Activities calendar

03 October 2018

18:36 - October 3, 2018

నిజామాబాద్ : ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాుడుతు..ఏసీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేతల ప్రచారానికి చంద్రబాబు కోట్ల రూపాయలు ఇస్తాడట..ఏడు మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. కరెంటు ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసుడు చంద్రబాబు. ప్రాజెక్టులకు అడ్డంపడ్డ దుర్మార్గుడు చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఆయనతో పొత్తు కూడతారా? అమరావతి గులాంలు, ఢిల్లీ గులాంలు కావాలా? మన పాలన మనకే కావాలా?’ అని సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు.

18:19 - October 3, 2018

నిజామాబాద్ : ప్రజా ఆశీర్వాదసభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదని విమర్శించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదని ఆజాద్ ఆరోపించారనీ..టీఆర్ఎస్ పాత్ర లేకుంటే ఆజాద్ అయ్య పాత్ర ఉందా? గులాంలకు బుద్ధి చెప్పాలంటే నిజామాబాద్ లో 9 స్థానాలు గెలవాలని నిజామాబాద్ ప్రజాశీర్వాద సభ వేదికనుండి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

 

17:56 - October 3, 2018

నిజామాబాద్ : ముందస్తు ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ లో నిర్వహించే సభలో కేసీఆర్ మాట్లాడుతు..తెలంగాణలో ఎన్నికల్లో పొత్తుల విషయంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని..అటువంటి టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటం సిగ్గుచేటని...ఇదేనా మీ బతుకులు అంటు విరుచుకుపడ్డారు. తెలంగాణను అమరావతికి తాకట్టు పెడతారా? ‘చంద్రబాబుతో పొత్తు కలుస్తారా! థూ..మీ బతుకులు చెడ’ అని కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘ఇవొక బతుకులా! ఎవడైతే తెలంగాణను నాశనం చేశాడో, గుండు కొట్టిండో.. చంద్రబాబుతో పొత్తా? మీ బతుకులకు. అడుక్కుంటే నేను ఇస్తాను.. నాలుగు సీట్లు. ఇదా మీ బతుకు! దయచేసి, తెలంగాణ మేథావులకు, పెద్దలకు నేను మనవి చేస్తున్నా.. మళ్లీ ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా అధికారం? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకెట్టు పెడతారా? కాంగ్రెస్ పార్టీ వాళ్లు పరాన్న భుక్కులు.. వీళ్ల చేతుల్లో ఏమీ ఉండదు’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న సొల్లు పురాణాలు, పిచ్చికూతలు టీ-కాంగ్రెస్ నేతలు కూస్తున్నారని మండిపడ్డారు. సీట్లు కావాలంటే నేనే ఇచ్చావాడని కానీ ..తెలంగాణలో రాజకీయ అస్థిరత తేవాలని చంద్రబాబు పలువిధాలుగా యత్నించారనీ..ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ పార్టీతో పొత్తు పెట్టుకేనేందుకు మీకు సిగ్గులేదా? అంటు విరుచుకుపడ్డారు. 
తెలంగాణ, నిజామాబాద, కేసీఆర్, ప్రజాశీర్వాద సభ, ఏపీ, సీఎం, చంద్రబాబు,  టీడీపీ,కాంగ్రెస్, పొత్తులు, విమర్శలు, 

 

17:43 - October 3, 2018

నిజామాబాద్ : టీఆర్ఎస్ ప్రజాశీర్వాద భారీ బహిరంగసభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతు..నిజామాబాద్ పౌరుషానికి ప్రతీకగా నిలిచిందని..గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారనీ.. తెలంగాణ ఉద్యమంలోను జిల్లా పాత్ర ప్రాధాన్యత కలిగిందన్నారు. ఈరోజు కాంగ్రెస్ నేతలు రూ.2వేల పెన్షన్ ఇస్తామంటు ఓట్లు అడిగేందుకు వస్తున్నారనీ..వారి నోట రూ.2వేలు పలికించింది గులాబీ జెండాయేనని కేసీఆర్ కండువా ఎత్తి చూపెడుతు తెలిపారు. 452 పథకాలను మేనిఫెస్టో లేనివి కూడా అమలు చేస్తున్నామన్నారు. 
టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టేనాటికి అన్నీ సంక్షోభాలనే వున్నాయనీ..శిథిలమైపోయిన చెరువులు, తాగు,సాగునీరు వంటి కరవు పరిస్థితుల నుండి ఈనాడు జిల్లాలో పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయంటే కనువిందు చేస్తున్నాయంటే మన స్వపరిపాలనే కారణమన్నారు. స్వపరిపాలనలో కలల్ని సాకారం చేసుకునే దిశగా పయనిస్తున్నామని కేసీఆర్ అన్నారు. 24గంటలు విద్యుత్ సాధించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు.  ప్రతీ ఇంటికి తాగునీరే లక్ష్యంగా కొనసాగుతున్నామన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ విజయపథంలో కొనసాగుతోందని తెలిపారు. రూ.42వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని..త్వరలో పెన్షన్స్ కూడా పెంచబోతున్నామని తెలిపారు. ఆడపిల్ల పుట్టిననాటి నుండి ప్రతీ అంశంలోను టీఆర్ఎస్ బాధ్యత తీసుకుని ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచామని కేసీఆర్ పేర్కొన్నారు. 
తెలంగాణ, నిజామాబాద్, టీఆర్ఎస్, ప్రజాశీర్వాద సభ, కేసీఆర్, కాంగ్రెస్, కేసులు, పెన్షన్, మిషన్ భగీరథ, 

