Activities calendar

02 October 2018

22:14 - October 2, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. యువతిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జాతకంలో దోషం ఉందంటూ ఓ యువతిపై ఆమె మేనమామ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతికి వివాహం జరిగాక కూడా నిందితుడు ఈ అఘాయిత్యాన్ని ఆపలేదు. దీంతో విషయాన్ని యువతి తన బంధువులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 

ఆ దోషం సరి చేసుకోకపోతే తండ్రి చనిపోతాడని చెప్పి నిందితుడు బాధితురాలిని లొంగదీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేనకోడలు అని కూడా చూడకుండా 23 ఏళ్ల యువతిపై గత నాలుగేళ్లుగా లెక్కలేనన్ని సార్లు అత్యాచారం జరిపాడని వెల్లడించారు. యువతిని ఢిల్లీలోని మహిళా సంరక్షణ గృహానికి తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నరేలా ప్రాంత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

 

21:34 - October 2, 2018

విశాఖ : అరకులో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ జంట హత్యల విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సిట్ అధికారులు పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అరకు పోలీస్ స్టేషన్ గెస్ట్‌హౌజ్‌లో విచారించనున్నట్లు తెలుస్తోంది. మాజీ సర్పంచ్ సుబ్బారావు, బిసోయ్ మూర్తి, కామరాజులను పోలీసులు విచారిస్తున్నారు. లివిటిపుట్టులో 200 మందిని అదుపులోకి తీసుకుని విచారించి, వదలిపెట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 23న గ్రామ దర్శిని కార్యక్రమానికి వెళ్తున్నకిడారి సర్వేశ్వరరావు, సివేరు సోమపై మావోయిస్టులు కాల్పులు జరిపి, హత్య చేసిన సంగతి తెలిసిందే. 

కిడారి సర్వేశ్వరరావు, సివేరు సోమల హత్యకు సంబంధించి ప్రాథమిక నివేదికను డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ సీఎం ముఖ్యమంత్రికి అందజేశారు. సీఎం చంద్రబాబుతో సీఎస్ అనిల్ చంద్ర పునేత, డీజీపీ ఠాకూర్ భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. అరకు జంట హత్యలపై నిగూఢమైన సమాచారం, సాక్ష్యాధారాలతో కూడిన కీలకమైన ప్రాథమిక నివేదికను సీఎంకు అందజేశారు. నివేదికలో ఆరుగురు ప్రధాన నిందితుల పేర్లను పొందుపరిచారు. ఈ కేసులో ప్రధానమైన నిందితులుగా  ముగ్గురు టీడీపీ అనుచరులు, ఇద్దరు వైసీపీ అనుచరులు, ఒకరు బీఎస్పీ అనుచరుడు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచరాణలో తెలిసింది. ఈ ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్నారు. వీరి నుంచి కీలకమైన సమాచారం వస్తోంది. ’ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేని చంపేస్తారనే విషయం తమకు తెలియదని...కేవలం అక్కడ బాక్సైట్‌కు సంబంధించిన అంశంలో కేవలం వారిద్దరిని బెదిరిస్తారు.. భయపెట్టి వదిలేస్తారు..  ఆ బాక్సైట్ జోలికి రాకుండా చేస్తారనేటటువంటి సమాచారంతోటే మావోయిస్టులకు సమాచారం ఇచ్చినట్లుగా’ నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి నుంచి మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు.

 

21:04 - October 2, 2018

ఢిల్లీ : రైతుల ఆందోలనలకు కేంద్రం దిగి వచ్చింది. రైతుల తొమ్మిది డిమాండ్లలో ఏడింటికి కేంద్ర ప్రభుత్వం అంగీకారించింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో.. రైతు సంఘాలతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరిపారు. రైతు సంఘాల నేతలు పెట్టిన 9 డిమాండ్లలో ఏడింటిని అంగీకరిస్తామన్నారు. అయితే.. రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుపై మాత్రం ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది.

మెజార్టీ డిమాండ్లను ఆమోదించడానికి సిద్ధపడినందున ఆందోళన విరమించాలంటూ కేంద్రం రైతులను కోరింది. అయితే కీలక డిమాండ్లైన రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తేనే ఆందోళన విరమిస్తామంటూ రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. దీంతో రైతులు నచ్చజెప్పేందుకు.. నేరుగా ఢిల్లీ-యూపీ సరిహద్దులకే కేంద్ర మంత్రులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

అంతకముందు అన్నదాతలు కదంతొక్కారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో ఢిల్లీ సరిహద్దులు మారు మ్రోగాయి. పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్‌తో అడ్డుకున్నా.. రైతులు వెన్నుచూపలేదు. అంతకంతకు భారమవుతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

20:31 - October 2, 2018

కర్నూలు : జిల్లాలోని నందికొట్కూరులో జరిగిన ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమంలో రసాభాసయింది. నిరుద్యోగ భృతి కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య....2వేలు ఇస్తామన్న ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దీనిపై అక్కడే ఉన్న టీడీపీ నేతలు...ఐజయ్యతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఐజయ్య సభ నుంచి వెళ్లిపోయారు.

 

20:14 - October 2, 2018

గుంటూరు : ఏపీలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల  భృతి చెల్లించే పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు.  వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న పథమకమంటూ విపక్షాలు దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. యువనేస్తం ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదని స్పష్టం చేశారు.

నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా కొందరు పారిశ్రామికవేత్తలను కూడా కార్యక్రమానికి ఆహ్వాంచారు. బహుముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలు చేస్తునట్టు ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. 

19:50 - October 2, 2018

హైదరాబాద్ : నగరంలో మళ్లీ  స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మోయినాబాద్‌కు చెందిన మహిళతోపాటు సిద్ధిపేటకు చెందిన మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు. స్వైన్ ఫ్లూ ఉన్న ఇద్దరూ గాంధీ ఆస్పత్రిలో చేరగా ప్రత్యేక వార్డులో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోయినాబాద్‌కు చెందిన మహిళకు స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా ఉన్నట్లు నిర్ధారించారు. కాగా సిద్ధిపేటకు చెందిన మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించారు. అయితే ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా నగరంలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 9 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు సమాచారం.

 

18:35 - October 2, 2018

రంగారెడ్డి  టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ కారు ప్రమాదానికి గురైంది. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. కల్వకుర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్.. జైపాల్ యాదవ్‌ కారు వెనుక భాగంలో ఢీకొట్టంది. కారు వెనుకభాగానికి కొద్దపాటి నష్టం జరిగింది. జైపాల్ యాదవ్‌తోపాటు వాహనంలోని మరికొందరికి ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. టిప్పర్ క్రషర్ మిల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న కడ్తాల్ పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని, విచారించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టిప్పర్ డ్రైవర్, యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. 

