Activities calendar

14 May 2018

21:50 - May 14, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో ముసలం మొదలైంది. కన్నాను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో నేతల్లో అసంతృప్తి భగ్గుమంది. కన్నా నియమాకాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. పలు జిల్లాల్లో నేతలు రాజీనామాలు చేశారు. ఇదిలావుంటే సోము వీర్రాజుతో మాట్లాడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

పార్టీలో తీవ్ర అలజడి
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక ఆ పార్టీలో తీవ్ర అలజడి రేపింది. సోము వీర్రాజుకు అవకాశం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో కొందరు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారిని కాదని... కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవి కట్టబెట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు.

హరిబాబు రాజీనామా చేసిన సమయంలోనూ కన్నా పేరు
ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై గత కొన్ని నెలలుగా అధిష్టానం చర్చలు జరిపింది. రాష్ట్రంలో పరిస్థితులు మారడం.. మాణిక్యాలరావుకు అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తానన్నా ఒప్పుకోకపోవడంతో కన్నాకు పదవిని కట్టబెట్టారు. అయితే.. హరిబాబు రాజీనామా చేసిన సమయంలోనూ కన్నా పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ... వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం బీజేపీ సాంప్రదాయం కాదని పలువురు సీనియర్లు వారించారు. అయితే అనూహ్య పరిణామాలతో చివరకు కన్నా పేరునే అధిష్టానం ఖరారు చేసింది. అయితే కన్నా ఎంపికపై బీజేపీ నేతలు ఒకింత ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజు... అధిష్టానం వ్యవహారంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయారు. ఇదిలావుంటే కన్నా ఎంపికపై సోము వీర్రాజు అనుచరులు ఆందోళనబాట పట్టారు. సోముకు అధ్యక్ష పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రాజీనామాలు చేశారు. వేరే పార్టీ నుంచి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం బీజేపీ సాంప్రదాయం కానప్పటికీ.. కన్నా వేరే పార్టీలోకి వెళ్తారనే భయంతో అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఎంతవరకు సబబు ? అని ప్రశ్నిస్తున్నారు.

సోము వీర్రాజు అలక చిన్న విషయమే : కన్నా
ఇదిలావుంటే... రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. సోము వీర్రాజు అలక చిన్న విషయమేనని... సోము వీర్రాజుతో మాట్లాడి అన్ని విషయాలు చక్కదిద్దుతానన్నారు. టీడీపీతో విభేదాలు తలెత్తిన తర్వాత రాష్ట్రంలో సొంతంగా బలపడుతామనుకుంటున్న బీజేపీకి పార్టీ అంతర్గత పోరు పెద్ద తలనొప్పిగా మారింది. కన్నా ఎంపికపై ఆదిలోనే ఆందోళనలు తలెత్తడంతో.. పరిణామాలు ఎలా మారుతాయోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. 

21:47 - May 14, 2018

పశ్చిమగోదావరి : వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర మరో చరిత్ర సృష్టించింది. 161 రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లి వద్ద ఏర్పాటు చేసిన 40 అడుగుల స్తూపాన్ని జగన్‌ ఆవిష్కరించారు.

పాదయాత్ర @ 2000 కిమీ
వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఏలూరు శివారు మాదేపల్లిలో 2 వేల కి.మీ. మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా మాదేపల్లిలో ఏర్పాటు చేసిన 40 అడుగుల స్తూపాన్ని జగన్‌ ఆవిష్కరించారు. 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర ఎనిమిది జిల్లాల్లో పూర్తైంది. 161వ రోజు పశ్చిమగోదావరిలో ప్రవేశించి ఏలూరు చేరుకొంది. పాత బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో... టీడీపీ ప్రభుత్వ విధానాలపై జగన్‌ విరుచుకుపడ్డారు.

సంఘీభావ యాత్రలు
మరోవైపు జగన్‌ పాదయాత్ర 2 వేల కి.మీ. పూర్తైన సందర్భంగా... వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ యాత్రలు నిర్వహించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రల్లో పాల్గొన్నారు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ నాయకులు సంఘీభావ పాదయాత్రలు నిర్వహించారు. తెలుగుదేశం పాలన అవినీతిమయంగా మారిందని ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోనూ వైసీపీ నేతలు సంఘీభావ పాదయాత్రలు నిర్వహించారు. జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విజయనగరం జిల్లాలో వైసీపీ ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ, పార్టీ నేత కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాదయాత్రల్లో పాల్గొన్నారు. జగన్‌ పాదయాత్ర 2 వేల కి.మీ. మైలురాయిని అధిమించిన సందర్భంగా తూర్పుగోదారి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. మంగళవారం వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘీభావ ర్యాలీలు కొనసాగుతాయి. బుధవారం వైసీపీ నాయకులు తమ తమ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. 

21:43 - May 14, 2018

కర్ణాటక : కన్నడ పీఠం ఎవరికి..? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేయడంతో.. రేపు వెలువడనున్న ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. ఒకవేళ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు నిజమైతే.. జేడీఎస్‌ ఏ పార్టీతో కలవనుంది ? పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బీజేపీలు సిద్దరామయ్య, యడ్యూరప్పలను సీఎం అభ్యర్థులుగా ప్రకటించాయి. కానీ.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్‌ దళిత సీఎం అభ్యర్థిత్వాన్ని తెరపైకి తీసుకురాగా... బీజేపీ అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని సీఎం చేయాలనే యోచనలో ఉంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే... ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా కీలకంగా మారనున్నారు. ఇక ఇప్పటికే ఆ రెండు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు హంగ్‌ వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో జేడీఎస్‌ కీలకంగా మారింది. మరోవైపు జేడీఎస్‌ నేత కుమారస్వామి మాత్రం... తాము ఎగ్జిట్‌పోల్స్‌ విశ్వసించబోమంటున్నారు. అధికారం కోసం తాము ఎవరి వద్దకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఫలితాలు వెల్లడయ్యే వరకు ఒత్తిడిని అధిగమించేందుకు కుటుంబంతో కలిసి కుమారస్వామి సింగపూర్‌ వెళ్లారు. దీంతో రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయోనన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. 

21:41 - May 14, 2018

పశ్చిమ బెంగాల్‌ : జరిగిన పంచాయితీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఏడుగురు మృతి చెందారు. టిఎంసి కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారు. ఇద్దరు సిపిఎం కార్యకర్తలను సజీవ దహనం చేశారు. ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని సిపిఎం విమర్శించింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న తృణమూల్‌ చర్యలను తీవ్రంగా ఖండించింది.

పంచాయితీ ఎన్నికల్లో హింస
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లింది. నార్త్‌ 24 పరగణాస్‌, బుర్ద్వాన్‌, కూచ్‌బెహర్‌, సౌత్‌ 24 పరగణాస్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

ఇంట్లోనే సజీవ దహనమైన దేబుదాస్‌, ఉషాదాస్‌ దంపతులు
సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లాలో.. సీపీఎం మద్దతుదారుల ఇల్లును గత రాత్రి తృణమూల్‌ గూండాలు తగలబెట్టారు. సీపీఎం కార్యకర్తలైన దేబుదాస్‌, ఉషాదాస్‌ అనే భార్యాభర్తలపై దాడి చేసి ఇంట్లోనే సజీవ దహనం చేశారు. ఈ ఘటనను సిపిఎం తీవ్రంగా ఖండించింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని సిపిఎం విమర్శించింది. తృణమూల్‌ చర్యలను ఖండించింది. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్‌ వరకు హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించింది.నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలో బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. బాగ్డాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలోకి కొంతమంది వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి బాలెట్‌ పత్రాలపై స్టాంపులు వేయడానికి ప్రయత్నించారు. జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద బాంబు పేలడంతో 20 మంది గాయపడ్డారు. కూచ్‌ బిహార్‌లో బిజెపి కార్యకర్తపై ఓ మంత్రి చేయి చేసుకున్నాడు. శికర్‌పూర్‌ గ్రామంలో బ్యాలెట్‌ బాక్స్‌ను తగుల బెట్టారు.

మీడియా వాహనాన్ని ధ్వంసం
భాంగర్‌ జిల్లాలో ఓ మీడియా వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. టిఎంసి కార్యకర్తలు పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించేందుకు యత్నించారు. కొన్ని చోట్ల ప్రజలను ఓటు వేయకుండా వారు అడ్డుకున్నారు. అల్లరిమూకలపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 58, 639 గ్రామపంచాయతీ స్థానాలకు ఎన్నికలు
గత నెల 2న పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ మొదలైన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నామినేషన్‌ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీల అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 58, 639 గ్రామపంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సుమారు 20వేల స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయింది. 

బెంగాల్ హింసపై వ్యతిరేకంగా సీపీఎం నిరసనలు..
పశ్చిమ బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌ దాడులను ఏపీ సీపీఎం తీవ్రంగా ఖండించింది. దాడులను నిరసిస్తూ విజయవాడ బీసెంట్‌ రోడ్డులోని అన్సారీ పార్క్‌ సెంటర్‌లో పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు వైవీ హాజరయ్యారు. బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల్లో చోటు చేసుకున్న హింస అక్కడ పాలనా విధానాలను బయట పెట్టిందని మధు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు.. బెంగాల్లో మాత్రం ప్రభుత్వ నిర్భందపూరిత వాతావరణంలో జరిగాయన్నారు. టీఎంసీ అప్రజాస్వామికంగా వ్యవహిరించిందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ కలగజేసుకుని తిరిగి పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బెంగాల్‌ దౌర్జన్యఖాండను నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మధు తెలిపారు. 

