Activities calendar

11 October 2018

23:01 - October 11, 2018

హర్యానా : అత్యాచారాలను నియంత్రించడానికి దేశంలో నిర్భయలాంటి ఎన్నిచట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ బాలికపై సమీప బంధువులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక బాధితురాలు యూనిట్‌టెస్ట్‌ పరీక్ష సమాధాన పత్రంలో రాసింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి అందులో వివరించింది. 

గుడ్‌గావ్‌ సమీపంలోని బాద్‌షాపూర్‌ తాలూకాకు చెందిన 15 సంవత్సరాల బాలిక పదో తరగతి చుదువుతోంది. విద్యార్థినిపై ఆమె బంధువు(23), మరో మైనర్‌ బాలుడు కొద్ది రోజుల క్రితం అత్యాచారం చేశారు. అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక బాధితురాలు ఈనెల 1న జరిగిన యూనిట్‌టెస్ట్‌ పరీక్ష సమాధాన పత్రంలో రాసింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి అందులో వివరించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల యాజమాన్యం కోరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో నిందితులిద్దరిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

 

22:32 - October 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈరోజు ఉదయమే పద్మినీరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. మురళీధర్ రావు సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కొన్ని గంటలు గడవకముందే పద్మినీరెడ్డి మళ్లీ సొంతగూటికి వచ్చేశారు. కార్యకర్తల మనోభావాలను, వారి మనోవేదనను అర్థం చేసుకున్నానని అందుకే తిరిగి కాంగ్రెస్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు పద్మినీరెడ్డి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీలోకి వెళ్లడం అనుకోకుండా జరిగిన పరిణామని ఆమె అన్నారు.

 

22:14 - October 11, 2018

హైదరాబాద్ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబుమోహన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ తనను మోసం చేశారని వాపోయారు. స్థానికత తెరపైకి తెచ్చి తనకు అన్యాయం చేశారని బోరున విలపించారు. బీజేపీ తరపున ఆంధోల్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. టీఆర్ఎస్‌లో తనకు సీటు కేటాయించనందుకు బాబుమోహన్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. 

 

21:34 - October 11, 2018

హైదరాబాద్ : స్టేషన్ ఘనపూర్ సీటుపై మంత్రి కడియం శ్రీహరి క్లారిటీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ సీటు తాను ఆశపడలేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రాజయ్యకే ఇవ్వాలని 6 నెలల కిందటే చెప్పానని గుర్తు చేశారు. రాజయ్య అందరిని కలుపుకోపోవాలని కడియం సూచించారు. 

 

21:21 - October 11, 2018

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీది సమర భేరీ కాదు...అసమర్థ భేరీ ఎద్దేవా చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అమిత్‌షాపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అమిత్‌షా ఎత్తులు తెలంగాణలో పని చేయవన్నారు. తెలంగాణలో షా ఆటలు సాగవని చెప్పారు. రాష్ట్రంలో అమిత్‌షా షోలు నడవు అని పేర్కొన్నారు. బీజేపీ ఐదు సీట్లు గెలుచుకుంటే అదే ఎక్కువని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యం కల్గినవారని, సెక్యులర్ భావాలు ఉన్న ప్రజలని అన్నారు. మతాలు, ఆచారాల ఆధారంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామనుకుంటే కుదరదన్నారు. 

 

20:26 - October 11, 2018

శ్రీకాకుళం : ఉత్తరాంధ్రను తిత్లీ తుపాన్ వణికిస్తోంది. బీభత్సం సృష్టిస్తోంది. తిత్లీ తుపాన్ ధాటికి 10 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలోని సరబుజ్జిలి మండలం రొడ్డివలస గ్రామానికి చెందిన మూడడ్ల సూర్యారావు, వంగర మండలం వన్నే అగ్రహారంకు చెందిన తాడి అప్పల నర్సమ్మ, మందస మండలం సువర్ణపురంకు చెందిన ఇప్పిలి కన్నయ్య, మన్నెన సంతోష్ కుమార్, సంతబొమ్మాలి మండలం సున్నపల్లికి చెందిన బొంగు దుర్గారావు, టెక్కలిలోని ఆంధ్రవీధికి చెందిన కొల్లి లక్షమ్మ మృతి చెందారు. విజయనగరం జిల్లాకు చెందిన సూరాడ రాము, వాసుపల్లి లక్ష్మణ్ రావు, బడే సత్తయ్యలు మృతి చెందారు. భారీగా పెను గాలులు వీస్తున్నాయి. పెనుగాలులకు కొబ్బరిచెట్లు విరిగిపడుతున్నాయి. ఇళ్ళల్లో నుంచి భయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. 

