Activities calendar

03 September 2018

21:45 - September 3, 2018

మధ్యప్రదేశ్ : రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీపై మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నా రక్తాన్ని తాగాలన్నంత ఆగ్రహంతో వుందని వ్యాఖ్యానించారు. కాగా సిధి జిల్లాలోని చుర్హాత్ లో జన్ ఆశీర్వాద్ యాత్ర జరుగుతుండగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై చౌహాన్ స్పందిస్తూ..కాంగ్రెస్ పార్టీ తన రక్తం తాగాలన్న దాహంతో ఉందని, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భావజాల పరమైన పోరాటాలు మాత్రమే ఇప్పటివరకు జరిగాయి కానీ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించుకునేవని, ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షనేత అజయ్ సింగ్ నిజంగా బలమైన నేత అయితే ప్రత్యక్షపోరుకు రావాలని సవాల్ విసిరారు. తాను శారీరకంగా బలంగా లేను కానీ, ఇలాంటి చర్యలకు మాత్రం తలొగ్గనని, రాష్ట్ర ప్రజలంతా తనతో ఉన్నారని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.

21:06 - September 3, 2018

తిరుమల : తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుడు ప్రపంచవిఖ్యాతి గాంచాడు. ఆయన విషయంలో ఏం జరిగినా సంచలనమే. శ్రీవారి సేవలు..ఆయన ఆదాయం...నగలు ఇలా ప్రతీదీ శ్రీవారి సంచలనమే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా శ్రీవారి నగల విషయంలో వివాదాస్పద వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆపద మొక్కులవాడి సన్నిధి ఎంతటి రమ్యంగా వుంటుందో..ఆయన విషయంలో వివాదాలు, సంచలనాలకు లోటు లేకుండా పోతోంది. ఈ క్రమంలో శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన నగలు మాయమయ్యాయన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నవే. ఈ వివాదంపై కేంద్ర సమాచార కమిషన్ స్పందించింది. శాసనాల్లో ఉన్న నగలకు, ప్రస్తుతం ఉన్న నగలకు మధ్య పొంతన లేదని ఆర్కియాలజీ డైరెక్టర్ సైతం చెప్పారంటూ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ తాజాగా వెల్లడించడంతో శ్రీవారి ఆభరణాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

శ్రీవారి నగల విషయంలో ప్రభుత్వాలతో పాటు టీటీడీ జవాబుదారీగా ఉండాలని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ సూచించారు. ఈ వివాదంపై కేంద్ర సమాచార కమిషన్ సెప్టెంబర్ 28న తుది విచారణ జరపనుంది. శ్రీవారి ఆలయం విషయంలో ప్రజలకు వచ్చే సందేహాలను, అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత టీటీడీతో పాటు ప్రభుత్వాలపై కూడా ఉందన్నారు. మరి ఈ విషయంలో టీటీడీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తాయో చూడాలి.

20:47 - September 3, 2018

రోజురోజుకు కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఈరోజు వున్న టెక్నాలజీ రేపటికల్లా పాతదైపోతోంది. సినిమా రంగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు టెక్నాలజీలో రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు మూకీ సినిమా చూడటం పెద్ద సంబరంగా వుండేది. తరువాత మాటలు..ఆ తరువాత రంగులు..స్పోపు, స్పెషల్ ఎఫెక్ట్స్, 70ఎంఎం,బిగ్ స్క్రీన్ ఇలా సినిమా తెర టెక్నాలజీతో అభిమానులను అకట్టుకుంటు మనసులను దోచుకుంటోంది. ఇప్పుడు తాజాగా మరో అద్భుతం కళ్లముందు ఆవిష్కరించబడింది.

ఇప్పటి వరకూ టెలివిజన్ రంగానికే పరిమితమైన ఎల్‌ఈడీ టెక్నాలజీ, సినిమా థియేటర్ లకు వచ్చేసింది. దీంతో సినిమా థియేటర్లలో మరింత ప్రకాశవంతమైన చిత్రాన్ని కళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే వీలు కలుగుతుంది. ఇండియాలో తొలి ఎల్ఈడీ థియేటర్, న్యూఢిల్లీలోని పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌ లో ప్రారంభమైంది. శాంసంగ్‌ సంస్థ సహకారంతో ఈ స్క్రీన్ ఏర్పాటైంది. మరింత స్పష్టమైన చిత్రంతో పాటు ధ్వని కూడా అద్భుతంగా ఉంటుందని పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ బిజ్లి చెప్పారు. ఎల్‌ఈడీ తెరకు ప్రొజెక్టర్‌ అవసరం ఉండదు. సాధారణ థియేటర్లలో సినిమా నడుస్తుంటే, లైట్లు ఆర్పివేస్తారన్న సంగతి తెలిసిందే. ఎల్ఈడీ థియేటర్ లో లైట్లు వెలుగుతూ ఉన్నా సినిమా చూసేందుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఈ స్క్రీన్ ఏర్పాటుకు రూ. 7 కోట్లు ఖర్చు అయిందని, ప్రపంచంలో ఇప్పటివరకూ 12 థియేటర్లలో ఈ తరహా ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశామని శాంసంగ్ వెల్లడించింది.

20:09 - September 3, 2018

హైదరాబాద్ : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని తత్వవేత్తలు చెప్పిన మాట అక్షరసత్యాలుగా మన కళ్లముందు కనిపిస్తున్నాయి. భర్త చనిపోతే బీమా డబ్బులు వస్తాయనే ఆశతోను..సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తున్న భర్త ఉద్యోగం వస్తుందనే దురాశతో కాసుల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పైగా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. పోస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న కేస్యా నాయక్‌ మొదటి భార్యతో బిడ్డలు శైలజ అనే యువతిని రెండ వివాహం చేసుకున్నాడు.

భర్తపై కేసు పెట్టిన పద్మ..
ఈ విషయం తెలిసిన పద్మ.. కేస్యా నాయక్ ను వేధించేందుకు రెండో వివాహాన్ని సాకుగా చేసుకుని తనకు తెలికుండా రెండవ విహాం చేసుకున్నాడని తనకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తు నల్గొండ త్రిపురామ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఇలా ఎనిమిదేళ్ల నుంచీ భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో గత మూడేళ్ళ క్రితం కారు కొన్న కేస్యా వినోద్‌ అనే వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నాడు.ఈ నేపథ్యంలో పద్మ.. భర్తను హత్య చేసేందుకు డ్రైవర్‌ వినోద్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుంది. ముందుగా రూ.15 వేలను అడ్డాన్స్ గా కూడా ఇచ్చింది. ఆగస్టు 31న వినోద్‌ కేస్యానాయక్‌‌ను రాత్రి 10:30 గంటలకు ఎల్బీనగర్‌ చౌరస్తాలో కారు ఎక్కించుకుని గుర్రంగూడ సమీపంలోని ఓ బార్‌కు వెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి మద్యం తాగారు. తిరిగి రాత్రి 12:30 గంటలకు బయల్దేరారు. కొద్ది దూరం ప్రయాణించిన తరువాత కారులోనే కేస్యానాయక్‌‌ను వినోద్‌ గొంతు నులిమి చంపేశాడు. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు 100 కి.మీ.ల వేగంతో వెళ్లి కారు ఎడమ వైపు స్తంభానికి ఢీకొట్టించాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలూ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి డ్రైవర్‌ వినోద్ ను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్‌, పద్మలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తాం : చంద్రబాబు

అమరావతి : పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం చంద్రబాబు మాట్లాడుతు..రాబోయే రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. వంశధార-నాగావళి నదుల అనుసంధానం పనులను ఈ ఏడాది చేపట్టనున్నామని, రాయలసీమలో ఈ ఏడాది 60 శాతం లోటు వర్షపాతం నమోదైందని, అయితే, ప్రభుత్వ చర్యల వల్ల ఇవాళ అన్ని జలాశయాల్లో నీళ్లు ఉన్నాయని, అన్ని జలాశయాల్లో 600 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, దూరదృష్టితో ఆలోచించి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశామని చంద్రబాబు అన్నారు.

పూర్తయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలకు కృషి : చంద్రబాబు

అమరాతి : పూర్తయిన ప్రాజెక్టులకు వరుస ప్రారంభోత్సవాలు జరిపేలా కసరత్తులు ప్రారంభించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెండింగ్ లో ఉన్న 57 ప్రాజెక్టులలో 10 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో 5 ప్రాజెక్టుల నిర్మాణం తుది దశలో ఉన్నాయని అధికారులు తనకు తెలియజేశారని పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై అమరావతి నుంచి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఈ వివరాలను తెలిపారు.

2కోట్ల ఎకరాలకు నీరివ్వటమే లక్ష్యం : చంద్రబాబు

అమరావతి : రెండు కోట్ల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో పని చేయాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై అమరావతి నుంచి ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17 నుంచి వారానికో ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

18:37 - September 3, 2018

బుల్లి తెరపై వచ్చే షో సూపర్ డూప్ హిట్ సాధిస్తున్నాయి. ఓ ఛానల్ లో టెలీకాస్ట్ అవుతు..బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన 'జబర్దస్త్' కామెడీ స్కిట్ షోలో సుపరిచితుడైన గాలిపటాల సుధాకర్ కు డాక్టరేట్ వచ్చింది. తమిళనాడుకు చెందిన కోయంబత్తూర్‌ రాయల్‌ అకాడమి ఆర్ట్స్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ను ప్రకటించింది. కళారంగంలో దేశవ్యాప్తంగా సుమారు ఐదు వేలకు పైగా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చినందుకుగాను గుర్తింపుగా సుధాకర్ కు డాక్టరేట్ లభించింది. 8వ తేదీన దుబాయ్‌ లో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈ డాక్టరేట్‌ ను సుధాకర్ కు కోయంబత్తూర్‌ రాయల్‌ అకాడమి ఆర్ట్స్‌ యూనివర్సిటీ సుధాకర్ కు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ కు చెందిన సుధాకర్‌, 'జబర్దస్త్' కార్యక్రమంలో స్కిట్ ల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 

గరిష్ఠానికి జీడీపీ,కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు ఊహించని రీతిలో కుప్పకూలాయి. చివరి గంటల్లో అమ్మకాల జోరు వెల్లువెత్తడంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 332 పాయింట్లు దిగజారి 38,312 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 11,582 పాయింట్ల వద్ద ముగిశాయి. కాగా, రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఐషర్ మోటార్స్, టైటాన్, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థల షేర్లు లాభపడగా, ఐటీసీ షేర్లు, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థల షేర్లు నష్టపోయాయి.