 

17:41 - October 3, 2018

నిజామాబాద్ :  టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ తట్టుకోలేని ప్రభుత్వంపై కేసులు పెడుతోందనీ..కాంగ్రెస్ పార్టీ అంటేనే కేసుల పార్టీ అని ఉ అంటే కేసు..ఆ అంటే కేసులు..కూర్చుంటే నిల్చుంటే..బాత్రూమ్ కెల్లినా కేసులు పెట్టేలా కాంగ్రెస్ తయారయ్యిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతీ విషయానికి పొద్దున్న లేచినకాడ్నుండి కాంగ్రెస్ లొల్లి లొల్లి చేయటమే కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతల బతుకే కేసులు.. ఊ అంటే కేసు.. ఉ.. పోస్తే కేసులు వేస్తారని ఎద్దెవా చేశారు కేసీఆర్. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. రైతుబంధు పథకం కింద నవంబర్ నెలలో యాసంగి పంటకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇస్తామని చెప్పినం. దీనిపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసు వేశారు. వాళ్ల బతుకే కేసు. ఊ అంటే కేసు.. ఉ.. పోస్తే కేసు. సొల్లు పురాణం చేస్తారు కాంగ్రెసోళ్లు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరెగి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోదామని చెప్పిన. ప్రజల వద్దకు వెళ్దామని చెప్పిన వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయంగానే గిలగిల కొట్టుకుంటున్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ వద్దకు పోయి అడ్డుకుంటున్నారు. ఎన్నికలకు పోదామా? అని ప్రశ్నించిన వారే.. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 
 

 

17:34 - October 3, 2018

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన జీవితంలో విలువైన అయిదేళ్ళ సమయాన్ని బాహుబలి కోసం కేటాయించాడు..దాని ఫలితంగా అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపుపొందాడు..
రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో చేస్తోన్న సాహో సినిమా షూటింగ్ కొంతభాగం విదేశాల్లో, మరికొంత భాగం హైదరాబాద్‌ఃలోనూ జరిగింది... ఇంతలో జిల్ ‌ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఇంకో సినిమా కూడా స్టార్ట్ చేసేసాడు...ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలని ఇటలీలో చిత్రీకరిస్తారట.. మూవీ యూనిట్ ఆల్‌రెడీ‌ ఇటలీలోనే ఉంది.. షూటింగ్ పర్మిషన్స్‌లో భాగంగా డార్లింగ్ అక్కడి గవర్నమెంట్ అఫిషియల్స్‌ని కలిసినప్పుడు తీసుకున్న ఫోటో.. ఇప్పుడు సోషల్ సైట్స్‌లో వైరల్ అవుతోంది.. ఆ ఫోటోలో ప్రభాస్ మీసాలు లేకుండా క్లీన్ షేవ్‌తో కత్తిలా ఉన్నాడు.. కాస్ట్యూమ్ కూడా డిఫరెంట్‌గా ఉంది.. 1950 కాలంలో ఇటలీలో జరిగిన ఒక అందమైన ప్రేమకథ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.. యు.వి.క్రియేషన్స్ అండ్ గోపికృష్ణ‌ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి...
ఈ నెల 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా సాహో‌కి సంబంధించి ఏదైనా న్యూ అప్‌డేట్ తెలిసే ఛాన్స్ ఉంది..

16:57 - October 3, 2018

హైదరాబాద్ : తమిళనాడు కు చెందిన  బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఉమ్మడి హైకోర్టులో టీటీడీ పై బుధవారం   పిటీషన్  దాఖలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని, దేవస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ నుంచి తప్పించాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. టీటీడీ మీద ఇటీవల కాలంలో  వచ్చిన ఆరోపణలు దేవస్థానం ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయి. 65 ఏళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణను టీటీడీ బోర్డు అమలు చేసింది. దీంతో అప్పటి వరకు ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రమణ దీక్షితులు టీటీడీ మీద  పలు  సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి నగలు, ఆభరణాలు, వజ్రాలు మాయం అయ్యాయంటూ  ఆయన ఆరోపించారు. ఇది అప్పట్లో  పెను దుమారం రేపింది.
           టీటీడీని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం నుంచి తప్పించాలంటూ గతంలో సుబ్రమణ్య స్వామి  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. నిబంధనల ప్రకారమే దేవస్థానం బోర్డు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుందని తెలిపింది. దీనిపై కావాలంటే హైకోర్టుకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో సుబ్రమణ్యస్వామి హైకోర్టు లో  బుధవారం  పిటీషన్ దాఖలు చేశారు. 
గతంలో శ్రీవారి ఆలయంపై పరిశోధన చేసేందుకు పురాతత్వ శాఖకు సహకరించాలంటూ కేంద్రం నుంచి వచ్చిన లేఖ పెనుదుమారం రేపింది. తిరుమల మీద కేంద్రం పెత్తనం చేసేందుకు రాష్ట్రం పరిధి నుంచి తప్పించే కుట్రలు చేస్తోందంటూ టీడీపీ ఆరోపించింది. అయితే, ఆ వివాదం సద్దుమణిగింది.

