Activities calendar

01 October 2018

21:14 - October 1, 2018

ముంబై : క్యాస్టింగ్ కౌచ్ వివాదం సినిమా పరిశ్రను కుదిపివేస్తోంది. టాలీవుడ్ లో శ్రీరెడ్డితో మరోసారి మొదలైన ఈ రచ్చ బాలివుడ్ లో కూడా గత కొన్ని రోజుల నుండి వివాదాస్పదమవుతోంది. దాదాపు అన్ని భాషాల్లోని సినిమా పరిశ్రమపై ఈ అంశం సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో  బాలీవుడ్ లో హీరోయిన్ తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను సీనియర్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే  కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కూడా తనను లైంగికంగా వేధించాడని ఆమె తెలిపింది.  దీంతో ఈ వివాదంపై సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ వివాదంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించేందుకు నిరాకరించారు. ఈ వివాదంపై మాట్లాడటానికి తాను తను శ్రీ దత్తాను కానీ, నానా పటేకర్ ను కానీ కాదని స్పష్టం చేశారు. దీంతో అమితాబ్ వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిల సమస్యల గురించి స్పందించని అమితాబ్ లాంటి వ్యక్తులు సామాజిక కథాంశాల ఆధారంగా ‘పింక్’ వంటి సినిమాలు తీస్తున్నారని విమర్శించింది. ఇలాంటి వ్యక్తులు నిజజీవితంలో కళ్ల ఎదుట జరిగే దారుణాన్ని ప్రశ్నించరనీ, కళ్లు మూసుకుంటారని..ఇటువంటివారు సినిమాల్లో హీరోలు..నిజ జీవితంలో జీరోలు అని వ్యాఖ్యానించింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తాను చివరివరకూ పోరాడుతానని స్పష్టం చేసింది. 
మహారాష్ట్ర, ముంబై, బాలివుడ్, క్యాస్టింగ్ కౌచ్, తనుశ్రీదత్తా, నానా పటేకర్, అమితాబచ్చన్,టాలీవుడ్, శ్రీరెడ్డి, Maharashtra, Mumbai, Bollywood, Casting Cowch, Tanushree Datta, Nana Patekar, Amitabhachan,Tollywood, Sri Reddy

 

20:54 - October 1, 2018

అమెరికా : మానవుడి తెలివి రాళ్లు కొట్టుకుని బ్రతికే నాటి నుండి గ్రహాంతరాళలో విహరించే స్థాయికి చేరింది. అయినా మనిషి ఆశ చావలేదు..ఆతడి కాంక్ష కూడా తీరలేదు. ఎన్నెన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న మనిషి అందని చందమామ కోసం అందిపుచ్చుకోవాలని ఆరాట పడుతున్నాడు. భూమిపై జనాభా పెరుగుతోంది. అంతకంటే ఎక్కువగా మానవుడి మేథస్సు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అంగారకుడిపై ఆహారాన్ని పండించే మార్గాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ముందుగా ఇక్కడ అంగారకుడిపై ఉండే మట్టిని కృత్రిమంగా రూపొందించారు. ఈ మట్టికి వారు సిమ్యులెంట్ గా నామకరణం చేశారు. అమెరికాలోని సెంట్రల్‌ ఫ్లోరిడా వర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ మట్టిని రూపొందించారు. 
అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ రోవర్‌ సేకరించిన మట్టిలోని రసాయన లక్షణాల ఆధారంగా సిమ్యులెంట్‌ను తయారు చేశారు. అరుణ గ్రహంపై ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు.. ఈ మట్టి ఎంతగానో తోడ్పడుతుందని పరిశోధకుడు డాన్‌ బ్రిట్‌ అన్నారు. భవిష్యత్ లో అంగారకుడిపై మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే.. ఆహారం, నీరు, ఇతరత్రా నిత్యావసరాలు అవసరమని పేర్కొన్నారు. తాము రూపొందించిన సిమ్యులెంట్‌తో.. అలాంటి మార్గాలను ఇక్కడే పరీక్షించే వీలు చిక్కుతుందని చెప్పారు. మరోవైపు కిలో రూ.1450 చొప్పున ఈ మట్టిని కావలసిన వారికి సరఫరా కూడా చేస్తున్నామని తెలిపారు. 

 

20:24 - October 1, 2018

కర్ణాటక : మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రజలకు ఓ మంచి సందేశాన్నిచ్చారు. సిగిరెట్లు తాగవద్దని..వాటితో క్యాన్సర్ వస్తుందని..దయచేసి సిగిరెట్లు తాగి క్యాన్సర్ బారిన పడవద్దని పిలుపునిచ్చారు. మైసూరులో క్యాన్సర్ పరీక్షాశిబిరం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ, ఒకప్పుడు తాను రోజుకు 40 సిగరెట్లు కాల్చేవాడినని తెలిపారు. ఒకసారి తన మిత్రులు విదేశీ సిగరెట్ల పెట్టెను తీసుకొస్తే... అదే రోజు చాలా ఉత్సాహంగా సిగరెట్లన్నింటినీ ఊదేశానని... ఆ తర్వాత తనలో ఒక అపరాధభావం మొదలైందని, సిగరెట్లను మానేశానని చెప్పారు. ఇప్పుడు ఎవరి వద్ద నుంచైనా సిగరెట్ వాసన వస్తే భరించలేనని తెలిపారు. 31 ఏళ్ల నుంచి సిగరెట్లకు దూరంగా ఉన్నానని చెప్పారు. సిగరెట్ పెట్టెలపై బొమ్మలతో సహా హెచ్చరికలు ఉన్నప్పటికీ... జనాలు వాటిని వదల్లేకపోతుండటం బాధను కలిగిస్తోందని సిద్ధరామయ్య చెప్పారు. ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందని... అందువల్ల క్యాన్సర్ బారిన పడకముందే దాన్ని వదిలేయాలని సూచించారు.

19:19 - October 1, 2018

తిరుమల: లడ్డూ విక్రయాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం అరుదైన రికార్డును స్వంతం చేసుకొంది. సెప్టంబర్ నెలాఖరులో విపరీతమైన రద్దీ ఏర్పడంటంతో తిరుమల కొండ కిటకిటలాడింది. పవిత్ర తమిళ ప్రేస్థాసి మాసం ప్రారంభం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. సెప్టెంబరు 30 వతేదీ తెల్లవారుఝామున 3 గంటల నుంచి అక్టోబరు 1వ తేది ఉదయం 3 గంటల మధ్య (24 గంటల్లో) 5 లక్షల 13 వేల 566 లడ్డూల అమ్మకాలు జరిగినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది.

