Activities calendar

31 May 2017

21:39 - May 31, 2017

లండన్ : క్రికెట్‌ హోంనేషన్‌...ఇంగ్లండ్‌లో ఇన్‌స్టంట్‌ వన్డే వార్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. టాప్‌-8 ర్యాంక్స్‌లో ఉన్న జట్ల చాంపియన్స్‌ ట్రోఫీలో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. 18 రోజుల పాటు జరుగనున్న మినీ వరల్డ్‌ కప్‌ సమరంలో 8 జట్లు టైటిల్‌ వేటలో బరిలోకి దిగబోతున్నాయి. గ్రూప్‌ అండ్‌ నాకౌట్ రౌండ్లలో నిర్వహించనున్న చాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించడానికి ముందుకొస్తోంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి 8 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మహా సంగ్రామం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గ్రూప్‌ -Aలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ , న్యూజిలాండ్‌ జట్లు......గ్రూప్‌ -Bలో భారత్‌, పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్‌ దశలో A,B లీగ్‌ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో గ్రూప్‌-ఎ విన్నర్‌తో గ్రూప్-బీ రన్నరప్‌ జట్టు....గ్రూప్‌-ఎ రన్నరప్‌తో గ్రూప్-బీ టాపర్‌ జట్టు ....ఫైనల్‌ బెర్త్‌ కోసం పోటీపడతాయి.ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌తో చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభం కానుంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇండియా, రెండు సార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియా, ఆతిధ్య ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు హాట్‌ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి.మూడు వారాల పాటు జరుగనున్న ఈ మినీ వరల్డ్‌కప్‌లో నెగ్గి.....చాంపియన్స్‌ ట్రోఫీ సొంతంచేసుకునే జట్టేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.


 

 


 


 


 

 

 

 

21:32 - May 31, 2017

కర్నూలు : పోలీసుల సహకారంతో అధికారంలో ఉన్న బడా నేతలే చెరుకుల పాడు నారాయణరెడ్డి హత్యకు కుట్ర పన్నారని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఆరోపించారు. కర్నూల్‌ జిల్లాలో జరిగిన నారాయణరెడ్డి సంతాపసభకు వైసీపీ నాయకులు హాజరై.. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నారాయణరెడ్డికి నివాళులు అర్పించారు. ఈసారి వచ్చేది తామేనని... టీడీపీ ఆగడాలకు చెక్‌ పెడుతుందని అన్నారు. 

21:30 - May 31, 2017

హైదరాబాద్ : తెలంగాణ రెవిన్యూశాఖలో ప్రక్షాళన కొనసాగుతోంది. మియాపూర్‌ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల ఘటనతో మేల్కొన్న ప్రభుత్వం.. అధికారుల బదిలీలను ముమ్మరం చేసింది. చాలాకాలంగా ఒకే చోట పాతుకుపోయిన వారిని బదిలీ చేస్తోంది. నిన్న, ఈరోజు కలిపి మొత్తం 72 మంది సబ్‌ రిజిస్ట్రార్లను బదిలీ చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి.

21:28 - May 31, 2017

సంగారెడ్డి : జిల్లాలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రజాగర్జన సభకు రెండు లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఈ సభకు వేరే జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రైతులు కూడా రాబోతున్నారని చెప్పారు. ఈ సభ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ నాయకులు షబ్బీర్‌ ఆలీ, ఎంపీ వి. హనుమంతరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా సోనియాగాంధీ కుటుంబాన్ని విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదని షబ్బీర్‌ ఆలీ అన్నారు.

21:27 - May 31, 2017

గుంటూరు : పాలనలో అవినీతిని సహించేదిలేదని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. లంచాలు తీసుకుంటే వాళ్లని రోడ్డుపై నిలబెడతానని హెచ్చరించారు. టీని అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారని... అలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విజయవాడలో విదేశీ విద్య దీవెన పథకంలో ఎంపికైన విద్యార్థులతో చంద్రబాబు చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు

కరీంనగర్ : జిల్లాలోని తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఏసీబీ అధికారులు పలు ఫైళ్లును స్వాధీనం చేసుకున్నారు.

 

కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ దాడి

నాగర్ కర్నూల్ : జిల్లాలోని కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ దాడులు చేస్తోంది. ఏసీబీ అధికారులు కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్నారు. 

2016 సివిల్స్ ఫలితాలు విడుదల

ఢిల్లీ : 2016 సివిల్స్ ఫలితాలు విడుదల. యూపీఎస్సీ గ్రూప్ ఏ, బీ ఫలితాలు విడుదల చేసింది. మొదటి ర్యాంక్ కేఆర్ నందిని(కర్ణాటక), రెండవ ర్యాంక్ అన్ మోల్ షేర్ సింగ్ బేడీ, మూడవ ర్యాంక్ జి.రోనాన్కీ దక్కించుకున్నారు.

 

స్త్రీ, శిశుసంక్షేమశాఖలపై చంద్రబాబు సమీక్ష సమావేశం

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మున్సిపల్, స్త్రీ, శిశుసంక్షేమ శాఖలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పరిటాల సునీత, నారాయణ హాజరైయ్యారు.స్త్రీ, శిశుసంక్షేమశాఖలపై చంద్రబాబు సమీక్ష సమావేశం

 

నర్సాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

మెదక్ : జిల్లాలోని నర్సాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్యర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారి మండలం కారికాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడడంతో నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

20:11 - May 31, 2017

ఎన్కట మా కాలంల మొగులును జూశి.. ఎప్పుడు వానలు వడ్తయ్.. ఎండకాలం ఎప్పటి సంది సుర్వైతది..? ఎప్పుడు ఇత్తునపొడ్లు నానవొయ్యాలే అనే అల్గగ జెప్తుండె పెద్దమన్షులు..ఇద్దరాలు మొగలు గొట్లాడుకోని పోరన్ని బాయిలేశినట్టే ఉన్నది ఈ ముచ్చట.. నీది దొంగ సర్వే అని కాంగ్రెసోళ్లు దిట్ట.. ధమ్ముంటే మీరు రాజీనామా జేశి మళ్ల గెల్వుండ్రి అని టీఆర్ఎసోళ్లు.. తెలంగాణ ప్రజలారా..? జర్ర ఇది మీరు బాగ ఇనాలే ముచ్చట.. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం మీ అందర్ని ఉద్దరించెతందుకు ఒక్కటి గాదు రెండు గాదు 365 పథకాలను ప్రవేశపెట్టిందట..మన ఏతుల పుంజు కం.. అంతర్జాతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు.. మళ్ల గాలితిర్గుడే తిర్గుతున్నట్టుండుగదా... ప్రియమైన ప్రజలారా..? మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాటలు ఏస్కోండ్రి.. మీ పోరగాళ్లను ప్రభుత్వం ఏర్పాటు జేస్తున్న గురుకుల పాఠశాలలళ్ల జేర్పిచ్చుకోండ్రి..పబ్లీకుకు కోపమొస్తె ఎంత పనిజేస్తరు సూడుండ్రి.. వరంగల్ కాడ ఒకామే ఊరివెట్టుకోని సచ్చిపోయింది.. అయితే ఆ సచ్చిపోయినామే సుట్టాలే.. పెద్ద పంచాది దీశి..ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ జేస్తున్న అద్బుతమైన పనులకు ఎసొంటి ఆటంకం లేకుంట.. ప్రతిపక్షాల దిష్టిదాకకుంట..చానునోట్లె తల్కాయవెట్టి బైటికొచ్చినా అని కొంతమంది చెప్తాఉంటరు.. వాళ్లు పెట్టొచ్చిండ్రో లేక మాటలే జెప్పిండ్రో తెల్వదిగని..

20:04 - May 31, 2017

పాలమూరు : ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాలమూరు జిల్లావాసులకు అనేక హామీలు గుప్పించారు. అధికారం వచ్చి మూడేళ్లవుతున్నా... అవి అమలుకు మాత్రం నోచుకోలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఒకే రోజు 8 నియోజక వర్గాలలో తిరిగి తాము అధికారంలోకి వస్తే జిల్లా సమస్యలను సమూలంగా పరిష్కారిస్తామన్నారు.. నమ్మిన జనం.. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అఖండ విజయాన్ని చేకూర్చారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు.

పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని... పంటలకు సాగునీరు అందిస్తామని, పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కట్టి ఇస్తామని టీఆర్ఎస్‌ హామీ ఇచ్చింది. అలాగే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాట కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం వీటిని అమలు చేయలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే హామీలు అమలు చేయకపోవడంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. అలవికాని హామీలిచ్చిన కేసీఆర్‌ ప్రజలను దారుణంగా మోసం చేశారని విమర్శిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని కోరుతున్నారు. గపెండింగ్‌లో ఉన్న ఆర్డీఎస్ పనులు పూర్తైతే ఎంతో మంది రైతులకు సాగునీరు అందుతుందని...కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రైతుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికార పార్టీ నాయకుల ధీమా
అయితే జిల్లాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అధికార పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో రెండేళ్లలో అన్ని పూర్తిచేస్తామని అంటున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూం నిర్మాణం సైతం చివరి దశకు చేరుకుందని... వలసలను అరికట్టే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. అలాగే పాలమూర్‌ రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల పాలనలో జిల్లాకు ఒరిగిందేమి లేదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

19:58 - May 31, 2017

ఢిల్లీ : మోదీ మూడేళ్ల పాలనలో సాధించిన ప్రగతి ఏమీ లేదని.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మోదీ మూడేళ్ళ పాలనా వైఫల్యాలపై "తీన్ సాల్ న రోటీ న దాల్ హజారోం సవాల్" పేరుతో సీపీఎం వేసిన పుస్తకాన్ని ఏచూరి ఆవిష్కరించారు. దేశమంటే మట్టికాదు మనుషులన్న గురజాడ మాటలను గుర్తుచేసిన ఏచూరి.. మోదీ పాలనలో ధనవంతులు ఇంకా ధనవంతులవుతున్నారని.. పేదవారు ఇంకా పేదవారుగా మిగులుతున్నారన్నారు. ఐటీ రంగంలో 56 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. పరిశ్రమలు, సేవలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాల వృద్ధి రేటు పడిపోయాయని తెలిపారు. దేశంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గడిచిన మూడేళ్ళుగా సంవత్సరానికి 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ.. మూడేళ్ళైనా నెరవేర్చలేదన్నారు. పేదల పక్షాన నిలబడి పోరాడుతామని కలిసివచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని ఏచూరి తెలిపారు. 

