Activities calendar

15 January 2018

21:26 - January 15, 2018

అమెరికా : కాలిఫోర్నియాలో కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరి ఏకంగా భవనం రెండో అంతస్థులోకి దూసుకెళ్లింది. స్థానిక శాంతా అనా ప్రాంతంలో మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ సెడాన్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా కారు గాల్లోకి లేచి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనే ఉన్న ఓ కార్యాలయం రెండో అంతస్తులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఒకరు గాయాలతో బయటపడగా.. మరో వ్యక్తి కారులోనే ఇరుక్కుపోయాడు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది కారులో ఉన్నవారిని రక్షించి.. వాహనాన్ని క్రేన్‌ సహాయంతో కిందికి దించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ డ్రగ్స్‌ తీసుకొని కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ భవంతి పాక్షికంగా దెబ్బతింది. 

21:24 - January 15, 2018

హర్యానా : మహిళలపై సామూహిక అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కురుక్షేత్రలో 15 ఏళ్ల దళిత బాలికపై కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు. గత వారం ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైన టెన్త్‌ క్లాస్‌ బాలిక జింద్‌ జిల్లాలోని ఓ గ్రామం సమీపంలోని కెనాల్‌ వద్ద శుక్రవారం శవమై తేలింది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె ప్రయివేటు భాగాల్లో పదునైన వస్తువులతో గాయపరిచనట్లు వైద్యులు తెలిపారు. మరో ఘటన పానిపట్‌లో శనివారంనాడు జరిగింది. చెత్తను డంప్‌ చేయడానికి వెళ్లిన 11 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారం జరిపారు. కామాంధుల కాటుకు ఆ బాలిక మృతి చెందింది. ఈ ఘోరంపై ఇద్దరు నైబర్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫరీదాబాద్‌లో ఆదివారం మరో ఘటన వెలుగు చూసింది. 22 ఏళ్ల మహిళ ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కిడ్నాప్‌కు గురైంది. నలుగురు వ్యక్తులు నడుస్తున్న ఎస్‌యువి స్పోర్ట్స్‌ కారులోనే గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం బల్లబ్‌గఢ్‌ వద్ద ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

21:23 - January 15, 2018

ఢిల్లీ : భారత్‌-ఇజ్రాయిల్‌ దేశాలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య అంతరిక్ష ప్రయోగాలు, పౌర విమానయానం, సైబర్‌ సెక్యూరిటీ, టెక్నాలజీ, ఇంధన సహకారం తదితర రంగాల్లో 9 ఒప్పందాలు జరిగాయి. ఫిల్మ్‌, స్టార్టప్‌ ఇండియా, రక్షణ రంగంలోనూ పెట్టుబడులపై ఇజ్రాయిల్‌తో అంగీకారం కుదిరిందని...వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్‌ టెక్నాలజీ తీసుకువస్తామని సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. భారత్‌లో తనకు అపూర్వ స్వాగతం లభించిందని, ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైందని నెతన్యాహు చెప్పారు. అంతకు ముందు ఇజ్రాయిల్‌ ప్రధాని జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌తో భారత్‌ ఆయనను సత్కరించింది.

21:23 - January 15, 2018

ఢిల్లీ : ఆర్మీ డే సందర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. సరిహద్దు పరిస్థితుల్లో మార్పు రాకుంటే తీవ్ర చర్యలు చేపట్టక తప్పదని స్పష్టం చేశారు. ఆర్మీ నుద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఆర్మీడే పరేడ్‌లో బిపిన్‌ రావత్‌ సైనిక వందనం స్వీకరించారు. సరిహద్దులో ఉగ్రవాద చొరబాట్లను మానుకోవాలని పాకిస్తాన్‌కు రావత్‌ సూచించారు. పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే భారత్‌ తగినరీతిలో సమాధానమిస్తుందని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో ఆర్మీ అవేర్‌నెస్‌ ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు.

21:21 - January 15, 2018

జమ్మూ కాశ్మీర్ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్నది. పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులను తిప్పికొడుతూ భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాక్‌ రేంజర్లు హతమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. యూరీ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆర్మీడే సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్న భారత బలగాలకు జమ్ముకశ్మీర్‌ నియంత్రణ రేఖ వద్ద భారీ విజయం లభించింది. తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. పూంచ్‌ జిల్లాలోని ఎల్వోసి వద్ద భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్తాన్‌ సైనికులు హతమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. శనివారం నాడు రాజౌరి సెక్టార్‌లో పాక్‌ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను మృతికి ప్రతీకారంగా భారత్‌ ఈ చర్య చేపట్టింది. జనడ్రాట్‌, కోట్లి సెక్టార్‌ సరిహద్దులో తమ రేంజర్లు నలుగురు మృతి చెందినట్లు పాకిస్తాన్‌ ధృవీకరించింది.

యురీ సెక్టర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేశాయి. ఆత్మాహుతి దాడి చేసేందుకు యత్నంచిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. జైష్‌-ఎ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు యురీ సెక్టార్‌లోకి ప్రవేశించడానికి యత్నించారు. వారి కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపినట్లు జమ్ముకశ్మీర్‌ డిజిపి ఎస్పీ వైద్‌ తెలిపారు. ఐదుగురు ఉగ్రవాదుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్మీ, సిఆర్‌పిఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు కలిసి ఉమ్మడి ఆపరేషన్‌ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీలో 70వ ఆర్మీ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. సరిహద్దు పరిస్థితుల్లో మార్పు రాకుంటే తీవ్ర చర్యలు చేపట్టక తప్పదని స్పష్టం చేశారు. సరిహద్దులో ఉగ్రవాద చొరబాట్లను ఆపాలని పాకిస్తాన్‌కు రావత్‌ సూచించారు. పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే భారత్‌ తగినరీతిలో సమాధానమిస్తుందని పేర్కొన్నారు. 

21:17 - January 15, 2018

కర్నూలు : జిల్లా డోన్‌లో యువకులు కాసేపు వీరంగం సృష్టించారు. మద్యం తాగి... చేతిలో వేట కొడవళ్లతో ప్లైఓవర్ కింద హడావుడి చేశారు. డోన్‌లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల వద్ద ఇలాంటి ఘటనలు తరచు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు వచ్చేలోపు ఉడాయించడం షరామామూలేనని అంటున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

హరీష్..అధికారులతో కేసీఆర్ భేటీ...

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో జలవివాదలపై ఈనెల 17న ఢిల్లీలో జరిగే సమావేశంలో అనుసరించాల్సిన ప్యూహంపై చర్చిస్తున్నారు. 

21:08 - January 15, 2018

పరేడ్ గ్రౌండ్స్ లో స్వీట్ ఫెస్టివల్..

హైదరాబాద్ : సికింద్రాబాద్ పెరేడ్స్ గ్రౌండ్స్ నేషనల్ స్వీట్ పెస్టివల్ చివరిరోజుకు చేరుకుంది. తెలంగాణతో పాటు... వివిధరాష్ట్రాలకు చెందిన వారి వెయ్యి రకాల స్వీట్స్ ఐటమ్స్ ఒకే వేదికపైకి తెచ్చారు. ఎ

పాక్ కు రావత్ హెచ్చరికలు...

ఢిల్లీ : ఆర్మీ డే సందర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. సరిహద్దు పరిస్థితుల్లో మార్పు రాకుంటే తీవ్ర చర్యలు చేపట్టక తప్పదని స్పష్టం చేశారు. ఆర్మీ నుద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

హర్యానాలో అత్యాచారాలు...

హర్యానా : మహిళలపై సామూహిక అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కురుక్షేత్రలో 15 ఏళ్ల దళిత బాలికపై కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు.

కలెక్టర్లతో సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : మంగళవారం ఉ.11 గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం భేటీ కానున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీల పునర్‌వ్యవస్థీకరణ, సంబంధిత అంశాలపై చర్చ జరుగనుంది. 