18:08 - September 3, 2018

హైదరాబాద్ : పంచ్ డైలాగ్స్ తో ప్రత్యర్థులను ఉడికించే చిచ్చరపిడుగు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై పంచ్ డైలాగులు కురిపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అత్యంత ప్లానింగ్ తో చేపట్టిన కొంగరకలాన్ లో జరిగింది 'ప్రగతి నివేదన' సభ కాదనీ, 'పుత్రుడి నివేదిక' సభ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కుమారుడు కేటీఆర్ బెదిరింపులకు లొంగిపోయిన తండ్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కొడుకుకు సమాధానం చెప్పుకోని సీఎం తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పేందుకు ప్రగతి నివేదన సభ పెట్టారని ప్రశ్నించారు. ఈ సభకు వందలాది కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది సంగతేంటని? కాంగ్రెస్ నేత రేవంత్ ప్రశ్నించారు. 

కోయంబత్తూరులో ఐసిస్ కలకలం..

తమిళనాడు : కోయంబత్తూరులో ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కలకలం చెలరేగింది. కోయంబత్తూరులో ఈ రోజు పోలీసులు ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని హిందూ మక్కల్ కట్చి చీఫ్ అర్జున్ సంపత్ తో పాటు ఇతర నేతలను హత్యచేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రెండు వారాల పోలీస్ కస్టడీకి అప్పగించింది.

17:44 - September 3, 2018

ముంబై : కేంద్ర ప్రభుత్వంపై ప్రముఖ బాలీవుడ్ నటి సంచలన విమర్శలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన వారు దేశాన్ని పాలిస్తున్నారంటూ బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. పౌరహక్కుల నేత వరవరరావుతో పాటు మరికొందరిని కేంద్రం ప్రభుత్వం అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును ఖండించిన నటి స్వర భాస్కర్ కేంద్రంపై నిప్పులు చెరిగింది.

నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారి కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటు ప్రశ్నించింది. వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచేసి..విదేశాలకు పారిపోతున్న వారిని ఏమీ చేయలేని ప్రభుత్వం..నిరు పేదల కోసం, వారి హక్కుల కోసం పోరాడుతున్న వారిని మాత్రం అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తోందని స్వరభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. కాగా ప్రధాని నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఇటీవల మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావుతోపాటు మరో నలుగురు హక్కుల నేతలను అరెస్ట్ చేసినన విషయం తెలిసిందే. 

17:26 - September 3, 2018

ప్రముఖ నటుడు..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి అక్కినేనివారి కోడలు సమంతా చేసిన అత్తారింటికి దారేది సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ తో కలిసి నటించి నటీనటులంతా పవన్ గురించి గొప్పగా చెబుతుంటారు. ఎందుకంటే అంత దగ్గరగా అతనితో కలిసి పనిచేసే సమయంలో అతని నిరాడంబరత..మంచితనం వంటి పలు కోణాలను గమనించే అవకాశం వుంటుంది.ఈ క్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అక్కినేని ఇంటి కోడలు, హీరోయిన్ సమంత ఓ ట్వీట్ చేసింది. ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కు సమంతా విషెష్ చెప్పేందుకు ఓ ట్వీట్ పెట్టింది.అది కేవలం విషెష్ మాత్రమే కాదు..పవన్ గురించిన ఓ విలువైన విషయాలను కూడా యాడ్ చేసింది. పవన్‌కు ట్విట్టర్‌లో విషెస్ చెప్పిన ఆమె... 'పవన్ కల్యాణ్ నిస్వార్ధపరుడనీ, ఈ తరానికి రోల్ మోడల్' అంటూ ట్వీటింది. ప్రియమైన పవర్‌స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిస్వార్ధంగా ఉండటంలో ఈ తరానికి పవన్ ఓ ఉదాహరణ అని మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం' అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. కాగా కేరళలో వరదలతో కేరళ ప్రజలు పలు కష్టాల్లో వున్నాననీ..అందుకే తన పుట్టిన రోజు జరుపుకోవటంలేదనీ..అభిమానులు కూడా తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన నగదును కేరళ బాధితులకు విరాళంగా ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.

17:26 - September 3, 2018

కొద్దిరోజుల క్రితం ఫిట్ నెస్ విషయంలో నెటిజ‌న్ల చేతిలో పిచ్చిపిచ్చిగా ట్రోల్ అయిన టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి వారికి మ‌రో ఆయుదాన్ని అందించారు. ఓవైపు టెస్ట్ ల్లో ఓట‌మిపాలైన భార‌త్ ఆట‌గాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటే ర‌విశాస్త్రి మాత్రం లేటు వ‌య‌సులో త‌న కంటే 20ఏళ్లు చిన్న వ‌యస్సుకు చెందిన నిమ్ర‌త్ కౌర్ తో డేటింగ్ చేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఇద్ద‌రిని పెళ్లి చేసుకొని ఎటూ కాకుండా పోయిన ర‌విశాస్త్రి తాజాగా నిమ్ర‌త్ తో చ‌నువుగా ఉండ‌డం పై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

ఓ ఆట‌గాడిగా, ప్లేబాయ్ గా విశిష్ట ఆద‌ర‌ణ పొందిన ర‌విశాస్త్రి గ‌తంలో బాలీవుడ్ నటి అమృతాసింగ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఆ తర్వాత రీతూను పెళ్లి చేసుకున్నా.. పదేళ్ల నుంచి వేరుగానే ఉంటున్నారు. ఇప్పుడు 56 ఏళ్ల వయసులో ఓ కొత్త తోడు కోసం రవి వెతుక్కుంటున్నాడు. ఎయిర్ లిఫ్ట్ మూవీతో ఫేమ‌స్ అయిన నిమ్ర‌త్ కౌర్ తో రెండేళ్ల నుంచి డేట్ ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  

అయితే వీరి డేటింగ్ కు బీజం వేసింది ఆడి సంస్థేన‌ని తెలుస్తోంది. 2015 ఆడి సంస్థ కొత్త కార్ల లాంచింగ్ కోసం ర‌విశాస్త్రిని, నిమ్ర‌త్ ను ఆహ్వానించింది. అప్పుడే వీరిద్ద‌రికి ప‌రిచ‌యం అయ్యిందని, ఆ ప‌ర‌చ‌య‌మే డేటింగ్ కు దారితీసిందని స‌మాచారం. 

ఇదే విష‌యంలో ఈ జంట చాలాజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌రిస్తున్నారని..డేటింగ్ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింద‌ని మీడియా ప్ర‌తినిధులు చెబుతున్నారు.   మరి ఇప్పటికైనా ఈ సెలబ్రిటీ జోడీ తమ బంధాన్ని బయటపెడుతుందా లేదా చూడాలి.

17:06 - September 3, 2018

ఉత్తరప్రదేశ్ : ఇస్లాం నియమాల ప్రకారం మహిళలపై జరిగే ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. దారుణమైన హింసలకు ముస్లిం మహిళలు బలైపోతున్నారు. వారి ఆవేదన ఆరణ్య రోదనగా మిగిలిపోతోంది. అసలు ఈ 'నిఖా హలా' అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం..ముస్లిం నియమాలు, ఆచార సంప్రదాయాల ప్రకారం..విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. అనతరం ఆ భర్తకు విడాకులు ఇవ్వాలి లేదా లేదా అతను మరణించేంత వరకూ ఆమె ఎదురు చూస్తుండిపోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆమె తిరిగి మొదటి భర్తను వివాహం చేసుకోవటానికైనా..కలిసుండటానికి ఇస్లాం మతం ఒప్పుకుంటుంది.

నిఖా హలాలా పేరుతో కట్టుకున్న భర్తలే తమ భార్యలపై దారుణమైన ఘోరాలకు పాల్పడుతున్నారు. యూపీలో ఓ భర్త తన భార్యపై తండ్రితో పాటు మరో ముగ్గురు వ్యక్తులతో అత్యాచారం చేయించాడు. ఫలితంగా ఆ మహిళ గర్భందాల్చింది. ఓ బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మొరదాబాద్‌ జిల్లాకి చెందిన ఓ మహిళకి 2014లో వివాహమైంది. చాలామంది ఆడపిల్లల వలెనే ఆమెకు కూడా పెళ్లి అయిన కొద్ది రోజులకే అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమెను వదిలించుకునేందుకు ఏడాదికి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె పోలీసు కేసు పెట్టింది. పోలీసుల మధ్యవర్తిత్వంతోనో ఈ కేసు గ్రామ ముస్లిం పెద్దలు జోక్యం చేసుకుని వారి మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో తన కాపురం చక్కబడుతుందని ఆమె అనుకుంది. కానీ జరిగింది మరొకటి.

అమాయకురాలైన భార్యపై భర్త సరికొత్త నాటకాన్ని ప్రారంభించాడు. మనకు విడాకులయా కాబట్టి..ముస్లిం ఆచారం ప్రకారం మరో పెళ్లి చేసుకోవాలని మహిళతో చెప్పాడు. కాబట్టి తన తండ్రితో కాపురం చెయ్యాలని వేధించాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు.

దీంతో ఆగ్రహించిన ఆ భర్త.. భార్యను గదిలో బంధించి.. నిఖా హలా పేరుతో భార్యపై తన తండ్రితో అత్యాచారం చేయించాడు. మరుసటి రోజు ఆమెకు మావయ్య విడాకులిచ్చాడు. అంతటిదో ఆ భర్త ఊరుకోలేదు. తన బంధువులైన మరో ముగ్గురుతో కూడా ఆమెపై అత్యాచారం చేయించాడు. దీనికి వారి బంధువులు సమ్మతించారు. దీంతో గర్భం దాల్చిన సదరు మహిళ 2017లో బాబుకు జన్మనిచ్చింది. నిఖా హలాల పేరుతో అత్యాచారం చేసిన అత్తింటి వారిపై మహిళ ఆమె మొరదాబాద్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నారని మహిళ వాపోయింది. సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

16:41 - September 3, 2018

'ఎన్టీఆర్' బయోపిక్ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పీడ్ గా జరిగిపోతోంది. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల్ని అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో షూట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'ఎన్టీఆర్' సినిమాలో శ్రీదేవిగా ఇప్పటికే రకుల్..జయప్రద పాత్రలో రాశిఖన్నా నటించనుందనే టాక్స్ హల్ చల్ చేస్తున్నాయి.