మోదీ కేబినెట్ లో కీలక మార్పులు..

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ్చారు. సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ బాధ్యతల నుంచి ఆమెను తప్పించారు. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు సమాచార ప్రసార శాఖను అప్పగించారు. ఆర్ధిక శాఖ ఇంఛార్జ్‌గా పీయుష్ గోయల్‌ను నియమించారు.

రేపే కన్న ఫలితాలు..భారీ బందోబస్తు..

హైదరాబాద్ : దేశ ప్రజల దృష్టంతా తన వైపునకు తిప్పుకున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ల భవితవ్యం ఈవీఎంలలో ఓట్ల రూపంలో నిక్షిప్తమై వుంది. మరోపక్క, ఎగ్జిట్‌ పోల్స్‌ కర్ణాటకలో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మొత్తం 222 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల కౌంటింగ్‌ కోసం సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం మొత్తం 40 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

20:37 - May 14, 2018

బీజేపీ ఏపీ అధ్యక్షుడి కన్నా లక్ష్మీనారాయణ నియామకం వివాదాస్పదంగా మారింది. ఆ బీజేపీ పార్టీ లైన్ కూడా పెద్దగా తెలియని కన్నా నియామకం ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ గా మారిపోయింది. దీంతో ఆపార్టీ వ్యక్తుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. మరి ఇంత వివాదాస్పదంగా మారినా అధిష్టాం కన్నానే ఎంచుకోవటం పట్ల వున్న రాజకీయ ఎత్తుగడలేమిటి? భవిష్యత్ వ్యూహాలు ఏవిధంగా వుండబోతున్నాయి? కన్నాపై బీజేపీకున్న ననమ్మకమేమిటి? అధిష్టానం ఆంతర్యమేమిటి? వ్యూహమేమిటి? వంటి పలు అంశాలపై ప్రొ.నాగేశ్వర్ గారి విశ్లేషణలో తెలుసుకుందాం..

20:27 - May 14, 2018

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పార్టీల ముసలం బుట్టింది.. నిన్నగాక మొన్న పార్టీల జేరిన కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ అధ్యక్షుడి పదవి ఇస్తె.. ఇన్నొద్దుల సంది జనం చెవ్వుల పువ్వులు వెట్టి పువ్వుగుర్తును కాపాడుకుంటొచ్చిన మా ప్రియతమ నేత సోమువీర్రాజు పరిస్థితి ఏందని పంచాది రాజుకున్నది.. రాజీనామాల దాక వోతున్నది యవ్వారం..

జానారెడ్డికి భయమైతున్నట్టుంది.. ఆయింత ముఖ్యమంత్రి పదవిని ఉత్తంకుమార్ రెడ్డి గొట్కపోతడా..? లేకపోతె రేవంత్ రెడ్డి ఎసరువెడ్తడా అన్న పుట్టెడు భయంతోని ఉన్నట్టుండు.. ఇగ అయితె గియితే నేను గావాలె గని.. జూనియర్లు వాళ్లెట్లైతరు అని చెప్పలేక.. కొంతమంది అత్యుత్సాహంగ మాట్లాడుతున్నరని కడ్పుల మంటను మీడియా ముంగట వోశిండు..

వారెవ్వ సూస్కోండ్రి.. ప్రపంచంలనే ఎక్కడలేని విధంగ రెవెన్యూ రికార్డులు సదిరినం అని చెప్తున్నడుగదా..? ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శుద్దికరణల ఎంత గోల్మాల్ ఉన్నదో మచ్చుకు ఒక ముచ్చటొచ్చింది సూడుండ్రి.. రికార్డుల శుద్దిల పేదల భూమిని ముప్పై ఎక్రాలు చెరవట్టేశిండ్రు అధికార పార్టీ లీడర్లు.. వాస్తవమే మరి ప్రపంచంల ఎక్కడలేని విధంగనే జేశిండ్రు ఎక్కడైనా పేదల భూమి పేదలకే ఇచ్చిండ్రు ఈడ దోసుకుంటున్నరు..

కాంగ్రెస్ పార్టోళ్లు సంకురాత్రి గంగెడ్ల లెక్క బస్సుయాత్రలు వెట్టుకోని తిర్గుతున్నరు జనంల అని తిడ్తున్నడు పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ సారు.. వాళ్లు ఎన్నడు ఏం జేయలేదు.. ఇగ ముంగట గూడ ఏం జేశెటోళ్లు గాదు వాళ్ల మాటలు నమ్మకుండ్రి అని ఆ గంగెడ్ల కంటె ముందుగాళ్లనే మేము మీతానికొచ్చి చెప్తున్నం అనుకొచ్చిండు ఒకతాన మీటింగుల సారు జర్ర మళ్ల జెప్పు..

తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ జేస్తున్న కుట్రలను పశిగట్టకపోతె ఆగమైతది తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం అయితే.. రైతుల కండ్లళ్ల నీళ్లు గారుతున్నయ్.. నిధులు ఆంధ్రాకాంట్రాక్టర్ల జేవుల వడ్తున్నయ్..నియామకాలు కేసీఆర్ ఇంటోళ్లతోని భర్తీ అయితున్నయ్.. తస్మాత్ జాగ్రత్త ఈ ప్రభుత్వాన్ని ప్రజలంత గల్చి గద్దెతించకపోతె ఆగమైతదనుకొచ్చిండు జనసమితి అధ్యక్షుడు కోదండరాం సారు..

ఇంకా శెరమొస్తలేదేమయ్యా ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇంతగనం మొత్తుకుంటున్నం.. వడగండ్ల వానకు రైతుల పంట ఆగమైతున్నది ఏమన్న ఏర్పాట్లు గట్టిగ జేయుండ్రి వాళ్లు ఆగమైతున్నరని ఎన్నొద్దుల సంది మొత్తుకుంటున్నం మనం.. అయినా లాభం లేదు.. అడ్డమైన వానలు జేయంగ మళ్ల మార్కెట్ల పొంట గదే తడ్సుడు గదే ఆగమున్నది..

పూసలోళ్లు నెత్తిల గంప ఎత్తుకోని ఇంటి ముంగటికొస్తె ఆ ఇల్లు కళకళలాడ్తది.. పండుగేదైనా పబ్బమేదైనా.? పూసలి తల్లి తట్ట ఇంటికాడ దిగంది పండుగ పూరాగ గాదు.. పెండ్లి కాడికెళ్లి చిన్న దావతుదాక వాళ్ల చేయివడంది అసలది పండుగనే గాదు.. పండుగకు వన్నెతెచ్చె పూసలోళ్ల తల్లి ఇయ్యాళ మార్కెట్ మాయాజాలం చిక్కి గోసెల్ల వోస్తున్నది.. ఒక్క మాటల జెప్పాల్నంటే పూసల గంప చిన్నవోయింది..

కార్డన్ సర్చ్ అని ఒక కథనడుస్తున్నది చానొద్దుల సంది తెలంగాణ రాష్ట్రంల..మరి ఈ కార్డన్ సర్చ్ తోని ఏం బైటవడ్తున్నది ఏ దొంగ దొర్కుతున్న సంగతి మనకు మాత్రం తెల్వదిగని.. పోలీసోళ్లు ఏడైతె చేయాల్నో సర్చింగు ఆడ జేస్తలేరు.. ఏడ జేయొద్దు ఆడ జేస్తున్నరు.. పేదలు బత్కే బస్తీల పొంట సర్చింగులు గాదు పోలీసోళ్లు మీరు జేయవల్సింది నిజంగ మీకు ధమ్ము ధైర్యం ఉంటే ఇగో గీడ జేయుండ్రి...

 

పిడుగుపాటు..ముగ్గురు చిన్నారులు మృతి..

గుంటూరు : గురజాల మండలంలోని సమాధానంపేటలో ప్రకృతి వైపరీత్యానికి ముగ్గురు బాలురు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో గ్రౌండ్ లో పవన్ నాయక్, హరిబాబు, మనోహర్ నాయక్ క్రికెట్ ఆడుకుంటున్నారు. అదే సమయంలో వర్షం కురవడంతో పాటు పిడుగులు పడ్డాయి. అక్కడి నుంచి ముగ్గురు బాలురు సురక్షిత ప్రదేశానికి వెళదామనుకునేలోపే పిడుగు పడటంతో అక్కడికక్కడే వారు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

19:47 - May 14, 2018

శ్రీకాకుళం : పెద్దల మీద కక్ష సాధించేందుకు ఏడేళ్ల పసివాడిని అపహరించి దారుణంగా హత్య చేసిన ఘటన మానవత్వానికే మాయని మచ్చలా కనిపిస్తోంది. సావరకోట మండలం గుమ్మపాడులో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన ఘటనతో స్థానికంగా కలకలం రేపింది. టీడీపీ నేత అయిన హర్షవర్థన్ అనే ఏడేళ్ల బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా పాతకక్షలతో బంధువులే అపహరించి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కాగా బంధువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని బాలుడి తల్లిదండ్రులు భావిస్తుండగా..పాత కక్షలతోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు జిల్లా ఎస్పీ త్రివిక్రమన్ ఎదుట నిందితుడు ఎడ్డెన్న లొంగిపోయాడు. బాలుడి బంధువుల ఫిర్యాదుమేరకు, నిందితుడు లొంగిపోయిన సందర్భంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

19:36 - May 14, 2018

పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో 12మంది మృతి చెందారు. తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారు. ఇద్దరు సీపీఎం కార్యకర్తలను సజీవదహనం చేశారు. పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లను భయభ్రాంతులకుగురి చేశారు. వారిని ఓటు వేయకుండా అడ్డుకున్నారు. సీపీఎం కార్యకర్తలు దేబుదాస్‌, ఉషాదాస్‌లపై దాడిచేసిన టీఎంసీ గూండాలు ఇంట్లోనే సజీవ దహనం చేశారు. అటు భావ్‌నగర్‌లో అధికార టీఎంసీ - జమి జిబిక పరిరక్షణ సమితి కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఓ మీడియా వాహనాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలను సీపీఎం తీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. బెంగాల్ లో టీఎంసీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈ హింసలకు వ్యతిరేకంగా కోల్ కతాలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహిస్తామన్నారు. టీఎంసీ దారుణాలకు, హింసలకు ప్రజాస్వామ్యంగానే సమాధానం చెబుతామన్నారు. టీఎంసీ దాడులు, హింస, బెదిరింపులు దేనికి సంకేతం? ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామిక పాలనతో రాజ్యాంగానికి మాయని మచ్చగా పాలిస్తున్న టీఎంసీ పాలనలో హింస దేనికి సంకేతం? వంటి పలు అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో కాంగ్రెస్ అధికార ప్రతినిథి మహేశ్ గౌడ్, బీజేపీ అధికార ప్రతినిథి సుభాష్, ప్రముఖ విశ్లేషకులు తులసీదాస్ పాల్గొన్నారు. 