 

17:34 - October 2, 2018

కర్నూలు : జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. డాక్టర్ నిర్లక్ష్యంతో పేషెంట్ కోమాలోకి వెళ్లాడు. ఎర్రగుడి గ్రామనికి చెందిన భాస్కర్ వైద్యం కోసం కర్నూలులోని సన్‌రైజ్ ప్రైవేట్ వెళ్లాడు. భాస్కర్‌కు బాంబే బ్లడ్ గ్రూప్ ఎక్కించాల్సింది పోయి ’ఓ పాజిటివ్‌’ బ్లడ్ ఎక్కించారు. రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి బ్లడ్ తీసుకొచ్చారు. టెస్ట్ చేయకుండానే బ్లడ్ ఎక్కించారు. డాక్టర్ నిర్లక్ష్యంతో పేషెంట్ భాస్కర్ కోమాలోకి వెళ్లాడు. 


రక్త మార్పిడి చేయడం వల్లే భాస్కర్ కోమాలోకి వెళ్లాడని పేషెంట్ బంధువులు ఆరోపిస్తున్నారు. బ్లడ్ బ్యాంకు, సన్‌రైజ్ ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. పేషెంట్ భాస్కర్‌తో బంధువులు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బ్లడ్ బ్యాంకు, ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ రెండింటి లైసెన్స్‌లు రద్దు చేయాలంటున్నారు. తమకు న్యాయం చేయాలని రోగి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. భాస్కర్‌కు పూర్తి వైద్యం సన్‌రైజ్ ఆస్పత్రి చేయాలంటున్నారు. అయితే సన్‌రైజ్ ఆస్పత్రి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. 

ఒక వర్గం పేషెంట్ భాస్కర్‌కు, మరో వర్గం ఆస్సత్రి యాజమాన్యానికి మద్దతు పలికింది. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఇరు వర్గాలు పోలీసుల ముందే వాగ్వాదానికి దిగాయి. కాగా ఈ ఘటనకు పూర్తి బాధ్యత బ్లండ్ బ్యాంకుదేనని ఆస్పత్రి యాజమాన్యం ఆరోపిస్తున్నారు. వారిచ్చిన బ్లడ్‌నే తాముకు రోగికి ఎక్కించామని చెబుతున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది

 

17:07 - October 2, 2018

గీతగోవిందం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం ఈనెల 5వతేదీ రిలీజ్ కానునన్న సంగతి తెలిసిందే.. గతకొద్ది రోజులుగా నోటా పబ్లిక్ మీట్ పేరుతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం..
నోటా పబ్లిక్ మీట్కి వచ్చిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ,  విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. 
పెళ్ళిచూపులు సినిమాచూసి విజయ్కి కథ వ్రాయాలనుకున్నాను, అర్జున్ రెడ్డి చూసాక ఈయనకి ఎలాంటి కథ వ్రాయాలో, అని భయపడ్డాను.. గీతగోవిందం చూసాక కూడా అదే పరిస్ధితి.. ఎప్పటికప్పుడు కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు.. ఇప్పుడు నోటా చూసాను.. వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తున్నారు.. డెఫినెట్‌గా ఒక మంచి కథతో మీదగ్గరకి వస్తాను అని కొరటాల అనగానే విజయ్ కూడా హ్యాపీగా రియాక్ట్ అయ్యాడు.. వరసగా నాలుగు హిట్స్ ఇచ్చిన కొరటాల విజయ్ గురించి ఇలా అన్నాడంటే, ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు..

16:53 - October 2, 2018

గుంటూరు : అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరు సోమల హత్యకు సంబంధించి ప్రాథమిక నివేదికను డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ సీఎం ముఖ్యమంత్రికి అందజేశారు. సీఎం చంద్రబాబుతో సీఎస్ అనిల్ చంద్ర పునేత, డీజీపీ ఠాకూర్ భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. అరకు జంట హత్యలపై నిగూఢమైన సమాచారం, సాక్ష్యాధారాలతో కూడిన కీలకమైన ప్రాథమిక నివేదికను సీఎంకు అందజేశారు.

నివేదికలో ఆరుగురు ప్రధాన నిందితుల పేర్లను పొందుపరిచారు. ఈ కేసులో ప్రధానమైన నిందితులుగా  ముగ్గురు టీడీపీ అనుచరులు, ఇద్దరు వైసీపీ అనుచరులు, ఒకరు బీఎస్పీ అనుచరుడు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచరాణలో తెలిసింది. ఈ ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్నారు. వీరి నుంచి కీలకమైన సమాచారం వస్తోంది. ’ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేని చంపేస్తారనే విషయం తమకు తెలియదని...కేవలం అక్కడ బాక్సైట్‌కు సంబంధించిన అంశంలో కేవలం వారిద్దరిని బెదిరిస్తారు.. భయపెట్టి వదిలేస్తారు..  ఆ బాక్సైట్ జోలికి రాకుండా చేస్తారనేటటువంటి సమాచారంతోటే మావోయిస్టులకు సమాచారం ఇచ్చినట్లుగా’ నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి నుంచి మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. జంట హత్యలో ఎవరెవరైతే ఉన్నారో 60 నక్సలైట్లు, మావోయిస్టులు, అక్కడి మహిళలు, వారికి సహకరించిన వారందరిని పేరు పేరున విచారిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది నుంచి సాక్ష్యాధారాలు పోలీసులు సేకరించారు. కీలకమైన సమాచారంతో ఉన్న నివేదికను డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ ముఖ్యమంత్రికి అందజేశారు


ఇదిలావుంటే రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో పలువురు ఎస్పీల బదిలీకి రంగం సిద్ధం చేశారు. పోలీసులు, ఐపీఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధమైంది. దాదాపు పది జిల్లాల్లోని ఎస్పీలను బదిలీ చేసేందుకు సిద్ధం అయ్యారు. వీటిలో ఐపీఎస్ ఉన్నతాధికారులను కూడా బదిలీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్‌పీ ఠాకూర్ గతంలో ఏపీ డీజీగా ఉన్నారు. నాలుగు ఉన్నతస్థాయి ఐపీఎస్ పోస్టులు, పది జిల్లాల ఎస్పీ పోస్టులను మార్చడానికి ముఖ్యమంత్రితో డీజీపీ ఠాకూర్ చర్చించారు. ఎనిమిది జిల్లాలో ఉన్న కలెక్టర్లను కూడా మార్చే అవకాశం ఉంది. కార్యదర్శి అనిల్ చంద్ర పునితా ముఖ్యమంత్రితో చర్చించారు. ఫైల్‌ను రేపు కానీ ఎల్లుండి గానీ ముఖ్యమంత్రికి సర్క్యులేట్ చేసే అశకాశం ఉంది. మూడు, నాలుగు రోజుల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉంది. విశాఖ రూరల్ ఎస్పీని బదిలీ చేసే అవకాశం ఉంది. నెల్లూరు, అనంతపురం, గుంటూరు ఎస్పీలు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 

15:20 - October 2, 2018

 ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన నవాబ్ చిత్రం గతవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది.. తెలుగుతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.. ఒక్క తమిళనాడులోనే ఇప్పటివరకు 30కోట్లకు పైగా కలెక్ట్  చెయ్యడం విశేషం.. ఈ సందర్భంలో మణిసార్‌తో సహా టీమ్ అంతా హ్యాపీగా ‌ఉన్న టై్మ్‌లో ఒక ఆగంతకుడి దగ్గరినుండి ఆయనకి బాంబు బెదిరింపు కాల్ రావడం సినీవర్గాల్లో చర్చకి దారితీసింది..

