Activities calendar

09 October 2018

23:05 - October 9, 2018

కడప : జిల్లాలో దారుణం జరిగింది. భార్యను భర్త అతి కిరాతంగా నరికి చంపాడు. తలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంబేపల్లె మండలం దుద్యాల వడ్డేపల్లికి చెందిన వెంకటరమణ, రాణి భార్యభర్తలు. వెంకటరమణ కువైట్‌లో జీవనాధారం సాగిస్తున్నాడు. ఇటీవలే గ్రామానికి వచ్చాడు. అయితే భార్య తీరుపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యను వ్యవసాయ పొలంలోకి తీసుకెళ్లాడు. భార్య తల నరికి అతి కిరాతంగా హత్య చేశాడు. అదే తలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో భర్త వెంకటరమణ లొంగిపోయాడు. తాను కువైట్ నుంచి పంపిస్తున్న డబ్బును అక్రమ సంబంధం పెట్టకున్న వ్యక్తికి ఇచ్చి తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిందని అందుకే హత్య చేసినట్లు వెంకటరమణ చెప్పారు. 

 

22:30 - October 9, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు, ధీటైనా పోటీ ఇచ్చేందుకు జట్టు కట్టిన మహాకూటమిలో ముసలం మొదలైంది. మహాకూటమికి జన సమితి డెడ్ లైన్ విధించింది. కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సీపీఐలు మహాకూటమిగా ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. తాము అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే కూటమి నుంచి  జన సమితి బయటకు వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. 21 సీట్లు ఇస్తేనే మహాకూటమిలో ఉంటామని పలు మార్లు చర్చల్లో జనసమితి నేతలు చెప్పారు. కానీ కూటమి నేతలు జనసమితికి ఎన్ని సీట్లు ఇస్తారో ఇప్పటివరకూ చెప్పలేదు. 

జన సమితికి ఎన్ని సీట్లిస్తారో తేల్చాలని ఆ పార్టీ అధ్యక్షలు కోదండరాం కూటమి నేతలను అడిగారు. జన సమితికి ఎన్ని సీట్లిస్తారో 48 గంటల్లో తేల్చాలని..లేకపోతే తామే అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. కాగా కోదండరాంతో టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సీట్ల విషయంలో తొందరపడొద్దని కోదండరాంకు సూచించారు. అయితే సీట్ల విషయంపై సందిగ్ధం నెలకొనడంతో జనసమితి నేతలు నిరాశలో ఉన్నారు. 

 

21:52 - October 9, 2018

హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. అమీర్‌పేట్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. రాహుల్ అనే వ్యక్తి నుంచి 12 గ్రాముల ఎల్‌సీడీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ స్నేహితులు రిషబ్, ప్రవీణ్ దగ్గర కూడా డ్రగ్స్ ఉందన్న సమాచారంతో వారిపై కూడా అధికారులు దాడులు చేశారు. వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు లక్ష విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాహుల్, రిషబ్, ప్రవీణ్‌లతోపాటు డ్రగ్స్ కొనడానికి వచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. 

 

21:30 - October 9, 2018

ఢిల్లీ:బల్గేరియాలో దారుణం జరిగింది. అవినీతిని వెలికితీసినందుకు యువ మహిళా జర్నలిస్టుపై దుండగులు అత్యాచారానికి పాల్పడి ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బల్గేరియాకు చెందిన విక్టోరియా మరినోవా(30) జర్నలిస్ట్‌గా జీవనం సాగిస్తున్నారు. టీవీ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఐరోపా సమాఖ్య నుంచి బల్గేరియాకు విడుదలైన నిధుల్లో అవినీతిని విక్టోరియా మరినోవా వెలికితీశారు. దీంతో ఆమెను దుండగులు పాశవికంగా అత్యాచారం చేసి చంపారు. తమ పైశాచికత్వంతో ఆమెకు నరకం చూపించారు. శవాన్ని డాన్యూబ్‌ నదీతీరాన పడేశారు. విషయం తెలిసి ప్రజలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హంతకులను పట్టుకోవాలని ఐరోపా సమాఖ్యతో పాటు జర్మనీ ఓ ప్రకటనలో బల్గేరియాను కోరాయి.

 

19:39 - October 9, 2018

ఢిల్లీ : ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు పాపకు అరుదైన శస్త్రచికిత్స చేశారు. పది నెలల పాప వీపుపై ఉన్న కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. పాపకు ఉస్మానియా ఆసుపత్రిలోని న్యూరోసర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ వైద్య నిపుణుల బృందం అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసింది.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్‌ గ్రామానికి చెందిన ఇర్షాద్‌, సన దంపతుల కుమార్తె అనీలా.  పుట్టినప్పుడే అనీలా వీపుపై చిన్న గడ్డ ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ పాపతో పాటు కణితి పరిమాణం కూడా పెరుగుతూ వస్తోంది. తల్లిదండ్రులు పాపను తొలుత హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో చూపించి వైద్యం చేయాలని కోరారు. కానీ ఫలితం లేకుండా పోవడంతో మిన్న కుండిపోయారు. 10 నెలల వయస్సులో కణితి పరిమాణం పెరగడంతో చిన్నారి ఇబ్బంది పడింది. దాంతో తల్లిదండ్రులు ఇటీవలే ఉస్మానియా ఆస్పత్రిలోని న్యూరోసర్జరీ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీధరాల శ్రీనివాస్‌ను సంప్రదించారు. చిన్నారికి పలు రకాలైన రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ పలుకూరి లక్ష్మీ, అనస్థీషియా ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ పాండునాయక్‌లతో కలిసి ఈ నెల 6న శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు.

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సుమారు రూ.3లక్షల ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ సహకారంతో ఉస్మానియాలో పూర్తి ఉచితంగా చేశామని న్యూరోసర్జరీ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీధరాల శ్రీనివాస్‌, సత్యనారాయణ తెలిపారు. ఫోలికాసిడ్‌ లోపం వల్ల జన్మించే పిల్లల్లో ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెప్పారు. గర్భిణి కావడానికి 6 నుంచి 8 నెలల ముందే ఫోలికాసిడ్‌ మాత్రలు వేసుకోవడం వల్ల జన్మించే పిల్లలకు ఎలాంటి జబ్బులు, లోపాలు ఉండవని పేర్కొన్నారు. 

 

19:18 - October 9, 2018

హైదరాబాద్: తెలంగాణా లో పోలింగ్ జరిగే అమావాస్య రోజు కలిసొస్తుందా, అంటే కేసీఆర్ కు కలిసొస్తుందనే చెపుతున్నారు యువ జ్యోతిష్య పండితుడు నిట్టల ఫణి భాస్కర్ శర్మ. ప్రతి పనికి ముహూర్తం చూసుకుని పని మొదలు పెట్టే టీఆర్ఎస్ అధినేత,ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణలో  పోలింగ్ జరిగే  తేదీ డిసెంబర్  7వ తేదీ కలిసొస్తుందని చెపుతున్నారు ఈ యువసిధ్దాంతి. ఆరోజు కార్తీకమాస అమావాస్య ప్రాముఖ్యం ఉన్నరోజని, జ్యేష్ట నక్షత్రం అయి కేసీఆర్ కు వేరే నవకంలో జన్మ తార అయినందున కేసీఆర్ కు శుభాలు చేకూరుస్తుందంటున్నారు. ఫలితాలు వెలువడే 11వ తేదీ చవితి తిధి అయి, ఆరోజు ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం కేసీఆర్ కు క్షేమతార అయినందున ఈరెండు రోజులు ఉన్న నక్షత్ర బలం వల్ల కేసీఆర్ గెలిచి తీరతారు అని ఆయన చెపుతున్నారు. అక్టోబరు 12 తర్వాత గోచారంలో గురుడు కేసీఆర్ కు పంచమస్దానం లోకి వెళ్లటంవలను కూడా విజయావకాశాలు మెండుగా ఉన్నాయని  ఫణి భాస్కర్ చెపుతున్నారు. కేసీఆర్ కు జాతక  రీత్యా చూసినా రాహు మహర్దశలో శుక్రాంతరం నడుస్తోంది అని ఇది యోగించే దశ అని, ఇలా అన్నిరకాలుగా ఆలోచించినా కేసీఆర్ కు శుభయోగాలు మెండుగా ఉన్నాయని  ఆయన  అన్నారు ఏదిఏమైనా గోచారబలం, జాతకబలం, దైవికంగా కేసీఆర్ చేసిన ఆయత చండీయాగం,శతచండీయాగం,దశచండీ యాగం మొత్తంగా చూస్తే  కేసీఆర్ కు మళ్లీ అధికారం అందటం చాలా తేలికైన విషయం అని ఫణి భాస్కర్ చెపుతున్నారు.