19:17 - May 14, 2018

కరీంనగర్‌ : రాంపూర్‌లోని జయశంకర్‌ కాలనీలో ఓ మహిళకు దేహశుద్ధి చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను తాళ్లతో కట్టేసి చితకబాదారు. కోటేశ్వరరావు అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన బంధువులు.. కోటేశ్వరరావు ఆ మహిళతో ఉండగా రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని చితకబాదారు. అయితే... బంధువులు రావడంతో కోటేశ్వరరావు అక్కడినుంచి ఉడాయించాడు. 

19:15 - May 14, 2018

పశ్చిమగోదావరి : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద జగన్‌ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ జగన్‌ ఆవిష్కరించి... గుర్తుగా ఒక మొక్కను నాటారు. కాసేపట్లో ఏలూరుకు చేరుకోనున్న జగన్‌.. బహిరంగ సభలో పాల్గొననున్నారు. జగన్‌ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల సందర్భంగా భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. 

19:13 - May 14, 2018

ఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్‌ వరకు హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. సిపిఎంకు చెందిన ఇద్దరు కార్యకర్తలను సజీవ దహనం చేయడాన్ని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఎంసి అభ్యర్థులు ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడ అధికార పార్టీ దాడులకు తెగబడిందని ఏచూరి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న తృణమూల్‌ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏచూరి చెప్పారు.

19:11 - May 14, 2018

నల్గొండ : కేంద్రంలో బీఎల్‌ఎఫ్‌ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరయ్యారు. . తెలంగాణలో అసలైన రాజకీయ ప్రత్యామ్నాయం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ మాత్రమేనని నల్లా సూర్యప్రకాష్‌ స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక విధానాలలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెక్‌కి ఎటువంటి తేడా లేదని తెలంగాణలో బీఎల్‌ఎఫ్‌ నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తుందని ఆయన చెప్పారు. సేద్యం, విద్యా, వైద్యం బిఎల్‌ఎఫ్‌ ప్రధాన లక్ష్యాలని.. సామాజిక న్యాయం ఎజెండానే బీఎల్‌ఎఫ్‌ ధ్యేయం అని సూర్యప్రకాష్‌ అన్నారు. పార్టీలు, జెండాలు మారుతున్నాయే తప్ప వాటి ఎజెండాలో ఎలాంటి మార్పు లేదన్నారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. దేశ సంపదకు మూలమైన వారు కార్మికులేనని వీరికి అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీల నుండి కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.

19:07 - May 14, 2018

హైదరాబాద్ : పిల్లలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో ఎస్వీకేలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. పిల్లలు, మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టేందుకు కేవలం చట్టాలు సరిపోవనే అభిప్రాయాన్ని ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా సంఘం నేతలు వెల్లడించారు. పోక్సో చట్టంపై పాఠశాలల్లో పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్‌ కౌచ్‌ఫై తమ ఉద్యమం కొనసాగుతుందని శ్రీరెడ్డి, అపూర్వ తెలిపారు. 

19:05 - May 14, 2018

కరీంనగర్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కరీంనగర్‌ జిల్లా ముకుందాలాల్ మిశ్రా భవన్‌లో ఏర్పాటు చేసిన బీఎన్‌ఎఫ్‌ పార్లమెంటరీ స్థాయిలో సమావేశం తమ్మినేని పాల్గొన్నారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ స్థితుగతులతో పాటు భవిష్యత్ కార్యచరణను వివరించారు. రైతు బంధు పథకానికి తాము వ్యతిరేకం కాదన్న తమ్మినేని.. కౌలు, పోడు భూములు సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. 

19:03 - May 14, 2018

కరీంనగర్ : బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. రైతులు ఏ కష్టం లేకుండా పంటలు పండించాలని కేసీఆర్‌ రైతు బంధు పథకం పేరుతో సాయం చేస్తుంటే... ఆ డబ్బుతో రైతులు బీర్లు తాగుతున్నారని ఆరోపించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రైతులకు బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. 

18:53 - May 14, 2018

అమరావతి : పోలవరాన్ని అడ్డుకునేందుకు జగన్‌ ఎన్ని కుట్రలు పన్నినా.. వాటన్నింటిని అధిగమించి ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా కొనసాగుతుండడంతో.. అడ్డుకునేందుకు మళ్లీ కొత్త కొత్త కేసులు వేస్తున్నారన్నారు. జూన్‌ 11 వరకు డయా ఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేస్తామన్నారు దేవినేని. 

18:43 - May 14, 2018

కుమరం భీమ్ : ఈ ఆధునికక యుగంలో కూడా మంత్రాల నెపంతో ప్రాణాలు తీసే ఘటనలకు కొదవ లేకుండా పోతోంది. ఇటువంటి ఘటనే కౌటాల మండలం గిన్నెల మెట్టిలో చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో గంగారాం అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మూఢవిశ్వాలకు అద్దంపడుతోంది. మల్లక్క అనే మహిళ ఆమె కుమారుడితో కలిసి గంగారాం అనే వ్యక్తిని వైర్లతో గొంతునులిమి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఘటనాస్థలికి పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మల్లక్క ఆమె కుమారుడు ఇద్దరు కలిసి ఈ హత్యకు ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో ఒక కుమార్తెకు మానసిక స్థితి స్థిమితంగా వుండదనే విషయం కూడా దర్యాప్తులో బైటపడింది. కాగా ఎంతోకాలంగా విరోధులుగా భావిస్తున్నవారినిక మంత్రాల నెపంతో హత్యలు చేస్తున్న ఘటనలో ఈ ప్రాంతంలో జరుగతున్నట్లుగా సమాచారం. 

కలకలం రేపిన బాలుడి హత్య..

శ్రీకాకుళం : సావరకోట మండలం గుమ్మపాడులో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన ఘటనతో స్థానికంగా కలకలం రేపింది. టీడీపీ నేత అయిన హర్షవర్థన్ అనే ఏడేళ్ల బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా పాతకక్షలతో బంధువులే అపహరించి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ ఆలోచించాలి : ఏచూరి

ఢిల్లీ : బెంగాల్ లో హింసను చూసైనా సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై ఆలోచించుకోవాలని సూచించారు. పంచాయితీ ఎన్నికల్లో 34 శాతం సీట్లకు ప్రతిపక్ష అభ్యర్ధులను నామినేషన్లు కూడా వేయకుండా ఏకపక్షం చేసేసారని ఏచూరి విమర్శించారు. వాటిపైనా..వాటి ఫలితాలపైనా సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలిపారు. పంచాయితీ ఎన్నికలు ప్రకటించిన నాటి నుండి టీఎంసీ దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. సీపీఎం కోసం ఎవ్వరు పనిచేయకూడదని నిర్భంధాలు విధించారనీ..ఈ క్రమంలో సీపీఎం కోసం పనిచేసిన వారిపై దాడులు చేసి హత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగాల్ దాడులకు నిరసనగా సీపీఎం ఆందోళనలు..

ఢిల్లీ : బెంగాల్ లో సీపీఎం కార్యకర్తలపై టీఎంసీ దాడులకు నిరసనగా సీపీఎం పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సీపీఎం జాతీయ అధ్యక్షులు సీతారాం ఏచూరి మాట్లాడుతు..బెంగాల్ లో సీపీఎం కార్యకర్తలపై దాడి, సజీవ దహనం వంటి పలు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు చేపట్టి సమాధానం చెబుతామన్నారు. బెంగాల్ దాడులకు నిరసనగా కోల్ కతాలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు. కాగా పశ్చిమబెంగాల్ లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా టీఎంసీ నేతలు, కార్యకర్తలు సీపీఎం కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు.

17:26 - May 14, 2018

సిద్ధిపేట : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వివాదాస్పందంగా మారింది. తమ పొలంలో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించవద్దు అంటు ఓ మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని చిన్నకోడూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం తమ స్థలంలో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపడతోందనే ఆరోపణలో కొంతమంది రైతులు అడ్డుకున్నారు. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి చిన్నకోడూరు పీఎస్ కు తరలించారు. దీంతో మనస్థాపం చెందిన ఓ మహిళా రైతు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా వుండటంతో చిన్నకోడూరు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

16:57 - May 14, 2018

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును ఆపేసిన ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే ధరలు పెంచేసింది. పెట్రోల్‌ ధర లీటరుకు 17 పైసలు, డీజిల్‌ ధర 21 పైసలు పెంచింది. ఎన్నికల వేళ పెట్రోల్‌ ధరలు పెంచితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందన్న ఉద్దేశ్యంతో పెంపును మూడు వారాల పాటు నిలుపు చేసింది ప్రభుత్వం.

