Activities calendar

08 October 2018

21:26 - October 8, 2018

జైపూర్: స్వచ్చ  భారత్ పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజల్లో మార్పు తీసుకు వస్తుంటే ఆ పార్టీకి చెందిన నేతలు మోడీ ఆశయానికి  తూట్లు పొడుస్తున్నారు. లేటెస్ట్ గా రాజస్ధాన్ కు  చెందిన మంత్రి శంభు సింగ్ ఖేటసర్ బహిరంగ మూత్ర విసర్జన చేసి వార్తల్లో కెక్కారు. మంత్రి గారు మూత్రవిసర్జన చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్ గా మారి నెటిజన్ల విమర్శలు ఎదుర్కుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా  అజ్మీర్ వద్ద ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభకు హజరయ్యే క్రమంలో సభా వేదికకు సమీపంలోనే  మంత్రిగారు లఘుశంక తీర్చుకున్నారు. పైగా ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్  పక్కనే ఆయన మూత్ర విసర్జన చేయడం మరింత చర్చకు దారి తీసింది. ఇదేం పని మంత్రి గారు అని అడిగితే స్వచ్ఛ భారత్‌ ఉద్దేశ్యం  బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని తాను చేసిన పనిని సమర్ధించుకున్నారు ఆ పెద్ద మనిషి. తను చేసిన ఈ పనిని  ఇది పెద్దవారి సాంప్రదాయమని చెప్పడం కొసమెరుపు. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా గడిపానని, దగ్గరల్లో ఎక్కడా  టాయిలెట్స్‌ లేవని చివరకు తప్పు ఒప్పుకున్నారు సదరు మంత్రిగారు. 

19:51 - October 8, 2018

న్యూఢిల్లీ: దేశ జాతీయ భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజంటు ఒకరు అత్యంత భద్రత నడుమ రహస్యంగా చేపడుతున్న బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగశాల వద్ద తచ్చాడుతూ కనిపించడం జాతీయ భద్రతపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియజేస్తోంది. మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బ్రహ్మోస్ మిసైల్ తయారీ కేంద్రం వద్ద నిషాంత్ అగర్వాల్ అనే పాకిస్థాన్ గూఢచారి తచ్చాడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక శాఖ అధికారులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌‌లో నిషాంత్ పట్టుబడ్డట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.


గత కొంతకాలంగా పోలీసులు నిషాంత్ కదలికలపై నిఘా పెట్టారు. ఈ నిఘాను శనివారం నుంచి పెంచారు. కీలకమైన సాంకేతిక సమాచారాన్ని ఐఎస్ఐకు నిషాంత్ చేరవేస్తున్నాడని తెలుస్తోంది. పాకిస్థాన్‌తో పాటు ఇతర గూఢచార సంస్థలకు చేరవేస్తున్నట్టు సమాచారం.

18:51 - October 8, 2018

ఢిల్లీ: బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్న శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. అమిత్‌షా ఆదేశాల మేరకు తన ప్రణాళిక ఉంటుందని,నవరాత్రి ఉత్సవాలు అయ్యాక మరోసారి కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. 
శ్రీ పీఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు చేస్తున్న స్వామి పరిపూర్ణానంద ఇటీవలి కాలంలో హిందూ మత పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలతో వార్తల్లో నిలిచారు. యూపీలో యోగి ఆదిత్యనాధ్ తరహాలోనే  తెలంగాణాలోను స్వామి పరిపూర్ణానందను రంగంలోకి  దింపి హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉంది. అంతకు ముందు స్వామి పరిపూర్ణానంద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తోనూ సమావేశం అయ్యారు. 

18:20 - October 8, 2018

హైదరాబాద్:తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. ఈ ఎన్నిక‌ల్లో మ‌హిళా ఓట‌ర్లే అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేయ‌బోతున్నారా?  న‌ల‌బై యొక్క నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుషుల కంటే మ‌హిళా ఓట‌ర్లే ఎక్కువమంది ఉన్నారా? ఓట‌ర్ ఎన్ రోల్ మెంట్ గ‌ణాంకాలు అస‌లేం చెబుతున్నాయి?

తెలంంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హిళా ఓట‌ర్లు కీలక పాత్ర‌ పోషించ‌నున్నారు. గ‌త ఎన్నిక‌లతో పోలిస్తే ఈ ఎన్నిక‌ల్లో మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్టు ఓట‌ర్ ఎన్ రోల్ మెంట్ గ‌ణాంకాలు చెబుతున్నాయి. 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న‌ తెలంగాణ‌లో 41 నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హిళా ఓట‌ర్లు అధిక సంఖ్య‌లో ఉన్నారు. అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను మ‌హిళా ఓట‌ర్లు నిర్ణ‌యించున్నారు. మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువ‌గా ఉండ‌టంతో మ‌హిళల ఆశీర్వాదం పొందాల‌ని అన్ని పార్టీల అభ్య‌ర్థులు భావిస్తున్నారు. 


ప్ర‌స్తుత ఓట‌ర్ల జాబితా ప్ర‌కారం 2.61కోట్ల మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు. అంటే మొత్తం ఓట‌ర్ల‌ల‌లో వీరి వాతం 49.22. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుషుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్నా అది స్వ‌ల్ప‌మే అని లెక్క‌లు చెబుతున్నాయి. 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో పురుషుల పోలింగ్ శాతం 74.22 గా ఉంది, మ‌హిళ‌ల‌ పోలింగ్ శాతం 74.17గా న‌మోదైంది. తాజాగా వ‌చ్చిన ద‌రఖాస్తుల్లో మ‌హిళ‌ల‌దే పైచేయి అని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మ‌హిళా ఓట‌ర్లే కీల‌కం కావ‌డంతో వారే నిర్ణ‌యాత్మ‌క ప్రాత పోషించ‌నున్నారు. 

క‌ల్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం కింద ల‌క్షా 116 రూపాయ‌లు పెళ్లి కానుక‌గా, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో డెలివ‌రీ ఖ‌ర్చుల కింద 12వేల ఆర్థిక సాయంతో పాటు కేసీఆర్ కిట్ ను అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎక్కువ‌మంది మ‌హిళ‌లు.. ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకున్న‌ట్టు తెలుస్తోంది. అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో మ‌హిళా ఓట‌ర్లు ఉండ‌టంతో అన్ని పార్టీలు మ‌హిళలపై ప్ర‌త్యేక‌ దృష్టి సారించ‌డంతో పాటు మేనిఫెస్టో లో కూడా వారికి తాయిలాలు ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