16:36 - October 3, 2018

ఢిల్లీ :  సాధారణ స్థాయి నుండి ప్రధాన మంత్రి స్థాయికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనే విషయం అందరికి తెలుసు. క్రమేపీ పార్టీలో ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రి..అనంతరం ప్రధానమంత్రి అయిన ప్రధాన మోదీని నమ్మిన ప్రజలు ప్రధానికి చేశారు. కానీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన మోదీ డీమానిటేష్ వంటి పథకాలతో అప్పతిష్టను మూటకట్టుకోవటమే కాక..భారతదేశపు ఆర్థిక వ్యవస్థనే ఛిన్నా భిన్నం చేసేసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఎన్నికల ప్రధాన అస్త్రంగా ఎన్డీయే వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతు..నరేంద్ర మోదీని నమ్మిన ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వగా, ఆయన దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారని..నమ్మిన ప్రజలను మోదీ మోసం చేశారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనను నమ్మాలని కోరారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మహాత్మాగాంధీ ఎంతో కృషి చేస్తే, ఇప్పటి ప్రధాని విభజించి పాలించాలన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.
"మీరు మోదీకి మద్దతిచ్చారు. ఆయన మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, మహాత్మా గాంధీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లి దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉన్న కాంగ్రెస్ ను నమ్మండి" అని ఆయన వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్ ను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థను వదిలేసి, అంబానీల సంస్థను ఎంచుకోవడం వెనకున్న కారణం ఏంటో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.

16:18 - October 3, 2018

భాగ్‌పత్ (ఉత్తర్ ప్రదేశ్) : ఒకే కుటుంబానికి చెందిన 13 మంది సభ్యులు ఇస్లాం నుంచి హిందూ మతానికి మారిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే ఓ ముస్లీం కుటుంబం బాదర్క గ్రామం నుంచి నవడా గ్రామానికి వలస వెళ్లారు. వారి కుటుంబంలోని వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. నిందితులను పట్టుకోవడంలో తమకు ఏ ఒక్కరూ సహాయం అందించకపోవడంతో పాటు తమకు దక్కాల్సిన న్యాయం దక్కనందున మతాన్ని మార్చుకుంటున్నట్టు కుటుంబ పెద్ద ప్రకటించాడు.  పోలీసులు కాని తమ మతానికి చెందిన వారు కాని తమకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని.. మతం మారడం వెనక ఎటువంటి తొందరపాటు లేదని తమంత తాముగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కుటుంబ పెద్ద వివరించాడు. దీనికి సంబంధించి కోర్టులో వీరు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కుటుంబానికి అండగా ఉంటామని యువ హిందూ వాహిని భారత్ నేత యోగేందర్ తోమర్ ప్రకటించారు.

13 మంది గల ఈ కుటుంబం శాస్త్రోక్తంగా అగ్నిగుండం ఏర్పాటు చేసుకొని జపాలతో మతం మారటం విశేషం.

15:52 - October 3, 2018

న్యూఢిల్లీ: అత్యాచార బాధితులు తమపై జరిగిన లైంగిక దాడిపై ఫిర్యాదు చేసేందుకు 30 ఏళ్లకు పెంచేందుకు కేంద్ర మహిళ, శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి మేనకా గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లడుతూ చిన్నతనంలో జరిగిన లైంగికదాడులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు మహిళలకు అవకాశం పెరుగుతుందని మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఎస్‌పీసీ) సెక్షన్ 468 ప్రకారం అత్యాచారం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలని పేర్కొంటోంది.

ఇటీవల బాలివుడ్ నటి తనుశ్రీ దత్తా నానా పటేకర్‌పై సినిమా సెట్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో మేనకా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన సంగతి విదితమే. 

తనుశ్రీ దత్తా సంఘటన నేపథ్యంలో నెటిజన్లు ‘‘#మీ టూ’’ అంటూ గ్రూపులుగా ఏర్పడి కామెంట్లు గుప్పించడంతో మరోసారి అత్యాచార బాధితుల ఫిర్యాదులపై చర్చ ప్రారంభమయ్యింది.  

‘‘మీ టూ ఇండియా’’ పేరుతో భారీ ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు. కనీసం కొంతమందైనా బాధితులు ముందుకువచ్చి ఫిర్యాదు చేస్తారన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.