పెట్రోల్‌ ధర లీటరుకు 17 పైసలు పెంపు
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, తగ్గింపులను గత 19 రోజులుగా ఆపేసిన ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఎన్నికల ముగిసిన రెండ్రోజులకే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్‌కు 17పైసలు, డీజిల్‌ ధర లీటరుకు 21పైసలు పెరిగాయి. కొన్ని రోజులుగా అంతర్జాతీయ చమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచకుండా ఉంచారు.

దిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.74.63పైసలు నుంచి రూ.74.80పైసలకు పెంపు
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం.. దిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.74.63పైసలు నుంచి రూ.74.80పైసలకు పెరిగింది. డీజిల్‌ ధర లీటరుకు రూ.65.93 పైసల నుంచి రూ.66.14పైసలకు పెరిగింది.

ఎన్నిక నేపథ్యంలో అగిన పెట్రోల్, డీజిల్ ధరలు
గత ఏడాది జూన్‌ నుంచి చమురు సంస్థలు రోజువారీగా ధరల మార్పులు చేస్తువస్తున్నాయి. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో గత మూడు వారాలుగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో రోజువారీ మార్పుల ప్రభావం ఎన్నికలపై చూపిస్తుందనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు ధరల మార్పును నిలిపేస్తాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా పెరగడంతో పాటు రూపాయి బలహీన పడడంతో కొన్ని రోజులుగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దాదాపు రూ.500కోట్లు నష్టపోయినట్లు అంచనా. 

16:53 - May 14, 2018

కుమురంభీమ్ : రైతుల సంక్షేమం కోసమే కేసీఆర్‌ రైతు బంధు పథకం తీసుకువచ్చారని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం బాబాపూర్‌ గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన లబ్ధిదారులకు రైతు బంధు పథకం కింద చెక్కులను, పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు, తదితరులు పాల్గొన్నారు.

16:47 - May 14, 2018

పశ్చిమగోదావరి : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఏలూరు రూరల్‌ మండలం మాదేవల్లి వద్ద 2 వేల కి.మీ. మైలురాయిని చేరుకుటుంది. మాదేపల్లి వద్ద వైసీపీ నాయకులు ఏర్పాటు చేసని 40 అడుగుల స్థూపాన్ని జగన్‌ ఆవిష్కరిస్తారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:44 - May 14, 2018

నిజామాబాద్ : అమెరికాలో కామారెడ్డి జిల్లా వాసి మృతి చెందాడు. మాచారెడ్డి మండలం అరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి డల్లాస్‌లోని గ్లోబల్‌ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్నేహితులతో ఈతకు వెళ్లి నీటిలో మునిగి శవమై తేలాడు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది. మరో నెల రోజుల్లో స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

16:40 - May 14, 2018

ఢిల్లీ : కులం, మతం, కుటుంబం ఆధారంగా నాయకత్వం నిర్ణయించే అలవాటు బీజేపీకి లేదన్నారు. కర్ణాటకలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ నేత మురళీధర్‌ రావు. ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది సీఎం చంద్రబాబే అన్నారు మురళీధర్. 

16:26 - May 14, 2018

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లోని పంచాయితీ ఎన్నికల్లో జరిగిన హింసపై సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కమిషన్ పట్టించుకోవటంలేదని ఏచూరి ఆవేదనతో విమర్శించారు. బెంగాల్ లో జరుగున్న హింసకు వ్యతిరేకంగా పోరాడతామని ఏచూరి తెలిపారు. కాగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీఎంసీ గూండాలు రెచ్చిపోతున్నాయి. విచక్షణారహితంగా దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తు దాడులకు పాల్పడుతున్నారు. బెంగాల్ లో 58,639 పంచాయతీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 20 వేల స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయ్యింది. ఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లను బెదిరించి వెనక్కి పంపించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 24నార్త్ పరగణాస్, బుర్ద్వాన్, కుచ్ మెహర్, సౌత్ 24 పరగణాస్ జిల్లాలో హింస చోటు చేసుకుంది. సీపీఎం కార్యకర్తలైన దేబుదాస్, ఉషాదాస్ దంపతులను ఇంట్లోనే టీఎంసీ గూండాలు సజీవ దహనం చేయడం కలకలం సృష్టించింది. మొత్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మృతి చెందారు.

ప్రధానిపై మాజీ ప్రధాని ఫిర్యాదు!!

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతలను బెదిరిస్తు మోదీ భయాందోళనలకు గురిచేస్తున్నారనీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు. ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలపై ప్రధానికి హెచ్చరించాలని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతికి కోరారు. ప్రధానిపై మాజీ ప్రధాని ఫిర్యాదు చేసిన ఘటన బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రధమం కావచ్చు.

సునంద పుష్కర్ మృతి కేసులో షార్జ్ షీట్ దాఖలు..

ఢిల్లీ : సునంద పుష్కర్ మృతి కేసులో పాటియాలో కోర్టులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. సునందా పుష్కర్ కేసును కోర్టు మే 24కు వాయిదా వేసింది. కాగా కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ 2014 జనవరి 17న ఢిల్లీ చాణక్యపురిలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు చెందిన 345 గదిలో సునందా పుష్కర్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఈనేపథ్యంలో సునంద మృతిపై పలు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో కేసు విచారణను సిట్ కు అప్పగించగా, శశిథరూర్ పనివాళ్లు నరేన్ సింగ్, డ్రైవర్ బజ్ రంగీ, సన్నిహితుడు సంజయ్ దేవాన్ లు ఒక్కోసారి ఒక్కో విధమైన వాంగ్మూలాలు ఇచ్చారు.

చంద్రబాబుతో అంబానీ..

అమరావతి: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ అమరావతిలోని ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తితో ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనిల్ అంబానీ చర్చించనున్నారు. కాగా క్రీతం పలుమార్లు అనిల్ అంబాని రాష్ట్రానికి విచ్చేసారు. ఏపీ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

15:20 - May 14, 2018

విశాఖ : ఒడిశా తుపాకీలు మరోసారి ఘర్జించాయి. రాష్ట్రంలోని కందమాల్ జిల్లాలో బాదిరంగలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగినకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోలు కూడా వున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

15:19 - May 14, 2018

7గురు మావోలు హతం..

విశాఖ : ఒడిశా తుపాకీలు మరోసారి ఘర్జించాయి. రాష్ట్రంలోని కందమాల్ జిల్లాలో బాదిరంగలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగినకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోలు కూడా వున్నట్లుగా తెలుస్తోంది. 

పంచాయితీ ఎన్నికల్లో టీఎంసీ గూండాగిరి..

పశ్చిమబెంగాల్ : పంచాయితీ ఎన్నికల సంబర్భంగా రాజుకున్న హింస కొనసాగుతునే వుంది. ఉత్తర పరగణాలల్లోకి 24 జిల్లాల్లోని పోలింగ్ బూత్ లపై దాడులు జరిగిన సందర్భంగా ఆ హింస కొనసాగుతోంది. పోలింగ్ బూత్ లను అధీనంలోకి తీసుకున్ని టీఎంసీ నేతలు ఓటర్లను బెదిరించటం, నాటు బాంబులు ప్రయోగించటం, ఇతర ఏజెంట్లపై టీఎంసీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. నాటబరిలో టీఎంసీ మంత్రి రబీంద్రనాథ్ ఘోష్ కు బీజేపీ పోల్ ఏజెంట్ పై చేయిచేసుకున్నందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నందిగ్రాంలో పోలింగ్ బూత్ వద్ద సీపీఎం కార్యకర్త చేతివేలును టీఎంసీ కార్యకర్తలు నరికివేశారు.

కావేరీపై కమిటీ ఏర్పాటు..కేంద్రం సుముఖత..

ఢిల్లీ : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వివాదంగా కొనసాగుతున్న కావేరీ జాలల తీర్పు అమలుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. తీర్పు అమలు సంబంధంచిన ప్రణాళికను కోర్టుకు కేంద్ర జనలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్ అందించారు. తీర్పు అమలుకు సంబంధించి కమిటీ ఏర్పాటుకు కేంద్రం సుముఖతను వ్యక్తంచేసింది. దీంతో తదుపరి విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం 16వ తేదీనికి వాయిదా వేసింది. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ కేంద్ర కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. పార్టీ పటిష్టత, సంస్థాగతంగా పార్టీలో చేయాల్సిన మార్పులు, 2019 ఎఇన్నకలకు సిద్ధం కావటం, ప్రధాని మోదీ నాలుగేళ్ల పాలన, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు అధ్యక్షులు అమిత్ షా నిశానిర్ధేశం చేస్తున్నారు.

రైతుల రాత మారాలన్నదే సీఎం లక్ష్యం : కేటీఆర్

మహబూబ్ నగర్ : భూత్పూర్ లో రైతులకు రైతుబంధు చెక్కులు,పాస్ పుస్తకాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది పాలమూనేనన్నారు. కృష్ణానది పక్కనే వున్నా నదీ జలాలు వాడుకోలేని దుస్థితిలో పాలమూరు జిల్లా రైతులది అని అన్నారు. రైతుల తలరాతలు మారాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమనీ..అందుకోసమే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నామని తెలిపారు. పాలమూరు జిల్లాలో ఆయకట్టు లక్ష నుంచి 7 లక్షల ఎకరాలకు పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో ఏ నాయకుడికి రాని ఆలోచనను, కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. 

