Activities calendar

15 October 2017

22:01 - October 15, 2017

టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాంతో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ.ప్రభుత్వ అత్యంత నిరంకుశంగా పాలన చేస్తుందన్నారు. ప్రజ అనుకూల పరిపాలన చేయడం లేదని చెప్పారు. ధర్నా చౌక్ ను ఎత్తివేశారని పేర్కొన్నారు. నిర్ణయాల్లో జరిగే విషయంలో మంత్రులకు అవకాశం లేదన్నారు. నిర్ణయాలు ముఖ్యమంత్రిగారి చేతిలో కేంద్రీకృతమయ్యాయని తెలిపారు. విపక్షాలు చేసే కార్యక్రమాలపై ఆంక్షలు, అణిచివేత కొనసాగుతుందన్నారు. ఉద్యమ ఆంకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ లక్ష్యాల కోసమైతే సాధించుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరడం లేదన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాల ఏర్పాటు వల్ల పది వేల ఉద్యోగాలు ఖాళీలు ఏర్పాడ్డాయన్నారు. ఉన్న ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కొలువుల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమరుల స్ఫూర్తియాత్ర బాగుందన్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:50 - October 15, 2017

ఢిల్లీ : కేరళలో కాషాయదళం జరిపిన దాడి..దేశం మొత్తం మీద జరిగిన దాడిలా చూడాలని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ అన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాద బలోపేతానికి కట్టుబడివుండటం.. మతతత్వం, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించినందువల్లే కేరళ రాష్ట్రాన్ని టార్గెట్‌ చేశారన్నారు.  పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎందుకు తీసుకున్నారో..అటు కేంద్రం కానీ.. ఇటు ఆర్బీఐ కానీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేవని అన్నారు. 

 

21:46 - October 15, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని చిన్నా, పెద్ద ప్రాజెక్టుల్లో జలకళ వచ్చింది. పలు జిల్లాల్లో  కుండపోత వానలతో పంటలు నీటిపాలయ్యాయి. ఇటు హైదరాబాద్‌ను మరోసారి భారీవర్షం ముంచెత్తింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌ జామ్‌లతో సిటీజనం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంతో అల్పపీడనం ఏర్పడటంతో మరో 3 రోజులు ఏపీ, తెలంగాణలకు భారీవర్షాలు తప్పవని విశాఖ వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్‌ను వదలని వరుణుడు  
హైదరాబాద్‌ను వరుణుడు వదలడంలేదు. భారీవర్షాలు ముంచెత్తడంతో సిటీ జనం అవస్థలు పడుతున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌లో కుండపోతగా వర్షం కురిసింది. గత పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో నగరంలోని ఆయా ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. అటు శివారు ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. భారీవర్షాలతో  అటు  నిజమాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. నిజామాబాద్‌జిల్లాలో వరిపంటను వర్షాలు దారుణంగా దెబ్బతీయగా.. కామారెడ్డి జిల్లాలో చేతికవచ్చిన పత్తిపంట నేలపాలయిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.  
ఏపీలోనూ 
ఏపీలోనూ భారీవర్షాలకు పంటలు నేలరాలాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో  ఇటీవల కురిసిన  వర్షాలకు  మొత్తం 31.161 హెక్టార్లలో వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా దాదాపు 834  కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, అలాగే 365  కిలోమీటర్ల మేర పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని జిల్లా అధికారులు లెక్కలు వేశారు.  
నిండుకుండలా ఆల్మట్టీ, శ్రీరాం సాగర్, శ్రీశైలం
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టీ, శ్రీరాం సాగర్, శ్రీశైలం, సింగూరు , నిజాంసాగర్, తదితర ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ నీటితో నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్‌ నీటి మట్టం అమాంతం పెరిగుతోంది.  అయితే నాగార్జున సాగర్ నిండడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అటు  నిజామాబాద్ జిల్లాలోని  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. 
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఇదిలావుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల  భారీవర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలో  ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది. భారీగా క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడి.. హైదరాబాద్‌తోపాటు, పలు జిల్లాల్లో మరో 3రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

 

21:42 - October 15, 2017

హైదరాబాద్ : అమరవీరుల స్ఫూర్తియాత్ర చేస్తున్న కోదండరామ్‌ను అరెస్ట్‌ చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు ఖండించారు. కోదండరామ్‌ను కలిసి ఆయనకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ కంటే ఎక్కువ కష్టపడ్డ కోదండరామ్‌ పట్ల... ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని... ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వీహెచ్ అన్నారు. 

 

21:27 - October 15, 2017

కృష్ణా : విజయవాడలోని కాపు కార్పొరేషన్‌ ఆఫీస్‌లో హైడ్రామా నడిచింది. ఎండీ అమరేందర్‌ను ప్రభుత్వం  ఇవాళ బాధ్యతల నుంచి  తప్పించింది. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు  అమరేందర్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. అయితే  తన  అనుమతి లేకుండా ప్రెస్‌మీట్‌ ఎలాపెడతారంటూ చైర్మన్‌ రామానుజయ అమరేందర్‌ను నిలదీశారు. దీనిపై ఎండీ అమరేందర్‌ సీరియస్‌ అయ్యారు. తనకు సీఎం ఆఫీసు నుంచి అనుమతి ఉందని అడ్టుకోవద్దని తేల్చి చెప్పారు. దీంతో ప్రెస్‌మీట్‌లో తానుకూడా కూర్చుంటానంటూ చైర్మన్‌ రామానుజయ పేచీపెట్టారు. ఇద్దరు నేతల మధ్య వాగ్వాదంతో కాపుకార్పొరేషన్‌లో రాజకీయం మరింత వేడెక్కింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

పుష్ పుల్ రైలు అదివారం నుంచి 20 రోజుల పాటు రద్దు

మహబూబాబాద్ : విజయవాడ...ఖాజీపేట మధ్య నడిచే పుష్ పుల్ రైలు అదివారం నుంచి 20 రోజుల పాటు రద్దు కానుంది. 

 

20:54 - October 15, 2017

ఢిల్లీ : ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ దుమ్ములేపింది. పూల్‌ ఏ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 3..1తో చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో భారత్‌ 9 పాయింట్లతో పూల్‌-ఏలో అగ్రస్థానంతో ముగించింది. చింగల్‌సేన 13 నిమిషంలో, రమణ్‌దీప్‌ సింగ్‌ 44 నిమిషంలో, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 45వ నిమిషంలో గోల్‌ కొట్టారు. పాక్‌లో అలీషాన్‌ ఒక్కడే గోల్‌ చేయగలిగాడు. టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం. తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 5..1, రెండో మ్యాచ్‌లో బంగ్లాను 7...0తో చిత్తుచిత్తుగా ఓడించింది.

 

20:50 - October 15, 2017

నాగర్‌కర్నూల్ : జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు నీటిని మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన హరీశ్‌...కాంగ్రెస్‌ నేతలపై నిప్పులు చెరిగారు. 30 ఏళ్లలో వారు చేయలేనిది..మూడేళ్లలో తాము చేయడంతో అసూయపడుతున్నారని విమర్శించారు. వారు కోర్టులను నమ్ముకుంటే.. తాము ప్రజలను నమ్ముకున్నామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి కృష్ణ జలాలు తీసుకురావడం ఎంతో ఆనందదాయకమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇది కల్వకుర్తి రైతుల 30 ఏళ్ల కల అని..పండుగలా జరుపుకోవాల్సిన రోజు అని అభివర్ణించారు. ఇక మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..కల్వకుర్తి ప్రాజెక్టుకు నీరు విడుదల చేయడంలో మంత్రి హరీష్‌రావు కృషి ఎంతో ఉందన్నారు. దీంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 

రేపు విజయవాడలో నిర్వాసితుల 30 గంటల మహా ధర్నా

కృష్ణా : విజయవాడలో రేపు నిర్వాసితులు 30 గంటల మహా ధర్నా నిర్వహించనున్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు ధర్నాచౌక్ లో మహా ధర్నా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పాల్గొననున్నారు. 

 

ఏఎస్ రావు నగర్ లో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

హైదరాబాద్ : ఏఎస్ రావు నగర్ లో ఇంటర్ విద్యార్థిని జశ్వని అదృశ్యం అయింది. తోటి విద్యార్థులపై విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుషాయిగూడ పోలీసులు పట్టించుకోలేదు. 

