Activities calendar

09 February 2017

21:29 - February 9, 2017

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సింగిల్‌ టెస్ట్‌ తొలి రోజు టీమిండియా డామినేట్‌ చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌ జోరు ముందు బంగ్లాదేశ్‌ బౌలర్లు తేలిపోవడంతో ...ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. టెస్ట్‌ స్పెషలిస్ట్‌లు మురళీ విజయ్, పుజారా రాణించడంతో పాటు ...యంగ్ గన్‌ విరాట్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత జట్టు భారీ స్కోర్‌పై కన్నేసింది.

ఓపెనర్‌ రాహుల్‌ విఫలమైనా..

ఓపెనర్‌ రాహుల్‌ విఫలమైనా..మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ స్ట్రోక్‌ ఫుల్‌ సెంచరీలతో ఆకట్టుకున్నాడు.బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న విజయ్‌...పుజారాతో కలిసి అసలు సిసలు టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండో వికెట్‌కు పుజారాతో కలిసి 178 పరుగులు జోడించాడు.క్రీజ్‌లో పాతుకుపోయిన పుజారా 12వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. స్టైలిష్‌ షాట్లతో అలరించిన విజయ్‌ 149 బంతుల్లో కెరీర్‌లో 9వ టెస్ట్‌ సెంచరీ పూర్తి చేశాడు.

83 పరుగులు చేసిన పుజారా ఔటైనా...

83 పరుగులు చేసిన పుజారా ఔటైనా....విరాట్‌ కొహ్లీ మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మురళీ విజయ్‌తో కలిసి హాఫ్ సెంచరీ, రహానేతో కలిసి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన కొహ్లీ...భారత్‌ను తిరుగులేని ఆధిక్యంలో నిలిపాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లతో ఆటాడుకున్న విరాట్‌..... ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో ఉర్రూతలూగించాడు. ఏ మాత్రం తడబడకుండా బ్యాటింగ్‌ చేసిన విరాట్‌....130 బంతుల్లో టెస్టుల్లో 16వ సెంచరీ పూర్తి చేశాడు.

తొలి రోజు ఆట ముగిసే సరికి..

తొలి రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. విరాట్‌ 111, రహానే 45 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 550 పరుగులకు పైగా స్కోర్‌ నమోదు చేస్తే విరాట్‌ ఆర్మీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సింగిల్‌ టెస్ట్‌లో నెగ్గి 2017 సీజన్‌లోనూ ట్రెడిషనల్‌ ఫార్మాట్‌లో జైత్రయాత్ర కొనసాగించాలని కొహ్లీ అండ్‌ కో తహతహలాడుతోంది.

21:27 - February 9, 2017

హైదరాబాద్: 1997లో ఉపహార్‌ సినిమా థియేటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. థియేటర్‌ యజమాని గోపాల్‌ అన్సల్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని గోపాల్‌ను కోర్టు ఆదేశించింది. గోపాల్‌ అన్సల్‌ ఇదివరకే నాలుగు నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు. ఇప్పుడు మిగతా శిక్ష పూర్తిచేయాల్సి ఉంది. మరో సోదరుడు సుశీల్ అన్సల్‌కు మాత్ర కోర్టు ఊరటనిచ్చింది. ఇదివరకే అనుభవించిన జైలు శిక్ష సరిపోతుందని పేర్కొంది. 2015లో సుప్రీంకోర్టు ఇద్దరు సోదరులకు రూ.60కోట్ల జరిమానా విధించగా కట్టారు. 1997 జూన్‌ 13న ఢిల్లీలోని గ్రీన్‌ పార్క్‌ ప్రాంతంలో ఉన్న ఉపహార్‌ సినిమా థియేటర్‌లో బోర్డర్‌ సినిమా నడుస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు. థియేటర్‌లో కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల తలుపులు తెరుచుకోక మంటలతో బాల్కనీలో వారు వూపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో థియేటర్‌ యజమానులైన గోపాల్‌ అన్సల్‌, సుశీల్‌ అన్సల్‌పై కేసు నమోదైంది.

21:20 - February 9, 2017

హైదరాబాద్: రబీలో 10వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ సరఫరాపై కేసీఆర్‌... ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రబీసాగు రికార్డు స్థాయిలో ఉందన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి 4500 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉందని... వచ్చే నెలలో ఇది 5000 మెగావాట్లకు పెరిగే అవకాశముందన్నారు. ఎండాకాలం వస్తున్నందున పారిశ్రామిక, వాణిజ్య, గృహ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

21:19 - February 9, 2017

హైదరాబాద్: తెలంగాణకు ఎయిమ్స్‌ను కేటాయిస్తున్నట్లు లోకసభలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.. ఈ బడ్జెట్‌లో జార్ఖండ్‌, గుజరాత్‌కుమాత్రమే ఎయిమ్స్‌ కేటాయించారు.. తెలంగాణకూ ఎయిమ్స్‌ కావాలంటూ కొద్ది నెలలుగా సీఎం కేసీఆర్‌తోపాటు... ఎంపీలు చాలాసార్లు ప్రధానితోపాటు కేంద్రమంత్రులను కోరారు... ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో కేంద్రం ఎయిమ్స్‌ మంజూరుచేసింది... ఎయిమ్స్‌ను కేటాయించడంపై కేంద్రానికి ఢిల్లీలో తెలంగాణ అధికారప్రతినిధి వేణుగోపాలాచారి కృతజ్ఞతలు తెలిపారు..

21:17 - February 9, 2017

చెన్నై: తమిళనాడు రాజకీయాలు గంటగంటకు మలుపులు తిరుగుతున్నాయి. తమిళనాడు ఇంచార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైలో అడుగుపెట్టింది మొదలు.. తమిళ రాజకీయ కాక తారస్థాయికి చేరింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం.. శశికళ బృందాలు వేర్వేరుగా గవర్నర్‌తో భేటీ అయ్యాయి. బలనిరూపణకు అవకాశమివ్వాలని నేతలు ఎవరికి వారుగా విన్నవించారు.

పన్నీర్‌సెల్వం, శశికళల మధ్య రాజకీయ సమరం..

తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం, శశికళల మధ్య రాజకీయ సమరం.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. తనకు ఎమ్మెల్యేల బలముందని శశికళ, అవకాశమిస్తే బల నిరూపణ చేసుకుంటానని పన్నీర్‌ సెల్వం చెబుతూ వస్తున్నారు. గవర్నర్‌ రాకకోసం ఈరెండు వర్గాలూ.. రెండు రోజులుగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో.. తమిళనాడు ఇంచార్జి గవర్నర్‌ విద్యాసాగరరావు ఈ మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు.

గవర్నర్ తో సెల్వం, శశికళ భేటీ...

ముందుగా ఫిక్స్‌ చేసుకున్న అపాయింట్‌మెంట్‌ ప్రకారం, సీఎం పన్నీర్‌ సెల్వం, సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విద్యాసాగరరావుతో భేటీ అయ్యారు. సుమారు పదిహేను నిమిషాల పాటు ఆయనతో చర్చించాక.. చిరునవ్వుతో బయటకు వచ్చిన సెల్వం.. నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ, తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో మీడియాతో మాట్లాడారు. బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని గరర్నర్‌ను కోరినట్లు పన్నీర్‌ సెల్వం చెప్పారు. అమ్మ ఆశీర్వాదం తనకే ఉందన్న ఆయన.. కచ్చితంగా ధర్మమే గెలుస్తుందన్నారు. అటు శశికళ కూడా గవర్నర్‌ విద్యాసాగరరావును కలిశారు. అంతకుముందు.. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో... జయలలిత సమాధిని చేరుకున్న శశికళ.. అక్కడ నివాళులు అర్పించారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. 10 మంది రాష్ట్ర మంత్రులతో కలిసి వెళ్లిన శశికళ.. తనను శాసనసభా పక్షం నేతగా ఎన్నుకుంటూ.. ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను గవర్నర్‌కు అందించారు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తనతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ను కోరారు. మొత్తానికి సీఎం రేసులో ఎవరు ముందు వరుసలో ఉన్నారు..? ఎవరికి గవర్నర్‌ అవకాశం ఇస్తారు?ప్రస్తుతం తన కోర్టుకు చేరిన బంతిని, గవర్నర్‌ విద్యాసాగరరావు ఎవరి కోర్టులోకి నెడతారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.

గవర్నర్ తో ముగిసిన శశికళ భేటీ

హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ భేటీ ముగిసింది. ఎమ్మెల్యేల సంత‌కాల‌తో కూడిన మ‌ద్ద‌తు లేఖ‌ను ఆమె గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించారు. గ‌వ‌ర్న‌ర్‌తో ఆమె భేటీ 20 నిమిషాల పాటు కొన‌సాగింది. ప్ర‌భుత్వం ఏర్పాటుకు అనుమతించాలని శ‌శిక‌ళ విజ్ఞ‌ప్తి చేశారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న వారి జాబితాను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు. అయితే, భేటీ ముగిసిన త‌ర్వాత ఆమె మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు.

19:53 - February 9, 2017

హైదరాబాద్: తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడలో గవర్నర్ విద్యాసాగర్ రావు తడబాటుకు గురయ్యారా?తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు హఠాత్తుగా జరిగాయా?తమిళనాడు రాజకీయ సంక్షోభంలో బిజెపి హస్తం ఉందా? ఈ గందరగోళంలో డీఎంకే పాత్ర ఎంత ఉంది? శశికళ అక్రమాస్తుల కేసుతో రాష్ట్ర రాజకీయాలను ముడిపెట్టడం సబబేనా? ఈ అంశాలపై 'హెడ్ లైన్ షో' లో చర్చించారు. ఈ చర్చలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి,బిజెపి నేత ప్రేమందర్ రెడ్డి, న్యాయనిపుణులు విఆర్ మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

గవర్నర్ తో భేటీ అయిన శశికళ

హైదరాబాద్: అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ రాజ్‌భ‌వ‌న్ విద్యాసాగ‌ర్ రావుతో భేటీ అయ్యారు. అంతకు ముందు చెన్నై మెరీనా తీరంలో ఉన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధికి నివాళులు అర్పించారు. త‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఎమ్మెల్యేల నుంచి తీసుకున్న లేఖ‌లను ఆమె ఆయ‌న‌కు స‌మ‌ర్పించ‌నున్నట్లు తెలుస్తోంది. అనంత‌రం విద్యాసాగ‌ర్ రావు ఏ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తారోన‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద భారీగా భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను చేశారు.

సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టులో పిల్

హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సింగరేణి వారసత్వ ఉద్యోగాల మార్గదర్శకాలను అఫిడవిట్ లో తెలియజేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 6కి వాయిదా వేసింది.

సత్తుపల్లి పీఎస్ లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

ఖమ్మం: సత్తుపల్లి పీఎస్ లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: సోంత పార్టీ వాళ్లే నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా ఆత్మవిశ్వాసం కోల్పోనన్నారు. నా రాజకీయ జీవితం కార్యకర్తలు తలెత్తుకునేలా ఉంటుందన్నారు.

జయలలిత సమాధి వద్ద శశికళ నివాళులు

చెన్నై: దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద శశికళ నివాళుర్పించారు. అనంతరం చెన్నైలోని రాజ్ భవన్ లో గవర్నర్ విద్యాసాగర్ ను కలిసేందుకు బయలుదేరారు.

