Activities calendar

09 September 2018

21:09 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తుండడంతో ఆయా పార్టీలు అప్రమత్తమయ్యాయి. తమ వ్యూహ రచనలో నిమగ్నమైపోయారు. తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని కాషాయ దళం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 15వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా అడుగు పెట్టనున్నారు. మహబూబ్ నగర్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఈనెల 15న బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలోనే ప్రధాన మంత్రి మోడీ పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు. బహిరంగసభలు ఎక్కడ నిర్వహించాలి ? తదితర వాటిపై షా నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర పర్యటనలో మీడియా ఎడిటర్లతో అమిత్ షా సమావేశమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర అధ్యక్షుడికి,ఎన్నికల కార్యచరణ ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు షా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఎన్నికల కోసం సంతోష్, భూపేంద్ర యాదవ్ లను జాతీయ కార్యదర్శులుగా నియమించినట్లు సమాచారం. 

20:58 - September 9, 2018

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో 292 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. ఈ టూర్లో చివరి టెస్ట్ మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భారత క్రీడకారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ లో జడేజా, విహారీలు భారత్ ను ఆదుకున్నారు. వీరు కనీసం ఆదుకోవడం ఆ మాత్రం స్కోరు సాధించాలని చెప్పవచ్చు. విహారీ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరకు భారత్ ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు 40 పరుగుల ఆధిక్యం లభించింది.
174 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మూడో రోజు ఇండియా బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి హనుమ విహారీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ సాధించిన 26వ భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

19:50 - September 9, 2018

ఆడియన్స్ పల్స్ తెలుసుకుని సినిమాలు చేస్తే చాలు, కళ్ళు మూసుకుంటే అవే హిట్ అయిపోతుంటాయి. ఎప్పటి కప్పుడు ప్రేక్షకులు అభిరుచికి తగ్గటు సినిమాలు తీస్తే చిన్న హీరోలనైనా ఆదరిస్తారు. ఎలాగైనా హిట్ అవుతాయి అనకుంటే పెద్ద హీరోలు కూడా బోల్తా పడతారు. అది లేట్ గా తెలుసుకున్న ఓ మాస్ హీరో తనలో మార్పును గట్టిగా చూపిస్తానంటున్నాడట. 'రవితేజ' ఇప్పుడో కొత్త మూవీతో రాబోతున్నాడు. 'రాజాది గ్రేట్' మంచి సక్సెస్ ను అందుకున్న సంతోషం ఎక్కువ రోజులు లేకుండానే వరుసగా రెండు ఫెయిల్యూర్స్ తో డిస్సపాయింట్ అయ్యాడు. అటు 'టచ్ చేసి చూడు'.. ఇటు 'నేల టికెట్టు'.. ఈ రెండు మూవీస్ డిజాస్టర్స్ అవ్వడంతో, మరో మూవీ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో అన్న టెన్షన్ పట్టుకుంది మాస్ మహారాజ్ కి. అందుకు ఈ సారి రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రజంట్ 'శ్రీను వైట్ల' డైరక్షన్ లో.. 'అమర్ అక్బర్ ఆంటోనీ' చేస్తున్నాడు రవితేజ. ఎంతసేపు ఓ ఫైటూ.. పవర్ ఫుల్ డైలాగ్... ఓ సాంగ్ అన్నట్లు కాకుండా.. శ్రీను వైట్ల మార్క్ లో కూడా లేకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడట 'రవితేజ'. అంతే కాదు కాన్సెప్ట్ బేస్ కథలను ఎంకరేజ్ చేయాలి అనుకుంటున్నాడట రవి.. దాంతో తాను నెక్ట్స్ చేయబోయే మూవీ కూడా అలానే ప్లాన్ చేశాడట.. విఐ ఆనంద్ డైరక్షన్ లో చేయబోయే సినిమాలో 'రవితేజ' తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. మొత్తానికి ఆడియన్స్ కు తగ్గట్టు తనను తాను మార్చుకుంటున్నాడు మాస్ మహారాజ్..మరి ఈ మార్పు ఫలిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

19:41 - September 9, 2018

ఢిల్లీ : దేశ రాజధానిలో వీకెండ్ అయిన ఆదివారం రోజున ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించింది. గురుగ్రామ్, మహవీర్ ఎన్ క్లేవ్ తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కొందరూ భూకంపం వచ్చిందంటూ..భూమి స్వల్పంగా కంపించిందని హస్తిన వాసులు సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఇండియన్ మైటోరోలాజికల్ డిపార్ట్ మెంట్ నిర్ధారించలేదని తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 3.8గా నమోదైనట్లు సమాచారం. భూ ప్రకంపనాల కారణంగా ఎలాంటి ప్రాణ..ఆస్థి నష్టం జరగలేదని సమాచారం. మరోవైపు విదేశాల్లో సైతం భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

