Activities calendar

26 June 2018

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..

తిరుమల : టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ దర్శన్ కౌంటర్లను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తిరుమల గోవిందరాజు స్వామి ఆలయంలో గోపురం బంగారు తాపడానికి రూ.32 కోట్లు కేటాయించింది. తిరుమలలలో మరుగు దొడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు, ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్ పనుల కోసం రూ.36కోట్లు, ప్రకాశం జిల్లా దుద్దుకూరు చెన్నకేశవస్వామి ఆలయం సునరుద్ధరణకు రూ.25లక్షలను కేటాయిస్తు టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. అగమ సలహాదారుడిగా రమణదీక్షితులను తొలగిస్తు..పాలక మండలి నిర్ణయించింది.

హేతువాది బాబు గోగినేనిపై కేసు నమోదు..

హైదరాబాద్ : ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై హైదారాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ సమాచారాన్నిబహిర్గతం చేస్తున్నారని, మత విశ్వాసాలను కించ పరచడం, భారత విదేశాంగ విధానానికి ఆటంకం కలిగించేలా విదేశాల మీద విద్వేషకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కేవీ నారాయణ అనే వ్యక్తి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో ఒక మతాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడారని, ప్రైవేట్ కార్యక్రమానికి ఆధార్ నెంబర్ తీసుకోవడంపై హైదరాబాద్ లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బాబు గోగినేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో పోలీసులకు ఊరట..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో పోలీసులకు ఊరట కలిగింది. నయీంకు సహకరించారన్న ఆరోపణలపై గతంలో ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో వారిపై సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంబంధించి రేపు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా గతంతో గ్యాంగ్ స్టర్ నయీంకు సహకరించారనే ఆరోపణలతో అదనపు ఎస్పీ శ్రీనివాస్, ఏసీపీ మలినేని శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ మస్తాలపై సస్పెండ్ చేసి.. మరో 11 మంది పోలీసులకు ఛార్జ్ మెమోలు ఇచ్చింది ప్రభుత్వం.

ఉత్తరాంధ్రలో జనసేనాని విస్తృత చర్చలు..

విశాఖపట్నం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జరుపుతోన్న జన పోరాట యాత్ర విశాఖపట్నంలో తిరిగి ప్రారంభం కాబోతుంది. సోమవారం సాయంత్రం.. మంగళవారం పార్టీ శ్రేణులతో జిల్లా సమస్యలు, పార్టీ నిర్మాణం పై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. కాగా, ఈనెల 27వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఉత్తరాంధ్ర జిల్లాలలకు చెందిన మేధావులతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పవన్ కళ్యాణ్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కె.ఎస్.చలం సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. 

పేదల రక్తాన్ని పీల్చేస్తున్నారు : సోము

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నేత సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదల రక్తాన్ని సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు ఏనుగు తొండాలతో పీల్చినట్టుగా పీల్చుతున్నారని, చంద్రబాబు దోపిడీకి ఆస్కార్ అవార్డు కూడా చాలదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంచి అవినీతికి పాల్పడుతున్న మంత్రి దేవినేని ఉమకు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..భారీగా ఉద్యోగాలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నామని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఉద్యోగాల భర్తీ అంశం చర్చకొచ్చిందని తెలిపారు. మొత్తం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తున్నామని, త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. కాగా, ఈ నెల 28 నుంచి ఏరువాక కార్యక్రమం ఉంటుందని సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పాల్గొంటారని అన్నారు.

'దళిత తేజం' ముగింపు సభ విజయవంతం చేయాలి : కళా

అమరావతి : తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘దళిత తేజం’ ముగింపు సభ ఈ నెల 30న నెల్లూరులో జరుగనుంది. ఈ సభ ముగింపు కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధినేత, చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కళావెంకట్రావు, ఆనందబాబు, జవహర్‌, నారాయణ, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు, ప్రభుత్వ విప్‌ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

ఉక్కు పరిశ్రమ విషయంలో రాజీ ప్రసక్తే లేదు : చంద్రబాబు

అమరావతి : సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..నీతి అయోగ్ సమావేశంలో కేంద్రాన్ని అడగాల్సినవన్నీ అడిగానని తెలిపారు. ఉక్కు పరిశ్రమపై ఎంసీ సీఎం రమేశ్, రవి గట్టిగా పోరాడుతున్నారన్నారు. ఉక్కు పరిశ్రమ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ, వైసీపీ ఒకటే అనటానికి రీసెంట్ గా గాలి జనార్థన్ రెడ్డి మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా బీజేపీ, వైసీపీ పార్టీలు కుట్ర చేస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.

