Activities calendar

04 March 2017

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదల అయింది. 10న ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  

 

ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్‌ మరో ఏడాది కొనసాగింపు

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్‌ను మరో ఏడాది కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇవాళ అమరావతిలో క్రమశిక్షణా సంఘం సమావేశమైంది.   రోజా రెండుసార్లు కమిటీ ముందు హాజరుకాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రోజా ఇచ్చిన వివరణ కూడా  సంతృప్తిగా లేదని   ప్రివిలేజ్‌ కమిటీ అభిప్రాయపడింది. ఎమ్మెల్యే అనితకు భేషరతుగా రోజా క్షమాపణ చెప్పలేదని కూడా కమిటీ సభ్యులు  భావించారు. దీంతో ఆమెపై సస్పెన్షన్‌ మరో ఏడాది పాటు కొనసాగించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నిర్ణయాన్ని ఈనెల 7న సభకు సిఫార్సు చేసే అవకాశం కనిపిస్తోంది. 

22:22 - March 4, 2017
22:20 - March 4, 2017
22:17 - March 4, 2017

బెంగళూర్‌ టెస్ట్‌ : తొలి రోజు ఆటలోనే టీమిండియా తేలిపోయింది. ఆస్ట్రేలియా ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభం నుంచే తడబడింది. అభినవ్‌ ముకుంద్‌ను డకౌట్‌ చేసి స్టార్క్‌ శుభారంభాన్నిచ్చాడు. ఆ తర్వాత నాథన్‌ లయోన్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. లయోన్‌ ధాటికి  పుజారా,కొహ్లీ,రహానే, అశ్విన్‌, సాహా, తక్కువ స్కోర్‌కే  ఔటయ్యారు. జడేజా,రాహుల్‌,ఇషాంత్‌ శర్మలను సైతం ఔట్‌ చేసిన లయోన్‌...టెస్టుల్లో కెరీర్‌ బెస్ట్‌ ఫెర్ఫామెన్స్‌ నమోదు చేశాడు. 
భారత బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెట్టిన లయోన్ 
పర్‌ఫెక్ట్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులేసి భారత బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెట్టాడు. టెస్టుల్లో 8వ సారి 5 వికెట్ల ఫీట్‌ రిపీట్‌ చేసిన లయోన్‌...ఆతిధ్య జట్టును కోలుకోనివ్వకుండా చేశాడు.50 పరుగులు మాత్రమే ఇచ్చిన లయోన్‌ 8 వికెట్లు పడగొట్టి భారత్‌ను 189 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 
రాహుల్‌ ఒంటరి పోరాటం 
భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా...యంగ్‌ గన్‌ రాహుల్‌ ఒంటరి పోరాటం చేశాడు.హోంగ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో  ఫైటింగ్‌ హాఫ్‌ సెంచరీతో భారత జట్టు పరువు కాపాడాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా...బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశాడు. 205 బంతుల్లో 90 పరుగులు చేసి..ఔటయ్యాడు. రాహుల్‌ ఫైటింగ్‌ హాఫ్‌ సెంచరీతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులైనా చేయగలిగింది. 
తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 40 పరుగులు 
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు ...తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. 
మొదటి రోజే మ్యాచ్‌పై ఆస్ట్రేలియా జట్టు పట్టు
టీమిండియా ఇలా తొలి ఇన్నింగ్స్‌లోనే తేలిపోవడంతో ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది. రెండో రోజు భారత స్పిన్నర్లు చెలరేగితేనే టీమిండియా, ఆస్ట్రేలియాకు కనీస పోటీ అయినా ఇవ్వగలుగుతుంది. 

 

22:12 - March 4, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. యూపీ ఆరో విడత ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 57 శాతం పోలింగ్‌ నమోదైంది. మణిపూర్‌లో తొలివిడత ఎన్నికల్లో 84 శాతం భారీగా పోలింగ్‌ నమోదైంది. యూపీలో ఏడు జిల్లాల్లోని 49 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 635 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటు ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లుండగా... తొలివిడతగా 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగింది. తొలిదశలో 168 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మణిపూర్‌లో సైనిక దళాల ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ఇరోమ్‌ షర్మిలా 20 ఏళ్ల తర్వాత ఖురై అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. 

 

22:10 - March 4, 2017

హైదరాబాద్ : ఖరీఫ్‌ సీజన్‌లో ఎస్సారెస్పీ స్టేజ్‌ -2 కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.  ఆయకట్టు కాలువలన్నీ  సిద్ధం చేయాలన్నారు.  జలసౌధలో ఎస్సారెస్పీ స్టేజ్‌-2 పనుల పురోగతిపై హరీశ్‌ సమీక్ష నిర్వహించారు. టార్గెట్‌ ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమర్ధవంతంగా పనిచేయని అధికారులను డిమోట్‌ చేస్తామని హెచ్చరించారు. ఇంజనీరింగ్‌ అధికారులు ఆఫీసులు విడిచిపెట్టి క్షేత్రస్థాయి పర్యటనలు జరపాలని సూచించారు. కాల్వల వెంట అధికారులు స్వయంగా తిరిగితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు.

 

22:06 - March 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటి అయ్యారు. దాదాపు రెండుగంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఈ నెల పది నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనతో పాటు అమెరికాలో తెలుగు వాళ్లపై జరగుతున్న దాడులు, రాష్ట్ర విభజనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 

 

22:05 - March 4, 2017

ఢిల్లీ : జులై ఫస్ట్‌ నుంచి జిఎస్‌టి అమలు కానుంది. ఈ మేరకు కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఓ అవగాహన కుదిరింది. జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ చట్టాలకు మెజార్టీ ఆమోదం లభించింది. ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 16 మరోసారి భేటీ కావాలని కౌన్సిల్‌ నిర్ణయించింది.
జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో పెద్ద ముందడుగు
జీఎస్టీ అమలులో భాగంగా నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో ఒక పెద్ద ముందడుగు పడింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్‌టి సమావేశంలో సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ చట్టాలకు మెజార్టీ ఆమోదం లభించింది. జులై ఫస్ట్‌ నుంచి అమలు కానున్న ఈ చట్టంపై కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఓ అవగాహన కుదిరింది. కానీ దీనికి తుది ఆమోదం మాత్రం మార్చి మధ్యలో రావచ్చని భావిస్తున్నారు.
జీఎస్టీ అమలు వల్ల అక్రమాలకు అడ్డుకట్ట : ఈటెల
జీఎస్టీ అమలు వల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్రాలు పూర్తి అవగాహనతో పనిచేస్తేనే జీఎస్టీతో సత్ఫలితాలు వస్తాయని తెలిపారు.. గ్రోత్‌ రేట్‌ 14శాతంకంటే తక్కువగాఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం జీఎస్ టీ నష్టపరిహారాన్ని ఇస్తుందన్నారు. 16కంటే ఎక్కువగా ఉన్న తెలంగాణకు నష్టపరిహారం వచ్చే అవకాశం లేదని ఈటెల తెలిపారు. టాక్స్‌ చెల్లింపులకు జీఎస్ టీ కొత్త విధానమని... దీనిపై డీలర్లకు అవగాహన కల్పిస్తామన్నారు.  
జీఎస్టీ బిల్లులో 26 మార్పులు 
ఇప్పటికే జీఎస్టీ బిల్లులో రాష్ట్రాలు సూచించిన 26 మార్పులను కేంద్రం చేసింది. రాష్ట్రాల మధ్య సరిహద్దులో చెక్‌పోస్టులను ఎత్తివేస్తారు. వాహనాలలోని సరుకుల తనిఖీలపై నియంత్రణ హక్కు రాష్ట్రాలకే ఉంటుంది. తీర ప్రాంతానికి 12 నాటికల్‌ మైళ్ల లోపు సరుకు రవాణా, చేపల వేటపై రాష్ట్రాలకే హక్కు ఉంటుంది. దాబాలు, చిన్న రెస్టారెంట్లకు మినహాయింపు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. వీటిపై కేవలం 5శాతం మాత్రమే పన్ను విధిస్తారు. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి..
జీఎస్టీపైనే చర్చ 
ఇవాళ్టి సమావేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేసే జీఎస్టీపైనే చర్చ జరిగింది. రాష్ట్రాలు అమలు చేసే జీఎస్టీపై చర్చ జరగలేదు. మిగిలిన విషయాలపై చర్చించేందుకు ఈ నెల 16 మరోసారి భేటీ కావాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది.