 

20:19 - October 15, 2017

అనంతపురం : కదిరి సైదాపూర్ లో రౌడీ షీటర్ దారుణ హత్య గావించబడ్డారు. వేట కొడవళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. సైదాపూర్ లో బైక్ పై వెళ్తున్న రౌడీ షీటర్ నర్సింహనాయక్ ను కాపుగాసి ప్రత్యర్థులు సాయంత్రం 6.30 గంటల సమయంలో వేట కొడవళ్లతో నరికి చంపారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సైదాపుర్ లో ఉద్రిక్తత నెలకొంది. 10హత్య కేసుల్లో నరసింహనాయక్ నిందితుడుగా ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:10 - October 15, 2017

ఆధునిక సమాజంలో అంబేద్కరిజం అనే అంశంపై మాస్టర్ కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రావెల కిషోర్ బాబు పాల్గొని, మాట్లాడారు. అంబేద్కర్ భావజాలం, ఆలోచనలను వివరించారు. కాన్షీరాం ఆలోచనలను తెలిపారు. ఆధునిక సమాజంలో అంబేద్కరిజాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కదిరి సైదాపూర్ లో రౌడీ షీటర్ దారుణ హత్య

అనంతపురం : కదిరి సైదాపూర్ లో రౌడీ షీటర్ దారుణ హత్య గావించబడ్డారు. రౌడీ షీటర్ నర్సింహనాయక్ ను వేట కొడవళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. 
 

ఆసియాకప్ హాకీ టోర్నీలో పాకిస్తాన్ పై భారత్ విజయం

ఢిల్లీ : ఆసియాకప్ హాకీ టోర్నీలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. 3..1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ ను భారత్ హాకీ జట్టు ఓడించింది. వరుసగా మూడు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. గ్రూప్..ఏలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 

బల్దియా టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అవినీతి

హైదరాబాద్ : బల్దియా టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అవినీతి కంపుకొడుతోంది. అధికారుల మాయాజాలం మరోసారి బట్టబయలైంది. మాముళ్ల మత్తుల్లో నిజానిజాలు తెలుసుకోకుండానే పనులు ఎలా చేస్తున్నారో వెలుగులోకి వచ్చింది. ఏకంగా చనిపోయిన వ్యక్తి పేరిట కమర్షియల్‌ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. సరూర్‌నగర్‌ శ్రీనివాస్‌నగర్‌లో వైన్‌షాప్‌ ఏర్పాటుకు...2014లో చనిపోయిన యాదగిరిగౌడ్‌ పేరుతో ఈనెల 7న దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే మూడు రోజుల్లోనే అనుమతులు ఇచ్చేశారు. అదీ రెసిడెన్షియల్‌ ఏరియాలో కమర్షియల్‌ నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 

19:14 - October 15, 2017
19:13 - October 15, 2017
18:43 - October 15, 2017

ఢిల్లీ : దేశంలో సెక్యులర్‌ వ్యవస్థను కాపాడ్డానికి సీపీఎం ఎల్లపుడూ ముందుంటుందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సంఘ్‌పరివార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రల్లో భాగంగానే సీపీఎం పార్టీపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేరళ, త్రిపురల్లో వామపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని రాఘవులు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్రకమిటీ సమావేశాల్లో ఈ అంశాలన్నీ చర్చించామని రాఘవులు చెప్పారు. 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగనున్న పార్టీ 22వ జాతీయ మహాసభల సన్నాహకాలపై కూడా కేంద్రకమిటీలో చర్చించినట్టు రాఘువులు తెలిపారు. 

 

కృష్టా జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

కృష్ణా : జి.కొండూరు మండలం వెల్లటూరులో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. పొలంలో పనులు చేస్తున్న ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. 

 

18:37 - October 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి సైలెంట్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. భూ కబ్జాల్లో సీఎం కేసీఆర్‌కు కూడా వాటాలు ఉన్నాయన్నాయనే విమర్శలు వస్తున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న కేసీఆర్‌ తన బుద్ధిహీనతను బయటపెట్టుకుంటున్నారని తమ్మినేని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలను నిందించడం తగదని ఆయన హితవు పలికారు.

 

18:15 - October 15, 2017

ఖమ్మం : పట్టణంలో విషాదమైన ఘటన చోటుచేసుకుంది. ఎన్‌ఎస్‌పి కాలువలో పడి అక్కాతమ్ముడు మృతి చెందారు. మృతులు ఆరేళ్ల మంద మానస, ఐదేళ్ల మంద మనోజ్‌గా గుర్తించారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:10 - October 15, 2017
18:08 - October 15, 2017

హైదరాబాద్ : అక్కడ లంచం ఇస్తే ఏ పనైనా జరిగిపోతుంది. చనిపోయిన వ్యక్తి పేరుపైనా కమర్షియల్‌ నిర్మాణాలకు అనుమతులిచ్చేస్తారు. బల్దియా టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అవినీతి కంపుకొడుతోంది. అధికారుల మాయాజాలం మరోసారి బట్టబయలైంది. మాముళ్ల మత్తుల్లో నిజానిజాలు తెలుసుకోకుండానే పనులు ఎలా చేస్తున్నారో వెలుగులోకి వచ్చింది. ఏకంగా చనిపోయిన వ్యక్తి పేరిట కమర్షియల్‌ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. సరూర్‌నగర్‌ శ్రీనివాస్‌నగర్‌లో వైన్‌షాప్‌ ఏర్పాటుకు...2014లో చనిపోయిన యాదగిరిగౌడ్‌ పేరుతో ఈనెల 7న దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే మూడు రోజుల్లోనే అనుమతులు ఇచ్చేశారు. అదీ రెసిడెన్షియల్‌ ఏరియాలో కమర్షియల్‌ నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:57 - October 15, 2017

ఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో.. ప్రజల దృష్టి మళ్లించడానికే లెఫ్ట్‌పార్టీలపై బీజేపీ ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఢిల్లో జరుగుతున్న సీపీఎం కేంద్రకమిటీ సమావేశాల్లో తమ్మినేని పాల్గొని, మాట్లాడారు. పెరుగుతున్న మతోన్మాద కలహాలు, దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, అమెరికన్‌ సామ్రజ్యవాదానికి మోదీ ప్రభుత్వం లొంగిపోతున్న విధానంపై పార్టీ కమిటీలో చర్చించినట్టు తమ్మినేని చెప్పారు. తప్పుడు ఆర్థిక విధానాలను కప్పిపుచ్చుకోడానికే లెఫ్ట్‌పార్టీలపై బీజేపీ దాడులకు పాల్పడుతోందన్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రకమిటీలో చర్చించామని తెలిపారు. జీఎస్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే లెఫ్ట్‌పార్టీల బీజేపీ విమర్శలు అన్నారు. 

బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు : బివి.రాఘవులు

ఢిల్లీ : హస్తినలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సీపీఎం కార్యాలయాలపై బీజేపీ దాడులను కేంద్ర కమిటీ ఖండించింది. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు మాట్లాడుతూ బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. మతోన్మాదాన్ని ఎదుర్కోవడంలో సీపీఎం ముందుందని తెలిపారు. లౌకిక విలువలు కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సీపీఎం సిద్ధమన్నారు. పార్టీ అఖిల భారత 22 వ జాతీయ మహాసభల్లో చర్చించే అంశాల ముసాయిదాను జనవరిలో విడుదల చేస్తామని చెప్పారు.

 

బీజేపీ దాడులను ఖండించిన సీపీఎం కేంద్ర కమిటీ

ఢిల్లీ : హస్తినలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సీపీఎం పార్టీ కార్యాలయాలపై బీజేపీ దాడులను సీపీఎం కేంద్ర కమిటీ ఖండించింది. 

 

చీరాల మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం

ప్రకాశం : చీరాల మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. చీరాలలో కరెంట్ స్తంభం విరిగిపడి మూడు బైక్ లు ధ్వంసం అయ్యాయి. 

 

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. అప్జల్ గంజ్, కోఠి, మలక్ పేట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లు జలమయం అయ్యాయి. 

 

దెందులూరు పీఎస్ వెనుక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి : దెందులూరు పీఎస్ వెనుక నక్కల పండు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. దెందులూరు ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసులో నక్కల పండు మొదటి నిందితుడిగా ఉన్నారు.  

కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ముద్రగడ డెడ్ లైన్

విశాఖ : కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ముద్రగడ పద్మనాభం డిసెంబర్ 6 వరకు డెడ్ లైన్ విధించారు. ఆ లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేని పక్షంలో మరోసారి రోడ్డెక్కుతామని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 49 శాతం రిజర్వేషన్లలో ఆడగటం లేదు. మిగిలిన కోటా 51 శాతం లోనే అడుగుతున్నామని చెప్పారు. తెలంగాణలో పల్స్ సర్వే ఒక్క రోజులోనే చేశారు. పల్స్ సర్వే రిపోర్టును సీఎం కేసీఆర్ పరిశీలించి 9వ షెడ్యూల్ లో చేర్చమన్నారు. ఏపీలో చంద్రబాబు ఏ రిపోర్టుమా తెప్పించుకోలేదన్నారు. 

