Activities calendar

11 September 2018

22:44 - September 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మహాకూటమికి ఖరారయ్యింది. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి. హైదరాబాద్‌ పార్క్ హయత్‌ హోటల్‌లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ నేతలు భేటీ అయ్యారు. పొత్తులపై కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ నేతలు చర్చలు జరిపారు. ఈమేరకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలిసివచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుపోతామని అన్నారు. నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నకేసీఆర్‌ను గద్దె దింపేందుకే మహాకూటమిగా ఏర్పడుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. 

 

22:23 - September 11, 2018

జగిత్యాల : జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణాలేంటీ ? భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరగడానికి...డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ? లేదంటే ఘాట్ రోడ్డులోని చివరి మలుపు కొంపముంచిందా ? ఘాట్ రోడ్డయినప్పటికీ....పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నారా ? 

గతంలో ఎన్నడూ చోటు చేసుకొని...వినని విషాదమిది...ఒకరు కాదు ఇద్దరు కాదు...పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లోకి...జగిత్యాల జిల్లాలోనే అతి పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం...కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు...బస్సు ప్రమాదానికి కారణాలెన్నో. బస్సు చాలా పాతది కావడంతో పాటు కండీషన్ లో ఉందా లేదా అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు చాలా పాతది కావడంతోనే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

మంగళవారం కావడంతో ఎక్కువ మంది భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో...పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఎక్కారు. కొండగట్టు చివరి మలుపు వద్ద ప్రయాణికులందరూ డ్రైవర్‌ వైపు ఒరగడంతో...ఒకవైపే బస్సులో బరువు పెరిగింది. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్డులో....బస్సు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు లేవంటున్నారు. అయితే పోలీసులు మాత్రం....అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు.

మరోవైపు ప్రమాదం సమయంలో బస్సును డ్రైవింగ్ చేసిన శ్రీనివాస్...ఘాట్ రోడ్ల డ్రైవింగ్ లో మంచి ప్రావీణ్యం ఉంది. తెలంగాణ ఆర్టీసీ నుంచి ఉత్తమ డ్రైవర్ గా ఇటీవలే అవార్డు కూడా అందుకున్నారు. బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో...ముందువైపు మొత్తం ధ్వంసమైంది. డ్రైవర్ సీట్లో కూర్చున్న శ్రీనివాస్ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించినా...ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందారు.  

21:51 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి...లోయలోకి దూసుకెళ్లడంతో 57 మృతి చెందారు. గాయపడ్డ క్షతగాత్రులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు.
తప్పి లోయలో పడిన బస్సు 
కొండగట్టు ఘాట్ రోడ్డు నుంచి కిందికి దిగుతున్న బస్సు....చివరి మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. దీంతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి కొందరి తీవ్ర గాయాలు కావడంతో...ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కరీంనగర్, హైదరాబాద్ కు తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతులు బంధువులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటన స్థలంలో తమ బంధువులను చూసి....కన్నీరుమున్నీరయ్యారు.
ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి 
బస్సు లోయలో పడటంతో ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది పెద్దపల్లి, జగిత్యాల జిల్లా వాసులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక యువకులు సహాయ చర్యల్లో పాల్గొని...ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల ఆస్పత్రి మొత్తం మృతుల బంధువులతోనే నిండిపోయింది. తమ వారి మృతదేహాలను...కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 
ప్రమాదంపై కేసీఆర్, గవర్నర్ దిగ్భ్రాంతి 
కొండగట్టు రోడ్డు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన కేసీఆర్...క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులకు కుటుంబాలకు 5లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. తాజా మాజీ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్ రెడ్డిలు...క్షతగాత్రులను పరామర్శించి...వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆర్టీసీ తరపున 3లక్షల రూపాయలు సాయం అందిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , మహేశ్వర్ రెడ్డిలు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పోస్టు మార్టం పూర్తి కావడంతో మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు ట్రాక్టర్ లో తరలించారు.

 

20:44 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 58 కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలువురికి గాయాలు అయ్యాయి. ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎక్కువ మంది ఊపిరాకడ చనిపోయినట్లు తెలుస్తోంది.