 

 

19:14 - October 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఉత్కంఠకు తెరపడింది. ఓటర్ల జాబితా ప్రకటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ల జాబితా విడుదలకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా ప్రింట్‌కు హైకోర్టు ఆమోదం తెలపడంతో జాబితాను రేపు విడుదల చేసేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

 రాష్ట్రంలో ఓటు హక్కు కోసం మొత్తం 33 లక్షల 14 వేల 6 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొత్తగా ఓటు హక్కు కోసం 22 లక్షల 36 వేల 677 దరఖాస్తులు వచ్చాయి. అయితే 30 లక్షల 872 దరఖాస్తులకు ఈసీ ఆమోదం తెలిపింది. 3 లక్షల 12 వేల 335 దరఖాస్తులను తిరస్కరించింది. రేపు ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. లోపాలు లేకుండా ఓటరు జాబితా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 

 

18:28 - October 11, 2018

రంగారెడ్డి : జిల్లాలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రథంపై దాడి జరిగింది. షాద్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార రథంపై ప్రజలు దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రచార రథం ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి తండాకు వెళ్లింది. తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో నేతలు విఫలమయ్యారని టీఆర్ఎస్ ప్రచారం రథంపై గ్రామస్తులు దాడి చేశారు. ప్రచార రథాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేసి, ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

17:56 - October 11, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీ ఈరోజు వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయింది.. సినిమాకి అన్ని ఏరియాల నుండి మంచి స్పందన వస్తోంది.. ఏపీ, తెలంగాణాల్లో అన్ని ధియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి.. ఓవర్సీస్‌లోనూ మొదటి రోజు తారక్ తన హవా కొనసాగిస్తున్నాడు.. అక్కడ, తన గత చిత్రం జై లవకుశని, అరవింద సమేత వీర రాఘవ బీట్ చేసింది..
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు,  మొదటి రోజు ఓవర్సీస్‌లో అరవింద సమేత 707,698 డాలర్లు కలెక్ట్ చేసింది.. అమెరికాలో తొలిరోజు జై లవకుశ 589,219 డాలర్లు వసూలు చెయ్యగా, జనతా గ్యారేజ్ 584,000 డాలర్లు రాబట్టింది.. ఈ లెక్కన అమెరికాలో తారక్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ తెచ్చిన మూవీగా అరవింద సమేత వీర రాఘవ రికార్డ్ నెలకొల్పింది.. ఫస్ట్‌వీక్‌లోనే వందకోట్లు వసూళ్ళు సాధించే దిశగా వీర రాఘవుడు బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతున్నాడు...

 

17:19 - October 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముందస్తు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. సభలు, సమావేశాలతో ముందుకెళ్తోంది. టీఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ, సీపీఐ, జన సమితి పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్‌ను గద్దె దించాలనే తలంపుతో జట్టు కట్టింది. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీకి నేతలు రాజీనామాలు చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు రాజీనామా బాట పడుతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టికెట్ రాని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నేతలు వరుసగా పార్టీని వీడడంతో కాంగ్రెస్ కష్టాల సుడిగుండంలో పడింది.Image result for పద్మినీరెడ్డి
పద్మినీరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. గత కొంత కాలంగా సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నపద్మినీరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. మురళీధర్ రావు సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పద్మినీరెడ్డి చేరికను స్వాగతిస్తున్నామని, ఆమె సేవలను వినియోగించుకుంటామని మురళీధర్ రావు తెలిపారు. సంగారెడ్డి నుండి పోటీ చేయాలని పద్మినీ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు సంగారెడ్డి శాసనసభ టికెట్ కోసం దామోదర రాజనర్సింహ తీవ్రంగా ప్రయత్నించారు. కుటుంబానికి ఒకటే టికెట్ నిర్ణయం కారణంతో ఆమెకు టికెట్ ఇవ్వలేమని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పడంతో పోటీ యోచనను ఆయన విరమించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దామోదర రాజనర్సింహను మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. సతీమణి పద్మినీరెడ్డిని సంగారెడ్డి నుండి బరిలోకి దింపాలని దామోదర యోచించినట్లు తెలుస్తోంది. అయితే సతీమణి బీజేపీలో చేరడంతో దామోదర కూడా బీజేపీలో చేరుతారా అనే చర్చ జరుగుతోంది.