19:05 - October 9, 2018

విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనంగా మొదలైన తుఫాను.. రానున్న 24 గంటల్లో పెను తుఫానుగా మారనుందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫానుకు టిట్లీగా నామకరణం చేశారు. 
ఈ వాయిగుండం వాయవ్య దిశగా పయనించి ఒడీషా, ఉత్తరాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. గోపాలపూర్, కళింగపట్నం మధ్య అక్టోబరు 11 తేదీ ఉదయం తీరాన్ని దాటవచ్చని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు సముద్రం మీదకు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీచేశారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడీషా తీర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో గాలులు వీచడంతోపాటు.. భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయి. 

18:41 - October 9, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీకి బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ సవాల్‌ విసిరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ నియోజకవర్గం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసి తనపై గెలవాలని.. ఒకవేళ ఓడిపోతే ఇటలీ వెళ్లిపోవాలలని మహరాజ్ అన్నారు. ఈమేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రాహుల్‌గాంధీకి ఇదే నా సవాల్‌. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉన్నావ్‌ నియోజకవర్గం నుంచి నాకు వ్యతిరేకంగా పోటీ చేయాలి. ఒకవేళ ఆయన గెలిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా.. కానీ ఆయన ఓడిపోతే మాత్రం దేశాన్ని‌ వదిలి ఇటలీ వెళ్లిపోవాలి’ అని సవాల్ చేశారు. రాహుల్‌ మానస సరోవర్‌ యాత్రపైనా ఆయన విమర్శలు చేశారు. రాహుల్‌ యాత్ర చేయడాన్ని తాము వ్యతిరేకించబోమని, అయితే అలాంటి యాత్రలు చేపట్టేముందు పవిత్రత చాలా అవసరమన్నారు. రాహుల్‌గాంధీ ఈ యాత్ర చేపట్టే ముందు స్వచ్ఛంగా మారాలని అని సాక్షి మహరాజ్‌ సూచించారు.

 

18:40 - October 9, 2018

ముంబయి: రూపాయి విలువ మరింత దిగజారింది. ఈ ఏడాది ఇప్పటివరకు డాలర్‌తో పోల్చితే 16 శాతం మేరకు తగ్గిపోయింది. ఈ రోజు ఒక్కసారిగా..33 పైసలు తగ్గి.. డాలర్ విలువలో 74.39 వద్ద నిలిచింది. ఇది ఇప్పటి వరకు జరిగిన తగ్గుదలలో అత్యధికంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

18:31 - October 9, 2018

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఎన్టీఆర్.. కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు..
ఇప్పుడు ఎన్టీఆర్ సెట్లోకి రకుల్ ప్రీత్ సింగ్ ఎంటర్ అవబోతోంది.. ఈ మూవీలో రకుల్ ప్రీత్  శ్రీదేవి పాత్రలో కనిపించబోతోంది.. ఎన్టీఆర్, శ్రీదేవి అనగానే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, మరెన్నో సూపర్ హిట్ పాటలు‌ గుర్తొస్తాయి.. వాటిలో, కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన వేటగాడు కూడా ఒకటి.. ఈ చిత్రంలోని ఆకుచాటు పిందె తడిసే అనే పాట  ఏ‌రేంజ్ హిట్ అయిందో తెలిసిందే.. ఎన్టీఆర్‌లో ఈ పాటని బాలయ్య,రకుల్‌లపై చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది..
ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.. 2019 జనవరి 9న మొదటిభాగం, జనవరి 24న రెండవ భాగం విడుదల కాబోతున్నాయి...

18:25 - October 9, 2018

ముంబయి:  గత కొద్ది ఏళ్లగా వినియోగదారులకు దూరమైన హ్యుండయ్ శాంట్రో మోడల్ కారు..మళ్లీ త్వరలో మార్కెట్‌లోకి రాబోతోంది.  కొత్తగా రాబోయే శాంట్రో హ్యుండయ్ ఇయాన్, హ్యుండయ్ గ్రాండ్ ఐ10 మధ్య మోడల్‌గా విడుదల చేసేందుకు హ్యుండయ్ సన్నాహాలు చేస్తోంది. గతంలో తమ మొదటి కారుగా కొనుక్కున్న శాంట్రో వినియోగదారులు.. కొత్త మోడల్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
గతంలో మార్కెట్‌లో రిలీజ్ అయిన శాంట్రో మోడల్ కంటే రాబోయే మోడల్ కొన్ని మార్పులు, చేర్పులతో విడుదల చేస్తున్నారు. ఎక్సటీరియర్, ఇంటీరియర్ లుక్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే సరికొత్త ఫీచర్లతో శాంట్రో వస్తోంది. ప్రధానంగా కొత్త ఇంజన్, పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరికొన్ని ఫీచర్లు ఉండబోతున్నాయి.  దీని ధర రూ 46 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు ఈ నెల 23న విడుదల చేస్తున్నట్టు హ్యుండయ్ కంపెనీ వెల్లడించింది. 

 

17:39 - October 9, 2018

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్దానం పాలకమండలి సమావేశం ముగిసింది. మూడేళ్లు కు పైగా తిరుమలలో పనిచేస్తున్నవారిని  వేరే  చోటకు  బదిలీ చేయాలని  ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశం లో నిర్ణయించారు. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన మంగళవారం  సమావేశమైన  బోర్డు  టీటీడీ లో  పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులకు  డెప్యుటేషన్  పై  పరకామణి లో  డ్యూటీ వేయరాదని, టీటీడీ లోని రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు  6 మంది సభ్యులతో  ఒక కమిటీ ఏర్పాటు చేయాలని  నిర్ణయించింది. అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.120 కోట్లతో దాదాపు 500 గదులతో వసతి సముదాయం నిర్మించేందుకు  బోర్డు  ఆమోదం తెలిపింది. డిప్యూటేషన్ పై    టీటీడీలోకి వచ్చిన  ఉద్యోగులను 3 ఏళ్ళ తర్వాత తిరిగి మాతృసంస్ధకు పంపాలని నిర్ణయించారు. ఒకేచోట మూడు సంవత్సరాలు విధులు నిర్వహించిన టీటీడీ  ఉద్యోగులను మరో చోటకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  కాలేజీల్లో  డిమాండ్   ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచి,  డిమాండ్ తక్కువ ఉన్నగ్రూపులలో సీట్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.  తిరుమల లోని  కాటేజీల ఆధునీకరణకు  రూ.112 కోట్లు  మంజూరు చేసిన బోర్డు,  ఏపీ రాజధాని  అమరావతిలో నిర్మిస్తున్న  శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్లకు  ఆమోదం తెలిపింది. 

 

17:08 - October 9, 2018

మీటూ... హాలీవుడ్ టు బాలీవుడ్, తర్వాత టాలీవుడ్ వయా కోలీవుడ్.. ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా తమ బాధని వ్యక్తం చేస్తున్నారు..
ఇప్పడీ లిస్ట్‌లో లక్స్‌పాప కూడా యాడ్ అయింది.. టాలీవుడ్‌లో నరసింహ నాయుడు, చాలా బాగుంది, మనసున్న మారాజు వంటి పలు చిత్రాల్లో నటించిన ఆశా‌షైనీ అలియాస్ ఫ్లోరా‌షైనీ తనకెదురైన చేదు అనుభవం తాలూకు విషయాలను ట్వట్టర్ ద్వారా బయటపెట్టింది.. ముఖంపై గాయాలతో ఉన్నఫోటోలని పోస్ట్ చేసి, 2007లో, లవర్స్ డే నాడు గౌరంగ్ దోషి అనే ప్రొడ్యూసర్ ఆమెని రక్తం వచ్చేలా కొట్టడమేకాక, తనమాట వినపోతే సినిమా చాన్స్‌లు రాకుండా చేస్తానని బెదిరించేవాడని, అతని పలుకుబడి చూసి భయంతో మౌనంగా ఉండిపోయాను, ధైర్యంచేసి ఎవరికైనా చెప్పినా ఎవరూ పట్టించుకునేవారు కాదు, కొన్నొకొన్ని‌సార్లు అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి, తర్వాత తనని తప్పించేవారని ట్వీట్ చేసింది... గౌరంగ్ ఏడాదిపాటు తనకి నరకం చూపించాడానీ, అతనిచేతిలో బలైపోయిన చాలామంది అమ్మాయిలు తమకి సహాయం చెయ్యమని తనని అడిగేవారనీ, కానీ, అప్పుడు ఎవరికీ హెల్ప్ చెయ్యలేకపోయానీ, ఇప్పుడు అన్యాయం జరిగిన వాళ్లంతా ధైర్యంగా బయటకి చెప్పడం మంచి పరిణామం, వాళ్లే రియల్ హీరోస్  అని చెప్పుకొచ్చింది  ఫ్లోరా షైనీ...