18:42 - February 9, 2017

చెన్నై: ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుందని తమిళనాడు ఆప‌ద్ధ‌ర్మ సీఎం ధీమా వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ ముగించుకున్న సీఎం ప‌న్నీర్ సెల్వంత‌న నివాసం వ‌ద్ద‌కు వచ్చి మీడియాతో మాట్లాడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌న రాజీనామా వెన‌క్కు తీసుకుంటానని గ‌వ‌ర్న‌ర్‌ను కోరిన‌ట్లు ఆయ‌న తెలిపారు. త్వరలోనే అందరం ఓ మంచి శుభ‌వార్త వింటామని చెప్పారు. ఎల్ల‌ప్పుడూ ధ‌ర్మ‌మే గెలుస్తుంద‌ని, తాము ధ‌ర్మం వైపు ఉన్నామ‌ని చెప్పారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

18:34 - February 9, 2017

శశికళ క్యాంపులో ముసలం

చెన్నై: జయలలిత నిచ్చెలి శశికళ క్యాంపులో ముసలం పుట్టినట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్లు లాక్కోవడం పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపు నుండి వెళ్లిపోతామని 12 మంది ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు.

ఎమ్మెల్యేలు నావెంటే ఉన్నారు: సీఎం సెల్వం

చెన్నై: ఎమ్మెల్యేలు నా వెంటే ఉన్నారని సీఎం పన్నీ సెల్వం తెలిపారు. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. చివరికి న్యాయమే గెలుస్తుందని సెల్వం స్పష్టం చేశారు. నాకు మద్దతిస్తున్న వారందరికీ ధన్యావాదములు అని తెలిపారు.

17:29 - February 9, 2017

చెన్నై : గవర్నర్ బంగళాలో తమిళనాడు ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ ముగిసింది. ఈ భేటీ లో తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నాని, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ని కోరినట్లు సమాచారం. వీరి భేటీ దాదాపు 15 నిమిషాల పాటు జరిగింది. మరో వైపు శశికళకు రాత్రి 7.30గంటలకు గవర్నర్ తో భేటీ కానున్నారు. దీంతో తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

గవర్నర్ తో ముగిసిన సీఎం సెల్వం భేటీ

చెన్నై : గవర్నర్ బంగళాలో తమిళనాడు ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ ముగిసింది. ఈ భేటీ లో తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నాని, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ని కోరినట్లు సమాచారం. వీరి భేటీ దాదాపు 15 నిమిషాల పాటు జరిగింది.

అరుదైన రికార్డు సాధించిన మురళీ, పుజారా

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో మురళీ విజయ్, చటేశ్వర్ పుజారాలు అరుదైన రికార్డును సాధించారు. ప్రస్తుత ఉప్పల్ మ్యాచ్ తొలి రోజున మురళీ విజయ్ (108), చటేశ్వర్ పుజారా (83)లు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత గడ్డపై ఒక సీజన్లో అత్యధిక సెంచరీలు సాధించిన జోడీగా అరుదైన ఫీట్ ను సాధించారు. ఈ క్రమంలో 68 ఏళ్లనాటి రికార్డును బద్దలు కొట్టారు.

గవర్నర్ తో భేటీ అయిన సీఎం పన్నీర్ సెల్వం

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ఇన్‌ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుతో ప‌న్నీర్ సెల్వం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప‌రిస్థితులు, ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు వివ‌రాలను ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌కి వివ‌రించనున్నట్లు సమాచారం. రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ సభ్యులు గవర్నర్ తో భేటీ

హైదరాబాద్‌ : నగరంలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి హరీష్‌, జగదీష్‌, వివేక్... హాజరు కాగా... ఏపీ నుంచి హాజరైన యనమల, అచ్చెన్న, కాల్వ శ్రీనివాసులు సమావేశంలో పాల్గొన్నారు.

17:04 - February 9, 2017

హైదరాబాద్‌ : నగరంలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి హరీష్‌, జగదీష్‌, వివేక్... హాజరు కాగా... ఏపీ నుంచి హాజరైన యనమల, అచ్చెన్న, కాల్వ శ్రీనివాసులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తొమ్మిది, పది షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకంపై చర్చిస్తారు. కోర్టులకు వెళ్లకుండా, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ నెల 2న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ్టి చర్చలు సాగుతాయి.

17:01 - February 9, 2017

హైదరాబాద్: తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ పడకేసిందన్నారు... పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.... విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లో పేద రోగులు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు.. గాంధీ, నిలోఫర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు లేక జనాలు చనిపోతున్నారని విమర్శించారు. ఎంతమంది రోగులు మృత్యువాత పడుతున్నా సర్కారులో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ సొంత నియోజవర్గమైన గజ్వేల్‌లోనే వైద్య సేవల్లో ఎంత నిర్లక్ష్యంఉందో చూద్దాం కేసీఆర్ వస్తారా అని సవాల్ విసిరారు.

16:59 - February 9, 2017

అమరావతి: రేపటి నుంచి ఏపీలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు నిర్వహిస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తెలిపారు. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన ప్రముఖులైన మహిళలు పాల్గొంటారని చెప్పారు. జాతీయ మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. కేందమంత్రి వెంకయ్యనాయుడు, బౌద్దగురువు దలైలామా రేపు ప్రారంభ సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్న ఆయన.. మహిళా సాధికారత కోసం వివిధ అంశాలపై చర్చలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

16:57 - February 9, 2017

మహబూబ్ నగర్ : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి కల్వకుర్తి ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మూడు రోజులుగా జలసాధన రైతు చైతన్య యాత్ర చేస్తున్నామన్నారు. కల్వకుర్తి ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్న ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి స్పష్టం చేశారు.

16:51 - February 9, 2017

కొత్తగూడెం : సీపీఎం మహాజన పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో జోరుగా కొనసాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున్న తరలి వచ్చి యాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 11 వందలగ్రామాల్లో సాగిన యాత్ర మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. దళితులు, గిరిజనుల పోడుభూములపై ప్రభుత్వ తీరుకును పాదయాత్రలో నాయకులు ఎత్తిచూపుతున్నారు.

16:18 - February 9, 2017

చెన్నై: తమిళనాడు రాజకీయాలు గవర్నర్ బంగళాకు చేరుకుంది. కొద్ది సేపటికి తమిళనాడు రాష్ట్ర ఇంఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం స్వాగతం పలికారు. గంట గంటకూ ఉత్కంఠ రేపుతోన్న తమిళనాడు రాజకీయానికి ఫుల్ స్టాఫ్ పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్లు సమాచారం.

చెన్నైలో దిగిన గవర్నర్..స్వాగతం పలికిన పన్నీర్..

చెన్నై : తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై విమానాశ్రయంలో దిగారు. రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఘనస్వాగతం పలికారు. 

15:42 - February 9, 2017

హైదరాబాద్: జీహెచ్ఎంసీ లో సెల్‌టవర్లపై కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు.. విచారణ అధికారిగా టౌన్‌ప్లానింగ్‌ చీఫ్ ఆఫీసర్‌ దేవేందర్‌ రెడ్డిని నియమించారు.. అలాగే రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ విభాగాలతో రెండు యాక్షన్‌టీంలు ఏర్పాటు చేశారు... గ్రౌండ్‌లెవల్లో పరిస్థితిని విచారించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.. అవసరమైతే అనధికారికంగాఉన్న సెల్‌ టవర్లను తొలగించాలని ఆదేశించారు..

15:40 - February 9, 2017

హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల భర్తీ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. నిరుద్యోగుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం పలు నిబంధనలను తొలగించింది. డిగ్రీలో 60శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను తొలగించాలని కేసీఆర్‌ ఆదేశించారు. 50శాతం మార్కులు ఉన్న వారందరినీ పరీక్షకు అనుమతించాలని సూచించారు. అంతేకాదు.. డిగ్రీ, బీఈడీ, టెట్‌ అర్హత ఉన్నవారందరికీ పరీక్షకు అవకాశం కల్పించాలన్నారు. ఇక మూడు సంవత్సరాల బోధనా అనుభవం నిబంధనను ఎత్తివేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఆంగ్లభాషలోనే పరీక్ష నిర్వహించాలన్న నిబంధనను యధాతథంగా అమలు చేయాలన్నారు. విద్యార్ధులకు ఏ మీడియంలో బోధించడానికి నియామకాలు జరపాలనుకుంటే.. అదే భాషలో పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. దీంతో గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్‌ మీడియం ఉన్నందున అభ్యర్ధులంతా ఆంగ్లములోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.

15:38 - February 9, 2017

అమరావతి : ఏపీ సచివాలయంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది... సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల పోలింగ్‌తో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది... అధ్యక్ష పదవికోసం మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి పోటీపడుతున్నారు..

15:31 - February 9, 2017
15:18 - February 9, 2017

చెన్నై: ఎట్టకేలకు తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకి వస్తున్నారు. తమిళనాడు ఆపద్ధర్మ సీఎంపన్నీర్‌ సెల్వం, శశికళకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ను తమిళనాడు రాజ్‌భవన్‌ వర్గాలు ఖరారు చేశాయి. పన్నీర్‌ సెల్వంకు సాయంత్రం 5 గంటలకు, శశికళకు సాయంత్రం 7 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారైంది. ఎమ్మెల్యేలతో కాకుండా ఒంటరిగా వచ్చి గవర్నర్‌ను కలవాలని శశికళకు రాజ్‌భవన్‌ వర్గాలు సూచించాయి.

 

సెల్ టవర్లపై విచారణకు జీహెచ్ఎంసీ ఆదేశం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో సెల్ టవర్లపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. విచారణ అధికారిగా టౌన్ ప్లానింగ్ చీఫ్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డిని నియమించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలతో రెండు యాక్షన్ టీంలు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని విచారించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే అనధికారికంగా ఉన్న సెల్ టవర్లను తొలగించాలని ఆదేశించింది. 

కాసేపట్లో ఎయిర్ పోర్టుకు పన్నీర్ సెల్వం..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎయిర్ పోర్టుకు బయలుదేరనున్నారు. ముంబై నుండి బయలుదేరిన రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు స్వాగతం పలికేందుకు వెళ్లనున్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే స్వాగతం పలుకనున్నట్లు, అనంతరం పన్నీర్ ఇంటికి బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. 

గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ పై టెన్ టివి జనపథంలో చర్చ..

హైదరాబాద్ : గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ లోని నిబంధనలపై ఇవాళ జనపథంలో టెన్ టివి చర్చించిన సంగతి తెలిసిందే. 60 శాతం మార్కుల నిబంధనల ఎత్తివేయాలని పలువురు ఫోన్ కాల్స్ లో పేర్కొన్నారు. 

గురుకుల ఉద్యోగాల మార్కుల నిబంధనపై కేసీఆర్ ఆదేశాలు..

హైదరాబాద్ : గురుకుల ఉద్యోగాలకు 60 శాతం మార్కుల నిబంధనను తొలగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. డిగ్రీలో 50 శాతం మార్కులు వచ్చిన వారికి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనితో ఎక్కువ మంది నిరుద్యోగులకు పరీక్ష రాసే అవకాశం కలుగుతుందన్నారు. మూడేళ్ల బోధన అనుభవం ఉండాలన్న నిబంధన తొలగించాలన్నారు. డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హత ఉన్నవారందరికీ అవకాశం ఉంటుందని, ఏ భాషలో బోధించడానికి నియామకాలు జరుగుతున్నాయో ఆభాషలోనే పరీక్ష నిర్వహించాలన్నారు. గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని, అభ్యర్థులు ఇంగ్లీష్ భాషలోనే పరీక్ష రాయాలన్నారు. 

నర్కూడ వద్ద కారు బీభత్సం..