సీఎం చంద్రబాబు నాయుడుకి గుడి..

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హిజ్రాలు ఏకంగా గుడిని కట్టిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో చంద్రబాబు ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి ఈరోజు మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు శంకుస్థాపన చేశారు. హిజ్రాలకు రూ. 1500 పెన్సన్ తో పాటు తెల్ల రేషన్ కార్డును కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబుపై కృతజ్ఞతలో హిజ్రాలు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ నిర్మాణానికి ఎంపీ టీజీ వెంకటేష్, మంత్రి అఖిలప్రియ, స్థానిక నేత అభిరుచి మధులు సహకరిస్తున్నారు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఢిల్లీ : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుళ్ల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,120 ఎస్ఐ పోస్టులు, 8,000 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ జరగనుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ పీఎఫ్ ఎస్ఐ పోస్ట్ కు డిగ్రీ చదివిన వారు అర్హులు. కానిస్టేబుల్ పోస్ట్ కు పదో తరగతి, తత్సమాన అర్హత ఉండాలి. ఎస్ఐ పోస్ట్ కు 20-25 సంవత్సరాలు, కానిస్టేబుల్ పోస్ట్ కు 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ నెల 30వ తేదీ దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ.

11:26 - June 26, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, కడప ఉక్కు పోరాటం, ప్రతిపక్షాల వ్యవహారంపై చర్చ జరుపనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం

గుంటూరు : చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, కడప ఉక్కు ఫ్యాక్టరీ పోరాటం, ప్రతిపక్షాల వ్యవహారంపై చర్చ జరుపనున్నారు. 

11:20 - June 26, 2018

జగిత్యాల : ఐదువందల సంవత్సరాల నుంచి ఓ చెట్టు ఊడలతో ఐదు ఎకరాల్లో వ్యాపించింది. ఈ చెట్టును చూడటానికి ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర దేశాలనుంచి సందర్శకులు వచ్చి వెళ్తుంటారు. అంతగా ప్రాముఖ్యత సాధించుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలోని మర్రి చెట్టు. అయితే ఇప్పుడు ఆ మర్రి చెట్టు కష్టాల్లో ఉంది.
పైడిమడుగులో ఐదు ఎకరాలకు విస్తరించిన మర్రిచెట్టు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామమిది. అయితే ఈ గ్రామ ప్రత్యేకత ఏమిటని జిల్లాలో ఎవరిని ప్రశ్నించినా వచ్చే మొదటి సమాధానం మర్రి చెట్టు.  ఇదిగో ఇదే ఆ మర్రి చెట్టు దశాబ్దాలుగా ఊడలతో ఐదు ఎకరాల్లో వ్యాపించింది. ఈ చెట్టును చూడటానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలనుంచే కాకుండా విదేశీ సందర్శకులు వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కల్గిన ఈ మర్రి చెట్టు ప్రమాదంలో పడింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో.. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఐదు ఎకరాల్లో ఉన్న మర్రి చెట్టు మూడెకరాలకు క్షీణించి పోయింది.                                      
మర్రిచెట్టు పరిస్థితిని చూసి ఆవేదన చెందిన గ్రామస్తులు
దీంతో ఆ మర్రిచెట్టు పరిస్థితిని గ్రామంలో కొందరిని కదిలించింది. ఎన్నో ఏళ్లుగా తమకు నీడను, ఆహ్లాదాన్ని పంచిన ఆ చెట్టును రక్షించుకోవాలని ఆ గ్రామంలో యువకులు నిర్ణయించుకున్నారు. ఇక నుంచి ఆ మహావృక్షానికి సంమృద్ధిగా నీరు అందించాలని అనుకున్నారు.
బోరు వేయించి నీటిని ప్రతి వేరుకు అందెట్టు డ్రిప్‌ బిగించారు..  
ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన వారితో పాటుగా... ఆ చెట్టును చూడానికి వచ్చే వారితో వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి ఆ చెట్టు పరిస్థితిని వివరించారు. ఈ చెట్టుపై ఉన్న అభిమానంతో సుమారు 200 మంది తమకు తోచిన సహాయాన్ని అందించారు. సుమారు 3 లక్షల రూపాయలు విరాళంగా పోగయ్యాయి. వీటితో చెట్టు దగ్గర్లో బోరు వేయించి దాని ద్వారా వచ్చే నీటిని 3 ఎకరాల్లో ఉన్న ప్రతి వేరుకు అందెట్టు డ్రిప్‌ను బిగించారు. డిప్‌ పైపులు చెట్టు మొత్తానికి అందేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఊడలను రక్షించేందుకు చుట్టు వలయం ఏర్పాటు చేశారు. 
మళ్లీ చిగురించిన మర్రి చెట్టు కొమ్మలు  
నీళ్లు సమృద్ధిగా అందటంతో.. మరిన్ని ఊడలు పెరుగుతాయని చెట్టు విస్తీర్ణం పెరుగుతుందని యువకులు చెబుతున్నారు. ఇదే కాకుండా ఎన్ ఆర్ ఐ గ్రూప్‌లో ఉన్న 200 మందిలో ఎవరు వచ్చినా ఓ మొక్కనాటాలి అని తీర్మానం చేసుకున్నారు. ఏది ఏమైన ఈ చెట్టెకున్న అభిమానుల కారణంగా ఎండిపోతున్న ఈ మర్రి చెట్టు కొమ్మలు మళ్లీ చిగురిస్తున్నాయి. 

