Activities calendar

13 September 2018

22:59 - September 13, 2018

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏసీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 21న కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పట్లో చంద్రబాబుతో పాటు 15 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. అయితే దీని వెనకాల కేంద్రప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలేమైన ఉన్నాయా అన్నఅనుమానం కలుగుతుంది. చంద్రబాబుకు కోర్టు నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఉన్నారు. బీజేపీ నేతల చర్యలు కొండనుతవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 

 

22:39 - September 13, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. మహాకూటమి ఏర్పాటులో ముందడుగు పడింది. టీటీడీపీ,సీపీఐ కూటమి నేతల రాయబారం ఫలించింది. ఎల్‌.రమణ ఇంటి వద్ద మహాకూటమి నేతలు భేటీ అయ్యారు. మహాకూటమిలో చేరేందుకు తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకే మహాకూటమిలో భాగస్వామ్యమయ్యామని కోదండరామ్‌ తెలిపారు. 

 

22:18 - September 13, 2018

హైదరాబాద్ : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సింగర్ మంగ్లీతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె తన పాటల కెరీర్ గురించి వివరించారు. ఆమె పాడిన పాలు పాటలను పాడి వినిపించారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే... ’మాఫ్యామిలీలో మా నాన్న పాటలు పాడేవారు. బాగా పాడేవారు. అలా అలా నాకు పాడటం వచ్చింది. నా తొలి గురువు మా నాన్నే. మా చెల్లె బాగా పాడుతుంది. మా నాన్న నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు ద్వారా నేను సంగీతం నేర్చుకున్నా. మొదట సంగీతం నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. సంగీతమనేది మహాసముద్రం లాంటిది. మ్యూజిక్, మా నాన్ననా జీవితానికి చాలా ముఖ్యం. నేను చేసిన మాటకారి మంగ్లీ ప్రోగ్రామ్ కు చాలా ఫేమస్ అయింది. ఆ ప్రోగ్రామ్ తోనే నాకు మంచి పేరు వచ్చింది. ఆ ఫేమ్ తోటే నా పాటలకు మంచి పేరు వచ్చింది. సత్యవతి కాస్తా.. మాటకారి మంగ్లీ అయింది..మాటకారీ మంగ్లీ కాస్తా పాటకారి అయింది. సత్యవతిగా ఉన్నప్పుడు స్కూల్ లో సంగీతం నేర్పించాను. ఆ తర్వాత యాంకర్ అయ్యాను. ’రేలారే.. రేలారే’... అనే సాంగ్ నాకు ఒక మార్క్’ అని పేర్కొన్నారు. మంగ్లీ తెలిపిన మరిన్ని వివరాలను, ఆమె పాడిన పాటలను వీడియోలో చూద్దాం...   

 

20:47 - September 13, 2018

హైదరాబాద్ : సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 2.0 సినిమా అఫీషియల్ టీజర్ వచ్చేసింది. వినాయక చవితి పండుగ కానుకగా ఈ టీజర్‌ను విడుదల చేశారు. తమిళం, తెలుగు భాషల్లో ఇవాళ విడుదల చేశారు. భారీ వ్యయం, అంచనాలతో సినిమా టీజర్ రిలీజ్ అయింది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో టీజర్ అదరగొడుతోంది. సినిమాపై టీజర్ అంచనాలను పెంచేసింది. సైన్స్ ఫిక్షన్ వరల్డ్ అంటే ఎలా ఉంటుందో టీజర్ రూపంలో చూపించారు. హాలివుడ్ సినిమాకు తీసిపోని రీతిలో ఒక అద్భుతాన్నిఆవిష్కరించారు డైరెక్టర్ శంకర్. టీజర్ లో కనిపించిన ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. టీజర్ లో శంకర్ గొప్ప మెరుపులు మెరిపించారు. ఈ టీజర్లోనే కథేంటో రివీల్ అయిపోయింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన రోబోకు కొనసాగింపుగా వస్తోన్న2.0 చిత్రంపై తొలి నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. 

 

