Activities calendar

14 September 2018

22:46 - September 14, 2018

నల్గొండ : జిల్లాలో పరువు హత్య జరిగింది. మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు పెరమళ్ల ప్రణయ్‌గా గుర్తించారు. ఆరు నెలల క్రితం ప్రణయ్‌ ఓ కోటీశ్వరుడి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తండ్రి నుంచి ప్రాణహాని ఉందని గతంలో ప్రణయ్‌ పోలీసలకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే.. ఈరోజు గర్భవతి అయిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ప్రణయ్‌పై కత్తులతో దాడి చేశాడు. 

పథకం ప్రకారమే తమ కొడుకును మారుతీరావు చంపాడని ప్రణయ్‌ తల్లిదండ్రులు అంటున్నారు. ప్రాణహాని ఉందని పెళ్లైన కొత్తలోనే ఐజీకి ఫిర్యాదు చేశాం. పోలీసులు కూడా తమ కొడుకును కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. చంపేస్తారా అని అంటున్నారు.

పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా.. మారుతిరావు ఇలాంటి దురాఘతానికి పాల్పడతాడని ఊహించలేదని పోలీసులంటున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ రంగనాథ్‌ హుటాహుటిన మిర్యాలగూడకు చేరుకున్నారు. ప్రణయ్‌ను కాపాడలేకపోయినందుకు విచారంగా ఉందన్నారు. 

22:26 - September 14, 2018

హైదరాబాద్ : పలువురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాల లింకేజీ పత్రాలను ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అందజేశారు.  వి హబ్ ఆధ్వర్యంలో వారికి బ్యాంకు రుణ పత్రాలను కేటీ రామారావు అందించారు. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానంతరం బ్యాంకు అధికారులు, వి హబ్  ప్రతినిధుల సమక్షంలో ఈ బ్యాంకు రుణాల అందజేత కార్యక్రమం జరిగింది. వి హబ్ ప్రారంభమైన కొద్ది నెలల్లోనే మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించేలా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల మంత్రి కేటీ రామారావు వి హబ్ బృందానికి అభినందనలు తెలిపారు. దీంతోపాటు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు అందుకున్న మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార ప్రణాళికలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ వి-హబ్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చిన మంత్రి వారిని అభినందించారు. 
మహిళా పారిశ్రామిక వేత్తలు హర్షం  
వి హబ్ ద్వారా తమకు అత్యవసరమైన ఆర్థిక సహాయం, రుణాల లింకేజీ రూపంలో లభించడం పట్ల పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. వి హబ్ ద్వారా తమకు అందిన సహాయ సహకారాలను ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు. ప్రస్తుత రుణాల ద్వారా తమ వ్యాపారాలను విస్తరించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.

22:11 - September 14, 2018

సిద్ధిపేట : కొండ గట్టు బస్సు ప్రమాద ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లాలో జిరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. పాములపర్తి గ్రామానికి చెందిన 20 మంది ఆటోలో నాగపురి గ్రామానికి వెళ్తున్నారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రోడ్డు పక్కన ఆగిఉన్నటాటా ఏస్ వాహనాన్నిలారీ ఢీకొనడంతో ఆటోలోని ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

21:34 - September 14, 2018

కర్నూలు : బాబ్లీ వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసిన నోటీసులను ఎలా ఎదుర్కోవాలో... అలానే ఎదుర్కొంటామన్నారు. బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందన్న ఉద్దేశంతోనే పోరాటం చేశామని చెప్పారు. దీనిపై కేసులు పెట్టామని కొన్నిసార్లు, పెట్టలేదని మరికొన్నిసార్లు మహారాష్ట్ర పోలీసులు, ప్రభుత్వం చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు పంపిన కోర్టు నోటీసులపై ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. 

 

21:18 - September 14, 2018

హైదరాబాద్ : ఆపరేషన్‌ గరుడ పేరుతో ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సినీనటుడు శివాజీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జారీ అయిన కోర్టు నోటీసుపై తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబుకు ధర్మాబాద్‌ కోర్టు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఏపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందన్నారు. త్వరలో మరో రెండు నోటీసులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నోటీసులకు భయపడి మహారాష్ట్ర వెళ్తే ఉచ్చులో దింపుతారని శివాజీ చెప్పారు. మహారాష్ట్ర వెళ్లడం మంచిదికాదన్నారు. ప్రైవేటు విమానాల్లో తిరగడం కూడా మంచిదికాదని చంద్రబాబుకు సూచించారు. 