ప్రమాద ఘటనపై తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ మంత్రి నారా లోకేశ్‌  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని గవర్నర్‌ నరసింహన్‌, అద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

19:43 - September 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు అయింది. కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ రద్దైన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

18:35 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 52కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద ఘటనపై తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ మంత్రి నారా లోకేశ్‌  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 88 మందితో వెళ్తోంది. కొండగట్టు ఘాట్‌ రోడ్డు పైకి ఎక్కుతున్నసమయంలో చివరి మూలమలుపు స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 52 మంది మృతిచెందారు. మృతుల్లో 25 మంది మహిళలు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయాలపాలైన 8 మందిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. మరికొందరికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందగానే జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ సింధూ శర్మ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతిచెందిన వారిలో ఇప్పటివరకు 35 మందిని అధికారులు గుర్తించారు. వారిలో 30 మంది శనివారంపేట, హిమ్మత్‌రావుపేటకు చెందినవారని తెలిపారు. బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌ మృతిచెందగా.. కండక్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడే శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది.

 

17:47 - September 11, 2018

దొంగతనం జరిగిన సమయం  - అర్థరాత్రి, సెప్టంబర్ 2, 2018

స్థలం - పురాణీహవేలీ లోని నిజాం మ్యూజియం

లోపలికి చొరబడిన విధానం - 20 అడుగుల ఎత్తులో ఉన్న వెంటిలేటర్ కు ఉన్న ఇనప కడ్డీలను తొలగించి తాడు సాయంతో లోపలకు దిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్: దొంగతనమైతే చాకచక్యంగా చేశారు కానీ అంత ఏంటిక్ విలువ ఉన్న బంగారు టిఫిన్ బ్యాక్సును ఎలా సొమ్ముచేసుకోవాలో తెలియక నిజాం మ్యూజియంలొ దొంగతనం చేసిన వ్యక్తులు అడ్డంగా బుక్కయ్యారు.

పోలీసులను బురిడీ కొట్టించిన విధానం...

 • దొంగతనం చేసిన తర్వాత సిమ్ కార్డు లేని ఫోన్ తో సంభాషించినట్టు నటించి పోలీసులను చాకచక్యంగా పక్కదారి పట్టించారు  ఈ ఘరానా దొంగలు.
 • దీంతో వారి సెల్ ఫోన్ సంభాషణను ట్రాక్ చేసేందుకు అన్ని టవర్లను పరిశీలించేందుకు పోలీసులు చాలా రోజులే తీసుకున్నారు.
 • 32 సీసీ కెమేరాలుకు చిక్కకుండా ఎటువంటి ఆధారాలు వదలకుండా చేసి పోలీసులకు గట్టి ఛాలెంజ్ నే విసిరారు.
 • చూట్టూ పోలీసు పహారా ఉన్నా కనీసం వారి ఎటువంటి చప్పుడు కాకుండా పనిని సులువుగా ముగించేశారు.
 • దొంగతనానికి ఉపయోగించిన మోటర్ సైకిళ్లను జహీరాబాద్ ప్రాంతంలో వదిలి.. పోలీసులను తికమక పెట్టారు ఈ దుండగులు.

నిజాం సొత్తుతో మజా ...

 • దాదాపు కిలో బరువున్న బంగారు టిఫిన్ బాక్సుతో నిజాం రాజు భొజనం చేసాడో లేదో ఎవరికీ తెలియదు. కానీ.. ఈ ఇద్దరు దొంగలు మాత్రం బంగారం టిఫిన్ బాక్సులో సుష్టుగా భోంచేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
 • దొంగతనం తర్వాత వీరిద్దరు - (అందులో 35 ఏళ్ల వ్యక్తి తాపీ పని చేస్తూ దొంగతనాలకు పాల్పడేవాడు. అతనిపై 26 దాకా కేసులున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరోక వ్యక్తి 25 ఏళ్లవాడు. కానీ ఈ దోపిడీకి కారకుడు అతనే. మామూలు టూరిస్టులాగా నిజాం మ్యూజియంను సందర్శించి.. దోపిడీకి పన్నగం పన్నాడు.) ముంబైకి చెక్కేసి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో మకాం వేశారు. నిత్యం భోజనం మాత్రం ఇదే బంగారపు టిఫిన్ బాక్సులోనే లాగించేవారట.  
 • వీరిద్దరూ కాజేసిన సొత్తు ఖరీదు దేశీయంగా అయితే రూ కోటికి పై మాటే.. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో వీటి విలువ రూ 120-150 కొట్ల వరకూ పలుకుతుందని సీనియర్ పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.
 • ఈ దుండగులు బంగారు టిఫిన్ బాక్సు పక్కనే ఉన్న బంగారు అట్టతో ఉన్న ఖురాన్ పుస్తకాన్ని టచ్ చేయలేదు. వారికి బంగారం కవర్ కనిపించినా.. భగవంతుడిపై ఉన్న భయంతో దాన్ని ముట్టుకోలేదని అనుకోవాలి.
16:10 - September 11, 2018

ముంబయి: రూపాయి మరింత క్షీణించి డాలరు విలువలో రూ 72.73 స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ మంగళవారం నాడు 28 పైసలు మేరకు తగ్గింది, ప్రారంభంలో 15 పైసలు తగ్గినా.. సాయంత్రం ట్రేడింగ్ లో 28 పైసలు మేర పడిపోయింది. ఈ ఏడాది ఇంతవరకు డాలరు విలువలో 13 శాతం మేర తగ్గింది. ఆసియా కరెన్సీలలోనే రూపాయి అత్యంత బలహీనమైన పనితీరును కనబరిచింది. 