19:32 - September 9, 2018

ఫ్యామిలీ మూవీస్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి పేరు తేచ్చుకున్న హీరో 'శ్రీకాంత్'.. ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలలో కూడా మార్పు చూపిస్తున్న ఈ హీరో.. సమాజంపై రాజకీయ ప్రభావాన్ని చూపిస్తూ.. తీస్తున్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. త్వరలో మరో పొలిటికల్ మూవీతో పలుకరించబోతున్నాడు శ్రీకాంత్.. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా స్టార్ డమ్ సంపాదించుకున్న శ్రీకాంత్.. మాస్ మూవీస్ కి దూరంగా క్లాస్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించికున్నాడు. ఆ తరువాత మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు రూట్ మార్చిన 'శ్రీకాంత్' ఆ తరువాత 'మహాత్మ', 'ఆపరేషన్ దుర్యోదన' లాంటి సినిమాలో.. పొలిటికల్ టచ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. 'ఆపరేషన్ దుర్యోదన' లాంటి మూవీస్ కి మంచి టాక్ రావడంతో 'శ్రీకాంత్' జోనర్ మారిపోయింది. ప్రజంట్ అలాంటి పొలిటికల్ మూవీతో మళ్లీ రాబోతున్నాడు. సమకాలీన రాజకీయ ,సామాజిక అంశాలను కథలుగా చేసుకుని అలివేలు ప్రొడక్షన్స్ పతాకంపై కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్-2019. 'శ్రీకాంత్' హీరోగా యజ్ఞా శెట్టి, దీక్షా పంత్ హీరోయిన్లుగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. "ఆపరేషన్ దుర్యోధన"లాంటి బోల్డ్ పొలిటికల్ ఎటెంప్ట్ తో థియేటర్లోకి వస్తున్న ఈ సినిమాలో, సుమన్, కోట, పోసాని, శివకృష్ణ, నాగినీడు లాంటి సీనియర్స్ నటిస్తున్నారు. ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో 'శ్రీకాంత్' హీరోగానే కాకుండా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

19:21 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించాలంటే ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అని..ఇందుకు మహా కూటమి ఏర్పాటు చేయాలని టి.టిడిపి భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర టిడిపి నేతలతో సమాలోచనలు జరిపారు. మహా కూటమి ఏర్పాటు చేయాలని..అన్నీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని బాబు నేతలకు సూచించారు. ఇందుకు ఆయా పార్టీల నేతలతో చర్చలు ప్రారంభించాలని..పొత్తులకు సంబంధించి మూడు కమిటీలను ఏర్పాటు చేశారు.

అందులో భాగంగా మొదటి అడుగు విజయవంతమైందని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం సీపీఐ నేతలతో సంప్రదింపుల కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో టి.టిడిపి సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. అన్ని పార్టీల నేతలను కలుస్తామని..చర్చలు కొనసాగిస్తామని ప్రకటించారు. ఏ ఏ నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేస్తుందో వాటి వివరాలను ఆ పార్టీ నేత చాడ వెంకట్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

19:02 - September 9, 2018

తమిళనాడు : రాజీవ్ హత్య కేసులో హంతకుల విడుదలకు తమిళనాడు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితం తమిళనాడు మంత్రివర్గం సమావేశమైంది. రాజీవ్ హంతకులను విడుదల చేయాలని గవర్నర్ కు సిఫార్సు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 27 ఏళ్లుగా రాజీవ్ హంతకులు జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రాజీవ్ హంతకుల విడుదల అంశంపై తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు, కేంద్రం తప్పుబట్టాయి. మరోసారి ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం పంపింది.

1991 మే 21న శ్రీ పెరంబుదూర్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో గత 27 ఏళ్లుగా ఏడుగురు నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇందులో త్వరగా విడుదల చేయాలని నిందితురాలిగా ఉన్న నళిని కోరగా మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. 

18:34 - September 9, 2018

తెలుగు సినిమాల రేంజ్ అంతకంతకూ పెరిగిపోంది.. ఒకప్పుడు తక్కువగా చూసినవాళ్ళ నోర్లు మూతపడేలా రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నాయి టాలీవుడ్ మూవీస్.. ఎప్పుడో పదేళ్ల క్రితం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఓ బడా మూవీ ఇప్పుడు జపాన్ లో దుమ్ము దులుపుతోంది.. ఆ మూవీ ఎంటో ?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చెక్కిన విజ్యూవల్ వండర్ 'మగధీర'.. 2009 లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పుడు సెన్సేషన్ అయ్యింది.. రాంచరణ్, కాజల్ కు హీరో హీరోయిన్లుగా ఓ టర్నింగ్ పాయింట్ మూవీ అయ్యింది.. అప్పట్లో అంత హిట్ అయిన మూవీ ఆ తరువాత ఇతర భాషల్లో కూడా తన సత్తాచాటి దూసుకుపోయింది.. టాలీవుడ్ లో అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసి వసూళ్ళ వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు సరికొత్త రికార్డ్ తో మళ్ళీ తెరపైకి వచ్చింది..

రాజమౌళికి బాహుబలి సిరీస్ తో విదేశాల్లో మార్కెట్ పెరిగింది.. ముఖ్యంగా జపాన్ లో రాజమౌళికి మంచి పేరు ఉంది.. దాంతో మగధీర మూవీని లాస్ట్ వీక్ జపాన్ లో రిలీజ్ చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువ స్పందనతో జపాన్ లో ఉరకలువేస్తోంది 'మగధీర' మూవీ. ఇప్పటి వరకు 1.06 మిలియన్ల డాలర్లు వసూళ్ళను సాధించింది ఈ మూవీ. షాకింగ్ న్యూస్ ఏమిటంటే 'బాహుబలి' మూవీస్ కి 1.03 మిలియన్ డాలర్లు వస్తే, అంతకు మించి ఈ మూవీ సాధించింది..