20:55 - January 15, 2018

హైదరాబాద్ : రాష్ట్ర రైతాంగానికి ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంటసాయంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం కలెక్టర్లతో సమావేశం కానున్నారు. భూరికార్డుల ప్రక్షాళనలో బహిర్గతమైన సాగు యోగ్యమైన భూములకు ఈ సాయాన్ని అందించనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా దీన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కలెక్టర్లకు ఆయన హితబోధ చేయనున్నారు. పంటసాయంతో పాటు.. నూతన పంచాయతీరాజ్‌ చట్టం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీపైనా ఈ సమావేశంలో కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడీ మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌ ప్రజలను ఆకర్షించేలా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రచించి.. అధికారయంత్రాంగంతో అమలు చేసేందుకు సమాయాత్తం అవుతోంది. ఇందులో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్‌ కలెక్టర్లు, అధికారులతో సమావేశం కానున్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు... ఎలాంటి ఫలితాలు సాధించిపెడుతున్నాయో రేపటి సమావేశంలో చర్చించనున్నారు. మరికొన్ని కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టడంపై చర్చిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు అందించనున్న పంటసాయంపై కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎక్కడా విమర్శలకు తావులేకుండా రైతులకు ఆధార్‌ నంబర్‌ ముద్రించి చెక్‌ల ద్వారా ఈ సాయాన్ని అందించనున్నారు. దీనిపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టేలా అధికారులకు వివరించనున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన చేసిన ప్రభుత్వం.. వాటికి ధరణి అనే పేరుపెట్టి వాటిని పట్టాదారులకు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశప్రధాని లేదా.. రాష్ట్రపతి చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. వారిచేత శభాష్‌ అనిపించుకొని విపక్షాల విమర్శలకు చెక్‌పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి సత్తాచాటాలనే ఉత్సాహంలో కేసీఆర్‌ ఉన్నారు. ఇందుకోసం నూతన పంచాయతీ రాజ్‌ చట్టానికి రూపకల్పన చేశారు. దీనిని ఈనెల 22న జరిగే కేబినెట్‌లో ర్యాడిఫికేషన్‌ చేసి ఇదే నెలలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చి..చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన 24గంటల ఉచిత విద్యుత్‌ అమలు తీరుపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైతుల నుంచి క్షేత్రస్థాయిలో వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోనున్నారు. విద్యుత్‌ అమలులో ఎక్కడా లోపాలు జరుగకుండా చూసేలా అధికారులకు కేసీఆర్‌ వివరించనున్నారు. రాజకీయ విమర్శలను పట్టించుకోకకుండా ముందుకెళ్లాలనే సూచనలు చేయనున్నారు. మొత్తానికి మంగళవారం జరిగే కలెక్టర్ల మీటింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందని అధికారులు చెప్తున్నారు. 

20:53 - January 15, 2018

హైదరాబాద్ : అందరూ ఊహించిందే జరుగుతోంది. కోస్తాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. భోగిరోజు మొదలైన ఈ పందెం... రెండోరోజూ కొనసాగింది. కత్తులు కట్టి కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హడావుడి చేసిన అధికారులు, పోలీసులు పత్తాలేకుండా పోయారు. ఇదేఅవకాశంగా ఖద్దరు అండతో నిర్వాహకులు కోడిపందేలు యధేచ్చగా నిర్వహిస్తున్నారు. ఏపీలో కోడి పందేలు యధేచ్చగా సాగుతున్నాయి. కోళ్లు కత్తులు దూస్తున్నాయి. కత్తులు కట్టకుండా డింకీ పందేలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకునే వారేలేరు. కోళ్లకు కత్తులు కట్టి మరీ కోళ్లను పందాలకు దింపుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఐ. పోలవరం మండలం మురమళ్లలో కోడిపందేల నిర్వహణ కొత్త పుంతలు తొక్కింది. తొలిరోజే పది కోట్లకుపైగా చేతులు మారగా.. రెండో రోజు 50కోట్లకుపైగా పందేలు నడిచాయి. కోడి పందేలు ఆడటానికి తెలుగు రాష్ట్రాల నుంచి పందెపురాయుళ్లు తరలివచ్చారు. ఇక్క మొత్తంగా పది బరులు ఏర్పాటు చేశారు. 25వేలు, 50వేలు, లక్ష, రెండు లక్షలు, అయిదు లక్షల బరులుగా విభజించి పందేలు నిర్వహిస్తున్నారు.(kkd కోడిపందేలతోపాటు గుండాట, పేకాట, కోతముక్క జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఏకంగా గుండాట కోసం 30 బోర్డులను ఏర్పాటు చేశారు. కోడిపందేలతోపాటు గుండాట ఆడటానికి పందెంరాయుళ్లు ఎగబడ్డారు. బరులకు సమీపంలో మద్యం, బిర్యానీ, మాంసం పకోడీ, శీతలపానియాలు అందుబాటులో ఉంచారు. ప్రజాప్రతినిధులు సైతం వీటిని తిలకిస్తున్నారు. మురమళ్లలో భారీ స్థాయిలో జరుగుతున్న పందేలకు ఖరీదైన కార్లు బాటపట్టాయి. పందెంరాయుళ్లు ఖరీదైన కార్లలో పందేలుకాయడానికి తరలివచ్చారు. దీంతో మరమళ్లలోని పదెకరాలు ప్రాంగణం కార్లతో నిండిపోయింది. వేలాది ద్విచక్రవాహనాలు కొలువుతీరాయి. సాయంత్రం మురళ్లలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సామర్లకోట, పిఠాపురం మండలాల్లోనూ కోళ్లు కాలుదూస్తున్నాయి. మీడియా, పోలీసులు వెళ్లిపోగానే నిర్వాహకులు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తున్నారు. కోడిపందేలతోపాటు గుండాట, చిన్నబజార్‌, పెద్దబజార్‌,లోన, బయట ఆటలు జోరుగా సాగుతున్నాయి. కోడిపందేలు తూర్పుమన్యానికీ విస్తరించాయి. దేవీపట్నం మండలం ఇందుకూరు, పోతుకొండలో కోళ్లు గిరిగీసి బరుల్లో కత్తులు దూస్తున్నాయి. నిర్వాహకులు గిరిజనులకు ఈ పందేలను అటవాటుచేసి వారి నుంచి డబ్బులు దోచుకుంటున్నారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఊరు,వాడ బరులు ఏర్పాటు చేశారు. ఈ బరుల్లో 24 గంటలూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న ప్రజాప్రతినిధులే.. దగ్గరుండి మరీ కోడిపందేలను ప్రారంభించారు. చాలా చోట్ల కత్తికట్టిన కోడిపందేలే జరుగుతున్నాయి. కత్తులతో కోళ్లు తలపడుతుంటే రక్తం చిందుతోంది. ఆకివీడు మండలం ఐ.భీమవరంలో జరిగిన కోడి పందేలకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హాజరయ్యారు. కోడి పందేలను వీక్షించారు. కోడి పందేలు తెలుగు సంస్కృతికి అద్దంపడుతాయని... వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక యండగండిలో జరిగిన పోటీలను టాలీవుడ్‌ నటుడు శ్రవణ్‌ రాఘవ తిలకించారు. పెనుమంట్ర మండలం జుత్తిగలో స్థానిక వీఆర్‌వో భూపతిరాజు రవీంద్ర ఆధ్వర్యంలో కోడిపందేలు నిర్వహించారు. కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడంతో నిర్వాహకులు మరింతగా రెచ్చిపోయి పందేలను నిర్వహించారు. విజయవాడలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. బెట్టింగుల రూపంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పోరంకి సెంటర్లో హాస్యనటుడు కిషోర్ దాస్ ఈ పందేలను తిలకించారు. సుప్రీంకోర్టు నిబంధనలు పట్టించుకోకుండా... కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. విశాఖ నగరానికి కోడిపందేలు పాకాయి. సుప్రీంకోర్టు, పోలీసుల ఆదేశాలు బేఖాతర్‌చేస్తూ... పందేలు నిర్వహించారు. పందేల నియంత్రణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు అడ్రస్‌లేకుండా పోయాయి. అధికారం, ధనబలం ముందు ఖాకీలు తలవంచారు. దీంతో రెచ్చిపోయి మరీ పందేలు కాశారు.