16:54 - October 8, 2018

ఢిల్లీ:వంద అబద్దాలు ఆడి ఓ పెళ్లి చెయ్యమన్నారు పెద్దలు. కానీ ఇక్కడ నకిలీ వజ్రాలు బహుకరించే సరికి కుదిరిన పెళ్లి కాస్త క్యాన్సిల్ అయ్యింది,  దాంతో ఆ పెళ్లికొొడుకు లబోదిబో మంటూ వజ్రాల వ్యాపారి పై కేసు పెట్టాడు.ఇంతకీ ఆ వజ్రాల వ్యాపారి ఎవరనుకుంటున్నారు? మన దేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలాది కోట్ల రూపాయలు అప్పులు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీయే.
సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ అనే అనే పత్రిక కథనం ప్రకారం.. నీరవ్‌ మోడీ జూన్ లో కెనడాకి చెందిన పౌల్‌ ఆల్ఫోన్సో అనే వ్యక్తికి సుమారు 2లక్షల డాలర్ల విలువ కలిగిన రెండు డైమండ్‌ ఉంగరాలను హాంకాంగ్ లో అమ్మాడు. అందులో ఒక రింగును ఆల్ఫోన్సో తన గర్ల్ ఫ్రెండ్ కు బహుకరించాడు. ఆమె డైమండ్ రింగ్ లు చెక్ చేయించగా అవి నకిలీవని తేలింది, ఆ విషయం ఆల్ఫోన్సో కు చెప్పిన అతని  గర్ల్ ప్రెండ్ ఎంగేజ్ మెంట్ రద్దు  చేసుకుంది. నీరవ్ చేసిన పనికి గర్ల్ ఫ్రెండ్ దూరమైన ఆ వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్లాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆల్ఫోన్సో నీరవ్ మోడీ పై  రూ.31కోట్ల నష్టపరిహారం కోరుతూ కాలిఫోర్నియాలో కేసు పెట్టాడు.
పంజాబ్ నేషనల్  బ్యాంకుకు రుణం ఎగ్గొట్టిన కేసులో నీరవ్ కు చెందిన సుమారు 600 కోట్లరూపాయల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులు ఇటీవల జప్తు చేసి, నీరవ్ ని ఇండియా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ లో బ్యాంకులను మోసం చేసిన కేసులో భాగంగానే  నీరవ్ పై ఇంటర్ పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. నీరవ్ మోడీ బ్యాంకును చేసిన మోసం వెలుగులోకి వచ్చింది,  ఇప్పుడు తాజాగా నకిలీ వజ్రాలు అమ్మిన విషయం బయటపడింది. నీరవ్ ఇలా ఇంకెంత మందికి నకిలీ వజ్రాలు అమ్మాడో మున్ముందు తెలియాల్సి ఉంది. 

16:19 - October 8, 2018

హైద‌రాబాద్: తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అధికార ప్ర‌తిప‌క్షాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. తాజాగా మ‌హాకూట‌మిని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నాయ‌కులు మాట్లాడుతున్నారు. తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు(టీజేఎస్) కోదండ‌రామ్‌పై టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత నాయిని న‌ర్సింహారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నిక‌ల్లో రెండు మూడు సీట్లు గెలిచి నువ్వు ఏం సాధిస్తావ్ ? అని కోదండ‌రామ్‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. కోదండ‌రామ్ అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మమని సూచించారు. అంతేకాదు ఏదో ఒక పార్టీకి స‌పోర్ట్ చేయాల‌ని స‌ల‌హా ఇచ్చారు.
ఉద్య‌మం స‌మ‌యంలో కోదండరామ్‌కు టీఆర్ఎస్, కేసీఆర్ ఎంతో సాయం అందించార‌ని నాయిని గుర్తు చేశారు. తాము మ‌ద్ద‌తివ్వ‌కుంటే జేఏసీ ఏమ‌య్యేద‌ని ప్ర‌శ్నించారు. మ‌హాకూట‌మిలో బాగంగా కోదండ‌రామ్ పార్టీకి కాంగ్రెస్ వాళ్లు మూడు సీట్లే ఇస్తామ‌ని అంటున్నారని.. కోదండ‌రామ్‌కు ఎందుకంత దీనావ‌స్థ అని నాయిని వ్యాఖ్యానించారు. రెండు మూడు సీట్ల‌కు ఎందుకు పాకులాడుతున్నావ్? ఒక‌టి రెండు సీట్లు గెలిచి నువ్వు సాధించేది ఏంది? అని నిల‌దీశారు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో 200మంది చ‌నిపోవ‌డానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్ కార‌ణమని ఆరోపిస్తూ అలాంటి వాళ్ల‌తో ఎలా చేతులు క‌లుపుతార‌ని నాయిని మండిప‌డ్డారు.

15:40 - October 8, 2018

ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ మాథ్యూ హెడెన్‌ కి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబంతో కలిసి క్వీన్స్‌లాండ్ దీవులకి ఇటీవల హాలిడే ట్రిప్‌కి వెళ్లిన హెడెన్..   అక్కడ తన కొడుకుతో కలిసి సరదాగా సర్ఫింగ్ చేస్తుండ‌గా,  ప్రమాదవశాత్తు పట్టుజారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో హెడెన్ తల బోటుకి బలంగా తాక‌డంతో.. తీవ్రగాయాల పాల‌య్యాడు.  వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ లో హెడెన్ తల, మెడలోని సీ6, సీ5, సీ4 లిగమెంట్స్ విరిగినట్లు తేలింది. ప్రస్తుతం త‌న‌ పరిస్థితి మెరుగ్గానే ఉంద‌ని, స్వ‌యంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేశాడు హెడెన్. 2008లో భారత్ తో చివరి టెస్టును, 2009లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డేను హెడెన్ ఆడాడు. ఆస్ట్రేలియా తరపున 103 వన్డేలు, 161 టెస్టులు ఆడాడు.

15:07 - October 8, 2018

హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో అవకతవలపై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఎన్నికల సంఘం  ఇవాళ కోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీనిపై బుధవారం కోర్టులో వాదనలు ఉంటాయి. మరో వైపు ఎన్నికల షెడ్యూల్‌ను సవాల్‌ చేస్తూ కోర్ట్‌లో నిరూప్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

 

14:38 - October 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. దీనికి కారణాలు ఏమైనాగానీ..అసెంబ్లీని రద్దు చేయటాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామయుతంగా గెలిపించిన ప్రభుత్వాన్ని అర్థాంతరంగా రద్దు చేయటంపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టుల్లో పిటీషన్లు వెల్లవెత్తుతున్నాయి. మరోపక్క గెలుపే లక్ష్యంగా పార్టీల నేతలంతా ప్రచారంలో తలమునకలయ్యారు. టీఆర్ఎస్ ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి, విపక్షాలకు సవాలు విసిరింది. మరోవైపు, అసెంబ్లీని రద్దు చేయడంపై హైకోర్టులో వందలాది ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఈ పిటిషన్లు వేశారు. దాదాపు 200 పిల్స్ వేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, ఈ పిటిషన్లన్నింటినీ కలిపి హైకోర్టు ఒకేసారి విచారించే అవకాశం ఉంది.
తెలంగాణ, కేసీఆర్, అసెంబ్లీ రద్దు, హైకోర్టు, 200 పిటీషన్స్,విచారణ, Telangana, KCR, Assembly dissolution, High Court, 200 petitions, trial,

