Activities calendar

10 October 2018

22:13 - October 10, 2018

హైదరాబాద్: తెలంగాణలో  త్వరలో  ఒక ప్రజాస్వామిక, ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని  టీపీసీీసీ అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు.  ఆపద్దర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు  ఆయన ఒక లేఖ రాశారు. అనంతరం  విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం రాజకీయ పార్టీలకు సహజమని, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడాన్ని విమర్శిస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. 2009లో తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇచ్చినందుకే  టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నామని ఆనాడు కేసీఆర్ చెప్పారని,   చంద్రబాబు లో ఏం మార్పు వచ్చిందని  చండీయాగానికి పిలిచి సన్మానించారని ఉత్తమ్  ప్రశ్నించారు. టీడీపీ నాయకురాలు, ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్లి మీరు  టీడీపీ నాయకులతో రహస్య మంతనాలు జరపలేదా ,ఈ రోజు మేము  ఎన్నికల పొత్తులు పెట్టుకుంటే మీకు అభ్యంతరం వచ్చిందా అని  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రశ్నించారు. గతంలో తెలంగాణకు బద్ద వ్యతిరేకయిన సీపీఎంతో  కూడా టీఆర్ఎస్ ఎన్నికల  పొత్తులు పెట్టుకుందని   ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

21:24 - October 10, 2018

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలన అంతమొందించడానికి 1983లో నందమూరి తారక రామారావు టీడీపీని స్ధాపిస్తే, అధికారం కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నారని టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అన్నారు.  మహబూబ్ నగర్, దేవరకొండకు చెందిన  టీడీపీ నాయకులు కేటీఆర్ సమక్షంలో బుధవారం టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతోనే టీడీపీ పతనం ప్రారంభమైందని, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 85 స్థానాల్లో గెలుస్తుందని ఎన్డీటీవీ సర్వే చెప్పిందని కేటీఆర్ అన్నారు.

20:21 - October 10, 2018

ఢిల్లీ : కర్ణిసేన వ్యవస్థాపకుడు...వివాదాస్పద నేత సూరజ్‌పాల్‌ అమూ మళ్లీ బీజేపీలో చేరారు. పద్మావతి పాత్రను కించ పరిచారంటూ బాలీవుడ్‌ నటి దీపికా పడుకోన్ .. సంజయ్‌ లీలా బన్సాల్‌ తలకు 10 కోట్లు పారితోషికం ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. కర్ణిసేనను ఏర్పాటు చేసి సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆయనకు బీజేపీ షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతో పార్టీకి రాజీనామా చేశారు. సూరజ్‌పాల్‌ రాజీనామాను ఆమోదించేది లేదని బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌ బరాలా ప్రకటించారు.

 

20:12 - October 10, 2018

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. ఓ నేత చేసిన వ్యాఖ్యలతో ఆపార్టీ ఇరకాటంలో పడింది. బీజేపీని ఇంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిన వ్యక్తి ప్రతిపక్ష నేతకాదు.. ఇంతకు ఎవరా నేత..? అసలేమన్నారు..బీజేపీ ఆచరణకు అమలుకాని హామీలిచ్చింది. ఆ హామీలు ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించాయి. వాటిని నెరవేర్చే ప్రయత్నం ఇంతవరకూ జరగలేదు. ఈ మాటలన్నది ప్రతిపక్ష నేతకాదు.. స్వయంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ..కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సొంత బీజేపీ ప్రభుత్వాన్నే తీవ్ర ఇరకాటంలో పడేశారు. కమలనాథులపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌ చేతికి స్వయంగా మరో అస్త్రాన్ని అందించారు. గడ్కరీ వ్యాఖ్యలతో మోదీ, అమిత్‌ షా ద్వయమే కాదు కమలదళమంతా తలలు పట్టుకుంటుంటే... కాంగ్రెస్‌ ఇదే అవకాశంగా తూర్పారబడుతోంది. ఓ చానల్‌లో ప్రసారమైన 'అసల్‌ పవానే- ఇర్సల్‌ నమూనే' అనే రియాలిటీ షోలో గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా నానాతో సంభాషిస్తూ గడ్కరీ బీజేపీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఈనెల 4, 5 తేదీల్లో రెండు భాగాలుగా ప్రసారమైంది. 'రాజకీయాలు సినిమా కలిసిన వేళ' పేరిట మొదటి భాగం, 'నానా-నితిన్‌ మధ్య చమత్కారం' పేరిట రెండో భాగం ప్రసారమయ్యాయి.''మేం అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు మేం ఇచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నామని చెప్పుకొచ్చారు నితిన్‌ గడ్కరీ. గడ్కరీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురించి ఈ వ్యాఖ్యలు చేశారా ? లేక మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం గురించి చేశారా ? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే గడ్కరీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 

20:07 - October 10, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  చేస్తున్న ఎన్నికల వాగ్దానాలు తీరాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ చాలదని టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణాలో కడుతున్న ప్రాజెక్టులు ఆపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాశారని,పొరపాటున మహా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి కావని కేటీఆర్ హెచ్చరించారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తాతో పాటు వందలాది మంది వైశ్యులు బుధవారం తెలంగాణా భవన్ లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో వెయ్యి రూపాయలు పింఛను ఇస్తానని హామీ ఇస్తే, కాంగ్రెస్  రెండు వేల రూపాయలు  ఫించను ఇస్తానని  హామీ ఇస్తోందని, ఇదీ మరీ విడ్డూరంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. సాధారణంగా వైశ్యులు  రాజకీయాలకు దూరంగావుండి  వ్యాపారాలు నిర్వహించుకుంటుంటారని,  కేసీఆర్ అమలు చేస్తున్నసంక్షేమ పధకాలు చూసి వారు టీఆర్ఎస్ లో చేరటం చాలా సంతోషమని కేటీఆర్ అన్నారు. 

20:00 - October 10, 2018

విశాఖపట్టణం : ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగమంతా సిద్ధంగా ఉందన్నారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. విశాఖ కేంద్రంగా పని చేస్తున్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థతోపాటు పలు విభాగాల సిబ్బంది గురువారం వరకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.  గాజువాక, పెందుర్తి, భీముని పట్నం, ఆనందపురం మండలంతోపాటు విశాఖ సిటీ, కొండ ప్రాంతాల్లో ప్రచండ గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అక్కడి ప్రజలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు

19:50 - October 10, 2018

విజయవాడ : కేంద్రానికి, ఏపీ సర్కార్ కు మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేంద్రం తీరు కూడా ఏపీని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. వెనకబడిన జిల్లాలకు సాయం చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించారు. అప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాకపోతే వచ్చే వారం పార్లమెంటు సభ్యుల బృందాన్ని దిల్లీకి పంపాలని భావిస్తున్నారు.

వెనకబడిన జిల్లాలకు ఇదివరకే ఇచ్చిన 350 కోట్ల రూపాయలు మళ్లీ వెనక్కి తీసుకోవడంపై కేంద్రానికి లేఖ రాసినా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు, ఇప్పుడు తెలంగాణకు సాయం చేసి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితిపై తీవ్రంగానే స్పందించాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే  కేంద్రానికి ఘాటుగా లేఖ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సహాయ నిరాకరణపై  వైసీపీ, జనసేన స్పందించకపోగా.. కేంద్రంపై పోరాడుతున్న తన ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకుంటున్నారు. కేంద్ర వైఖరిలో మార్పు రాకపోతే ఢిల్లీ వేదికగా కేంద్ర పెద్దలను నిలదీసేందుకు స్కెచ్‌ సిద్ధం చేస్తోంది. 

వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో బీజేపీని, ఇతర పార్టీలను టార్గెట్‌ చేసుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం అడుగులేస్తోంది. వెనుకబడిన జిల్లాల గురించి.. వాటి అభివృద్ధి గురించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ నేతలు.. ఇప్పుడు  ఏం సమాధానం చెబుతారనే వాదనను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ -జనసేన  పార్టీలను టార్గెట్ చేయడానికి ఇదే అంశాన్ని బేస్ చేసుకోవాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది టీడీపీ. మరి ఏపీ టీడీపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

19:50 - October 10, 2018

పట్టిసీమ : తూర్పుగోదావరి జిల్లాలోని సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 15న ధవళేశ్వరం బ్యారేజీ వద్ద చేపట్టనున్న కవాతుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీతోపాటు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 
ఈ సందర్భంగా పట్టిసీమలోని గెస్ట్‌ఇన్ అతిధి గృహంలో కవాతుకు సంబంధించిన మ్యాపును జనసేనాని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ సభకు ముందు విజ్జేశ్వరం నుంచి భారీ ర్యాలీని వందలాది కార్యకర్తలతో ప్రారంభించి ధవళేశ్వరం దగ్గర ఉన్న కాటన్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు. 
ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

18:52 - October 10, 2018

కరీంనగర్ : చొప్పదండి అభ్యర్థి ఎవరు ? మళ్లీ బొడిగె శోభకు అవకాశం కల్పిస్తారా ? మరొకరికి టికెట్ కేటాయిస్తారా ? అనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ఎందుకంటే 105 స్థానాలకు అభ్యర్థులను, కరీంనగర్ 12 అసెంబ్లీ స్థానాలకు 11 మందిని గులాబీ అధిపతి కేసీఆర్ ప్రకటించేసి చొప్పదండిని మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేశారు. దీనితో అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ టికెట్ తమకే వస్తుందని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చొప్పదండి ఎస్‌సీ రిజర్వుడు అనేది తెలిసిందే. తాజా, మాజీ ఎమ్మెల్యే శోభపై పలువురు ఫిర్యాదు చేయడంతో టికెట్‌ ఖరారులో కేసీఆర్ ఆలోచించినట్లు సమాచారం. ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్, వొల్లాల వాణి, రిటైర్డు డీఆర్‌వో బైరం పద్మయ్య, గుర్రం సంధ్యారాణి పేర్లు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే తనకే టికెట్ వస్తుందని ఆశిస్తున్న శోభ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పేద దళిత మహిళ అంటూ ప్రజలకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు తాను కూతురులాంటిదాన్నని,  తనకు తప్పకుండా న్యాయం చేస్తారని శోభ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ తనకే టికెట్‌ ఇస్తారని, అందరిని కలుపుకుని మళ్ళీ చొప్పదండిలో గులాబీ జెండా ఎగురవేస్తామని బొడిగె శోభ పేర్కొంటున్నారు. కానీ టికెట్ రాకపోతే పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. దీనిని బొడిగె శోభ ఖండిస్తున్నారు. కొద్ది రోజుల్లో ఎవరికి టికెట్ వస్తుందో తెలియనుంది. అప్పటి వరకు నేతలకు ఉత్కంఠ తప్పదు. 
- తూపురాణి మధుసూధన్...

18:31 - October 10, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ మూవీ మరికొద్ది గంటల్లో ధియేటర్స్‌‌లో సందడిచెయ్యబోతోంది... అరవింద సమేత చిత్రాన్ని అదనంగా మరో రెండు ఆటలు‌ ప్రదర్శించుకోవడానికి ఏపీ‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపధ్యంలో, చాలాచోట్ల బెనిఫిట్ షోలు పడబోతున్నాయి.. ఇప్పటికే ధియేటర్లని భారీ ఫ్లెక్సీలతో నింపేసారు నందమూరి అభిమానులు.. మరోవైపు తెలంగాణాలోనూ ఎక్కువ ధియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా చాలాచోట్ల టికెట్స్ అయిపోవడం విశేషం.. ఈ రాత్రి ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడబోతుండగా, రేపు తెల్లవారు ఝామునుండి తెలుగు రాష్ట్రాల్లో వీర రాఘవుడు వీర విహారం చెయ్యనున్నాడు...

