Activities calendar

07 September 2018

22:02 - September 7, 2018

హైదరాబాద్ : దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ రాష్ట్ర విభజన అనంతరం పరిణామాల మధ్య కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి కొండా దంపతులు జంప్ అయ్యారు. కాగా కారెక్కినాటినుండి కొండా దంపతులకు ఆశలే తప్ప ఎటువంటి పదవులు దక్కలేదు. ఈ నేపథ్యంలో కొండా దంపతులు తిరిగి స్వంత పార్టీకి చేరనున్నారు. దీనికి సంబంధించి జాతీయ నేత గులాంనబీ అజాద్ తో చర్చలు జరిపి దంపతులిద్దరికి టికెట్లు కూడా ఖరారు చేయించుకున్నట్లుగా సమాచారం.  

21:20 - September 7, 2018

తమిళనాడు : రజినీకాంత్ ఆపేరు ఓ సంచలనం, ఓ ఆనందం, ఓ ఉద్వేగం, ప్రజల గుండెల్లో ఆయన ఓ మేరు పర్వతం. అటువంటి నేత రాజకీయాల్లోకి రావాలని అభిమానులు గంగవెర్రులెత్తిపోయారు. వస్తున్నానని సూపర్ స్టార్ ప్రకటించగానే ఆనందంలో మునిగిపోయారు. మరి ఇప్పుడో!!..అయితే ఆయన రాజకీయ ఆరంగేట్రంపై స్పష్టత ఉన్నా..పార్టీ పేరు, గుర్తు లాంటివేవీ ఇంకా ప్రకటనకు నోచుకోలేదు. ఆయన పార్టీ ఇంకా పునాదుల స్థాయిలోనే ఉంది. పూర్తి స్థాయిలో పురుడు పోసుకోకముందే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడానికి రజినీ రెడీ అవుతున్నారంటూ ఓ వార్తా కథనం జాతీయ మీడియాలో జోరుగా ప్రసారమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. ఢిల్లీ వేదికగా ఇప్పటికే ఏడు సార్లు ఇద్దరూ కలిసి చర్చించినట్టు సమాచారం. అదే నిజమైతే రజినీ ఫ్యాన్స్.తమిళ తంబిలు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే.

21:06 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ పలు కీలక రాజకీయ పరిణామాలకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. కనీవినీ ఎరుగనటువంటి పొత్తులకు దారితీస్తోంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ బద్ధ శతృవైన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో టీడీపీతో పొత్తుకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు హైదరాబాద్ వస్తున్నారు. చంద్రబాబుతో ఉత్తమ్ సమావేశం కానున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై రేపు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పొత్తులపై చర్చించేందుకు కలుద్దామని ఉత్తమ్‌కు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి చెప్పారు. ఉత్తమ్ ప్రతిపాదనపై రేపటి టీటీడీపీ సమావేశంలో చర్చ జరగనుంది.

20:38 - September 7, 2018

ఢిల్లీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని ఏడు మండలాలలను ఏపీలో ఏపీలో కలుపుతు విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేసిన అనంతరం ఆ సిన ఏడు మండలాల ఆంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్‌ పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాలతో కలిసి తెలంగాణకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే ఆంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు రావత్. భవిష్యత్తుల్లో జరగబోయే చర్యల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దయినట్లు గురువారం సాయంత్రం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ద్వారా తమకు సమాచారం అందిందన్నారు. రాష్ట్రంలో, జిల్లాల్లో ఎన్నికల సంసిద్ధతపై స్థాయీ నివేదిక సమర్పించాలని సీఈఓని కోరామంటూ ఆ నివేదిక వచ్చిన తర్వాత... ఆ నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసే విషయం నిర్ణయిస్తామని రావత్ చెప్పారు. 

19:49 - September 7, 2018

ఢిల్లీ : సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సీపీఐ నేత నారాయణ మరోసారి తన సహజశైలితో తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రిపై తనదైన శైలిలో విమర్శలు చేసారు. శోభనం పెళ్లికొడుకుతో కేసీఆర్ ను పోల్చిన నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని రద్దు చేసి హడావిడి చేస్తున్న కేసీఆర్ వ్యవహారశైలిపై ఆయన విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లక్ష్మణ రేఖ దాటారని..ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ చేస్తున్న హడావిడి ఎలా వుందంటే..అంటు దీర్ఘం తీసిన నారాయణ ''శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లికొడుకు, ఇప్పుడు మళ్లీ పెళ్లి చేయండి సత్తా చాటుతా'' అన్నట్టుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

19:32 - September 7, 2018

విజయవాడ : తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ నేత జగన్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత జగన్ బహిరంగ సవాల్ విసిరింది. చంద్రబాబూ? నీకు ‘దమ్ముందా..అసెంబ్లీ రద్దు చేస్తారా? మీరు గెలుస్తారని నమ్మితే.. తెలంగాణ రాష్ట్రంలో వలెనే ముందస్తుకు రండి అంటు సవాల్ విసిరారు. చంద్రబాబు ఒంటరిగా ఒక్క ఎన్నికనైనా చంద్రబాబు గెలిచారా? బీజేపీతో పొత్తు పెట్టుకుని 1999లో గెలిచారు. 2009లో మహాకూటమి అంటూ టీఆర్ఎస్ తోనే పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. న్నారు. 2014లో బీజేపీ, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారని చంద్రబాబుపై విమర్శలు సంధించారు.