16:50 - October 9, 2018

హైదరాబాద్ : సీపీఐ (మావోయిస్టు) అగ్రనేతలు పురుషోత్తం ఆయన సతీమణి కోటి వినోదిని హైదరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఎదుట లొంగిపోయారు. ఆర్కే, గణపతి, కిషన్‌లతో 25 ఏళ్లపాటు పురుషోత్తం పని చేశారు. మావోయిస్టు ఉద్యమంలో పురుషోత్తంకు మాస్టర్ బ్రెయిన్‌గా గు్ర్తింపు ఉంది. అనారోగ్య సమస్యలు, ఆస్తమా సమస్యతోపాటు డయాబెటిస్ సమస్య ఉన్నందువల్లే పోలీసులకు లొంగిపోయినట్లు వారు మీడియా ముందు చెప్పారు. 
పురుషోత్తం అలియాస్ విజయ్‌శరత్, ఆయన భార్య కోటి వినోదిని అలియాస్ విజయలక్ష్మీ అలియాస్ భారతక్క సీపీఐ (మావోయిస్టు)లో 30 సంవత్సరాలుగా కీలక సభ్యులుగా ఉన్నారు. క్యాడర్‌ను బలపరచడంలో వీరు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆర్కే, గణపతి, కిషన్‌లతో 25 ఏళ్లపాటు పురుషోత్తం పని చేశారు. మావోయిస్టు ఉద్యమంలో పురుషోత్తంకు మాస్టర్ బ్రెయిన్‌గా గు్ర్తింపు ఉంది.
సీపీఐ (మావోయిస్టు)లో ప్రింటింగ్, పబ్లిషింగ్‌ యూనిట్‌లో పురుషోత్తం చాలా కీలక నేతగా వ్యవహరించారు. వినోదిని ఉపాధ్యయురాలిగా కొనసాగుతున్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వీరిద్దరూ మావోయిస్టు పార్టీ సిటీ కమిటీ మెంబర్లుగా 1981 నుంచి 86 వరకు కొనసాగారు. వీరిద్దరిపై 8 లక్షలకు పైగా రివార్డు కూడా ఉంది.
కొద్ది రోజులుగా ఆ పార్టీ అగ్రనేతలతో టచ్‌లో ఉండడం, వీరి అనారోగ్య విషయాలను పార్టీ అగ్రనేతలు పట్టించుకోకపోవడం వల్లే పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిపారు. అనారోగ్య సమస్య, ఆస్తమా సమస్యతోపాటు డయాబెటిస్ సమస్య ఉన్నందు వల్ల పోలీసులకు లొంగిపోతున్నట్లు మీడియాకు వివరించారు.  

 

16:30 - October 9, 2018

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, మాజీ ఎడిటర్ ఎమ్ జే అక్భర్ ‘#మీ టూ’ సుడిగుండంలో చిక్కుకున్నారు. తనుశ్రీ దత్తా- నానా పటేకర్‌తో మొదలైన ‘మీ టూ’ ప్రచారం సినీ రంగంతోపాటు మీడియా హౌజ్‌లను కబళిస్తోంది. హిందూస్థాన్ టైమ్స్ ఎడిటర్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రికే ఈ ప్రచారం ఎసరుపెట్టింది. 
దీనిపై విలేకరులు ప్రశ్నించగా కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘మీరు మహిళా మంత్రిగా ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మీరేమైనా వీటిపై విచారణకు ఆదేశిస్తారా’’ అని  ట్రిబ్యూన్ ప్రతినిధి స్మితా శర్మ.. సుష్మా స్వరాజ్‌ను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వడివడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.  దీనిపై స్పందించడానికి మంత్రి అక్బర్ అందుబాటులో లేరు. ఆయన నైజీరియా పర్యటనలో ఉన్నట్టుగా సమాచారం.  
ప్రియా రమణి అనే జర్నలిస్టు తన ట్వీట్‌లో ప్రముఖ జర్నలిస్టు కేంద్ర విదేశీ ఉప మంత్రి అక్బర్ పేరును వెల్లడించింది. అమెరికాలో ఈ తరహా ప్రచారం హార్వే వీన్‌స్టీన్ కుంభకోణం వెలుగుచూసినపుడు రమణి తన చేదు అనుభవాలను వెల్లడించింది.  ఆ వ్యక్తినే ఒక ప్రముఖ పత్రిక ఎడిటర్‌గా పేర్కొంది. తనపై వేధింపులపై ఒక  మ్యాగజైన్‌లో ఓ ఆర్టికల్‌ను గత ఏడాది అక్టోబర్‌లో ఆమె రాసింది. 

 

16:28 - October 9, 2018

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ఖరారు కావడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తుంటే.. టీఆర్ఎస్ అంతే ధాటిగా ఎదురుదాడికి దిగుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. మహాకూటమిలో భాగంగా టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకునే పొత్తు షరుతులతో కూడినదా? లేక శరం లేని పొత్తా? అని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. ఈ మేరకు 12ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తమ పార్టీ కూడా గతంలో కాంగ్రెస్‌, టీడీపీలతో పొత్తుపెట్టుకుందని, కానీ అవి షరతులతో కూడిన పొత్తులు అని హరీష్ రావు స్పష్టం చేశారు. 2009లో తెలంగాణకు మద్దతు ప్రకటించడంతోనే టీఆర్‌ఎస్‌ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందని ఆయన గుర్తు చేశారు. ఇక 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని ఏఐసీసీతో ప్రకటన చేయించామని హరీష్ గుర్తు చేశారు.

ఆ షరతులు ఉల్లంఘించినప్పుడు ఆయా పార్టీలతో తెగదెంపులు చేసుకున్నామని హరీష్ రావు వెల్లడించారు. అదే స్పష్టతను మహాకూటమితో సాధించగలరా? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. మహాకూటమి పొత్తు స్వప్రయోజనమో.. రాష్ట్ర ప్రయోజనమో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసలు మహాకూటమి లక్ష్యం ఎంటో చెప్పాలన్నారు. అడుగడుగున తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్యాయంగా తీసుకున్న ఏడు మండలాలను తిరిగి తెలంగాణను కలుపతామనే ప్రకటన చేయించగలరా? అని హరీష్ రావు ప్రశ్నించారు. లేకపోతే పోలవరం డిజైన్‌ మార్పు చేయించేలా ఏమైనా కండీషన్‌ పెట్టారా? అని అడిగారు

మహాకూటమిలో భాగంగా జరుగుతున్న పొత్తుల వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని హరీష్ రావు వాపోయారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా పని చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకి చెందిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ ప్రాంతానికి సాగునీటి రంగంలో, ఆస్తుల పంపకంలో, ఉమ్మడి రాజధాని విషయంలో, హైకోర్టు విభజనలో ఇలా అనేక అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాల దెబ్బతింటాయనే ఆందోళన తెలంగాణవాదులు, ప్రజల్లో నెలకొని ఉన్నాయని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు మీద ఆధారపడే ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రయోజనాలకు కచ్చితంగా గండిపడుతుందన్నారు. చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రాబాబే అవుతారు, ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగానే ఉంటారు తప్ప ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉండరని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో చంద్రబాబు ఏపీ పక్షాన నిలబడతారా? తెలంగాణ పక్షాన నిలబడతారా? అని హరీష్ రావు నిలదీశారు. అధికారం కోసం తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెట్టైనా సరే మేము శరం లేకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పదలుచుకున్నారా? మీది బేషరతు పొత్తా? శరం లేని పొత్తా? ఏ విషయం అనేది ప్రజలకు స్పష్టం చేయాలని హరీష్ రావు కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు.