18:26 - October 10, 2018

వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లాలో కొత్తగా ఓటర్లు పెరుగుతారా ? పెరిగితే ఏ పార్టీకి లాభం జరుగుతుంది...తదితర అంశాలతో రాజకీయ వేడి నెలకొంది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మొత్తం 4,52,047 ఓటర్లున్నారు. కొత్తగా ఓటర్ నమోదుకు ఈసీ అనుమతినిచ్చడంతో కొత్తగా యువత ఓటర్ల నమోదు చేసుకుంది. నర్సంపేట నియోజకవర్గంలో 1,97,227మంది ఓటర్లు...వర్ధన్నపేటలో 2,10,299మంది ఓటర్లు...పరకాల నియోజకవర్గంలో 1,88,819మంది ఓటర్లున్నారు. ఓటర్ల జాబితా సవరణ తర్వాత ఇప్పటికే ఉన్న 587 పోలింగ్ కేంద్రాలు 452047 మంది ఓటర్ల జాబితాలో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి. అధికారుల తుది జాబితా ప్రకటన తర్వాత పోలింగ్ కేంద్రాలు, కొత్త ఓటర్ల జాబితా ఖరారు కానున్నది.
ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈవీఎంల పరిశీలన, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. త్వరలోనే వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచే టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకుపోతోంది. మిగతా పార్టీలు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయలేదు. కానీ సీటును ఆశిస్తున్న వారు మాత్రం ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో మాత్రం గులాబీ క్యాడర్ దూసుకపోతోంది. 
                                                                                                                                                                   - మధుసూధన్ తూపురాణి

18:15 - October 10, 2018

విజయవాడ : పార్టీకి దూరంగా ఉంటూ అలకబూనిన వంగవీటి రాధను బుజ్జగించేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. గత కొద్ది రోజులుగా వంగవీటి రాధ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ బాధ్యతల నుండి వంగవీటిని తప్పించి ఆ స్థానాన్ని మల్లాది విష్ణుకు అప్పగించారు. దీనితో వంగవీటి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వంగవీటి అభిమానులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ కార్యక్రమాలకు...ఇతర వాటికి వంగవీటి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వైసీపీ నేత విజయసాయిరెడ్డి వంగవీటితో ఏకాంతంగా భేటీ అయ్యారు. సీటును మార్చడం వెనుక కారణాన్ని తెలియచేసినట్లు తెలుస్తోంది. అలక వీడాలని..పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. బందర్ పార్లమెంట్ నియోజవకర్గం, విజయవాడ తూర్పు నియోజకవర్గాలపై దృష్టి సారించాలని పేర్కొన్నట్లు సమాచారం. మరి విజయసాయిరెడ్డి బుజ్జగింపులు పని చేస్తాయా ? లేదా ? అనేది చూడాలి. 

18:13 - October 10, 2018

కరీంనగర్ :  తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక  దళితుడ్ని  తొలి  ముఖ్యమంత్రి ని చేస్తానన్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిచినా  దళితుడ్ని ముఖ్యమంత్రి చేయరని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.  కరీంనగర్ లో   జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో  బుధవారం  ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలోని టీఆర్ఎస్  ప్రభుత్వం  అన్ని విషయాలలోను  విఫలమైందని దళిత ముఖ్యమంత్రిని చేస్తానిన చెప్పిన  కేసీఆర్ దళిత కుటంబాలకు చేసిందేమి లేదని,  కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులే ముఖ్యమని, 2018 లో అధికారం లోకి వచ్చినా ఆయన దళితుడ్ని ముఖ్యమంత్రి ని  చేయరని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారం లోకి  వచ్చాక లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని కేసీఆర్ చెప్పారని,  ఈరోజు తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఉన్నప్పటికీ  ప్రభుత్వం నిమ్మకు నీరె్తినట్టు  ఉంటోందని అమిత్ షా అన్నారు. పేదలకు డబులు బెడ్ రూం ఇళ్ళు ఇస్తామని చెప్పిన కేసీఆర్  ఇంతవరకు 5 వేల  ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయలేక పోయారని  అన్నారు.  2019లో ఎన్నికలకు వెళితే మోడీ ధాటికి  ఓడిపోతామనే  భయంతోనే  ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తెలంగాణ ప్రజలపై  అదనపు భారం మోపారని  అమిత్ షా అన్నారు. ఎస్సీ కుటుంబాలకు ఇస్తానన్న  3 ఎకరాలు  భూమి ఇవ్వలేదని,  గత ఎన్నికల్లో  చేసిన 150వాగ్దానాల ఏమీ  పూర్తి చేయకుండానే  కేసీఆర్ మందుస్తుకు వెళ్లారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించి  ఒక్క ఛాన్స్ఇస్తే  దేశంలో జరుగుతున్న అభివృధ్ది తెలంగాణాలోనూ  జరిగేట్టు చేస్తామని అమిత్ షా  హామీ ఇచ్చారు. 

18:07 - October 10, 2018

నయనతార.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి మూవీ చేస్తోంది.. కోలీవుడ్లో మాత్రం ఊపిరి సలపనంత బిజీగా ఉంది.. ఓ పక్క హీరోయిన్గా డ్యూయెట్లు పాడుతూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటుంది.. నయన్ తమిళ్ అండ్ తెలుగులో ఐరా అనే మూవీ చేస్తోంది.. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కెఎమ్ సర్జున్ దర్శకుడు.. ఇప్పుడీ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్‌లో నయనతారని ఒకవైపు నుండి చూపించారు.. ఆమె ఫేస్ వెనక ఫుల్ బ్లాక్‌షేడ్‌లో మరో నయనతార ఫేస్ కనబడుతోంది.. నయన్ ఈ మూవీలో డ్యుయల్ రోల్ చేస్తుండడం విశేషం.. నయన్ ద్విపాత్రాభినయం చెయ్యడం ఇదే తొలిసారి.. ఆమె రెండు క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యేలా డిజైన్ చేసిన ఐరా ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో ఐరా రిలీజ్ కాబోతోంది..

17:23 - October 10, 2018

అనంతపురం: శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అయిదు నదులు అనుసంధానం చేసి మహాసంగమం  సృష్టిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భైరవానితిప్ప వద్ద కుందుర్పి ఎత్తిపోతల పధకానికి శంకుస్దాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గంటడికోటకు నీళ్లిస్తే పార్టీ ఉనికికి ప్రమాదమని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన మనుషులతో కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. 
ఈ రోజు రాయలసీమలో  అన్ని జిల్లాలకు నీళ్లివ్వగలుగుతున్నానని, తాను చేసే అబివృధ్ది పనులకు అడ్డుపడితే బుల్లెట్లా దూసుకుపోతానని చంద్రబాబు అన్నారు. ప్రతి సోమవారం నీరు-ప్రగతి మీద టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నానని, సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని దాని మీద శ్రధ్దపెట్టానని ,ఇప్పటికి 60 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని 2019 కల్లా పోలవరాన్ని పూర్తిచేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నానని వీటిలో 47 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని,గోదావరి,కృష్ణా, నదులు అనుసంధానం చేసామని, గోదావరి,పెన్నా నదుల అనుసంధానానికి చెందిన పనులు త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్య్తతులో శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా వంశధార,నాగావళి,గోదావరి,కృష్ణ,పెన్నా,నదులు అనుసంధానం చేసి మహా సంగమాన్నిసృష్టిస్తానని  చంద్రబాబు అన్నారు.

17:16 - October 10, 2018

పశ్చిమగోదావరి : మరోసారి జనసేన అధినత ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి జవహార్‌పై పలు ఆరోపణలు గుప్పించారు. అంబేద్కర్ ఆశయాలను గుండెల్లో నింపుకున్న వ్యక్తి నింపుకున్నానని, దళిత నాయకులై ఉన్న మంత్రి జవహార్ బెల్టుషాపులను ఎంకరైజ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అణగారిన వర్గాలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. బాబొస్తే జాబు వస్తుందన్నారు కానీ ఉన్న ఫ్యాక్టరీలు మూసివేస్తున్నారని..మరి ఉద్యోగాలు ఎక్కడనుండి వస్తాయని ప్రశ్నించారు. 

గతంలో అరకులో పర్యటించిన సమయంలో తమ గ్రామంలో పర్యటించాలని గిరిజనులు కోరడం జరిగిందని, క్వారీలు ఇష్టమొచ్చినట్లుగా పలగొడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరడం జరిగిందన్నారు. తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు చంపేశారని..కానీ పరిస్థితిని ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారని తెలిపారు.  దీనిని బట్టి చూస్తే బాబు పరిపాలన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓటు రాజకీయాలు చేయడానికి రాలేదని...అర్థవంతమైన రాజకీయాలు చేయడానికి వచ్చానని తెలిపారు.

జిల్లాలో ఉన్న యువత తీవ్ర అసంతృప్తిలో ఉందని..నక్సలైట్లలో కలుస్తామని తనకు కొంతమంది చెప్పారని పేర్కొన్నారు. ఎవరూ ఆయుధాలు పట్టుకోవాలని అనుకోరని..దోపిడి..అవినీతి...ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే యువత ఎలా ఊరుకుంటారని..తప్పకుండా ఆయుధాలు పట్టుకుంటారని పేర్కొన్నారు. జాతి కోసం ఏమి త్యాగాలు చేశారని బాబును ఉద్దేశించి ప్రశ్నించారు. 

17:10 - October 10, 2018

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర‌తో, ఆయన తనయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్నచిత్రం.. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు...  రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. మరోవైపు ప్రమోషన్స్‌లోనూ వేగం చూపిస్తుంది చిత్రబృందం..  ఈ ఉదయం రకుల్ ప్రీత్ బర్త్‌డే  సందర్భంగా ఆమె  శ్రీదేవి గెటప్‌లో ఉన్న లుక్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్, ఇప్పుడు ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి ఉన్న పోస్టర్ వదిలింది.. అదికూడా వేటగాడు  చిత్రంలోని ఆకుచాటు పిందె తడిసే పాటలోని స్టిల్ కావడం విశేషం.. ఎన్టీఆర్‌లో,ఈ పాటని బాలయ్య,రకుల్‌లపై షూట్ చేస్తున్నారు.. వేటగాడు గెటప్‌లో బాలయ్య తండ్రిలా దిగిపోగా, శ్రీదేవిగా రకుల్ కరెక్ట్‌గా సెట్ అయింది.. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

16:54 - October 10, 2018

బంగ్లాదేశ్: బంగ్లాదేశ్: గ్రనేడ్ దాడి కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశ మాజీ మంత్రి లుత్‌ఫోజ్మన్ బాబర్‌కు  మరణశిక్షను ఖరారు చేసింది. మరో 19మందికి కూడా మరణశిక్షను విధించింది. వీరిలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్‌ కూడా ఉన్నాడు. తీర్పు సందర్బంగా స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి షెహజాద్‌ నురుద్దిన్‌ ఆ సంఘటనను వివరిస్తూ.. ఈ నిందితులు ఇక జీవించే హక్కు లేదని ఉద్విగ్నభరితంగా తీర్పులు వెలువరించారు.  కాగా బీఎన్‌పీ పార్టీలో కార్యదర్శిగా చేసిన హరిస్ చౌదరీకి జీవిత శిక్షను వేశారు. గ్రనేడ్ దాడి కేసులో మరో 11మంది ప్రభుత్వ అధికారులకు కూడా శిక్ష ఖరారైంది.