రంగారెడ్డి : శంషాబాద్ (మం) నర్కూడ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి నాలుగు బైక్ లను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

పన్నీర్ కు..శశికళకు అపాయింట్ మెంట్ ఖరారు..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళకు గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్ మెంట్ సమయాలను ఖరారు చేశారు. సాయంత్రం 5గంటలకు పన్నీర్ సెల్వంకు, రాత్రి 7.30గంటలకు శశికళలను రావాల్సిందిగా సూచించారు. 

విజయవాడలో ఎంపీ కవిత..

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతికి టీఆర్ఎస్ ఎంపీ కవిత వెళ్లారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు ఆమె అమరావతికి విచ్చేశారు. రాజధాని అమరావతికి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 

14:16 - February 9, 2017
14:12 - February 9, 2017

మహిళ అనే మూడు అక్షరాలు పోరాటానికి ప్రతీకలు.. అమ్మ కడుపులో పిండంగా ఏర్పడింది మొదలు.. పుట్టుక కోసం పోరాటం... బ్రతికేందుకు పోరాటం.. ఉనికి కోసం... వ్యక్తిత్వం కోసం ఇలా మహిళ జీవితాతం పోరాడుతోనే వుంది. దేశ వ్యాప్తంగా మహిళల రిజర్వేషన్లకు ఉద్యమిస్తోంది. ఇదిలా ఉండగా నాగాలాండ్ లో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఆందోళనకు కారణమైంది. ఈ అంశాలపై మానవి ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:02 - February 9, 2017
14:00 - February 9, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు ఉత్యంఠ రేపుతున్నాయి. సెల్వం, శశికళ పరస్పర ఆరోపణలో రాజకీయం వేడిక్కెంది. సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ను శశికళ వర్గం కలవనున్నారు. పన్నీర్ సెల్వం వెంట కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ తెలిపారు. పన్నీరు సెల్వం శశికళపై దాడి పెంచారు. పొయెస్ గార్డెన్ ముందు అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసన చేపట్టారు. పన్నీర్ గా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే కోశాధికారి హోదాలో బ్యాంకులకు పన్నీర్ సెల్వం లేఖ రాశారు. తన అనుమతి లేకుండా లావాదేవీలు జరపొద్దని సూచించారు. చెన్నె సీపీ జార్జ్ బదిలీకి సెల్వం ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి చెన్నై బయల్దేరారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:43 - February 9, 2017

విజయవాడ : టీడీపీలో పదవుల జాతరకు తెర లేసింది. ఓ ప‌క్క క్యాబినేట్ విస్తర‌ణ.. మ‌రొప‌క్క ఎమ్మెల్సీ, నామినేటెడ్ ప‌ద‌వులను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణయించ‌టంతో పార్టీలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో అవ‌కాశాన్ని అందిపుచ్చుకొని పొస్ట్ చేజిక్కించుకునేందుకు వారి వారి స్ధాయికి త‌గ్గట్లుగా సిపార్సులు చేయించుకుంటున్నారు ఆశావాహులు.
ఏపీ టీడీపీకి కొత్త శోభ‌
ఏపీ టీడీపీ కొత్త శోభ‌ను సంత‌రించుకుంటోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్యాబినెట్‌ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీతో పాటు ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేస్తోండటంతో టీడీపీ శ్రేణులకు భారీగా పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక ఖాళీలు సైతం ఎక్కువగానే ఉండటం, పార్టీలోని అందరికి న్యాయం చేయాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో అటు పార్టీ ఇటు ఆశావాహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
క్యాబినెట్ ఎక్సపాన్షన్..? 
ముందుగా మంత్రివ‌ర్గ విస్తర‌ణ విష‌యానికొస్తే ఈ నెల 9 లేదా 10 తేదీలలో క్యాబినెట్ ఎక్సపాన్షన్ ఉంటుంద‌నీ ప్రచారం జ‌రిగింది. ఇప్పుడు ఈ నెల 16 తేదిన జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇక మంత్రి ప‌ద‌వులు ఆశించే వారి విష‌యానికొస్తే.. సీనియర్ నేత‌లు క‌ళావెంక‌ట్రావు, సొమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి, దూళిపాళ్ల న‌రేందర్‌, ఉండి ఎమ్మెల్యే శివ‌రామ‌రాజు ఉండ‌గా, వైసిపి నుండి ఇటీవ‌ల టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, జ్యోతుల నెహ్రు, గొట్టిపాటి ర‌వి కుమార్, సుజ‌య‌ రంగారావు,అమ‌ర‌నాథ్‌ రెడ్డిలు సైతం క్యాబినెట్ బెర్త్ రేసులో ఉన్నారు. 
ఎమ్మెల్సీ ఆశావాహుల లిస్ట్ 
ఇక ఎమ్మెల్సీ ఆశావాహుల లిస్ట్ కూడా భారీగానే ఉంది. ప్రధానంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన‌ మంతెన స‌త్యనారాయ‌ణ‌ రాజు పేరు వినిపిస్తొంది. తెలుగు యువ‌త నేత‌గా ఉన్న స‌త్యనారాయణ రాజుకు గ‌తంలో ఎమ్మెల్సీ అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి దూరం అయ్యింది, దీంతో మరోసారి త‌ప్పక అవ‌కాశం ఇస్తాన‌నీ చంద్రబాబు మంతెన‌కు హామీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తొంది. ఈ నేప‌థ్యంలో ఈయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఖాయంగా క‌నిపిస్తొంది. ఇక‌ ద‌ళిత‌నేత మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్, క‌ర్నూల్ జిల్లా టిడిపికి సుదీర్గ కాలం అధ్యక్షుడుగా ప‌నిచేసిన సొమిశెట్టి వెంక‌టేశ్వర్లు, గొనుగుట్ల కొటేశ్వరావుల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వులు త‌ప్పక వ‌చ్చే అవ‌కాశం స్పష్టంగా క‌నిపిస్తొంది. 
మ‌రో ఛాన్స్ పొందేందుకు య‌త్నాలు
ఇదిలా ఉంటే ప్రస్తుత ప‌ద‌వి కాలం ముగిసేవారు కూడా మ‌రో ఛాన్స్ పొందేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. వారిలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌ సతీష్ రెడ్డి, కౌన్సిల్ విప్ రామ్మోహ‌న్, తూర్పుగొదావ‌రి జిల్లా ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రావు, అనంతపురం జిల్లాకు చెందిన‌ మెట్టు గోవింద‌ రెడ్డి, సీనియ‌ర్ నేత ప్రతిభా భార‌తి ఉన్నారు. వీరంద‌రూ త‌మ‌కు త‌ప్పకుండా మ‌రో సారి ఎమ్మెల్సీ  ఛాన్స్ వ‌స్తుంద‌నీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అధినేత‌ను ప్రస‌న్నం చేసుకునేందుకు ప్రయత్నాలు 
ఎవ‌రికి తొచిన విధంగా వారు అధినేత‌ను ప్రస‌న్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త‌మ బ‌యోడెటాను ఆక‌ర్షనీయంగా త‌యారు చేసుకొని తెలుగుదేశం పెద్దల చుట్టూ ప్రద‌ర్శన‌లు చేస్తున్నారు. అయితే కావ‌ల్సిన‌న్ని ప‌ద‌వులు ఖాళీగా ఉన్న నేప‌థ్యంలో పార్టీ శ్రేణుల‌కు అన్ని ర‌కాలుగా న్యాయం చెయ్యవ‌చ్చని తెలుగుదేశం అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేస్తొంటే.. ఆశావాహులు సైతం వ‌చ్చిన అవ‌కాశాన్ని త‌ప్పక అందిపుచ్చుకుంటామంటున్నారు. కాగ‌ ఎవ‌రెవరికి ప‌ద‌వులు ద‌క్కుతాయో తెలియాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందే.

 

13:38 - February 9, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయపరిణామాలు ఇపుడు గవర్నర్‌ నిర్ణయంచుట్టూ తిరుగుతున్నాయి. మధ్యహ్నం గవర్నర్‌ చెన్నైకి చేరుకోనుండటంతో .. అన్నాడీఎంకేలో రెండు వర్గాలు తమ వ్యూహానికి పదును పెట్టాయి. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న పన్నీర్‌సెల్వం తో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ హల్‌చల్‌ చేస్తున్నారు. సీఎంతో డీజీపీ రాజేంద్ర, సీఎస్‌ వైద్యనాథన్‌లభేటీ కావడంపై ఆసక్తిగా మారింది. భేటీ అనంతరం..చెన్నై పోలీస్‌ కమీషనర్‌కు   బదిలీ ఆదేశాలు జారీచేశారు పన్నీర్‌. మరోవైపు  పీఎంకే పార్టీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలను కోర్టులో ప్రవేశపెట్టేలా ఆదేశించాలని పిటిషన్‌ వేసింది. ఇదిలాంటే.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి పన్నీర్‌సెల్వంపై విమర్శలు గుప్పించడం ఆసక్తిగా మారింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్న శశికళనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

 

ఎమ్మెల్యేల కోసం కదిలిన పోలీసులు ?

చెన్నై : రహస్యంగా ఉన్న ఎమ్మెల్యేల ఆచూకి కనుక్కోవడానికి పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. శశికళ వీరిని రహస్య ప్రాంతానికి తరలించిన సంగతి తెలిసిందే. శశికళ వర్గం దాచి ఉంచిన ఎమ్మెల్యేలందరినీ బయటకు తేవాలని అపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం ఆదేశాలు జారీ చేయడంతో డీజీపీ కదిలినట్లు తెలుస్తోంది.

ఉత్కంఠ రేపుతున్న తమిళనాడు రాజకీయాలు..

చెన్నై : పోయెస్ గార్డెన్ ను అమ్మ స్మారక భవనంగా మారుస్తూ అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆదేశాలు జారీ చేశారు. పన్నీర్ ఆదేశాలను శశికళ వర్గం ధిక్కరిస్తోంది..

బాబును కలిసిన ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడుని ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కుమార్ జైన్ కలిశారు. మౌలిక సదుపాయాలు, విద్య, పర్యాటకం, అతిథ్య రంగాల్లో రూ. 5వేల కోట్ల పెట్టుబడులకు ఇండియన్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇండియన్ బ్యాంకు ప్రతిపాదనలను చంద్రబాబు స్వాగతించారు. అమరావతిలో జోన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం బాబు సూచించారు. ఇందుకు మహేశ్ కుమార్ జైన్ సానుకూలంగా స్పందించారు.