16:28 - October 9, 2018

చెన్నై: తమిళ వార పత్రిక ఎడిటర్ నక్కీరన్  గోపాల్ ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర గవర్నర్  బన్వరిలాల్ పురోహిత్  పై  అసత్య కధనాలు ఫ్రచురించినందుకు ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూణే వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆయన్ను ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రోఫెసర్ నిర్మలాదేవి విధ్యార్ధినిలను వ్యభిచారంలోకి దింపుతున్నారని, ఆమె విద్యార్ధినులను రాజ్ భవన్ కు తీసుకువెళుతున్నారని నక్కీరన్ పత్రికలో కధనాలు వెలువడ్డాయి. దీంతో రాజ్ భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తనపై వచ్చిన వార్తలను గవర్నర్ ఖండించారు. కాలేజీ విద్యార్ధినులను మభ్యపెట్టి వ్యభిచారంలోకి  దింపుతున్నారనే ఆరోపణలతో ఏప్రిల్లో నిర్మలాదేవిని అరెస్టు చేసి పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.గవర్నర్  ను  కలిసినట్లు నిర్మలాదేవి పోలీసు విచారణలో చెప్పారు .ఈకేసు విచారించేందుకు విశ్రాంత ఉన్నతాధికారి ఆర్‌.సంథమ్‌ను  నియమించారు. ‌కేసు విచారణ  జరుగుతోంది.  
నక్కీరన్ గోపాల్ అరెస్టు అప్పుడే తమిళనాట రాజకీయ దుమారం రేపింది. గోపాల్ అరెస్టు పత్రికా స్వేచ్చను హరించటమేనని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నక్కీరన్ గోపాల్ ను అరెస్టు చేయించిందిని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. మరోవైపు...సరైన సాక్ష్యాధారాలు లేకుండా వార్త ప్రచురించటం తప్పు అని గోపాల్ అరెస్టును సమర్దిస్తూ టీటీవీ దినకరన్ అన్నారు. కాగా గోపాల్  ను   అరెస్టు చేసిన చింతాద్రిపేట పోలీసు స్టేషన్ వద్ద రాజ్యసభ  సభ్యుడు, ఎండీఎంకే నేత వైగో ధర్నా నిర్వహించారు. గతంలో కరడుగట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్  తో  నక్కీరన్ గోపాల్ ఇంటర్వ్యూ చేసి తన పత్రికలో ప్రచురించి ప్రాముఖ్యం పొందారు.  

 

15:39 - October 9, 2018

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మరో ప్రసంశ తోడయింది. ప్రస్తుతం జరుగుతున్న సంస్కరణల కారణంగా అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారతదేశం చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) ప్రశంసలు కురిపించింది.   
గతకొన్ని సంవత్సరాలుగా ఇండియాలో పలు ముఖ్యమైన సంస్కరణలు ఉదా.. జీఎస్టీ, ద్రవ్యోల్బణం అదుపుచేసే యంత్రాంగం, బ్యాంకుల దివాతీయకుండా చేపట్టిన చర్యల ద్వారా, ఈజ్ ఆఫ్ దూయంగ్ బిజినెస్‌లో సాధించిన ప్రగతి ఆర్థికసోపానాలకు మార్గదర్శకంగా మారాయని బాలిలో ఐఎమ్ఎఫ్ వార్షిక సమావేశం సందర్భంగా రానున్న ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్ (డబ్ల్యూఈఓ) నివేదికలో పేర్కొంది.  
ఇటీవల పెరిగిన ఆయిల్ ధరలు, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది అభివృద్ధి సూచికలో 0.1 శాతం నుంచి 7.4 శాతం పెరుగుదల నమోదు చేసేందుకు కృషి జరుగుతోందని ఐఎమ్ఎఫ్ నివేదిక పేర్కొంది.  భారత్ అంచనాలు సాధ్యం కాకపోయినప్పటికీ..ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే ఇది తక్కువేమీ కాదని నివేదిక పేర్కొంది. చైనా ఆర్థికాభివృధ్ది అంచనాల కంటే భారత్ మెరుగైన ఫలితాలు పొందగలదని ఐఎమ్ఎఫ్ నివేదిక తేల్చింది.

 

15:29 - October 9, 2018

విశాఖ : విశాఖ నగరంలో చెడ్డీగ్యాంగ్ కలకలం రేపుతోంది. మధురవాడలో హల్ చల్ చేసింది. దసరాకు ముందే గ్యాంగ్ నగరంలో తిష్టవేసింది. చెడ్డీగ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు. చెడ్డీగ్యాంగ్ కదలికలతో నగరవాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

నగరంలో ఉంటున్న వైజాగ్ వాసులు దసరాకు సొంతూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇళ్ళళ్లో చోరీ చేసేందుకు చెడ్డీగ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో నగర శివారు మధురవాడలో పోతిన మల్లయ్యపాలెంలోని పనోరమా హిల్స్‌లో 66 నెంబర్ విల్లా వద్ద ఈ గ్యాంగ్‌ సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరా దృశ్యాల అధారంగా పోలీసులు నిర్ధారించారు. నలుగురు సభ్యులు సంచరిస్తున్నట్లు పోలీసులు సీసీ ఫుటేజీని విడుదల చేశారు. ఆ గ్యాంగ్ సభ్యులు గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించారు. సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. అపార్ట్‌మెంట్‌తోపాటు రెండు, మూడు ప్రాంతాల్లో చెడ్డీగ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు. చెడ్డీగ్యాంగ్ రాత్రిపూట తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖాలు కనపడకుండా ముసుకులు వేసుకుని ఇళ్ళళ్లోకి చొరబడుతున్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన చెడ్డీగ్యాంగ్ ఉత్తరాంధ్రలో సంచరిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. చెడ్డీగ్యాంగ్ కదలికలపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

 

15:28 - October 9, 2018

ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్, 2001లో భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి వెనుక మాస్టర్ మైండ్ అయిన ఉగ్రవాది మసూద్ అజహర్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మసూద్.. కొంత కాలంగా మంచానికే పరిమితమైనట్టు భారత నిఘా వర్గాల సమాచారం. వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో మసూద్ బాధపడుతున్నాడని, రావల్పిండిలోని ఓ మిలిటరీ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది.

మసూద్ స్వగ్రామమైన భవల్‌పూర్‌, పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లో కానీ ఇటీవలి కాలంలో అతడు కనపడలేదని తెలుస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మంచానికే పరిమితమయ్యాడట. దీంతో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను మసూద్ సోదరులు రాఫ్ అస్గర్, అత్తర్ ఇబ్రహీం చూసుకుంటున్నారు. భారత్, ఆప్థనిస్థాన్‌లపై ఉగ్రవాద దాడులు ఆ ఇద్దరి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని నిఘా వర్గాల సమాచారం.

1999లో కాందహార్ హైజాక్ ఎపిసోడ్‌లో ప్రయాణికులకు ఎలాంటి హాని కలగకుండా ఉండటానికి ప్రతిగా భారత్ విడుదల చేసింది ఈ మసూద్ అజహర్‌నే. 2005లో అయోధ్యలో, 2016లో పఠాన్‌కోట్‌లో జరిగిన దాడుల వెనుక సూత్రధారి కూడా మసూద్ అజహరే. ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించాలని కోరుతూ భారత్, అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చైనా వాటిని అడ్డుకుంటోంది.

14:29 - October 9, 2018

విజయ్ సేతుపతి, వైవిధ్య భరితమైన కథల్ని ఎంపిక చేసుకుంటూ వరస విజయాలు సాధిస్తున్నాడు.. విజయ్ రీసెంట్ మూవీ 96 తమిళనాట సంచలన విజయం సాధించింది.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నారు..
ఇప్పుడు విజయ్ మరో ఢిఫరెంట్ ఫిలిమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. త్యాగరాజన్ కుమార‌రాజా డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాజిల్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం సూపర్ డీలక్స్..
ఈ మూవీలో విజయ్ సేతుపతి హిజ్రాగా కనిపించనున్నాడు.. మూవీ యూనిట్ సూపర్ డీలక్స్ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది.. ఆ లుక్‌లో విజయ్‌ని చూసి అందరూ షాక్ అయ్యారు.. చీరకట్టు,నుదుట బొట్టు, ముక్కు పుడకతో విజయ్ వెరైటీగా ఉన్నాడు..
ఈ పోస్టర్‌లో లేడీ బృహన్నలలా రెడీ అయిన విజయ్‌తోపాటు, సీనియర్ నటి రమ్యకృష్ణ, సమంత కూడా ఉన్నారు.. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.. ఈ మధ్యే నవాబ్ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయిన విజయ్ సేతుపతి, మెగాస్టార్ చిరంజీవి, సైరా నరసింహా రెడ్డిలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు...