తెలంగాణకూ కోడిపందేలు విస్తరించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీఆర్‌పురం మండలంలోని రేఖపల్లి దగ్గర కోడిపందేలు యధేచ్చగా సాగాయి. రామారావు అనే వ్యక్తిని నిర్వాహకులు చితకబాదడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల ముందే ఇంత దారుణం జరుగుతున్నా.. నిర్వాహకులను మాత్రం అదుపులోకి తీసుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

20:50 - January 15, 2018

హైదరాబాద్ : దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పెట్టుబడుల కోసం పర్యటిస్తున్నారు. ఆ దేశ రాజధాని సియోల్‌లో హ్యుందాయ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నామ్‌ గ్యూహ్‌నోతో భేటీ అయిన కేటీఆర్‌... టీఎస్‌ ఐపాస్‌, అనుమతులకు ఏకగవాక్ష విధనాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. హ్యూందాయ్‌ రోటెం గ్లోబల్‌రైస్‌ డైరెక్టర్‌ కేకే యూన్‌తోనూ కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

ఎయిర్ సెల్ టవర్ లో మంటలు...

హైదరాబాద్ : సరూర్ నగర్ పీ అండ్ టీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ సెల్ టవర్ లో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

పతంగి ఎగురేస్తూ మృత్యు ఒడిలోకి...

కృష్ణా : నందిగామలో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగురవేస్తుండగా అపార్ట్ మెంట్ పై నుండి పదో తరగతి చదువుతున్న నితీష్ కుమార్ మృతి చెందాడు. 

20:16 - January 15, 2018

కృష్ణా నదిలో పడవ బోల్తా...

కృష్ణా : నదిలో పడవ బోల్తా కొట్టింది. పడవలో ఉన్న 20 మందిని స్థానికులు కాపాడారు. పడవలో ఉన్న 20 మందిని స్థానికులు కాపాడారు. ఎదురుమొండి దీవుల నుండి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో 4 బైక్ లు, ఇతర సామాగ్రీ ఉన్నాయి. దీవుల వద్ద నిత్యం ప్రయాణీకులను దాటించే పంట్ ను పడవ పోటీల కోసం అధికారులు తరలించారు. గత్యంతరం లేక నాటు పడవలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. పడవ పోటీల కోసం స్థానిక ఎమ్మెల్యే ఉపసభాపతి బుద్ధ ప్రసాద్ ఆదేశాలతో పంట్ ను తరలించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

18:31 - January 15, 2018

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కైట్..స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసింది. ఎన్నో రకాల కైట్స్ ఆకాశంలో ఎగురుతుండడం నగర వాసులను ఆకట్టుకుంది. ఈ కైట్ ఫెస్టివల్ లో 12 దేశాల నుండి కైటర్స్ ఇక్కడకు వచ్చి కైట్స్ ను ప్రదర్శించారు. భారీ భారీ పతంగులను వీక్షించడానికి సోమవారం ఫెస్టివల్ కు భారీగా నగర వాసులు పోటెత్తారు. కానీ మధ్యాహ్నం వాతావరణం అనుకూలించకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:23 - January 15, 2018
18:21 - January 15, 2018
18:19 - January 15, 2018

తమిళనాడు : రాష్ట్ర వ్యాప్తంగా పొంగల్ సందర్భంగా జల్లికట్టు జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వమే దగ్గరుండి ఏర్పాట్లు చేసింది. కానీ ఓ ప్రాంతంలో జరిగిన జల్లికట్టు విషాదం నింపింది. మధురై, అనంగానల్లూరు, పాలమేడులో జల్లికట్టు పోటీలు జరిగాయి. పాలమేడులో ఎద్దు కుమ్మడంతో ఒకరు మృతి చెందగా 32 మందికి గాయాల్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఎయిర్ పోర్టు మూసివేత..

లిబియా : ట్రిపోలి ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుగుబాటు దారులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. 9 మంది మృతి చెందారు. కాల్పుల కారణంగా ఎయిర్ పోర్టును మూసివేశారు. 

18:13 - January 15, 2018

కొత్తగూడెం : సంక్రాంతి పండుగ సందర్భంగా పందాల జోరు కొనసాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న పందాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లాలో కలిసిపోయిన తెలంగాణ జిల్లాలోని కొన్ని మండలాల్లో కూడా పందాలు జరిగాయి. భద్రాచలం చుట్టుపక్కల మండలాలకి చెందిన వారు పందాలను వీక్షించడానికి..పాల్గొనడానికి వెళ్లారు. వీఆర్ పురంలోని రేఖపల్లిలో జరిగిన పందాల్లో నిర్వాహకులు రెచ్చిపోయారు. పందెంలో గెలుపొందిన దుమ్ముగూడెంకు చెందిన రామారావుపై నిర్వాహకులు దాడి చేశారు. తలకు తీవ్రగాయం కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. 

కోడి పందాల్లో ఘర్షణ..

కొత్తగూడెం : వీఆర్ పురం మండలంలోని రేఖపల్లిలో కోడి పందాల్లో ఘర్షణ తలెత్తింది. రామారావు అనే వ్యక్తిపై నిర్వాహకులు దాడి చేశారు. గాయాలపాలైన రామారావును ఆసుపత్రికి తరలించారు. 

శిల్పారామంలో సందడి..

హైదరాబాద్ : నగరంలోని శిల్పారామంలో సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా శిల్పారామాన్ని సందర్శించేందుకు ప్రజలు పోటెత్తారు. ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

కమల్ రాష్ట్ర వ్యాప్త పర్యటన..

తమిళనాడు : రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నట్టు సినీ నటుడు కమల్ హాసన్ ప్రకటించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకొనేందుకు జనవరి 26న తన పర్యటన చేయనున్నట్లు వెల్లడించారు. 

భారత్ 307 ఆలౌట్..

ఢిల్లీ : సెంచూరియన్ టెస్టు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాకు 28 పరుగుల అధిక్యం కనబరిచినట్లైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 335 ఆలౌట్. భారత్ బ్యాటింగ్ కోహ్లీ 153, విజయ్ 48, అశ్విన్ 38, పార్థివ్ 19, పాండ్యా 15, రోహిత్ శర్మ 10, పుజరా (డకౌట్). 

17:00 - January 15, 2018

ఢిల్లీ : భారత్ లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ హౌస్ లో సోమవారం ఆయన ప్రధాన మంత్రి మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య 9 కీలక ఒప్పందాలు కుదిరాయి. స్పేస్, పౌర విమానాయానం, సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ తదితర రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. రక్షణ రంగంలో పెట్టుబడులపై ఇజ్రాయిల్ తో అంగీకారం కుదిరిందని మోడీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్ టెక్నాలజీని తీసుకొస్తామని చెప్పారు. మోడీ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం జరిగిందన్నారు.