ఇక ఎన్టీఆర్ సినిమాలో అలనాటి మేటి నటుడు..నిలువెత్తు విశ్వరూపం అయిన ఎస్వీ రంగారావు పాత్ర చాలా కీలకమైనది. ఈ పాత్రలో 'నాగబాబు'ను తీసుకోనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే అంతటి భారీకాయానికి నాగబాబు సరిపోతాడని ఆయనతో సంప్రదించినట్లుగా తెలుస్తోంది. 'మహానటి' సినిమాలో ఎస్వీరంగారావు పాత్రను మోహన్ బాబు అద్భుతంగా పోషించారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబుకి గల ప్రత్యేకమైన అనుబంధం కారణంగా, 'ఎన్టీఆర్' బయోపిక్ లోను ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించే అవకాశం ఉందని కూడా అనుకున్నారు. కానీ బయోపిక్ లో కొత్తదనాన్ని ఆడియన్స్ మిస్ అవుతారనే ఉద్దేశంతో నాగబాబును సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాత్రకి నాగబాబు సరిగ్గా సరిపోతారనీ .. ఇటీవల ఆయన గొంతు సమస్యతో ఇబ్బంది పడుతుండటంతో వేరే వారితో డబ్బింగ్ చెప్పించ వచ్చని కూడా సిని వర్గాల సమాచారం. 

మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం..

బ్రెజిల్‌ : రియో డి జెనీరోలో ఉన్న 200 ఏళ్ల నాటి పురాతన నేషనల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మ్యూజియంలో మొత్తం అత్యంత అరుదైన 20 మిలియన్ వస్తువులు ఉండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమెర్ ట్వీట్ చేస్తూ.. దేశ ప్రజలకు ఇదో విషాదకరమైన రోజుగా పేర్కొన్నారు. అగ్నిప్రమాదం కారణంగా సంభవించిన అపార నష్టానికి విలువ కట్టలేమని ఆవేదన వ్యక్తం చేశారు.

16:25 - September 3, 2018

థాయ్ లాండ్ : బ్యాంకాక్ అంటే పర్యాటకులు ఉత్సాహం చూపే ప్రాంతం. భూత స్వర్గంగా పేరొందిని ఈ స్వర్గధామం అత్యంత ప్రమాదంలో పడింది. ఇంతటి సుందర రూపం అయిన బ్యాంకాక్ సముద్రంలో మునిగిపోనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. థాయ్ లాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ ప్రమాదంలో పడిందా? ఏమిటా ముప్పు? ఆ సుందర నగరం త్వరలోనే సముద్రంలో మునిగిపోనుందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదికలో ఈ భయంకర నిజం వెల్లడయ్యింది. మరో పదేళ్లలో బ్యాంకాక్ 40 శాతం భూమి సముద్రపు మునిగిపోతుందని హెచ్చరించింది.

2011లో రుతుపవనాల సందర్భంగా భారీ వర్షాలు కురవడంతో బ్యాంకాక్ లో 20 శాతం ప్రాంతం నీట మునిగింది. ప్రస్తుతం ఈ నగరం ఏటా 2 సెం.మీ చొప్పున సముద్రంలో మునిగిపోతోంది. అంతేకాకుండా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే సముద్రమట్టం ఇక్కడ ఏటా 4 మిల్లీమీటర్లు అధికంగా పెరుగుతోంది.

బ్యాంకాక్ పట్టణం అంతకంతకు పెరుగుతోంది. దీంతో సముద్ర తీరప్రాంత తగ్గిపోతోంది. భారీ భవనాల నిర్మానాలు వెరసి బ్యాంకాక్ ముంపు ముప్పులో చిక్కుకుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సహజనీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా పలు నిర్మాణాలు ఈ పరిస్థితికి దారి తీస్తోంది. బ్యాంకాక్ కు పట్టుకొమ్మలుగా వున్న మడ అడవులను నరికేస్తు..రొయ్యల సాగు చేపట్టటం, తీర ప్రాంతంలో భూమి విపరీతంగా కోతకు గువరవటం ఈ ప్రమాదానికి దారి తీస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

16:02 - September 3, 2018

కేరళ : ఒకరి కష్టం చూసి చలించిపోయే మనసు అందరికీ వుండదు. అలా స్పందించటనాకి పేద, గొప్న తేడా లేదు. ప్రార్థించే పెదవులు కంటే సాయం చేసే చేతులు మిన్న అని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రూపం మదర్ థెరిసా పలుకులు ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆ మానవతావాది మాటలనే నిజం చేశాడు ఓ యాచకుడు. కష్టంలో వున్న వారికి సహాయం చేసేందుకు కోట్లాది రూపాయలు అక్కరలేదని..మనస్ఫూర్తిగా ఇచ్చిన ఒక్క పైసా అయిన చాలు అని నిరూపించాడు ఓ యాచకుడు. సహాయానికి పెద్ద హోదా అవసరం లేదని నిరూపించాడు. రాష్ట్రంలో వుండే 44నదులు ఒక్కసారి భీకరరూపం దాల్చి కేరళను అతలాకుతరం చేసేసాయి. ఈ విపత్తుకు ప్రపంచం అంతా స్పందించింది. ప్రతి ఒక్కరూ సాయం చేసేందుకు తమ ప్రాణాలకు తెగించి కేరళను అక్కున చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే కేరళను ఆదుకునేందుకు తన వంతుగా సాయం అందించాడు ఓ భిక్షగాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న కేరళను ఆదుకునేందుకు ప్రజలు రూ.1,000 కోట్లకు పైగా విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.

మోహనన్ అనే యాచకుడు ఎర్రట్టుపట్ట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ టీఎం రషీద్ ఇంటికి వెళ్లాడు. ఆ యాచడకుడిని గమనించిన రషీద్ రూ20 నోటును ఇవ్వబోయాడు. దాన్ని ఏమాత్రం పట్టించుకోని సదరు మానవతావాది మోహనన్ తాను యాచించి సంపాదించిన చిల్లరను లెక్కపెట్టి రూ.94ను రషీద్ కు అందించాడు. తన వంతుగా ఆ డబ్బును కేరళ వరద బాధితులకు అందించాలని కోరాడు. ఆ సహాయాన్ని బాధితులకు అందించేందుకు మోహనన్ సుమారు 4 కి.మీ నడిచి మోహనన్ రషీద్ ఇంటికి చేరుకున్నాడు. దీంతో రషీద్ ఆ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి పంపాడు. ఈ విషయాన్ని రషీద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మోహనన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

15:34 - September 3, 2018

కడప : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్న నేపథ్యంలో కొత్త పార్టీల ఆవిర్బావం కూడా అంతే వాడీ వేడిగా పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తన ఉద్యోగ హోదానే ఇంటిపేరుగా ప్రసిద్ధి చెందిన జేడీ లక్ష్మీనారాయణ తన రాజకీయ అరంగ్రేటంపై పూర్తిస్థాయిలో స్పష్టతనివ్వాలని ప్రజలు ఆశపడుతున్నారు.ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రస్తుతం తాను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేందు ప్రయత్నిస్తున్నానన్నారు. ఆ ససమ్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే కచ్చితంగా వస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతు..దేశ రాజకీయాలు, ఎన్నికలు, మద్యం,మతం, కులం, డబ్బును పారద్రోలేందుకు ప్రజల్లో చైతన్య రావాలన్నారు. దీనికోసం ప్రజలు తమ బాధ్యతను గుర్తెరికి తగిన విధంగా స్పందించాలని సూచించారు. ప్రజల్లో చైతన్య వస్తే సమాజంలో మార్పునుఎవరు ఆపలేరన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల సమస్యలపై తాను కూడా పోరాటానికి సిద్ధమని చెప్పారు. వ్యవసాయమే ప్రధాన అధారంగా వుండే ప్రాంతం కాబట్టి తాను మాత్రం వ్యవసాయ, చేనేత కార్మికుల అభ్యున్నతే లక్ష్యంగా ఓ మేనిఫెస్టోను రూపొందిస్తామని వెల్లడించిన లక్ష్మీ నారాయణ, కౌలు రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని జేడీ లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

 

15:11 - September 3, 2018

ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదని, ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు ఎన్నో సార్లు చెప్పారని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభ పై ఆయన విశ్లేషించారు. కేసీఆర్ స్పీచ్ ను విమర్శించే అవకాశం ఉందని..ఇక్కడ కేసీఆర్ చాలా తెలివిగల వాడని..తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికలు కూడా కేసీఆర్ ను కవర్ చేయకుండా ఉండలేకపోయారని..కేసీఆర్ భాష..టైమింగ్...కొన్ని అంశాలు కేసీఆర్ కు కవరేజ్ వచ్చాయన్నారు. సింగిల్ ఎపిసోడ్ లో కేసీఆర్ పూర్తి చేయరని, కొత్త పథకాలు ప్రకటిస్తే..ఆ వరాలకు సంబంధించిన అంశాలు వస్తాయన్నారు. రేపటి హెడ్ లైన్ ను కేసీఆర్ ఇవాళే నిర్ణయించుకని మాట్లాడారని, త్వరలో రాజకీయ నిర్ణయాలు వెలువరిస్తానని కేసీఆర్ చెప్పారన్నారు. అంటే ఒక ట్రైలర్ వదిలారని పేర్కొన్నారు. కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడనే దానిపై ఉత్కంఠ ఉందని...అందుకే సభకు వచ్చారన్నారు. సభకు వచ్చిన వారంతా టీఆర్ఎస్ శ్రేణులేనని, సానుభూతి పరులు, ఓటర్లు అని పేర్కొన్నారు. వెళ్లిన వారికి కూడా క్రూరియాసిటీ ఉందన్నారు. అధికారంలో ఉన్న వారు ఇలాంటి సభలు నిర్వహించడం పరిపాటి అని, ఆయా నియోజకవర్గాలకు చెందిన వారు జనసమీకరణ చేశారని..పోటీ పడి జనాలను తరలించారని, టికెట్లు రావాలనే ఉద్ధేశ్యంతో ఇలా చేశారన్నారు. మరింత విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

కేసీఆర్ ప్రసంగాలలో అతి చెత్త ప్రసంగం ఇదే: సీపీఐ నారాయణ

హైదరాబాద్ : తన అభిప్రాయాలను నిర్మొహమాటంలో తెలిపే సీపీఐ నారాయణ నిన్న ప్రగతి నివేదన సభపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేసీఆర్ ఎప్పుడు ఎక్కడ ప్రసంగించినా, ప్రజల నుంచి చప్పట్లు వచ్చేలా మాట్లాడే కేసీఆర్, నిన్నటి ప్రగతి నివేదన సభలో మాత్రం నిస్సత్తువగా మాట్లాడారని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రసంగాల్లో అత్యంత చెత్తగా, చప్పగా సాగిన ప్రసంగం ఇదేనని అభిప్రాయపడ్డ ఆయన, పుత్ర రత్నాన్ని సీఎం పదవిలో కూర్చోబెట్టి, తాను ఢిల్లీలో చక్రం తిప్పాలన్న వ్యూహం పన్నిన కేసీఆర్, అందుకు ఈ సభను వేదికగా చేసుకుందామని భావించి, విఫలం అయ్యారని వ్యాఖ్యానించారు.  

