Activities calendar

23 February 2017

చంద్రబాబుకు మధు లేఖ

విజయవాడ : చంద్రబాబుకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులకు న్యాయం చేయాలని మధు అన్నారు.

22:15 - February 23, 2017
22:14 - February 23, 2017

పూణె : ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని ఆరంభ టెస్ట్‌ మొదటి రోజు ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. పూణే టెస్ట్‌ తొలి రోజు భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో  కంగారూ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. 205 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన ఆస్ట్రేలియా జట్టును మిషెల్‌ స్టార్క్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు.

పూణే టెస్ట్  తొలి రోజు టీమిండియా డామినేట్‌ చేసింది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో ఆతిధ్య భారత జట్టు శుభారంభం చేసింది.

ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, షాన్‌ మార్ష్‌ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు.భారత స్పిన్నర్లు, పేసర్లు సమిష్టిగా రాణించడంతో  కంగారూ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు.

స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా ఓపెనర్‌ రెన్‌షా టెస్టుల్లో 2వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి... ఆస్ట్రేలియాకు శుభారంభాన్నిచ్చాడు. 

ఉమేష్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు పోటీలు పడి మరీ వికెట్లు తీయడంతో....ఆస్ట్రేలియా జట్టు తేలిపోయింది. స్టీవ్‌స్మిత్‌,షాన్‌ మార్ష్‌,హ్యాండ్స్‌ కూంబ్‌ కొద్దిసేపు పోరాడినా భారీ స్కోర్లుగా మలచడంలో మాత్రం విఫలమయ్యారు.

205 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన జట్టును మిషెల్‌ స్టార్క్‌ ఆదుకున్నాడు. ఆఖరి వికెట్‌కు హేజిల్‌వుడ్‌తో కలిసి పోరాడిన మిషెల్‌ స్టార్క్‌  టెస్టుల్లో 9వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసి...ఆస్ట్రేలియా జట్టు పరువు కాపాడాడు.
 
తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 256 పరుగులు చేసింది.భారత బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.... రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.

రెండో రోజు ఆరంభ ఓవర్లలోనే ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేసి....తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించి ప్రత్యర్ధికి సవాల్‌ విసరాలని భారత్‌ పట్టుదలతో ఉంది. టెస్టుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా....పూణే టెస్ట్‌లో నెగ్గి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని తహతహలాడుతోంది.

22:11 - February 23, 2017
22:08 - February 23, 2017

న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్‌జస్‌ కళాశాలలో నిన్న జరిగిన హింసాత్మక ఘటనలకు నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులు ఢిల్లీ యూనివర్సీటీ నుంచి  పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వరకు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. ఏబివిపి విద్యార్థులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ప్రయివేట్‌ సైన్యంలా ఎబివిపికి కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఏబివిపి హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తున్న పోలీసులను సస్పెండ్‌ చేయాలని లెఫ్ట్‌ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాల్లో దళిత, మైనారిటీ విద్యార్థులపై దాడులు పెరిగాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం డీయూలోని రామ్‌జాస్‌ కళాశాలలో 'కల్చర్‌ ఆఫ్‌ ప్రొటెక్ట్‌' సెమినార్‌లో ప్రసంగించడానికి వచ్చిన జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ను ఏబివిపి విద్యార్థులు అడ్డుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌, బస్తర్‌ ప్రాంతాలకు స్వాతంత్రం కోరుతూ కొందరు విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న  ఓ వీడియోను ఏబివిపి విడుదల చేసింది.

22:06 - February 23, 2017

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటలవరకు 61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని 12 జిల్లాల్లో 53  స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 680 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 61 మంది మహిళలు. మొత్తం కోటి 69 లక్షల మంది ఓటర్లుండగా  19,487 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  2012 అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో అధికార సమాజ్‌వాదీ పార్టీ 25 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష బీఎస్ పీ 15, కాంగ్రెస్‌ ఆరు, బీజేపీ ఐదు సీట్లు గెలుచుకున్నాయి. నాల్గవ దశ పోలింగ్‌ జరుగుతున్న నియోజకవర్గాల్లో అలహాబాద్‌, లలిత్‌పూర్‌, రాయ్‌బరేలి  వంటి కీలక స్థానాలు ఉన్నాయి. 

22:04 - February 23, 2017

హైదరాబాద్ : సికింద్రబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని కేంద్ర వైద్యబృదం సంర్శించింది. ఆస్పత్రిలో జరుగుతున్న స్వైన్‌ఫ్లూ ట్రీట్‌మెంట్‌ తీరును పరిశీలించింది. వార్డుల్లో పేషెంట్ల పరిస్థితిని పరిశీలించారు. స్వైన్‌ఫ్లూ రోగులకు అందిస్తున్న చికిత్సలో  ఉన్న లోపాలపై ఆస్పత్రి వైద్యులకు సూచలను చేసింది సెంట్రల్‌టీం.  ఆస్పత్రిలో రోగులకు అన్ని రకాలుగా వైద్యసౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌  వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 

 

22:02 - February 23, 2017

విశాఖ : చెన్నైలో ఉన్న తన ఆస్తుల జప్తుకు ఇండియన్‌ బ్యాంక్‌ నోటీసు ఇవ్వడంపై మంత్రి గంటా స్పందించారు. ఇదంతా వ్యాపారంలో ఒక భాగమని స్పష్టం చేశారు.. ప్రత్యూష సంస్థ తీసుకున్న అప్పుకు గాను గ్యారంటీగా మాత్రమే ఉన్నానని చెప్పారు.. అప్పు విషయం ప్రత్యూష సంస్థ, బ్యాంక్‌ అధికారులు మాట్లాడుకుంటారని చెప్పారు.. 

21:58 - February 23, 2017

విజయవాడ : అమరావతిలో రోడ్లు, భవనాలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తామని... ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తెలిపారు. విజయవాడలోని సీఆర్ డీఏ కార్యాలయంలో పలువురు నిపుణులతో పరకాల సమావేశమయ్యారు. ఈ నిర్మాణాలపై నిపుణులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.. రాజధానిలో 9 నగరాలుంటాయని...ఇందులో 17 టౌన్‌షిప్స్ నిర్మిస్తామని స్పష్టం చేశారు. భవనాల నిర్మాణంలో సంస్కృతిని నిక్షిప్తం చేయడంపై సలహాలు, సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు.

 

21:54 - February 23, 2017

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కాజేయాలని చూస్తున్నారని... ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.. ఏళ్లు గడుస్తున్నా బాధితులకు ఇంకా న్యాయం జరగడంలేదని అన్నారు.. రఘువీరా ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతల బృందం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసింది.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.. 

 

21:51 - February 23, 2017

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడిన తాము ప్రజలకు చెప్పుకోవడలో మాత్రం విఫలమయ్యామని కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి.హన్మంతరావు అన్నారు. సంగారెడ్డిజిల్లా పటాన్‌చెరువులో ఏర్పాటు చేసిన జన ఆవేదన సభలో ఆయన మాట్లాడారు. సొంతరాష్ట్రంలో కూడా తెలంగాణప్రజల జీవితాలు బాగుపడలేదన్న వీహెచ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు . నిరుద్యోగ నిరసన సందర్భంగా కోదండరాం ను  అరెస్ట్‌ను వీహెచ్‌ తప్పుబట్టారు. ఇంటినుంచి ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

21:47 - February 23, 2017

ర్యాలీ గెలుపోటముల మీద పోస్టుమార్టం... ఫ్లాపన్న సర్కార్... సక్సెస్ అన్న జేఏసీ, పోలీసు మంత్రికే దెల్వని అరెస్టులు...నామూషిగ మాట్లాడుతున్న నాయిని, 
ఓట్ల కోసం పైకం పంచుతున్న బీజేపీ.. ఉత్తరప్రదేశ్ ఎన్నికలల కమలం కథ, ఇండియాకు రాను... ఈడనే ఉంటా...మంకుపట్టుపడుతున్న విజయ్ మాల్యా, రెండు వందల కడితే ఎయిడ్స్ రోగం మాయం.. నెల్లూరు జిల్లాల తేలిన కొత్తరకం డాక్టరు, కల్లు తాగితే కాన్సర్ రోగం రానే రాదు... నిజం ఈ ముచ్చట అవద్దం కానే కాదు....ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:39 - February 23, 2017

టీటీడీ నిధులు దారి మళ్లుతున్నాయని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, లక్ష్మీపార్వతి, సీపీఎం నేత మురళి పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:35 - February 23, 2017

చిత్తూరు : టీటీడీ నిధులపై ప్రభుత్వం కన్నుపడింది. హిందూ ధర్మ ప్రచారం పేరిట ఓ ట్రస్ట్‌కు ఏటా అప్పనంగా కోట్ల రూపాయలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం జీవో కూడా జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై టీటీడీ ఉద్యోగులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి నిధులను అక్రమంగా దారి మళ్లిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. 
టీటీడీ నిధులు బొక్కేసేందుకు మరో కుట్ర 
టీటీడీ నిధులు అప్పనంగా బొక్కేసేందుకు మరో కుట్ర జరుగుతోంది. హిందూ ధర్మ ప్రచారం పేరుతో ఓ ప్రైవేట్‌ సంస్థకు ఏటా కోట్లాది నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం  ఈనెల 8న జీవో 65 జారీ చేసింది. 
ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకత
హిందూ ధర్మ ప్రచారం ట్రస్ట్‌కు టీటీడీ నుంచి ప్రతి నెల 50 లక్షలు, దేవాదాయ శాఖ నుంచి మరో 50 లక్షలు చెల్లించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికే టీటీడీ.. దానికి అనుబంధంగా ఉన్న హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కు కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందంటున్నారు. ఇప్పుడు అదికాకుండా.. హిందూ ధర్మ పరిరక్షణ పేరిట ట్రస్ట్‌ ఏర్పాటు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
ప్రభుత్వం ఆఘమేఘాల మీద నిర్ణయం 
టీటీడీ మాజీ ఈవోగా పని చేసిన పీవీ ఆర్కే ప్రసాద్‌.. హిందూ ధర్మ ప్రచారం పేరిట వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు.. ఇందుకు నిధులు మంజూరు చేయాలని గతేడాదిలో ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల దేవాదాయశాఖ 50 లక్షలు,.. టీటీడీ 50 లక్షల రూపాయలు ఇవ్వాలని జీవోలో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నెలా 5వ తేదీలోగా నిధులు విడుదల చేయాలని ప్రత్యేకంగా  పేర్కొనడం గమనార్హం. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీటీడీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కనీస వేతనాలు, ఇతర సదుపాయాల కోసం ఎంతోకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఓ ట్రస్ట్‌కు కోట్ల రూపాయలు అప్పనంగా మంజూరు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 
శ్రీవారి భక్తులు, టీటీడీ ఉద్యోగులు ఆందోళన బాట
ప్రభుత్వ నిర్ణయంపై శ్రీవారి భక్తులు, టీటీడీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ధర్మ ప్రచారం ముసుగులో శ్రీవారి సొమ్ము స్వాహా చేస్తున్నారని మండిపడుతున్నారు. తాము సమర్పించే కానుకలకు జవాబుదారీ ఎవరు ? అని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్‌లో కూడా ఎవరో ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు హిందూ ధర్మ ప్రచారం పేరిట సంస్థలు పెడితే ఇలానే కోట్లాది రూపాయలు కట్టబెడతారా ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం శ్రీవారి నిధులను ఇష్టమొచ్చిన వారికి అప్పనంగా కట్టబెడితే.. భవిష్యత్‌లో తమకు, భక్తులకు అన్యాయం జరిగే అవకాశముందని టీడీపీ ఉద్యోగులంటున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.

 

21:26 - February 23, 2017

గుంటూరు : ఏపీ రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బోసి పోతున్నాయి. అధికారులు అన్ని సిద్దం చేసుకుని రిజిస్ట్రేషన్ కు రెఢీ అంటున్నా..ఒక్క రైతు కూడా  ముందుకు రావడం లేదు. సీఆర్డీఏ ఇచ్చిన ప్లాట్లలో కనీస వసతులు లేకపోవడం, గజం భూమికి మార్కెట్ ధర నిర్ణయించకపోవడంతో  మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా  నిలిచిపోయింది. 
ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ కోసం రైతుల అవస్థలు 
ఎపీ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. భూములిచ్చిన తర్వాత ప్లాట్ల కోసం పడిగాపులు కాసిన రైతులు, మళ్లీ ఇప్పుడు  ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. భూమలు తీసుకునే సమయంలో ఓమాట ..ఇప్పుడు మరోమాట చెబుతున్నారని సీఆర్‌డీఏ అధికారులపై రైతులు ఆగ్రహంగా 
2016 జూన్‌ నుంచి 2017 జనవరి వరకు ప్లాట్ల పంపిణీ
రాజధాని కోసం  తమ పొలాలను 2015లోనే ఇచ్చిన రైతులకు దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్లాట్ల పంపకం మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. 2016 జూన్‌ నుంచి ఈఏడాది జనవరి వరకు ప్లాట్లపంపిణీ చేపట్టారు సీఆర్‌డీఏ అధికారులు. వివాదాల్లో ఉన్నవి, భూములివ్వని వారికి మినహా.. మిగతా రైతులందరికీ ప్లాట్లను కేటాయించారు. అయితే.. ప్లాట్లను ఇచ్చే సమయంలోనే రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోవచ్చని  చెప్పిన సీఆర్‌డీఏ అధికారుల  మాటలు కార్యరూపం దాల్చలేదు. తర్వాత  ప్రతిగ్రామంలో సీఆర్‌డీఏ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అదికూడా జరగలేదు.  ఆతర్వాత రాజధాని ప్రాంతంలోని మొత్తం 29 గ్రామాలను నాలుగు యూనిట్లుగా తీసుకుని , నాలుగు ప్రాంతాల్లో  సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రారంభించారు. ఒక్కో సబ్‌రిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో 7గ్రామాలను ఉండేలా నిర్ణయించారు. దాన్లో భాగంగానే ఈనెల 3న తుళ్ళూరు లో మొదటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసును రెవెన్యూ శాఖ మంత్రి కె.ఈ.కృష్ణమూర్తి అట్టహాసంగా ప్రారంభించారు. అయితే.. 20రోజులు గడిచినా రిజిస్ట్రేషన్‌ కోసం ఒక్కరైతుకూడా ముందుకు రాలేదు. 
మార్కెట్‌ ధర తేల్చకుండా ప్లాట్లు ఎలా ఇస్తాం..?
అయితే తమకు ఇచ్చిన ప్లాట్లకు మార్కెట్‌ ధర ఎంతో తేల్చకుండా రిజిస్ట్రేషన్‌ ఎలా చేస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకంగా రాజధాని గ్రామాల్లో  గజం భూమికి మార్కెట్ ధర నిర్ణయించాల్సి ఉంది. కాని సీఆర్‌డీఏ నుంచి ఎలాంటి స్పందన రావడంలేదని రైతులు అంటున్నారు. 
ప్లాట్లలో కనిపించని మౌలిక వసతుల అభివృద్ధి
ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రైతులు మందుకు రాకపోవడానికి మరో ప్రధాన కారణం..సీఆర్డీఏ ఇచ్చిన ప్లాట్లలో అభివృద్ది జరగకపోవడమే. లాండ్‌పూలింగ్‌ పథకం ప్రారంభ సందర్భంగా .. ప్లాట్లకు అన్ని మౌలిక వసతులు కల్పించిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ అని చెప్పిన సీఆర్‌డీఏ అధికారులు.. తాజాగా మాటమార్చారు.  ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయండి వసతుల సంగతి తర్వాత చూద్దాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రిజిష్ట్రేన్‌ తర్వాత మూడుసంవత్సరాలకు వసతులు కల్పిస్తామంటున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
మోసపోతామని రైతుల్లో ఆందోళన
సీఆర్‌డీఏ అధికారులు ఇప్పటివరకు కల్పించిన మౌలిక వసతులు ఇదిగో ఇలా రోడ్లపేరుతో ఇసుక పోయడం, పెగ్‌మార్కింగ్‌తోనే సరిపెట్టారు. పూర్తిస్థాయిలో వసతులు కల్పించడానికి మూడేళ్ల సమయం పడితే , అప్పటి వరకు తామేంచేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్లాట్లు అభివృద్ధి చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే, తర్వాత తాము ఖచ్చితంగా మోసపోతామనే భయంతో రైతుల్లో నెలకొంది.                                 
చిన్న, సన్నకారు రైతుల్లో ఆందోళన
మరోవైపు..ఎకరం, అరెకరం ఇచ్చిన చిన్న , సన్నకారు రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. ప్లాట్లు ఇవ్వకముందు  ఉన్నదాంట్లోనే ఎంతోకొంత అమ్ముకునే వెసలుబాటు ఉండేది. కాని ప్లాట్లు తీసుకున్న తర్వాత అత్యవసర ఖర్చులు మీదపడినా తమ భూములు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. పోని..సీఆర్డీఏ ఇచ్చిన ప్రోవిజనల్ సర్టిఫికెట్లతో అయినా లావాదేవీలు చేద్దామనుకుంటే..అదీ వీలు కావడంలేదు. సీఆర్డీఏ ఇచ్చిన ప్రోవిజనల్ సర్టిఫికెట్లు కేవలం రైతుకు ప్లాట్ ఇచ్చినట్టు గుర్తింపు కోసమే తప్ప.. ఎలాంటి రిజిస్ట్రేషన్‌లకు చెల్లుబాటు కాదన్నట్టు వాటిపై రాశారు సీఆర్‌డీఏ అధికారులు. దీంతో పిల్లల చదువు, పెళ్లిళ్లకు కూడా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ

ఢిల్లీ : ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ చేపట్టారు. కేంద్ర పర్యావరణ శాఖ, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కేజీ బేసిన్ అథారిటీలకు ఎన్జీటీ నోటిసులు జారీ చేసింది. 