ప్రస్తుత బంగ్లా ప్రధాని షేక్ హసీనా టార్గెట్‌గా 2004, ఆగస్టు 21న జరిగిన గ్రనేడ్ దాడిలో 20 మందికిపైగా మరణించారు. సుమారు 500 మంది గాయపడ్డారు. పేలుడు వల్ల హసీనా పాక్షికంగా వినికిడిని కోల్పోయారు. బహిరంగ సభ కోసం వచ్చిన షేక్ హసీనా ట్రక్కు నుంచి దిగుతున్న సమయంలో దాడి జరిగింది. 

16:47 - October 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి అయిన జైపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చానీయాంశమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగునున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జైపాల్ రెడ్డి విలేకరులతో మాట్లడారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానని వెల్లడించారు. రాఫెల్ యుద్ధ విమానాల స్కామ్‌లో రక్షణ శాఖ ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసిందని తెలిపారు.
మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి జైపాల్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశమే తనకు లేదని, ఊహాగానాలను నమ్మొద్దని గతంలో జైపాల్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. వచ్చే లోకసభ ఎన్నికల్లో తాను మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

16:14 - October 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఓటర్ల జాబితా అవకతవకల పిటిషన్‌ వాయిదా పడింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసీ కౌంటర్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ వేసిన పిటిషన్‌ను ఈనెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అభ్యంతరాల నివృత్తికి ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తారో అఫిడవిట్ రూపంలో తెలియచేయాలని ఆదేశించింది. ఓటర్ల తుది జాబితాను ప్రచురించుకోవచ్చని ఈసీకి హైకోర్టు సూచించింది. మరోవైపు అసెంబ్లీ రద్దు, యువ ఓటర్లకు నష్టం వాటిల్లితుందని డీకే అరుణ, శశాంక్ రెడ్డి వేసిన పిటిషన్లపై వాదనలు కూడా ముగిశాయి. తీర్పును మాత్రం కోర్టు రిజర్వ్యులో ఉంచింది. 

పిటిషన్‌లోని ఒక్క అంశం కూడా చెల్లదని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది తెలిపారు. కోర్టులో పిటిషనర్ సమర్పించిన జాబితాలో తప్పులు ఉన్నాయని, 2016-2017 ఓటర్ల లిస్ట్‌ను ఇప్పుడు చూపిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఈసీ తరపు న్యాయవాది వాదిస్తూ...ఓటర్ల జాబితాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేస్తామని తెలిపారు. ఒకే అడ్రస్‌తో వేల ఓట్లు ఉన్నాయని, బోగస్ ఓట్లను ఎలా తొలగిస్తారని...తొలగించిన ఓట్లను ఎలా కలుపుతారో చెప్పాలని పిటిషనర్‌ తరపు లాయర్‌ కోర్టులో వాదించారు. 12వ తేదీ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. 

16:02 - October 10, 2018

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. నరేంద్ర మోదీ హవాలో కొట్టుకుపోతారనే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని షా ఎద్దేవా చేశారు. కొడుకు లేదా కూతురినో సీఎంను చేయాలనేది కేసీఆర్ ఆశ అని.. కానీ కేసీఆర్ ఆశలు నెరవేరవని అమిత్ షా అన్నారు. ముందస్తు ఎన్నికల కారణంగా ప్రజలపై పడుతున్న ఆర్థికభారంపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని షా ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు అమిత్ షా రంగంలోకి దిగారు. కరీంనగర్ లో బీజేపీ అధ్వర్యంలో జరిగే సమరభేరి సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.

ఇవాళ హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా కు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఎన్నికల సన్నాహక సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల బూత్ స్థాయి ఇంఛార్జ్‌లతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడిన అమిత్ షా.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ‌పై మోడీ వివక్ష చూపుతున్నారని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన రూ.లక్షా 15వేల సంగతి కేసీఆర్ మరిచారా? అని నిలదీశారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తే బీసీలు నష్టపోతారని అమిత్ షా అన్నారు.

15:59 - October 10, 2018

తిరువనంతపురం : ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల చెక్కును అందచేశారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్(76) ను కేరళ పోలీసులు అనవసరంగా గూఢచర్యం కేసులో ఇరికించారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను వేధించినందుకు ఎనిమిది వారాల్లో రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన్ను కలిసి డబ్బును అందచేసింది. 

1994 నాటి గూఢచర్యం కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని, వేధించారని నంబి నారాయణన్(76) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనితో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలో జస్టిస్‌లు ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌తో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.  విచారణ జరిపిన అనంతరం 1994నాటి కేసులో నంబి నారాయణన్ ను కేరళ పోలీసులు అనవసరంగా అరెస్టు చేశారని, దారుణంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలేం జరిగింది ? 
1994 అక్టోబర్ 20న కేరళలోని తిరువనంతపురంలో మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇస్రోకు చెందిన క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని రహస్యంగా సేకరించి పాకిస్థాన్‌కు అందచేస్తున్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు. అదే ఏడాది నవంబర్‌లో ఇస్రోకు చెందిన క్రయోజెనిక్ ప్రాజెక్టు డైరెక్టర్ నంబి నారాయణ్, డిప్యూటీ డైరెక్టర్ డీ శశికుమారన్ లను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. నిరాధారమంటూ  పేర్కొంది. 

15:48 - October 10, 2018

ఢిల్లీ: కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ ఆదాయపన్నుశాఖతో దాడులు చేయిస్తోందని ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన  ఐటీ దాడుల సమయంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేసాయి. తాజాగా ఈరోజు ఆమ్ఆద్మీ పార్టీ కూడా అదే వ్యాఖ్యలు చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఢిల్లీ రవాణాశాఖ మంత్రి  కైలాష్ గెహ్లాట్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 16 ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ నేత కైలాష్ గెహ్లాట్  కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న బ్రిస్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్, కార్పోరేట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనే 2 సంస్ధలకు సంబంధించి పన్నుఎగవేత కేసులో, 60 మంది సభ్యుల బృందం ఢిల్లీ  గురుగావ్ ల లో 16 చోట్ల సోదాలు  నిర్వహిస్తున్నారు. గెహ్లాట్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రెండు సంస్ధల్లో చాలా లావాదేవీలు జరిగాయి కానీ లాభాలు లేవని ఆదాయపన్ను రిటర్న్  దాఖలు  చేయటంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆదాయపన్నుశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆదాయపన్ను దాడులపై స్పందిస్తూ ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్నికేంద్రం వేధిస్తోందని ట్విట్టర్లో ఆరోపించారు. 

15:40 - October 10, 2018

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా, త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో, దిల్ రాజు సమర్పణలో, శిరీష్, లక్షణ్ నిర్మించిన చిత్రం.. హలో గురు ప్రేమకోసమే...ఎటువంటి హంగూ, ఆర్భాటంలేకుండా నిన్న నేరుగా ఆన్‌లైన్‌లో పాటలు విడుదల చేసిన నిర్మాతలు, ఇప్పుడు ధియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.. ట్రైలర్‌లో రామ్, అనుపమల కెమిస్ట్రీ బాగుంది.. ప్రకాష్ రాజ్.. రామ్ ఫ్రెండ్‌గా నవ్వించాడు..  అబద్ధాలు చెప్తే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు కానీ,  అబద్ధాలు చెప్తే మాత్రం అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు..  గుర్తుంచుకోవాలనుకునే చదువుని మర్చిపోతాం, మర్చిపోవాలనుకునే అమ్మాయిని మాత్రం మర్చిపోం లాంటి డైలాగ్స్ బాగున్నాయి.. రామ్ లుక్ బాగుంది.. గెడ్డంతోనూ, క్లీన్ షేవ్‌తోనూ కనిపించాడు.. ప్రణీత సెకండ్ హీరోయిన్‌గా కనిపించబోతుండగా, పోసాని, సితార, జయప్రకాష్ తదితరులు నటించారు.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు... ఈ నెల 13న వైజాగ్‌లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు.. హలో గురు ప్రేమకోసమే దసరా కానుకగా ఈ నెల 18న ప్రేక్షకులముందుకు రాబోతోంది... 

15:25 - October 10, 2018

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ.. పార్టీలు ప్రచారపర్వాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో టీఆర్ఎస్ బాగా ముందుంది. ఇప్పుడిప్పుడే విపక్షాలు కూడా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. తాజాగా బీజేపీ స్పీడప్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. కరీంనగర్‌లో సమరభేరి సభలో ఆయన ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న షా కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  లక్ష్మణ్‌, ఎంపీ దత్తాత్రేయ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తదితరులు ఘనస్వాగతం పలికారు. 

విమానాశ్రయం నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని మహరాజ్ అగ్రసేన్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. నేడు మహరాజ్ అగ్రసేన్ జయంతిని పురష్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి బయలుదేరారు. పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, హైదరాబాద్‌లోని శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జిలు, ఐదు రూరల్ పార్లమెంట్లకు చెందిన నాయకులతో అమిత్‌ షా సమావేశమవుతున్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ బయలుదేరి వెళ్లనున్నారు. 

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ మైదానంలో నిర్వహించే ‘సమరభేరి’ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షకు పైగా జనం ఈ సభకు హాజరవుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

15:20 - October 10, 2018

ఢిల్లీ : జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయింది. పైలట్లకు..ఎయిర్ క్రాఫ్్ట సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  11, 26వ తేదీల్లో రెండు దఫాలుగా వేతనాలు చెల్లిస్తామని జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం గతంలో హామీనిచ్చింది. కానీ ఈనెల 11న జీతాలు చెల్లించలేమని..వీలైనంత త్వరగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని బుధవారం వెల్లడించింది. అక్టోబర్ 11న సెప్టెంబర్ నెలకు సంబంధించిన 50 శాతం వేతనం, ఆగస్టులో చెల్లించకుండా మిగిలిపోయిన 25 శాతం వేతనం చెల్లించాల్సి ఉంది. 

వేతనాలు వస్తాయని ఆశించిన పైలట్లు..ఎయిర్ క్రాఫ్్ట సిబ్బంది తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కొంత సంయమనం  పాటించాలని యాజమాన్యం పేర్కొంది. ఆగస్టు నెలలో ఉద్యోగులకు 75 శాతం మాత్రమే వేతనాలు చెల్లించింది. మిగతా 25 శాతం తరువాత చెల్లిస్తామని చెప్పింది. వేతనాలు ఇవ్వలేమని జెట్ ఇండియన్ జెట్ ఇండియన్ పైలట్్స యూనియన్, నేషనల్ ఏవియేటర్్స గిల్్డ తో సమావేశమై పరిస్థితిని వివరించింది. వేతనాలు ఎప్పుడిస్తామనేది త్వరలో తెలియచేస్తామని పేర్కొంది. 

14:59 - October 10, 2018
మహబూబాబాద్ : ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది...వెంటనే అనుకున్నది తడువుగా రైలు పట్టాలపై చేరుకుంది...ఆ సమయంలో ఓ రైలు మెల్లిగా వస్తోంది...కానీ ఆమె మాత్రం చనిపోలేదు...కారణం ? ఎవరైనా తప్పించారా ? లేక ఆమేనే మనస్సు మార్చుకుందా ? అంటే కాదు...కేవలం ఆమే వేసుకున్న డ్రెస్ కారణం...పూర్తి వివరాలకు చదవండి...
 
