Activities calendar

22 February 2017

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తిరుపతి పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు, పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక మొక్కులు సమర్పించిన సీఎం రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రగతి భవన్‌కు బయలుదేరారు.

పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కోదండరాం సతీమణి

హైదరాబాద్ : నగరంలో నిరుద్యోగ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమ‌తి నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. అయితే, రాజ్యాంగం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకునే హక్కును కల్పించిందని తెలుపుతూ, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ర్యాలీ నిర్వ‌హిస్తామ‌ని చెప్పిన కోదండ‌రాంను, ఈ రోజు తెల్ల‌వారు జామున‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోదండ‌రాం స‌తీమ‌ణి న‌గ‌ర‌ పోలీస్‌ కమిషనర్ మ‌హేంద‌ర్‌రెడ్డిని ఆశ్ర‌యించారు. తన భర్త అరెస్టుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. కాగా, కోదండరాం అరెస్టుపై మానవహక్కుల సంఘానికి టీజేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. కోదండ‌రాంను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

రేపు విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అరెస్టులు చేస్తూ భయోత్సాతాన్ని సృష్టిస్తున్నారు. ఈ తెల్లవారు జామున కోదండరాంను సైతం ఆయన నివాసంలోనే ముందస్తుగా అరెస్టుచేశారు. ఈ అరెస్టులకు నిరసనగా రేపు విద్యాసంస్థల బంద్‌కు ఓయూ ఐకాస పిలుపునిచ్చింది. అరెస్టుచేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఓయూ ఐకాస డిమాండ్‌ చేసింది.

కంటి చూపు కోల్పోయిన సందీప్ చమల్

హైదరాబాద్: టీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ చమల్ కంటి చూపు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

సీఎం చంద్రబాబుకు జగన్ లేఖ

అమరావతి : సీఎం చంద్రబాబు కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని ఆ లేఖ కోరినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా హామీ నెరవేరలేదని.. ఈ 33 నెలల్లో రూ. 2వేల చొప్పున ఒక్కో కుటుంబానికి రూ. 66 వేలు చెల్లించాల్సి వుందని తెలిపారు. నిరుద్యోగులకు బకాయిలతో పాటు భృతి మొత్తాన్ని చెల్లించేందుకు 2017-18 బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే కార్మాచరణ ప్రకటిస్తామని జగన్ హెచ్చరించారు.

హిందూధర్మ పరిరక్షణ ట్రస్టుకు నెలకు రూ. కోటి రూపాయలు..

తిరుపతి : ఏపీ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. మాజీ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ నిర్వహిస్తున్న హిందూధర్మ పరిరక్షణ ట్రస్టుకు నెలకు రూ. కోటి రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేవాదాయశాఖ, టీటీడీ నుండి ప్రతి నెలా చెరో రూ.50 లక్షలు చెల్లించాలని జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై టిటిడి ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఒప్రైవేటు ట్రస్టుకు ఏడాదికి రూ.12 కోట్లు ఇవ్వడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సరైన జీతాలు, సదుపాయాలు లేక టీటీడీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు నేత కందారపు మురళి ఆవేదన వ్యక్తం చేశారు.

14:34 - February 22, 2017

తిరుపతి: తిరుమల శేషాచల అడవుల్లో కార్చిచ్చు రగిలింది. తిరుమల నుంచి తిరుపతి వచ్చే పాత అన్నయ్య మార్గం అడవుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించారు. మంటలను అదుపు చేసేందుకు తిరుమల నుంచి వచ్చిన రెండు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకోలేకపోయాయి. దీంతో టిటిడి అటవీ, అగ్నిమాపక సిబ్బంది చెట్ల కొమ్మల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్‌ అందిస్తారు.

14:32 - February 22, 2017

విశాఖ : బీమునిపట్నం తహసీల్దార్‌ రామారావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అధికారులు హైదరాబాద్‌, రాజమండ్రి, విశాఖలలో ఉన్న రామారావు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రామారావు ఇంట్లో 15 లక్షల రూపాయలను, రాజమండ్రిలో ఉంటున్న అతని అల్లుడి ఇంట్లో 30 లక్షల రూపాయలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇతర ఇళ్లలోనూ నగలు, నగదు ఆస్తి పత్రాలు దొరికినట్టు అధికారులు వెల్లడించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

14:29 - February 22, 2017

హైదరాబాద్: కోదండరామ్‌ అరెస్టును నిరసిస్తూ కామాటిపుర పోలీసు స్టేషన్‌ వద్దకు భారీ సంఖ్యంలో టీజాక్ నేతలు చేరుకున్నారు. పోలీసు స్టేషన్‌లో ఉన్న కోదండరామ్‌ను కలుసుకుని పరామర్శించేందుకు యత్నించిన జేఏసి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో మాజీ మంత్రి డాక్టర్‌ విజయరామారావు కూడా ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవేందర్‌ అందిస్తారు.

13:30 - February 22, 2017

సూర్యాపేట : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర విజయంతమైందని టి.కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. మహాజన పాదయాత్ర 129వ రోజుకు చేరుకుంది. నాయకన్ గూడెం, మామిళ్ల గూడెం, హుస్సేనాబాద్, మోతె, నర్సింహుల గూడెం, రేపాల, జగన్నాథపురం, తలకోవలో లో పాదయాత్ర బృందం పర్యటించనుంది. నాయకన్ గూడెం చేరుకున్న అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి, పొన్నాల లక్ష్మయ్యలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు వారు వెల్లడించారు. తమ్మినేని చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమని, పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని పొన్నాల తెలిపారు.

13:26 - February 22, 2017
13:25 - February 22, 2017

హైదరాబాద్ : ఓయూలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీకి విద్యార్థులు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉంటే ఓ విద్యార్తి కళాశాల పైకి ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించాడు. దీనితో అక్కడ కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ విద్యార్థిని అరెస్టు చేసి కిందకు తీసుకెళ్లారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మూడేళ్లు అయిపోయిందని, ఉద్యోగాల మాట ఏమైందని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు వేచిచూడాలని ప్రశ్నించారు.