 

14:36 - October 8, 2018

గుంటూరు : జిల్లాలో వరకట్న వేధింపులకు వివాహిత బలి అయింది. అత్తింటి వరకట్న వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మంగళగిరిలో నివాసముంటున్న భార్గవ్, శిరీషలు నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కట్నం కోసం భార్గవ్‌తోపాటు అతని తల్లిదండ్రులు శిరీషను వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శిరీష అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి అత్తింటి వేధింపులే కారణమంటూ...మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

14:25 - October 8, 2018

ముంబయి: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. అనే తేడా లేదు.. అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ లైంగిక వేధింపుల వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌స్తోంది. త‌మపై లైంగిక వేధింపులు జ‌రిగిన‌ట్టు పలువురు హీరోయిన్లు, న‌టీమ‌ణులు బ‌య‌ట‌పెడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. బాలీవుడ్ న‌టి త‌నూశ్రీ ద‌త్తా చేసిన కామెంట్స్ కూడా ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దక్షిణాది నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద కూడా తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులపై పెదవి విప్పింది. ట్విట్టర్ వేదికగా ఆమె తన స్పందన తెలియజేసింది.  8-9 ఏళ్ల వయస్సులో అమ్మతో కలిసి ఒక రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లానని, అక్కడ తను నిద్రపోతున్నప్పుడు ఎవరో తడుముతున్నట్టు గుర్తించానని, ఆ విషయాన్ని అమ్మతో కూడా చెప్పానని పేర్కొంది. అలాగే 10-11 ఏళ్ల వయసులో ఉన్న‌ప్పుడు సంగీత కచేరీ చూస్తుండగా ఒక ముసలాయన తన తొడపై గిల్లాడని వెల్లడించింది.
 
ఇక తాజాగా తన అభిప్రాయాలకు మద్దుతు తెలిపే నెపంతో ఒక వ్యక్తి మాటలతోనే లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డార్లింగ్‌, స్వీట్‌హార్ట్‌ అంటూ పిలవడంతో అతన్ని దూరంగా పెట్టానని, అయితే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడని చిన్మయి ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

సింగ‌ర్ చిన్మయి చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. చిన్మ‌యిని వేధింపుల‌కు గురి చేసిన ఆ వ్య‌క్తి ఎవ‌రా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

14:23 - October 8, 2018

శ్రీకాకుళం : పచ్చని పల్లెలలో మరణమృదంగం మారు మ్రోగుతుంది. కళ్ళముందే తిరిగాడే మనుషులు చూస్తుండగానే మృత్యవాత పడుతున్నారు. మరణంలో చిన్నాపెద్దా అన్న తేడాలేదు.  ఈ మరణాలన్నింటికి ఒక్కటే కారణం.అదే కిడ్నీ వ్యాధి. ఇన్నాళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంకే పరిమితమైన కిడ్నీ మహమ్మారి...  ఇప్పుడు పక్క మండలాలకు సైతం వ్యాప్తి చెందుతుండటం సిక్కోలు వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. 
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జగన్నాథపురం గ్రామంలోని వారిని కిడ్నీ వ్యాధి సమస్య వెంటాడుతోంది. కొద్ది నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో గ్రామస్తులు చనిపోయారు. మరికొంతమంది కిడ్నీ సమస్య కారణంగా మంచాన పడ్డారు.  ఇప్పటి వరకు మనకు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతమే మనకు తెలుసు. అయితే ఇప్పుడీ మహమ్మారి పక్కనున్న  ప్రాంతాలకు పాకుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తంఅవుతోంది. .  కిడ్నీ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

గ్రామంలోని పిల్లలు , పెద్దలు అన్న తేడాలేకుండా అందరినీ కిడ్నీ వ్యాధి కబలిస్తోంది. ఏ రూపంలో ఈ వ్యాధి ప్రజలను పట్టిపీడిస్తుందో అంతుపట్టకుండా పోతోంది. స్థానికంగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా వ్యాధితో బాధపడేవారు ముందుగా ఆర్‌ఎంపీ వైద్యులనే సంప్రదిస్తున్నారు. ఇకనైనా ఈ ప్రాంతంలోని వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి ఈ వ్యాధి అసలు కారణాలు కనుగొనాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామాన్ని కిడ్నీ సమస్య వెంటాడుతుండడంతో యువకులకు వివాహాలు కావడం లేదు. వారిని ఎవరూ ఉద్యోగాల్లో చేర్చుకోవడం లేదు. దీంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు. తమ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
 

14:11 - October 8, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని ఎచ్చెర్లలో టీడీపీ వాల్‌పోస్టర్ల కలకలం చెలరేగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లు ఎలా వచ్చాయన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాత్రికి రాత్రే పోస్టర్లు వెలియడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. వలస నాయకులు వద్దు.. స్థానిక నేతలే ముద్దు అంటూ వాల్‌పోస్టర్లు అంటించారు. 

 

14:02 - October 8, 2018

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉదయాన్నే గోదావరిలో పడవలో విహరించారు. పట్టిసీమ సమీపంలోనే రిసార్ట్ దగ్గర నుంచి ప్రత్యేక బోట్‌లో కాసేపు గోదావరిలో తిరిగారు. గోదావరి జిల్లా వాడినైనప్పటికీ.. పడవ ప్రయాణం చేయడం ఇదే తొలిసారన్నారు పవన్. జనసేన పార్టీ నేతలు, పోలవరం నిర్వాసితుల్లో కొంతమంది పవన్‌తో పాటు పడవ ప్రయాణం చేశారు. ఇవాళ పోలవరంలో వివిధ వర్గాల ప్రజలతో సమావేశం అయిన తర్వాత.. మధ్యాహ్నం మూడు గంటలకు కొయ్యలగూడెం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. 

 

13:48 - October 8, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈసీ బోగస్ ఓట్ల విషయంలో ఉక్కుపాదం మోపింది. ఓట్ల విషయంలో అవకతవకలు జరగకుండా ఈసీ తగిన చర్యలు తీసుకుంటోంది. దీనికి టెక్నాలజీని జోడించి బోగస్ ఓట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది.టెక్నాలజీ సాయంతో తెలంగాణలో 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని హైకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా బోగస్ ఓట్లు అన్నింటినీ తొలగించామని ఈసీ చెప్పింది. ఈ నెల 12న ఓటర్ల తుది జాబితాతో పాటు నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలిపింది. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలను వినిపించారు. 

