Activities calendar

26 June 2017

17:38 - June 26, 2017

ప్రకాశం : ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు....పార్టీలో ప్రముఖ వ్యక్తి ... మంత్రిగా ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పుతున్నాడు... ఆయనుంటే.. ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నాయకులు సైతం బుద్ధిగా నడుచుకుంటున్నారు. అసలు ఆ మంత్రి ఎవరు? ఆయన హవా ఏంటి?
మంత్రి నారాయణకు సీఎం పెద్దపీట
ప్రస్తుతం టీడీపీలో మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలకంగా మారారు. కచ్చితమైన సమాచార వారధిగా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి నారాయణకు సీఎం పెద్దపీట వేస్తున్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు... ఎప్పటికప్పుడు నారాయణ ద్వారానే  సీఎంకు చేరుతున్నాయి. జిల్లాలోని  అన్ని నియోజకవర్గాల్లో నాయకుల జాతకాలను సీఎం ముందు ఉంచుతున్నారు నారాయణ. దీంతో జిల్లాలో నారాయణ పర్యటిస్తే చాలు నాయకులు భయపడుతున్నారు. ఇటీవల టీడీపీ మహానాడు సందర్భంగా జరిగిన రసాబాసా వివరాలను సీఎంకు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లాలో నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని  సీఎం చెప్పినట్టు సమాచారం.
టీడీపీ పటిష్టానికి నారాయణ సూచనలు
జిల్లాలో పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు...నారాయణ కూడా సీఎంకు కొన్ని సూచనలు చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి నాలుగో సారి కూడా దామచర్లకు అవకాశం ఇవ్వాలని నారాయణ సూచించారు. జిల్లాలో వైసీపీని బలహీనపరచడంలో దామచర్ల పాత్ర మెరుగ్గా ఉందని.. ప్రస్తుతం ఇక్కడ ఎవరిని పార్టీకి అధ్యక్షులుగా చేసినా రాజకీయ వైషమ్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్న అంశాన్ని సీఎంకు తెలిపారు. దీంతో ఇద్దరు, ముగ్గురు నేతలు వ్యతిరేకించినా..దామచర్లనే పార్టీకి అధ్యక్షులుగా చేశారు.  
నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతం చేయాలని నివేదిక
అలాగే కొండెపి, కందుకూరు, గిద్దలూరు, అద్దంకి, దర్శి, ఒంగోలు నియోజక వర్గాల్లో  తెలుగుదేశం పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం దృష్టిలో  పెట్టారు. ఈ మేరకు సీఎం దామచర్లకు, మంత్రి శిద్దాకు దిశానిర్దేశం చేశారు. అలాగే మహానాడు సందర్భంగా తలెత్తిన పరిణామాలు.. ఇక్కడ మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న అంశాలను అధ్యక్ష పదవి ఎంపికలో జోడించారు. 
నారాయణ పర్యవేక్షణను వ్యతిరేకిస్తున్న తెలుగుతమ్ముళ్లు
కాగా  ఇక్కడ తెలుగు తమ్ముళ్లు మాత్రం నారాయణ ఉపదేశాన్ని వ్యతిరేకిస్తున్నారు.  మంత్రి నారాయణ డేగ కన్ను చాలామంది నాయకులకు ఇబ్బందిగా మారింది. స్థానిక నేతలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోయిందని బాధపడుతున్నారు.  ఎప్పటికప్పుడు అధినేత దృష్టికి వెళ్లేంత అంశాలు ఇక్కడ లేవంటున్నారు. 

 

17:15 - June 26, 2017

పశ్చిమగోదావరి : దళితులపై వివక్ష సహించేది లేదని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ సభ్యులు కె.రాములు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో పర్యటించారు. దళితుల సాంఘిక బహిష్కరణపై విచారణ జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ విగ్రహం పెట్టారన్న కారణంతో దళితులను వెలివేయడం సరికాదన్నారు. వెలికి కారణమైన నలుగురిని అరెస్ట్‌ చేయాలని.. కౌలు పొలాలను తిరిగి దళితులకు ఇప్పించాలని ఆదేశించారు. విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:37 - June 26, 2017

శ్రీకాకుళం : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకురావడానికి  ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విద్యార్థులకు భోజనాలను ఇక నుంచి కేంద్రీయ వంటశాలల నుంచి అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఇన్నాళ్లూ అష్టకష్టాలు పడి విద్యార్ధులకు భోజనం వండిన డ్వాక్రా సంఘాల మహిళలు వీధినపడనున్నారు.
మిడ్డేమీల్స్‌ పథకం ఆచరణలో ఇబ్బందులు
మధ్యాహ్న భోజనం పథకం పేద విద్యార్ధుల కడుపునింపుతోంది. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కనీసం తిండికూడా దొరకని అన్నార్తులు మిడ్డేమీల్స్‌తో చదువుకునే అవకాశం లభించింది.  పథకం లక్ష్యం మంచిదే.... కానీ దాని ఆచరణలోనే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధుల కొరత, సౌకర్యాల లేమీతో కొట్టుమిట్టాడుతోంది. ఉన్నదాంట్లోనే  ఎలాగోలా విద్యార్ధులకు మాత్రం కొంత కడుపునిండుతోంది.
విద్యార్థులకు వండిపెడుతున్న డ్వాక్రా మహిళలు
ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్డే మీల్స్‌ నిర్వహణ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగించింది.  ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే  దాదాపు 7600 మంది డ్వాక్రా మహిళలు ఈ పథకంలో పనిచేస్తున్నారు. వీరికి సకాలంలో ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోయినా ఎలాగోలా విద్యార్ధుల కడుపులు నింపుతూ ఆకలి తీర్చుతున్నారు. మరికొన్ని చోట్ల తాము ఇబ్బందిపడుతున్నా విద్యార్ధులకు తిండిమాత్రం ఆపడం లేదు. అష్టకష్టాలు పడుతూ విద్యార్ధులకు అన్నంపెడుతున్నారు.
మిడ్డే మీల్స్‌లో మార్పులకు శ్రీకారం
ప్రభుత్వం మిడ్డేమీల్స్‌లో మార్పులు చేయాలని యోచిస్తోంది. పాత విధానానికి స్వస్తి చెప్పే యోచనలో ఉంది.  కేంద్రీయ వంటశాలల పేరుతో సుమారు 20 పాఠశాలలకు ఒక దగ్గర వండి... పంపిణీ చేసే కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో స్వచ్చంద సంస్థలు చేస్తున్న అక్షయపాత్ర కార్యక్రమం తరహాలో 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలు అన్నింటినీ ఒకేచోట చెయ్యాలని భావిస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచే అన్ని జిల్లాలో అమలు చేయాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల కడుపులు నింపుతున్న  డ్వాక్రా సంఘాల మహిళలు రోడ్డునపడనున్నారు. ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా... ఆలస్యంగా ఇచ్చినా... అష్టకష్టాలకోర్చి విద్యార్ధులకు వండిపెడుతోంటే.. తమను తొలగించేందుకు కుట్ర చేయడం దారుణమని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తమ పొట్టకొట్టవద్దని వేడుకుంటున్నారు.
ఆందోళనకు సిద్ధమవుతున్న డ్వాక్రా మహిళలు  
కేంద్రీయ వంటశాలల ద్వారా మధ్యాహ్న భోజన పథక నిర్వహణపై ప్రభుత్వం నుంచి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్నం అందించే సంస్థల కోసం అన్వేషణ ప్రారంభించారు. మరోవైపు ఇన్నాళ్లూ అప్పులు చేసి పథకాన్ని బతికించిన డ్వాక్రా మహిళలు కార్మిక సంఘాల అండతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

