Activities calendar

10 September 2018

18:47 - September 10, 2018

హైదరాబాద్ : 2007 నాటి జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడించింది. ప్రధాన నిందితులైన అనీక్ సయీద్, ఇస్మాయిల్ చౌధురీలకు సోమవారం నాడు మరణ శిక్షను ఖరారు చేసింది. మూడో నిందితుడు తారిక్ అన్జుమ్ కు జీవిత ఖైదును విధించింది. న్యాయమూర్తి స్వయంగా చర్లపల్లి జైలును సందర్శించి అక్కడే తీర్పును విడుదల చేశారు.

2007 ఆగస్టు 25 న కోఠిలోని గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో బాంబులను అమర్చి 40 మంది మృతికి, 75 మందికి పైగా గాయపడేందుకు నిందితులు కారణమయ్యారు. నిందితులకు కఠిన శిక్షలు విధించడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

18:24 - September 10, 2018

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు ఏఐసీసీ అధ్యక్షులు రాజీవ్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. 2011-12 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్నురిటర్నులకు సంబంధించిన వివాదంలో సోనియా, రాహుల్ వేసిన పీటిషన్ ను కోర్టు సోమవారం తిరస్కరించింది.    

వారు  వేసిన రిట్ పిటీషన్లు పనికిరావు.. ఆదాయపు పన్ను శాఖకు ఆ ఏడాది పన్ను ఎసెస్మెంటును తిరిగి ఓపెన్ చేసే అధికారం ఉన్నందున ఈ పిటీషన్లు చెల్లవని కోర్డు నిర్ధారించింది.

ఆదాయపు పన్ను శాఖ ఈ ఏడాది మార్చిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు పంపిన నోటీసులలో వారు 2011-12 సంవత్పరానికి గాను సమర్పించిన పన్ను వివరాలను తిరిగి పున:పరిశీలిచాల్సి ఉందని తెలిపింది. దీనికి వ్యతిరేకంగా సోనియా, రాహుల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అలాగే మరో కాంగ్రెస్ నేత ఆస్కర్ ఫెర్నాండేజ్ వేసిన పిటీషన్ ను సైతం కోర్టు కొట్టివేసింది.

ఇంగ్లీషు పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆదాయపు పన్ను కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పున:పరిశీలకు చర్యలు చేపట్టింది. 2008 సంవత్సరంలో హెరాల్డ్ పత్రిక మూసివేసే సమయానికి రూ 90 కోట్ల అప్పులు చెల్లించకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ కేసును ధాఖలు చేసింది.  

15:57 - September 10, 2018

హైదరాబాద్ : డాలరు విలువతో పోల్చితే రూపాయి విలువ సోమవారం మరింత దిగజారింది. రూపాయి మరింత పతనమై డాలర్ రేటుతో 72.67 స్థాయికి పడిపోయింది. వాణిజ్య లోటుతోపాటు అమెరికా డాలర్ కు ఎగుమతి  దారుల వల్ల డిమాండ్ పెరగటంతో రూపాయి విలువ పడినట్టు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

దేశీయ ద్రవ్య విలువ ఈరోజు డాలర్ రేట్ పై 71.73 దగ్గర మొదలై అత్యల్పంగా 72.15 వద్ద ముగిసింది. నిన్నటి 72.11 విలువను రికార్డు స్థాయిలో దాటి 72.67 గా నమోదయ్యింది.

15:44 - September 10, 2018

విజయవాడ : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అన్ని వర్గాలకు భారంగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన ఓ ప్రకటన చేశారు. పెట్రోల్ ధరలపై రూ. 2 వ్యాట్ ను తగ్గించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు రూ. 1200 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ప్రస్తుతం రూ. 4లను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇంధన ధరలు తగ్గించేందుకు నాలుగేళ్లుగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేంద్రం బాధ్యతగా వహించి ఎక్సైజ్ పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని, రూ. 20 లక్షల కోట్లకు పైగా ప్రజలపై కేంద్రం అదనంగా భారం వేస్తోందన్నారు. 