11:54 - October 8, 2018

ముంబై: అవును.. భార్య‌లు బ‌తికుండ‌గానే భ‌ర్తలు పిండ ప్ర‌దానం చేశారు. భర్తలకు భార్యలు విముక్తి కల్పిస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారట‌. పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయని, చివరికి అవి విడాకులకు దారి తీస్తున్నాయని వారు వాపోయారు. మహారాష్ట్రలోని నాసిక్ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వాస్తవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందమంది భార్యాబాధితులు వేదమంత్రోచ్చారణ మధ్య గోదావరిలో తర్పణాలు విడిచారు. వాస్తవ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అమిత్ దేశ్‌పాండే దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు.

పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయని, చివరికి అవి విడాకులకు దారి తీస్తున్నాయని అమిత్ దేశ్ పాండే పేర్కొన్నారు. ఇటువంటి వ్యవహారాల్లో మహిళలకే ఎక్కువగా మద్దతు లభిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో భర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే వాస్తవ్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసినట్టు అమిత్ తెలిపారు. గతంలో వారణాసిలోనూ పిండ ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అమిత్ వివరించారు. భార్యలు కేసులు వేసినప్పుడు భర్తలకు ధైర్యం చెప్పడంతో పాటు న్యాయపరమైన సాయం కల్పిస్తున్నారు.  

గ‌తంలో వార‌ణాసిలోనూ ఇలానే జ‌రిగింది. భార్యల వల్ల బాధలు పడ్డ భర్తలు వైవాహిక జీవితానికి ముగింపు పలికి.. తమ మాజీ భార్యల పేరిట ‘పిశాచి ముక్తి పూజ’ను వారణాసిలోని గంగానది వద్ద నిర్వహించారు. ఇలా చేస్తే.. భార్యల వల్ల పడిన బాధలకు స్వస్తి పలికి.. పీడ వదిలిపోతుందని వారు చెబుతున్నారు. అంతేకాదు, తమ మాజీ భార్యలకు శాస్త్రోక్తంగా హిందూ ధర్మం ప్రకారం పిండ ప్రదానం చేశారు.
 
భారతీయ చట్టాలన్నీ పురుషులకు వ్యతిరేకంగా ఉన్నాయని భ‌ర్త‌లు వాపోతున్నారు. చివరికి జంతువులకు కూడా ఓ మంత్రిత్వ శాఖ ఉందని.. పురుషుల భద్రత కోసం ఏ శాఖ లేదని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం భార్యలు పెట్టే బాధలు భరించలేక 92వేల‌ మంది భర్తలు చనిపోతున్నారని, భర్తలు పెట్టే హింసలు భరించలేక 24వేల‌ మంది భార్యలు చనిపోతున్నారని సంస్థ స‌భ్యులు చెప్ప‌డం విశేషం.

11:47 - October 8, 2018

కేరళ : పోలీసులు తమ వసూళ్ల విషయంలో ఎటువంటి రాజీలకు పోరు. అసలే పోలీసులు వ్యవస్థతపై నమ్మకం కోల్పోతున్న తరుణంలో మరోసారి తమపై నమ్మకం పెట్టుకోవద్దంటున్నట్లుగా వ్యవహరించారు కేరళ రాష్ట్రంలో పోలీసులు. సాధారణంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి. అది లేకుండా బండెక్కితే భారీ జరిమానా తప్పదు.  వాహనాదారులకు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ నిబంధనను కొనసాగిస్తున్నాయి. దీనిపై ఎటువంటి రాజీలేకుండా నిబంధనలకు పాటిస్తున్నాయి. కానీ దీన్ని అలుసుగా తీసుకున్న కొందరు పోలీసులు తమ దందాను కొనసాగిస్తున్నారు. కానీ హెల్మెట్ తప్పనిసరి అనేది ద్విచక్ర వాహనదారులకు మాత్రమే కాదు.. సైకిలిస్టులకూ వర్తిస్తుంటూ ఓ వ్యక్తికి ఏకంగా రూ.2 వేల జరిమానా విధించారు కేరళ పోలీసులు. అంతమొత్తం తన దగ్గర లేదని ఆ అభాగ్యుడు మొరపెట్టుకోవడంతో కనికరించిన పోలీసులు చివరికి రూ.500 కట్టించుకున్నారు. కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిలుపై వెళ్తుండగా అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల జరిమానా విధించారు. అక్కడితో ఆగక సైకిలు టైర్లలోని గాలిని తొలగించారు. ఖాసింకు ఇచ్చిన చలానా రసీదుపై ఓ మహిళకు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో అవాక్కైన ఖాసిం తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. రూ.500 కట్టే వరకు పోలీసులు తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అది కాస్తా వైరల్ అయి ఎస్పీ దృష్టికి చేరింది. తీవ్రంగా పరిగణించిన ఆయన విచారణకు ఆదేశించారు.  

11:16 - October 8, 2018

కర్నూలు : జిల్లాలో దారుణం జరిగింది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కడతేర్చాడు. భార్యపై అనుమానంతో పిల్లలను దారుణంగా హత్య చేశాడు. జూపాడు బంగ్లాలో ధనోజీరావు తన భార్య, కూతురు నిఖిత (11), కొడుకు మధు (7)లతో కలసి నివాసముంటున్నారు. అయితే భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దానికి తోడూ భార్యపై ధనోజీరావు అనుమానం పెంచుకున్నాడు. ఈనేపథ్యంలో కూతురు నిఖిత, కొడుకు మధును నీటికుంట దగ్గరకు తీసుకెళ్లాడు. మొదటగా కొడును నీటికుంటలో ముంచి చంపాడు. తర్వాత కూతురును నీటికుంటలో ముంచే క్రమంలో పెద్దగా ఏడ్వడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చి, ఇంట్లో కత్తితో గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ధనోజీరావు పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై అనుమానంతోనే పిల్లలను హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. 

 

11:16 - October 8, 2018

తిరుమల : ఈ ఏడాది అధికమాసం రావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల అంటే సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను కనులారా గాంచి ఆ తిరుమలేశుని దర్శనం లభించడం కోసం మన రాష్ట్రం నుంచే కాకుంగా దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆపదమొక్కుల వాడికి మొక్కులు చెల్లించుకుంటే కష్టాలు కొండెక్కుతాయని కొలిచేవారు కొందరైతే.. వైకుంఠవాసుని దివ్య దర్శనంతో జన్మ తరింపజేసుకోవాలనుకునే వారు ఇంకొందరు.. గంటలు.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి ఆ దేవదేవుని దర్శించుకుని గాని తిరిగి వెళ్లరు… ఇక బ్రహ్మోత్సవ సమయాల్లో అయితే.. ఆ తొమ్మిదిరోజులపాటు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తిరుమల కొండకు భక్తులు తరలివస్తారు. కలియుగ వైకుంఠంపై వెలసిన వేంకటాచలపతి.. సకల సింగారాలతో తిరువీధుల్లో మెరిసిపోయేందుకు సిద్ధమవుతున్నాడు.