Related imageకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. సిటీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్‌ టీఆర్ఎస్‌లో చేరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మంచి పట్టున్నవ్యక్తి దానం నాగేందర్ అని చెప్పవచ్చు. ఆత్మాభిమానం దెబ్బతిన్నందుకే పార్టీకి రాజీనామా చేశానని దానం నాగేందర్‌ అన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం... తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసేందుకే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని జెండా మోస్తున్న వారికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని.. ఓ వర్గం పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశానని.. కానీ రానురాను బీసీలకు అన్యాయం జరుగుతోందని.... ఒకే వర్గానికి చెందిన వారు పార్టీని ఏలుతున్నారని ఆరోపించారు.అందుకే ఆత్మగౌరవం లేని చోట ఉండటం సరికాదని రాజీనామా చేసినట్లు తెలిపారు. Image result for ex-speaker suresh reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గత నెల 12న టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. గౌరవం లేని చోట ఉండడం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని సురేశ్‌రెడ్డి తెలిపారు. పార్టీ మారే వారి కోసం టికెట్‌ కేటాయించడంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే అవకాశాలు పూర్తిగా మూసుకుపోవడం వల్లే తాను కాంగ్రెస్‌ నుంచి తప్పుకోవలసి వచ్చిందన్నారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్‌రెడ్డి తన అనుచరులకు వివరించారు. 2009 నుంచి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. తొందరపడి పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్‌కు నష్టమే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు  ఏవిధంగా ముందుకెళ్తారో చూడాలి మరి.

-చింత భీమ్‌రాజ్

17:11 - October 11, 2018

ఢిల్లీ : గంగా నదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ (స్వామి జ్ఞానస్వరూప్ సనంద్ జీ) కన్నుమూశారు. 112 రోజులుగా ఆయన ఉపవాస దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన్ను బలవంతంగా పోలీసులు రిషికేష్ లోని ఏయిమ్్స ఆసుపత్రికి తరలించారు. కానీ గురువారం శరీరంలో పొటాషియం, ఇతర ప్రోటీన్లు పడిపోవడంతో మధ్యాహ్నం 1గంటకు తుదిశ్వాస విడిచారని వైద్యులు పేర్కొన్నారు. 
గంగా నదిని కాపాడేందుకు ఆయన జూన్ 22వ తేదీ నుండి ఉపవాస దీక్ష చేస్తున్నారు. నదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకరావాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఐఐటి కాన్పూర్‌లో ఆయన ప్రొపెసర్‌గా పనిచేశారు. సీపీసీబీలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. 2011లో ఆయన స్వామిగా అవతారమెత్తారు. భగరీథి నదిపై డ్యామ్‌లు కట్టవద్దని ఆయన కోరారు. 

16:58 - October 11, 2018

త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్టార్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకుని, దర్శకుడిగా మారి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.. గత చిత్రం అజ్ఞాతవాసి వల్ల ప్రేక్షకులను నిరాశకి గురిచేసిన గురూజీ, ఈసారి యంగ్ టైగర్‌తో హిట్ సినిమా తియ్యాలనే కసితో అరవింద సమేత వీర రాఘవ తీసాడు.. రాయలసీమ ఫ్యాక్షనిజంలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చెయ్యని ఒక కొత్త పాయింట్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది.. ముఖ్యంగా త్రివిక్రమ్ మేకింగ్‌కి ఆడియన్స్‌అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌నుండి మంచి ఫీడ్ బ్యాక్ అందుతోంది.. సినిమాలో త్రివిక్రమ్ మార్క్‌ కామెడీ పెద్దగా లేకపోయినా, కథ, కథనం, తన స్టైల్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు.. సీమ సినిమా అనగానే, మీసాలు మెలెయ్యడాలు, తొడలు కొట్టడాలు గట్రా కాకుండా, రక్తం అంటిన కత్తిని ప్యాంటుకి తుడుచుకునే షాట్స్‌ పెట్టాలనే ఐడియా త్రివిక్రమ్‌కి ఎలా వచ్చిందసలు అని అందరూ అనుకునేలా చేసాడు... అందరికీ తెలిసిన కథనే అర్ధమయ్యేలా, హృదయాలకు హత్తుకునేలా తీసి, ఒక్క పరాజయం వచ్చినంత మాత్రాన తన స్థాయి ఏం తగ్గదని నిరూపించాడు త్రివిక్రమ్... 