గతంలో అత్యధికంగా 4 లక్షల 64 వేల 152 లడ్డూ ప్రసాదం అక్టోబరు 10, 2016 సంవత్సరంలో పంపిణీకాగా ఆ రికార్డు ఈ ఏడాది అధికమించినట్టు దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో 4 లక్షల 32 వేల 745 లడ్డూల అమ్మకాలు జరిగాయి. ఇదే స్థాయిలో 4 లక్షల 14 వేల 987 లడ్డూలు ఈ ఏడాదే మే నెల 19 వతేదీన దేవస్థానం విక్రయించింది. దీని తర్వాత 4 లక్షల 11 వేల 943 లడ్డూల అమ్మకాలు 2017 సంవత్సరం జూన్ 11న జరిగాయి. ఈ సందర్భంగా లడ్డూ పోటు సిబ్బందిని దేవస్థానం అధికారులు అభినందించారు.

19:12 - October 1, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్ లో వున్న పలు సమస్యలకు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చిటికెలో పరిష్కారాన్ని చెప్పేశారు. పేదిరకం,ఉగ్రవాదం, సైస్యం పెత్తనం వంటి సమస్యలు పోవాలంటే పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయడమే ఆ దేశానికి పరిష్కారమన్నారు. ‘‘పాకిస్తాన్‌కు ఒకే ఒక్క మార్గం ఉంది. బలోచ్‌లు పాకిస్తాన్‌తో కలిసి ఉండేందుకు ఇష్టపడడం లేదు. సింధీలు, పస్తూన్లది కూడా అదే దారి. కాబట్టి పాకిస్తాన్‌ను బలోచ్, సింద్, పస్తూన్ మూడింటితో పాటు అవశేష పశ్చిమ పంజాబ్‌గా విడగొట్టాలి....’’ అని స్వామి పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమయం వృధా చేసుకోవద్దనీ.. భారత్ తిట్టినప్పుడల్లా పాకిస్తాన్ వెర్రి ఆనందం పొందుతుందన్నారు. ‘‘పాకిస్తాన్‌ను పక్కనపడేసి మన సైన్యాన్ని సన్నద్ధం చేసుకోవాలి. అదనుచూసి ఒకరోజు దాన్ని నాలుగు ముక్కలుచేస్తే సరి...’’ అని స్వామి వ్యాఖ్యానించారు. కాగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘపై ఇటీవల సుష్మా స్వరాజ్‌ ఐరాసలో లేవనెత్తిన నేపథ్యంలోనే స్వామి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

17:51 - October 1, 2018

స్వీడన్ : నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి. ఈ నేపథ్యంలో 2018 సంవత్సరానికి గానూ నోబెల్‌ పురస్కారాల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు వైద్య శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది అమెరికా, జపాన్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్‌‌ను పంచుకుంటున్నారు. అమెరికాకు చెందిన జేమ్స్‌ పి అల్లిసన్‌, జపాన్ కు చెందిన  తసుకు హోంజో వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి అందిస్తున్నట్లు స్టాక్‌హోం లోని నోబెల్‌ అసెంబ్లీ ఈరోజు ప్రకటించింది.
క్యాన్సర్ చికిత్స కోసం వీరు చేసిన పరిశోధనలకు గానూ నోబెల్‌ బహుమతి ప్రకటించారు. క్యాన్సర్‌ కణాలపై పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సాయపడుతుందని వీరు తమ అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. పురస్కారంతో పాటు 9 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల అంటే 7,80,000 పౌండ్ల నగదు బహుమతిని కూడా వీరు అందుకోనున్నారు. అక్టోబరు 5 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్‌ పురస్కారాల విజేతలను వెల్లడిస్తారు.

17:33 - October 1, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ మూవీ మరికొద్దిరోజుల్లో ధియేటర్స్‌లోకి రాబోతోంది..ఇటీవల విడుదల చేసిన టీజర్కీ, థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్‌కీ... ముఖ్యంగా ఎమోషనల్‌గా సాగే పెనిమిటి పాటకి మంచి స్పందన వస్తోంది..
రేపు (అక్టోబర్ 2వ తేదీన) ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు.. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్‌గా చేసారు..ఇదిలా ఉంటే, అరవింద సమేత గురించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ చేసాడట..
తండ్రిగురించి కొడుక్కి వివరించే సందర్భంలో పెనిమిటి సాంగ్ వస్తుందనీ, తండ్రి పాత్ర పోషించే ఎన్టీఆర్‌కి జోడీగా ఈషా రెబ్బా నటించిందనీ, రావు రమేష్, ఎన్టీఆర్‌ల  మధ్యవచ్చే పొలిటికల్ సీన్స్ సినిమాకే హైలెట్ అని అంటున్నారు.. 
జగపతి బాబు, నాగబాబు, సునీల్ తదితరులు నటిస్తున్న అరవింద సమేత.. దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది..

 

17:17 - October 1, 2018

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తన నోటికి పని పెట్టారు. ఎప్పుడు వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తు వార్తల్లో నిలిచే సుబ్రహ్మణ్యస్వామి ఈసారి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పడ్డారు. ఇమ్రాన్‌ఖాన్‌పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఇమ్రాన్ ఖాన్ ఓ ‘చప్రాసీ’ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్‌లో అక్కడి సైన్యం, ఐఎస్ఐ, తీవ్రవాదులే పరిపాలన సాగిస్తున్నారు. అక్కడి ప్రభుత్వంలో ఇమ్రాన్ ఖాన్ ఓ నౌకరు మాత్రమే. ఆయనను పేరుకు ప్రధాని అని పిలుస్తున్నారు.. వాస్తవానికి ఆయన ఓ ‘చప్రాసీ’...’’ అని సుబ్రమణ్యస్వామి వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. 

 

16:57 - October 1, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొనటంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై విరసం సభ్యుడు వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, గౌతమ్ నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు ఆగస్టు 28న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఐదుగురు హక్కుల కార్యకర్తలను సుప్రీంకోర్టు 4 వారాల పాటు హౌస్ అరెస్ట్ లో ఉంచింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు వీరి అరెస్టులపై స్పందించారు.
ప్రధాని మోదీ హత్యకు తాము పౌర హక్కుల నేతలతో కలసి కుట్ర పన్నలేదని మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కి చెందిన అభయ్ లేఖ విడుదల చేశారు. హక్కుల నేత రోనా విల్సన్ దగ్గర దొరికినట్లు పోలీసులు చెబుతున్న లేఖలు బూటకమని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. పౌర హక్కుల నేతలపై జరుగుతున్న అణచివేతలపై ప్రజాస్వామ్య వాదులు స్పందించాలని కోరారు. ప్రధానిని హత్య చేయాలని తాము ఎవరికీ లేఖ రాయలేదనీ, అలాంటి అవసరం తమకు లేదని అభయ్ స్పష్టం చేశారు.
పుణెలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం అనంతరం దళితులకు-అగ్రవర్ణాలకు మధ్య భీమా-కోరేగావ్ ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు హక్కుల కార్యకర్త రోనా విల్సన్ ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోదీని మట్టుబెట్టేందుకు మావోలు ప్లాన్ వేశారనీ, ఇందుకోసం ఆయుధాల కొనుగోలుకు వరవరరావు సాయం చేస్తాడని లేఖలో ఉన్నట్లు..దానికి సంబంధించిన లేఖ లు తమకు లభించినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది.