తిరులేశుని సన్నిధి... బ్రహ్మోత్సవ సంబరాలకు ముస్తాబవుతోంది. ఏడాది పొడవునా ఉత్సవాలు, ఊరేగింపులతో భక్తకోటిని అనుగ్రహించే శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే బ్రహ్మోవత్సవాలంటే ఎందుకింతటి విశిష్టతో మీకు తెలుసా? ఆ లక్ష్మీవల్లభుడైన శ్రీమన్నారాయణుడికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం వెనుక వాస్తవ చరిత్ర ఏంటి? అసలు ఇంతకీ తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలు ఎప్పట్నుంచి జరుగుతున్నాయి. 9రోజులపాటు జరిగే ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు ఎలా వచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కొండ విగ్రహంలో బ్రహ్మోత్సవాలు ప్రత్యేకమైన మరియు ఖగోళ ఉత్సవం 1400 సంవత్సరాల చరిత్రను కలిగి శ్రీవారి బ్రహ్మోత్సవ చరిత్రను తెలుసుకుందాం..

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవమంటే.. బ్రహ్మాండమంతా మారుమోగాల్సిందే… హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల. కలియుగ వైకుంఠమైన సప్తగిరులు నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతుంటాయి. తిరుమల వెంకన్న క్షేత్రం మహిమాన్వితం. ‘వేం’ అంటే పాపాలు.. ‘కట’ అంటే హరించడం అని అర్థం..అంటే వేంకటేశ్వరస్వామి సమక్షంలో ఉంటే సర్వపాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.


ఏడాదంతా భక్తులను తన దగ్గరకు రప్పించుకునే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల దరిచేరేందుకు సన్నద్దమవుతున్నాడు. తిరుమల ఆలయంలో నిత్యకళ్యాణం పచ్చతోరణమే.. అలాంటి  ఏడాదికొకసారి కమనీయంగా జరిగే ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవ వేడుకలు చూసి తరించేందుకు రెండు కళ్లు సరిపోవు.. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను తిలకించి ఆయన కృపాకటాక్ష వీక్షణల కోసం భక్త కోటి ఉవ్విళ్లూరుతుంది. బ్రహ్మోత్సవ వేళ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు వెంకన్న భక్తులు. 

 

10:37 - October 8, 2018

న‌ల్గొండ‌: మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వ‌ర్షిణిపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పెట్టిన వ్యక్తిపై పోలీసులు  అరెస్టు చేశారు. హైద‌రాబాద్ స‌మీపంలోని కొంపల్లి దూల‌ప‌ల్లికి చెందిన గొట్టె శ్రీనివాస్(25) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌డిపై ఐపీసీ సెక్ష‌న్ 354 డీ, ఐటీ యాక్ట్ సెక్ష‌న్ 67 కింద కేసులు న‌మోదు చేశారు. అమృత చేసిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఆ యువ‌కుడిని అరెస్ట్ చేశారు. ఇకపై ఎవరైనా అమృతపై సోషల్ మీడియాలో అసభ్యకర, అవమానకర పోస్టులు పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ సబ్‌ డివిజినల్‌ పోలీసు అధికారి హెచ్చ‌రించారు.

కాగా, ప్రణయ్ హత్య కేసులో అమృతను దూషిస్తూ...ఆమె తండ్రి మారుతీరావును అభినందిస్తూ సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను మ‌రికొంద‌రు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కామెంట్స్ చేసేవారికి వార్నింగ్ ఇచ్చేలా పోలీసులు...ఈ వ్యవహారంలో తొలి అరెస్ట్ చేశారు.

ప్ర‌ణ‌య్ ప‌రువు హ‌త్య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. కూతురు వేరే కులం వ్య‌క్తిని పెళ్లి చేసుకుంద‌నే కోపంతో అమృతి తండ్రి మారుతీరావు.. ప్ర‌ణ‌య్ ను హ‌త్య చేయించాడు. ఈ ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కులపిచ్చితో ఉన్మాదిగా మారిన మారుతీరావుని క‌ఠినంగా శిక్షించాల‌ని కొంద‌రు.. తండ్రిగా మారుతీరావు చేసింది క‌రెక్టే అని మ‌రికొంద‌రు.. ఇలా ఎవ‌రికి వారు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అమృత‌కు స‌పోర్ట్ గా కొంద‌రు, వ్య‌తిరేకంగా కొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

10:32 - October 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లే...అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేయనున్నారా ? 41 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారా ? ఓటర్ ఎన్ రోల్ మెంట్ గణాంకాలు ఏం చెబుతున్నాయి.

తెలంగాణలో జరిగే ముందస్తు ఎన్నికల్లో...మహిళా ఓటర్లే కీలక పాత్ర పోషించనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే...ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఓటర్ ఎన్ రోల్ మెంట్ గణాంకాలు చెబుతున్నాయి. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో....41 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్ణయించనున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటంతో....మహిళల ఆశీర్వాదం పొందితే చాలని పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం....2.61 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో వీరి శాతం 49.22. కొన్ని నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ...అది స్వల్పమేనని లెక్కలు చెబుతున్నాయి.

2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పురుషుల పోలింగ్ శాతం 74.22 శాతముంటే...మహిళల పోలింగ్ శాతం 74.17 శాతం నమోదైంది. తాజాగా వచ్చిన దరఖాస్తులతో మహిళలతే పైచేయని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లే కీలకం కావడంతో...వారే నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. కల్యాణలక్ష్మి కింద  లక్షా 116 రూపాయలు పెళ్లి కానుకగా....ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీ ఖర్చుల కింద 12వేల ఆర్థిక సాయంతో పాటు కేసీఆర్ కిట్ ను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు...ఓటర్లుగా నమోదు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్ధుల గెలుపు- ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో మహిళా ఓటర్లు ఉండటంతో అన్నిపార్టీ మహిళలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు మ్యానిఫెస్టోలలో కూడా వారికి తాయిలాలు ప్రకటించేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి.

10:00 - October 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి మ్యానిఫెస్టో దసరా తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు ముమ్మరం చేశారు. మ్యానిఫెస్టోను జనరంజకంగా రూపొందించే కసరత్తులో భాగంగా  ఆయన పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమైనట్లు తెలుస్తోంది.  ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై మ్యానిఫెస్టో కమిటీ నేతలతోనూ కేసీఆర్‌ చర్చిస్తున్నారు. నిన్న జరిగిన భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.  ఎన్నికల ప్రణాళిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే అంశంపై చర్చించారు. ప్రజావసరాలు, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల కొనసాగింపు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాల కల్పనకు అమలు చేయాల్సిన అంశాలపైనా చర్చించినట్టు సమాచారం.

ఫించన్ల పెంపుపైనా అధ్యయనం చేయాలని కేసీఆర్‌ నేతలకు సూచించినట్లు తెలిసింది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమి పంపిణీలాంటి  పథకాల్లో మార్పులపైనా సీఎం దృష్టి సారించినట్లు తెలిసింది. 