16:42 - October 11, 2018

మాస్కో: రష్యా ప్రయోగించిన మానవసహిత సోయుజ్ రాకెట్ ప్రయోగం ఆకాశంలో ఒక్కసారిగా పేలటంతో విఫలమైంది. అయతే రాకెట్ ఎమర్జెన్సీ లాండింగ్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యోమగాములు ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా భూమి మీదకు చేరుకున్నారు. 
నాసా ట్రయినీ వ్యోమగామి నిక్ హాగ్‌తో పాటు రెండోసారి ప్రయాణిస్తున్న అలెస్కీ ఒవచినిన్ ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా భూమిమీదకు చేరుకున్నారు. ప్రయోగించిన కొద్దిసేపటికే మొదటి సారి రాకెట్ భాగం విడిపోయో సమయంలో రాకెట్ స్పీడ్ అందుకోలేక పోయింది.. అత్యవసర రివర్స్ విధానంతో రాకెట్ కజికిస్థాన్‌లో ల్యాండ్ అయ్యింది. 

 

16:32 - October 11, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయింది. అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ టీడీపీ తన సత్తా చాటుకుంది. ఏ పార్టీకి లేని విధంగా తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అదే టీడీపీకి ప్లస్. కాగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితం కావడం తెలంగాణలో టీడీపీకి మైనస్ అయింది. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. ఆ కారణంగా టీఆర్ఎస్‌కు అత్యధిక స్థానాలు రావడం అధికారం దక్కడం జరిగిపోయాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడింది. ఓవైపు ఎన్నికల్లో వరుస ఓటములు.. దీనికి తోడు వలసలు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. Image result for l ramana

2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 72స్థానాల్లో పోటీ చేస్తే 15 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటింగ్ శాతం 14.66గా ఉంది. కాగా గులాబీ ఆకర్ష్ కారణంగా తెలుగుదేశం టికెట్ మీద గెల్చిన ఎమ్మెల్యేలంతా సైకిల్ దిగి కారెక్కారు. చివరకు టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. సండ్ర వెంటక వీరయ్య(సత్తుపల్లి), ఆర్ క్రిష్ణయ్య(ఎల్బీనగర్). టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి సైతం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఒంటరిగా కాకుండా మహాకూటమి పేరుతో బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి, సీపీఐలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. అయితే మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై మిత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయన్నది క్లారిటీ లేదు. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీలు చెబుతున్నాయి.

జిల్లాలు గెలిచిన స్థానాలు
రంగారెడ్డి 7
హైదరాబాద్ 3
మహబూబ్‌నగర్ 2
వరంగల్ 2
ఖమ్మం 1

          

2014లో టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు 15
ఎంపీ స్థానాలు 1
ఓటింగ్ శాతం 14.66

 

 

 

 

మరోవైపు టీఆర్ఎస్ మాత్రం దూకుడు మీదుంది. ఇప్పటికే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ప్రతిపక్షాల కన్నా చాలా ముందు ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ సరైన నాయకత్వమే లేదు. ఈ లోపం కారణంగానే టీడీపీ చతికలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఆ లోపాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. 

2014 టీడీపీ ఎమ్మెల్యేలు
సండ్ర వెంకట వీరయ్య -సత్తుపల్లి
ఆర్.కృష్ణయ్య -ఎల్బీనగర్
రేవంత్ రెడ్డి -కొడంగల్
రాజేందర్ రెడ్డి -నారాయణ్ పేట్
వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్
కృష్ణా రావు కూకట్ పల్లి
కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం
క్రిష్ణా రెడ్డి మహేశ్వరం
ప్రకాశ్ గౌడ్, రాజేంద్రనగర్
ఎ.గాంధీ శేరిలింగం పల్లి
ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి
చల్లా ధర్మారెడ్డి పరకాల
శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్
సాయన్న, కంటోన్‌మెంట్
మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్

     


 

 

16:28 - October 11, 2018

కరీంనగర్ : చొప్పదండి టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్న శోభ ఆశలు నెరవేరడం లేదా ? ఆమెకు టికెట్ దక్కదా ? ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. తనకు టిక్కెట్ ఇవ్వకుండా పెండింగ్‌‌లో ఉంచడంతో బొడిగే శోభ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా అపదర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలువడానికి బొడిగె శోభ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం సిరిసిల్లలో కేటీఆర్‌ను కలువడానికి ప్రయత్నించినా అంతగా సమయం ఇవ్వలేదని ప్రచారం జరిగింది. 
ఈ నేపథ్యంలో గురువారం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ రాకకోసం శోభ గంటపాటు ఎదురు చూశారు. వేములవాడకు చేరుకున్న కేటీఆర్..చెన్నమనేని రమేష్ నివాసంలో భోజనం చేశారు. ఈ భోజనానికి వారితో పాటు శోభ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య చొప్పదండి టికెట్ పెండింగ్ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కానీ మంత్రి కేటీఆర్ ఎలాంటి స్పష్టమైన హామీనివ్వకపోడంతో భోజనం మధ్యలో నుండే శోభ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలు ఎంత మాత్రం లేకపోవడంతో ఆమె తుదినిర్ణయానికి తీసుకొనే అవకాశం ఉందని, బీజేపీలో చేరుతారని పుకార్లు షికారు చేస్తున్నాయి.