 

20:51 - September 14, 2018

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు పెరమళ్ల ప్రణయ్‌గా గుర్తించారు. ఆరు నెలల క్రితం ప్రణయ్‌ ఓ కోటీశ్వరుడి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తండ్రి నుంచి ప్రాణహాని ఉందని గతంలో ప్రణయ్‌ పోలీసలకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే.. ఈరోజు గర్భవతి అయిన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ప్రణయ్‌పై కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందారు. 

 

19:29 - September 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వేగవంతం చేసింది. రాష్ట్రంలోని 32,574 పోలింగ్ బూత్ లలో ఓట్ల జాబితాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి చేసింది. శాంతిభద్రతల నిర్వహణపై సమీక్ష నిర్వహించింది. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సివుందని సీఈవో రజత్ కుమార్ అన్నారు. శాంతిభద్రతల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో రూ.7.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈసారి ధన ప్రభావాన్నితగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 

 

18:36 - September 14, 2018

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలో దారుణం జరిగింది. ఓ కళాశాల ప్రిన్సిపల్ మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తరచూ వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సెలవులు కావాలని అడిగితే తనకు లొంగాలని మహిళా అధ్యాపకులను శ్రీనివాస్ వేధింపులకు గురి చేస్తున్నాడు. మహిళలతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మాట్లాడుతున్నాడు. ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మహిళా అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. మహిళా అధ్యాపకులకు విద్యార్థి సంఘాలు అండగా నిలిచాయి. శ్రీనివాస్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని..లేనిఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ రేట్ కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు విన్నవించారు. తనతో పాటు మరో ఇద్దరు మహిళలతో ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అధ్యాపకురాలు తెలిపారు. డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతారని వాపోయింది. శ్రీనివాస్ ను సస్పెండ్ చేసేందుకు కలెక్టర్ దర్యాప్తు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.   

 

18:24 - September 14, 2018

న్యూఢిల్లీ: ఆయన ఓ సాంకేతిక విజయాన్ని దేశానికి అందించిన అత్యంత ప్రతిభావంతుడు. రాకెట్ల ప్రయోగంలో ఓ కీలక ప్రయోగానికి నాంది పలికిన విజ్ఞాని. అప్పటివరకూ ద్రవ ఇంధనాన్ని రాకెట్ ప్రయోగంలో వినియోగించలేదు. 70వ దశకంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు కేరళకు చెందిన నంబి నారాయణన్. ఇస్రోలో పనిచేసిన సమయంలో మెదటిసారిగా ద్రవ ఇంధనాన్ని రాకెట్ ప్రయోగంలో ఉపయోగించిన గొప్ప శాస్త్రవేత్త. అటువంటి శాస్త్రజ్ఞుడిని మిలిటరీ రహస్యాలను మాల్దీవుల సీక్రెట్ ఏజెంట్లకు అమ్మివేశాడని ఆరోపిస్తూ 1994లో కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

50 రోజుల పాటు జైలులో ఉంచారు.  ఈయనతోపాటు డి.శశికుమారన్ అనే మరోక శాస్త్రవేత్తను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్లైట్ టెస్ట్ డాటాను రహస్యంగా అమ్మివేశారన్న ఆరోపణలతో ఆయనను ముగ్గురు పోలీసులు సిబీ మాథ్యూ, కెకె జోషువా, ఎస్ విజయన్ లాకప్ లో చిత్రహింసలకు గురిచేశారు.

ఆ తర్వాత ఆ కేసును సీబీఐ తీసుకోవడంతో నారాయణన్ ను నిర్దోషి అని తేల్చి వదిలేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని వివరిస్తూ కేరళ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రూ.1 లక్ష రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీంతో మరింత కృంగిపోయిన 70 ఏళ్ల నారాయణన్ సుప్రీంకోర్టులో తిరిగి పోరాటం ప్రారంభించారు. దీనిపై తీర్పును శుక్రావారంనాడు వెలువరిస్తూ నారాయణన్ కు రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

‘‘ దోషిగా..దేశద్రోహిగా ఇక నన్ను ఎవరూ పిలవలేరు. నన్ను ఈ కేసులో ఇరికించిన పోలీసలు వాళ్లు ఎంత తప్పు చేశారో అర్థమయితే చాలు. సుప్రీంకోర్టు తీర్పు నాకు ప్రశాంతతను ఇచ్చింది. నేను ఇప్పుడు నా కుటుంబంతో సంతోషంగా జీవించగలను..‘‘  అంటూ నారాయణన్ కోర్టు తీర్పు అనంతరం ఎన్డీటీవీతో తన ఆవేదనను పంచుకున్నారు.