18:44 - September 7, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పందించారు. ఎటువంటి ఎన్నికల షెడ్యూల్ అయిన ఎన్నికల సంఘం కాకుండా ఇతరులు ప్రకటించడం తప్పని అన్నారు. అసెంబ్లీలో కాని, ఇతర సభలో కాని రాజకీయ నాయకులు ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమని రావత్ వ్యాఖ్యాలనించారు. వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని... అయితే, మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని రావత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నుంచి నివేదిక వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలను నిర్వహించేందుకు యంత్రాంగం, వసతులు, ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉంటే... ముందుగా నిర్వహించేందుకు తమకు ఎలాంటి సమస్య లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. 

18:19 - September 7, 2018

సిద్ధిపేట : అసెంబ్లీ రద్దు చేసిన అనతరం తొలిసారిగా హుస్నాబాద్ సభలో పాల్గొన్న తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఒకపక్క ప్రజలకు తెలియజేస్తునే..మరోపక్క కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు సంధించారు.

తెలంగాణను మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ తెలిపారు. కోటి ఎకరాలకు సాగు నీటిని అందించడమే తన లక్ష్యమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తన ఆకాంక్ష అని తెలిపారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజలకు భరోసా కలిగిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు అధికారంలో వున్న సమయంలో చేవలేక..చేతకాక అభివృద్ధిలో తెలంగాణకు వెనుకబాటుకు గురిచేశారన్నారు. అభివృద్ధి దిశగా పయనించేందుకు దేశంలో ఎక్కడా లేని సంక్షేమపథాకాలను, రైతన్నలకు 24గంటల ఉచిత విద్యుత్ ను అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని..ఇంత అభివృద్ధి సాధిస్తున్నా కాంగ్రెస్ నేతల మాపై ఎన్నో ఆరోపణలు చేసిన వాజమ్మలు కాంగ్రెస్ నేతలేని ఎద్దేవా చేశారు. కానీ, ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాలని హుస్నాబాద్ సభలో తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. 

17:53 - September 7, 2018

సిద్దిపేట : హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. జానారెడ్డికి నిజాయితీ వుంటే గులాబీ కండువ కప్పుకోవాలని హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాద సభలో తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్ పాలన వచ్చిన తరువాత తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తామన్నాం..ఇచ్చి చూపంచామనీ..24 గంటలు సాధ్యమైతే గులాబీ కండువా కప్పుకుంటానన్న జానారెడ్డి ఎక్కడున్నాడనీ..అది సాధ్యం అయితే తానే గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని జానారెడ్డి నిండు శాసనసభలో చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఆయనకు నిజాయితీ ఉంటే ఆ పని చేసి చూపించాలి. రాష్ట్రంలో అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదు. కాంగ్రెస్ నేతలు కంటి వెలుగులో పరీక్షలు చేయించుకోని రాష్ర్టాభివృద్ధిని చూడాలని సీఎం పేర్కొన్నారు.

ముందస్తు ఎన్నికలకు సిద్ధమని అన్ని పార్టీలు ప్రకటించాయని... ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీని రద్దు చేస్తే, ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని చెప్పారు. ఎన్నికలు వచ్చాయంటే అమలు చేయలేని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటేనని అన్నారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడైనా వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు సమైక్య పాలనలో గళమెత్తి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ఈ ఎన్నికలు రావడానికి కాంగ్రెస్సే కారణమని తెలిపారు. 

17:44 - September 7, 2018

సిద్ధిపేట : హుస్నాబాద్ సభలో కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల నోళ్లకు హద్దూ, పద్దూ లేదని విమర్శించారు. అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదరికానికి కాంగ్రస్ పార్టీ కారణం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలేమైనా గంధర్వులా? పైనుంచి దిగి వచ్చారా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని... ఈ అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా? అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

17:28 - September 7, 2018

సిద్ధిపేట : అసెబ్లీ రద్దు చేసిన సీఎంగా కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ లో కేసీఆర్ మాట్లాడుతు..కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై తనశైలిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రా నేతలకు చూస్తే కాంగ్రెస్ నేతలకు లాగులు తడుస్తయ్ అని..కాంగ్రెస్ నేతలకు టిక్కెట్లు కేటాయించాలంటే కూడా ఢిల్లీలోనే జరుగుతుయనీ..కాంగ్రెస్ ముదనష్టపు పాలన వల్లనే తెలంగాణకు తెగులు పట్టిందన్నారు. మాజీ దివంగత నేత వైఎస్ వల్లనే గైరెల్లి ప్రాజెక్టు దుస్థితి అన్నారు. కాంగ్రెసోళ్లకు పైరవీలు చేసుకోవటమే తప్ప ప్రజల సంక్షేమం మాత్రం పట్టలేదని విమర్శించారు. ఏ సీఎం చేయని సాహసంతో రాష్ట్రంలో 31 జిల్లాలో చేశామన్నారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ కూడా సిద్ధమన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ లాంటి కిట్ కాంగ్రెస్ వాళ్లు ఇచ్చారా? అని కేసీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు భరోసా వచ్చిందన్నారు. కాంగ్రెస్ వారు పేలే అవాకులు చవాకులకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని కేసీఆర్ పేర్కొన్నారు.