 

11:11 - June 26, 2018

గుంటూరు : కాసేపట్లో చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, కడప ఉక్కు పోరాటం, ప్రతిపక్షాల వ్యవహారంపై చర్చ జరుపనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. 

 

కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

గుంటూరు : కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, కడప ఉక్కు పోరాటం, ప్రతిపక్షాల వ్యవహారంపై చర్చ జరుపనున్నారు. 

ఆటో, కారు ఢీ...ఒకరి మృతి

జోగులాంబ గద్వాల : జిల్లాలోని ఉండవల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవల్లి నుంచి వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు ఇసుక రవాణా

నల్లగొండ : జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తున్నారు. ఆర్ ఐ గోపరాజు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఎమ్మార్వో కార్యాలయంలో గోపరాజుపై నారాయణ అనే వ్యక్తి దాడికి దిగాడు. నారాయణపై గోపరాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 

08:37 - June 26, 2018

విశాఖ : బీకామ్‌లో ఫిజిక్స్‌ ఉందని వాదించిన  ఓ ఎమ్మెల్యే తెలివికి ప్రజలంతా నవ్వుకున్నారు. అయితే.. మేమేమీ తక్కువ తినలేదని ఓ యూనివర్సిటీ నిరూపించింది. బీఎస్సీ విద్యార్థికి బీకామ్‌ పట్టా ఇచ్చి నిర్వాకాన్ని బయటపెట్టింది. ఇంతకు ఏ యూనివర్సిటీ.. ఏమిటా కథా.. ఇప్పుడు చూద్దాం. 

ఆంధ్ర విశ్వవిద్యాలయం... చెప్పుకోవడానికి దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం. కానీ తీరులో మాత్రం గందరగోళంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి వ్యవహారంలో యూనివర్సిటీ చేసిన నిర్వాకం చూస్తే ప్రజలంతా ముక్కున వేలేసుకునేటట్లు ఉంది. 

గతంలో ఓ ఎమ్మెల్యే బీకామ్‌లో ఫిజిక్స్‌ ఉందని వాదించినట్లుగానే... ఆంధ్రా యూనివర్సిటీ బీఎస్సీ విద్యార్ధికి బీకామ్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. దీంతో మూడేళ్లుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. శ్రీహరి 2015లో టెక్కలి బీఎస్ ఆండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చేశాడు. కానీ... ఫలితాల అనంతరం యూనివర్సిటీ అధికారులు బీకామ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. 