వివరాల్లోకి వెళితే.. మణిరత్నం నవాబ్ మూవీలో జాలర్లకి సంబంధించి కొన్ని అభ్యంతరకర డైలాగులున్నాయని, వెంటనే వాటిని తొలగించకపోతే నీ ఆఫీస్‌ని బాంబుపెట్టి పేల్చేస్తానని ఒక వ్యక్తి, మణిరత్నం ఆఫీస్‌కి కాల్ చేసి బెదిరించాడట... వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇవ్వగా..  రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని ఫేక్ కాల్‌గా గుర్తించి, ఆ కాల్ ఎక్కడినుండి వచ్చిందో వెతికి పట్టుకునే పనిలో ఉన్నారట..

15:18 - October 2, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రైతులు గర్జించారు. రైతన్నలు కదం తొక్కారు. ఢిల్లీ..యూపీ సరిసహద్దుల్లో రోడ్డుపై రైతులు నిరసన తెలుపుతున్నారు. రుణమాఫీ అమలు చేయాలని సెప్టెంబర్ 23న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి కిసాన్ ర్యాలీ ప్రారంభం అయింది. ఇవాళ కిసాన్ ర్యాలీ ఢిల్లీ చేరుకుంది. వేలాదిగా రైతులు ఢిల్లీలో కనిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వేల మంది రైతులు ఢిల్లీకి వస్తున్నారు. 

ఢిల్లీలో కిసాన్ ర్యాలీకి పోలీసులు అనుమతివ్వడం లేదు. రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతులపై పోలీసులు భాష్పవాయువులు, జల ఫిరంగులు ప్రయోగిస్తున్నారు. చాలా మంది రైతులు రోడ్లపైనే పడిపోయారు. అయినా వెనక్కి వెళ్లేది లేదని రైతులు రోడ్లపైనే భీష్మించుకుని కూర్చుకున్నారు. హింస చెలరేగింది. ర్యాలీ విజయ్‌ఘాట్ వద్దకు రావాల్సివుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డకుంటున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. రుణమాపీ అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనల కారణంగా మీరట్ ఎక్స్‌ప్రెస్ వే పైకి వెళ్లవద్దని పోలీసులు ద్విచక్రవాహనదారులకు సూచిస్తున్నారు.  దీంతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరస్థితులు నెలకొన్నాయి. 

 

14:12 - October 2, 2018

ఢిల్లీ : విహిత మహిళతో ఒక వ్యక్తి  చేసిన శృంగారం నేరంగా పరిగణించరాదని  సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇష్టపూర్వకంగా చేసే శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం  సంచలన తీర్పు చెప్పింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 పురాతన చట్టమని.. రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అలుసుగా తీసుకున్న ఓ భర్త  మరో వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై ప్రశ్నించిన భార్యను అవహేళన చేశాడు. 
దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దానికా భర్త పకపకా నవ్వుతూ.. ‘‘పిచ్చిదానా, పోలీసులు కూడా ఏమీ చేయలేరే. వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఒకవేళ పోలీసులు నన్నేమైనా అంటే తిరిగి వారిపైనే కోర్టుకెళ్తా. కోర్టు తీర్పును ఉల్లంఘించారని కోర్టుకెక్కుతా’’ అని భార్యనే బెదిరించాడా ప్రబుద్ధుడు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వెలుగు చూసిన ఈ పరిణామం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. చెన్నైలో జరిగిందీ ఘటన.  
విషయం తెలిసిన ఆమె భర్తను నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. భార్య హెచ్చరికలకు ఫ్రాంక్లిన్ పకపకా నవ్వుతూ పోలీసులు కూడా ఏమీ చేయలేరని తేల్చి చెప్పాడు. వివాహేతర సంబంధాలు తప్పు కాదంటూ స్వయంగా సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చిందని పేర్కొన్నాడు. పోలీసులు కనుక తన జోలికి వస్తే వాళ్ల మీదే కోర్టు ధిక్కార నేరం కింద తిరిగి కేసు పెడతానని చెప్పడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోక, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

13:30 - October 2, 2018

హైదరాబాద్ : అసలే ఫ్రైర్ బ్రాండ్ అనే పేరు. పైగా అధిష్టానం ఎన్నికల వర్కింగ్ ప్రెసిడెంట్ అధికారాలు చేతిలోపెట్టింది. మరోపక్క కాంగ్రెస్ లో ఆధిప్యత ధోరణి కొత్తేం కాదు. వెరసి రేవంత్ రెడ్డిగారి హల్ చల్ టీ. కాంగ్రెస్ లో నిప్పులో ఉప్పుకణికలాగా తయారయ్యాడు. దీంతో పాత నాయకులంతా అటు అధిష్టానం  ముందు నోరు మెదపలేరు. ఇటు రేవంత్ దూకుడు తట్టుకోలేరు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ గెలుపు కోసం ప్రచారానికి వెళ్లి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ పై పాత నాయకులంతా గుర్రుగా వున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ మాట్లాడుతు.."మీ నియోజకవర్గంలో షబ్బీర్ అలీని గెలిపిస్తే ఆయన నంబర్-2 పొజిషన్ లో ఉంటారు. మీకు మేలు జరుగుతుంది" అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 'ఇంకా అధికారంలోకి రాలేదు. సీట్ల సర్దుబాటు లేదు, అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండానే ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలేంటని సీనియర్లు అంటున్నారు. ఆయన వ్యాఖ్యలతో సీఎం ఆశావహుల జాబితా పెరిగిపోయే ప్రమాదం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రేవంత్ మాటలపై ఎవరూ బహిరంగంగా విమర్శించకపోయినా, ఈ కొత్త సంస్కృతితో పార్టీకి నష్టమేనని సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీలో ఐక్యతను దెబ్బతీసే ఈ వ్యాఖ్యలు మంచివి కావని, ఎన్నికల వేళ, పదవులు, స్థానాల గురించి మాట్లాడితే, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటూ, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకరు రాహుల్ గాంధీకి లేఖను రాసినట్టు తెలుస్తోంది.