15:51 - October 3, 2018

ఢిల్లీ : తెలంగాణ అడ్వకేట్స్ కు సుప్రీంకోర్ట్ షాక్ ఇచ్చింది. ఉద్యోగాలను స్థానికత ఆధారంగా విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.  ఉమ్మడి హైకోర్టులో తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. రోస్టర్ విధానంలోనే నియామకాలు చేపట్టాలని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం ఆదేశించింది. గతంలో హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారమే రోస్టర్ విధానంలో నియామకాలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది.
హైకోర్టులో జడ్జీలుగా ఏపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నందున విభజనలో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీంలో 2015లో పిటిషన్ దాఖలు చేసింది. సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే తెలంగాణ న్యాయాధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఉమ్మడి హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీనియారిటీ ప్రాతిపదికన జడ్జీల విభజన చేపడితే తెలంగాణ జడ్జీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదించారు .అందరికీ సమాన అవకాశాలు కల్పించే 371 (డి)ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం తరఫు లాయర్లు స్పందిస్తూ..371 (డి) న్యాయ శాఖకు వర్తించదనీ, ఈ పోస్టులకు దేశంలో ఎవరైనా పోటీ పడొచ్చని తేల్చిచెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం, రోస్టర్ విధానంలోనే జడ్జీల నియామకాలు చేపట్టాలని సుప్రీంకోర్టు తెలంగాణ లాయర్లకు తేల్చిచెప్పింది.

15:51 - October 3, 2018

మన టాలీవుడ్‌లో ఒకప్పుడు హిట్ సినిమాలు అంటే, వందరోజులు, నూటయాభై రోజులు, నూటడెబ్భై అయిదు రోజులు ఆడేవి.. ఇప్పుడు పరిస్ధితి‌ అలాలేదు... ఒక సినిమా నాలుగు వారాలపాటు ధియేటర్‌లో ఉంటే హిట్ కింద లెక్క.. చాలాకాలం తర్వాత నందమూరి బాలకృష్ణ లెజెండ్ చిత్రం రాయలసీమలోని ఒక ఏరియాలో పదకొండు వందల రోజులకుపైగా ఆడి, రికార్డ్ నెలకొల్పింది... ఈ సంవత్సరం జైసింహా, రంగస్ధలం, భరత్ అనే నేను సినిమాలకు యాభై మరియు వందరోజుల పోస్టర్స్ పడ్డాయి.. ఆగష్టు 15వతేదీన చిన్న సినిమాగా విడుదలై విజయఢంఖా మ్రోగించిన గీతగోవిందం మూవీ ఇవాళ్టితో (అక్టోబర్3వ తేది) విజయవంతంగా యాభై రోజులు పూర్తిచేసుకుంది..
జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై, మెగాప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, విజయ్ దేవరకొండ, రష్మికా జంటగా, పరశురామ్ డైరెక్షన్‌లో బన్నీవాసు నిర్మించిన గీత గోవిందం తమిళ్‌లోనూ బాగా ఆడింది... అంతేకాక, రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లోకి ఎంటరై మరో అద్భుతమైన ఘనతని సొంతం‌ చేసుకుంది..
విజయ్,  రష్మికల నటన, గోపీసుందర్ సంగీతం, పరశురామ్ దర్శకత్వ ప్రతిభ కలిసి ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళాయి... యూత్‌కి విపరీతంగా నచ్చేసిన గీత గోవిందం మూవీ నేటితో 59 సెంటర్స్‌లో 50 రోజులు పూర్తిచేసుకుని, 100 రోజుల దిశగా పరుగులు పెడుతుంది..

15:34 - October 3, 2018

తూర్పుగోదావరి :  స్వామివారికి నిత్యం పూజలు నిర్వహించే పూజారి..భక్తుల కోరికలను స్వామివారికి తెలుపుతు అర్చనలు చేసే అర్చకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆలయ పాలక మండలి తనను మానసికంగా వేధిస్తున్నారనీ ఓ అర్చకుడు ప్రాణాలు తీసుకున్నాడు. అర్చకత్వ బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగాడు. దీంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. 
కోరుకొండ మండలం కణుపూరు శివాలయంలో మల్లికార్జున శర్మ గత 30 ఏళ్లుగా అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆలయ పాలక మండలి శర్మను ఇటీవల విధుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో నిన్న సెల్ఫీ సూసైడ్ వీడియోను శర్మ తీసుకున్నాడు. అందులో ఆలయ పాలకమండలి వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నట్లు ఆరోపించాడు. పాలకమండలి  సభ్యులు పగబడ్డి తనను విధుల నుంచి తప్పించారని మల్లికార్జున శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
తన ఆత్మహత్యకు కారకులైవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన శర్మ.. వారి పేర్లను సెల్ఫీ వీడియోలో ప్రస్తావించాడు. అధికారులు సరైన చర్యలు తీసుకోకుంటే తన స్థానంలో వచ్చే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. గుప్త నిధుల తవ్వకాలు జరిపామని తనపై, తన కుంటుంబ సభ్యులపై నిందలు మోపిన వారిని విడిచిపెట్టొద్దని కోరాడు.