 

14:15 - October 9, 2018

అహ్మదాబాద్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ఓ కుమారుడికి కోర్టు బుద్ధి చెప్పింది. ప్రతి నెలా ఖర్చుల కోసం డబ్బు ఇవ్వాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఏకంగా అతడికి నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన రాంఛోద్‌భాయ్ సోలంకి, జసుమంతి సోలంకికి ఇద్దరు కుమారులు. వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులకు కొడుకులతో వివాదం నడుస్తోంది. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో.. గతిలేని పరిస్థితుల్లో 2013లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కొడుకుల నుంచి తమకు ప్రతి నెలా కొంత డబ్బు అందేలా చూడాలని కోరారు. పాపం ఆ దంపతుల కష్టాలను చూసిన కోర్టు.. ప్రతి నెలా తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.900 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి నుంచి మొదటి కుమారుడు దయాభాయ్ మాత్రం ప్రతి నెలా తల్లిదండ్రులకు డబ్బు చెల్లిస్తున్నాడు. రెండో కుమారుడు కాంతి భాయ్ మాత్రం సరిగా డబ్బు ఇవ్వడం లేదు. 

రెండో కుమారుడి నుంచి డబ్బు సరిగా అందకపోవడంతో.. ఆ దంపతులు మళ్లీ 2015లో కోర్టును ఆశ్రయించారు. తమకు డబ్బు సరిగా చెల్లించడం లేదని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఏప్రిల్‌లో జైలు శిక్ష విధించి నోటీసులు పంపింది.  అయినా అతడు డబ్బు చెల్లించకపోవడంతో శిక్షను ఖరారు చేసింది. తండ్రికి డబ్బు ఇవ్వనందుకు 735రోజులు.. తల్లికి పంపనందుకు 810 రోజులు.. మొత్తం కలిపి 1545 రోజులు జైలు శిక్ష విధించింది. కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కోర్టు తీర్పుపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలకు కోర్టు హెచ్చరికలు పంపినట్టైంది. 

13:19 - October 9, 2018

చెన్నై: క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిని శ్రీరెడ్డి కొద్ది నెలల క్రితం బయట పెట్టి సంచలనం సృష్టించింది. అప్పటికే హాలీవుడ్‌లో "మీ టూ" పేరుతో మొదలైన ఉద్యమం బాలీవుడ్‌లో పాకింది. అప్పటి నుంచి మహిళలు ఒక్కొక్కరుగా తమపై జరిగిన లైంగిక దాడిని ధైర్యంగా గొంతెత్తి చెబుతూ సెలబ్రిటీల బండారం బయటపెడుతున్నారు. దక్షిణాదిలో ఇటీవల సింగర్ చిన్మయి తనపై జరిగిన లైంగిక దాడిని బయటపెట్టి మీ టూ ఉద్యమాన్ని ఉధృతం చేసారు. 
లేటెస్ట్‌గా ప్రముఖ తమిళ పాటల రచయిత, పద్మవిభూషణ్ అవార్డుగ్రహీత వైరముత్తు తన దగ్గర పని చేసే సహాయకురాలిపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు.. జర్నలిస్టు సంధ్యామీనన్‌కు చెప్పారు. ఆమె ఈ విషయాన్ని, బాధితురాలు పంపిన వాట్సప్ మెసెజ్‌తో తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 
తమిళ చిత్రపరిశ్రమలో లెజెండ్‌గా భావించే వైరముత్తు దగ్గర బాధితురాలు 18వ ఏట నుంచి పని చేస్తోంది. పాటల డిక్టేషన్ కోసం పిలిపించుకుని, దగ్గరకు తీసుకుని, ముద్దు పెట్టుకుని, కౌగిలించుకునే వాడని బాధితురాలు వాపోయింది. ఆ సమయంలో ఏం చేయాలో తోచక భయం వేసి ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి బయట పడేదాన్నని ఆమె చెప్పింది. ఆయన నిజస్వరూపం తెలిశాక ఒంటరిగా ఉండలేక నలుగురు ఉన్న చోట మాత్రమే ఉండేలా అలవాటు చేసుకున్నట్లు బాధితురాలు తెలిపినట్లు జర్నలిస్టు సంధ్యామీనన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైరముత్తుకున్న రాజకీయ పలుకుబడి ఇతర పరిచయాల వల్ల అతను చేసిన అఘాయిత్యాన్ని బయటకు చెప్పలేక ఇప్పుడు చెప్పినట్లు భాదితురాలు తెలిపింది.

13:15 - October 9, 2018

కాలిఫోర్నియా: డేటా లీక్.. సోషల్ మీడియాకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఖాతాదారుల సమాచారం ఇతరులకు చేరిపోతోంది. గతంలో ఫేస్‌బుక్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. డేటా లీక్ వ్యవహారంలో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్‌ ప్లస్‌కు ఈ సమస్య ఎదురైంది. గూగుల్ ప్లస్‌లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తెలుస్తోంది. గూగుల్‌ ప్లస్‌లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్‌ అయ్యుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్‌ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్‌ ప్లస్‌ కార్పొరేట్‌ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఈ వ్యవహారంపై స్పందించిన గూగుల్..
గూగుల్‌ ప్లస్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదని తెలిపింది. అసలు ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని వివరణ ఇచ్చింది. కాగా విచారణ సంస్థలకు భయపడి గూగుల్‌ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

13:12 - October 9, 2018

కరీంనగర్ : కులం, మతం మనుషుల ప్రాణాలను నిలువునా హరించివేస్తున్నాయి. పరువు పేరుతో జరిగే దారుణ హత్యలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రణయ్, మాధవి ఇలా వెలుగులోకి వచ్చినవి చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రేమను కాలరాసేందుకు మరో పరువు కత్తి యువకుడి ప్రాణాలను బలితీసుకుంది.శంకరపట్నం మండలం తాడికల్ లో ఈ పరువుహత్య జరిగింది. గడ్డి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కుమార్ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు కుమార్ ను వారించారు. అంతేకాదు పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ సదరు యువతితో కుమార్ తిరగటం మానలేదు.ఈ నేపథ్యంలో  తాడికల్ శివారులో శవమై కనిపించాడు. కుమార్ మరణంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి బంధువులే కుమార్ ను చంపేశారని, ఇది ముమ్మాటికీ పరువుహత్యేనని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. కుమార్ మరణంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విచారణకు వచ్చిన పోలీసు వాహనాన్ని కూడా గ్రామస్తులు ధ్వంసం చేశారు. జీపు అద్దాలను పగలగొట్టారు.

13:12 - October 9, 2018

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన లవ్, ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్... అరవింద సమేత వీర రాఘవ... ఇప్పటికే ధియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది.. మరోపక్క సాంగ్స్ అండ్ సాంగ్ ప్రోమోస్ కూడా వైరల్ అవుతున్నాయి...
మరికొద్ది గంటల్లో అరవింద సమేత ధియేటర్స్‌లో సందడి చెయ్యబోతుండగా, తారక్ ఫ్యాన్స్‌కి, ఏపీ‌ ప్రభుత్వం ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది.. అరవింద సమేత చిత్రాన్ని అదనంగా మరో రెండు ఆటలు‌ ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చింది.. అక్టోబర్ 11 నుండి 18వరకు, ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు రెండు షోలు వేసుకోవచ్చు.. ఈ లెక్కన అరవింద సమేత రోజుకు ఆరు ఆటలు అన్నమాట.. చిత్ర నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) వినతిమేరకు, ఏపీ హోం మంత్రిత్వశాఖ మెమో పాస్ చేసారు.. అసలే దసరా సెలవులు, పైగా ఆరు షోలు అంటే.. కలెక్షన్స్ అదిరిపోతాయి అంటున్నారు తారక్ అభిమానులు..

12:50 - October 9, 2018

హైదరాబాద్ : ప్రజాగాయకుడిగా అలరించిన ప్రముఖ ఉద్యమ గాయకుడు గద్దర్ ఇక సంకీర్ణ రాజకీయాల్లోకి రానున్నారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమ సయమంలో చైతన్యాన్ని కల్పించిన గద్దర్ గులాబీ బాస్ తో ఢీకొంటానంటున్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటే రానున్న ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్ తెలిపారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ స్థానంలో బరిలోకి దిగుతానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఓటు హక్కును గజ్వేల్ లోనే నమోదు చేసుకున్నానని... అందుకే అక్కడ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నానని చెప్పారు. ఓటు హక్కును నమోదు చేసుకోవడం తన జీవితంలో గొప్ప అనుభూతి అని అన్నారు. ఓటు హక్కు వినియోగంపై ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను నిన్న గద్దర్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మనీ, మీడియా, మాఫియా మధ్య ఓటు బందీ అయిందని చెప్పారు. ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో మీరు భారతీయుడు అయ్యారని రజత్ కుమార్ తనతో అన్నారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలు, రెండు పడకల ఇళ్లు ఏమయ్యాయని నిలదీశారు. దీనిపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలని గద్దర్ తెలిపారు.
 