 

16:56 - January 15, 2018

తమిళ నటుడు 'సూర్య'కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి మంచి విజయాలు సాధించాయి. దీనితో ఆయన టాలీవుడ్ పై కూడా మనస్సు పారేసుకుంటుంటారు. తాజాగా ఆయన నటించిన 'గ్యాంగ్' సినిమా ఇటీవలే తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా 'సూర్య' సోమవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. రాజమండ్రిలోని ఓ థియేటర్ లో అభిమానులతో కలిసి 'గ్యాంగ్' సినిమా చూశారు. ‘సూర్య' వచ్చాడని తెలుసుకున్న అభిమానులు థియేటర్ కు ఎగబడ్డారు. బయటకు వచ్చే సమయంలో అభిమానులు పోటెత్తడంతో 'సూర్య' ప్రధాన ద్వారం గుండా కాకుండా పక్కనే ఉన్న గేటును దూకి బయటకు వెళ్లారు. వెళ్లే సమయంలో అభిమానులతో కరచాలనం చేసుకుంటూ వెళ్లడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 

16:51 - January 15, 2018
16:50 - January 15, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని కొమ్రంభీ జిల్లాలో టీ మాస్ నేతలు పర్యటించారు. జిల్లా కేంద్రంలోని వరలక్ష్మీనగర్ లో నెలకొన్న సమస్యలను స్థానికులు నేతలకు వివరించారు. మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, 20 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. నేటికి విద్యుత్, నీటి సదుపాయం లేకుండా గోండులు నివాసం ఉంటున్నారని టీ మాస్ నేతలు పేర్కొన్నారు. వెంటనే సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. 

16:35 - January 15, 2018

సంగారెడ్డి : హరివిల్లును తలపించే ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పసందైన వంటలు.. ఇదే చాలా మందికి తెలిసిన సంక్రాంతి... కానీ... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలో జరిగే సంక్రాంతి మామూలు పండగ కాదు... అదో జాతర... మహిళలు వినూత్నంగా జరుపుకునే పాతపంటల జాతరపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని పొట్టిపల్లి గ్రామంలోని సందడి... ఇక్కడ జరిగే సంక్రాంతి చాలా ప్రత్యేకమైంది... భిన్నమైంది. వందలాది మంది మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి చేరుకుంటారు. వీళ్ళకు సంక్రాంతి అంటే పాతపంటల జాతరే.. మనిషి నిస్సారమైన ఆహారంతో అనారోగ్యాల బారిన బడుతున్న నేటి కాలంలో... నిండు ఆరోగ్యానికి కావాల్సిన ధాన్యాలను వీరు పండిస్తున్నారు..

డిడిఎస్‌ సహకారంతో మహిళలు చిరుధాన్యాలను సాగుచేస్తూ... మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని జహీరాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. నేటి సమాజానికి పెద్దగా తెలియని ఎన్నో పాత పంటలను వీరు కాపాడి ముందు తరాలకు అందిస్తున్నారు. ఆ పంటలతోనే వారు ప్రతి సంక్రాంతికి పాతపంటల జాతర పేరుతో వేడుక చేసుకుంటారు.. ఈ చిరుధాన్యాల వల్ల మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డిడిఎస్‌ డైరెక్టర్‌ పీవీ సతీష్‌ అంటున్నారు. ఈ పాతపంటల జాతరలో స్పూర్తివంతమైన మహిళలను ఎంపిక చేసి.. వారికి సన్మానం చేస్తారు. ఈ సారి నిర్వహించిన జాతరలో సెంట్రల్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ డైరెక్టర్‌ సమ్మిరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడి మహిళా రైతులకు కొన్ని సూచనలు చేశారు.

పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే పాతపంటల జాతరలో వారు ఆలపించిన పాటలు ఆలోచన రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఏ పంటను ఎప్పుడు సాగు చేయాలి.. అంతర పంటలుగా ఏవేవి వేసుకోవచ్చు, చీడపీడలనుంచి పంటలను ఎలా రక్షించుకోవాలి అన్న అంశాలతో వారి పాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందరూ పండగ అంటే విందు, వినోదాలు చేసుకుంటారు... కానీ వినోదాన్ని విజ్ఞానంతో మేళవించి మహిళలు జరిపే పాతపంటల జాతర అభినందనీయం.. ఆదర్శవంతం.. వీరి తపనకు తగ్గట్టు ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

16:32 - January 15, 2018
16:28 - January 15, 2018

పశ్చిమగోదావరి : కాలం చాలా వేగంగా మారిపోతోంది. దాంతో పాటు సంస్కృతీ, సంప్రదాయాలు, అభిరుచులు, అలవాట్లూ అన్నీ మారిపోతున్నాయి... ఐతే ఈ డిజిటల్‌ యుగంలోనూ పాతకాలంనాటి బుర్రకథ, హరిదాసులు, గంగిరెద్దులు వంటివి తలచుకుంటేనే... ఆ పురాతన అనుభూతితో మనసు పులకరిస్తుంది... ఈ సంక్రాంతికి భీమవరంలో ప్రత్యక్షమైన మోడరన్‌ సోదమ్మాయిని చూస్తే... మీకు కూడా అలాంటి అనుభుతేకలుగుతుంది... జరిగింది.. జరగబోయేది చెప్పే ఈ సోదమ్మాయి గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

16:25 - January 15, 2018

విజయవాడ : కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. బెట్టింగుల రూపంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడిపందాల వద్దకు మహిళలు కూడా భారీగా చేరుకొని వీక్షిస్తున్నారు. పోరంకి సెంటర్లో హాస్యనటుడు కిషోర్ దాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సుప్రీంకోర్టు నిబంధనలు పట్టించుకోకుండా... కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:09 - January 15, 2018

విజయవాడ : చట్టాలు పనిచేయలేదు...కోడి గెలిచింది..ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పందాలు జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరి చేతిలో చూసినా ఒక కోడి..జేబుల్లో లక్షల రూపాయలు...తిరునాళ్లు తలపిస్తున్నట్లుగా ఆయా ప్రాంతాలు కనబడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భం నిర్వహించే కోళ్ల పందాలు జోరుగా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు నిబందనలు పట్టించుకోకుండా కోళ్లకు కాళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 300 బరులు..తూర్పుగోదావరి జిల్లాలో 200కి పైగా బరుల్లో పందాలు జరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే రూ. 600 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనిధికారికంగా తెలుస్తోంది. ఒక్కో కోడి పందెంలో లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల ధర పలుకుతుండగా పందాలు వీక్షించడానికి వచ్చిన వారు కూడా పందాలు కాస్తుండడంతో ఆ ధర కాస్తా ఇంకా పెరిగిపోతోంది. కనుమ రోజు పోలీసులు దాడులు చేసి పందాలను ఆపుతారని తెలుసుకున్న నిర్వాహకులు భోగి..సంక్రాంతి రోజు ఉదయం..పగలు నిర్వహించడమే కాకుండా రాత్రుల్లో ఫ్లడ్ లైట్లు వెలుతురుల్లో పందాలు నిర్వహిస్తుండడం గమనార్హం. 

జమ్మూలో మందుగుండు సామాగ్రీ స్వాధీనం..

జమ్మూ కాశ్మీర్ : యురీ సెక్టర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేశారు. ఆత్మాహుతి దాడి చేసేందుకు యత్నంచిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ సందర్భంగా వారి వద్దనుండి భారీగా మందుగుండు సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు. 

14:33 - January 15, 2018

చిత్తూరు : నారావారిపల్లెలో సందడి నెలకొంది. సీఎం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌ కుటుంబ సభ్యులు రావడంతో కోలాహలం నెలకొంది. చిన్ననాటి స్నేహితులతో చంద్రబాబు సంతోషంగా గడుపుతున్నారు. ప్రతి కుటుంబాన్ని చంద్రబాబు ఆత్మీయంగా పలకరించడంతో... గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఇక చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌ దంపతులు గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

14:32 - January 15, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జిల వివాదం సమసిపోయినట్లేనని బార్‌ కౌన్స్‌ల్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఈ కథ ఇంతటితో సమాప్తమైందని బార్‌ కౌన్స్‌ల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు మనన్‌ కుమార్‌ మిశ్రా తెలిపారు. సిజెఐకి, జడ్జిలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. బిసిఐ కమిటి 15 మంది సుప్రీంకోర్టు జడ్జిలతో సమావేశమై చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎప్పటిలాగే తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని మిశ్రా వెల్లడించారు.