16:24 - October 1, 2018

జగిత్యాల : ఇటీ వల జగిత్యాలలో జరిగిన ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన తాజా వివరాలు వెల్లడయ్యాయి. ఇటీవల వచ్చి సూపర్ హిట్ అయిన  సినిమా ఆర్ఎక్స్ 100 సినిమా ప్రభావంతో వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారనీ డీఎస్పీ వెంకట్ రమణ ఈ ఆత్మహత్యలపై వివరాలను వెల్లడించారు. కాగా వారిద్దరు ఆత్మహత్యకు చేసుకోలేదనీ..వారి మధ్య మూడో వ్యక్తికూడా వున్నాడనీ..అతనే వీరి ఆత్మహత్యలకు కారణం అని మహేందర్, రవితేజల పేరెంట్స్ ఆరోపించారు. కాగా విచారణలో మాత్రం మూడ వ్యక్తి మాత్రం లేడని పోలీసులు వెల్లడించారు. కాగా సదరు విద్యార్థుల ఆత్మహత్యల వివరాలను తెలుసుకుందాం..
జిల్లాలోని ఆత్మహత్యల కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మధ్యహ్నాం 4గంటల సమయంలో పెట్రోల్ కొన్నట్లుగా సీసీ కెమెరా పుటేజ్ లో లభ్యమయ్యాయి. పెట్రోల్ బంక్ కు వెళ్లి మహేందర్, రవితేజలు రూ.430 విలువైన పెట్రోల్ కొనుగోలు చేసారు. అప్పటివకే వారు మద్యం తాగి వున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం వారిద్దరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా అంత పెద్ద మొత్తంలో పెట్రోల్ ఎందుకు కొంటున్నాని పెట్రోల్ బంక్ వారు అడిగిన దారిని కాకు మార్గం మధ్యలో ఆగిపోయిందని అందుకే కొంటున్నామని వారు తెలిపినట్లుగా తెలుస్తోంది. 
విజయపురి కాలనీకి చెందిన కూసరి మహేందర్‌ అనే 16, విద్యానగర్‌కు చెందిన బంటు రవితేజ 16 స్నేహితులు. స్థానిక మిషనరీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం పొద్దుపోయాక ఇద్దరూ పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌ వద్దకు వెళ్లారు. గొడవ.. ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని.. కొద్ది సేపటికే పరస్పరం ఘర్షణ పడిన వాళ్లు.. క్షణికావేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒకరిపై ఒకరు చల్లుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితులను 108 వాహనంలో జగిత్యాల ప్రాంతీయ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఇద్దరూ ప్రాణాలు వదిలారు.. ఈ లోపే మహేందర్‌ మృతి చెందగా..రవితేజ కరీంనగర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలంలో బీరు సీసాలు ఉండటాన్ని బట్టి..ఘర్షణ పడే ముందు ఇద్దరూ మద్యం తాగి ఉంటారన్న అనుమానాలను పోలీసులు వ్యక్తంచేశారు. ఒకే అమ్మాయిని ప్రేమించి... ఒకే అమ్మాయిని ఇద్దరూ ప్రేమించి ఆమె కోసం గొడవపడి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, మరెవరైనా ఈ ఇద్దరు యువకులను పెట్రోల్ పోసి కాల్చి చంపారా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎంతో ప్రేమగా పెంచుకున్న తమ కుమారులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు. దీనిపై తాజాగా వివరాలు వెల్లడయ్యాయి. 

 

15:31 - October 1, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు ఈసీ త్వరపడుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే టీ. సర్కార్ రూ.275 కోట్లు కేటాయించింది. సెప్టెంబర్ ఆరున అసెబ్లీని రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నిక కోసం ఉబలాపడతోంది. ఈ క్రమంలో ఈసీ కూడా ముందస్తు ఎన్నికలను త్వరగా అంటే అసెంబ్లీ రద్దు అయిన ఆరు నెలల లోపుగానే ఎన్నికలు నిర్వహించాలని త్వరపడుతోంది. దీనికి సంబంధించి ఈసీ అడుగులు త్వరపడుతున్నాయి. ఈవీఎంలకు అయ్యే ఖర్చును కేంద్ర ఎన్నికల సంఘం భరిస్తుందని కేంద్రం ఎన్నికల కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఉమేశ్ సిన్హా తెలిపారు. భారీ లావాదేవీలపై సమాచారం ఇవ్వాలని ఐటీ అదికారులను ఉమేశ్ సిన్హా కోరారు.
రూ.275 కోట్లు విడుదల చేయమని కోరాం : రజత్ కుమార్
తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.275 కోట్లు విడుదల చేసిందని, త్వరలో మరింత బడ్జెట్‌ను విడుదలచేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. ఈ ఎన్నికల సందర్భంగా బ్యాంకుల్లో జరిగే పెద్ద లావాదేవీలపై ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ ఉంటుందని, ఆదాయపుపన్నుశాఖ అధికారులతో కలిసి అధిక విలువైన బ్యాంకు లావాదేవీలను గుర్తించే పనిని ప్రత్యేకంగా చేపడుతున్నామని ఆదివారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది నెలల ముందుగానే శాసనసభను రద్దుచేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇటీవల రాష్ర్టానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ఆదాయపుపన్నుశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌ను కలిసి బ్యాంకుల లావాదేవీలపై దృష్టిసారించాలని సూచించారని, ఈ నేపథ్యంలో భారీ ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచార ఖర్చుల వివరాలను అందజేయాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 122 మంది ప్రతినిధులకు నోటీసులు జారీచేశామని రజత్‌కుమార్ చెప్పారు. రాష్ర్టానికి పూర్తిస్థాయిలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు అందాయని, వీటిలో 70 శాతం ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఇప్పటికే తనిఖీచేశామని తెలిపారు. 

 

14:58 - October 1, 2018

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి ఎవరి పాలన వారు చేసుకుంటున్నారు. కాగా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా వున్న హైకోర్టును త్వరంగా విభజించాలని తెలంగాణ రాష్ట్రం కేంద్రం న్యాయశాఖను త్వరపెడుతుందో. మరోవైపు హైకోర్టుకు సంబంధించిన భవనాల నిర్మాణం ఇంకా పూర్తికాలేదనేది ఏపీ వాదన. దీనిపై త్వరగా నిర్మాణం పూర్తి చేసి హైకోర్టను ఏపీకి తీసుకెళ్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే గత మూడేళ్లనుండి ఈవిషయంపై ఓ కొలిక్కి రాలేదు. 
ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.  ఎప్పుడు సిద్ధమవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు సిద్ధమవుతుందని సుప్రీంకోర్టుకు ఏపీ తరపు న్యాయవాది నారీమన్ తెలిపారు. ఏపీ మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని కేంద్ర, తెలంగాణ తరపు లాయర్లు కోర్టుకు విన్నవించారు. హైకోర్టు భవనం ఎప్పటిలోగా సిద్ధమవుతుందో అఫిడవిట్ రూపంలో రెండు వారాల్లో కోర్టుకు అందజేయాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
 