12:27 - February 9, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయపరిణామాలు ఇపుడు గవర్నర్‌ నిర్ణయంచుట్టూ తిరుగుతున్నాయి. ఇవాళ ముంబైనుంచి చెన్నైకి గవర్నర్‌ వస్తుండటంతో .. అన్నాడీఎంకేలో రెండు వర్గాలు తమ వ్యూహాలకు మరింత పదును పెట్టాయి. ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వం .. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నాడీఎంకే పార్టీకి  సంబంధించిన బ్యాంకు ఖాతాలను నిలుపుదల చేయాలని .. ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు ప్రస్తుతం శశికళ ఆధీనంలో ఉన్న  ఫొయెస్‌ గార్డెన్‌ను .. అమ్మ మెమోరియల్‌గా మార్చేందుకు ఉత్తర్వులిచ్చారు. ఇక పన్నీర్‌సెల్వం తిరుగుబాటుతో క్యాంపు రాజకీయానికి తెరతీసిన శశికళ వర్గం .. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను  హోట్‌ల్‌కు తరలించింది. చెన్నై ఈస్ట్‌కోస్ట్‌ రోడ్‌లోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలను ఉంచి.. వారికి సకల సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే.. ఎమ్మెల్యేలు జారిపోకుండా.. ముందుగానే సెన్‌ఫోన్లు లాగేసుకుంది శశికళవర్గం. వారి కదలికలపై నిఘా ఉంచేందుకు ప్రతిఒక్కరికీ ఇద్దరు చొప్పున సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతిని కలవడానికి రెడీ అయ్యారు. తంబిదురై నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసి తమిళనాడులో తాజా రాజకీయపరిణామాలను వివరించడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా గవర్నర్‌ వైఖరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.
ఇవాళ సీఎం పీఠంపై స్పష్టత వచ్చే అవకాశం
ఇవాళ సీఎం పీఠంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకి రానున్నారు. మద్దతు దారులతో గవర్నర్‌ను కలవడానికి శశికళ సిద్ధం అయింది. అయితే గవర్నర్ ముందుగా పన్నీర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఆపద్ధర్మసీఎం పన్నీర్‌సెల్వం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫొయెస్‌గార్డెన్‌ను అమ్మ మెమోరియల్‌గా మార్చాలని ఆదేశించారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్లు 234
ఉన్నాయి. వీటిలో అన్నాడీఎంకే బలం 135, డీఎంకే 89, కాంగ్రెస్‌ 8, ఇతరులు 1, మ్యాజిక్‌ ఫిగర్‌ 117. శశికళ వర్గంలో ప్రస్తుతం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తనకు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పన్నీర్‌సెల్వం చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని శశికళ అంటున్నారు. సభలో బలనిరూపణకు అవకాశం ఇస్తే .. తనకే మెజారిటీ వస్తుందని పన్నీర్‌ అంటున్నారు. క్యాంపు రాజకీయాలతో శశికళ వ్యూహం రచిస్తున్నారు. ఎమ్మెల్యేలను ఓ హోటల్‌కు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే తనయుడు అరెస్టు...

విజయవాడ : జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే అక్కినేని లోకేశ్వరరావు కుమారుడు విజయకృష్ణ నిర్వాకం బయటపడింది. ఎన్ఆర్ఐ మహిళను విజయకృష్ణ వేధిస్తున్నాడు. విజయవాడ సీపీకి మెయిల్ ద్వారా ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదు చేశారు. విజయకృష్ణను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు.

మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ..

గుంటూరు : కాపులను బీసీల్లో చేర్చాలనే దానిపై మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. మంజునాథ కమిషన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

చెన్నై కమిషనర్ ను బదిలీ చేయాలని పన్నీర్ ఆదేశాలు..

తమిళనాడు : చెన్నై కమిషనర్ ను బదిలీ చేయాలని అపద్ధర్మ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు సీఎస్, డీజీపీలతో పన్నీర్ భేటీ అయ్యారు.

12:11 - February 9, 2017

విజయవాడ : జాతీయ రహదారులపై 100 మీటర్ల దూరంలోనే వైన్స్‌ షాప్స్‌, బార్లు ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని విన్నప రూపంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ భావిస్తోంది. ఒకవేళ సుప్రీం నుంచి అనుమతులు లభిస్తే... బార్లు, మద్యం దుకాణాలకు జూన్‌ నుంచి ఒకే కాలపరిమితితో కూడిన పాలసీ అమలు చేసే ఆస్కారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 
500 మీ.దూరంలో ఏర్పాటుకు అనుమతి
దేశవ్యాప్తంగా.... చాలాచోట్ల జాతీయ రహదారుల పక్కనే మద్యం షాపులు, బార్లు ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై గతంలోనే సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. 500 మీటర్ల దూరంలో వైన్స్‌ షాపులు, బార్లు ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ఆదేశాలచ్చింది. అయితే.. సుప్రీం ఇచ్చిన 500 మీటర్ల దూరంలో కాకుండా.. 100 మీటర్ల దూరంలోనే మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు విన్నప రూపంలో పిటిషన్ సమర్పించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ పిటిషన్‌తో పాటు మద్యం దుకాణాల లైసెన్స్‌ల పొడిగింపును కూడా ప్రస్తావించాలని భావిస్తున్నారు. 
మార్చి 31వ తేదీలోపు సమయం ఇచ్చిన సుప్రీం
మార్చి 31వ తేదీలోగా జాతీయ రహదారులపై ఉన్న వైన్స్‌ షాపులు, బార్లను తొలగించేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మద్యం దుకాణాల యజమానులు సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మద్యం అంశంపై నేరుగా కోర్టును ఆశ్రయిస్తే ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందుకని విన్నప రూపంలో వెళ్లాలనే దిశగా చర్చలు జరుపుతూనే అటు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. 
డిసెంబర్‌తో ముగియనున్న బార్ల కాలపరిమితి
మరోవైపు మద్యం దుకాణాల లైసెన్స్ పరిమితి జూన్‌తో ముగియనుంది. బార్ల కాలపరిమితి ఈ ఏడాది డిసెంబర్‌తోనే ముగుస్తుంది. సుప్రీం ఆదేశాలు మార్చి 31వ తేదీ వరకు అమలు చేయాల్సి ఉన్నందున... బార్ల లైసెన్స్‌లను మార్చి వరకూ పొడిగించారు. ఇదే సమయంలో జూన్ వరకు కాలపరిమితి మద్యం దుకాణాల లైసెన్స్‌లను మూడు నెలలకు కుదించాల్సి వస్తోంది. బార్లు, మద్యం దుకాణాల లైసెన్స్‌లను నేరుగా జూన్ నెల వరకు పొడిగించి ఆ తర్వాత కొత్త మార్గదర్శకాలను అమలు చేసే అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై
ప్రజాసంఘాలు, మేథావులు మండిపడుతున్నారు. గత కాంగ్రెస్‌, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నాయని ఆరోపించారు. 
మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి : మద్యపాన నిషేధ కమిటీ 
మరోవైపు మద్యాన్ని ఆదాయ వనరుగా చూసుకోకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని మద్యపాన నిషేధ కమిటీ సభ్యులు కోరుతున్నారు. 
రాష్ర్టంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు 
టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ర్టంలో బెల్టు షాపుల విచ్చలవిడిగా నడుస్తున్నాయని, దీని వల్ల మహిళలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఐద్వా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా.. దాన్ని నియంత్రించాలని మహిళా, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

12:06 - February 9, 2017

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసలు విలన్ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కిస్తానని, ఇందులో హీరోగా తానే నటిస్తానని సినీ నటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించడం వివాదాలకు కారణమైంది. ఇందులో అసలు విలన్ లక్ష్మీ పార్వతి అంటూ టిడిపి నేతలు చేసిన ప్రకటనలకు వివాదాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతితో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలు..ఎన్టీఆర్ గత చరిత్ర తెలియచేశారు. బాలకృష్ణ తీయబోయే సినిమాలో నిజాలు ఉండాలని కుండబద్ధలు కొట్టారు. వివాదాల జోలికి వెళ్లకుండా సినీ నటుడు ఎలా ఎదిగాడు..సీఎం పీఠం ఎలా అధిరోహించాడు..? ఎలా కష్టపడ్డారో చూపించాలని సూచించారు. అలా కాకుండా ఉంటే మాత్రం తాను మాత్రం కోర్టుకు వెళుతానని స్పష్టం చేశారు. ఇదంతా తన వ్యక్తిగత వ్యవహారమని, వైసీపీ సహాయం తీసుకోనని తేల్చి చెప్పారు. బాలయ్య ప్రకటన తరువాత టిడిపి నేతల వ్యాఖ్యల నేపథ్యంలో బాలకృష్ణ వివాదాల జోలికి వెళుతారా ? లేదా ? అనేది చూడాలి.

11:56 - February 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో నీట్‌ పీజీ సీట్ల గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇంకా లోకల్‌ ర్యాంకులు రాక స్టుడెంట్స్‌ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నీట్ ఫలితాలు అనుకున్న సమయానికి విడుదలైనా విద్యార్థులకు ఉపయోగంలేకుండా పోయింది.
గత డిసెంబర్‌లో నీట్‌ నిర్వహణ
తెలంగాణలో నీట్‌ రాసిన ఎంబిబిఎస్ డాక్టర్లు టెన్షన్ పడుతున్నారు. నీట్‌ ఫలితాలు విడుదలైనా లోకల్‌ ర్యాంకులు తెలియక అయోమయానికి గురవుతున్నారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా గత డిసెంబర్‌లో ప్రవేశపరీక్ష నీట్‌ జరిగింది. ఈ ఫలితాల్ని జనవరి 15న విడుదల చేశారు. నేషనల్‌ ర్యాంకులు ప్రకటించారు. రాష్ట్రపరంగా ర్యాంకులు మాత్రం ఇంకా విడుదల కాలేదు. లోకల్‌, నాన్‌ లోకల్‌ విషయంలో స్పష్టతలేకనే ర్యాంకుల ప్రకటన ఆలస్యమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికులతోనే సీట్ల భర్తీ చేసుకునేలా నిబంధన
అయితే జమ్ము కశ్మీర్ తో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రాజ్యాంగపరంగా ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక చట్రంలో ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371 (డి) ప్రకారం స్పష్టమైన విధానాలున్నాయి. ఈ నిబంధనల ప్రకారం ఇక్కడి సీట్లను స్థానిక విద్యార్థుల తోనే భర్తీ చేసుకోవాలి. ఈ సీట్లకు కౌన్సిలింగ్‌ జరగాలంటే లోకల్‌ ర్యాంకులు విడుదల చేయాలి. ఈ ర్యాంకులు వస్తే తమకు సీటు వస్తుందో రాదో విద్యార్థులు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ర్యాంకును బట్టి వేరే కాలేజీలో చేరాలా? విదేశాలకు వెళ్లాలా? మళ్లీ వచ్చే ఏడాదికి ప్రిపేర్‌ కావాలో ప్లాన్‌ చేసుకోవచ్చు. చివరి నిమిషంలో హడావుడిగా లోకల్ ర్యాంకులు ప్రకటించి అడ్మిషన్లు పూర్తిచేస్తే తాము విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
బేరాలు కుదుర్చుకున్న ప్రైవేట్‌ కాలేజీల యాజమన్యాలు
మరోవైపు ర్యాంకుల ఆలస్యం వెనక మరో కారణముందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.... కొందరు విద్యార్థులకు మేలుచేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని మండిపడుతున్నారు.. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంచేస్తే మంచి ర్యాంకులు వచ్చినవారు ఇతర కాలేజీల్లో చేరిపోతారని.. అప్పుడు ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి ఛాన్స్ ఉంటుందనే ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.. ఇప్పటికే ప్రైవేటు కాలేజీలు కొందరు విద్యార్థులతో బేరాలుకూడా కుదుర్చుకున్నాయని ఆరోపణలొస్తున్నాయి.
అడ్మిషన్ల కసరత్తు 
నీట్‌ పీజీ సీట్ల భర్తీ కోసం మిగతా రాష్ట్రాల్లో లోకల్‌ ర్యాంకులు ప్రకటించి అడ్మిషన్ల కసరత్తు కూడా నడుస్తోంది. పీజీ సీట్ల భర్తీకి సంబంధించి మరిన్ని ఆరోపణలు రాకముందే లోకల్‌ ర్యాంకులు ప్రకటించి విద్యార్థుల టెన్షన్ తీర్చాల్సిన అవసరమెంతైనా ఉంది. 