 

17:32 - September 14, 2018

కర్నూలు : స్మార్ట్ వాటర్ గ్రిడ్ కు శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో నిర్వహించిన ’జలసిరికి హారతి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం భావితరాలకు సంబంధించినదన్నారు. నీరు ఉంటే బంగారం పండించే అవకాశం ఉంటుందని తెలిపారు. నీరు ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తయన్నారు. గోదావరి నదికి అఖండ హారతి ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు నదులు కలిపామని చెప్పారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామన్నారు. కృష్ణమ్మ తల్లికి జల హారతి ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు జల హారతికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అనంతపురంకు నీటిని తీసుకెళ్లడానికి లిఫ్టు ద్వారా తప్ప వేరే మార్గంలేదని చెప్పారు. కుప్పం వరకు నీరును తీసుకెళ్తామన్నారు.

వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని సూచించారు. కర్నూలు జిల్లాలో 45 గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించామని తెలిపారు. దేశంలో వ్యవసాయరంగంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని చెప్పారు. వేరుశనగ పంట ఎండిపోయి నష్టపోయిన రైతులను పూర్తిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ’మన భవిష్యత్ మన చేతిలోనే ఉంది’ అని పేర్కొన్నారు. ప్రజల్లలో చైతన్యం తీసుకరావాలన్నారు. నీటి పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. 

 

16:53 - September 14, 2018

న్యూఢిల్లీ:  ఓ యవతిని జుట్టుపట్టుకొని నిర్దాక్షణ్యంగా కాలుతో తంతున్న యువకుడి వీడియో వైరల్ అవ్వడంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా శుక్రవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.

ఆదేశాల మేరకు ఓ పోలీసు ఆఫీసరు కొడుకు రోహిత్ సింగ్ తోమర్ ను పోలీసులు అరెస్టుచేసారు. వీడియోలో రోహిత్ ఆ యువతిని లాగుతూ.. కాలుతో తంతూ విచక్షణారహితంగా కొట్టడం రికార్డయ్యింది. ఆ యువతి కొట్టవద్దని వేడుకొంటున్నా వినకుండా చెంపమీద కొడుతూ లాక్కెళ్లుతున్న దృశ్యాలు చూపరులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.

ఢిల్లీ ఉత్తమ్ నగర్ లోని ఓ ప్రయివేటు ఆఫీసులోకి ఈ నెల 2న చొరబడ్డ నిందితుడు యువతిని హింసించడం వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయ్యింది.  ఆ యువతి శుక్రవారం పోలీసుస్టేషన్ కు వెళ్లి తనను బలత్కరించాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వీడియో తన దృష్టికి రావడంతో వెంటనే తాను ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ తో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్టు రాజనాథ్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే..ఈ వీడియోను స్వయంగా నిందితుడే తన కాబోయే భార్యకు పంపినట్లు తెలుస్తోంది. ఆమె వివాహానికి సుముఖంగా లేకపోవడంతో ఈ దాడికి దిగి ఆ వీడియోను ఆమెకే పంపాడని.. ఆమె ఈ  వీడియోను ట్విట్టర్ లో పోస్టుచేసి అతని బండారం బయటపెట్టాలని యత్నించింది.  అయితే... తాను వీడియో చూసిన తర్వాతే తన వివాహం రద్దు చేసుకున్నట్టు పోలీసులకు ఆమె తెలిపింది.

బాధితురాలు ఈ రోజు పోలీసు స్టేషన్ కు స్వయంగా వెళ్ళి రోహిత్ తనను అతని స్నేహితుని ఆఫీసుకు రమ్మని అక్కడ తనపై అఘాయిత్యం చేశాడని ఆరోపించింది. పొలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో తనను హింసించాడని బాధితురాలు వివరించింది.

16:40 - September 14, 2018

కర్నాటక : బెంగళూరు నగర శివారులోని టయోటా ప్లాంట్ లో సుజుకీ సంస్థ 10 లక్షల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. దీంతో కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తన వ్యాపారాన్నివిస్తరించాలన్న వ్యూహంలో టయోటా కంపెనీ ఉంది. బెంగుళూరు లోని రెండో ప్లాంటును టయోటా, సుజుకీ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 

దాదాపు 25 వేల మారుతి సుజుకీ బాలెనో కార్లను రీడిజైన్  చేసి సరికొత్త పేరుతో వచ్చే ఏడాది టయోటా కార్లగా మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. సుజుకీకి అవసరమైన కార్లను కూడా టయోటా ఉత్పత్తి చేసి సరఫరా చేయనుంది.  ఈ ప్లాంట్ లో పూర్తి సామర్థ్యంకు చేరుకొనే వరకూ కార్లను ఉత్పత్తి చేసి సుజుకీ కంపెనీకి సరఫరా చేయాలని ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

16:12 - September 14, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు ఇవాళ ఇంకాస్త పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌ పై 22పైసలు ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81.28 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 77.82 రూపాయలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 88.39 రూపాయలు కాగా, లీటర్ డీజిల్ 77.82 రూపాయలు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 84.49, డీజిల్ రూ.77.49 లకు పెరిగాయి. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ. 83.14, డీజిల్ రూ. 75.15లకు పెరిగింది. పెట్రో ధరలపై వాహనదారులు  భగ్గుమంటున్నారు. 