15:27 - October 11, 2018

కరీంనగర్ : కరీంనగర్...ఉద్యమాల ఖిల్లా అనే పేరుంది. మరి ఈ కోటాలో ఈసారి పాగా వేసే వారు ఎవరు ? పాలకుల పాలనతో ఇక్కడి ప్రజలు సంతృప్తితో ఉన్నారా ? మరలా వారికే పట్టం కడుతారా ? కొత్త వారికి అవకాశం ఇస్తారా ? తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ మరోసారి చక్రం తిప్పుతారా ? కీలక నేత ఈటెల రాజేందర్ కూడా ప్రభావం చూపిస్తారా ? తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కూత కూయడంతో ఇక్కడి రాజకీయాలు రంజుగా మారాయి. ఇక్కడ 2 పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాలున్నాయి.  
కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ గతంలో కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం బీటలు పడిపోయాయి. 2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్లమెంట్‌ స్థానాలతోపాటు 12 అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఎన్నికలు జరగడంతో గులాబీకి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య నువ్వా..నేనా అనే పోటీ జరిగినా చివరకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాన్నికాంగ్రెస్ దక్కించుకొంది. కాంగ్రెస్+సీపీఐ, టీడీపీ+బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయగా టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. Image result for karimnagar town
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ‘కారు’కు బ్రేకులు వేయాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా శత్రువులుగా ఉన్న పార్టీలు ఏకమౌతున్నాయి. మహా కూటమి పేరిట పొత్తుల చర్చలు కొనసాగుతున్నాయి. టిడిపి..కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తులు కుదురుతాయని తెలుస్తోంది. కానీ ముందే అభ్యర్థులను ప్రకటించేసిన ‘గులాబీ’ ప్రచార పర్వంలో దూసుకెళుతోంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ అక్కడక్కడ అసంతృప్తులు వ్యక్తమౌతున్నాయి. టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన వారు రెబెల్‌గా దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఏ పార్టీకి వెళుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదని విపక్ష పార్టీలు ప్రజల మెదల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అరకొరగా హామీలు అమలు చేయడంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు కారుకు పంక్చర్ చేస్తారని నేతలు అంటున్నారు. తమ అభివృద్దే తమను గెలిపిస్తుందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

2014లో గెలుపొందిన అభ్యర్థులు

నియోజకవర్గం

అభ్యర్థి పేరు వచ్చిన ఓట్లు
కోరుట్ల కె.విద్యాసాగర్ రావు 20,585
జగిత్యాల  టి.జీవన్ రెడ్డి 8,114
ధర్మపురి (ఎస్సీ) కొప్పుల ఈశ్వర్  18,679
రామగుండం సోమారపు సత్యనారాయణ 2,235
మంథని పుట్టా మధు 9,366
పెద్దపల్లి  దాసరి మనోహర్ రెడ్డి 62,663
కరీంనగర్ గంగుల ప్రభాకర్  24,673
చోప్పదండి (ఎస్సీ)  బి.శోభ 54,981
వేములవాడ సీ.హెచ్.రమేష్ బాబు  5,268
సిరిసిల్ల కె.తారకరామారావు 52,538
మానకొండూరు (ఎస్సీ)  రసమయి బాలకిషన్ 46,832
హుజూరాబాద్ ఈటెల రాజేందర్ 57,637
హుస్నాబాద్ వి.సతీష్ కుమార్ 34,269
2018 టీఆర్ఎస్ అభ్యర్థులు...
నియోజకవర్గం అభ్యర్థి పేరు
కరీంనగర్  గంగుల కమలాకర్‌ 
హుజూరాబాద్ ఈటెల రాజేందర్ 
మానుకొండూరు రసమయి బాలకిషన్
సిరిసిల్ల కల్వకుంట్ల తారకరామారావు 
వేములవాడ చెన్నమనేని రమేష్
జగిత్యాల సంజయ్ కుమార్ 
కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
ధర్మపురి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి  దాసరి మనోహర్‌రెడ్డి
మంథని  పుట్టా మధుకర్
రామగుండం సోమారపు సత్యనారాయణ