యూనివర్సిటీ చేసిన తప్పిదానికి శ్రీహరి మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. యూనివర్సిటీ అధికారులు చేసిన తప్పిదానికి తాను శిక్ష అనుభవిస్తున్నానని... ఉద్యోగాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నానని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  పోటీ పరీక్షల్లో అర్హత సాధించినా... సర్టిఫికెట్‌లో తప్పు ఉండడం వల్ల ఉద్యోగావకాశాలు కోల్పోయినట్లు తెలిపాడు. 

ఇంకా తనలాంటి బాధితులు చాలామంది ఉన్నారంటున్నాడు శ్రీహరి. యూనివర్సిటీ అధికారులు చేసిన తప్పులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్ధులంటున్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి తమ సర్టిఫికెట్లలోని తప్పులను సరిదిద్దాలని కోరుతున్నారు. 

ఫిఫా ప్రపంచకప్ లో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా నేడు పలు మ్యాచ్ లు జరుగనున్నాయి. రాత్రి 7.30 ఆస్ట్రేలియాతో పెరూ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు డెన్మార్క్ తో ఫ్రాన్స్ ఢీకొట్టింది. రాత్రి 11.30 గంటలకు నైజీరియాతో అర్జెంటీనా తలపడనుంది. 

 

నేడు 199వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

తూ.గో : నేడు 199వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది. నేడు దేవరలంక, పేరూరు, కొంకపల్లిలో జగన్ పాదయాత్ర చేయనున్నారు. అమలాపురంలో సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేక ఉత్సవాలు

హైదరాబాద్ : శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేక ఉత్సవాలు నేటితో ముగియనుంది. నేడు స్వర్ణ కవచంతో భక్తులకు శ్రీవారు దర్శనమివ్వనున్నారు.

 