 

11:46 - February 9, 2017

హైదరాబాద్ : టెక్నాలజీ వినియోగం, పారదర్శకతలో బల్దియా నెంబర్‌ వన్‌గా నిలుస్తోంది. అయితే అదే స్థాయిలో కార్పొరేట్‌ కంపెనీలకు మోకరిల్లుతుందా..? సెల్‌ కంపెనీలకు దాసోహం అంటోందా...? అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రేటర్‌ పరిధిలో సెల్‌ టవర్స్‌ ఎన్ని ఉన్నాయి..? వాటి వల్ల వస్తున్న ఆదాయం ఎంత..? అంటే లెక్కలు లేవంటున్నారు గ్రేటర్‌ అధికారులు. కార్పొరేట్‌ కంపెనీలతో కలిసి బల్దియా ఖజానాకు కోట్లాది రూపాయలు కుచ్చుటోపీ పెడుతున్నారు. 
బల్దియాకు అన్నింట్లో టాప్‌ ప్లేసే
బల్దియాకు అన్నింట్లో టాప్‌ ప్లేసే. అభివృద్ధిలోనే కాదు కరప్షన్‌లోనూ కూడా గ్రేటర్‌ అధికారులు ముందుంటున్నారు. మొన్న రోడ్ల నిర్మాణంలో కోట్లాది రూపాయలు నొక్కెశారు. అక్రమ నిర్మాణాలు ప్రొత్సహించడంలో వీరిది అందవేసిన చెయ్యి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా బల్దియా ఖజానా సొమ్మును లక్షల రూపాయలు తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. ఒక్కటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క విభాగం ఎంటీ, అన్ని విభాగాల్లో అదే పరిస్థితి. తాజాగా సెల్‌ టవర్ల ఏర్పాటులో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల అండతో వందల కోట్ల రూపాయలు అధికారుల జోబుల్లోకి వెళ్తున్నాయి. 
గ్రేట‌ర్ ప‌రిధిలో సెల్ ట‌వ‌ర్లకు అనుమతి 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో సెల్ ట‌వ‌ర్లకు అనుమ‌తినిస్తుంది బ‌ల్దియా. దీనికి బిల్డింగ్‌ ప‌ర్మిష‌న్ తో పాటు ఇత‌ర డాక్యుమెంట్లు ప‌రిశీలించి అనుమ‌తులు మంజూరు చెయ్యాల్సి ఉంటుంది. అయితే హైద‌రాబాద్ న‌గ‌రంలో 969 ట‌వ‌ర్లకు మాత్రమే అనుమ‌తి ఉందంటుంది బ‌ల్దియా. కానీ న‌గ‌రంలో ఏ ప్రాంతంలో చూసినా ప‌దుల సంఖ్యలో మ‌న‌కు సెల్ ట‌వ‌ర్లు ద‌ర్శన‌మిస్తుంటాయి. జీహెచ్‌ఎంసీ నుంచి సెల్ ట‌వ‌ర్ కు అనుమ‌తి తీసుకోవాలంటే  ఒక్కో ట‌వ‌ర్ కు ల‌క్ష రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సెల్ కంపెనీల యాజ‌మానులు వాటి నుంచి బ‌య‌ట‌ప‌డటానికి ఎలాంటి అనుమ‌తులు లేకుండా ట‌వ‌ర్లు నిర్మిస్తున్నారు. అలా హైద‌రాబాద్ న‌గ‌రంలో వేల అక్రమ ట‌వ‌ర్లు వెలుస్తున్నాయి.
అక్రమ సెల్ ట‌వ‌ర్లపై ఫిర్యాదులు  
హైద‌రాబాద్ లో వెలుస్తున్న అక్రమ సెల్ ట‌వ‌ర్లపై నిత్యం ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ప్రధాన కార్యాల‌యంలో పర్మిష‌న్ ఇస్తార‌ని అక్కడే ఫిర్యాదు చేయాలని స్థానికంగా ఉండే అధికారులు చెబుతుంటారు. ఫిర్యాదులపై ప్రధాన కార్యాల‌యం చుట్టు చెప్పుల‌రిగేలా తిరిగినా బల్దియా అధికారులు మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పని చేస్తున్న అధికారులే. చ‌ట్ట ప్రకారం అనుమ‌తులిస్తున్నామంటున్నా ఎలాంటి అనుమ‌తులు లేకుండ వెల‌సిన  4,368 ట‌వ‌ర్ల విష‌యంలో మాత్రం అధికారులు ఎలాంటి చ‌ర్యలు తీసుకోవ‌డం లేదు. కేవ‌లం 10వేలు మాత్రమే చెల్లించి ఎలాంటి  అనుమ‌తులు పోంద‌కుండా యదేచ్ఛగా ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. 
ఫిజిక‌ల్ మానిట‌రింగ్ ఉండ‌టం లేదు...
ఒక్కసారి అనుమ‌తి ఇచ్చామంటే తమకు దానితో సంబంధం లేదంటున్నారు అధికారులు. కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటిస్తున్నారా లేదా అనే అంశాలను కూడా పట్టించుకోవడం లేదు. ఫిజిక‌ల్ మానిట‌రింగ్ ఉండ‌టం లేదు.  రేడియేష‌న్ పై ప్రజ‌లు నిత్యం భ‌యాందోళ‌న‌ల్లో ఉంటున్నారు. ఒక్క సెల్ ట‌వ‌ర్ అనుమ‌తి తీసుకుని అందులో నాలుగు, ఐదు కంపెనీల ఫ్రిక్వేన్సీ బాక్స్ లు అమ‌రుస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 
ప్రతి ట‌వ‌ర్ కు ల‌క్ష రూపాయ‌లు... 
2013లో ప్రభుత్వం విడుద‌ల చేసిన 380జివో ప్రకారం జిహెచ్ఎంసి ప‌రిధిలో సెల్ ట‌వ‌ర్లు నిర్మించాలంటే ప్రతి ట‌వ‌ర్ కు ల‌క్ష రూపాయ‌లు చెల్లించాలి. కానీ 10వేల రూపాయ‌లు మాత్రమే చెల్లించి ఎలాంటి అనుమ‌తులు లేకుండా సిటి ప‌రిధిలో 4,500 ట‌వ‌ర్లు నిర్మించాయి సెల్ కంపెనీలు. దీంతో సెల్ ట‌వ‌ర్ల ద్వారా బ‌ల్దియా కు వ‌చ్చే ఆదాయానికి భారీగా గండి ప‌డుతోంది. అనుమ‌తులు లేకుండా న‌డుస్తున్న సెల్ ట‌వ‌ర్ల నుంచి ఫిజులు వ‌సూలు చేస్తే బల్దియాకు దాదాపు 50 కోట్ల ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ప్రతి ఏడాది ఒక్కోట‌వ‌ర్ కు 10 నుంచి 15 వేలు ప‌న్ను రూపంలో వ‌చ్చినా 6 కోట్ల రూపాయ‌లు జీహెచ్‌ఎంసీ ఖ‌జానాకు చేరుతుంది. ఇంత‌టి ఆదాయం ఉన్న ఈ విభాగంలో కేవ‌లం ముగ్గురంటే ముగ్గురు అధికారులు మాత్రమే చ‌క్రం తిప్పుతున్నారు. ప్రజ‌ల ఆరోగ్యంపై రేడియేష‌న్ పెను ప్రభావం చూపుతుందని సిటిజన్లు బయపడుతున్న తరుణంలో సెల్‌ టవర్లను రెగ్యులరైజ్‌ చెయ్యడంలో బల్దియా పూర్తిగా విఫలమవుతోంది. ఇప్పటికైనా అధికారులు సెల్‌ టవర్లపై నిఘా పెట్టాలంటున్నారు సిటిజన్లు.

ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని రిసార్ట్స్ లో ఎమ్మెల్యేల బస..

చెన్నై : ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలు బస అయ్యారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఇద్దరు సెక్యూర్టీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల నుండి ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బలనిరూపణ వరకు ఎమ్మెల్యేలను రిసార్ట్స్ లోనే ఉంచాలని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

11:38 - February 9, 2017

ఢిల్లీ : నగదు లభ్యతపై ఆర్బీఐ సామాన్యులకు ఊరటనిచ్చింది. సేవింగ్ అకౌంట్ల నుంచి నగదు ఉపసంహరణపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు ఖాతాల్లో నగదు ఉపసంహరణ పరిధిపై మార్చి 13 నుంచి ఆంక్షలు ఎత్తివేయనుంది. మరోవైపు ఇప్పుడున్న వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. 
వారానికి రూ.24వేల నుంచి 50వేలకు పెంపు
నగదు రద్దుతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు.. ఆర్బీఐ మరో తీపికబురు అందించింది. పొదుపు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ పరిధిని వారానికి 24వేలు నుంచి 50వేలకు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ పెంపు ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి రానుంది. మార్చి 13 నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో బ్యాంకుల్లో, ఏటీఎంలలో విధించిన ఆంక్షల నుంచి ఇక ప్రజలకు పూర్తి విముక్తి లభించనుంది. మార్చి 13 నుంచి నగదు విత్‌డ్రా పరిమితి పూర్తిగా ఎత్తివేయనున్నట్టు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు.
జనవరి 27..నగదు విలువ రూ.9.92లక్షల కోట్లు
జనవరి 27 నాటికి దేశం మొత్తమ్మీద చలామణీలో ఉన్న నగదు విలువ రూ.9.92లక్షల కోట్లుగా ఆర్బీఐ లెక్క తేల్చింది. ఇందులో కొత్త రూ.500, రూ.1000 నోట్లు కూడా ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చిన వెయ్యి, ఐదొందల నోట్లకు నకిలీవి తయారు చేయడం అసాధ్యమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌.ముంద్ర అన్నారు. ఒకవేళ అలా దొరికిన అవి ఫోటో కాపీ లేనని చెప్పారు. 
మార్కెట్ వర్గాలకు నిరాశ 
మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆరో త్రైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. మార్కెట్లకు ఎలాంటి సర్ ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. దీంతో రెపోరేటు 6.25, రివర్స్‌ రెపోరేట్‌ 5.7 శాతాలను యథాతథంగా ఉంచింది. 2016-17లో వృద్ధిరేటు 6.9శాతంగా, 2017-18లో 7.4శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. కీలక వడ్డీరేట్లను నిర్ణయించే పరపతి విధాన కమిటీ సమావేశం రెండో రోజూలుగా కొనసాగింది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయాలను వెల్లడించింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరింత తగ్గిస్తుందని భావించిన గృహ, ఆటోమొబైల్‌, కార్పొరేట్‌ రంగాలకు ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది. బడ్జెట్ అనంతరం... వడ్డీ రేట్ల తగ్గింపుపై అనేక సెక్టార్లు ఆశలు పెట్టుకున్నాయి. వారి ఆశలు అడియాసలు చేస్తూ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని మానిటరీ కమిటీ ఈ నిర్ణయం వెలువడింది. వడ్డీరేట్లు తగ్గించకున్నా.. నగదు విత్ డ్రా ఆంక్షల నుంచి మాత్రం విముక్తి లభిస్తుండటం ప్రజలకు ఊరటనిచ్చే విషయం. 

 

11:34 - February 9, 2017

నరేంద్రమోడీ ప్రధాని స్థాయిలో ఉండి రాజ్యసభలో మన్మోహన్ సింగ్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని వక్తలు అన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, బీజేపీ నేత అద్దేపల్లి శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

రాజ్యసభలో గందరగోళం..

ఢిల్లీ : రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను గర్హిస్తూ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏఐడీఎంకే సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనితో స్పీకర్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎంపీ మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

10:50 - February 9, 2017

చెన్నై : తమిళనాడలో జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. మధురైజిల్లా పాలమేడులో పోటీలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. సుమారు వెయ్యిమంది యువకులు 1500 ఎద్దులతో పోటీపడుతున్నారు. జిల్లాకలెక్టర్‌ జెండాఊపి పోటీలను ప్రారంభించడంతో ఎద్దులను లొంగదీసేందుకు యువకులు ఉత్సాహంగా ముందుకు కదిలారు. 