19:57 - May 31, 2017

హైదరాబాద్ : భారతదేశంలో 29 వ రాష్ట్రంగా 2014 జూన్ 2న అవతరించిన తెలంగాణ నాలుగో వసంతంలోకి అడుగు పెడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాడే తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా మూడేళ్ల పాలనా కాలం పూర్తి చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్లలో కెసిఆర్ తెలంగాణను ధనిక రాష్ట్రంగా అభివర్ణిస్తే చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ అదే కెసిఆర్ బిజెపి బాస్ అమిత్ షా కు కౌంటరిచ్చేందుకు ధనిక రాష్ట్రం అన్న వాదనను లాఘవంగా ప్రయోగించి ఔరా అనిపించారు. తెలంగాణ సెంటిమెంట్ ను సజీవంగా వుంచడంలోనే కాదు కొత్తకొత్త కలలు, ఆశలు కల్పించడంలోనూ కెసిఆర్ దిట్ట. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కెసిఆర్ అప్పటికే తొమ్మిదేళ్ల పాలనా అనుభవం వున్న పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడగలరా? అన్న సందేహాలు వ్యక్తం చేసిన రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు కెసిఆర్ కే ఎక్కువ మార్కులు వేస్తుండడం విశేషం. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో కరెంటు తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందంటూ ఎకసెక్కాలాడినవారి నోళ్లు మూయించడంలో కెసిఆర్ సఫలీకృతులయ్యారు. చత్తీస్ ఘడ్ తో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంపై ఎన్ని విమర్శలున్నా, ఈ మూడేళ్ల కాలంలో విద్యుత్ సరఫరా మెరుగుపడడం, వేసవిలో కూడా విద్యుత్ కోతలు లేకపోవడం తెలంగాణ ప్రజలకు పెద్ద రిలీఫ్.

అతిపెద్ద సంస్కరణ
పది జిల్లాల తెలంగాణను 31 జిల్లాల సమాహారంగా పునర్ వ్యవస్థీకరించడం టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద పాలనా సంస్కరణ. దీని ఫలితాలు అర్ధం కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. తెలంగాణ ఆవిర్భావం నాటికి రైతులకు వివిధ బ్యాంకుల్లో వున్న లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని పూర్తిగా నెరవేర్చినట్టు కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించుకుంది. అయితే, రుణ మాఫీ నాలుగు విడతలుగా అమలు చేయడం వల్ల తమకు సంపూర్ణ ఫలితం దక్కలేదన్న అసంతృప్తి కొంతమంది రైతుల్లో వుంది. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్, రబీ సీజన్ లలో కలిపి ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ తాజా వాగ్ధానం రైతులను ఊరిస్తోంది. ఇది నిజంగా అమలైతే, ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర లిఖించుకుంటుంది.

డబుల్ బెడ్ రూం ఇళ్లు
ముఖ్యమంత్రి కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల స్వప్నాన్ని ఆవిష్కరించిన తొలినాళ్లలో అందరూ సంభ్రమాశ్చర్యాలతోనే ఆలకించారు. కానీ, ఆ కల ఇప్పటికీ వాస్తవరూపం దాల్చలేదు. డబుల్ బెడ్ రూం స్వప్నమే తమ పాలిట శాపంగా మారుతుందన్న భయం ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెన్నాడుతోంది. సమస్యలు అధ్యయనం చేయడంలోనూ, పథకాలు ప్రకటించడంలోనూ కనబరిచే ఉత్సాహం వాటి అమలులో చూపించకపోవడం కెసిఆర్ పెద్ద బలహీనత. దళితులకు మూడు ఎకరాల భూమి పథకం ఇందుకు మరో నిదర్శనం.రాష్ట్రం విడిపోతే, హైదరాబాద్ ఎకానమీ దెబ్బతింటుందన్న వాదన ఈ మూడేళ్ల అనుభవంలో వీగిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కాపాడడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయినట్టే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఎస్ ఐపాస్ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత 71617 కోట్ల రూపాయల పెట్టుబడులతో 3828 పరిశ్రమలకు అనుమతులిచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, 280 ఇంజనీరింగ్ పరిశ్రమలు, 195 ఆగ్రో బేస్ట్ పరిశ్రమలు, 169 ఫార్మా కెమికల్స్, 165 ప్లాస్టిక్ రబ్బరు పరిశ్రమలు, 166 గ్రానైట్ స్టోన్ క్రషింగ్ పరిశ్రమలకు అనుమతులిచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచంలోని టాప్ 5 కంపెనీలలో నాలుగు కంపెనీలు హైదరబాద్ లో ఆఫీసులు ఏర్పాటు చేస్తుండడం కెసిఆర్ ప్రభుత్వానికి మంచి మైలేజ్. గత మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం భావిస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు లోటు రానీయకుండా పనులు చేస్తున్నారు. ఏటా 9వేల చొప్పున ఐదేళ్లలో 45వేల చెరువులను మరమ్మతు చేయడం, పునరుద్దరించడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. రాబోయే రెండేళ్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించాలంటే గడిచిన మూడేళ్లలో సాగించిన కృషి సరిపోదు. ఈ పథకాల ఫలితాలు రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారతాయన్నది కెసిఆర్ నమ్మకం.

ప్రాజెక్టుల రీ డిజైన్
గత మూడేళ్లుగా కెసిఆర్ అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా విమర్శలపాలవుతోంది. నిధులు, నీళ్లు, నియామకాలే తెలంగాణ ఉద్యమానికి ఊపరి. ప్రాజెక్టుల రీ డిజైన్ అత్యంత వివాదస్పద వ్యవహారంగా మారిపోయింది. 2013 భూ నిర్వాసిత చట్టం ప్రకారం కాకుండా 123 జీవో ప్రకారం భూసేకరణకు ప్రయత్నించడం, దానిని హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిన పరిణామాలు. తొలి రెండేళ్ల పాటు దాదాపు మౌన పాత్ర పోషించిన జెఏసి చైర్మన్ కోదండరామ్ అభివృద్ధి నమూనా విషయంలోనే కెసిఆర్ తో తీవ్రంగా విబేధిస్తున్నారు. భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరించే విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

ధర్నా చౌక్ ను ఎత్తివేత..
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను ఎత్తివేయాలన్న నిర్ణయమూ తీవ్ర వివాదస్పదమైంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారన్న విమర్శలకు ఇందిరా పార్క్ ఉదంతం మరింత ఊతమిస్తోంది. ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమానికి పోటీగా కౌంటర్ ఉద్యమాన్ని సృష్టించిన తీరు అభాసుపాలైంది. ఈ మూడేళ్ల కాలంలో ధర్నా చౌక్ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా ఆత్మరక్షణలో పడింది. కార్మిక, ప్రజాసంఘాలు ఆయా సమస్యల మీద ఉద్యమించిన్నప్పుడు వాటిని అవహేళన చేయడం, ఉద్యమకారుల డిమాండ్స్ విషయంలో నిర్లప్తంగానూ, మొండిగానూ వ్యవహరించడం, నాయకత్వం వహిస్తున్నవారితో కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించడం, ఓ ఏడాది తర్వాత అదే సమస్యలపై, అదే డిమాండ్స్ పై సానుకూలంగా స్పందించడం కెసిఆర్ స్టయిల్ గా మారిపోవడం ఈ మూడేళ్లలో కొట్టొచ్చినట్టు కనిపించిన దృశ్యం. ఆశా వర్కర్లు, మున్సిపల్ వర్కర్ల సమ్మెల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. తక్షణం పరిష్కరించే అవకాశం వున్న సమస్యలను కూడా కెసిఆర్ తన విపరీత మనస్తత్వం కారణంగా ఎలా వాయిదా వేస్తున్నారో ఇలాంటి కొన్ని సంఘటనలు పట్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను ఆశిస్తున్న ఫలితాలు సాధించాలంటే తన విపరీత మనస్తత్వం కారణంగా జరుగుతున్న హానిని గుర్తించి, తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సి వుంటుంది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తొలి మూడేళ్లు కెసిఆర్ చెప్పిన మాటలు తెలంగాణ ప్రజలు సంభ్రామాశ్చర్యాలతో ఆలకించారు. భవిష్యత్ మీద భరోసాను పెంచుకోవడానికి ఆయన మాటలు ఉపకరించాయనడంలోనూ సందేహం లేదు. అయితే, రాబోయే రెండేళ్లలో ప్రజలు ఫలితాలు ఆశిస్తారు. ఏ సమాజమైన కలలతో ఎక్కువ కాలం గడపలేదు. ఇక సమయం లేదు మిత్రమా అన్నట్టు ఫలితాలు చూపించాల్సిన సమయం వచ్చేసింది.

ఉద్యోగ నియామకాల ప్రక్రియ
తెలంగాణ నిరుద్యోగ యువత ఆశిస్తున్నట్టుగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగంగా సాగడం లేదు. అడపా దడపా వస్తున్న నోటిఫికేషన్లు తెలంగాణ నిరుద్యోగుల దాహార్తిని తీర్చడం లేదు. తెలంగాణ వస్తే కనీసం లక్ష ఉద్యోగాలొస్తాయన్న యువత భావించగా, ఇప్పటికి టిఎస్ పిఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చింది 5936 ఉద్యోగాలకే. వీటిలో కొన్నింటి ఇంటర్వ్యూలు ఇంకా పెండింగ్ లోనే వున్నాయి. ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్, పోలీస్ డిపార్ట్ మెంట్ లలో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కలిపినా 22వేల లోపే వున్నాయి.

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న సంకల్పమూ నెరవేరలేదు. హై కోర్టు తీర్పుతో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవో చెల్లని చిత్తుకాగితంగా మిగిలిపోయింది. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలోనూ కోర్టులో ఎదురుదెబ్బే తగిలింది. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కు బదులుగా ఫాస్ట్ పేరుతో ప్రవేశపెట్టిన పథకమూ కోర్టుల్లో పల్టీ కొట్టింది. ఆరంభంలో వుండే ఊపు ఆ తర్వాత కొనసాగించకపోవడం కెసిఆర్ మూడేళ్ల పాలనలో కొట్టొచ్చిన్నట్టు కనిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు , రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, ఇందిరమ్మ ఇళ్లపై సిఐడి ఎంక్వయిరీ, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీలపై విజిలెన్స్ తనిఖీలు ఇలా ఏది చూసినా ఆరంభ శూరత్వమే తప్ప చివరకు సాధించిందేమీ కనిపించడం లేదు. హైదరాబాద్ శివార్లలో నాలుగు చెరుగులా నాలుగు పెద్ద ప్రభుత్వాసుపత్రులను స్థాపిస్తామంటూ కెసిఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బ్రహ్మాండమైన ప్రణాళికను ప్రకటించారు. కానీ, ఇప్పటికే ఉనికిలో వున్న గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, కోఠీ మెటర్నిటీ ఆస్పత్రుల నిర్వహణ లోపాలను సరిదిద్దలేకపోతున్నారు. ఆయా ఆస్పత్రుల్లో వరుసగా జరిగిన విషాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మూడేళ్ల తర్వాత కూడా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఏమాత్రం మెరుగుపడలేదన్న నిర్వేదమే ప్రతి చోటా వ్యక్తమవుతోంది.