16:26 - June 26, 2017

విశాఖ : కొండకోనల్లో పదిలంగా ఒదిగిపోయిన ఓ పచ్చని పల్లెలో మృత్యుఘోష మార్మోగింది. విషజ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ..ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 16 మంది అడవి బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 3వారాల్లోనే 16 మంది మృత్యువాతపడినా..వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ, ఇతర శాఖల సిబ్బంది కనీసం ఆ గ్రామాన్ని సందర్శించలేదు. ఫలితంగా ఇన్ని వరుస మరణాలు సంభవిస్తున్న విషయం వెలుగులోకి రాలేదు. ఆదివారం ఈ మరణాల విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ గ్రామం..చాపరాయికి హడావుడిగా పరుగు తీసింది.
శవాల దిబ్బగా మారిన పచ్చని పల్లె 
కొండకోనల మధ్య ఉన్న ఈ పచ్చని పల్లె శవాల దిబ్బగా మారింది. మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనులు గ్రామంలో మృత్యువాత పడ్డారు. రోజుకు ఇద్దరు ముగ్గురు గిరిజనులు విషజ్వరాల బారిన పడి మరణిస్తున్నా..వారి దుస్థితిని గుర్తించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవడంతో..ఈ విషాదం బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి. దీంతో గిరిజనుల మరణ వేదన వారు నిత్యం తిరిగే కొండల్లోనే కలిసిపోయింది. 
మొన్న కాళ్లవాపు తాజాగా టైఫాయిడ్‌, మలేరియా 
మొన్నటి వరకు కాళ్లవాపు మరణాలతో అట్టుడికిన మన్యం..తాజాగా టైఫాయిడ్‌, మలేరియా జ్వరాలతో వణికిపోతుంది. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం బొడ్డగండి పంచాయతీ చాపరాయి గ్రామంలోని గిరిజనులు ఈ నెల ఒకటో తేదీ నుంచి విషజ్వరాలు, వాంతులు, విరేచనాల బారిన పడి మరణిస్తున్నారు. 
కాలినడకే శరణ్యం
60 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలోని గిరిజనులు వైద్య సేవలు పొందాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్తేడు ప్రాథమిక వైద్యకేంద్రానికి వెళ్లాలి. అంత దూరం రోడ్డు సదుపాయం లేకపోవడంతో కాలినడకే వారికి శరణ్యం. అనారోగ్యం బారిన పడిన వారు నడవలేని స్థితిలో ఆ పీహెచ్‌సీకి కూడా వెళ్లలేకపోయారు. గ్రామంలోనే నాటు వైద్యాన్ని ఆశ్రయించారు. ఎవరో చేతబడి చేశారని భావించారు. ఫలితంగా అప్పటి నుంచీ ఈ నెల 21 వరకూ గ్రామంలో 16 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా గ్రామస్తులు మరణిస్తున్నా..ఒక్కరు కూడా గుర్తేడు పీహెచ్‌సీకి వచ్చి వైద్యసేవలు పొందలేదు. చావు తరుముకొస్తున్నా గ్రామంలోనే ఉంటూ చెక్కమందులు వాడారు. క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది గ్రామాన్ని సందర్శించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా శనివారం రాత్రి బయటకు రావడంతో అధికారుల బృందం హుటాహుటిన చాపరాయికి బయలు దేరివెళ్లింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. గ్రామంలో జ్వరాలతో అస్వస్థతకు గురైన మరో 30 మంది గిరిజనులను అంబులెన్స్‌ల్లో రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రితోపాటు మారేడుమిల్లి పీహెచ్‌సీలో చేర్పించారు. ప్రస్తుత వారు వైద్యసేవలు పొందుతున్నారు.
మూడు వారాల్లో 16 మంది మృత్యువాత
ఈ ఏడాది మే 29న తర్వాత జ్వరాల బారినపడిన ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. ఆ తర్వాత నుంచి ఈ నెల 21 వరకు వరుసగా 16 మంది మృతి చెందారు. కలుషిత ఆహారం వల్ల మృతిచెందారని అధికారులు చెప్తున్నారు. కానీ..కలుషిత ఆహారమైతే రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటుందని, కాని నెల రోజులుగా మరణాలు సంభవిస్తుంటే అధికారులు తప్పుగా ధ్రువీకరించడం దారుణమని పలువురు అంటున్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల మరణాలపై ఆరా తీయగా జ్వరాలు, కాళ్లనొప్పులు, వాంతులు, విరేచనాలతో మాత్రమే మృతి చెందారని చెబుతున్నారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఐటీడీఏ పీవో దినేష్‌కుమార్‌లు మాత్రం ఆహార కలుషితం వల్ల మృతి చెందారని ధ్రువీకరించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా మరణాలు సంభవించాయని పలువురు గిరిజనులు అభిప్రాయపడుతున్నారు. 

 

శబరిమలలో తెలుగు భక్తుల అరెస్టు..

తమిళనాడు : శబరిమలలో ఐదుగురు తెలుగు భక్తులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు కృష్ణా జిల్లాకు చెందిన వారు. విద్రోహ చర్యగా భావించి అరెస్టు చేశారు. ఈ అరెస్టు విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలియచేశారు. శబరి మల అధికారులతో మాట్లాడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ధ్వజ స్తంభంపై బంగారం..వెండి..ఇత్తడితో పాటు పాదరసం పారపోయడంతో పోలీసులు అరెస్టు చేశారు.

16:05 - June 26, 2017

హైదరాబాద్ : బాలిక కిడ్నాప్‌ కేసును హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. టపాచబుత్ర పిఎస్‌ పరిధిలో ఈనెల 17న అదృశ్యమైన బాలికకు విముక్తి కల్పించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్‌ ను విశ్లేషించిన పోలీసులు బెంగళూరులో ఉన్న నిందితులను పట్టుకున్నారు. నిందితులు బాలిక కుటుంబానికి పరిచయం ఉన్నవారేనని పోలీసులు తెలిపారు. 10నెలల బాబును చూసుకునేందుకే బాలికను నిందితులు తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. 

 

16:02 - June 26, 2017

పశ్చిమగోదావరి : కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమబాట పడుతున్నారు. జులై 26 నుంచి చావో రేవో పేరుతో 'ఛలో అమరావతి'కి నిరవధిక పాదయాత్ర చేయబోతున్నారు. గతంలో ప్రభుత్వం రెండుసార్లు పాదయాత్రను అడ్డుకుందని.. ఈసారి ఎలాగైనా పాదయాత్ర చేయాలనే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపడుతున్నామని ముద్రగడ తెలిపారు. ఈమేరకు ముద్రగడతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు తెలిపారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రను అడ్డుకున్నా మళ్లీ తర్వాత రోజు నుంచి పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. పాదయాత్రకు ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. గతంలో వైఎస్‌, చంద్రబాబులు పాదయాత్రకు అనుమతి తీసుకోలేదని గుర్తు చేశారు. తమ డిమాండ్‌ నెరవేరే వరకు పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. 