 

10:47 - February 9, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అన్నాడీఎంకేలో శశికళ వర్గం క్యాంపురాజకీయాలకు తెరతీసింది. మరోవైపు ఇవాళ ఇంచార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకి వస్తున్నారు. దీంతో గవర్నర్‌ను కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో బలప్రదర్ననకు శశికళ సిద్ధమవుతున్నారు. అటు అపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం తానే మళ్లీ సీఎం అవుతానంటున్నారు. రెండు వర్గాల పోటాపోటీ రాజకీయాల్లో  గవర్నర్‌ పాత్ర కీలకంగా మారింది. ఇప్పటికే 90ఎమ్మెల్యేలతో క్యాంపును నిర్వహిస్తున్న శశికళకు సీఎంగా అవకాశం కల్పిస్తారా.. లేదా శాసన సభను సమావేశపరిచి బలం నిరూపించుకోడానికి పన్నీర్‌సెల్వంకు అనుమతి అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇవాళ రాష్ట్ర పతిని కలవడానికి అన్నాడీఎంకేఎంపీలు సిద్ధమయ్యారు. తంబిదురై నేతృత్వంలో రాష్ట్రపతినికలిసి రాష్ట్రంలో జరగుతున్న పరిణామాలు, గవర్నర్‌ వైఖరిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. 

 

డీఎంకే జోక్యం చేసుకోదు - కనిమొళి..

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో డీఎంకే జోక్యం చేసుకోదని, ఏఐఏడీఎంకే అంతర్గత సమస్య అని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు.

10:42 - February 9, 2017
  • బియ్యం ఉడికే సమయంలో రెండు చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా వస్తుంది.
  • అంతేగాకుండా అన్నం పొడిపొడిగా రావడానికి ఉడికే సమయంలో కాస్త నూనె వేస్తే పొడిపొడిగా వస్తుంది.
  • క్యాబేజీ కూరలో పచ్చివాసన పోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తుంటారు. పచ్చివాసన పోవాలంటే ఉడుకుతుండగా ఒక బ్రెడ్ ముక్కను వేయాలి.
  • పాలు కాచేటప్పుడు సరిగ్గా గమనించకపోవడంతో పాలు పొంగిపోతుంటాయి. ఈ సమస్య పరిష్కారానికి గిన్నె అంచుకు నూనె రాసి చూడండి.
  • పాలతో వెండి వస్తువులను కడగడంవల్ల వాటి గార పోతుంది.
  • పచ్చిమిరపకాయలు తొడిమెలను తీసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడంవల్ల తొందరగా పాడవవు.
  • సీజన్ మారే సమయంలో జలుబు..గొంతు నొప్పి బాధిస్తుంటాయి. తులసి ఆకులను తగినన్ని నీళ్లలో వేసి కాచి తాగాలి.
  • వెల్లుల్లితో కలిపి ఆలుగడ్డలను ఉంచితే కొన్ని రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.
  • ఇడ్లీ మెత్తగా..దోశ కరకరలాడుతూ ఉండాలంటే ముందుగా బియ్యాన్ని కొద్దిసేపు వేయించి నానబెట్టాలి.
  •  
10:32 - February 9, 2017

మాస్కో : ప్రపంచంలోనే టాప్‌ క్లాస్‌ స్కేటర్‌...మాగ్జిమ్‌ హబానే ...రష్యా క్యాపిటల్‌ సిటీ మాస్కోలో డేర్‌ డెవిల్‌ స్టంట్స్‌తో అదరగొట్టాడు. నగర వీధుల్లో, స్ట్రీట్‌ స్కేటింగ్‌ స్టంట్స్‌తో ఔరా అనిపించాడు.  హైవే రోడ్స్‌పై రిస్క్‌ను సైతం లెక్కచేయకుండా స్ట్రీట్‌ స్కేటింగ్‌ చేసి స్థానికులను ఆశ్చర్యపరచాడు. ఈ ఫీట్స్‌తో హబానే... స్ట్రీట్‌ స్కేటింగ్‌లో తనకు తాను మాత్రమే సాటి అని మరోసారి నిరూపించాడు. 

బ్యాంకులకు పన్నీర్ లేఖ..

చెన్నై : తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బ్యాంకులకు లేఖలురాశారు. తన అనుమతి లేకుండా అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాల నుండి ఎలాంటి లావాదేవీలు జరపొద్దని కోరారు. అన్నాడీఎంకే కోశాధికారి హోదాలో లేఖలు రాశారు.

గన్నవరంలో దలైలామా..

విజయవాడ : గన్నవరం విమానాశ్రయానికి ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు దేవినేని, పల్లె రఘునాథరెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు.

10:28 - February 9, 2017

హైదరాబాద్ : మీడియా  ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌లో 10టీవీ సత్తా చాటింది. 10టీవీ వర్సెస్‌ స్నేహ టీవీ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో 10టీవీ ఘన విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న 10టీవీ... నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు సాధించింది.  177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్నేహటీవీ ఆరంభం నుంచే తడబడింది.  10టీవీ బౌలర్లు చెలరేగడంతో... వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుంది. 107 పరుగులకే స్నేహ టీవీ జట్టు ఆలౌట్‌ అయ్యింది. దీంతో  69 రన్స్‌ తేడాతో 10టీవీ భారీ విజయాన్ని నమోదు చేసింది.  10టీవీ జట్టు గెలుపులో కెప్టెన్‌ శ్రీనివాస్‌ కీరోల్‌ పోషించారు. 4 వికెట్లు తీసిన  శ్రీనివాస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఆరు భారీ సిక్సర్లతో చెలరేగిన రోహిత్‌కు మ్యాక్సిమమ్‌ సిక్స్‌ అవార్డు లభించింది. ఈనెల 11న న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ టీమ్‌తో 10టీవీ తలపడనుంది.

10:25 - February 9, 2017

కర్నూలు : నల్లమల అభయారణ్యంలో ఓ చిరుత మృత్యువాత పడింది. చిరుత మృతిపై  అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి చెందిందని ప్రజలు ఆరోపిస్తుండగా.. రెండు పులుల బీకర పోరాటంలో చిరుత మృతి చెందిందని ఫారెస్ట్‌ సిబ్బంది అంటున్నారు. 
ముళ్లపొదల్లో చిరుత మృతదేహం
కర్నూలు జిల్లా ఆత్మకూరు నల్లమల పెద్దపులుల అభయారణ్యంలో ఓ చిరుతపులి మృతి చెందింది. వెలుగోడు రిజర్వాయర్‌కు వంద మీటర్ల దూరంలో.. ముళ్లపొదల్లో చిరుత మృతదేహాన్ని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. అయితే.. ఆరేళ్ల మగ చిరుతపులి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి కోసం వచ్చి చిరుత ఉచ్చులో చిక్కుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. ఓవైపు ఎండలు పెరగడంతో రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో వేటగాళ్లు ఉచ్చులు వేయడం పెరిగింది. దీంతో పులులు ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్నాయి. 
చిరుత మృతదేహానికి పోస్ట్‌మార్టం 
ఇదిలావుంటే.. అటవీశాఖ సిబ్బంది మాత్రం రెండు చిరుత పులులు పోట్లాడటం వల్లే చనిపోయిందంటున్నారు. రెండు పులుల భీకరపోరులో చిరుతకు గాయాలై చనిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారులు.. మృతి చెందిన చిరుత మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. 
చిరుత మృత్యువాత.. అనేక అనుమానాలు 
మొత్తానికి పులులను సంరక్షించాల్సిన అభయారణ్యంలోనే చిరుత మృత్యువాత పడటం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇది సహజంగా రెండు పులుల పొట్లాటలో జరిగిన ఘటనా ? లేక వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుందా ? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఫారెస్ట్‌ సిబ్బంది ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 

 

సీపీఎం మహాజన పాదయాత్ర 116వ రోజు..

భద్రాద్రి కొత్తగూడెం : సీపీఎం మహాజన పాదయాత్ర 116వ రోజు కొనసాగుతోంది. చాతకుంట, ఎర్రకుంట, నవభారత్, మంచికంటినగర్, ఇల్లందు క్రాస్ రోడ్డు, అనిశెట్టిపల్లి, బొమ్మనపల్లి, సులానగర్, టేకులపల్లి గ్రామాల్లో పాదయాత్ర బృందం పర్యటించనుంది.

కరీంనగర్ లో ఏఆర్ ఎస్ఐ మృతి..

కరీంనగర్ : రామ్ నగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనీ ఏఆర్ ఎస్ఐ యాదగిరిరావు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్ అంబర్ పేట ప్రాంతానికి చెందిన వాడు. గతంలో ట్రైనింగ్ కు వచ్చిన ముగ్గురు అనారోగ్యంతో మృతి చెందడం గమనార్హం.

అన్నాడీఎంకేలకు దొరకని రాష్ట్రపతి అపాయింట్ మెంట్..

చెన్నై : అన్నాడీఎంకేలకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ దొరకలేదు. తంబిదురై నేతృత్వంలో రాష్ట్రపతిని కలువాలని ఎంపీలు భావించారు. తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించాలని కోరనున్నారు.

10:14 - February 9, 2017
09:44 - February 9, 2017

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా దేశాల మధ్య నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్ జరగనుంది. భారత్ లో ఈ సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 23వ తేదీ నుండి  ప్రారంభమౌతాయని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 29 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. తాజాగా ఈ సీరిస్ లు జరిగే వేదికల వివరాలను తాజాగా ప్రకటించింది. మొదటి టెస్టు మ్యాచ్ పూణెలో ప్రారంభం కానుంది.

 

నగరం స్టేడియం టెస్టు తేదీ సమయం
పూణె మహారాష్ట్ర క్రికేట్ అసోసియేషన్ స్టేడియం మొదటి టెస్టు ఫిబ్రవరి 23-27 09.30Am
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం రెండో టెస్టు మార్చి 04-08 09.30Am
రాంచీ జేఎస్ సీఏ ఇంటర్నేషనల్ కాంప్లెక్స్ మూడో టెస్టు మార్చి 16-20 09.30Am
ధర్మశాల హిమాచల్ ప్రదేవ్ క్రికేట్ అసోసియేషన్ స్టేడియం నాలుగో టెస్టు మార్చి 25-29 09.30Am
09:26 - February 9, 2017

టాలీవుడ్..బాలీవుడ్...ఇలా ఏ వుడ్ లో నైనా చిత్రం కోసం అదిరిపోయే టైటిల్ సాంగ్ ఉండాలని చిత్ర యూనిట్ భావిస్తూ ఉంటుంది. అందుకని పవర్ ఫుల్ సాంగ్ రాయాలని పాటల రచయితలను కోరుతుంటారు. పలు చిత్రాల టైటిల్ సాంగ్ లు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అందులో భాగంగా 'మహేష్ బాబు' నటిస్తున్న ఓ తాజా చిత్రం కోసం పవర్ పుల్ సాంగ్ ను రాస్తున్నారంట. ‘మురుగదాస్' కాంబినేషన్ లో 'మహేష్' ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ సాంగ్ ఉండనున్నట్లు టాక్. మహేష్ గత చిత్రాలైన 'అతడు'..’దూకుడు' చిత్రాల టైటిల్ సాంగ్ లకు స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల పాటలను విశ్వ రాశారు. మరోసారి 'మహేష్' చిత్రం కోసం ఓ ఇంట్రడక్షన్ సాంగ్ ను రాసినట్లు తెలుస్తోంది. గత చిత్రాలకంటే మించిన రేంజులో పవర్ ఫుల్ సాంగ్ ను రాసాడని సమాచారం. మహేష్ హీరోగా..రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

హైదరాబాద్ : భారత్, బంగ్లాదేశ్ మధ్య కాసేపట్లో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

 

09:05 - February 9, 2017

బాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందిన నటీమణుల్లో 'విద్యా బాలన్' ఒకరు. విభిన్న తరహా పాత్రలు..మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీల్లోకి అడుగు పెట్టి 14 సంవత్సరాలు గడుస్తోంది. కానీ ఓ హీరోతో మాత్రం 'విద్యా' నటించలేదు. ప్రస్తుతం ఇదే అంశాన్ని లేవనెత్తారు. మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా పేరొందిన 'అమీర్ ఖాన్' తో చిత్రం చేయాలని ఉందని తన మనస్సులోని మాటను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. మంచి కథ వస్తే అమీర్ తో స్ర్కీన్ షేర్ చేసుకోవాలని ఉందని పేర్కొంది. అమీర్ తో కచ్చితంగా ఓ సినిమా చేయాలని ఉందని..దర్శకుడు..నిర్మాతలు..టెక్నీషీయన్లతో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తానని తెలిపింది. ఇటీవలే అమీర్ నటించిన 'దంగల్' సినిమా చూడడం జరిగిందని, బాగా ఎంజాయ్ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 'విద్యా బాలన్' ‘బేగమ్ జాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వ్యభిచార నిర్వాహకురాలిగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో ముజ్రా సాంగ్ ను ఆశాభోంస్లే పాడడం సోషల్ మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి విద్యా కోరిక నెరవేరుతుందా ? లేదా ? అనేది చూడాలి.