 

22:00 - March 4, 2017

వాట్సాప్ గ్రూప్ హ్యాంగవుట్, వీరేంద్రసెహ్వాగ్ ట్వీట్ ఇంటర్నెట్ లో కలకలం, హీరో ధనుష్ మా అట్బాయే అంటూ చెన్నైలో ఒక జంట కోర్టులో కేసు, ఆస్కార్ పండుగలో ఒక పెద్ద తప్పిదం... ఈ అంశాలపై ఇవాళ్టి క్రేజీ న్యూస్ ను వీడియోలో చూద్దాం... 

 

21:50 - March 4, 2017

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' టీమ్ తో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా హీరో రాజ్ తరుణ్, డైరెక్షర్ వంశీకృష్ణ, నటుడు సుదర్శన్ పాల్గొని, మాట్లాడారు. సినిమా విశేషాలను తెలిపారు. తన అనుభవాలను పంచుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

21:46 - March 4, 2017

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు. హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 3 నుంచి హెచ్‌1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ రద్దు అమల్లోకి రానుంది. అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాయని భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్ వెల్లడించారు.
హెచ్‌ 1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ తాత్కాలికంగా రద్దు 
హెచ్‌ 1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ రద్దు 6 నెలల పాటు ఉండే అవకాశముందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు అమల్లోకి రానుంది.
'ప్రీమియం ప్రాసెసింగ్‌'కు మాత్రమే తాత్కాలిక రద్దు 
పెండింగ్‌లో ఉన్న రెగ్యులర్‌ హెచ్‌ 1బీ వీసాల దరఖాస్తులను పరిష్కరించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఫీజుతో హెచ్ 1బీ వీసాల ప్రాసెస్‌ త్వరగా పూర్తిచేసుకునే 'ప్రీమియం ప్రాసెసింగ్‌'కు మాత్రమే ఈ తాత్కాలిక రద్దు వర్తిస్తుంది.  రెగ్యులర్‌ హెచ్‌-1బీ వీసాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది
తత్కాల్ విధానం లాంటిదే...
వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ అంటే ఒక విధంగా తత్కాల్ విధానం లాంటిది. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే వీసాను ఈ విధానంలో ప్రాసెస్ చేస్తారు. ఈ దరఖాస్తులకు అదనంగా 1225 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.  హెచ్-1బి వీసా దరఖాస్తులు అమెరికాలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. వీటిని క్లియర్ చేయడానికి కాన్సులేట్ అధికారులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రీమియం ప్రాసెసింగ్‌కు 15 రోజులు పడుతుంటే... రెగ్యులర్‌ హెచ్‌-1బీ వీసాల ప్రాసెసింగ్‌కు మూడు నెలలకు పైగా సమయం పడుతోంది. ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం ద్వారా పెండింగులో ఉన్న ఫైళ్లన్నింటినీ పరిష్కరిస్తారు. 
ట్రంప్‌ ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో ఇది ఒక భాగం.. 
హెచ్‌ 1బి వీసాల అంశంలో భారతీయ ఐటి కంపెనీలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో దీనికంత ప్రత్యేక ప్రాధాన్యత ఏమీలేదని....ట్రంప్‌ ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో ఇది  ఒక భాగమని అమెరికా  భరోసా ఇచ్చింది.  
భారత్‌తో సంబంధాల బలోపేతానికి అమెరికా ఆసక్తి : ఎస్.జయశంకర్  
భారత్‌, అమెరికా సంబంధాలపై ట్రంప్‌ యంత్రాంగం పాజిటివ్‌ దృక్పథంతో ఉందని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్‌.జయశంకర్‌ అన్నారు. భారత్‌తో సంబంధాల బలోపేతానికి అమెరికా ఆసక్తి కనబరుస్తోందని చెప్పారు.  అమెరికా విదేశాంగ మంత్రి టిలర్‌సన్‌, వాణిజ్యమంత్రి రాస్‌, హోంమంత్రి జాన్‌ కెల్లీ, అధికారులతో జయశంకర్‌ చర్చలు జరిపారు. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ప్రారంభమైన ఇండో-అమెరికా వ్యూహ్యాత్మక చర్చలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయని వెల్లడించారు.

 

21:41 - March 4, 2017

హైదరాబాద్ : అమెరికాలో జాత్యాంహకారుల దాడిలో చనిపోయిన శ్రీనివాస్‌  కూచిబొట్ల కుటుంబాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీనివాస్‌ మృతి బాధాకరమని.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీనివాస్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.  ప్రధానితో మాట్లాడి శ్రీనివాస్‌ కుటుంబానికి అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని తెలిపారు.  హత్యపై అమెరికా ప్రభుత్వం స్పందించేవరకు ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

 

21:39 - March 4, 2017

హైదరాబాద్ : అమరావతిలో శాసనసభ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. రోజాపై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై కమిటీ చర్చించింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. రోజా బేషరతుగా క్షమాపణ చెప్పలేదని కమిటీ సభ్యులు తెలిపారు. రోజా వివరణపై ప్రివిలేజ్‌ కమిటీ సంతృప్తి చెందలేదు. గతంలో రోజాను ఏడాదిపాటు శాసనసభ సస్పెండ్‌ చేసింది. రోజా సమాధానం సంతృప్తిగా లేనందున శాసనసభ నిర్ణయాన్ని పునరుద్ధరించాలని కమిటీ భావించింది. ఎమ్మెల్యే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్‌ చేయాలని కమిటీకి సిఫారసు చేసింది. ఈనెల 7న నివేదికను క్రమశిక్షణా కమిటీ శాసనసభకు సమర్పించనుంది.

 

21:32 - March 4, 2017

వాషింగ్టన్ : అమెరికాలో, భారతీయుల హత్యలు ఆగడం లేదు. శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్య నుంచి తేరుకోకముందే.. అక్కడ మరో భారతీయుడిని అక్కడి దుండగులు పొట్టనపెట్టుకున్నారు. సౌత్‌ కరోలినాలో భారత సంతతికి చెందిన హర్నీష్‌ పటేల్‌ అనే వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
వరుస దాడులు 
అమెరికాలో ఉద్యోగానికే కాదు.. ప్రాణాలకూ భద్రత లేదు. వరుస దాడులు భారతీయులను భయపెట్టిస్తున్నాయి. కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య జరిగిన పది రోజులు కూడా కాలేదు.. మరో భారతీయుడిని అమెరికాలోని దుండగులు పొట్టనపెట్టుకున్నారు. కరోలినా రాష్ట్రంలో హర్నీష్‌ పటేల్‌ అనే భారత సంతతి వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. హర్నీష్‌ పటేల్‌ పేజ్‌లాండ్‌ హైవేపై స్పీడ్‌మార్ట్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఇంటికి సమీపంలో పటేల్‌ మృతదేహం లభించిందని అమెరికా మీడియా పేర్కొంది. హర్నీష్‌ పటేల్‌ మృతిపై లాంచెస్టర్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 
పటేల్‌ హత్యపై స్థానికుల ఆగ్రహం
పటేల్‌ హత్య పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పటేల్‌ మంచి మనిషి అని కొనియాడుతున్నారు. హర్నీశ్‌ పటేల్‌కు భార్య, ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతున్న చిన్నారి ఉన్నారు. పటేల్‌ స్టోర్‌ ఎదుట స్థానికులు నివాళులర్పించారు. కేన్సస్‌లో జరిగిన తెలుగు ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్యను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించిన రెండ్రోజుల్లోనే మరో భారతీయుడు హత్యకు గురికావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ట్రంప్‌ కఠిన నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు 
ట్రంప్‌ కఠిన నిర్ణయాలతో భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా జరుగుతున్న జాత్యాంహకార దాడులతో భయాందోళనలకు గురవుతున్నారు. 

 

21:30 - March 4, 2017
21:26 - March 4, 2017
21:22 - March 4, 2017

హైదరాబాద్ : అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడినతీరును వైసీపీ నేత అంబటి రాంబాబు తప్పుబట్టారు.. భాషను కంట్రోల్‌ చేసుకోవాలని సూచించారు.. వర్ల రామయ్య కూడా తమ పార్టీ నేతల్ని రాక్షసులంటూ విమర్శించారని మండిపడ్డారు.. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబే ఇలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.. తమను ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఇష్టంవచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు..