13:56 - September 14, 2018

చెన్నై : ఓ మహిళను ఇష్టమొచ్చినట్లుగా తన్నిన డీఎంకే మాజీ కార్పొరేటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బ్యూటీ పార్లర్ లో మహిళను తన్నుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనితో పోలీసులు స్పందించి సదరు నేతను కటకటల్లోకి నెట్టారు. 
గతంలో కార్పొరేటర్ గా సెల్వకుమార్ పనిచేశాడు. ఇతను డీఎంకే నేత. ఇతను ఓ బ్యూటీ పార్లర్‌లో ప్రవేశించి, ఓ మహిళపై దౌర్జన్యం చేశాడు. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా బైటికి రావడంతో సెల్వకుమార్ వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

13:10 - September 14, 2018

బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ అయినా బయోపిక్ ల హావా కొనసాగుతోంది. ఎన్నో చిత్రాలు నిర్మితమై ప్రజాదరణ పొందాయి. కూడా రికార్డులు కూడా సృష్టించాయి. తాజాగా తెలుగులో నాయకుల బయోపిక్ చిత్రాలు నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’..వైఎస్ జీవితం ఆధారంగా ‘యాత్ర’ చిత్రాలు రూపొందుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ నటిస్తుండగా వైఎస్ బయోపిక్ లో మమ్ముట్టి నటిస్తున్నాడు. తాజాగా వైఎస్ బయోపిక్ లో మరో హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

జగన్ పాత్రలో ‘విజయ్ దేవరకొండ’ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. మొదట సూర్య...కార్తీ పేర్లు వినిపించాయి. జగన్ పాత్రలో విజయ్ కరెక్టుగా సరిపోతారని..అతను అయితే పాత్రకు న్యాయం జరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందంట. దీనికి సంబంధించి విజయ్ తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందని టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ‘నోటా’ మూవీ చేస్తున్నాడు. మరి జగన్ పాత్రలో దేవరకొండ నటిస్తున్నాడా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది. 

12:53 - September 14, 2018

హర్యానా : దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఎక్కడో ఒక చోట దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని ఘటనలు కలిచివేస్తున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు రెచ్చిపోతునే ఉన్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 19 ఏళ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. 

హర్యానా రాష్ట్రం మహేందర్‌ఘర్ జిల్లాలో కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న యువతిని కారులో వచ్చి  ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతికి మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని బస్‌స్టాప్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది.  దారుణ ఘటనకు పాల్పడిన వారు తమ గ్రామానికి చెందిన వారేనని పేర్కొన్నట్లు సమాచారం. అత్యాచారానికి గురైన బాధితురాలు... ఇంటర్‌ ఎగ్జామ్స్‌లో  ఐదేళ్ల క్రితం  టాపర్‌గా నిలిచింది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో టాపర్‌గా నిలిచి.. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకుంది. 

12:20 - September 14, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 2010లో బాబ్లీ ప్రాజెక్టు సందర్శన..అక్కడ ఆందోళనలు చేసిన నేపథ్యంలో 2018లో కోర్టు వారెంట్ జారీ చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుట్రలో భాగంగానే బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

చంద్రబాబు తిరుమలలో ఉండగానే వారెంట్ పై బాబు సమాచారం అందుకున్నారు. కోర్టుకు హాజరయ్యే విషయంపై బాబు సమాలోచనలు జరుపుతున్నారు. ఐపీసీ సెక్షన్లు 353, 324, 332, 336, 337, 323, 504, 506, 109  కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అత్యవసరంగా టీటీడీపీ నేతలు భేటీ అయ్యరు. కోర్టుకు హాజరయితే తెలంగాణ పార్టీకి సానుకూలత వచ్చే అవకాశం ఉందని..కానీ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు వారెంట్ జారీ చేయడం ఏంటీ ? అని నిలదీస్తున్నారు. మరి ఆయన కోర్టుకు హాజరవుతారా ? లేదా ? అనేది చూడాలి. 

11:36 - September 14, 2018

హైదరాబాద్ : కాషాయం దళం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుంది. పార్టీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పక్కా ప్రణాళిక, వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా అడుగు పెట్టనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అనంతరం బషీర్ బాగ్ లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఎలా ప్రచారం నిర్వహించాలి ? తదితర వివరాలను ఆయన నేతలకు దిశా..నిర్దేశం చేయనున్నారు. 

మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను...రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని షా నిర్దశం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న నేతలను ఆకర్షించడం...బీజేపీపై అభిమానం ఉన్న వారిని పార్టీలోకి చేరిపించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే వారిపై పార్టీ అధిష్టానం నిర్వహించినట్లు, వారికి టికెట్ కేటాయించనున్నటు్ల సమాచారం. మరి షా పర్యటన తెలంగాణలో బీజేపీ నేతలకు బూస్ట్ ఇస్తుందా లేదా ? అనేది చూడాలి. 

11:20 - September 14, 2018

ఢిల్లీ : తనకు సినిమా అంటే ప్రాణం...కానీ ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలని అనిపించిందని..అందుకని కాంగ్రెస్ లో చేరానని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల్లో వలసలు...చేరికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య వలసలు జోరందుకుంటున్నాయి. పలువురు టికెట్ లు ఆశిస్తూ ఆయా పార్టీలో చేరుతున్నారు. తాజాగా సిని నిర్మాత బండ్ల గణేష్, ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. 

శుక్రవారం ఢిల్లీకి వచ్చిన బండ్ల గణేష్, ఇతర నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్  సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అంటే త్యాగాల పార్టీ అని అభివర్ణించారు. తాను ఎప్పటి నుండో పార్టీ అభిమానినని పేర్కొన్నారు. సినిమాల్లో నటించడం...నిర్మించడం తాను చేయడం జరిగిందని, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. పవన్ తండ్రిలాంటి వారని..గురువు..కానీ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని పేర్కొన్నారు. జూబ్లిహిల్ నియోజకవర్గం నుండి టికెట్ పోటీ చేయనున్నారా ? అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఎక్కడి నుండి పోటా చేయాలని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని చెప్పారు. 

10:04 - September 14, 2018

ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనుషులు చలించిపోతుంటారు..వెంటనే స్పందిస్తుంటారు. ఇటీవలే కేరళ రాష్ట్రంలో వరదల బీభత్సం ఎవరూ మరిచిపోలేరు. వరదలు..భారీ వర్షాలతో ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని ఆదుకోవాలని..చేయూత అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన సంగతి తెలిసిందే. చాలా మంది కేరళ రాష్ట్రానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనడం..విరాళాలు అందచేశారు. కానీ ఓ మత్స్యకారుడు చేసిన సాయం దేశ ప్రజలను ఆకర్షించింది. అతడిని అభినందించింది. 

వరదల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు బోట్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడున్న మహిళలకు ఎత్తైన బోటు ఎక్కడానికి వీలు కాలేదు. దీనితో అక్కడ ఉండి సహాయం చేస్తున్న జైసల్ గుర్తించాడు. వెంటనే తను మెట్టుగా మారిపోయాడు. నీటిలో వంగి తన వీపుపై నుండి వారిని ఎక్కే విధంగా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. సహాయానికి గుర్తింపుగా కోజికోడ్ లోని మహీంద్ర డీలర్ జైశాల్ ఓ కారును జైసల్ కు బహుమతిగా అందించారు. కేరళ ఎక్సైజ్ శాఖ మంత్రి టీపీ రామకృష్ణన్ కారు తాళాలను జైసల్‌కు అందించారు. మత్స్యకారుడు జైసల్‌ మానవత్వానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సైతం అభినందించారు. జైసల్‌ని సత్కరించి మెమెంటోను ఇచ్చి అభినందించారు.

09:35 - September 14, 2018

ఢిల్లీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన మనోహర్ అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం కుదుటు పడడంతో ఈనెల 6వ తేదీన భారత్ కు తిరిగొచ్చారు. మరోమారు అనారోగ్యం పాలయ్యారు. దీనితో పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. 
ప్రస్తుతం ఆయన బీచ్ విలేజ్ అయిన కండోలిమ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చేరిన విషయం నిజమేనని బీజేపీ నేత మైఖేల్ లోబో పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో కూడా ఆయన పాల్గొనలేదు.

 

09:16 - September 14, 2018

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘ఎన్టీఆర్’పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాను చాలా మంది దృష్టి పెట్టారు. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా క్రిష్ డైరెక్షన్ ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన చిత్రాలు విడుదలై హల్ చల్ చేస్తున్నాయి. 