ఇప్పటి వరకు జపాన్ లో ఎక్కువ వసూళ్లు సాధించిన మూవీ 'ముత్తు'.. ఈ సినిమా అప్పట్లోనే 3.0 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది.. ఆ తరువాత 1.5 మిలియన్ డాలర్లతో '3ఇడియట్స్' మూవీ సెకండ్ ప్లేస్ లో ఉంది.. ఇప్పుడు 'మగధీర' ఇదే ఊపును కంటీన్యూ చేస్తే 'ముత్తు'ను క్రాస్ చేయవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి.. లేదంటే కనీసం సెకండ్ ప్లేస్ అయినా ఆక్యుపై చేస్తుందని అనుకుంటున్నారు. 

18:19 - September 9, 2018

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ దుందుడుకుగా ప్రవర్తిస్తోందని...భవిష్యత్ లో ఒకే దేశం..ఒకే ఎన్నికలు జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అజయ్ భారత్ - అకల్ప్ బీజేపీ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. గతంలో సాధించిన లోక్ సభ సీట్ల కంటే అధికంగా సాధించాలని..తప్పకుండా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారని తెలిపారు. పోలింగ్ బూత్ లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందిన వారిని కలుస్తామని..వీరిని బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు ప్రయత్నిస్తామన్నారు. మోడీ ఇచ్చిన స్పూర్తితో ముందుకెళుతామని...పేర్కొన్నారు. 

18:15 - September 9, 2018

ప్రకాశం : ఏపీ రాష్ట్రంలో నలుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపింది. ఈ విద్యార్థుల ఆచూకీ సాయంత్రం తెలిసింది. నిడమనూరు శ్రీ చైతన్య కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. గత రాత్రి ప్రిన్స్ పాల్ తీవ్రస్థాయిలో మందలించడమే కాకుండా మోకాళ్లపై కూర్చొబెట్టి కర్రతో బాదాడని తల్లిదండ్రులకు తెలియచేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంతో కాలేజీ నుండి వెళ్లిపోవాలని భావించి పారిపోయాడు. తల్లిదండ్రులకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు...తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేశారు. తాము కాలేజీకి వెళ్లబోమని..ఇంటికే వస్తామని చెప్పారని తెలుస్తోంది. దీనితో అదృశ్యమైన విద్యార్థుల కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

18:00 - September 9, 2018

జుబా : ప్రయాణీకులు ఎక్కువ మంది ప్రయాణించడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సందర్భాలు చూస్తుంటాం. తాజాగా విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ సూడాన్ లో ఓ విమానంలో అధిక మంది ప్రయాణీకులు ఎక్కడంతో ఓవర్ లోడ్ అయి నదిలో కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు. ఈ విమానంలో కేవలం 19సీట్లు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో కొంతమంది బయటపడ్డారని, గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. 

17:49 - September 9, 2018

విశాఖపట్నం : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాపులకు సమయం ఆసన్నమైందని కాపు సంఘం నేత ముద్రగడ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కాపు నాడు సదస్సు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని..కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాటనే మరిచిపోయారని గుర్తు చేశారు. ఒకవేల రిజర్వేషన్లు అమలు చేస్తే కాపులు టిడిపి వైపు నిలబడుతారా ? లేదా ? అనే అనుమానం బాబులో ఉందన్నారు. అలాంటి అపోహలు బాబు విడనీడాలని ముద్రగడ సూచించారు. రాష్ట్రంలోని కాపు కులస్థులు ఎవరిసంచి వారిది అన్నట్లుగా ఆయా పార్టీల్లో మనుగడ సాగిస్తున్నారని అన్నారు. కాపులకు మేలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 30ని జారీ చేసిందని కానీ కాంగ్రెస్ ను కాపులు ఓడించారని తెలతిపారు. రాజ్యాధికారం కోసం పోరాడాలని కాపులకు పిలుపునిచ్చారు. 

17:36 - September 9, 2018

హైదరాబాద్ : దివంగత నటి శ్రీదేవి విగ్రహం ఏర్పాటు కాబోతోంది. కానీ మన భారతదేశంలో కాదు లెండి...స్విట్జర్లాండ్ లో. ఇటీవలే దుబాయిలో శ్రీదేవి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అతిలోక సుందరిగా పేరొందిన ఈ నటి ఎన్నో పేరున్న సినిమాల్లో నటించి మెప్పించింది. శ్రీదేవి విగ్రహం ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. స్విట్జర్లాండ్ లో శ్రీదేవి సినిమాలు షూటింగ్ జరిగాయని గుర్తు చేశారు. అంతేగాకుండా స్విట్జర్లాండ్ పర్యాటకం అభివృద్ధి చెందేదుకు శ్రీదేవి కారకులయ్యారని వివరించారు. అందుకే శ్రీదేవి విగ్రహం ఏర్పాటు చేయడం జరుగోందని, ప్రస్తుతం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. 

16:35 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలపై జనసేనానీ 'పవన్ కళ్యాణ్' దృష్టి సారించారు. ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహార కమిటీతో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్నికలపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే దానిపై చర్చించారు. గతంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో జరిపిన చర్చల వివరాలను పవన్ కు సభ్యులు వివరించారు. తదుపరి చర్చలు పవన్ తో జరపాలని సీపీఎం సభ్యులు పేర్కొన్నారని వారు తెలిపారు. దీనితో చర్చలకు పవన్ అంగీకరించారు. సీపీఎం నేతలను చర్చలకు ఆహ్వానించాల్సిందిగా పవన్ సూచించారు. మంగళ, బుధ వారాల్లో ఈ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. 