21:20 - March 4, 2017

విజయవాడ : రద్దైన పాతనోట్లను కొత్తనోట్లతో మార్పిడికి పాల్పడుతున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలో 8మంది ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 55శాతం కమీషన్‌ తీసుకొని నోట్లమార్పిడి చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  నిందితుల నుంచి 7.23 లక్షల రద్దైన కరెన్సీ, 10 సెల్‌ఫోన్స్‌, ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

21:17 - March 4, 2017

పశ్చిమగోదావరి : అత్యవసర సేవలైన 100,108,104కు కాల్స్‌ చేస్తూ మహిళా సిబ్బందితో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడో ప్రబుద్దుడు. ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్‌ చేయొద్దని సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. 20 రోజుల్లో ఏకంగా 300 సార్లు కాల్స్‌చేసి మహిళా సిబ్బందిని ఇబ్బందిపెట్టిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగమురళిని విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాగమురళికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈమేరకు డీసీపీ పాల్‌రాజ్‌తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించారు. చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:10 - March 4, 2017

హైదరాబాద్ : ఈ ఏడాది చివ‌రినాటికి  హైదరాబాద్‌లో మెట్రోరైల్ ప‌రుగులు పెడుతుందని మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈమేరకు టెన్ టివి ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. నాగోల్ నుంచి హైటెక్ సిటి వ‌ర‌కు మియాపూర్ నుంచి ఎల్‌బిన‌గ‌ర్ వ‌ర‌కు పూర్తిస్థాయిలో మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మెట్రోమార్గంలో ఇప్పటి వ‌ర‌కు 3 ఆర్వోబిల‌ను పూర్తి చేశామ‌ని......, మిగిలిన ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయని తెలిపారు. 

 

21:05 - March 4, 2017

ఢిల్లీ : సిటిజన్‌ మార్చ్‌ ఆందోళనతో ఢిల్లీ దద్దరిల్లింది. విద్యార్థులు, విశ్వ విద్యాలయాలపై దాడులకు నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు మండిపౌస్‌ నుంచి పార్లమెంట్‌ వరకు సిటిజన్‌ మార్చ్‌ నిర్వహించాయి. సిటిజన్‌ మార్చ్‌కు మద్దతు తెలిపిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. విద్యార్థులు, యూనివర్సిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. కన్హయ్య కుమార్‌పై అన్యాయంగా దేశద్రోహం కేసు పెట్టారని.. అయినా రుజువుచేయలేకపోయారని ఆరోపించారు. దేశభక్తులెవరో, దేశద్రోహులెవరో బిజేపీ ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. దాడుల వెనక ఏబీవీపీ హస్తం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా ఆరోపించారు. 

 

21:02 - March 4, 2017

హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదు చోట్లే పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ముందుగా ఆరు స్థానాల్లో పోటీ చేయాలనుకున్న ఇప్పుడు ఐదింటికే పరిమితం కానుంది. ఈ కోటాలో ఇప్పటికే నారా లోకేశ్ పేరు ఖరారు చేసింది. చినబాబు సోమవారం మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు మిగిలిన 4 సభ్యుల జాబితాను రేపు సాయంత్రం లోపు చంద్రబాబు నిర్ణయించనున్నారు. 

20:59 - March 4, 2017
20:56 - March 4, 2017

కృష్ణా : త్వరలో విజయవాడ మెగా గ్రేటర్ సిటీగా అవతరించబోతుంది. 45 గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. తొలుత విజయవాడ రూరల్ మండలంలోని గ్రామాలను విలీనానికి ప్రభుత్వం సుముఖత చూపుతోంది. దీంతో ఇప్పటి వరకు పంచాయతీలుగా ఉన్న గ్రామాలు విజయవాడ నగర హంగులతో సరికొత్తగా రూపుదిద్దుకోబోతున్నాయి.
గ్రేటర్‌గా మారితే 403.70 కిలోమీటర్లు 
గ్రేటర్‌ హైదరాబాద్ తరహాలో విజయవాడను గ్రేటర్ సిటీగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం అధికారులు పక్కా ప్లాన్ రచించారు. ప్రస్తుతం విజయవాడ జనాభా 11 లక్షల 97 వేలు. గ్రామాలు విలీనమైతే విజయవాడ నగర జనాభా 15 లక్షలు దాటుతుంది. నగర విస్తీర్ణపరంగా 64 చదరపు కిలోమీటర్లుగా ఉంది. గ్రేటర్‌గా మారితే 403.70 కిలోమీటర్లకు చేరుకుంటుంది. 
అందరి చూపు గ్రేటర్ పైనే 
విజయవాడ గ్రేటర్ సిటీగా మారనున్నడంతో ఇప్పుడు అందరి చూపు గ్రేటర్ పైనే ఉంది. మొత్తం 45 గ్రామాలతో కలిపి విజయవాడ నగరం అతిపెద్ద కార్పొరేషన్‌గా అవతరించబోతోంది. విజయవాడ, గుంటూరు నగరాలను జంట నగరాలుగా చేయాలనే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఈ రెండు నగరాలను కలిపితే దేశంలోనే అతిపెద్ద నగరంగా మారనుంది. ఇదిలా ఉండగానే..విజయవాడను గ్రేటర్ సిటీగా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విజయవాడ రూరల్, గన్నవరం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు మండలాల పరిధిలోని మొత్తం 32 గ్రామాలను గ్రేటర్ పరిధిలోకి మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీలైనంత మేరకు ఎక్కువ సంఖ్యలోనే గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేయడానికి రెడీ అవుతున్నారు. 
45 గ్రామాలతో అతిపెద్ద కార్పొరేషన్‌ 
విజయవాడ రూరల్ మండలంలోని నున్న, పాతపాడు, పి.నైనవరం, అంబాపురం, జక్కంపూడికాలనీ, గొల్లపూడి, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాలు విజయవాడలో విలీనమవుతాయి. కొత్తూరుతాడేపల్లి, పైడూరుపాడు, రాయనపాడు గ్రామాలను జి.కొండూరు మండలంలో కలిపి, రూరల్ మండలాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. గన్నవరం, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, బుద్ధవరం, వెదురుపావులూరు, కంకిపాడు, పెనమలూరు, పోరంకి, కానూరు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, ముస్తాబాద, నున్న, పాతపాడు, నైనవరంతోపాటు మరో 28 గ్రామాలను విజయవాడలో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ సిటీగా అవతరించనుంది. 
'రియల్'కు రెక్కలు 
30 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో గ్రామాలు గ్రేటర్ విజయవాడలో విలీనమైతే 'రియల్'కు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే నగరపాలక సంస్థకు చేరువలో ఉన్న గ్రామాలలో భూముల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఖాళీ స్థలాలు, అపార్ట్ మెంట్ల కొనుగోళ్ళతోపాటు ఇతర భూ క్రయవిక్రయాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి.  