మహిళా కండక్టర్ కు డ్రంక్ అండ్ డ్రవ్ పరీక్షలు..

విశాఖపట్నం : డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ఎవరికి నిర్వహిస్తారు? వాహనం నడిపే డ్రైవర్లకే కదా? మరి వాహనం నడిపేవారికి తప్ప వాహనంలో వుండేవారికి చేస్తే ఎలా వుంటుంది? కానీ విశాఖపట్నంలో ఓ విచిత్రం జరిగింది. అదేమిటంటే..జిల్లాలోని సింహాచలం ఆర్టీసీ డిపోలో ఓ మహిళా కండక్టరుకు కానిస్టేబుల్ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేసి, ఉన్నతాధికారులతో చీవాట్లు తిన్నాడు. ఓ మహిళకు ఈ పరీక్షలు చేయడంపై ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, సదరు కానిస్టేబుల్ తో మహిళా కండక్టరుకు క్షమాపణలు చెప్పించారు. ఇటువంటి ఘటన పునరావృతమైతే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

14:29 - September 3, 2018

ఆరోపణలు నిరసపిన్తే ఆస్తులు రాసిస్తా : శివాజీ రాజా

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా'లో మారోసారి వార్తల్లో నిలిచింది. 'మా' నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మా టీమ్ ప్రెస్ మీట్ పెట్టింది. వివరణ ఇచ్చింది. 'మా' నిధులను తాను కాజేసినట్టు వచ్చిన వార్తలపై అధ్యక్షుడు శివాజీరాజా స్పందించారు. కొంతమంది ఇండస్ట్రీలోనివారు 'మా' ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, వారే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఒక్క పైసా దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే, తన ఆస్తి మొత్తాన్నీ పరిశ్రమకు రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. అసోసియేషన్ డబ్బుతో తాను ఒక్క టీ కూడా తాగలేదని ఆయన అన్నారు. తాము చేస్తున్న మంచి పనులను తప్పు పట్టడమే వాళ్ల పనని అన్నారు.

 

కాగా, ఇటీవల అమెరికాలో 'మా' సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేసినట్టు వార్తలు రావడంతో దుమారం మొదలైంది. గడచిన మూడు రోజులుగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ లో పంచాయతీలు జరుగుతూ ఉండగా, నటుడు, 'మా' కార్యదర్శి నరేష్, ఆఫీసుకు తాళం వేయడంతో పరిస్థితి మరింతగా ముదిరింది. ఆపై అత్యవసర సమావేశం జరిపి, శివాజీ రాజా వివరణ తీసుకున్న తరువాత, వివాదం సద్దుమణిగిందన్న ప్రకటన వెలువడినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. ఇదే విషయమై స్పందించిన శ్రీకాంత్, ఒక్క రూపాయిని తాను వాడుకున్నట్టు నిరూపించినా, 'మా' కార్యాలయంలో అడుగు పెట్టనని..మా అసోసియేషణ్ సభ్యత్వానికి శాశ్వతంగా రాజీనామా చేస్తానని..లేదంటే ఆరోపణలు చేసిన వారు చేసేదేమిటో చెప్పాలని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా సవాల్ చేశారు.

 

కత్తి మహేశ్ ఇక ఏపీలోనే వుంటాడట..

విజయవాడ : హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ను పోలీసులు హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మహేశ్ బెంగళూరులో ఉంటున్న క్రమంలో మాట్లాడుతూ.. తాను ఇకపై విజయవాడలోనే ఉండబోతున్నట్లు ప్రకటించాడు. తనపై హైదరాబాద్ నగరంలోకి వెళ్లకుండా మాత్రమే నిషేధం ఉందనీ, మిగతా తెలంగాణలో స్వేచ్ఛగా పర్యటించవచ్చని వెల్లడించాడు. తనది ఏపీయేనని మహేశ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను విజయవాడకు షిఫ్ట్ కత్తి మహేశ్ తెలిపాడు. 

13:38 - September 3, 2018

విజయవాడ : వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో పోలీసులు బందోబస్తుకు వెళ్లారు. ఇది అదనుగా భావించిన స్నాచర్లు ఛైన్ స్నాచర్లకు తెగబడ్డారు. గుణజల సత్యనారాయణపురంలో వరుస స్నాచింగ్లకు పాల్పడ్డారు. వృద్ధురాలు...మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను లాక్కెళ్లారు. కాలేజీ విద్యార్థులు ఈ చర్యకు పాల్పడ్డారా ? బీహార్ కు చెందిన ముఠా చేసిందా ? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:37 - September 3, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కేసీఆర్..ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ నేత డీకే అరుణ సోమవారం మీడియాతో మాట్లాడారు. ముందస్తుకు వెళితే ముందే కుర్చీ వదిలేయాల్సిన పరిస్థితి ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ ఓడగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో రైతు బంధు చెక్కులను రెండో విడత పంపిణీ చేయాల్సి ఉందని..దీనిని క్యాష్ చేసుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి ఎరువు..ఇతరత్రా రేట్లు పెంచుతున్నారని విమర్శించారు. ప్రగతి నివేదన సభ ద్వారా జనం వెంబడి లేరని..నిన్నటి మీటింగ్ తోనే తెలిసిపోయిందని అందుకే కేసీఆర్ గొంతు పెగల్లేదని విమర్శించారు. మోడీని భయపెట్టి జోనల్ వ్యవస్థ తీసుకొచ్చానని చెబుతున్నాడని..కానీ అక్కడ కాళ్లపై పడుతాడని విమర్శించారు. బీజేపీ..టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉందని ప్రజలు గమనించారని, ఇది లేదని భ్రమ పెట్టాలని బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు పోవాలా ? వద్దా ? అనే సంశయంలో కేసీఆర్ కొట్టుమిట్టాడుతున్నారని, సభలో మాట్లాడిన మాటల్లో స్పష్టత లేదని..కేసీఆర్ ఏం చెబుతారోనని అందరూ ఎదురు చూశారని విమర్శించారు. 

విజయవాడలో ఛైన్ స్నాచర్లు...

విజయవాడ : నగరంలో ఛైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గుణజల సత్యనారాయణపురంలో వరుస స్నాచింగ్లు జరుగుతున్నాయి. ఛైన్ స్నాచర్ల సీసీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. 

కాంగ్రెస్ కు భయం - తలసాని...

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కళ్లు లేని కబోదలని, టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ నేతలు కళ్ల పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని..ప్రజలు కాంగ్రెస్ ను చీదరించుకుంటున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ కు భయం ఉందని...సిగ్గు..జ్ఞానం..ఏవైనా ఉండాలా ? అని నిలదీశారు. 

13:22 - September 3, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కళ్లు లేని కబోదలని, టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ నేతలు కళ్ల పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని..ప్రజలు కాంగ్రెస్ ను చీదరించుకుంటున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ కు భయం ఉందని...సిగ్గు..జ్ఞానం..ఏవైనా ఉండాలా ? అని నిలదీశారు. 

13:19 - September 3, 2018

అనంతపురం : పెళ్లై 24గంటలు కాలేదు...అప్పుడే తన రాక్షసత్వాన్ని పెళ్లి కూతురికి చూపించాడు. తాను సంసారానికి పనికి రానని...ఈ విషయం బయటకు చెబితే న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానంటూ ఓ వ్యక్తి భార్యను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన జిల్లాలోని రాయదుర్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...రాయదుర్గానికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేంద్రప్రసాద్ కు గత సంవత్సరం ఆగస్టులో దివ్యంతో వివాహమైంది. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు రూ. 65 లక్షల కట్నాన్ని ఇచ్చారు. కానీ పెళ్లి చేసుకున్న మొదటి రోజే దివ్యకు పిడుగు లాంటి విషయం చెప్పాడు. తాను సంసారానికి పనికి రానని...చెప్పాడు. ఈ విషయం బయటకు చెబితే అప్పటికే తీసిన న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. ఒక్కసారిగా బెదిరిపోయిన దివ్య ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అదనపు కట్నం తీసుకరావాలని వేధించాడు. చివరకు తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. అదనపు కట్నం తీసుకరావాలని వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:58 - September 3, 2018

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఇసుక కొరత ఏర్పడింది. లారీ ఇసుకను 40వేలకు విక్రయిస్తున్నారు. ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ అవసరాలను ఆసరా చేసుకుని ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తోంది. తమ దందాకు సహకరించని వారిని వేధింపులకు గురిచేస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత విధానం అమలు చేస్తోంది. అంటే ఇసుకను ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. కానీ శ్రీకాకుళంలో మాత్రం ఇది అమలు కావడంలేదు. ఇసుక మాఫియా క్వారీలను తమ గుప్పిట్లోకి తీసుకుంది. ప్రభుత్వం ఉచిత ఇసుకని చెబుతున్నా... లారీ ఇసుక 40వేల రూపాయలకు విక్రయిస్తోంది. విశాఖలో ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ అవసరాలను ఆసరా చేసుకుని ఇసుక మాఫియా సొమ్ము చేసుకుంటోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలు, అధికారులు కుమ్మక్కై ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తున్నారు.