17:12 - September 7, 2018

సిద్ధిపేట : రాష్ట్ర అవతరణ అనంతరం తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమమంత్రిగా తొలిసారి కేసీఆర్ సిద్ధపేటలోని హుస్నాబాద్ లోని ప్రజల అశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు.. శ్రావణశుక్రవారం నాడు వారంలో '6'వ రోజున హుస్నాబాద్ లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని 'ప్రజల ఆశీర్వాద' సభలో పూరించారు. కొత్తకొండ ఈరన్న కొలువుదీరిన హుజ్నాబాద్ లో ఎన్నికల శంఖారావంలో దేశంలోనే తెలంగాణ అగ్రరాష్ట్రంగా వుందనీ..దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని..రాష్ట్రంలో అభివృద్ధి చూడలేని కళ్లులేని నేతలు కాంగ్రెస్ నేతలనీ..వారి వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనన్నారు. దేశాన్ని 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ కరవు కారణమని కేసీఆర్ విమర్శలు సంధించారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని కేసీఆర్ స్పష్టంచేశారు. 

16:43 - September 7, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా వుండే కేసీఆర్ కీలక పరిణామాల మధ్య అసెంబ్లీని రద్దు చేశారు. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. దీన్ని వ్యతిరేకిస్తు హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రభుత్వానికి ఇంకా 9 నెలలు గడువు వుండగా ..అసెంబ్లీని రద్దు చేయటాన్ని సవాల్ చేస్తు రాపోలు భాస్కర్ అనే ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిని ప్రభుత్వం పాలన ఐదేళ్లు పూర్తయ్యేంత వరకూ ఎటువంటి ఎన్నికలు జరపకుండా చూడాలని ముందస్తు ఎన్నికలు జరగకుండా చూడాలని రాపోలు భాస్కర్ పిటీషన్ లో కోరారు. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడతుందనీ..ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని కాబట్టి ముందస్తు ఎన్నికలు జరకుండా చూడాలని పిటీషనర్ రాపోలు భాస్కర్ కోరారు. దీనిపై విచారణకు స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణను పరిశీలించిన మంగళవారానికి వాయిదా వేసింది. 

16:21 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు వేడి రాజుకున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి టీర్ఎస్ పై విమర్శలు సంధించారు. అసెంబ్లీ రద్దు అనంతరం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అభ్యర్థులను ప్రటించారు. ఈ ప్రకటనలో కొన్ని నియోజకవర్గాలకు నేతలను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. వీటిలో జహీరాబాద్ నియోజకవర్గం కూడా ఒకటి.ఈ ఈ విషయంపై గీతారెడ్డి మాట్లాడుతు..జహీరాబాద్ నియోజకవర్గంలో తన విజయాన్ని అడ్డుకోవటం టీఆర్ఎస్ తరం కాదని..తనపై పోటీ చేసేంత దమ్ము వున్న నేతలు టీఆర్ఎస్ లో లేరనీ..అందుకే కేసీఆర్ జహీరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని ఈ ఎన్నికలతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని గీతారెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శనలు సంధించారు. 

15:31 - September 7, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించి పాక్ లో అధికారంలోకి వచ్చారు. కాగా పాకిస్థాన్ లో అధ్యక్షుడు ఎవరైనా..ముఖ్యమంత్రి ఎవరైనా అధికారం మాత్రం సైన్యానిదే. సైన్యం కనుసన్నల్లోని అన్నీ జరుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ అధికారంలోకి వచ్చాక పాక్ విధి విధానాలు మారతాయనే అందరు ఊహించారు. కానీ సదా మామూలుగానే పాత పద్ధతిలోనే పాక్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ దేశ సైన్యం తీరు మాత్రం మారలేదు. ఇండియాను రెచ్చగొట్టేలా పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తమ సైనికులను చంపితే... అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కశ్మీర్ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్ లో జరిగిన డిఫెన్స్ డే ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజలకు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. కశ్మీర్ సోదరులు, సోదరీమణులు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవని అన్నారు. 

14:59 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దీంతో తెలంగాణలో టీడీపీ నేతల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటంతో కొందరు నేతలు కారెక్కాశారు. టీడీపీలో బలమైన నేత రేవంత్ రెడ్డి అందరికీ భిన్నంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. టీడీపీ నుండి కారు పార్టీలోకి వెళ్లిన ఎర్రబెల్లికి గులాబీ నేత సీట్ కూడా ఖరారు చేసిన ప్రకటించేశారు. ఇక ఎటు వెళ్లలేక..టీడీపీ నుండి బహిష్కరించబడిని మోత్కుపల్లి నర్శింహులు మాత్రం రెండూ చెడ్డ రేవడిలా ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మోత్కుపల్లి ఈ ముందస్తు ఎన్నికల్లో స్వంతగా తన సత్తా చూపించుకోవటానికి సిద్ధమైపోయారు. సైకిల్ పార్టీ పొమ్మంది. కారు పార్టీ రమ్మనలేదు. ఈ క్రమంలో  ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు మోత్కుపల్లి.

ఈ నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మోత్కుపల్లి ప్రకటించారు. 35 ఏళ్లుగా ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆలేరు నియోజకవర్గ ప్రజలు తనను దీవించి శానసనభకు పంపాలని కోరారు. ఎన్నికల్లో తాను గెలుపొందితే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు గోదావరి జలాలను సాధించి సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. ఈ నెల 17న యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించబోతున్నానని... ఆ భేటీలో అన్ని విషయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

14:45 - September 7, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కానీ ఇది కొత్తకాదు. ఇంతకు ముందు జరిగినదే. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1985, 2004లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుకు సర్వం సిద్ధమవుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి రద్దు చేయటం..ముందస్తు ఎన్నికలు సమరశంఖం పూరింటంచం, విపక్షాలు ఆగమేఘాలమీద తమ తమ అభ్యర్థులను ఖాయం చేసుకోవటం వంటి వేడి పెరిగిపోయింది. దీంతో తెలంగాణలో వర్షాకాలంలోనే వేసవి వేడిరాజుకుంది. తెలంగాణ అసెంబ్లీ రద్దైంది. ముందస్తు ఎన్నికలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. కాగా ఈ ముందస్తు కథ ఏమిటో తెలుసుకుందాం. గత మూడు దశాబ్దాలలో ఈ విధంగా ముందస్తుకు వెళ్లడం ఇది మూడోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1985, 2004లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ముందస్తుకు సర్వం సిద్ధమవుతోంది.