08:09 - June 26, 2018

హైదరాబాద్ : కోదండరామ్‌ దూకుడు తగ్గించారా..? పార్టీ ఆవిర్భావ కాలం నాటి పంచుల్లో పవర్‌ ఎందుకు తగ్గింది..? కేసీఆర్‌ను గద్దె దింపుతాం అంటూ హూంకరించిన కోదండరాం  మెత్తబడ్డారా..?  టీజేఎస్‌లో అందరూ ఉద్యమ నేతలే ఉన్నా.. గులాబీపార్టీని టార్గెట్‌ చేయడంలో విఫలం అవుతున్నారా..? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు దీనిపైనే  హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. 
గులాబీపార్టీపై విమర్శలు సంధించడంలో టీజేఎస్ వెనుకంజ? 
అధికారం సాధ్యం కాకపోయినా .. అధికారపార్టీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చని గులాబీపార్టీకి గుణపాఠం చెబుతాం అని టీజేఎస్‌ అధినేత కోదండరాం పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. కాని ఇపుడు ఆమాటల్లో వాడి తగ్గినట్లు కనిపిస్తోంది. గులాబీపార్టీపై విమర్శలు సంధించడంలో కోదండరాం పార్టీ వెనుకంజ వేస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
తొలినాటి ఉత్సాహం కనిపించడంలేదని కామెంట్లు 
పార్టీ అధ్యక్షుడు కోదండరాం మాత్రమే అప్పుడప్పుడు అధికారపార్టీని టార్గెట్‌ చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నా.. మిగతా నాయకత్వంలో మాత్రం స్తబ్దత నెలకొంది. ఓ వైపు కాంగ్రెస్‌, ఇతర విపక్షపార్టీలు కారు గుర్తు పార్టీని టాప్‌గేర్‌లో ఏకిపారేస్తున్నాయి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం అంటూ.. జేఏసీని వదిలి..సొంతపార్టీ పెట్టిన కోదండరాం టీమ్‌లో మాత్రం తొలినాటి ఉత్సాహం కనిపించడంలేదనే కామెంట్లు వస్తున్నాయి. పార్టీ ఆవిర్భవించి నెల‌లు కావ‌స్తోంది. అయినా కేసీఆర్‌ ప్రభుత్వ పని తీరును ఎండగట్టడంలో తమ పార్టీనేతలు విఫలం అవుతున్నారని టీజేఎస్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.   
టీవీ డిబేట్లలో సైతం టీజేఎస్‌ వాయిస్‌ లోగానే ఉంది... 
ఇక పార్టీగళాన్ని గట్టిగా వినిపించే వేదికలయిన టీవీ డిబేట్లలో సైతం టీజేఎస్‌ వాయిస్‌ లోగానే ఉంది. పార్టీ ఏర్పాటు చేసిన టి.వి డిబెట్ ప్యాన‌ల్ అపుడపుడు మాత్రమే గళం విప్పుతోంది. ఒక్కరిద్దరు  త‌ప్ప.. మిగిలిన వారు అధికారపార్టీని సూటిగా టార్గెట్‌ చేయలేక పోతున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. పానల్‌లో ఉన్న ఓ మహిళా అడ్వొకేట్‌ తాను టీవీ బేట్‌లో పాల్గొనబోనని కోదండరామ్‌కే చెప్పేయడం విశేషం. 
ఉద్యమ పార్టీకి  ఉద్యమనేతలే ప్రత్యర్థులు 
టీజేఎస్‌ ఆవిర్భావంతో ఉద్యమ పార్టీకి  ఉద్యమనేతలే ప్రత్యర్థిగా మారారని.. దీంతో   తెలంగాణ పాలిటిక్స్‌ ఇక  రసవత్తరంగా నడుస్తాయని రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగింది. అయితే పార్టీ  అధ్యక్షుడు కోదండరామం సైతం.. విద్యార్థులకు పాఠాలు చెప్పినట్టే మెతక ప్రసంగాలు చేస్తున్నారని టీజేఎస్‌ క్యాడర్‌ నుంచే  కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఢీ అంటే ఢీ అనే రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఘాటైన ప్రసంగాలతో అధికారపార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాల్సిన టీజేఎస్‌ నేతలు...ఇలా చప్పటి మాటలతో నీళ్లు నములు తున్నారని  కేసీఆర్‌ వ్యతిరేకుల్లో అసంతీప్తి వ్యక్తం అవుతోంది. 
రసకందాయంలో రాష్ట్ర రాజకీయాలు 
వాస్తవానికి పార్టీ బలోపేతానికి అహరహం కృషి చేస్తున్న కోదడంరాం.. యువతను టీజేఎస్‌ వైపు ఆకర్షించడంలో కొంత సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. కాని మరో ఏడాదిలోనో అంతకంటే ముందుగానో ఎన్నికలు తరముకొస్తున్న తరుణంలో చప్పటి ప్రసంగాలు కేడర్‌లో ఉత్తేజం నింపలేక పోతున్నాయి. ఓ వైపు ముందస్తు ఎన్నికలు అంటూ గులాబీదళపతి సవాళ్ళు విసురుతున్నారు. మేం రెడీ అంటూ అటు కాంగ్రెస్‌ కూడా ప్రతి సవాళ్లు విసురుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఈసమయంలో కోదండరాం తన క్లాస్‌ ప్రసంగాలకు కొంత మాస్‌టచ్‌ ఇవ్వాలని టీజేఎస్‌ కేడర్‌ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని కొందరు పార్టీ నేతలు కోదండరాం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు కూడా సమాచారం. ఇప్పుడు కోదండరామ్‌ ఎలా స్పందించనున్నారన్న ప్రశ్న సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. 

 