15:07 - October 3, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సంసిద్ధంగా వున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బిజీ బిజీగా ప్రచారాలు చేసేస్తున్నారు కూడా. చిన్నా చితకా పార్టీలు కూడా కూటమి కట్టేందుకు..సీట్ల పంపకాల విషయంలోను మీటింగ్ ల మీద మీటింగ్ లు పెట్టుకుంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఎన్నికల తేదీని మాత్రం ప్రకటించలేదు. కానీ మీడియా వారు మాత్రం నవంబర్ 24న తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తామని తాను చెప్పినట్లు కొన్ని టీవీలు, పత్రికలు ప్రచారం చేయడం పట్ల అసహనం రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఈసీ వర్క్ షాప్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజత్ కుమార్ మాట్లాడుతు..మీడియాలో వస్తున్న వార్తలపై జిల్లాల ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా రజత్ కుమార్ సూచించారు. వచ్చే నెల 24న ఎన్నికలు నిర్వహిస్తామని తాను చెప్పినట్లు అసత్యపు వార్తలు రాయడం సరికాదని మీడియాకు సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఎన్నికల వార్తలపై కూడా పూర్తిస్థాయిలో నిఘా పెడుతున్నామని స్పష్టం చేశారు.తప్పుడు వార్తలు రాసినా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

13:10 - October 3, 2018

ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందిన అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్, నిన్న హైదరాబాద్‌లోని నొవాటెల్‌లో జరిగిన సంగతి ‌తెలిసిందే..  తారక్ తండ్రి నందమూరి హరికృష్ణ గారు దుర్మరణం చెందిన నేపధ్యంలో, ఈ కార్యక్రమం ఆద్యంతం ఉద్వేగ భరితంగా కొనసాగింది.. 
అన్నదమ్ముళ్ళు తారక్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఫంక్షన్ జరిగినంతసేపూ ఎమోషనల్‌గానే ఉన్నారు..
కళ్యాణ్ రామ్ మాట్లాడుతున్నంతసేపూ ఎన్టీఆర్ ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు..
కళ్యాణ్ రామ్ మాటలతోపాటు, పెనిమిటి పాటలోని కొన్నిలైన్స్ పాడి కంటతడి పెట్టిస్తే, తారక్ ఈ ఒక్క సినిమా చూడడానికైనా నాన్నగారు ఉండాల్సింది అంటూ ఎమోషనల్ అయ్యాడు.. 
తారక్, కళ్యాణ్ రామ్‌ల బాండింగ్, తండ్రి‌ పై వారికున్న ప్రేమనిచూసి.. ఫంక్షన్‌కి అటెండ్ అయిన అభిమానులే‌ కాక, లైవ్‌లో ,చూసిన ప్రేక్షకులు సైతం కంటతడి పెట్టుకున్నారు.. ఈనెల 11న రిలీజ్ కాబోతున్న అరవింద సమేత వీరరాఘవ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నారు..

12:42 - October 3, 2018

ఢిల్లీ : రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరిగిపోవడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరోసారి భారీగా క్షీణించింది. మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా 73 మార్క్‌ను దాటింది. 73.34 వద్ద అత్యంత కనిష్టానికి రూపాయి పడిపోయంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.34 వద్ద తాజా జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. మంగళవారం నాటి సెషన్‌లో 72.91 వద్ద స్థిరపడ్డ రూపాయి.. నేడు 35 పైసలు నష్టపోయి 73.26 వద్ద ప్రారంభమైంది. కాసేపటికే మరింత దిగజారి 73.34 వద్ద అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం 9.45 గంటల ప్రాంతంలో రూపాయి మారకం విలువ 73.33గా కొనసాగుతోంది.

దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయంగా రూపాయి విలువ భారీగా పతనమైందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూ. 1,842కోట్ల పెట్టబడులను విదేశీ సంస్థాగత మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 85 డాలర్లుగా ఉంది. కాగా.. రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. నేటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

12:34 - October 3, 2018

ఢిల్లీ  ...భారత అత్యున్నత న్యాయస్థానం  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్‌   బుధవారం  ప్రమాణ స్వీకారం  చేశారు.  రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ ఉదయం ఆయనతో  రాష్ట్రపతి  భవన్ లో  ప్రమాణ స్వీకారం చేయించారు. అసోం వాసి అయిన 63 సంవత్సరాల  గొగోయ్‌.. ఈశాన్య రాష్ట్రాల నుంచి   దేశ సర్వోన్నత  న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తి.  ఆయన ఈ పదవిలో 2019 నవంబర్‌ వరకు  కొనసాగుతారు. రాష్ట్రపతి భవన్  దర్బార్ హాలులో  జరిగిన ఈ  కార్యక్రమానికి ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ,   కేంద్ర  హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్,  ఆర్ధిక మంత్రి అరుణ్  జైట్లీ , మాజీ  ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవగౌడ, పలువురు కేంద్రమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.ఈఏడాది జనవరిలో   చీఫ్ జస్టిస్ మిశ్రాని విమర్శించిన నలుగురు న్యాయమూర్తులలో రంజన్ గొగోయ్‌  ఒకరు. 