08:58 - February 9, 2017

మెగాస్టార్ చిరంజీవితో తీసిన 'ఖైదీ నెంబర్ 150’ సినిమా విజయం వి.వి.వినాయక్ కు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చిరంజీవి 150వ చిత్రం కావడంతో అభిమానులు..టాలీవుడ్ లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అందరి అంచనాలకు తగ్గట్టే చిత్రం ఘన విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే చిత్రం రూ. 150 కోట్లు సాధించిందని తెలుస్తోంది. అనంతరం వి.వి.వినాయక్ తదుపరి చిత్రంపై కసరత్తులు ప్రారంభించాడు. అందులో భాగంగా మెగా కౌంపౌండ్ నుండి వచ్చిన 'సాయి ధరమ్ తేజ్' తో వినాయక్ చిత్రం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కంటే ముందుగానే వినాయక్ ఓ కథను రూపొందించారంట. ప్రస్తుతం 'తేజ్' తో చిత్రాన్ని చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో త్వరలోనే విడుదల కానుంది. అంతేగాకుండా 'జవాన్'..'నక్షత్రం'..సినిమాల్లో నూ కూడా 'తేజ్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల తరువాత వినాయక్ చిత్రం ఉంటుందా ? లేక ముందే ఉంటుందా ? అనేది తెలియరావడం లేదు.

08:51 - February 9, 2017

'కాటమరాయుడు' కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వల్ప విరామం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా స్పీడ్ గా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చిత్ర పోస్టర్..టీజర్ విడుదలైంది. యూ ట్యూబ్ లో టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా చిత్ర షూటింగ్ కు విరామం పడింది. పవన్ కళ్యాణ్ బోస్టన్ కు వెళ్లడమే ఇందుకు కారణం. హార్వర్డ్ యూనివర్సిటీలో పవన్ ప్రసంగించనున్నారు. అంతేగాకుండా పలు కార్యక్రమాల్లో పవన్ బిజీ బిజీగా గడుపనున్నారు. బోస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టిన పవన్ ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుండి 12వ తేదీన సాయంత్రం 6.30గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొననున్నారు. న్యూక్లియర్ అండ్ యాంటీ న్యూక్లియర్ ప్రొఫెసర్ మాధ్యు బన్, ఎనర్జీ పాలసీ రూపకల్ప నిపుణుడు ప్రొఫెసర్ హెన్రీ లీలతో పాటు హ్యాంప్ షైర్ గవర్నర్, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు వంటి పలువురు ముఖ్యులతో పవన్ మాట్లాడనున్నారు.
11వ తేదీన హార్వర్డ్ యూనివర్సిటీలో ‘బికమింగ్ జనసేనాని’ అనే అంశంపై పవన్ మాట్లాడనున్నారు. దీనిపై 1వ తేదీన పవన్ నోట్ ప్రసంగం ఇవ్వనున్నారు.
12న నషువా లోని రివర్ యూనివర్సిటీ దగ్గర భారతీయ సంతతి వారు నిర్వహిస్తున్న కార్ ర్యాలీలో పాల్గొననున్నారు.
తెలుగు లలితా కళావైభవానికి చిహ్నమైన కూచిపూడి నృత్య ప్రదర్శనలో పవన్ పాల్గొంటారని తెలుస్తోంది.

నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్టు

హైదరాబాద్ : నకిలీ కరెన్సీ తయారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హిమాయత్ నగర్ లార్డ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 30 లక్షల నకిలీ కరెన్సీ, ప్రింటర్, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సానియామీర్జాకు సర్వీస్ ట్యాక్స్ విభాగం నోటీసులు

హైదరాబాద్ : సానియామీర్జాకు సర్వీస్ ట్యాక్స్ విభాగం నోటీసులు జారీ చేసింది. రూ.కోటికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించనందుకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నజరానా ఇచ్చింది. 

08:38 - February 9, 2017

కృష్ణా : విజయవాడలోని గుణదల.. మేరీమాత ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రతిఏటా ఫిబ్రవరిలో 9 నుంచి 11వరకు సాగే ఉత్సవాల కోసం ఆలయాన్ని అంగరంగవైభవంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండడంతో ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేశారు. కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.
గుణదల మేరీమాత ఆలయం శోభాయమానం 
గుణదల మేరీమాత ఆలయం.. శోభాయమానమైంది. భక్తుల సందడితో ఈ క్షేత్రం కళకళలాడుతోంది. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో జరిగే మేరీమాత వేడుకల కోసం.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇప్పటికే తండోపతండాలుగా తరలివస్తున్నారు. సాధారణంగా, క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, గుడ్‌ప్రైడే, ఈస్టర్‌ లాంటి ప్రధాన పండుగల వేళ మేరీమాత ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. శుక్ర, శని, ఆదివారాల్లోనూ ఇక్కడ భక్తుల తాడికి ఎక్కువే. ఇక ఏటా వచ్చే మేరీమాత వేడుకలకైతే.. లక్షల్లో భక్తులు వచ్చి.. మాతను దర్శించుకుంటారు. 
3రోజుల పాటు మేరీమాత ఉత్సవాలు 
1947 నుంచి ప్రతిఏటా ఫిబ్రవరి 9 నుంచి మూడు రోజుల పాటు మేరీమాత ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలకు ముందు తొమ్మిది రోజులపాటు నవదిన ప్రార్ధనలు, ఆరాధనలు వైభవంగా నిర్వహిస్తారు.  
సమష్టి దివ్య పూజాబలితో మేరీమాత ఉత్సవాలు 
గురువారం ఉదయం 7 గంటలకు సమష్టి దివ్య పూజాబలితో మేరీమాత ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.  ప్రత్యేక ప్రార్ధనలతోపాటు ఆధ్యాత్మికమైన ఆరాధనలు, గీతాలాపనలు జరుగనున్నాయి. మేరీమాత ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

08:32 - February 9, 2017

గుంటూరు : అమరావతిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రి నారాయణ పరిశీలించారు. అసెంబ్లీ భవనాన్ని, సౌకర్యాలను పరిశీలించిన కోడెల.. కొన్ని మార్పులు చేయాలని సిబ్బందికి  సూచించారు. 

 

08:29 - February 9, 2017

విజయవాడ : రాజధాని అభివృద్ధే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూములను 3 దశల్లో లే ఔట్స్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. రైతుల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి బాండ్ల జారీతో పాటు ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. తొలివిడతగా 1000 కోట్ల బాండ్లు జారీ  చేయాలన్నారు.
నగర ప్రణాళికపై అధికారుల ప్రజెంటేషన్‌ 
రాజధాని ప్రాంత అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని రాజధానిలో నిర్మించనున్న 9 నగరాలకు సంబంధించిన ప్రణాళికపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధానిలో తాగునీటి అవసరాలు, నీటి  నిర్వహణపై చర్చించారు. రాజధానిలోని 24 రెవెన్యూ గ్రామాలను 13 జోన్లుగా విభజించి మాలిక సదుపాయాలు కల్పించాలన్నారు సీఎం. మొదటి మూడు జోన్లలోని 8 గ్రామాల్లో 2982 కోట్లు వెచ్చించేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. నాలుగురోజుల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించింది. 4 దశల్లో 13 జోన్ల గ్రామాలను మూడేళ్లలో పూర్తిగా అభివృద్ధి చేస్తామని పేర్కొంది. హడ్కో 7500 కోట్లు, వరల్డ్ బ్యాంకు 6500 కోట్ల రుణాల మంజూరుకు అనుమతి ఇచ్చాయని సీఎం తెలిపారు. 
రాజధాని అభివృద్ధికి వెయ్యి కోట్ల బాండ్లు జారీ 
రాజధాని ప్రాంత అభివృద్ధికి బాండ్లు జారీ  చేయాలన్న  చంద్రబాబు..తొలివిడతగా వెయ్యి కోట్ల విలువైన బాండ్లు జారీ  చేశారు. విద్యుత్ సరఫరా లైన్లకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పన చేశారు  చంద్రబాబు. ఐఐటీలు, ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లు, ఆర్కిటెక్చర్ కళాశాలల విద్యార్థులను ఇంటర్న్‌షిప్ కింద తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమరావతిలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపనకు ఆసక్తి చూపుతున్నారని.. ఒకే ప్రాంతంలో కాకుండా విశాఖ, తిరుపతిలోనూ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా  మూడు నగరాలను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తన ఆలోచన అని అధికారులకు తెలిపారు చంద్రబాబు. ఈ సమావేశ వివరాలను మంత్రి నారాయణ వెల్లడించారు. 
విజయవాడలో రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ప్రెజెంటేషన్‌
విజయవాడలో రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై సమావేశం చివరలో అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. దుర్గ గుడి, ఘాట్లు, కాల్వలు, బస్ పోర్ట్, రైల్వే స్టేషన్ ప్రాంతాలన్నింటినీ ఒకే సముదాయంగా తీర్చిదిద్దేందుకు బ్యుటిఫికేషన్ ప్లాన్‌ను ఆహ్వానించారు. ఇందులో భాగంగా రివర్, కెనాల్ ఫ్రంట్ అభివృద్ది, బిజినెస్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, సర్విస్ అపార్టుమెంట్స్, మల్టీప్లెక్స్, ఫుడ్  కోర్టులు, పార్కులు,  సైకిల్ ట్రాకుల నిర్మాణం, ఇన్‌లాండ్ వాటర్ వేస్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు అన్నారు.