15:56 - June 26, 2017

విశాఖ : మన్యంలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. అరకులోయ మండలం కోడిపుంజువలస గ్రామంలో ఐదుగురిలో ఆంత్రాక్స్ లక్షణాలు గుర్తించారు. బాధితులకు  విశాఖ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. నిల్వ ఉంచిన మాంసం తినడం వల్లే  ఆంత్రాక్స్ సోకినట్టు వైద్యులు అంటున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో  హుకుంపేట మండలంలో  13 మందికి ఆంత్రాక్స్ సోకగా వారిలో ఇద్దరు మరణించారు. తాజాగా  వ్యాధి మరోసారి  బయటపడటంతో మన్యం ప్రజలు వణికిపోతున్నారు.   

 

వస్త్ర వ్యాపారుల బంద్..

హైదరాబాద్ : రేపటి నుండి మూడు రోజుల పాటు వస్త్ర వ్యాపారులు బంద్ పాటించనున్నారు. వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలని బంద్ కు కు పిలుపునిచ్చారు. తెలంగాణలో 40 వేలు, ఏపీలో 25 వేల దుకాణాలు బంద్ కానున్నాయి. వస్త్రాలపై ఐదు శాతం జీఎస్టీకి కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో తొలిసారి వస్త్రాలపై పన్ను పోటు పడినట్లైంది. వస్త్రాలపై జీఎస్టీ విధిస్తే చిన్న షాపులు మూత పడుతాయయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

15:48 - June 26, 2017

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూములపై పెద్దలు దండయాత్ర చేశారు. ఆరు దశాబ్దాలు దళితులు సాగు చేసుకుంటున్న భూములను పెద్దు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అధికారులు, అధికార పార్టీ నేతల అండతో భూస్వాములు ఈ దురాక్రమణకు పాల్పడ్డారు. బాధితులకు అండగా సీపీఎం, ఇతర ప్రతిపక్షాలు నిలుస్తున్నాయి. ఆందోళన ఉద్ధృతం చేస్తామని విపక్ష నేతలు హెచ్చరించారు. దేవరపల్లిలో దళితుల భూముల కబ్జాపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

చెన్నైలో మంచినీటి కొరత..

తమిళనాడు : 140 ఏళ్ల తరువాత చెన్నైలో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడింది. చెన్నైకి రోజుకు 830 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరం ఉంటుంది. చెన్నైలో సగం కూడా నీరు సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది.

15:44 - June 26, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రు గ్రామంలో మూడో రోజు పోలీసుల దిగ్బంధం కొనసాగుతుంది. దళిత, ప్రజా సంఘాల నాయకులు గ్రామంలోకి రాకుండా.. పోలీసులు రహదారులను మూసివేశారు. అయితే కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:30 - June 26, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె.రాములు పర్యటిస్తున్నారు. దళితుల సాంఘిక బహిష్కరణపై విచారణ చేస్తున్నారు. ప్రజలు రాములుకు వివరాలు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:29 - June 26, 2017

‘నిప్పులాంటి నిరుద్యోగి' అంటూ 'ధనుష్' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఆయన నటించిన ‘రఘువరన్ బి.టెక్' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా 'వి ఐ పి 2’ పేరిట వస్తోంది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మళ్లీ 'ధనుష్' తన నటన ప్రతిభను మరోసారి చూపెట్టనున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. తొలి సినిమాకు ధీటుగా 'వి.ఐ.పి 2’ ఉందని ట్రైలర్ ను చూస్తుంటే అర్థమౌతోంది..ట్రైలర్ లో ఎన్నో విశేషాలు దాగున్నాయి.

’నా పేరు రఘవరన్'..
’నా పేరు రఘవరన్..నేనిప్పుడు మళ్లీ వెరీ ఇంపార్టటెంట్ పనిలేనివాడిని' అంటూ చిత్ర ట్రైలర్ ప్రారంభమైంది. మధ్యలో ధనుష్..అమలాపాల్ ల మధ్య సన్నివేశాలు నవ్వును తెప్పిస్తున్నాయి...వూదరా అని అమలాపాల్ అంటే తాగలేదని ధనుష్..మరి ఊదడానికి ఏ మాయ రోగం అంటూ అమలా పాల్ అనడం..నవ్వును తెప్పించాయి. ‘కానీ పెళ్లాన్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు సార్' అంటూ ధనుష్ డైలాగ్స్ ఉన్నాయి. ఒక్కసారిగా వసుంధర కన్ స్ట్రక్షన్ యజమాని 'కాజల్' ఎంటర్ కావడం అంచనాలను ట్రైలర్ అమాంతం పెంచేసింది. ఈ మధ్యలో ధనుష్ చేసిన ఫైట్స్ అలరించే విధంగా ఉన్నాయి. ‘మేడం నేను పులికి తోకలా ఉండడం కన్నా పిల్లికి తలలా ఉంటాను' అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకొంటోంది. వి.ఐ.పి 2 చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు.

15:18 - June 26, 2017

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథా చిత్రాలు..రీమెక్ చిత్రాల్లో నటించడంలో 'వెంకటేష్' ముందున్నారు. ఆయన నటించిన పలు సినిమాలు రీమెక్ చిత్రాలే కావడం తెలిసిందే. ఇటీవలే ఆయన 'గురు' గా ప్రేక్షకులు ముందుకొచ్చారు. చిత్ర రిలీజ్ తరువాత ఆయన ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు. దీనితో ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారు ? ఆ చిత్రం ఎలా ఉంటుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వేసవికాలంలో సెలవులు తీసుకోవడం జరుగుతోందని ఆయన ఇటీవలే పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు పూర్తి కావడంతో ఆయన చిత్రంపై వార్తలు వెలువడుతున్నాయి. సెలవలను ఆస్వాదించిన 'వెంకీ' పలువురి దర్శకుల కథలను విన్నట్లు టాక్. అందులో పూరి జగన్నాథ్, క్రిష్ తదితర దర్శకులున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కొత్త సినిమా గురించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్..బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం 'వెంకీ'..’పూరీ' చిత్రం ఉంటుందని టాలీవుడ్ టాక్. మరి ఆయన తాజా చిత్రం గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలువనున్నాయి.

15:08 - June 26, 2017

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ' జై లవ కుశ' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై 'ఎన్టీఆర్' సోదరుడు 'కళ్యాణ్ రామ్' 'బాబీ' దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో 'ఎన్టీఆర్' మూడు పాత్రలను పోషిస్తున్నట్లు..ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారనే వార్తలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జై..లవ కుమార్..కుశల్ కుమార్ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఓ పాత్ర ఏకంగా విలన్ అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. విలన పాత్రకు హాలీవుడ్ కు చెందిన మేకప్ మెన్ రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ఫొటోలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొంది. బుల్లితెర హిందీ నటుడు రోనిత్ రాయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

15:02 - June 26, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రం అభిమానులను అలరిస్తోంది. అంతేగాకుండా బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ‘హరీశ్ శంకర్' దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ‘బన్నీ’కి జోడిగా ‘పూజా హేగ్డే’ నటించింది. ఈ సినిమాలో ‘అల్లు అర్జున్’ బ్రాహ్మణ యువకుడిగా కనిపించి తనదైన స్టైల్ లో నటించారు. అంతేగాకుండా ఆయన డ్యాన్స్..ఫైట్లకు అభిమానులు ఫిదా అయిపోయారు. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 65 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు రమేశ్ బాలా ట్వీట్ చేశారు. తొలి రోజు వసూళ్లలో బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్'..’ట్యూబ్ లైట్' ను అధిగమించిన సంగతి తెలిసిందే. రంజాన్ పండుగ సందర్భంగా సినిమాకు కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కుంజూ భిక్షం ఆచూకీ లభ్యం..