12:34 - October 9, 2018

అమెరికా : దేనికైనా ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాలి. సరికొత్త ఆలోచనలకు నాంది పలకాలి. ఆ ఆలోచనలు. ఆ పదాలు సరికొత్తగా వుండాలి. అవి అందరికీ అందుబాటులో వుండాలి. అందరూ ఉచ్ఛరించేలా వుండాలి. దీనికి ఒక ప్రత్యేక వేదిక వుండాలి. సరికొత్త పదాలకు, ఆ పదాలను పుట్టించే ఆలోచనలు ఆక్స్ ఫర్డ్ సొంతం. మరి ఈ సంవత్సం ఆక్స్ ఫర్డ్ ఏఏ కొత్త పదాల్ని తీసుకొచ్చిందో తెలుసుకుందాం..

ప్రతీ సంవత్సరం సరికొత్త మాటల్ని కనిపెట్టే ప్రఖ్యాత యూనివర్శిటీ ఈ సంవత్సరంలో నాలుగు సార్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కొత్త పదాలు,మాటలు కలుపుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈసారి 1400 కొత్తపదాలను కొత్తగా చేర్చింది. వాటిలో ‘ఇడియోక్రసీ’ కూడా ఒకటి. ఇడియోక్రసీ అంటే ఎటువంటి జ్ఞానం లేని, మూర్ఖులతో ఏర్పడిన ప్రభుత్వం అని అర్థం. కాగా ఇప్పటికే ఈ డిక్షనరీలో ఇప్పటికే ‘క్రసీ’ అనే సఫిక్స్‌ తో వంద పదాలున్నాయి.

డెమోక్రసీ, అరిస్టోక్రసీ వంటి పదాలు గ్రీకు భాష నుంచి వచ్చినవి. 18వ శతాబ్దంలో ఇంగ్లీషు పదాలకు ఓక్రసీ కలిపి స్టాటోక్రసీ, మోబోక్రసీ వంటి పదాలను డిక్షనరీలో చేర్చారు. 19 శతాబ్దంలో ఇలాంటి పదాలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి. అలాగే ఇప్పటి ఇడియోక్రసీ కూడా. 1832లో ఫూలోక్రసీ, 1909లో డియటోక్రసీ వంటి పదాలను కూడా ఇదే అర్థంతో వినియోగించేవారు. 1967లో ఇడియోక్రసీ అనే పదం వెలుగులోకి వచ్చింది. దానిమీద 2006లో ఓ సినిమా కూడా వచ్చింది. అమాయకులు, ఏ మాత్రం జ్ఞానం లేని ఒక మానవ తెగ గురించి ఆ సినిమాలో చూపిస్తారు. అలాగే ఫిలిప్పైన్స్‌కు చెందిన ‘ట్రాపో’ అనే పదాన్ని ఈసారి జత చేశారు. అధికారంలో ఉన్న సంప్రదాయ, అవినీతి పరుడైన వ్యక్తి గురించి అది తెలియజేస్తుంది. ఇప్పుడు కొత్తగా కలుపుతోన్న పదాల్లో చాలా కాలం నుంచి వాడుతున్నవి కూడా ఉన్నాయి. అయితే గత ఎడిషన్‌ సవరణ సమయంలో వాటిని గుర్తించలేదు.
 

12:30 - October 9, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్‌‌బ్యానర్‌పై.. నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మించిన చిత్రం.. సవ్యసాచి.. ఇటీవల రిలీజ్ చేసిన సవ్యసాచి టీజర్‌‌కి మంచి స్పందన వస్తోంది..
ఇప్పుడు, ఎమ్.ఎమ్.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సవ్యసాచి‌లోని ఫస్ట్‌సాంగ్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది‌ మూవీయూనిట్.. వైనాట్ అంటూ సాగే ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినసొంపుగా ఉంది... కీరవాణి మ్యూజిక్‌లోని మ్యాజిక్, సాంగ్‌కి మరింత అందం తీసుకొచ్చింది.. ప్రస్తుతం సవ్యసాచి లిరికల్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది..ఆర్.మాధవన్ విలన్‌గా కనిపించబోతుండగా, ఇతర పాత్రల్లో భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, ముకుల్ దేవ్, రావు‌రమేష్ తదితరులు నటిస్తున్నారు... నవంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రాబోతుంది.. 

సాంగ్ కోసం కిందఉన్న యూఆర్ఎల్ చూడండి...

12:29 - October 9, 2018

నాగ్‌పూర్: పాకిస్థాన్ గూఢ‌చారి సంస్థ ఐఎస్ఐ ప‌న్నిన కుట్ర వెలుగులోకి వ‌చ్చింది. భారత అమ్ములపొదిలో కీలక అస్త్రమైన ‘బ్రహ్మోస్‌ క్షిపణి’ రహస్యాలు తెలుసుకునేందుకు ఐఎస్ఐ ఈ కుట్ర ప‌న్నింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ క్షిపణి పరీక్ష కేంద్రంలో ప‌ని చేస్తున్న ఇంజినీర్ నిషాంత్ అగ‌ర్వాల్‌ను ఏటీఎస్ అరెస్టు చేసింది. నిషాంత్ అగ‌ర్వాల్ ఐఎస్ఐ ఏజెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. క్షిప‌ణికి సంబంధించిన స‌మాచారాన్ని ఐఎస్‌ఐకి చేరవేస్తున్న‌ట్టు అధికారులు గుర్తించారు. ఫేస్‌బుక్ ద్వారా అతడు ఈ సమాచారాన్ని పంపించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఏటీఎస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఫెసిలిటీ యూనిట్ వద్ద నిశాంత్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ యూనిట్‌లో బ్రహ్మాస్ క్షిపణులకు ప్రొపెల్లెంట్, ఇంధనం వంటివి సమకూరుస్తున్నారు.
 
భారత మిస్సైల్ సిస్టమ్‌కు చెందిన కీలకమైన సాంకేతిక సమాచారాన్ని నిశాంత్ అగర్వాల్‌ సేకరించి ఐఎస్ఐకి లీక్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన బ్రహ్మోస్‌ సాంకేతిక సమాచారాన్ని నిషాంత్ ఐఎస్ఐకి ఏ మేరకు చేరవేశాడనే అంశంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ గూఢచర్యం వ్యవహారంలో మరో ఏజెన్సీ ప్రమేయం ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

12:03 - October 9, 2018

తిరుమల : ఏడుకొండలపై కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలు నేడే అంకురార్పణ జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆయన సేనాధిపతి విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. ఈ వేడుకను వైఖానస ఆగమ మోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయతీ.
ఈరోజు సాయంత్రం విష్వక్సేనుడు భూమి పూజతో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాయిద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలో మట్టితో నింపిన 9 మూకుళ్లలో నవధాన్యాలతో బీజావాపం చేస్తారు. నిత్యం నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఈ ఏడాది అధికమాసం రావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల అంటే సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను కనులారా గాంచి ఆ తిరుమలేశుని దర్శనం లభించడం కోసం మన రాష్ట్రం నుంచే కాకుంగా దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆపదమొక్కుల వాడికి మొక్కులు చెల్లించుకుంటే కష్టాలు కొండెక్కుతాయని కొలిచేవారు కొందరైతే.. వైకుంఠవాసుని దివ్య దర్శనంతో జన్మ తరింపజేసుకోవాలనుకునే వారు ఇంకొందరు.. గంటలు.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి ఆ దేవదేవుని దర్శించుకుని గాని తిరిగి వెళ్లరు… ఇక బ్రహ్మోత్సవ సమయాల్లో అయితే.. ఆ తొమ్మిదిరోజులపాటు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తిరుమల కొండకు భక్తులు తరలివస్తారు. కలియుగ వైకుంఠంపై వెలసిన వేంకటాచలపతి.. సకల సింగారాలతో తిరువీధుల్లో మెరిసిపోయేందుకు సిద్ధమవుతున్నాడు.