19:20 - September 13, 2018

హైదరాబాద్ : విపక్షాలపై టీఆర్ ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ కు ఉన్న బలాన్నిచూసి విపక్షాలు భయపడిపోయాయని ఎద్దేవా చేశారు. వారు చేసుకున్నసర్వేల్లో తమ పార్టీకున్న బలాన్నిచూసి భయపడి ఎట్లైనా అందరు ఐక్యమై టీఆర్ ఎస్ ను ఓడగొట్టాలనేదే వారికున్న ఏకైక లక్ష్యమని వేరేమీ లేదన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని..పొత్తులకు సిద్దం కావడం విడ్డూరంగా ఉందన్నారు. 70 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. ’మీకు జెండా, ఎజెండా ఏమీ లేవని...నీతి మాలిన పనులు చేస్తూ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు అని కాంగ్రెస్ నేతలకు ఉద్ధేశించి మాట్లాడారు. నిన్నజైపాల్ రెడ్డి రాజీవ్ శర్మపై విమర్శలు చేశారని..అసలు తెలంగాణ ఉద్యమంలో జైపాల్ రెడ్డి పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ’నీవు ఎవిరికి తాబీరుదారుగా ఉన్నావని, ఎవరికి బ్రోకర్ గా ఉన్నావని, ఎవరికి పని చేశావు’ అని జైపాల్ రెడ్డిని ఉద్ధేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’రాజీవ్ శర్మ గురించి నీకు పూర్తిగా తెలుసా’ అని ఆయన్నుప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేంద్ర హోంశాఖలో పని చేస్తున్నరాజీవ్ శర్మ  పాత్ర ఏంటో తెలుసా అని అడిగారు. తెలంగాణ కోసం జరుగుతున్న అత్మబలిదానాలపై ఉన్నదిఉన్నట్లుగా రాజీవ్ శర్మ కేంద్రానికి నివేదిక ఇచ్చినందుకు ఆయన బ్రొకర్ అయ్యాడా ?  తెలంగాణలో పుట్టకపోయినా అయన పలుకుబడిని ఉపయోగించి ఎప్పటికప్పుడు రాష్ట్రానికి నిధులు తెచ్చినందుకా ఆయన బ్రోకర్? రాజీవ్ శర్మఎందుకు బ్రోకర్ అయ్యాడో చెప్పలాని జైపాల్ రెడ్డిని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అన్నిపోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరిలో మిగిలిన 5శాతం రిజర్వేషన్లలో కూడా తెలుగువారికి అని నిబంధనలు పెట్టాలని రాజీవ్ శర్మ పేర్కొన్న విషయాన్నిశ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.

 

16:28 - September 13, 2018

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది పాలి నారిమన్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. అందుకు గానూ నారిమన్ కు 33 లక్షల ఫీజు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సుప్రీంకోర్టులో ఏపీ తరఫున పాలి నారిమన్ వాదించనున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టులో ఉమ్మడి హైకోర్టు విభజన విచారణకు రానుంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

 

15:49 - September 13, 2018

హైదరాబాద్ : తెలుగు  రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఉద్యోగుల మధ్యంతర భృతి, తాజా రాజకీయ అంశాలపై గవర్నర్ తో చర్చించారు. అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టుకి వెళ్తామన్న విపక్షాల నిర్ణయం, కొండగట్టు ప్రమాదం, తదితర అంశాలపై గవర్నర్ ఆరా తీశారు. కేబినెట్ రద్దు తర్వాత తొలిసారి కేసీఆర్ అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో గవర్నర్ ను కలిశారు. 

 

15:31 - September 13, 2018

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. పొత్తుల అంశంపై రాహుల్ గాంధీకి వివరించనున్నారు. సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయనతో చర్చలు జరుపనున్నారు. అన్నింటినీ సమకూర్చుకుని కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ తో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు.   

 

10:10 - September 13, 2018

దైవభక్తి, దేశభక్తి మేళవించిన రూపం...ఆయన ఆకారం విద్యా బుద్ధులకు సాకారం...ఆయన నామస్మరణం...సర్వ పాప హరణం... ఆయనే విఘ్నేశ్వరుడు... వినాయక పూజకున్న విశిష్టత ఏంటి? గణపతి నేర్పే విద్యాబుద్ధులేంటి? తదితర అంశాలపై వినాయక చవితి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బంగారయ్య శర్మ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:33 - September 13, 2018

హైదరాబాద్ : వినాయక చవితి రాగానే వినాయకుడి విగ్రహాలతో పాటు లడ్డూకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఆయా మంటపాల్లో భారీ లడ్డూలను ఏర్పాటు చేస్తుంటారు. భారీ లడ్డూలు ఏర్పాటు చేయడంలో ‘తాపేశ్వరం’ వారికి వారే సాటి. ఎందుకంటే అత్యంత భారీ లడ్డూలు తయారు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా 600 కిలోల భారీ లడ్డూను తయారు చేశారు. 
తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు లడ్డూను విరాళంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. లడ్డూను అత్యంత భక్తి...నిష్టలతో తయారు చేస్తుంటారు. ఈసారి ఫిలింనగర్ దైవసన్నిధానానికి 600కిలోల లడ్డూను విరాళంగా అందించారు. ఈ భారీ లడ్డూ హైదరాబాద్ కు చేరనుంది. 220 కిలోల పంచదార, 145 కిలోల నెయ్యి, 175 కిలోల పచ్చిపప్పు, 25కిలోల జీడిపప్పు, 13 కిలోల బాదం, మూడు కిలోల యాలకులు, కిలో పచ్చ కర్పూరం కలిపి మహాప్రసాదం తయారు చేశారంట. 