 

14:30 - January 15, 2018

జమ్ముకశ్మీర్‌ : యురీ సెక్టర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేశారు. ఆత్మాహుతి దాడి చేసేందుకు యత్నంచిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. పాకిస్థాన్‌కు చెందిన జైష్‌-ఎ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు యురీ సెక్టార్‌లోకి ప్రవేశించడానికి యత్నించారు. వారి కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపినట్లు జమ్ముకశ్మీర్‌ డిజిపి ఎస్పీ వైద్‌ తెలిపారు. మరోవైపు నియంత్రణ రేఖవద్ద భారత భద్రతా బలగాలు నలుగురు పాకిస్తాన్‌ ఆర్మీ రేంజర్లను మట్టుబెట్టాయి. 2016 సెప్టెంబరు 18న పాక్‌ ఉగ్రవాదులు యురీ సైనిక స్థావరంపై దాడులు చేసి 19 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.

సియోల్ లో మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సియోల్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. హ్యుందాయ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. 

నారావారిపల్లెలో బాబు ఫ్యామిలీ...

చిత్తూరు : నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. కుటుంబసమేతంగా ఉదయం కుటుంబ సంప్రదాయం ప్రకారం నాగాలమ్మ కట్టను దర్శించి నాగుల పూజ చేశారు. 

న్యాయమూర్తుల విబేధాలు పరిష్కారం - బార్ కౌన్సిల్...

ఢిల్లీ : న్యాయమూర్తుల మధ్య విబేధాలు పరిష్కారమయ్యాయని, న్యాయమూర్తు అంశాన్ని రాజకీయం చేయవద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాఇ అధ్యక్షుడు పవన్ మిశ్రా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో ఎలాంటి విభజన లేదని, సుప్రీంకోర్టులోని కార్యకలాపాలన్నీ సాధారణంగా కొనసాగుతున్నాయన్నారు. 

ఆర్మీ డే వేడుకలు...

ఢిల్లీ : ఆర్మీడే వేడుకలను చీఫ్ జస్టిస్ రావత్ పరిశీలించారు. 15 మంది వీర సైనికులకు సేన పతకాలు అందించారు. ఇందులో ఐదుగురు వీరమరణం పొందిన సైనికులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. 

తూర్పుగోదావరిలో అశ్లీల నృత్యాలు...

తూర్పుగోదావరి: జిల్లాలో సంక్రాంతి సంబరాల పేరిట అశ్లీల నృత్యాలు కొనసాగుతున్నాయి. మల్కిపురం మండలంలో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు కొనసాగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. 

కోహ్లీ సెంచరీ...

సెంచూరీయన్ : దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. టెస్ట్ కెరీర్ లో ఇతనికి 21వ సెంచరీ. అంతకముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 335 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. 

11:57 - January 15, 2018

జబర్దస్త్ టీమ్ తో 10టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జబర్దస్త్ ఆర్టిస్టులు జీవన్, శ్రీను, వినోద్, వెంకీ మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

11:21 - January 15, 2018

స్టార్ కమెడియన్ పృథ్వీతో 10 టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ వివాదం వ్యవహారంపై స్పందించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:13 - January 15, 2018

హైదరాబాద్ : తెలంగాణలో  పంచాయతీ రాజ్‌ ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఎన్నికలు నిర్ణీత గడువు ప్రకారమే నిర్వహించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని సమాచారం. పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. 

స్థానిక  సంస్థల  ఎన్నికలను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్‌ నేతలను సిద్ధం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం కూడా ఏడాది మాత్రమే ఉండడంతో....నిర్ణీత గడువు ప్రకారం  పంచాయతీ రాజ్‌ సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలన్న  యోచనలో కేసీఆర్‌  ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

పంచాయతీ రాజ్‌ సంస్థలను బలోపేతం చేయడంతో పాటు...కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు చేస్తామని గతంలోనే అధికార పార్టీ హామీ ఇచ్చింది.  దీనిలో భాగంగానే స్థానిక సంస్థల  చట్టంలో సవరణలకు  ప్రభుత్వం దాదాపు కసరత్తు కూడా పూర్తి చేసింది. పలు సవరణలకు  మంత్రివర్గ ఉప సంఘం కూడా ఆమోదం తెలిపింది. సబ్ కమిటీ ఆమోదించిన అంశాలతో పాటు  న్యాయ పరమైన సమస్యలపై కూడా చర్చించి ప్రభుత్వం త్వరలో  చట్ట సవరణకు ఆమోదం తెలిపేందుకు  రెడీ అవుతోంది. ఈ నెలాఖరు నాటికి ప్రత్యేకంగా శాసనసభ, శాసనమండలి సమావేశాలను నిర్వహించి  పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఆమోదించనుంది.  ఆ తర్వాత కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.   సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ సిద్ధమవుతుండడంతో ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది. 

అయితే....ముఖ్యమంత్రి మాత్రం ప్రభుత్వ పరంగా  తీసుకుంటున్న నిర్ణయాలపై జనం నాడి  కూడా స్థానిక ఎన్నికల ద్వారా తేలిపోతుందన్న అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. పంచాయతీ రాజ్‌ సంస్థల ఫలితాల ఆధారంగా   ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధారణ ఎన్నికల నాటికి తీసుకోనే అవకాశం   ఉంటందని  భావిస్తున్నారు. 

11:09 - January 15, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతున్నాయి. స్నేహితులు, బంధువులతో అందరి ఇళ్లలో సందడి మొదలైంది. పిండి వంటలు, కొత్త అల్లుళ్లు, పంట పొలాలు, లేగదూడల మధ్య డాన్సులు చేస్తూ ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటున్నారు. జిల్లాలో సంక్రాంతి సంబరాలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 
 

09:54 - January 15, 2018

చిత్తూరు : పండుగపూట పెను విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొంతమంది భక్తులు తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నారు. మార్గంమధ్యలో పెద్దతిప్పసముద్రం మండలం యంపార్లపల్లిలో భక్తులపైకి బైక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అనిల్, బయమ్మ, బైరెడ్డి అనే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనిల్ కర్నాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల బంధువులు రోధనలు మిన్నంటాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఏపీలో జోరుగా కోడి పందాలు

తూర్పుగోదావరి : ఏపీలో జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. కోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ కోడి పందాలు  నిర్వహిస్తున్నారు.  పందెంరాయుళ్లు భారీ సంఖ్యలో పందెం కాస్తున్నారు. పాస్ లు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. పందెం బరులు తిరునాళ్లుగా మారాయి. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కోళ్ల పందాలతోపాటు గుండాట, పేకాట, కోతముక్కాటలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారీగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. 