- మధుసూధన్ తూపురాణి

15:19 - October 11, 2018

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా ఈరోజు వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయింది.. తారక్ యాక్టింగ్‌కి, త్రివిక్రమ్ మేకింగ్‌కి మంచి స్పందన వస్తోంది.. అయితే, పైరసీ భూతం అరవిందకి ఊహించని షాక్‌ ఇచ్చింది..
అక్టోబర్ 11 నుండి 18వరకు, ఉదయం 5 గంటలనుండి 11 గంటలవరకు అరవింద సమేత చిత్రాన్ని అదనంగా మరో రెండు ఆటలు‌ ప్రదర్శించుకోవడానికి  ఏపీ‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో ఉదయాన్నే బెనిఫిట్ షోలకి వెళ్ళినవాళ్ళు చాలామంది సినిమా రన్ అవుతుండగా మొబైల్స్‌తో వీడియోలుతీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసారు..  ఎన్టీఆర్ ఇంట్రడక్షన్‌తో పాటు మరికొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, రెడ్డీ ఇక్కడ సూడు సాంగ్ లాంటివి తీసింది తీసినట్టు ఆన్‌లైన్‌లో పెట్టేసారు.. పైరసీని ప్రోత్సహించకండి, సినిమాని ధియేటర్‌లోనే చూడండి అని నిర్మాతలూ, దర్శకులూ, హీరోలూ మొత్తుకుంటున్నా, ఇలా.. వందలాది మంది కష్టాన్ని తమ ఇష్టానికి విచ్చలవిడిగా వీడియోలు తీసి పోస్ట్ చేసేవారిని ఏమనాలంటారు?

15:07 - October 11, 2018

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీకి తీరని అన్యాయం చేసినా.. ప్రధాని మోదీని వైఎస్ జగన్ ఒక్క మాట కూడా అనడం లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న కారణంగానే జగన్ నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబు ఆరోపిస్తుంటే.. వైసీపీ నాయకులు అంతే ధీటుగా బదులిస్తున్నారు. బీజేపీతో కలిస్తే మాపై కొత్తగా ఈడీ కేసులు ఎందుకు పెడతారని? వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు జాతీయ పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారాయన. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడిన వైవీ సుబ్బారెడ్డి.. తమ రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. 

వంగవీటి రాధా ఎపిసోడ్‌పైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వంగవీటి రాధా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కొన్ని మార్పులు జరుగుతుంటాయన్నారు. ఇక 2019 ఎన్నికల్లో నేను ఒంగోలు నుంచే పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. తన పోటీపై అధినేత జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందన్నారు.

14:45 - October 11, 2018

శాంట్రోనీ : జంతు ప్రేమికుల పోరాటం చివరకు ఊబకాయులకు పెద్ద కష్టాన్నే మిగిల్చింది. గత కొన్నేళ్లుగా గాడిదలను టూరిస్టులు వినియోగించడం వల్ల వాటి వెన్నుముక దెబ్బతిని అనారోగ్యం పాలైతున్నాయని జంతు ప్రేమికులు గ్రీకు దేశంలోని శాంట్రోనీ దీవిలో ఆందోళన చేపట్టారు. ఇది కాస్తా అంతర్జాతీయ మీడియా దృష్టికి రావండంతో ఆ దీవిలో ప్రస్తుతం ఆంక్షలు విధించారు. దీవికి వచ్చే పర్యాటకులు 220 పౌండ్లు అంటే 99 కిలోల బరువు కంటే ఎక్కువ ఉంటే స్థానిక గాడిదల మీద ఎక్కించరాదని అక్కడి ప్రభుత్వం హూకూం జారీచేసింది. 

“The holiday season on islands is now a lot longer than it used to be, meaning that the donkeys are pretty much working the whole year round."నిత్యం వందల సంఖ్యలో ఊబకాయ పర్యాటకులు ప్రఖ్యాత క్రూయిజ్ ఓడను ఎక్కేందుకు ఎత్తైన కొండలు ఎక్కి వెళ్లడానికి నడవడం ఇష్టం లేక గాడిదలను ఆశ్రయిస్తున్నారు.