కేసీఆర్ సర్వేలు
ఎమ్మెల్యేల పనితీరు మీద నిరంతరం సర్వేలు చేయించుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రజల గుండెల్లో కదలాడుతున్న భావాలు తెలియడం లేదనుకోలేం. మూడేళ్ల పాలనలో కొన్ని ప్లస్ లు, కొన్ని మైనస్ లు మూటగట్టుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే ఏడాది అత్యంత కీలకం.  

19:30 - May 31, 2017
19:29 - May 31, 2017
19:27 - May 31, 2017

నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారి మండలం కారికాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడడంతో నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందినవారు దొరవారి సత్రంకు కూలీ పని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చొటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. మృతులు నాగయ్య, శేషయ్య, చంద్రయ్య, సుబ్రహ్మణ్యంతగా పోలీసులు గుర్తించారు.

19:26 - May 31, 2017

విజయనగరం : బలమైన ప్రతిపక్షంగా ఉండి ... ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వైసీపీ అంతర్గత పోరుతో సతమతమవుతోంది. విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయ కర్త... జిల్లా పార్టీ సమన్వయ కర్త మధ్య వర్గపోరు సాగుతోంది. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి ఒక వర్గానికి.... జిల్లా పార్టీ సమన్వయ కర్త, బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్నశ్రీను వేరొక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు, ప్రెస్‌ మీట్‌లను నిర్వహిస్తూ... కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు.

కోలగట్ల, శ్రీను మధ్య పోరు
వాస్తవానికి ఒక్క కడపలో తప్ప...వైసీపీ జిల్లా సమన్వయకర్త పదవి ఏ జిల్లాలోనూ లేదు. కాని, విజయనగరం జిల్లాలో కోలగట్లకు పోటీగా ఉండేందుకని చిన్న శ్రీను అధిష్ఠానాన్ని ఒప్పించి మరీ జిల్లా సమన్వయకర్త పదవిని దక్కించుకున్నారని సమాచారం. జిల్లా సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన చిన్న శ్రీను అభినందన కార్యక్రమానికి కోలగట్ల వర్గీయులు హాజరు కాలేదు. గతంలో ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి జిల్లాకు వచ్చిన సమయంలో బొత్స వర్గం కనీసం మర్యాద పూర్వకంగానైనా కోలగట్లను కలవలేదు. జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉన్నా ...జిల్లా పార్టీలో ఎటువంటి సమన్వయ లోపం లేదని, అందరినీ కలుపుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తానని చిన్న శ్రీను చెబుతున్నారు.

వైసీపీలోకి వెళ్లిన కోనగల్ల
గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పటి నుంచే కోలగట్ల, బొత్స మధ్య వర్గపోరు ఉంది. బొత్సతో పొసగలేక 2014 ఎన్నికలకు ముందు కోలగట్ల వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే, ఎన్నికల తర్వాత బొత్స సైతం వైసీపీలోకి రావడంతో మళ్లీ పాత పరిస్థితే కొనసాగుతోంది. ప్రస్తుతం బొత్స కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైనా... జిల్లాలో తన మేనల్లుడు చిన్న శ్రీనుతో పరోక్ష రాజకీయాలు నడుపుతున్నారు. బొత్స నాయకత్వంతో ఇమడలేని కోలగట్ల.. వేరే శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని కేవలం విజయనగరం పట్టణానికే పరిమితమవుతున్నారు.ఏదిఏమైనా గ్రూపు తగాదాలతో జిల్లాలో వైసీపీ అబాసుపాలవుతోంది. ఇప్పటికైనా అధిష్ఠానం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

19:25 - May 31, 2017
19:22 - May 31, 2017

విజయవాడ : విజయవాడలోని స్వరాజ్య మైదాన ప్రాంగణాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడం దారుణమని వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. స్వరాజ్య మైదానం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోట్లాది రూపాయల విలువైన భూమిని ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం సరికాదని అఖిలపక్ష నాయకులు అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

19:21 - May 31, 2017

విజయవాడ : క్యాన్సర్‌తో చనిపోయిన సాయి శ్రీ తన బిడ్డ కాదన్న మాదంశెట్టి శివ వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని ఆమె తల్లి సుమశ్రీ అన్నారు.. శివ కుమార్‌కు ధైర్యం ఉంటే చర్చకు రావాలని.. తాను ఆధారాలతోసహా నిరూపిస్తానని సవాల్ విసిరారు.. శివ కుమార్‌ చరిత్ర అందరికీ తెలుసునని మండిపడ్డారు.. కూతురు చనిపోయాక కూడా శివ కుమార్‌, మంత్రి బొండా ఉమ ఇంకా వేధిస్తున్నారని విజయవాడలో ఆరోపించారు.

19:19 - May 31, 2017

హైదరాబాద్ : అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. పండ్లు మాగబెట్టేందుకు రసాయనాలు వాడటం ఆగడం లేదు. తాజాగా... హైదరాబాద్ కేపీహెచ్‌బీ అడ్డగుట్ట సొసైటీలో మామిడి పండ్ల గోడౌన్లపై ఎస్‌ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో చైనా నుంచి దిగుమతి అవుతున్న కెమికల్స్ వాడుతున్నట్టు గుర్తించారు. దీంతో రెండు గోడౌన్లు సీజ్ చేసి, కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

19:18 - May 31, 2017

మేడ్చల్ : ఇది ఓ సైకో కాదు..లేదంటే కట్నపిశాచి కాదు..ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్...న్యాయాన్ని కాపాడుతూ..ఆడాళ్లకు రక్షణ కల్పించాల్సిన ఎస్సై నట్టింట్లో ఇల్లాలికి నరకం చూపిస్తున్నాడు...ప్రతినిత్యం వేధింపులు భరించలేక..నాలుగుగోడల మధ్య నలిగిపోలేక ఆ ఇల్లాలు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది.తను సంగారెడ్డి ఎస్సైగా చేస్తున్న లక్ష్మారెడ్డి...ఇతనికి జ్యోతితో పెళ్లయింది..ఓ కొడుకు ఉన్నాడు...హాయిగా సాగుతున్న సంసారంలో అదనపు కట్నం పిశాచి ఆవహించింది...అంతే మరో పెళ్లి చేసుకుంటే కోటి రూపాయలు వస్తాయని..పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మంటూ వేధింపులు మొదలుపెట్టాడు..ఆ తర్వాత అనుమానం పెంచుకున్న ఎస్సై ఇంటి నిండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.. రకరకాలుగా ఉన్మాదిలా ప్రవర్తిస్తూ నిత్యం నరకం చూపిస్తున్నాడంటోంది ఆ ఇల్లాలు...భార్య కళ్ల ముందే అరాచకాలకు పాల్పడుతూ...విడాకులు ఇవ్వాలని..లేదంటే బెడ్ రూంలో తీసిన వీడియోలను నెట్‌లో పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు దిగి వేధిస్తున్నాడంటూ జ్యోతి చెబుతుంది. మల్కాజిగిరిలోని పివియన్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న జ్యోతి పోలీసులను ఆశ్రయించింది...న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తుంది.

19:16 - May 31, 2017

హైదరాబాద్ : ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీకేలో పట్నం ఆధ్వర్యంలో ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల దోపిడీపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్‌ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలని... పేదల విద్యార్థులకు సీట్లు కేటాయించి.. ఉచిత విద్యను అందించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

19:14 - May 31, 2017

కియెన్ :  ఉక్రెయిన్ రాజధాని కియెవ్‌ నగరంలో ఉన్నట్టుండి పెద్ద పేలుడు కలకలం సృష్టించింది. ఆ ధాటికి అపార్టుమెంట్లలోని ఏడో అంతస్తులో ఉన్న కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. భూమి బద్దలైంది. కార్లు గాల్లోకి లేచాయి. విపరీతంగా దుమ్ము వ్యాపించింది. అయితే అది బాంబు పేలుడు మాత్రం కాదు... భూమిలోపల ఉన్న నీటిపైపు పగిలి రోడ్డును బద్దలు చేస్తూ నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. వాటిపై బురద పేరుకుపోయింది. ఇదంతా కూడా అక్కడకు దగ్గర్లో ఉన్న సిసిటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదని స్థానిక జర్నలిస్టులు తెలిపారు. పైపు పేలుడుకు గల కారణాలు తెలియలేదు.

19:13 - May 31, 2017

కాబూల్ : ఆప్ఘనిస్థాన్‌లోని ఇండియన్‌ ఎంబసీ దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 80 మంది మృతి చెందగా.. 350 మందికిపైగా గాయపడ్డారు. ఎంబసీ కిటికీలు, డోర్లు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు ధాటికి వందల మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లు కూడా ద్వంసమయ్యాయి. అయితే ఎంబసీలోని అధికారులందరూ క్షేమంగానే ఉన్నారు. ఇండియన్‌ ఎంబసీ లక్ష్యంగా మాత్రం ఈ పేలుడు జరగలేదని సమాచారం. ఈ పేలుడుకు ఎవరూ బాధ్యత వహించకపోయినా... తాలిబన్ల పనే అని అనుమానిస్తున్నారు.

19:12 - May 31, 2017

జైపూర్ : మాంసం కోసం పశువుల అమ్మకాల నిషేధంపై దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌ హైకోర్టు కీలక సూచనలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. అంతేగాక, ఆవును వధించేవారికి యావజ్జీవ కారాగార శిక్ష పెంచాలని సిఫార్సు చేసింది. ఆవుల సంరక్షణపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సమయంలో ఈ మేరకు సూచనలు చేసింది.

