Activities calendar

16 November 2017

12:39 - November 16, 2017

'బిచ్చగాడు'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని హీరోగా ఇంద్రసేన చిత్రం రూపు దిద్దుకుంటోంది. డయానా చంపిక, మహిమ కథానాయికలుగా జి.శ్రీనివాసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ను ఎన్‌.కె.ఆర్‌ ఫిల్మ్స్‌ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఆ విశేషాలను నీలం కృష్ణారెడ్డి తెలియజేస్తూ, 'టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. 'బిచ్చగాడు' కంటే బిగ్గెస్ట్‌ హిట్‌ అవ్వగల స్థాయి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. 
ఆ నమ్మకంతోనే భారీ పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేసే హక్కులను సొంతం చేసుకున్నాం. ఈ నెల 16న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఆడియో వేడుకను నిర్వహిస్తాం. అదే వేడుకలో సినిమాలో ఓ పది నిమిషాల నిడివి గల ఫుటేజ్‌ను ప్లే చేస్తాం. అలాగే ఓ ఫుల్‌ వీడియో సాంగ్‌ను కూడా ప్రదర్శిస్తాం. ఆ వీడియో సాంగ్‌ను మాస్‌ మహారాజా రవితేజ లాంచ్‌ చేస్తారు. మా సంస్థ నుంచి విడుదలైన మునుపటి చిత్రాలు 'ఇంకొక్కడు', 'జయమ్ము నిశ్చయమ్మురా' తరహాలోనే ఈ సినిమా కూడా ఘన విజయం సొంతం చేసుకుని హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంటామన్న నమ్మకం ఉంది' అని అన్నారు.

12:35 - November 16, 2017

మొదటి యాబై చిత్రాలు వేగంగా పూర్తి చేశాను. ప్రస్తుతం కొద్దిగా వేగం తగ్గించాను. కేవలం కమర్షియల్‌ సినిమాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను' అని అన్నారు సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.థమన్‌. 'కిక్‌', 'బృందావనం', 'రగడ', 'మిరపకారు', 'నాయక్‌', 'షాడో', 'బాద్‌షా', 'గౌరవం', 'తడాఖా', 'బలుపు', 'మసాలా', 'రేసుగుర్రం', 'రభస', 'పవర్‌', 'ఆగడు', 'కిక్‌ 2', 'పండగ చేస్కో', 'డిక్టేటర్‌', 'సరైనోడు', 'విన్నర్‌', 'గౌతమ్‌నంద', 'మహానుభావుడు', 'రాజుగారి గది 2' వంటి తదితర చిత్రాలతో సంగీత దర్శకుడిగా థమన్‌కి తెలుగునాట మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపుని ఇంకా మెరుగుపర్చుకుంటానని అంటున్న 
థమన్‌ పుట్టినరోజు నేడు (గురువారం). ఈ సందర్భంగా బుధవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే, 'ఎనిమిదేండ్ల వయసులోనే నా సినీ ప్రయాణం ప్రారంభమైంది. చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25 ఏండ్లు అవుతోంది. కీ బోర్డ్‌ ప్లేయర్‌గా ఏ.ఆర్‌.రెహ్మాన్‌, మణిశర్మ, కీరవాణితోపాటు దాదాపు అందరూ సంగీత దర్శకుల వద్ద 900 చిత్రాలకు పైగా పని చేశాను. ఈ ప్రయాణంలో వారి దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీత దర్శకుడిగా ఇప్పటివరకు 72 చిత్రాలు పూర్తయ్యాయి. వంద చిత్రాల దిశగా పయనిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి యాభై చిత్రాలు చాలా వేగంగా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు వేగం తగ్గించాను. కమర్షియల్‌ చిత్రాలకే పరిమితం కాకుండా భిన్న నేపథ్య చిత్రాలకూ సంగీతం అందించాలని ఆశిస్తున్నాను. సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఇందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాను. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిజం ప్రధానంగా సాగే సినిమాలదే ఆధిపత్యం. వారి ఇమేజ్‌కు అనుగుణంగానే సంగీతాన్ని అందించాలి. ప్రస్తుతం పాటల విడుదల ధోరణిలో కూడా చాలా మార్పులొచ్చాయి. గతంలో ఒకే రోజున ఆరుపాటల్ని విడుదల చేసేవారు. అందులో మంచి కిక్‌ ఉండేది. ప్రస్తుతం ఓ సినిమా ప్రమోషన్‌ నాలుగైదు నెలల పాటు సాగుతోంది. దాంతో ఒక్కో పాటను, ఒక్కోలా విడుదల చేయటం ట్రెండ్‌గా మారింది. టాలీవుడ్‌లో నాకు సాయి ధరమ్‌ తేజ్‌ అత్యంత ఆప్తుడు. ఇద్దరం కలిసి గతంలో కొన్ని సినిమాలు చేశాం. కానీ సక్సెస్‌ మాత్రం కొట్టలేకపోయాం. ఆ లోటుని భర్తీ చేసేలా మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'జవాన్‌' చిత్రం ఉంటుంది. కమర్షియల్‌, హర్రర్‌, మాస్‌.. ఇలా ఏ తరహా చిత్రం విషయంలోనైనా సంగీత దర్శకుడిగా నా పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు. వంద చిత్రాలకు చేరువవుతున్నప్పటకీ సంగీత దర్శకుడిగా ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది' అని పేర్కొన్నారు.