ఎన్బీకే ఫిలింస్‌, వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ లుక్ ను విడుదల చేసింది. ఎన్టీఆర్, చంద్రబాబు క్యారెక్టర్లకు సంబంధించిన లుక్  ను రిలీజ్ చేశారు. ఈసారి మామా అల్లుళ్లు కలిసే వచ్చారు. పోస్టర్‌ లో ఎన్టీఆర్ తన అల్లుడిపై ప్రేమగా చెయ్యివేసి మాట్లాడుతున్నట్లుగా చూపించారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యారెక్టర్ లో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావుగా.. ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

08:17 - September 14, 2018

మంచిర్యాల : ముందస్తుకు ముందువరుసలో ఉన్న టీఆర్‌ఎస్‌.. అసమ్మతిలోనూ మొదటి స్థానంలో ఉంది. రాష్ర్టవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఓదెలు అనుచరుడి ఆత్మహత్యాయత్నం ఇందుకు పరాకాష్ట. చెన్నూరులో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న వివాదానికి కేసీఆర్‌ చెక్‌ పెట్టారు. అసంతృప్త నేతలనూ ఆయన బుజ్జగించే పనిలో పడ్డారు. టీఆర్ఎస్‌ ముందస్తు ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. రాష్ర్టవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. టికెట్‌ ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. కొంతమందైతే బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అక్కడక్కడా నిరసనలకు దిగుతున్నారు. సమస్య అంతటితో అంతమవ్వలేదు...  ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు.. అనుచరుడైతే.. ఏకంగా ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో నల్లాల ఓదెలు, బాల్క సుమన్‌ మధ్య వివాదం తలెత్తింది. నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళనలో పడ్డారు. 

ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి బంగపడ్డవారంతా నిరసన తెలుపుతుండడంతో గులాబీ బాస్‌ అలర్ట్‌ అయ్యారు. వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. కేసీఆర్‌ ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత తనదేనని.. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. పార్టీలో అసమ్మతి గురించి పట్టించుకోకుండా... ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్‌ అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తోంది. 

కేసీఆర్‌ అన్నంత పనిచేస్తున్నారు. అసంతృప్త నేత మాజీ ఎమ్మెల్యే ఓదెలుతో మాట్లాడి దారికి తెచ్చారు. ప్రగతి భవన్‌లో  కేసీఆర్‌ను కలుసుకున్నాక ఓదెలు కాస్త మెత్తబడ్డారు. మాటతీరులోనూ మార్పు వచ్చింది. కేసీఆర్‌ మాటే తనకు శిరోధార్యమన్న ఓదెలు. బాల్కసుమన్‌ విజయానికి కృషి చేస్తానన్నారు. తొందరపాటు చర్యలు తీసుకోకుండా.. పార్టీ వెంటే నడవాలని కార్యకర్తలను కోరారు ఓదేలు. 

బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌..  టికెట్లు కేటాయించిన అభ్యర్థులకు గురువారం ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సమాచారం. ముఖ్యంగా ఓటర్ల నమోదుపై సీరియస్‌గా దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది. బూత్ కమిటీల నియామకాలు, పార్టీ నేతల సమన్వయంతోపాటు.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ చెప్పినట్లు తలాడించిన ఓదెలుకు కార్యకర్తలనుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆయనకు మద్ధతుగా ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన ఓదెలును అడ్డుకున్నారు.  గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. 

08:00 - September 14, 2018
ఢిల్లీ : ఆసియాకప్‌ చరిత్రలో ఆరుసార్లు విజేతగా నిలిచిన  టీమ్‌ఇండియా..తమకు కలిసొచ్చిన టోర్నీలో మరోసారి  కలబడుతోంది. ఆసియా క్రికెట్‌ దేశాల మధ్య స్నేహపూర్వక  వాతావరణం పెంపొందించడం కోసం 1983లో తొలిసారిగా  ఆసియాకప్‌ నిర్వహించారు. ఆసియాక్రికెట్‌ కౌన్సిల్‌ నిర్వహణ  బాధ్యతలు చూసుకుంది. అయితే 2015 నుంచి ఐసీసీ దీనిని  నిర్వహిస్తోంది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీని ఒకసారి  టీ20 కప్‌గా, మరోసారి వన్డే కప్‌గా రొటేషన్‌ పద్ధతిలో  జరుపుతున్నారు. చివరిసారిగా 2016లో జరిగిన టీ20  కప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది.

ఎప్పటిలాగే ఈసారి కూడా మిగతా జట్ల కంటే టీమ్‌ఇండియానే  పటిష్టంగా కనిపిస్తున్నది. రోహిత్‌శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌  రాహుల్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోనీ, హార్దిక్  పాండ్యతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్‌,  శార్దూల్‌తో పేస్‌ ఎటాక్...చాహల్‌, కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌తో స్పిన్‌  ఎటాక్‌ సైతం స్ట్రాంగ్‌గా ఉంది. యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌  ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను  సెప్టెంబర్‌ 18న హాంకాంగ్‌తో ఆడుతుంది. మరుసటి రోజు సెప్టెంబర్‌ 19న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడుతుంది.