 

14:31 - October 1, 2018

ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్స్ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. అర్హత, ప్రతిభను బట్టే రిజర్వేషన్స్ వుండాలని కొందరు వాదిస్తుంటే..వెనుకబడిన వర్గాలను అభివృద్ది కోసం రిజర్వేషన్స్ కొనసాగించాలని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో రిజర్వేషన్స్ పై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  దళితులు, ఇతర వెనుకపడిన వర్గాలకు అందజేస్తున్న రిజర్వేషన్లపై జార్ఖండ్ లో జరిగిన ‘లోక్ మానథాన్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న నేపథ్యంలో సామాజిక సామరస్యం సాధించేందుకు వీలుగానే అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. కానీ రిజర్వేషన్ల కారణంగా ఆయా రంగాల్లో తీవ్రమైన శూన్యత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తొలుత పదేళ్లకు మాత్రమే అనుకున్న రిజర్వేషన్లను పెంచుకుంటూ పోవడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని అభిప్రాయపడ్డారు. సామాజిక ప్రగతి సాధించాలంటే రిజర్వేషన్లు అవసరం లేదనీ..ఆలోచనలను, చేతలను మార్చుకోవాలని మహాజన్ తెలిపారు. అలా చేసినప్పుడే అంబేడ్కర్ కన్న కలలు సాకారం అవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

14:10 - October 1, 2018

వైజయంతీ మూవీస్.. ఈ పేరు చెబితే ఎన్నో భారీ సినిమాలు, కమర్షియల్ హిట్స్ గుర్తొస్తాయి.. ఈ బ్యానర్ ద్వారానే మహేశ్ బాబు, రామ్ చరణ్  హీరోలుగా పరిచయం అయ్యారు.. శక్తి చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకుని, రీసెంట్ గా నాగార్జున, నానీల మల్టీస్టారర్ మూవీ దేవదాస్‌తో మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చారు సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అశ్వనిదత్.. ప్రస్తుతం దిల్‌రాజు, పి.వి.పి.తో కలిసి, వంశీపైడిపల్లి డైరెక్షన్‌లో మహేశ్‌బాబు 25వ సినిమా మహర్షి‌ని నిర్మిస్తున్నారాయన.. తర్వాత, రాజారాణి, పోలీసోడు, అదిరింది వంటి వరుస హిట్స్ ఇచ్చిన యువ తమిళ దర్శకుడు అట్లీ‌తో దత్ ఓ ద్విభాషా చిత్రం చెయ్యబోతున్నారనీ, అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తాడని తెలుస్తోంది.. 
 ఎన్టీఆర్ - అట్లీ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు దత్ సన్నాహాలు చేస్తున్నారట.. మొన్నటివరకు  అట్లీతో సినిమా ఓకే అయినా హీరో మాత్రం ఫిక్స్ కాలేదు.. మహర్షి పూర్తయ్యాక రామ్ చరణ్ తో సినిమా ప్లానింగ్ లో ఉంది.. ఇక తారక్ నటించిన  అరవింద సమేత త్వరలో రిలీజ్ కాబోతుంది.. దీని తర్వాత తారక్‌కి రాజమౌళి సినిమాఉంది.. 
అంటే, వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో  ఎన్టీఆర్ హీరోగా, అట్లీ సినిమా 2020లో ఉండొచ్చన్నమాట..

 

13:25 - October 1, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐటీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ సింహ విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు సూచించారు. దీనితో సోమవారం ఆయన ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అధికారులు ఆయన్ను విచారించారు. 

కాసేపటి క్రితం విచారణ ముగిసింది. ఐటీ అధికారుల విచారణకు మరింత సమయం కోరడం జరిగిందని ఉదయ సింహ తెలిపారు. మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించడం జరిగిందని, ఈనెల 3వ తేదీన మరోసారి విచారణకు రావడం జరుగుతుందన్నారు. తమ బంధువు నివాసంపై ఐటీ అధికారుల పేరిట దాడులు జరిగాయని, కానీ తాము దాడి చేయలేదని ఐటీ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. తమ బంధువు ఇంటిపై దాడికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పన్ను ఎగవేత, అవినీతి ఆరోపణలతో గత బుధవారం రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు ఉదయ సింహా, ఎమ్మెల్సీ సెబాస్టియన్, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి ఇళ్ళల్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

 

12:32 - October 1, 2018

ఖమ్మం : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చాలా రోజుల తరువాత తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన ఖమ్మం జిల్లా నుండి పర్యటన మొదలు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. టిడిపి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టనున్నారు. కానీ తెలంగాణ టిడిపి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయని సంగతి తెలిసిందే. 
సోమవారం ఆయన ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఆయనతో పాటు భారీగా కార్యకర్తలు..నేతలు తరలొచ్చారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. జిల్లాకు రాగానే టిడిపి నేతలు నామా, సండ్ర తదితరులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను బాలయ్య ఆవిష్కరించారు. తెలంగాణ కోటి రతనాల వీణ..నైజాంకు ఎదురుతిరిగిన నేల..అంటూ ప్రసంగించి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. సాయత్రం సత్తుపల్లిలో జరిగే బహిరంగసభలో పాల్గొనున్నారు. 

12:16 - October 1, 2018

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐటీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఐటీ కార్యాలయానికి సోమవారం ఉదయ్ సింహా కాసేపటి క్రితం చేరుకున్నారు. ఓటుకు నోటు కేసులో కీలకమైన వ్యక్తి..ఏ2 ఉదయ్ సింహా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రూ. 50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయో తెలియచేయాలని ఐటీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఐటీ కార్యాలయానికి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి కూడా చేరుకున్నారు. 

మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాల సందర్భంగా సెబాస్టియన్,  ఉదయ్ సింహాల ఇండ్లలో కూడ సోదాలు నిర్వహించారు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇండ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకొన్న డాక్యుమెంట్ల పరిశీలిస్తున్నట్లు సమాచారం.  సెబాస్టియన్, కొండల్ రెడ్డిలకు ఐటీ అధికారులు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని, హాజరు కాని పక్షంలో సెక్షన్ 271ఏ ఆదాయపు పన్ను చట్టం కింద జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. 

11:54 - October 1, 2018

హైదరాబాద్ : వర్షాకాలం అప్పుడే ముగిసిపోయింది. ఈసారి ఆశించినంత వర్షాలు కురియలేదు. దీనితో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంచితే చలికాలం ప్రవేశించడంతోనే రోగాలు కూడా ప్రవేశిస్తాయి. ఈ రోగాలతో పాటు ఇతర వ్యాధులు కూడా ప్రవేశిస్తాయి. ప్రధానంగా జులుబు, జ్వరంతో బాధ పడుతుంటారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ ఇతరత్రా వ్యాధులు వస్తాయి. వైరస్..బ్యాక్టీరియాలు సోకితే శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. అందువల్ల బొంగురు గొంతు, తరచూ తుమ్ముల్లు, దగ్గు, కండరాలు పట్టుకోవడం తదితర సమస్యలు ఏర్పడుతాయి. మరి ఎలాంటి సూచనలు పాటించాలి ? రోగాల బారిన పడుకుండా ఉండాలంటే ఏం 
చేయాలో చదవండి...