 

20:45 - March 4, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిల మధ్య గ్యాప్ పెరుగుతోందా.. క్రమంగా కేఈ ప్రాధాన్యతను సీఎం తగ్గిస్తున్నారా... తాజా డిప్యూటీ సీఎం అధికారాల్లో కోత విధించేలా జారీ చేసిన జీవో నెం 28 టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. 
కేఈ అధికారాలను సీఎం కావాలనే తగ్గిస్తున్నారని ఆరోపణలు
కేఈ కృష్ణమూర్తి.. సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం.. కర్నూలులో పార్టీకి కీలక నేత. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో రెవిన్యూ శాఖను ఆయన చూస్తున్నారు.. అయితే ఆయన శాఖ పరిధిలోకి వచ్చే.. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని సాధారణ పరిపాలన శాఖకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ జీవో నెం 28ని విడుదల చేసింది... ఈ పరిణామం పై కేఈ అనుచరులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కేబినెట్‌లో అత్యంత సీనియర్ అయిన కేఈ అధికారాలను సీఎం కావాలనే తగ్గిస్తూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అధికారాల్లో కోత వేయడంపై కేఈ ఆగ్రహం 
గతంలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ ల బదిలీల సందర్భంగా రెవిన్యూ మంత్రి హోదాలో కేఈ తీసుకున్న నిర్ణయాలను సీఎం నిలిపేశారనే ప్రచారం జరిగింది.. అలాగే ఆర్డీఓల బదిలీల సందర్భంగా చాలా జిల్లాల్లో మంత్రుల మధ్య తగాదాలకు దారి తీసింది. విశాఖలో ఓ ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా బహిరంగంగానే విమర్శించుకున్నారు. అలాగే కొత్త రాజధాని భూములు , నిర్మాణం , భూ కేటాయింపుల్లో కూడా రెవిన్యూ మంత్రిగా ఉన్న కేఈ కి ఎక్కడా భాగస్వామ్యం కల్పించకపోవడంపై అప్పట్లోనే చర్చనీయాంశమైంది. భూ కేటాయింపులపై వేసిన సంఘంలో కూడా రెవిన్యూ మంత్రిగా ఉన్న కేఈకి స్థానం దక్కలేదు. అయితే తాజాగా జీవో నెం 28 జారీ చేసి మరీ అధికారాల్లో కోత వేయడంపై కేఈ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
సీఎంపై కేఈ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం 
2014 లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లో జరిగిన కర్నూలు జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశంలో కేఈ సీఎంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మన జిల్లా నుంచి కేవలం 3 సీట్లు మాత్రం గెలిపించుకోగలిగాం.. అందుకే సీఎం చంద్రబాబు మనపై చిన్న చూపు చూస్తున్నారు. కర్నూలు జిల్లా కూడా అభివృద్ది కావాలి కదా అంటూ వ్యాఖ్యానించారు.. మరికొన్ని సందర్బాల్లో కేఈ సోదరుడు ప్రభాకర్ నేరుగా టీడీపీ హైకమాండ్ పైనే రుసరుసలాడారు. దీంతో అప్పట్నుంచి సీఎం కు డిప్యూటీ సీఎంకు మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోందనే ప్రచారం ఉంది. తాజాగా అధికారాల్లో కోత.. ఇద్దరి మధ్య కొత్త వివాదానికి కారణమయ్యేలా ఉందనే వాదన వినిపిస్తోంది.  

 

20:29 - March 4, 2017

హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ హోరా హోరీగా మారింది. టీడీపీ, బీజేపీ కూటమిని 
ఓడించడానికి మిగతా పక్షాలు పీడీఎఫ్ అభ్యర్థులను బలపరచడానికి ముందుకొచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో పీడీఎఫ్‌ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.  
రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికలు  
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రెవిన్యూ లోటు భర్తీ, ఉద్యోగాల భర్తీ అంటూ టీడీపీ, బీజేపీల కూటమి ఊదరగొట్టింది. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఈ రెండు పక్షాలూ ఘోరంగా విఫలమయ్యాయన్న విమర్శలు మూటగట్టుకున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతూ, నిర్వాసితులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వామపక్ష పార్టీలు బలపరుస్తున్న ప్రొగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్.. పీడీఎఫ్ అభ్యర్థులకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది.
పీడీఎఫ్‌కు పెరుగుతున్న మద్దతు 
ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ..తాము పోటీ చేస్తున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానం మినహా మిగతా స్థానాల్లో పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల పీడీఎఫ్ తరపున ఎమ్మెల్సీలు ఎంవీవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వర్రావు...వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన సందర్భంగా.. కచ్చితంగా మద్దతిస్తామని ప్రకటించారు.. దీంతో వైసీపీ పోటీ లేని చోట.. పీడీఎఫ్ అభ్యర్థులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ప్రకటించాలని ఇప్పటికే ఆయా పరిధిలోని జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలకు వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 
పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన వైసీపీ 
మరోవైపు పీడీఎఫ్ అభ్యర్థులకు సీపీఎం, సీపీఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి.. అటు లోక్ సత్తా కూడా పీడీఎఫ్ అభ్యర్థులకే ఓటు వేయాలని తమ పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు పంపింది... ఇంకోవైపు జనసేన కూడా పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. 
పీడీఎఫ్‌కు సీపీఎం, సీపీఐ పార్టీల మద్దతు 
గతంలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు కోట్లు గుమ్మరించినా గ్రాడ్యుయేట్లు, టీచర్లు పీడీఎఫ్ అభ్యర్థులనే గెలిపించారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో పీడీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావును ఓడించడానికి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సుమారు 26 కోట్లు ఖర్చుపెట్టారనే వార్తలు దుమారం రేపాయి. అయినా ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తూ రాము సూర్యారావుని అక్కడి ఓటర్లు గెలిపించడం సంచలనమైంది.. గత ఎన్నికల్లో ఒక్క గుంటూరు మినహా మిగతా స్థానాల్లో పీడీఎఫ్ అభ్యర్థులు విజయడంకా మోగించారు. ఈ సారి కూడా మెజార్టీ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుతో పీడీఎఫ్ ప్రభంజనం సృష్టిస్తుందని పీడీఎఫ్‌ మద్దతుదారులు భావిస్తున్నారు. 

 

20:03 - March 4, 2017

చిత్తూరు : తిరుపతి మండలం మల్లవరం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న వ్యవసాయబావిలో టవేరా వాహనం అదుపుతప్పి పడడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులంతా తమిళనాడు తిరువణ్ణామలై వాసులుగా గుర్తించారు. 

 

20:01 - March 4, 2017

పశ్చిమగోదావరి : జిల్లా పొడూరు మండలం కవిటంలాకుల వద్ద నిన్న రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా.. పారిపోతుండగా... కాల్వలో పడి గల్లంతైన దిగమర్తి నవీన్‌ మృతదేహం వేడంగి గ్రామంలో దొరికింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్తుండగా.. మృతుని బంధువులు అడ్డుకుని.. ఇంటికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని చూసిన భార్యపిల్లలు శోక సంద్రంలో మునిగిపోయారు. నవీన్‌ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా.. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతుని కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ... ప్రజా సంఘాల నేతలు మృతదేహాంతో రోడ్డుపై బైఠాయించి.. ఆందోళన నిర్వహించారు. 

19:58 - March 4, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో మరో  చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. చట్టసభల నిర్వహణ కోసం నిర్మించిన అసెంబ్లీ భవనంలో 6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సోమవారం ఉదయం 11.06 నిమిషాలకు గవర్నర్‌ ప్రసంగం ద్వారా  సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ నిర్మాణం జరిగిన తీరు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభలో సభ్యులు వ్యవహరించాల్సి అంశాలపై ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. 'అతి త్వరగా అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తైంది. 192 రోజుల్లోనే నిర్మించాం. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించాం. ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా చూస్తా' అని తెలిపారు. 

 