07:41 - June 26, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్సకు హైకమాండ్‌ శ్రీకారం చుట్టింది. పార్టీలో చెలరేగుతున్న అసంతృప్తులకు కళ్లెం వేస్తూనే... పార్టీని రాబోయే ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. దీనికోసం కొత్తగా నియమించిన ముఖ్యులకు పనివిభజన చేసింది. క్యాడర్‌ను పరిగెత్తించేందుకు యాక్షన్‌ప్లాన్‌ రెడీ చేసింది.
టీకాంగ్రెస్‌పై దృష్టి సారించిన హైకమాండ్‌
తెలంగాణలో కాంగ్రెస్‌పై ఆపార్టీ హైకమాండ్‌ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసింది. పార్టీలోని నేతల మధ్య వివాదాలను ఆలస్యం చేయవద్దని డిసైడ్‌ అయ్యింది. పూర్తిస్థాయిలో ట్రీట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. 
కాంగ్రెస్‌ యాక్షన్‌ప్లాన్‌
ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదు. ఇప్పటి నుంచి పార్టీ క్యాడర్‌ను పరుగులు పెట్టిస్తేనే ఎన్నికల్లో విక్టరీ కొట్టవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇందుకోసం నేతలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే హైకమాండ్‌ ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్‌కు అదనంగా రాష్ట్రానికి మరో ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు పని విభజన చేసింది. గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో  దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించింది. కొత్తగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శలు బోసురాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, సలీమ్‌ అహ్మద్‌లు ముగ్గురికి సమాన బాధ్యతలు అప్పగించింది.
పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి నివేదిక అందజేయనున్న నేతలు
ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, మెదక్‌, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాలు, ఆ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు. మరోకార్యదర్శి సలీమ్‌ అహ్మద్‌కు మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, నల్లగొండ, భువనగిరి, మహబూబాబాద్‌, ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గాలను అప్పగించారు.  ఇక మూడో కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌కు ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కేటాయించారు.  ఈ ముగ్గురూ తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఆశావహుల పనితీరు, పార్టీకి చేసే సేవలు, ఆ నాయకుడికి ప్రజల్లో ఉండే ఆదరణ, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై దృష్టి సారిస్తారు. ఓ నివేదిక తయారు చేసి అధిష్టానానికి రిపోర్ట్‌ చేస్తారు.
నేతల మధ్య విభేదాలపైనా దృష్టి సారించిన అధిష్టానం
నేతల మధ్య విభేదాలపైనా అధిష్టానం దృష్టి సారించింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన చోట నేతల మధ్య విభేదాలు తీవ్రంగా వస్తున్నాయి. నాగం రాకతో.. దామోదరరెడ్డి పార్టీని వీడారు. ఉత్తమ్‌కు... డీకె  అరుణకు మధ్య విభేదాలు పీక్‌కు చేరగా.. కోమటిరెడ్డి వర్సెస్‌ ఉత్తమ్‌కు ఇప్పటికే గొడవ ఉండనే ఉంది. పాలమూరులోని మరికొన్ని నియోజకవర్గాల్లో చేరికలపై ఉత్తమ్‌కు, జిల్లా నేతల మధ్య అభిప్రాయ బేధాలు కొనసాగుతున్నాయి. ఇదే విధంగా కరీంనగర్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాలో నేతల మధ్య పంచాయితీలు ఉన్నాయి. వీటన్నిటికి చెక్ పెట్టేందుకు ఓ కమిటీ వేయాలని పార్టీ భావిస్తోంది. ముందస్తు ఎన్నికలు తరుముకు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టించడం.... మరోవైపు నేతల మధ్య ఉన్న కీచులాటలకు బ్రేకులు వేయాలన్న ద్విముఖ వ్యూహంతో అధిష్టానం ముందుకెళ్తోంది. మరి ఈ ప్లాన్‌ మేరకు వర్కవుట్‌ అవుతుందో వేచి చూడాలి.
 

 

07:36 - June 26, 2018

హైదరాబాద్ : తెలంగాణలో గులాబీ పార్టీ విపక్షాలపై మరోమారు ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను ఇస్తూనే... విపక్షాలను మరింత ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేసేందుకు అడుగులు వేస్తోంది. విపక్షాల్లోని బలమైన నేతలను కారెక్కించుకుంటూనే... ప్రతిపక్షాలపై విమర్శల దాడిని ముమ్మరం చేసింది. ముందస్తు ఎన్నికలంటూ పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది.

టీఆర్‌ఎస్‌ విపక్షాలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రాన్ని మరోసారి బయటకు తీసింది. విపక్షాల్లోని బలమైన నేతలను తన పార్టీలో చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ విపక్షాలను డైలమాలో వేసే విధంగా వ్యూహాలు రచిస్తోంది.  ఇప్పటికే టీడీపీని ఆపరేషన్‌ ఆకర్ష్‌తో తీవ్రంగా దెబ్బతీయగా... ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ బాస్‌ దృష్టి సారించారు.  కాంగ్రెస్‌లో బలమైన నేతలుగా గుర్తింపు పొందిన నేతలపైనే టీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అయినా... మాజీలు అయినా.. కారెక్కితే వారు కోరుకున్న స్థానాలను కేటాయిస్తామన్న హామీలు ఇస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌నేత దానం నాగేందర్ కారెక్కడంతో.. మరింత మంది కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలను ఇస్తోంది. 