09:55 - October 8, 2018

అహ్మ‌దాబాద్: చిన్నారిపై లైంగిక దాడి ఘ‌ట‌న‌తో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన‌ గుజ‌రాత్ లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. గుజ‌రాత్ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్ వాసులు ప్రాణ‌భ‌యంతో వ‌ణికిపోతున్నారు. గుజ‌రాత్ రాష్ట్రం వ‌దిలి పారిపోతున్నారు. గుజరాతీ చిన్నారిపై స్థానికేతరుడు అత్యాచారానికి పాల్ప‌డాడ్డు. ఈ కేసులో బీహార్ నుంచి వలస వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అల్లరిమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. ఈ క్రమంలో బీహార్, యూపీ నుంచి వలసవచ్చిన  కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. 

గాంధీనగర్ తో పాటు అహ్మదాబాద్, పటన్, సబర్‌కాంతా, మెహసానా ప్రాంతాల్లో వలస దారులను లక్ష్యంగా చేసుకొని వారిపై అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. ఇక ఈ అత్యాచార‌ ఘటనపై సోషల్ మీడియాలో కొంద‌రు విద్వేష పూరిత పోస్టులు పెట్ట‌డంతో ఈ దాడులు మ‌రింత పెరిగాయి. దీంతో పొట్ట కూటి కోసం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ ప్రాణాలను అరచేత పట్టుకుని సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి.

అహ్మదాబాద్‌కు సమపంలోని సబర్‌కాంతా జిల్లా హిమ్మత్‌నగర్ పట్టణంలో సెప్టెంబ‌ర్ 28న ఓ 14 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానంతో ఓ బీహార్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గుజరాతీ ప్రజల్లో బీహార్ సహా వలసదారులపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వీటికి ఆజ్యం పోస్తూ సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఠాకూర్ సేన అనే సంస్థ బీహార్, యూపీ ప్రజలు వెంటనే గుజరాత్ ను వదిలి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ ప్రాంత  వాసులకు పని ఇవ్వరాదని దుకాణాల యజమానులకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో వందలాది మంది ప్రజలు ప్రాణ భయంతో తమ సొంత రాష్ట్రాలకు త‌ర‌లిపోతున్నారు.

ఈ ఘ‌ట‌న‌ల‌తో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందులో భాగంగా స్థానికేత‌రుల‌పై దాడి చేసిన 342మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 42కేసులు న‌మోదు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. స్టేట్ రిజ‌ర్వ్డ్ పోలీసుల‌కు చెందిన 17 కంపెనీల‌ను రంగంలోకి దించారు. స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో గ‌స్తీని పెంచారు.

09:51 - October 8, 2018

వరంగల్ : నూతన ఆవిష్కరణలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన వరంగల్‌ నిట్‌.. జాతికి ఎందరో మేథావులను అందించింది.  భారత తొలి ప్రధాని చేతుల మీదుగా అంకురం తొడిగిన నిట్‌...  భరత మాత సిగలో సృజనాత్మక కిరీటంగా బాసిల్లుతోంది. అరవై వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సరస్వతీ నిలయంలో ఇవాళ వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభించేందుకు  సర్వం సిద్ధం చేశారు.

దేశంలోనే అరుదైన విశిష్టతతో, తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ.  భారత తొలి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా   1959, అక్టోబర్ 10న  250 ఎకరాల  విస్తీర్ణంలో వరంగల్‌ నిట్‌కు అంకురార్పణ జరిగింది.  నాటి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది.. ఓరుగల్లు సిగలో కిరీటంలా మారింది.  ఇప్పుడు 60వ వసంతంలోకి అడుగుపెడుతోన్న నిట్‌  వజ్రోత్సవాలను కోలాహలంగా నిర్వహించనున్నారు. ఇవాళ ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. 

25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అలుమిని కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 10న దేశంలోని ప్రముఖులతో కలిపి వర్క్ షాప్ నిర్వహించనున్నారు. భారతీయ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పద్మభూషణ్ విశ్వమోహన్ వీణ, పద్మభూషణ్ విద్వాన్ వినాయక్రమ్, రమా వైద్యనాథన్, మంజూషా, గురచరణ్ సంగీత కచేరిలకు రూపకల్పన చేశారు.
నిట్‌లో ఆసియా, మధ్య ఆసియా ఆఫ్రికా దేశాల విద్యార్థులు

వరంగల్‌ నిట్‌లో ఆసియా, మధ్య ఆసియా, ఆఫ్రికా వంటి 40 దేశాల విద్యార్థులు చదువుకుంటున్నారు. 8 యూజీ, 25 ఎంటెక్, 4 ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్స్, పీజీ స్థాయిలో 32 కోర్సులు కలిగి ఉన్న నిట్‌గా వరంగల్ రికార్డు సృష్టించింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఉన్న ఏకైక సంస్థ ఇదే.  అత్యాధునిక పరికరాలతో పరిశోధనలను, ఇంటర్స్ షిప్‌కు అవకాశం కల్పిస్తున్నారు. 

ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. ఆర్మీ అధికారులతోపాటు.. వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్,  జిల్లా పోలీస్ అధికారులు హెలిప్యాడ్ ను పరిశీలించారు. ఆర్మీ హెలికాప్టర్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించింది.  ఆర్ట్స్ కళాశాల హెలీప్యాడ్ నుంచి నేరుగా నిట్ లో నూతనంగా ప్రారంభించిన అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌కు ఉప రాష్టపతి చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

నూతన ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచిన వరంగల్ నిట్‌.. జాతి ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తోంది. ఈ వజ్రోత్సవాల స్పూర్తితో నిట్ యాజమాన్యం, విద్యార్ధుల్లో మరింత ఉత్సాహం తొణికిసలాడుతోంది. సమాజ కాంక్షతో వారంతా.. ముందుకు సాగుతున్నారు. 
తెలంగాణ, వరంగల్, నిట్, సిల్వర్ జూబ్లీ వేడుకలు, ఉప రాష్ట్రపతి, వెంకయ్యనాయుడు, ఆర్ట్స్ కళాశాల హెలీప్యాడ్ ,

09:47 - October 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా.. లేక ఆలస్యమవుతాయా అన్నది ఇవాళ తేలిపోనుంది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ నేత మర్రిశశిధర్ రెడ్డి వేసిన పిటిషన్‌.. మరికాసేపట్లో హైకోర్ట్‌లో విచారణకు రానుంది. ఈసీ ఇచ్చే నివేదికను పరిశీలించనున్న హైకోర్ట్ ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుందన్నది ఉత్కంఠను సృష్టిస్తోంది. 20 లక్షలకు పైగా ఓటర్లను తొలగించి, హడావుడిగా ఓటరు జాబితాను పూర్తి చేయడంపై మర్రిశశిధర్‌రెడ్డి అభ్యంతరం చెబుతున్నారు. దీనివల్ల ఆ 20 లక్షల మందికి ఓటు వేసే అవకాశం ఉండదంటున్నారు. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం పోలింగ్‌కు ముందు వరకూ కూడా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చంటోంది. ఓటర్ల తుదిజాబితాను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది.  మరో వైపు హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న అంచనాతో.. తెలంగాణలో పోల్‌బాజా మోగించింది ఎన్నికల సంఘం. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకూ షెడ్యూల్ విడుదల చేసింది. ఒకవేళ ఓటర్ల తుది జాబితాకు హైకోర్ట్ ఆమోదం తెలిపితే.. షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. కోర్టు గనక ఓటర్ల జాబితాలో సవరణలు చేయాలంటే మాత్రం.. షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వస్తుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