13:30 - October 2, 2018

హైదరాబాద్ : అసలే ఫ్రైర్ బ్రాండ్ అనే పేరు. పైగా అధిష్టానం ఎన్నికల వర్కింగ్ ప్రెసిడెంట్ అధికారాలు చేతిలోపెట్టింది. మరోపక్క కాంగ్రెస్ లో ఆధిప్యత ధోరణి కొత్తేం కాదు. వెరసి రేవంత్ రెడ్డిగారి హల్ చల్ టీ. కాంగ్రెస్ లో నిప్పులో ఉప్పుకణికలాగా తయారయ్యాడు. దీంతో పాత నాయకులంతా అటు అధిష్టానం  ముందు నోరు మెదపలేరు. ఇటు రేవంత్ దూకుడు తట్టుకోలేరు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ గెలుపు కోసం ప్రచారానికి వెళ్లి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ పై పాత నాయకులంతా గుర్రుగా వున్నారు. ప్రచారంలో భాగంగా రేవంత్ మాట్లాడుతు.."మీ నియోజకవర్గంలో షబ్బీర్ అలీని గెలిపిస్తే ఆయన నంబర్-2 పొజిషన్ లో ఉంటారు. మీకు మేలు జరుగుతుంది" అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 'ఇంకా అధికారంలోకి రాలేదు. సీట్ల సర్దుబాటు లేదు, అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండానే ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలేంటని సీనియర్లు అంటున్నారు. ఆయన వ్యాఖ్యలతో సీఎం ఆశావహుల జాబితా పెరిగిపోయే ప్రమాదం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రేవంత్ మాటలపై ఎవరూ బహిరంగంగా విమర్శించకపోయినా, ఈ కొత్త సంస్కృతితో పార్టీకి నష్టమేనని సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీలో ఐక్యతను దెబ్బతీసే ఈ వ్యాఖ్యలు మంచివి కావని, ఎన్నికల వేళ, పదవులు, స్థానాల గురించి మాట్లాడితే, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటూ, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకరు రాహుల్ గాంధీకి లేఖను రాసినట్టు తెలుస్తోంది.

12:57 - October 2, 2018

విశాఖపట్నం : మావోయిస్టుల చేతిలో అంత్యంత కిరాతకంగా చంపబడ్డ ఎమ్మెల్యే కిడారి హత్యకు అత్యంత సన్నిహితుల వల్లనే జరిగిందని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నమ్మినవారే కిడారిని మావోల చేతికి అప్పగించారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కిడారికి అతి సన్నిహితుడిగా, విశ్వాసపాత్రుడిగా వ్యవహరించిన ఓ వ్యక్తి చేసిన నమ్మకద్రోహమే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతికి చిక్కి, వారి చేతిలో హత్యకు గురికావడానికి కారణమైంది. ఆ వ్యక్తి కిడారిని బావా బావా.. అంటూ ఆప్యాయంగా పిలుస్తూనే ఆయన ప్రతి కదలికనూ మావోయిస్టులకు పక్కాగా చేరవేయడం గమనార్హం. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు. అతని భార్య స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. అతడు సోమకు దగ్గరి బంధువవుతారని సమాచారం. అతనితో పాటు మరికొందరిని పావులుగా ఉపయోగించుకునే జంట హత్యల ప్రణాళికను మావోయిస్టులు పక్కాగా అమలుచేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆ నాయకుడిది, కిడారిది వేర్వేరు గిరిజన తెగలైనా కిడారితో అతను  విశ్వసనీయంగా, చనువుగా ఉండేవాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గత నాలుగు రోజులుగా భార్యభర్తలు ఇద్దర్ని పోలీసులు వేర్వేరుగానూ, కలిపి ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టారు. వీరిరువురు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారని సమాచారం. జంట హత్యలకు రెక్కీ నిర్వహించే క్రమంలో రెండు, మూడు సార్లు లివిటిపుట్టు ప్రాంతంలో పర్యటించిన మావోయిస్టులకు అతనే ఆశ్రయమిచ్చినట్లు తెలిసింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో మావోయిస్టులు ఉన్నప్పుడు వారిని కలవడం, అక్కడికి సమీపంలోని కొందరు గ్రామస్థులతో ఆహారం సిద్ధం చేయించారని తెలిసింది. ఆహారం అందజేశారన్న అనుమానం ఉన్న వ్యక్తులను కూడా పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. సర్రాయిలో గ్రామదర్శినికి కిడారి  అరకులో బయల్దేరారనే సమాచారం కూడా ఆ గ్రామస్థాయి నాయకుడి ద్వారానే మావోయిస్టులకు చేరిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించి కాల్‌ డేటా విశ్లేషణలోనూ కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.
 

12:31 - October 2, 2018


బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వీరవనిత ఝాన్సీలక్ష్మీభాయి చరిత్ర ఆధారంగా చేస్తున్నచిత్రం.. మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ.. జాతీయస్ధాయి ప్రతిభకనబరచిన కంగనా టైటిల్ రోల్ చెయ్యబోవడం, బాహుబలి తర్వాత విజయేంద్ర ప్రసాద్ రచన చేపట్టడం, క్రిష్ డైరెక్ట్ చేస్తుండడంతో మణికర్ణికపై ముందునుండీ భారీ అంచనాలున్నాయి.. కట్‌చేస్తే.. కంగనా బిహేవియర్ కారణంగా ప్రాజెక్ట్ నుండి ఒకొక్కరుగా తప్పుకోవడం స్టార్ట్ చేశారు.. దీంతో సినిమాని పూర్తిచేసే బాధ్యత తనపైనే వేసుకుంది కంగనా..
ఇండిపెండెన్స్‌డే రోజు ఫస్ట్‌లుక్ లాంచ్ చేసి, గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు మణికర్ణిక టీజర్ రిలీజ్ చేశారు..
బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌తో మొదలైన మణికర్ణిక టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది.. ప్రశాంతమైన ప్రకృతి, నదీజలాల విజువల్స్‌తో  స్టార్ట్ చేసి, భారతదేశంలోకి అడుగుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ జెండాని చీలుస్తూ ఝాన్సీ ఎంటర్ అవడం చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం.. మహారాణిగా, ఓ బిడ్డకి తల్లిగా.. విభిన్న పాత్రలు పోషాస్తూ, వీర వనితగా గుర్రపుస్వారీ చేస్తూ, శివంగిలా శత్రుసైన్యాన్ని గడగడలాడించిన ఝాన్సీలక్ష్మీభాయి ఇలాగే ఉండేదేమో అన్నంత అద్భుతంగా ఉంది టీజర్‌లో కంగనా రనౌత్ వీరోచిత నటన.. ముఖ్యంగా యుద్ధసన్నివేశాల్లో ఆమె కత్తి తిప్పిన విధానం చాలాబాగుంది..  భారీసెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.. నేపధ్యసంగీతం కూడా బాగా కుదిరింది.. తనపై వచ్చిన విమర్శలకి మణికర్ణిక టీజర్‌‌తో కంగనా  స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చినట్టుంది.. రిపబ్లిక్ డే  సందర్భంగా 2019 జనవరి 25న మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ..  గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది..