 

12:23 - October 3, 2018

గుంటూరు : తిరుపతిలో గతంలో తనపై దాడి చేసిన వ్యక్తి అరకు జంట హత్యలకు టీమ్ లీడర్‌గా పని చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. చలపతి అనే వ్యక్తి కిడారి సర్వేశ్వరరావు, సివేరు సో్మ హత్యల ఘటనకు టీమ్ లీడర్‌గా పని చేశారని చెప్పారు. గుంటూరులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా లేదన్నారు. ఒడిస్సాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉందని.. ఆ టీమంతా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కాల్పులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆ టీమ్‌లో ఉండే చలపతి అనే వ్యక్తి టీమ్ లీడర్‌గా పని చేశాడని చెప్పారు. తిరుపతిలో గతంలో చలపతి తనపై దాడి చేశారని గుర్తు చేశారు.

బాక్సైట్ తవ్వకాలను క్యాన్సల్ చేశామని తెలిపారు. బాక్సైట్ తవ్వకాలను కొనసాగించే ఉద్దేశం టీడీపీ ప్రభుత్వానికి లేదన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. ఏకపక్షంగా ఎంవోయూలు చేసి, చాలా దుర్మార్గంగా ప్రవర్తించారని, రాష్ట్రానికి చాలా నష్టం చేశారని పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థతి వస్తుందని టీడీపీ అధికారంలోకి వచ్చాక బాక్సైట్ తవ్వకాలను క్యాన్సల్ చేశామని చెప్పారు.  

11:52 - October 3, 2018

నిజామాబాద్ : టీఆర్ఎస్ బహిరంగ సభకు నిజామాబాద్ జిల్లా ముస్తాబయ్యింది. ఇందూరు నగరం గులాబీమయంగా మారింది. ముందస్తు ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో ఉన్న గులాబీ దళపతి మరోసారి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. హుస్నాబాద్ సభతో ఎన్నికల ప్రచార శంఖాన్ని పూరించిన టీఆరెస్ అధినేత కేసీఆర్.. నిజామాబాద్ నుంచి పూర్తి స్ధాయి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నిజామాబాద్‌లోని  గిరిరాజ్ కాలేజిలో ఇవాళ భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభకు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లుపూర్తి చేశారు. పార్టీ మలి సభ కావడంతో ఇందూరు గులాబీ మయంగా మారింది.

సభా స్ధలి వద్దే హెలిప్యాడ్ ను సిద్దం చేశారు. వేదిక, ఇతర నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సుమారు 100 మంది నేతలు వేదికపై కూర్చునేలా నిర్మాణం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చే నేతలు, జిల్లా మంత్రి,  ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలంతా కూర్చునేలా వేదికను సిద్దం చేస్తున్నారు. పార్కింగ్ కోసం సీఎస్ఐ గ్రౌండ్‌తోపాటు పాలిటెక్నిక్ కళాశాల మైదానం, సభ ఎదురుగా ఉన్న ఖాళీ స్ధలాన్ని వినియోగిస్తున్నారు. సభ దగ్గర మూడంచల భద్రత ఏర్పాట్లు చేశారు. 

జిల్లాలోని 9 నియోజకవర్గాల నుంచి సభకు భారీ జనసమీకరణ చేస్తున్నారు. అధినేత దృష్టిని ఆకర్షించేలా తాజా మాజీలు జనసమీకరణలో పోటీ పడుతున్నారు. గ్రామాల్లోనే వాహనాలను సిద్దం చేశారు.  . ఇప్పటికే నగరాన్ని గులాబీమయంగా మార్చిన గులాబి దండు.. దళపతికి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. 

వారం రోజులుగా జిల్లాలోనే మకాం వేసిన ఎంపీ కవిత.. తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.  భారీ జనసమీకరణ కోసం కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ఆశీర్వదించేందుకు రావాలని ఆహ్వానం పలుకుతున్నారు. సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కవిత చెప్పారు. హుస్నాబాద్ సభ అనంతరం పార్టీ అధినేత హోదాలో కేసీఆర్ పూర్తిస్ధాయి ప్రచారం నిజామాబాద్ నుంచే ప్రారంభించనున్నారు. తాజా రాజకీయ పరిణాణాలతో పాటు ఎన్నికల హామీలు తదితర అంశాలపై కేసీఆర్‌ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

11:17 - October 3, 2018

కోల్‌కతా...పశ్చిమబంగాల్‌లోని  కోల్‌కతా  మెడికల్  కాలేజీ  ఆస్పత్రిలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆస్పత్రిలోని 250 మంది రోగులను సెలైన్‌ సీసాలు, స్ట్రెక్చర్‌లతో సహా హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో కొందరిని ఇతర ఆస్పత్రులకు పంపించారు. మొదట  ఉదయం   7-30   ప్రాంతంలో ఆస్పత్రిలోని ఫార్మసీ విభాగంలో దట్టమైన పొగ రావడం గమనించిన సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ 10 వాహనాలతో సహా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులతోపాటు పశ్చిమ్‌ బంగ‌ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్టు ఇంతవరకూ సమాచారమేదీ లేదు. స్థానిక పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  

2011లో కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 92 మంది చనిపోయారు.అప్పుడు  రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో చాలా మంది రోగులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.