08:21 - November 16, 2017

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎందుకు పెరుగుతాయి..? ఎందుకు తగ్గుతాయి? వీటిధరలపై రోజువారి సమీక్ష ఎందుకు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్‌టీ పరిధిలోనికి ఎందుకు చేర్చడంలేదు? ఈ విషయాలపై టెన్ టివి జనపథంలో ఆర్థిక వేత్త శశికుమార్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:19 - November 16, 2017

కోల్ కతా : భారత్‌, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.ఐసీసీ టెస్ట్ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు...6వ ర్యాంకర్‌ శ్రీలంక సవాల్‌ విసురుతోంది. కోల్‌కతాలోని ఇండియన్‌ క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగనున్న తొలి టెస్ట్‌లో కొహ్లీ అండ్‌ కో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. ఇండియన్‌ క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇప్పటికే రంగం సిద్ధమైంది.ఐసీసీ టెస్ట్ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు...6వ ర్యాంకర్‌ శ్రీలంక సవాల్‌ విసురుతోంది.టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని జైత్రయాత్ర కొనసాగిస్తోన్న టీమిండియా..సిరీస్‌ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.

యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత టెస్ట్‌ జట్టు...బ్యాక్‌ టు బ్యాక్ సిరీస్‌ విజయాలతో జోరు మీదుంది.అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లతో అన్ని విభాగాల్లో సమతూకంగా ఉన్న భారత జట్టు..... ఆల్‌రౌండ్‌ పవర్‌తో పటిష్టంగా ఉంది. విరాట్‌ కొహ్లీ, రాహుల్‌, శిఖర్‌ ధావన్‌,మురళీ విజయ్‌, అజింక్యా రహానే,చటేశ్వర్‌ పుజారా, రోహిత్‌ శర్మ,వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేధ్యంగా ఉంది.

భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేష్‌ యాదవ్‌,మహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ వంటి మేటి ఫాస్ట్‌ బౌలర్లతో పేస్‌ బౌలింగ్‌ లైనప్‌ పదునుగా ఉంది.ఇక స్పిన్‌ ట్విన్స్‌ రవీందర్ జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారో అందరికీ తెలిసిందే. మరోవైపు దినేష్‌ చాందిమల్‌ సారధ్యంలోని శ్రీలంక జట్టుపై పెద్దగా అంచనాల్లేవు. ఏంజెలో మాథ్యూస్‌, కరుణ రత్నే,తిరిమాన్నే ,చాందిమల్‌,రంగన హెరాత్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్ల ప్రదర్శన మీదనే లంక జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఇక ఫేస్ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ లంకపై భారత్‌దే పై చేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకూ 41 టెస్టుల్లో పోటీపడగా....19 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 7 మ్యాచ్‌ల్లో మాత్రమే శ్రీలంక విజయం సాధించగలిగింది. శ్రీలంకను వారి సొంతగడ్డపై 3-0తో టెస్ట్‌ సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన కొహ్లీ అండ్‌ కో...భారత గడ్డపై సైతం లంకను బ్రౌన్‌వాష్‌ చేయాలని పట్టుదలతో ఉంది. ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ టెస్ట్‌లో కొహ్లీ అండ్‌ కో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.బలమైన జట్టుతో టెస్టుల్లో జైత్రయాత్ర కొనసాగిస్తోన్న భారత జట్టుకు.... బలహీనంగా ఉన్న శ్రీలంక జట్టు కనీస పోటీ అయినా ఇవ్వగలదో లేదో చూడాలి. 