12:27 - October 2, 2018

హైదరాబాద్ : ఒక రియాల్టీషోలో పాల్గొంటేనే ఇంతటి ప్రేమ ఎవరికైనా సాధ్యమేనా? అంతటి ప్రేమ కురిపించటానికి వారేమైన తోడబుట్టినవారా? లేక పిల్లనిచ్చినవారా? లేకుంటే స్నేహితులా? అంటే వీరెవరూ కాదు. ఒంటరి పోరాటంలో విజేతగా నివటానికి 16 మందిలో వుండికూడా ఒంటిరిపోరు సలిపి 100రోజులకు పైగా నిప్పులమీద కుంపటిలా విజయం కోసం ఆరాటపడి..నిలిచి..గెలిచిన ఓ సామాన్యుడి అసామాన్య గెలుపు బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచి కౌశల్ గెలుపు. ముక్కూ మొహం తెలియని వ్యక్తులు కౌశల్ విజయానికి కారకులు.వారి రుణం తీర్చుకోలేదని తెలిపిన కౌశల్ వారి కోరిక మేరకు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని అభిమానులను కలుసుకుని వారి ప్రేమను పంచుకుంటానని తెలిపాడు. 
టాలీవుడ్ లో అత్యంత ఉత్కంఠను రేపిన బిగ్ బాస్ సీజన్ - 2 విజేత కౌశల్, ఇప్పుడు అభిమాన వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. తనను గెలిపించిన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు చెబుతూ ఆయన ఫేస్ బుక్ లో లైవ్ కు వచ్చిన వేళ, తమ ఊరికి రావాలంటే, తమ ఊరికి రావాలంటూ అభిమానులు కోరిన కోరికలను చూసి, ఆయన ఉద్వేగానికి గురయ్యాడు. 
హౌస్ లో ఉన్న తనకు బయట ఇంతమంది అభిమానులు ఉన్నారని తెలియదని, 'కౌశల్ ఆర్మీ' అంటూ ఒకటి ఏర్పడిందని, వారి కారణంగానే తాను విజయం సాధించానన్న విషయం బయటకు వచ్చిన తరువాతే అర్థం అయిందని ఈ సందర్భంగా కౌశల్ వ్యాఖ్యానించాడు. తనను గెలిపించేందుకు అభిమానులు వేసిన ప్రతి ఓటునూ తాను మరచిపోలేనని అన్నాడు. ఈ విజయం తనకెంతో స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపాడు. త్వరలోనే అభిమానులను కలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని తెలిపాడు. కాగా, తన భార్య, బిడ్డలతో కలసి లైవ్ లోకి వచ్చిన కౌశల్, ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. 

12:00 - October 2, 2018

కర్ణాటక : ఉగ్రవాదుల అరాచకాలకు పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీరి అకృత్యాలకు ఎందరో అమాయకులు కూడా బలైపోతున్నారు. పవిత్ర యుద్ధం పేరుతో వీరు చేసే మారణకాండలకు వేలాది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రామనగర ప్రాంతంలో గత నెలలో సోదాలు జరిపిన ఎన్‌ఐఏ అధికారులు, జేఎంబీ టెర్రరిస్ట్‌ మునీర్‌ ను అరెస్టు చేశారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా హత్యకు కుట్ర చేసినట్టు కర్ణాటకలో ఇటీవల పట్టుబడిన ఓ ఉగ్రవాది వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌ కు చెందిన మునీర్, తమ దేశంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేశాడు. బంగ్లాదేశ్ లో పోలీసులు గాలిస్తుండడంతో ఇండియాలోకి చొరబడిన మునీర్, బట్టల వ్యాపారిగా అవతారం మార్చి కన్నడనాట ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతని వ్యవహారాలపై నిఘా వేసిన ఎన్‌ఐఏ అరెస్ట్ చేసి విచారించింది.

దలైలామా తరచుగా మైసూరుకు దగ్గరలో ఉన్న బైలుకుప్పె ప్రాంతంలోని టిబెటన్‌ పునరావాస కేంద్రానికి వస్తుంటారన్న సంగతిని పసిగట్టిన మునీర్, ఆయన వచ్చిన వేళ, హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ పని చేస్తే, భారత్‌ తో పాటు పలు దేశాల్లో చిచ్చు పెట్టవచ్చన్నది ఆయన వ్యూహం. ఈ సంవత్సరం జనవరి 18న బిహార్‌ లోని బుద్ధగయలో జరిగిన ఓ కార్యక్రమంలో బాంబు పేల్చడం ద్వారా దలైలామా, ఆయనతో పాటు ఇదే కార్యక్రమంలో పాల్గొనే బిహార్‌ గవర్నర్‌ లను హత్య చేయాలని కుట్ర చేసినట్టు కూడా మునీర్ చెప్పినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి.

11:28 - October 2, 2018

చిత్తూరు : వి.కోట మండలం కృష్ణాపురం గ్రామ పంచాయితీలోని కొమ్మరమడుగు చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. విదేశాల నుండి వలస వచ్చే పక్షులకు కరెంట్ షాక్ తగిలింది.దీంతో మూడు పక్షులకు హైఓల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో గ్రామస్థులు వెటర్నరీ ఆసుపత్రికి మూడు పక్షులను చికిత్స నిమిత్తం తరలించారు. వెంటనే వైద్యం ప్రారంభించారు. వైద్యం కొనసాగుతోంది. 