భారత్‌ తర్వాత శ్రీలంక అత్యధికంగా ఐదు సార్లు ఆసియాకప్  గెలిచింది. లంక..ఈసారి అంత బలంగా కనిపించకపోయినా,  యువ క్రికెటర్లతో జట్టు సమతూకంలోనే ఉన్నది. కెప్టెన్‌  మాథ్యూస్‌కు తోడు సీనియర్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ జట్టులో  చేరడం లంకకు కలిసొచ్చే అంశం. గాయం కారణంగా దినేశ్‌ చండిమాల్‌ ఆఖరి నిమిషంలో తప్పుకోవడం ఆ జట్టును కొంత కలవరపరిచే అంశం. అటు బంగ్లాదేశ్‌ కూడా బలంగా  కనిపిస్తోంది. కెప్టెన్‌ మొర్తజా, ఆల్‌రౌండర్‌ షకీబ్‌, ముష్పికర్‌  రహీమ్‌, మహ్మదుల్లా జట్టులో కీలకపాత్ర పోషించనున్నారు. దీంతో తొలి మ్యాచ్‌ కావల్సినంత కిక్‌ ఇవ్వడం ఖాయం.

సర్ఫరాజ్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ జట్టులో షోయబ్‌ మాలిక్‌  మినహా మిగతా వారందరూ యువ క్రికెటర్లే. బాబర్‌ అజామ్‌,  ఫక్హర్‌ జమాన్‌, మహ్మద్‌ అమీర్‌, జునైద్ ఖాన్‌ కీలక ఆటగాళ్లు.  పాక్‌ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 16న హాంకాంగ్‌తో  ఆడుతుంది. మరోవైపు పసికూనలు అనే ముద్ర చేరిపేసుకునేందుకు  ఆఫ్ఘనిస్థాన్‌ సిద్ధమైంది. కెప్టెన్‌ అస్గర్‌ ఆఫ్ఘాన్‌తో పాటు మహ్మద్‌ నబి వంటి సీనియర్లుండగా...స్పిన్‌ సంచలనాలు రషీద్‌ఖాన్‌, ముజీబుర్‌ రహ్మన్‌ ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. పెద్ద జట్లకు షాక్‌ ఇవ్వాలని తహతహలాడుతున్న ఆఫ్ఘన్‌ సెప్టెంబర్‌  17న శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. మొత్తానికి క్రికెట్‌ అభిమానులను 14 రోజుల పాటు అలరించేందుకు ఆసియాకప్‌ సిద్ధమైంది.

ఆసియా కప్‌ షెడ్యూల్‌
సెప్టెంబర్‌ 15 – బంగ్లాదేశ్‌ × శ్రీలంక
సెప్టెంబర్‌16 – పాకిస్థాన్‌ × హాంకాంగ్‌
సెప్టెంబర్‌17 – శ్రీలంక × అఫ్గానిస్తాన్‌
సెప్టెంబర్‌18 – భారత్‌ × హాంకాంగ్‌
సెప్టెంబర్‌19 – భారత్‌ × పాకిస్థాన్‌
సెప్టెంబర్‌20 – బంగ్లాదేశ్‌ × అఫ్గానిస్థాన్‌
సెప్టెంబర్‌21 – Supe 4 మ్యాచ్‌ 1, 2
సెప్టెంబర్‌23 – Super 4 మ్యాచ్‌ 3, 4
సెప్టెంబర్‌25 – Super 4 మ్యాచ్‌ 5
సెప్టెంబర్‌26 – Super 4 మ్యాచ్‌ 6
సెప్టెంబర్‌28 – ఫైనల్‌
07:22 - September 14, 2018

విశాఖపట్టణం : అత్యంత వినోదం, ఉత్కంట కలిగించే ఈ సాహస జల క్రీడకు ఆదరణ పెరుగుతోంది. సముద్రంలోపల జలచరాలతో జలకాలాడుతూ.. అందాలను ఆస్వాదించడం మరపురాని మధురానుభూతి.. దీనివైపు యువత ఆసక్తి కనబరుస్తోంది. విదేశాల్లో క్రేజు పొంది.. ఇప్పుడిప్పుడే ఇండియాకు పరిచయమైన స్కూబాడైవింగ్‌కు  కేరాఫ్‌గా మారబోతోంది విశాఖ. కడలి లోపలి అందాలను కనువిందుచేసే.. అద్భుత విన్యాసం స్కూబాడైవింగ్‌. ఈ సాహస క్రీడకు విశాఖలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఇక్కడి సముద్రంలో విజన్‌ చాలా పారదర్శకంగా ఉండడంతో.. 30 మీటర్ల వరకూ జలచరాల కదలికలను స్పష్టంగా గమనించవచ్చు.