08:17 - November 16, 2017

ఢిల్లీ : జియో ఎఫెక్ట్‌ టెలికాం కంపెనీ ఉద్యోగులపై కూడా పడింది. భారీ ఆఫర్లతో మంచి జోరుమీదున్న జియో... ఇతర నెట్‌వర్క్‌ కస్టమర్లందరినీ లాగేసుకుంటోంది. ఈ దెబ్బతో ఇతర నెట్‌వర్క్‌లన్నీ కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నెట్‌వర్క్‌ల్లో పనిచేస్తోన్న ఉద్యోగుల భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్తోంది. జియో దెబ్బతో.. ఏడాది కాలంలోనే టెలికాం పరిశ్రమలో పనిచేస్తున్న 75వేల మంది ఉద్యోగాలు పోయాయి. భారత టెలికాం పరిశ్రమలో రిలయన్స్‌ జియో సంచలనాలకు నాంది పలికింది. ఉచిత సేవలతో ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించింది జియో. ఇప్పుడు అదే జియో మరో విధ్వంసానికి కూడా కారణమైంది. జియో సృష్టిస్తున్న ప్రకంపనలకు టెలికాం రంగంలో వేలాది కొలువులు ఊడుతున్నాయి. జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో ఏడాది కాలంలో దాదాపు 75వేల కొలువులు కొండెక్కాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో జియో పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలును మొదలు పెట్టేనాటికి ఈ రంగంలో మొత్తంగా 3లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు అంచనా. ఏడాది తిరిగే సరికే ఇందులో దాదాపు 75వేల మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయారు. ఇందులో 30శాతం మంది మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం వారే ఉన్నారు. టెలికాం రంగంలో దాదాపు 50శాతం మంది ఈ విభాగంలోనే పనిచేస్తారు.

టెలికాం రంగంలోని సంస్థలన్నీ ఆస్తులు విక్రయిస్తుండడంతో ఏడాది కాలంగా ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఆగిపోయింది. కంపెనీ మొత్తం ఖర్చులో మానవ వనరులకు దాదాపు 4 నుంచి 5శాతమే అవుతుంది. ప్రస్తుతం దాన్ని కూడా భరించే స్థితిలో కూడా కంపెనీలు లేకపోవడంతో మొదటి వేటు ఉద్యోగులపైనే పడుతోంది. దీంతో ఈ రంగంలో పనిచేస్తున్న ఇంకా చాలామంది ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. వివిధ టెలికాం సంస్థలు 3నుంచి 6 నెలల జీతాన్ని ప్యాకేజీగా ఇచ్చి ఉద్యోగులను బయటకు పంపుతున్నాయి. ఇక ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశమే లేకుండా పోయింది. జియో ఎంట్రీతో ప్రస్తుతం దేశీయ టెలికాం రంగం దాదాపు 5లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. గతేడాది జియో రాకతో కంపెనీల రాబడి, లాభాలు, నగదు రాక ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఈ దెబ్బతో రెండు, మూడు స్థానంలో ఉన్న వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ విలీన ప్రక్రియలో ఉన్నాయి. టాటా టెలీ సర్వీసెస్‌ వైర్‌లెస్‌ వ్యాపారం కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్‌ సూచనలు చేసింది. ఇప్పటికే ఐడియా, వొడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ తమ టవర్ల సంస్థలను విక్రయానికి పెట్టాయి. మొత్తంగా జియో ఎఫెక్ట్‌ ఉద్యోగుల జీవితాలనూ ఛిన్నాభిన్నం చేస్తోంది.