ఇదిలాఉండగా, కేంద్ర ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందిగా రిజర్వు బ్యాంకు అధికారులను ఆదేశించింది.

14:19 - September 11, 2018

హైదరాబాద్: ‘‘నేను తింటున్నప్పుడు మా నాన్న వాతలు పెట్టాడు. కాల్చిన చంచాతో వాతలు పెట్టి.. నన్ను కొట్టాడు..మా అమ్మ కూడా బాగా కొట్టింది.’’ ఈ మాటలు  హైదరాబాద్ కు చెందిన నాలుగేళ్ల చిన్నారి పిల్లల హక్కులను పరిరక్షించే ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహకులకు చెప్పిన మాటలు.పక్కింటి వారి సాయంతో ఈ చిన్నారి నరకయాతన వెలుగులోకి వచ్చింది. ఈ పాప పడుతున్న యాతన చూసిన పక్కింటి వారు స్థానిక రాజకీయ నాయకుడికి ఫిర్యాదు చేయటంతో ఆయన స్వచ్చంధ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.

ఈ పాపను వారి తల్లిదండ్రుల వద్దనుంచి రక్షించి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్ లో చేర్పించారు. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ చిన్నారి 25 ఏళ్ల వయస్సున్న తల్లి భర్తను వదిలేసి వేరే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. తన భాగస్యామితో గొడవలు జరగటంతో.. వీరిద్దరూ కలిసి తమ చిరాకును పాప మీద చూపించడం మొదలుపెట్టారు. ఈ పాపను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు వివరించారు.

పాప తల్లి, సవతి తండ్రిపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దవాళ్లు చేసే తప్పులకు పిల్లలు చిత్రహింసలకు గురవుతున్నారు. సమాజంలో ఈ విపరీత పోకడలకు ముగింపు పలకాల్సి ఉందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.   

13:52 - September 11, 2018
కరీంనగర్ : టీఆర్ఎస్ తనకు టికెట్ కేటాయించలేదని ఓ నేత గృహ నిర్భందం చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు..కేసీఆర్ పై తనకు అపారమైన నమ్మకం  ఉందని...బాల్క సుమన్ కు సపోర్టు ఇచ్చేది లేదని స్పష్టం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ఇటీవలే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియజకవర్గ టికెట్ బాల్క సుమన్ కు దక్కింది. దీనితో నల్లా ఓదేలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వెంటనే తనకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం స్పందించకపోయే సరికి గృహ నిర్భందం విధించుకున్నారు. స్పష్టమైన హామీనిస్తే గాని గృహ నిర్భందం విరమిస్తానని తేగేసి చెబుతున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు నల్లాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో సిట్టింగులు అందరికీ టికెట్లు కేటాయించి తనకు ఇవ్వకపోవడం బాధించిందని, బాల్క సుమన్ వల్లే తనకు టికెట్ రాలేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 
13:39 - September 11, 2018

హైదరాబాద్ : మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రిమాండ్ విధించారు. పోలీసులు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. 104 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీనితో జగ్గారెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. 2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు ఈ కేసులో జగ్గారెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.  కేవలం తనను రాజకీయ సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు. 

13:24 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు..వారికి మృత్యుదారి అయ్యింది. ఆంజనేయ స్వామిని దర్శించుకుని సంతోషంగా తిరుగు ప్రయాణమయిన వారు విగతజీవులుగా మారిపోయారు. సంతోషంగా ఉండాల్సిన వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద లోయలో ఆర్టీసీ బస్సు పడిపోవడంతో 40 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం బాగా ధ్వంసమైంది. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, పిల్లలున్నారు. సహాయక చర్యల్లో స్థానికులు పాల్గొన్నారు. 

కొండగట్టు మీద నుండి కిందకు వస్తున్న సమయంలో మూల మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు బ్రేకలు ఫెయిల్ కావడంతో ఘటన చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. దీనితో మృతుల బంధువులు ఆర్టీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అపద్ధర్మ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. ఘటన జరిగిన అనంతరం ఎస్పీ సింధు, కలెక్టర్ శరత్ చేరుకుని ఆరా తీశారు. 