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో ఎర్రగడ్డ కాలనీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. అందులో 20 ఏళ్ల యువతికి ఆమె కుటుంబసభ్యులకు మధ్య మంగళవారం గొడవ జరిగింది. దీనితో ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. సమీపంలో ఉన్న కేసముద్రం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఆ సమయంలో స్టేషన్ నుండి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ కదులుతోంది. రైలుకు ఎదురుగా ఆమె వస్తోంది. రైలు డ్రైవర్ వెంటనే గమనించి రైలును ఆపేశాడు. ఆ యువతి ఎరుపు రంగు దుస్తులు ధరించడంతో డ్రైవర్ అప్రమత్తమై రైలును ఆపివేశాడు. ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. సమచారం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఆమెను తీసుకెళ్లారు. 
14:42 - October 10, 2018

హైదరాబాద్ : ఓటరు నమోదు ప్రక్రియలో హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నమోదు ప్రక్రియలో అనుమానాలున్నాయని, వివరణ ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. మర్రి శశిధర్ రెడ్డి, సిద్ధిపేట వాసి శశంక్‌లు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుమారు మూడు గంటలకు పైగా వాదనలు జరిగాయి. ఓటర్ల సవరణ పూర్తయ్యిందని, ఎలాంటి అవతవకలు లేవని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందని హైకోర్టుకు తెలిపారు. ఒకే అడ్రస్‌తో వేల ఓట్లున్నాయని దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీకి చీఫ్ జస్టిస్ ఆదేశించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 70 లక్షలకు పైగా ఓట్లు అవకతవకలు జరిగాయని, 20 లక్షలు బోగస్ అని తేల్చారని...వీటిని ఎలా తొలగిస్తారని..తొలగించిన ఓట్లను ఎలా కలుపుతారో ఈసీ చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిని నివృత్తి చేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని వాదిస్తున్నారు. మరికొన్నింటిపై హైకోర్టు 2.30గంటల తరువాత తీర్పును చెప్పనుంది. 

14:11 - October 10, 2018

అనంతపురం: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నేత, ఆత్మకూరు మాజీ సర్పంచ్ కేశవరెడ్డిని గుర్తు తెలియని దుండగులు బుధవారం నాడు వేటకొడవళ్లతో దాడి చేసి చంపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. వైసీపీ నేత కేశవరెడ్డి హత్య జిల్లాలో రాజకీయంగా సంచలనం రేపింది. కుటుంబసభ్యుల మధ్య ఉన్న పాత కక్షలు, ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేశవరెడ్డికి, అతడి అన్న నర్సింహారెడ్డికి మధ్య రెండేళ్లుగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే హత్య చేసి చంపారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నర్సింహారెడ్డి కొడుకు రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని వారు డిమండ్ చేస్తున్నారు.

13:55 - October 10, 2018

యంగ్ హీరో శర్వానంద్, కేరళ కుట్టి సాయి పల్లవి జంటగా, అందాలరాక్షసి, కృష్ణగాడి వీరప్రేమ గాధ, లై వంటి సినిమాలతో గుర్తింపుతెచ్చుకున్న హను రాఘవపూడి డైరెక్షన్‌లో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై, ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం.. పడి పడి లేచే మనసు..
రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. టీజర్‌లో ముఖ్యంగా, శర్వానంద్, సాయి పల్లవి పెయిర్ చాలా బాగుంది.. సాయి పల్లవి  డాక్టర్‌గా కనబడుతుంటే, ఆమెని ఫాలో అవుతూ శర్వా కనిపిస్తున్నాడు.. ఎక్కడంటే అక్కడ శర్వా తనని ఫాలో చెయ్యడం చూసి, ఏంటి ఫాలో చేస్తున్నావా అని సాయి పల్లవి అడగడం, దానికి శర్వా, అరే, తెలిసిపోయిందా, అయినా మీరిలా దగ్గరికొచ్చి మాట్లాడడం ఏం బాలేదండీ, ఏదో నాపాటికి నేను అరకిలోమీటరు దూరంనుండి ప్రేమిస్తూ బతికేస్తుంటే.. అని ఆన్సర్ ఇవ్వడం యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది..  టీజర్ చివర్లో బోటులోనుండి పడిపోబోతున్న సాయి పల్లవిని శర్వా చెయ్యందించి పట్టుకోవడం అదిరిపోయింది..  విశాల్ చంద్రశేఖర్ నేపధ్య సంగీతం కూడా బాగుంది.. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ  పడి పడి లేచేమనసు డిసెంబర్ 21న రిలీజ్ కాబోతోంది..

 

13:52 - October 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో గులాబీ దళం దూసుకపోతోంది. 119 స్థానాలకు గాను 105 మంది అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 14 అభ్యర్థుల జాబితాను పెండింగ్‌లో ఉంచారు. దీనితో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కొన్ని స్థానాల్లో అసమ్మతి రాజుకొంటోందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గాలు మొత్తం కీలకమైన స్థానాలు కావడం విశేషం. 

తాజాగా రెండో జాబితాను టీఆర్ఎస్ అధిష్టానం సిద్ధం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మొత్తం 12 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక్కడ కూడా సిట్టింగ్ వారిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు గుండెకాయగా ఉన్న ఖైరతాబాద్‌కు దానం నాగేందర్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన దానం గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ముషీరాబాద్‌కు ఎం.గోపాల్, గోషామహల్‌కు ప్రేమ్ సింగ్ రాథోడ్, అంబర్ పేట ఎడ్ల సుధాకర్ రెడ్డి, మల్కాజ్ గిరి మైనంపల్లి హన్మంతరావు, వరంగల్ ఈస్ట్-నన్నపనేని నరేందర్, మేడ్చల్ సీహెచ్, కోదాడ-చంద్రరావు, హుజూర్‌నగర్-సైదిరెడ్డి, చొప్పదండి రవిశంకర్, జహీరాబాద్-ఎర్రోళ్ల శ్రీనివాస్, వికారాబాద్-రాంచందర్ లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ మరో రెండు నియోజకవర్గాలకు పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటిస్తే గాని అభ్యర్థులను ఎవరనేది తెలియదు. 

13:44 - October 10, 2018

భూపాలపల్లి : ప్రభుత్వ అధికారులు సరైన టైమ్ కు ఆఫీసుకు రారనీ, చెప్పిన పనులు సక్రమంగా చేయరని ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని వారెప్పుడు వమ్ము చేయరు. కచ్చితంగా ఆలస్యంగా వచ్చి మేము ప్రభుత్వ అధికారులం..ఎప్పుడొచ్చినా మమ్మల్ని ఎవరు ఏమీ చేయరు అని వారు నిత్యం నిరూపించుకుంటుంటారు. అందరూ అలా కాకపోయినా..చాలామంది తీరు ఇలాగే వుంటుంది. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారులు వీరందరికంటే ఓ మెట్టుపైనే ఉన్నారు. ఎందుకంటే వారంతా సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కే చుక్కలు చూపించారు. ఏకంగా జిల్లా కలెక్టర్ ను రోడ్డుపై 10 నిమిషాలు నిలబెట్టేశారు. మేమేనన్నా కార్పొరేట్ అధికారులమా? ప్రభుత్వ అధికారులం అని కలెక్టర్ కు గుర్తు చేసారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని మినీ ఫంక్షన్ హాలులో భద్రపరిచారు. వీటి ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాలుకు వద్దకు వచ్చారు. కలెక్టర్ పర్యటనపై ముందే సమాచారం ఇచ్చినా సిబ్బంది మాత్రం తమ  నిర్లక్ష్యం ధోరణితో అదేవిధంగా ప్రవర్తించారు. కలెక్టర్ హాలు వద్దకు చేరుకుని వారికోసం ఎంతసేపు ఎదురు చూసినా వారెవ్వరు  తాళాలలు పట్టుకుని రాలేదు.

గత్యంతరం లేక కలెక్టర్ అక్కడే 10 నిమిషాల పాటు నిలబడ్డారు,. చివరికి ఓ ఉద్యోగి తాళాలు తెచ్చి హాలును తెరవడంతో కలెక్టర్ లోపలకు వెళ్లారు. ఈ ఘటనతో స్థానిక సిబ్బందిపై ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కలెక్టర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోవటం గమనించాల్సిన విషయం.

13:38 - October 10, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నాయి. మరి ఎంఐఎం సంగతేంటి? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మళ్లీ ఎంఐఎం పాగా వేస్తుందా? తిరుగులేని శక్తిగా అవతరించిన మజ్లిస్‌కు పోటీ ఇచ్చే వారే లేరా? అధికార టీఆర్ఎస్‌తో ఈసారి దోస్తీ కొనసాగిస్తారా? అసలు ఎంఐఎం ప్లాన్ ఏ విధంగా ఉంది?

పాతబస్తీ అంటే ఎంఐఎం, ఎంఐఎం అంటే పాతబస్తీ అనే విధంగా మజ్లిస్ గట్టి పట్టు సాధించింది. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) దశాబ్దాలుగా హైదారబాద్‌లో పాతుకుపోయింది. 1958 మార్చి 2న అబ్దుల్ వాహిద్ ఒవైసీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఏఐఎంఐఎం పార్టీని స్థాపించారు. ముస్లిం హక్కులు, విద్యాభివృధ్ధి కోసం ఏర్పడ్డ ఎంఐఎం క్రమక్రమంగా బలమైన రాజకీయ పునాదులు వేసుకుంది. అబ్దుల్ వాహిద్ ఒవైసీ తర్వాత ఆయన కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్లాలు చేపట్టి పార్టీని ఎంతో బలోపేతం చేశారు. 

సలావుద్దీన్ ఒవైసీ 1967, 1972, 1978 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తర్వాత హైదరాబాద్ పార్లమెంటుకు 6 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సలావుద్దీన్ ఒవైసీ విజయాన్ని అడ్డుకోవడానికి బీజేపీ 1996 ఎన్నికల్లో వెంకయ్య నాయుడిని హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుండి బరిలో దింపినా ఫలితం లేకపోయింది. సలావుద్దీన్ ఒవైసీ 73వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది 1986లో 38 డివిజన్లు గెలుచుకుని మేయర్ పీఠం కైవసం చేసుకుంది 2002లో 36 డివిజన్లు గెలుచుకుంది. 2009లో 43 డివిజన్లు గెలుచుకుని కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుని మేయర్ పీఠాన్ని పంచుకుంది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 44 డివిజన్లు గెలుచుకుని తన సత్తా చాటుకుంది.

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 7మంది సభ్యులు ఎంఐఎంకు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్ పాలనాపరమైన నిర్ణయాల్లో ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

సలావుద్దిన్ మరణం తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ 2008 నుండి ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు 1994, 1999 ఎన్నికల్లో చార్మినార్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నుండి 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. అసదుద్దీన్ సారధ్యంలోనే ఎంఐఎం పార్టీ పాతబస్తీ దాటి బయట ప్రాంతాలకు విస్తరించింది.

1996లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి గెలుపొంది ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్నారు ప్రస్తుతం తెలంగాణలో ఎంఐఎంకు ఏడుగురు శాసనసభ్యులున్నారు. మహారాష్ట్రలో ఎంఐఎంకు ఇద్దరు శాసన సభ్యులున్నారు బిహార్, ఢిల్లీ, యూపీ ఎన్నికల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేసింది. మహారాష్ట్రలో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లను ఎంఐఎం గెలుచుకుంది.