19:11 - May 31, 2017

వరంగల్ : 42 గ్రామాల విలీనంతో గత నాలుగేళ్ల క్రితం వరంగల్ కార్పోరేషన్ కాస్తా.. గ్రేటర్ కార్పోరేషన్‌గా మారింది. ఇప్పుడు గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌లో 58 డివిజన్లు ఉన్నాయి. వీటిలో అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుచుకున్నారు. కానీ డివిజన్లలో అభివృద్ది శూన్యం. ఇక 34 వ డివిజన్ సమస్యలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కాజీపేటకు 3 కిలో మీటర్ల దూరంలో.. నేషనల్ హైవే 163 కి పక్కనే ఉన్న నెహ్రునగర్ ఇది. ప్రజలు 25 యేళ్ల నుంచి ఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. పేరుకు ఇది స్మార్ట్‌ సిటీ. కానీ ఈ కాలనీల్లో రోడ్లు లేవు. మట్టి రోడ్లు మట్టి పోయి రాళ్లు తేలి కనపడుతున్నాయి. ఈ రోడ్లపై నడుద్దామన్న నరకం కనపడుతుందని స్థానికులు అంటున్నారు. కొత్త డ్రైనేజీల నిర్మాణం మాటే లేదు. పాత డ్రైనేజీలను పట్టించుకున్నవారే లేరని వాపోతున్నారు.

కరెంటు స్థంభాలు లేవు
సిటీలో కలిసినట్లు ఉండే నెహ్రూ నగర్ లో కరెంట్ సరఫరా చేసే విద్యుత్‌ స్థంభాలు లేకపోవడం.. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇండస్ట్రీకి కేటాయించిన ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఇచ్చారు విద్యుత్ అధికారులు. ఇళ్ల మధ్యలో ఇండస్ట్రీలు ఉండటం.. నెహ్రూనగర్‌ ప్రజలను వేధిస్తోన్న మరో సమస్య. ఒక ఆయిల్ మిల్, రెండు రైస్‌ మిల్లుల వల్ల ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. వాటి నుంచి వచ్చే వాసన, దుమ్ము ద్వారా ఇప్పటికే చాలా మంది స్థానికులు హాస్పిటల్ పాలయ్యారు. వీటికి తోడు ఇదే ఏరియాలో డంపింగ్‌ యార్డ్స్‌ పెట్టడంతో.. మట్టి తరలింపుకు పెద్ద పెద్ద లారీలు మట్టి రోడ్లపై వెళ్లడం మరో నరకంగా ఉందంటున్నారుకార్పోరేషన్‌లో కలిస్తే అభివృద్ధి జరుగుతుందనుకొని.. నెహ్రూనగర్‌ కాలనీలో ఎన్నో కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితిని చూసి ఇంత దారుణంగా అవుతుందనుకోలేదని పలువురు స్థానికులంటున్నారు. గ్రామ పంచాయితీలుగా ఉన్నప్పుడు అధికారులు కానీ.. నాయకులు కానీ సమస్య అనగానే వచ్చేవారంటున్నారు. కార్పోరేషన్‌లో పన్నులు వసూలు చేయడంలో.. చూపించిన శ్రద్ధ అభివృద్ధిపై చూపించడం లేదంటున్నారు. బంగారు తెలంగాణ కోసం అభివృద్ధికి వందల కోట్లు ఇస్తామంటోన్న ప్రభుత్వం.. ఆ సొమ్మును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చాలా సార్లు గ్రీవెన్‌ సెల్‌కి వెళ్లి సమస్యలను ఏకరువు పెట్టి.. 9 లక్షలతో రోడ్డును సాంక్షన్‌ చేయించుకున్నారు. అయితే కమిషనరేట్‌ దగ్గరే ఫైల్‌ ఆగిపోయేలా చేశారని నెహ్రూనగర్‌ స్థానికులు ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వదిలి.. తమకు న్యాయం చేసేందుకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే ఇక్కడ ఉండటం నరకంలో ఉండటమే అవుతుందని స్థానికులంటున్నారు.

19:08 - May 31, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస చెక్కర కార్మాగారం పరిసరాల్లో.. చిరుత సంచరిస్తోందనే వార్త కలకలం సృష్టించింది. గడిచిన పన్నెండేళ్లుగా మూతపడి ఉన్న .. ఈ కార్మాగారంలో పలు జంతువులు సంచరిస్తూ ఉన్నాయి. ఈ మధ్యే అంబికా లామినేషన్స్ అనే సంస్థకు.. ఈ కార్మాగారాన్ని అప్పగించారు. సంస్థకు చెందిన కాపాలాదారుడు ఇక్కడ ఉంటున్నాడు. అయితే మెయిన్ డోర్ నుంచి లోపలికి చూస్తే అక్కడ చిరుత కనిపించడంతో.. సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించడంతో పాటు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు.. సెక్యూరిటీ సిబ్బంది చెప్పిన ఆనవాళ్లను బట్టి అది హైనా అయి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఈ వార్త బయటకు రావడంతో.. ఆమదాలవలస పరిసర ప్రాంతీయులు ఆందోళనకు గురవుతున్నారు. 

17:18 - May 31, 2017

పశ్చిమ గోదావరి : పశ్చిమగోదావరి జిల్లాలోని.. భీమవరం పట్టణంలో కారు ఢీకొని ఒకరు మృతి చెందగా... ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. లంకపేటలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 38వ వార్డు కౌన్సిలర్‌ భర్త పిల్లి ముసలయ్య కారు నిలిపే క్రమంలో బ్రేక్‌ వేయబోయి.. ఆక్సిలేటర్‌పై కాలు వేయడంతో సమీపంలోని ఓ పాకపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మావుళ్లు అనే వ్యక్తి మృతి చెందగా... శాంతమ్మ, మరియమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా కారు నడుపుతున్న ముసలయ్య మద్యం సేవించి ఉన్నట్టు సమాచారం.

17:13 - May 31, 2017

ఫ్రెంచ్ : ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ రిపోర్టర్‌ పట్ల ఓ ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్‌లో ఓడిపోయిన మాక్సిమ్ హామవ్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు మహిళా జర్నలిస్టు మాలీ థామస్ అతడి దగ్గరకు వెళ్లింది. మాట్లాడుతుండగానే తొలుత మాక్సిమ్ ఆమె భుజాలపై చేతులు వేశాడు. లైవ్ కావడంతో ఆమె సంయమనం కోల్పోకుండా నవ్వుతూనే ఇంటర్వ్యూ చేసింది. ఇంతలో ఉన్నట్టుండి అతగాడు న్యూస్ రిపోర్టర్‌కు ముద్దులివ్వడం మొదలుపెట్టాడు. ఎంతవారిస్తున్నా పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. మాక్సిమ్ తీరును సీరియస్‌గా తీసుకున్న ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్...అతడిని ఫ్రెంచ్ టెన్నిస్ ఓపెన్‌ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.

17:05 - May 31, 2017

వికారాబాద్‌ : జిల్లాలో కన్నారెడ్డి అనే యువకునిపై పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటనలో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కన్నారెడ్డిపై స్థానిక ఏవో ఫిర్యాదు చేయడంతో.. మోమిన్‌పేట పోలీసులు అతడ్ని దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో చిన్నారెడ్డి రెండు కిడ్నీలు ఫెయిలయి.. ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో... ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు పాటించారు. ఎలాంటి విచారణ జరపకుండా... బాధితునిని తీవ్రంగా కొట్టినందుకు... మోమిన్‌పేట ఎస్‌ఐ రాజు, ఏఎస్‌ఐ వీరస్వామి, హెడ్ కానిస్టేబుళ్లు వెంకటేశ్, శంకరయ్య, కానిస్టేబుళ్లు శివయ్య, రాఘవేందర్‌ను అటాచ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

17:03 - May 31, 2017

రంగారెడ్డి : దర్శకరత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ నగర శివారు మొయినాబాద్‌ మండలం తోల్కట్ట వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య.. దాసరి సతీమణి పద్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియల్ని పూర్తిచేశారు. దాసరి మరణవార్త తెలుసుకొని తెలుగు చిత్ర పరిశ్రమ కన్నీరు మున్నీరైంది. అంతకుముందు దాసరిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం ప్రజల సందర్శనార్థం దాసరి భౌతికకాయాన్ని ఇంటి నుంచి ఫిలింఛాంబర్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి మొయినాబాద్‌లోని దాసరి వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.

16:46 - May 31, 2017

కమిల్ మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేల దాడి

ఢిల్లీ : కమిల్ మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. కేజ్రీవాల్ పై ఆరోపణలకు చేసినందుకు ఆ దాడి చేసినట్టు తెలుస్తోంది. 

మామిడి గోడౌన్లపై ఎస్ఓటీ పోలీసుల దాడి

హైదరాబాద్ : కేపీహెచ్ బీ అడ్డగుట్ట సొసైటీల్లో మామిడి గోడౌన్లపై ఎస్ఒటీ పోలీసుల మెరుపు దాడులు చేశారు. చైనా నుంచి దిగుమతి చేసిన కెమికల్స్ వాడుతున్నారని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి గోడౌన్లు సీజ్ చేశారు. 

ఓయూ డిగ్రీ ఫలితాల విడుదల..

హైదరాబాద్: ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. ఓయూ డిగ్రీ సెకండియర్, థర్డ్ ఇయర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఓయూ డిగ్రీ ఫలితాల్లో మొత్తం 57.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

స్పెయిన్ అధ్యక్షుడితో మోడీ భేటీ..

మాడ్రిడ్: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బుధవారం స్పెయిన్ దేశాధ్య‌క్షుడు మారియానో రాజోయ్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు, స‌మాజానికి ఉగ్ర‌వాద‌మే పెను స‌వాల్‌గా మారింద‌ని మోడీ పేర్కొన్నారు.

ఏ నిర్ణయమైనా అమలు చేసేందుకు సిద్ధం- నేవీ చీఫ్..

పుణె : కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయాన్నైనా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా వ్యాఖ్యానించారు. పుణేలోని జాతీయ రక్షణ అకాడమీ(ఎన్‌డీఏ) గ్రాడ్యుయేట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

13:24 - May 31, 2017

హైదరాబాద్ : దాసరి నారాయణ రావు హఠాన్మరణం తనకు బాధ కలిగించిందన్నారు దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన జీవితం సార్థకత అయినట్లు తాను భావిస్తున్నానని..అయినా ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాని చెప్పారు. దర్శకరత్న దాసరి మృతికి హాస్యనటుడు వేణుమాధవ్‌ నివాళి అర్పించారు. ప్రేమాభిషేకం సినిమాతో నిర్మాతగా, హీరోగా నటించడానికి దాసరి నారాయణ రావే కారణమన్నారు. ఒక్క పెద్ద దిక్కు కోల్పోయిందని, దాసరి మృతి చెందడం బాధిస్తోందని యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు పేర్కొన్నారు.