దుర్గమ్మ సేవలో అంబానీ..

విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీ దర్శించుకున్నారు. దుర్గమ్మకు అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి చిత్ర పటం, తీర్థప్రసాదాలను ఆలయ పూజారులు పాలకమండలి చైర్మన్, ఈవో అంబానీకి అందజేశారు. 

రైతుబంధు రైతుల కోసమేనా : తమ్మినేని

కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం గత వారం రోజులుగా రైతుబంధు పథకం కింద రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాల జారీలో బిజీ బిజీగా వుంది. ఈ క్రమంలో రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమనీ..రైతులకు టీఆర్ఎస్ పార్టీ చేసినంతగా ఏ ప్రభుత్వం చేయలేదని ఊదరగొడుతోంది. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి స్పందించారు. రైతుబంధు పథకం..రైతుల కోసమా?, భూస్వాముల కోసమా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. కౌలురైతులకు కూడా రైతుబంధు వర్తింపజేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ను ఓడింటమే లక్ష్యం : తమ్మినేని

కరీంనగర్: 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని స్థానాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పోటీచేస్తుందని పేర్కొన్నారు. పొత్తులపై తెలంగాణ జన సమితి అధక్షుడు కోదండరాంతో చర్చలు జరుపుతామని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని తమ్మినేని స్పష్టం చేశారు.

మాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి..

హైదరాబాద్ : మలయాళం ప్రముఖ నటుడు కళాశాల బాబు ఆదివారం రాత్రి ఎర్నాకుళంలో కన్నుమూశారు. గత మూడు నెలలుగా తన అనారోగ్యానికి బాబు తన 68వ ఏట చికిత్స తీసుకుంటు కొచ్చిలోని అమృత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కళాశాల బాబు గత రాత్రి సెలెబ్రల్ హ్యామరేజ్ కారణంగా మృతి చెందారు.

13:37 - May 14, 2018
13:34 - May 14, 2018

ప్రకాశం : జిల్లాలోని ఉలవపాడులో విషాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో భార్య భర్తల నిర్ణయంతో ఆరుగురు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురు పిల్లలు మృతి చెందిన వారిలో ఉన్నారు. సునీల్..రమాదేవి దంపతులకు నలుగురు పిల్లలు. కందుకూరులో జరుగుతున్న వివాహ వేడుకకు వీరు హాజరయ్యారు. అక్కడ భార్య..భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. బంధువులు జోక్యం చేసుకుని సర్ధిచెప్పారు. తిరుగు ప్రయాణంలో ఉలవపాడు రైల్వే స్టేషన్ వద్ద మళ్లీ ఒకసారి వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీనితో పిల్లలతో సహా సునీల్..రమాదేవిలు రైలు కింద పడిపోయారు. మృతదేహాలు చెల్లాచెదురుగాపడి ఉన్నాయి. కల్యాణ్‌, కల్యాణి, ఉష, మరో 8 నెలల చిన్నారిగా మృతులుగా గుర్తించారు. నలుగురు చిన్నారులు చనిపోవడం అందరి హృదయాలను కదిలించింది.

13:27 - May 14, 2018

తూర్పుగోదావరి : జిల్లా అధ్యక్ష పదవి పార్టీలో ముసలం పుట్టింది. సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంపై జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న మాలకొండయ్యతో పాటు పలువురు కాకినాడలో రాజీనామాలు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తుతో పాటు నగర బిజెపి కమిటీ సభ్యులు వారి వారి పదవులకు రాజీనామాలు చేశారు. ఈ విషయంలో బిజెపి అధిష్టానం పునరాలోచిస్తుందని నమ్మకం ఉందన్నారు. 

13:22 - May 14, 2018

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నమ్మకాన్ని నిలబెడుతానని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...గత నాలుగేళ్లుగా ఏపీకి బిజెపి చేసిన సాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతూ టిడిపి ఆడుతున్న నాటకాన్ని బయటపెడుతామని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవి విషయంలో సోము వీర్రాజు అలకపై ఆయన స్పందించారు. పార్టీలో చర్చించి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా వ్యవహరిస్తామని, సోము వీర్రాజు అలక చిన్న విషయమేనన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు చక్కదిద్దుతానని వెల్లడించారు. 

13:16 - May 14, 2018

ఢిల్లీ : భారతదేశంలో భిన్నమైన వాతావరణం కనబడుతోంది. పలు రాష్ట్రాలు ఎండలు మండిపోతుండగా మరికొన్ని రాష్ట్రాల్లో ఈదురుగాలులు..భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ప్రాణ..ఆస్తి నష్టం సంభవిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలపై ప్రకృతి పడగ విప్పుతోంది. రాబోయే 24గంటల్లో పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, అసోం, మేఘాలయ, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. అంతేగాకుండా కర్ణాటక, కేరళ, తమిళనాడులో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇటీవలే దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాణ..ఆస్తి నష్టం సంభవిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈదురుగాలులు..భారీ వర్షాలకు 53 మంది మృతి చెందారు. అత్యధికంగా యూపీలో 39 మంది దుర్మరణం చెందారు. ఏపీలో 9గురు, బెంగాళ్ లో 4గురు ఢిల్లీలో ఒకరు మృతి చెందారు. దీనితో ఈదురుగాలులు..భారీ వర్షాలు కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. ఈ సమయంలో ప్రాణ..ఆస్తి నష్టం జరగుకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మే చివరి నాటికి కేరళకు రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

12:48 - May 14, 2018
12:47 - May 14, 2018
12:19 - May 14, 2018
12:13 - May 14, 2018

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీఎంసీ గూండాలు రెచ్చిపోతున్నాయి. విచక్షణారహితంగా దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. మొదటి నుండి ఇదే పరిస్థితి కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిన అభ్యర్థులపై దాడులు చేయడం..పోటీ చేయాలంటే..ఓటు వేయాలంటే భయం కల్పించే విధంగా ప్రవర్తించారు.

58,639 పంచాయతీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 20 వేల స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయ్యింది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటింగ్ వేయడానికి వచ్చిన వారిని బెదిరించి వెనక్కి పంపించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 24నార్త్ పరగణాస్, బుర్ద్వాన్, కుచ్ మెహర్, సౌత్ 24 పరగణాస్ జిల్లాలో హింస చోటు చేసుకుంది. సీపీఎం కార్యకర్తలైన దేబుదాస్, ఉషాదాస్ దంపతులను ఇంట్లోనే టీఎంసీ గూండాలు సజీవ దహనం చేయడం కలకలం సృష్టించింది. మొత్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మృతి చెందారు.

అధికారిక టీఎంసీ - జమి జిబిక పరిరక్షణ సమితి కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగాయి. భావ్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మీడియా వాహనాన్ని సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి అల్లరిమూకలపై టియర్ గ్యాస్ ప్రయోగించి గాల్లోకి కాల్పులు జరిపారు. 

రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం...

ఢిల్లీ : రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల సమావేశం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

11:13 - May 14, 2018

హైదరాబాద్ : 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 ఏళ్లు సేవలందించాం...తమను అకారణంగా ఉద్యోగాల నుండి తొలగించారు..వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి' అంటూ ఓ హోంగార్డు ఆందోళన చేపట్టాడు. గతంలో 400 మంది హోం గార్డులను తొలగించిన సంగతి తెలిసిందే. వీరికి న్యాయం జరుగకపోతుండడంతో ఓ హోం గార్డు ఖైరతాబాద్ కు చేరుకుని సమీపంలోని భారీ హోర్డింగ్ పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. ఇతని ఆందోళనకు మద్దతుగా 200 మంది హోం గార్డులు ఆందోళన నిర్వహించారు. ఒక్కసారిగా హోం గార్డుల ఆందోళనతో ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది. సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి వీరి సమస్య పరిష్కారమౌతుందా ? లేదా ? అనేది చూడాలి. 

హోర్డింగ్ ఎక్కి హోం గార్డు ఆందోళన...

హైదరాబాద్ : తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ హోం గార్డు హోర్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 ఏళ్ల పాటు సర్వీస్ చేశామని పేర్కొంటున్నారు. 

అభివృద్ధిలో ముందుకెళుతున్నాం - బాబు...

విజయవాడ : కేంద్రంతో విభేదించినా తమిళనాడు, కేరళ అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం నీరు-ప్రగతి, వ్యవసాయంపై సంబంధిత అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయంకృషితో స్థాయిని మెరుగు పర్చుకుంటున్నామని తెలిపారు. 

బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత...

పశ్చిమబెంగాల్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన ఓ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడింది టీఎంసీ కార్యకర్తలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

10:29 - May 14, 2018

నిజామాబాద్ : ప్రేమించానన్నాడు..పెళ్లి చేసుకున్నాడు..ఆ తరువాత ముఖం చాటేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ ప్రియురాలు మౌనపోరాటం..గత రెండు రోజులుగా ఆమె పోరాటం చేస్తున్నా ఎలాంటి చర్యలు లేవు..పైగా ఆమెపైనే దాడి కూడా జరగడం గమనార్హం. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

సదాశివనగర్ మండలం అడ్డూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రవీణ్ రెడ్డి ఎదుట ప్రియురాలు మమత ఆందోళన చేపట్టింది. ప్రేమించి మోసం చేశాడని..వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తాము ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నామని, కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదని బాధితురాలు పేర్కొంటోంది. దీనితో తనకు ప్రవీణ్ రెడ్డి తాళి కూడా కట్టాడని, కానీ కొద్ది రోజుల నుండి ముఖం చాటేశాడని వాపోతోంది. దీనితో ప్రవీణ్ రెడ్డి ఎదుట మౌన పోరాటం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడి బంధువులు మమతపై దాడికి పాల్పడ్డారు. తనకు న్యాయం దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్ డబ్బా పట్టుకుని హెచ్చరిస్తోంది. మహిళకు అన్యాయం జరుగుతున్నా కామారెడ్డి మహిళా పోలీసు అధికారులు స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

పారిపోయిన బాల నేరస్తుల కోసం గాలింపు...