ఈసారి జరిగే ఎన్నికల్లో పాతబస్తీపై గట్టిపట్టున్న మజ్లిస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు చేజారకుండా వ్యూహలు రచిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు కేటాయించిన ఎంఐఎం.. చార్మినార్ ఎమ్మెల్యేగా ఉన్న అహ్మద్ పాషా ఖాద్రీని యాకుత్ పురాకు.. యాకుత్ పురా ఎమ్మెల్యేగా ఉన్న ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను చార్మినార్‌కు పరస్పరం మార్పులు చేశారు.  చాంద్రాయణ గుట్ట నుండి అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్ పేట నుండి మహ్మద్ బిన్ అబ్దుల్ బలాలా, బహదూర్‌పురా నుండి మహ్మద్ మౌజం ఖాన్, నాంపల్లి నుండి జాఫర్ హుసేన్ మెరాజ్, కార్వాన్ నుండి కౌసర్ మోహియుద్దీన్ పోటీ చేయనున్నారు. ఒకవైపు మిత్రపక్ష పార్టీ టీఆర్ఎస్‌తో స్నేహపూర్వక పోటీ మరోవైపు కాంగ్రెస్ కూటమి, బీజేపీ అభ్యర్దులను ఎదుర్కోవాల్సి ఉన్నందున తమ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు ఎంఐఎం వ్యూహలకు పదును పెడుతూ తన అభ్యర్దులను ప్రకటించింది.

ఎంఐఎం పార్టీ మొదటి నుండి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు తెలుపుతుంటుంది. మొదట్లో 
కాంగ్రెస్‌కు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డితో తీవ్రమైన విబేధాలు రావడంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. అదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో అక్బరుద్దీన్‌ జైలుకు వెళ్లడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంఐఎం సమైక్యాంధ్రకే జై కొట్టింది. చివరలో రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చింది  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి ఎంఐఎం దగ్గరైంది. ఎంఐఎం పార్టీకి చెందిన ఒవైసీ హాస్పిటల్స్, విద్యాలయాలకు ప్రభుత్వం ద్వారా భూములు లబ్ది పొందారనే ఆరోపణలున్నాయి

అయితే ఈ సారి యాకుత్ పురా, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎంఐఎంకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే విశ్లేషణ వినిపిస్తోంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా యాకుత్ పురా అభ్యర్దిని మార్చడంతో పాటు మిత్రపక్ష టీఆర్ఎస్‌ను అనుసరించి ముందుగానే అభ్యర్దులను ప్రకటించింది ఎంఐఎం. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న ముస్లింల ఓటు బ్యాంకును ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎంకు స్నేహహస్తం అందిస్తుంటుంది. ఎంఐఎం కూడా అదే పంధాలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి మద్దతు తెలుపుతుంటుంది

పాత బస్తీలో పట్టు సడలకుండా ఉండేందుకు ముందుగానే అభ్యర్దులను ప్రకటించిన ఎంఐఎం ఎన్నికల వ్యూహంలో భాగంగా నోటిఫికేషన్ కంటే ముందే తొలి జాబితా ప్రకటించి ప్రత్యర్ది పార్టీల కంటే ముందే ప్రచార పర్వానికి తెరలేపింది.

-కుమార్

13:37 - October 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార పర్వంలో టీఆర్ఎస్ దూసుకపోతోంది. ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాల్సిన వాటిపై..ఇతర పార్టీల పొత్తు...అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీ నుండి భక్తచరణ్ దాస్ నేతృత్వంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బృందం బుధవారం నగరానికి చేరుకుంది.

గొల్కొండ రిసార్ట్లో బృందం భేటీ అయ్యింది. టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, ఇతర నేతలు కూడా సమావేశమయ్యారు. పార్టీ నేతల బలబలాలు ఇతరత్రా విషయాలపై చర్చిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో ఏఐసీసీ, టిపిసిసి వేర్వేరుగా సర్వేలు చేయించింది. ఈ సర్వేల నివేదికలను కమిటీ ముందుంచింది. దీనిపై కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దసరా పండుగ రోజుకు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తోంది. మూడు రోజుల పాటు బృందం మకాం వేయనుంది. మరి అభ్యర్థులను ఖరారు చేస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

13:18 - October 10, 2018

హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఓటర్ల జాబితా అంశంపై రెండు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఇందులో సిద్ధిపేట వాసి శశాంక్ రెడ్డి పిటిషన్ కూడా ఉంది. పిటిషనర్ తరపున జంధ్యాల రవిశంకర్ వాదిస్తున్నారు. పిటిషనర్ వేసిన దానిలో ఏ ఒక్క అంశం చెల్లదని ఎన్నికల సంఘం వాదిస్తోంది. 2019 జనవరి ఓటర్ల జాబితా సవరణను అక్టోబర్‌కు కుదించడం వల్ల అన్యాయం జరుగుతుందని కోర్టుకు పిటిషనర్ తరపున న్యాయవాది తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 70 లక్షలకు పైగా ఓట్లు అవకతవకలు జరిగాయని, 20 లక్షలు బోగస్ అని తేల్చారని...వీటిని ఎలా తొలగిస్తారని..తొలగించిన ఓట్లను ఎలా కలుపుతారో ఈసీ చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిని నివృత్తి చేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని వాదిస్తున్నారు. 2016-2017 ఓటర్ల లిస్ట్‌ను కూడా ఇప్పుడు చూపిస్తున్నారని..ఓటర్ల జాబితాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేస్తామంటూ హైకోర్టులో ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందానే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

12:59 - October 10, 2018

చత్తీస్‌గఢ్‌ : పరిశ్రమల్లో అగ్రిప్రమాదాలు సంభవించి తొమ్మిది మంది మృతి చెందిన ఘటన స్థానికింగా భయాందోళనలకు గురిచేసింది. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో భిలాయ్ ఉక్కు పరిశ్రమలో సంభవించిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్లాంటులోని కోక్ ఓవెన్ సెక్షన్ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నవెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు దుర్గ్‌ రేంజ్‌ ఐజీ జీపీ సింగ్‌ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 24 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
 

12:48 - October 10, 2018

ఎస్.ఎస్.రాజమౌళి.. ఈ పేరు తెలియని ప్రపంచ సినీ ప్రేమికుడెవరూ ఉండరు.. హాలీవుడ్‌తో సహా, దక్షిణాది భాషల సినీ పరిశ్రమల చూపు తెలుగు చలన చిత్ర పరిశ్రమ వైపు తిప్పి చూసేలా చేసిన దర్శక ధీరుడు, ఓటమి అనేది ఎరగని విజయుడు.. జక్కన్న పుట్టినరోజు నేడు..
స్టూడెంట్ నెం:1‌తో దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేసి, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాదరామన్న, ఈగ, బాహుబలి: ది బిగినింగ్,  బాహుబలి: ది కన్‌క్లూజన్ వరకూ అప్రతిహతంగా కొనసాగిన, కొనసాగుతున్న విజయ ప్రస్ధానం ఆయనది..
బాహుబలి వంటి విజువల్ వండర్‌తో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా, తెలుగు ఇండస్ట్రీ, ఆ మాటకొస్తే దక్షిణాదిలో ఎవరికీ సాధ్యం కాని వందల కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టాడు.. దీంతో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు, పద్మశ్రీ తో పాటు పలు అవార్డులు అందుకున్నారు.. తను తీసే ప్రతీ హీరోకి కెరీర్ బెస్ట్ ఇవ్వడం ఒక్క జక్కన్నకే చెల్లింది.. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లతో ఓ భారీ మల్టీ స్టారర్ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న దర్శక ధీరుడు రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు...

 

12:46 - October 10, 2018

విశాఖ: ఇటీవల మావోయిస్టులు మెరుపు దాడి చేసి అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ జంట హత్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. కాగా, ఆ ఇద్ధరిని ఎందుకు చంపాల్సి వచ్చిందీ మావోయిస్టులు వెల్లడించారు. వారి పేరుతో విడుదలైనట్టు చెబుతున్న ఓ లేఖ మంగళవారం సాయంత్రం సోషల్ మీడియాలో దర్శనమైంది. 

కిడారి, సోమలు గిరిజన వ్యతిరేకులని, ప్రజా ద్రోహులని అందుకే వారిని చంపేసినట్టు లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. కిడారి, సోమలకు రక్షణగా వచ్చిన ఉద్యోగులను మానవతా దృక్పథంతోనే విడిచిపెట్టినట్టు చెప్పుకొచ్చారు.

గూడ క్వారీని వదిలేయమని కిడారిని చాలాసార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదని, బాక్సైట్ తవ్వకాలకు లోపాయికారీగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయినందుకే ఆయనను ప్రజా కోర్టులో శిక్షించినట్టు చెప్పారు. అధికార పార్టీకి తొత్తుగా మారారంటూ గిడ్డి ఈశ్వరిని మావోలు హెచ్చరించారు. రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. ప్రజాకోర్టులో ఈశ్వరి గురించి కూడా కిడారి చెప్పారని, నీతులు చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు. తనకు అందిన అవినీతి సొమ్మును రెండు నెలల్లో గిరిజనులకు పంచకుంటే కిడారికి పట్టిన గతే ఈశ్వరికి కూడా పడుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

మావోయిస్టుల లేఖగా చెబుతున్న దీనిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల భాష భిన్నంగా ఉంటుందని, వారు వాడే కాగితాలు కూడా వేరేగా ఉంటాయని అంటున్నారు. ఈ లేఖ విషయమై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. అదసలు మావోయిస్టులు రాసిన లేఖ కాదని తేల్చేశారు. దాన్ని ఎవరు రాసి ఉంటారో తెలుసుకుంటామని చెబుతున్నారు.

మొత్తంగా మావోయిస్టులు రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖ మరోసారి రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.