 

11:08 - October 2, 2018

కేరళ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు నేపథ్యంలో ఆలయ బోర్డు మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పంపానది వద్ద మహిళల కోసం ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక టాయిలెట్లు, బస్సుల్లో మహిళలకు సీట్లలో రిజర్వేషన్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం బోర్టు సన్నాహాలు చేస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పంపానది నుంచి సన్నిధానం వరకు ఉన్న అడవి మార్గంలో లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేశన్‌ వెల్లడించారు. మహిళల కోసం ‘మహిళా మిత్ర’ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని, నీలక్కల్-పంప మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తామని పేర్కొన్నారు. అయితే, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేయడం అసాధ్యమని, కాబట్టి వారు పురుషులతో కలిసే వెళ్లాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
 

 

11:08 - October 2, 2018

అలనాటి ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు రాజ్ కపూర్ సతీమణి కృష్ణరాజ్ కపూర్ (87), కార్డియాక్ అరెస్ట్ కారణంగా సోమవారం‌ ఉదయం తన స్వగృహంలో కన్నుమూసారు..
కార్డియాక్ అరెస్ట్‌తోపాటు, వయసు పైబడడం వలన అమ్మ సోమవారం‌ తెల్లవారుజామున పరమపదించారు.. ఆమె మరణం మా కుటుంబానికి తీరనిలోటు అంటూ ఆమె తనయుడు రణధీర్ కపూర్ విచారం వ్యక్తంచేశారు.. 1946లో రాజ్ కపూర్, కృష్ణరాజ్ కపూర్‌ల‌ వివాహం జరిగింది.. వీరికి రిషి కపూర్, 
రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, రీతూ నందా, రీమా కపూర్ అయిదుగురు సంతానం.. కరిష్మా కపూర్, కరీనా కపూర్, రణబీర్ కపూర్‌లు కృష్ణరాజ్ కపూర్ మనవలు... అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు..
అనుపమ్ ఖేర్, రవీనా టాండన్, సోహా అలీఖాన్ ఆమె మృతిపట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలియచేసారు.. 


 
 
 

10:50 - October 2, 2018

శ్రీకాకుళం : అరసవల్లి శ్రీసూర్య నారాయణ స్వామి దేవాలయంలో మూడేళ్ల తరువాత నాలుగవ సంవత్సరంలో ఈ ఉదయం ఆదిత్యుని కిరణాలు పూర్తి స్థాయిలో స్వామివారిని తాకాయి. నిన్న పాక్షికంగా కేవలం మూలవిరాట్టు ముఖంపై మాత్రమే పడిన కిరణాలు, నేడు ఆపాదమస్తకం స్వామిని ఆక్రమించాయి. దీంతో భక్తులు పులకించిపోయారు. గడచిన మూడు సంవత్సరాలుగా మేఘాలు అడ్డువస్తుండటం, అల్పపీడనాల ప్రభావంతో సూర్య కిరణాలు ఆదిత్యుని చెంతకు చేరలేకపోయాయి.
ఈ ఉదయం బంగారు ఛాయలోని లేలేత కిరణాలు స్వామిపై పడటం, పాదాల నుంచి ముఖం వరకూ కమ్మేయడంతో స్వామివారు మెరిసిపోయారు. దీంతో భక్తులు పరమానంద భరితులయ్యారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు సూర్యడి కిరణాలు అరసవల్లి సూర్య నారాయణుని తాకుతాయన్న సంగతి తెలిసిందే. కాగా, రేపు కూడా స్వామివారిపై కిరణాలు పడే అవకాశాలు ఉన్నాయని ఆలయ పూజారులు వెల్లడించారు.

 

10:27 - October 2, 2018

ఇండోనేషియా : అందమైన ప్రకృతితో అలరారే సుంబాదీవి అతలాకుతలంగా మారిపోయింది. పచ్చని చెట్లు, అందమైన జలపాతాలతో ఆకట్టుకునే సుంబాదీని ప్రకృతి విలయానికి అల్లాడిపోయింది. ఈ తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం రాగా, వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. నాలుగు రోజుల నాడు సంభవించిన భూకంపం, ఆపై వచ్చి సునామీ నుంచి ఇండోనేషియా పూర్తిగా తేరుకోకముందే మరో భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. సులవేసి దీవి ఇప్పటికే నామరూపాలు లేకుండా పోగా, తాజాగా వచ్చిన భూకంపం సుంబాదీవిని అల్లాడించింది. 
సుంబాదీవిలో ఇప్పటివరకూ 32 మంది మరణించినట్టు వార్తలు అందుతుండగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు రెండుగా చీలిపోయాయని, భవంతుల కింద వందలాది మంది చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల నిమిత్తం సిబ్బందిని సుంబాదీవికి పంపుతున్నామని తెలిపారు.

09:20 - October 2, 2018

హైదరాబాద్ : ఎప్పటికైనా నీతి, నిజాయితీలదే గెలుపు అని బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ద్వారా మరోసారి నిరూపితమైంది. మొత్తం 16మంది బిగ్ బాస్ సభ్యుల్లో ప్రేక్షకుల ఆదరణను చివరి వరకూ తన సంకల్పంతో, నిజాయితీతో, పట్టుదలతో గెలుచుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు..బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు కౌశల్. ఇప్పటి వరకూ ఎన్నో భాషల్లో బిగ్ బాస్ నిర్వహించినా..ఏ నటుడికీ..ఏ సెలబ్రిటీకి రానంత ఆదరణ, ప్రేమ, గౌరవం దక్కించుకున్నాడు కౌశల్. 16మంది సభ్యుల్లో బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులకు పైగా ఒంటరి పోరాటం చేసి ఓపికతో సహనంతో తాను నమ్మినదానినే చివరివరకూ కొనసాగించి విన్నర్ గా నిలిచాడు కౌశల్. తాను విన్నగా నిలిచింనందుకు అభిమానులందరితో తన సంతోషాన్ని పంచుకున్నాడు. పట్టుదలతో స్వయంకృషితో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని బిగ్ బాస్ 2 విన్నర్ గా నిలిచి తనకు అందిన పారితోషికాన్ని తన తల్లి క్యాన్సర్ తో మృతి చెందిందనీ..అందుకు ఆ మొత్తాన్ని క్యాన్సర్ రోగులకు వినియోగిస్తానని తెలిపి మరోసారి తన ఉదారతను చాటి చెప్పాడు కౌశల్. ఈ క్రమంలో తాను బిగ్ బాస్ లోకి ఎలా ఎంటర్ అయ్యింది. దానికి కారణం ఎవరో తెలిపాడు కౌశల్..
తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వెనక టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు ప్రోత్సాహం ఉందని బిగ్‌బాస్-2 విజేత కౌశల్ తెలిపాడు. మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’తోనే తమ మధ్య సాన్నిహిత్యం ఉందన్న కౌశల్.. మహేశ్ బాబు లేకుంటే తాను లేనంటూ కౌశల్ చెప్పిన వీడియోను ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
తాను బిగ్‌బాస్‌కు వచ్చానంటే దానికి కారణం మహేశ్ బాబేనని కౌశల్ అన్నాడు. హైదరాబాద్‌లో తొలిసారి మోడలింగ్ అకాడమీ ఏర్పాటు చేసింది తానేనన్న కౌశల్.. అందుకోసం మహేశ్ ఎంతో సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు. రాజకుమారుడు సినిమా సమయంలో దగ్గురుండి అకాడమీని ఏర్పాటు చేయించినట్టు చెప్పాడు. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఎంతో సాయం చేశారని పేర్కొన్నాడు. ఆ ఏజెన్సీ లేకపోతే తానెప్పుడో తిరిగి వైజాగ్ వెళ్లిపోయి ఉండేవాడినన్నాడు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన కౌశల్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపాడు.  
 