హైదరాబాద్ : సైదాబాద్ లో జువైనల్ హోం నుండి పారిపోయిన బాల నేరస్తుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. 15 మందిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

10:20 - May 14, 2018

హైదరాబాద్ : మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల్, అతని అనుచరులు పీఎస్ లో వీరంగం సృష్టించారు. అత్యాచారయత్నం చేసిన నిందితుడిని స్టేషన్ లోనే చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ సృష్టిస్తోంది. మూడు రోజుల క్రితం మలక్ పేటలో ఆరేళ్ల బాలికపై మహ్మద్ రియాజ్ అత్యాచారయత్నం చేయబోయాడు. ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. సోమవారం పీఎస్ లో పోలీసు ఉన్నతాధికారులు లేని సమయంలో ఎమ్మెల్యే అహ్మద్ బలాల్, అతని అనుచరులు చేరుకున్నారు. నిందితుడు ఉన్న రూంకు చేరుకుని ఎమ్మెల్యే, అతని అనుచరులు చితకబాదారు. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

ఎమ్మెల్యే అహ్మద్ ఓవర్ యాక్షన్...

మలక్ పేట : ఎమ్మెల్యే అహ్మద్, అతని అనుచరులు ఓ నిందితుడిపై చితకబాదారు. మూడు రోజుల క్రితం మలక్ పేటలో ఆరేళ్ల బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేయబోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్ లో ఉన్న నిందితుడిని ఎమ్మెల్యే అహ్మద్ అతని అనుచరులు చితకబాదారు. ప్రజాప్రతినిధి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీఎంసీ ?

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో పంచాయతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బిర్ పరాలోని బూత్ నెంబర్ 14/79లో ఓటు వేయకుండా టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను అడ్డుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

 

09:20 - May 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీకీ కోదండరామ్‌ వీడ్కోలు పలికారు. టీ జేఏసీని వీడుతున్న తరుణంలో చివరిసారిగా ఆయన అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోదండరామ్ రాజీనామాను ఏకగ్రీవంగా ఆమోదించారు. టీ జాక్‌కు చైర్మన్‌గా కొనసాగే అద్భుత అవకాశం కోల్పోతున్నందుకు బాధగా ఉందన్నారు కోదండరామ్.

విద్యార్థులకు పాఠాలు చెప్పే తనను.. సమాజానికి నాయకుడిగా పరిచయం చేసిన తెలంగాణ యాక్షన్ కమిటీకి ప్రొఫెసర్ కోదండరామ్‌ వీడ్కోలు పలికారు. టీ జాక్‌కు శాశ్వతంగా దూరమవుతున్న సందర్భంలో చివరి సారిగా ఆయన అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీజాక్‌ ఛైర్మన్‌ పదవికి కోదండరామ్‌ చేసిన రాజీనామాను ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ర్టంలోని పలు జిల్లాల నుంచి టీ జాక్‌ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించిన కోదండరామ్‌ ప్రస్తుతం ఆ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. టీజేఎస్‌ ఆవిర్భావ సభలోనే తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీకి రాజీనామా చేశారు కోదండరామ్‌. ఈ నేపథ్యంలో హైదారాబాద్‌లోని కోదండరామ్ ఇంటి సమీపంలోని ఓ ప్రైవేట్ పంక్షన్ హల్‌లో టీజాక్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీ జేఏసీ నుంచి టీ జేఎస్‌కు వెళ్తుతున్న వారి రాజీనామాలను ఈ సమావేశంలో ఆమోదించారు.

తెలంగాణ సాధనలో టీ జాక్‌ కీలక పాత్ర పోషించిందన్నారు కోదండరామ్‌. టీ జాక్‌ ఛైర్మన్‌గా పనిచేయడం అద్భుత అవకాశమన్నారు. ఇది తన జీవితంలో మరువలేని అంశమన్నారు. టీజాక్‌ లాంటి సంస్థలు దేశంలో ఎక్కడా లేవన్నారు కోదండరామ్. రాష్ర్టంలో పాలనాపరమైన మార్పు కోసమే తాము జనసమితి పార్టీని స్ధాపించామని చెప్పారు. తనకు ఓ ప్రత్యేక గుర్తింపు నిచ్చిన టీజాక్‌ను వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు కోదండరామ్‌. టీజేఎస్‌ స్థాపన వల్లే టీ జాక్‌కు దూరం కావాల్సి వచ్చిందన్నారు కోదండరామ్. ఇంతవరకూ తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కోదండరామ్‌.. భవిష్యత్తులో టీ జాక్‌తో కలిసి పనిచేస్తామన్నారు.

09:12 - May 14, 2018

విజయవాడ : బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ పదవి కోసం రాష్ట్ర పార్టీలోని పలువురి పేర్లు పరిశీలించిన బీజేపీ అధినాయకత్వం చివరికి కన్నా వైపు మొగ్గు చూపింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా సోము వీర్రాజును నియమించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ చీఫ్‌గా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నాలుగేళ్ల పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు గత నెలలో పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారోనన్న ఉత్కంఠత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం నుంచి సంకేతాలు కూడా అందాయి. అయితే సోము వీర్రాజుపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంటడం, ఆయనకు వ్యతిరేకంగా అధినాయకత్వానికి లేఖలు రాయడంతో పరిస్థితి తారుమారైంది. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఏపీలో నెలకొన్న సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కన్నా లక్ష్మీనారాయణ వైపే అమిత్‌ షా మొగ్గు చూపారు. ఒకవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సమయంలో ఆకస్మికంగా ఈ నియామకం జరిగింది.

బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణను పలువురు నేతలు అభినందించారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని మోదీకి కన్నా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏపీలో బీజేపీ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు. ఏపీ పుర్విభజన చట్టంలోని హామీల అమలు చేయించేందుకు చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు.

నాలుగేళ్ల నుంచి బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. పార్టీలో ఎటువంటి గుర్తింపు లేకుండా పోయిందన్న ఉద్దేశంతో ఇటీవల వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుకున్న అమిత్‌ షా.. కన్నాకు ఫోన్‌ చేసి... బుజ్జగించి, ఇప్పుడు పార్టీ ఏపీ చీఫ్‌గా నియమించారు. అయితే కన్నాకు పార్టీ అధ్యక్షత బాధ్యతలు కట్టబెట్టడం పట్ల బీజేపీలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన కన్నాకు పార్టీ బాధ్యతలు అప్పగించడం పట్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రమేయంలేని కన్నా నియమాకం పట్ల సంఘ్‌ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. 1955 ఆగస్టు 13న గుంటూరు జిల్లా నగరంపాలెంలో జన్మించిన కన్నా.. 1989 నుంచి 2004 వరకు పెదకూరపాడు నుంచి వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.1991-94 మధ్య నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలోక్రీడలు, యువజన సర్వీసులు, సహకార, కార్మిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచి, వైఎస్‌ఆర్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో సహకార, రవాణా, భారీ పరిశ్రమలు, వ్యవసాయ శాఖలు నిర్వహించారు. కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానం... ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు కట్టబెట్టింది.

అజ్ఞాతంలో సోము వీర్రాజు ?

విజయవాడ : ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ అధ్యక్ష పదవి దక్కడాన్ని సోము వీర్రాజు జీర్ణించుకోలేక పోతున్నారని, అధిష్టానం ఆగ్రహంపై ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు వెలువడుతున్నాయి. 

08:23 - May 14, 2018

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణనను బీజేపీ అధిష్టానం నియమించింది. ఇటీవలే కన్నా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో రైతు బంధు కార్యక్రమం కొనసాగుతోంది. అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ), చందూ సాంబశివరావు (టిడిపి), రమేష్ నాయుడు (బిజెపి), తెలకపల్లి రవి(విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

వెస్ట్ బెంగాళ్ లో పంచాయతీ ఎన్నికలు...

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈసందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ల

08:11 - May 14, 2018

రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అత్యాచారాలు జరుగుతుంటే మరోవైపు దారుణ హత్యలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ సర్పంచ్ ను వెంటాడి..వేటాడి నరికిచంపేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో చోటు చేసుకుంది. చందుర్తి మండలం మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్ నూకలమర్రిలో జరుగుతున్న కబడ్డీ పోటీలను తిలకించి రాత్రి వెళుతున్నారు. కాపుగాచిన దుండగులు వెదురుగట్టుకు చేరుకోగానే వేటకోడవళ్లతో శంకర్ పై దాడి చేశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి శంకర్ పరుగులు తీశారు. కానీ దుండగులు వెంటాడి విచక్షణారహితంగా పొడవడంతో శంకర్ అక్కడికక్కడనే చనిపోయాడు. ఈ ఘటనతో మూడపల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహిళతో వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చునని తెలుస్తోంది.  

ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు...

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి 22 వరకు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,20,549 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందుకు 819 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్...

హైదరాబాద్ : నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో పాలిసెట్ కౌన్సెలింగ్ జరుగనుంది. 18వ తేదీ వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, 15 నుంచి 19వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. 

ప్రకాశంలో ఆరుగురు ఆత్మహత్య...