12:45 - October 10, 2018

చెన్నై :  ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన యువతిపై ఓ కానిస్టేబుల్ అనుమానం పెంచుకున్నాడు.అనుమానం పెనుభూతంగా మారి విచక్షణ మరిచాడు. ఆమె మరెవరితోనో సన్నిహితంగా వుంటుందనే అనుమానంతో, ఆమెను కాల్చి చంపి, తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై సమీపంలోని విల్లుపురం, అన్నియూరులో జరిగిన ఈ దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కార్తివేలు అనే యువకుడికి మెడిసిన్ చదువుతున్న సరస్వతి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. గత కొంతకాలంలో సరస్వతి తనకు దూరమవుతూ, మరెవరికో దగ్గరవుతోందన్న అనుమానం కార్తివేలులో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సరస్వతి పుట్టిన రోజురాగా, వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఆమె వద్దకు వచ్చాడు. ఆపై వీరిద్దరి మధ్యా వాగ్వాదం జరుగగా, తుపాకితో సరస్వతిని కాల్చిచంపిన కార్తివేలు, ఆపై తనను తాను కాల్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

12:27 - October 10, 2018

న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్ వీడియో వీక్షించే వారి సంఖ్య పెరగడంతో పాటు చూస్తున్న సమయం కూడా పెరుగుతోంది. ఇతర దేశాల్లో ఆన్‌లైన్ వీడియే వీక్షించే వారు వెచ్చించే సమయం కంటే భారత్‌లో అత్యధికంగా ఉందని ఇటీవల చేసిన సర్వేలో తేలింది. భారతీయులు ఆన్‌లైన్ వీడియోలు చూడ్డానికి వారానికి సరాసరి వెచ్చిస్తున్న సమయం అక్షరాలా 8 గంటల 28 నిమిషాలు. ఇది ప్రపంచ స్థాయి సరాసరి (6 గంటల 45 నిమిషాలు) కంటే చాలా ఎక్కువ. ఇది రోజూ టీవీ చూసే సమయం కంటే  కూడా ఎక్కువేనని ఈ సర్వే చెబుతోంది. 2016 సంవత్సరం కంటే 2018లో ఇది 58 శాతం పెరుగుదల రికార్డయ్యిందని ఈ అధ్యయనం తెలుపుతోంది. లైమ్‌లైట్ నెట్‌వర్క్స్ అనే ప్రపంచ స్థాయి డిజిటల్ కంటెంట్ పంపిణీ చేసే సంస్థ  ఈ సర్వేను నిర్వహించింది. 
ఆన్‌లైన్ చానల్స్ ద్వారా ఫోన్ వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో సినిమాలు.. అ తర్వాత వార్తలు, టీవీ షోలు, క్రీడలు ఇతర వీడియోలను ఎక్కువగా చూస్తున్నట్టు సర్వే ‘‘స్టేట్ ఆప్ ఆన్‌లైన్ వీడియో 2018’’  తెలుపుతోంది.
ఇతర దేశాల్లో ఆన్‌లైన్ వీడీయో వీక్షణంలో వారానికి సరాసరి గంటలు ఇలా ఉన్నాయి. ఫిలిప్పీన్స్ - 8 గంటల 46 నిమిషాలు,  అమెరికా  - 8 గంటల 30 నిమిషాలు, భారత్ - 8 గంటల 28 నిమిషాలు, జర్మనీ - 5 గంటల 02 నిమిషాలు 
అయితే భారత్ సహా చాలా మంది వీక్షకులు 46 శాతం మంది వీడియో బఫరింగ్ సమయంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ వినియోగం, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మీడియా పరిశ్రమ క్వాలిటీ వీడియోలను అందించాల్సి ఉందని లైమ్‌లైట్ నెట్‌వర్క్స్ సీనియర్ డైరక్టర్ ఆగ్నేయ ఆసియా, భారత ప్రతినిధి జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డారు. 
పశ్చిమ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌లలో కంప్యూటర్లు ద్వారా ఆన్‌లైన్ వీడియోలు చూసేందుకు ప్రజలు ఇష్టపడుతుంటే.. భారత్ సహా ఫిలీప్పీన్స్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాల్లో స్మార్ట్ ఫోన్ల ద్వారా వీక్షించేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారని అబ్బాస్ వెల్లడించారు. ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ దేశాలతో సహా  పది దేశాల్లో 5 వేల మంది వీక్షకులతో సర్వే నిర్వహించారు. వీరిలో 18-35 ఏళ్ల వయస్సున్న వారి అభిప్రాయాలను ఈ అధ్యయనంలో తీసుకున్నారు. 
దుష్ప్రభావాలు : ఎక్కువ సమయం ఆన్‌లైన్ వీడియో వీక్షణం కారణంగా యువతలో కొన్ని ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తుతున్నాయి.  బెంగుళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో సైన్సెస్ (నిమ్‌హన్స్) క్లినిక్‌లో ఆన్‌లైన్ వీడియోలకు ఎడిక్ట్ అయిన వ్యక్తి ఆరోగ్యాన్ని పరిశీలించిన వైద్యులు నిశ్చేక్షులయ్యారు. 26 ఏళ్ళ ఓ నిరుద్యోగి రోజుకు 7 గంటల పాటు నెట్‌ప్లిక్స్‌లో వీడియోలు చూడటం వల్ల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యాడు. నిద్రలేమితో పాటు కళ్లకు ఎక్కువ శ్రమ, అలసట అతని అనారోగ్యానికి కారణమని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ తరహా కేసులు ఆసుపత్రికి రావడం ఇదే ప్రధమమని డాక్టర్లు చెప్పారు.  

 

12:14 - October 10, 2018

హైదరాబాద్ : దాదాపు 16భాషల్లో వచ్చిన బిగ్ బాస్ గేమ్ షోలు నిర్వహణ జరిగింది. కానీ తెలుగులో బిగ్ బాస్ 2 షో మాత్రం నేషనల్ వేర్ గా సంచలనంగా మారింది. విన్నర్ గా నిలిచిన కౌశల్ ఇప్పుడు నేషనల్ ఫిగర్ గా మారిపోయాడు. షోలో ఒంటిరిపోరు సలిపి నిలిచి గెలిచిన కౌశల్ ఓ చరిత్ర సృష్టించాడు. ఇది కేవలం విన్నర్ అయినంతమాత్రన కాదు. గేమ్ షోలో అతను వ్యవహరించిన తీరు..వ్యక్తిత్వం..ఇలా ఎన్నో కారణాలుగా మారాయి.స్వతహాగా ఎవ్వరితోను అంతగా కలవని కౌశల్ షోలో కూడా అదే తీరుగా వ్యవహరించాడు. ఒంటరిగానే షో ను గెలిచాడు. ఈ షో నడుస్తూ ఉండగానే ఆయన పేరుతో 'కౌశల్ ఆర్మీ' ఏర్పడింది అంటే ఎంతటి అభిమానం చూరగొంటే అటువంటి పరిస్థితి ఏర్పడి వుంటుంది? ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత కౌశల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అన్ని చానల్స్ లో ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు.

తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను 'బిగ్ బాస్ హౌస్' నుంచి బయటికి వచ్చిన మూడో రోజున పీఎమ్ గారి ఆఫీస్ నుంచి కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నేను షూటింగులో ఉండటం వలన, మా ఫాదర్ రిసీవ్ చేసుకుని మాట్లాడారు .. వాళ్లకి థ్యాంక్స్ చెప్పారు" అని అన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో 'డాక్టరేట్ గురించి వస్తోన్న వార్తల్లో నిజమెంత?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారనేది నేను చెప్పడం కన్నా .. ఇచ్చేవాళ్ల ద్వారా మీకు తెలిస్తేనే బాగుంటుంది' అని కౌశల్ తన సహజమైన శౌలిలో బదులిచ్చారు.
 

12:02 - October 10, 2018

ఢిల్లీ: రాఫెల్ డీల్.. దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, ఈ ఒప్పందం కుదుర్చుకోవడంపై నిర్ణయం తీసుకున్న ప్రక్రియ గురించి పూర్తి వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఈ నెల 29లోగా అందజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విమానాల ధర, సాంకేతిక అంశాలకు సంబంధించిన వివరాలు అవసరం లేదని కోర్టు వెల్లడించింది. దేశ రక్షణ అంశమైనందున వ్యయాల విషయాన్ని అడగబోమని కోర్టు స్పష్టం చేసింది.

‘మేము కేంద్రానికి నోటీసులు జారీ చేయడం లేదు. పిటిషనర్ల వాదనలు పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాం. వారి వాదనలు ఆమోదయోగ్యంగా లేవు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే రాఫెల్ ఒప్పంద నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారో తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. 

భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రూ.59వేల కోట్లతో 36యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మ వాదించారు. ఈ కేసు జాతీయ భద్రతకు సంబంధించిందని, దీన్ని రాజకీయం చేస్తున్నారని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబరు 31న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.

36 విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, ఇరు దేశ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేనందున, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

రాఫెల్ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం. భారత ఎయిర్‌ఫోర్స్ ఆయుధాల ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయాలనేదే ఒప్పందం. రెండు ఇంజిన్ల మీడియం మల్టీ రోల్ కంబాట్ సామర్థ్యం కలిగిన రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ తయారు చేసింది. ఇది 59వేల కోట్ల డీల్. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

11:53 - October 10, 2018

ముంబై : మీటు ఉద్యమం అన్ని రంగాలలోను సంచలన సృష్టిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా చిత్రపరిశ్రమలో సంచలనంగా మారిన తరుణంలో పలువురు నటీమణులు కొంతకాలం మౌనంగా భరించినా..ఇటీవలి కాలంలో తమపై జరిగిన ఈ వేధంపులపై గళమెత్తుతున్నారు. తెలుగులో శ్రీరెడ్డి రోడ్డుపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బాలీవుడ్ లో తనుశ్రీదత్తా మరోమారు తన గళాన్ని విన్నగా వినిపిస్తోంది. దీనికి బాలివుడ్ లో మద్దతుకూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడారంగంలో కూడా ఈ వేధింపులు వున్నాయన ప్రముఖ బాట్మింటన్ తార గుత్తా జ్వాల ట్విట్టర్ వేదికగా మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలో పలువురు వెలుగులోకి వచ్చిన మేము కూడా బాధితులమేనని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ క్రమంలో చానాళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యా రాయ్, నిర్మాత గౌరంగ్ దోషి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, ఆయన తలపెట్టిన ఓ సినిమా నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని నటి ఫ్లోరా శైనీ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. తనను గౌరంగ్ వేధించాడని, కొట్టాడని తెలుసుకున్న ఐశ్వర్యా, తనకు అండగా నిలిచిందని, గౌరంగ్ చర్యలను వ్యతిరేకిస్తూ, ప్రాజెక్టు నుంచి తప్పుకుందని వెల్లడించింది. గౌరంగ్ పై ఫ్లోరా షైనీ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఆయన్ను ప్రేమించానని, తనను లైంగికంగా వేధించడంతో పాటు దారుణంగా హింసించాడని వెల్లడించింది.

 

11:12 - October 10, 2018

విజయవాడ: బెజవాడలో శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమయ్యాయి. అధికారులు అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు, ఎక్కడా ఎటువంటి లోపాలు, సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు . గతంలో జరిగిన తప్పిదాలను సరి చేసుకుంటూ పకడ్బందిగా  ఏర్పాట్లను చేశారు. ఉత్సవాలకు కావాల్సిన సకల సదుపాయాలు, సౌకర్యాలు, భక్తులకు కావాల్సిన ఇతరత్రా వస్తు సామాగ్రిని అందుబాటులో ఉంచారు.

అశేష భక్త కోటితో అనునిత్యం నిత్యపూజలందుకుంటూ విశేషంగా కొలవబడుతున్న బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్దమయ్యాయి.  పదిరోజులపాటు భక్తుల నుంచి విశేష పూజలతో కొలవబడే అమ్మవారికి సకల లాంఛనాలు సిద్ధమయ్యాయి. దాదాపు 15 లక్షలకుపైగా భక్తులు అమ్మవారి ఉత్సవాలకు విచ్చేయనున్నారనే అంచనాలతో ఏర్పాట్లు చేశారు. కెనాల్ రోడ్డులోని వినాయక గుడి నుంచి ఘాట్ రోడ్ మీదుగా ఇంద్రకీలాద్రి వరకు నాలుగు లైన్ల క్యూ లైన్లు ఏర్పాటు చేసారు. భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన దగ్గర్నుంచి అమ్మవారి దర్శనం తరువాత మహామండపం నుంచి కిందికి వచ్చే వరకు పటిష్టమైన క్యూలైన్లను ఏర్పాటు చేసారు. ఇక దసరా ఉత్సవాల్లో కీలకమైన అమ్మవారి జన్మనక్షత్రం, మూలా నక్షత్రం రోజున ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్గమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. 