12:36 - September 11, 2018

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్...మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న అరవింద సేమత సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ ఆరు పలకలతో కనిపించడం అభిమానులను అలరిస్తోంది. ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. అక్టోబర్ మాసంలో చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 
తాజాగా చిత్ర యూనిట్ ఆడియో వేడుకపై దృష్టి పెట్టింది. వేడుకకు ముఖ్యఅతిథులు వారేనంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు రానున్నారని ప్రచారం జరిగింది. గతంలో మహేష్ సినిమాకు ఎన్టీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్. కానీ తాజాగా మరో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అరవింద సమేతలో బిగ్ బి కీలక పాత్ర పోషించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

12:08 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు హాహాకారాలతో మారుమోగింది. తమ వారు ఎక్కడున్నారు ? జీవించి ఉన్నారా ? అంటూ ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలు కంటతడి పెట్టించాయి. పవిత్ర ఆలయం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మంగళవారం చోటు చేసుకుంది. 
కొండగట్టును దర్శించుకొనేందుకు పలువురు జగిత్యాల జిల్లాకు వస్తుంటారు. మంగళవారం నాడు పలువురు దర్శనం చేసుకుని బస్సులో కిందకు బయలుదేరారు. ఆ సమయంలో బస్సులో 80 మంది ఉన్నట్లు సమాచారం. లోయ వద్ద మలుపు తీసుకుంటుండగా ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీనితో పది మంది అక్కడికక్కడనే మృతి చెందారు. ఇందులో వృద్దులు, చిన్నారులున్నారు. వారి వారి మృతదేహాల వద్ద బంధువులు రోదించారు. ఈ ఘటనపై సీఎం దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

11:59 - September 11, 2018

హైదరాబాద్ : తాను అందుబాటులో లేకుండా వెళ్లాలన్నవార్తలపై కడియం శ్రీహరీ స్పందించారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని..కడియం అలక అని వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఆయన వివరణనిచ్చారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. శ్రీ వారి దర్శనం కోసం తిరుపతికి వెళ్లడం జరిగిందన్నారు. మరుసటి రోజు నుండి కార్యకర్తలకు అందుబాటులో ఉన్నానని, మంగళవారానికి సచివాలయానికి వెళుతున్నట్లు వెల్లడించారు. 

వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ లో అసంతృప్తులు రాజ్యం ఏలుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా ఈసారి తాటికొండ రాజయ్యకు టికెట్ కేటాయిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వర్గీయులు, అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో జనగామ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. రాజయ్యకు టికెట్ ఇవ్వడంపై కడియం శ్రీహరిని టీఆర్ఎస్ కార్యకర్తలు కలిశారు. రాజయ్యకు మద్దతివ్వమని కార్యకర్తలు తెగేసి చెప్పారు. కడియం శ్రీహరి కూతురికి టికెట్ వస్తుందని కార్యకర్తలు, నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ టికెట్ రాకపోవడంతో రహస్య సమావేశాలు జరుపుతున్నారు. మరి కడియం శ్రీహరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

11:35 - September 11, 2018

విజయవాడ : ఏపీలో కూడా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ రాజకీయ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తాజాగా వైసీపీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళశారం విశాఖలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సమావేశాలకు కూడా వైసీపీ గైర్హాజర్ అయ్యింది. దీనిపై టిడిపి తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వేతనాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా...ప్రజా సమస్యలపై చర్చించకుండా వైసీపీ నాటకాలు ఆడుతోందని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. దీనితో సంచలన నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు. మూకుమ్మడిగా ఎమ్మెల్యెలు రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందని సమావేశంలో చర్చించనున్నారు. కానీ దీనిపై కొంతమంది ఎమ్మెల్యేలు విబేధిస్తున్నట్లు సమాచారం. మరి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

11:16 - September 11, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏఐఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. తమకు పట్టున్న స్థానాల్లో భారీ ఆధిక్యంతో తిరిగి గెలిచేందుకు  వ్యూహం రచించింది. అదికార టీఆర్ఎస్ తో ఎటువంటి పొత్తు లేకపోయినా  గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పాత నగరంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల వేడి మరింత పుంజుకుంది.