16:26 - September 9, 2018

అంపైర్ పై కోపం వ్యక్తం చేయడంతో ఓ క్రికెటర్ ఫీజులో కోత విధించారు. ఈ ఘటన ఇంగ్లండ్ - భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చోటు చేసుకుంది. టీమిండియాతో ఇంగ్లండ్ చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 29ఓవర్లో బంతి కోహ్లీ ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. వెంటనే బౌలర్ అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ ధర్మసేన అప్పీల్ ను తిరస్కరించాడు. కానీ బంతి వికెట్లను తాకిందని భావించి రివ్యూ కోరాడు. నిర్ణయం తీసుకోవాలని థర్డ్ అంపైర్ సూచించారు. తన నిర్ణయానికే ధర్మసేన కట్టుబడి ఉండిపోయాడు. దీనితో ధర్మసేన దగ్గరగా వెళ్లిన జేమ్స్ కోపంగా మాట్లాడాడు. ఫీల్డ్ అంపైర్లు నాలుగో అంపైర్ టిమ్ రాబిన్ సన్ కు ఫిర్యాదు చేశారు. విచారణలో అండర్సన్ తప్పును అంగీకరించారు. 2016లో సెప్టెంబర్ లో సవరించిన కొత్త నియమావళి కింద లెవల్ 1 తప్పు కింద మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. 

16:14 - September 9, 2018

కరీంనగర్ : టీఆర్ఎస్ లో విబేధాలు పొడచూపుతున్నాయి. టికెట్లు రాని వ్యక్తులు అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నిరుత్సాహం వ్యక్తం చేస్తూ ఇతర పార్టీల వైపుకు వెళ్లేందుకు చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం..వెంటనే 105 మందితో కూడిన అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై టికెట్ వస్తుందని ఆశించిన కొంతమంది అసంతృప్తులు వ్యక్తం చేశారు. వీరిని బుజ్జగించాలని కేసీఆర్ ఆదేశించారు.

మంచిర్యాల చెన్నూరు టికెట్ ను ఎంపీగా ఉన్న బాల్క సుమన్ కు కేటాయించారు. దీనితో టికెట్ వస్తుందని ఆశించిన నల్లాల ఓదేలుకు షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుండి టీఆర్ఎస్ ను అంటి పెట్టుకుని ఆయన ఉన్నారు. కానీ టికెట్ రాకపోవడం పట్ల ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కానీ బాల్క సుమన్ విజయానికి నల్లాల ఓదేలు సహకరిస్తారని ప్రచారం జరిగింది. దీనిపై ఆదివారం ఓదేలు స్పందించారు. తనను బాల్క సుమన్ కలిశారని, తనకు మద్దంతు తెలియచేయాలని కోరడం జరిగిందన్నారు. బయటకు వెళ్లిన అనంతరం తనకు ఓదేలు మద్దతు తెలియచేశారని బాల్క సుమన్ వెల్లడించారని, ఇది అసత్యమని కొట్టిపారేశారు. కేసీఆర్ పై నమ్మకం ఉందని..తనకే టికెట్ ఇస్తారని..ఆశాభావం వ్యక్తం చేశారు. 

15:58 - September 9, 2018

ముంబై : చమురు ధరల పెరుగుదలపై మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకురావడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని..ధరలు తగ్గే మార్గాలను చూస్తున్నట్లు వెల్లడించారు. జీఎస్టీలోకి తీసుకొస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తుందని, ఎన్డీయే ప్రభుత్వ హాయాంలో 13 సార్లు ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ధరల పెరుగుదల ఉంటుందన్నారు.

 

15:26 - September 9, 2018

హైదరాబాద్ : చమురు ధరలు పెరుగుతున్నాయి...రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాటిపై ఆధారపడుతున్న వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. వీటిపై వివిధ పార్టీలు దృష్టి సారించాయి. పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఇందుకు ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. బంద్ కు ఇతర పార్టీలు మద్దతివ్వాలని కోరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో స్వచ్చందంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని టి.కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బంద్ కు మద్దతివ్వాలని వివిధ పార్టీలను విజ్ఞప్తి చేశాయి. ఇక ఏపీ రాష్ట్రంలో వామపక్షాలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం బంద్‌కు మద్దతు తెలిపారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. కానీ వైసీపీ మాత్రం బంద్ కు మద్దతివ్వలేదని తెలుస్తోంది. మరి సోమవారం బంద్ విజయవంతమవుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

15:13 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై ఉభయ రాష్ట్రాల టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట...వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్య సాధ్యాలపై బాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఆదివారం టిటిడిపి నేతలతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ను ఒంటిరిగా ఎదుర్కొనే సత్తా ప్రస్తుతం టిటిడిపికి లేదని..ఇందుక పొత్తులే శరణ్యమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పార్టీలన్నింటినీ ఏకం చేయాలని...బాబు సూచించారు. ఇందుకు మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రచార కమిటీ, సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీలుగా ఏర్పాటు చేశారు. ఇక ఈ కమిటీల్లో ఎవరు ఉండాలనే దానిపై బాబు నేతలతో చర్చిస్తున్నారు. కమిటీల్లో పార్టీ సీనియర్ నేతలను నియమించారు.