విశాఖ జిల్లాలో ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో రాజమండ్రి, శ్రీకాకుళం నుంచి విశాఖకు ఇసుకను తీసుకొస్తున్నారు. విశాఖలో జరిగే నిర్మాణ అవసరాలకు రోజుకు రాజమండ్రి నుంచి 100 లారీలు, శ్రీకాకుళం నుంచి 250 లారీల ఇసుక వస్తోంది. ఎక్కువ మంది శ్రీకాకుళం నుంచి ఇసుకను తీసుకొస్తున్నారు. ఒక లారీ ఇసుక లోడింగ్‌, ఇతర ఖర్చులకు గాను 2500 తీసుకుంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించడం.. లారీ ఇసుక రేటును 30 నుంచి 40 వేలకు పెంచడం రివాజుగా మారింది. శ్రీకాకళం నుంచి ఇసుక తీసుకొస్తున్నప్పుడు రెవెన్యూ, పోలీస్‌, విజిలెన్స్‌ ఇలా అన్ని శాఖల అధికారులు ఎక్కడికక్కడ లారీలను ఆపడం, అందినంత దండుకోవడం చేస్తున్నారు. ఒక రేటు నిర్ణయించుకుని అవగాహనతో వెళ్లిపోతున్న సమయంలో ప్రభుత్వం ఇసుకను పూర్తిగా ఉచితంగా చేడయంతో వివాదం మొదలైంది. విశాఖ అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. శ్రీకాకుళం జిల్లాలో ఒకటో, రెండో రీచ్‌లను కేటాయిస్తే.. వాటి నుంచి ఇసుకను తెచ్చుకుంటామని బిల్డర్లు, లారీల యజమానులు కోరుతున్నారు.

శ్రీకాకుళంలోని కొందరు అధికారులు రాజకీయ నేతలకు లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియా తమ దందాకు సహకరించని లారీ యజమానులను వేధింపులకు గురిచేస్తోంది. సహకరించని లారీ యజమానులను ఎంచుకొని వేధిస్తున్నారు. ఆ లారీలకు బీమా ఇవ్వవద్దని బీమా కంపెనీలకు లేఖలు కూడా రాశారు. గత 15 రోజుల్లో 90 లారీలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు లారీ యజమానుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. దళారులు, మాఫియాకు మాత్రమే లాభం చేకూర్చుతున్న ఉచిత ఇసుక విధానాన్ని తక్షణం ప్రభుత్వం రద్దు చేయాలని క్రెడాయి అధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్‌ చేస్తున్నారు. ఉచిత ఇసుకంటూ రెవెన్యూ అధికారుల అండతో ఇసుకను రవాణా చేస్తున్న లారీలను సీజ్‌ చేస్తున్నారని తెలిపారు. వాటిని ఎందుకు సీజ్ చేశారో చెప్పడం లేదన్నారు. ఒక్కో లారీకి రెండు లక్షల జరిమానా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అందుకే లారీల సమ్మె చేయనున్నట్టు తెలిపారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతున్నారు.

12:53 - September 3, 2018

విశాఖపట్టణం : వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలోని కొత్తపెంట జరిగిన ఉట్ల ఉత్సవంలో చిన్నారులతో కలిసి జగన్‌ సందడి చేశారు. జగన్‌ పాదయాత్ర మాడుగుల నియోజకవర్గం చేరుకోవటంతో 3 వేల కిలోమీటర్స్ పాదయాత్ర పూర్తి అయింది.

కృష్ణా ష్టమిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని కృష్ణుడి దేవాలయాలు సర్వంగసుందరంగ ముస్తాబయ్యాయి. కాచిగూడలోని శ్యామ్‌ సేవా మందిర్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:45 - September 3, 2018

తూర్పుగోదావరి : జిల్లాలోని విలీన మండలాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ విషజ్వరాల బారినపడి ప్రజలు అల్లాడుతున్నారు. డెంగ్యు, మలేరియాతో మంచాలకే పరిమితం అయ్యారు. ముంపు మండలాల్లో విజృంభిస్తున్న విష జ్వరాలపై 10టీవీ కథనం... మొన్నటి వరకు తూర్పు విలీన మండలాలను వరదలు ముంచెత్తాయి. వరదలు పోతుపోతూ ఇక్కడి ప్రజలకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతోపాటు వరదల సమయంలో కలుషిత నీరు త్రాగడం, మరోపక్క శానిటేషన్‌ లోపంతో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. గోదావరి వరదలు తగ్గే సమయంలో రోడ్లపైనా, ఇళ్లచుట్టూ బురద చేరింది. అంతేకాదు.. గ్రామాల్లోని గుంతల్లో ఎక్కడినీరు అక్కడే నిలిచిపోవడం.. దోమలకు స్థావరమైంది. దీంతో గ్రామాలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి.

కూనవరం, వీఆర్‌ పురం, చింతూరు మండలాల్లో ఎక్కడ చూసినా జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. ఏ గడప తొక్కినా మంచంపై ముసుగేసుకొని మూలుగుతూ పడుకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముంపు మండలాల్లో వైద్య ఆరోగ్యశాఖ 164 మెడికల్‌ క్యాంపులను నిర్వహించింది. 5092 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా.. 3757 మంది విష జ్వరాల బారినపడినట్టు గుర్తించారు. 21 మంది మలేరియా బారినపడ్డట్టు తెలిపారు. మరికొంతమంది డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నట్టు చెప్పారు. వెంటనే వారికి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విలీన మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుకు ఒక్కో ఆస్పత్రిలో 100 నుంచి 150కిపైగా జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. కాగా ఇటీవల ప్రారంభించిన చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఇంకా సరిపడ వైద్యసిబ్బంది లేకపోవడంతో.. రోగులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రజలకు జ్వరాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా విష జ్వరాలు ప్రబలడానికి కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు, వైద్యం అందకపోవడంతో రోగులు రాజమండ్రి, ఖమ్మం, విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఉన్న డబ్బులన్నీ ఆస్పతులకు పోస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు కల్పించి.. వైద్యసేవలు అందించాలని ముంపు ప్రజలు కోరుతున్నారు. 

12:42 - September 3, 2018

విజయవాడ : రైల్వేస్టేషన్‌లో నెలకొన్న లోపాలు, ప్రయాణికుల అగచాట్లపై కాగ్‌ రైల్వేసంస్థకు చీవాట్లు పెట్టింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్‌లో తలెత్తుతోన్న సమస్యలు, స్టేషన్‌ అభివృద్ధి, ప్రయాణికుల అవసరాలపై దృష్టి సారించారు. శాటిలైట్‌ స్టేషన్‌ ఏర్పాటు, ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెంచే దిశగా కసర్తతు చేపట్టారు. దేశంలోనే రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని విజయవాడ రైల్వే జంక్షన్‌ సమకూర్చుతోంది. కానీ ఈ జంక్షన్‌ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంటోంది. డెవలప్‌మెంట్‌ పూర్తిస్థాయిలో పట్టాలెక్కడం లేదు. స్టేషన్‌లో 10 ప్లాట్‌ఫామ్‌లు, నిత్యం 750కుపైగా రైళ్ల రాకపోకలు, సీజన్‌లో ప్రతిరోజూ 1.50 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, రైల్వే సమాచారం చేరవేయడంలో , రైళ్ల రాకపోకల్లోనూ పూర్తి వైఫల్యాన్ని కాగ్‌ ఎండగట్టింది. రైళ్ల రాకపోకలతో ప్రతిరోజూ గంటలకొద్దీ అలస్యం కారణంగా ప్రయాణికులు అగచాట్లు ఎదుర్కొంటున్నారని నిలదీసింది. తిరుగుతున్న రైళ్లకు అనుగుణంగా స్టేషన్‌ విస్తరణకు నోచుకోకపోవడంతో నెలలోనే రైళ్ల రాకపోకల్లో 178 గంటల సమయం వృథాగా మారినట్టు కాగ్‌ తన అధ్యయనంలో తేల్చింది. నెలలో 1162 రైళ్లు... 11,575 నిమిషాలు స్టేషన్‌ బయటే నిలిచిపోవడంతో సగటును 18 నిమిషాల చొప్పున సమయం వృథా అవుతున్నట్టు కాగ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. తీరు మారకపోతే మున్ముందు ఇబ్బందులేనని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.

కాగ్‌ ఎత్తిచూపిన లోపాలను సరిదిద్దుకునేందుకు రైల్వేశాఖ అధికారులు దృష్టిసారించారు.బెజవాడ జంక్షన్‌ను మెగా విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను 12కు పెంచడంతోపాటు హైదరాబాద్‌ తరహాలో గుణదలలో శాటిలైట్‌ స్టేషన్‌ అభివృద్ధి చేయనుననారు. మెగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, వెయిటింగ్‌ హాల్స్‌ విస్తరణ, ఎస్కలేటర్ల సంఖ్య పెంపు, రిటైరింగ్‌ రూమ్స్‌, ఇలా స్టేషన్‌లో ఆధునీకీకరణ చేసేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. ప్రయాణీకులకు సదుపాయాలు కల్పిస్తూనే.. మరోవైపు స్టేషన్‌ అభివృద్ధి పనులకు 365 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. మరో 573.78 కోట్లతో జరుగుతున్న పనులు పురోగతిలో ఉన్నాయి. మరికొన్ని పనులకు 13,951 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే నిధులన్నీ మంజూరుకు కార్యరూపం దాల్చనున్నాయి. స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. 2019 నాటికి పూర్తి ప్రణాళికతో స్టేషన్‌ రూపురేఖలు మార్చాలని రైల్వేశాఖ పకడ్బంధీగా ముందుకెళ్తోంది.

విజయవాడ రైల్వేస్టేషన్‌ భవన సముదాయాన్నీ ప్రభుత్వం పొడిగించింది. స్టేషన్‌ లోపలా, బయటా ఎప్పటికప్పుడు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా మార్చారు. నిరంతరాయంగా స్టేషన్‌ శుభ్రత ఉండేలా చొరవ చూపుతున్నారు. త్వరలోనే మరికొన్ని కార్పొరేట్‌ హంగులు ఉట్టిపడేలా అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు.