 

16:32 - October 15, 2017

విజయవాడ : చేనేత కార్మికులకు జీఎస్టీ పోటు తప్పడంలేదు. చేనేతను ఆదుకుంటామని చెప్పే పాలకుల మాటలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అండగా ఉంటామన్న వారు ఆమడదూరంలో ఉంటూ ఆర్భాటపు ప్రకటనలు చేయడంతో సగటు చేనేత కార్మికుడి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. 
జీఎస్టీతో తగ్గిన ఉత్పత్తి
దేశంలోనే అత్యధిక జీవనాధారమైన చేనేత రంగంపై జీఎస్టీ దెబ్బ గట్టిగానే పడింది. వస్తుసేవల పన్ను ప్రభావం చేనేత కళాకారులు, రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సంప్రదాయ వస్త్రకళకు కొత్త డిజైన్లతో వన్నె తెస్తామన్న దేశ ప్రధాని ఆ హామిని నెరవేర్చలేదు సరికదా జీఎస్టీ తీసుకొచ్చి చేనేత పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశారు. జీఎస్టీ అమలుతోనే ఉత్పత్తిదారుల వద్ద 50 శాతానికి పైగా ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో నిల్వలు పేరుకుపోయి 30 శాతానికిపైగా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 
జీఎస్టీతో నేతన్నలపై మోయలేని పెనుభారం
చేనేత ఎగుమతుల్లో వృద్ధి సాధించాలంటే నిఫ్ట్‌ లాంటి సంస్థల సాయం తప్పనిసరి. అధునాతన మగ్గాల ఏర్పాటుకు చేనేత ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు అవసరం ఉన్నా ప్రభుత్వాలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి.  ఇలాంటి అంశాలను విస్మరించిన కేంద్రం చేనేతపై జీఎస్టీని తెచ్చి నేతన్నలపై మోయలేని పెనుభారాన్ని వేసింది. దీంతో ఎన్నడూ లేని విధంగా చేనేత ముడి సరుకు మొదలుకొని ఉత్పత్తుల వరకు పన్ను పోటు ఎక్కువైంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 
కాటన్‌, వూల్‌ కొనుగోలు నుండి 5 శాతం జీఎస్ టీ 
వస్త్ర ఉత్పత్తికి కావలసిన ముడిసరుకైన కాటన్‌, వూల్‌ కొనుగోలు నుండే జీఎస్ టీ 5 శాతం పడుతోంది. దేశంలోనే అత్యధిక మగ్గాలున్న అనంతపురం జిల్లాలో చేనేత పరిశ్రమే జీవనాధారం. ఆంధ్రప్రదేశ్‌లో 1.75 లక్షల మగ్గాలుంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే 75 వేల మగ్గాలున్నాయి. ఎక్కువ శాతం ఉత్పత్తయ్యే పట్టు వస్త్రాలకు దారం కొనుగోలు చేయాలంటే కిలో రూ. 4వేలకు పైనే ధర ఉంది. జీఎస్టీతో అది రెండువందలు పెరిగింది. చేనేత మగ్గంపై తయారైన వస్త్రానికి మరో 5 శాతం పన్ను అదనంగా విధిస్తున్నారు. అది సాధారణ వస్త్రమైనా, చీరైనా బాదుడు తప్పడంలేదు. అయితే మరో 18 శాతం అదనపు పన్ను చెల్లింపు అనివార్యంగా మారింది.
చేనేతపై పన్నును 15 శాతం పెంచిన కేంద్రం
చేనేత పన్నును 5 శాతానికి పరిమితం చేస్తామన్న కేంద్రం 15 శాతం పెంచింది. పట్టు చీర ఖరీదు 5వేలు ఉంటే, దానిపై జీఎస్టీ 750 విధించి చీర ఖరీదు కాస్తా 5,750 చేస్తున్నారు. దీంతో మహిళలు చీరలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంలేదు. ఫలితంగా స్టాకు నిల్వలు పెరిగిపోతున్నాయని ఉత్పత్తిదారులు ఆవేదన చెందుతున్నారు.
ముడిసరుకు కొనుగోలుకు 5 శాతం జీఎస్టీ 
ముడి సరుకు కొనుగోలుకు 5 శాతం జీఎస్టీ చెల్లించిన ఉత్పత్తిదారుడు తాను తయారు చేసిన వస్త్రానికి కూడా బిల్లువేసి వెంటనే జీఎస్టీ చెల్లించాలి. అదే రిటైలర్లు షాపులో కస్టమర్‌ నుండి జీఎస్టీ వసూలు చేసినా ఏడాది తర్వాత అయినా ఉత్పత్తిదారులకు మొత్తం సొమ్ము ఇస్తారన్న గ్యారెంటీ లేదు. దీంతో ఈ భారం ఉత్పత్తిదారులపై పడుతోంది. 
చేనేత రంగం సంక్షోభంలో 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల చేనేత రంగం సంక్షోభంలో పడిందంటున్నారు విపక్షాలు. కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప పరిస్థితులు చక్కబడే పరిస్తితులు కనిపించడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

16:14 - October 15, 2017

హైదరాబాద్‌ : బాలానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. సిగ్నల్‌ వద్ద ఆటో ఆగిపోవడంతో.. వెనకాల వస్తున్న ఇద్దరు యువకులు డ్రైవర్‌పై కిరాతకంగా దాడి చేశారు. అడ్డుకున్న మహిళలపై యువకులు ప్రతాపం చూపించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

 

16:11 - October 15, 2017

హైదరాబాద్ : బాలాపూర్ పరిధిలో రాయల్ కాలనీలో ఫేక్ ఆధార్ కార్డ్ పొందిన ఇద్దరు బర్మా దేశస్తులను పోలీసులు అరెస్టు చేశారు. అజాముద్దీన్ అనే వ్యక్తి రియాజుద్దీన్‌ అనే వ్యక్తిని తన కొడుకుగా తప్పుడు సమాచారం ఇచ్చి ఫేక్ ఆధార్‌ కార్డు పొందారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. 

 

16:04 - October 15, 2017

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బి.జె.పి. నేతలు అడ్డుపడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. అభివృద్ధికి సహకరించకపోగా అవినీతి పెరిగిపోయిందని సోము వీర్రాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన గోరంట్ల.. ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుపడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

 

15:58 - October 15, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ వాసులను వంట గ్యాస్‌ కొరత వేధిస్తోంది. సిలిండర్లు దొరక్క వేలాది మంది వినియోగదారులు చుక్కలు చూస్తున్నారు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామన్న అధికారులు మాటలకే పరిమితమయ్యారు. దీంతో నగరవాసులకు గ్యాస్‌ బండ గుదిబండగా మారింది. 
భాగ్యనగరాన్ని వేధిస్తోన్న వంటగ్యాస్‌ కష్టాలు
భాగ్యనగరాన్ని వంటగ్యాస్‌ కష్టాలు వేధిస్తున్నాయి. వంటింట్లో గ్యాస్‌ కొరవడడంతో నిత్యావసర వస్తువుగానే గ్యాస్‌ బండలను కూడా అరువు తీసుకుంటున్నారు. నగరంలో ఒకటి రెండు ఇండ్లల్లోని కష్టాలు కావు, ఎవరింటి గడప తొక్కినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 
ప్రతి రోజు సగటున 55వేల సిలిండర్లు అవసరం
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజు సగటున 55వేల సిలిండర్లు అవసరమవుతాయి. కాని ప్రస్తుతం 40 వేలకు మించి అందుబాటులోకి రావడంలేదు. ఇటీవల వరుస సెలవులు, దసరా పండుగ సైతం నగరంలో గ్యాస్ కష్టాలను మరింత జటిలం చేశాయి. హెచ్‌పీసీఎల్‌కు చెందిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ప్లాంట్ల నుండి నగరానికి తీసుకువస్తున్నారు. దసరా రావడంతో ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ పెరిగి సప్లయ్‌ తగ్గింది. పది పదిహేను రోజుల్లో పరిస్థితి యధాస్థితికి వస్తుందనుకున్న అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. 
డెలివరీకి 10...20 రోజుల సమయం
సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత డెలివరీ చేసేందుకు 10 నుండి 12 రోజుల వరకు పడుతోంది. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 130 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. హెచ్‌పీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లు 50 మంది ఉండగా, మొత్తం గ్యాస్ వినియోగదారులు సుమారు 23 లక్షలు ఉన్నారు. ఇందులో హెచ్‌పీ వినియోగదారులు 8 నుండి 9 లక్షల వరకు ఉన్నారు. ఒక్కో ఏజెన్సీ నుండి రోజు సుమారు 500 సిలిండర్లను సరఫరా చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ సరఫరా తగ్గిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు అధిక చార్జీలు వసూలు చేయడంతో నగరవాసులకు మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. 
పీడిస్తోన్న సిలిండర్‌ కొరత 
అసలే వాన కష్టాలతో సతమతమవుతోన్న నగరవాసులను సిలిండర్‌ కొరత పట్టిపీడిస్తోంది. దీంతో కొందరు కిరోసిన్‌ స్టవ్‌లను ఆశ్రయిస్తున్నారు. 15 రోజుల కింద సిలిండర్ బుక్‌ చేసినా ఇప్పటి వరకు రాలేదని పలువురు గృహిణులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. 