15:33 - September 10, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాబోయే రోజుల్లో జోరుగా వలసలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ నుండి అసమ్మతి నేతలు జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు మార్గాలు వెతుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే చేరికకు ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆజాద్, ఉత్తమ్ సమక్షంలో డీఎస్, కొండా సురేఖ, కొండా మురళీ, భూపతి రెడ్డిలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లోకి మాజీ గులాబీ ప్రతినిధులు కూడా చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నందీశ్వర్, కేఎస్ రత్నం చేరికలపై దామోదర, సబితా ఇంద్రారెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి నేతల చేరికతో కాంగ్రెస్ లో ఉన్న నేతలు ఎలా స్పందిస్తారు ? వారు కూడా ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారా ? అనేది చూడాలి. 

13:55 - September 10, 2018

బీహార్ : భారత్ బంద్ రెండేళ్ల చిన్నారిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకున్నట్లు పలు జాతీయ పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా దేశ వ్యాప్త బంద్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ కు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. బీహార్ లో పలు ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. జెహనాబాద్ లో వాహనాలను ఆందోళనకారులు నిలిపివేశారు. ఆ సమయంలో అస్వస్థతకు గురైన రెండేళ్ల చిన్నారిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. కానీ ట్రాఫిక్ లో చిక్కుకపోవడంతో తమ పాప చినిపోయిందని కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఐటి మంత్రి రవి శంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 

12:56 - September 10, 2018

సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే పలు ఛాలెంజులు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛాలెంజ్ సందడి చేస్తోంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ..ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి...తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలే కేటీఆర్ ను ఉద్దేశించి ఉత్తమ్ పలు వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ రాజకీయాలోకి రాకముందు అంట్లు తోముకొనే వారని' ఉత్తమ్ కామెంట్లు చేశారు. దీనికి కేటీఆర్ కూడా స్పందించారు.

దీనిపై కేటీఆర్ అభిమానులు వినూత్న ఛాలెంజ్ ను విసురుతున్నాయి. 'డిష్ వాష్' ఛాలెంజ్ అంటూ అభిమానులు అంట్లు తోముతూ ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ ఫొటోలన్నీ ఉత్తమ్ కు షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిష్ వాస్ ఛాలెంజ్ కు కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని సవాల్ విసురుతున్నారు. 

12:37 - September 10, 2018

నందమూరి కుటుంబం ఇప్పుడిప్పుడే కొలుకోంటోంది. హరికృష్ణ హఠాన్మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా జూ.ఎన్టీఆర్ ను తీవ్రంగా కలిచివేసింది. మనస్సులో ఉన్న బాధను దిగమింగుకుని జూ.ఎన్టీఆర్ షూటింగ్ లలో పాల్గొంటున్నారంట. జూ.ఎన్టీఆర్ 'అరవింద సమేత' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ షూటింగ్ జరుపుకొంటోంది. పంద్రాగస్టును పురస్కరించుకుని మూవీ టీజర్‌ రిలీజైంది.

టీజర్ లో ఎన్టీఆర్ నటన చూసి అభిమానులు ఫిదా అయిపోయారంట. తాజాగా మరో ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందంట. వినాయక చవితి సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేస్తారని టాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 20న ఈ మూవీ ఆడియో విడుదల చేయనున్నారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

12:14 - September 10, 2018

హైదరాబాద్ : నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కాసేపటి క్రితం గచ్చిబౌలిలో బస్సు బీభత్సానికి ముగ్గురు మృత్యువాత పడితే తాజాగా ఓ ఆటో బీభత్సానికి ఒక చిన్నారి బలైంది. ఈ ఘటన రామంతాపూర్ లో చోటు చేసుకుంది. శారదానగర్ లో ఉంటున్న ఓ కుటుంబం కిరాణా సరుకులు తీసుకరావడానికి బయటకు వెళ్లింది. వారితో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. కానీ ఓ ఆటో వేగంగా వచ్చిన ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మహీత్ కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. తాగిన మైకంలో ఆటో డ్రైవర్ నడిపినట్లు తెలుస్తోంది. 