ప్రకాశం : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉలవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో సంఘమిత్ర రైలు కింద పడి ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. 

తిరుమలలో పవన్...

చిత్తూరు : తిరుమలలో నేడు కూడా పవన్ బస చేయనున్నారు. సోమవారం తిరుమల, తిరుపతిలో ఆయన పర్యటించనున్నారు. శెట్టిపల్లె నిర్వాసితులతో ఆయన సమావేశం కానున్నారు. 

07:12 - May 14, 2018

తమ సమస్యలను పరిష్కరించే విషయంలో అటు ప్రభుత్వం.. ఇటు యాజమాన్యం.. చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని తెలంగాణలోని ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వివిధ రకాల సమస్యలపై అన్ని ప్రభుత్వ ఉద్యోగ కార్మిక సంఘాలతో చర్యలు జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వం.... ఆర్టీసీలో మాత్రం ఒక్క గుర్తింపు సంఘాన్నే చర్చలకు పిలవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు.. వారిపట్ల ప్రభుత్వ విధానాలపై టెన్ టివి జనపథంలో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:10 - May 14, 2018

ఐపీఎ‍ల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో గెలిచి.. ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. జోస్‌ బట్లర్‌‌ 94 రన్స్‌చేసి, రాయల్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్, ఎవిన్‌ లూయిస్‌, హార్దిక్‌ పాండ్యా మాత్రమే రాణించారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఫే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టంగా మారాయి.

07:09 - May 14, 2018

విజయనగరం : జిల్లాలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కాడు. సరస్వతి ప్రియుడు శివను పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకోగా... అసలు సూత్రధారి శివ ఎస్కేపయ్యాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న శివను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లా పార్వతిపురం భర్త హత్య కేసులో కీలక నిందితుడు.. శివను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నెల 7న కొంత మంది దుండగులు తన భర్తపై దాడి చేసి, తన బంగారాన్ని కాజేశారని సరస్వతి అనే మహిళ పోలీసులకు తెలియజేసిన విషయం విదితమే. అయితే మర్నాడు కేసు ఊహించని మలుపు తిరిగింది. పథకం ప్రకారం భార్య సరస్వతే కిరాయి గుండాలకు సుపారీ ఇచ్చి భర్త శంకర్రావును చంపించిందని పోలీసులు తెలిపారు. సరస్వతి.. ప్రియుడు శివతో కలిసి శంకర్రావు హత్యకు పథకం పన్నారని పోలీసులు చెప్పారు.

సరస్వతి తనకు ఫేస్‌ బుక్‌లో పరిచయమైన శివ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇంతలో పెద్దలు శంకర్రావుతో ఆమెకు వివాహం నిశ్చయిచడంతో, శివతో కలిసి భర్త హత్యకు ప్లాన్‌ వేసింది. విశాఖపట్నంలో శివకు పరిచయం ఉన్న పాత నేరస్తులు.. సారపల్లి రామకృష్ణ, గోపిలతో శంకర్రావు హత్య విషయం మాట్లాడారు. శంకరావును హత్య చేస్తే తన దగ్గర ఉన్న బంగారాన్ని ఇస్తానని సరస్వతి వారికి తెలిపింది. ముందుగా తన నిశ్చితార్థ ఉంగరాన్ని వారికి ఇచ్చి.. తర్వాత మూడు దఫాలుగా తేజ్‌యాప్‌ ద్వారా 18 వేలు ఇచ్చింది. హత్య తరువాత మిగిలిన బంగారాన్ని ఇస్తానని తెలుపడంతో రామకృష్ణ, గోపిలు.. బంగార్రాజు, కిషోర్‌ అనే మరోఇద్దరితో కలిసి హత్యకు రంగం సిద్ధం చేశారు.

ఈనెల 7వ తేదీన సరస్వతి ఆమె భర్త శంకర్రావు మోటర్‌ వాహన సర్వీసింగ్‌ కోసం పార్వతిపురం వచ్చారు. అయితే వీరిని నిందితులు రామకృష్ణ, గోపి, బంగార్రాజు, కిషోర్‌లు ఆటోలో ఫాలో అయ్యారు. తాము ఏ ప్రాంతంలో ఉన్నామో తెలిసేలా నిందితులకు, సరస్వతి జీపీఎస్ ద్వార లొకేషన్‌ను పంపింది. భార్యభర్తలిద్దరూ తోటపల్లి ఐటీడీఏ పార్కు వద్దకు చేరుకోగానే నిందితులు రామకృష్ణ, గోపి, బంగార్రాజు, కిషోర్‌లు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత తన భర్తపై, తనపై కొంతమంది దాడి చేసి బంగారాన్ని కాజేశారని సరస్వతి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. అయితే సంఘటన తీరును నిశితంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ పాలరాజు..నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశాడు.

సరస్వతిని వివరాలు అడిగి తెలుసుకొని తిరిగి బయలు దేరిన ఎస్పీకి మానపురం వద్ద ఆటోలో నిందితులు తారసపడ్డారు. విషయం ఆరా తీయడంతో అసలు పథకం బయటపడింది. భార్య సరస్వతే ప్రియుడు శివతో కలిసి కిరాయి గూండాలతో భర్తను చంపించిందని వెల్లడైంది. కిరాయి గూండాలు పోలీసులకు దొరకడంతో శివ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసు బృందాలు గాలింపును తీవ్ర చేయడంతో శివ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.

శివ పోలీసులకు దొరకడంతో మరో ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. శంకరావుతో వివాహం ఇష్టం లేని సరస్వతి పెళ్లికి ముందే శంకర్రావు హత్యకు పథకం వేసింది. శంకర్రావు బెంగళూర్‌లో పనిచేస్తుండటంతో అక్కడే అతన్ని మట్టుబెట్టాలని కిరాయి గూండాలతో మాట్లాడింది. అందుకు గాను శివ వారికి 25 వేలు చెల్లించాడు. బెంగళూరులో సరస్వతి ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదు. దీంతో విజయనగరంలో మర్డర్‌ప్లాన్‌ చేసి.. కటకటాల్లో ఊచలు లెక్కిస్తోంది. 

06:43 - May 14, 2018

చిత్తూరు : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుమ‌ల వెంక‌న్న స‌న్నిధిలో భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయారు. శనివారం రాత్రి కాలిన‌డ‌క‌న తిరుమల కొండ ఎక్కిన ప‌వ‌న్‌.. సాధాసీదాగా సామాన్య భ‌క్తుడిగా న‌డుచుకుంటూ వెళ్లారు. ఓ పార్టీకి అధినేతై ఉండి.. ఇలా సాధాసీదాగా వెంక‌న్నను ద‌ర్శించుకోవ‌డంపై ప‌వ‌న్ అభిమానులు సంతోష‌ం వ్యక్తం చేస్తున్నారు. మ‌రో రెండు రోజుల పాటు తిరుమ‌ల కొండ‌పైనే గడపనున్నారు ప‌వన్‌ కల్యాణ్‌.
జ‌న‌సేన అధీనేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ‌నివారం రాత్రి కాలిన‌డ‌క‌న తిరుమల కొండ‌పైకి చేరుకున్నారు. ఆదివారం ఆయ‌న శ్రీవారిని ద‌ర్శికున్నారు. ప‌వ‌న్ సాదాసీదాగా తిరుమ‌ల కొండ‌పైకి వెళ్లడంతో.. అభిమానులు ప‌వ‌న్‌ను క‌లిసి అభివాదం చేశారు. దర్శనం అనంతరం పవన్ ఆలయం వెలుపలకి రాగానే అక్కడికి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని వారించడం భద్రతా సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. అభిమానుల తోపులాటల మధ్యే పవన్ కాన్వాయ్ వద్దకు చేరుకున్నారు. స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని రాజకీయాలు మాట్లాడనని పవన్‌ అన్నారు. తనకు అన్నప్రాశన, నామకరణ౦ శ్రీవారి ఆలయంలోని యోగా నరసింహా స్వామి సన్నిధిలోనే జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా పవన్ బస్సు యాత్ర ప్రారంభించే ముందు స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు శ్రీవారి సన్నిధికి వచ్చారు.

కాలిన‌డ‌క మార్గం గుండా ప‌వ‌న్ నడుచుకుంటూ వెళ్తుండగా.. ప‌లువురు సామాన్య భ‌క్తులు ఆయ‌న‌తో ఫోటోలు తీసుకునేందుకు పోటీప‌డ్డారు. తిరుమ‌లకు వ‌చ్చే వీ.ఐ.పీ భ‌క్తుల‌కు ప్రత్యేక ద‌ర్శన సౌక‌ర్యం ఉన్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం 300 రూపాయాల ప్రత్యేక ద‌ర్శన టికెట్ కొనుగోలు చేసి స్వామీ వారిని ద‌ర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు పవన్‌ను ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. కొండ‌పై మరో రెండు రోజులు బస చేయనున్న పవన్‌కల్యాణ్ మ‌రికొన్ని పుణ్యక్షేత్రాల‌ను ద‌ర్శించుకోనున్నారు. 

06:41 - May 14, 2018

ఢిల్లీ : దేశ రాజధానిలో గాలివానా బీభత్సం సృష్టించింది. దుమ్మూ ధూళితో బలమైన గాలులు వీచాయి. దీంతో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ఢిల్లీ, గురుగ్రామ్‌లో మిట్ట మధ్యాహ్నమే చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడంతో.. 40 విమానాలను దారి మల్లించారు. 72 గంటల పాటు అలర్ట్‌ ప్రకటించారు.