Over 1,000 tourists a day flood Santorini during the peak vacation season between May and October.ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులు ఈ ఏడాది జులైలో గాడిదలను అధిరోహించే పర్యాటకులకు వారి బరువుపై ఆంక్షలు విధించాలని ఆందోళన చేపట్టారు. అధికబరువు ఉన్న ఊబకాయులను మోయడం ద్వారా గాడిదల వెన్నుముక విరిగి గాయాలపాలవుతున్నాయని ఆందోళన చేశారు. 
హాలిడే సీజన్ కారణంగా అధిక సంఖ్యలో పర్యాటకులు దీవికి చేరుకోవడం దీనికితోడు ఏ కాలంలోనైనా పర్యాటకులను వారి గమ్యస్థానాలు చేర్చటంలో గాడిదలు ప్రముఖంగా ఉపయోగపడటంతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది.  కాబట్టి ఇకపై గ్రీకు దీవులకు వెళ్లే పర్యాటకులు తమ బరువు ఒకసారి చెక్ చేసుకొని ప్రయాణానికి సిధ్దం కావల్సిఉంటుందన్నమాట..!

14:40 - October 11, 2018

విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఆయన పార్టీలో చేరితే కృ‌ష్ణా, గుంటూరు జిల్లాలో సామాజిక సమీకరణాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కానీ నాలుగేళ్లుగా పవన్‌తో నాదెండ్ల మైత్రి పూర్వక సంబంధం కొనసాగిస్తున్నారు. పవన్ నిర్వహించే సభలు..సమావేశాలకు మనోహర్ సూచనలు చేస్తున్నారు. జనసేన భావజాలం, పవన్ వ్యక్తిత్వం..నాదెండ్ల నిర్ణయానికి దోహదం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కులాల మధ్య సఖ్యత పెంచాలని ఇరువురి మధ్య ఏకాభిప్రాయం ఉందనే చెప్పవచ్చు. అంతేగాకుండా జనసేనకు దూరంగా ఉన్న సామాజిక వర్గాన్ని అక్కున్న చేర్చుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నాదెండ్ల మనోహర్ వ్యక్తిగతంగా వివాదరహితుడిగా పేరొందారు. మరి నాదెండ్ల ఎంతమేరకు సక్సెస్ అవుతారు ? ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

14:14 - October 11, 2018

ఢిల్లీ : ఇప్పుడు ప్రపంచం అంతా స్మార్ట్ అయిపోయింది. అందరి చేతుల్లోను స్మార్ట్ ఫోన్సే. ఇంటిలోను స్మార్ట్ ఐటెమ్సే. స్మార్ట్ అభిమానులకోసం మైక్రోమ్యాక్స్ సంస్థ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలను తాజాగా విడుదల చేసింది. చూపరులను కట్టిపడే స్మార్ట్ టీవీని విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ అనుబంధ యూ టెలీ వెంచర్స్, 'యూఫోరియా' పేరిట భారత మార్కెట్లో 40 అంగుళాల స్మార్ట్ టీవీని ఆకర్షణీయ ధరలో విడుదల చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడే ఈ టీవీ ధర రూ. 18,999 కాగా, పాత టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో భాగంగా మార్చుకుంటే రూ. 7,200 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుందని సంస్థ తెలిపింది. 

Image result for amazon
ఇక ఈ స్మార్ట్ టీవీలో మీడియా ఫైల్స్ ను డైరెక్టుగా ప్లే చేసుకోవచ్చు. తమకు నచ్చిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఈ టీవీలో 40 అంగుళాల ఫుల్‌ హెచ్‌ డీ డిస్‌ ప్లే, 5000:1 కాంట్రాస్ట్‌ రేషియో, డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్ కో ప్రోసెసర్‌ కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, మూడు హెచ్‌డీఎం పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక వీజీఏ పోర్ట్, 24 వాట్స్‌ ఆడియో అవుట్‌ పుట్‌ సదుపాయాలుంటాయి. మరి ఇంకేంటి మీ పాత టీవీని ఇచ్చేయండి. కొత్త ఫుల్ హెచ్చ డీ స్మార్ట్ టీవీని ఇంటికి పట్టుకెళ్ళండి.

14:01 - October 11, 2018

ఢిల్లీ: రాఫెల్ డీల్ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. రాఫెల్ డీల్ పూర్తి వివరాలను సీల్డ్ కవర్‌లో తమకు అందజేయాలని సుప్రీంకోర్టు నిన్న కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అనిల్ అంబానీకి ప్రధాని మోదీ రూ.30,000 కోట్లు అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ ప్రధాని మోదీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఈ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో రహస్యంగా ఉంచాల్సిన అంశాల్లో విమానం ధర లేనేలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. వాస్తవాలను రాస్తున్న మీడియాపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని, అయినా లొంగనివారిపై ఐటీ దాడులు చేయిస్తోందని రాహుల్ విమర్శించారు. 