 

15:48 - October 15, 2017

విశాఖ : పోర్టు అభివృద్ధికి సంబంధం లేని కార్యక్రమాలకు పోర్టు భూములు లీజుకు ఇవ్వాలని నిర్ణయించడాన్ని.. సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు ఖండించారు. పోర్టు యాజమాన్యం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పోర్టు భూములను లీజుకు తీసుకొని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టడమేంటని నిలదీశారు. విశాఖ పోర్టు సామర్థ్యం 2020కల్లా 125 మిలియన్‌ టన్నులకు పెంచాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. భవిష్యత్ పోర్టు అవసరాలు ఎలా తీరతాయని ప్రశ్నించారు. 

 

15:45 - October 15, 2017

కరీంనగర్‌ : జిల్లాలోని సైదాపూర్‌ మండలం రాయికల్‌ గ్రామ శివారులోని పెద్దగుట్టపై నుండి జాలువారే నీటిని, ప్రకృతి అందాలను కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తిలకించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న గ్రామస్తుల కోరిక మేరకు కలెక్టర్‌, పోలీసు సిబ్బంది ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. అద్భుతమైన వాతావరణం ఉన్న ఈ ప్రదేశాన్ని పిక్నిక్ స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌, సిపిలు తెలిపారు. 

 

15:43 - October 15, 2017

హైదరాబాద్ : అమరవీరుల స్ఫూర్తియాత్రకు అనుమతి తీసుకున్నా.. అక్రమ అరెస్టులు చేశారని కోదండరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక పీఎస్‌ల చుట్టూ చుట్టారని పేర్కొన్నారు. అమరవీరుల స్ఫూర్తియాత్రకు వెళ్తున్న వారిని అరెస్ట్‌ చేయడం సరైంది కాదన్నారు. అక్రమ అరెస్టులపై అత్యవసరం సమావేశం నిర్వహించిన టీ.జేఏసీ... ప్రభుత్వం అభద్రతభావంతో కొనసాగుతుందన్నారు. 151 సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేయడం సరైంది కాదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పాలించే హక్కు లేదన్నారు. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించేందుకు అందరూ సంఘటితం కావాల్సిన అవసరముందన్నారు. 

 

15:33 - October 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై వీహెచ్‌ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు, కేసీఆర్‌ ప్రజాపాలన కాకుండా పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని ఆరోపించారు. అనుమతి తీసుకుని అమరవీరుల స్ఫూర్తియాత్ర చేస్తున్న కోదండరామ్‌ను..  పోలీసులు ఎలా అడ్డుకున్నారని ప్రశ్నించారు. అలాగే ఏపీలో కూడా ముద్రగడను పాదయాత్ర చేయకుండా అణిచివేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వాలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారని హెచ్చరించారు. 

 

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 50 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు. ఇన్ ఫ్లో 45 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 10 వేల క్యూసెక్కులుగా ఉంది.

ఇద్దరు బర్మా దేశస్తుల అరెస్టు

రంగారెడ్డి : బాలాపూర్ పరిధిలోని రాయల్ కాలనీలో ఇద్దరు బర్మా దేశస్తుల అరెస్టు చేశారు. ఇక్కడి రోహింగ్యాలకు పాన్, ఓటర్ కార్డు ఆధార్ కార్డు తయారు చేస్తుండగా పట్టుకున్నారు. 

 

సోమవారం కొరాపుట్ బంద్.

కొరాపుట్ : ఆదివాసీ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడిని మావోయిస్టులు ఖండించారు. ఈ మేరకు సోమవారం కొరాపుట్‌ జిల్లా బంద్ కు మావోలు పిలుపునిచ్చారు. 

జూరాలకు వరద..

గద్వాల : జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో లక్షా 48 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో లక్షా 50 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటినిల్వ 8.989 టీఎంసీలు, పూర్తి స్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలుగా ఉంది.

 

తిరుమలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి...

చిత్తూరు : తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమితో రాయ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

మోరినాలో పోలీసుల తనిఖీలు..

మధ్యప్రదేశ్‌ : మోరినాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి పలు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు. 

13:22 - October 15, 2017

హైదరాబాద్ : హిమాయత్ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ దాదాపు 100 ఏళ్లుగా హైదరాబాదీలకు తాగునీటిని అందిస్తున్న జంట జలాశయాలు. వీటిలో నీరు సమృద్ధిగా ఉంటే సిటీకి 45 మిలియన్‌ గాలన్లను ప్రతీ రోజూ సరఫరా చేస్తారు. 15 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్‌వాసులకు ఈ జంట జలాశయాల నుంచే నీరు అందేది. కొన్నేళ్లుగా ఎన్ని వానలు పడుతున్నా వీటిలోకి నీరు రావడం లేదు. 2010లో పూర్తిగా నిండిన జలాశయాలు ఇప్పటివరకూ నిండలేదు. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వస్తున్న నిర్మాణాలే ఇందుకు కారణమన్న వాదనలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి వర్షాలు పడుతున్నా.. గడిచిన వారం 10 రోజుల్లోనే ఈ జలాశయాలకు భారీగా నీరు చేరింది. గతేడాది కన్నా ఉస్మాన్‌సాగర్‌లో ఒక్క అడుగు తక్కువగా ఉండగా.. హిమాయత్ సాగర్‌లో 7 అడుగులు అధికంగా నీరు చేరింది.

ఉస్మాన్‌ సాగర్‌లో ప్రస్తుతం 2.2 టీఎంసీల నీరు
ఉస్మాన్ సాగర్‌ జలాశయం 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,781 అడుగులకు నీరు చేరింది. మొత్తం 3.9 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఉస్మాన్‌ సాగర్‌లో ప్రస్తుతం 2.2 టీఎంసీల నీరు ఉంది. ఇక హిమాయత్ సాగర్‌ వాటర్‌ లెవల్ 1763 అడుగులు కాగా.. ప్రస్తుతం సాగర్‌లో 1755 ఉంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే హిమాయత్ సాగర్‌లోకి 7 అడుగుల నీరు అధికంగా వచ్చింది. హిమాయత్ సాగర్‌ నుండి ప్రతీ రోజు 25 మిలియన్ గ్యాలన్ల నీటిని ఓల్డ్‌ సిటీ ప్రాంతానికి పంపిణీ చేస్తారు. అయితే ప్రస్తుతం కృష్ణా గోదావరి జలాలు పుష్కలంగా సిటీకి అందుతుండటంతో ఈ నీటిని వాడటం లేదు. ఈ రెండు చెరువుల నుంచి గ్రావిటీ ద్వారా నీరు సిటీకి వస్తుండటంతో.. వీటిని సరఫరా చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

అన్యాక్రాంతమైన నాలాలు
హిమాయత్‌ సాగర్‌ను ఈసీ నదిపై.. ఉస్మాన్‌ సాగర్‌ను మూసీ నదిపై నిర్మించారు. అయితే వీటి క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఉన్న వ్యవసాయ భూముల్లో వివిధ రూపాలైన నిర్మాణాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు ప్రైవేట్ కాలేజ్‌లు.. ఫామ్‌ హౌజ్‌లతో పాటు పలు ప్రైవేట్ నిర్మాణాలు వచ్చాయి. అంతే కాకుండా ఈ సరస్సులోకి నీటిని తెచ్చే పలు నాలాలు కూడా అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలున్నాయి. అందువల్లే వీటిల్లోకి నీరు రావడం లేదని నిపుణులు అంటున్నారు. 

13:21 - October 15, 2017

హైదరాబాద్ : మైనర్ విద్యార్థుల మిస్సింగ్ కేసులు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. రాచకొండ కమీషనరేట్ మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో.. ఈ నెల 11న సాయి ప్రజ్వల అనే విద్యార్థిని అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యమై 5 రోజులు గడిచినా ఇప్పటివరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదు. పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి ప్రజ్వలను హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడ నారాయణ కళాశాలలో.. కోచింగ్ కోసం జాయిన్ చేశారు. దసరా సెలవులు రావడంతో ఊరికి వెళ్లి తిరిగి కళాశాలకు వచ్చింది. తరువాత బోడుప్పల్ వెంకటసాయి నగర్‌లోని తన మామయ్యవాళ్ల ఇంటికి తీసుకొచ్చారు. అయితే సాయిప్రజ్వల ఓ లేఖ రాసి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఇంట్లో నుండి వెళ్లే సమయంలో సీసీ కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు చొరవ చూపి తమ కూతురి ఆచూకీ తెలపాలని తల్లిదండ్రులు కోరారు. 

యూడీఎఫ్ విజయం..

కేరళ : వెంగర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థి కేఎన్ఏ ఖాదర్ విజయం సాధించారు. పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఎన్డీయే కూటమిన నాలుగో స్థానంలో నిలిచింది. 