 • శుభ్రమైన..తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.  శుభ్రత కొరవడిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. శుభ్రమైన ఆహారం..నూనె, కారం ఎక్కువగా లేని ఆహారం తీసుకోవాలి. తేలికగా అరిగే ఇడ్లీ..బ్రెడ్..ఆపిల్..కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం ఉత్తమం.
 • దొమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా, దోమలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి. 
 • శరీరం పొడిబారకుండా చూడాలి. ఇమ్యూన్ వ్యాక్సిన్ ఇవ్వాలి. కాచి వడబోసిన నీరు తాగడం బెటర్. 
 • వాటర్ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మరిచిపోకండి. అపరిశుభ్రమైన నీటిని సేవించడం వల్ల పలు అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. డీహైడ్రేషన్, డయేరియా, వాంతులు, శరీరం పొడిబారడం, విరోచనాలు ఉంటే అది కలరా లక్షణాలని గుర్తించాలి. 
11:36 - October 1, 2018

ఢిల్లీ : పీఎన్‌బీకి వేల కోట్లు ఎగనామం పెట్టిన నీరవ్ మోడీ ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. నాలుగు నెలలు కిందటే అతని పాస్‌పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టు పరారీలో ఉన్న వజ్రాల వర్తకుడు నీరవ్‌  మోడీ ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రూ. 637 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ ఆస్తులు భారతేదశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయని తెలుస్తోంది. జప్తు చేసుకున్న ఆస్తుల్లో నగలు, ప్లాట్లు, బ్యాంకుల్లో నగదున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్‌ చట్టం కింద ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం బ్యాంకులకు రూ. 12,600 కోట్లను నీరవ్‌ మోడీ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

11:25 - October 1, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. కార్తికేయ, ప్రేమమ్ చిత్రాలతో గుర్తింపుతెచ్చుకున్న చందూమొండేటి దర్శకత్వంలో, శ్రీమంతుడు, జనతా‌ గ్యారేజ్, రంగస్ధలం వంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మించిన చిత్రం.. సవ్యసాచి.. 
ఈ ఉదయం సవ్యసాచి టీజర్‌ని ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేసింది మూవీ యూనిట్... ఈ టీజర్‌లో నాగచైతన్య  తన క్యారెక్టర్‌ని వాయిస్ ఓవర్ ద్వారా తనే ఆడియన్స్‌కి ఇంట్రడ్యూస్ చేసుకోవడం విశేషం..
మామూలుగా ఒకతల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ముళ్లంటారు.. అదే, ఒకేరక్తం, ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్నిఅద్భుతం అంటారు.. అలాంటి అద్భుతానికి మొదలుని, వరసకి కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని, ఈ సవ్యసాచిలో సగాన్ని.. అంటూ చైతూ చెప్పిన డైలాగ్, సినిమామీద అంచనాలని పెంచేసింది.. ఈ మూవీ ద్వారా చైతూ కంప్లీట్ మాస్ అటెంప్ట్‌‌ చెయ్యబోతున్నాడనిపిస్తోంది. ఎమ్.ఎమ్.కీరవాణి నేపధ్యసగీతం ఆకట్టుకునేలా ఉంది.. భారతంలో అర్జునుడికి రెండుచేతులకు సమానమైన బలంఉండేది.. అలాంటి శక్తి ఒక హీరోకి ఉంటే ఎలా ఉంటుంది... అనే ఆసక్తికరమైన అంశంతో రూపొందుతున్న సవ్యసాచిలో.. ఆర్.మాధవన్, భూమికాచావ్లా, వెన్నెల కిషోర్, ముకుల్ దేవ్, రావు‌రమేష్ తదితరులు నటిస్తున్నారు... నవంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రాబోతుంది.. 

 

11:18 - October 1, 2018
 1. ప్రతి రోజు పచ్చి కూరగాయల రసం తాగితే అనారోగ్యాల బారి నుండి కాపాడుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 2. యోగా..వ్యాయామం..ధాన్యం..లాంటి ప్రక్రియలతో మానసిక వత్తిడిని దూరం కావచ్చు.
 3. కుటుంబసభ్యులు..బంధు..మిత్రులతో మాట్లాడుతుండడి..ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి..
 4. ప్రతి రోజు ఒక గంట పాటు వ్యాయామం చేయండి..
 5. పొగ..మద్యపానం..తదితర చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి..
 6. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
 7. విటమిన్ ఇ, విటమిన్ సి లభించే ఆహారాలను తరచుగా తీసుకోవాలి.
 8. ఆహారం మితంగా తీసుకోవాలి. ఇది ఎంతగానో మంచింది.
 9. వారంలో ఒక రోజుల పచ్చి కూరగాయల సలాడ్ తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయి.
 10. ఆలీవ్..ఆవనూనె..సన్ ఫ్లవర్ లను వంట పదార్థాల్లో ఉపయోగించాలి. సాధ్యమైన వంత వరకు ఫ్లై..వేపులకు సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. 
11:11 - October 1, 2018

మీరట్: ఉత్తరప్రదేశ్‌లో ముస్లీం యువకుడిని ప్రేమించిందని హిందూ యువతిని ఒక ముస్లీంను ప్రేమిస్తావా అంటూ.. పోలీసుల వ్యాన్‌లో చెంపలు పగులకొట్టిన మహిళా కానిస్టేబుల్ ఇతర పోలీసుల వీడియో గతవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ పోలీసులకు కఠినంగా శిక్షిస్తారని అందరూ ఊహించారు.   అదే బిల్డప్ యూపీ పోలీసు బాసులు ఇచ్చారు. సీన్ మారితే.. సదరు పోలీసు అధికారులకు వీఐపీ శిక్ష అమలు చేసి తమ ముద్రను చాటుకుందీ యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కర్.

ఆ మహిళా పోలీసును మరొ ఇద్దరు అధికారులను గోరఖ్‌పూర్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం.  గోరఖ్‌పూర్.. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వంత నియోజకవర్గం కావడం కొసమెరుపు.  ఇది పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫరా లేదా వీఐపీ ట్రీట్‌మెంటా అనే సందిగ్ధాన్ని అక్కడి ప్రజలకు మిగిల్చింది సర్కార్.  