చిత్తూరు : మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం ఆలస్యం లభ్యమైంది. కరకంబాడిలో నడుచుకుంటూ వెళుతున్న కుంజూను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాసేపట్లో కుంజూను బంధువులకు పోలీసులు అప్పగించనున్నారు. తిరుమలకొండపై ఆయన శనివారం నాడు తప్పిపోయిన సంగతి తెలిసిందే. కుంజూ భిక్షం కోసం పోలీసులు రెండు రోజులుగా గాలించారు. మతిమరుపు వ్యాధితో ఆయన బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

14:52 - June 26, 2017

టాలీవుడ్ నటి 'సమంత' పూర్తిగా కొత్తగా కనిపించనుంది. గత చిత్రాల పాత్రలకు భిన్నంగా ఓ పాత్ర చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్'..దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985’ చిత్రంలో 'సమంత' నటిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'సమంత' కొత్తగా కనిపించనుంది. చెర్రీ పక్కా పల్లెటూరి యువకుడిగా లుంగీలో కనిపించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను 'సమంత' రిలీజ్ చేసింది. ఈ ఫొటోలో లాంగా వోణి ధరించి పల్లెటూరి అమ్మాయిల..కాలువ గట్టు కూర్చొని సూర్యాస్తమయం చూస్తున్నట్లు ఉంది. ‘అలసట..బాధ పెద్ద విషయం కాదు..కెమెరా కేవలం అద్బుతాన్నే చిత్రీకరిస్తుంది' అంటూ 'సమంత' పోస్టు చేశారు.

కాశ్మీర్ కు వెళ్లనున్న రాష్ట్రపతి అభ్యర్థి..

ఢిల్లీ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కాశ్మీర్ కు వెళ్లనున్నారు. 28వ తేదీన ఆయన కాశ్మీర్ లో ఎంపీలు..ఎమ్మెల్యేలను కలువనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు కూడా వెళ్లనున్నారు.

భోపాల్..ఢిల్లీకి వెళ్లనున్న లోకేష్..

విజయవాడ: ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళవారం భోపాల్..హస్తినకు పయనం కానున్నారు. భోపాల్ లో మంగళవారం కేంద్ర మంత్రి తోమర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనున్నారు. బుధవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ కానున్నారు.

శిరీష కేసు..విషయాలు చెప్పమన్న న్యాయవాదులు..

హైదరాబాద్ : శిరీష మృతి కేసులో కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడు ఎలాంటి విషయాలు వెల్లడించలేమని రాజీవ్, శ్రవణ్ తరపు న్యాయవాది వెంకట్ గౌడ్ పేర్కొన్నారు. శిరీష..ప్రభాకర్ రెడ్డిది హత్యా..ఆత్మహత్యా అనేది విచారణ తరువాత తెలుస్తుందన్నారు.

గరగపర్రు..టెన్ టివి ఎఫెక్ట్..

పశ్చిమగోదావరి : గరగపర్రులో కుల బహిష్కరణపై బాహ్య ప్రపంచానికి తెలియచేసిన టెన్ టివి కథనాలకు అధికారులు స్పందించారు. గరగపర్రు క్రిస్టియన్ పేటలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొలతలు తీసుకుని అధికారులు అంచనాలు వేస్తున్నారు.

గరగపర్రులో విచారణ..

పశ్చిమగోదావరి : గరగపర్రులో దళితుల బహిష్కరణపై విచారణ జరుగుతోంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు విచారణ జరుపుతున్నారు. బహిష్కరణపై గ్రామస్తులు వివరణనిస్తున్నారు. ఎస్పీ రవి ప్రకాష్, కలెక్టర్ లు హాజరయ్యారు.

26 నుండి ముద్రగడ పాదయాత్ర..

విజయవాడ : జులై 26వ తేదీ నుంచి నిరవధిక పాదయాత్ర చేపట్టనున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. పాదయాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను సోమవారం విడుదల చేశారు.

కేంద్రానికి ముస్లిం రిజర్వేషన్ తీర్మానం - హరీష్ రావు..

హైదరాబాద్ : ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లిలో తీర్మానం చేశామని, ముస్లిం రిజర్వేషన్లపై చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్ధిపేటలో జరిగిన రంజాన్‌ వేడుకల్లో ఆయన పాల్గొని ముస్లిం సోదరులకు ఆయన రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

50వేల మంది ముస్లింల ప్రార్థనలు..

శ్రీనగర్ : రంజాన్‌ సందర్భంగా జమ్ము కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. హజ్రత్‌బల్‌ మసీదులో 50 వేల మంది ముస్లింలు ప్రార్థనలు చేశారని అధికారులు తెలిపారు.

13:46 - June 26, 2017

ఢిల్లీ :ఏపీ భవన్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు. కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా గత 135 రోజులుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఆడారి కిశోర్‌. ఈ సందర్భంగా ఢిల్లీలోని మున్సిపల్ కార్మికులను ఆడారి కిశోర్ బృందం సన్మానించింది.

ఘనంగా రంజాన్..

హైదరాబాద్ : రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మసీదుల్లో ప్రార్థనలు ముగించుకున్న అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రముఖులు, రాజకీయ నేతలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

13:45 - June 26, 2017

హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్యను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వనజీవి రామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు కేర్ ఆసుపత్రికి వచ్చారు. వనజీవి రామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి చైర్మన్ సోమరాజును వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రామయ్యతో కూడా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

13:43 - June 26, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఉప ఎన్నిక సమరానికి అటు టీడీపీ, ఇటు వైసీసీపీ సై అంటున్నాయి. మంత్రి అఖిలప్రియ సవాల్‌ను వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి స్వీకరించారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోతే..తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని శిల్పామోహన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో నంద్యాల ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది.

గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని...

పశ్చిమబెంగాల్ : గూర్ఖాలాండ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో భారతీయ గూర్ఖా భూత్‌పూరవ్‌ సైనిక్‌ కల్యాణ్‌ సంఘటన్‌ (బిజిబిఎస్‌కెఎస్‌) ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు.

పట్టిసీమ నుండి నీరు విడుదల...

విజయవాడ : పట్టిసీమ నుంచి వచ్చిన నీటి ద్వారా కృష్ణా డెల్టాలోని 13లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టా భూములకు విడుదల చేశారు. సాగునీటి కష్టాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రతిష్టాత్మకంగా నదుల అనుసంధానం చేపట్టామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

13:41 - June 26, 2017

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్‌, శ్రవణ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కుకునూర్‌పల్లిలో ఏం జరిగిందన్న అంశంపై ఇద్దర్నీ ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్ కు కంటి ఆపరేషన్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు ఢిల్లీలో ఈ రోజు కంటి ఆపరేషన్ జరగనుంది. అవసరమైన అన్ని ఏర్పాట్లు ఆసుపత్రి అధికారులు పూర్తి చేశారు. దీనితో మరో నాలుగు రోజులు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు కస్టడీ..

హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రావణ్, రాజీవ్ లను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం నిందితులులిద్దరినీ జైలు నుండి పీఎస్ కు తీసుకొచ్చారు.