 

21:14 - February 23, 2017

విజయవాడ : కొత్త కొత్త పథకాలు..కొంగొత్త కంపెనీలు...వీటితో నిండిపోవాల్సిన బెజవాడ రహస్య స్థావరాలకు కేంద్రమయింది... మాఫియా మహరాజ్‌లు బెజవాడను సొంతం చేసుకోబోతున్నారు...పోలీసులు..నిఘా వర్గాలు నిద్రలో ఉన్నా...సహకారం అందించినా కొద్ది కాలంలోనే విజయవాడ వారి గుప్పిట్లోకి వెళ్లనుంది..ఇది సత్యం...
లారీల్లో లోడుల కొద్దీ గుట్కా ప్యాకెట్లు...
ఏపీని కేంద్రంగా చేసుకుని గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాల మాఫియా రాజధాని ప్రాంతమైన బెజవాడలో అక్రమంగా గుట్కా, గంజాయి వంటి మత్తుపదార్థాలను యథేచ్ఛగా చేసుకుపోతోంది. లోడుల కొద్ది గుట్కాలు దిగుమతి అవుతున్నా, ఇవన్నీ పసిగట్టాల్సిన నిఘా వ్యవస్థలు నిద్రపోతున్నాయా అంటూ ప్రశ్నలు విన్పిస్తున్నాయి...యూత్‌ జీవితాలతో ఆడుకుంటున్న మాఫియా చెలరేగుతుంది.. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ యదేచ్చగా వ్యాపారం కొనసాగిస్తుంది...
గుట్కాపై అనేక రాష్ట్రాల్లో నిషేధం 
ప్రాణాంతక గుట్కాపై దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నిషేధం కొనసాగుతుండగా, వాటిలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన గుట్కా, ఖైనీ జాఢ్యం క్రమంగా దక్షిణాదిలోనూ ప్రబలిపోయింది. వక్కపొడి, పొగాకు, ఇతరత్రా నిషేధిత వస్తువులతో తయారయ్యే ఈ పొడిని నమలడం వల్ల నోరు, గొంతు, అన్నకోశం తదితర క్యాన్సర్లకు సులభంగా గురవుతారు. క్యానర్లు ప్రబలడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఐదారేళ్ల క్రితమే గుట్కా మసాలాల మీద నిషేధం వేటు వేసింది. ఆ నిషేధంతో పలు శాఖల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. గుట్కా ఉంటే ఆరోగ్యాన్ని పాడుచేసే విషపూరిత వస్తువులు ఉంచుకున్న నేరం కింద 270, 273 సెక్షన్లతో కేసు నమోదు చేస్తారు. అయితే గుట్కాల అడ్డుకట్ట బాధ్యత మాది కాదంటే మాది కాదని పోలీసులు, నగరపాలక ఆరోగ్య, ఆహార, ఔషధ నియంత్రణ, విజిలెన్స్ విభాగాలు 'ఎవరికి వారే యమునాతీరే' అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ విభాగాలన్నింటికీ తనిఖీలు, సీజ్ చేసే అధికారం ఉన్నా కొందరు అధికారులు కాసుల కక్కుర్తితోనే కొనసాగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి...
విజయవాడ కేంద్రంగా దందా..
నిషేధిత గుట్కాలు, గంజాయి వంటి విక్రయాలకు విజయవాడ కేంద్రంగా మారింది...రాజధాని కేంద్రం చేసుకున్న మాఫియా గుట్కాల రవాణా కొనసాగిస్తుంది...చిన్నపాటి రవాణా మొదలై భారీ లోడులతో గుట్కాలు  రవాణా చేస్తున్నారు. గతంలో భవానీపురం, గొల్లపూడి, ఆయా పరిసర ప్రాంతాలలో ఉన్న గోడౌన్లను కేంద్రంగా చేసుకొని గుట్కాలను భారీగా నిల్వలు ఉంచేవారు. ఇటువంటి అరకొర దాడులతో అధికారులు 'నిమ్మకు నీరెత్తినట్లు' వ్యవహారించడంతో గుట్కా మాఫియా రెచ్చిపోయీ లక్షలాది రూపాయల విలువైన గుట్కా, గంజాయి, మాదకద్రవ్యాలను బెజవాడ కేంద్రంగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి...
3 కోట్ల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం 
గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఎదురుగా జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రగతి ప్లయిట్ క్యారియర్ రవాణా సంస్థలో విజిలెన్స్ బృందాల దాడిలో దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన గుట్కాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి మూడు లారీల లోడుతో గుట్కాలు నగరానికి రవాణా అయ్యాయి. ఢిల్లీ నుంచి బెజవాడకు ఇంత భారీగా గుట్కాలు రవాణా అయినా మార్గంలో ఉన్న చెక్ పోస్టుల అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారన్న వాదనలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. శివారు ప్రాంతాలలో ఉన్న గోడౌన్లలో గుట్కాలు నిల్వ ఉంచితే ఏమీ కాదన్న భరోసా లభించడం వల్లనే స్మగ్లర్లు ధైర్యంగా అక్కడ నిల్వలు చేసే వారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. 
ఒడిశా నుంచి బెజవాడకు గుట్కా సరఫరా
ఒడిశా నుంచి కూడా బెజవాడకు గుట్కాలు సరఫరా అవుతున్నాయి...నగరానికి రావడానికి ఎన్నో చెక్‌పోస్టులున్నాయి..కాని లోడ్‌ లారీలు మాత్రం చెక్కుచెదరకుండా నగరంలోకి ప్రవేశిస్తున్నాయి..అంటే దీన్ని బట్టి ఎవరు సహకరిస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదేమో....
ఫిబ్రవరి 9న భారీగా గుట్కా పట్టివేత..
2017 ఫిబ్రవరి 9వ తేదీన గుట్కా ప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తూ విజయవాడలో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. దాదాపు రూ.12 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు గుట్టుచప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తులను, వారికి సహకరిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మాఫియాగా మారి దందా...
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన మల్లేశ్వరరావు అనేవ్యక్తి పెద్దఎత్తున ఒడిషా నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి విజయవాడలో నిల్వ ఉంచి ఆ తర్వాత అక్రమంగా వ్యాపారలావాదేవీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గ్రహించారు. దీంతో పెద్దఎత్తున నిఘా రెట్టింపు చేసి అశోక్ నగర్ లోని ఓ ఇంట్లో గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచుతున్న సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులకు దిగారు. గుట్కా ప్యాకెట్లను అక్రమంగా నిల్వ ఉంచిన మల్లేశ్వరరావు అనేవ్యక్తి నుంచి పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే గతంలో పట్టుబడి జైలు జీవితం గడిపి మళ్లీ అదే దందా చేస్తున్నట్లు తేలింది... పెనమలూరు ఠాణా పరిధిలో పెద్దఎత్తున గుట్కా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చాయంటున్నారు పోలీసులు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చుకుని నిఘా వ్యవస్థను మరింత పటిష్టపరిచి నగరంలోకి వస్తున్న అసాంఘిక శక్తులను ఆటకట్టించడంతోపాటు అక్రమ రవాణాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. 

 

21:02 - February 23, 2017

ఖమ్మం : జిల్లాలోని సింగరేణి యాజమాన్యం భూదందాకు పాల్పడుతోంది. టేకులపల్లి మండలంలో దశాబ్దాలుగా గిరిజనులు సాగుబడిలో ఉన్న భూములను బలవంతంగా లాక్కుటోంది. బొగ్గు గనులు తవ్వకం కోసం చట్టాలను తుంగలో తొక్కుతోంది. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

20:59 - February 23, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకేసిన వైద్యాన్ని మెరుగుపరచాలని తెలంగాణ తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్‌ చేశారు. సర్కారు దవాఖానల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను వివరిస్తూ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వినపతిపత్రం అందజేశారు. మందులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరతతో ప్రభుత్వ ఆస్పత్రులకు మాయరోగం వచ్చిందని ఆరోపించారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన పిల్లలు, గర్భిణిలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం  పట్టించుకోడంలేదని విమర్శించారు. 

 