దాదాపు 18 మంది వీహెచ్‌పీ కార్యకర్తలు ఒక ముస్లీం యువకుడిని దారుణంగా చితకబాదుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అందులో ఒక్కరినీ యూపీ పోలీసులు  అరెస్టుచేయలేదు. మెడికల్ కాలేజీ స్టూడెంట్లు అయిన ఓ జంటను కొందరు దాడిచేసి గాయపర్చారు. ఆ వీడియోలు బయటకు రావడంతో నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులు ప్రకటించారు.  ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారిపై కేసును మాత్రం నమోదు చేయలేదు. అలాగే బాధితురాలిని వ్యాన్‌లో కొట్టిన సంఘటనలో ఆ ముగ్గురు పోలీసులపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ సంఘటనపై ఆదిత్యనాథ్ సర్కార్‌పై  రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

10:58 - October 1, 2018

విజయవాడ : 2019 ఎన్నికలకు ప్రీ మెనిఫెస్టోను ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నుండి ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు, శ్రీకాకుళం నుండి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. నెల రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని, ప్రజలు ఇచ్చిన సలహాలు..సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ బీజేపీ నెరవేర్చలేదన్నారు. ఇక టిడిపి విషయానికి వస్తే ఇచ్చిన హామీలను టిడిపి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. వైసీపీ ఇప్పటికే ఆరు వేల హామీలిచ్చిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై టిడిపి, వైసీపీ, బిజెపి పార్టీలు ముంచాయని, అధికారంలోకి రాగానే హామీల అమలుపై తొలి సంతకం, రైతుల రుణమాఫీపై మలి సంతకం పెడుతామన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం పూర్తయిన తరువాత మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. 

 

10:17 - October 1, 2018

హైదరాబాద్ : మాజీ టిడిపి నేత, ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐటీ విచారణ కొనసాగిస్తోంది. సోమవారం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డిని విచారించనున్నారు. ఆయనతో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కూడా ఐటీ అధికారులు విచారించనున్నారు. వీరికి వేర్వేరు సమయాలు కేటాయించారు. కేటాయించిన సమయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. దీనితో బషీర్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఐటీ కార్యాలయానికి వీరు చేరుకోనున్నారు. ఓటుకు నోటు కేసులో ఉదయ్ సింహా, సెబస్టియన్‌లు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ఇటీవలే రేవంత్ నివాసంపై ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర్య వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అడ్వకేట్ రామారావు ఫిర్యాదు మేరకు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. రేవంత్ నివాసంలో నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 35గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని రేవంత్ సోదాల అనంతరం పేర్కొన్నారు. ఈనెల మూడో తేదీన విచారణకు హాజరు కావాలని ఐటీ నోటీసుల్లో పేర్కొంది. 

09:29 - October 1, 2018

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన పలు సంఘాలతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం..నేతలపై విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సోమవారం పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి నేతలు పలు ఏర్పాట్ల చేశారు. జంగారెడ్డిగూడెం వేలూరుపాడు నుంచి ముంపు ప్రాంతాల పర్యటన కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు కుక్కునూరులో పోలవరం నిర్వాసితులతో పవన్‌ మాట్లాడనున్నారు. రిజనులతో భేటీ కానున్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న వారితో వరుసగా పవన్ భేటీలు జరుపనున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 14 గ్రామాలకు ముంపు ఉన్నా ప్రభుత్వం సరియైన చర్యలు తీసుకోవడం లేదని పవన్‌కు గిరిజనులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

09:12 - October 1, 2018

ముంబై : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. వరుసగా ధరలు పెరగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం లీటర్ పెట్రోల్ 24 పైసలు, డీజిల్ లీటర్‌కు 30 పైసలు పెరగడంతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 83.73, లీటర్ డీజిల్ రూ. 75.09 ధరగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 91.08, లీటర్ డీజిల్ రూ. 79.72 ధరగా ఉంది. 
అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల రేట్లలో మార్పులు చేస్తున్న కేంద్రం ప్రభుత్వ విధానం వల్ల వరుసగా పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు త్వరలో లీటరు డీజిల్‌ ధర 100కు చేరుకుంటుదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అధిక చమురు ధరలు ప్రజల ఆదాయానికి గండికొడుతున్నాయి. వినియోగదారులకు అదనపు భారం పడుతోంది.   

08:52 - October 1, 2018

న్యూఢిల్లీ : వంట గ్యాస్ ధర పెరిగింది. ఇప్పటికే పెట్రోల్, డీజీల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నసామాన్యులకు మరోసారి షాక్ తగిలింది. సబ్సిడీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోమారు షాకిచ్చాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఆదివారం ప్రకటించింది. ధరలు పెరిగాయన్న విషయం తెలుసుకున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్  ధరలు పెరగడంతో వాటిపై ఆధారపడిన ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్యాస్ ధర కూడా పెంచడంతో సామాన్యుడికి ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో గ్యాస్ ధరలు పెంచక తప్పడం లేదని ఐఓసీఎల్ పేర్కొంది. సబ్సిడీ సిలిండర్‌పై రూ. 2.89, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 59.00 పెంచుతున్నట్టు తెలిపింది. వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376కు పెంచినట్టు ఐఓసీఎల్ పేర్కొంది.

08:34 - October 1, 2018

ఇండోనేషియా :  సునామీ ఇండోనేసియాని అతలాకుతలం చేసేసింది. వెయ్యికి పైబడే ప్రాణాలను హరించేసింది. పాలూ నగరాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. సముద్ర తీరాన ఉన్న పాపానికి ఈ నగరం.. సునామీ ధాటికి తన స్వరూపాన్నే కోల్పోయింది. ఇక్కడ నివసిస్తున్న వారిని సముద్రపు అలలు.. సుమారు 20 కిలోమీటర్ల వరకూ లాక్కు వెళ్లాయంటే.. పరిస్థితి తీవ్రత ఏమేరకు ఉందో అర్థమవుతోంది. ఇప్పటి వరకూ అధికారికంగా.. 832 మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఊళ్లు మరుభూములను తలపిస్తున్నాయి.    .

సునామీ దెబ్బకు ఇండోనేసియాలో ప్రాణాలో కోల్పోయిన వారు పోగా.. ప్రాణాలతో మిగిలిన వారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. క్షతగాత్రులకు వైద్య సహాయం అందడం లేదు.. ఇక సునామీ కారణంగా సర్వం తుడిచిపెట్టుకు పోయిన ప్రజలు.. ఆహారం కోసం.. మంచినీటి కోసం అల్లాడుతున్నారు. మొన్నటిదాకా గౌరవంగా, దర్జాగా బతికిన ఇండోనేసియా వాసులు.. ఇప్పుడు ఆకలిదప్పులను తాళలేక లూటీలకు దిగుతున్నారు మరోవైపు సునామీ ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులూ విజృంభిస్తున్నాయి. దీంతో జీవచ్ఛవాల్లా మిగిలిపోయారు. ఇక భూకంపం తాకిడికి కూలిన శిథిలాలు అలాగే ఉన్నాయి. వీటిని తొలగించే ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతున్నాయి. సహాయ చర్యలకు భారీ యంత్రాలు కూడా లేకపోవడంతో ఎక్కడి శిథిలాలు అక్కడే ఉన్నాయి. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇండోనేషియా ప్రభుత్వం సునామీని జాతీయ విపత్తుగా ప్రకటించింది. 