19:53 - March 4, 2017

హైదరాబాద్‌ : నగర వాసులకు ఈ ఏడాది కూడా నీటి కష్టాలు తప్పేలా లేవు. నాగార్జున సాగర్‌ నుంచి భారీగా నీటిని తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలు ఆలోచిస్తుండటంతో సిటీకి కష్టకాలం వచ్చేలా ఉంది. దీంతో గతేడాది కంటే రెండు నెలల ముందే ఎమర్జెన్సీ పంపింగ్‌కు జలమండలి సిద్ధమవుతోంది. 
పెరుగుతున్న నీటి కష్టాలు 
గ్రేటర్‌ వాసుల్లో రోజు రోజుకు నీటి కష్టాలు పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాల్లో నీటి వత్తిడిని తగ్గించి సరఫరా చేస్తున్నారు. గతంతో పోలిస్తే నగరానికి అయ్యే సరఫరా నీటి శాతం పెరిగినప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా చెయ్యలేకపోతుంది జలమండలి. శివారు ప్రాంతాల్లో గతంలోని పరిస్థితులే ఇంకా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన పైపులైన్‌ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఇంకా నీటి కష్టాలు తీరలేదు. చాలా ప్రాంతాల్లో రిజర్వాయర్లు పూర్తి కాకపోవడంతో గతంలోని సమస్యలు పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
సిటీకి ఇబ్బందులు..?
ఇక ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగర్ నుంచి ఇప్పటి వరకు నీటిని జలమండలి వాడలేదు. సింగూర్‌, మంజీరా జలాశయాల నుంచి 125 ఎంజీడీలు రావాల్సి ఉండగా 48 ఎంజీడీలను మాత్రమే సేకరిస్తున్నారు. అయితే కృష్ణా, గోదావరి నుంచి 356 మిలియన్ గ్యాలన్ల నీరు ప్రస్తుతం సిటికి సరఫరా అవుతుంది. వీటిలో 242 ఎంజీడిల నీరు కృష్ణా నది అక్కంపల్లి నుంచి తీసుకుంటున్నారు. అక్కంపల్లి వద్ద ప్రస్తుతం 511.4 మీటర్ల నీటి మట్టం ఉంది. సిటికి తాగు నీటిని అందించాలంటే రిజర్వాయర్‌లో 510 మీటర్ల నీటి మట్టం మెయింటేన్ చెయ్యాలి. కానీ నాగార్జున సాగర్‌లో కనీస నీటి మట్టానికి తగ్గించి నీటిని వాడుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిర్ణయించడంతో సిటీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
అక్కంపల్లి బ్యారేజీలోనూ తగ్గిపోతున్న నీటిమట్టం 
ఇక నాగార్జునసాగర్‌లో నీటి మట్టం తగ్గించకపోతే అక్కంపల్లి బ్యారేజీలోనూ నీటిమట్టం తగ్గిపోతుంది. అయితే 506 మీటర్ల కంటే నీటిమట్టం తగ్గిపోతే గ్రావిటీ ద్వారా వచ్చే నీరు రాదు. దీంతో పంపింగ్ ద్వారానే కృష్ణా నది నుంచి నీటిని సేకరించాల్సి ఉంటుంది. అయితే మరో నాలుగు వారాల్లోపే ఇలాంటి పరిస్థితులు రానున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎమర్జెన్సీ నీటి పంపింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రావీటి ద్వారా వచ్చే దాదాపు 250 ఎంజీడీల నీటిని ప్రతి రోజు పంపింగ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం 7 కోట్ల రూపాయలతో భారీ మోటర్లను ఫిక్స్ చెయ్యనుంది జలమండలి.
తాగు నీటి సరఫరాపై పెద్ద ప్రభావం 
ప్రస్తుతం సిటీకి వస్తున్న నీటిలో సింహా భాగం కృష్ణానది నుంచే వస్తోంది. సాగర్‌లో నీటి మట్టం తగ్గితే అదే స్థాయిలో సిటికి తాగు నీటి కష్టాలు వస్తాయి. గతేడాది జూన్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించగా ఈ సారి రెండు నెలల ముందే ప్రారంభించే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. ఇది గ్రేటర్ పరిధిలోని తాగు నీటి సరఫరాపై పెద్ద ప్రభావం చూపనుంది.

 

19:45 - March 4, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీ దోపిడీ జరిగింది. ఆర్మీ కల్నల్ ఇంట్లో కిలో బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఇంట్లో అనారోగ్యంతో ఒంటరిగా ఉన్న కల్నల్ కుమారుడిని బెదిరించి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. కుమారుడికి అండగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కల్నల్ నియమించారు. అయితే ఈ దోపిడీ తర్వాత ఓ సెక్యూరిటీగార్డు పరారీలో  ఉన్నాడు. దీంతో సెక్యూరిటీ గార్డుపై పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందింతులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. 

19:44 - March 4, 2017

నాగర్ కర్నూలు : అందరి సహకారంతో విజయడైరికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిర్మలాదేవి. నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని పాల శీతలీకరణ కేంద్రాన్ని ఎమ్‌డీ నిర్మలాదేవి పరిశీలించారు. అనంతరం పాలసేకరణ ఏజెంట్లు, కార్యవర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.  పాడి రైతులు, ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్‌డీ దృష్టికి తీసుకొచ్చారు. రేషన్‌ బ్యాలెన్సింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా పాడి రైతులకు అవగాహన కల్పిస్తామని, తెలంగాణ వ్యాప్తంగా విజయ పాల పాకెట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నిర్మలాదేవి చెప్పారు. పాడి రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లతో మాట్లాడుతామని, నాణ్యమైన పాలకు మారుపేరు విజయడైరి అని అన్నారు. 

19:42 - March 4, 2017

నల్గొండ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్‌ అమలు చేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. తమ్మినేని నేతృత్వంలో మహాజన పాదయాత్ర నల్లగొండ జిల్లాలో సాగుతోంది. పలుచోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వ మెడలు వంచైనా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు సాధిస్తామన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. తెలంగాణ పారిశ్రామిక విధానంతో ఏ ఒక్కరికీ ఉపాధి లభించలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ ఇచ్చిన హమీలు అమలు చేయకుంటే.. భవిష్యత్‌లో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాదయాత్రపై స్ఫూర్తి రచించిన కవితా సంపుటి పుస్తకాన్ని తమ్మినేని ఆవిష్కరించారు.

 

19:36 - March 4, 2017

వరంగల్ : వరంగల్‌ మహానగరపాలక సంస్థ బడ్జెట్‌ను కౌన్సిల్‌ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదటిసారి వెయ్యి 43కోట్ల రూపాయలతో బడ్జెట్‌ రూపకల్పన చేశామని మేయర్‌ నరేందర్‌ తెలిపారు. నగరవాసులపై పన్నుభారం లేకుండా బడ్జెట్‌ తయారుచేశామని స్పష్టం చేశారు. బల్దియా కౌన్సిల్‌ హాల్‌లో ఏర్పాటైన బడ్జెట్‌ సమావేశానికి ఎంపీ దయాకర్‌... ఎమ్మెల్యే వినయ భాస్కర్‌ హాజరయ్యారు.

ఢిల్లీలో వామపక్ష విద్యార్థి సంఘాల సిటిజన్ మార్చ్

ఢిల్లీ : విద్యాలయాల్లో విద్యార్థులపై దాడులను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సిటిజన్ మార్చ్ నిర్వహించారు. 

18:52 - March 4, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఒకే పన్ను జీఎస్ టీ అమలుతో పన్ను ఎగవేత అక్రమాలకు చెక్‌ పడుతుందని... మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఢిల్లీలో జీఎస్ టీ కౌన్సిల్‌ సమావేశానికి ఆయన హాజరయ్యారు. టాక్స్‌ చెల్లింపులకు జీఎస్ టీ కొత్త విధానమని... దీనిపై డీలర్లకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. గ్రోత్‌ రేట్‌ 14శాతంకంటే తక్కువగాఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం జీఎస్ టీ నష్టపరిహారాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. 16కంటే ఎక్కువగా ఉన్న తెలంగాణకు నష్టపరిహారం వచ్చే అవకాశం లేదని ఈటెల తెలిపారు. మళ్లీ మార్చి 16న మరోసారి సమావేశం జరుగుతుందని మంత్రి వివరించారు..

 

18:47 - March 4, 2017

వరంగల్ : అటు బడ్జెట్‌ అద్భుతంగా ఉందని టీఆర్ ఎస్ నేతలు ప్రశంసిస్తుంటే... ప్రజాసంఘాలు మాత్రం అశాస్త్రీయంగా ఉందని ఆరోపిస్తున్నాయి.. బడ్జెట్‌ రూపకల్పన తప్పులతడకగా ఉందంటూ వరంగల్‌ మేయర్‌ చాంబర్‌ దగ్గర ధర్నా చేపట్టారు.. పన్నుల్ని భారీగా పెంచారని మండిపడ్డారు.. పన్నుల పెంపులేకుండా బడ్జెట్‌ తయారు చేయాలని డిమాండ్ చేశారు..