06:39 - May 14, 2018

విజయవాడ : ఉప‌రితల ఆవ‌ర్తనం ప్రభావంతో కురుసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఉరుములు పిడుగుల‌తో కూడిన వ‌ర్షానికి పలుప్రాంతాల్లో ప్రజలు హడలిపోయారు. పిడుగు పాటుకు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మ‌రో రెండు రోజుల పాటు ఉప‌రిత ఆవ‌ర్తన ప్రభావం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ అధికారులు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్రాలోని ప‌లు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రాలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిక‌లు జారీ చేసింది. ఝార్ఖండ్‌ నుంచి ఒడిశా వరకు ఏర్పడిన ద్రోణి వల్ల ఉత్తరాంధ్రాతో పాటు తెలంగాణలోను వర్షాలు కురుస్తున్నాయి..

శ్రీకాకుళం జిల్లాలో గాలివానతోపాటు పిడుగులు ప‌డ‌టంతో వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం సిక్కోలును అతలాకుతలం చేసింది. పిడుగుపాటు వల్ల పాతపట్నం మండలం తిడ్డిమిలో ఇద్దరు, మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం బస్టాండ్‌ వద్ద ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎల్‌.ఎన్‌.పేట మండలం పెద్దకొల్లివలసలో చెరువులో చేపలవేటకు వెళ్లిన యాభై ఐదేళ్ళ అప్పలనర్సయ్య మరణించాడు. జలుమూరు మండలం కరకలస వద్ద యాభై మూడేళ్ళ మత్య్సకారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు హిర మండలం అంబావల్లికి చెందిన బొడ్డేపల్లి రాములుగా గుర్తించారు. పాలకొండ, రేగిడి, వంగర, సంతకవిటి, బూర్జ, పొందూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, జలుమూరు, సంతబొమ్మాళి, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

అటు కాకినాడలోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వ‌ర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. గ‌త వారం రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరైన ప్రజానీకం ఒక్కసారిగా వాతావ‌ర‌ణం చ‌ల్లబడంతో సేదతీరారు. అటు విశాఖ నగరంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

మ‌రోవైపు కడప జిల్లాలో ప‌లుచోట్ల భారీ వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో వీరబల్లె, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం, కరప, బిక్కవోలు, విశాఖ రూరల్‌, విశాఖ అర్బన్‌, రోలుగుంట, చోడవరం, దేవరాపల్లి, విజయనగరం జిల్లా జామి, వేపాడ మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలు, ఉరుములతో కూడిన భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ ప్రకటించింది. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉండటంతో ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. 

06:35 - May 14, 2018

హైదరాబాద్ : పోరాడి సాధించుకున్న తెలంగాణలో కార్మిక రాజ్యం రావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు అన్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటం నిర్వహించిన మున్సిపల్‌ కార్మికులు.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచారని అన్నారు. తద్వారా వేతన పెంపునకు సంబంధించిన సర్క్యులర్‌ను వారు సాధించుకున్నారని అభినందించారు. మున్ముందు పోరాటాలకు మరింత పదును పెట్టాలని ఆయన మున్సిపల్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. దీనికి హాజరైన సాయిబాబు.. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. 

06:34 - May 14, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, వారి ఇబ్బందులన్నీ విన్నామని... రెండు రోజుల్లో వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం టీఎమ్‌యూ నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. ఈ చర్చలకు మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు. ఇక గుర్తింపు సంఘం టీఎమ్‌యూ తరుపున అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డితో పాటు 21 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక వేతన సవరణపై ఎందుకు జాప్యం చేస్తున్నారని కార్మిక సంఘం సభ్యులు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చే వరకు తాత్సారం చేయడం సరికాదని కార్మిక సంఘం స్పష్టం చేసింది.

 

06:31 - May 14, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో డీఎస్‌ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశం టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. డీఎస్‌ మళ్లీ సొంతగూటికి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే కార్యకర్తల ఒత్తిడి మేరకే సమావేశం ఏర్పాటు చేసినట్టు డీఎస్‌ స్పష్టం చేశారు. మరోవైపు కార్యకర్తలు తమకు పార్టీలో ప్రాధాన్యత దక్కడంలేదని డీఎస్‌ దగ్గర మొరపెట్టుకోగా... సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీనిచ్చారు.

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ నిజామాబాద్‌లో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ - రూరల్‌ నియోజకవర్గ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. డీఎస్‌ ముందు కార్యకర్తలు తమ గోడు వెల్లబోసుకున్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యం ఏమాత్రం దక్కడం లేదని మొరపెట్టుకున్నారు. డీఎస్‌ అనుచరులమనే పేరుతో.... తమను పార్టీకి దూరంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తమకు సముచిత స్థానం కల్పించాలని డీఎస్‌ను కోరారు. అలాగే తమ సమస్యలను, ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలు డీఎస్‌కు విన్నవించారు.

నిజామాబాద్‌ మండల జెడ్పీటీసీ సభ్యురాలు పుష్పాల శోభ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీర్మానాలు ప్రవేశపెట్టింది. డీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉండాలని సమావేశంలో తీర్మానించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తల ఇబ్బందులను, సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని మరో తీర్మానం చేశారు. సమావేశం అనంతరం మాట్లాడిన డీఎస్‌.. పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభించేలా చేస్తానని హామీ ఇచ్చారు.

డీఎస్ కార్యకర్తల సమావేశం టీఆర్‌ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. డి.శ్రీనివాస్ తన సొంత గూటికి వెళతారనే ప్రచారం టీఆర్ఎస్‌లో జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్ నేతల్లో డీఎస్ పట్ల అసహనం వ్యక్తం అవుతుంది. అయితే డీఎస్‌ మాత్రం కేవలం కార్యకర్తల ఒత్తిడి మేరకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. డీఎస్ టీఆర్ఎస్‌లో చేరాక ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా సమావేశాన్ని నిర్వహించడంతో టీఆర్‌నేతల్లో కలవరం మొదలయ్యింది.

06:29 - May 14, 2018

కరీంనగర్ : తెలిసీ తెలియనివాళ్లు తమకు తాము సీఎం అని ప్రకటించుకుంటున్నారని తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా సభల్లో చెప్పుకోవడం అత్యుత్సాహం ప్రదర్శించడమే తప్ప ఏమీ లేదన్నారు. కరీంనగర్‌ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. అన్ని సమీకరణాలు ఆలోచించి అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రైతు బంధు సమావేశంలో కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌కు సీఎల్పీ నేత జానారెడ్డి కౌంటరిచ్చారు. తమ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలెన్నో దేశంలో నెంబర్‌ వన్‌గా నిలిచాయని జానారెడ్డి తెలిపారు. 

06:27 - May 14, 2018

మంచిర్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధుకాదని... రాబందు అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రైతుబంధు పథకం ఎన్నికల స్టంటేనని విమర్శించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలురైతులు వారికి రైతుబంధు ఎందుకు వర్తింపచేయలేదని ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కేసీఆర్‌ ఆర్భాటాలకు పోతున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ చేపట్టిన మూడో విడత ప్రజాచైతన్య యాత్ర మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుబంధు పథకం.... ఎన్నికల స్టంటేనని కొట్టిపారేశారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పతకం ఖాయమన్నారు. రైతుబంధునని చెప్పుకుంటున్న కేసీఆర్‌.. రాష్ట్రంలో 3600 మంది రైతులు ఆత్మహత్యచేసుకుంటే ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో సీఎం కేసీఆర్‌ తన ప్రచారాల కోసం ఆర్భాటాలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పంటకు గిట్టుబాటు ధర అడిగిన రైతుల చేతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ కుటుంబం చేసిన త్యాగాలు ఏమీ లేవని ఆయన విమర్శించారు. ప్రజలు రక్తం చిందించి తెచ్చిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

06:24 - May 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ తదితరులు పాల్గొన్నారు. రైతులకు చెక్కులతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా కేటీఆర్‌... రైతులకు పెట్టుబడి సాయం పథకం దేశానికే ఆదర్శమన్నారు.

మెదక్‌ నియోజకవర్గంలో జరిగిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం భగాయత్‌లో జరిగిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామల్లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. ఎంపీ బాల్క సుమన్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పులు ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్ని రైతుకుల చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేమహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో జరిగిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఎంపీ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యే రమేశ్‌ పాల్గొన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు చెక్కుల పంపణీ పథకం అమలు కొసాగుతోంది. 

జగన్..2వేల కిలోమీటర్లు...

పశ్చిమగోదావరి : జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. నేడు ఏలూరు (మం) వెంకటాపురం వద్ద 2వేల కిలోమీటర్ల మైలురాయిని జగన్ చేరుకోనున్నారు. 

వెదర్ న్యూస్....

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఝార్ఖండ్ నుండి ఒడిశా వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 

మాడపల్లి సర్పంచ్ దారుణ హత్య...

రాజన్న సిరిసిల్ల : వేములవాడ (మం) వెదురుగట్టులో మాడపల్లి సర్పంచ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. సర్పంచ్ గోలి శంకర్ ను కత్తులతో పొడిచి చంపారు. 

బొల్లారంలో రోడ్డు ప్రమాదం...

మేడ్చల్ : బొల్లారంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు - బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో శంకర్ (27) మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

మహబూబ్ నగర్ కు కేటీఆర్...

మహబూబ్ నగర్ : నేడు జిల్లాకు మంత్రి కేటీఆర్ రానున్నారు. బూత్పూర్ లో రైతు బంధు కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 

ముంబై పరాజయం...

ఢిల్లీ : ఐపీఎల్ లో ముంబై ఇండియన్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది. ముంబై జట్టు 6వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేయగా ముంబై జట్టు 3 మూడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. 

Don't Miss