సంప్రదింపుల కమిటీలో దేవేందర్ గౌడ్, పెదిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రావు ఇతరుల సీనియర్ నేతలను నియమించారు. ప్రచార కమిటీలో పార్టీ గరికపాటి, కొత్తకోట దయాకర్, సండ్ర వెంకట వీరయ్యలున్నారు. మేనిఫెస్టోలో రావుల చంద్రశేఖర్, దేవేందర్ గౌడ్, రేవుల వారితో పాటు ఇతరులకు స్థానం కల్పించారు.

ఈ రోజు నుండే చర్చలు ప్రారంభం కావాలని బాబు సూచించడంతో సీపీఐ నేత నారాయణకు టి.టిడిపి అధ్యక్షుడు రమణ ఫోన్ చేశారు. సాయంత్రం సీపీఐ నేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్, జనసేన, ఇతర పార్టీలతో చర్చలు జరపాలని బాబు తెలిపారు. ఈ చర్చల సారాంశాన్ని బాబుకు కమిటీ సభ్యులు నివేదించనున్నారు. అనంతరం తుది నిర్ణయం బాబు తీసుకోనున్నారు. మరి ఈ పొత్తులు ఫలిస్తాయా ? లేదా ? అనేది చూడాలి. 

14:32 - September 9, 2018

అనంతపురం : విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లికి చెందిన మంజుల అనంతపురంలోని ఎస్ ఆర్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చుదుతోంది. ఈనేపథ్యంలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. 

 

14:12 - September 9, 2018

మహారాష్ట్ర : 'నా సినిమాలను నిషేధించండి' అని నటి, రచయిత్రి ట్వింకిల్‌ ఖన్నా అంటున్నారు. తెలుగులో 'శీను', హిందీలో ‘బర్సాత్‌, ‘మేలా’తదితర చిత్రాల్లో ట్వింకిల్‌ నటించారు. నటిగా కంటే రచయిత్రిగానే ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పటివరకు తాను చేసిన సినిమాలను నిషేధించాలని, వాటిని ప్రేక్షకులు ఎవ్వరూ చూడకూడదని అంటున్నారు. ట్వింకిల్‌ రాసిన ‘పైజామాస్‌ ఆర్‌ ఫర్గివింగ్’పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ట్వింకిల్‌ భర్త అక్షయ్‌కుమార్‌, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ట్వింకిల్‌ తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నేను నటించిన ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. కాబట్టి నేను నటించిన సినిమాలు నిషేధించాలి. వాటిని ఎవ్వరూ చూడకూడదు. ఒక్కోసారి నా కెరీర్‌ గురించి ఆలోచించడం కూడా నాకు నచ్చదు. అందుకే నాకు అల్జీమర్స్‌ వ్యాధి ఉందని ఊహించుకుంటూ నా కెరీర్‌ను మర్చిపోవాలని అనుకుంటున్నాను. కరణ్‌ జోహార్‌ తొలిసారి నాతో యాడ్‌ ఫిలింను చిత్రీకరించబోతున్నాడు. దేవుడు అతన్ని చల్లగా చూడాలి. ఎందుకంటే నాకు నటించడం రాదు.' అని ట్వింకిల్‌ వెల్లడించారు.

 

13:51 - September 9, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. మోడీ పాలనలో బ్లాక్ మనీ వైట్ గా మారిందన్నారు. మోడీని ఎన్నిసార్లు కాల్చినా పాపం లేదని వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరలపై విపక్షాలు మండిపడుతున్నాయి. 

 

13:35 - September 9, 2018

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి అంజయ్య సతీమణి మణెమ్మ (74) కన్నుమూశారు. అపోలో  అాసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా మణెమ్మ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రెండుసార్లు  మణెమ్మ ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. 2008లో ఎమ్మెల్యేగా గెలిచారు. 

అంజయ్య 1980 అక్టోబర్ నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలు పాటు  ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరికి  ఒక కుమారుడు , నలుగురు కుమార్తెలు. 1980లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో అసమ్మతి పెరగడం...అవినీతి  ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం అంజయ్యను తొలగించిన సంగతి తెలిసిందే. 

ఇక మణెమ్మ విషయానికొస్తే ముషిరాబాద్ నుండి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మణెమ్మ ఘప విజయం సాధించారు. 2009లో సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పై ఆమె గెలుపొందారు. మొత్తంగా ముషిరాబాద్ నియోజకవర్గం నుండి అంజయ్య కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

13:14 - September 9, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్, టీటీడీపీ మధ్య పొత్తుకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ పార్టీతో టీటీడీపీ పొత్తుకు ఏపీ సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే చంద్రబాబు కొన్ని షరతులు విధించారు. ఈమేరకు టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పొత్తు విషయంలో టీటీడీపీ నేతలకే స్వేచ్ఛ ఇచ్చారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఆదేశించారు. అంతిమంగా పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆదేశించారు. బీజేపీనే టార్గెట్ చేసుకోవాలంటూ నేతలకు సూచించారు. పొత్తుల విషయంలో తాను తెరపైకి రానంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. 
   