13:35 - June 26, 2017
09:45 - June 26, 2017

'ఇంకెన్నాళ్లు ఈ చావులు..తమను పట్టించుకోరా...పట్టించుకుంటామన్న నాయకులు..నేతలు ఎక్కడకు పోతున్నారు..వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ప్రాణాలు పోవాల్సిందేనా'..అంటూ ఏజెన్సీ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతంలో మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనులు మృత్యువాత పడడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్యాధికారులు..ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ విషయం బాహ్యప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వెంటనే కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దుర్ఘటనలు నిత్యం కొనసాగుతున్నా అధికార  యంత్రాంగం సకాలంలో ఎందుకు స్పందించడం లేదనే విమర్శలున్నాయి.

అభివృద్ధికి ఆమడ దూరంలో మన్యం...
మన్యం..ఏజెన్సీ ప్రాంతాలు...అభివృద్ధికి ఆమడదూరంలో నిలుస్తాయి. ఎన్నికలు వచ్చేటప్పుడు వచ్చే నాయకులు గెలిచిన అనంతరం ఏజెన్సీ ప్రాంతాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో మన్యం ప్రాంతాల్లో మృత్యుకేకలు వినిపిస్తుంటాయి. పారిశుధ్యం లోపం లోపించడం..అవగాహన లేకపోవడం..వైద్యాధికారులు ఆలస్యంగా స్పందించడం..వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు ఉతన్నమౌతున్నాయి. మలేరియా..టైఫాయిడ్..అతిసార వ్యాధులు ప్రబలుతుంటాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో గిరిజనులు మృత్యువాత పడుతూనే ఉన్నారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో గిరిజనుల మరణాలు సంభవిస్తున్నాయని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. అనారోగ్యానికి గురైన వారు ఎలాంటి వైద్య సేవలు పొందకుండా నాటు వైద్యం చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. గిరిజనుల్లో ఇంకా మూఢనమ్మకాలు అలానే ఉన్నాయి.

వర్షాకాలంలో వ్యాధులు..
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలుతాయని ముందే తెలిసినా వైద్యాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. వాగుల్లోని నీరు వీరు సేవిస్తుండడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. కలుషిత నీరు సేవించడం వల్ల పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీనితో పాటు పారిశుధ్యం లోపించడంతో వ్యాధులు అధికమవుతున్నాయి. పలువురు వ్యాధుల బారిన పడి మంచం పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉత్పన్నమవుతే పరిష్కరించాల్సిన వైద్యులు తగినంత లేదని తెలుస్తోంది. పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు..వైద్య సిబ్బంది ఒకరత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రుల్లో గైనకాలజిస్టులు..చిన్న పిల్లల నిపుణులు కూడా తగినంత లేకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఇక సంచార వైద్య సేవలందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమౌతోంది. ఇవన్నీ ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతిసారి మృత్యుఘోష ఎందుకు వినపడుతుందని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి గిరిజన గ్రామాల్లో మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలని గిరిజనులు కోరుతున్నారు.

 

09:43 - June 26, 2017

తూర్పుగోదావరి : జిల్లా ఏజెన్సీలో 15 మంది గిరిజనులు మృత్యువాత పడటం కలకలం రేపింది. వారంరోజుల వ్యవధిలో వీరంతా చనిపోయినట్టు సమాచారం. జిల్లాలోని వైరామవరం మండలం బొడ్డగండి పంచాయితీ పరిధిలోని చాపరాయిలో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం స్పందించింది. వెంటనే ఘటనా స్థలానికి వైద్య సిబ్బందిని పంపారు. గిరిజనుల మృతికి అతిసారా లేకుంటే పుడ్ పాయిజనా అనేది ఇంకా నిర్థారణ కాలేదు. అయితే అధికారులు మాత్రం ఓ వివాహంలో పాల్గొన్న అందరు అనారోగ్యానికి గురైనట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. మృతుల కుటుంబా ప్రభుత్వం రూ.5లక్షలు ప్రకటించింది.

09:39 - June 26, 2017

హైదరాబాద్‌ : నగరంలో చంద్రబాబుతో టీటీడీపీ నేతలు సమావేశమయ్యారు. రాష్ర్టంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. సమావేశానికి రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి, రావుల, సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఈ భేటీ లో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

09:35 - June 26, 2017

నెల్లూరు: జిల్లాలో ఓ ఎస్‌ఐ తన డిపార్ట్‌మెంట్‌పైనే సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అధికారులు, అధికారపార్టీ నేతలకు మామూళ్లు వసూలు చేయలేకపోతున్నానంటూ ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కలెక్టర్‌కే ఫిర్యాదు చేస్తావా అంటూ.. ఎస్‌ఐపై విరుచుకుపడుతూ ఎస్పీ చెడామడా తిట్టేసిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

ఎస్‌ఐని ఎస్పీ విశాల్ గున్నీ తిడుతున్న స్పాట్..

ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నది నెల్లూరు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ. అది సూళ్లూరుపేట ఎస్‌ఐ జగన్మోహనరావుకి. ఇప్పుడు ఈ విజువల్సే సంచలనం రేపుతున్నాయి.నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు జగన్మోహనరావు. ఇటీవల తనతో పోలీస్ అధికారులు, అధికారపార్టీ నేతలు మామూళ్లు వసూలు చేయిస్తున్నారని .. ఆ పని చేయలేకపోతున్ననని కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నెలకి కోటి టార్గెట్ ఇస్తారని.. పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారిని పీడించాలని.. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి వచ్చే సొమ్మును అందరికీ పంపించాలని.. అయితే ఇలా చేయడం తన వల్ల కావడం లేదంటూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నట్లు సమాచారం.

రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచలనం

ఇక జగన్మోహనరావు ఆవేదన ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. అతనిపై యక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ. వెంటనే అతనిని బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచారు. అక్కడితో ఆగకుండా తన దగ్గరకు రప్పించుకుని డిపార్ట్‌మెంట్‌లో లేకుండా చేస్తాను.. .. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. మరోవైపు జిల్లా పోలీసు అధికారులు సైతం జగన్మోహనరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది నిజమేనని.. దీనిపై దర్యాప్తు అనంతరం వివరాలు చెబుతామని అంటున్నారు.

మాట మార్చిన ఎస్ ఐ.....

పోలీస్ బాస్‌ క్లాస్‌లకి భయపడ్డాడో ఏమో ఎస్‌ఐ జగన్మోహనరావు మాట మార్చాడు. తాను అసలు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని.. కిట్టని వారెవరో ఇలాంటి అభియోగాలు మోపుతున్నారని చెబుతున్నాడు. ఇక ఈ స్టోరిపై పై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో.. ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.