 

10:26 - October 9, 2018

ఢిల్లీ : భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ‘రాఫెల్ యుద్ధ విమానాల’ ఒప్పందంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ పై అక్టోబర్ 10న విచారణ జరగనుంది. వినీత్ దండ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ కే ఎం జోసెఫ్ మోండేల బెంచ్ వాదనలు విననుంది. రాఫెల్ ఒప్పందం వివరాలతో పాటుగా, యూపీఏ, ఎన్ డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ ఒప్పందపు విలువలో వున్న వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయవాది తన పిల్ లో కోరారు.
ఇదిలావుండగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంపై స్టే విధించాలంటూ ఎం ఎల్ శర్మ అనే అడ్వకేట్ వేసిన పిటీషన్ కూడా ఈ నెల 10న విచారణకు రానుంది. 36 విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, ఇరు దేశ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేనందున, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది శర్మ తన పిటీషన్ లో పేర్కొన్నారు.
ఇదేకోవలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి వివరాలను పార్లమెంటుకు సమర్పించాలని కోరుతూ సుప్రీంలో మార్చి నెలలో మరో పిటీషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ ప్రొసీజర్ అనుమతి కోరలేదని, ఫ్రాన్స్ తో జరిగిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదో కేంద్రం నుంచి తెలుసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత తెహ్ సీన్ ఎస్ పూనావల్లా కూడా ఓ పిటీషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.
రాఫెల్ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం. భారత ఎయిర్ ఫోర్స్ ఆయుధాల ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయాలనేదే ఒప్పందం. రెండు ఇంజిన్ల మీడియం మల్టీ రోల్ కంబాట్ సామర్థ్యం కలిగిన రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ తయారు చేసింది. 126 యుద్ధ విమానాల కొనుగోలుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2007 ఆగస్టులో ప్రతిపాదనలు చేసింది.  
 

 

09:47 - October 9, 2018

ముంబై : మీ టూ ఉద్యమం ఇప్పుడు మనదేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.మహిళలు మౌనం వీడి.. సామాజిక మాధ్యమ వేదికల మీదికి వచ్చి.. తమపై జరిగిన లైంగిక వేధింపులు, లైంగిక దాడులపై నినదించడమే మీ టూ ఉద్యమంప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో  మీటూ  ఆరంభమైంది. ఇది సంచలనంగా మారి చలనచిత్ర పరిశ్రమను పట్టి కుదిపేస్తోంది.

మీటూ ప్రకంపనలు ఇప్పుడు మీడియాను తాకాయి.  దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలనూ ఉక్కిరిబిక్కిరి చేయటం ఆరంభించింది. తనుశ్రీ ఆరంభించిన ట్విటర్‌ సందేశ పరంపరను చూసి మరికొంతమంది నటీమణులు తమకు ఎదురైన అనుభవాలను బయటపెట్టటం మొదలుపెట్టారు. 'క్వీన్‌' సినిమా చిత్రీకరణ సమయంలో ఆ చిత్ర దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ప్రముఖ నటి కంగనా రనౌత్‌  ఆరోపించింది. ఉత్తరాది నుంచి 'మీ టూ' ఉద్యమంలో కంగనా దూకితే దక్షిణాదికి చెందిన గాయని చిన్మయి, నటి ఆషా శైనీ తామూ లైంగికంగా వేధింపులకు గురయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పత్రిక 'హిందుస్థాన్‌ టైమ్స్‌'లో పని చేసిన ఒక మహిళా ఉద్యోగి తమ పత్రిక రాజకీయ విభాగం సంపాదకుడు తనను లైంగికంగా వేధించాడని వెల్లడించటంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం.

గతంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో బయటపెడుతూ ఆరంభమైన 'మీ టూ' ఉద్యమం ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాదు, వివిధ మీడియా సంస్థలనూ చేరుకుంది. మీడియా సంస్థలు కూడా 'మీ టూ' సుడిలో చిక్కుకుంటున్నాయి. తాజాగా హిందుస్థాన్‌ టైమ్స్‌ పత్రిక రాజకీయ విభాగం సంపాదకుడు ప్రశాంత్‌ ఝాపై సంస్థ మాజీ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో ఆయన రాజీనామా సమర్పించినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే వినోద కార్యక్రమాలను రూపొందించే 'ఏఐబీ' సంస్థ వ్యవస్థాపకుల్లో ఇద్దరు కూడా ఇవే ఆరోపణల సుడిలో చిక్కుకొని, సెలవు మీద వెళ్లిపోయారు. 'మీ టూ' ట్విటర్‌ పరంపరలో ప్రముఖ పత్రికా సంస్థలకు చెందిన మరికొందరు పాత్రికేయుల పైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఉద్యమం ఇంకెలా మారుతుందో ,  ఇంకెంతమంది బాధితులు ముందుకు వస్తారో చూడాలి.
 

09:14 - October 9, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చడం లేదు.  ఈ ఏడాది మార్చిలో ఏడు జిల్లాలకు విడుదల చేసిన 350 కోట్ల రూపాయలనూ మోదీ ప్రభుత్వం వెనక్కితీసుకుంది.  రాష్ట్ర ప్రభుత్వం యూసీలు, ఖర్చుల వివరాలను అందించి ఆర్నెళ్లు గడుస్తున్నా... ఈ నిధుల విడుదలకు  సంబంధించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.  ఏపీతోపాటు పెండింగ్‌లో పెట్టిన తెలంగాణకు చెల్లించాల్సిన 450 కోట్ల రూపాయల నిధులను మాత్రం వారం రోజుల క్రితమే విడుదల చేసింది. ఏపీకి మాత్రం ఎలాంటి నిధులు విడుదల చేయకుండా మరోసారి మొండిచేయి చూపించింది.
కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఐటీ సోదాలు
ఏపీలో జరిగిన ఐటీ దాడులపై ఐటీశాఖ మంత్రి లోకేష్‌ స్పందించారు. ఐటీ దాడుల పేరుతో ఏపీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో ఐటీ దాడులు జరుగలేదన్నారు.  19 బృందాలు, 200 మంది సిబ్బందితో దాడులు నిర్వహించడం.. కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందనడాకి  నిదర్శనమన్నారు. మొత్తానికి  కేంద్రం తీరుపై ఏపీ టీడీపీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్రంతో విభేదిస్తున్నందున రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని వారంతా మండిపడుతున్నారు.

08:57 - October 9, 2018

ఏలూరు: పోరాట‌యాత్ర‌లో భాగంగా ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఏపీ మంత్రి నారా లోకేష్ పై విమ‌ర్శ‌లు చేశారు. లోకేష్ కెపాసిటీ ఏంటో ప‌వ‌న్ వివ‌రించారు. లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేడ‌ని , ఆయ‌న‌కు అంత స‌త్తా లేద‌ని ప‌వ‌న్ తేల్చేశారు.జనసేనకు భయపడే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని ప‌వ‌న్ విమర్శించారు. పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఎక్కడ జనసేన క్షేత్రస్థాయిలో బలంగా పాతుకుపోతుందోనని చంద్రబాబు భయపడుతున్నారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొయ్య‌ల‌గూడెంలో ప‌వ‌న్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదని ప‌వ‌న్ వాపోయారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని  చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే కౌలు రైతులకు అండగా ఉంటామని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప‌వ‌న్ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో జనసేన జెండా ఎగురుతుందని, గ్రామాలకు నిస్వార్థంగా సేవ చేసే సర్పంచ్‌ల అవసరం ఉందని స్పష్టం చేశారు. 

ఇక దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని గురించి ప్రస్తావిస్తూ.. ఆయన్ను విప్ పదవి నుంచి తొలగిస్తారా? లేక ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా? అని సీఎం చంద్రబాబును ప‌వ‌న్ హెచ్చరించారు.

08:41 - October 9, 2018

అమరావతి : 2019నాటికి లక్ష ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్. క్రమంగా అనుకున్న లక్ష్యాన్ని చేరువువుతున్నట్లు చెప్పారు. కృష్ణాజిల్లా గన్నవరంలో హెచ్‌సీఎల్ కంపెనీకి లోకేష్ భూమిపూజ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయని చెప్పారు. 

రాష్ట్రంలో యువతకు ఉద్యోగం,ఉపాధి కల్పన లక్ష్యంగా ఎపి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్పొరేట్, ఐటి కంపెనీల స్థాపనకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటిరంగానికి చెందిన పెద్ద కంపెనీలు రాష్ట్రంలో బ్రాంచ్ లు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి..తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో హెచ్ సిఎల్ యూనిట్ వన్ కు భూమి పూజ చేశారు ఐటి మంత్రి నారా లోకేష్.. దేశంలోనే మూడవ అతిపెద్ద ఐటి కంపెనీ అయిన హెచ్ సిఎల్ మొదటి బ్రాంచ్ కోసం 28.69 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. దీంతో దాదాపు 7500 మందికి ఉపాది దొరికే అవకాశముంది..మరో బ్రాంచ్ ను మంగళగిరిలో ప్రారంభించనున్నామని, ఎపిలో యూనిట్ పెట్టడం చాల సంతోషంగా ఉందని , స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈవో రోషిని లాడార్ తెలిపారు..