09:27 - January 15, 2018

తూర్పుగోదావరి : ఏపీలో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. కోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు ఉన్నప్పటికీ వాటిని నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని శివారు ప్రాంతాలు, పండ్ల తోటల్లో బరులు వేసి పందాలు నిర్వహిస్తున్నారు. పేరున్న ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ పందాలు కొనసాగుతున్నాయి. ఇక పాసులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి పందాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున పందెంరాయుళ్లు తరలివస్తున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ కోడిపందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. భారీ ఎత్తున తరలివస్తున్న వారితో ఆ ప్రాంతాలన్నీ జాతరను తలపిస్తున్నాయి. ఇక కోళ్లపందాలతో పాటు... గుండాట, పేకాట, కోత ముక్కాటలు లాంటి జూద క్రీడలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆ ప్రాంతాల్లో మద్యం విక్రయాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

భక్తులపైకి దూసుకెళ్లిన బైక్

చిత్తూరు : పెద్దతిప్పసముద్రం మండలం యంపార్లపల్లిలో తిరుమలకు పాదయాత్రగా వెళ్లున్న భక్తులపైకి బైక్ దూసుకెళ్లింది. ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

 

08:47 - January 15, 2018

సినీనటి హరితేజతో 10టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా హరితేజ మాట్లాడుతూ తన సినీ, సీరియల్ కెరీర్ గురించి వివరించారు. పుట్టినప్పటి నుంచి డ్యాన్స్ ఇష్టమని చెప్పారు. తమ ఫ్యామిలీ మొత్తం సింగర్స్ అని అన్నారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే... 
'బిగ్ బాస్ షో ఒక ప్లాట్ ఫామ్. నిజాం కాలేజీలో బీఏ పూర్తి చేశారు. చిన్నారి నా ఫస్ట్ సీరియల్. నేను వారే వారిని ఇమిటేట్ చేస్తాను. గీతా మాధురిని ఇమిటేట్ చేసింది. అయితే అర్చన నన్ను ఇమిటేట్ చేసింది. నాన్న వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. నాకు పని ఉంటేనే ఎనర్జీటిక్ గా ఉంటుంది. జిమ్ అంటే నా భర్తకు చాలా ఇష్టం అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

నేడు ఢిల్లీలో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఇన్ ఎడ్యుకేషన్ భేటీ

ఢిల్లీ : నేడు హస్తినలో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఇన్ ఎడ్యుకేషన్ భేటీ జరుగనుంది. దేశంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

నేడు ఇజ్రాయిల్ ప్రధానితో ప్రధాని మోడీ సమావేశం

ఢిల్లీ : నేడు ఇజ్రాయిల్ ప్రధానితో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

నేడు మకర సంక్రాంతి

హైదరాబాద్ : నేడు మకర సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వాకిళ్లు ముగ్గులతో కళకళలాడుతన్నాయి. గొబ్బెమ్మలు దర్శనమిస్తున్నాయి. 

08:29 - January 15, 2018

ఢిల్లీ : అండర్‌ 19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌ బిలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై వంద పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడుసార్లు ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత్‌.. పటిష్ఠ ఆసీస్‌‌పై గెలుపుతో ఈ టోర్నీలో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది. భారత్‌ నిర్దేశించిన 329 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ చతికిలబడింది. 42.5 ఓవర్లలోనే 228 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ షా-94, మన్‌జోత్‌‌-86 పరుగులతో చెలరేగి ఆడటంతో... భారత్ 328 పరుగులు చేసింది. 

 

08:28 - January 15, 2018

చెన్నై : తమిళుల సంప్రదాయ ఆట జల్లికట్టు జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ప్రత్యేక చట్టం మేరకు నిర్వహిస్తున్నారు.  ప్రభుత్వమే ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా అన్ని అనుమతులు,  నిర్వహణ, భద్రత అంతా దగ్గరుండి చూసుకుంటోంది.  అవనీయపురంలో వెయ్యిమంది యువకులు, 400 ఎద్దులతో జల్లికట్టు నిర్వహించారు. ఇక అనంగానల్లూరు, పాలమేడు ప్రాంతాల్లో జల్లికట్టు ఆటకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు జల్లికట్టను తిలకించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. 

 

08:24 - January 15, 2018

ఢిల్లీ : హస్తినలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  సంక్రాంతి వేడుకలను నిర్వహించింది. భారీ సంఖ్యలో హాజరైన తెలుగు వారితో సందడి నెలకొంది ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులతో ఆటాపాటలతో తెలుగువారి పండగను వైభవంగా జరుపుకున్నారు. 

 

08:20 - January 15, 2018

విశాఖ : జిల్లాలోని పెందుర్తీ నియోజక వర్గ ప్రజలను లారీలు భయపెడుతున్నాయి. ఐదునిముషాలు గ్యాప్‌లేకుండా తిరుగుతున్నలారీల రోడ్లన్నీ గుల్లవుతున్నాయి. దుమ్ము ధూళితో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజల ఆరోగ్యాలను, రహదారులను గుల్లచేస్తున్న లారీలను వెంటనే నిలిపేయాలని స్థానికులు ఆందోళనబాట పట్టారు. 
నిత్యం వందలాది భారీ వాహనాలు 
విశాఖ జిల్లా పెందుర్తి నియోజక వర్గాన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పరవాడ ఫార్మాసిటీ.. హింధూ జా విద్యత్ ఉత్పత్తి కేంద్రం మరో వైపు, ఎన్టీపీసీ పరిశ్రమ. దాంతోపాటు పలు ఫెర్రో ఎల్లాయిస్ కంపేనీలు ఉన్నాయి. వీటికి తోడు నియోజకవర్గం గుండా ఉన్న జాతీయ రహదారి మీద నిత్యం వందలాది భారీ వాహనాలు విరామం లేకుంబడా తిరుగుతూ ఉంటాయి. ఎన్టీపీసీ, హిందూజా, ఫెర్రొఎల్లాయిస్  కంపేనీలకు బోగ్గును సరఫరా చెసేందుకు నిత్యం వందలాది లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాస్తవానికి ఈ పరిశ్రమలు తమ బొగ్గు అవసరాల కోసం రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు చేస్తుకోవాలి. కాని పరిహారం విషయంలో హిందూజా విద్యుత్‌ సంస్థకు స్థానిక రైతులకు వివాదం ఏర్పడ్డంతో రైల్వేలైన్లు ప్రతిపాదనకే పరిమితం అయ్యాయి. దీంతో పలు సంస్థలు  లారీలద్వారానే బొగ్గును తెచ్చుకుంటున్నాయి. బొగ్గులారీ నుంచి వెలువడుతున్న దుమ్ముధూళితో పెందుర్తి నియోజవర్గంలోని పలుగ్రామాల్లో కాలుష్యం ప్రమాదకారస్థాయికి పెరిగిపోయింది. 
రోడ్లన్నీ గతుకులమయం
ఈ లారీలు అన్ని పరవాడ, సబ్బవరం మండలాల్లోని 20కు పైగా గ్రామాల నుంచి రాపోకలు సాగిస్తున్నాయి.  పరిమితికి మించి లోడ్‌తో వెళ్లడంవల్ల రోడ్లన్నీ గతుకుల మయంగా మారిపోయాయి. పైగా బొగ్గులోడుతో వస్తున్న లారీలు కనీసం టార్పాలిన్‌ షీట్లుకూడా కప్పకండా వస్తున్నాయి. దీంతో రేణువులు గాల్లోకలిసి గాలికాలష్యం ఏర్పడుతోంది. పలు గ్రామాల్లో ప్రజలకు శ్వాసకోశవ్యాధులు వస్తున్నాయి.  అంతేకాదు మితిమీరిన వేగంతో దూసుకుపోతున్న లారీలతో తరచుగా రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. లారీలు అధికార పార్టీ నేతలకు చెందినవే కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నారు. 
ప్రజలు ప్రత్యక్ష అందోళన
ఎన్ని సార్లు అధికారులకు మోరపెట్టుకున్న వారి నుంచి ఎటువంటి స్పంధన లేదు..దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యక్ష అందోళను దిగుతున్నారు..అని ప్రజా సంఘాలతో పాటుగా అన్ని రాజకీయ పక్షాలు అంధోళనకు దిగుతున్నాయి. ప్రజల ఆందోళనతో  పెందుర్తి  ఎమ్మేల్యే బండారు సత్యనారాయణమూర్తి   స్పందించారు. సాధ్యమైనంత త్వరగా హింధూజా యాజమాణ్యంతో నూ ఇతర ఫెర్రో ఎల్లాయ్ సంస్థలతోనూ మాట్లాడి   రైల్వే ట్రాక్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తానంటున్నారు. నాయకులు హామీలు ఎప్పటిలాగే గొప్పగా ఉన్నా.. సమస్యమాత్రం పరిష్కారం కావడంలేదని స్థానక ప్రజలు అంటున్నారు. నాయకులు, అధికారులు తగిన చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పెందుర్తి నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. 