09:15 - June 26, 2017

సినీ నటుడు రవితేజ సోదరుడు 'భరత్' అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. శనివారం రాత్రి శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ పరిధిలోని ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో 'భరత్' అక్కడికక్కడనే మృతి చెందిన సంగతి తెలిసిందే. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడం..స్టీరింగ్ రెండు ముక్కలు కావడంతో భరత్ ముఖం ఛిద్రమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో సినీ నటుడు 'రవితేజ' సోదరుడు 'భరత్' అని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం సోదరుడు రఘు, ఉత్తేజ్, భరత్ స్నేహితుడు ఆదిత్యలకు మృతదేహాన్ని అప్పగించారు. రాయదుర్గం మహాప్రస్థానానికి తరలించారు. భరత్ బాబాయి మూర్తిరాజు అంతిమ సంస్కారాలు నిర్వహించిన అనంతరం విద్యుత్ దహన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలకు భరత్ తమ్ముడు రఘు మినహా..రవితేజ, ఇతర కుటుంబసభ్యులు హాజరు కాలేదు. ఛిద్రమైన తమ్ముడు ముఖాన్ని చూడలేనని రవితేజ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. భరత్ తండ్రి అనారోగ్యం కారణంగా రాలేకపోయారని కుటుంబసభ్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. మొత్తానికి అతివేగం మరో సినీ నటుడిని కోల్పోయింది.

08:48 - June 26, 2017

హైదరాబాద్: 60 గంటల పాటు నిర్విరామంగా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. బోరుబావిలోంచి చిన్నారి బతికొస్తుందనుకున్న ఆ కన్నతల్లికి కన్నీళ్లే మిగిలాయి. కన్నతల్లి పేగు బంధాన్ని శాశ్వతంగా తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అమ్మా అని నోరారా పిలిచే ఆ చిట్టితల్లి చిట్టిపొట్టి మాటలు ఇప్పుడు వినిపించవు. నవమాసాలు మోసి కనిపెంచిన ఆ కన్నతల్లికి ఇప్పుడు మిగిలింది కడుపుకోతే. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు రవితేజ సోదరుడు భరత్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదాలు తాగడం వల్లే జరుగుతున్నాయా? అతివేగమే కారణమా? దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇలాంటి అంశాలపై 'న్యూస్ మార్నింగ్ ' షో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత నంద్యాల నరసింహారెడ్డి, దుర్గా ప్రసాద్ టిడిపి, సత్యనారాయణ టిఆర్ ఎస్,లక్ష్మీనారాయణ బిజెపి నేత పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

06:51 - June 26, 2017

హైదరాబాద్: వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేసే పథకం జూన్ 20న మొదలైంది. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో గొర్రెల ద్వారా 20 వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించే అవకాశం వుందంటున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. ప్రస్తుతం రోజుకి 600 లారీల గొర్రెలను దిగుమతి చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు ఎంతో ఆశావాహ దృక్పథాన్ని కలిగిస్తున్నా, క్షేత్ర స్థాయి వాస్తవాలు మరో రకంగా వుంటున్నాయి. గొర్రెల పంపిణీలో క్షేత్ర స్థాయి వాస్తవాలేమిటి.? ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలేమిటి? గొర్రెల పెంపకంలో రాష్ట్రం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ గొర్రెల పెంపకందారుల సంఘం నాయకులు ఉడత రవీందర్ పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

పాకిస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం

హైదరాబాద్: పాకిస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బహవల్‌పూర్‌ ప్రాంతంలో జాతీయ రహదారిపై.. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపు 150 మంది సజీవదహనమయ్యారు. మరో 117 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్యాంకర్‌ బోల్తా పడడంతో రహదారిపై భారీగా ఇంధనం లీకయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా బకెట్లతో ఇంధనం తోడుకోవడానికి ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంతలో ట్యాంకర్‌ పేలిపోవడంతో అక్కడున్నవారంతా చనిపోయారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వైభవంగా జగన్నాథుని రథయాత్ర

హైదరాబాద్: ప్రఖ్యాత పూరీ క్షేత్రంలో భక్తుల సందడి మధ్య జగన్నాథుని ర‌థ‌యాత్ర వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడి వద్ద నుంచి సూచన రాగానే లాంఛనంగా రథాన్ని కదలించారు. ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో పూరీ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు పోలీసు యంత్రాంగం సర్వత్రా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.

జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో రోప్‌వే ప్రమాదం

జమ్మూ : రోప్‌వే కూలి ఏడుగురు పర్యాటకులు దుర్మరణం చెందారు. శ్రీనగర్‌లోని గుల్మార్గ్‌లో పెనుగాలికి భారీ వృక్షం కూలీ రోప్‌వే తీగపై కూలింది. దీంతో 30 మీటర్ల ఎత్తులో ఉన్న కార్‌చైర్ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, టూర్ గైడ్‌తో సహా ఓ కుటుంబం మృతిచెందింది. ఈ ఘటన తరువాత కేబుల్ కార్ల సర్వీసులను వెనువెంటనే నిలిపివేశారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 1998లో ప్రారంభమైన గుల్మార్గ్ కేబుల్ కారు సర్వీసులో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారని స్థానికులు పేర్కొన్నారు.

కరేబియన్‌ పర్యటనలో బోణి కొట్టిన భారత్‌

హైదరాబాద్: కరేబియన్‌ పర్యటనలో భారత్‌ బోణి కొట్టింది..రెండో వన్డే మ్యాచ్‌లో ఏకంగా 105 పరుగుల తేడాతో విజయం సాధించింది..ఓపెనర్లు అజింక్య రహానే,ధావన్‌ చెలరేగడంతో కేవలం 43 ఓవర్లలోనే 310 పరుగుల భారీ స్కోర్‌ ని నమోదు చేసింది..రహానే 104 బంతుల్లోనే 10ఫోర్లు,2 సిక్సర్లతో శతకం సాధించగా.. ధావన్‌ 59 బంతుల్లో 63 పరుగులు చేసి అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు..భారీ లక్ష్య చేదనతో బ్యాటింగ్ కి దిగిన విండీస్‌ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది ..మొదటి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ పోవెల్‌ అవుటయ్యాడు..ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ని భువి పెవిలియన్‌కు పంపాడు.

06:45 - June 26, 2017

హైదరాబాద్: తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువైంది. ఎక్కడ చూసినా భక్తజనమే. శ్రీనివాసుని దర్శనం కోసం భక్తజనం భారీగా తరలివచ్చారు. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో ఎక్కడ చూసినా సందడి నెలకొంది.

భక్తుల రద్దీ పెరగడంతో గదుల సమస్య

భక్తుల రద్దీ పెరగడంతో గదుల సమస్య తీవ్రమైంది. భక్తులందరికీ సరిపడ గదులు లేకపోవడంతో ఎగబడుతున్నారు. గదుల కోసం గంటలకొద్దీ ఎదురుచూస్తున్నారు. జేఈవో కార్యాయం ముందు బారులు తీరారు.

నడకదారిలోనూ భక్తులు భారీగా

నడకదారిలోనూ భక్తులు భారీగా రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో క్యూలైన్లలోకి టీడీపీ అనుమతి నిలిపివేసింది. భక్తులందరినీ మధ్యాహ్నం తర్వాత క్యూలైన్లలోకి రావాలని సూచించడంతో చిన్నారులతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

క్తులు భారీగా తరలివస్తుండడంతో తిరుమలకు వాహనాలు క్యూకట్టాయి. అలిపిరి నుంచి తిరుమలకు వాహనాల రద్దీ ఎక్కువైంది. దీంతో యంబీసీ ప్రాంతంవైపు వాహనాలు వెల్లకుండా నిషేధించారు.