09:36 - October 8, 2018

యాదాద్రి : యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన లడ్డూలు బూజు పట్టాయి. ప్రసాదాన్ని కొనుగోలు చేసిన భక్తుడు తినేందుకు లడ్డూను రెండు ముక్కలు చేయగా మొత్తం బూజు పట్టి కనిపించింది. దీంతో అతడు వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మొత్తం 1800 లడ్డూలు పాడైపోయాయి. అప్రపమత్తమైన అధికారులు 30 ట్రేలలో ఉన్న 1800 లడ్డూలను పారబోశారు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.

తయారీలో నాణ్యత లోపించడం, భద్రపరిచే చర్యల్లో లోపాల కారణంగా లడ్డూలు పాడై ఫంగస్ వచ్చినట్టు తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో భక్తుల రద్దీ తగ్గడంతో ప్రసాదాల విక్రయం కూడా తగ్గిందని అధికారులు తెలిపారు. కౌంటర్ గదుల్లో లడ్డూలకు సరైన గాలి ఆడకపోవడంతోనే బూజు వచ్చినట్టు చెబుతున్నారు.

 

09:26 - October 8, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. నగరీకరణ, పట్టణ మౌలిక వసతులు, ఐటీ  శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి అరుదైన ఆహ్వానం అందింది. దీంతో ఆయన నవంబర్ 6, 7 తేదీల్లో సింగపూర్ లో ఈ సదస్సు జరగనున్న ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మార్పులను చర్చించే నిమిత్తం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఈ ఫోరం ప్రారంభోత్సవానికి వ్యవస్థాపక ప్రతినిధిగా ఉండాలంటూ కేటీఆర్ కు ఈ ఆహ్వానం అందింది.నగరీకరణ, పట్టణ మౌలిక వసతులు, ఐటీ అంశాలపై ఈ సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఎనిమిది దేశాల నుంచి సుమారు మూడు వందల కంపెనీల ముఖ్య కార్య నిర్వాహక అధికారులు, వివిధ దేశాల రాజకీయ నాయకులు, వక్తలు హాజరుకానున్నారు. కాగా, ఈ ఆహ్వానంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
 

09:14 - October 8, 2018

ఏలూరు:  రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నే విషయం తెలిసిందే. ఆయా పార్టీల అవ‌స‌రాలు, ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రితోనైనా చేతులు క‌లుపుతారు, పొత్తులు పెట్టుకుంటారు. తెలంగాణలో ఏం జ‌రిగిందో అంతా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సంచ‌ల‌నానికి తెర‌తీసింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నాయి. ఇదే ఫార్మాల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఫాలో అవుతారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నికల్లో  అధికారంలోకి వ‌చ్చేందుకు వ్యూహం ర‌చిస్తున్న ప‌వ‌న్...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   

ఈ విశ్లేష‌ణ‌కు కార‌ణం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాకు శత్రువు కాదు అని చెప్పి పవన్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న సృష్టించారు. జగన్ నా శత్రువు కాదు.. అస‌లు నాకు శత్రువులెవరూ కూడా లేరు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమ‌న్నారు. నేను పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఎన్టీఆర్ మాదిరిగా ఉప్పెన లేదు.. నా సోదరుడు చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో అభిమానుల ప్రవాహం లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో మంచి పాలన అందిస్తారనే ఉద్దేశ్యంతోనే తాను 2014లో టీడీపీకి మద్ద‌తిచ్చినట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు. మోసాలు చేస్తే  చూస్తూ ఊరుకోనని హెచ్చ‌రించారు.
 
అయితే జగన్ శత్రువు కాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చర్చ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో పవన్ జగన్‌తో పొత్తు పెట్టుకుంటారా? అనే దాని గురించి చర్చించుకుంటున్నారు. అయితే గతంలో పవన్‌పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయ‌డం, ఆ విమర్శలకు పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగానే స్పందించడం తెలిసిందే. కాబట్టి జ‌గ‌న్ తో పొత్తు ఉండ‌క‌పోవ‌చ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. ఎప్పుడైనా ఏమైనా జ‌ర‌గొచ్చు.

09:08 - October 8, 2018

హైదరాబాద్ : అనుభవజ్నులు చెప్పిన మాట ఊరికే పోదు. వారి జీవితంలో ఎదురైన అనుభవాలనుండే సామెతలు పుడతాయి. ఒక్కొక్క సామెతకు ఒక్కోఅర్థం వుంటుంది. అత్తమీద కోసం కూతురిపై చూపెట్టినట్లు అనే సామెత ఎంతటి వాస్తవమో నిరూపించే ఘటనలో నగరంలో చోటుచేసుకుంది. భర్తపై కోపంతో ఓ మహిళ కన్నకుమారుడ్ని హత్య చేసిన ఘటనతో నగరం మరోసారి ఉలిక్కి పడింది. భర్తతో వున్న పొరపొచ్చాలు..ఇరుగుపొరుగువారితో వుండే తగాదాలు..ఆర్థిక ఇబ్బందులు..వివాహేతర సంబంధాలు వంటి పలు విషయాలలో అందిరి మధ్య బలైపోయేది చిన్నారులే. ఈ నేపథ్యంలోనే భర్తతో వున్న వివాదాల కారణంగా మూడు సంవత్సరాల ముక్కుపచ్చలారని కన్నకుమారుడ్ని కడతేర్చుకుంది ఓ తల్లి. ఈ ఘటన మాదన్నపేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. కన్న బిడ్డల జోలికి వస్తే క్రూర మృగాలు కూడా శతృవుపై ప్రాణాలకు తెగించి పోరాడుతాయి. కానీ మానవత్వం మరచి మనుషులు చేసే దారుణాలకు చిన్నారులు బలికావటం కడు శోచనీయం. మరోపక్క ఇద్దరు పిల్లల్ని చంపిన తండ్రి ఇలా చిన్నారుల విషయంలో బంధువులు,కన్నవారే కసాయివారిగా మారుతున్న పరిస్థతితో చిన్నారుల భత్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

 

08:36 - October 8, 2018

తమిళనాడు  : ఇంటిల్లి పాదిని హుషారెత్తించే ప్రో కబడ్డీ-6 సీజన్ ప్రారంభమైంది. 12 జట్లు పాల్గొంటున్న ఆరో సీజన్ లో తొలి మ్యాచ్ లో తమిళ్ తలైవాస్-పట్నా పైరేట్స్ మధ్య జరిగింది. తొలి మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ జట్టు అద్భుత ఆట తీరుతో అదరగొట్టింది. 42-26 స్కోరు తేడాతో పట్నా పైరేట్స్ ను ఓడించింది. 13 నగరాల్లో నిర్వహించే ఈ లీగ్‌.. జనవరి 5న ముంబైలో జరిగే మెగా ఫైనల్‌తో ముగుస్తుంది. 
 