08:15 - November 16, 2017

కడప : జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ నగరాలకు విమాన సర్వీసును ప్రారంభించేందుకు విమానయాన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటి వరకు కడప-హైదరాబాద్‌కు మాత్రమే ప్రైవేటు విమాన సర్వీసు ఉంది. ఇవాళ్టి నుంచి చెన్నైకి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కడప నుంచి కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు ట్రూ జెట్‌ విమానయాన సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రస్తుతం కడప-హైదరాబాద్‌ల మధ్య నడుపుతున్న సర్వీసులను ఇప్పుడు చెన్నైకి విస్తరిస్తోంది.

దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ఉడాన్‌ పథకాన్ని ప్రారంభించింది. స్థానిక అనుసంధానం కల్పించేందుకు ముందుగా కడప నుంచి హైరాబాద్‌కు విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల నుంచి దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. గతే ఏడాది ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య కడప-హైదరాబాద్‌-కడప మధ్య 3,500 మంది ప్రయాణించారు. ఈ ఏడాది ఇదే సయమంలో 13 వేల మంది రాకపోకలు సాగించారు. ప్రయాణికుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ట్రూ జెట్‌ ఇప్పుడు కడప నుంచి చెన్నైకి విమాన సర్వీసులను ప్రారంభించబోతోంది. చెన్నైలో ఉదయం 9.50 గంటలకు బయలుదేరి, 10.45 గంటలకు కడప చేరుకుంటుంది. కడపలో మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి, 3.05 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ఈ మధ్య సమయంలో ఇదే విమానం హైదరాబాద్‌ వెళ్లివస్తుంది. కడప నుంచి విజయవాడ, బెంగళూరకు కూడా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ట్రూ జెట్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

08:09 - November 16, 2017

నల్లగొండ : జిల్లా అక్కలాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి మృతిపై అధికారుల చర్యలు చేపట్టారు. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి విజయేందర్‌ మంగళవారం టాయ్‌లెట్‌కు వెళ్లి కాలువలో పడి చనిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు టీచర్ల సస్పెన్షన్‌‌, ఐదుగురు టీచర్లపై బదిలీ వేటు వేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సహా మొత్తం సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. లెక్కల మాస్టారు శేఖర్‌రెడ్డి, సైన్స్‌ టీచర్‌ మంగళను సైతం సస్పెండ్‌ చేరు. మరో ఐదుగురు ఉపాధ్యాయులైన సమీర్‌కుమార్‌, చార్లెస్‌, శ్రీవిద్య, బ్లాడీనా, వసుమతిపై పనిష్‌మెంట్‌ గ్రౌండ్స్‌ కింద బదిలీ వేటువేశారు. వీరైదుగురిని మారుమూల ప్రాంతాలైన చందంపేట, గుండ్లపల్లి, అడవిదేవులపల్లి ప్రాంతాలకు బదిలీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారెవరినైనా ఉపేక్షించబోమని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అక్కలాయి గూడెంలో 14వ తేదీన ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి వల్లపు విజయేందర్‌ ప్రమాదవశాత్తు ఏఎమ్మార్పీ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడు. మధ్యాహ్న భోజన సమయంలో టాయిలెట్‌ కోసం వెళ్లి చనిపోయాడు. ఈ విషయాన్ని మొదలు టెన్‌టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల దగ్గరికి చేరుకుని ఆందోళన చేపట్టాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎంతోపాటు టీచర్స్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. విజయేందర్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మృతదేహంతో ఆందోళన నిర్వహించాయి. బుధవారం బాలుడి మృతిపై విద్యాసంస్థల బంద్‌ను నిర్వహించాయి. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు దిగొచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టారు. మరోవైపు బాలుడి కుటుంబానికి రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేకాదు... డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని హామీనిచ్చారు. 