ప్రారంభమైన దాసరి అంతిమయాత్ర..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ చాంబర్ నుండి చేవెళ్ల ఫాం హౌస్ కు వరకు అంతిమయాత్ర జరగనుంది.

13:12 - May 31, 2017

పశ్చిమగోదావరి : దర్శక రత్న దాసరి నారాయణ రావు సొంతూరు పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాసరి మరణ వార్తను వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మృతికి నివాళిగా వ్యాపార వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. నాటకీయ కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఏపీ మంత్రివర్గ భేటీ సమయంలో మార్పు..

విజయవాడ : గురువారం జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాల్సిన సమావేశాన్ని ఉదయం 10.30గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు మార్చారు.

ఆధార్ - పాన్ అనుసంధానానికి..

హైదరాబాద్ : ఆధార్ - పాన్ అనుసంధానానికి మరో సదుపాయాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ కార్డుకు పాన్ నంబర్ ను అనుసంధానం చేసుకోవచ్చని ఐటీ శాఖ పేర్కొంది. 567678 లేదా 56161 నంబర్లకు ఎస్ఎంఎస్ చేసి ఆధార్ -పాన్ లింక్ చేసుకోవాలని సూచించింది.

హోదా ఆంధ్రుల హక్కు - రఘువీరా..

విజయవాడ : హోదా అంశం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా విమర్శించారు. టిడిపి, బిజెపి హోదా ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని, హోదా ఇవ్వకుండా రెండు పార్టీలు తిరోగమనం వైపు పోతున్నాయన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని..ఇవ్వాల్సిందేనన్నారు. జూన్ 4వ తేదీన గుంటూరులో ప్రత్యేక హోదా భరోసా సభ ఉంటుందన్నారు.

 

పాలకొల్లులో 'దాసరి' శిలా విగ్రహం..

పశ్చిమగోదావరి : దర్శక రత్న దాసరి నారాయణ రావు సొంతూరు పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాసరి మరణ వార్తను వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మృతికి నివాళిగా వ్యాపార వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. నాటకీయ కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:20 - May 31, 2017

చెన్నై : దాసరి నారాయణ రావు గురించి ఒక్క మాటల్లో చెప్పలేమని ప్రముఖ నటి ఊర్వశి శారద పేర్కొన్నారు. సంపూర్ణుడు మాత్రం చెప్పగలమని, దాసరి లాంటి వ్యక్తి లేరని చెప్పడం బాధగా ఉందని తెలిపారు. ఇటీవలే ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో తాను పరామర్శించడం జరిగిందని, తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగిందన్నారు. కొద్ది సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా ఆ సినిమాలన్నీ అద్భుత చిత్రాలన్నారు.

12:14 - May 31, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు మృతి తాను జీర్ణించుకోలేక పోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చిన ఆయన దాసరి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మరణం చలన చిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి తీరని లోటన్నారు. దాసరి ఓ వ్యక్తి కాదని..ఒక వ్యవస్థ అని అభివర్ణించారు. పాలకొల్లులో జన్మించిన దాసరి ఎన్నో విజయాలు సాధించారని, సినీ కార్మికుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఏదైనా విషయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పేవారని, తమ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారని, వారి సతీమణి పద్మకు తాను అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. కొన్ని విలువల కోసం దాసరి పోరాడారని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు బాబు తెలిపారు.

దాసరి పార్థీవ దేహానికి బాబు నివాళులు..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు పార్థీవ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చనిపోయారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నట్లు, ఆయన మరణం చలన చిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికి తీరని లోటన్నారు.

ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్న ఏపీ సీఎం..

హైదరాబాద్ : నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రముఖ దాసరి నారాయణ రావు పార్థీవ దేహానికి ఆయన నివాళులర్పించారు.

11:56 - May 31, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు లోటు ఎవరూ తీర్చలేరని ప్రముఖ నటుడు కృష్ణ పేర్కొన్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో దాసరి భౌతికకాయాన్ని కృష్ణ, విజయనిర్మల దంపతులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఇండ్రస్ట్రీల్లో ఏ సమస్య వచ్చినా..చిన్న సినిమాలు రిలీజ్ కాకపోయినా దాసరి విశేషంగా కృషి చేశారని కృష్ణ తెలిపారు. ఆయన లేకపోవడం చాలా బాధిస్తోందని, ఆయన లోటు ఎవరూ తీర్చలేరని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తాను నటించడం పూర్వజన్మసుకృతమని విజయనిర్మల పేర్కొన్నారు. తనను ఇండ్రస్ట్రీలో చెల్లెమ్మా అని పిలిచే వారు లేరని, ఆయనొక్కరే చెల్లెమ్మా అని పిలిచే వారని కన్నీటిపర్యంతమయ్యారు.

ఫిల్మ్ ఛాంబర్ లో దాసరి పార్థీవ దేహం..

హైదరాబాద్ : ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం దాసరి నారాయణ రావు పార్థీవ దేహాన్ని ఉంచారు. కాసేపటి క్రితం ఆయన స్వగృహం నుండి అంతిమ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాసేపటి తరువాత ఆయన అంత్యక్రియ ఊరేగింపు ప్రారంభం కానుంది.

11:46 - May 31, 2017

పశ్చిమగోదావరి : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు మృతి పట్ల పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం దాసరి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి వార్తను సొంతూరు పాలకొల్లు వాసులు జీర్ణించుకోలేకపోతున్నరు. స్వచ్ఛందంగా వ్యాపార వర్గాలు బంద్ పాటిస్తున్నారు. దాసరి సేవలను నాటక కళాకారులు గుర్తు చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం బుధవారం నిర్మానుష్యంగా మారిపోయింది. పాలకొల్లుకు ఎంతో సేవ చేశారని, నాటక రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారని సన్నిహితంగా మెలిగిన వారు టెన్ టివితో పేర్కొన్నారు. మహిళా ప్రభుత్వ డిగ్రీ కళశాల పెట్టించారని, విరివిగా విరాళాలు ఇచ్చి ప్రోత్సాహించే వారని ఛాంబర్ ప్రెసిడెంట్ తెలిపారు.

11:43 - May 31, 2017

చెన్నై : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావుకు ఓ దుర్మార్గుడిని పరిచయం చేశానని నిర్మాత మురారీ పేర్కొన్నారు. దాసరి మృతి పట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. దాసరి అన్ని సమస్యలు తలెత్తుకొనే వారని, ప్రతొక్కరీ సమస్య తీర్చే వారని తెలిపారు. తన జీవితంలతో ఒకే తప్పు చేశానని..దాసరి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఒక దుర్మార్గుడిని పరిచయం చేసినట్లు తెలిపారు. ఈ తప్పు ఇప్పటికీ తనను కాల్చేస్తోందని మురారీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఐఐటీ మద్రాస్ క్యాంపస్ వద్ద ఉద్రిక్తత..

చెన్నై : ఐఐటీ మద్రాస్ క్యాంపస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఫ్ ఫెస్టివల్ లో పాల్గొన్న పీహెచ్ డీ స్కాలర్ పై మంగళవారం కొందరు విద్యార్థులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ బుధవారం విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

11:30 - May 31, 2017

బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్'కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో 'డ్వార్ఫ్' చిత్రంలో 'షారూఖ్' నటిస్తున్న సంగతి తెలిసిందే. మీరట్ లో జరుగుతున్న షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు. చిత్రీకరణ జరుగుతున్న సమయంలో సెట్ లోని పై కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో 'షారూఖ్' ఓ పక్కన కూర్చోవడంతో ప్రమాదం తప్పింది. ఆయనకు ఎలాంటి గాయాలు కలుగలేదని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు యూనిట్ సభ్యులు గాయపడ్డారని..వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా షూటింగ్ ను నిలిపివేశారు. షారూఖ్ కు జోడీగా 'కత్రినా కైఫ్', ‘అనుష్క శర్మ'లు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో 'షారూఖ్' పొట్టిగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

11:28 - May 31, 2017

'డైరెక్టర్‌ ఈజ్‌ ద కెప్టెన్ ఆఫ్‌ ద మూవీ' అని అందరు దర్శకులూ సగర్వంగా తలెత్తుకొని నిల్చొనేలా చేసిన దిగ్దర్శకుడు 'దాసరి నారాయణ రావు' అచేతనుడైపోయాడు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా 'మా గురువుగారున్నారు' అనే భరోసా కల్పించిన మహాగురువు మరల రాని లోకాలను మరలిపోయాడు. ఒక్క నటులే కాదు.. సినీ పరిశ్రమలోని 24 నాలుగు శాఖల వారూ తమ పెద్ద దిక్కు, తమ 'మేస్త్రీ' వెళ్లిపోయాడంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరి ఆయన గురించి తెలియని కొన్ని నిజాలు..వాస్తవాలు..ప్రముఖ విశ్లేషకులు 'తెలకపల్లి రవి'విశ్లేషించారు. జయచిత్ర (సీనియర్ నటి) కూడా దాసరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

అంతిమాయాత్రలో అల్లు అర్జున్..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. జూబ్లీహిల్స్ నుండి ఆయన స్వగృహం నుండి పార్థీవదేహాన్ని తరలించారు. సినీ నటులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

పశువధ నిషేధంపై డీఎంకే నిరసన..

చెన్నై : డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, డీఎంకే లీడర్ కనిమొళి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన పశువధ నిషేధాన్ని నిరసిస్తూ వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

నవ నిర్మాణ దీక్షపై ఏపీ సీఎం సమీక్ష..

విజయవాడ : నవ నిర్మాణ దీక్షపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష..8న మహాసంకల్పం విజయవంతం చేయాలని సూచించారు. వారంలో ఒక్కో రోజు ఒక్కో అంశంపై దీక్ష పూనాలని, ప్రతి జిల్లా నియోజకవర్గంలోని సభలను సవ్యంగా పరిశీలిస్తానని బాబు తెలిపారు. మూడేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

10:55 - May 31, 2017

దాల్చిన చెక్క..మసాల దినుసుల్లో ఇదొక రకం. దీనిని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు దాల్చిన చెక్క పొడి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయంట. దాల్చిన చెక్క సహజ సిద్ధమైన ఔషధగుణాలను కలిగి ఉంటుంది. మరి దాల్చిన చెక్కలో ఎలాంటి ఔషధాలున్నాయో ..చూద్దాం..
బ్రేక్‌ ఫాస్ట్‌లో లేదా ఫ్రూట్స్‌, పెరుగు, ఓట్స్‌, గుడ్డు తినేటప్పుడూ చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసుకుంటే బాగుంటుంది.
మిటమిన్లు..మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు గా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గిస్తుంది.
విటమిన్లు..మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే రసాయనాలు ముఖ్యంగా ఆక్సిడేషన్ ఒత్తిడిని..డయాబెటిస్ ను దూరం చేస్తాయి.
జీర్ణక్రియ ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది. దీని వల్ల అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. అధికరక్త పోటు తగ్గుముఖం పడతుంది.