బీజేపీ తీర్థం పుచ్చుకున్న బీఎస్పీ లీడర్లు..

లక్నో : ఆరుగురు బీఎస్పీ లీడర్లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ యూపీ చీఫ్ మహేంద్ర నాథ్ ఆధ్వర్యంలో వారు కాషాయ కండువాలు కప్పుకున్నారు. 

గురుదాస్ పూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం..

పంజాబ్ : గురుదాస్ పూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జకర్ గెలుపొందారు. 1,93,219 ఓట్లతో ఆయన విజయం సాధించారు. 

గేదే మాంసం తరలిస్తున్నారని..

ఫరీదాబాద్ : గేదే మాసం తరలిస్తున్నాడని ఐదుగురు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఉప్పల్ మెట్రో మార్గంలో మేయర్ పర్యటన..

హైదరాబాద్ : ఉప్పల్ మెట్రో మార్గంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. వర్షపునీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. వచ్చే వర్షాకాలం నాటికి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మేయర్ సూచించారు. 

అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల కార్యక్రమం..

విజయవాడ : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. 3991 మంది స్కూల్ విద్యార్తులకు అవార్డులు అందచేశారు. 

వామపక్ష నేతల అరెస్టు దుర్మార్గం - కె.రామకృష్ణ..

విజయవాడ : వంశధార నిర్వాసితులను కలిసేందుకు వెళ్లిన వామపక్ష నేతల అరెస్టులు దుర్మార్గమని సీపీఐ నేత కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం లేదని, 4 వేల ఎకరాలు అవసరమైన చోట 33 వేల ఎకరాలు తీసుకోవడం అన్యాయమన్నారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరకం కాదని, ప్రాజెక్టు వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించడం దారుణమన్నారు. 

గురుదాస్ పూర్ లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..

పంజాబ్ : గురుదాస్ పూర్ లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ అభ్యర్థి సునీల్ జకర్ లక్ష ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

11:41 - October 15, 2017
11:40 - October 15, 2017

ప్రకాశం : జిల్లా ఒంగోలులోని మాస్టర్‌ మైండ్స్‌ డిఫెన్స్‌ అకాడమీ.. విద్యార్థులను నిలువునా ముంచేసింది. డిఫెన్స్‌ రంగంలో ఉద్యోగాలు గ్యారంటీ అని నడుపుతోన్న విద్యాసంస్థ.. నిరుద్యోగ యువతను మోసం చేసింది. ఒక్కొక్కరి దగ్గరి నుంచి ఆరు నెలల కోర్సుకు 40 వేలు వసూలు చేసి యాజమాన్యం ఫ్లేట్ ఫిరాయించింది. ఇక్కడి వసతులు దారుణంగా ఉన్నాయని.. అమ్మాయిలకు, అబ్బాయిలకు ఒకే చోట వసతి ఏర్పాటు చేశారని విద్యార్థులు తెలిపారు. అమ్మాయిలను దారుణ పదజాలంతో అవమానించడంతో.. చాలా మంది వెళ్లిపోయారని మరి కొందరు ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యారని చెప్పారు. విద్యార్థుల నుంచి దాదాపు అర కోటి వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

11:39 - October 15, 2017

 

హైదరాబాద్ : నకిలీ బాబా గుట్టు రట్టయ్యింది. అసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సయ్యద్‌ రాజి రాజవి తన పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని దర్గాకు వెళ్లాడు. అక్కడ నకిలీ బాబా తమకు డబ్బులిస్తే కుమారులకు నయం చేస్తానని నమ్మించి విడతల వారీగా 70 లక్షలు తీసుకున్నాడు. వివిధ దర్గాల వద్ద అమాయకులను చూసి మోసగిస్తుండేవాడు. సయ్యద్‌ నుంచి బాబా వసూలు చేసిన డబ్బులతో ఒక స్కార్పియో కార్‌, ఫోర్టునేర్‌ కార్, భూములను కొనుగోలు చేశాడు. నకిలీ బాబాకు సహకరించిన ఇద్దరు ఏజెంట్‌లను గతంలోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపారు. బాబా వద్ద నుంచి రెండు కార్లు, ఇంటి స్థలాల పేపర్‌లను స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించారు. 

11:38 - October 15, 2017

 

హైదరాబాద్ : టప్పచెబుత్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీగా గుట్కా ప్యాకెట్లు దొరికాయి. సబైర్‌ నగర్‌లో సదుల్లా అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ఉందన్న సమాచారంతో పోలీసులు రైడ్‌ చేశారు. 26 రకాల గుట్కా కాటన్స్‌ దొరికాయి. వాటి విలువ 5 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. సదుల్లాను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి..

పంజాబ్ : గురుదాస్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జకర్ 94,161 ఓట్లతో అధిక్యంలో కొనసాగుతున్నారు. 

మీడియాతో కోదండరాం..

హైదరాబాద్ : యాత్ర కోసం ముందుగానే పర్మిషన్ ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, జనగామ, మహబూబాబాద్ లో యాత్రకు పోలీసు అధికారులు మాటతో కూడిన అనుమతిచ్చారని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. శాంతియుతంగా, రాజ్యంగబద్ధంగా తాము కార్యక్రమం ఉంటుందని, భావ ప్రకటన స్వేచ్చ రాజ్యాంగం కల్పించిందన్నారు. ఆఖరి నిమిషంలో మధ్యరాత్రి నుండి అరెస్టులు చేస్తున్నారని, రాష్ట్ర హోం మంత్రి నాయినీ కలవడం జరిగిందన్నారు. అన్ని చెప్పిన తరువాతే వరంగల్ లో యాత్ర చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 

11:08 - October 15, 2017
11:07 - October 15, 2017

 

మేడ్చల్ : జిల్లా మేడిపల్లి పరిధిలో ఇంటర్ విద్యార్థిని సాయిప్రజ్వల అదృశ్యమైంది. ఈ నెల 11న ఇంటి నుంచి వెళ్లిపోయిన సాయిప్రజ్వల ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాయిప్రజ్వల బయటకు వెళ్లిన సీసీ ఫుటేజీలు పోలీసులు స్వాధీనం చేసుకుని విద్యార్థిని ఎటు వెళ్లిందో అని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

యూడీఎఫ్ కు 56925 ఓట్లు..

కేరళ : రాష్ట్రంలోని వెంగర స్థానానికి జరిగిన బై పోల్ లో కౌంటింగ్ కొనసాగుతోంది. యూడీఎఫ్ 56925, ఎల్డీఎఫ్ 36262, ఎస్ డీపీఐ 7325, ఎన్డీయే 5403 ఓట్లు సాధించాయి. కేరళ : రాష్ట్రంలోని వెంగర స్థానానికి జరిగిన బై పోల్ లో కౌంటింగ్ కొనసాగుతోంది. యూడీఎఫ్ 56925, ఎల్డీఎఫ్ 36262, ఎస్ డీపీఐ 7325, ఎన్డీయే 5403 ఓట్లు సాధించాయి. 

బెంగళూరులో రోడ్లపై ఏర్పడిన గుంతలు..

బెంగళూరు : కర్నాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమవుతున్నాయి. ఆనంద్ రావ్ సర్కిల్ లో రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. ఇటీవలే రోడ్లపై ఏర్పడిన గుంతల వల్ల పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 

కోదండరాం పోరులో కాంగ్రెస్ - వీహెచ్..

హైదరాబాద్ : ప్రొ.కోదండరాం పట్ల కేసీఆర్ వ్యవహార శైలి దారుణంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కోదండరాంను వాడుకుని వదిలేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. అమరువీరుల స్పూర్తి యాత్రకు కోదండరాంకు అనుమతిన్వికపోవడం.. పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రభుత్వంపై కోదండరాం చేసే పోరులో కాంగ్రెస్ పాల్గొంటుందన్నారు. 

పొంగుతున్న వాగులు..

గుంటూరు : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సత్తెనపల్లి - అమరావతి మధ్య వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 

నారాయణ కాలేజ్ విద్యార్థిని అదృశ్యం కలకలం..

మేడ్చల్ : మేడిపల్లి పరిధిలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. నారాయణ కాలేజీ హాస్టల్ లో సరియైన వసతులు లేవని పేర్కొంటూ తల్లిదండ్రులకు లెటర్ రాసి పెట్టి వెళ్లింది. ఈనెల 11న ఇంటి నుండి వెళ్లిపోయింది. పీఎస్ లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 

కోదండరాంతో వీహెచ్..బండా కార్తికరెడ్డి..

హైదరాబాద్ : టీజేఏసీ ఛైర్మన్ ప్రో.కోదండరాంను కాంగ్రెస్ నేత వీహెచ్, మాజీ మేయర్ బండా కార్తికరెడ్డిలు కలిశారు. 