11:08 - October 10, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 7న పోలింగ్, డిసెంబర్ 11న కౌంటింగ్ జరగనుంది. ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడు? మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కొందరు ఆకాంక్షిస్తున్నారు. వారిలో ఒకరు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నారాయణమూర్తి విప్లవ ప్రధానమైన సినిమాల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు. కేసీఆరే సీఎం కావాలని ఈ పీపుల్స్ స్టార్ కోరుకుంటున్నారు. కేసీఆరే సీఎం కావాలని కోరుకోవడం వెనుక గల కారణాలను కూడా ఆయన వివరించారు.

''రాష్ట్రం విడిపోతే.. తెలంగాణను చిమ్మచీకట్లు కమ్ముకుంటాయని.. సమైక్య రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు! కానీ ఇప్పుడు చూడండి. వెలుగు రేఖలతో తెలంగాణ ఎలా విరాజిల్లుతున్నదో.. 24గంటల ఉచిత విద్యుత్‌తో దేశానికే గర్వకారణంగా తెలంగాణ నిలుస్తున్నది.. మరోసారి టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించి కేసీఆర్ సీఎం అయితేనే.. రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుంది' అని ఆర్ నారాయణమూర్తి అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కేసీఆర్‌ ఇస్తున్నారని నారాయణమూర్తి ప్రశంసించారు. రైతులకు, ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని స్వయంగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కేసీఆర్‌కు ఫోన్‌చేసి అభినందించారని గుర్తు చేశారు. రైతుల మేలు కోసం ఎన్నో అద్భుతమైన సిఫార్సులు చేసిన గొప్పవ్యక్తి స్వామినాథన్.. అలాంటి స్వామినాథన్ కేసీఆర్‌ను అభినందించడం మామూలు విషయం కాదన్నారు. 

దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టనన్ని సంక్షేమ పథకాలు కేసీఆర్ చేపట్టారని నారాయణమూర్తి కితాబిచ్చారు. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రవేశపెట్టిన రైతుబీమా, రైతుబంధు పథకాలు అద్భుతమన్నారు. పంట పెట్టుబడి సాయంగా ఎనిమిది వేల రూపాయలు రైతుకు అందిస్తుండటం గొప్ప పథకమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ చారిత్రక నిర్మాణం అని కొనియాడారు. కేంద్రప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల వారు సైతం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో పథకాలను మెచ్చుకుంటున్నారని నారాయణమూర్తి చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ రైతులు తాము తెలంగాణలో అంతర్భాగం అయితే బాగుండునని, తమకూ ఈ సంక్షేమ పథకాలు వర్తించేవని కోరుకునేంత గొప్పగా కేసీఆర్ పథకాలు ఉంటున్నాయని నారాయణమూర్తి పేర్కొన్నారు. 

దేశంలో ఒకప్పుడు వ్యవసాయ రంగం 75శాతం వాటా ఉండేదని, కానీ నేడు అది 52శాతం తగ్గిందని, అందులో 40శాతం కౌలురైతులే ఉన్నారని నారాయణమూర్తి చెప్పారు. కౌలు రైతులను ఆదుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని కేసీఆర్‌కు నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశరాజకీయాల్లోనూ కేసీఆర్ కీలక పాత్ర వహించాలని నారాయణమూర్తి ఆకాంక్షించారు. ఫెడరల్ లక్ష్యాల్ని కాపాడటం కోసం, ఫెడరల్ స్ఫూర్తిని నింపడం కోసం కేసీఆర్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. కేసీఆర్ మంచి పరిపాలకుడు అన్న నారాయణమూర్తి అంతకంటే ముందు ఆయన గొప్ప ఉద్యమ నాయకుడన్నారు. రైతుల హక్కులను కాపాడటానికి జరుగుతున్న పోరాటాల్లో ఉద్యమకారుడిగా రైతుల హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ కృషి చేయాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు.

మొత్తంగా మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు నారాయణమూర్తి వెల్లడించారు.

10:44 - October 10, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు పుట్టిస్తుండగా, లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని చెబుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే వేధింపులు పరిమితం కాలేదని, మీడియా, క్రీడా రంగాల్లోనూ ఈ జాడ్యం ఉందని చెబుతూ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తనకు ఎదురైన వేధింపులను పంచుకుంది. తనను ఓ వ్యక్తి మానసికంగా ఎంతో వేధించాడని చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ లో కొన్ని ట్వీట్లు పెట్టింది. నాకు ఎదురైన మానసిక వేధింపులను వెల్లడించే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను. అతను 2006లో చీఫ్ గా వచ్చాడు. జాతీయ చాంపియన్ షిప్ సాధించిన నన్ను జట్టు నుంచి తొలగించాడు. మానసికంగా వేధింపులకు గురి చేశాడు. రియో ఒలింపిక్స్ తరువాత కూడా ఇవి సాగాయి. నేను బ్యాడ్మింటన్ ను వదిలేందుకు ఈ వేధింపులు కూడా కారణం. నేను మిక్సెడ్ డబుల్స్ లో ఎవరితో ఆడతానో తెలుసుకుని, అతన్ని బెదిరించేవాడు. అందుకే నేను జట్టుకు పూర్తిగా దూరమయ్యానని..అన్ని రకాలుగా నన్ను ఒంటరిని చేశాడు" అని  గుత్తా జ్వాల ట్విట్టర్ వేదికగా వాపోయింది. కాగా, సింధు, సైనాల వంటి సింగిల్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తూ, సంచలన విజయాలు సాధించిన తనను పక్కనబెడుతున్నారని ఆరోపిస్తూ, గతంలో గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన సంగతి విదితమే.

 

10:33 - October 10, 2018

ఢిల్లీ : సామాన్యుడి అతి చౌక ప్రయాణ సాధనం రైలు. ఇండియన్ రైల్వేలో లక్షలాదిమంది ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. రైల్వేలో ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తారు చాలామంది. ఎందుకంటే వారికి అన్ని విధాల సదుపాయాలను ఆ శాఖ నిర్వహిస్తుంటుంది.  ఈ నేపథ్యంలో దసరాకు రైల్వే ఉద్యోగులకు శుభవార్తనందించింది ఆ శాఖ. రైల్వే యూనియన్లతో జరిగిన చర్చలు ఫలప్రదం కావటంతో రైల్వే ఉద్యోగులకు ఈసారి 78 రోజుల దసరా బోనస్ లభించనుంది. దీంతో రైల్వే ఉద్యోగుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఉత్పాదకత ఆధారంగా 78 రోజులకు బోనస్ ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది.  అయితే, ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. బోర్డు ప్రతిపాదనతో రూ.12.26 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కొక్కరికీ సుమారు రూ. 18 వేల బోనస్ లభించనుంది. అయితే, గెజిటెడ్ ఉద్యోగులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పీఎఫ్ స్పెషల్ ఫోర్స్‌కు చెందిన ఉద్యోగులకు ఈ పీఎల్‌బీ బోనస్ వర్తించదు. రైల్వే బోర్డు నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల భారం పడనుంది.

10:30 - October 10, 2018

సినిమా స్టార్ట్ చేసిన దగ్గరి నుండి కొత్త కొత్త అప్ డేట్స్తో వార్తల్లో నిలుస్తోంది ఎన్టీఆర్ మూవీ యూనిట్...
ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రూపొందుతుండగా.. నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.. ఆయనతోపాటు విద్యా బాలన్, నిత్యా మీనన్, సుమంత్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.. ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్ట్లో పంజాబీ భామ రకుల్ ప్రీత్సింగ్  జాయిన్ అయింది..
ఈ మూవీలో రకుల్ ప్రీత్, అలనాటి అందాలతార  శ్రీదేవి పాత్రలో కనిపించబోతోంది..  ఈ రోజు రకుల్ ప్రీత్ బర్త్డే.. ఈ సందర్భంగా ఆమె  శ్రీదేవి గెటప్లో ఉన్న లుక్ రిలీజ్ చేసారు.. చక్కటి చీరకట్టు, నుదుట బొట్టు, ముక్కు పుడక, చెవులకు రింగులు, మెడలో హారంతో రకుల్ అచ్చు శ్రీదేవిలా ఉంది.. పోస్టర్పై జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, హ్యాపీ బర్త్డే రకుల్, ది ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ శ్రీదేవి గారు ఆఫ్  ఎన్టీఆర్ బయోపిక్ అంటూ దర్శకుడు క్రిష్ ట్విట్టర్లో పోస్ట్ చేసాడు...  ఎన్టీఆర్ కథానాయకుడు 2019 జనవరి 9న, ఎన్టీఆర్ మహానాయకుడు  జనవరి 24న విడుదల కాబోతున్నాయి...

10:21 - October 10, 2018

ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు నితిన్ బాలి దుర్మరణం చెందారు. నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నితిన్.. నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. ముంబై మాలద్ నుంచి బొరివిల్లిలో ఉన్న తన ఇంటికి వెళుతున్న క్రమంలో నితిన్ కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి గాయాలకు చికిత్స చేశారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కానీ ఇంటికి వెళ్లిన తర్వాత, ఆయన మృత్యువాత పట్టారు. 

ఇంటికి చేరుకున్న వెంటనే నితిన్‌ రక్తపు వాంతులు చేసుకున్నారని, రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందని, ఒక్కసారిగా హార్ట్‌ రేటు పడిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే నితిన్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

కాగా, నితిన్‌ 1990 కాలంలో సింగర్‌గా బాగా ప్రసిద్ధి పొందారు. ‘నీలే నీలే అంబర్‌ పర్‌’ అనే క్లాసిక్‌ పాటతో ఎక్కువగా ఫేమస్‌ అయ్యారు. ఈ పాట బ్లాక్‌ అండ్‌ వైట్‌ వీడియోలో రూపొందింది. ఆరుకు పైగా ఆల్బమ్స్‌ చేశారు. ‘నా జానే’తో మ్యూజిక్‌ ఇండస్ట్రీలోకి నితిన్ అడుగుపెట్టారు. అయితే నితిన్‌ చాలా లో ప్రొఫైల్‌ మెయింటేన్ చేసేవారు. 2012లోనే మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. నితిన్‌ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నితిన్ బాలి.. టీవీ నటి రోమా బాలి భర్త.

09:43 - October 10, 2018

రంగారెడ్డి : ఎన్నికల్లో మద్యం, మనీ ఓటర్లపై ప్రభావం చూపించటం సర్వసాధారణంగా మారిపోయింది. రాజకీయ పార్టీలు ఒకదానికి మించి మరొకరు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ముందుంటాయి. మనీ, మద్యం, కానుకలు వంటివి ఆశ చూపి ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోవడంతో ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు. రాజకీయ నాయకులు వేసే ఎరలకు ఆశపడి, గుడ్డిగా వారిని అనుసరించకుండా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మర్పలి మండలంలోని ఖల్కోడ గ్రామ ప్రజలు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న నాయకులు మద్యాన్ని ఎరగా వేసి ఓట్లు గుంజేందుకు ప్రయత్నిస్తారని, వారి బారిన పడి మోసపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గ్రామస్తులంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా విధించనున్నట్టు గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఇటువంటి గ్రామస్థుల నిర్ణయం అన్ని గ్రామాలకు ఆదర్శం కావాల్సినఅవుసరం ఎంతైనా వుంది. అంతేకాదు..ఎన్నికల్లో నేతలు ఇచ్చిన కానుకలకు ఆశపడి తమ ఓటును అమ్ముకుని ఓటు వేయటం అంటే తమ భవిష్యత్తును..అభివృద్దిని తామే అంతం చేసుకోవటంతో సమానమని..రాజ్యాంగపరంగా ఓటు వేసే పూర్తి హక్కుని ప్రతీ  ఓటరు వినియోగించుకోవాలని..వినియోగించుకుంటారని  ఆశిద్దాం..