12:03 - September 10, 2018

విజయవాడ : మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి వసంత ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సోమవారం అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం బాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై బాబు సీరియస్ గా స్పందించారు. బెదిరింపులు..హత్యలతో ఏమీ సాధించలేరని...ఇలాంటి చర్యలను సహించేది లేదని..ఎంతటి వారైనా తీవ్రస్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. మంత్రిని హత్య చేస్తామనే ధోరణిలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని వ్యూహ కమిటీకి సూచించారు. ఇప్పటికే కేసు నమోదైందని వ్యూహ కమిటీ సభ్యులు బాబు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోనూ ఈ ప్రస్తావన తీసుకరావాలని బాబు సూచించారు. 

11:43 - September 10, 2018

ఢిల్లీ : రూపాయి విలువ మరింత క్షీణిస్తోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత పతనమవుతోంది. సోమవారం 64 పైసలు నష్టపోయి 72.37 స్థాయిని డాలర్ విలువ తాకింది. ట్రేడ్ వార్ పరిణామాలతో రూపాయి విలువ పతనమవుతోందని బిజినెస్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆల్‌ టైమ్ లో రూపాయి పతనం రికార్డులు సృష్టిస్తోంది. చివరి సెషన్‌లో రూ.71.74 దగ్గర ముగిసిన రూపాయి విలువ ఈరోజు 42 పైసల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. రూ.72.15 దగ్గర మొదలై ప్రస్తుతం రూ.72.37 దగ్గర కొనసాగుతోంది రూపాయి విలువ. మరోవైపు స్టాక్ మార్కెట్లు అలాంటి పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మరోవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతుండడంతో స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. 

11:25 - September 10, 2018

హైదరాబాద్ : 11 ఏళ్ల క్రితం నగరంలో సంభవించిన జంట బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువడుతోంది. దిల్ సుఖ్ నగర్, లుంబినీ పార్కు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఏ 1 అనిఖ్, ఏ 2 అక్బర్ ఇస్మాయిల్ చౌదరికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. సోమవారం చర్లపల్లికి జైలుకు ప్రత్యేక న్యాయమూర్తి చేరుకున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారక్ అంజుమ్ ను దోషిగా ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇండియన్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులు ఈ మారణ హోమానికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 44 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 

ఆగస్టు 4వ తేదీన వాదనలు ముగిసాయి. మొత్తంగా 11 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ సాగింది. అనంతరం నాంపల్లి రెండో అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జీ సెప్టెంబర్ 4వ తేదీన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది నిందితుల్లో కేవలం ఇద్దర్ని మాత్రమే దోషులుగా తేల్చింది. లుంబీపార్క్‌ లేజర్ షో వద్ద, దిల్‌సుఖ్‌నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద బాంబులు అమర్చిన అనీక్‌ షఫీఖ్ సయీద్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలను దోషులుగా పరగణించిన న్యాయస్థానం, నేడు వీరికి శిక్షలు ఖరారు చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌, అతడి సోదరుడు ఇక్బాల్‌ భత్కల్‌, అమీర్‌ రెజాఖాన్‌లు పరారీలో ఉన్నారు. తీర్పు నేపథ్యంలో న్యాయస్థానం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

11:13 - September 10, 2018

పారిస్ : ఓ దుండగుడు కత్తితో రెచ్చిపోయాడు. జనాలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఒక సినిమా థియేటర్ వద్ద ఉన్న ముగ్గురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈశాన్య పారిస్ లోని ఊర్క్ కెనాల్ లో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. మొత్తంగా ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు జర్మన్ పర్యాటకులున్నట్లు సమాచారం. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది తీవ్రవాదుల దాడి ? అనేది తెలియరావడం లేదు. దుండగుడి కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. 

10:51 - September 10, 2018

హైదరాబాద్ : 2007 ఆగస్టు 25వ తేదీన గోకుల్ ఛాట్, లుంబీపార్కు జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు నేడు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. మరో నిందితుడిపై తీర్పును వెలువరించనుంది. వీరికి ఎలాంటి శిక్షలు ఖరారవుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇండియన్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులు ఈ మారణ హోమానికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 44 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దోషులకు ఉరిశిక్షలు వేయాలని బాధితులు, ఇతరులు డిమాండ్ చేస్తున్నారు.