13:15 - February 22, 2017

చిత్తూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన కొనసాగుతోంది. గత రాత్రి కుటుంబసభ్యులతో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుచానూరుకు చేరుకున్న కేసీఆర్ కు ఆలయ అర్చకులు..అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ క్షేత్ర సంప్రదాయాలను కేసీఆర్ పాటిస్తున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 47 గ్రాములతో తయారు చేసిన ముక్కుపుడకను ఆలయ అర్చకులకు..అధికారులకు అందించారు. పద్మావతి అమ్మవారి దర్శనం..కానుకలు సమర్పించిన అనంతరం నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

శ్రీవారికి కానుకలు..
ఉదయం వరహాస్వామిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ కుటుంబసభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి రూ. 3 కోట్ల విలువైన 14.2 కిలోల సాలగ్రామహారం, రూ. కోటీ 21 లక్షల విలువైన 4.65 కిలోల మకరకంఠిలను ఆలయ ప్రధాన అర్చకులు, నిర్వాహాకులకు సీఎం అందజేశారు.

ఘనమైన ఏర్పాట్లు..
తెలంగాణ రాష్ట్ర సీఎం..కుటుంబసభ్యులకు..మంత్రులు..అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఆలయ అధికారులు..ఉన్నతాధికారులు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

13:08 - February 22, 2017

వరకట్నం తీసుకోవడం అనేది నేరమని తెలిసినా పలువురు కట్నాలు తీసుకొంటూనే ఉన్నారు. వరకట్న నిషేధ చట్టం..ఇతర వివరాలను లాయర్ పార్వతి మానవి 'మై రైట్' కార్యక్రమంలో విశ్లేషించారు. వరకట్నం అమ్మాయిలకు గిఫ్ట్ రూపేన ఇవ్వడం లేదా ప్రామిసరీ నోట్లు ఇవ్వడం జరుగుతుంటాయని, క్యాష్ రూపేన కావచ్చు..విలువైన ఆస్తులు ఇలా..ఏదైనా ఇస్తుంటారన్నారు. వివాహ సందర్భంగా ఇచ్చినా..పూర్వం ఇచ్చినా..తరువాత ఇచ్చినా కట్నం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరకట్నం తీసుకోవడం నిషేధం అంటూ 1961లో చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇందులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత అంశం చర్చకు రాలేదు. టేబుల్ ఐటమ్ గా ప్రవేశ పెట్టేందుకు అరుణ్ జైట్లీ ప్రతిపాదించగా సమయాభావం వల్ల కుదరదని ప్రధాని మోడీ తేల్చిచెప్పారు. వచ్చే బుధవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తిరుమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం..

చిత్తూరు : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు అన్నమయ్య మార్గంలోని అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

పద్మావతి ఆలయంలో కేసీఆర్ దంపతులు..

తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి సీఎం కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని కానుకలను సమర్పించనున్నారు.

అత్తాపూర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : అత్తాపూర్ లో అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రి మహేందర్ రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, కార్మిక శాఖ తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆపద్బందు పథకం కింద మరో రూ. 50వేలు అందిస్తామని, ఎయిర్ కూలర్ గోదాం యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.

ఏపీ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల..

విశాఖపట్టణం : ఏపీ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుండి మార్చి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు గడువు విధించారు. తొలిసారిగా ఆన్ లైన్ లో 16 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీన ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరగనుంది. ఏప్రిల్ 26న ఎడ్ సెట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి.

పోచారం డిశ్చార్జ్..

చిత్తూరు : తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రావు డిశ్చార్జ్ అయ్యారు. తిరుమలలో ఉదయం ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న మంత్రులు హరీష్ రావు, ఈటెలు పరామర్శించారు. ఆరోగ్యం మెరుగుపడడంతో పోచారంను డిశ్చార్జ్ చేశారు.

విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ : ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

12:41 - February 22, 2017

హైదరాబాద్ : ఎస్వీకే వద్దకు చేరుకున్న రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ను పోలీసులు అరెస్టు చేయడం విమర్శలకు దారి తీసింది. ఇతర కార్యక్రమంపై తాను ఇక్కడకు వస్తే అరెస్టు చేయడం ఏంటనీ ఆయన పోలీసులను నిలదీశారు. కనీసం మీడియాతో మాట్లాడకుండా పోలీసులు ప్రయత్నాలు చేశారు. దీనిపై చంద్రకుమార్ అసహనం వ్యక్తం చేశారు. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో ఎస్వీకే వద్ద బుధవారం ఉదయం నుండి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అడుగడుగునా ఆంక్షలు విధించారు. నిరసన వ్యక్తం చేయడానికి..ర్యాలీ చేయడానికి వస్తున్న వారిని అరెస్టులు చేస్తూ పీఎస్ కు తరలించారు. విమలక్క, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ తదితర ప్రజా సంఘాల నేతలు అరెస్టుయిన వారిలో ఉన్నారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు..ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ చేరుకున్నారని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన తరలివచ్చారు. ఇక్కడి నుండి రావాలని, అరెస్టు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో సభలు..సమావేశాలు నిర్వహించుకోవచ్చని అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. తాను వేరే కార్యక్రమం కోసం వచ్చామని, అంతలో అరెస్టు చేస్తున్నట్లు వెల్లడించారు.

12:31 - February 22, 2017

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా స్థానంలో తీసుకొచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ టిడిపి ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నారు. కొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండడం...ప్రతిపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే 'ప్యాకేజీ'కి చట్టబద్ధత కల్పించాలని, లేనిపక్షంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంటుందని ఎంపీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'ప్యాకేజీ'కి చట్టబద్ధత కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. కానీ క్యాబినెట్ ఏజెండాలో మాత్రం ఈ అంశం లేకపోవడం గమనార్హం. కానీ టేబుల్ అజెండాగా తీసుకొనే అవకాశం ఉంది. చట్టబద్ధత కల్పించడం వల్ల ప్రభుత్వాలు మారినా కేంద్రం నుండి నిధులు వచ్చే అవకాశం ఉందని ఎంపీలు పేర్కొంటున్నారు.
3500 కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల రూపంలో సహయం అందే అవకాశం ఉంది. అంటే ఐదు సంవత్సరాల్లో 17వేల కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. చట్టబద్ధత కల్పిస్తే ప్రతిపక్షాన్ని ఎదుర్కొనవచ్చని ఎంపీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పేర్కొంటోంది. కానీ చట్టబద్ధత కల్పిస్తే వెనుకబడి ఉన్న రాష్ట్రాలు ఆందోళన చేసే అవకాశం ఉందని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. భేటీ అనంతరం మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