12:18 - September 9, 2018

గుంటూరు : జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముఠా ఓ వ్యక్తిని హత్య మార్చింది. చిలకలూరిపేట మండలం యడవల్లి సమీపంలో ఈనెల 3వ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి అంజనీరాజు అలియాస్‌ ఆంజనేయరాజు, నూతలపాటి రామాంజనేయులు, అంజయ్య, కోటేశ్వరరావులు అన్నదమ్ముల పిల్లలు. వీరి కుటుంబంలోని ఒక మహిళతో అంజనీరాజు వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని అనుమానంతో రామాంజనేయులు, అంజయ్య, కోటేశ్వరరావు అతనిపై కక్ష పెంచుకొని చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పొలం అమ్మి డబ్బులు కూడా సమీకరించారు. ఇది తెలిసిన అంజనీరాజు ఈ ఏడాది మే నెలలో చిలకలూరిపేటకు వెళ్లాడు. ఊరు వదలిపెట్టినా అంజనీరాజును చంపుతామని వారంతా బంధువులతో చెప్పారు. అంజనీరాజును చంపేందుకు సాధు బాబు, సాధు రమేష్‌లను అనే వ్యక్తులను వారు సంప్రదించారు. ఎలాగైనా అంజనీరాజును చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. అందుకు సాధు రమేష్‌ రూ.10 లక్షలు డిమాండ్‌ చేశాడు. దాని ప్రకారం పథకం రూపొందించిన కిరాయి ముఠా.. ఈనెల 3వ తేదీ రాత్రి అంజనీరాజు పనిచేసే యడవల్లి గ్రానైట్‌ క్వారీ వద్దకు వెళ్లారు. సాధు రమేష్‌ అతని మిత్రులు ఏసుబాబు, అచ్చిబాబులు ఇనుప పైపులతో అంజనీరాజు తలపై కొట్టి చంపారు. ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసిన చిలకలూరిపేట గ్రామీణ సీఐ శోభన్‌బాబు చురుగ్గా దర్యాప్తు నిర్వహించి 4 రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 

10:57 - September 9, 2018

హైదరాబాద్ : మసాజ్‌ పేరుతో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. వ్యభిచార దందాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకుడితోపాటు ఎనిమిదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... బెంగళూరుకు చెందిన సమీర్‌ అగర్వాల్‌(40) సికింద్రాబాద్ మెట్టుగూడలోని గాయత్రి ప్లాజా మూడో అంతస్తులోని 302 ప్లాట్‌లో స్టార్‌స్పా పేరుతో 6నెలల క్రింతం మసాజ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆశించిన ఆదాయం రాకపోవడంతో ‘లోకోంటో’అశ్లీల వెబ్‌సైట్‌లో ఆకర్షించే యువతుల ఫోటోలతో పాటు ఫోన్‌ నంబరును ఉంచారు. దానికి కాల్‌ చేసే వారి పూర్తి వివరాలు సేకరించి స్పా సెంటర్‌కు రప్పించి వ్యభిచారం నిర్వహించడం ప్రారంభించారు. దీనిపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఓ కానిస్టేబుల్‌ను విటుడిగా పంపించి వివరాలను సేకరించారు. శనివారం రాత్రి 6గంటలకు మసాజ్‌ సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడు సమీర్‌ అగర్వాల్‌తో పాటు అక్కడ పనిచేస్తున్న పశ్చిమబెంగాల్ కు చెందిన ఇద్దరిని, ముగ్గురు విటులను, పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. నిర్వాహకుడితోపాటు ఎనిమిదిమంది నిందితులను అదుపులోకి తీసుకుని నగదు, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  

 

10:25 - September 9, 2018

ఢిల్లీ : మన సంకల్పం ధృడంగా ఉన్నప్పుడు ఏ అవరోధాలూ మనకి అడ్డంకులు సృష్టించలేవు అంటారు. ఇండోనేషియాలో జరిగిన ఏషియాడ్‌లో పతకాలు సాధించిన కొంతమంది నేపధ్యం చూస్తే అదే నిజమనక తప్పదు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చి విజయాలు సాధించించారు. సాధారణ ట్రక్ డ్రైవర్ కొడుకు అయిన భగవాన్ సింగ్ రోవర్స్ గేమ్‌లో గోల్డ్‌తో పాటు రెండు కాంస్య పతకాలు సాధించాడు. భగవాన్ సింగ్ జర్నలిజం చదువుతూ కుటుంబానికి సాయపడేందుకు మధ్యలో తన చదువు ఆపేశాడు. అతని తాజా విజయం వ్యక్తిగతంగా అతనితో పాటు పడవపోటీలకు భారత్‌లో ప్రాచుర్యం తెచ్చినట్లైంది. 

 

09:51 - September 9, 2018

విశాఖ : నగరంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ గంగిరావి చెట్టు ఆకుల నుంచి చినుకులు కురుస్తున్నాయి. విశాఖ అంతగా భానుడు భగభగమంటుంటే... కేవలం ఆ చెట్టు దగ్గర మాత్రమే చెట్టు నుంచి జల్లులు కురుస్తున్నాయి. వినడానికి ఇది ఆశ్చర్యంగా.. వింతగా ఉండడంతో ఈ వింతను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. 