08:42 - October 2, 2018

ఢిల్లీ : ఇకపై రైళ్లలో శాకాహారులు, మాంసాహారులకు వేర్వేరు సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరికీ ఒక దగ్గరే సీట్లు కేటాయించడం వల్ల శాకాహారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఇద్దరికీ వేర్వేరుగా సీట్లు కేటాయించేలా రైల్వేను ఆదేశించాలంటూ..  అహ్మదాబాద్‌కు చెందిన 67 ఏళ్ల సయీద్..  గుజరాత్ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. శాకాహారులు, మాంసాహారులకు వేర్వేరు సీట్లు కేటాయించడం వల్ల ఒకరి ఆహారపు అలవాట్ల వల్ల మరొకిరికి ఇబ్బంది ఉండదని పిటిషనల్‌లో పేర్కొన్నారు.  టికెట్ రిజర్వేషన్ సమయంలో వారు శాకాహారులా? మాంసాహారులా? అనే విషయం తెలుసుకుని సీట్లు కేటాయించేలా రైల్వే శాఖను ఆదేశించాలని పిటిషనర్ కోరాడు. దీనివల్ల కేటరింగ్ సిబ్బందికి కూడా ఆహార సరఫరా మరింత సులభం అవుతుందన్నారు. అయితే వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు రానుంది.

08:15 - October 2, 2018

హైదరాబాద్ :  తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రోజురోజుకు  రాజుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలపై వాగ్ధానాల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పోరాడుతున్న బీజేపీ ప్రజాకర్షక మేనిఫెస్టో తయారీకి రంగం సిద్ధం చేసింది. పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశమైన పార్టీ రాష్ట్ర నాయకత్వం మేనిఫెస్టోలో ఉండాల్సిన విషయాలపై చర్చించింది. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్తుకు తమ మేనిఫెస్టో ఉపయోగపడుతుందన్నారు. 15వ తేదీకల్లా మేనిఫెస్టోకు తుదిరూపం ఇవ్వనున్నట్టు చెప్పారు.

బీజేపీ మేనిఫెస్టో కమిటీ రూపొందించిన ముసాయిదా మేనిఫెస్టో ప్రకారం.. భాగ్యనగరంలో అద్దెకు ఉంటున్న ప్రతీ కుటుంబానికి నెలకు రూ.5వేలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. నీటి పన్నును ఆరు రూపాయలు వసూలు చేస్తారు. కాలుష్య నియంత్రణకు ఆటో, వ్యాన్ మార్పిడి పథకం. డప్పు కొట్టే వారు, చెప్పులు కుట్టే వారికి నెలకు రూ.3వేల పింఛన్. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఉచిత విద్యుత్. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు. డిగ్రీ పైస్థాయి ఉద్యోగులకు ఉచిత ల్యాప్ టాప్‌లు. 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలకు, చేతి, కుల వృత్తుల వారికి రూ.3 వేల పింఛన్. ప్రతీ ఏడాది ఉద్యోగాల భర్తీగా బీజేపీ మేనిఫెస్టో రెడీ అవుతోంది.
 

07:44 - October 2, 2018

హైదరాబాద్ : తెలంగాణలోని ఆన్‌గోయింగ్‌ పథకాల అమలుకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీకి ఎలాంటి ఆటంకం లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 5 నుంచి చెక్కుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే వీటిని లబ్దిదారులకు నేరుగా ఇవ్వాలా.. లేక వారి అకౌంట్స్‌లో జమ చేయాలా అనేదానిపై ఓ స్పష్టత రాలేదు.
రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీపై అనుమానాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలపై కాస్త సందిగ్దత నెలకొంది. ప్రజలను ఆకర్షించే పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని రాజకీయ పార్టీల నేతలు ప్రతిరోజు ఎన్నికల కమిషన్‌కు కంప్లైంట్‌ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ఏడాది మే నెలలో రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఎనిమిది వేలు ఇచ్చేందుకు సర్కార్‌ ప్రవేశపెట్టిన పథకం రైతుబంధు పథకం. అయితే తొలివిడతలో చిన్న చిన్న విమర్శలు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ కార్యక్రమం మాత్రం సక్సెస్‌ఫుల్‌గా సాగింది.  సర్కార్‌కు మంచి మైలేజ్‌ తెచ్చిపెట్టింది.
రైతుబంధు, బతుకమ్మ చీరల పథకాల కొనసాగింపుకు లైన్‌క్లియర్‌
రెండు విడతల్లో ఇవ్వవాల్సిన పంట పెట్టుబడి సాయం ఈ అక్టోబర్‌లోనే అందించాలి. కానీ అనూహ్యంగా ప్రభుత్వం రద్దుకావడంతో రెండోదఫా రైతుబంధు చెక్కుల పంపిణీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సెప్టెంబర్‌ 6న కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీ రద్దు చేసిన  రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఈసీ స్పష్టపరిచింది. దీంతో అటు రైతు బంధు , ఇటు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అటు రాజకీయ పార్టీలు కూడా వీటిని నిలిపివేయాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశాయి. అయితే ప్రభుత్వ రద్దుకు ముందు ప్రారంభించిన పథకాలు కాబట్టి, వీటి కొనసాగింపు కోడ్‌ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంపై ఈసీ రజత్‌కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. సీఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తంకాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ అధికారులు చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈనెల 5 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ సీఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తకాకపోవడంతో సీఎస్‌ రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  చెక్కుల ప్రింటింగ్‌పై వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పార్థసారధి బ్యాంకర్లతో భేటీ అయ్యారు.  చెక్కులను ముద్రించి రెడీగా ఉంచాలని ఆదేశించారు.  మొత్తం 58 లక్షల మంది రైతులకు 7 బ్యాంకులతో పంపిణీ చేయాలన్నారు. ఈనెల 5 నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమం కేవలం అధికారులతోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బతుకమ్మ చీరల పంపిణీకి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్టే తెలుస్తోంది. దసరాకు బతుకమ్మ చీరల పంపిణీకి రెడీ అవుతున్నారు.

 

07:19 - October 2, 2018

అమరావతి : ఏపీలో నేటి నుంచి ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ప్రారంభం కానుంది.. ఉండవల్లి ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. భూమి ఉన్న వారినీ  అర్హులుగా పరిగణించాలని  కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉన్నా నమోదు కాని 20వేల మందికి లబ్ది చేకూరనుంది. అప్రెంటిషిప్‌లో 1500 ప్రోత్సహకం ఇచ్చేందుకూ పరిశీలన జరగుతోంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. 