12:24 - February 22, 2017

హైదరాబాద్ : ఓయూ మళ్లీ రణరంగం మారింది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ ఈ రోజు పునరావృతమయ్యాయి. విద్యార్థుల నినాదాలు..పోలీసుల అడ్డుకోవడం తదితర పరిణామాలతో ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీ నేపథ్యం..ప్రో.కోదండరాం అరెస్టును నిరసిస్తూ ఓయూ విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు ఎన్ ఓసీసీ గేట్ వద్ద వారిని అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా నిర్వహిస్తామని విద్యార్థులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వస్తున్న వారినీ అరెస్టు చేస్తున్నారు. నాలుగు దఫాలుగా ర్యాలీ నిర్వహించేందుకు విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వచ్చిన విద్యార్థులను వచ్చినట్టే నిర్భందిస్తూ అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును..పోలీసుల చర్యలను నిరసిస్తూ సీఎం కేసీఆర్ ఫొటోను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అరెస్టుకు యత్నం..

హైదరాబాద్ : ఎస్వీకే వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్కడకు వచ్చిన రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్..ఇతరులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై చంద్రకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని పేర్కొంటున్నా పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.

‘ప్రత్యేక ప్యాకేజీ'కి చట్టబద్ధత కల్పించాలి - టిడిపి ఎంపీలు..

ఢిల్లీ : ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని టిడిపి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాసేపటి క్రితం ప్రధాని కార్యాలయంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఏజెండాలో మాత్రం లేదని, టేబుల్ అజెండాగా తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

టీమిండియా ప్రాక్టీస్..

మహారాష్ట్ర : టీమిండియా పూణెలో ప్రాక్టిస్ మొదలు పెట్టింది. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ 23న ఆరంభమవుతుంది.

ఎస్వీకే వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఎస్వీకే వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీకి యత్నించిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విమలక్కతో పాటు పలువురు జేఏసీ నేతలను అరెస్టు చేశారు. పోలీసులతో ఆందోళనకారుల వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది.

కేసీఆర్ చిత్రపటం దగ్ధం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని విద్యార్థులు దగ్ధం చేశారు. ఓయూ ఎన్ సీసీ గేట్ వద్ద విద్యార్థులు ర్యాలీ నిర్వహించి చిత్రపటాన్ని తగులబెట్టారు.

నగదు కొరత లేదు - శక్తికాంత్ దాస్..

ఢిల్లీ : రూ. 1000 నోట్లు ప్రవేశ పెట్టే ఆలోచన లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ వెల్లడించారు. చిన్న నోట్ల ముద్రణపైనే దృష్టి సారించడం జరిగిందని, ప్రస్తుతం ఎక్కడా నగదు కొరత లేదని వెల్లడించారు.

డీఎంకే పిటిషన్..విచారణ వాయిదా..

చెన్నై : మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈనెల 18వ తేదీన అసెంబ్లీలో జరిగిన ఘటనపై డీఎంకే పిటిషన్ దాఖలు చేసింది. వీడియో ఆధారాలు సమర్పించాలని డీఎంకేకు హైకోర్టు సూచించింది.

11:30 - February 22, 2017

హైదరాబాద్ : ఓయూ పాత రోజులను మరిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై విద్యార్థులు పోరాడిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రం ఆవిర్భవించి సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాల నియామకాలు చేపట్టకపోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీకి వారు మద్దతినిచ్చారు. అందులో భాగంగా బుధవారం ఉదయం ర్యాలీగా తరలివచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఎన్ సీసీ గేటు వద్ద వారిని అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. తాము శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నా పోలీసులు వినిపించుకోలేదు. అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడం..విద్యార్థులు ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వ, పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్థులపై దాడులు చేస్తున్నారని, అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలుపాలని ప్రశ్నించారు. వెంటనే లక్ష ఉద్యోగాలు ప్రకటించాలని, 15 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద ఉన్నారని వారి మొక్కు ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. కోదండరాంను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, వెంటనే చర్చలకు పిలవాలని సూచించారు. అనంతరం సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. హాస్టల్స్ లో కి చొరబడి అరెస్టులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలా చేయడం సిగ్గు చేటన్నారు.

11:25 - February 22, 2017

హైదరాబాద్ : ప్రొ.కోదండరాం ను అరెస్టు చేయడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాశవికంగా అరెస్టు చేశారని ప్రభుత్వం..పోలీసుల చర్యలను తప్పుబడుతున్నారు. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేసిన కోదండరాంను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆయన నివాసం ఉంటున్న తార్నాక ప్రాంతానికి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున ఇంటి తలుపులు పగులగొట్టి కోదండరాంను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. అరెస్టు చేస్తున్న దృశ్యాలను కోదండరాం తన ఫేస్ బుక్ ద్వారా లైవ్ లో చూపెట్టారు. అనంతరం కామాటీపురా పీఎస్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఇతరులు కామాటీపురా పీఎస్ కు తరలివస్తున్నారు. ఇక్కడకు ఎవరూ రావద్దని, సాయంత్రం కోదండరాంను విడుదల చేస్తామని పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్, ఆప్ నేతలు పీఎస్ కు వచ్చారు. లోనికి వెళ్లకుండానే వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నట్టు వెల్లడిస్తూ ఇతర పీఎస్ కు తీసుకెళ్లారు. కోదండరాం ను అరెస్టు చేయడం పట్ల న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీగా తరలివచ్చి కోదండరాంను పరామర్శిస్తామని, తలుపులు బద్దలుగొట్టి చేయడం కరెక్టు కాదని న్యాయవాదులు పేర్కొంటున్నారు. దీనిపై కేసులు పెడుతామని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అరెస్టు చేసినప్పటి నుండి కోదండరాం ఏమీ తీసుకోవడం లేదని తెలుస్తోంది. టిఫిన్..భోజనం చేయాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నా కోదండరాం సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు సమాచారం.