08:07 - November 16, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్‌ స్కాం కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. పరీక్ష పత్రానికి సంబంధించి మినిట్‌ టు మినిట్‌ వివరాలు ఇవ్వాలంటూ జెఎన్‌టీయూ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఎంసెట్‌-2 పేపర్‌ ముద్రించిన ప్రెస్‌ నిర్వాహకులకూ నోటీసులిచ్చారు. పరీక్ష పేపర్‌ తయారైంది మొదలు.. బయటకు వెళ్లేంతవరకూ.. మినిట్‌ టు మినిట్‌ వివరాలను అందించాలంటూ.. జేఎన్టీయూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు.. ఎంసెట్‌2 పేపర్‌ ముద్రాపకులకూ నోటీసులు పంపింది. పదిరోజుల్లోగా అన్ని వివరాలనూ తమకు సమర్పించాలని సీఐడీ అధికారులు.. నోటీసుల్లో ఆదేశించారు.

ఎంసెట్‌ పేపర్‌ లీకేజీకి సంబంధించి.. సీఐడీ ముందునుంచీ జెఎన్‌టీయూనే అనుమానిస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో కీలక నిందితుడు ఎస్‌బి సింగ్‌ సహా, 63 మంది నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విద్యార్ధుల నుంచి నిందితులు వసూలు చేసిన డబ్బు... దాదాపు మూడు కోట్ల మేర స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌బి సింగ్‌ అందించిన వివరాల ప్రకారం.. సీఐడీ అధికారులు జేఎన్టీయూ యాజమాన్యంతో పాటుగా.. ఎంసెట్‌2 పేపర్‌ ముద్రాపకులకూ నోటీసులు జారీ చేశారు.

ఎంసెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వివిధ రాష్ట్రాల్లో 2005 నుంచే కొనసాగుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. గడచిన పదకొండు సంవత్సరాల్లో పది సార్లు ప్రశ్నపత్రాలను లీక్‌ చేసినట్లు భావిస్తున్న ఎస్‌బి సింగ్‌ .. చివరకు తెలంగాణ సీఐడీ అధికారులకు దొరికిపోయాడు. పరీక్షకు వారం ముందు మాత్రమే ప్రశ్నపత్రం విశ్వవిద్యాలయానికి చేరుతుంది. అయితే, నెలముందే సింగ్‌ చేతికి ఆ పత్రాలు ఎలా అందాయి..? ఎంసెట్‌2 పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో ఎస్‌బి సింగ్‌తో .. జేఎన్టీయూ అధికారులు ఎవరైనా కుమ్మక్కయ్యారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

కేసు నమోదై దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇన్నాళ్లకు.. సీఐడీ అధికారులు, జెఎన్‌టీయూ, ప్రింటింగ్‌ ప్రెస్‌లకు నోటీసులు జారీ చేయడం విశేషం. ఇప్పుడు జేఎన్టీయూ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఆ నివేదిక ఆధారంగా.. కేసు ముందుకు సాగుతుందా..? లేక తూతూ మంత్రంగానే ముగించేస్తారా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. 

08:05 - November 16, 2017

తూర్పుగోదావరి : పట్టిసీమ ప్రాజెక్టు మరోసారి రికార్డులకెక్కింది. అతి తక్కువ సమయంలోనే వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసిన ప్రాజెక్టుగా పట్టిసీమను లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డు సంస్థ ధృవీకరించింది. నిర్విరామంగా 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసినందుకు ప్రాజెక్టు నిర్వహణ సంస్థ మెఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రికార్డు సొంతం చేసుకుంది. ఇదే సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అతి తక్కువ సమయంలో పూర్తిచేసి చరిత్ర సృష్టించింది. నిర్దేశించిన గడువులోగా పట్టిసీమ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సాధించిన మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌... ఇప్పుడు మరో మైలురాయిని అధిగమించింది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్వహణలోనూ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లో బుధవారం నాటికి నిరంతరాయంగా 148 రోజులు వంద టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా సరికొత్త రికార్డు సాధించింది.