కాబూల్ ఇండియన్ ఎంబసీ వద్ద పేలుడు..

కాబూల్ : భారతదేశ కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. భారత దౌత్యవేత్తలు సురక్షితమేనని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు.

పాలకొల్లులో స్వచ్ఛంద బంద్..

వెస్ట్ గోదావరి : ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మృతికి సంతాపం తెలియచేస్తూ పాలకొల్లులో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దాసరి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

10:27 - May 31, 2017

ఫిల్మ్ ఛాంబర్ కు దాసరి భౌతికకాయం..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలిస్తున్నారు. సినీ నటుడు మోహన్ బాబు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.

విజయవాడ మెట్రో ప్రాజెక్టు టెండర్ల రద్దు..

విజయవాడ : రెండోసారి మెట్రో ప్రాజెక్టు టెండర్లు రద్దయ్యాయి. టెండర్ల రద్దుకు గల కారణాలను డీఎంసీ గుట్టుగా ఉంచింది. భూ సేకరణ నోటిఫికేషన్ జారీ అయిన తరువాత టెండర్లు రద్దయ్యాయి. కొత్త విధానంలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది.

10:10 - May 31, 2017

'ఆగదు ఏ నిమిషము నీ కోసమూ..' అంటూ పాట రాసి, 'ప్రేమాభిషేకం' చేయించుకొన్న దార్శనికుడు శాశ్వతంగా కన్నుమూశాడు. చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలూ తీసి, 'డైరెక్టర్‌ ఈజ్‌ ద కెప్టెన్ ఆఫ్‌ ద మూవీ' అని అందరు దర్శకులూ సగర్వంగా తలెత్తుకొని నిల్చొనేలా చేసిన దిగ్దర్శకుడు అచేతనుడైపోయాడు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా 'మా గురువుగారున్నారు' అనే భరోసా కల్పించిన మహాగురువు మరల రాని లోకాలను మరలిపోయాడు. ఒక్క నటులే కాదు.. సినీ పరిశ్రమలోని 24 నాలుగు శాఖల వారూ తమ పెద్ద దిక్కు, తమ 'మేస్త్రీ' వెళ్లిపోయాడంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇక తనకు దిక్కేదంటూ తెలుగు చిత్రసీమ కన్నీరు కారుస్తోంది. ఈ సందర్భంగా జర్నలిస్టు దేవులపల్లి అమర్ తో టెన్ టివి మాట్లాడింది. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

10:07 - May 31, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు మృతి తనను బాధించిందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం దాసరి కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం బంజారాహిల్స్ లోని ఆయన స్వగృహం వద్ద దాసరి భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు దాసరి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎంపీ సుబ్బిరామిరెడ్డి, టి.కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పలువురు ఉన్నారు. దాసరి చాలా బాధ కలిగించిందని, త్వరగా కోలుకోవాలని ఆశించినట్లు పవన్ తెలిపారు. వ్యక్తిగతంగా చిన్నప్పటి నుండి తెలుసని, ఆయన మృతి తీరని లోటు అని తెలిపారు. ఆయన మృతి చెందడం..బాధగా ఉందని ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. సినీ రంగంలో..ఎన్నో రంగాల్లో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన తనకు గురువుతో సమానమని, ఆయనతో తనకు చాలా అనుబంధం ఉందన్నారు. సినిమాకు పనిచేసే సమయంలో దాసరి సతీమణి పద్మ భోజనం పెట్టారని గుర్తు చేసుకున్నారు. ఆయన కొలుకొని సినీ రంగంలో పని చేస్తారని ఆశించానని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

దాసరికి పవన్..త్రివిక్రమ్ నివాళులు..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావుకు పలువురు నివాళులర్పిస్తున్నారు. జూబ్లిహిల్స్ లోని ఆయన స్వగహంలో ఉంచిన దాసరి భౌతికకాయాన్ని కాసేపటి క్రితం నటుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఘనంగా నివాళులర్పించారు.

09:51 - May 31, 2017
09:43 - May 31, 2017

హైదరాబాద్ : సినీ దిగ్గజాలు రాలిపోతుండడంతో సినీ ప్రపంచం చిన్నదయి పోతోందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. దాసరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉన్నదంతా పరిశ్రమ కోసం..కార్మికుల కోసం ఖర్చు చేశారని నన్నపనేని రాజకుమారి తెలిపారు. ఏనాడో కులాంతర వివాహం చేసుకున్నాడని, ఆయనకు తీవ్ర సంతాపం తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

అంబటి నివాళి..
దాసరి నారాయణ రావు అనారోగ్యంతో హఠాత్తుగా మరణించడం కలిచివేసిందని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని వైసీపీ నేత అంబటి కొనియాడారు. దర్శకుడి పేరును ఆయన వెలుగులోకి తెచ్చారని, చలన చిత్ర రంగానికి పరిమితం కాదని, రాజకీయ రంగంలో ప్రముఖ స్థానం ఉందన్నారు. ఆయన మృతి చెందడం రాజకీయ, సినీ రంగానికి తీరని లోటని తెలిపారు.

దాసరికి నన్నపనేని నివాళి..

హైదరాబాద్ : సినీ దిగ్గజాలు రాలిపోతుండడంతో సినీ ప్రపంచం చిన్నదయి పోతోందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. దాసరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

దాసరి మృతి షాక్ కు గురి చేసింది - మంత్రి గంటా..

హైదరాబాద్ : దాసరి అకాల మరణం షాక్ కు గురి చేసిందని మంత్రి గంటా శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. దాసరి భౌతికకాయాన్ని సందర్శించి ఆయన నివాళులర్పించారు. నాటక రంగం..సినీ రంగంలో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. అన్ని రకాలుగా ఆల్ రౌండర్ వ్యక్తి అని కొనియాడారు. కార్మికుల సంక్షేమం కోసం..వారి బాగోగుల కోసం కృషి చేశారన్నారు. రెండు రోజుల క్రితం తనకు ఫోన్ చేశాడని, విశాఖ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరారని తెలిపారు.

09:12 - May 31, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' తాజా చిత్రం ఉత్కంఠను రేపుతూనే ఉంది. ఇప్పటి వరకు కేవలం పోస్టర్స్ మాత్రమే విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇంకా టీజర్ విడుదల చేయలేదు. దీనితో ఆయన అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రంలో 'మహేష్' ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ‘మహేష్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకొంటోంది. చిత్ర టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ అందుకు తగిన సన్నాహాలు చేసుకొంది. తన తండ్రి కృష్ణ జన్మదినం మే 31వ తేదీన కావడంతో ఆ రోజున టీజర్ విడుదల చేయనున్నామని స్వయంగా మహేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ టీజర్ ఇంకా పూర్తి కాలేదని వార్తలు వెలువడుతున్నాయి. అంతేగాకుండా ప్రముఖ దర్శకుడు దాసరి మృతి చెందడంతో టీజర్ విడుదల వాయిదా వేస్తారా ? లేదా ? విడుదల చేస్తారా ? వేచి చూడాలి.

09:05 - May 31, 2017

టాలీవుడ్ లో గతంలో విలన్ వేషాలు వేసి మెప్పించిన పలువురు హీరోలుగా..హీరోలుగా ఉన్న వారు విలన్ పాత్రలు వేస్తుంటుంటారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం విలన్ గా మారిన హీరో 'గోపిచంద్'. విలన్ గా మంచి విజయాలు సాధించాడు. అనంతరం హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గౌతమ్ నంద' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో 'గోపిచంద్' ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్. స్టైలిష్ లుక్ లో గోపి చంద్ అలరించాడు. రెండు పాత్రల్లో ఒకటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని టాక్ వినిపిస్తోంది. విలన్ రోల్ లో నటిస్తుండం సినిమాకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. గోపిచంద్ సరసన హన్సిక, కేథరిన్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి నెగటివ్ పాత్ర అలరిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

09:04 - May 31, 2017
08:35 - May 31, 2017
08:27 - May 31, 2017

హైదరాబాద్ : దాసరి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన సిని పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. పలువురు సినీ, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రి నుండి బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి దాసరి పార్థీవ దేహాన్ని తరలించారు. మంగళవారం రాత్రి చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు నివాళులర్పించారు. బుధవారం ఉదయం అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు పలు ఏర్పాట్లు చేశారు. ఇండ్రస్ట్రీ దురదృష్టమని ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ టెన్ టివితో పేర్కొన్నారు. పలువురు అభిమానులు దాసరితో తమకున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.

వేతనాలు పెంచాలని రేపు రాష్ట్ర వ్యాపిత ధర్నాలు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచిన తరహాలోనే జిల్లాల్లో పనిచేస్తున్న కార్మికులకూ కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న రాష్ట్ర వ్యాపితంగా అన్ని మున్సిపాల్టీల్లో ధర్నాలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నిర్ణయించింది.

రేపటి నుండి అందుబాటులో జీఎస్టీ పోర్టల్..

హైదరాబాద్ : జూన్ ఒకటి నుండి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో వివిధ వ్యాపారులు, డీలర్ల సౌకర్యార్థం జీఎస్టీఎస్ (గూడ్స్ అండ్స్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్ వర్క్) పోర్టల్ ను అందుబాటులో ఉంచనున్నారు.

నేడు గురుకుల పోస్టులకు ప్రాథమిక పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాణలో నేడు గురుకుల పోస్టులకు ప్రాథమిక పరీక్ష జరగనుంది. 1,25,635 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 211 కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరగనుంది.