12:40 - September 3, 2018

విజయవాడ : శ్రీకృష్ణాష్టమి వేడకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణుడు విగ్రహానికి పాలు..పెరుగు..రకరకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పూజారీతో టెన్ టివి మాట్లాడింది. అభిషేకం చేసిన వారికి...చూసిన వారికి స్వామి ఆశీస్సులు అందుతాయని పేర్కొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:36 - September 3, 2018

విజయవాడ : పెళ్లి కాకముందే అమ్మాయిపై యువకుడు అనుమానం వ్యక్తం చేశాడు...ఇందుకు టెక్నాలజీ సహాయంతో తీసుకున్నాడు. అమ్మాయి వేరే వ్యక్తితో మాట్లాడుతోందని..వెంటనే ఆపేయాలని...పెళ్లి చేసుకోవాలంటే మెడికల్ రిపోర్టు, కాల్ లిస్టు చూపించాలని డిమాండ్ చేశాడు. పెళ్లి కాకముందే ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసిన అతను...పెళ్లి అయిన తరువాత ఇంకా ఎన్నో అనుమానాలు రేకేత్తిస్తాడని..ఈ వివాహం అవసరం లేదని బాధితురాలు పేర్కొంది....

నాగ శ్రీను అనే వ్యక్తికి కనెక్షన్‌ మేనేజర్‌ అనే యాప్‌ అనుభవం ఉంది. దివ్య అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. జూన్ 22వ తేదీన జరిగిన నిశ్చితార్థంలో సెప్టెంబర్ 2వ తేదీన వివాహం నిశ్చయించారు. అనంతరం పలుమార్లు దివ్యకు నాగ శ్రీను పలుమార్లు ఫోన్ చేశాడు. కానీ ఆ సమయంలో ఫోన్ ఎంగేజ్ రావడంతో అనుమానం వ్యక్తం చేశాడు. దివ్యకు తెలియకుండా నాగశ్రీను ఆమె మొబైల్‌లో ఓ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశాడు. దివ్య ఎవరితో మాట్లాడుతుందో.. ఎక్కడ ఉందో.. ఎంత టైమ్‌ వరకు చాట్‌ చేస్తుందో తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి నాగశ్రీనుతో మాట్లాడటం మానేసింది. దివ్య వేరే అతనితో మాట్లాడుతోందని...ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని అమ్మాయి బంధువులకు తెలిపాడు. పెళ్లి చేసుకోవాలంటే మెడికల్ సపోర్టు, కాల్ లిస్టు ఇస్తేనే వివాహం చేసుకుంటానని చెప్పడంతో అమ్మాయి తరపు బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ 2వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా నాగ శ్రీను మాత్రం హాజరు కాలేదు. పెళ్లికి ముందే అనుమానిస్తే పెళ్లి తర్వాత రక్షణ ఏమిటని నాగశ్రీనును, అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. మరోవైపు బాధితురాలు నాగశ్రీనుపై తోట్లవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆగ్రహించిన బాధితురాలు నాగశ్రీనుపై, కుటుంబసభ్యులపై కేసు పెట్టింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానంటూ పోలీసుస్టేషన్‌ ముందు ఆందోళనకు దిగింది. 

రెండు ఫ్యామిలీ మధ్య టెక్నాలజీ చిచ్చు...

విజయవాడ : టెక్నాలజీ రెండు కుటుంబాల మధ్య పంతాలకు దారితీసింది. కనెక్షన్‌ మేనేజర్‌ అనే యాప్‌ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుల మధ్య చిచ్చు పెట్టింది. పళ్లి కూతురుకు తెలియకుండా వరుడు నాగశ్రీను ఆమె మొబైల్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశాడు. యాప్‌ పెళ్లి కూతురు ఎవరితో మాట్లాడుతుందో.. ఎక్కడ ఉందో.. ఎంత టైమ్‌ వరకు చాట్‌ చేస్తుందో తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి నాగశ్రీనుతో మాట్లాడటం మానేసింది. యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి ముందే అనుమానిస్తే పెళ్లి తర్వాత రక్షణ ఏమిటని నాగశ్రీనును, అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.

12:24 - September 3, 2018

హైదరాబాద్‌ : ఓ వ్యక్తి విద్యుత్ స్తంభంపై కాలిపోయాడు. హృదయవిదాకరమైన ఈ ఘటన రామాంతపూర్ లో చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు కర్రలతో కొట్టి కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడని తెలుస్తోంది. రిలయెన్స్ జియోకు సంబంధించిన పనుల కోసం కరెంటు పోల్ ఎక్కాడు. ప్రమాదవశాత్తు కరెంటు వైర్ కు మంటలు చెలరేగడం..అతని అంటుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. వెంటనే అతను హాహాకారాలు వేయడంతో స్థానికులు స్పందించారు. స్తంభంపైనే మంటల్లో కాలిపోతున్న కార్మికుడిని కర్రలతో కొట్టి కిందకు దింపారు స్థానికులు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని తెలుస్తోంది. దీనిపై విద్యుత్ అధికారులు స్పందించారు. తమను ముందుగా సంప్రదించి ఉంటే ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూసేవారమని విద్యుత్ అధికారులు వెల్లడిస్తున్నారు. 

రామాంతపూర్‌లో విద్యుత్ ప్రమాదం...

హైదరాబాద్‌ : రామాంతపూర్‌లో విద్యుత్ ప్రమాదం జరిగింది. కరెంటు స్తంభంపై ఉండగానే విద్యుత్‌ కార్మికునికి మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్తంభంపైనే మంటల్లో కాలిపోతున్న కార్మికుడిని కర్రలతో కొట్టి కిందకు దింపారు స్థానికులు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జియోకు సంబంధించిన వైరింగ్ చేస్తున్నాడు. 

10:40 - September 3, 2018

హైదరాబాద్ : నేడు కృష్ణాష్టమి. దేశ వ్యాప్తంగా శ్రీ కృష్ణుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను అందంగా అలంకరించారు. ఆబిడ్స్ లోని ఇస్కాన్ టెంపుల్ లో భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఉట్లోత్సవం జరుగనుంది. పలువురు చిన్నారులు శ్రీ కృష్ణుడి వేషధారణలో అలరించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారీతో టెన్ టివి ముచ్చటించింది. శ్రీ కృష్ణుడి పుట్టిన రోజు అని నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తుంటారని పేర్కొన్నారు. భక్తులు తయారు చేసిన ప్రసాదాలను వేలం వేయడం జరుగుతోందని, మంగళవారం వ్యాసపూజ ఉంటుందని ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో మొత్తంగా 50-60వేల మంది భక్తులు దర్శించుకొనే అవకాశం ఉందన్నారు.

కరీంనగర్ లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివెళుతున్నారు. అటుకులు..పాయసాలను నైవేద్యం సమర్పించారు. యాదవులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

10:37 - September 3, 2018

గుంటూరు : నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి నీరు విడుదల చేయడంతో గుంటూరు, ప్రకాశం జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత మూడేళ్లుగా సాగునీరులేక మెట్టపైర్లకే పరిమితమై అనేక ఇబ్బందులుపడ్డ రైతులు... ఈ ఏడాది వరి సాగుకు సమాయాత్తమవుతున్నారు. కుడి కాలువకు నీరు విడుదల చేయడంతో ఈ ఏడాది 14 లక్షల ఎకరాల్లో సాగు సకాలంలో ప్రారంభంకానుంది. నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి అధికారులు ఎట్టకేలకు నీరు విడుదల చేశారు. ఈ ఏడాది ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్‌లోకి భారీగా నీరు వచ్చింది. దీంతో అధికారులు కుడి కాలువ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. మూడేళ్ల తర్వాత నీటిని విడుదల చేయడంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

సాగర్‌ కుడి కాలువ కింద నీటిని విడుదల చేయకపోవడతో రైతులు మూడేళ్లుగా మిర్చి, ప్రత్తిలాంటి వాణిజ్య పంటలు సాగుచేశారు. భూగర్భ జలాలపై ఆధారపడి సేద్యాన్ని కొనసాగించారు. వరి మినహా ఇతర వాణిజ్య పంటలను సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్డు ఎండిపోయి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకున్న గట్టు పరిస్థితి రైతులు ఎదుర్కొన్నారు. వరిసాగు లేకపోవడంతో కూలీలు ఉపాధిలేక ఇతర జిల్లాలకు వలస పోయారు. చివరకు రైతులైతే తిండి గింజలు కూడా కొనుగోలు చేయాల్సి వచ్చింది.

మూడేళ్ల తర్వాత ప్రాజెక్టులోకి నీరు రావడంతో అధికారులు కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లా రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సాగర్‌ నుంచి నీటి విడుదలతో గుంటూరు జిల్లా 2.49 లక్షల ఎకరాల మాగాణి, 4.25 లక్షల ఎకరాల మెట్ట సాగు కానుంది. ఇక ప్రకాశం జిల్లాలో 1.85 లక్షల ఎకరాల మాగాణి, 2.57 లక్షల ఎకరాల్లో మెట్టసాగు కానుంది. ఎడమ కాలువ కింద కృష్ణా జిల్లాలో 3.67 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేపట్టనున్నారు. మూడు సంవత్సరాలుగా వాణిజ్యపంటలు వేసిన రైతులు.. ప్రస్తుతం మాగాణి సాగుకు సమాయాత్తం అవుతున్నారు. మొత్తానికి సాగర్‌ కుడి, ఎడవ కాలువల కింద సాగుచేసే రైతుల మోముల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. నీరు విడుదల చేయడంతో సాగుకు సమాయాత్తం అవుతున్నారు.

సాగర్ కు వరద...

నల్గొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 71,102, ఔట్ ఫ్లో 32,669 ఉండగా ప్రస్తుత నీటి మట్టం 586.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. నేడు, రేపు మరోసారి గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది.

 

భారత సైన్య నిషేధిత మారణాయుధాల లభ్యం...

ప్రకాశం : హనుమంతరాయుని పల్లెలో భారత సైన్య నిషేధిత మారణాయుధాలను పోలీసులు లభ్యం చేసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. 