20:56 - February 23, 2017

కరీంనగర్‌ : వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోతున్న వారి కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. పదేళ్ల క్రితం సేకరించిన భూములకు ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడం, భారీ వర్షాలు కురిసిన్నప్పుడల్లా ఇళ్లు మునిగిపోతున్నా ముంపు బాధితులకు సహాయం చేయకపోవడం లాంటి దృశ్యాలు కరీంనగర్‌ జిల్లాలో కనిపిస్తున్నాయి. అందుకే కడుపు మండిన నిర్వాసితులు తమకు పరిహారం చెల్లించాలంటూ పోరాటాలకు దిగుతున్నారు. 2013 భూ సేకరణ చట్టం తమకు శ్రీరామ రక్ష అని భావిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూ నిర్వాసితులు సాగిస్తున్న పోరాటాల్లో సిపిఎం క్రియాశీలకంగా పాల్గొంటోంది. మీకు అండగా మేమున్నామన్న భావనను నిర్వాసితుల్లో కల్పిస్తోంది. ఇదే ఇవాళ్టి స్పెషల్‌ ఫోకస్‌. 
భూ నిర్వాసితుల పోరాటాలు 
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో భూ నిర్వాసితుల పోరాటాలు పదునెక్కుతున్నాయి. వీరి పోరాటాలకు సిపిఎం పూర్తి అండదండలు అందిస్తోంది. తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలంటూ రైతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగస్వామ్యమైనవే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, గౌరవెల్లి, గండిపెల్లి, అనంతగిరి ఇలా ప్రతి ప్రాజెక్టు ను ఏదో ఒక వివాదం వెన్నాడుతోంది. తమకు న్యాయం చేయాలంటూ భూ నిర్వాసితులు పోరాటాలకు దిగుతున్నారు.  ఈ పోరాటాలతో సిపిఎం మమేకమవుతోంది.
మేడిగడ్డ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం
17500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ప్రారంభించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్ ల నిర్మాణానికి మంథని నియోజకవర్గంలో 2500 ఎకరాల భూమిని సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, ఇవన్నీ సారవంతమైన భూములు కావడంతో వీటిని ఇచ్చేందుకు రైతులు ఇష్టపడడం లేదు. జీవో 123 ప్రకారం పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్న డిమాండ్ ను సిపిఎం వినిపిస్తోంది. ఇప్పటికే సుందిళ్ల, ఉప్పట్ల పంప్ హౌస్ ల నిర్మాణానికి 616 ఎకరాల భూమి అవసరమంటూ లెక్కలేసిన ప్రభుత్వం ఇప్పటికే జీవో 123 కింద   మూడు గ్రామాల్లో దాదాపు 222 ఎకరాల భూమిని సేకరించింది. ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున మాత్రమే చెల్లించేందుకు ఒప్పుకుంది. ఈ మూడు గ్రామాల్లో అధికార పార్టీ నేతలు, అధికారులు కలిసి బలవంతంగా భూమి సేకరించారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఇస్తానన్న ఎనిమిది లక్షల రూపాయల పరిహారం తీసుకునేందుకు ఇష్టపడని రైతులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించారు. 
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ఆధారం
నిర్వాసితుల విషయంలో ప్రభుత్వాలు ప్రదర్శించే నిర్లక్ష్యానికి మరో తిరుగులేని నిదర్శనం ఎల్లంపల్లి ప్రాజెక్ట్.  ఎప్పుడో వైఎస్ హయాంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులన్నింటికీ ఆయువుపట్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. మేడిగడ్డ మొదలు మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనలకు ఈ ప్రాజెక్టే మూల ఆధారం. దీన్ని ఆధారంగా చేసుకునే ప్రభుత్వం గోదావరి నది ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టింది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కి పునాది  వేయగా, 2014లో పూర్తయ్యింది. 20 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు చుట్టూ ఆది నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. అంచనా వ్యయాలు పెరగడం, ముంపు బాధితులకు, నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం, చెల్లించినవాటిలో అవకతవకలు లాంటి సమస్యలున్నాయి. 
ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పలు గ్రామాలు ముంపు 
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో వెల్గటూరు మండలంలోని చెగ్యాం, తాళ్లకొత్తపేట, ఉండేడ, మొక్కట్రావుపేట, కోటిలింగాలతో పాటు రామగుండం మండలంలో కుక్కలగూడూరు, పోట్యాల, మూర్మూర్ గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాసితులకు అనేక హామీలిచ్చింది. నిర్వాసితులకు పరిహారంతో పాటు, పునరావాస కాలనీలు నిర్మిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. పరిహారం చెల్లించేవరకు గ్రామాలను ఖాళీ చేసేది లేదంటూ చెగ్యాం, తాళ్ల కొత్తపేట, ఉండేడ గ్రామాలలో 260 ఇళ్లను ఇంతవరకు ఖాళీ చేయలేదు.  ఆయా గ్రామాల్లో శివార్లలో వున్న ఇళ్లకు, పొలాలకు అంచనాలు తక్కువ వేశారు. అది కూడా పూర్తిగా చెల్లించలేదు. అయితే, ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగితే, ఈ గ్రామాలు మునిగిపోయే ప్రమాదం వుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలి. 
నిర్వాసితుల సమస్యలకు నిదర్శనం ఎల్లంపల్లి ప్రాజెక్ట్
గౌరవెల్లి, గండువెల్లి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కాకపోగా, ముంపు సమస్య మరింత తీవ్రమవుతోంది. వైఎస్ హయాంలో ప్రారంభించిన ఈ రిజర్వాయర్ల పనులు మధ్యలోనే నిలిచిపోగా, కెసిఆర్ ప్రభుత్వం వీటి  నిల్వ సామర్థ్యం పెంచింది.  దీంతో కొత్తగా అనేక తండాలు మునిగిపోతున్నాయి. గిరిజనుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోంది. 
గౌరవెల్లి, గండువెల్లి సామర్థ్యం పెంపు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపాదించిన గౌరవెల్లి, గండువెల్లి రిజర్వాయర్ల సామర్థ్యం పెంచేందుకు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించడంతో ముంపు ప్రాంతం పెరిగింది. జలయజ్ణంలో భాగంగా 2007 సెప్టెంబర్ 9న రిజర్వాయర్ నిర్మాణానికి పునాది రాయి పడింది. మెట్ట ప్రాంతంలో నిర్మిస్తుండడంతో సాగునీరు లభిస్తుందని రైతులంతా ఆశపడ్డారు. కానీ, ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. గౌరవెల్లి రిజర్వాయర్  కోసం పొలాలు, ఇళ్లు పోగొట్టుకున్నవారు నిర్వాసితులయ్యారు. కొంతమంది రైతులు దినసరి కూలీలుగా మారారు. ఒక దశలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. శ్రీరామ్ సాగర్ వరద కాలువ రెండో దశలో భాగంగా, మధ్యమానేరు ప్రాజెక్టు ద్వారా గౌరవెల్లిలో 1.41 టిఎంసిల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలన్నది వైఎస్ ప్రభుత్వ నిర్ణయం. ఈ ప్రాజెక్టు పనుల నిర్మాణం బాధ్యతలను వారిగేట్స్ కంపెనీకి అప్పగించారు. బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్ నుంచి సొరంగ మార్గంలో లిఫ్ట్ ద్వారా సాగునీటిని తరలించాల్సి వుంది. లిఫ్ట్ కోసం నిర్మించే పంప్ హౌస్ పనులు ఇంకా పూర్తి కాలేదు. 60శాతం పనులు పూర్తి చేసుకున్న గౌరవెల్లి రిజర్వాయర్ కి ఇంకా 40శాతం పనులు పూర్తి చేయాల్సి వుంది. అయితే, కాంట్రాక్ట్ కంపెనీ పనులు నిలిపివేసింది. దీంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. నిర్వాసితులకు కష్టాలు కన్నీళ్లే మిగిలాయి. 
2015 జులై.. హుస్నాబాద్ లో సీఎం కేసీఆర్ పర్యటన 
2015 జులైలో హుస్నాబాద్ లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవెల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయడమే కాకుండా దానిని సామర్థ్యాన్ని 9 టిఎంసీలకు పెంచుతామంటూ ప్రకటించారు. జీవో జారీ చేసి 1300 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. 1.4 టిఎంసిల సామర్థ్యంతో వున్న పాత డిజైన్ కారణంగా గుడాటిపల్లి, తెనుగుపల్లి గ్రామాలు, 2300 ఎకరాల భూమి ముంపునకు గురయ్యేది. కొత్త డిజైన్ కారణంగా ముంపు పరిధి పెరుగుతోంది. ఈ రెండు గ్రామాలతో పాటు చింతల్ తండా, బోంద్యానాయక్ తండా, జాల్వాయ్ తండా, సేవనాయక్ తండాలతో పాటు మరో 1500 ఎకరాల భూమి ముంపు బారినపడుతోంది. 
గౌరవెల్లి, గండువెల్లి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు
గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న గండుపెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని కూడా 0.4 టిఎంసిల నుంచి 1 టిఎంసీకి పెంచడంతో 8 గిరిజన తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న గిరిజనుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వీరికి ఎలాంటి పరిహారం చెల్లిస్తారన్న విషయంలో స్పష్టతలేదు. గౌరవెల్లి, గండువెల్లి ప్రాజెక్టుల్లో నిర్వాసితులైన వారి పక్షాన సిపిఎం పోరాడుతోంది. గ్రామగ్రామాన ర్యాలీలు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గౌరవెల్లి, గండిపెల్లి ముంపు గ్రామాల్లో రెండు రోజుల పాటు పాదయాత్రలు చేయడం విశేషం. గౌరవెల్లి, గండువెల్లి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కాకపోగా, ముంపు సమస్య మరింత తీవ్రమవుతోంది. వైఎస్ హయాంలో ప్రారంభించిన ఈ రిజర్వాయర్ల పనులు మధ్యలోనే నిలిచిపోగా, కెసిఆర్ ప్రభుత్వం వీటి  నిల్వ సామర్థ్యం పెంచింది.  దీంతో కొత్తగా అనేక తండాలు మునిగిపోతున్నాయి. గిరిజనుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోంది. 
పెరిగిన ముంపు ప్రాంతం 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపాదించిన గౌరవెల్లి, గండువెల్లి రిజర్వాయర్ల సామర్థ్యం పెంచేందుకు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించడంతో ముంపు ప్రాంతం పెరిగింది. జలయజ్ణంలో భాగంగా 2007 సెప్టెంబర్ 9న రిజర్వాయర్ నిర్మాణానికి పునాది రాయి పడింది. మెట్ట ప్రాంతంలో నిర్మిస్తుండడంతో సాగునీరు లభిస్తుందని రైతులంతా ఆశపడ్డారు. కానీ, ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. గౌరవెల్లి రిజర్వాయర్  కోసం పొలాలు, ఇళ్లు పోగొట్టుకున్నవారు నిర్వాసితులయ్యారు. కొంతమంది రైతులు దినసరి కూలీలుగా మారారు. ఒక దశలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. శ్రీరామ్ సాగర్ వరద కాలువ రెండో దశలో భాగంగా, మధ్యమానేరు ప్రాజెక్టు ద్వారా గౌరవెల్లిలో 1.41 టిఎంసిల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలన్నది వైఎస్ ప్రభుత్వ నిర్ణయం. ఈ ప్రాజెక్టు పనుల నిర్మాణం బాధ్యతలను వారిగేట్స్ కంపెనీకి అప్పగించారు. బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్ నుంచి సొరంగ మార్గంలో లిఫ్ట్ ద్వారా సాగునీటిని తరలించాల్సి వుంది. లిఫ్ట్ కోసం నిర్మించే పంప్ హౌస్ పనులు ఇంకా పూర్తి కాలేదు. 60శాతం పనులు పూర్తి చేసుకున్న గౌరవెల్లి రిజర్వాయర్ కి ఇంకా 40శాతం పనులు పూర్తి చేయాల్సి వుంది. అయితే, కాంట్రాక్ట్ కంపెనీ పనులు నిలిపివేసింది. దీంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. నిర్వాసితులకు కష్టాలు కన్నీళ్లే మిగిలాయి. 
గండుపెల్లి రిజర్వాయర్ సామర్థ్యం 0.4 టిఎంసిలు 
గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న గండుపెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని కూడా 0.4 టిఎంసిల నుంచి 1 టిఎంసీకి పెంచడంతో 8 గిరిజన తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న గిరిజనుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వీరికి ఎలాంటి పరిహారం చెల్లిస్తారన్న విషయంలో స్పష్టతలేదు. 
నిర్వాసితుల పక్షాన సిపిఎం పోరాటం
గౌరవెల్లి, గండువెల్లి ప్రాజెక్టుల్లో నిర్వాసితులైన వారి పక్షాన సిపిఎం పోరాడుతోంది. గ్రామగ్రామాన ర్యాలీలు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గౌరవెల్లి, గండిపెల్లి ముంపు గ్రామాల్లో రెండు రోజుల పాటు పాదయాత్రలు చేయడం విశేషం. 
2013 భూసేకరణ చట్టం కోసం భూనిర్వాసితులు పట్టు 
అనంతగిరి రిజర్వాయర్ లోనూ భూ నిర్వాసితులు 2013 భూ సేకరణ చట్టం కోసం పట్టుబడుతున్నారు. తమకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. అనంతగిరి నిర్వాసితుల పోరాటంతో సిపిఎం భుజం కలుపుతోంది. కరీంనగర్, మెదక్ జిల్లా సరిహద్దుల్లో ఇల్లంతకుంట మండలం అనంతగిరి దగ్గర 3.5 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్ లోనూ భూ నిర్వాసితుల సమస్య ఎజెండా మీదకు వచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 10వ ప్యాకేజీ కింద అనంతగిరి గ్రామం దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. అనంతగిరి గ్రామంతో పాటు సిద్ధిపేటలోని కోచగుట్టపల్లి, చెలుకలూరిపల్లె గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందన్న విమర్శలున్నాయి. అనంతగిరి గ్రామంలో ఆరు వందల కుటుంబాలుండగా, 2700 ఎకరాల వ్యవసాయ భూమి రిజర్వాయర్ లో మునిగిపోతుంది. తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలంటూ గ్రామస్తులు పోరాడుతున్నారు. ఈ పోరాటంతో సిపిఎం మమేకమైంది. 
నిర్వాసితుల కష్టాలు ఒక్కటే..
మన్వాడ, మిడ్ మానేరు ఎక్కడైనా నిర్వాసితుల కష్టాలు ఒక్కటే. పరిహారం లెక్కింపులో అన్యాయం, పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చిపెడుతున్న ప్రభుత్వాలు నిర్వాసితుల సమస్యల విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. 
మన్ వాడ వద్ద రిజర్వాయర్ నిర్మాణం
బోయిన్ పల్లి మండలం మన్ వాడ దగ్గర 25.873 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి 2006లోనే అంకురార్పణ జరిగింది. మిడ్ మానేరు జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో దీనికి శంకుస్థాపన చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్నది లక్ష్యం. ఎడమ వైపున 5.27 కిలోమీటర్లు, కుడివైపున 4.4 కిలోమీటర్ల దూరం మట్టి కట్ట, రెండు వైపులా 80 మీటర్ల చొప్పున నాన్ ఓవర్ ఫ్లో డ్యాం, మధ్యలో 388 మీటర్ల స్పిల్ వే, 25 రేడియల్ గేట్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. జడ్ విఎస్, రత్నా, సుషి సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో పనులు చేజిక్కించుకున్నాయి. 339.39 కోట్ల రూపాయల వ్యయంతో 2009 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేసేలా 2006 అక్టోబర్ లో ఒప్పందం చేసుకున్నారు. నిర్మాణంలో జాప్యం జరిగింది. 2010 ఏప్రిల్ 30 వరకు గడవు పొడిగించారు. అయిన్నప్పటికీ కాంట్రాక్ట్ సంస్థలు పనులు పూర్తి చేయలేదు. గడవు ముగిసేనాటికి కేవలం 23శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు.  ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఒప్పందాల్లో మార్పులు జరిగాయి. అంచనా వ్యయాలు పెంచేశారు. అయినా పనులు పూర్తి కాలేదు. 2015లో పూణెకు చెందిన యశోదీప్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు, ఆ తర్వాత రాజరాజేశ్వరీ కన్ స్ట్రక్షన్ కంపెనీకి పనులు బదలాయించారు. ఇలా 8 మంది కాంట్రాక్టర్లు మారినా మిడ్ మానేరు కథ మధ్యలోనే కొట్టుమిట్టాడుతోంది.
మిడ్ మానేరు...17 గ్రామాలు ముంపు 
మిడ్ మానేరు ప్రాజెక్టు కింద 17 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వేములవాడ మండలంలో కోడిముంజ, అనుపురం, సంకెపల్లి, ఆరెపల్లి, బోయినపల్లి మండలంలోని వరదవెల్లి, శాభాస్ పల్లి, నిలోజిపల్లి, కోదురుపాక, కొత్తపేట, మనువాడ, సిరిసిల్ల మండలంలోని చీర్లవంచ, చింతల్ ఠాణా,  ఇల్లంతకుంట మండలంలోని బుర్రవాణిపల్లి, కందికట్కూర్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. పది గ్రామాలు పూర్తిగానూ, ఏడు గ్రామాలు పాక్షికంగానూ ముంపు బారిన పడుతున్నాయి. 
మునిగిపోనున్న8524 ఇళ్లు 
19440 ఎకరాలు మునిగిపోతాయి. 8524 ఇళ్లు మునిగిపోతాయి. 1123 కుటుంబాలు కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. 2006లో ముంపు గ్రామాలను సర్వే చేసినా, ఇప్పటికీ పరిహారం అందలేదు. భూములకు పరిహారం చెల్లించిన ప్రభుత్వం ఇళ్లకు పరిహారం చెల్లించే విషయంలో జాప్యం చేసింది.  దీంతో గత పదేళ్లుగా నిర్వాసితులు ఆందోళనలు చేస్తూనే వున్నారు.  కొన్నాళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు మిడ్ మానేరు ఎడమ వైపు కట్ట 40 మీటర్ల మేర కోతకు గురైంది. కాంక్రీటు డ్యాం కంటే మట్టి కట్టను ఎత్తుకు నిర్మించి ఉంటే డ్యాం నుంచి నీరు వెళ్లిపోయేది. మిడ్ మానేరు కు ఎగువ మానేరుతో పాటు మూలవాగు, శ్రీరాంసాగర్ వరద కాలువ నుంచి వచ్చే నీటితో లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో ముంపు గ్రామస్తులంతా ప్రాణాలను చేతిలో పట్టుకుని ఊళ్లను ఖాళీచేసి, తరలి వెళ్లారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రిజర్వాయర్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే, వీటిని నిర్మించేటప్పుడు ముంపు ప్రాంతాలు సాధ్యమైనంత తక్కువగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లు, భూములు, ఉపాధి కోల్పోతున్నవారికి పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలి. ఇదే అంశంపై 2013 భూ సేకరణ చట్టం స్పష్టంగా దిశా నిర్ధేశం చేస్తోంది. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే, నిర్వాసితులు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదు. 

 

20:40 - February 23, 2017

హైదరాబాద్‌ : నగరంలో జేఏసీ ర్యాలీ విజయవంతమైందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్‌ కోదండరామ్ ఇంటిపై పోలీసుల దాడి అప్రజాస్వామికమని విమర్శించారు. ఎవరి సొమ్ముతో తిరుమల వెంకన్నకు కేసీఆర్‌ నగలు చేయించారని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

 

20:35 - February 23, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ నిరసన ర్యాలీని భగ్నం చేయటాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆందోళన చేపట్టింది.. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను సీఐటీయూ నేతలు భగ్నం చేశారు.. కార్మిక, ప్రజా ఉద్యమాలపై సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. అక్రమంగా అరెస్ట్‌చేసినవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

20:30 - February 23, 2017

విశాఖ : మెగా హీరోల మల్టీస్టారర్ మూవీపై సుబ్బిరామిరెడ్డి మరోసారి స్పందించారు. మల్టీస్టారర్‌ మూవీ కోసం చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఒప్పుకున్నారని.. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారన్నారు. కథ సిద్ధం కాగానే.. షూటింగ్‌ ప్రారంభిస్తామని సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. 

20:28 - February 23, 2017

పాకిస్తాన్‌ : లోని లాహోర్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా...24 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని పోలీసులు వివిధ ఆసుపత్రులకు తరలించారు. లాహోర్‌లోని డిహెచ్‌ఏ పరిధిలో రద్దీగా ఉండే మార్కెట్‌లో పేలుడు సంభవించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పేలుడు ధాటికి పలు భవనాల కిటికీలు పగిలిపోగా... 4 కార్లు, 12 మోటార్‌ సైకిళ్లు ధ్వంసమయ్యాయి. బాంబ్‌ బ్లాస్ట్‌ కోసం ఉగ్రవాదులు  10 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.

 

20:26 - February 23, 2017

అలహాబాద్ : గుజరాత్‌ అసెంబ్లీ రణరంగమైంది. రైతుల ఆత్మహత్యలపై అధికార విపక్ష సభ్యులు బాహాబాహీకి దిగారు. అమ్రేలి జిల్లాలో రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పరేష్‌ దహ్నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు పరస్పరం ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఒక బిజెపి ఎమ్మెల్యే గాయపడ్డారు. దీంతో స్పీకర్‌ రమణ్‌లాల్‌వోరా సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభించగానే స్పీకర్‌ ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్‌ నేత శక్తిసిన్హాగోహిల్‌- ప్రజాస్వామ్యానికి ఇది చీకటిరోజన్నారు.  బీజేపీ ఎమ్మెల్యేల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఈ దాడిలో గాయ‌ప‌డిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బ‌ల్దేవ్‌జీ ఠాకూర్‌ చెప్పారు.

 

20:23 - February 23, 2017

కేరళ : నటిపై లైంగిక వేధింపుల కేసులో ఎట్టకేలకు నిందితులు దొరికపోయారు. గత ఆరు రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ఈకేసులో ప్రసార మాధ్యమాల్లో పుకార్లు షికారు చేశాయి. కిడ్నాప్‌, వేధింపుల వెను సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు పలు ఆరోపణలొచ్చాయి. ఈనేథ్యంలో ప్రధాన నిందితుడు అరెస్ట్‌ కావడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. 

 

పవన్ కళ్యాణ్ కుప్ప గంతులు మానుకోవాలి : నారాయణ

కృష్ణా : గన్నవరంలో సీఎల్ రాయుడు శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సీపీఐ జాతీయ నేత నారాయణ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కుప్ప గంతులు మానుకోవాలని హితవు పిలికారు. సమస్యను రగిలించి సైలెంట్ గా ఉండడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై పట్ల 
మొండి వైఖరి మానుకోవాలన్నారు. 
 

20:11 - February 23, 2017

తూర్పుగోదావరి : కొన‌సీమ‌లో అక్రమ ఆక్వా సాగుపై అల‌జ‌డి రేగుతోంది. సీపీఎం నేతృత్వంలో ప్రజలు ఉద్యమబాట ప‌డుతున్నారు. ఓ వైపు న్యాయ‌పోరాటం మ‌రోవైపు ప్రత్యక్ష కార్యాచర‌ణ‌ల‌కు దిగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్న రొయ్యలు, చేపల చెరువులను ధ్వంసం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమ ఆక్వాసాగుపై కోనసీమ కన్నెర్ర చేసింది. పచ్చదనంతో అలరారుతున్న గోదావ‌రి డెల్టా  గ్రామాలను ఆక్వాసాగుతో కాలుష్య కాసారాలుగా మార్చారని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఎర్రజెండా పట్టి ఉద్యమిస్తున్నారు. 
హైకోర్టును ఆశ్రయించిన ప్రజలు     
అనుమతి లేకుండా ఇష్టారీతిగా తవ్వుతున్న రొయ్యల చెరువులపై అమలాపురం ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు.  కోర్టు చివాట్లు పెట్టినా జిల్లా అధికారుల్లో కదలిక రాలేదు. దీంతో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమబాట పట్టారు. తూర్పుగోదావరి జిల్లా తాండ‌వ‌ప‌ల్లి ప‌రిస‌రాల్లో వేల ఎక‌రాల్లో అనుమ‌తిలేకుండా అక్రమ ఆక్వా సాగు న‌డుపుతున్న వారంద‌రిపైనా చ‌ర్యలు తీసుకోవాల‌ని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. కోన‌సీమ‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఆక్వాసాగుకి అడ్డుక‌ట్ట వేయాలంటూ ఆపార్టీ రాష్ట్ర కార్యద‌ర్శి మ‌ధు ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప‌రిశీల‌న చేసి.. పెద్దఎత్తున ఉద్యమించడానికి కోససీమవాసులు సిద్ధమవుతున్నారు. 
చేపల చెరువులతో కాలుష్యం
పాడిపంటలు, పచ్చదనంతో తులతూగే కోనసీమలో రొయ్యలు, చేపల చెరువులతో కాలుష్యం నింపుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద‌శాబ్ధకాలంగా అడ్డూ అదుపులేకుండా పెరిగిన ఆక్వా చెరువులతో గ్రామాల్లో భూగర్భజలాలు కలుషితం అయ్యాయని జనం అంటున్నారు. పాలకుల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు.. ఇష్టం వచ్చినట్టు ..ఏలాంటి అనుమతుల్లేకండా చెరువులు తవ్వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాన్ని కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో.. సీపీఎం అండతో ఉద్యమబాట పడుతామంటున్నారు. అక్రమ ఆక్వా చెరువులపై సీపీఎం చేస్తున్న పోరాటంలో తామూ కలిసొస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. 
క‌దం తొక్కుతున్న స్థానికులు, రైతులు 
మొత్తంగా కోన‌సీమ‌లోని ప‌లు మండ‌లాల్లో అక్రమ ఆక్వాసాగు మీద స్థానికులు, రైతులు ప్రధానంగా  క‌దం తొక్కుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. నిబంధనలకు విరుద్ధంగా సాగు చేస్తున్న ఆక్వాచెరువులను  ధ్వంసం చేసి.. కోనసీమలో పచ్చదనాన్ని, ప్రజాజీవితాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. 