09:14 - October 15, 2017

పాట్నా : దేశంలోని 20 యూనివర్సిటీలకు 10 వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రకటించారు. ప్రపంచంలోని టాప్‌ 5 వందల విశ్వవిద్యాలయాల్లో భారత్‌కు చెందిన ఒక్క యూనివర్సిటీ కూడా లేకపోవడం శోచనీయమన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలుగా తీర్చిదిద్దుతామని మోదీ అన్నారు. పట్నా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను ద్దేశించి ప్రసంగించారు. పట్నా విశ్వవిద్యాలయం చాలా మంది ఐఏఎస్‌ అధికారులను దేశానికి అందించిందని మోది ప్రశంసించారు. బిహార్ అభివృద్ధికి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. 2022 నాటికి అభివృద్ధిలో బిహార్ ముందంజలో ఉంటుందని చెప్పారు. జెడియు ఎన్డీయేలో చేరిన తర్వాత మోది, నితీష్‌ ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. పట్నా యూనివర్సిటీకి కేంద్ర వర్సిటీ గుర్తింపు ఇవ్వాలన్న నితీష్‌కుమార్‌ విజ్ఞప్తిని మోది తోసిపుచ్చారు.

టిడిపికి బుట్టా రేణుక ?

కర్నూలు : వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. మొన్న అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును బుట్టా దంపతులు కలవడం తెలిసిందే. 

09:12 - October 15, 2017

 

బెంగళూరు : కర్నాటక సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకు సంబంధించి కీలక ఆధారాలను సిట్‌ బయటపెట్టింది. లంకేష్‌ను హత్య చేసిన ముగ్గురు అనుమానితుల స్కెచ్‌ను స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్ విడుదల చేసింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా ముగ్గురి ఊహాచిత్రాలను ఇద్దరు ఆర్టిస్టులతో సిట్‌ రూపొందించింది. ఇందులో ఇద్దరి పోలికలు ఒకేలా ఉన్నాయి. గౌరి లంకేష్‌ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన ఇద్దరు అనుమానితులకు సంబంధించిన ఫుటేజీని కూడా సిట్‌ సేకరించింది. ఈ వీడియోలో గౌరీ ఇంటి ముందు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. హత్యలో అతడి ప్రమేయం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అనుమానితులు 25-35 ఏళ్ల మధ్య
అనుమానితులు 25-35 ఏళ్ల మధ్య వయసు వారేనని సిట్‌ పేర్కొంది. కలిగి హత్యకు ముందు వారం రోజులు గౌరి ఇంటికి సమీపంలోనే అనుమానితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో సిట్‌ ఇప్పటివరకు సుమారు 250 మందిని విచారణ జరిపింది. దుండగులను పట్టుకునేందుకు సహకరించాలని సిట్‌ పోలీస్‌ చీఫ్‌ బికె సింగ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 55 ఏళ్ల గౌరీ లంకేష్‌ హిందుత్వ వాదాన్ని విమర్శిస్తూ పలు పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. టీవీ చర్చల్లో పాల్గొనేవారు. సెప్టెంబర్‌ 5న బెంగళూరులో ఆమె ఇంటి సమీపంలో గౌరీ లంకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మోటార్‌బైక్‌పై వచ్చిన దుండగులు సమీపం నుంచి ఆమెను కాల్చి చంపారు. ఈ హత్య కేసులో నిందితుల వివరాలను తెలియజేసిన వారికి 10లక్షలు రివార్డు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.

09:11 - October 15, 2017

హైదరాబాద్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ పురస్కరించుకొని నగరంలోని నెక్లెస్ రోడ్డు లో 3కె, 5కె రన్ నిర్వహించారు. రన్ ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ, సీపీ, పలువురు పోలీస్ ఉన్నతధికారులు పాల్గొన్నారు.

సాగర్ కు వరద ఉధృతి..

నల్గొండ : నాగార్జున సాగర్ కు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 544.50 అడుగులుగా ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. సాగర్ ఇన్ ఫ్లో 2,67,513, ఓట్ ఫ్లో 1,500గా ఉంది. 

08:47 - October 15, 2017

జుడ్వా 2....కలెక్షన్ల హావా కొనసాగుతోంది. బాలీవుడ్ హీరో 'వరుణ్ ధావన్' హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో 'హాలో బ్రదర్' పేరిట సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను 'సల్మాన్ ఖాన్' హీరోగా 'జుడ్వా' గా హిందీలో వచ్చింది. దీనికి సీక్వెల్ గా 'జుడ్వా 2' రూపొందింది.

డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో 'వరుణ్ ధావన్' 'తాప్సీ'..జాక్వెలిన్ ఫెర్నాండెజ్' నటించారు. వరుణ్ ధావన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. విమర్శలకు ప్రశంసలు అందుకుంది. తొలి రోజున దేశ వ్యాప్తంగా రూ. 16.10 కోట్లు రాబట్టింది. మూడు రోజుల్లోనే రూ. 50 కోట్లు సాధించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లు రాబట్టినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. విదేశాల్లో రూ. 36.64 కోట్లు గ్రాస్ సాధించింది. 

7 గేట్ల ద్వారా నీరు విడుదల..

కర్నూలు : శ్రీశైలం రిజర్వాయర్ 7 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 1,57,832 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 2,82,261 క్యూసెక్కులు ఉంది. 

గురుదాస్ పూర్ లోక్ సభ బై పోల్ కౌంటింగ్..

పంజాబ్ : గురుదాస్ పూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

08:25 - October 15, 2017

అగ్ర హీరోల చిత్రాలను భారీ మొత్తం చెల్లించి పంపిణీ చేయడంలో 'దిల్' రాజుకు పెట్టింది పేరు. దసరా సీజన్‌లో 'దిల్' రాజు పంపిణి చేసిన చిత్రాల్లో 'జై లవకుశ'..'స్పైడర్'..'మహానుభావుడు' చిత్రాలు ఉన్నాయి. త్వరలో విడుదల కాబోతున్న 'పవన్ కల్యాణ్' చిత్రానికి సంబంధించిన హక్కులను కూడా ఈయనే దక్కించుకున్నట్లు సమాచారం.

'దిల్' రాజు నిర్మాణంలో 'రాజ ది గ్రేట్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా 'దిల్' రాజు మాట్లాడుతూ...తనకు తెలిసి ఇప్పటివరకు ఎవ్వరికీ రాని విధంగా తమకు ఈ ఏడాది మంచి విజయాలు వచ్చాయని అన్నారు. 'శతమానం భవతి', 'ఫిదా', 'డీజే', 'నేను లోకల్'.. ఇలా వరుసగా విజయాలు వచ్చాయని తెలిపారు. తనకు రవితేజతో త‌న‌కు 20 ఏళ్లుగా అనుబంధం ఉంద‌ని పేర్కొన్నారు. తెలుగు సినిమాలో హీరో అంధుడిగా న‌టిస్తే అస‌లు ఆ సినిమా ఆడుతుందా? అని కొంద‌రు అన్నార‌ని తెలిపారు. మొత్తం సినిమాలో 'రవితేజ' అంధుడిగా కనిపిస్తాడని, కళ్లు వస్తాయా ? రావా ? అని చాలా మంది డౌట్ పడ్డారని తెలిపారు. మొదటి నుంచి శుభం కార్డు ప‌డే వ‌ర‌కు 'ర‌వి తేజ' అంధుడిగానే ఉంటాడంటే వారు న‌మ్మ‌లేక‌పోయార‌ని అన్నారు.

అలహా బాద్ వర్సిటీ ఫలితాలు..

అలహాబాద్ : యూనివర్సిటీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 5 సీట్లకు సమాజ్ వాదీ చాహత సభ 4 సీట్లు గెలుచుకుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. ఇదిలా ఏబీవీపికి ఒక్క సీటు దక్కింది. 

07:50 - October 15, 2017

శ్రీకాకుళం జిల్లా హిరమండలం దుగ్గుపురం, పాడలి, చిన్నకొల్లివలస, ఇరపాడు, తులగాం గ్రామాలకు చెందిన నిర్వాసిత రైతులు ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు వందల ఎకరాలను పంటతో సహా జేసిబి, ట్రాక్టర్లతో నాశనం చేశారని కన్నీరు పెట్టుకుంటున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో అనురాధ (టిడిపి), ఉమా మహేశ్వరరావు (సీపీఎం), సుధాకర్ బాబు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:00 - October 15, 2017
06:56 - October 15, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌వన్ అని అన్నారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ ఎక్స్ పోను ఆయన ప్రారంభించారు. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఇండియన్‌ పోలీస్‌ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఇండోర్‌ స్టేడియంలో పోలీస్‌ ఎక్స్ పో ఏర్పాటు చేశారు. తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌ శర్మ, సిటీ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో మొత్తం 21 స్టాల్స్ ఏర్పాటు చేశారు.