11:16 - February 22, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తన తాజా చిత్ర ప్రమోషన్స్ వెరైటీగా నిర్వహిస్తున్నాడు. ఇందుకు సోషల్ మాధ్యమాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ లో 'దిల్' రాజు ప్రొడక్షన్ లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'డీజే'..'దువ్వాడ జగన్నాథమ్' ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘అల్లు అర్జున్' సరసన 'పూజా హెగ్డే' నటిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమాలను అలరించింది. గత చిత్రాలకంటే భిన్నంగా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు టాక్. బ్రాహ్మణ వేషధారణలో స్కూటర్ పై కూరగాయాలు తీసుకెళ్తూ ఉన్న ఫొటో అలరించింది. తాజాగా 'డీజే' చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈనెల 24వ తేదీన ఉదయం 9గంటలకు చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మరి ఈ టీజర్ ద్వారా 'బన్నీ' ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

11:10 - February 22, 2017

హైదరాబాద్ : సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీకి ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ మద్దతు తెలుపడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్వీకే వద్ద బారికేడ్లు..కంచెలు ఏర్పాటు చేశారు. వస్తున్న వారిని ఎక్కడికక్కడనే అరెస్టులు చేస్తూ పీఎస్ కు తరలిస్తున్నారు. తాజాగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ విద్యార్థులు ఒక్కసారిగా దూసుకొచ్చి ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులను లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. తోపులాటలో పలువురు విద్యార్థి సంఘ నాయకులకు గాయాలయ్యాయి. ఎస్వీకే నలువైపులా పోలీసులు మోహరించారు. శాంతియుతంగా నిరుద్యోగ ర్యాలీ జరుపుతామంటే అడ్డుకోవడం సరికాదని విద్యార్థులు పేర్కొంటున్నారు.

ఎస్వీకే వద్ద విద్యార్థుల అరెస్టు..

హైదరాబాద్ : టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఎస్వీకే వద్దకు వచ్చిన విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.

మంత్రి పోచారంకు అస్వస్థత..

చిత్తూరు : తిరుమలలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది ఆయన్ను చికిత్స నిమిత్తం అశ్విని ఆసుపత్రికి తరలించారు.

10:33 - February 22, 2017

హైదరాబాద్ : అత్తాపూర్ లో ఆరుగురు సజీవదహనం కావడం కలకలం రేగింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో ఏ 1 కూలర్ల కంపెనీ ఉంది. కూలర్ల తయారు చేయడానికి భారీగా ఫైబర్..గడ్డి నిల్వలు ఉంచారు. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పలువురు కార్మికులు నిద్రిస్తున్నారు. గాఢ నిద్రలో ఉండడం..షట్టర్ కు తాళాలు వేసేసరికి వారు బయటకు రాలేకపోయారు. దీనితో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. కంపెనీ మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. మూడు..నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మృతి చెందిన వారు బీహార్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు. కంపెనీ యజమాని ప్రమోద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొంటున్నారు.

10:26 - February 22, 2017

హైదరాబాద్ : టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అడుగడుగునా నిర్భందించారు. ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు పెడుతామని పోలీసులు హెచ్చరించారు. ప్రధాన కేంద్రాలైన ఎస్వీకే, ఇందిరాపార్కు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎస్వీకే వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వస్తున్న వారిని అరెస్టులు చేస్తూ పీఎస్ కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్వీకే వద్ద బారికేడ్లు..ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, ఎవరైనా ర్యాలీ నిర్వహించడానికి వస్తే అరెస్టు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఇక ఇందిరాపార్కు వద్ద కూడా ఇదేవిధమైన పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కు సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడ మోహరించి భద్రతను..పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామునే తార్నాకలోని ప్రొ.కోదండరాం నివాసంపై దాడి చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.

ఓయూలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఓయూలో ఉద్రిక్త చోటు చేసుకుంది. విద్యార్థులు నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు..పోలీసుల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది.

10:16 - February 22, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి దర్శనం చక్కగా జరిగిందని, దర్శన ఏర్పాట్లను ఘనంగా చేశారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబసభ్యులకు...మంత్రులకు చక్కని దర్శనం లభించిందని పేర్కొన్నారు. స్వామి వారికి మొక్కులు సమర్పించడం జరిగిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలూ బాగా అభివృద్ధి చెంది, భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలుగా పేరు తెచ్చుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు. అందరినీ చల్లగా చూడాలని, రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని కేసీఆర్ వెల్లడించారు. సీఎం వెంట ఏపీ ప్రతినిధిగా బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఉన్నారు.
గత రాత్రి తిరుమలకు విచ్చేసిన కేసీఆర్ కుటుంబసభ్యులకు..మంత్రులు..అధికారులకు టిటిడి, ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వారు బస..దర్శన ఏర్పాట్లు..ఇతర సౌకర్యాలు కల్పించారు. తొలుత వరహాస్వామి వారిని దర్శించకున్న కేసీఆర్ కుటుంసభ్యులు మహాద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించిన అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందచేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుమల జేఈఏ వెంట ఉన్నారు.

పాదయాత్రకు పొంగులేటి, పొన్నాల సంఘీభావం..

సూర్యాపేట : నాయకన్ గూడెంలో సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి, పొన్నాల లక్ష్మయ్యలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. తమ్మినేని చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమని, పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు.

మహాజన పాదయాత్ర 129వ రోజు..

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర 129వ రోజుకు చేరుకుంది. నాయన్ గూడెం, మామిళ్ల గూడెం, హుస్సేనాబాద్, మోతె, నర్సింహుల గూడెం, రేపాల, జగన్నాథపురం, తలకోవలో లో పాదయాత్ర బృందం పర్యటించనుంది.

స్టేషన్ దాటి వెళ్లిపోయిన రైలు..

జనగామ : దట్టమైన పొగమంచు అలుముకోవడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా సిగ్నల్ కనిపించకపోవడంతో జనగామ రైల్వే స్టేషన్ దాటి రైలు వెళ్లిపోయింది.

శ్రీవారి సేవలో కేసీఆర్..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని కేసీఆర్ దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు సమర్పించడం జరిగిందని, తమ కుటుంబసభ్యులు..మంత్రులకు చక్కని దర్శనం లభించిందని కేసీఆర్ పేర్కొన్నారు. చక్కని దర్శనం లభించిందని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని వెల్లడించారు.