08:22 - October 8, 2018

గుంటూరు :  మంగళగిరిలోని రామినేని ఫౌండేషన్‌ - 2018 పురస్కరాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.  బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు రామినేని విశిష్ట పురస్కారం దక్కింది. మహా సహస్ర అవధాని గరికపాటి నరసింహారావు, బాల సాహితీవేత్త చొక్కాపు వెంకటరమణ, సినీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు రామినేని విశేష పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య... అవార్డులు ప్రదానం చేశారు.  విశిష్ట పురస్కారం కింద రెండు లక్షలు, విశేష పురస్కార కింద లక్ష రూపాయల చొప్పన అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌, టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తోపాలు పలువురు నేతలు హాజరయ్యారు.
 

 

08:18 - October 8, 2018

సూర్యపేట : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధి యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని... కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ  ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. పొరుగు రాష్ట్రమైన ఏపీలోని నెల్లూరు జిల్లా సైదాపురానికి చెందిన లోహిత్‌రెడ్డి ఈ పాదయాత్ర చేపట్టాడు. విజయవాడ నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు పాదయాత్రగా బయలుదేరాడు. తన పాదయాత్ర ద్వారా కొందరినైనా టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేలా చేయడమే లక్ష్యమని చెబుతున్నాడు.  టీఆర్‌శ్రీస్‌ చేపట్టిన అభివృద్ధి పథకాలను గ్రామ గ్రామాన ప్రచారం చేస్తూ హైదరాబాద్‌కు సాగుతున్నాడు. గత నెల 25న లోహిత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతానికి అతడు సూర్యాపేట  పట్టణానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్‌ఎస్‌ యువత లోహిత్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రాంతాలు వేరైనా భాష ఒక్కటేనని.. అభివృద్ధి ఎవరు చేసినా స్వాగతిస్తామని..  కేసీఆర్‌ చేసిన అభివృద్ధి తనను ఆకర్షించిదని లోహిత్‌ తెలిపాడు.

 

08:07 - October 8, 2018

హైదరాబాద్ :  దసరా పండుగ ప్రత్యేక బస్సులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ పది రోజులపాటు 4,480 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తోపాటు దిల్‌సుఖ్‌నగర్‌, కాచిగూడ, లింగంపల్లి, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఉప్పల్‌ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా  నేటి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామని, ఆన్‌లైన్‌లో టికెట్ల రిజర్వేషన్‌ చేసుకోవచ్చని  ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నారు.

07:58 - October 8, 2018

అమరావతి :  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ... పశ్చిమ బెంగాళ్‌ సీఎం మమతాబెనర్జీ ఓ లేఖ రాశారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ప్రదర్శనకు హాజరుకావాలని ఆ లేఖలో కోరారు. 2019 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 19న ఈ భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు వివరించారు. బీజేపీకి  వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుందని తెలిపారు.  దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తామని..  ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై నిరసన స్వరం వినిపిద్దామని కోరారు. 

 

07:28 - October 8, 2018

విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసుల్లో కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్న ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ అలియాస్ ఆర్కే, చలపతి అలియాస్‌ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అరుణ అలియాస్ వెంకట రవి చైతన్యలు పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఒడిశాలోని కొరాపూట్ జిల్లా పొట్టంగి సమితి ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. డిస్ట్రిక్ట్‌ వలంటరీ ఫోర్స్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కలిసి ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి. పోలీసుల రాకను గమనించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. ఇటు పోలీసులూ ఎదురు కాల్పులు మొదలుపెట్టడంతో.. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలోనే ఆర్కే, చలపతి, అరుణ సహా ఇతర కీలక నాయకులకు అక్కడి నుంచి సేఫ్‌ జోన్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టులూ పరారు కావడంతో.. మావోయిస్టు శిబిరాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయి ఉంటాయని ఒడిశా పోలీసులు చెబుతున్నారు. అడవిలో ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. 
 

06:58 - October 8, 2018

ఢిల్లీ : సర్వసంగ పరిత్యాగులు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. స్వాములు, యోగుల రాజకీయ తీరే బీజేపీ అన్నది కొత్తగా చెప్పేదేమీ కాదు. అయితే,తెలుగు రాష్ట్రాల బీజేపీలో ఇంతవరకు స్వాములు, యోగులు లేరు. త్వరలో ఆ లోటు తీరబోతున్నట్లుగా రాజకీయ వాతావరణం కలనిపిస్తోంది. స్వామి పరిపూర్ణానంద త్వరలో బీజేపీలో చేరటానికి బీజేపి రంగం సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన పరిపూర్ణానందస్వామి మాట్లాడుతు..అమ్మవారు ఆదేశిస్తే రాజకీయ అరగ్రేటం చేస్తానంటున్నారు.
కాగా ఇటీవల నగర బహిష్కరణకు గురై మొన్ననే తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన స్వామి పరిపూర్ణానందకు కాషాయ కండువా కప్పడం ద్వారా తెలంగాణలో మజ్లిస్ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చని బీజేపీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లా హిందుత్వ కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే సమ్మోహనశక్తి పరిపూర్ణానందకు ఉందని ఆరెస్సెస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. పరిపూర్ణానంద స్వామిని పార్టీలోకి ఆహ్వానించడంపై ఇటీవల మోహన్ భగవత్ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనూ చర్చించినట్టు తెలుస్తోంది.  

హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరిపూర్ణానంద నిలబడుతున్న విషయం ఆరెస్సెస్ గుర్తించిందని తెలుస్తోంది.  ముఖ్యంగా సినీ క్రిటిక్ కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నిత అంశంపై వాతావరణం వేడెక్కడంతో, పోలీసులు స్పందించి తొలుత కత్తి మహేశ్‌ను, ఆ తర్వాత పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించారు. 55 రోజుల బహిష్కరణ తర్వాత స్వామి భారీ ర్యాలీతో రెండు రోజుల క్రితం నగరంలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రవేశానికి బీజేపీ అన్నివిధాలుగా రంగం చేస్తున్నట్లు రాజకీయ సన్నిహిత వర్గాలు సమాచారం. కాగా గతంలో పరిపూర్ణానంద మాట్లాడుతు..తాను తలచుకుంటే సీఎంను కావటం పెద్ద విషయం కాదు అని వ్యాఖ్యానించటం గమనించాల్సిన విషయం.
 

Don't Miss