ఆగస్టు 4వ తేదీన వాదనలు ముగిసాయి. మొత్తంగా 11 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ సాగింది. అనంతరం నాంపల్లి రెండో అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జీ సెప్టెంబర్ 4వ తేదీన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది నిందితుల్లో కేవలం ఇద్దర్ని మాత్రమే దోషులుగా తేల్చింది. లుంబీపార్క్‌ లేజర్ షో వద్ద, దిల్‌సుఖ్‌నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద బాంబులు అమర్చిన అనీక్‌ షఫీఖ్ సయీద్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలను దోషులుగా పరగణించిన న్యాయస్థానం, నేడు వీరికి శిక్షలు ఖరారు చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌, అతడి సోదరుడు ఇక్బాల్‌ భత్కల్‌, అమీర్‌ రెజాఖాన్‌లు పరారీలో ఉన్నారు. తీర్పు నేపథ్యంలో న్యాయస్థానం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

10:51 - September 10, 2018

విజయవాడ:  వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు హోమ్ శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావుపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటుపల్లి పంచాయితీ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు పోన్ లో తనను వసంత నాగేశ్వరరావు బెదిరించారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సంభాషణలను రికార్డ్ చేసి ఆయన పోలీసులకు అందజేశారు.

గ్రామంలో ఫ్లెక్సీలు తొలగిస్తుండగా తనకు వసంత నాగేశ్వరరావు ఫోన్ చేసి దూషించారని, తనను తెలుగుదేశం ఏజంటుగా పనిచేస్తున్నావని తిట్టారని వెంకటేశ్వరరావు ఫిర్యాదులో ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల వివరాలు అడిగ తనను భయపెట్టారని.. తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ సంభాషణను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతున్నట్టు పోలీసులు చెప్పారు.

10:38 - September 10, 2018

హైదరాబాద్ : 'సేవ్ నిమ్స్' అంటూ వైద్యులు గళమెత్తారు. నిమ్స్‌లో డీన్‌గా నియామకం పొందిన ప్రొఫెసర్‌ ఆర్వీ కుమార్‌ను వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వైద్యులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని సేవలను బహిష్కరించిన వైద్యులు అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. డీన్‌ సీట్లో ఆయన కూర్చోవడానికి వీలు లేదని నిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. సోమవారం ఉదయం పాత భవనం ఎదుట వైద్యులు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు.

డీన్ గా కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం నిరవధిక సమ్మెలోకి వెళుతామని హెచ్చరిస్తున్నారు. ఆయనపై ఎన్నో ఆరోపణలున్నాయని, గతంలో ఏసీబీ విచారించిందని వారు పేర్కొంటున్నారు. అలాంటి అవినీతి ఆరోపణలున్న వ్యక్తి రద్దు అయిన రోజే డీన్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిమ్స్ లో వైద్యులు ఆందోళన చేస్తుండడంతో రోగులు పలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. 

10:27 - September 10, 2018

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు జరుగుతున్న భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానస సరోవర యాత్ర ముగించుకుని రాహుల్ ఢిల్లీకి చేరుకున్నారు. పెట్రో ధరలు పెంపుపై సోమవారం భారత్ బంద్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్రోల్ ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతకంటే ముందు రాజ్‌ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్‌ఘాట్ నుంచి జకీర్ హుస్సేన్ కాలేజ్ వరకు జరిగిన ఈ ర్యాలీ కొనసాగింది. రాహుల్ నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బీహార్ లో...
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వామపక్ష నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. దర్బంగ్‌లో కార్యకర్తలంతా రైల్ రోకోలు నిర్వహించారు. పలు రైళ్లను అడ్డుకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