08:14 - January 15, 2018

అనంతపురం : వృత్తి గొర్రెల కాపరి.. ప్రవృత్తి ప్రకృతిని చిత్రించడం.. పగలంతా పశువులు కాస్తూ.. రాత్రిపూట చిత్రాలు వేయడం నేర్చుకున్నాడు. పేదరికం వేధిస్తున్నా.. తనలోని కళాకారుడికి పదునుపెట్టాడు. నట్టడవిలో సంచరిస్తూ నలుగురూ మెచ్చే చిత్రాలు వేస్తున్నాడు..అనంతపురం జిల్లాకు చెందిన వెంకటరమణ. 
వృత్తిరీత్యా గొర్రెలకాపరి
ఇక్కడ పేపర్‌మీద చకచకా బొమ్మలేస్తున్న ఈ కళాకారుడిపేరు వెంకటరమణ. అనంతపురం జిల్లా శింగనమల గ్రామంలో ఉండే ఈ కళాకారుడు వృత్తిరీత్యా గొర్రెలకాపరి. పొద్దుపొడుపు నుంచి పొద్దుకూకే వరకు కొండకోనలు పట్టుకుని తిరిగే వెంకటరమణకు చిన్ననాటి నుంచే బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. స్కూల్లో చదువుతుండగానే చిత్రాలు వేస్తూ నలుగురితో శహభాష్‌ అనిపించుకున్నాడు. 
పేదరికంతో కష్టాలు పడుతున్నా
పేదరికంతో కష్టాలు పడుతున్నా.. తనలోని కళాకారుణ్ని మాత్రం రంగులు ప్రపంచంలో విహరింపజేస్తాడు వెంకటరమణ.  ఈ వర్ణచిత్రాలన్నీ ఈ పేద చిత్రకారుడి కుంచెనుంచే జాలువారాయి. చిన్ననాడే చదువుకు దూరమైనా.. చేయితిరిగిన కళాకారులకే సాధ్యం అయ్యేలా ఆలోచింపచేసే చిత్రాలు వేస్తున్నాడు.  పొద్తున్నే అడవిబాట పట్టింది మొదలు హృదయాంతరాళంలో మెదులుతున్న  ఊహాలకు  రాతిబండలపైనే రూపం ఇస్తాడు. రంగు,రంగుల చాక్ పీసులను తీసుకెళ్లీ .. గొర్రెలను మేపుతూనే బొమ్మలు వేయడంలో ప్రావీణ్యం సాధించాడు. 
ఏడో తరగతి చదువుతుండగా తండ్రి మృతి
ఏడవతరగతి చదువుతుండగా తండ్రి చనిపోయాడు.. కుటుంబ భారం మీదపడింది. 12ఏళ్ల పసిప్రాయంలో పశులకాపరిగా మారాడు. ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లకు తానే తల్లి-తండ్రి అయ్యాడు. తండ్రి వారసత్వంగా ఇచ్చిన గొర్రెలను మేపుతూ.. జీవనం సాగిస్తున్న వెంకటరమణకు ఇపుడు చెల్లెళ్ల పెళ్లి ఒక సవాల్‌గా మారింది. పేదరికంలో మగ్గుతున్న  తననుఆదుకోవాలని దాతలకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. గొర్రెలు కాస్తేనే తన కుటుంబం గడుస్తుందని..పేదరికం నుంచి బయటపడేందుకు చేయూత నిస్తే.. దేశం గర్వించే కళాకారుడినవుతాని వెంకటరమణ చెబుతున్నాడు. ఈ పేదకళాకారుణ్ని ప్రభుత్వమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది.  

 

08:10 - January 15, 2018

విజయవాడ : రైల్వే స్టేషన్ల నిర్వహణ ప్రైవేటుపరం కాబోంది. ఇప్పటికే ట్రాక్‌ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్‌, కోచ్‌ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్న రైల్వే శాఖ... ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యతల నుంచి కూడా తప్పుకుని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమైంది. రైల్వే స్టేషన్లు కార్పొరేట్‌ సంస్థ చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ విషయంలో విజయవాడ, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లు ముందువరసులో ఉన్నాయి. 
స్విస్‌ చాలెంజ్‌ విధానంలో విజయవాడ రైల్వే స్టేషన్‌ 
విజయవాడ రైల్వే స్టేషన్‌ను 198 కోట్లతో ఆధునికరించేందుకు స్విస్‌ చాలెంజ్‌ విధానంలో రైల్వే బోర్డు టెండర్లు పిలించింది. స్టేషన్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను టెండర్‌ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా 40 ఏళ్లకు లీజు ఇచ్చేందుకు లీజుకు వచ్చే విధంగా టెండర్లు పిలించినా... పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు ఈ సమయంలో సరిపోందని,  90 ఏళ్లకు పైన ఉండాలన్న అంత్జాతీయ బిడ్డర్లు డిమాండ్‌కు రైల్వే శాఖ తలొగ్గింది.  ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు దీనిని వ్యరేకిస్తున్నాయి. 
దోపిడీకి గురికానున్న ప్రయాణికులు  
రైల్వే స్టేషన్లు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళితే ప్రయాణికులు దోపిడీకి గురవుతారు. స్టేషన్‌ ఆవరణతోపాటు పరిసరాల్లోకి ఖాళీ స్థనాల్లో మల్టిప్లెక్స్‌ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, క్లినిక్‌లు వస్తాయి. వీటిలో వస్తుసేవల రసుములపై  ఎవరి నియంత్రణ ఉండే అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు జేబుల లూటీ తప్పదని భావిస్తున్నారు. రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యతలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. 

08:04 - January 15, 2018

ప్రకాశం : జిల్లాలోని సీఎస్‌ పురం మండలం ఉప్పలపాడులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సంక్రాంతి సందర్భంగా దేవాలయం వద్ద మైక్‌ పెట్టిన అంశంపై రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీనికి రాజకీయరంగు పులుముకోవడంతో వివాదం పెద్దదైంది. ఘర్షణలో గాయపడ్డ రాధాకృష్ణారెడ్డి కనిగిరి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. విషయం పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది.

 

07:54 - January 15, 2018

సంగారెడ్డి : ప్రజల పక్షాన నిలుస్తున్న టెన్‌టీవీ ప్రజల్లో మరింతగా దూసుకుపోవాలన్నారు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జె. గీతారెడ్డి. సంగారెడ్డిజిల్లా జహీరాబాద్‌లో 10టివి నూతన సంవత్సర కేలండర్‌ను ఆమె ఆవిష్కరించారు.  5వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టెన్‌టీవీకి గీతారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

 

07:49 - January 15, 2018

లండన్ : ఈస్ట్‌ లండన్‌లో తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఈ సంబరాల్లో తెలుగు భాష, అలవాట్లు, అభిరుచులకు పెద్దపీట వేశారు.  తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆహూతులు తమ అభిలాషను వ్యక్తం చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలు 
యునైటెడ్‌ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ యుక్తా ఆధ్వర్యంలో జనవరి 13న 8వ సంక్రాంతి సంబరాలను ఈస్ట్‌ లండన్‌లో  ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో మహిళలకు ముగ్గులపోటీలు, చిన్నపిల్లలకు ఫ్యాన్సీ డ్రస్‌ పోటీలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయురారోగ్యాలు అందించేందుకే పిల్లలకు భోగిపళ్ళు పోస్తారని పద్మకిల్లి అన్నారు. తెలుగు వారికి ఎన్నో పండగలున్నా... దేనిప్రత్యేకత దానిదే అన్నారు ట్రస్టీ గీత మోర్ల. 
పెద్ద వేడుక
తెలుగు పండగరోజు తెలుగు వారంతా పరాయిదేశంలో ఒక చోట కలుసుకోవడమే పెద్ద వేడుక. ఇక్కడ బాలల కార్యక్రమాలను చూస్తే... ఎంతో ముచ్చటగా ఉందన్నారు యుక్తా అధ్యక్షులు మంత్రాల ప్రసాద్. బ్రిటన్‌లో ఉన్నా మాతృ భాషను మరవకుండా...   వారసత్వంగా  తమ పిల్లలకు అందిస్తున్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన ఈ సంక్రాంతి వేడుకల్లో  దాదాపు వెయ్యిమందికిపైగా హాజరయ్యారు. 