18:44 - March 4, 2017

శ్రీకాకుళం : ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ప్రచారానికి కేవలం 4 రోజులే గడువు ఉండటంతో అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గెలుపు తమదంటే తమదని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్‌ పెరిగింది. మార్చి 7వ తేదీతో ప్రచారానికి గడువుముగియనుడడంతో అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరంచేశారు. మార్చి 9న ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 
ప్రస్తుత ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు 
2007 ఎన్నికల్లో 31 మంది.. 2011 ఎన్నికల్లో 20 మంది పోటీచేయగా.. ప్రస్తుత ఎన్నికల్లో 30 మంది తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఈ సారి ఎన్నికల బరిలో ముగ్గురు మహిళలు పోటీలో నిలవడం విశేషం. ఉత్తరాంధ్ర జిల్లాలలో మొత్తం 1, 56, 957 వేల ఓటర్లు ఉంటే విశాఖ నగరంలోనే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. దీంతో అభ్యర్ధులు ఉక్కు నగరంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్ధి మాధవ్, పీడీఎఫ్ తరుపున అవధానుల అజశర్మ, స్వతంత్ర అభ్యర్ధి రమణమూర్తి, కాంగ్రెస్ తరపున యడ్ల ఆదిరాజు ప్రధాన అభ్యర్ధిలుగా బరిలో ఉన్నారు. 
టీడీపీ, బీజేపీల తరపున మాధవ్‌
టీడీపీ, బీజేపీల తరపున రంగంలోకి దిగిన మాధవ్‌కు మద్దతుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. గడువు తక్కువ ఉన్నందున నియోజకవర్గాల వారీ బాధ్యతలను శాసనసభ్యులు, నియోజకవర్గబాధ్యులు ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. మీటింగ్స్ మీద మీటింగ్స్ పెడుతూ మాదవ్‌ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి రానున్న జీవీఎంసీ ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని భావిస్తున్నారు. 
అధికార పార్టీ అభ్యర్ధికి ముచ్చెమటలు 
అయితే విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంశం అటు అధికార పార్టీ అభ్యర్ధికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పీడీఎఫ్ తరుపున గత రెండు సార్లు ఎంవీఎస్ శర్మ ఎమ్మెల్సీగా గెలుపు సాధించారు. ఇప్పుడు ఆయన స్థానంలో కార్మిక నేత, ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక కన్వీనర్ అయిన అజశర్మను పోటీలో ఉంచారు. శర్మకు వామపక్షాలు, కార్మిక సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. మరోవైపు వైసీపీ కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకించడంతో శర్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 
దూసుకుపోతున్న రమణమూర్తి         
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ లీడర్ రమణమూర్తి కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో అన్ని విధాల పరిచయాలు ఉండటంతో పాటుగా పాత్రికేయుడిగా తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర రైల్వే జోన్‌తో పాటుగా నిరుద్యోగ భృతి, పింఛన్ల అమలులో కేంద్రం చేసిన మార్పుల గురించే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మొత్త మ్మీద గెలుపుపై అభ్యర్థులందరూ ధీమా వ్యక్తంచేస్తున్నారు. 

 

18:29 - March 4, 2017

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : అప్పట్లో నిజాం ప్రభుత్వం అక్కడ ప్రాణహిత నదిపై జలవిద్యుత్‌ కేంద్రానికి శ్రీకారం చుట్టి వదిలేసింది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఆచరించలేదు. తెలంగాణ వచ్చాకైనా నిర్మాణం జరుగుతుందని ఆశపడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజల కల కలగానే మిగిలిపోయింది. ఏళ్ల తరబడి జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.
ప్రాణహిత నదిలో జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం 
మారుమూల గ్రామాలకు కరెంటు అందించాలనే లక్ష్యంతో అప్పటి నిజాం సర్కార్‌ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం తలాయి గ్రామ సమీపంలో ప్రాణహిత నదిలో జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1945లో నిజాం సర్కారు తలాయి గ్రామం వద్ద ప్రాణహిత నదిలో 150 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ప్రాణహిత నదిలో ఒక దిమ్మెను నిర్మించి  నది ఒడ్డున ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం సర్వే చేసి కొంత మేర పనులు కూడా మొదలుపెట్టారు అప్పటి పాలకులు.  కానీ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రాజెక్టు పనులు నిలిచి పోయాయి. ఇప్పటికీ వాటి ఆనవాళ్లు  ప్రాణహిత నదిలో అలాగే ఉన్నాయి.
ప్రతిపాదనలకే పరిమితం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎందరు నాయకులు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ జల విద్యుత్‌ కేంద్రం గురించి పట్టించు కోలేదు. కొన్నిసార్లు పరిశీలించినా అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. సర్వేల పేరిట కాలయాపన చేశారు. తెలంగాణ ఉద్యమంలో దీనిపై ఎంతో చర్చ జరిగింది. అప్పుడు కేసిఆర్ కూడా దీనిపై అలోచన చేశారు. ఇక్కడి నుంచే బస్సు యాత్ర చేయడానికి నిర్ణయించారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బెజ్జూరు మండల కేంద్రం నుంచి యాత్రను మొదలు పెట్టారు. 
జల విద్యుత్తు కేంద్రం ఏర్పాటుపై నోరు మెదపని ప్రభుత్వం 
2008 ఆగస్టులోనే ఇప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు తలాయి వద్ద జల విద్యుత్‌ కేంద్రం ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ జల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే వెనుకబడిన ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాజెక్టును తప్పకుండా నిర్మిస్తామని అప్పుడు హరీష్ రావు హామీ ఇచ్చారు.  కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తలాయి జల విద్యుత్తు కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. వెనుకబడిన ఈ ప్రాంతంలో తలాయి జలవిద్యుత్తు కేంద్రం నిర్మిస్తే ఈ ప్రాంతంలోని మారుమూల గ్రామాలతో పాటు సమీపంలోని కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి లాంటి పట్టణాలకు విద్యుత్‌ను అందించవచ్చని స్థానికులు చెప్తున్నారు.
జలవిద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిజాం సర్కార్ యోచన 
ఆ కాలంలోనే ప్రాణహిత నదిలో ఒక జల విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచన చేసింది నిజాం సర్కార్‌. ఇప్పటి అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం చొరువ చూపి జలవిద్యుత్తు ప్లాంటును నిర్మిస్తే ఎంతో మేలు జరుగుతుందని, విద్యుత్తు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

 

సీజీఎస్టీ, ఐజీఎస్టీలపై పూర్తిగా స్పష్టత వచ్చిందన్న మంత్రి ఈటెల

ఢిల్లీ : సీజీఎస్టీ, ఐజీఎస్టీలపై పూర్తిగా స్పష్టత వచ్చిందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. జీఎస్టీపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సఖ్యత కుదిరిందని చెప్పారు. సామాన్యులపై భారం పడకుండా చూడాలని కోరామని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సరిహద్దు చెక్ పోస్టుల ఎత్తివేత, తీర ప్రాంతానికి 12 నాటికల్ మైళ్లలోపు సరుకు రవాణా, చేపల వేటలపై రాష్ట్రాలకే హక్కు ఉంటుందని చెప్పారు.

17:29 - March 4, 2017

హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ పోలీసులు శాఖ నెంబర్‌ 1గా ఉందని... మంత్రి నాయిని ప్రశంసించారు. ముఖ్యంగా షీ టీమ్‌ల పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇతర రాష్ట్రాలు మన షీ టీమ్స్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో షీటీమ్స్ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ పీపుల్స్ ప్లాజాలో ఉమెన్‌ ఎక్స్‌పోను నాయిని ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్‌ శర్మ, సీపీ మహేందర్‌ రెడ్డి, స్వాతి లక్రా హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా.. ఉమెన్‌ ఎక్స్‌పోతోపాటు.. ఆదివారం ఉదయం 5కే రన్‌ నిర్వహించబోతున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని పోలీసులు కోరారు.

 

17:25 - March 4, 2017

హైదరాబాద్ : హరితహారం పేరుతో పోడు రైతులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు ఆపాలని... సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వ్యవసాయదారుల పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారని... క్షేత్రస్థాయిలోమాత్రం రైతుల్ని అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని నిర్భంధాన్ని తెలంగాణలో విధిస్తున్నారని మండిపడ్డారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోడు రైతుల్ని కాపాడాలని కోరారు.