పోలీస్‌లపై దాడి జరిగినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో సైబరాబాద్‌ టాక్టికల్‌ వింగ్‌ సభ్యులు ఈ ఎక్స్ పోలో ప్రదర్శించి చూపించారు. ఎగ్జిబిషన్‌లో పోలీసుల అధునాతన ఆయుధాలు, నేరస్తులను పట్టుకునేందుకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. తెలంగాణ పోలీస్‌ శాఖ నిర్వహిస్తున్న ఈ ఎక్స్ పోను ప్రతి ఒక్కరు చూడాలని మంత్రి నాయిని కోరారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా ప్రజలకు, పోలీసులు నిర్వహిస్తున్న విధుల పట్ల మరింత అవగాహన వస్తుందన్నారు. ఈ ఎక్స్ పో ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన పారా మిలిటరీ బలగాలు, వారు ఉపయోగించే ఆయుధాలు, సైబర్‌ నేరాలపై అవగాహన, షీ టీంల పనితీరు పై ప్రజలకు అవగాహన వస్తుందన్నారు. రేపు పీపుల్స్ ప్లాజాలో 2k, 5k, 10k స్మారక రన్‌ నిర్వహిస్తామని డీజీపీ తెలిపారు. పోలీసులు, ప్రజలకు మెరుగైన సంబంధాలు కలిగించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు డీజీపీ. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

06:53 - October 15, 2017

కృష్ణా : ఎన్నో కలలతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి అడుగుపెట్టారు. భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలనే లక్ష్యంతో చదువుకుంటున్నారు. అంతలోనే వారికి ఏమైంది? జీవితం అంటేనే ఎందుకు అంత విరక్తి కలిగింది? ఒత్తిడా? ప్రేమ వ్యవహారాలా? కుటంబసమస్యలా? కారణాలు ఏవైనా కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో రెండు విద్యా కుసుమాలురాలిపోయాయి. మూడురోజుల తేడాలో ఇద్దరు విద్యార్ధులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల మరణమృదంగం ఆగడంలేదు. బుధవారం లక్ష్మీనర్సింహమూర్తి అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే.. శనివారం హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి రమాదేవి అనే విద్యార్ధిని కన్నుమూసింది.

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రమాదేవి అనే విద్యార్ధిని శనివారం ఉదయం కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటీన విజయవాడ ఎంజే  ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమాదేవి కన్నుమూసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస రమాదేవి స్వస్థలం. ఆమె మరణంతో ఆమె కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు ఎంజీ ఆసుపత్రికి పెద్ద ఎత్తున విద్యార్ధి సంఘ నేతలు చేరుకున్నారు.

కాగా బుధవారం రాత్రి లక్ష్మీనరసింహమూర్తి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీనరసింహమూర్తి నూజివీడులోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతనిది తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామం. క్యాంపస్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై విషాద ఛాయలు నెలకొన్నాయి. వరుస ఘటనలతో విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలపై అధికారులు దృష్టిపెట్టాలని..దీనిపై విచారణ చేపట్టాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశారు. 

06:49 - October 15, 2017

విజయవాడ : వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్రకు రెడీ అవుతోన్న వేళ ఆ పార్టీకి పెద్ద షాకే త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర వ‌చ్చే నెల 2 నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌య్యే టైంకు కాస్త అటూ ఇటూగా వైసీపీ నుంచి కీల‌క వ్యక్తులు జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ పాలిటిక్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీలో జోష్‌ నింపగా.. ప్రతిపక్షాన్ని డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీతో పాటు కాంగ్రెస్‌ నుంచి కూడా కొందరు కీలక నేతలు టీడీపీవైపు తొంగి చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ బుట్టా రేణుక టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బుట్టా రేణుకతో పాటు మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత జ‌గ‌న్...క‌ర్నూల్ జిల్లా నేత‌ల‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. తాము పార్టీ మార‌డం లేద‌ని కొందరు నేతలు చెప్పగా...ఎంపీ బుట్టా రేణుక మాత్రం పార్టీలో కొన‌సాగే విష‌యంపై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే..బుట్టా రేణుక పార్టీ మారడం ఖాయమన్న ప్రచారానికి మరింత బ‌లం చేకూరింద‌ని వైసీపీ నేత‌లు చర్చించుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను కర్నూలు ఎంపీగా కాక..ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్‌ సూచించడంతో వైసీపీని వీడేందుకు ఆమె సిద్ధపడినట్లు తెలుస్తోంది. బుట్టా రేణుక ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు అంగీకరిస్తే..కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే బుట్టా మాత్రం ఇందుకు ససేమిరా అన్నారట. ఎంపిగానే పోటి చేస్తాన‌ని, ఎమ్మెల్యేగా పోటి చేసే ఉద్దేశం తనకు లేద‌ని కుండబద్దలు కొట్టేశారట. ఈ పరిణామాలతోనే బుట్టా రేణుక త‌న‌దారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మ‌రోవైపు బుట్టా రేణ‌క భర్త గ‌తంలో చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. రేణుక కూడా భర్త బాటలో నడుస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త‌న స‌న్నిహితులు,అనుచ‌రుల‌తో సమావేశమైన త‌రువాత..పార్టీ మార్పుపై రేణుక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే వ‌ల‌స‌ల‌తో స‌త‌మ‌తమవుతున్న వైసీపీకి బుట్టా రేణుక పార్టీ మారితే మ‌రింత న‌ష్టం త‌ప్పద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఏపీలో నేడు ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పుస్కారాల ప్రధానోత్సవం

గుంటూరు : నేడు ఏపీలో ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 6,500 మందికి ఈ పురస్కరాలు అందజేస్తారు. అధికారులు జిల్లాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

06:46 - October 15, 2017

విజయవాడ : నంద్యాల, కాకినాడ ఓటమితో కుదేలైన వైసీపీని గాడిన పెట్టేందుకు జగన్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? మూసపద్ధతిలో కాకుండా వినూత్న పద్ధతిలో పాదయాత్ర ప్రారంభించేందుకు పావులు కదుపుతున్నారా? ప్రజా సమస్యలే ఎజెండాగా బాబు సర్కార్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే వ్యూహాలకు జగన్‌ పదునుపెడుతున్నారట. రాజకీయ నేపథ్యం, ప్రజావసరాల దృష్ట్యా యాత్రకు అనుమతి వస్తుందని భావిస్తున్న వైసీపీ నేతలు...జగన్‌ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. అసలు జగన్‌ పాదయాత్రకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. జగన్ పాదయాత్రకు సంబంధించి హాజరు మినహాయింపుల అనుమతులు కోరుతుండగా.. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లలో యాత్రకు బ్రేకులు వేయాలని కోరుతున్నారు. రాజకీయ నేపథ్యం, ప్రజావసరాల దృష్ట్యా యాత్రకు మాత్రం అనుమతి వస్తుందని, హాజరు మినహాయింపు సంగతి ఏమౌతుందో చూడాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడక పోయినా..జగన్‌ పాదయాత్రకు వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

న‌వంబ‌రు 2 నుంచి సుదీర్ఘ పాద‌యాత్రకు శ్రీకారం చుట్టేందుకు జగన్‌ రెడీ అవుతున్నారు. పట్టణాలతో పాటు ప‌ల్లెలు, గ్రామాల్లో విస్తరిస్తేనే పార్టీ ప‌వ‌ర్‌లోకి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పాద‌యాత్ర పూర్తిగా ప‌ల్లెలు, గ్రామాల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ కూడా రెడీ అయింది. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే పాదయాత్రను అట్టహాసంగా ప్రారంభించేందుకు వైసిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారట. సుమారు లక్ష మందితో పాదయాత్రను మొదలుపెట్టి అధికార పార్టీకి పెద్ద సవాల్‌ను విసరాలని భావిస్తున్నారట. 3 వేల కిలోమీటర్లకు పైగాసాగే పాదయాత్ర అన్ని జిల్లాలను కలుపుతూ 122 నియోజకవర్గాల్లో ఉండేలా రూట్ మ్యాప్ రూపొందించారు. ఈ పాదయాత్రలో జనాన్ని ఆకర్షించేందుకు పీకే కొత్త వ్యూహాలు సిద్ధం చేశారట. నవరత్నాల పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు పావులు కదుపుతున్నారట. ఇవేకాక జనాల నాడిని బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి కొత్త హామీలు ప్రకటించాలని భావిస్తున్నారట. ఇక జగన్‌ పాదయాత్రలో మరో ఆసక్తిరమైన అంశంపై ప్రచారం హోరెత్తుతోంది. ప‌ల్లె జ‌నాల‌ను ఆక‌ర్షించేందుకు త‌న తండ్రి మాదిరిగా జ‌గ‌న్ కూడా పంచె ధరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా వైసీపీ అధినేత పాదయాత్రకు సీబీఐ కోర్టు తీర్పు కీలకం కానుంది. 