 

09:27 - September 13, 2018
చిత్తూరు : పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాణిపాకంలో వినాయక సంబరాలు మొదలయ్యాయి. గురువారం నుంచి అక్టోబరు 3 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం వేకువజామున ఆలయ అర్చకులు అభిషేకాలు జరిపించారు. అనంతరం ఉదయం 4గంటల నుండి స్వామి వారి దర్శనం కల్పించారు. శుక్రవారం ఉదయం స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం..రాత్రి హంస వాహన సేవ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నెల 22న ధ్వజావరోహణం, త్రిశూల స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. 
08:57 - September 13, 2018

ఉత్తర్ ప్రదేశ్ : తాగిన మైకంలో ఏవైనా చేసేస్తారు. ఏమి చేస్తున్నామో మత్తులో ఉన్న వారికి తెలియదు. దీనివల్ల కొన్ని జీవితాలు బుగ్గిపాలవుతున్నాయనే విషయం తెలిసిందే. తాజాగా మత్తు ఒకరి జీవితాన్ని దిగమింగింది. మత్తులో ఉన్న వ్యక్తి పాము పిల్లను నోట్లో వేసుకోవడంతో అక్కడికక్కడనే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. సోషల్ మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 
ఉత్తరప్రదేశ్‌లోని అమ్‌రోహ జిల్లాలో మహిపాల్‌ సింగ్‌(40) ఫుల్లుగా మద్యం సేవించాడు. రోడ్డు పక్కన ఓ పాము పిల్ల కనిపించింది. సరదాగా దానితో ఆడుకున్నాడు. అక్కడే ఉన్న వారు తమ తమ సెల్ ఫోన్ లో బంధిస్తున్నారు. అసలే మత్తులో ఉన్న మహిపాల్ సింగ్ మరింత రెచ్చిపోయాడు. పామును పిడికిలితో పట్టుకున్నాడు. నోట్లో పెట్టుకుంటావా అని గుంపులో ఎవరో అనడంతో ఏ మాత్రం ఆలోచించని మహిపాల్ పామును నోట్లో వేసుకున్నాడు. ఇంకేముంది...పాము జరజరా అంటూ లోపలికి వెళ్లిపోయింది. అతను వాంతులు చేసుకున్నా పాము బయటకు రాలేదు. చివరకు మహిపాల్ మృతి చెందాడు. చూశారా ..మత్తు ఎంత పని చేసిందో...

08:51 - September 13, 2018

బెంగళూరు : కర్నాటకలో రాజకీయం మరింత రసకందాయంలో పడింది. వచ్చే వారంలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మేం చెప్పినవారికే పోర్ట్ ఫోలియోలు ఇవ్వాలని లేకపోతే, ఏకంగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామంటూ జర్కిహోలి బ్రదర్శ్ ఆల్టిమేటమ్ జారీ చేశారు. దీంతో ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వంలో అష్టకష్టాలు పడుతోన్న కుమారస్వామికి మంత్రి వర్గ విస్తరణ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.

 

08:46 - September 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా  రాజకీయంగా సంచలనం రేపింది. ఒకే రోజు అసెంబ్లీని రద్దు చేయడం.. ఆ వెంటనే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం నిజంగా ఓ సాహసమే. కేసీఆర్‌ ప్రకటించిన 105 స్థానాల్లో 103 మంది సిట్టింగ్‌లే. కేవలం ఇద్దరు సిట్టింగ్‌లకు మాత్రమే టికెట్‌ దక్కలేదు.  మరో 14 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను కేసీఆర్‌ పెండింగ్‌లో ఉంచారు. వివిధ సర్వేల నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్టు కేసీఆర్‌ ప్రకటించారు.