1985లో సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్..
తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే దివంగత ఎన్టీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే రామారావును తప్పించి, నాదెండ్ల భాస్కరరావు సీఎం పగ్గాలను చేపట్టారు. అనంతరం మళ్లీ ఎన్టీఆర్ సీఎం పదవిని చేపట్టారు. ఆ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఎన్టీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో 1985లో సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఘన విజయం సాధించారు.

2004లో ఏపీలో ఎన్నికలు..విజయం సాధించిన టీడీపీ..
2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అలిపిరి బ్లాస్ట్ ఘటన అనంతరం ఆయన ముందస్తుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో కేంద్రంలో వాజ్ పేయి నాయకత్వంలో ఉన్న ఎన్డీయే సైతం ముందస్తుకు సిద్ధం కావడంతో... ఏపీలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే ఊహించని విధంగా ఈ ఎన్నికల్లో టీడీపీ కేవలం 47 సీట్లను మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది.

ముందస్తుకు వేడి రాజేసింన కేసీఆర్..
ఇప్పుడు తాజాగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ గడువు ఇంకా ఏడు నెలలు ఉండగానే అసెంబ్లీని రద్దు చేయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభకు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే నవంబర్ లో ఇతర నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం వేచి చూడాలి. 

14:29 - September 7, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నెత్తిన అదనపు భారాలు పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరుగతు సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగి సామాన్యులకు సవాల్ విసురుతున్నాయి. దీంతో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రూపాయి విలువ పతనమవుతుండటం పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా పెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ముంబైలో పెట్రోల్ ధర ఆల్ టైమ్ హైని తాకింది. ఈరోజు ఏకంగా లీటర్ కు 52 పైసలు పెరిగి రూ. 87.39కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 79.99కి చేరింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.91, డీజిల్ ధర రూ. 78.48కి పెరిగింది.   

14:08 - September 7, 2018

హైదరాబాద్ : సురేష్ రెడ్డికి పార్టీలో సముచితస్థానం కల్పిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు, రాష్ట్రానికి సురేష్ రెడ్డి సేవలు అందించారని చెప్పారు. కలిసి పని చేసే అవకాశం వచ్చినప్పుడు ఆలోచిద్దామని సీఎంతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ కు సురేష్ రెడ్డి 1989 నుంచి తెలుసునని పేర్కొన్నారు. 1989 నుంచి పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటున్నారని తెలిపారు.

13:40 - September 7, 2018

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయడం అభ్యంతరకరమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం విమర్శలను సహించలేకపోతోందని మండిపడ్డారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే ధోరిణిలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ కలుషితం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా త్యాగాలు చేసిందని జానారెడ్డి పేర్కొన్నారు. 

13:13 - September 7, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ లోకి చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ ఎస్ లో చేరారు. కేటీఆర్ సురేష్ రెడ్డిని పార్టీకిలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు అభివృద్ధిలో భాగస్వామిని అయ్యేందుకే టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ వచ్చాక అభివృద్ధిపరంగా నిశబ్ధ విప్లవాన్ని చూశానని తెలిపారు. తెలంగాణకు ఇది క్రిటికల్ టైమ్ అని పేర్కొన్నారు.

 

12:42 - September 7, 2018

హైదరాబాద్ : మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ ఎస్ లో చేరారు. కేటీఆర్ సురేష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు సురేష్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం సురేష్ రెడ్డి, కేటీఆర్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ ఎస్ లో చేరినట్లు సరేష్ రెడ్డి ప్రకటించారు. 

11:58 - September 7, 2018

ఢిల్లీ : మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ నాలుకపై కాంగ్రెస్‌నేత, మాజీ మంత్రి సుబోధ్‌ సావ్‌జీ ఐదు లక్షల నజరానా ప్రకటించారు. దీంతో ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. యువకులు కోరుకుంటే నచ్చిన అమ్మాయిని అపహరించి తీసుకొస్తానని రామ్‌ కదమ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని బులదానాలో సుబోధ్ సావ్ జీ గురువారం ఓ సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా ఎవరైతే రామ్‌ కదమ్‌ నాలుక కోసి తెస్తారో వారికి రూ.5లక్షలు నజరానా అందజేస్తానని ఆయన బహిరంగవేదికపై ప్రకంటించారు. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు సుబోధ్‌ నిరాకరించారు.

కాగా ఘట్కోపర్‌లో ‘దహీ హండీ’వేడుకలో మాట్లాడుతూ రామ్ కదమ్‌ చేసిన వ్యాఖ్యాలపై సొంతపార్టీతో సహా వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘యువకులు నన్ను ఏ పని మీదైనా కలవచ్చు. మీకు వందశాతం ఆ పని చేసి పెడతాను. మీ తల్లిదండ్రులను కూడా తీసుకురండి. వారు ఒప్పుకుంటే మీకు నచ్చిన అమ్మాయిని అపహరించి తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటూ’వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. ఆ సమయంలో పెద్దఎత్తున యువకులు ఆ వేడుకలో ఉండటంతో ఉత్సాహంతో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఆయనకు నోటీసులు జారీచేసింది. 