ఏడు స్థానాల్లో అభ్యర్థులు
 

 1. ముంతాజ్ అహ్మద్‌ఖాన్ - చార్మినార్
 2. మహ్మద్ మొజంఖాన్ -  బహదూర్‌పుర
 3. అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాల్ - మలక్‌పేట్ 
 4. అక్బరుద్దీన్ ఓవైసీ -  చంద్రాయణగుట్ట
 5. జాఫర్ హుస్సేన్ మేరాజ్ - నాంపల్లి
 6. కౌసర్ మొహిద్దీన్ - కార్వాన్
 7. సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ - యాకుత్‌పుర
11:16 - September 11, 2018

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారనే దానిపై ఉత్తర మండల డీసీపీ సుమతి వివరణనిచ్చారు. భార్య పిల్లల పేరిట ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి అక్కడే వారిని వదిలేసి వచ్చారనే ఆరోపణలతో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2004లో జగ్గారెడ్డితో తనతో పాటు భార్య, పిల్లల పేరిట పాస్ పోర్టులు తీసుకున్నారని, వేకొరని అమెరికాకు తీసుకెళ్లారని గుర్తించినట్లు తెలిపారు. ఎవరు వెళ్లిందో గుర్తించాల్సి ఉందని, తెలంగాణకు చెందిన వారు మాత్రం కాదని స్పష్టం చేశారు. సికింద్రబాద్ పీఎస్ ఎస్ఐ అంజయ్యకు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమంగా తరలించిన ముగ్గురి నుండి జగ్గారెడ్డి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనపై అధికార దుర్వినియోగం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. 

11:03 - September 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు వేడి రాజుకొంది. కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నట్లు ప్రకటించడం...105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో బిజీ బిజీగా మారిపోయాయి. మంగళవారం ఎంఐఎం తొలి జాబితాను ప్రకటించింది. మళ్లీ గెలుపు గుర్రాలకే పట్టం కట్టింది. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను ఖరారు చేయడం విశేషం. పాతబస్తీలో మరోసారి పట్టునిలుపుకొనేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది. 

నియోజకవర్గం అభ్యర్థి
చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ
యాకుత్ పురా అహ్మద్ పాషా ఖాద్రీ
చార్మినార్  ముంతాజ్ అహ్మద్ ఖాన్
బహదూర్ పురా మౌజమ్ ఖాన్
మలక్ పేట అహ్మద్ బిన్ అబ్దుల్లా
నాంపల్లి  జాఫర్ హుస్సేన్
కార్వాన్ కౌసర్ మొహీనుద్దీన్

 

10:19 - September 11, 2018

హైదరాబాద్: ఓపిగ్గా ఎదురు చూసినందుకు దానం నాగేందర్ ను టీఆర్ఎస్ అధిష్ఠానం కరుణించింది. పార్టీ ప్రకటించిన 105 అభ్యర్థుల్లో తన పేరు లేకపోవడంతో ఖంగారు పడ్డ దానం ఇప్పుడు తేరుకున్నారు.

ఒక స్థాయిలో టిక్కెట్ రాకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమనడంతో దానం నాగేందర్  కొంత కంగారు పడ్డారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కొట్టిపారేశారు.

అయితే.. గోషామహల్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అధిష్టానం  దానం పేరు ఖరారు చేసినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఆయన పేరు ప్రకటించే చేసే అవకాశం ఉంది.

09:35 - September 11, 2018

సెప్టెంబర్ 11...అందరికీ ఈ తేదీన ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఇదే రోజున దాడి జరిగింది. ఈ దాడిలో ప్రజలు ఉలిక్కి పడ్డారు. నాలుగు విమానాలాతో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ దాడికి పాల్పడడంతో మూడు వేల మంది దుర్మరణం చెందగా మరో ఆరు వేల మంది ఇప్పటికీ అక్కడి వాసులు ఈ దారుణ ఘటనను మరిచిపోవడం లేదు. అమెరికన్లే కాదు...ప్రపంచ ప్రజలు కూడా ఈ విషాద ఘటనను మరిచిపోలేరు. గాయాలపాలయ్యారు. డబ్యూటీవో పై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా పరిగణించింది. 

2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖైదా ఉగ్రవాదులు ఈ మారణ హోమానికి తెగబడ్డారు. ఈ దాడికి నేటితో 17 ఏళ్లు. అందుకే సెప్టెంబర్ 11 అంటే చాలు అమెరికన్లు ఉలిక్కి పడుతుంటారు. ఈ సందర్భంగా తమ వారిని కోల్పోయిన వారిని తలుచుకుంటూ కుటుంబసభ్యులు నివాళులర్పిస్తుంటారు. అక్కడి ప్రభుత్వం కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. 