విశాఖలో చెట్టు నుంచి వర్షం కురవడం సర్వత్రా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్కయ్యపాలెం పోర్టు క్వార్టర్స్‌ సమీపంలో ఒక గంగిరావి చెట్టు కుంది. ఆ చెట్టు  ఆకుల నుంచి నీటితో కూడిన చుక్కులు కురవడాన్ని స్థానికులు గమనించారు. మరే ప్రాంతంలో వర్షం పడకుండా కేవలం ఆ వృక్షం కిందే వర్షపు చినుకులు మాదిరిగా నీటి బిందువులు జల్లులా కురుస్తుండడం వింతగొల్పుతోంది.

చెట్టు ఆకుల నుంచి వర్షపు జల్లుల్లాంటి నీటి బిందువులు పడుతుండడంతో  దేవుడి మహిమ అంటున్నారు స్థానికులు, అంతేకాదు...చెట్టుకింద దేవతా విగ్రహాలు ఉంచి పూజలు మొదలు పెట్టారు. ఈ విషయం చుట్టుపక్కలకు పొక్కడంతో జనం వింతను చూసేందుకు తరలివస్తు్నారు.  చెట్టుకు దండాలు పెడుతూ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రజలు  ఈ వింతను దైవసృష్టిగా భావిస్తున్నామని చెబుతున్నారు.

అయితే గంగరావి చెట్టుకు ఆకుల చివర్లో హైడాథోడ్స్‌ అంటే చిన్నచిన్న రంధ్రాలు ఉంటాయని.. కొన్నిసార్లు చెట్టులో నీరు అధికమైనప్పుడు ఇలా ఆకుల ద్వారా నీరుబయటకు వస్తుందని  విజ్ఞానశాస్త్ర మేధావులు చెబుతున్నారు. ఇదొక సర్వసాధారణమైన అంశంమని అంటున్నారు.  ఈ అధికమైన నీరు గట్టేషన్‌ అనే ప్రక్రియ ద్వారా బయటకు రావడాన్ని హైడ్రోస్టాటిక్‌ ప్రెజర్‌ అని అంటార. ఇదే కారణమై ఉండొచ్చని తెలిపారు. మరోవైపు ఇవేమీ తెలియని జనం మాత్రం దైవ సృష్టి అంటూ పూజలు నిర్వహిస్తున్నారు.

09:03 - September 9, 2018

నల్గొండ : నాగార్జున సాగర్ ను చూసేందుకు వెళ్తున్నారా ? అయితే మీరు కొత్త అనుభూతిని పొందుతారు. నాగార్జున సాగర్ కు వెళ్లే పర్యాటకులు కొత్త అనుభూతి పొందేలా...తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి కలిగించేలా ఈ లాంచీ ప్రయాణం ఉండనుంది. పర్యాటకానికి తోడు శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకునేలా ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది.

నాగార్జున సాగర్ పర్యాటకులు కొత్త అనుభూతి ఆస్వాదించేలా తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. నాగార్జున సాగర్ నుంచి అధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంకు లాంచీని ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఐదు జిల్లాల మీదుగా 110 కిలోమీటర్ల పాటు లాంచీ ప్రయాణం సాగనుంది. నల్లమల కొండల మధ్య సాగే లాంచీ ప్రయాణం....పర్యాటకులకు కొత్త అనుభూతి కలగనుంది. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు....నల్లమల జలాశయం అటవీ ప్రాంతం మధ్యలో విస్తరించి ఉంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 570 అడుగులు దాటితేనే....శ్రీశైలంకు లాంచీ ప్రయాణానికి అణువుగా ఉంటుందన్న లక్ష్యంతో ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత పర్యాటకుల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మూడు ప్యాకేజీలను నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్  నీటి మట్టం 585 అడుగుల మార్కు దాటడంతో...ట్రయల్ రన్ లేకుండానే తెలంగాణ పర్యాటక శాఖ యాత్రకు శ్రీకారం చుట్టింది. కృష్ణా నదిలో ఆరు గంటల పాటు సాగే యాత్రలో...అలలతో పోటీ పడుతూ లాంచీ యాత్ర సాగుతుంది. లాంచీయాత్ర మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలోనే సాగడంతో...పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. 