ఎపిలో ప్రస్తుతం మంచి నాయకత్వం ఇచ్చే ప్రభుత్వం ఉందన్నారు మంత్రి లోకేష్..అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, 2019నాటికి లక్ష ఐటి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎపికి వచ్చిన ప్రముఖ ఐటికంపెనీల్లో హెసి ఎల్ అగ్రభాగంలో ఉందన్నారు మంత్రి లోకేష్. భూమిపూజ చేసుకున్న హెచ్ సిఎల్ కంపెనీ అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు..

ఐటి కంపెనీల స్థాపనకు ఎపి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని.. ప్రముఖ ఐటి కంపెనీలు తమ బ్రాంచ్ లను ఎపిలో స్థాపించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. హెచ్ సిఎల్ కంపెనీ చేరికతో ఆంధ్రప్రదేశ్ ఐటి రంగంలో యువతకు ఉపాది అవకాశాలు పెరిగే అవకాశముందన్నారు మంత్రి లోకేష్. 
 

08:20 - October 9, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం టెన్షన్ నెలకొంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన  రెండు కీలక అంశాలపై ఆ రోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ వాదనతో ఏకీ  భవించి పిటిషన్లను తోసి పుచ్చుతుందా లేక.. పిటిషనర్ల వాదనను బలపరుస్తుందా అన్న  ఆందోళన అధికార, ప్రతిపక్షాల్లో నెలకొంది. ఇంతకీ బుధవారం ఏం జరగబోతోంది? ఆ  రెండు కీలక అంశాలేంటి?
ఈనెల 10న బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే ఓటర్ల జాబితా,  అసెంబ్లీ రద్దుపై దాఖలైన 200లకు పైగా పిటిష్లపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఓటరు  జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి లేవనెత్తిన  అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్ హైకోర్టుకు కౌంటర్ దాఖలు చేసింది. ఓటరు జాబితా  సవరణ ప్రక్రియ, అభ్యంతరాలతో పాటు పరిష్కరించిన వివరాలను కోర్టుకు  సమర్పించింది. ఈసీ కౌంటర్ పై అభ్యంతరాలుంటే తెలపాలని మర్రి శశిధర్ రెడ్డిని హైకోర్టు  ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా వేసింది. 
మరోవైపు తెలంగాణ శాసనసభ రద్దును సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ నేత డీకే అరుణ  హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ శాసనసభను రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేశారన్న  ఆమె.. ఐదేళ్లు ఉండాల్సిన సభను రాజకీయ ప్రయోజనాల కోసం మధ్యలోనే  రద్దుచేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. రద్దు చేసే ముందు సభ్యులకు సమాచారం  కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. 
అసెంబ్లీ రద్దుపై కోరుట్ల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు దాఖలు చేసిన  పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ  చర్యను తప్పుపడుతూ హైకోర్టులో దాదాపు 200 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు  దాఖలయ్యాయి. పదవీకాలం పూర్తికాకుండానే మంత్రిమండలి తమ ఇష్టానుసారంగా  అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యంగ విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అభ్యంతరాలను ఎప్పుడైనా  సమర్పించవచ్చ ఈసీ.. ఈనెల 12 తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా విడుదల  చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితా సహా.. అసెంబ్లీ రద్దుపై హైకోర్టు ఏం తీర్పు  చెప్పనుందనేది ఆసక్తి రేపుతోంది. 

 

08:01 - October 9, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కింగ్‌ మేకర్‌ కావాలని బీజేపీ భావిస్తోంది.టీఆర్‌ఎస్‌, మహాకూటమిల మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్న కమల దళం.. టీఆర్‌ఎస్‌కు మెజారిటీ తగ్గితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని యోచిస్తోంది! ఆ దిశగా దూకుడు పెంచింది! వ్యూహాలకు పదును పెడుతోంది! రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి దేశం నలుమూలల నుంచి నేతలను రప్పించాలని నిర్ణయించింది! అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ.. 30 సీట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. కచ్చితంగా 15 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల వ్యూహాల అమలుకు పార్టీ, సంఘ్‌ పరివార్‌ ఉమ్మడి కార్యాచరణతో రంగంలోకి దిగుతున్నాయి. 
ఒకవైపు పార్టీ పొరుగు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలను రంగంలో దింపుతుండగా, మరోవైపు సంఘ్‌ పరివార్‌ క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి 15మంది పార్టీ సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 100మంది ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతలు రానున్నారు. కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలనుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ చేరుకున్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటక తరహాలో ఇంటింటికీ ప్రచారం చేసేందుకు సంఘ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. 31 జిల్లాల నుంచి ఆరెస్సెస్ కు సంబంధించిన అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు ఈ అంశంపై హైదరాబాద్‌లో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

07:47 - October 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్దుల జాబితాను దసరా లోపు విడుదల చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ నెల 18 లోపు అభర్ధుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయనుంది. నేడు మహాకూటమి నేతలలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 5గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్యర్యంలో టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ రోజు ఎంత సేపైనా అభ్యర్దుల వడపోతను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్, కమిటీ సభ్యులు జ్యోతిమణి షర్మిష్ఠ ముఖర్జీలు బుధవారం హైదరాబాద్ కు రానున్నారు. ఈ కమిటీ మూడు రోజుల పాటు జిల్లా లోనూ పర్యటించి టీపీసీసీ ఎన్నికల కమిటీ రూపొందించిన అభ్యర్ధుల జాబితా పై చర్చిస్తుంది. అభ్యర్దుల జాబితా పై టీపీసీసీ ముఖ్యనేతలు స్క్రీనింగ్ కమిటీ పూర్తి స్థాయిలో కసరత్తు చేసి 16వ తేదీ నాటికి నియోజవర్గానికి ఒకపేరుతో జాబితాను రూపొందించి ఏఐసీసీకి అందిస్తారు. ఏఐసీసీ ఆమోద్రముద్రతో 18న కాంగ్రెస్ అన్ని స్థానాల అభ్యర్దులను ఒకేసారి ప్రకటించాలని నిర్ణయించారు.
 

 

07:32 - October 9, 2018

హైదరాబద్ :  రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ స్వయంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. 50 రోజుల వ్యవధిలో 115 నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం కేసీఆర్‌ గత నెల 7న హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల  ప్రచారం ప్రారంభించారు. నిజామాబాద్‌, నల్గొండ, వనపర్తిల్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. శనివారం ఎన్నికల షెడ్యూలు విడుదలవడంతో దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేయాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాలుగు నియోజకవర్గ కేంద్రాలు మినహాయించి, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆయన భావిస్తున్నారు.  బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాలు పోనూ మిగిలిన రోజుల్లో ప్రచారం నిర్వహించాలనుకుంటున్నారు. రోజుకు రెండు నుంచి మూడు సభలు జరిపే అవకాశం ఉంది.
 

07:22 - October 9, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఈడీ దాడులు కలకలం రేపాయి. సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణరావు డైరక్టర్‌గా ఉన్న సంస్థల్లో ఈడీ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకుల నుంచి 304కోట్ల రూపాయల నిధుల మళ్లింపు, ఎగవేత ఆరోపణలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారం నిమిత్తం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరిగాయని సమాచారం. ఇదే సంస్థకు చెందిన చెన్నై, బెంగళూరు కార్యాలయాల్లోనూ ఈడీ బృందాలు సోదాలు చేశాయి. 

సీబీఐ మాజీ డైరక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణరావుపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన స్థాపించిన బెస్ట్‌ క్రామ్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ తరఫున వివిధ బ్యాంకుల నుంచి రూ.304 కోట్ల రుణం తీసుకొని చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ 2016లో కేసు నమోదు చేసింది. చెన్నైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు నమోదయ్యింది. మోసపూరితంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు పూర్తిచేసి అభియోగపత్రాలు దాఖలు చేసింది. ఈడీ సోదాల కారణంగా మరోమారు శ్రీనివాస కల్యాణరావు పేరు వెలుగులోకి వచ్చింది.
 

Don't Miss