 

17:12 - March 4, 2017

హైదరాబాద్ : రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న నిమ్స్‌కు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక గుర్తింపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌కి పీజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసింది. 2017-18 ఏడాదికిగాను అదనంగా 30 పీజీ మెడికల్‌ సీట్లు శాంక్షన్‌ చేసింది.   
నిమ్స్‌ ఎనలేని సేవలు 
ప్రతిష్టాత్మకమైన నిమ్స్‌ వైద్యశాఖ ప్రభుత్వం రంగంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా రోగులకు ఎనలేని సేవలు అందిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిమ్స్‌ ప్రగతి పథంలో పయనిస్తోంది. నిమ్స్‌ బెడ్ల సంఖ్యను 1140 నుంచి 1500లకు పెంచారు. కొత్త బెడ్లు, కొత్త ఫర్నీచర్‌ సమకూర్చడంతోపాటు,  డయాలసిస్‌ సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. త్రీ డీ ఎంఆర్‌ఐ, రెండు క్యాథల్యాబ్స్‌, స్లీప్‌ ల్యాబ్‌, 128 స్లైస్‌ సిటీ వంటి అధునాతన సదుపాయాలు కల్పించారు. త్వరలో రెండు సూపర్‌ స్పెషాలిటీ టవర్స్‌ను కూడా నిర్మించబోతున్నారు.
నిమ్స్‌కు ఎంసీఐ ప్రత్యేక గుర్తింపు 
రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న నిమ్స్‌కు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అదనంగా పీజీ సీట్లు 28 కేటాయించగా, పీజీ ఎమర్జెన్సీ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌  మరో రెండు సీట్లు మంజూరు చేసింది.  నిమ్స్‌లో జ‌న‌ర‌ల్ మెడిసిన్ విభాగంలో ప్రస్తుతం ఉన్న నాలుగు సీట్లకు  11 కు పెంచారు. దీంతో ఈ విభాగంలో మొత్తం సీట్ల సంఖ్య 15కు చేరింది. ఎండీ అనస్థీషియా విభాగంతో ప్రస్తుతం ఏడు సీట్లుండ‌గా కొత్తగా మరో పెరగడంతో వీటి సంఖ్య ఎనిమిదికి చేరింది.  ఎండి రేడియాల‌జీలో గ‌తంలో 5 సీట్లుండ‌గా ప్రస్తుతం ఆరు సీట్లని పెంచడంతో మొత్తం సీట్ల సంఖ్య 11కు చేరింది. ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో గ‌తంలో ఆరు సీట్లుండ‌గా ప్రస్తుతం మూడు సీట్లు కేటాయించడంతో మొత్తం సీట్ల సంఖ్య 9కి పెరిగింది.
నిమ్స్‌కు 30 పీజీ సీట్లు రావ‌డం వ‌ల్ల రోగుల‌కు ఉప‌యోగం : డైరెక్టర్ డా.కె.మనోహర్ 
నిమ్స్‌కు 30 పీజీ సీట్లు రావ‌డం వ‌ల్ల రోగుల‌కు ఎంతో ఉప‌యోగం క‌లుగుతుంద‌న్నారు డైరెక్టర్ డాక్టర్ కె. మ‌నోహ‌ర్‌. తెలంగాణ సీఎం కెసిఆర్ చొర‌వ‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.ల‌క్ష్మారెడ్డి కృషి ఫ‌లితంగానే నిమ్స్ ప్రగ‌తి ప‌థంలో నడుస్తుందన్నారు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా స‌దుపాయాల కల్పన‌తో పాటు అధునాత‌న రోగ నిర్ధార‌ణ ప‌రీక్షల యంత్రాల‌ను సైతం సిద్ధం చేశామ‌న్నారు. దేశంలోని అత్యాధునిక వైద్యాన్ని ఇక్కడ అందించ‌డానికి వీలుగా అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు. 
పీజీ సీట్లతో రోగుల‌కు ఉప‌యోగ‌క‌రం : వైద్య నిపుణులు 
తాజా పీజీ సీట్లతో రోగుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉత్తమ‌మైన వైద్య సేవ‌లు అందడంతో పాటు డాక్టర్లకు ఈ విభాగంలో చ‌దువుకునే అవ‌కాశం కూడా దొరుకుతుందంటున్నారు. రానురాను ఈ విభాగం బ‌ల‌ప‌డ‌ట‌మేగాక‌ ఎక్కువ మంది డాక్టర్లను ఈ విభాగంలో తయారు చేయడానికి వీలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రాల ఆర్థికమంత్రులు, అధికారులు హాజరయ్యారు. సీజీఎస్ టీ, ఐజీఎస్ టీ బిల్లులకు పలు మార్పులతో జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మార్చి 16న మళ్లీ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానున్నారు. 

 

జయశంకర్ జిల్లాలో ల్యాండ్ మైన్ అమర్చిన మావోయిస్టులు

జయశంకర్ : వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టు వద్ద మావోయిస్టులు ల్యాండ్ మైన్ అమర్చారు.

బెంగళూరు టెస్టు..తొలి ఇన్నింగ్స్... భారత్ 189 పరుగులకు ఆలౌట్

బెంగళూరు టెస్టు : తొలి ఇన్నింగ్స్ లో భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. లోకేష్ రాహుల్ (90) మినహా బ్యాట్స్ మెన్ రాణించలేదు. నాయర్... 26, పుజారా..17, కోహ్లీ...12, అశ్విన్...7, జడేజా..3, సాహా..1. ఆసీస్ బౌలర్ లియాన్ 8 వికెట్లను కూల్చాడు. స్టార్క్, ఒకీఫ్ లు చెరో వికెట్ పడగొట్టారు. 
 

16:38 - March 4, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాని మోది నియోజకవర్గం వారణాసిలో ఓవైపు బిజెపి మరోవైపు ఎస్పీ...కాంగ్రెస్‌లు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. హెలిక్యాప్టర్‌లో వారణాసి చేరుకున్న యూపి సిఎం అఖిలేష్‌యాదవ్ ఎన్నికల సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి ఆయన రోడ్‌షోలో పాల్గోనున్నారు. కాంగ్రెస్‌, ఎస్పీ కార్యకర్తలు వారణాసికి భారీగా తరలివచ్చారు.

 

16:35 - March 4, 2017

హైదరాబాద్ : ఉన్నది రెండు సీట్లు. ఆశావహుల జాబితా మాత్రం చాంతాడంత ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా నుంచి  ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ తీవ్రంగా ఉంది. అయితే పెద్దల సభలకు పెద్ద తలకాయిలను పంపాలన్నది టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తలపండిన నేతల శాసనమండలికి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శాసనమండలికి ఎన్నికలకు సీనియర్లను ఎంపిక చేయాలన్న ఆలోచన 
శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికలకు సీనియర్లను ఎంపిక చేయాలన్నా ఆలోచనలో గులాబీ దళాధిపతి ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, సమాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. 
ఉన్న రెండు సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన
ఎమ్మెల్యేల కోటా నుంచి మండలికి జరిగే ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది ఉన్నారు. కానీ ఉన్న రెండు సీట్లను ఎవరికి సర్దుబాటు చేయాలన్న అంశంపై పార్టీలో తర్జన భర్జన జరుగుతోంది. గతంలో హామీ ఇచ్చిన నేతలను కాదని  ఇప్పుడు కొత్త పేర్ల ప్రచారంలోకి వస్తోండటంతో  ఆశావహుల్లో కలవరం ప్రారంభమైంది. మారుతున్న రాజకీయ సమీకరణల  పరిశీలిస్తే పదవుల కోసం పలు విధాలుగా ప్రయత్నిస్తూ, ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ఆశావహులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశంలేదని భావిస్తున్నారు. 
సుఖేందర్‌రెడ్డిని శాసనమండలికి పంపితే పార్టీకి లాభమన్న యోచన 
ఉన్న రెండు సీట్లలో ఒక స్థానాన్ని మైనారిటీలను దువ్వేందుకు వీలుగా ఒక స్థానాన్ని మజ్లిస్‌కు కేటాయించే అవకాశం ఉంది. మరో స్థానాన్ని ప్రస్తుత ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌కే కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని శాసనమండలికి పంపే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన సుఖేందర్‌రెడ్డి, గతేడాది ఆ పార్టీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చేశారు. ఈయన్ని మండలికి పంపితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి లాభిస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. బలమైన సామాజికవర్గాన్ని ప్రభావితం చేసినట్టు ఉటుందన్న ఆలోచనలో టీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డిని మండలికి పంపితే ఖాళీ అయ్యే నల్గొండ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా జిల్లాలో టీఆర్‌ఎస్‌ పూర్తిగా పట్టు బిగించినట్టు అవుతుందన్నది గులాబీ దళాధిపతి విశ్లేషణ. ఎమ్మెల్సీ కోటా నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పర్యాద కృష్ణమూర్తి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నకాలంలో  పర్యాద కృష్ణమూర్తి హాకా చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 
శాసనమండలి మహిళలకు ప్రాతినిధ్యం లేదు.. 
మరోవైపు శాసనమండలి మహిళలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈసారి తమకు అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ మహిళా నేతలు కోరుతున్నారు. ఆశావహుల్లో ఎమ్మెల్సీ వరమాల ఎవరిని వరిస్తుందో చూడాలి. 