రాజకీయంగా అనుభవం ఉన్న నేతలపై గులాబీ దళపతి ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు ఝలక్‌ ఇచ్చేందుకు స్కెచ్‌ వేశారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కారెక్కుతారన్న ప్రచారం అధికారపార్టీలో జరుగుతోంది. ఓవైపు రాజకీయంగా బలమైన నేతలను కారెక్కించుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్‌పై విమర్శల దాడిని అధికారపార్టీ నేతలు పెంచుతున్నారు.
 
తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో నేతలు చేరుతున్నారని ఎంపీ కవిత అంటున్నారు. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మరింత మంది సిద్ధమవుతున్నారని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళితే తాము మరోసారి అధికార పగ్గాలు  దక్కించుకోవడం ఖాయమన్న ధీమా గులాబి నేతల్లో కనిపిస్తోంది.

07:34 - June 26, 2018

హైదరాబాద్ : గులాబీ దళపతి సవాల్‌కు కాంగ్రెస్‌ నేతలు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా తాము కూడా రెడీ అని తేల్చి చెప్పారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ అన్నారు. ఆ ఓటమి భయంతోనే కేసీఆర్‌ ఇతర పార్టీల నేతలను చేరదీస్తున్నారని  తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా విమర్శించారు.  

ముందస్తుకు సిద్ధమా అన్న కేసీఆర్‌ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎపుడు ఎన్నికలు జరిగినా తాము రెడీ అని ప్రకటించారు. ఓటమి భయంతోనే గులాబీపార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని  ఉత్తమ్‌ అన్నారు. 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌పార్టీ నియంతృత్వ పాలన కొనసాగిస్తోందని టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. కేసీర్‌ పాలనతో ప్రజలు విసిగి పోయారని, ఎపుడు ఎన్నికలు వచ్చినా దుష్టపాలనకు చరమగీతం పాడుతారని అన్నారు. దానం నాగేందర్‌ పార్టీ నుంచి వెళ్లిపోవడం బాధాకరమే అయినా.. కాంగ్రెస్‌పార్టీలో నాయకులకు కొదవలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత దక్కుతోందన్నారు. దానం నాగేందర్‌ కేసీఆర్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. 

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా.. కొత్తగా నియమించిన ఏఐసీసీ కార్యదర్శులతో భేటీ అయ్యారు.  రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషిచేయాలని నిర్దేశం చేశారు. ఒక్కో ఏఐసీసీ  కార్యదర్శి 5 లేదా 6 పార్లమెంటు స్థానాలకు ఇంచార్జ్‌లుగా ఉంటారని కుంతియా ప్రకటించారు. గెలుస్తామనే నమ్మకం లేకనే కేసీఆర్‌ వేరే పార్టీ నాయకులను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటున్నారని  విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను  ఎదుర్కోడానికి తాము అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలు ఎపుడొచ్చినా  టీఆర్‌ఎస్‌ను ఢీ కొడతామని కుంతియా అన్నారు. మొత్తానికి టీఆర్‌ఎస్‌ అధినేత ముందస్తు ఎన్నికల సవాల్‌కు హస్తం పార్టీ నేతలు దీటుగానే కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక నుంచి పార్టీ నాయకులు చేజారకుండా  కాంగ్రెస్‌ అధినాయకత్వం వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో బీసీ నేతలను కూల్ చేసేందుకు టీపీసీసీకి ఢిల్లీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

నేడు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

అమరావతి : ఉదయం 10 గంటలకు చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తాజా పరిణామాలు, కడప ఉక్కు పోరాటం, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీల వ్యవహారంపై చర్చించనున్నారు. మంత్రులు, ఎమ్మేల్యులు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

Don't Miss