 

11:10 - September 7, 2018

ఒహియోః అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని నార్త్ బెండ్ కు చెందిన దుండగులు జరిపిన కాల్పుల్లో గుంటూరుకు చెందిన ఆర్థిక సలహాదారు పృధ్వీరాజ్ కందెపితో పాటు మరో ఇద్దరు బలయ్యారు. 26 ఏళ్ల ఒమర్ ఎరిక్ శాంతా పెరేజ్ అనే వ్యక్తి ఫౌంటలైన్ స్కేర్ లోని ఫిప్త్ థర్డ్ బ్యాంక్ వద్ద కాల్పులు జరిపినట్టు డౌన్ టౌన్ సిన్ సిన్నటి పోలీసులు తెలిసారు.

పృధ్వీరాజ్‌ గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన వాడు.  చదువు పూర్తయిన తర్వతా అమెరికాలో ఫిప్త్ థర్డ్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం బ్యాంకు విధులు ముగించుకుని ఉద్యోగులంతా బయటకు వస్తున్న వారిపై దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు.

10:59 - September 7, 2018

గుంటూరు : ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన నేపధ్యంలో తెలంగాణలో పార్టీల హడావుడి మొదలైంది. దీంతో అన్ని పార్టీల నాయకులు ఎన్నికల ప్రచార రధాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ప్రచార రధాల తయారీలో పేరుగాంచిన గుంటూరులోని ఎంపి రాయపాటి సాంబశివరావుకు చెందిన జయలక్ష్మీ డిజైనర్స్ తమ ఖార్ఖానాలో అందమైన ఎన్నికల ప్రచార రధాలను పెద్ద ఎత్తున సిద్ధం చేస్తోంది. టిఆర్ఎస్ నేతల నుండి వాహనాల తయారీ అర్డర్లు అధికంగా వస్తుండటంతో వాటిని సిద్ధం చేసే పనిలో వర్కర్లు రాత్రింభవళ్ళు పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం రథం తయారవుతుంది. అన్ని హంగులతో రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఆ రథంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. 
ప్రచారానికి సిద్ధమవతున్న నేతలు  
తెలంగాణా అసెంబ్లీ రద్దుతో నేతలంతా ఇక ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థి జయాపజయాల్లో ప్రచారం చాలా కీలకం. ప్రచారంలో సక్సస్ అయితే సగం గెలిచేసినట్లే. అందులో భాగంగా తమ కోసం ప్రత్యేకంగా ఎన్నికల రధాలను సిద్ధం చేసుకోవడంలో నేతలు అప్పుడే నిమగ్నమయ్యారు. మోడరన్ స్టైళ్లో ప్రచార రధాల తయారీకి పెట్టింది పేరైన గుంటూరులోని జయలక్ష్మీ డిజైనర్స్ ఖార్ఖానాలో ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రచార రధాల తయారీ చాలా స్పీడుగా జరుగుతోంది. 

 

10:39 - September 7, 2018

హైదరాబాద్ : నిజాం మ్యూజియంలో చోరీ కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మ్యూజియంలో పక్కా ప్రణాళికతోనే దోపిడీ జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. పురానాహవేలీలో ఉన్న ఈ మ్యూజియంలోకి ఎలా ప్రవేశించాలో.. ఏం తీసుకెళ్లాలో ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం మ్యూజియం పైన మూడు చోట్ల మార్కులు పెట్టుకున్నారు. ఈ నెల మూడో తేదీన చేసుకున్న మార్కుల ఆధారంగా మ్యూజియంలోకి ప్రవేశించి వచ్చిన పనిని కానిచ్చారు. గ్యాలరీలోకి ప్రవేశించి రెండు గంటల పాటు అక్కడే గడిపిన వీరు కచ్చితంగా స్థానికులే అయి ఉంటారని అనుమానిస్తున్నారు.
సీసీ కెమెరాలకు చిక్కిన చోరీ దృశ్యాలు  
నిజాం మ్యూజియంలో విలువైన వస్తువులు చోరీ చేసిన దుండగుల దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. అయితే.. తమ ముఖాలు కనిపించకుండా వాళ్లు మాస్క్‌లు కట్టుకోవడంతో ఎవరన్నది స్పష్టంగా తెలియడం లేదు. చోరీ అనంతరం పల్సర్‌ బైక్‌పై పరారవుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మ్యూజియం నుంచి మాయమైన వస్తువులు.. 
ఆదివారం రాత్రి మ్యూజియంలో ఘరానా చోరీ జరిగింది. ఆ సమయంలో మ్యూజియానికి ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తున్నారు. అయినా.. తెలివిగా వారి కళ్లు గప్పిన దుండగులు ప్రహారీ నుంచి మ్యూజియం పై అంతస్తుకు వెళ్లారు. అక్కడి వెంటిలేటర్‌ ను పగలగొట్టి ఒకడు లోపలికి చొరబడ్డాడు. మరొకడు అక్కడే కాపలాగా ఉన్నాడు. తాడు సాయంతో లోపలికి దిగి.. నిజాం ఉపయోగించిన బంగారు వస్తువులను దోచుకెళ్లాడు. మ్యూజియం నుంచి మాయమైన వాటిలో బంగారు టిఫిన్ బాక్స్‌, బంగారు స్పూన్‌, బంగారు టీ కప్పు, సాసర్‌ ఉన్నాయి. 
మ్యూజియం లోపల చోరీ జరుగుతున్నా.. 
మ్యూజియం లోపల చోరీ జరుగుతున్నా.. సెక్యూరిటీ సిబ్బంది ఏ మాత్రం పసిగట్టలేకపోయారు. లోపల సీసీ కెమెరాలు ఉన్నా.. వాటిలో పూర్తి స్థాయిలో చోరీ దృశ్యాలు నమోదు కాలేదు. కేవలం దుండగుడి వీపు మాత్రమే రికార్డయ్యింది. మ్యూజియంలో మరెన్నో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ వాటి జోలికి దొంగ వెళ్లలేదు. కేవలం నాలుగు వస్తువులను మాత్రమే ఎత్తుకెళ్లడం చూస్తుంటే.. ఈ చోరీపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. వాటిపైపు సీసీ కెమెరాల ఫోకస్ లేదన్న సంగతిని పక్కాగా గుర్తించే.. వీటిని చోరీకి ఎంచుకుని ఉండొచ్చని తెలుస్తోంది. 
ఇంటిదొంగల పనై ఉండొచ్చన్న డౌట్స్‌ 
నిజాం మ్యూజియం నుంచి ఈ వస్తువులు దోచుకెళ్లడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, తెగించి మరీ చోరీకి వచ్చారంటే, అది ఇంటిదొంగల పనై ఉండొచ్చన్న డౌట్స్‌ తలెత్తుతున్నాయి. పైగా టెర్రస్‌పై సీసీ కెమెరాలు లేకపోవడం కూడా దొంగలకు తెలిసే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దొంగలకు మ్యూజియం గురించి పూర్తిగా తెలిసి ఉంటే తప్ప, ఇంత ఈజీగా చోరీ జరగదు. వజ్రాలు, రూబీలు పొదిగిన టిఫిన్‌ బాక్స్ బరువు దాదాపు రెండు కిలోలు ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల వేటకు వెళ్లే సమయంలో ఏడో నిజాం ఈ టిఫిన్‌ బాక్స్‌ను తీసుకువెళ్లేవారట. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంటుంది. మ్యూజియం గ్యాలరీల్లో సీసీకెమెరాలను కన్నార్పకుండా పరిశీలించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఎంతగా నిద్రపోతున్నారో ఈ ఘటనతో తేలిపోయింది. 