 

08:22 - February 9, 2017

హైదరాబాద్ : రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ, ఏపీ ఉన్నతాధికార బృందాలు నేడు హైదరాబాద్‌లో భేటీ కానున్నాయి.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో జరిగే ఈ సమావేశంలో  తొమ్మిది, పది షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకంపై చర్చిస్తారు. కోర్టులకు వెళ్లకుండా, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ నెల 2న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ్టి చర్చలు సాగుతాయి. 
సమస్యల పరిష్కారం దిశగా రెండు ప్రభుత్వాలు అడుగులు 
రాష్ట్ర విభజన తర్వాత ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. రెండు రాష్ట్రాల ఉన్నతాధికార బృందాలు ఇవాళ హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో  మరోసారి భేటీ కానున్నాయి. తెలంగాణ బృందానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వివేక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి యనయమల రామకృష్ణుడు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు ప్రనిధులుగా ఉన్నారు. 
హైదరాబాద్‌లోని ఏపీ సచివాయల భవనాల అప్పగింత 
ఇవాళ్టి భేటీలో చర్చించే అంశాలపై రాజ్‌భవన్‌ నుంచి రెండు రాష్ట్రాల కమిటీలకు అజెండా చేరింది. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాల అప్పగింత, న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌  విభజన, టీటీడీ, ఆర్టీసీ సంస్థల ఆస్తుల పంపకం వంటి అంశాలపై చర్చిస్తారు. ఏపీ పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న ఆస్తుల పంపకంపై కూడా ఉన్నతాధికార బృందాలు చర్చిస్తాయి. తొమ్మితో షెడ్యూలులోని 12 ఉమ్మడి సంస్థలపై ఇవాళ్టి సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటిలో మూడు పరిశ్రమలు కూడా ఉన్నాయి. పదో షెడ్యూలులో 60 సంస్థలు ఉన్నాయి. ఇవి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 
వెయ్యి మందికి పైగా ఉద్యోగుల విభజన 
అలాగే ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలు, గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల విభజనపై స్పష్టత వచ్చే చాన్స్‌ ఉందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఈ రెండు విభాగాల్లో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారు. ఖాళీలు లేకపోతే సూపర్‌న్యూమరీ పోస్టులు  సృష్టించి, ఏ ప్రాంత ఉద్యోగులను ఆ ప్రాంతానికి పంపే అంశంపై అంగీకారం కుదిరే అవకాశం ఉంది. అలాగే అంతరాష్ట్ర బదిలీలు, పరస్పర అంగీకరాతంతో బదిలీలకు రెండు ప్రభుత్వాలు సుముఖంగా ఉన్నట్టు గవర్నర్‌ నరసింహన్‌కు తెలిపాయి. ఇవాళ్టి భేటీలో ఈ సమస్యలు ఎంతవరకు కొలిక్కి వస్తాయో చూడాలి. 

 

08:09 - February 9, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకుంది. సాగర్‌ కుడికాల్వ నుంచి రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీరు విడుదల అంగీకారం తెలిపింది. ఐదు టీఎంసీ జలాలు కావాలన్న ఏపీ విజ్ఞప్తికి తెలంగాణ సానుకూలంగా స్పందించింది. 
కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ 
హైదరాబాద్‌లో జలసౌధలో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాడీవేడీగా జరిగింది. బోర్డు ఛైర్మన్‌ హాల్దర్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, కార్యదర్శులు హాజరయ్యారు. నీటి కేటాయింపులు, బోర్డు నిర్వహణ, విధి, విధానాలు, టెలిమెట్రీల ఏర్పాటు వంటి అంశాపై విస్తృతంగా చర్చించారు. నీటి లెక్కలపై ఈఎన్‌సీలు ప్రత్యేకంగా చర్చించారు. 
నీటి వాడకం లెక్కలపై అధికారుల తర్జన భర్జన
వేసవి సమీపిస్తున్న సమయంలో సాగునీటి కన్నా మంచినీటికి  ప్రధాన్యత ఇవ్వాలన్న అంశం కృష్ణానదీ యాజమాన్య బోర్డులో చర్చకు వచ్చింది. తెలంగాణ అధికారులు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీ అధికారులు తాగునీటితోపాటు, సాగుచేసిన పంటలను కాపాడేందుకు సాగునీరు కూడా ముఖ్యమన్న వాదాన్ని వినిపించినట్టు సమాచారం. నీటి వాడకం లెక్కలపై రెండు రాష్ట్రాల అధికారులు తర్జన భర్జన పడ్డారు. పంపణీ లెక్కలు తేలనంతవరకు బోర్డు నిర్వహణ, విధి విధానాలు అంగీకరించబోమన్న వాదాన్ని తెలంగాణ అధికారులు వినిపించారు. గత కేటాయింపులకు అనుగుణంగా పంపిణీ చేయాలని కోరారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ తెలంగాణకు కేటాయించిన వాటాలపై ఏపీ  అన్యాయంగా వ్యవహరిస్తోందన్న రాష్ట్ర అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. బచావత్‌ ట్రైబ్యునల్‌  కేటాయింపుల ప్రకారం నీరు విడుదల ఉండాలని తెలంగాణ అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరారు. మొత్తం 811 టీఎంసీల్లో 299:512 నిష్పత్తిలో పంపిణీ చేయాలన్న తెలంగాణ వాదాన్ని ఏపీ వ్యతిరేకించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల కోసం ఐదు టీఎంసీల నీరు విడుదలకు గతంలో జారీ చేసిన ఆదేశాలు అమలు కాలేదని ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. ఇది సత్యదూరమని కొట్టిపారేసిన తెలంగాణ అధికారులు, నీటి విడుదలకు సంబంధించిన ఆధారాలు చూపి, ఏపీ వాదాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. 

08:05 - February 9, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శశికళ క్యాంపు రాజకీయాలు, ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నై పర్యటన ఖరారు కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గంటగంటకు మారుతున్న పరిణామాలు, రాజకీయ సమీకరణలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గాల మధ్య పోరు తీవ్రమైంది.
మొత్తం 134 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు 
పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కొద్ది రోజులు మౌనంగానే ఉన్నారు. చెన్నై మెరీనా బీచ్‌లోని జయలలిత సమాది వద్ద మౌనవ్రతం చేసిన తర్వాత శశికళపై ఒక్కసారిగా భగ్గుమనడంతో రాజకీయ పరిణామాలు  ఒక్కసారిగా మారిపోయాయి. శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో, ఈ హఠాత్పరిణామానికి కలవరపాటుకు గురైన శశికళ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను కూడగట్టారు. మొత్తం 134 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేల్లో 130 మంది తన వైపే ఉన్నారన్న వాదాన్ని వినిపిస్తున్నారు. తిరుగుబాటు నేత సెల్వం ప్రలోభాలకు  లొంగుతారేమోనన్న భయంతో క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలందర్నీ నగరంలోని ఓ హోటల్‌కు తరలించారు. ఇక్కడ కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శశికళ మొదట ఏర్పాటు చేసిన భేటీకి సగం మందికిపైగా గైర్హాజరయ్యారు. దీంతో ఖంగుతిన్న చిన్నమ్మ, మరోసారి నిర్వహించిన భేటీకి వచ్చిన 123 మందిని క్యాంపుకు  తరలించారు. అయితే వీరిలో ఎంతమంది శశికళకు మద్దతు ఇస్తారన్న విషయాన్ని ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు. అందరూ చిన్నమ్మకు  అండగా ఉంటే మాత్రం పన్నీరు సెల్వంకు  గడ్డుకాలం తప్పదని భావిస్తున్నారు. 
అనుయాయులకే టికెట్లు ఇప్పించుకున్న శశికళ 
2016 అసెంబ్లీ ఎన్నికల నుంచే శశికళ జాగ్రత్త పడ్డారు.  అన్నా డీఎంకే తరుపున పోటీ చేసే అభ్యర్ధుల నిర్ణయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో చక్రంతిప్పి తన అనుయాయులకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఇదే ఇప్పుడు  శశికళకు బాగా కలిసివచ్చిందని విశ్లేషిస్తున్నారు.  గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది శశికళ మాట జవదాటే అవకాశంలేదని భావిస్తున్నారు. అయితే అవకాశవాద రాజకీయాల్లో దీనికి అంత ప్రాధాన్యత ఉండదన్న వాదనలేకపోలేదు. ప్రజాబలం ఎటువైపు ఉంటే శాసనసభ్యులు అటువైపై మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదని గతంలో చాలా సందర్భాల్లో రుజువైన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. 
ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో పన్నీరు సెల్వం విఫలం 
పన్నీరు  సెల్వంకు అన్నా డీఎంకే పార్టీ శ్రేణులతోపాటు, ప్రజల్లో సానుభూతి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ  ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే ఆయనవైపు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. శశికళపై తిరుగుబాటు తర్వాత 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని  సెల్వం వర్గీయులు ప్రకటించుకున్నారు. కానీ ఇదంతా ఒట్టిదేనని  తదనంతర పరిణామాల్లో తేలిపోయింది. అయితే పన్నీరు సెల్వం మాత్రం ఇప్పటికే తనకు బలం ఉందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పడం గమనించదగ్గ పరిణామం. అయితే  సెల్వంకు ఇది అంత సులువు కాదని విశ్లేషిస్తున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న అంశాన్ని చెప్పడంలేదు. 
రాష్ట్రపతి ముందు శశికళ వర్గం ఎమ్మెల్యేల పరేడ్‌కు యత్నాలు 
పన్నీరు సెల్వం, శశికళ మధ్య అధికార పీఠం కోసం ప్రత్యక్ష యుద్ధం జరుగుతున్న తరుణంలో తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఇవాళ మధ్యాహ్నం చెన్నై చేరుకోనున్నారు. శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ముందు పరేడ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో విద్యాసాగర్‌రావు చెన్నై రానున్నారు. ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ రాగానే శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేను విద్యాసాగర్‌రావు ముందు ప్రవేశపెట్టి ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు చేయించాలని చిన్నమ్మ వర్గం భావిస్తోంది. అటు పన్నీరు సెల్వం కూడా విద్యాసాగర్‌రావును కలుసుకొని తన వాదాన్ని వినిపించనున్నారు. రాజీనామాను ఉపసంహరించుకుని సీఎంగా కొనసాగించాలని కోరనున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ,  పన్నీరు సెల్వం మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో గవర్నర్‌ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. 
శశికళ కేసులపై న్యాయ సలహాలు తీసుకుంటున్న గవర్నర్‌ 
ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. శశికళపై ఉన్న కేసుల విషయంలో విద్యాసాగర్‌రావు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు. రాజ్యాంగ నిపుణులు గవర్నర్‌ ముందు ఉన్న కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. గవర్నర్‌ నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుని, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. అనిశ్చితి తొలగిపోయి,రాష్ట్రంలో పరిస్థితులు కుదుట పడిన తర్వాత రాష్ట్రపతి పాలన తొలగించి,  మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరివైపు వారిటి వారిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంది.   అయితే ఈ విషయంలో గతంలో ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ల విషయంలో సుప్రీంకోర్టులో ఎదురైన చేదు అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శశికళను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి, బలనిరూపణకు  గడువు ఇవ్వడం కూడా గవర్నర్‌ ముందు ఉన్న మరో ప్రత్యామ్నాయం. రాజీనామాను వెనక్కి తీసుకుంటానని పన్నీరు సెల్వం చేసే విన్నపాన్ని  విద్యాసాగర్‌రావు పరిశీలించి ముఖ్యమంత్రిగా కొనసాగమని కోరడం ఇంకో ఆప్షన్‌. అయితే ఇదే జరిగితే శశికళ వర్గం పన్నీరు సెల్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌ తీసుకోబోయే నిర్ణయం  కోసం తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

నేడు భారత్, బంగ్లా సింగిల్ టెస్టు మ్యాచ్

హైదరాబాద్ : నేడు భారత్, బంగ్లాదేశ్ సింగిల్ టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

వికారాబాద్ : పరిగి పల్లవి కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు ఇద్దరు దోమ మండలం బప్పల్లికి చెంది వారు, మరొకరు బొంపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

 

నేడు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

హైదరాబాద్ : నేడు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 

Don't Miss