ఈ భీకర విధ్వంసం ఘటన నుండి తేలుకోవడానికి అమెరికాకు చాలా ఏళ్లే పట్టంది. అనంతరం ఉగ్రవాద ఏరివేత చర్యలకు అమెరికా ఉపక్రమించింది. అమెరికా బలగాలు ఉగ్రమూకలను హతమార్చింది. కానీ అల్ ఖైదా కీలక నేత ఒసామా బిన్ లాడెన్ ను తుదముట్టించేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు జరిపింది. సరిగ్గా న్యూయార్కు పై దాడులు జరిగిన పదేళ్లకు లాడెన్ ను అమెరికా తుదముట్టించింది. 

09:07 - September 11, 2018

సంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సంగారెడ్డిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు కార్యకర్తలు..నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జగ్గారెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 14 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు తెర మీదకు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే జగ్గారెడ్డిని అరెస్టు చేసిన అనంతరం పీఎస్ లో మూడు గంటల పాటు పోలీసులు విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ కోర్టు స్పెషల్ జడ్జి ముందు జగ్గారెడ్డిని హాజరు పరచనున్నారు. 

2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. జగ్గారెడ్డి తీసుకెళ్లినవారు 14 ఏళ్లు అయినా.. ఇంకా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అమెరికా కాన్సులేట్‌ అధికారులు ఈ విషయంపై ఆరా తీయాలంటూ నార్త్‌జోన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు.. జగ్గారెడ్డి 2004లో తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌పోర్టుల డాక్యుమెంట్లను పరిశీలించారు. దీంతో... అందులో భార్య, కూతురు, కొడుకు పేర్లు ఉన్నా ఫొటోలు వేరేవిగా గుర్తించారు. 

08:55 - September 11, 2018

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర డిప్యూటి సీఎం కడియం శ్రీహరి అండర్ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే టికెట్ రాజయ్య కు ఖరారైనప్పటి నుండి ఆయన కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. టీఆర్ఎస్ లో టికెట్ రాని అభ్యర్థులు లోలోపన రగిలిపోతున్నారు. జిల్లా టీఆర్ఎస్ నేతల్లో వర్గ విబేధాలు పొడచూపుతున్నాయి. ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్యకు టికెట్ కేటాయిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వర్గీయులు, అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో జనగామ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. రాజయ్యకు టికెట్ ఇవ్వడంపై కడియం శ్రీహరిని టీఆర్ఎస్ కార్యకర్తలు కలిశారు. రాజయ్యకు మద్దతివ్వమని కార్యకర్తలు తెగేసి చెప్పారు. కడియం శ్రీహరి కూతురికి టికెట్ వస్తుందని కార్యకర్తలు, నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ టికెట్ రాకపోవడంతో రహస్య సమావేశాలు జరుపుతున్నారు. మరి కడియం శ్రీహరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

07:35 - September 11, 2018

ఢిల్లీ : ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో బ్రిటీష్‌ ఆటగాళ్లు పట్టుబిగించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 423 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. దీంతో భారత్‌ ముందు ఇంకా 464 పరుగుల లక్ష్యం ఉంచింది. ఇప్పటికి 58 పరుగులకు కీలమైన మూడు వికెట్లు భారత్‌ కోల్పోయింది. క్రీజ్‌లో రాహుల్‌, రహానే ఉన్నారు.  మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇండియాకు మరో 406 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. 

07:29 - September 11, 2018

హైదరాబాద్ : దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంట్లో ఆస్తివివాదాలు తలెత్తాయి. పెద్ద కుమారుడు సతీమణి సుశీల... దాసరి కుటుంబ సభ్యుల మధ్య వివాదం రాజుకుంది. కొన్నేళ్లుగా బయట ఉంటున్న దాసరి పెద్దకోడలు సుశీల... సోమవారం దాసరి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.  పోలీసులు, మహిళా సంఘాలతో కలిసి సుశీల ఇంట్లోకి ప్రవేశించింది. ఏడాదిన్నరగా తనను ఇంట్లోకి రానివ్వడం లేదని దాసరి చిన్న కుమారుడైన అరుణ్‌, అతడి భార్యపై ఆరోపణలు చేశారు. 

తాను మొన్నటి వరకు పంజాగుట్టలోని ఇంట్లో ఉన్నానని... ఇప్పుడు అదికూడా ఖాళీ చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను తన నుంచి దూరం చేస్తున్నారని ఆరోపించారు. విడాకుల కోసం సుశీల దరఖాస్తు చేసిందన్న ఆరోపణలపైనా ఆమె స్పందించారు. డైవర్స్‌ కోసం తానెప్పుడూ దరఖాస్తు చేయలేదన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారు... ఆధారాలుంటే చూపించాలన్నారు. తనకు న్యాయం జరిగేలా సినీ పెద్దలు కల్పించుకోవాలని ఆమె కోరారు. దాసరి నారాయణరావు చనిపోయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తితగాదాలు తలెత్తాయి. దాసరి చిన్న కుమారుడు అరుణ్‌ ప్రస్తుతానికి విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి ఆయన వచ్చేలోగా  ఈ వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.