09:24 - September 3, 2018

విజయవాడ : ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తరచూ ప్రమాదాలకు గురవుతూ అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ఇందులో తప్పెవరిది? వీఐపీల కార్లు బలిగొంటున్న ప్రజల ప్రాణాలకు సమాధానం ఎవరు చెప్తారు? లెట్స్‌ వాచ్‌దిస్‌ స్టోరీ.... ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లు ప్రజల పాలిట యమదూతల్లో మారిపోతున్నాయి. వీఐపీ కాన్వాయ్‌ రోడ్డు మీదకు వచ్చిందంటే చాలు ప్రజలు హడలిపోవాల్సిన రోజులు వచ్చాయి. వీఐపీ కాన్వాయ్‌ను వస్తోందంటే ఎవరికో మూడిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, పోలీసుల వైఫల్యం... వెరసి ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి.

ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లోని ఈ మధ్య తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. జనాన్ని గాయపర్చడమో.. లేక వారి ప్రాణాలు బలిగొనడమో జరుగుతోంది. ఈ మధ్యకాలంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వాహనం ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాజకీయంగా కూడా పెద్ద దుమారమే లేపింది. టీడీపీ, బీజేపీ మధ్య మాటలయుద్ధానికి తెరతీసింది. ఈ ఘటన మరువక ముందే.. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు వాహనం.. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ రెండు ఘటనల్లోనూ ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లోని డ్రైవర్ల నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయినా ప్రజాప్రతినిధులపైకానీ... కారు డ్రైవర్లపైకానీ ఎలాంటి కేసులు లేవు. చర్యలేమీ లేకుండానే వివాదం సద్దుమణిగింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకో రూలు... సామాన్య ప్రజలకో రూలా అంటూ మండిపడుతున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాన్వాయ్‌ కూడా ఈ మధ్య ప్రమాదానికి గురైంది. అయితే అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఇలా ఒకటేమిటి తరచూ వీఐపీల కాన్వాయ్‌లు ప్రమాదానికి గురవుతూ ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. అయినా పట్టించుకునే వారే లేరు. దీంతో వీఐపీ కల్చర్‌ను సమాజం ప్రశ్నిస్తోంది. విదేశాల్లో మాదిరిగా వీఐపీ కల్చర్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది.ప్రజాసేవ చేస్తున్నామంటున్న నేతలు కాన్వాయ్‌పేరుతో హడావుడి చేయడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీఐపీల కాన్వాయ్‌ ప్రమాదాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

09:17 - September 3, 2018
09:14 - September 3, 2018

హైదరాబాద్ : నేడు కృష్ణాష్టమి. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను పూలు..విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. తిరుమల, యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు కృష్ణుడి వేషాలు వేస్తు అలరించారు. 

09:10 - September 3, 2018

చిత్తూరు : ధనియాల గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు రూ. 2.5 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పుంగనూరు మండలం హనుమంతరైదిన్నెలోని ధనియాల గౌడోన్ ను 25 మంది రైతులు ఈ నిర్వహిస్తున్నారు. సమీపంలో ఉన్న రైతులు వారి వారి ఆహార ధాన్యాలను ఇక్కడ నిల్వ చేస్తుంటారు. తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ధనియాలను సరఫరా చేస్తుంటారు.

ఆదివారం రాత్రి ఒక్కసారిగా గౌడోన్ లో మంటలు అంటుకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపలికి వెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది వీలుకాలేదు. అతికష్టం మీద లోనికి వెళ్లిన సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గోడౌన్ లో సరైన ప్రమాణాలను పాటించారా ? లేక ఇతర కారణాలున్నాయా ? అనేది తెలియాల్సి ఉంది. భారీ నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 

ధనియాల గౌడోన్ లో ఫైర్ ఆక్సిడెంట్...

చిత్తూరు : పుంగనూరు మండలం హనుమంతరైదిన్నెలోని ధనియాల గౌడోన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. రూ. 2.5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచన.

శివరాజ్ సింగ్ కు నిరసన సెగ...

మధ్యప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిరసన సెగ తగిలింది. జన్ ఆశ్వీరాద్ యాత్ర నిర్వహిస్తున్న ఆయనకు ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. 

08:59 - September 3, 2018

పశ్చిమ బెంగాల్ : రాజధాని కోల్‌కతాలో పసికందుల మృతదేహాలున్న ప్లాస్టిక్ సంచులు కలకలం సృష్టించాయి. పాలిథిన్‌ కవర్లలో 14 మంది శిశువుల మృతదేహాలున్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానిక హరిదేవ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ సంచులు అక్కడికి ఎలా వచ్చాయి.. ఎవరు తీసుకొచ్చారు.. అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

08:28 - September 3, 2018

చిత్తూరు : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబరు 13 నుంచి 21 వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుంచి 18 వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్నాట్లు చేస్తోంది. సెప్టెంబరు 13 న స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అధిక మాసం కావడంతో.. తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. తొలిగా ఈనెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరులో నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు 12న వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ జరగనుంది. 13న ద్వజారోహణం ఉంటుంది. ఆ రోజు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అదేరోజు రాత్రి స్వామివారికి పెద్దశేషవాహనం, 17న అత్యంత ప్రధానమైన గురుడసేవ జరుగుతుంది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్‌, ఇంజనీరింగ్ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. గరుడసేవ రోజున వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు. కార్లను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. అన్నప్రసాదం, మంచినీరు, రవాణా, అత్యవసర వైద్య సౌకర్యాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. గరుడసేవ రోజున 6 లక్షల తాగునీటి ప్యాకెట్లను సిద్దం చేస్తున్నారు. అదనపు వైద్య సిబ్బందితోపాటు.. అవసరమైన అంబులెన్సులు సిద్దం చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రవేశద్వారాల వద్ద తోపులాట లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.

పెయింటింగ్‌, విద్యుత్‌ అలంకరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు అన్ని పనులు పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటికే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు విడివిడిగా అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.  

కాసేపట్లో కౌంటింగ్...

కర్నాటక : 102 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 31న ఈ ఎన్నికలు జరిగాయి. కల్బుర్గిలో ఈవీఎంలను భద్రపరిచారు. 

పుల్వామాలో కార్డన్ సెర్చ్...

జమ్మూ కాశ్మీర్ : పుల్వామా జిల్లాలో ఆర్మీ బలగాలు, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

07:25 - September 3, 2018

తెలంగాణలో సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. తమను క్రమబద్దీకరించాలని.. తమకు 24వేలు కనీస వేతనంగా నిర్ధారిస్తూ.. వేతనాలు పెంచాలని, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని.. తదితర డిమాండ్లతో వారు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే.. సమ్మెకైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. అందరి సమస్యలను పరిష్కరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తమ సమస్యను కూడా అర్థం చేసుకుని పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వారి డిమాండ్లు, వారి పట్ల ప్రభుత్వ విధానంపై టెన్ టివి జనపథంలో సర్వ శిక్షా అభియాన్‌ ఉద్యోగులు సురేందర్, మరియు పాషాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:20 - September 3, 2018

ఢిల్లీ : సౌతాంప్టన్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌ 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసింది. ఇక భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులు చేసింది. 245 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. 184 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

 

శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు...

చిత్తూరు : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబరు 13 నుంచి 21 వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుంచి 18 వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్నాట్లు చేస్తోంది. సెప్టెంబరు 13 న స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

07:16 - September 3, 2018

విజయవాడ : దుర్గగుడికి ఎలాంటి అధికారి ఈవోగా వచ్చినా.. వివాదాల్లో చిక్కుకుని అర్థంతరంగా వెళ్లిపోవాల్సి వస్తోంది. గత పదేళ్లలో 10 మంది ఈవోలు మారడమే ఇందుకు ఉదాహరణ. గుత్తేదారుల ఆధిపత్యం, సుదీర్ఘకాలం పాతుకుపోయి వివాదాలకు కేంద్ర బిందువులుగా నిలిచే కీలకమైన కొందరు సిబ్బంది కుతంత్రాలు, రాజకీయ జోక్యం ఈ మూడు కారణాల వల్లే ఈవోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయట ఎంతో సమర్థ అధికారిగా పేరున్నా దుర్గగుడికి వచ్చేసరికి మాత్రం వివాదాల్లో చిక్కుకుంటున్న వైనంపై 10 టివి ప్రత్యేక కధనం...దుర్గగుడిలో పనిచేసిన మాజీ ఈవోలు. ఒకప్పుడు ఇంద్రకీలాద్రిని గడగడలాడించి.. చివరికి అవమాన భారంతో వెనుదిరిగినవారే. కొందరు ఏఈవో స్థాయి సిబ్బంది ఏవోలను సైతం శాసించే స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. వారికి రాజకీయ నేతల అండ కూడా ఉండడంతో.. ఈవోలకు తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. 2008లో దుర్గగుడిలో ఈవోగా పనిచేసిన చంద్రకుమార్ దగ్గర నుంచి.. ఈ పదేళ్లలో వచ్చిన ఏ ఒక్క ఈవో నిలకడగా ఉన్న దాఖలా లేదు.

ఆలయ ఎఫ్.డి.ల వినియోగ వివాదంతో చంద్రకుమార్ ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఈవో విజయకుమార్ హుండీ ఆదాయంతోపాటు.. ఎఫ్.డి.లను పెంచారు. కానీ ఉద్యోగుల సహకారాన్ని పెంచుకోలేక.. ఇక్కడనుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆతర్వాత ఈవోగా రఘునాథ్‌ వచ్చారు. అప్పటి మంత్రి ఉన్న తోట నర్సింహం వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదన్న కారణంతో ఆయనపై వేటు పడింది. లైంగిక వేదింపుల వివాదంలో ప్రభాకర్ శ్రీనివాస్‌పై వేటుపడగా... స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ నర్సింగరావు.. ఓ అర్చకుడిని మందలించిన వివాదంలో అర్థాంతరంగా వెళ్లిపోయాడు. ఇన్‌ఛార్జ్‌ ఈవోగా వచ్చిన ఆజాద్ కొండమీది కట్టడాలు కూల్చివేత వివాదంతో వెళ్ళిపోయారు. మరో ఇన్‌ఛార్జ్‌ ఈవో త్రినాథరావు కూడా నిలకడ ఉండలేకపోయారు.