 

20:02 - February 23, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్‌ చాలెంజ్‌ విధానం వివాదాల పుట్టగా మారుతోంది. విదేశీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా  అనుసరిస్తున్న పద్ధతులపై న్యాయస్థానాల్లో కేసులు మీద కేసులు పడుతున్నాయి. అమరావతి నిర్మాణ బాధ్యతలను సింగపూర్‌ కంపెనీలకు కట్టబెడూ జారీ చేసిన జీవో 170 సవరిస్తూ  గత నెల 2న మరో జీవో జారీ చేసింది. దీనిని కూడా సవాల్‌ చేస్తూ చెన్నైకి చెందిన ఎన్వియన్‌ ఇంజినీర్స్‌  ప్రైవేటు లిమిటెడ్‌  ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ వేసింది. 
అమరావతి నిర్మాణంపై కోర్టు కేసులు అధికం
ఆంధప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నాయి.  ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్‌ చాలెంజ్‌ విధానం లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్విజ్‌ చాలెంజ్‌ని సవాల్‌ చేస్తూ ఎన్వియన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌..... తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టులో వేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఈ పిటిషన్‌లో  ప్రతివాదులుగా చేర్చారు. వరుస కేసులతో ఏపీ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. 
సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలపై జీవో 170 జారీ 
అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ జీవో 170 ఇచ్చారు. దీనిపై న్యాయస్థానాల్లో కేసులు  వేయడంతో, స్వదేశీ కంపెనీలకు అవకాశం లేకుండా చేసిన స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో పాత జీవో 170ని సవరిస్తూ ఏపీ ప్రభుత్వం గత నెల 2న  జీవో వన్‌ ఇచ్చింది. ఇది ఏపీ మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్ట నిబంధనలకు విరుద్ధంగా  ఉందంటూ ఎన్వియన్‌ ఇంజనీర్స్‌ సంస్థ కేసు వేయడంతో ప్రభుత్వ తలబాదుకుంటోంది. ఇంతకీ ఈ జీవోలో ఏముంది. కోర్టు కేసు ఎందుకు పడిందో పరిశీలిద్దాం. 
గత నెల 3న టెండర్‌ నోటిఫికేషన్‌ 
కొత్త జీవోలో కూడా లొసుగులు ఉన్నాయన్నఆరోపణలు ఉన్నాయి. కొత్త జీవో ఆధారంగా అమరావతి నిర్మాణానికి గత నెల 3న జారీ చేసిన టెండ్లర ప్రక్రియలో రెండంచల పద్ధతిని ప్రతిపాదించారు. మొదట వచ్చిన టెండర్లు వేసిన కంపెనీలకు అర్హతలు ఉంటేనే రెండో దశకు ఎంపిక చేస్తారు. ఈ విధానంలో పారదర్శకత పోపించిందలూ ఎన్వియన్‌ ఇంజనీర్స్‌ కోర్టుకు వెళ్లింది. టెండర్ల ఎలిమినేషన్‌ ప్రక్రియ చట్ట విరుద్ధమని, స్థిరాస్తి వ్యాపార సంస్థలకు అనుకూలంగా ఉందని ఎన్వియన్‌ కంపెనీ పిటిషన్‌లో పేర్కొంది. టెండర్లల్లో పాల్గొనే కంపెనీల ఆర్థిక అర్హతలను కూడా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బిడ్డింగ్‌ సంస్థ నికర విలువ రెండు వేల కోట్ల రూపాయలుగా ఉండాలన్న నిబంధన విధించారు. దేశీయ కంపెనీలను పోటీ నుంచి తప్పించేందుకే కఠిన నిబంధనలను విధించారు. అలాగే బిడ్‌ ప్రాసెసింగ్‌ ఫీజును 25 లక్షలుగా నిర్ణయించారు. సెక్యూరిటీని 6.35 కోట్లుగా నిర్ధరించారు. ప్రాసెసింగ్‌ ఫీజు, సెక్యూరిటీని సింగపూర్‌ కంపెనీల కన్సార్టియం  నుంచి  తీసుకున్నారా ? లేదా ? అన్న అంశంపై ప్రభుత్వ స్పష్టత ఇవ్వని విషయాన్ని ఎన్నియన్‌ ఇంజినీర్స్‌ సంస్థ తన ప్రస్తావించింది. ఈ మొత్తం వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరింది. 
స్విస్‌ చాలెంజ్‌ విధానం 
మొత్తం మీద స్విస్‌ చాలెంజ్‌ విధానం ఏ విధంగా చూసుకున్నా పారదర్శకతకు పాతరేసాలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సింగపూర్‌ కంపెనీల కన్సార్టియంపై మమకారంతో వీటి అడుగులకు మడుగులెత్తే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఆరోపణలు మొదటి నుంచీ వెల్లువెత్తుతున్నాయి. స్విస్‌ చాలెంజ్‌ విధానానికి ప్రభుత్వం చేసిన సవరణలు కూడా చట్ట విరుద్ధమన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అమరావతి నిర్మాణం పారదర్శకంగా ఉండేందుకు  స్వదేశీ కంపెనీలకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. అమరావతి నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అరమరికలు లేకుండా ఎందుకు వ్యవహరించడం లేదు ? రాజధాని నిర్మాణంలో స్వదేశీ కంపెనీలు పాల్గొంటే తప్పేంటి? వచ్చే ముప్పేంటి..? అని స్వదేశీ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది. 

19:55 - February 23, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇసుక మాఫియా దెబ్బకు జిల్లా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. స్వయానా టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ నియోజకవర్గంలోనే భారీగా  ఇసుక దందా కొనసాగుతోంది. పశ్చిమ ప్రజాప్రతినిధులతో తూర్పు రాజకీయ నాయకులు కుమ్మక్కై ఇసుక దోపిడికి పాల్పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరగుతున్న ఇసుక అక్రమ దందాపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

19:52 - February 23, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని దివీస్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల భూముల్లో దివీస్‌ యాజమాన్యం చేపట్టిన..నిర్మాణాలను తొలగిస్తామని దివీస్‌ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. దీంతో తొండంగిలో 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు. మరోవైపు తొండంగిలో దివీస్‌ వ్యతిరేక పోరాట సమితి నేత ముసలయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ముసలయ్య అరెస్టును వ్యతిరేకిస్తూ..రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుండడంతో తొండంగిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

 

19:50 - February 23, 2017

తిరుపతి : అణగారిన వర్గాలకు న్యాయం జరిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని అన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సమాజంలోని అన్ని వర్గాల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు చేపట్టిన సామాజిక చైతన్య యాత్ర తిరుపతిలోకి ప్రవేశించిన సందర్భంగా వామపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. జనవరి 26న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మొదలైన చైతన్య యాత్ర..ఇప్పటివరకు 10 జిల్లాలు పూర్తిచేసుకుందని రామకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున..చైతన్యయాత్రను మార్చి 10వరకు వాయిదా వేస్తున్నామన్నారు. అన్ని వర్గాల్లో సామాజిక న్యాయం తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.  

 

19:48 - February 23, 2017

తిరుపతి : హిందూ ధర్మ ప్రచారం పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు ఏటా టిటిడి కోట్లాది నిధుల్ని మంజూరు చేయడం అన్యాయమన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.  టిటిడికి సొంతంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్‌  ఉండగా..ప్రైవేటు సంస్థకు హిందూధర్మం పేరుతో నిధులు ఎలా కేటాయిస్తారని తిరుపతిలో ప్రశ్నించారు. 

 

19:45 - February 23, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఉద్యమ శక్తులన్నీ ఏకం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క విలుపు ఇచ్చారు. కేసీఆర్ సర్కారుకు నిరంకుశ పోకడలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు.

 

19:42 - February 23, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల వెంకన్నకు సమర్పించిన ఆరభణాల డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో లెక్క చెప్పాలని కాంగ్రెస్‌ నేత వీ హనుమంతరావు డిమాండ్‌ చేశారు. మొక్కులు చెల్లించుకోడానికి సొంత డబ్బు ఖర్చు చేయకుండా ప్రజా ధనం వెచ్చిస్తే రాబోయే  ముఖ్యమంత్రులకు  ఇదొక ఆనవాయితీగా మారే అవకాశం ఉందన్నారు. 

 

19:37 - February 23, 2017

 

హైదరాబాద్ : నిన్న టి జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ విజయవంతంమైందని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ర్యాలీకి రాకుండా నిరుద్యోగ యువతను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతోనే ర్యాలీ సక్సెస్‌ అయిందన్నారు. ప్రజా సమస్యలపై టీ జేఏసీ తలపెట్టిన పోరాటం ఇక్కడితో ఆగదని..మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు కోదందరామ్‌. తన నివాసంలో జేఏసీ నేతలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌..త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. 
అన్ని సంఘాల నేతలతో చర్చించాకే భవిష్యత్‌ కార్యాచరణ
అన్ని సంఘాల నేతలతో విస్త్రత చర్చలు జరిపిన తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు టి జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌. నిన్న తన నివాసంలో సీసీ కెమెరాలను, సీసీ ఫుటేజీ బాక్సును పోలీసులు ఎత్తుకెళ్లిపోయారని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లు ఉండొద్దనే భావన ప్రభుత్వాల్లో సహజంగానే ఉంటుందని..త్వరలోనే జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు వేసి ప్రజా సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామన్నారు కోదండరామ్‌. 

పుణె టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట

పుణె టెస్టు : తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ : 256/9. బ్యాటింగ్ : రెన్ షా.. 68, వార్నర్..38, స్మిత్.. 27, హ్యాండెడ్స్ కోంబ్.. 22, మార్ష్...16, వేడ్ 8, స్టార్క్ 57 నాటౌట్ గా నిలిచాడు. 

గాంధీ స్పత్రిలో స్వైన్ ఫ్లూ వార్డును పరిశీలించిన ఎన్ సీడీసీ జాతీయ వైద్య బృందం

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వార్డును ఎన్ సీడీసీ జాతీయ వైద్య బృందం పరిశీలించింది. స్వైన్ ఫ్లూ రోగులకు అందిస్తున్న చికిత్సపై వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. స్వైన్ ఫ్లూ రోగులకు చికిత్స చేసే వారికి వ్యాక్సినేషన్ చేయాలని ఎన్ సీడీసీ జాతీయ వైద్య బృందం సూచింది.

 

11:54 - February 23, 2017

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా తో హిట్ కొట్టిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు 'అక్కినేని' ఫామిలీతో మరో సినిమా చెయ్యబోతున్నాడు. 'నాగార్జున'కి ఉన్న మన్మధుడు అనే పేరు ని కరెక్ట్ గా వాడేసాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. ఆల్రెడీ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్న ఈ అక్కినేని హీరోలలో ఎవరితో ఆ సినిమా ఉంటుంది .?? 'నాగార్జున'కు పండగ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. గ్రామీణ నేపధ్యం లో మంచి ప్రేమకథకు కుటుంబ నేపధ్యాన్ని అందించి బిగ్ స్క్రీన్ పైన బ్యూటీ ని నింపిన ఈ డైరెక్టర్ ఆడియన్స్ ని మెప్పించి మొదటి సినిమాతో గెలిచాడు. 'నాగార్జున'కి హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ మీద అపారమైన నమ్మకం పెంచుకున్నాడు కింగ్.

యువ హీరోతో ప్లాన్..
ఇటు స్టోరీ న్యాయం చేసే డైరెక్షన్ అటు విజువల్స్ గ్రాండ్ గా తియ్యగల సత్త ఉన్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా నాగ్ ఫామిలీ లో యువ హీరోతో ప్లాన్ చేసాడు. హీరో నాగార్జున అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ కి నచ్చిన నటుడు. గతంలో నాగార్జున హీరో గా వచ్చిన ‘అల్లరి అల్లుడు’ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇందులో నాగ్ మాస్ లుక్ తో అదరగొట్టాడు. ఇప్పుడిదే టైటిల్ ని తనయుడు సినిమాకి సెట్ చేసే ప్లాన్ లో నాగ్ ఉన్నట్టు చెబుతున్నారు. స్టోరీ ఏదైనా ఫస్ట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేది టైటిల్ అనే విషయం తెలిసిందే. ఆ టైటిల్ మాస్ కి నచ్చేటట్టు పెట్టడంతో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నట్టు నాగార్జున వ్యూహం తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేసిన ఈ సినిమా నాగ్ ‘నిన్నే పెళ్లాడతా’ తరహా చిత్రమిదని చెబుతున్నారు.

నాగచైతన్య..
నాగార్జున సినీ వారసుడిగా వచ్చిన 'అఖిల్' మొదటి సినిమాతో తేలిపోయాడు. ఫొటోస్ వరకు బాగున్నా యాక్టింగ్ విషయంలో తన సత్త చాటడంలో విఫలమైయ్యాడు. ఫస్ట్ ఫిలిం నుండి తనలో టాలెంట్ ని పెంచుకుంటూ సెటిల్డ్ యాక్టింగ్ తో హిట్ కొట్టిన అక్కినేని హీరో నాగచైతన్య. ఇప్పుడు తండ్రిపేరు నిలబెట్టే టాలెంట్ తనకే ఉందని ఇండస్ట్రీ వర్గాలు కూడా అంటున్నాయి. ప్రేమమ్ సినిమాలో వేరియేషన్స్ ఉన్న పాత్రలని పోషించి వెరీ గుడ్ అనిపించుకున్న నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో హీరోగా రాబోతున్నాడు. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. అటు నాగార్జునని డైరెక్ట్ చేసి ఇప్పుడు నాగచైతన్య తో సినిమా చెయ్యబోయే కళ్యాణ్ కృష్ణ అక్కినేని ఫామిలీ డైరెక్టర్ గా మారుతున్నాడు.

11:49 - February 23, 2017

టాప్ రేంజ్ లో ఉన్న హీరోలు ఒక్కసారిగా డార్క్ లైట్ లోకి వెళ్ళిపోతారు. అలా కెరీర్ స్లో అవ్వడానికి రీజన్స్ చాల ఉంటాయి. తాము సెలెక్ట్ చేసుకునే కధలు, తాము వర్క్ చేసిన డైరెక్టర్స్ ఇలా చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. లాస్ట్ ఇయర్ ఒక్క సినిమా కూడా చెయ్యకుండా ఉన్న ఒక హీరో రియలైజేషన్ తో ఈ ఇయర్ టు ఫిలిమ్స్ ఒకే చేసాడు. సినిమా అంటేనే మాస్ మార్కెట్ అనేది ఒక కోణం. ఒక హీరో మాస్ ని అట్రాక్ చేస్తే తిరుగుండదు, కలెక్షన్లకు కొదవుండదు, ఫాన్స్ కి లిమిట్ ఉండడదు. ఇవన్నీ ఒకప్పుడు. ఆడియన్స్ వ్యూస్ లో విజన్ లో మార్పు వస్తుంది. హీరో ఎవరైనా కధలో దమ్ముండాలి సినిమాలో బలముండాలి. అప్పుడే ఆడియన్స్ థియేటర్ వరకు వస్తారు. సినిమాని హిట్ చేస్తారు. సినిమా ఇండస్ట్రీ లో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడు 'రవితేజ'. తన యాక్టన్ తో మాస్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన రవితేజ మాస్ మహారాజా అని బిరుదు కూడా కొట్టేసాడు. కానీ కొంత కాలం నుండి 'రవితేజ' ఫిల్మ్ రికార్డు చూస్తే ఒక్క పర్ఫెక్ట్ హిట్ కూడా కనపడదు. అసలు కొన్ని సినిమాలు అయితే ఎందుకు చేసాడో కూడా అర్ధం కాదు. సెంటిమెంట్ ని కామెడీ ని యాక్షన్ ని క్యాజువల్ వేలో ప్రెజెంట్ చేసే రవితేజ ఘోరంగా వెనక పడ్డాడు. హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు కూడా అంతగా ఆడలేదు. కొత్తదనం లేని కధ, కట్టిపడెయ్యలేని కధనం, రొటీన్ కామెడీ, మోనాటిని ఎక్స్ప్రెషన్స్ ఇలా ఎన్నో కారణాలు మాస్ మహారాజని డౌన్ చేసాయి. గత సంవత్సరం కేవలం ఒక్క సినిమా కూడా చెయ్యకుండా సైలెంట్ గా వరల్డ్ టూర్ కి వెళ్ళాడు రవితేజ. ఒకప్పుడు కలక్షన్స్ కురిపించిన ఈ హీరో ఎంట్రీ తడబాటు లో పడింది. ఐన సరే అది గతం. ఇప్పుడు మాస్ మహారాజ్ రెండు వెరైటీ సినిమాలతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తన ప్రీవియస్ ఎనేర్జినీ స్క్రీన్ మీద మ్యాజిక్ లా మార్చబోతున్నాడు.