11:16 - October 3, 2018

వాషింగ్‌టన్: డయాబిటీస్‌తో బాధపడేవారికి కేన్సర్ వ్యాధి త్వరగా సోకే ప్రమాదం ఉందని స్వీడన్ జాతీయ డయాబిటిక్ రిజిస్టర్ (ఎన్‌డీఆర్) అనే పరిశోధనా సంస్థ అధ్యయనంలో తేలింది. షుగర్ వ్యాధి లేనివారి కంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు 20 శాతం త్వరగా మలాశయ కేన్సర్, 5 శాతం బ్రెస్ట్ కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.

డయాబిటిస్ వ్యాధిగ్రస్థులు కేన్సర్ బారినపడితే.. కోలుకొనే శాతం తక్కువేనని ఈ అధ్యయనంలో తేలినట్టు ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది.  

11:12 - October 3, 2018

పశ్చిమ గోదావరి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్వరం మారుతుందా..? ప్రజా పోరాటయాత్ర మొదటి, రెండు విడతల్లో పవన్‌ స్వరానికి మూడవ విడత స్వరానికి మార్పు కనిపిస్తోందా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొదటి, రెండు విడతల పోరాట యాత్రల్లో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడాలేకుండా ఇద్దరి మీదా విరుచుకుపడ్డ పవన్‌.. ఇప్పుడు కేవలం అధికారపార్టీనే టార్గెట్‌ చేశారు. అంతేకాదు.. ప్రతిపక్ష వైసీపీకి సానుకూల వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వైసీపీ పట్ల పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది..

జనసేనాని తన స్వరం మార్చుకున్నారు. నిన్నమొన్నటి వరకు టీడీపీ, వైసీపీలను కలిపి ఏకిపారేసిన పవన్‌... ఇప్పుడు టీడీపీనే టార్గెట్‌ చేశారు. చంద్రబాబు, లోకేష్‌ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరినీ వదలకుండా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో పవన్‌ స్వరంలో స్పష్టమైన మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనాని ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది.  పవన్‌ తన యాత్రలో చేస్తున్న వ్యాఖ్యలు.. రాజకీయ సర్కిల్‌లో చర్చకు తెరలేపాయి. గత రెండు విడతల్లో అధికార, ప్రతిపక్ష పార్టీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పవన్‌.. మూడవ విడతలో టీడీపీపైనే  ఫోకస్‌ పెట్టారు. ప్రతిపక్ష పార్టీని పూర్తిగా టచ్‌ చేయడం లేదు. గత సభల్లో వైసీపీపైనా , అధినేత జగన్‌పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు జరుగుతున్న యాత్రలో పవన్‌... వైసీపీ అధినేతపై అనుకూల కామెంట్స్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు జగన్‌ అంటే భయమని, 2014 ఎన్నికల్లో జగన్ గెలిచేఅవకాశముందని చంద్రబాబు తనతో చెప్పారని పవన్‌ అన్నారు. అంతేకాదు.. జగన్‌ను ఓడించాలంటే తన ఒక్కడి వల్ల కాదని.. నా సహకారం ఉండాలని చంద్రబాబు కోరినట్టు వివరించారు. 

జగన్‌కు అనుకూలంగా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్‌కు చంద్రబాబు భయపడుతున్నారన్న వ్యాఖ్యలను వైసీపీ నేతలు ప్రమోట్‌ చేసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పవన్‌ అలాంటి కామెంట్స్‌ చేయడం తమకు ఉపయోగమనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు.

10:58 - October 3, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై, ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం.. అరవింద సమేత వీరరాఘవ.. ఎస్.ఎస్.థమన్ కంపోజ్ చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది..
నిన్న, నొవాటెల్‌లో అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది...ఈ సందర్భంగా విడుదల చేసిన అరవింద సమేత ధియేట్రికల్  ట్రైలర్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్‌వస్తోంది...  టీజర్ చూస్తే, ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది అని అర్ధం అయింది.. 
ఇప్పుడు ట్రైలర్‌లో, ఫ్యాక్షనిజం ఏ స్ధాయిలో ఉండబోతోందో చూపించాడు త్రివిక్రమ్.. ముఖ్యంగా తారక్,జగపతి బాబు, పూజా హెగ్డే ట్రైలర్‌కి హైలెట్ అయ్యారు.. తారక్ చెప్పిన డైలాగ్స్, జగ్గూభాయ్ గెటప్, పూజా గ్లామర్ ఆకట్టుకున్నాయి.. అంతర్లీనంగా  త్రివిక్రమ్ ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నాడనిపిస్తోంది.. అక్టోబర్ 11న అరవింద సమేత వీరరాఘవ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...