07:26 - May 31, 2017

హైదరాబాద్ : ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మృతి సినీ పరిశ్రమను తీవ్రంగా కలిచివేసింది. 1942 మే 4వ తేదీన జన్మించిన దాసరి 2017 మే 30వ తేదీ సాయంత్రం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి చెందారన్న వార్త తెలుసుకున్న పలువురు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. కిమ్స్ ఆసుపత్రి నుండి బంజారాహిల్స్ లోని ఆయన స్వగృహానికి పార్థీవ దేహాన్ని తరలించారు. దాసరిని కడచూపు చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. బుధవారం ఉదయం పలువురు సినీ, రాజకీయ నేతలు..అభిమానులు నివాళులర్పిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హరికృష్ణ..లక్ష్మీపార్వతిలు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. దాసరితో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటున్నారు. 10.30 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ కు దాసరి పార్థీవ దేహాన్ని తరలించనున్నారు. 12.00 గంటల అనంతరం అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు మొయినాబాద్ లోని చేవెళ్ల ఫాం హౌస్ లో దాసరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

06:48 - May 31, 2017

రవాణా రంగంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణారంగంలో సంస్కరణల పర్వాన్ని వేగవంతం చేసింది. బడా సంస్థలకు లాభాలు ఓనర్ కమ్ డ్రైవర్లకు నష్టాలు తెచ్చేలా ఈ సంస్కరణలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. రవాణారంగంలో మునుపెన్నడూ లేని అలజడి, ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 4, 5 తేదీలలో విశాఖపట్టణంలో ఆలిండియా రోడ్డు ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. రవాణారంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

06:45 - May 31, 2017
06:44 - May 31, 2017

హైదరాబాద్ : దాసరి నారాయణరావు.. దర్శకుడుగా, నటుడిగా, రాజకీయనాయకుడిగా మాత్రమే కాదు.. ఆపన్నులను ఆదుకోవడంలో ఎల్లపుడు ముందుండేవారు. మనసున్న మనిషిగా కష్టకాలంలో స్పందించేవాడు. చేతనైన సాయం చేస్తూ.. నలుగురిలో తిరుగుతూ విరాళాలు సేకరించి.. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు చేయూత నందించారు దర్శకరత్న. తాను పుట్టిన ఊరైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తన పేరుతో దాసరి నారాయణరావు మహిళా కళాశాలను 1980లో స్థాపించారు. తన భార్య దాసరి పద్మ పేరుతో చెన్నైలో పద్మ విద్యాలయాన్ని స్థాపించారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రవేశపెట్టి ఇందుకోసం ఆంధ్రా, ఉస్మానియా, వెంకటేశ్వర, చెన్నై, కేరళ యూనివర్శిటీలకు భూరి విరాళాలు అందజేశారు.

దాసరి స్ట్రీట్ నైట్..
1975లో కాకినాడ పోలీస్ సంక్షేమ నిధికి విరాళాలు సేకరించి దానికి తన సొంత డబ్బును కొంత చేర్చి మొత్తం 4లక్షల 50 లక్షలు అందజేశారు. 1977లో మతసామరస్య ర్యాలీని జంటనగరాల్లో నిర్వహించారు. 1998లో సైక్లోన్ రిలీఫ్ ఫండ్ కోసం దక్షిణ-ఉత్తర భారత సినీ నటులతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించి మూడు కోట్ల రూపాయలు సేకరించి విరాళంగా అందజేశారు. 1999లో స్ట్రీట్ ర్యాలీలు, వినోద కార్యక్రమాలు నిర్వహించి కార్గిల్ యుద్ధవీరుల నిధికి పెద్దమొత్తాన్ని అందజేశారు. 1982లో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లాంటి దిగ్గజ కళాకారులను విశాఖకు రప్పించి 'దాసరి స్ట్రీట్ నైట్' నిర్వహించారు దాసరి నారాయణరావు. దీనిద్వారా వచ్చిన సొమ్మును వైజాగ్‌లో పోలీస్ స్టేషన్ నిర్మాణంకోసం విరాళంగా అందజేశారు. తర్వాత 1985లో తుపాను బాధితుల సహాయార్ధం రూ.30 లక్షలు సేకరించి అందజేసి ఆపన్నులను ఆదుకోవడంలో ముందుంటానని చాటారు. 1986లోనూ 35 లక్షల రూపాయలను విరాళంగా సేకరించి కరవు నివారణ నిధికి అందించారు. 1990లో స్టార్ నైట్ నిర్వహించి తద్వారా సేకరించిన కోటి రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా నేనున్నానంటూ ముందుండే దాసరి ..అందరికీ పెద్దదిక్కుగా నిలబడ్డారు. ఆయన చేసిన గుప్తదానాలు కూడా లెక్కలు మిక్కిలిగా ఉన్నాయి. ఆర్థిక సహాయం కోరుతూ వచ్చిన వాళ్లను దాసరి నిరాశపరచిన సందర్భాలు ఏనాడూ లేవని ఆయన సన్నిహితులు పదేపదే చెబుతుంటారు.

06:42 - May 31, 2017

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి త‌న కెరీర్‌లో ఎందరో స్టార్ హీరోల‌కు ఎన్నో హిట్లు ఇచ్చారు. 151 చిత్రాలు తీసిన దాసరి టాలీవుడ్‌ హేమాహేమీలైన ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావుల‌తో అనేక చిత్రాలు తీశారు. స‌ర్దార్ పాపారాయుడు, మ‌నుషులంతా ఒక్కటే, బొబ్బిలి పులి లాంటి హిట్ సినిమాల‌ను ఎన్టీ రామారావుతో తీశారు దాస‌రి. మ‌రో మేటి న‌టుడు అక్కినేని నాగేశ్వరరావుతోనూ సూప‌ర్ హిట్స్ అందించారు. అంతేకాకుండా ఆ తరువాత వచ్చిన హీరోలతోనూ అనేక హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు దాసరి. తెలుగు తెరకు వెలుగు నింపిన శతాధిక చిత్ర దర్శకుడైన దాసరికి ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉండేది. మనుషులంతా ఒక్కటే, సర్దార్‌ పాపారాయుడు, సర్కాస్‌ రాముడు, విశ్వరూపం, బొబ్బిలిపులి వంటి చిత్రాలను ఆయనతో తీశారు దాసరి. ఎన్టీఆర్‌తో దాసరి ఐదు సినిమాలు తీశారు. అయితే.. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్టీఆర్‌ బిజీగా ఉండడం.. దర్శకుడిగా దాసరి బిజీగా ఉండడం వల్ల ఇద్దరు ఎక్కువ సినిమాలు తీయడం కుదరలేదు. ఎన్టీఆర్‌ సినిమా అంటే ప్రేక్షకులకు పండగే. ఆయన స్టెప్పులు, హుషారైన పాటలు చూసేందుకు జనాలు థియేటర్లకు క్యూలు కట్టేవారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్‌తో యుగళ గీతం లేకుండా సినిమా తీసిన ఘనత దాసరి నారాయణరావుది. అయితే.. దర్శకులను నమ్మే వ్యక్తి కాబట్టే అలాంటి సాంగ్‌ లేకపోయినా నా సినిమాలో ఎన్టీఆర్‌ నటించారన్నారు దాసరి.

సీతారామరాజు..
ఇక బొబ్బిలిపులి చిత్రంలో పాత్ర ఏంటో ఫోన్‌లో చెప్పగానే ఎన్టీఆర్‌ ఒప్పుకున్నారని.. క్లాప్‌ ఇచ్చిన తర్వాత కథ అడిగి తెలుసుకున్నారని.. దాసరి చెప్పేవారు. అంత అనుబంధం ఎన్టీఆర్‌, దాసరి మధ్య ఉండేది. ఇక సర్దార్‌ పాపారాయుడు సినిమా షూటింగ్‌ సమయంలో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్‌కు దాసరి పాదాభివందనం చేశారు. అయితే.. ఇదేంటని ఎన్టీఆర్‌ అడిగితే... మీలో ఆ మహానుభావుణ్ని చూశాననన్నారు దాసరి. అదే సమయంలో మన తరువాత తరాలు మన గురించి చెప్పుకోవాలంటే ఏం చేయాలని ఎన్టీఆర్‌ అడిగితే.. ప్రజా సేవ చేయాలని సూచించినట్లు దాసరి చెప్పేవారు. అదే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టేందుకు బీజం పడిందని దాసరి గుర్తు చేసుకునేవారు. ఇక ఏఎన్నార్‌తో ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు, ఏడంతస్తుల మేడ, మేఘ సందేశం లాంటి బాక్సాఫీస్‌ చిత్రాలను తీశారు దాసరి. ఇక తన వందో చిత్రం చిరంజీవితో లంకేశ్వరుడు తీశారు. నందమూరి బాలకృష్ణతో తన 150వ సినిమా పరమవీర చక్ర తీశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమకు ఖ్యాతి తీసుకువచ్చిన దర్శకరత్న మరణించడం తీరని లోటు. దాసరి మరణవార్త విని సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది.

06:39 - May 31, 2017

హైదరాబాద్ : ఒకరు ముందు.. ఒకరు తర్వాత.. అంతే. ఎవరైనా చివరకు చేరాల్సింది అక్కడికే. తన భార్య మృతిని జీర్ణించుకోలేని దర్శకరత్న రెండేళ్లపాటు ఆమె ధ్యానంలోనే ఉన్నారు. తీరా కోలుకున్నా.. అస్వస్థతకు గురి కావడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రేమ వివాహం చేసుకున్న దాసరి నారాయణరావు-పద్మలు అన్యోన్య జీవితాన్ని గడిపారు. ప్రతి పురుషుడి విజయవం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు దాసరి నారాయణరావు. దాసరి వేసిన ప్రతి విజయపు అడుగు వెనుక తన భార్య ఉందని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. దర్శకరత్న దాసరి నారాయణరావు-పద్మలది ప్రేమ వివాహం. హైదరాబాద్‌లో ఉంటున్న సమయంలో దాసరి.. తన చెల్లెలుకు గాజులు కొనేందుకు సుల్తాన్‌బజార్‌ వెళ్లారు. గాజుల సైజు ఎంత అని షాపు వాళ్లు అడగడంతో.. సైజు తెలియన దాసరి పక్కనే ఉన్న యువతి చేయి చూపించాడు. దీంతో తొలిసారి పద్మ-దాసరిల మధ్య పరిచయం ఏర్పడింది.