రెండు సినిమాలు..
ఈ ఇయర్ లో రవితేజ ఆల్రెడీ రెండు సినిమా లు ఓకే చేసి ట్రాక్ మీద పెట్టుకున్నాడు. 'టచ్ చేసి చూడు' అనే టైటిల్ తో ఒక సినిమా రాబోతుంది. టైటిల్ లోనే మాస్ ఎలిమెంట్ కనిపిస్తున్న ఈ సినిమా మీద 'రవితేజ' హోప్స్ పెట్టుకున్నాడు. విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో వస్తున్న 'టచ్ చేసి చూడు' సినిమా వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో 'రవితేజ'తో పాటు 'లావణ్య త్రిపాఠి', 'రాశిఖన్నా' నటిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'రవితేజ' హీరోగా వస్తున్న మరో సినిమా 'రాజా ది గ్రేట్'. ఈ సినిమా లో 'రవితేజ' అంధుడిగా నటిస్తున్నాడు అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. స్టోరీ లైన్ సస్పెన్సు మైంటైన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఏది ఏమైనా 'రవితేజ'కి ఈ ఇయర్ రెండు సినిమాలు రెడీ గా ఉన్నాయ్. తన స్పీడ్ పెంచి ఇంకా కధలు వింటున్నాడు ఈ మాస్ హీరో.

11:46 - February 23, 2017

తూర్పుగోదావరి : 'జీవితాలను ప్రభావితం చేసే కంపెనీ మా కొద్దు..భూమి వదిలి ఎక్కడకు పోవాలి..పిల్లల బతుకులు ఏం కావాలి..కంపెనీ వద్దు' అంటూ వారందరూ కొన్ని రోజుల తరబడి పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వీరి ఆవేదనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసుల సహాయంతో వారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దివీస్ లో నిర్మాణం చేయవద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది రైతులు కోర్టు మెట్లు ఎక్కడంతో స్టేటస్ కో ఆర్డర్ ను జారీ చేసింది. కానీ కంపెనీ యాజమాన్యం మాత్రం నిర్మాణాలు చేపడుతోంది. దీనితో ఆగ్రహించిన రైతులు ఆందోళన బాట పట్టారు. బుధవారం ఉదయం 250 మంది రైతులు ర్యాలీగా నిర్మాణం అవుతున్న ప్రాంతానికి వద్దకు చేరుకున్నారు. అక్కడనే మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఆందోళనకారులు తీవ్రంగా ప్రతిఘటించారు. రైతుల ఆందోళనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేని పోలీసులు ఆందోళనకారులను ఈడ్చిపారేశారు. డ్రోన్ ల సహాయంతో భద్రతను పర్యవేక్షిస్తుండడం గమనార్హం.

11:41 - February 23, 2017

తిరుపతి : హిందూ ధర్మ ప్రచారం పేరుతో ఓ ప్రైవేటు సంస్థకు ఏటా టిటిడి కోట్లాది నిధుల్ని మంజూరు చేయడం అన్యాయమన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. టిటిడికి సొంతంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఉండగా..ప్రైవేటు సంస్థకు హిందూధర్మం పేరుతో నిధులు ఎలా కేటాయిస్తారని తిరుపతిలో ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు 50 లక్షలు స్వామి వారి సొమ్ము కొట్టేస్తున్నారని, సంవత్సరానికి 6 కోట్లు అని తెలిపారు. ఎండో మెంట్స్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ట్రస్టుకు టిటిడి సొమ్మును ప్రభుత్వం ఎందుకు దానం చేయాలని సూటిగా ప్రశ్నించారు.

 

11:38 - February 23, 2017

గుంటూరు : ఎపీ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. భూములిచ్చిన తర్వాత ప్లాట్ల కోసం పడిగాపులు కాసిన రైతులు, మళ్లీ ఇప్పుడు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. భూమలు తీసుకునే సమయంలో ఓమాట ..ఇప్పుడు మరోమాట చెబుతున్నారని సీఆర్‌డీఏ అధికారులపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. రాజధాని కోసం తమ పొలాలను 2015లోనే ఇచ్చిన రైతులకు దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్లాట్ల పంపకం మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. 2016 జూన్‌ నుంచి ఈఏడాది జనవరి వరకు ప్లాట్లపంపిణీ చేపట్టారు సీఆర్‌డీఏ అధికారులు. వివాదాల్లో ఉన్నవి, భూములివ్వని వారికి మినహా.. మిగతా రైతులందరికీ ప్లాట్లను కేటాయించారు. అయితే.. ప్లాట్లను ఇచ్చే సమయంలోనే రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోవచ్చని చెప్పిన సీఆర్‌డీఏ అధికారుల మాటలు కార్యరూపం దాల్చలేదు. తర్వాత ప్రతిగ్రామంలో సీఆర్‌డీఏ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అదికూడా జరగలేదు. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలోని మొత్తం 29 గ్రామాలను నాలుగు యూనిట్లుగా తీసుకుని, నాలుగు ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రారంభించారు. ఒక్కో సబ్‌రిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో 7గ్రామాలను ఉండేలా నిర్ణయించారు. దాన్లో భాగంగానే ఈనెల 3న తుళ్ళూరు లో మొదటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసును రెవెన్యూ శాఖ మంత్రి కె.ఈ.కృష్ణమూర్తి అట్టహాసంగా ప్రారంభించారు. అయితే.. 20రోజులు గడిచినా రిజిస్ట్రేషన్‌ కోసం ఒక్కరైతుకూడా ముందుకు రాలేదు.

తేలని గజం భూమి మార్కెట్‌ ధర..
అయితే తమకు ఇచ్చిన ప్లాట్లకు మార్కెట్‌ ధర ఎంతో తేల్చకుండా రిజిస్ట్రేషన్‌ ఎలా చేస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకంగా రాజధాని గ్రామాల్లో గజం భూమికి మార్కెట్ ధర నిర్ణయించాల్సి ఉంది. కాని సీఆర్‌డీఏ నుంచి ఎలాంటి స్పందన రావడంలేదని రైతులు అంటున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రైతులు మందుకు రాకపోవడానికి మరో ప్రధాన కారణం..సీఆర్డీఏ ఇచ్చిన ప్లాట్లలో అభివృద్ది జరగకపోవడమే. లాండ్‌పూలింగ్‌ పథకం ప్రారంభ సందర్భంగా .. ప్లాట్లకు అన్ని మౌలిక వసతులు కల్పించిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ అని చెప్పిన సీఆర్‌డీఏ అధికారులు.. తాజాగా మాటమార్చారు. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయండి వసతుల సంగతి తర్వాత చూద్దాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రిజిష్ట్రేన్‌ తర్వాత మూడుసంవత్సరాలకు వసతులు కల్పిస్తామంటున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

మోసపోతామని రైతుల్లో ఆందోళన..
సీఆర్‌డీఏ అధికారులు ఇప్పటివరకు కల్పించిన మౌలిక వసతులు ఇదిగో ఇలా రోడ్లపేరుతో ఇసుక పోయడం, పెగ్‌మార్కింగ్‌తోనే సరిపెట్టారు. పూర్తిస్థాయిలో వసతులు కల్పించడానికి మూడేళ్ల సమయం పడితే , అప్పటి వరకు తామేంచేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్లాట్లు అభివృద్ధి చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే, తర్వాత తాము ఖచ్చితంగా మోసపోతామనే భయంతో రైతుల్లో నెలకొంది.

విలువలేని ప్లాట్ల ప్రొవిజనల్‌ సర్టిఫికేట్లు..
మరోవైపు..ఎకరం, అరెకరం ఇచ్చిన చిన్న , సన్నకారు రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. ప్లాట్లు ఇవ్వకముందు ఉన్నదాంట్లోనే ఎంతోకొంత అమ్ముకునే వెసలుబాటు ఉండేది. కాని ప్లాట్లు తీసుకున్న తర్వాత అత్యవసర ఖర్చులు మీదపడినా తమ భూములు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. పోని..సీఆర్డీఏ ఇచ్చిన ప్రోవిజనల్ సర్టిఫికెట్లతో అయినా లావాదేవీలు చేద్దామనుకుంటే..అదీ వీలు కావడంలేదు. సీఆర్డీఏ ఇచ్చిన ప్రోవిజనల్ సర్టిఫికెట్లు కేవలం రైతుకు ప్లాట్ ఇచ్చినట్టు గుర్తింపు కోసమే తప్ప.. ఎలాంటి రిజిస్ట్రేషన్‌లకు చెల్లుబాటు కాదన్నట్టు వాటిపై రాశారు సీఆర్‌డీఏ అధికారులు. దీంతో పిల్లల చదువు, పెళ్లిళ్లకు కూడా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సీఆర్‌డీఏ అధికారులు రైతుల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్లాట్లలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు .. గజం భూమిపై మార్కెట్‌ ధర ఎంతో తేల్చాల్సిన అవసరం ఉందని రాజధాని గ్రామాల రైతులు అంటున్నారు.

11:35 - February 23, 2017

 

హైదరాబాద్ : శాసనసభ్యుల కోటాలో మండలికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదవులపై టీఆర్‌ఎస్‌లో చాలామంది నేతలు కన్నేశారు. ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు ఒక్కఛాన్స్‌ అంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి ఛాన్స్‌ ఇస్తారా..? లేక మరెవరికి పదవులు దక్కుతాయి..? అన్న చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. శాస‌నస‌భ్యుల కోటాలో శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో గులాబీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉద్యమంలో పాల్గొన్న చాలామంది నేతలు పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ముందు కూడా కేసీఆర్‌ శాసన మండలి సభ్యులుగా అవకాశం కల్పిస్తామని చాలామంది నాయకులకు హామీ ఇచ్చారు. దీంతో వారంతా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. శాస‌న‌స‌భ్యుల కోటా ఎన్నిక‌ల‌కు న‌గ‌రా మోగ‌డంతో ఉద్యమంలో పనిచేసిన వారంతా త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్న ధీమాతో ఉన్నారు. మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీలు వి. గంగాధ‌ర్ గౌడ్, మాఘం రంగారెడ్డి, రిజ్వీల ప‌ద‌వి కాలం ముగియ‌నుంది.

ఏకగ్రీవం అవుతాయా ?
టీడీపీ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన గంగాధ‌ర్ గౌడ్‌కు మ‌రోసారి అవ‌కాశం ద‌క్కనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి స్థానం కూడా శాస‌న‌స‌భ్యుల సంఖ్య ప్రకారం అధికార పార్టీకే ద‌క్కనుంది. ఈ సీటుపై టీఆర్‌ఎస్‌లోని చాలామంది నేతలు భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక ఎంఐఎం ఎమ్మెల్సీ రిజ్వీ స్థానాన్ని ఆ పార్టీకి అధికార పార్టీ వ‌దులుతుందా..? లేదా చర్చ సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు మిత్రప‌క్షంగా ఉన్నఎంఐఎం నుంచి ఇప్పటి వ‌ర‌కూ ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలుస్తోంది. శాస‌న‌స‌భ‌లో పార్టీల బ‌లాబ‌లాల‌ను ప‌రిశీలిస్తే... ప్రతిప‌క్ష పార్టీల‌న్నీ క‌లిసినా ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా వాటికి దక్కే అవకాశం లేదు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంల అవగాహన ఒప్పందంతోనే మండలి ఎన్నికలు ఏకగ్రీవం కావొచ్చన్న అభిప్రాయం చాలామంది నేతల్లో వ్యక్తమవుతోంది.

గవర్నర్ ను కలిసిన టిటిడిపి నేతలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను టి.టిడిపి నేతలు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్ కు వారు ఫిర్యాదు చేశారు.

11:11 - February 23, 2017

ఇప్పుడిప్పుడే టాలీవుడ్ మూస కధలకి గుడ్ బై చెప్తుంది. కొత్త కథలు స్క్రీన్ మీద వండర్స్ చేస్తున్నాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు రావడం మొదలయింది. ఇది ఇలా ఉంటే పెద్ద హీరోలు మాత్రం ఎందుకో న్యూ ట్రెండ్ ని ఫాలో అవ్వలేక పోతున్నారు. అలాంటి ఒక పెద్ద హీరో మళ్ళీ సీమ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. రోజు రోజు కి అప్డేట్ అవుతున్న ఫిలిం ఇండస్ట్రీ లో రెగ్యులర్ స్టోరీస్ కి కాలం చెల్లిపోతున్నట్టు స్పష్టం గా తెలుస్తుంది. కొత్త కధలకు పట్టం కడుతున్న ఈ టైం లో కూడా రిస్క్ చేయలేకపోతున్నారు మన పెద్ద హీరోలు. కొన్ని సార్లు తెలిసి కొన్ని సార్లు తెలియక ఆడియన్ పల్స్ పెట్టుకోడం లో ఫెయిల్ అవుతున్నారు ఫిలిం మేకర్స్. కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకుడు పక్క పరిశ్రమల మీద ఆధారపడకుండా చేస్తున్నాయి ప్రెజెంట్ తెలుగు ఫిలిమ్స్. ప్రెజెంట్ టైమ్స్ లో వచ్చిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా తెలుగు సినిమా స్థాయిని ఒక రేంజ్ లో పెంచి 'బాలకృష్ణ' కి యు ఎస్ లో కూడా మంచి మార్కెట్ క్రేయేట్ చేసింది.

గౌతమిపుత్ర శాతకర్ణి..
'గౌతమి పుత్ర శాతకర్ణి' ఈ సినిమా అటు హీరోకి ఇటు డైరెక్టర్ కి ఇద్దరికి రిస్కీ అట్టెంప్ట్. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోని డీల్ చెయ్యాలంటే కధలో బలం ఉండాలి అని నమ్మిన డైరెక్టర్ క్రిష్. ఎక్కడ కంప్రమైజ్ అవ్వకుండా ఎప్పుడో చరిత్రలో జరిగిన కధని తెరమీద చూపించిన క్రిష్, అదే లెవెల్ లో తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రెజెంట్ చేసిన బాలయ్య ఇద్దరు గెలిచారు అనే చెప్పాలి. కొత్త కధనం, కొత్త కధ చరిత్ర చెప్పిన కధ ఇలాంటి పాత్రలు బాలకృష్ణ కు కొత్త కాదు. రాజ్యకాంక్ష, తల్లిమాట మీద ఉన్న రెస్పెక్ట్ రెండిటిని బాలన్స్ చేసే చక్రవర్తి పాత్రలో బాలకృష్ణ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇలాంటి ల్యాండ్ మార్క్ హిట్ తరువాత బాలయ్య మీద అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. తన తరువాత సినిమా కృష్ణ వంశి డైరెక్షన్ లో ఉంటుంది అని చెప్పిన బాలయ్య హఠాత్తుగా మాట మార్చేశాడు. కృష్ణ వంశి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరో గా 'రైతు' అనే టైటిల్ తో సినిమా ఉండబోతుంది అని అనుకున్న ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు బాలయ్య.