10:38 - October 3, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమ ఆందోళన కొనసాగించిన రైతులు  అర్థరాత్రి ఆందోళన విరమించారు. ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన అన్నదాతలు తమ ఆందోళనలు విరమించుకున్నారు. అంతకు ముందు రైతులు ఆందోళన విరమణకు రైతులు ససేమిరా అన్నారు. తమను ఆపిన చోటే ఆందోళనను కొనసాగిస్తామంటూ మంగళవారం రాత్రి పొద్దుపోయాక దిల్లీ సరిహద్దులోనే పడకలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. దీంతో అక్కడ వేలమంది పోలీసుల్ని మోహరించారు. కనీస మద్దతు ధరపై స్వామినాథన్‌ కమిటీ నివేదిక పూర్తిస్థాయి అమలు, సంపూర్ణ రుణమాఫీల కోసం రైతులు పట్టుపట్టారు. 11 అంశాలకు గానూ ఏడింటిపై ప్రభుత్వం అంగీకరించినా మిగిలినవి ఆర్థికాంశాలు కావడంతో చర్చించాక చెబుతామన్నారని బీకేయూ ప్రతినిధి యుధ్‌వీర్‌సింగ్‌ తెలిపారు. ఆతర్వాత అర్థరాత్రి ఆందోళన విరమించుకోవడంతో  అధికారులు, అటు కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
 
మంగళవారం వేల మంది  అన్నదాతలు దేశ రాజధానిపైకి దండెత్తారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి వినిపించడానికి ఉద్యుక్తులయ్యారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు  చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. పంట రుణాల మాఫీ, ఇంధన ధరల తగ్గింపు, స్వామినాథన్‌ కమిటీ నివేదిక అమలు, పదేళ్లు పైబడిన ట్రాక్టర్ల వినియోగంపై నిషేధం తొలగింపు వంటి వివిధ డిమాండ్ల సాధనకు వీరంతా 'కిసాన్‌ క్రాంతి పాదయాత్ర' పేరుతో భారీ ప్రదర్శన చేపట్టారు. వారిపైకి పోలీసులు జల ఫిరంగులను, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఘర్షణలో కొందరు రైతులు, పోలీసులు గాయపడ్డారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించేవరకూ ఆందోళనను విరమించేది లేదని రైతునేతలు స్పష్టం చేశారు. 

రైతులపట్ల కేంద్రం తీరును విపక్షాలు ఆక్షేపించాయి. రైతులపై హింసాత్మక చర్యలకు పాల్పడడమేమిటని కాంగ్రెస్‌, ఆప్‌ ప్రశ్నించాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం తీరును తప్పుపట్టారు. మరోవైపు పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ సహా కొంతమందితో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చించారు. ఆ తర్వాత ఆందోళనకారుల వద్దకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రాజేంద్రసింగ్‌ షెకావత్‌ వచ్చారు. డిమాండ్లను పరిశీలించడానికి ముఖ్యమంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం తరఫున హామీ ఇచ్చారు. నిరసనకారులు ఆ హామీతో సంతృప్తి చెందలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో రాత్రి బైఠాయించారు. 

10:20 - October 3, 2018

అమెరికా : గీతం యూనివర్సిటీ అధినేత, తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అమెరికాలో అలస్కాలోని ఆంకరేజ్‌ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తితో పాటు మరో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎంవీవీఎస్ మూర్తితోపాటు మరో నలుగురు కారులో ఉన్నారు. కడియాల వెంకటరత్నం తీవ్రంగా గాయపడటంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

గీతం యూనివర్శిటీ ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి....గతంలో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న తానా సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నెల 6న కాలిఫోర్నియాలో జరగనున్న గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించించేందుకు ఎంవీవీఎస్‌ మూర్తి అమెరికా వెళ్లారు.

తూర్పు గోదావరి జిల్లా మూలపాలెంకు చెందిన ఎంవీవీఎస్ మూర్తి...ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్ డీ చేశారు. లా కోర్సు చేసి హైకోర్టులో కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. ఆయన పూర్తి పేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి. 

గీతం యూనివర్శిటీ ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి...1991, 1999లో రెండు సార్లు టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ నేతల్లో విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలకు రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతంలో టీడీపీ సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, లాల్ జాన్ భాషా, నందమూరి హరికృష్ణ, ప్రస్తుతం ఎంవీవీఎస్ మూర్తి...వీరంతా రోడ్డు ప్రమాదాల్లోనే మృతి చెందారు. ఎర్రన్నాయుడు, లాల్ జాన్ భాషా, నందమూరి హరికృష్ణతో పాటు ఎంవీవీఎస్ మూర్తిలు గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా పని చేశారు.

Don't Miss