08:23 - October 1, 2018

ఇండోనేషియా : వృత్తిధర్మం కోసం ప్రాణాలను పణంగా పెట్టేవారు అరుదుగా కనిపిస్తారు. ఇండోనేషియాకు చెందిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌.. వృత్తిధర్మం కోసం తన ప్రాణాలనే కోల్పోయాడు. చనిపోతావంటూ సహచరులు హెచ్చరించినా..తనకు అప్పగించిన పని పూర్తి చేసి ప్రాణ త్యాగం చేశాడు. ఇండోనేషియా ప్రజల దృష్టిలో హీరోగా మారిపోయాడు..ఆథనియస్‌ గునావన్‌. వయసు 21 ఏళ్లు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ గా పనిచేస్తున్నాడు. సులవేసి ద్వీపం భూకంపం బారిన చిక్కుకున్నపుడు అతడు పాలూ ప్రాంతంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్ టవర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే సమయంలో ఒక విమానం ల్యాండ్‌ కావాల్సి ఉంది. ఐతే సహచరులంతా వెళ్లిపోదాం రమ్మంటూ గునావన్‌ను పిలిచారు. కానీ అతడు విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యాకే వస్తానని చెప్పాడు. విమానం సేఫ్‌గా ల్యాండ్‌ ఐన తర్వాత గునావన్‌ తాను ఉన్ననాలుగంతస్తుల టవర్‌ నుంచి కిందకి దూకాడు. తీవ్ర గాయాలవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. వృత్తిధర్మం కోసం ప్రాణాలర్పించిన గునావన్‌పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.

07:58 - October 1, 2018

హైదరాబాద్ : బుల్లితెర ప్రేకక్షుల ఉత్కంఠకు తెరపడింది. బుల్లితెర ప్రేకక్షులను అలరించిన బిగ్ బాస్ 2కు ఎండ్ కార్డు పడింది. విజేతగా కౌశల్ నిలిచాడు. తరువాతి స్థానంలో గీతా మాధురి నిలిచారు. రికార్డుస్థాయిలో ప్రేకక్షులు ఓట్లు వేశారు. దాదాపు 26 కోట్లకు పైగా వచ్చిన ఓట్లలో దాదాపు 12 కోట్ల ఓట్లు కౌశల్‌కు పడినట్లు టాక్. 112 రోజులు...18 మంది సభ్యులు..విజతగా నిలవాలని ఎత్తులకు పై ఎత్తులు..ఎలిమినేషన్ టాస్్కలు, అదిరిపోయే అందాలు..కాంట్రవర్సీలు, తిట్లు..కోపాలు...వార్నింగ్‌లు..హెచ్చిరికలు..బుజ్జగించడాలు..ఇవన్నీ బిగ్ బాస్ 2 హౌస్‌లో చోటు చేసుకున్నాయి. 

తుదిపోరులో కౌశల్, గీతా మాధురి, తనీష్, సామ్రాట్, దీప్తి నల్లమోతులు పోటీ పడ్డారు. మా టీవీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం టైటిల్ పోరు నువ్వా.. నేనా అంటూ సాగింది. ఆదివారం సాయత్రం ఫైనల్‌లో నేచురల్ స్టార్ నాని ఆకట్టుకొనే విధంగా వ్యవహరించారు. అదిరిపోయే డ్యాన్్సలు, ఆకట్టుకొనే ఫెర్మామెన్్స మధ్య ఫైనల్ విజేతను ప్రకటించారు. ముఖ్యఅతిథిగా విక్టరీ వెంకటేష్ వచ్చి ప్రేక్షకులను అలరించారు. బలపం పట్టి బామ్మ ఒళ్లో అ.. ఆ నేర్చుకుంటా అనే సాంగ్‌కి స్టెప్టులు వేసుకుంటూ బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చేశారు వెంకటేష్. ఉత్కంఠ నడుమ విజేత ఎవరో నాని టీవీ ద్వారా కౌశల్ విన్నర్ అంటూ ప్రకటించారు. దీంతో కౌశల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే తన కుటుంబ సభ్యులు వద్దకు వెళ్లి హత్తుకున్నాడు. ఆ తర్వాత వేదికపై వెంకటేష్.. కౌశల్‌కు ట్రోపీ అందించగా, నాని రూ.50 లక్షల నగదును అందించారు. ఈ నగదును క్యాన్సర్ రోగులకు అందిస్తానని కౌశల్ ప్రకటించారు. 

07:38 - October 1, 2018

విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితులు పోరుబాట పడుతున్నారు. మోసపోయినవారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం విఫలం కావడంతో ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నారు. లక్షలాది మంది అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. బాధితుల్లో 185 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడంలేదని ఆరోపిస్తూ.. బాధితులంతా కలిసి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు జీఎస్‌ఎల్‌ వెనక్కి తగ్గడంతో బాధితుల ఆందోళన చేస్తున్నారు. పెట్టిన పెట్డుబడిలో కొంతైనా తిరిగి వస్తుందని ఆశిస్తే.. చివరికి నిరాశే మిగిలుతోందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. 

ఆగ్రిగోల్డ్‌కు ఎనిమిది రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధిలున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల అడ్వాన్స్‌ ఇచ్చి... ప్రభుత్వ శాఖలో ఆస్తులు కొనుగోలు చేసే విధంగా చూడాలని పలుమార్లు విన్నవించినా.. ప్రయోజనం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన 4 వేల 50 కోట్ల ఆస్తులను కొనుగోలుకు ముందుకొచ్చిన జీఎస్‌ఎల్‌ ... ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేసేందుకు నాలుగేళ్ల గడువు కోరింది. దీంతో జీఎస్‌ఎల్‌పై తమకు నమ్మకం కుదరడంలేదని... ఏపీ సర్కారు కోర్టు దృష్టికి తెచ్చింది. నాలుగేళ్లలో అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రెట్టింపు అవుతాయన్న అంచనాతో జీఎస్‌ఎల్‌ గ్రూపు ఉందన్న వాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతోంది. నాలుగేళ్లపాటు అమ్మకం ప్రక్రియకు ఆమోదిస్తే భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని.. ప్రభుత్వం భయపడుతోంది. నాలుగువేల కోట్లకు ఆస్తులు కొనుగోలు చేస్తామన్న తమ ప్రతిపాదనను ఏపీ తెలంగాణ ప్రభుత్వాలతోపాటు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఒప్పుకోవడంలేదని జీఎస్‌ఎల్‌ గ్రూపు కోర్టుకు నివేదించింది.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ మదింపు విషయంలో కూడా భిన్నవాదనలున్నాయి. తమ అంచనా ప్రకారం అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ 2,200 కోట్లని, ప్రభుత్వం మాత్రం 25 వేల కోట్లుగా లెక్కలు చూపుతోందన్నది జీఎస్‌ఎల్‌ వాదన. అగ్రిగోల్డ్‌ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, పన్ను బకాయిలపై కూడా స్పష్టతలేదని జీఎస్‌ఎల్‌ చెబుతోంది.ఇన్ని చిక్కుముడులున్న అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారానికి హైకోర్టులో రోజువారీ విచారణ అవసరమని న్యాయనిపుణలు సూచిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని వాపమక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కరించకపోతే.. నవంబర్‌ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న ఆలోచనలో బాధితులు ఉన్నారు. 