06:44 - October 15, 2017

హైదరాబాద్ : విషజ్వరాలతో తెలంగాణలో జనం పిట్టల్లా రాలిపోతున్నా...సర్కార్‌ మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదని చెబుతోంది. అసలు రాష్ట్రంలో వైరల్‌ ఫీవర్స్‌తో ఒక్కరంటే ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్రానికి నివేదిక సమర్పించింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఈ ఏడాది జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటికిటలాడినా.. ప్రభుత్వ పెద్దలకు ఇవేమీ కనిపించడం లేదు. కేంద్రానికి తప్పుడు నివేదికలు సమర్పించిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతమంది విషజ్వరాల బారినపడ్డారు? ఎంతమంది చనిపోయారన్న వివరాలతో 10 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

తెలంగాణలో మలేరియా, డెంగీ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. ఒక్కరు కూడా చనిపోలేదంటూ కేంద్రానికి తప్పుడు నివేదికలు సమర్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ సంవత్సరం సుమారు 20మందికి పైగా డెంగీతో మరణించినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో మలేరియా, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. సర్కార్‌ ఇచ్చిన సమాచారం తప్పుల తడక అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ నివేదికలో వెల్లడైనట్లు సమాచారం. 20 మంది డెంగీతో చనిపోయినట్లు సమాచారం ఉన్నా.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంగీకరించడం లేదని తెలిసింది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 16,074 డెంగీ కేసులు, 3 వేల 631 మలేరియా కేసులు నమోదు అయ్యాయి.

ఈ ఏడు జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా 78,691 డెంగీ కేసులు నమోదు కాగా...122 మంది చనిపోయినట్లు కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. 2010లో 28,292 డెంగీ కేసులు నమోదుకాగా.. 110 మంది మృతిచెందారు. 2011 కంటే 2012లో ఏకంగా 50 వేల 222 మందికి డెంగీ సోకగా 242 మంది మృత్యువాతపడ్డారు. 2013లో 75 వేల 808 డెంగీ కేసులు నమోదు కాగా.. 192 మంది చనిపోయారు. 2015లో 99వేల 913 డెంగీ కేసులు నమోదుకాగా.. 220 మంది మృతిచెందారు. 2016లో లక్షా 29 వేల 166 కేసులు నమోదైతే 245 మంది చనిపోయారు. మలేరియా కేసులు కూడా గత నెల వరకు 4లక్షల 1వెయ్యి 141 నమోదవగా.. సాధారణ మలేరియా కేసులు 5లక్షల 92వేల 905గా రికార్డయ్యాయి. 75 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా డెంగీ, మలేరియా మరణాలు ఎక్కువగా ఉన్నట్లు సాక్షత్‌ కేంద్రం నివేదించినా.. తెలంగాణలో మాత్రం ఒక్కరు కూడా చనిపోలేదని కేసీఆర్‌ సర్కార్‌ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.  

06:42 - October 15, 2017

ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో టీ-మాస్‌ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు టీ-మాస్‌ ఫోరం స్టీరింగ్‌ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ప్రజల భవిష్యత్‌ కోసమే టీ-మాస్‌ ఏర్పడిందన్నారు గద్దర్‌. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని అధికారంలోకి వచ్చిన నేతలు.. హామీలన్నీ విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన నడుస్తుందన్నారు సాయిబాబు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరముందన్నారు. ఇక ఈ సభలో ఆడపిల్లలపై గద్దర్‌ పాడిన అందరిని అలరించింది. 

06:38 - October 15, 2017

హైదరాబాద్ : ఐపిఎల్‌ ఫ్రాంచైజ్‌ మాదిరిగానే ఫార్ములా వన్ పేరుతో పేరుతో ఆర్భాటపు ప్రకటనలు చేశారు. వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇదిగో అదిగో అంటూ 4 సంవత్సరాల నుండి జాప్యం చేస్తూ వచ్చారు. మోసపోయామని తెలుసుకున్న వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ నిర్వాహకులపై కేసు నమోదైంది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నైతో సహా 11 రాష్ట్రాల్లో ఫార్ములా వన్ రేసు ఫ్రాంచైజ్‌లను ప్రారంభిస్తున్నామని 2004 సంవత్సరంలో ప్రకటనలు ఇచ్చారు మచ్‌ దర్‌ కంపెనీ నిర్వహకులు. దీంతో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రఘురాం కృష్ణంరాజు ఫ్రాంచైజీలో తనకు పాట్నర్‌షిప్‌ కావాలని కోరాడు. దీనికి సమ్మతించిన మచ్‌ దర్‌ మోటారు ప్రైవేటు కంపెనీ లిమిటెడ్‌ నిర్వాహకులు చెన్నైలో ఫ్రాంచైజీ ఇస్తామని హామి ఇచ్చారు. ఇది నమ్మిన కృష్ణంరాజు 12న్నర కోట్ల రూపాయలు చెల్లించాడు. ఇది జరిగి 4 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు ఫ్రాంచైజ్‌ పనులు మొదలు పెట్టలేదు. దీంతో తాము కట్టిన డబ్బు తిరిగి చెల్లించాలని నిర్వాహకులను అడిగారు కృష్ణం రాజు

ఈ విషయమై నిర్వాహకులు టీమ్ ఇండియా మాజీ మేనేజర్ చాముండేశ్వరీనాథ్‌ను మధ్యవర్తిగా పంపించి ఎంవోయూ ఒప్పందం చేయించుకొని కృష్ణంరాజుకు 5 కోట్లు చెల్లించారు. అయితే మిగిలిన 7.50 లక్షలను చెల్లించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో కృష్ణంరాజు సిపిఎస్‌లో తన పీఏ నర్సింహా భారతి చేత ఫిర్యాదు చేయించారు. కేసు రిజిస్టర్‌ చేసుకున్న పోలీసులు నిందితుల వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న అంజనా రెడ్డి వాంగ్మూలాన్ని, మధ్యవర్తిగా వచ్చిన చాముండేశ్వరినాథ్‌ వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి తాను గతంలోనే పోలీసులకు వివరణ ఇచ్చానని దీనిపై ఇప్పుడు తానేమీ స్పందించలేనని చాముండేశ్వరీనాథ్‌ స్పష్టం చేశారు. ఫార్ములా వన్‌ రేసు పేరుతో భారీగా మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. ఇలాంటి డొల్ల కంపెనీలకు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

06:34 - October 15, 2017

వరంగల్ : తెలంగాణలో ఆరో దశ అమరుల స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామన్నారు టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్. యాత్రకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కావాలనే అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్ వెళ్తున్న కోదండరామ్‌ను ఘట్‌కేసర్‌ జోడిమెట్ల వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు స్ఫూర్తి యాత్రకు అనుమతి ఇవ్వాలని కోదండరామ్ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. నల్గొండ జిల్లాలో స్ఫూర్తియాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే నాయిని నుంచి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదని సమాచారం.

మరోవైపు కోదండరామ్‌ను కలిసేందుకు కీసరకు వెళ్లారు మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు. అయితే కోదండరామ్‌ ఆదిభట్ల పీఎస్‌లో ఉన్నట్లు పోలీసులు వీహెచ్‌కు చెప్పారు. కోదండరామ్‌ అరెస్టును వీహెచ్‌ ఖండించారు. మరోవైపు అమరుల స్ఫూర్తి యాత్ర పోలీసులు ఆపలేరన్నారు ప్రొ.కోదండరామ్. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా తాము మాత్రం యాత్రను చేపట్టి తీరతామని కోదండరామ్ స్పష్టం చేశారు. 

న్యూజిలాండ్ తో భారత్ టీం..

ఢిల్లీ : ఈనెల 22 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ... భారత జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కొత్తగా యువ పేసర్ శార్థూల్ ఠాకూర్, వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌లు చోటు దక్కించుకున్నారు.

స్పెషల్ బస్సులో బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు శనివారం విజయవాడలో సుడిగాలి పర్యటన చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరిన సీఎం సుమారు 5 గంటల పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లు, కాల్వలతో పాటు ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు. ఎప్పుడూ ప్రయాణించే కాన్వాయ్‌లో కాకుండా స్పెషల్ బస్సులో చంద్రబాబు పర్యటించారు. సీఎం వెంట మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీందర్, నగర ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. 

పోలీసుల అమరవీరుల సంస్మరణ పరుగు..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో పోలీసుల అమరవీరుల సంస్మరణ పరుగు జరుగనుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, డీజీపీ అనురాగ్ శర్మలు పాల్గొననున్నారు. 

మంత్రి కేటీఆర్ గరం..గరం..

వరంగల్ : జీడబ్ల్యూఎంసీ సమీక్షలో మంత్రి కేటీఆర్ గరమయ్యారు. మేయర్ నరేందర్, కలెక్టర్ అమ్రపాలి, కమీషనర్ శృతి పనితీరుపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Don't Miss