 

09:48 - September 7, 2018

హైదరాబాద్ : రోడ్లు అభివృద్ధి చెందినా, వాహనాల సంఖ్య పెరిగినా ప్రయాణాలంటే ఇంకా జనం మదిలో కదిలేది రైళ్లే. ఇక దూర ప్రాంతాలంటే రైలు అందుబాటులో ఉంటే మరో ప్రత్యామ్నాయమే చూడరు. అలాంటి రైలు కొత్తగా అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఆనందానికి అవధులుండవు. కాకినాడ, తిరుపతి, విజయవాడకు వెళ్లే రైళ్లు ఇప్పుడు లింగంపల్లి నుంచే మొదలవుతున్నాయి. ఇప్పటికే కాకినాడ, విజయవాడకు వెళ్లే రైళ్లు లింగంపల్లి నుంచి ప్రారంభమవుతుండగా.. తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఆగుతోంది. తిరుపతి వెళ్లే మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు నారాయణాద్రి గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ముంబయ్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఇక్కడ ఆగుతున్నాయి. ఇలా లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రాధాన్యం పెరిగింది. ప్రయాణికులకు ఇలా ఊరట లభించినా.. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో వీటిని ఆపితే మరింత మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
42 రైళ్లు... 
లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ఇటీవల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లసంఖ్య పెరుగుతోంది. ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్న గౌతమి, అమరావతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రతిరోజు బయలుదేరుతుండగా.. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం కోకనాడ ఎక్స్‌ప్రెస్‌ ఇక్కడి నుంచి మొదలవుతోంది. ఇండోర్‌ వెళ్లే హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి ఆదివారం బయలుదేరుతుంది. తిరుపతి నాగర్‌సోల్‌ వెళ్లే ప్రత్యేక రైలు. యశ్వంత్‌పూర్‌ టాటానగర్‌ల మధ్య నడిచే టాటా ఎక్స్‌ప్రెస్‌ ప్రతి శుక్రవారం ఇక్కడ ఆగి వెళుతున్నాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం వెళ్లే పుణె ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా ఇక్కడ ఆగుతున్నాయి. యశ్వంత్‌పూర్‌ వెళ్లే గరీబ్‌రథ్‌ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం యశ్వంత్‌పూర్‌ వెళ్లే గరీబ్‌రథ్‌ ప్రత్యేక రైలు కూడా ఇక్కడ ఆగి వెళుతోంది. మొత్తంగా ప్రతిరోజూ 12 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడ ఆగి ప్రయాణికులను తీసుకుని వెళుతున్నాయి. ఇలా పాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కలిపి మొత్తం 42 ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి.