09:59 - February 22, 2017
09:58 - February 22, 2017

హైదరాబాద్ : ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని, ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సెంట్రల్ జోన్ డీసీపీ టెన్ టివికి తెలిపారు. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా పోలీసులు నగరంలో భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేపడుతున్నారు. ప్రొ.కోదండరాం అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ప్రధాన రహదారులైన ఎస్వీకే, ఇందిరాపార్కు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ టెన్ టివితో మాట్లాడారు. ఎవరైనా వస్తే అరెస్టు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ర్యాలీకి వచ్చే వారిపై క్రిమినల్ కేసులు పెడుతామని, ర్యాలీతో పాటు సభకు అనుమతి లేదన్నారు. మధ్యాహ్నం 1గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

09:56 - February 22, 2017

హైదరాబాద్ : టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అడుగడుగునా నిర్భందాలు ప్రయోగిస్తూ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. నిరుద్యోగ ర్యాలీ నిర్వహిస్తామని జేఏసీ తేల్చిచెప్పడంతో నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాన రహదారులైన ఎస్వీకే, ఇందిరాపార్కు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రొ.కోదండరాం ను తెల్లవారుజామున అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. దీనితో ప్రభుత్వం..పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు భారీగా మోహరించడంతో తార్నాకలోని కోదండరాం నివాసం వద్ద నివాసం ఉండే స్థానికులు కొంత భయాందోళనలకు గురయ్యారు. కోదండరాం అరెస్టు అనంతరం ఆ ప్రాంతంలో ప్రశాంత వాతవరణం నెలకొంది.

1500 మంది అరెస్టు..!

హైదరాబాద్ : నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1500 మంది నిరుద్యోగులను..నేతలను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

09:26 - February 22, 2017
09:17 - February 22, 2017

చిత్తూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీవారిని దర్శించుకున్నారు. కుటంబసమేతంగా ఆయన తిరుమలకు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు మంత్రులు..ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. రాత్రి బసచేసిన గెస్ట్‌హౌజ్ నుంచి సీఎం, ఆయన కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు టీటీడీ ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాల్లో ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, టిటిడి ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమలేశుని దర్శనానికి ముందుగా సీఎం కేసీఆర్ వరహస్వామి ఆలయానికి చేరుకుని దర్శించుకున్నారు. వీరి వెంట ఏపీ ప్రభుత్వ రాష్ట్ర ప్రతినిధిగా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఉన్నారు. వరహాస్వామి దర్శించుకున్న అనంతరం మహాద్వారం గుండా కేసీఆర్ కుటుంసభ్యులు శ్రీవారిని దర్శించుకోగా సీఎం వెంట వచ్చిన వారందరూ వైంకుఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి రూ. 3 కోట్ల విలువైన 14.2 కిలోల సాలగ్రామహారం, రూ. కోటీ 21 లక్షల విలువైన 4.65 కిలోల మకరకంఠిలను ఆలయ ప్రధాన అర్చకులు, నిర్వాహాకులకు సీఎం అందజేశారు.
తరువాత టీఆర్ఎస్ నేత సుదర్శన్ రెడ్డి పెళ్లికి సీఎం హాజరు కానున్నారు.  ఉదయం 11.30గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ముక్కుపుడకను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు.

09:15 - February 22, 2017

మహిళలు..నిత్యం ఏదో ఒక పనిచేస్తూ బిజీ బిజీగా గడుపుతుంటుంటారు. ఒక్కోసారి వత్తిడికి కూడా గురవుతుంటారు. ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఏదో ఒకటి తినేస్తుంటారు. శరీరానికి అవసరమయ్యే పోషకాల గురించి అస్సలు ఆలోచించరు. దీనితో భవిష్యత్ లో వారు అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఏదో ట్యాబెట్స్ వేసుకుని అందులో నుండి బయటపడే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా రక్తహీనత..తొందరగా అలసిపోవడం..కండ్లు తిరగడం..ఏకగ్రత కోల్పోవడం ఎదుర్కొంటుంటారు. ట్యాబ్ లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కాల్షియం ఎక్కువగా లభించే పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది.

  • చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనేది తెలిసిందే. వారంలో ఒకసారైనా చేపలు తింటే సమృద్ధిగా కాలుష్యం లభిస్తుంది.
  • ప్రతి రోజు ఒక గ్లాసు పాలు తీసుకోవాలి. పాలల్లో చక్కెర వేయకుండా తీసుకుంటే బాగుంటుంది.
  • రొయ్యల్లో అధిక శాతంలో కాల్షియం లభిస్తుంది. రొయ్యలను తక్కువగా ఉండిచుకుని తీసుకుంటే కాల్షియం శరీరానికి అందుతుందంట.
  • ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. పాలకూర, గోంగూర, బ్రొకోలీ లాంటి ఆకుకూరలు తీసుకోవాలి.
  • అంజీర పండ్లను మహిళలు తినడం వల్ల కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది.
  • నారింజ పండ్లలో అత్యధికంగా విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది.
  • ఒక చెంచా నువ్వులు తినడం వల్ల ఒక గ్లాసు తాగితే లభించే కాల్షియం ఇందులో లభిస్తుందని వైద్యులు పేర్కొంటుంటారు.

శ్రీవారి మహద్వారం వద్ద కేసీఆర్..

చిత్తూరు : శ్రీవారి మహద్వారం వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట రాష్ట్ర ప్రతినిధిగా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు.

ట్రావెల్స్ బస్సు బోల్తా..

వికారాబాద్ : పూడూరు (మం) మన్నెగూడలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. 20 మందికి గాయాలయ్యాయి. వీరిని వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి గుల్బర్గా వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

09:13 - February 22, 2017
09:12 - February 22, 2017

హైదరాబాద్ : ఇందిరాపార్కు...తెల్లవారుజామున వాకర్స్..చిరు వ్యాపారులతో రద్దీగా ఉంటుంది. కానీ బుధవారం ఉదయం మాత్రం నిశబ్ద వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతం వద్ద ఎక్కడ చూసినా పోలీసులు..పోలీసు వాహనాలే కనిపిస్తున్నాయి. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతను మోహరించడం గమనార్హం. ఇందిరాపార్కులోనికి వాకర్స్..ఇతరులను కూడా అనుమతించకపోవడం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై జేఏసీ పోరాటబాట పట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 22వ తేదీన ర్యాలీ నిర్వహించతలపెట్టింది. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో ప్రొ.కోదండరాం హైకోర్టును ఆశ్రయించారు. ర్యాలీ..సభ నేపథ్యంలో కోర్టు పలు సూచనలు చేసింది. కానీ జేఏసీ దీనికి అంగీకరించలేదు. ర్యాలీ నిర్వహించి తీరుతామని జేఏసీ స్పష్టం చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రొ.కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇతర జేఏసీ నేతలను అదుపులోకి తీసుకుని వివిధ పీఎస్ లకు తరలించారు.