చేవెళ్లలో అంత్యక్రియలు..
తొలిసారి పరిచయం అయిన దాసరిని మీరు ఏం చేస్తారని పద్మ అడగగా.. తాను వీఎస్‌టిలో పని చేస్తానన్నారు. ఆ తర్వాత మీరు నాటకాలు వేస్తారా అని అడిగితే.. అవునండీ.. వచ్చే వారం రవీంద్రభారతిలో నా నాటకం ఉంది.. టికెట్లు పంపిస్తా రండి అని పద్మ ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నారు దాసరి. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయమే ప్రేమగా చిగురించింది. అయితే.. వారిద్దరి ప్రేమ వివాహాన్ని పద్మ వాళ్లింట్లో ఒప్పుకున్నా.. దాసరి ఇంట్లో ఒప్పుకోలేదు. అయినప్పటికీ.. దాసరి పద్మను వివాహం చేసుకుని అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. దాసరి పద్మ పేరుతో ఎన్నో సినిమాలు నిర్మించారు దాసరి. 2011లో పద్మ కన్నుమూశారు. అప్పటినుంచి దాసరి మానసికంగా కృంగిపోయారు. ఆయన కోలుకునేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. అయినా కూడా ఆ తర్వాత దాసరి అస్వస్థతకు గురై.. మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఇవాళ చేవెళ్లలోని దాసరి ఫామ్‌ హౌస్‌లోని పద్మ సమాధి పక్కనే దాసరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

06:37 - May 31, 2017

హైదరాబాద్ : దాసరి నారాయణరావు మృతి సినీ పరిశ్రమలో విషాదం నింపింది. పలువురు సినీ ప్రముఖులు దాసరి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దాసరితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దాసరిని కడసారి చూసేందుకు అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న చిరంజీవి అక్కడి నుంచే సంతాప ప్రకటనను విడుదల చేశారు. దాసరి అకాలమరణ వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నట్టు చిరంజీవి తెలిపారు. అలాగే పోర్చుగల్‌లో ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ దాసరి మృతికి సంతాపం తెలిపారు. దాసరితో అనుబంధం ఎప్పటికీ మరవలేనిదన్నారు. దాసరి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని సినీ నటుడు వెంకటేష్ అన్నారు. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా సాయం చేసేందుకు దాసరి నారాయణరావు ఎపుడూ ముందుండే వారని వెంకటేశ్ గుర్తుచేసుకున్నారు. దర్శకరత్న దాస‌రి నారాయ‌ణరావు మృతి పట్ల సినీనటులు రజనీకాంత్, కమలహాసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాసరి నారాయణరావు తనకు ఆత్మీయుడు, స్నేహితుడని రజనీకాంత్ అన్నారు. దాస‌రి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సినీ రాములమ్మ విజయశాంతి దాసరి మృతికి నివాళులర్పించారు.

భార్య సమాధి పక్కనే..
టాలీవుడ్‌లో ఓ గొప్ప దార్శనికుడని విజయశాంతి అన్నారు. గురువుగారిని మిస్‌అవుతున్నామని దర్శకుడు రాజమౌళి అన్నారు. దర్శకుడనేవాడికి ఓ గుర్తింపు, గౌరవం తెచ్చిన ఘనత దాసరిదే అన్నారు. తెలుగు సినిమా ఒక గొప్ప వ్యక్తిని, శక్తిని కోల్పోయిందని దర్శకుడు వి.వి.వినాయక్ దాసరికి నివాళులర్పించారు. దాస‌రి నారాయ‌ణ‌రావు ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని సినీ నటుడు రాజశేఖర్‌ , జీవిత అన్నారు. దాసరి లాంటి వ్యక్తిని తన సినీ జీవితంలో చూడలేదని సీనియర్‌ నటుడు గొల్లపూడి మారుతీరావు నివాళులర్పించారు. దాసరి నారాయణరావు మృతి కళా రంగానికి తీరనిలోటు. దాసరితో తనకున్న అనుబంధాన్ని ప్రజాగాయకుడు గద్దర్‌ గుర్తుచేసుకున్నారు. దాసరి నారాయణరావ్ పార్ధివ దేహానికి నివాళులర్పించేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. ఉదయం పదిన్నరకు దాసరి ఇంటి నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు. చేవెళ్ల రోడ్‌లోని ఫార్మ్ హౌస్‌లో దాసరి భార్య పద్మ సమాధి పక్కనే నారాయణరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

06:34 - May 31, 2017

హైదరాబాద్ : దర్శక శిఖరం నేలకొరిగింది. కళామతల్లి నీడలో.. ఎంతో మంది కొత్తవారికి అవకాశాలు ఇచ్చిన దాసరి నారాయణరావు.. ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎక్కడో పాలకొల్లులో జన్మించిన దాసరి.. అంచలంచలుగా ఎదిగి సినీ, రాజకీయ జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించిన దాసరినారాయణరావు..అత్యధిక చిత్రాలకు దర్శకుడుగా గిన్నిస్‌ రికార్డులకెక్కారు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. దాసరి 250కి పైగా చిత్రాల్లో సంభాషణలు, గీతరచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం కన్నడ భాషా చిత్రాలలో నటించారు. తన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడి పురస్కారాన్ని కూడా పొందారు. కళాశాలలో చదివే రోజుల్లో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొన్నారు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా, చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. దాసరి చాలామంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డారు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమాన సంఘాలు ఉండేవి. ఇది ఏపీలో దాసరికి ఉన్న అభిమానానికి అద్దంపడుతోంది.

విమర్శకుల ప్రశంసలు..
తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మామగారు, సూరిగాడు, మేఘసందేశం, బొబ్బిలిపులి,సర్ధార్‌ పాపారాయుడు, మేస్త్రీ, ఒసేయ్‌రాములమ్మ, ఒరేయ్‌ రిక్ష, ఎమ్మెల్యే ఏడుకొండలు వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు దాసరి నారాయణరావు. ఈయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానంగా.. వరకట్న సమస్యకు వ్యతిరేకంగా సందేశాత్మకంగా ఉండేవి. దాసరి తీసిన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలు ఎన్టీఆర్ రాజకీయప్రవేశంలో కీలకపాత్ర పోషించాయి. మామగారు, సూరిగాడు, ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నట కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

సామాన్యమైన కుటుంబం..
దాసరిది పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబం. దాసరి నాన్నా పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోవడంతో.. ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. దాసరి తోబుట్టువులు మొత్తం ఆరుగురు. ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. దాసరి మూడో వారు. ఎంతో కష్టపడి ఉన్నతవిద్యను అభ్యసించారు. దాసరి నారాయణరావు మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో కేంద్ర సహాయక మంత్రి పదవిని సైతం నిర్వహించారు. బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. దాసరినారాయణ రావు మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

06:30 - May 31, 2017

హైదరాబాద్ : 'ఆగదు ఏ నిమిషము నీ కోసమూ..' అంటూ పాట రాసి, 'ప్రేమాభిషేకం' చేయించుకొన్న దార్శనికుడు శాశ్వతంగా కన్నుమూశాడు. చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలూ తీసి, 'డైరెక్టర్‌ ఈజ్‌ ద కెప్టెన్ ఆఫ్‌ ద మూవీ' అని అందరు దర్శకులూ సగర్వంగా తలెత్తుకొని నిల్చొనేలా చేసిన దిగ్దర్శకుడు అచేతనుడైపోయాడు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా 'మా గురువుగారున్నారు' అనే భరోసా కల్పించిన మహాగురువు మరల రాని లోకాలను మరలిపోయాడు. ఒక్క నటులే కాదు.. సినీ పరిశ్రమలోని 24 నాలుగు శాఖల వారూ తమ పెద్ద దిక్కు, తమ 'మేస్త్రీ' వెళ్లిపోయాడంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇక తనకు దిక్కేదంటూ తెలుగు చిత్రసీమ కన్నీరు కారుస్తోంది. గత నాలుగు రోజులుగా కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి ఈ ఏడాది జనవరి 19న తీవ్ర అనారోగ్యంతో.. కిమ్స్‌లో తొలిసారిగా చేరారు. ఆయన అన్నవాహికకు రీకన్‌స్ట్రక్టివ్ శస్త్ర చికిత్స చేసిన తర్వాత మార్చి 19న దాసరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఆ తర్వాత ఆయనకు మూత్రపిండాల్లో సమస్య తలెత్తడంతో..వారం రోజుల క్రితం తిరిగి దాసరి కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. దాసరికి మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కిమ్స్‌ వైద్యులు ఆయనకు హెమో డయాలసిస్ ట్రీట్‌మెంట్‌ కూడా నిర్వహించారు. అయితే దాసరి ఆరోగ్యం క్షీణించడంతో సాయంత్రం మంగళవారం రాత్రి 7 గంటలకు కన్నుమూశారు. దాసరి మృతి విషయం తెలుసుకున్న వెంటనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కిమ్స్‌కు చేరుకున్నారు.

పలువురి సంతాపం..
దాసరి నారాయణరావు మృతిపట్ల సినీలోకం దిగ్భ్రాంతి చెందింది. పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు, సినిమా విమర్శకులు, సినీ రచయితలు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ప్రతి విషయంలో ఆయన ప్రత్యేకత కనబరిచేవారని, ఆయన చనిపోవడం సినీ పరిశ్రమతో పాటు యావత్ రాష్ట్రానికి తీరని లోటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దాసరి మరణం సినీ లోకానికి తీరని లోటని,..ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్త వినగానే సీనియర్ నటుడు మోహన్‌బాబు మీడియా ముందు భోరున విలపించారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన గురువు ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని..తన కుటుంబం పెద్దన్నను కోల్పోయిందని మోహన్‌బాబు కన్నీటి పర్యంతమయ్యారు. దాసరి మృతి చెందారన్న వార్త తెలిసిన తర్వాత..కిమ్స్‌ ఆసుపత్రికి తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళులర్పించారు.

చేవెళ్లలో అంత్యక్రియలు..
దాసరి నాయరణరావు అంత్యక్రియలు...బుధవారం చెవేళ్లలో ఉన్న దాసరి సొంత ఫౌంహౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ప్రకటించారు. అంతకుముందు దాసరి భౌతికకాయాన్ని మూవీ ఆర్డిస్ట్‌ అసొసియేషన్‌ కార్యాలయానికి తరలిస్తామని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ ప్రకటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా చెవేళ్లకు అంతిమయాత్ర చేరుకుంటుందని ప్రకటించారు.

1942లో జననం..
దాసరి నారాయణరావు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4న మహాలక్ష్మి, సాయిరాజ్‌ దంపతులకు జన్మించారు. నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. తాతా మనవడు చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా తన ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, వంటి అగ్రనటులతో సినిమాలు తీసిన దాసరి జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు అందుకున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌ ఉన్నారు.

నేడు దాసరి అంత్యక్రియలు..

హైదరాబాద్ : నేడు ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. చెవేళ్ల ఆయన ఫాం హౌస్ లో భార్య సమాధి పద్మ పక్కనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నేడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు..షూటింగ్ లు బంద్..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు..షూటింగ్ లు నేడు బంద్ కానున్నాయి. దాసరి మృతికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ బంద్ పాటిస్తుందని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు.

Don't Miss