ఫ్యాక్షన్ చిత్రం..
తాను ఇప్పుడప్పుడే రైతులకి సంబంధించిన సబ్జక్ట్స్ టచ్ చెయ్యనని చెప్పిన బాలయ్య ఎవ్వరూ ఊహించని విధంగా తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఆ సినిమా కథ కూడా ఫ్యాక్షన్ నేపధ్యంలో ఉండటం మళ్ళీ రొటీన్ స్టైల్ లో బాలయ్య వెళ్తున్నాడా అనే సందేహం ఫాన్స్ లో గుబులు రేపుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యం లో అరడజను సినిమాలు తీసి ప్రేక్షకులకు అందించిన బాలయ్య మళ్ళీ ఫ్యాక్షన్ కథని ఎంచుకోడంతో ఫాన్స్ పరేషాన్ అవుతున్నారు. 'లింగ' సినిమాతో దారుణమైన పరాజయాన్ని చూపించిన డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తమిళ హీరోలే ఆయనతో పని చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇలాంటి టైంలో బాలయ్య కె.ఎస్.కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందులోని తాను తుక్కు తుక్కుగా వాడిన ఫ్యాక్షన్ స్టోరీనే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు బాలకృష్ణ . మరి బాలయ్య ఏ ధైర్యంతో ఆయనతో సినిమా చేస్తున్నాడో ?

11:00 - February 23, 2017
10:59 - February 23, 2017

విశాఖపట్టణం : ఉత్తరాంధ్ర పట్టభద్రులు నియోజకవర్గం నుంచి శాసన మండలికి జరుగుతున్న ఎన్నిక బీజేపీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నామినేషన్‌ వేసిన సందర్భంగా బీజేపీ, టీడీపీ కోడ్‌ ఉలంఘించారన్న ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. వీటిపై జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు నివేదికలు చేరడంతో పరిణామాలు ఎలా ఉంటాయోనని ఇరు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏపీ శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి మిత్రపక్షమైన బీజేపీకి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. పార్టీ సీనియర్‌ నేత వీపీ చలపతిరావు తనయుడు పీవీఎన్‌ మాధవ్‌ పోటీ చేస్తున్నారు. మాధవ్‌ నామినేషన్‌ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో బీజేపీ, టీడీపీ నేతలు చేసిన హడావుడి కమలదళ అభ్యర్థి మెడకు చుట్టుకుంటోంది.

అడుగడుగునా కోడ్‌ ఉల్లంఘించారన్న ఆరోపణలు..
మాధవ్‌ నామినేషన్‌ సందర్భంగా బీజేపీ, టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెతున్నాయి. దీనిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌, అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖపట్నం బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు, అనకాపల్లి టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌, శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కే రామ్మోహన్‌నాయుడు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్‌ సందర్భంగా అడుగడుగునా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న విమర్శలున్నాయి. లెక్కకు మించిన వాహనాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

నామినేషన్‌ సందర్భంగా ఐదుగురికే అనుమతి..
ఎన్నికల టిర్నింగ్‌ అధికార కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ర్యాలీ నిలివేయాల్సి ఉన్నా, అధికారంలో ఉన్న తమకు ఎదురులేదున్న ధీమాతో డీఆర్‌వో ఆఫీసు ఉన్న జిల్లా కలెక్టరేట్‌ మెయిన్‌ గేటు వరకు వచ్చారు. నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థి మాధవ్‌తోపాటు పరిమిత సంఖ్యలో నేతలు వెళ్లాలని సూచించిన పోలీసులపై అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌ దురుసుగా ప్రవర్తించి, నోరు పారేసుకోవడం వివాదాస్పదమైంది. వీటిన్నింటిపై జిల్లా కలెక్టర్‌కు అందిన ఫిర్యాదులపై నివేదికలు హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వెళ్లాయి. దీంతో అధికార టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీల నేతల్లో భయంపట్టుకుంది. కోడ్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థులు నామినేషన్‌ వేసిన సందర్భాల్లో కేవలం ఐదుగురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా వందమందిని పంపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నారు. మరోవైపు విశాఖకు రైల్వే సాధించడంలో విఫలమైన టీడీపీ, బీజేపీ తీరు పట్ట ఉత్తరాంధ్ర పట్టభద్ర ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంతోపాటు పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను ప్రతిపక్షాల అభ్యర్ధులు ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఎంచుకున్నాయి. ఇది కూడా బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు ఇబ్బందికర పరిణామంగా మారుతోందని భావిస్తున్నారు.

10:56 - February 23, 2017

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. విజయవాడ, గుంటూరు మధ్యలోఉన్న తాడేపల్లిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన జగన్‌... స్థలాన్నికూడా ఓకే చేశారని తెలుస్తోంది. పార్టీ కార్యాలయం తాడేపల్లికి వచ్చాక అమరావతి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు సాగించాలని జగన్‌ చూస్తున్నారు.. ఆలోగా తన నివాసాన్ని రాజధానికి మార్చాలన్న ఆలోచనలో ఉన్నారు.. విజయవాడలోగానీ... అక్కడికి దగ్గర్లోగానీ ఇల్లు తీసుకోవాలని జగన్‌ భావిస్తున్నారు.. రాజధానిలో ఉంటే నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతోపాటు.. ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేయొచ్చని జగన్‌ యోచిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం..
సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమేఉంది.. వైసీపీకి ఈ సమయం చాలా విలువైంది.. సొంత రాష్ట్రంలో కార్యకలాపాలద్వారా ప్రజల్లోకి మరింత వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది... పైగా పక్క రాష్ట్రంలో ఉంటూ ఏపీ సమస్యలపై మాట్లాడే హక్కులేదన్న టీడీపీకీ చెక్‌ పెట్టొచ్చు.. ఇలా అన్నిరకాలుగా ఆలోచించిన జగన్‌... తన పార్టీ కార్యాలయాన్ని రాజధానికి మార్చాలన్న నిర్ణయానికొచ్చారు.

మార్చి 6నుంచి అమరావతిలో బడ్జెట్‌ సమావేశాలు..
మార్చి 6నుంచి అమరావతిలో బడ్జెట్‌ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈ సమావేశాలు ముగిశాక కార్యాలయం తరలింపుపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని జగన్‌ భావిస్తున్నారు.. ఆలోగా మిగతా పనులన్నీ పూర్తిచేయడంపై దృష్టిపెట్టారు.

10:53 - February 23, 2017

సూర్యాపేట : కేసీఆర్‌ పాలనలో ప్రజలకు కనీస విద్యా, వైద్య సౌకర్యాలు కూడా అందడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న కేసీఆర్‌ ఏం పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయినా.. రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నిరుద్యోగుల సమస్యలను గాలికొదిలేసిన కేసీఆర్‌ నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కును కూడా కేసీఆర్‌ ప్రభుత్వం కాలరాస్తుందని తమ్మినేని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా, వైద్య సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు కనీస సౌకర్యాలు కూడా లభించడం లేదని తమ్మినేని అన్నారు. ప్రజల సొమ్మును దుబారాగా ఖర్చు చేస్తున్న కేసీఆర్‌ ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని తమ్మినేని ప్రశ్నించారు. తమ్మినేని యాత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలుకొలుపు యాత్ర అని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు సీపీఎం పార్టీ పూనుకోవడం అభినందనీయమని కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాగుండేలా.. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న సీపీఎంతో అన్ని పార్టీలు కలిసిరావాల్సిన అవసరం ఉందని పాదయాత్ర బృందం సభ్యుల జాన్‌వెస్లీ అన్నారు. జనాభాలో 93 శాతం ఉన్న బడుగు, బలహీన, ఎస్సీ,ఎస్టీ బీసీ వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే పాలకులుగా మారేందుకు కులాలకతీతంగా ఐక్యం కావాలని జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు.

129 రోజులు..పూర్తి..
ఎర్రజెండా చేతబట్టి..ప్రజలందిరినీ చైతన్యవంతం చేస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 129 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా పర్యటనను పూర్తి చేసుకుని సూర్యాపేట జిల్లాలోకి అడుగుపెట్టిన తమ్మినేని బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. 129వ రోజు నాయకన్‌గూడెం, మామిళ్లగూడెం, మోతే, ఉస్సేనబాద్‌, నర్సింహుల గూడెం, జగన్నాథపురం, రేపాల, విజయరాఘవపురం, కలకోవ గ్రామాల్లో పర్యటించింది. 129వ రోజు తమ్మినేని పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.

బాబు..కేసీఆర్ లపై రాఘవులు విమర్శలు..

విజయవాడ : ఆర్థిక అభివృద్ధి రేటు పేరిట సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. భూములు కోల్పోయిన రైతులతో భాగస్వామ్య సదస్సు జరపాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మం ప్రచారం పేరిట ప్రైవేటు ట్రస్టుకు ఏటా కోట్లాది నిధులు మంజూరు చేయడం దారుణమన్నారు. సంబంధిత జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం దొంగ ఓట్లు చేరిపించడం దారుణమని, శ్రీవారికి మొక్కులు తీర్చుకున్న కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని విమర్శించారు.

రాష్ట్రపతిని కలువనున్న స్టాలిన్..

చెన్నై : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కలువనున్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, విశ్వాస బలపరీక్ష అంశాలను రాష్ట్రపతి దృష్టికి తేనున్నారు.

బీఎంసీ పోల్స్ కౌంటింగ్..

ముంబై : బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 200 మరియు 202 వార్డులో శివసేన ఆధిక్యంలో కొనసాగుతుండగా 218 వార్డులో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది.

టెస్టు మొదలైంది..

పూణె : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టింది. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ 7, మ్యాట్ రెన్షా 12 ఆడుతున్నారు.

10:26 - February 23, 2017

గాల్లో దీపం ఎప్పుడారుతుందో ఎవరికి తెలుసు.. ఏ క్షణమైనా టప్పున ఆరిపోవచ్చు. పరిశ్రమల్లో కార్మికుడి ప్రాణం కూడా అంతే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు.. ఎటునుంచి ఏ మంటలు మింగుతాయో.. ఏ రసాయనం బతుకును కాలుస్తుందో ఊహించలేని దీనస్థితి. నిరంతరం అత్యంత అభద్ర పూరిత వాతావరణంలో ఏటా వేలాది కార్మికుల బతుకులు తెల్లారిపోతున్నాయి. సేఫ్టీని పట్టించుకోని యాజమాన్యాలు, చర్చలు తీసుకోని సర్కారీ యంత్రాంగం వెలసి కార్మికుడి ప్రాణాలకు ఏ విలువలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై ప్రత్యేక కథనం.. దేశాన్ని నడిపే సజీవ యంత్రం కార్మికుడు. తన రక్తాన్ని స్వేదంగా మార్చి నిత్యం దేశాన్ని ప్రగతి పధంలో నడిపిస్తున్న కార్మికుడి జీవితానికి ఎలాంటి గ్యారంటీ లేని పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉద్యోగానికి సేఫ్టీలేదు. ఇటు ప్రాణానికి అంతకంటే లేదు. రాజేంద్రనగర్ లో జరిగిన తాజా ఘటన ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది.

రెక్కాడితే డొక్కాడని బతుకులను చిదిమేస్తున్నదెవరు? ఎవర్ని ప్రశ్నించాలి?
అది ఎయిర్ కూలర్ల ఫ్యాక్టరీ..ఎండవేడి నుంచి ఉపశమనాన్ని అందించే యంత్రాలు తయారవుతున్నాయి. కానీ, అదే ఫ్యాక్టరీ కొందరి బతుకులను బుగ్గిపాలు చేసింది. మంటల్లో నిలువునా తగులబెట్టింది.. తెల్లవారుఝామున జరిగిన ప్రమాదం వాళ్లబతుకులను చీకటి పాల్జేసింది. ఎవర్ని బాధ్యులను చేయాలి? కార్మికుల భద్రతను గాలికొదిలేస్తున్నది సర్కరీ వైఫల్యమా లేక యాజమాన్యాల నిర్లక్ష్యమా? పరిశ్రమల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతతో కార్మికుల ప్రాణాలు బుగ్గిపాలవుతున్నాయి. అనుమతులు లేకుండా ఏండ్ల తరబడి యాజమాన్యాలు పరిశ్రమలను నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

పరిస్థితిలో మార్పు వచ్చేదెన్నడూ..
యజమానులు రాజకీయ నాయకుల అండతో, అవినీతి అధికారుల తోడ్పాటుతో ఇష్టా రాజ్యంగా కంపెనీలు కొనసాగి స్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కార్మికుడి సంక్షేమం పట్టని దేశం అభివృద్ధి పథంలో నడవ లేదు. ఎందుకంటే తమ రక్తాన్ని ధారపోసి ఈ ప్రపంచాన్ని నిర్మించుకుంటున్న కార్మికుడి భద్రతను పట్టించుకోని సమాజాలు ఏ మాత్రం ముందడుగు వేయలేవు. కానీ, దురదృష్టవశాత్తూ ఇప్పుడు కార్మికుడు తన ఉద్యోగ భద్రత కోసం, ప్రాణ రక్షణ కోసం పోరాడాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చిన నాడే నిజమైన అభివృద్ధి జరిగినట్టవుతుంది. పూర్తి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

10:21 - February 23, 2017

నాగుపాము తల్కాయల నాగమణి అనే రాళ్లుంటయా..? ఆ రాళ్లను చేతి ఉంగురంల వెట్టుకుంటే పాములు గర్వయా..? మస్తు సంపదొస్తదా..? మనం అప్పుడప్పుడు ఈ రాళ్లను అమ్మెటోళ్లను జూశ్నంగదా..? నిజంగ నాగుపాముల కంట్ల పక్కకు ఉండేటియి రాళ్లా..? రత్నాలా..? చింతగింజలా...? ఇంతకు ఇదంత నిజమేనా అనేది తెలుసుకోవాంటే వీడియో క్లిక్ చేయండి.

10:18 - February 23, 2017

ఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ నాలుగో దశ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. 7గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లో 1.8 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12 జిల్లాల్లో 10 జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 1989 నుండి రాయ్ బరేలి జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. కానీ ఈ ఎన్నికల్లో సోనియా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అలహాబాద్ వెస్ట్ నుండి బీజేపీ సుజాత సింగ్ పోటీ చేస్తున్నారు.
యూపీలో 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 53 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 12 జిల్లాలో ఈ పోలింగ్ ప్రారంభమైంది. అలహాబాద్, ప్రతాప్ గడ్, కౌశంబి, జలౌన్, ఝాన్సీ, లలితపూర్, మహోబా, బందా, రాయ్ బరేలి, హమిర్ పూర్, చిత్రకూట్, ఫతేపూర్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాయిబరేలీ, అలహాబాద్ వంటి స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 24, బీఎస్పీ 15, బీజేపీ 5, కాంగ్రెస్ 6, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. తామంటే తామే గెలుస్తామని ఆయా పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

10:10 - February 23, 2017

తూర్పుగోదావరి : దివీస్ లో మరలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్ ల్యాబ్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ గతకొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి సీపీఎం వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలుకుతూ పోరాటాలు చేస్తున్నారు. 34 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనితో స్టేటస్ కో ఆర్డర్ ను పునరావృతం చేసింది. కానీ కంపెనీ యాజమాన్యం మాత్రం ప్రహారీ గోడ నిర్మాణ పనులు చేపడుతోందని రైతులు పేర్కొంటున్నారు. పోలీసుల సహకారం..అధికారుల అండదండలతో ప్రహారీ గోడను నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తున్నారు. రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాణాలను తొలగిస్తామని దివీస్ వ్యతిరేక పోరాట సమితి నేతలు తేల్చిచెప్పారు. వీరిని అడ్డుకోవడానికి ఏకంగా 800 మంది పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం బాగా లేకపోవడంతో దివీస్ వ్యతిరేక పోరాట సమితి నేత ముసలయ్య గురువారం ఉదయం వైద్యుడి దగ్గరకు ప్రయాణమయ్యాడు. కానీ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుండడంతో తొండంగిలో 144 సెక్షన్ అమలు చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

10:08 - February 23, 2017

వివిధ వృత్తుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వివిధ వృత్తులవారితో సమావేశమవుతున్నారు. చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఎంబిసిలు ఇలా వివిధ వర్గాలతో సమావేశమవుతున్న సిఎం కెసిఆర్ కొత్త ఆలోచనలు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయం తర్వాత ఎక్కువ శాతం మందికి ఉపాధి చూపిస్తున్న చేనేతరంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా వున్నాయి? ముఖ్యమంత్రి కెసిఆర్ చెబుతున్నప్పటికీ సిరిసిల్ల కార్మికులకు 15వేల రూపాయల వేతనం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే వ్యవహారమేనా? అది సాధ్యం కావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆప్కో మాజీ చైర్మన్ జగన్నాధరావు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం నేత రమేష్ లు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

09:58 - February 23, 2017

అబ్బా తెలంగాణ రాష్ట్రంల పోలీసు స్టేషన్లన్ని ఇయ్యాళ కళకళలాడినయ్ పబ్లీకుతోని.. పోలీసోళ్లకు ఇయ్యాల చేతినిండ పని దొర్కింది.. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు గాదని ఎవ్వలన్నరు చెప్పుండ్రి..?నాగుపాము తల్కాయల నాగమణి అనే రాళ్లుంటయా..? ఆడోళ్లకు కోపమొస్తె ఆపుడు కష్టం సుమా..? మరి ఆడోళ్లకు కోపాలు ఏడొస్తయ్.. రోడ్ల పొంట పెట్రోల్ బంకులు జూశ్నంగని.. నీళ్ల బంకులను జూశిండ్రా..? ఒక్క ఆవేశం గుమ్మడికాయ రూపంల ఉర్కింది.. ఒక్క ఆక్రోశం గుండెపోటుకు కారణమైంది.. ఎవ్వలన్న ఆడోళ్లను ఏడిపిస్తె ఆడనే ఉన్న పోలీసోళ్లు ఏం జెయ్యాలే..? మరి ఏడిపిచ్చినోడే పోలీసోడైతె ఏం జెయ్యాలే..? గింత పొడ్గు మన్షిని జూశిండ్రా..? జర్రంతల అంటే ఒక్క ఈంచులనే ప్రపంచంల అందరి కంటె పొడ్గు ఉన్న మన్షిగ రికార్డు మిస్సైన మన శ్రీకాకుళం బిడ్డ..గిసొంటి ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

09:38 - February 23, 2017

ఎండకాలం వచ్చేస్తోంది. శివరాత్రికి చలి..శివ..శివ..అంటూ వెళ్లిపోతుందని పెద్దలు పేర్కొంటారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికం కావడంతో చాలా మంది డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. చాలా మంది చల్లగా ఉండటానికని మార్కెట్లో దొరికే శీతలపానీయాలు సేవిస్తుంటారు. కానీ ప్రకృతి నుండి లభించిన 'కొబ్బరి బొండాం' అయితే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. ఈ కొబ్బరి బొండాం సేవించడం వల్ల పలు ప్రయోజనాలు దాగున్నాయి.

 • కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
 • చర్మంపై ముడతలు తగ్గిపోతాయి. గర్భిణీలకు కొబ్బరి బొండాం నీళ్లు ఎంతో మంచిది.
 • డీ హైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గించుకోవచ్చు.
 • నిత్యం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
 • టాక్సిన్స్ తొలగడమే కాకుండా కిడ్నీల్లో రాళ్లు కూడా క్రమేపీ తగ్గుతాయి.
 • కొబ్బరి బొండాం తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 • శరీరంలోని బ్యాక్టీరీయాను బయటకు పంపి యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి తొడ్పడుతుంది.
 • శీతాకాలంలో కూడా కొబ్బరి బొండాం సేవించవచ్చు. జలుబు రాకుండా ఉంటుంది.
 • వారం రోజుల పాటు కొబ్బరి బొండాం నీళ్లు తీసుకుంటే ముందులేని ఉత్సాహం వస్తుంది.
 • తెల్లవారుజామున పరగడుపున కొబ్బరి బొండాం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
 • కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండాలంటే రోజూ ఓ కొబ్బరి బొండాంను తీసుకోవడం మంచిది.
09:31 - February 23, 2017

ఢిల్లీ : సంఘం విహార్‌ పరిధిలోని ఎస్బీఐ ఎటిఎం నుంచి నకిలీ నోట్లు రావడంతో ఓ యువకుడు బిత్తరపోయాడు. ఆ యువకుడు ఎటిఎం నుంచి 8 వేలు విత్‌ డ్రా చేయగా 2 వేల ఫేక్‌ నోట్లు వచ్చాయి. అచ్చం కొత్త 2 వేల నోట్ల మాదిరిగానే ఉన్నప్పటికీ దానిపై 'రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' అని ఉండాల్సిన చోట 'చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' అని ముద్రించి ఉన్నాయి. వెంటనే ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 6న జరిగిన ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఒరిజినల్‌ నోటుపై ఎలాంటి అక్షరాలను ఉపయోగించారో అచ్చం అలాంటివే దొంగనోట్ల ముద్రణకు వాడారని, వాటర్‌ మార్క్‌ వద్ద చురాన్‌ పట్టి అని రాసి ఉందని, మిగితా అన్ని అంశాలు కూడా ఆర్బీఐ మాదిరిగానే ముద్రించారని ఆ యువకుడు తెలిపాడు.

09:23 - February 23, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీ అసెంబ్లీ తరలింపు తుదిదశకు చేరుకుంటోంది. బడ్జెట్‌ సమావేశాల ముహూర్తం దగ్గరపడుతుండటంతో వారంలోపు ఉద్యోగులంతా ఏపీకి రావాలని స్పీకర్‌ ఆదేశించారు. దీంతో అసెంబ్లీ ఉద్యోగుల అమరావతి బాట పడుతున్నారు. పరిపాలన తరలింపులో ఏపీ సర్కార్‌ కీలక ఘట్టానికి చేరుకుంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నుంచి సచివాలయం సహా కొన్ని కీలక ప్రభుత్వ శాఖలను అమరావతికి తరలించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు అసెంబ్లీని కూడా తరలించేందుకు సిద్దమైంది. అసెంబ్లీ సచివాలయ సిబ్బంది అమరావతికి తరలి రావాలంటూ అసెంబ్లీ కార్యదర్శి సర్క్యులర్‌ జారీ చేశారు. వచ్చేనెల 6నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 25 నాటికి అసెంబ్లీ అడ్మినిస్ట్రేషన్‌ మొత్తం అమరావతికి వచ్చేయాలని స్పీకర్‌ ఆదేశించారు. దీంతో అసెంబ్లీ ఉద్యోగులు అమరావతి బాట పట్టారు. టీడీఎల్పీ కార్యాలయం, ముఖ్యమంత్రి చాంబర్‌ సైతం అమరావతికి తరలివెళ్లాయి.

సొంత రాష్ట్రంలోనే జరుగనున్న బడ్జెట్‌ సమావేశాలు..
హైదరాబాద్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగాయి. నిబంధనల ప్రకారం ఈ ఏడాది మార్చిలోపు ఏపీ అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈలోగా సొంత రాష్ట్రంలోనే సమావేశాలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనాల పక్కనే 6వ బ్లాక్‌ను తాత్కాలిక అసెంబ్లీ భవనాల కోసం ఏర్పాటు చేసుకుంటోంది. ఇప్పటికే అసెంబ్లీ భవనాల నిర్మాణాల పనులు ఓ కొలిక్కి వచ్చాయి. బడ్జెట్‌ సమావేశాలను పూర్తిస్థాయిలో వెలగపూడిలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వంతో స్పీకర్‌ చర్చలు..
అసెంబ్లీ తరలింపుకు ఆటంకంగా ఉన్న విభజన సమస్యలను కూడా ఏపీ ప్రభుత్వం పరిష్కరించుకుంది. అసెంబ్లీ ఉద్యోగుల విభజనపై స్పీకర్‌ దృష్టి సారించారు. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉద్యోగుల విభజన పూర్తి చేశారు. దీంతో 120 మంది అసెంబ్లీ ఉద్యోగుల తరలింపు లాంచనం అయ్యింది. వారం రోజుల నుంచి ఉద్యోగులు తరలి వెళ్తున్నారు. ఈ నెల మూడో వారంలోగా అసెంబ్లీ కార్యాలయం తరలించాలని మొదట సర్క్యులర్‌ జారీ అయ్యింది. అయితే వెలగపూడిలో నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో తరలింపు జాప్యం అయ్యింది. ప్రస్తుతం అసెంబ్లీ భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈనెల 25 నాటికి తరలింపు పూర్తి చేయాలని స్పీకర్‌ నిర్ణయించారు. దీంతో అసెంబ్లీ ఉద్యోగులు అమరావతికి తరలివెళ్తున్నారు.

అరెస్టుల పర్వంపై చర్చిస్తాం..

హైదరాబాద్ : టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీపై పోలీసుల అరెస్టులపై చర్చిస్తామని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. కాసేపట్లో టీజేఏసీ భేటీ కానుంది. ఈ సందర్భంగా కోదండరాం టెన్ టివితో మాట్లాడారు. అరెస్టులకు జరిగిన సమాచారాన్ని క్రోడీకరించాల్సి ఉందని, ఇంకా విడుదల కాని వారి గురించి..కేసుల విషయంలో తక్షణం ఆలోచించాల్సి ఉందన్నారు. నిరుద్యోగ ర్యాలీపై సమీక్ష..లోటుపాట్లపై చర్చిస్తామన్నారు. ఉద్యోగ సమస్య ఏజెండా మీదకు తేగలిగామని, అనంతరం కార్యచరణపై చర్చించుకుంటామన్నారు.

09:13 - February 23, 2017

హైదరాబాద్ : టీజేఏసీ భేటీ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రొ.కోదండరాం నివాసంలో సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరయ్యేందుకు టీజేఏసీ నేతలు కోదండరాం నివాసానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో ప్రొ.కోదండరాం మాట్లాడారు. తొలుత అరెస్టులకు జరిగిన సమాచారాన్ని క్రోడీకరించాల్సి ఉందని, ఇంకా విడుదల కాని వారి గురించి..కేసుల విషయంలో తక్షణం ఆలోచించాల్సి ఉందన్నారు. నిరుద్యోగ ర్యాలీపై సమీక్ష..లోటుపాట్లపై చర్చిస్తామన్నారు. ఉద్యోగ సమస్య ఏజెండా మీదకు తేగలిగామని, అనంతరం కార్యచరణపై చర్చించుకుంటామన్నారు. నిరుద్యోగ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు సత్యంగౌడ్ వెల్లడించారు. ర్యాలీలో జరిగిన పరిణామాలు, ప్రొ.కోదండరాం అక్రమ అరెస్టుపై కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

09:05 - February 23, 2017

సూర్యాపేటలో సీపీఎం మహాజన పాదయాత్ర..

సూర్యాపేట : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగనుంది. నారాయణగూడెం, మునగాల, భరాఖత్ గూడెం, నడిగూడెం, ఆకుపాముల, కోదాడలో సీపీఎం బృందం పర్యటించనుంది.

షోపియాన్ లో ఉగ్రవాదుల కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : షోపియాన్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో మహిళ మృతి చెందగా ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి.

09:01 - February 23, 2017

హైదరాబాద్ : టీజేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఏంటీ ? రానున్న రోజుల్లో ఎలాంటి కార్యచరణ రూపొందించాలనే దానిపై టీజేఏసీ దృష్టి సారించింది. టీజేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపడం..ప్రొ.కోదండరాంను అరెస్టు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కోదండరాం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గురువారం నాడు టీజేఏసీ భేటీ జరుగుతుందని, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. దీనితో టీజేఏసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 9.30గంటలకు టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈసమావేశానికి జేఏసీ నేతలందరూ హాజరు కానున్నారు. భేటీ అనంతరం ప్రొ.కోదండరాం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

 

09:00 - February 23, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని 53 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను సరి చేసిన అనంతరం పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 1.84 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు 19, 487 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 680 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 61 మంది మహిళలున్నారు.
2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఋందేల్ ఖండ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీ 24 సీట్లు గెలుచుకుంది. ప్రతిపక్ష బీఎస్పీ 15, కాంగ్రెస్ 6, బీజేపీ 5 సీట్లు గెలుచుకుంది. నాలుగో దశ జరుగుతున్న నియోజకవర్గాల్లో అలాహాబాద్, లలిత్ పూర్ వంటి కీలకస్థానాలున్నాయి.

08:58 - February 23, 2017

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత జవాన్ల లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నార. తాజాగా దక్షిణ కాశ్మీర్ లోని షోపియాన్ లో జవాన్లపై దాడులకు తెగబడ్డారు. కాశ్మీర్..జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలైన ఉగ్రవాద కదలికలు పెరిగిన నేపథ్యంలో బీఎస్ఎఫ్ రోజు వారిలాగానే కాన్వాయ్ నిర్వహిస్తోంది. ఈ సమయంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా, స్థానికంగా ఉన్న మహిళ మృతి చెందింది. ఘటన జరిగిన అనంతరం భద్రతా బలగాలు విస్తృత గాలింపులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలుస్తోంది.

 

08:56 - February 23, 2017

నిరుద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వకపోగా.. టీ-జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను అరెస్ట్‌ చేయడం దారుణమని పలువురు నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యను ఖండించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నియంతృత్వాన్ని తలపిస్తోందని, ఇప్పటికైనా కేసీఆర్‌ కళ్లుతెరిచి వాస్తవాలను గ్రహించాలని సూచిస్తున్నారు. నిరుద్యోగుల వెతల్ని అర్థం చేసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాంచంద్రారెడ్డి (టి.కాంగ్రెస్), నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు), మన్నె గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్), సుధాకర్ రెడ్డి (మండలి చీప్ విప్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

07:59 - February 23, 2017

ఢిల్లీ : ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ మరింత ప్రమాదకరంగా తయారవుతోందా... ? సరికొత్త టెక్నాలజీ మానవ రహిత డ్రోన్‌ బాంబులతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఐసిస్ ఆధునిక టెక్నాలజీ సామాన్య ప్రజానికానికి పెను ముప్పేనని అమెరికా ఆందోళన చెందుతోంది. ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలను ఉపయోగించడంపై అమెరికా కలవరపడుతోంది. గత కొద్దివారాలుగా ఇరాక్‌లోని మోసూల్‌లో అమెరికా దళాలపై ఐసిస్‌ డ్రోన్స్‌ బాంబులతో దాడులు చేసింది. ఐసిస్‌ దెబ్బతో అమెరికా-ఇరాకీ సంయుక్త ఆర్మీ దళాలు నిర్ఘాంతపోయాయి.డ్రోన్‌ దాడుల కోసం మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ ముజాహిదిన్‌ పేరిట ఐసిస్‌ ఓ సంస్థను నెలకొల్పింది. ఈ సంస్థ ఇరాక్‌ దాని మిత్రదేశాల ఆర్మీ లక్ష్యంగా పనిచేస్తోంది. డ్రోన్స్‌ బాంబుల ద్వారా వారంలోనే 39 మంది ఇరాకీ సైనికులను చంపినట్లు ఐసిస్‌ ప్రకటించింది. శత్రువులను దెబ్బతీసేందుకు ఇదో కొత్త ఆయుధమని ఐఎస్‌ అధికారిక న్యూజ్‌ లెటర్ అల్‌నాబా తెలిపింది.

అమెరికాకు భయం..
ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ డ్రోన్‌ బాంబులను వినియోగిస్తున్నట్లు అమెరికా ధృవీకరించింది. ఐసిస్‌ డ్రోన్‌ దాడులు సామాన్య ప్రజల పాలిట పెను ముప్పుగా మారనుందని తెలిపింది. డ్రోన్‌ దాడుల కారణంగా యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డ్రోన్స్‌ బాంబులతో అప్రమత్తంగా ఉండాలని అమెరికా-ఇరాక్‌ సైనిక దళాలను హెచ్చరించింది. ఐసిస్‌ ఉపయోగిస్తున్న డ్రోన్స్‌ బాంబుల వల్ల అంతగా భయపడాల్సిన పనిలేదని.... ఇవి చాలా చిన్నడ్రోన్లని చిన్న చిన్న బాంబులు, రాకెట్లను మాత్రమే మోసుకెళ్ల గలుగుతుందని అమెరికా పేర్కొంది. అయితే జనం గుంపులుగా ఉన్న చోట్ల ఈ బాంబు పడితే మాత్రం ప్రమాదమేనని, అధిక సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని అమెరికా చెబుతోంది.

07:29 - February 23, 2017

ఢిల్లీ : కొత్తగా వెయ్యి రూపాయల నోటు తీసుకొచ్చే ఆలోచన ఏదీ లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం 5 వందల నోట్ల ముద్రణపైనే దృష్టి పెట్టామని, వీటినే అత్యధికంగా ముద్రిస్తామని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. దీంతో కొత్త వెయ్యి రూపాయల నోటు వస్తుందన్న అపోహలకు తెరదించినట్లయింది. ఎటిఎంలలో డబ్బులను అవసరం మేరకే విత్‌డ్రా చేయాలని ప్రజలకు శక్తికాంతదాస్‌ సూచించారు. మోది ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌8న పాత 5 వందలు, వెయ్యి నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటి స్థానంలో కొత్త 5 వందలు, 2 వేల నోట్లను అమలులోకి తెచ్చింది.

07:16 - February 23, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తోంది ప్రభుత్వం. కేరళ ప్రభుత్వంతో కలిసి హెరిటేజ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి - సంప్రదాయాలను తెలుసుకోవడం, మన సంస్కృతిని ఇతరులకు అందించడమే లక్ష్యంగా హెరిటేజ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. ఇప్పటికే హర్యానా, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాలతో కలిపి పలు కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు కేరళ రాష్ట్రంతో కలిసి సంయుక్తంగా హెరిటేజ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. ఈనెల 25 నుంచి 27 వరకు ఈ ఫెస్టివల్‌ జరుగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి చందూలాల్‌ సచివాలయంలో ఆవిష్కరించారు. బ్రోచర్‌ రిలీజ్‌లో కేరళకు చెందిన పలువురు మంత్రులు పాల్గొన్నారు.