09:09 - February 22, 2017

హైదరాబాద్ : అత్తాపూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో ఏ 1 కూలర్ల కంపెనీ ఉంది. ఎండాకాలం వస్తుండడంతో కూలర్ల తయారు చేయడానికి భారీగా ఫైబర్..గడ్డి నిల్వలు ఉంచారు. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పలువురు కార్మికులు నిద్రిస్తున్నారు. గాఢ నిద్రలో ఉండడం..తలుపులు మూసివేసి ఉండడంతో కార్మికులు సజీవదహనమయ్యారు. ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. నలుమూలల మంటలు చెలరేగడంతో కంపెనీ మొత్తం అగ్నికి ఆహుతైంది. కంపెనీ యజమాని ప్రమోద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంపెనీలో ఎలాంటి జాగ్రత్త చర్యలు లేదని తెలుస్తోంది.

09:04 - February 22, 2017

నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రొ.కోదండరాంను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంపై పలు విమర్శలు ఎదురవుతున్నాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెబుతున్నారు. కానీ ర్యాలీ నిర్వహించి తీరుతామని జేఏసీ, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), రాకేష్ (టీఆర్ఎస్), ప్రతాప్ రెడ్డి (టి.టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో క్లిక్ చేయండి.

08:46 - February 22, 2017

హైదరాబాద్ : ఎస్వీకే..సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రం..నిత్యం రద్దీతో సందడిగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఖాకీ బూట్ల చప్పుడు వినిపిస్తోంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగ ర్యాలీ..సభను నాగోల్ మెట్రో గ్రౌండ్ లో నిర్వహించుకోవాలని హైకోర్టు సూచనలు చేయడం..ర్యాలీ నిర్వహించి తీరుతామని జేఏసీ పేర్కొనడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్వీకే నుండి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొనడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరూ రానీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా టియర్ గ్యాస్ వాహనాలు మోహరించడం గమనార్హం. తాము శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పినా, 21 రోజుల్లో తమ అనుమతిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రొ.కోదండరాం ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను ఇప్పుడు సాకుగా చూపడం దారుణమని అంటున్నారు. తీవ్ర నిర్భందాల నడుమ ఎస్వీకే వద్ద నిరుద్యోగులు ర్యాలీ నిర్వహిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు..

హైదరాబాద్ : నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఓయూలో విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇందిరాపార్కు, ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఇందిరాపార్కు వద్ద సభ జరగకుండా గట్టి భధ్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాల నుండి పోలీసులు నగరానికి తరలిస్తున్నారు.

భారీ చెక్ పోస్టులు - సీపీ..

హైదరాబాద్ : నగరానికి వచ్చే రహదారులపై భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిసనర్ శివకుమార్ వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా పరిధిలో 11 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, ర్యాలీకి అనుమతి లేదని ఎవరూ వెళ్లవద్దని సీపీ సూచించారు. నిరుద్యోగులను తరలించే వాహనాలను సీజ్ చేస్తామని, మెదక్ జిల్లాలో 3 చెక్ పోస్టులు..సంగారెడ్డి జిల్లా పరిధిలో 3 చెక్ పోస్టులు.. ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

06:58 - February 22, 2017

తెలంగాణ జెఏసి తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి వివిధ విద్యార్థి యువజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. నిధులు, నీళ్లు, నియామకాల చుట్టూనే తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లయినా నిరుద్యోగుల ఆశలు ఫలించలేదు. తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా పోస్టులు ఖాళీగా వుండగా, ఇప్పటికి భర్తీ చేసినవి నిండా పన్నెండు వేలు కూడా లేవు. సుమారు 35 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. అయితే ఈ రెండున్నరేళ్ల కాలంలో 30 వేల మందికి పైగా రిటైరయ్యారు. దీంతో తెలంగాణ నిరుద్యోగ యువత తీవ్ర నిరాశతో వుంది. ఇంతకాలమూ ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగులు పోరుబాట పడుతున్నారు. తెలంగాణ జెఏసి తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ కి మద్దతు ప్రకటించిన పివైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లయ్య టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. ఈ సందర్భంగా కాలర్స్ విశేషంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

06:57 - February 22, 2017
06:54 - February 22, 2017

హైదరాబాద్ : జీవో 123 పై స్టే ఎత్తివేయాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి హైకోర్టు నిరాకరించింది. జీవో 123కు బదులుగా.. జీవో 38 విడుదల చేశామని ప్రభుత్వం తెలిపింది. 123జీవోపై స్టే విధించడం వల్ల వేలకోట్ల రూపాయల పనులు నిలిచిపోయాయని వివరించింది. అయితే జీవోపై కూడా 38పై అనుమానాలు ఉన్నాయని దానిపై కౌంటర్‌ దాఖలు చేస్తామన్న పిటిషనర్ల విన్నపాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఇప్పటికే మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చామని.. కొత్తగా వాదనలు వద్దని సూచించింది. ఈ అంశంలో పూర్తి స్థాయి విచారణ ఈ నెల 27 నుంచి జరుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

06:51 - February 22, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 6 నుంచి 29 వరకు వెలగపూడిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 13న బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దీని కోసం అసెంబ్లీ భవనంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం సిద్ధమవడంతో... బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 6 నుంచి సభా పర్వం మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2014 ఆగస్టులో ఏపీ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2015, 2016లలో కూడా హైదరాబాద్ లోనే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. రాష్ట్ర విభజన జరిగిన మూడు సంవత్సరాల తర్వాత సొంత రాజధానిలో ఏపీ ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.