సైబరాబాద్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్‌ ప్రాంతాల్లో కొలువుదీరిన జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థల్లో దాదాపు 5లక్షల మంది పనిచేస్తున్నారు. వీరికి తోడు.. నాలుగు నియోజకవర్గాల ప్రజలకు లింగంపల్లి, హైటెక్‌సిటీ, భరత్‌నగర్‌ రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు స్టేషన్లలో హైటెక్‌సిటీ స్టేషన్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారని రైల్వే అధికారులు గుర్తించారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లో ఆపితే ఎక్కువమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. ఇక్కడి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం 24 బోగీలు ఆగేందుకు అవకాశం లేదు. తర్వాతి స్టేషన్లో బోగీలు మారుతాం.. ఇక్కడ రైలు ఆపితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ముఖ్యంగా అమరావతి వెళ్లే ఇంటర్‌సిటీ, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడ ఆగితే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ షురూ 
దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి రైల్వేస్టేషన్‌నుంచి ఆరంభించారు. సాయంత్రం 5.15 గంటలకు ఈ రైలు మొదలైంది. మొదటిరోజు కావడంతో ప్రయాణికులు స్వల్పసంఖ్యలోనే ఇక్కడ ఎక్కారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌వద్ద మెయింటెన్స్‌ డిపో నిర్మాణం తరువాత ఇక్కడినుంచి ఆరంభమైన రైళ్లలో నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్‌ నాలుగోది. ఇప్పటికే ఇక్కడినుంచి గౌతమి, కొకనాడ, విజయవాడ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఇక్కడినుంచి నడుస్తున్న సంగతి తెలిసిందే. నగరానికి వెళ్లి ప్రయాణించే అవసరం లేకుండా పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఇక్కడినుంచే బయలుదేరి వెళుతున్నారు. ఇదే స్థాయిలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కి విశేష స్థాయిలో అదరణ లభిస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

09:24 - September 7, 2018

ఢిల్లీ : కూలీలు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారా? కోటీశ్వరులం కావాలంటే ఎంతో కష్టపడి పని చేసి సంపాదిస్తే కానీ కాలేం. అహర్నిశలు కష్టపాడాలి. కానీ ఓ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అప్పు చేసిమరీ తన అదృష్టం పరీక్షించుకున్నాడు. రూ.200 పెట్టి లాటరీ టికెట్ కొన్న అతడికి ఏకంగా 1.5 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా వాసి మనోజ్ కుమార్ తొలుత ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. వాస్తవానికి లాటరీ టికెట్ కొనడానికి అవసరమైన రూ.200 కూడా లేకపోవడంతో సహచరుడి దగ్గర అప్పుచేసినట్టు అతడు పేర్కొన్నాడు. తన లాటరీ టికెట్ నెంబర్ విన్నింగ్ నంబర్‌తో సరిపోలడంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ''అంతా కలలా ఉంది. లాటరీ టికెట్ కొనడానికి నేను అప్పుచేశాను. ఇంత డబ్బు గెలుచుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు..'' అంటూ మనోజ్ సంతోషం వ్యక్తం చేశాడు

 

08:49 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ఉత్కంఠ వీడింది. తెలంగాణ తొలి అసెంబ్లీ రద్దయింది. సాధారణ ఎలక్షన్ల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని.. అందుకనుగుణంగా అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీని రద్దు చేస్తూ క్యాబినెట్‌ తీర్మానించింది. తద్వారా దాదాపు రెండు నెలల నుంచి మీడియాలో వస్తున్న పలురకాల ఊహాగానాలకు తెరపడింది. కేసీఆర్‌ సర్కారు నాలుగేండ్ల మూడు నెలల నాలుగు రోజులపాటు కొనసాగిన అర్ధాంతరంగా రద్దయింది. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 
గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీ రద్దు 
గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు కేసీఆర్‌ తన మంత్రివర్గ సహచరులకు తెలిపారు. అలాంటి నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను కేవలం ఒకట్రెండు మాటల్లో వివరించిన కేసీఆర్‌... ఆ వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్‌ను కోరుతూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానికి అంగీకారం తెలుపుతూ మంత్రులందరూ తీర్మాన ప్రతిపై సంతకాలు చేశారు. ఆ వెంటనే కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్య సలహాదారుడు రాజీవ్‌శర్మ, రాజకీయ కార్యదర్శి శుభాష్‌రెడ్డితో కలిసి రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్ళారు. ఈ తతంగమంతా కేవలం 15 నిమిషాల్లోనే ముగిసింది. మధ్యాహ్నం 1.35 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌... గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. మంత్రివర్గ తీర్మానాన్ని ఆయనకు అందజేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాన్ని రద్దు చేశామని గవర్నర్‌కు వివరించారు. 
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 
రాజ్యాంగ నిబంధనలు, సంప్రదాయాలకనుగుణంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడపాలని గవర్నర్‌ ఈ సందర్భంగా కేసీఆర్‌ను కోరారు. అందుకు కేసీఆర్‌ అంగీకరించారు. ఆ వెంటనే గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్‌ సింగ్‌ ఉత్తర్వులను విడుదల చేశారు. మరోవైపు ప్రస్తుత మంత్రివర్గం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుందని పేర్కొంటూ సీఎస్‌ ఎస్‌కే జోషి జీవో నెంబర్‌ 134ను విడుదల చేశారు. మరోవైపు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు సభ రద్దయినట్టు పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసి గెజిట్‌ నోటిఫికేషన్‌ను అందించారు. దీంతో అసెంబ్లీ రద్దు ప్రక్రియ పూర్తయింది. 
జూన్‌ 2, 2014న సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం 
జూన్‌ 2, 2014న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌... నాలుగేండ్ల 3 నెలల 4 రోజులపాటు ప్రభుత్వాన్ని నడిపారు. శుక్రవారం హుస్నాబాద్‌ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 50 రోజుల్లో 100 బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.