07:22 - September 11, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలపై ఈసీ దూకుడు పెంచింది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌.... సోమవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణ, సిబ్బంది, ఈవీఎంలు, బందోబస్తు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందస్తు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుత సమావేశం కేవలం ప్రాథమిక స్థాయిలోనే జరిగిందని చెప్పారు. మరోవైపు తెలంగాణలో జరుగనున్న ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు  మంగళవారం రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుంది. సాయంత్రం రాష్ట్రానికి వచ్చే ఉమేష్‌కుమార్‌ నేతృత్వంలోని ఈ బృందం... అందరి అభిప్రాయలు సేకరించనుంది. సాయంత్రమే  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరిస్తారు. మరునాడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకుంటారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు సచివాలయంలో సీఎస్‌, డీజీపీతో సమావేశంకానున్నారు. 

 

07:13 - September 11, 2018

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో ప్రజల మనస్సులను ఎలా చూరగొనాలి ? ప్రజలను ఎలా ఆకర్షించాలి ? వైసీపీ పట్ల మొగ్గు చూపేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలి ? అనేది దానిపై వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ‘ఇంటింటికి వైసిపి’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించాలని వైసీపీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంగళశారం విశాఖలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరుకానున్నారు. ఇందుకోసం నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఏడాది నేపథ్యంలో డిసెంబర్‌లోగా 'ఇంటింటికి' పార్టీ నేతలను పంపి టీడీపీ హామీలను ఎండగడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఈ సమావేశంలో ప్రధానంగా దీనిపై చర్చించి.. కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే నేతలంతా 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకునే విధంగా ప్రణాళిక రూపొందించనున్నారు. ఇక సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి.. ప్రజల వద్ద ఎలా ప్రస్తావించాలనే అంశాలపై నేతలకు జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే వైసీపీ ఎజెండాలో ప్రధానమైన నవరత్నాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు జగన్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

07:04 - September 11, 2018

విజయవాడ : ఆపరేషన్‌ గరుడ.  ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ పెట్టుకున్న పేరు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందేందుకు తీసుకొచ్చిన ఆపరేషనే గరుడ. బీజేపీ ఆపరేషన్‌ గరుడను ఏపీ ప్రయోగిస్తోందని బయటపెట్టింది హీరో శివాజీ. ఆపరేషన్‌ గరుడ ప్రయోగించి ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని ఆయన పలుమార్లు ఆరోపించారు. గరుడ ఎలా ఉండబోతోందో వీడియో చేసి చూపించారు.  మొన్నటికి మొన్న  ఆపరేషన్‌ గరుడ మరో రూపం దాల్చిందని చెప్పారు.  అతి త్వరలో చంద్రబాబుకు నోటీసులు వస్తాయని.... ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేయడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆయన ప్రధాన ఆరోపణ. 

ఆపరేషన్‌ గరుడపై ఏకంగా ఏపీ అసెంబ్లీలోనూ చర్చకొచ్చింది. సీఎం చంద్రబాబు బీజేపీ ఆపరేషనైన గరుడపై నోరు విప్పారు.  కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్‌ గరుడను చంద్రబాబే సృష్టించారని బీజేపీ నేతలు సభలో అన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన చంద్రబాబు... తనను దెబ్బతీసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గరుడ ప్రయోగిస్తోందని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని విపక్షాలను భయపెట్టాలని బీజేపీ నేతలు చూస్తోన్నారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని బీజేపీ నేతలు  గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం సరైందికాదన్నారు. ఆపరేషన్‌ గరుడకు సంబంధించిన  సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. మోదీ ముసుగు వేసుకుని కొందరు డ్రామాలాడుతున్నారని... ముసుగువీరుల ఆటలు ఏపీలో సాగబోవని ఆయన హెచ్చరించారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఆపరేషన్‌ గరుడపై మాటలయుద్ధం సాగింది. దీంతో మరోసారి ఆపరేషన్‌ గరుడ తెరపైకి వచ్చింది.