మార్చి 13 బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి..
సమయం లేకపోవడంతో బడ్జెట్ సమావేశాలతోనే అసెంబ్లీని ప్రారంభించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్‌కు సంబంధించిన తేదీలను సీఎం అధికారుల సమావేశంలో ప్రకటించారు. మార్చి 6 నుంచి 29 వరకు సమావేశాలు జరపనున్నారు. మార్చి 13న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు.

శాఖల వారీ ఖర్చులపై ప్రత్యేక శ్రద్ధ..
నవ్యాంధ్ర రాజధానిలో మొదటిసారిగా ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌ జనరంజకంగా ఉండేలా రూపొందిస్తున్నారు. నిధులు వినియోగ ఆధారిత బడ్జెట్‌ను రూపొందించాలని స్వయంగా ముఖ్యమంత్రే ఆర్థిక మంత్రికి సూచించారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రే స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ల నుంచి బడ్జెట్‌కు సంబంధించిన ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. శాఖల వారీ ఖర్చులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. బడ్జెట్‌కు రూపకల్పనకు అనేక రంగాల ప్రముఖులు, నిపుణులు అభిప్రాయాలను కూడా తీసుకున్నారు.

06:48 - February 22, 2017

చిత్తూరు : తెలంగాణ రాష్ట్రం వస్తే, శ్రీవారికి చెల్లిస్తానన్న మొక్కులు తీర్చుకునేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అనంతరం తిరుమలకు బయలుదేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కుటుంబ సమేతంగా, ఈ సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఉద్యమ సమయంలో.. రాష్ట్రం సిద్ధిస్తే.. శ్రీ వేంకటేశునికి ఆభరణాలు చేయిస్తానని ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కులు చెల్లించేందుకు, కేసీఆర్‌ తిరుమల వచ్చారు. ఐదున్నర కోట్లతో రూపొందించిన స్వర్ణాభరణాలను శ్రీవారికి సమర్పించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా, తిరుమలకు వచ్చిన కేసీఆర్‌కి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు.

కేసీఆర్ కుటుంబసభ్యులు..మంత్రులు..
మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి బయలుదేరిన కేసీఆర్ ఐదు గంటల సమయంలో రేణుగుంట విమానశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో కేసీఆర్‌కు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి బొజ్జల గోపాలకృష్టారెడ్డి ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన కారులో తిరుమల బయలుదేరారు. రాత్రికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కేసీఆర్ కుటుంబసభ్యులు బస చేస్తారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్‌, హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, మధ్యాహ్నమే ప్రత్యేక విమానం ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారంతా రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు.

గట్టి బందోబస్తు..
బుధవారం ఉదయం శ్రీవారికి మొక్కులు చెల్లించిన తర్వాత తిరుమలలోనే, తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి వివాహానికి కేసీఆర్‌ హాజరవుతారు. అనంతరం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని హైదరాబాద్ తిరుగుప్రయాణం అవుతారు. కేసీఆర్ పర్యటన నిమిత్తం తిరుపతి, తిరుమలలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

06:46 - February 22, 2017

హైదరాబాద్ : టీ-జాక్ చేపడుతున్న నిరుద్యోగుల నిరసన ర్యాలీ పట్టింపులకు వేదికగా మారింది. అధికార పార్టీ నేతలు టీ-జాక్ నిర్ణయంతో తమ పట్టు సాధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీ-జాక్ కూడా తమ నిర్ణయాన్ని మార్చుకునేది లేదంటూ ర్యాలీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. కోర్టు సూచనలు, పోలీసుల ఆంక్షల మధ్య టీ-జాక్ ర్యాలీకి సిద్ధం అవుతుండటం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో టీ-జాక్ తలపెట్టిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ ఉత్కంఠ రేపుతోంది. ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణతో కోర్టు తలుపు తట్టినా టీ-జాక్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. హైదరాబాద్‌లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కోర్టు సూచించినా....టీ-జాక్ ససేమిరా అంది. ర్యాలీ నిర్వహించి నిరుద్యోగుల గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తామని స్పష్టం చేస్తోంది.

ఉత్కంఠ..
టీ-జాక్ నిర్ణయం అధికార పార్టీ నేతల్లో కొంత అయోమయాన్ని రేపుతున్నా అధికార పార్టీగా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యతలను గులాబీ నేతలు భుజానికేసుకున్నారు. దాదాపు 15 రోజులుగా టీ-జాక్ ఛైర్మన్ కోదండరామ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కచ్చితంగా నిలబెట్టుకుంటుందన్న దీమా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కోర్టులను భయపెట్టే విధంగా టీ-జాక్ వ్యవహరిస్తోందన్న విమర్శలను టీఆర్‌ఎస్‌ తెరపైకి తెస్తోంది. టీ-జాక్‌ అనుకున్నట్లుగా నిరుద్యోగుల నిరసన ర్యాలీ చేపడుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది.

06:42 - February 22, 2017

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై బుధవారం నిర్వహించనున్న ర్యాలీకి అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ఐకాస హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాగోలులో నిర్వహించేందుకు కోర్డు అనుమతివ్వబోగా ఐకాస పిటిషన్‌ను ఉపసంహరించుకొంది. సాయంత్రం కోదండరాం నివాసంలో చర్చించిన ఐకాస ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలను య‌థాత‌థంగా శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పింది. పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్‌ నగరంలో భారీగా మోహరించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏది ఏమైనా నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడం తథ్యమని టీ-జేఏసీ ప్రకటించింది. ముందుగా అనుకున్న ప్రకారమే తమ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది. నిరుద్యోగులను ర్యాలీకి రానీయకుండా పోలీసులు.. ఎక్కడికక్కడ నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్ అరోపించారు. స్వరాష్ట్రంలో.. స్వపరిపాలనలో.. ఈ నిర్బంధమేంటని ఆయన సర్కారును నిలదీశారు. మరోవైపు.. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో, పోలీసులు రాజధానిలో భద్రతావలయాన్ని ఏర్పాటు చేశారు.