భవిష్యత్తులో ఈ క్రీడకు విశాఖ కేంద్రంగా మారుతుందన్నారు టూరిజం సీఈఓ. ఉత్తరాంధ్రలో స్కూబా డైవింగ్‌ను ప్రోత్సహించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. చింతపల్లి తీరంలో స్కూబా డైవింగ్‌ అకాడమీ ఏర్పాటుకు లివిన్‌ అడ్వంచర్స్‌ అన్న సంస్థతో పర్యాటకశాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లుతెలిపారు. విశాఖ-భీమునిపట్నం బీచ్‌రోడ్డులోని మంగమారిపేట వద్ద స్కూబా డైవింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు అనుకూలంగా స్కూబాడైవింగ్‌ను.. ఈత రాని వాళ్లు సైతం చేయొచ్చు.గత సీజన్‌లో దాదాపు 200 మంది, ఈ సీజన్‌లో వంద మందికిపైగా పర్యాటకులు సముద్రంలోకి వెళ్లారు. ప్రస్తుతానికి స్కూబాడైవింగ్‌ కోసం ఒక్కొక్కరికి ఐదు వేలు  వసూలు చేస్తున్నారు. ముందు స్విమ్మింగ్‌ పూల్‌లో శిక్షణ ఇచ్చాకే.. సముద్రంలోకి తీసుకెళ్తారు. సముద్రంలో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు.

07:04 - September 14, 2018

చెన్నై : రాజకీయ నేతలు ఎలా ఉండాలి ? ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ తాము నేతలం..ఏమైనా చేస్తాం...ఎలాగైనా వ్యవహరిస్తాం...అంటూ కొందరు ప్రవర్తిస్తుంటారు. నేతల కుమారులు సైతం వీరి బాటలోనే పయనిస్తుంటారు. భారతదేశం..తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులో డిఎంకేకి చెందిన మాజీ కార్పొరేటర్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. 

గతంలో కార్పొరేటర్ గా పనిచేశాడు. అనుభవం కూడా ఉంది. కానీ ఇవన్నీ అతను మరిచిపోయాడు. ఓ మహిళను దారుణంగా కాలితో తన్నాడు. ఇష్టం వచ్చినట్లుగా ఆమెపై దాడి చేశాడు. దాడి చేసిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సెల్వకుమార్ అనే తమిళనాడు డీఎంకే మాజీ కార్పోరేటర్ ఓ బ్యూటీ పార్లర్‌లో ప్రవేశించి, ఓ మహిళపై దౌర్జన్యం చేసిన సిసి ఫుటేజ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా బైటికి రావడంతో సెల్వకుమార్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. 

06:51 - September 14, 2018
అమెరికా : ప్రపంచంలో అగ్రరాజ్యం అంటూ పేర్కొంటున్న అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. పిచ్చొడులా మారిపోతూ విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కాల్పుల్లో భారత పౌరులతో మాత్రం..తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా విగతజీవులుగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వ్యక్త జరిపిన కాల్పుల్లో 5గురు ప్రాణాలు కోల్పోవడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. 
దక్షిణ కాలిఫోర్నియాలోని బేకర్స్‌ ఫీల్డ్‌ సిటీలో ఓ ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో అతని భార్య కూడా ఉంది. అనంతరం తనని తాను కాల్చుకున్నాడు. అమెరికాలో వారం రోజుల్లో ఇది రెండో ఘటన. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దుండగుడు కాల్పులకు తెగబడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
06:21 - September 14, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1948 సెప్టెంబర్ 5న కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. సినీ దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా పేరు పొందారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియచేశారు. ఆయన దర్శకత్వం వహించిన …తిలదానం, కమ్లి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన తెరకెక్కించిన తిలదానం, డాక్యుమెంటరీ చిత్రమైన సురభి చిత్రాలు నంది అవార్డులను గెలుచుకున్నాయి. 

ఆయన ఆరు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ఈయన కేవలం తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా సినిమాలు చేశారు.  1989లో బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ నేషనల్ అవార్డును సైతం శాస్త్రి గెలుచుకున్నారు. 2006లో నందిత దాస్ ప్రధాన పాత్రలో రూపొందించిన కమిలి చిత్రం దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.  తెలుగు, కన్నడ సినిమాలు తీసిన శాస్త్రి… చివరగా ఖోఖో ప్రధాన అంశంగా ‘శాణు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

Don't Miss