అభ్యర్థులను ప్రకటించని నియోజకవర్గాలను పరిశీలిస్తే.. అక్కడ రాజకీయ సమీకరణలు కూడా ఆసక్త  రేపుతున్నాయి. సిట్టింగ్‌ శాసనసభ్యులతో పాటు... ప్రతిపక్ష పార్టీలకు చెందిన నియోజకవర్గాలు పెండింగ్‌ జాబితాలో ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉంది. బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాలైన అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, గోషామహల్‌, ఖైరతాబాద్‌  స్థానాల్లో అభ్యర్థుల పోటీ కూడా టీఆర్‌ఎస్‌లో తీవ్రంగా ఉంది. అంబర్‌పేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎడ్ల సుధాకర్‌రెడ్డితోపాటు మాజీమంత్రి కృష్ణాయాదవ్‌ టిక్కెట్‌ కోసం పోటీ పడుతున్నారు.  మాజీ కార్పొరేటర్‌ కాలేరు వెంకటేష్‌ కూడా రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ముషీరాబాద్‌లో టిక్కెట్‌ కోసం ఇద్దరు నేతలు ప్రధానంగా పోటీపడుతున్నారు.  గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠాగోపాల్‌ ఒకరైతే... హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అల్లుడు, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి. శ్రీనివాస్‌రెడ్డి మరొకరు. ఇద్దరి మధ్య టిక్కెట్‌ కోసం పోటీ నెలకొంది. ఇక ఖైరతాబాద్‌ బరిలో నిలిపేందుకు విజయారెడ్డి, మన్నె గోవర్థన్‌రెడ్డితోపాటు విజయలక్ష్మి పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. దానం నాగేందర్‌కు మాత్రం ఖైరతాబాదా లేక గోషామహల్‌ అన్నది అధిష్టానం లెక్కలేస్తోంది.  మరో మాజీమంత్రి ముఖేష్‌ కారెక్కితే... గోషాహల్‌ స్థానం ఆయనకే దక్కనున్నట్టు తెలుస్తోంది.  అయితే ఎంపీ మల్లారెడ్డి కూడా ఈ స్థానంపై  ఆశలు పెంచుకున్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హన్మంత్‌రావుతోపాటు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వికారాబాద్‌లో మాజీమంత్రులైన ప్రసాద్‌కుమార్‌, ఏ. చంద్రశేఖర్‌లో ఎవరో ఒకరు కారెక్కుతారని.... వారికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం ఖారారయ్యే చాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. గులాబీబాస్‌ సమీకరణలు అన్ని పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. త్వరలోనే మంతనాలు ఓ కొలిక్కి వచ్చి.. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉంచిన నియోజకవర్గాల్లో మహిళలకు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలన్న  డిమాండ్‌ కూడా పార్టీలో వినిపిస్తోంది. మొత్తానికి గులాబీ బాస్‌ ఏ నిర్ణయం తీసుకుంటారు... ఎవరెవరికి ఎమ్మెల్యే టికెట్‌ బెర్త్‌లు దక్కుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది.

 

08:39 - September 13, 2018

హైదరాబాద్ : దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వినాయకుడిగా ఖైరతాబాద్‌ గణేశుడికి పేరుంది. ఈసారి 57 అడుగుల పొడవుతో శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతిగా కొలువుదీరనున్నాడు. వినాయకుడు ఏడు తలలు, 14 చేతులతో ఆకట్టుకోనున్నాడు. వినాయకుడి తలపై ఏడు సర్పాలతో విగ్రహం రూపుదిద్దుకుంది. ఇక విగ్రహం కుడి వైపున శ్రీనివాస కళ్యాణ ఘట్టం, ఎడమవైపు శివపార్వతుల కుటుంబాన్ని తీర్చిదిద్దారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 

 

08:34 - September 13, 2018

హైదరాబాద్ : గణపతి అందరి దైవం.. అందరికీ ఆనందాన్ని పంచే దైవం. విఘ్నాల్ని తొలగించి, విజయాలను అనుగ్రహించే దైవం. వినాయక చవితి సందర్బంగా ఈరోజు భక్తులు వినాయకుడి పూజ చేసుకుని వ్రతకల్పం చదువుకోవడం..  అక్షతలు వేసుకుని, వినాయకుడి దీవెనలు అందుకుంటారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి సందడి మొదలైంది. అన్ని ప్రాంతాల్లో మండపాలు వెలిశాయి. కాసేపట్లో మండపాల్లో గణేశులు కొలువుతీరనున్నారు. మరోవైపు మార్కెట్లలో విఘ్నేశ్వరుడి వివిధ రూపాల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వినాయకచవితి సందర్బంగా మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. 

06:31 - September 13, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్...కోడలు బ్రాహ్మాణి ల సెల్ఫీ సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరంలో బుధవారం అపూర్వ ఘట్టం జరిగింది. పోలవరం గ్యాలరీ వాక్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు కుటుంబసమేతంగా ప్రాజెక్టులో నడిచారు. ఏపీ మంత్రుల కుటుంబాలు సైతం ఈ వాక్ లో పాల్గొన్నారు. ఈ వాక్ లో మంత్రి నారా లోకేశ్, సతీమణి బ్రాహ్మణితో కలిసి పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ తన మొబైల్ లో అందమైన దృశ్యాలను చిత్రీకరించారు. బ్రాహ్మణితో కలిసి లోకేశ్ ఓ సెల్ఫీ కూడా దిగారు. ఈ సెల్ఫీని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టును నాలుగే నాలుగేళ్లలో పూర్తి చేస్తున్నామని, అధికారులు, కాంట్రాక్టర్లు.. అందరి సహకారం వల్ల ఈ ప్రాజెక్టు 58 శాతం పూర్తయిందన్నారు. ఇలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 

Don't Miss