దుర్గ గుడిలో ఏవోలుగా పనిచేసిన మహిళలు సైతం వివాదాలకు అతీతం కాదు. 2016లో తొలిసారి ఐఏఎస్ అధికారి సూర్యకుమారి తాంత్రిక పూజల వివాదంతో వెళ్లిపోయారు. మరో ఐఏఎస్ అధికారి పద్మ అమ్మవారి చీర మాయమైన వివాదంలో చిక్కుకోవడంతో వేటుపడింది. ఇక్కడ జరిగే వివాదాల్లో కేవలం ఈవోలు మాత్రమే బలైపోతున్నారు. మిగతా సిబ్బంది మాత్రం దశాబ్దాలుగా ఇక్కడే పాతుకుపోతున్నారు. దశాబ్దాలుగా దుర్గగుడిలో ఇదే తంతు కొనసాగుతోంది. ఆలయ ఉద్యోగుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో 30 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. వారిలో 10 మంది వరకూ వివాదాస్పద ఉద్యోగులున్నారు. 

07:00 - September 3, 2018

నెల్లూరు : జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేశారు. విశాఖ జిల్లా చోడవరం పర్యటనలో ఉన్న జగన్‌... ఆనంకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనంతోపాటు ఆయన అనుచరులు కూడా జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చకున్నారు. ఆనం చేరికతో నెల్లూరు జిల్లా వైసీపీలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం సోదరుడు దివంగత ఆనం వివేకానందరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు.. ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆనం ఎమ్మెల్సీ పదవి ఆశించారు. చివరికి ఏదైనా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించినా సర్దుకుపోదామనుకున్నారు. కానీ చంద్రబాబు ఏ పదవీ ఇవ్వకపోవడంతో టీడీపీలో గుర్తింపు దక్కలేదన్న భావనంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది మేలో నెల్లూరులో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు వేదిక నుంచి చంద్రబాబు ప్రభుత్వాన్ని, అధినాయకత్వాన్ని రామనారాయణరెడ్డి విమర్శించారు. అప్పట్లోనే పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఆనంతరం తన అనుచరులతో సమావేశమై టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీ నాయకులతో మూడు నెలల పాటు జరిపిన చర్చల అనంతరం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించి ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆనం విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలను టీడీపీ సాధించలేకపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆనం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఆనం చేరిక నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

06:57 - September 3, 2018

హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠకు దారితీసిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికలపై తెలంగాణ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈనెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో పలు వర్గాలకు వరాలు ప్రకటిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అణగారిన వర్గాల సామాజిక భవనాలకు 71 ఎకరాల భూమి, 70కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పనిచేస్తున్న ఆశా వర్కర్లు, సెకండ్ ఏఎన్‌ఎంలు, డాక్టర్ల వేతనాలు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రగతి నివేదన సభ తుది ఏర్పాట్లలో నిమగ్నమైన మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, జలవనరులు శాఖ మంత్రి హరీశ్‌రావు కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం సిఫారుసు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కొంగర కలాన్‌ ప్రగతి నివేదన సభలో అసెంబ్లీ రద్దను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటిస్తారని అనకున్నారు. అయితే ఈ భేటీలో అసెంబ్లీ ముందస్తు ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ... త్వరలో మరోసారి నిర్వహించే కేబినెట్‌ సమావేశంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని ముక్తసరిగా చెప్పారు. ఈనెల 5న మరోసారి కేబినెట్‌ భేటీ కానుంది.

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగులు, డాక్టర్ల వేతనాలు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆశా వర్కర్లకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఎనిమిదన్నర వేల రూపాయలకు పెంచారు. దీని వలన 25,045 మంది ఆశా వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సెకండ్‌ ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టుల వేతనాలుకు కూడా పెరిగాయి. సెకండ్‌ ఏఎన్‌ఎంలకు నెలకు ప్రస్తుతం ఇస్తున్న 11 వేల రూపాయలను 21 వేలకు పెంచారు. దీని వలన 9 వేల మందికిపైగా రెండో ఏఎన్‌ఎంలకు లబ్ధి చేకూరుతుంది. కాంట్రాక్ట్‌ డాక్టర్లకు కూడా వేతనాలు పెరిగాయి. జనాభాలో 50 శాతంపైగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు హైదరాబాద్‌లో భవనాలు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెడ్డి హాస్టల్‌ కోసం గతంలో కేటాయించిన 10 ఎకరాల భూమికి అదనంగా మరో 5 ఎకరాలు కేటాయించింది. అలాగే గోపాలమిత్రల వేతనాలను పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు పదవీ విరమణ వయసు పెరిగింది. మిడ్‌మానేరు ప్రాజెక్టు గండిపడి ముంపుతో నష్టపోయిన మన్వాడ గ్రామంలోని ఒక్కో కుటుంబానికి 4.25 లక్షల రూపాయాలు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొత్తం 25.84 కోట్ల రూపాయలు కేటాయించింది. కంటివెలుగు అమలు జరుగుతున్న తీరుపై కేబినెట్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. 

06:54 - September 3, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. సభ అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని విమర్శించింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు. ప్రగతి నివేదన సభ ప్రజల ఆవేదన సభగా మారిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు..

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారని ఉత్తమ్‌ విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ముస్లింలు, గిరిజన రిజర్వేషన్ల పెంపు, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీలాంటి విషయాలను కేసీఆర్‌ ప్రస్తావించకపోవడాన్ని ఉత్తమ్‌ తప్పు పట్టారు.

ప్రగతి నివేదన సభ కాస్తా ప్రజల ఆవేదన సభగా మారిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పులు, సాధించిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాలను సభలో ప్రస్తావించకపోవడంపై ఆయన మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ నిర్వహించినది ప్రగతి నివేదన సభకాదని... అది ప్రగతి నిరోధక సభ అంటూ మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో వసూళ్లకు అలవాటుపడిన టీఆర్‌ఎస్‌ నాయకులు.. నేడు సభ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా.. మాటలగారడి చేస్తున్నారని తెలిపారు. మొత్తానికి ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఆ సభతో తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

06:47 - September 3, 2018

హైదరాబాద్ : ప్రజల సంక్షేమానికి మరెన్నో సంక్షేమ పథకాలు చేపడతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. నాలుగున్నరేళ్ల పాలనలో 469 సంక్షేమ పథకాలు చేపట్టామని.... 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనని హామీలను కూడా నెరవేర్చామన్నారు. మరోసారి ప్రజలు దీవిస్తే బంగారు రాష్ట్రాన్ని తెలంగాణ చేస్తామన్నారు గులాబీ దళపతి. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు 2000 సంవత్సరంలోనే బీజం పడిందన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. తెలంగాణ వస్తే ఏం చేయాలనే ఆలోచనలు జయశంకర్‌ సార్‌తో కలిసి 2006-07లోనే చేశామన్నారు. అప్పటి ఆలోచనల ఫలితమే నేటి సంక్షేమ పథకాలన్నారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు సీఎం.

14 ఏళ్ల కఠోర శ్రమ అనంతరం తెలంగాణ సాధించుకున్నామన్నారు సీఎం. వేరే వారితో కలిసే వెళ్తే కష్టపడి సాధించుకున్న తెలంగాణకు న్యాయం జరగదనే అభిప్రాయంతో 2014 ఎన్నికలకు ఒంటరిగా వెళ్లామన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని ఎంతోమంది శాపనార్దాలు పెట్టారు. కానీ.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యుత్‌ కష్టాలు తొలిగించామన్నారు. దేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు కేసీఆర్‌.

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు సీఎం. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేతివృత్తుల వారికి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో అందరికీ కేజీ నుండి పీజీ విద్య అందిస్తామన్నారు కేసీఆర్‌. ఎన్నో ఏళ్లుగా అన్యాయానికి గురైన గిరిజనుల గురించి ఆలోచించి.. గిరిజన తండాలను పంచాయతీలు మార్చామన్నారు కేసీఆర్‌. తెలంగాణకు శాశ్వత ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు కేసీఆర్‌. త్వరలోనే కోటి ఎకరాలను ఆకుపచ్చగా మార్చి చూపిస్తామన్నారు సీఎం. .

ఇప్పటికే 22 వేల గ్రామాలకు నీళ్లు అందించామని.. మరో ఆరేడు రోజుల్లో మరో 1300 గ్రామాలకు నీళ్లు అందిస్తామన్నారు కేసీఆర్‌. రైతులకు గురించి ఆలోచించి రుణమాపీ చేశామని.. రైతుబంధు పథకం ప్రవేశపెట్టామన్నారు. నవంబర్‌లో రెండో విడత రైతుబంధు చెక్కులు అందజేస్తామన్నారు ఇసుకపై కాంగ్రెస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఇసుకపై ఆదాయం 10 కోట్ల రూపాయలు వస్తే.. నాలుగున్నరేళ్ల పాలనలో... 1980 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే... రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్నారు స్పష్టం చేశారు కేసీఆర్‌. ప్రజల దీవెనలతో మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గులాబీ దళపతి.

కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభకు జనం భారీగా తరలిరావడంతో సీఎం కేసీఆర్‌ ఉప్పొంగి పోయారు. సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో హెలిక్యాప్టర్‌లోంచి ప్రజలకు అభివాదం చెప్పారు. 

జగన్ 253వ రోజు...

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 253వ రోజు మాడుగుల నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఎ.భీమవరం, పడుగుపాలెం, ఎం.కోడూరు, కె.కోటపాడు, జోగన్నపాలెంలో పాదయాత్ర జరుగనుంది. 

గుంటూరుకు ముగ్గురు మంత్రులు...

గుంటూరు : నేడు జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం కేఈ, మంత్రులు లోకేష్, పుల్లారావులు పర్యటించనున్నారు. 

ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ

హైదరాబాద్ : నేటి నుండి ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్ కాలేజీల్లో 2018-19 ఏడాదికి జీఎన్వైసీ కోర్సుల్లో ఏ కోటా సీట్ల భర్తీ చేయనున్నారు. 

కృష్ణాష్టమి...

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నేడు కృష్ణాష్టమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. వైష్ణవ ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

సిరీస్ ఇంగ్లండ్ కైవసం...

ఢిల్లీ : ఐదు టెస్టుల సిరీస్ ను 3-1 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 246..రెండో ఇన్నింగ్స్ 271. భారత్ తొలి ఇన్నింగ్స్ 273, రెండో ఇన్నింగ్స్ 184.

Don't Miss