16:29 - March 4, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులు కదం తొక్కారు. పీహెచ్‌డీ రెండో లిస్ట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వీసీ చాంబర్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. అంతకుముందు పీహెచ్‌డీ ఫలితాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆర్ట్స్‌ కాలేజీలోని ప్రిన్సిపల్‌ చాంబర్‌లో ఆందోళన చేపట్టారు. 

 

16:26 - March 4, 2017

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. మారుతి ప్లాజాలో పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో దుకాణాలు ఏర్పాటుచేశారు. వీటిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నిర్మాణాలను తొలగించాలంటూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు.  

 

16:24 - March 4, 2017

అనంతపురం : ప్రతిపక్ష నేత జగన్‌పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన అనుచరులతోకలిసి జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనంతపురంలో ధర్నాకు దిగారు. జగన్‌లాగా తాము సూట్‌కేసు కంపెనీలు పెట్టలేదని స్పష్టం చేశారు. బస్సు ప్రమాద ఘటనపై సీబీసీఐడీ విచారణకు కూడా సిద్ధమేనంటూ జగన్‌కు సవాల్‌ విసిరారు. నందిగామ బస్సు ప్రమాదం కేసు నుంచి తమను సీఎం చంద్రబాబు ఎలా రక్షించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తగా మారడంతో జేసీతోపాటు ఆయన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

15:56 - March 4, 2017

వాషింగ్టన్ : అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు యువకుడు శ్రీనివాస్‌ మరణించిన ఘటన నుంచి తేరుకోకముందే మరో సంఘటన జరిగింది. సౌత్‌ కరోలినాలో గురువారం రాత్రి భారత సంతతికి చెందిన ఓ వ్యాపారిని ఆయన ఇంటి ముందే హత్య చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. లాంకాస్టర్‌ ప్రాంతంలో హర్నీష్‌ పటేల్‌ అనే వ్యక్తి గురువారం రాత్రి 11 గంటల 24 నిమిషాల సమయంలో దుకాణం మూసేసి ఇంటికి వెళ్తుండగా.. పది నిమిషాలకే ఇంటికి సమీపంలోనే కాల్చి చంపినట్లు అమెరికాలోని మీడియా పేర్కొంది. ఇటీవల కేన్సస్‌లో అమెరికన్‌ వ్యక్తి బార్‌లో కాల్పులు జరపగా శ్రీనివాస్‌ కూచిభొట్ల మరణించగా, అలోక్‌, మరో అమెరికన్‌ వ్యక్తి గ్రిల్లాట్‌ గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించిన రెండ్రోజుల్లోనే మరో భారతీయుడు హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.
హర్నీష్‌ పటేల్‌ మృతిపై దర్యాప్తు చేస్తున్నాం : లాంకాస్టర్‌ అధికారులు
హర్నీష్‌ పటేల్‌ మృతిపై దర్యాప్తు చేస్తున్నామని లాంకాస్టర్‌ అధికారులు వెల్లడించారు. దర్యాప్తు జరుగుతుండగా ఇది జాత్యహంకార దాడి అని చెప్పలేమని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. గురువారం రాత్రి ఓ మహిళ పోలీసులకు ఫోన్‌ చేసి వ్యక్తి అరుపులు, తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని చెప్పడంతో వారు ఘటనాస్థలానికి వచ్చారు. పటేల్‌ చాలా మంచి వ్యక్తి అని, కస్టమర్లతో చాలా మర్యాదగా వ్యవహరిస్తారని, చాలా దయగల వ్యక్తి అని అక్కడి వారు చెప్పారు. పటేల్‌కు భార్య, ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతున్న చిన్నారి ఉన్నారు. హత్య జరిగిన సమయంలో వారు ఇంట్లో ఉన్నారు. పటేల్‌ హత్యపై లాంకాస్టర్‌ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

 

15:53 - March 4, 2017

తిరుపతి : తూర్పు రాయలసీమలో పట్టభద్రుల స్థానిక సమరం ఊపందుకుంది. 14 మంది బరిలో ఉన్నప్పటికీ టీడీపీ, పీడీఎఫ్‌ బలపరుస్తున్న అభ్యర్థుల మధ్య పోటీ కనిపిస్తోంది. యువతకు ఉద్యోగాల కోసం ఎన్నో పోరాటాలు చేశానని.. తనను గెలిపిస్తే నిరుద్యోగ భృతి కోసం అలుపెరుగని పోరాటం చేస్తానని చెబుతున్నారు. ఓటర్ల లిస్ట్‌లో అవకతవకలు జరిగాయని... అనేకమంది అర్హుల పేర్లను తొలగించారని మండిపడ్డారు. పట్టభద్రుల ఎన్నికల్లో మంత్రులు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మంచి స్పందన వస్తోందన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని విమర్శించారు. 

 

15:47 - March 4, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల కనీస అవగాహన లేకుండా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కోర్టుల్లో కేసులు వేస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. 

 

15:41 - March 4, 2017

హైదరాబాద్ : గృహనిర్మాణశాఖ మంత్రివర్గ ఉపసంఘంపై తాను చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ రెడ్డి శాఖ అయిన సివిల్ సప్లయ్ లో భారీగా అవినీతి జరిగిందని ఆ శాఖ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని తెలిపారు. దీంతో ఆ శాఖ నుంచి ఈటలను తీసివేసే పరిస్థితులు వచ్చాయని రేవంత్ తెలిపారు. అలాంటి ఈటల చంద్రబాబు, టీడీపీ నేతల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.  

 

15:36 - March 4, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మార్చి 8న జరిగే చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలన్నీ వారణాసిపైనే గురిపెట్టాయి. ప్రధాని మోది నియోజకవర్గం వారణాసి రాజకీయ కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలతో బిజెపి భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. బెనారస్‌ యూనివర్సిటీ నుంచి ర్యాలీ మొదలైంది. వారణాసికి చేరుకున్న ప్రధాని మోది- కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన బిజెపి ర్యాలీ నుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ర్యాలీలో ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గోనున్నారు. మరోవైపు యూపీ సిఎం అఖిలేష్‌ యాదవ్, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా వారణాసిలో ఇవాళ ప్రచారం చేయనున్నారు. 

 

15:32 - March 4, 2017

వాషింగ్టన్ : అమెరికాలో వరుస దాడులు భారతీయులను భయపెట్టిస్తున్నాయి. జాత్యహంకార దాడుల్లో శ్రీనివాస్ మృతి చెందిన ఘటన మరువకముందే మరో భారతీయుడు హత్య గావించబడ్డాడు. తాజాగా అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన హర్నీష్‌ పటేల్‌ను దుండగులు కాల్చి చంపారు. భారత సంతతి, గుజరాత్ రాష్ట్రానికి చెందిన హర్నీష్ పటేల్ అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో పేజ్ లాండ్ హైవేపై స్పీడ్ మార్ట్ స్టోర్ నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్తుండగా పటేల్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఇంటికి సమీపంలో పటేల్‌ మృతదేహం లభించింది. పటేల్‌ హత్య పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పటేల్‌ మంచి మనిషి అని కొనియాడుతున్నారు. పటేల్‌ స్టోర్‌ ఎదుట స్థానికులు నివాళులర్పించారు. మరోవైపు ఈ హత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

అమెరికాలో మరో భారతీయుడి హత్య

వాషింగ్టన్ : అమెరికాలో జాత్యహంకార దాడుల్లో శ్రీనివాస్ మృతి చెందిన ఘటన మరువకముందే మరో భారతీయుడు హత్య గావించబడ్డాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన హర్నీష్ పటేల్ అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో పేజ్ లాండ్ హైవేపై స్పీడ్ మార్ట్ స్టోర్ నిర్వహిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి పటేల్ ఇంటికి సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. 

Don't Miss