ఇవాళ, రేపు కూడా సెలువుల కావడంతో

ఇవాళ, రేపు కూడా సెలువుల కావడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగేఅవకాశముంది. రద్దీ ఎక్కువవ్వడంతో టీటీడీ కూడా క్యూలైన్లలోని భక్తులకు కనీస వసతులు కల్పించలేకపోతోంది. మరోవైపు తిరుమల దైవ దర్శనానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కొండపై తప్పిపోయాడు..భద్రాచలం జిల్లా బూర్గంపాడు చెందిన మాజీ ఎమ్మోల్యే కుంజా భిక్షం మతిమరుపు వ్యాధితో గతకొంత కాలంగా బాధపడుతున్నారు..దీంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..పోలీసులు ఈ ఘటన పై విచారణ చేపడుతున్నారు..సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

హైదరాబాద్: తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల తాకిడి పెరగడంతో టీటీడీ అధికారులు వీఐపీ దర్శనాలను పరిమితం చేశారు.

06:42 - June 26, 2017

హైదరాబాద్: ఆషాడ మాసం బోనాల సందర్భంగా గోల్కోండ కోట అందంగా ముస్తాబైంది. కోటపై కొలువుతీరిన జగదాంబిక అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. ఉత్సవాలను పురస్కరించుకుని దేవాదాయ శాఖ, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

ముందుగా లంగర్‌హౌస్‌ చౌరస్తాలో

ముందుగా లంగర్‌హౌస్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసే తొట్టెలకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తొట్టెలకు, అమ్మవారి చిత్రపటానికి పూజలు చేశారు. దారి పొడవునా పోతరాజుల నృత్యాలు.. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలతో సందడి నెలకొంది.

ఛోటాబజార్‌లోని పూజారి అనంతాచారి ఇంటికి

అక్కడి నుంచి లంగర్‌హౌస్‌, చెరువుకట్ట, ఫతేదర్వాజా, బడాబజార్‌ల మీదుగా సాగిన ఊరేగింపు ఛోటాబజార్‌లోని పూజారి అనంతాచారి ఇంటికి చేరుకుంది. అక్కడి నుంచి అమ్మవారు కోటపైకి తీసుకెళ్లేసరికి రాత్రి అవుతుంది. మరోవైపు బోనాల జాతరకు ఉదయాన్నే భక్తులు క్యూ కట్టారు. మహిళలు, యువతులు కోటకు చేరుకుని బాలాహిస్సార్‌ దర్వాజా వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 350 మెట్లకు బొట్లు పెట్టి తమ కోర్కెలు తీర్చమని వేడుకున్నారు. చాలామంది మహిళా భక్తులు జగదాంబిక అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విద్యుత్ దీపాల వెలుగులో గోల్కోండ కోట

విద్యుత్ దీపాల వెలుగులో గోల్కోండ కోట శోభాయమానంగా వెలిగిపోతోంది. గతేడాది తెలంగాణలో జరిగే బోనాలకు 20 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా వేసిన అధికారులు ఈసారి 30 లక్షల మంది రావొచ్చని అంచనావేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టారు.

గోల్కొండ కోటలో బోనాల జాతర..

హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోటలో బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. భక్తులు ఉదయం నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. దీంతో గొల్కొండ కోటకు ఆధ్యాత్మిక కళ వచ్చింది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

06:38 - June 26, 2017

హైదరాబాద్: విశాఖలో వెలుగుచూసిన భూ కుంభకోణం రాజకీయ హీట్‌ను పెంచుతోంది. నిన్నమొన్నటి వరకు విశాఖ పాలిటిక్స్‌లో అంతగా ప్రభావం చూపకపోయిన వైసీపీకి ల్యాండ్‌ స్కామ్‌ ఓ ఆయుధంగా దొరికింది. భూ కుంభకోణాన్నే అస్త్రంగా మల్చుకుని వైసీపీ రాజకీయంగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. వైసీపీ అధినేత జగన్‌ ఆదేశాలతో జిల్లా నేతలు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అధికారపార్టీ నేతల అవినీతి బాగోతాన్ని బయటకుతీసేందుకు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. మంత్రులు అయ్యన్నపాత్రుడితోపాటు గంటా శ్రీనివాసరావుకు ఈ ల్యాండ్‌ స్కామ్‌తో సంబంధం ఉందంటూ ధర్నాలు చేశారు. వైసీపీతోపాటు సీపీఎం కూడా దశలవారీ ఆందోళనలు నిర్వహించింది. విశాఖ భూ కుంభకోణంలో అసలు నిజాలు తెలియాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రతిపక్షాల ఆందోళనతో సర్కార్‌ అలర్ట్‌

ప్రతిపక్షాల ఆందోళనలతో అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. గత నెల 18వ తేదీన అన్యాక్రాంతం అయిన భూములపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని ప్రకటించి వెనక్కి తగ్గింది. విపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో సిట్‌తో విచారణ జరిపిస్తోంది. రెండు నెలల్లోపు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు సిట్‌ బృందాన్ని ఆదేశించారు.

ప్రభుత్వ తీరుపై విపక్షాల ఫైర్‌

సిట్‌తో విచారణ జరిపించడం వల్ల ఒరిగేమీ ఉండబోదని విపక్షాలు మండిపడుతున్నాయి. భూ కుంబకోణానికి పాల్పడిన వారిని తప్పించేందుకు సిట్‌తో విచారణ జరిపిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడుతాయని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సేవ్‌ విశాఖ పేరుతో జగన్‌ భారీ ధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నా విజయంతం కావడంతో వైసీపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపింది. అదే సమయంలో అధికారపక్షంలో కలవరం మొదలైంది. భూ కుంభకోణంలో ప్రభుత్వ తీరును జగన్‌ ఎండగట్టారు. ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి.

ఎదురుదాడికి దిగిన ప్రభుత్వం ....

వైసీపీ వ్యూహాలు సక్సెస్‌ అవుతుండడంతో ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. ఇద్దరు మంత్రుల మధ్య గొడవగా భూదందాను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. కొంతమంది నేతలతో చవకబారు విమర్శలు చేయించింది. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి చినరాజప్పతో సహా అధికారపార్టీ నేతలంగా జగన్‌ అవినీతిపై పదేపదే విమర్శలకు దిగారు. అధికారపార్టీ వ్యూహాలను తిప్పికొడుతూ విశాఖలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. భూదందానే టార్గెట్‌గా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. మరి వైసీపీ వ్యూహాలను అధికారపార్టీ ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి.

విశాఖలో పెరిగిన రాజకీయ వేడి

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే విశాఖలో అప్పుడే రాజకీయ హీట్‌ మొదలైంది. విశాఖ భూకుంభకోణాన్ని అస్త్రంగా మలచుకున్న ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పోరుకు శ్రీకారం చుట్టాయి. అధికార పార్టీ నేతల అవినీతి బాగోతాన్ని ప్రజలకు చెప్పడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా విపక్షాలపై ఎదురుదాడి ప్రారంభించింది. దీంతో విశాఖలో రాజకీయవేడి మొదలైంది.

06:36 - June 26, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌కే తలమానికంగా మారిన గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఇక అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోనుంది. దేశ, విదేశీ విమానాలరాకపోకలతో కళకళలాడనుంది. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలు అశలు నెరవేరబోతున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్ర హోదా లభించింది. దీంతో ఈ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది. దేశంలోనే ఆక్యుపెన్సీపరంగా దూసుకుపోవడంతో ఈ ఖ్యాతిని త్వరితగతిన అందుకోగలిగింది.