 

07:43 - January 15, 2018

అసిఫాబాద్ : కోడి పందాలకు పెట్టింది పేరు కోస్తా ప్రాంతం. సంక్రాంతి పండగ వచ్చిందంటే అక్కడుండే సందడే వేరు...  మందూ విందులతో పందాలు కాస్తారన్నది బహిరంగ రహస్యం.. కానీ... ఇప్పుడు  కోడి పందాలు అంటేనే తెలియని మారుమూల ప్రాంతాల్లోనూ కోళ్ళకు కత్తులు కడుతున్నారు.. వేలల్లో పందాలు కాస్తున్నారు... కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్‌లోని దట్టమైన అడవుల్లో... సై అంటే సై అంటున్న పందెం కోళ్ళపై స్పెషల్‌ ఫోకస్‌..  
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందాలు  
ఇప్పటివరకూ కోడిపందాలు అంటే.. సంక్రాంతి పండక్కు కోస్తాలో జరిగే బెట్టింగుల గురించే తెలుసు.. యేడాదిపొడవునా కోడి పందాలు కొనసాగే ప్రాంతాలు కూడా ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. ఇలా ఏడాది కోడి పందాలు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతాయన్నది చాలా మందికి తెలియదు. మహారాష్ర్ట సరిహద్దు గ్రామాల్లో కొన్ని చోట్ల సంక్రాంతికి కోడిపందాలు జరిగితే... మరికొన్ని ప్రాంతాల్లో నిత్యం  కోళ్ళ కాళ్లకు కత్తులు కట్టే ఉంటాయి.
రహస్యప్రాంతాల్లో కోడిపందాలు
కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని  మహారాష్ర్ట సరిహద్దు మండలాల్లో సంక్రాంతికి  కోడి పందాలకు రంగం సిద్ధమైంది. సిర్ఫూర్‌ నియోజకవర్గంలోని బెజ్జూర్‌ దహేగాం, చింతల మానేపల్లి, కౌటాల, గాజక్‌నగర్ తోపాటు ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని పలు మండలాల్లో  బెట్టింగ్‌ రాయుళ్ళు పందాలకు కాస్కో అంటూ  సిద్ధమైనట్లు తెలుస్తోంది.  పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు రహస్య ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం.
కోడిపందాల పోలీసుల నిఘా
సమయం సందర్బం లేకుండా సాగిస్తున్న కోడిపందాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.. నిత్యం గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత యేడాది దహేగాం మండలం గిరివెళ్ళి అటవీ ప్రాంతంలో కోడిపందాల అడ్డామీద దాడి చేశారు. 45మందిని అరెస్టు చేశారు. 60వేల రూపాయల నగదు, 14 బైకులు, 3 ఆటోలు, 8 కోళ్ళను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు కౌటాల, కాగజ్‌ నగర్ మండలాల్లో కూడా పలు కేసులు నమోదు చేశారు. ఈ  సంవత్సరం  కోడి పందాలపై  ప్రత్యేక దృష్టి పెట్టామని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ... పోలీసులకు దొరక్కుండా రహస్య ప్రాంతాల్లో పందాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండగ పూట సరిహద్దు ప్రాంతాల్లో పందెం కోళ్ళు కత్తులు దూస్తుంటే....  బెట్టింగ్‌రాయుళ్ళు వేలల్లో పందెం కాస్తున్నారు.  
 

07:35 - January 15, 2018

హైదరాబాద్ : మీకు తీపి అంటే ఇష్టమా... అందులోనూ సందేశ్, రసగుల్లా వంటి పలు రాష్ర్టాల  మిఠాయిలు తినాలనుందా... ఐతే మీరు హైదరాబాద్‌లోని  పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళ్ళాల్సిందే... దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న స్వీట్‌ ఫెస్టివల్‌కు పరేడ్‌ గ్రౌండ్‌ వేదికైంది. స్వీట్‌ లవర్స్‌ కోసం వివిధ రాష్ర్టాలు,  దేశాలకు చెందిన వెయ్యి రకాల స్వీట్లను ఒకే వేదికపైకి తెచ్చింది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ. స్వీట్‌ ప్రియులారా మరెందుకు ఆలస్యం... వెంటనే స్వీట్‌ ఫెస్టివల్‌పై ఓ లుక్కేయండి.. 
పరేడ్‌ గ్రౌండ్స్‌లో 
హైదరాబాద్‌ నగరంలోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం తొలిసారి.. ప్రయోగాత్మకంగా తొలిసారిగా నిర్వహిస్తున్న స్వీట్‌ ఫెస్టివల్‌తో సందడి నెలకొంది. ఒకే వేదిక మీద వెయ్యి రకాల స్వీట్లతో నిర్వహిస్తున్న తీపి పండుగ నగరవాసుల్లో సంబరాన్ని నింపింది. 3 రోజుల పాటు జరగనున్న స్వీట్‌ ఫెస్టివల్‌లో వివిధ రాష్ర్టాలు, దేశాల ప్రజలు తయారు చేసిన వెయ్యిరకాల స్వీట్లు ఉండేలా సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. వైవిధ్యభరితమైన తీపి రుచులన్నింటినీ సంక్రాంతి సందర్భంగా ప్రపంచానికి పరిచయం చేసింది తెలంగాణ భాషా సాంస్కృతిక పర్యాటక శాఖ. నగరంలో నివసించే వివిధ రాష్ర్టాల, దేశాల ప్రజల ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే వేదికగా ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని సాంస్కృతిక శాఖ తెలిపింగి. ఈ ఫెస్టివల్‌ వల్ల పలు రాష్ర్టాల ప్రజల మధ్య పరస్పర గౌరవం, సాన్నిహిత్యం పెరుగుతాయంటున్నారు ఆశాఖ అధికారులు.
ఆహూతులను ఆకట్టుకున్న స్వీట్లు  
వివిధ రాష్ర్టాల మహిళలు తయారు చేసిన స్వీట్లు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. రాష్ర్టాల వారీగా స్వీట్ల రకాలను బట్టి స్టాళ్ళను ఏర్పాటు చేశారు.   ఒకే చోట   పలురకాల మిఠాయిలను రుచి చూసే అవకాశం దొరికింది..  ఒకే వేదిక మీద వెయ్యిరకాల స్వీట్లు కొలువు తీరడంతో ఎంతో బాగుందని  సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  నామ మాత్రపు ధరలకే స్వీట్లు దొరుకుతున్నాయి. దీంతో ప్రజలు తమకు నచ్చిన స్వీట్లను తింటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే స్వీట్‌ ఫెస్టివల్‌కు ఎంట్రీ ఫ్రీ కాబట్టి.. సెలవుల్లో మీకు నచ్చిన స్వీటు తింటూ స్వీట్‌ ఫెస్టివల్‌లో స్వీటు స్వీటుగా ఎంజాయ్‌ చేయండి. 

 

07:27 - January 15, 2018

ప్రకాశం : జిల్లాలోని అద్దంకి, బల్లికువర పోలీసులు కోడిపందేల స్థావరాలపై దాడుల చేశారు. ఈ దాడుల్లో  15 కోళ్లతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. పందేలు నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. చట్ట ప్రకారం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అద్దంకి ఎస్సై సుబ్బరాజు చెప్పారు.
 

Don't Miss