10:03 - September 10, 2018

హైదరాబాద్ : మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఇంటి నుండి బయటకు కాలు పెట్టిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతారా ? లేదా ? అనేది తెలియదు. ఎందుకంటే రోడ్డుపై వెళుతుంటే ఏదైనా వాహనం ఢీకొనవట్టవచ్చు. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరుగవచ్చు. తాజాగా గచ్చిబౌలిలో బస్సు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి బస్టాపులో సోమవారం ఉదయం పలువురు బస్సుల కోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన ఓ బస్సు పాదాచారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడనే మృతి చెందారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడమే కారణమని తెలుస్తోంది. బస్సు కింద ఇరుక్కున్న వారిని కాపాడేందుకు స్థానికులు కాపాడారు. కానీ వారు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు సృష్టించిన బీభత్సంతో అక్కడున్న ప్రయాణీకులు భీతిలిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

 

09:33 - September 10, 2018

విజయవాడ : పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా నేడు భారత్ బంద్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బంద్ కు పిలుపునిచ్చింది. ఏపీలో జరుగుతున్న ఈ బంద్ కు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతు తెలియచేశాయి. పీసీసీ చీఫ్ రఘువీరా ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. బస్సులను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నేతలను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. అమలాపురంలో బస్ డిపో ఎదుట సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. కర్నూలు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 12 ఆర్టీసీ డిపోలకు బస్సులు పరిమితమైపోయాయి. వామపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో బస్టాండుల ఎదుట నిరసనలు కొనసాగుతున్నాయి. టిడిపి ఆధ్రవ్యలో బెంజ్ సర్కిల్ వద్ద నేతలు ఆందోళనలు చేపట్టారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో వామపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. వామపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు. తిరుపతి బస్టాండు ఎదుట వామపక్ష నేతలు ధర్నా చేపట్టారు. దీనితో పోలీసులు నేతలను అరెస్టు చేశారు. విజయనగరం జిల్లాలో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపిస్తోంది. 

09:23 - September 10, 2018

హైదరాబాద్ : పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా నేడు భారత్ బంద్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ జరుగుతోంది. ఆదిలాబాద్ ఆరు డిపోలలో 625 బస్సులు నిలిచిపోయాయి. కరీంనగర్ లో బస్సులను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీనితో మాజీ ఎంపీ పొన్నం, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ డిపోల ఎదుట కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఆరు డిపోల్లో 646 బస్సులు రోడెక్కలేదు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్ లకు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్ కొనసాగుతోంది. వేముల వాడ డిపో ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేతలు నిరసన చేపడుతున్నారు. నల్గొండ బస్ డిపో ఎదుటు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కానీ సంగారెడ్డి జిల్లాలో బంద్ అంతగా కనిపించలేదు. జనగామలో ఆర్టీసీ డిపో ఎ దుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాలను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల ఎదుట వామపక్ష నేతలు ధర్నా నిర్వహించారు. వనపర్తి జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యారు. మహబూబాబాద్ డిపో ఎదుట వామపక్ష నేతలు ధర్నా నిర్వహించారు. 

09:18 - September 10, 2018

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన సోమవారం శాసనసభలో 344 నిబంధన కింద పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణంపై చర్చ జరుగనుంది. విభజన హామీల అమలుపై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది. శాసనమండలిలో అమరావతి నిర్మాణంపై చర్చ కొనసాగనుంది. ఈ సమావేశాలకు గైర్హాజర్ కావాలని వైసీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీపై అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. 

09:14 - September 10, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సభకు ఎవరూ గైర్హాజర్ కావొద్దని, చర్చలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సమావేశాలకు వైసీపీ గైర్హాజర్ అయిన సంగతి తెలిసిందే. 

09:05 - September 10, 2018

హైదరాబాద్ : నేడు జీహెచ్ఎంసీలో రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశం జరుగనుంది. ఓటర్ల జాబితా సవరణపై చర్చ జరుగనుంది.

హైదరాబాద్ : గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్ షపీఖ్ సయ్యద్ కు నాంపల్లి అదనపు మెట్రో పాలిటిన్ జడ్జీ శిక్ష ఖరారు చేయనున్నారు. 

Don't Miss