08:14 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్.. 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి తప్ప...అందరికీ మళ్లీ అవకాశం కల్పించారు. బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న తెలంగాణలో....ఆ వర్గాలకు ఎన్ని సీట్లు కేటాయించారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించారా ? లేదంటే గెలుపు గుర్రాలకే మళ్లీ అవకాశం ఇచ్చారా ? 
9శాతం జనాభా ఉన్న కులాలకు 55 సీట్లు..
దేశంలోనే ఎక్కువ బలహీన వర్గాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. అంతేకాదు, ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన కేసీఆర్‌.. 119 స్థానాల్లో 105 స్థానాలకూ అభ్యర్థులనూ ప్రకటించేశారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీలో...బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారన్న దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీని రద్దు చేసిన 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.... సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ అవకాశం కల్పించారు. నిన్న మొన్నటి వరకు సామాజిక న్యాయం అంటూ మాట్లాడిన కేసీఆర్...సీట్ల కేటాయింపులో బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్న విమర్శలు ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో 9శాతం జనాభా ఉన్న కులాలకు 55 సీట్లు దక్కితే...91శాతం ఉన్న బలహీన వర్గాలకు దక్కింది 50 సీట్లు. 
52శాతం బీసీలకు 20 సీట్లే.. 
తెలంగాణలో 52శాతం బీసీల జనాభా  ఉంటే...వారికి దక్కింది మాత్రం 20 సీట్లే. ఎస్సీలకు 16, ఎస్టీలకు 12 సీట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు జనరల్ కేటగిరి సీట్లు కేటాయించకూడదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు బలహీనవర్గాల ప్రజలు. మున్నూరుకాపులు, గౌడ సామాజిక వర్గాలకు చెరో ఆరు సీట్లు దక్కాయ్. యాదవులకు 4 సీట్లు, ముదిరాజ్‌, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, పెరిక కులాలకు ఒక్కో చోట ప్రాతినిధ్యం కల్పించారు. 16 ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లో 8 మాదిగ. మరో ఏడు చోట్ల మాల, ఒక స్థానం నేతకాని వర్గానికి కేటాయించడం ద్వారా సమతూకం పాటించారు. ఎస్టీలకు 12 స్థానాలుంటే...ఏడుగురు లంబాడ, ఐదుగురు ఆదివాసీ అభ్యర్థులను ఎంపిక చేశారు. రెండు సీట్లు ముస్లిం మైనారిటీలకు కేటాయించారు. 
ఎక్కువభాగం రెడ్లకే  
టీఆర్‌ఎస్‌ టికెట్లలో ఎక్కువభాగం రెడ్లకే దక్కాయి. 6శాతం జనాభా ఉన్న రెడ్లకు 35 సీట్లు,  0.5శాతం ఉన్న వెలమలకు 10, ఒక శాతం లోపున్న కమ్మ సామాజిక వర్గానికి 6 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు కేసీఆర్. హైదరాబాద్‌లో స్థిరపడ్డ రాజపుత్ర వంశానికి ఒక సీటిచ్చారు. అభ్యర్థులు ప్రకటించని 14 టికెట్లు ఎవరికి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 
సకల జనుల సర్వే.. 91శాతం బలహీన వర్గాలు 
సకల జనుల సర్వే చేయించిన కేసీఆర్....రాష్ట్రంలో 91శాతం బలహీన వర్గాల జనాభా ఉన్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత జనాభాకు అనుగుణంగా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలని కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే చేతిలో ఉన్న అధికారంతో ఎంత వరకు సామాజిక న్యాయం చేస్తున్నారో ఆలోచించుకోవాలని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 

 

07:42 - September 9, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో లుకలుకలు మొదలయ్యాయి. అసెంబ్లీ రద్దై...ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. టికెట్ వస్తుందని ఆశించిన నేతలకు టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశనిస్పృహలో ఉన్నారు. కేసీఆర్‌.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే టిక్కెట్లను ప్రకటించడంతో ఆశావహులంతా కారు దిగేందుకు సిద్ధమయ్యారు. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న నేతలంతా ఇప్పుడు అధినేత కేసీఆర్ నిరసన గళం వినిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 స్థానాల్లో 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మంథని, రామగుండంలో నిరసనలు మొదలయ్యాయి. 

టీఆర్‌ఎస్‌లో ఇంతకాలం టికెట్‌ కోసం ఎదురు చూసిన నేతలంతా ఇప్పుడు కండువా మార్చేందుకు రెడీ అవుతున్నారు. 
సిట్టింగ్‌లకు టికెట్‌ ఇచ్చి కేసీఆర్‌ తమను మోసం చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై సొంత పార్టీ నేతలే ఇప్పటికే తిరుగుబాటు ప్రకటించారు. ఎమ్మెల్యే హఠావో.. పార్టీ బచావో అంటూ వ్యతిరేకవర్గం ఏకమైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై  కోరుకంటి చందర్‌  ఫైర్‌ అవుతున్నారు. పార్టీ టికెట్ కోసం ఆయన శతవిధాలా ప్రయత్నాలు చేశారు. చందర్‌కు పార్టీ టికెట్‌ రాకపోవడంతో ఆయన అభిమాని ఒకరు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హంగామా సృష్టించారు. చందర్‌ కూడా పార్టీ తనకు అన్యాయం చేసిందంటూ కన్నీరుపెట్టుకున్నారు.

రామగుండం జెడ్పీటీసీ సంధ్య దంపతులు కూడా ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. రెండేళ్లుగా క్షేత్రస్థాయిలో పనులు కూడా చేస్తున్నారు. చివరికి అధినేత సోమారపుకే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం, సంధ్యారాణి దంపతులకు టికెట్‌ ఇవ్వకపోవడంతో సాగర్‌ , సంతోష్‌ అనే యవకులు కిరోసిన్‌ పోసుకుని  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఇక మంథనిలోనూ సేమ్‌ టూ సేమ్‌ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామ్‌రెడ్డి కుమారుడు టీఆర్‌ఎస్‌ యువజన రాష్ట్ర కార్యదర్శి సునీల్‌రెడ్డి మరోసారి ఆశాభంగం ఎదురైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటలో పుట్ట మధుకు టికెట్‌ ఇవ్వడంతో సునీల్‌రెడ్డి మద్దతుదారులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. రామ్‌రెడ్డిని కాదని పుట్టా మధుకు టికెట్‌ ఇవ్వడంపై ఇరువురి నేతల మధ్య విభేదాలు పెంచాయి.  ఇలా ప్రతి చోటా నేతల మధ్య టికెట్లు కుంపట్లు కొనసాగుతున్నాయి. మంథని, రామగుండం నియోజకవర్గాల్లో టికెట్‌ రాని ఆశావహులంతా కాంగ్రెస్‌, జనసమితిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

Don't Miss