పిటిషన్ ఉపసంహరణ..
నిరుద్యోగుల ర్యాలీపై.. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెగని ఉత్కంఠ కొనసాగింది. ఓవైపు పోలీసులు.. మరోవైపు టీజేఏసీ నేతలు.. నడుమ న్యాయస్థానం..! ర్యాలీ, బహిరంగ సభావేదికల గురించి ఈ మూడు వర్గాల మధ్యా దఫదఫాలుగా చర్చలు సాగాయి. చివరికి, న్యాయస్థానం, నాగోల్‌ మెట్రో గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని జేఏసీ నేతలకు సూచించింది. అయితే, దీనికి అంగీకరించని జాక్‌ నేతలు, ర్యాలీకి అనుమతి కోరుతూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

టీజేఏసీ న్యాయవాది అభ్యంతరం..
నిరుద్యోగుల నిరసన ర్యాలీ కోసం ఈనెల ఒకటో తేదీనుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. టీ-జేఏసీ నేతల విజ్ఞప్తిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించక పోవడంతో, వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం ఉదయం నుంచి కోర్టులో వాద-ప్రతివాదనలు జరిగాయి. ర్యాలీ నేపథ్యంలో విధ్వంసం జరిగే అవకాశముందని.. పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే.. ర్యాలీ నిర్వహించేవారిలో చాలామందిపై అనేక కేసులు ఉన్నాయని.. నగరంలో ర్యాలీ నిర్వహిస్తే ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతాయని నివేదించారు. నగర శివారులో ఎక్కడైన సభ నిర్వహించుకుంటే తమకు అభ్యంతరం లేదని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై టీ-జేఏసీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడైనా అనుమతి ఇవ్వాలని కోరారు.. ఉదయం నుంచి మూడు సార్లు విచారణను వాయిదా వేసి, పోలీసులు, జాక్‌ నేతల అభిప్రాయాలను తీసుకున్న న్యాయస్థానం.. నాగోల్‌ మెట్రో గ్రౌండ్‌లో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తామంది. దీనిపై అసంతృప్తి చెందిన టీ-జేఏసీ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

ర్యాలీ నిర్వహిస్తామన్న కోదండరాం..
కోర్టు తీర్పుపై టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పందించారు. తమ కార్యాచరణలో ఎలాంటి మార్పులేదని.. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే చాలాప్రాంతాల్లో అరెస్టులు జరుగుతున్నాయని అయినా భయపడేది లేదన్నారు. అరెస్టులకు భయపడితే.. తెలంగాణే వచ్చేది కాదన్నారు కోదండరాం. బుధవారం ఎట్టి పరిస్థితిల్లోనూ ర్యాలీ నిర్వహిస్తామని విద్యార్థి సంఘాల నేతలూ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే.. మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అటు, విపక్షాలు, ప్రజాసంఘాలు కూడా టీ-జేఏసీకి సంఘీభావం ప్రకటించాయి.

పోలీసుల హెచ్చరికలు..
మరోవైపు, టీ-జేఏసీ ర్యాలీకి అనుమతి లేదని.. ఎవరూ నగరానికి తరలిరావద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ర్యాలీలో పాల్గొనేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. నిరుద్యోగుల నిరసన ర్యాలీకి అనుమతి లేకపోవడంతో.. ఇందిరాపార్క్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరుద్యోగ ర్యాలీ జరిపితీరాలని జేఏసీ, అడ్డుకుని తీరాలని ప్రభుత్వం పట్టుదలతో ఉండడంతో.. బుధవారం ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ సర్వత్రా నెలకొంది.

06:37 - February 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాంను తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ నిరుద్యోగ ర్యాలీకి పిలుపునివ్వడంతో కోదండరామ్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో ముందస్తుగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పోలీసులు తరలించారు. పలువురు ఐకాస కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియాను కోదండరాం ఇంటి పరిసరాల్లోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం కోదండరాం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోదండరాంను కంచన్‌బాగ్‌ పీఎస్‌కు తరలించారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ రవీందర్‌ ఆధ్వర్యంలో కోదండరాం ఇంటిని 300 మంది పోలీసులు చుట్టుముట్టారు. అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహిస్తామనడంతో అరెస్టు చేశామని డీసీపీ రవీందర్‌ వెల్లడించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం సరికాదని పేర్కొన్నారు. ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు పేర్కొంటుంటే ర్యాలీ నిర్వహిస్తామంటున్న తెలంగాణ జేఏసీ వెల్లడిస్తోంది. దీనితో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అత్తాపూర్ లో భారీ అగ్నిప్రమాదం..పలువురు కార్మికుల మృతి..

రాజేంద్రనగర్ : అత్తాపూర్ లో ఏ 1 కూల్ కూలర్ల సెంటర్లలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

అమరావతి డిజైన్లపై సీఆర్డీఏ సమావేశం..

విజయవాడ : అమరావతి డిజైన్లపై నేడు నిపుణులతో సీఆర్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు..అధికారులు పాల్గొననున్నారు.

భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థల వాటాల విక్రయం..

ఢిల్లీ : నేటి నుండి రక్షణా రంగానికి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థల వాటాల విక్రయం జరగనుంది.

కోదండరాం ఇంటి వద్ద భారీ బందోబస్తు..

హైదరాబాద్ : ప్రొ.కోదండరాంను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మీడియాను కోదండరాం ఇంటి పరిసరాల్లోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

నల్గొండ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర..

నల్గొండ : సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో ముగించుకున్న పాదయాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశించనుంది.

 

శ్రీవారికి కానుకలను సమర్పించనున్న సీఎం కేసీఆర్..

చిత్తూరు : నేడు శ్రీవారికి సీఎం కేసీఆర్ కానుకలను సమర్పించనున్నారు. ఉదయం 7.15గంటలకు వైకుంఠం కాంప్లెక్స్ వద్దకు కేసీఆర్ చేరుకోనున్నారు. 8గంటలకు స్వామి వారిని దర్శించుకుని సాలిగ్రామ హారం, కంఠాభరణాలను సమర్పించనున్నారు. తరువాత టీఆర్ఎస్ నేత సుదర్శన్ రెడ్డి పెళ్లికి సీఎం హాజరు కానున్నారు. ఉదయం 11.30గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ముక్కుపుడకను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు.

ప్రొ.కోదండరాం అరెస్టు..

హైదరాబాద్ : ప్రొ.కోదండరాంను పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేశారు. అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహిస్తామనడంతో అరెస్టు చేయడం జరిగిందని డీసీపీ రవీందర్ పేర్కొన్నారు.

Don't Miss