07:26 - October 1, 2018

హైదరాబాద్ : ఎల్‌.బి.నగర్‌-అమీర్‌పేట రూట్‌ను ప్రారంభించడంతో హైదరాబాద్‌ మెట్రోకు రద్దీ పెరిగిపోయింది. ఆదివారం ఒక్కరోజే దాదాపు రెండు లక్షల మంది ప్రయాణీకులు మెట్రోను ఉపయోగించుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. రద్దీకి తగ్గట్లుగా ట్రైన్ల సంఖ్యనూ పెంచారు.  ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ ట్రైన్‌ను నడిపారు. ఇవాళ ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీకి తగ్గట్లుగా ట్రైన్ల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. 

07:16 - October 1, 2018

విజయవాడ : ఎక్కడకైనా దేవుళ్లు, దేవతలకు గుళ్లు కట్టిస్తారు. కానీ ఈ మధ్య ట్రెండ్‌ మారింది. ప్రజలు తమకు నచ్చిన  రాజకీయ  నేతలకు గుళ్లు కట్టించడం రివాజుగా మారింది. స్వాతంత్ర్య సమరయోధులకు ఎక్కడా గుళ్లు, గోపురాలు లేవు.  కానీ ఇప్పుడు విజయవాడలో జాతిపిత మహాత్మాగాంధీకి దేవాలయం సిద్ధమైంది. శాంతి, అహింస సిద్ధాంతాలతో ప్రజల్లో స్ఫూర్తి నింపిన ప్రధాత ఆయన. జాతిపిత మహాత్మాగాంధీకి జయంతి, వర్థంతులు నిర్వహించడమే మనకు తెలుసు. కానీ బెజవాడలో నిర్మించిన గాంధీ ఆలయం జాతిపిత నిత్యపూజలు అందుకోతున్నారు. ఏపీలో గాంధీ కోసం నిర్మించిన మొదటి ఆలయం ఇదే. 

గాంధీ బోధించిన శాంతి, అహింస సిద్ధాంతాలు ప్రపంచంలోని చాలా దేశాలు ఆచరిస్తున్నారు. జాతిపిత సిద్ధాంతాలతో ఎందరో స్ఫూర్తి పొందారు. ఇలాంటి వారిలో రాంపిళ్ల జయప్రకాశ్‌ ఒకరు.  స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం కార్యదర్శిగా  పనిచేస్తున్న జయప్రకాశ్‌.. గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎస్‌ఏఎస్‌ కాలేజీలో జాతిపితకు గుడి కట్టించారు. ఆలయ నిర్మాణం కోసం రెండేళ్లు శ్రమించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి శిల్పులు, చిత్రకారులను రప్పించి విగ్రహాన్ని తయారు చేయించారు. ఇందుకోసం ఏడు నెలల సమయం పట్టింది. గాంధీ సిద్ధాంతాలు మరువకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలయం నిర్మించినట్టు జయప్రకాశ్‌ చెబుతున్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా గాంధీ ఆలయం ప్రారంభింపచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేదమంత్రోచ్ఛరణలకు ఆగమశాస్త్రం అనుమతిస్తుందా.. లేదా.. అన్న అంశంపై వేదపండితుల సలహాలు తీసుకుంటున్నారు. ముందుగా గాంధీ సూక్తులనే మంత్రాలుగా జపించే ఏర్పాటు చేస్తున్నారు. జాతిపితకు ఆలయం నిర్మించిన జయప్రకాశ్‌... 2012 నుంచి గాంధీ దీక్షలు ప్రారంభించారు. కాలేజీ విద్యార్థులు గాంధీ దీక్ష తీసుకునే విధంగా చేశారు. ఇప్పుడు గాంధీ దీక్షలు ఎందరికతో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇలాంటివి మరిన్ని ఆలయాలు నిర్మించేందుకు ప్రజలు ముందుకు వచ్చి భావి తరాలకు స్పూర్తిగా నిలవాలని జయప్రకాశ్‌ కోరుతున్నారు. 

07:04 - October 1, 2018

ఢిల్లీ : భారతదేశ శాంతికి విఘాతం కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే... వారికి సైనికులు ధీటైన సమాధానం చెబుతారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చారు. శాంతిని బలంగా నమ్మే దేశం ఇండియా అన్న ఆయన దేశ సార్వభౌమాధికారం, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రధాని స్పష్టం చేశారు. మన్ కీ బాత్  రేడియో షో 48వ ఎడిషన్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. శాంతికి మనం కట్టుబడి ఉన్నామని.... అదే విధానంతో ముందుకు వెళ్తామన్నారు. భారత ఆర్మీ ప్రత్యేక బలగాలు జరిపిన సర్జికల్ దాడులను ప్రధాని గుర్తుచేస్తూ, మన సైనికులు 2016లో ఉగ్రవాదానికి గట్టి గుణపాఠం చెప్పారన్నారు. 

06:53 - October 1, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్‌ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. పెట్రో ధరలు సామాన్యుడికి పెనుభారంగా మారుతున్నాయి. నిత్యావసర ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల రేట్లలో మార్పులు చేస్తున్న కేంద్రం ప్రభుత్వ విధానం వల్ల వరుసగా పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు త్వరలో లీటరు డీజిల్‌ ధర 100కు చేరుకుంటుదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అధిక చమురు ధరలు ప్రజల ఆదాయానికి గండికొడుతున్నాయి. వినియోగదారులకు అదనపు భారం పడుతోంది.   పెట్రోల్‌, డీజిల్ ధరల పెరుగుదల వల్ల పేద కుటుంబాలపై  అధిక ప్రభావం చూపిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. సొంత వాహనంపై ప్రయాణం భారంగా మారుతోంది. పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆందోళనలో పాల్గొంటున్నారు. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

06:45 - October 1, 2018

హైదరాబాద్ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు బ్యాడ్‌ న్యూస్‌. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌ ద్వారా ఏటీఎం నుంచి రోజుకు 20వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా కొత్త నిబంధన వచ్చింది. ఐతే ఈ నిబంధన అక్టోబర్‌ 31 నుంచి అమలవుతుందని ఐస్‌బీఐ అధికారులు తెలిపారు. ఐతే క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్నబ్యాంక్‌ ఖాతాదారులకే ఇదే వర్తించనుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌ ద్వారా ఏటీఎం నుంచి రోజుకు 40వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలు జరుగుతున్నాయని అధికంగా ఫిర్యాదులు వచ్చినందునే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

Don't Miss