09:21 - October 10, 2018

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 7న 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడించనున్నారు. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారంలోకి మేమే వస్తాము అని ఎవరికి వారు ధీమాగా చెబుతున్నారు. కాగా ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ క్రమంలో డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి విజయం సాధించి, అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. సీ–వోటర్, టైమ్స్‌ నౌ, ఐటీటెక్‌ గ్రూప్‌ తదితర సంస్థలు సర్వేలను నిర్వహించగా టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి. ద టీమ్ ఫ్లాష్, వీడీయే అసోసియేట్స్ సంస్థల సర్వేల ప్రకారం టీఆర్ఎస్‌కు 85, మహాకూటమికి 18, ఎంఐఎంకు 7, బీజేపీకి 5, ఇతరులు 4 సీట్లలో గెలుస్తారని అంచనా.

08:57 - October 10, 2018

విశాఖపట్నం :  సాగర తీరంలో మిసెస్‌ వైజాగ్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి.  హ్యాంప్‌పెర్త్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో సాగిన ఈ పోటీలు... వీక్షకులను కనువిందు చేశాయి. చీరకట్టులోనేకాదు.. ఆధునిక వస్త్రాలతో కూడా కంటెస్టెంట్‌లు మంత్రముగ్దులను చేశారు.  ఈ పోటీల్లో మొత్తంగా 21 మంది మహిళలు పాల్గొన్నారు. అందం, సమయస్ఫూర్తి, సమాజ హితంలాంటి అంశాలపై పోటీ నిర్వహించారు.  ఎయూ ఫార్మసీ స్కాలర్‌ సంగీత మిసెస్‌ వైజాగ్‌గా ఎన్నికయ్యారు.  రన్నరర్స్‌గా సెంట్‌ జోసెఫ్‌ స్కూల్‌ టీచర్‌ షాలిని, సెకండ్‌ రన్నరఫ్‌గా అనిత నిలిచారు.  మిసెస్‌ వైజాగ్‌ -2018 టైటిల్‌ గెల్చుకోవడం చాలా ఆనందంగా ఉందని విజేత సంగీత అన్నారు. 
 

 

08:42 - October 10, 2018
హైదరాబాద్ : తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపి పావులు కదుపుతోంది. ఎన్నికల ప్రచార బరిలోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిగారు. నేడు కరీంనగర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న ఆయన.. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ తీరును ఎండగట్టనున్నారు. మరోవైపు అమిత్ షా పర్యటన తరువాత అభ్యర్ధుల జాబితా విడుదల చేసేందుకు బీజేపి కసరత్తు ముమ్మరం చేసింది. 
భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న షా.. ముందుగా బంజారాహిల్స్ లోని అగ్రశ్రేన్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కాచీగూడలోని శ్యాంబాబా మందిర్ లో సాధువులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు ఎగ్బిబిషన్ గ్రౌండ్ లో సికింద్రాబాద్, హైదరాబాద్, చేవేళ్ల, మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్ర స్థాయి నాయకులను కలుస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత ప్రత్యేక హెలీకాఫ్టర్లో కరీంనగర్ బయల్దేరతారు. బీజేపి తలపెట్టిన సమరభేరీ సభలో పాల్గొంటారు. 
 
అమిత్ షా పర్యటన తరువాత తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వెల్లడించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆరే కారణమని విమర్శించారు. ప్రజల తీర్పును వృథా చేయడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనన్నారు.
 
అమిత్‌షా పర్యటనతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు దడపుడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మోడీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తామన్న లక్ష్మణ్.. కాంగ్రెస్ నేతలు.. తెలంగాణ ద్రోహులతో జత కట్టి మహాకూటమిగా ఏర్పడ్డారని మండిపడ్డారు.
08:31 - October 10, 2018

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. దాదాపు 35మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. రాయ్‌బరేలి జిల్లా హర్‌చంద్‌పూర్ రైల్వే‌స్టేషన్‌కు 50మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదు బోగీలు, ఇంజిన్ పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఎన్ఢీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి పంపింది. ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారణాసి, లక్నోల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి తరలివెళ్లాయి. రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విన్‌ లోహానీ సహాయ, రక్షక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఫరక్కా ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి అలహాబాద్‌కు వెళుతోంది.

08:28 - October 10, 2018

హైదరాబాద్ : ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కొని ఫలితాల వరకు అంతా సవ్యంగా సాగేలా.. తమ సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. అలాగే ఓటర్ల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. మృతి చెందిన వారి ఓట్లను వారి కుటంబ సభ్యులకు తాఖీదులిచ్చి తొలగించేందుకు రెడీ అయింది.తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో ప్రదానమైన నామినేషన్ల స్వీకరణ.. వాటి పరిశీలన.. తరువాత అభ్యర్ధులతో వ్యవహరించాల్సిన విధానంపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని రిటర్నింగ్ అధికారులు.. వారి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ దాన కిషోర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని కమిషనర్ దానకిషోర్ తెలిపారు. సీఈసీ వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందిన 18 టీమ్‌లు హైదరాబాద్ ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నాయని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. గ్రేటర్ పరిధిలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగింపు చేపట్టారు. ఆర్టీసీ బస్సులపై రాజకీయ నేతల ఫోటోలు తొలగించాలని రవాణాశాఖకు ఇప్పటిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబాతా కసరత్తు దాదాపు పూర్తైందన్న జీహెచ్ఎంసీ కమిషనర్.. మృతి చెందిన వారి ఓట్లను వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి తొలగిస్తామని చెప్పారు.ఇప్పటి వరకు ఎన్నికల జాబితాపై ఫోకస్ పెట్టిన అధికారులు.. ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించారు. ఎలాంటి తప్పలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థతో పాటు.. సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.
 

08:03 - October 10, 2018

విశాఖపట్నం : మన్యంలో మరోసారి ఉద్విగ్న వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం చినరాజప్పతోపాటు మంత్రి నారా లోకేష్‌ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. మరోవైపు గిరిజన ప్రజాప్రతినిధులు వ్యాపారులు ఏజెన్సీని వదిలి వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ పేరుతో ఓ లేఖ విడుదలైంది. దీంతో ఒక్కసారిగా మన్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.విశాఖ మన్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోన్న టెన్షన్‌ నెలకొంది. నేడు ఏపీ హోంమంత్రి చినరాజప్ప, ఐటీమంత్రి నారా లోకేష్‌ ఇవాళ మావోయిస్టుల చేతిలో హతమైన కిడారి సర్వేశ్వరరావు, సోమ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు  రోడ్డు మార్గంలో పాడేరులోని కిడారి సర్వేశ్వరరావు ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.  అనంతరం అక్కడి నుంచి అరకు వెళ్లి సివేరి సోమా కుటుంబ సభ్యులనూ వారు పరామర్శించనున్నారు.  ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. నారా లోకేష్‌ పర్యటనకు ఒక రోజు ముందు మన్యంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ  కలకలం రేపుతోంది.  టీడీపీకి చెందిన కిడారి  సర్వేశ్వరరావు, సోమ హత్యలకు గల కారణాలను ఆ లేఖలో వెల్లడించారు. గిరిజనులకు   ద్రోహం చేస్తున్నందునే ప్రజాకోర్టులో వారికి శిక్ష విధించామని లేఖలో పేర్కొన్నారు.  బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు వారిని హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదన్నారు.  అందుకే అతడికి ప్రజాకోర్టులో శిక్ష విధించామని స్పష్టం చేశారు.  బాక్సైట్‌ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా ఉన్నా వదిలేది లేదని లేఖలో హెచ్చరించారు.  ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి 20 కోట్లకు అమ్ముడుపోయారని అందులో ఆరోపించారు.  బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, పద్దతి మార్చుకోకపోతే కిడారి, సోమలకు పట్టిన గతే ఆమెకు పడుతుందని హెచ్చరించారు.   ఈ నేపథ్యంలో ఇవాళ నారా లోకేష్‌ కిడారి, సోమ కుటుంబాల పరామర్శకు వస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందన్న ఆందోళన గిరిజనుల్లో వ్యక్తమవుతోంది.

07:49 - October 10, 2018

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ రాత్రి పెద్దశేష వాహన సేవతో పూర్తి స్థాయిలో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉదయం తిరువీధుల్లో బంగారు తిరుచ్చి ఉత్సవం, తరువాత రంగనాయకుల మండపంలో నవరాత్రి ఆస్థానం జరగనుంది. 
అంకురార్పణలో భాగంగా మంగళవారం సాయంత్రం సేనాధిపతి విష్వక్సేనుడిని  వసంతమండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ వేద పండితులు, అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా భూమిపూజ చేసి పుట్ట మట్టి సేకరించి ప్రదక్షిణంగా వచ్చి ఆలయ ప్రవేశం చేశారు. తిరువీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.   ఈ అంకురార్పణ ఘట్టం కోసం ముందుగా యాగశాలలో సీతారామలక్ష్మణులు, హనుమంతుడు, సుగ్రీవుడు,అగందుడు,అనంతుడు, గరుడాళ్వార్, చక్రత్తాళ్వార్, విశ్వక్సేనులను వేంచేశారు. అంకురార్పణ నిర్వహించే  ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరించి బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేశారు. తరువాత సోమరాజు మంత్రం, వరుణ మంత్రం, విష్ణు సూక్తం పఠిస్తూ వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల మధ్య అంకురార్పణ జరిగింది. తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడి విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ఏడు లక్షలకుపైగా లడ్డూలను సిద్ధం చేసింది. పాపవినాశనం రహదారి ముఖద్వారం సమీపంలో ఏర్పాటుచేసిన ఫల, పుష్ప, ఛాయాచిత్ర ప్రదర్శన భక్తుల మది దోచుకుంటోంది.
 

 

07:22 - October 10, 2018

వరంగల్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు వరంగల్‌ భద్రకాళి ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబు అయ్యింది.  నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈనెల  19 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు  అమ్మవారు  ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శమిస్తారు. 

07:13 - October 10, 2018

ఢిల్లీ : యూత్‌ ఒలింపిక్స్‌లో మిజోరాం వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగా చరిత్ర సృష్టించాడు. అతను ఈ క్రీడల చరిత్రలోనే భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. మరోవైపు షూటింగ్‌ సంచలనం మను బాకర్‌ కూడా చక్కటి ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. యూత్‌ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రినుంగా సంచలన ప్రదర్శన చేశాడు. మిజోరాంకు చెందిన 15 ఏళ్ల లాల్‌.. 62 కేజీల విభాగంలో పసిడితో మెరిశాడు. స్నాచ్‌లో 124 కేజీలు ఎత్తిన లాల్‌... క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 150 కేజీలు, మొత్తం మీద 274 కేజీలు లిఫ్ట్‌ చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక  సంచలన షూటర్‌ మనుబాకర్‌ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఆమె స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రష్యా అమ్మాయి అనా ఇనినా గట్టి పోటీ ఇచ్చినా.. 236.5 పాయింట్లతో పసిడి ఎగరేసుకుపోయింది. భారత్‌కు ఇవే ఉత్తమ యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడలు కాబోతున్నాయి. ఇప్పటికే నాలుగు పతకాలు గెలిచిన భారత్‌.. గత రికార్డును తుడిచిపెట్టింది. 
 

 

Don't Miss