ఎత్తిపోతల పథకాలు అంటేనే చాలా సంక్లిష్టమైనవి. అవి ఎప్పుడూ సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ మరమ్మతులకు గురవుతాయన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఎలాంటి అంతరాయం లేకుండా... ఇప్పటికీ ఒక లక్షా 20వేల గంటలు పనిచేసింది. ఈ పథకంలోని 24 మోటార్లు నిరంతరాయంగా పనిచేశాయి. 148 రోజుల్లో 25, 36,06,000 కిలోవాట్ల విద్యుత్‌ వినియోగం ద్వారా నిరంతరాయంగా 72వేల గంటలపాటు పనిచేసి ఎలెక్ట్రోమెకానికల్‌ రంగంలో మెయిల్‌ సంస్థ తనకున్న నైపుణ్యాన్ని నిరూపించుకుంది.

పట్టిసీమ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ఒక సవాల్‌గా స్వీకరించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా... 2వేల మంది సిబ్బందితో రాత్రింబవళ్లు పనిచేయించింది. మొత్తానికి నిర్దేశించిన గడువుకంటే ముందుగానే ప్రాజెక్టును పూర్తిచేసింది. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టిన 173 రోజుల్లోనే తొలి పంప్‌ నుంచి నీటిని విడుదల చేసింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని 2015 మార్చి 30న చేపట్టిన ఈ సంస్థ... ఏడాదికంటే ముందుగానే అంటే... 2016 మార్చి 20న పూర్తిచేసి... లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించింది. ఇప్పుడు నిర్మాణ ప్రాజెక్టు నిర్వహణలోనూ లిమ్కాబుక్‌లో చోటు సంపాదించింది.

08:03 - November 16, 2017

హైదరాబాద్ : గురుకుల కాంట్రాక్టు ఉపాధ్యాయులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్‌తో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షలను ప్రారంభించిన టీ మాస్‌ ఫోరం నేతలు.. గురుకుల కాంట్రాక్టు టీచర్ల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చి పోస్టులకు క్రమబద్ధీకరించే వరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోకి గురుకుల పాఠశాలల్లో ఏళ్ల తరబడి కాంట్రాక్టు టీచర్లు పని చేస్తున్నారు. తమ సర్వీసులకు క్రమబద్ధీకరించాలని ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. ఉద్యమాలు చేపట్టారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులను కలిసి, విన్నవించారు. ఉద్యోగాలకు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చినా.. ఇంత వరకు కార్యరూపం దాల్చకపోడంతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

గురుకుల కాంట్రాక్టు టీచర్ల ఆందోళనకు ప్రభుత్వం ఎక్కడా అనుమతి ఇవ్వకపోడంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దీక్షలు చేపట్టారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దీక్షలను ప్రారంభించారు. గురుకుల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి గురుకల పాఠశాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నా తమ సర్వీసులకు క్రమబద్ధీకరించడంలేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలని టీ మాస్‌ ఫోరం నేత గద్దర్‌ డిమాండ్‌ చేశారు. గురుకుల కాంట్రాక్టు టీచర్ల సమస్యలను ప్రజా ప్రతినిధులు పట్టించుకోపోవడాన్ని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ తప్పు పట్టారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని గురుకుల కాంట్రాక్టు ఉపాధ్యాయులు హెచ్చరించారు. 

07:56 - November 16, 2017

కృష్ణా : ఈనెల 12న విజయవాడ ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాద దృశ్యాలను 10 టీవీ సంపాదించింది. ప్రమాదం జరిగిన సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. బోటు బోల్తా పడిన ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 

చైనాలో ఘోర దుర్ఘటన..

చైనా : ఓ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్‌హూయ్ రాష్ట్రంలోని షుయాంగ్ పట్టణంలో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 

నేడు భారత్ - లంక జట్ల మధ్య తొలి టెస్టు..

ఢిల్లీ : మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్-శ్రీలంక తొలి టెస్టు నేడు ప్రారంభం కానుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు ఉదయం 9 గంటలకు తొలిటెస్టు మ్యాచ్ మొదలవుతుంది. 

Don't Miss