06:56 - September 11, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలోని నిజాం మ్యూజియంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గుల్బార్గాలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 రోజుల క్రితం మ్యూజియం నుంచి కోట్ల విలువైన బంగారు లంచ్‌బాక్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజి ఆధారంగా ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు.. 15 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

సీసీ కెమెరాలకు చిక్కిన చోరీ దృశ్యాలు...
నిజాం మ్యూజియంలో విలువైన వస్తువులు చోరీ చేసిన దుండగుల దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. అయితే.. తమ ముఖాలు కనిపించకుండా వాళ్లు మాస్క్‌లు కట్టుకోవడంతో ఎవరన్నది స్పష్టంగా తెలియడం లేదు. చోరీ అనంతరం పల్సర్‌ బైక్‌పై పరారవుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

మ్యూజియం నుంచి మాయమైన వస్తువులు.. 
ఆదివారం రాత్రి మ్యూజియంలో ఘరానా చోరీ జరిగింది. ఆ సమయంలో మ్యూజియానికి ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తున్నారు. అయినా.. తెలివిగా వారి కళ్లు గప్పిన దుండగులు ప్రహారీ నుంచి మ్యూజియం పై అంతస్తుకు వెళ్లారు. అక్కడి వెంటిలేటర్‌ ను పగలగొట్టి ఒకడు లోపలికి చొరబడ్డాడు. మరొకడు అక్కడే కాపలాగా ఉన్నాడు. తాడు సాయంతో లోపలికి దిగి.. నిజాం ఉపయోగించిన బంగారు వస్తువులను దోచుకెళ్లాడు. మ్యూజియం నుంచి మాయమైన వాటిలో బంగారు టిఫిన్ బాక్స్‌, బంగారు స్పూన్‌, బంగారు టీ కప్పు, సాసర్‌ ఉన్నాయి. 

06:47 - September 11, 2018

సంగారెడ్డి : తన భర్త ప్రాణానికి ముప్పు ఉందని జగ్గారెడ్డి భార్య నిర్మల పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో పాస్ పోర్టు, వీసా పొందారనే ఆరోపణలతో జగ్గారెడ్డిని పటన్ చెరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనీసం తనతో మాట్లాడనీయకుండా జగ్గారెడ్డిని ఎటు తీసుకెళ్లారో తెలియడం లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు... రాజకీయ కుట్రతోనే తన భర్తను అరెస్ట్‌ చేశారని నిర్మల అంటున్నారు. తన భర్త పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

06:40 - September 11, 2018

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు... హుటాహుటిన టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి చేరుకున్నారు. జగ్గారెడ్డి అరెస్ట్‌ను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం కుందన్‌బాగ్‌లోని డీజీపీ నివాసానికి చేరుకుని.. వినతిపత్రం సమర్పించారు. పోలీసులు రాత్రి సమయంలో సివిల్‌ డ్రస్‌లో వచ్చి అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమన్నారు టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.  నకిలీ పత్రాలతో జగ్గారెడ్డి అమెరికా వెళ్లారని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో దొంగ పాస్‌పోర్ట్‌ కేసులు ఉన్న కేసీఆర్‌, హరీష్‌రావులను అరెస్ట్‌ చేయాలన్నారు ఉత్తమ్‌. జగ్గారెడ్డి అరెస్ట్‌పై డీజీపీ సరైన సమాధానమివ్వలేదన్న ఉత్తమ్‌... కాంగ్రెస్‌ న్యాయపోరాటం చేస్తుందన్నారు. 

06:17 - September 11, 2018

సంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో పాస్ పోర్టు, వీసా పొందారనే ఆరోపణలతో జగ్గారెడ్డిని పటన్ చెరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ పాస్ పోర్టుతో మనుషులను అక్రమ రవాణా చేసినట్లు జగ్గారెడ్డిపై ఆరోపణలున్నాయి. దీనిపై ఆయన సతీమణి నిర్మల స్పందించారు. తన భర్త పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడకు తీసుకెళుతున్నారో కూడా పోలీసులు చెప్పడం లేదని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తన భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. తన భర్త జగ్గారెడ్డి ప్రాణానికి ముప్పు ఉందన్నారు. 

2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. జగ్గారెడ్డి తీసుకెళ్లినవారు 14 ఏళ్లు అయినా.. ఇంకా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అమెరికా కాన్సులేట్‌ అధికారులు ఈ విషయంపై ఆరా తీయాలంటూ నార్త్‌జోన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు.. జగ్గారెడ్డి 2004లో తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌పోర్టుల డాక్యుమెంట్లను పరిశీలించారు. దీంతో... అందులో భార్య, కూతురు, కొడుకు పేర్లు ఉన్నా ఫొటోలు వేరేవిగా గుర్తించారు. 

Don't Miss