 

08:19 - September 7, 2018

ఢిల్లీ : స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కం ఇకపై నేరం కాదు.. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అందరిలాగే స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం. తాజా తీర్పుతో సెక్షన్‌ 377పై కొనసాగుతున్న వివాదానికి తెరపడింది.
సుప్రీంకోర్టు తుది తీర్పు
స్వలింగ సంపర్కంపై ఐపిసి సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  తుది తీర్పును వెల్లడించింది. పరస్పర అంగీకారంతో జరికే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలువరించింది. 
జంతువులతో లైంగిక చర్య, చిన్నారులతో అసహజ శృంగారం నేరం 
వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కని...స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. లైంగిక స్వభావం ఆధారంగా ఒకరిపై పక్షపాతం చూపడమంటే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేననే తెలిపింది. ఎల్‌జిబిటి సముదాయాన్ని అందరూ గౌరవించాలని...వీరిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ప్రచారం నిర్వహించాలని సూచించింది. సుప్రీం తీర్పుతో సెక్షన్‌ 377పై 150 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారం మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ఎల్‌జిబీటీ కార్యకర్తలతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కొత్త శకానికి నాందిగా పేర్కొన్నారు. ఈ విషయంలో తనను తప్పు పట్టిన బిజెపి ఎంపీలకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ అన్నారు.
377 సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్ 
సెక్షన్‌ 377 ప్రకారం స్వలింగ సంపర్కం, జంతువులతో లైంగిక చర్యలు, అసహజ శృంగారానికి పాల్పడినవారికి పదేళ్ల వరకు జైలుశిక్ష, జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. 377 సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ నాజ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యను నేరంగా పరిగణించకూడదని 2009లో ఢిల్లీ  హైకోర్టు తీర్పు చెప్పింది. 2013లో ఈ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.  సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జులై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది.

 

07:44 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు సై అన్నారు. అనడమే కాదు.. ఏకంగా 105 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులనూ ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు దాదాపు ఖాయమని భావిస్తున్నారు. గతంలో ముందస్తు ఎన్నికలు జరిగాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో మూడు సార్లు ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌  ఏర్పడినప్పటి నుంచి 1978 దాకా  షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించడంతో... అప్పటి కాంగ్రెస్‌ సర్కార్ తొలిసారిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. షెడ్యూల్‌ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ... అదే ఏడాది జనవరిలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 202 స్థానాల్లో గెలుపొంది....అధికారంలోకి వచ్చింది. 

అయితే నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేయడం రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఇందిరాగాంధీ హత్యతో సానుభూతి వస్తుందన్న సందేహాలున్నప్పటికీ....1984 డిసెంబర్ 14న ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయం సాధించి...అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1989లో ఎన్టీఆర్ మరోసారి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 

1999లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు...రెండు నెలల ముందే జరిగాయి. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘనం విజయం సాధించింది. నక్సలైట్ల దాడి తరువాత వచ్చిన సానుభూతి వస్తుందన్న నమ్మకంతో...2003 నవంబరులోనే అసెంబ్లీని రద్దు చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ జయభేరి మోగించింది. 

రాష్ట్రంలోనే కాదు...దేశంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగిన ఉదంతాలున్నాయి.  1969లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని... అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప బహిష్కరించడంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. మైనారిటీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ఇందిరాగాంధీ తొలిసారిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. గరీబీ  హఠావో నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఇందిరా గాంధీ....352 స్థానాల్లో గెలుపొందారు. ఇందిర హత్యానంతరం 1984లో ప్రధాని అయిన రాజీవ్‌గాంధీ లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించారు. 414 సీట్లతో  తిరుగులేని విజయం సాధించారు. 2004లో  ప్రధాని వాజ్‌పేయి ముందస్తుకు వెళ్లారు. ఇండియా రైజింగ్ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లడంతో...బీజేపీకి పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఎ అధికారంలోకి వచ్చింది. 

07:23 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ వీడిపోయింది. ముందస్తు ఎన్నికలపై ఇంతకాలం ఊరించిన సీఎం కేసీఆర్.. తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారు. ఉదయం నుంచి చకచకా జరిగిన పరిణామాలు.. తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధం చేశాయి. ఎన్నికల ఫీవర్‌ను తెచ్చేశాయి. 
అసెంబ్లీ రద్దు 
సీఎం కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. నిన్న మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్‌, అసెంబ్లీ రద్దునే ఏకైక అజెండాగా పెట్టారు. మంత్రి మండలి క్షణాల్లో ఏకగ్రీవంగా అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆమోదించింది. కేవలం నాలుగు నిమిషాల్లోనే కేబినెట్‌ సమావేశం ముగియడం విశేషం. ఆ వెంటనే, మంత్రులందర్నీ తీసుకుని సీఎం కేసీఆర్‌ ప్రత్యేక బస్సులో రాజ్‌భవన్‌కు వెళ్లారు. 
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌
గవర్నర్‌ నర్సింహన్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు సీఎం కేసీఆర్‌. అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు కేసీఆర్ అందజేశారు. అసెంబ్లీ రద్దుకు కారణాలను ఆయనకు వివరించారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. దీనికి వెంటనే నర్సింహన్‌ ఆమోద ముద్ర వేశారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ సీఎం కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించారు.
గవర్నర్‌ ఆమోద ముద్రతో అసెంబ్లీ రద్దు
గవర్నర్‌ ఆమోద ముద్ర పడడంతో, తెలంగాణ అసెంబ్లీ రద్దైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి నోటిఫికేషన్‌ జారీ చేశారు. అసెంబ్లీ రద్దు విషయాన్ని అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. నవంబర్‌లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, వాటితో పాటే తెలంగాణకూ ఎన్నికలను ఈసీ నిర్వహించే అవకాశం ఉంది. అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. నవంబర్‌లో ఎన్నికలు జరిగి, డిసెంబర్‌లో ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయంటున్నారు. కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముందస్తు రావచ్చంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ టీడీపీలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయాయి. 

 

Don't Miss