అగ్రదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు

అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించడంతో త్వరలోనే ఈ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అగ్రదేశాలైన అమెరికా, దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా వంటి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత దుబాయ్‌కి విమాన సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. ఈ మేరకు దుబాయ్‌కు చెందిన ఎమిరైట్స్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్ధతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సర్వీస్‌ ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు నేరుగా విమాన ప్రయాణం సులభతరంకానుంది.

విదేశాలకు వెళ్లే ప్రయాణీకులకు తప్పనున్న పడిగాపులు

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ మీదుగా విదేశాలకు వెళ్తున్న ప్రయాణీకులకు ఇక నుంచి పడిగాపులు తప్పనున్నాయి. ప్రస్తుతం విదేశీ విమాన సర్వీసుల కోసం బోయింగ్‌ 737-800, ఎయిర్‌బస్‌ 319,320,321 విమాన రాకపోకలు సాగించేందుకు ఎయిర్‌పోర్టు రన్‌వే అనువుగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే విమాన సర్వీసులను ప్రారంభించాలనే లక్ష్యంగా పౌర విమానశాఖ పలు విమాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే విజయవాడలో జరిగిన సివిల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌లో సింగపూర్‌, దుబాయ్‌కు చెందిన విమాన సంస్థలతో డీల్‌ కుదుర్చుకున్నారు.

రూ. 162 కోట్లతో ట్రాన్సిట్‌ టెర్మినల్ నిర్మాణం

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇప్పటికే 162 కోట్ల రూపాయలతో ట్రాన్సిట్‌ టెర్మినల్‌ను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. భారీ విమాన రాకపోకలు సాగించేందుకు వీలుగా మరో 100 కోట్లతో పనులు చేపట్టారు. తొలి విడత విస్తరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2,286 మీటర్ల పొడవు ఉన్న రన్‌వేను 3,360 మీటర్లకు పెంచుతున్నారు. మొత్తానికి గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

గన్నవరం ఎయిర్ పోర్టు కు మహార్ధశ

కృష్ణా : విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు మహర్ధశ కలిగింది. అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ అయ్యింది. దీంతో ఏపీ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది.

గంగపర్రులో టెన్షన్

పశ్చిమగోదావరి :జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటులో నెలకొన్న వివాదం ఉద్రిక్తంగా మారింది. గరగపర్రులో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పర్యటిస్తుందనే నేపథ్యంలో దళిత, ప్రజాసంఘాలు 'ఛలో గరగపర్రు'కు పిలుపునిచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పర్యటనను మంగళవారానికి వాయిదా వేసుకుంది.

రంజాన్ శుభాకాంక్షలు

హైదరాబాద్: పరమ పవిత్రంగా భావించే రంజాన్‌ను ముస్లింలు ఇవాళ జరుపుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం షవ్వాల్‌ నెలవంక కనిపించడంతో ఈద్‌ ఉత్‌ ఫితర్‌ను ఇవాళ జరుపుకోవాలని మతపెద్దలు నిర్ణయించారు. గత నెలరోజులుగా ముస్లింలు పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు పాటించారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముస్లింసోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యం, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంతో గంగా జమున తెహజీబ్‌ సంస్కృతి ప్రతిబింబించేలా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

 

06:31 - June 26, 2017

కర్నూలు : గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన భూమా నాగిరెడ్డి అధికార పార్టీలో చేరడంతో నంద్యాలలో స్ధానాన్ని కోల్పోయింది వైసిపి. భూమా నాగిరెడ్డి మరణం తరువాత అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. పోగొట్టుకున్న చోటే స్ధానం దక్కించుకోవాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తోంది వైసిపి.

వ్యూహాలతో ముందుకెళ్తున్న టిడిపి, వైసిపి

నంద్యాల ఉప ఎన్నికపై అధికార టిడిపి, వైసిపి ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. నంద్యాల స్ధానాన్ని దక్కించుకోవాలని టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా భూమా కుటుంబానికి అవకాశం ఇచ్చారు సీఎం చంద్రబాబు. భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చారు. మరోవైపు ఉప ఎన్నికలో ఏకగ్రీవానికి రావాలని, చనిపోయిన వారి కుటుంబానికి అవకాశం ఇవ్వాలన్న సంప్రదాయాన్ని కొనసాగిద్దామని ప్రతిపక్ష నేత జగన్‌తో మంతనాలు ప్రారంభించారు టిడిపి నేతలు. ఈ నేపథ్యంలోనే నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా ఇటీవల పార్టీలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డిని ప్రకటించారు జగన్.

నంద్యాల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న జగన్

మొదటి నుంచి నంద్యాల స్ధానం మాదే అన్న వాదనను వినిపిస్తోంది వైసిపి. బిఫామ్‌తో గెలిచిన స్ధానం కనుక ఆ స్ధానం మాదే అంటున్నారు వైసిపి నేతలు. ఈ నేపథ్యంలోనే వైసిపి తమ అభ్యర్ధిని ప్రకటించింది. అంతేకాకుండా ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదల వ్యూహాలు రచిస్తున్నారు జగన్. త్తానికి నంద్యాల ఉప ఎన్నికకు రెండు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. మరి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో? ఎవరిని విజయం వరిస్తుందో? వేచి చూడాల్సిందే.

నంద్యాల ఉప ఎన్నికకు అభ్యర్ధుల ఎంపిక ఖరారు

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికకు అభ్యర్ధుల ఎంపిక ఖరారైపోయింది. ఇప్పటికే అధికార టిడిపి అభ్యర్ధిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రకటించింది. ఇక ఇటీవలే పార్టీలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డిని ఖరారు చేసింది వైసిపి. నువ్వా..నేనా అన్నట్లు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు.

06:28 - June 26, 2017

హైదరాబాద్: రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో వాషింగ్టన్‌ డీసీ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం శ్వేతసౌధంలో అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీకానున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికేందుకు శ్వేతసౌధం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్‌.. ట్విటర్‌ వేదికగా ఘన స్వాగతం పలికారు. మోదీ రాకకోసం శ్వేతసౌధం ఎంతగానో ఎదురు చూస్తోందని.. నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మకమైన విషయాల గురించి చర్చలు జరుపుతామంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అయితే ట్రంప్‌ ట్వీట్‌కు మోదీ రీట్వీట్‌ చేస్తూ ఎంతో అప్యాయంగా వ్యక్తిగతంగా స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీతో సమావేశమై చర్చలు జరిపేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య మరింత బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడనున్నాయి. వాణిజ్యం, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు, రక్షణశాఖకు సంబంధించిన కీలకమైన విషయాలు వీరి భేటీలో చర్చకురానున్నాయి. హెచ్‌1బీ వీసా అంశంపైనా వీరు చర్చించే అవకాశముంది. ఇక వైట్‌హౌస్‌లో మోదీ కోసం ట్రంప్‌ ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు.

 

06:26 - June 26, 2017

హైదరాబాద్: పరమ పవిత్రంగా భావించే రంజాన్‌ను ముస్లింలు ఇవాళ జరుపుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం షవ్వాల్‌ నెలవంక కనిపించడంతో ఈద్‌ ఉత్‌ ఫితర్‌ను ఇవాళ జరుపుకోవాలని మతపెద్దలు నిర్ణయించారు. గత నెలరోజులుగా ముస్లింలు పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు పాటించారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముస్లింసోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యం, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంతో గంగా జమున తెహజీబ్‌ సంస్కృతి ప్రతిబింబించేలా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Don't Miss