ఇవాళ ఉండ‌వ‌ల్లి ప్రజావేదిక‌లో యువ‌నేస్తం కార్యక్రమం ప్రారంభం జ‌ర‌గ‌నుంది.  ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కూ జ‌ర‌గనున్న కార్యక్రమంలో..  సీఎం ఈ పథకం ముఖ్య ఉద్దేశం గురించి ప్రసంగిస్తారు. ఇటీవ‌ల ప్రారంభమైన ప్రఖ్యాత కంపెనీలు యువ‌త‌కు క‌ల్పిస్తున్న ఉపాధి, కార్యక్రమాల‌ను ఆయా కంపెనీల ప్రతినిధులు వివరిస్తారు. 2ల‌క్షల‌ మందికి పైగా నిరుద్యోగులకు  బ్యాంకు ఖాతాల‌ో  జమ కానుంది. అర్హతన ఉన్నా నమోదు కాని 20వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది.  అప్రెంటిషిప్‌లో 1500 ప్రోత్సహకం ఇచ్చేందుకు  పరిశీలిస్తున్నారు.

ఈ సందర్భంగా 400 మంది ల‌బ్ధిదారుల‌తో సీఎం మాట్లాడనున్నారు. ఇదే స‌మ‌యానికి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల‌లోని.. 175 నియోజ‌క‌వ‌ర్గాల‌్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రాల‌్లో మంత్రులు, నియోజ‌వ‌క‌ర్గాల‌్లో  ఎమ్మెల్యేలు హాజ‌రు కానున్నారు. సీఎం ప్రసంగం  ప్రత్యక్ష ప్రసారం పూర్తయ్యాక  ఎక్కడికక్కడ అర్హులకు యువ‌నేస్తం స‌ర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నారు.

పొరపాటున భృతి వద్దనుకున్న వారికి.. 1100 నుంచి ఫోన్  చేసి తిరిగి అర్హులుగా గుర్తిస్తారు. ఈ పథకం కోసం  వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకున్న వారు 5,96,447 మంది, అర్హత సాధించిన వారు 2,06,642 మంది, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు 25,357, పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్య 73,270గా ఉన్నట్లు తెలిపారు.  నైపుణ్యాభివృద్ధికి తగు  శిక్షణతోపాటు ఇస్తారు. వారి అభిరుచి మేరకు  స్వయం ఉపాధి పథకాలకు  ప్రభుత్య కార్పొరేషన్‌ల తోడ్పాటు అందించేందుకు ఈ పథకాన్ని  ప్రవేశ పెట్టింది.
ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అంశాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. సర్వర్ ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు.  భూమి, కారు తదితర అంశాలపై అభ్యంతరాలుంటే వాటిని కూడా ఫిర్యాదు చేయొచ్చు. 2 నుంచీ 7 రోజుల్లో వాటిని పరిష్కరిస్తారు. అప్పటికీ అభ్యంతరాలుంటే..  పై అధికారికి పంపిస్తారు. ఎంపికైందీ లేనిదీ అభ్యర్థి మొబైల్‌కు వివరాలు అందుతాయి.

దరఖాస్తు ప్రక్రియ నిరంతర జరుగుతూ ఉంటుంది. రాష్టంలోని అర్హులైన నిరుద్యోగులందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.దీంతో భవిష్యత్తులో రాష్ట్రంలో ఏర్పాటయ్యే  పలు పరిశ్రమల్లో ఉపాధి పొందేందుకు  సాంకేతిక పరిజ్ఞానాన్నిపెంపొందించుకొనేలా తీర్చి దిద్దడం జరుగుతుంది.

 

06:54 - October 2, 2018

ఢిల్లీ : శారీరక బలంతో కాదు.. సంకల్ప బలంతోనే శక్తి పుడుతుందన్నగాంధీజీనే అందుకు ఉదాహరణ. స్వరాజ్యం, స్వపరిపాలన గురించి కలలుగన్న మహనీయుడు. విశ్వమానవునిగా ఎనలేని కీర్తి పొందిన గాంధీమహాత్ముని 150వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను భావితరాలకు అందిస్తూ.. మనసా వాచా స్మరించుకుందాం..
నేడు గాంధీ మహాత్ముడి 150వ జయంతి.   ప్రేమ, త్యాగం, సేవను  నిత్యం ఆచరించి చూపిన ఆదర్శ వంతుడు మన బాపూజీ.  ఏడు దశాబ్దాల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా  ఆయన బాటే   ఏకైక మార్గంగా నిలిచిందంటే ఆయన గొప్పతనమేంటో తెలుస్తోంది.    స్వేచ్ఛా, స్వాతంత్రాలకోసం అహింసాయుతంగా పోరాడిన ఆదర్శమూర్తి.  తెల్లదొరల నుంచి భారతమాతను విముక్తం చేసిన సాహసి. అహింసా అనే ఆయుధంతో యావత్‌ భారతీయులను ఏకంచేసిన మహానేత. జనాందోళనలతో బ్రిటీష్‌వారిని ఎదురించి చివరికి స్వాతంత్యాన్ని సాధించిన గొప్ప స్వాప్నికుడు. అందుకే ఆయన దేశపిత అయ్యాడు. భారతదేశ ప్రజల మదిలో ఎప్పటికీ  చెదిరిపోని సంతకం అయ్యారు.  
స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీజీ ఏనాడు తాను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ వదిలిపెట్టలేదు. హింసామార్గంలో ఎప్పుడూ వెళ్లలేదు. ఎప్పుడూ అహింసా మార్గంలోనే తన ఉద్యమాన్ని నడిపించాడు. ఆ అహింసా అనే ఆయుధంతోనే స్వాతంత్ర్యాన్ని సాధించాడు. అహింసా, సేవ ఆయుధాలుగా బాసిల్లిన మహాత్ముడు.. విశ్వమానవుడై చిరంజీవిగా నిలిచిపోయారు. 
 
బాపూజీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాజ్‌కోట్‌లో  ప్రధాని మోదీ మ్యూజియంను ప్రారంభించారు. స్థానిక ఆల్ఫ్రెడ్ హై స్కూల్‌లో  నిర్మించిన మ్యూజియంలోని మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రధాని. 1887లో మహాత్మాగాంధీ ఇక్కడే మెట్రిక్యులేషన్ చదివారు. మినిట్స్ బుక్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు.నోట్లు వెదజల్లి కోట్లు దండుకోవాలని చూస్తున్న నేటి తరం నేతలకు.. కుర్చీపట్టుకుని వేలాడకండి అన్న గాధీజీ మాట చెవికెక్కుతుందా.. ప్రతి ఒక్కరూ సేవాతత్పరతతో మెలగాలన్న ఆయన సూచనలు పాటించేవారు  నేడు దేశంలో కరువవుతున్నారు. దండలు, దండాలు పక్కనబెట్టి ఆయన అడుగుల్లో అడుగేయడమే అయనకు మనం అర్పించే అసలైన నివాళి.

 

Don't Miss