లలిత కళాతోరణంలో హెరిటేజ్‌ ఫెస్టివల్‌..
హెరిటేజ్‌ ఫెస్టివల్‌కు హైదరాబాద్‌లోని లలిత కళాతోరణం వేదిక కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వం పూర్తి చేసింది. తెలుగు గడ్డపై తొలిసారి తమ సంస్కృతిని ప్రదర్శించేందుకు కేరళ ప్రభుత్వం కూడా సంసిద్దమైంది. ఈ ఫెస్టివల్‌తో కేరళ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. హెరిటేజ్‌ ఫెస్ట్‌లో భాగంగా ఇప్పటికే కేరళ రాష్ట్రంలో తెలంగాణ టూరిజంశాఖ పలుచోట్ల రోడ్‌షోలు నిర్వహించింది. హైదరాబాద్‌లో జరుగున్న ఫెస్టివల్‌లో తెలంగాణ, కేరళకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నారు. క్విజ్‌ పోటీలు, ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. 

07:13 - February 23, 2017

ముంబై : 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ముంబైలో నిర్వహిస్తున్న ప్యూచర్ డీకోడెడ్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. ఏపీ విద్యార్థుల్లో నైపుణ్యం పెంపు, ఉపాధి కల్పనపై చర్చించారు. అలాగే ఎస్ బ్యాంక్ ఛైర్మన్ రాణాకపూర్‌ను చంద్రబాబు కలిసి అమరావతిలో ఇన్నోవేటివ్ ఫిట్‌నెస్ పార్క్, టూరిజంపై చర్చించారు. 

07:09 - February 23, 2017

విజయవాడ : ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని వైసీపీ అధినేత జగన్‌ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. వచ్చే బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలన్నారు.. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.. రెండున్నరేళ్లుగా తాము ఈ విషయాన్ని గుర్తుచేస్తూనే ఉన్నామన్నారు... ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేశారని జగన్‌ ఆరోపించారు... జాబు రావాలంటే బాబు రావాలంటూ ఊదరగొట్టారని విమర్శించారు.. నిరుద్యోగులు ఇచ్చిన హామీని మళ్లీ గుర్తుచేస్తే సర్కారునుంచి స్పందన వస్తుందేమోనని ఈ లేఖ రాస్తున్నట్లు జగన్‌ వివరించారు.

రాష్ట్రంలో కోటి 75లక్షల మంది నిరుద్యోగులు..
2017-18 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని జగన్‌ తన లేఖలో డిమాండ్ చేశారు.. ఇచ్చిన వాగ్దానం ప్రకారం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకూ 33 నెలల కాలానికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని సూచించారు.. నెలకు 2వేల చొప్పున ఒక్కో కుటుంబానికి 66వేల రూపాయలు చెల్లించాలన్నారు.. రాష్ట్రంలో కోటి 75లక్షలమంది నిరుద్యోగులున్నారని.... వీరికి లక్షా 15వేల కోట్ల రూపాయల్ని నిరుద్యోగభృతి కింద ఇవ్వాల్సిఉందని గుర్తుచేశారు.. ఈ డబ్బును చెల్లించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకుముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు భృతి చెల్లించాలని... లేకపోతే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని జగన్‌ హెచ్చరించారు.

07:06 - February 23, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెంది దేశంలోనే అగ్ర రాష్ట్రాలుగా పేరు తెచ్చుకునే దీవించాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే తిరుమలకు వచ్చి ముడుపులు చెల్లిస్తానని మొక్కుకున్న కేసీఆర్‌.. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుడికి 5 కోట్ల రూపాయల విలువైన సాలగ్రమహారం, మకరకంఠిలను మొక్కుగా సమర్పించుకున్నారు. ఈ భారీ కానుకలను సీఎం కేసీఆర్‌ టీటీడీకి అందజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ముడుపు చెల్లిస్తానని మొక్కుకున్న కేసీఆర్‌.. శ్రీనివాసుడికి భారీ కానుకలను సమర్పించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన తెలంగాణ సీఎంకు శ్రీవారి మహాద్వారం వద్ద ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉదయం సతీమేతంగా కేసీఆర్‌ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు సంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుచానూరు చేరుకున్న కేసీఆర్‌.. పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకను కానుకగా ఇచ్చారు. సీఎం వెంట ఆయన కుటుంబ సభ్యులు, స్పీకర్, మంత్రులు ఉన్నారు.

ప్రజలు సంతోషంగా ఉండాలన్న కేసీఆర్..
2010లో శ్రీవారికి మొక్కుకున్న కేసీఆర్.. తన మొక్కు తీర్చుకున్నారు. శ్రీవారికి 3 కోట్ల విలువైన 14.2 కిలోల సాలగ్రామహారం, కోటీ 21 లక్షల విలువైన 4.65 కిలోల మకరకంఠిలను ఆలయ ప్రధాన అర్చకులు, టీటీడీకి అందజేశారు. మొత్తం 5 కోట్ల 2 లక్షల విలువైన నగలకు ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్‌ దంపతులు.. శ్రీనివాసుడికి సమర్పించుకున్నారు. ఈ నగల్ని కోయంబత్తూరులో 19 కిలోల బంగారంతో చేయించారు. ఆభరణాల తయారీ బాధ్యతను తెలంగాణ సర్కార్‌ టీటీడీకి అప్పగించింది. కీర్తిలాల్‌కాళిదాస్‌ కంపెనీ ఈ టెండర్లు దక్కించుకుని ఆభరణాలు తయారు చేసింది. తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెంది దేశంలోనే అగ్ర రాష్ర్టాలుగా పేరు తెచ్చుకునేలా దీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు మొక్కు శ్రీవారికి చెల్లించుకున్నామన్న కేసీఆర్‌.. తమ కుటుంబ సభ్యులు, మంత్రులకు చక్కని దర్శనం లభించిందని తెలిపారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పిన సీఎం కేసీఆర్‌... త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

ఆధ్యాత్మికం ఎక్కువ..
తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కని మెట్లు లేవు.. మొక్కని దేవుడు లేడని సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ అనే వారు. అప్పుడు మొక్కిన మొక్కులకు ఒక్కొక్కటిగా కానుకలు సమర్పించుకుంటూ వస్తున్నారు. గతంలో భద్రకాళి అమ్మవారికి కిరీటం, ఖడ్గాన్ని సీఎం కేసీఆర్‌ సమర్పించారు. కురివి మల్లన్నకు కూడా మీసాలు సమర్పించుకున్నారు. అదే తరహాలో తిరుమల శ్రీవారికి భారీ కానుకలను సమర్పించుకొని మొక్కు తీర్చుకున్నారు. ఏది ఏమైనా ప్రతి పనికి ముందు వేద పండితుల నుంచి సలహాలు తీసుకునే కేసీఆర్‌కు దేశంలో ఉన్న అందరి సీఎంల కంటే ఆధ్యాత్మికత చాలా ఎక్కువ చెప్పవచ్చు.

07:02 - February 23, 2017

హైదరాబాద్ : నిరుద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వకపోగా.. టీ-జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను అరెస్ట్‌ చేయడం దారుణమని పలువురు నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యను ఖండించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నియంతృత్వాన్ని తలపిస్తోందని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్‌ కళ్లుతెరిచి వాస్తవాలను గ్రహించాలని, నిరుద్యోగుల వెతల్ని అర్థం చేసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగ ర్యాలీకి అనుమతి నిరాకరణ, టీ-జేఏసీ నేతలు, విద్యార్థుల అరెస్ట్‌లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను అర్ధరాత్రి అరెస్ట్‌ చేయడం ఏంటని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. కోదండరామ్‌తో సహా విద్యార్థులను అరెస్ట్‌ చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. తెలంగాణ వాదాన్ని తెలంగాణ వాదులే జైల్లో పెట్టారని, ఇది ప్రజాస్వామ్య తెలంగాణ కాదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు కావాల్సింది దొరల తెలంగాణ కాదని, బతుకు తెలంగాణ కావాలని తమ్మినేని అన్నారు.

కోదండరాం అరెస్టు..
కాంగ్రెస్‌ హయాంలో ఉద్యోగాల భర్తీకి సన్నద్దమవుతుంటే.. వాటిని మేమే భర్తీ చేస్తామని అప్పట్లో కేసీఆర్‌ అడ్డుపడ్డాడని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని టీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల పాలిట ఈ సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరి దారుణమని ఆయన అన్నారు. కోదండరామ్‌ను అరెస్ట్‌ చేసి ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, రాచరిక ప్రభుత్వం ఉందని కేసీఆర్‌ సర్కార్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుందని కాంగ్రెస్‌ నేత మల్లు రవి విమర్శించారు. కోదండరామ్‌ అరెస్ట్‌ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌.. ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. అంజన్‌కుమార్‌తో పాటు మరో పదిమంది కాంగ్రెస్‌ నాయకులు, ఇద్దరు ఆమ్‌ ఆద్మీ నేతలనూ అరెస్ట్‌ చేసి కంచన్‌బాగ్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిరుద్యోగ ర్యాలీకి అనుమతించకపోవడం టీఆర్‌ఎస్‌ నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఈ సందర్భంగా అంజన్‌కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేయడం సహేతుకమైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుద్యోగ సమస్యపై స్పందించాలని, వెంటనే ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని రావుల సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగుల తమ ఆకాంక్షలపై గొంతెత్తడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం కూడా నేరమా అని ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు కేసీఆర్‌ సర్కార్‌ను ప్రశ్నించారు. 

06:59 - February 23, 2017

హైదరాబాద్ : ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కోదండరామ్‌ వెనక కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ నేతలు ఉన్నారన్నారు. తమ హయాంలో ఉద్యోగాలు ఇవ్వని కాంగ్రెస్‌ నేతలు.. కోదండరామ్‌కు మద్దతిస్తున్నారని.. కానీ తాము మాత్రం ఖచ్చితంగా లక్షా 7 వేల ఉద్యోగాలు ఇస్తామని నాయిని స్పష్టం చేశారు. 

06:59 - February 23, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ ర్యాలీ నిర్బంధంపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. తమకు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో మీటింగ్‌కు అనుమతి ఇచ్చి ఉంటే ఇలాంటి పరిణామాలు జరిగేవీ కాదన్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. నిరుద్యోగుల సమస్యపై తమ కార్యాచరణ ఆగదని.. రేపు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరామ్‌ స్పష్టం చేశారు. 

06:57 - February 23, 2017

హైదరాబాద్ : నిర్బంధం...! స్వరాష్ట్రంలోనూ.. అందునా.. ఉద్యమకారులే పాలకులైన తెలంగాణలోనే.. అడుగడుగునా ఆంక్షల పర్వం..!! ఉద్యమ కాలపు బంగారు ముద్ద కోదండరామ్‌ కాస్తా.. ఇప్పుడు కానివాడయ్యారు. ప్రొఫెసర్‌ తలపెట్టిన కార్యక్రమానికి.. అడుగడుగునా అడ్డు తగిలారు. నిరుద్యోగుల సంగతేంటి అని ప్రశ్నించబోయిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను నిర్బంధించారు. ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచే అవకాశం ఉన్నా.. ఆచార్యుడి ఇంటి తలుపులు పగులగొట్టి మరీ అరెస్టు చేశారు. నిరుద్యోగుల ర్యాలీని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేందుకు తెగబడింది. కేసీఆర్‌ సర్కారు పోలీసు చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించేందుకు సిద్ధమైన తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు పలువురు ఐకాస నేతలు, కార్యకర్తలను కూడా అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని కామాటిపుర పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తరలించారు. తెల్లవారుజామున మూడున్నర గంటలకు వందలాదిగా తరలివచ్చిన పోలీసులు.. కోదండరామ్‌ ఇంటిని రౌండ్‌ చేసి.. ద్వారబంధాలు పగులగొట్టి.. బలవంతంగా లోనికి ప్రవేశించి, ఆచార్యుడిని అరెస్ట్‌ చేశారు.

సర్వత్రా విమర్శలు..
నిర్బంధంలోకి తీసుకున్న కోదండరామ్‌ను ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పకుండానే.. ఆయన్ను బలవంతంగా వాహనంలో తరలించుకు పోవడంతో సహచర జేఏసీ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆచూకీపై వెంటనే ప్రకటన చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. అనంతరం, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే, కోదండరామ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అరెస్ట్‌ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తార్నాకలోని ఆయన ఇంటి తలుపులను బద్దలు కొట్టి మరీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవడంపై జేఏసీ నేతలతో పాటు .. విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరామ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ భారీ సంఖ్యలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చారు. కోదండరామ్‌ను పరామర్శించేందుకు ప్రయత్నించిన జేఏసీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కఠిన చర్యలు..
నిరుద్యోగ ర్యాలీలో ఎవరు పాల్గొన్నా కఠిన చర్యలుంటాయని హెచ్చరించిన పోలీసులు.. కనపడ్డ ప్రతి ఒక్కరినీ అరెస్ట్‌ చేశారు. వ్యక్తిగత పనుల కోసం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరకు వచ్చిన జస్టిస్‌ చంద్రకుమార్‌ను కూడా పోలీసులు వదల్లేదు. ఆయన్ను బలవంతంగా తీసుకువెళ్లి పోలీసు వాహనం ఎక్కించేశారు. తనను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలంటూ జస్టిస్‌ చంద్రకుమార్‌ అడిగినా..పోలీసులు ఏమీ పట్టించుకోకుండా..ఆయన్ని బలవంతంగా తీసుకు వెళ్లారు. అయితే అరెస్ట్‌పై మండిపడ్డ జస్టిస్‌ చంద్రకుమార్‌..ఈ దేశంలో భావస్వేచ్చ కూడా లేదా అని పోలీసులను ప్రశ్నించారు.

పలువురి అరెస్టు..
నిరుద్యోగ ర్యాలీకి మద్దతు తెలిపేందుకు వచ్చిన పీవోడబ్ల్యూ నేత సంధ్యను పోలీసులు ఆర్డీసీ క్రాస్‌రోడ్డు వద్ద అరెస్టు చేశారు. మహిళ అని కూడా చూడకుండా సంధ్యను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దీంతో ఆర్టీసి క్రాస్‌రోడ్డు వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్‌..ఇప్పుడు మాట ఎందుకు మార్చారని సంధ్య ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇదే కేసీఆర్‌ మిలియన్‌ మార్చ్‌ పేరుతో ఆందోళన చేసిన విషయం గుర్తులేదా అని సంధ్య ప్రశ్నించారు. అరెస్టైన వారిలో మాజీ మంత్రి డాక్టర్‌ విజయరామారావు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు. కోదండరాంను అరెస్ట్ హేయమైన చర్య.. అప్రజాస్వామికం.. అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాపాలకులు పెట్టిన కేసులను జేఏసీ చైర్మన్‌ కోదండరాంపై టీఆర్‌ఎస్‌ అస్త్రాలుగా వాడుకోవడం దేనికి సంకేతమని టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మొత్తానికి..ఉద్యమ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినందుకు.. కేసీఆర్‌ తిరుమలేశునికి స్వర్ణాభరణాలు సమర్పించే వేళే, ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం గమనార్హం. 

నేడు యూపీలో నాలుగో దశ పోలింగ్..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 12 జిల్లాల్లో 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 680 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

గవర్నర్ ను కలువనున్న టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : ఉదయం 11గంటలకు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను టి.టిడిపి నేతలు కలువనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలయపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. 

వివిధ శాఖాధిపతులతో సీఎం బాబు భేటీ..

విజయవాడ : అమరావతిలో నేడు వివిధ శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. బడ్జెట్ లో కేటాయింపులు, కేంద్రం నుండి వచ్చే నిధులపై చర్చించనున్నారు. 

విద్యా సంస్థల బంద్ కు ఓయూ జేఏసీ పిలుపు...

హైదరాబాద్ : నేడు విద్యా సంస్థల బంద్ కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. టీజేఏసీ నిరుద్యోగ ర్యాలీపై ప్రభుత్వం...పోలీసులు వ్యవహరించిన తీరు..ప్రొ.కోదండరాం అరెస్టుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది. 

ఆస్ట్రేలియా - భారత్ మధ్య తొలి టెస్టు..

మహారాష్ట్ర : పూణేలో ఆస్ట్రేలియా - భారత్ జట్ల మద్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

కానగదూరు వద్ద రోడ్డు ప్రమాదం..

కడప : దువ్వూరు (మం) కానగదూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ను ఢీకొట్టి టాటా ఎస్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

తొండంగిలో 144 సెక్షన్..

తూర్పుగోదావరి : రైతుల భూముల్లో దివీస్ యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలు తొలగిస్తామని దివీస్ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. దీనితో తొండంగిలో 144 సెక్షన్ ను పోలీసులు విధించారు. 

Don't Miss