దేశానికి కాపలాదారుగా ఉంటానన్న ప్రధాని మోదీ అవినీతిపరుడిగా తయారయ్యారని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాడతానన్న హామీతోనే మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. సుప్రీంకోర్టు రాఫెల్ వివరాలు ఇవ్వాలని నిన్న కోరగానే రాత్రికిరాత్రి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ కు వెళ్లారని, దీని వెనుక అసలు రహస్యం ఏంటని రాహుల్ ప్రశ్నించారు.

మోదీ అవినీతికి పాల్పడ్డారు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని రాహుల్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే, డస్సాల్ట్ కంపెనీలో నంబర్ 2 అధికారి ఇద్దరూ.. మోదీ అవినీతి పరుడనే చెప్పారన్నారు. డస్సాల్ట్ కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చి తన అవినీతిని మోదీ దాస్తున్నారని విమర్శించారు. రిలయన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోకుండా, వారికి తగిన మొత్తం చెల్లించకుండా కాంట్రాక్టును దక్కించుకోలేరని డస్సాల్ట్ కంపెనీకి కేంద్రం స్పష్టం చేసినట్లు ఇటీవల ఓ డాక్యుమెంట్ లభ్యమయిందని రాహుల్ ఆరోపించారు. ఇదొక్కటే కాదు, గతంలో కేంద్రం చేసుకున్న పలు ఒప్పందాలకు సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయని రాహుల్ బాంబు పేల్చారు.

13:43 - October 11, 2018

సిరిసిల్ల : మూడేళ్లలో సిరిసిల్ల రూపు రేఖలు మారుస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం సిరిసిల్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో మాట్లాడారు. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. సిరిసిల్లలో రూ. 16-20వేల రూపాయలు చేనేత కార్మికుడు సంపాదిస్తున్నాడని, ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతోందన్నారు. గతంలో ఉన్న ఫించన్లు గౌరవంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో కేసీఆర్ వాటిని పెంచారని తెలిపారు. హాస్టళ్లలో నాణ్యమైన బియ్యంతో పిల్లలు తినాలని భావించి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి కేసులు పెరిగాయని, ఇందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం..కేసీఆర్ కారణమన్నారు. సిరిసిల్లకు రైలు తీసుకొస్తానని, జన్మనిచ్చింది తల్లి..అయితే రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల గడ్డ అని...ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. బీడీలు చుట్టే అవకాశం లేకుండా పదివేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై నిలబడే విధంగా చేసి చూపిస్తానన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, కేసీఆర్‌ను గద్దె దించాలని చెబుతున్నారని..ఎందుకు గద్దె దించాలో చెప్పాలని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తే గద్దె దించాలా అని పేర్కొన్నారు. గతంలో నల్లధనం విషయంలో ప్రధాన మంత్రి మోడీ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు హామీలు గుప్పిస్తున్నారని, రాష్ట్రంలో రూ. 2వేలు ఇస్తామని ప్రకటిస్తున్నారని..కానీ ఇతర రాష్ట్రంలో ఎందుకు మాట్లడడం లేదని నిలదీశారు. ఉత్తమ్ మాటలన్నీ ఉత్తుత్తివేనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీలో కొట్లాడుకుంటున్నారని, రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని..చెబుతున్నారని కానీ మాఫీకి అర్హత ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారని తెలిపారు. 

13:42 - October 11, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయింది.. సినిమాకి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది..
రాయలసీమ ఫ్యాక్షనిజంలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చెయ్యని ఒక కొత్త పాయింట్‌తో రూపొందిన అరవింద సమేతలో  ఎన్టీఆర్ నటనే మెయిన్ హైలెట్ అని సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు.. ఇంతకుముందు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఆది, సాంబ సినిమాల్లో తారక్ యాక్టింగ్ ఎలా ఉంటుందో మనం చూసాం.. అరవింద సమేతలో అంతకుమించి అనేలా ఉంది యంగ్ టైగర్ అభినయం.. ఎన్టీఆర్ నట సామర్ధ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు... ఈ మూవీలో, మైండ్ బ్లోయింగ్ అండ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.. ఫస్ట్‌హాఫ్ అరవింద వెనక తిరిగే లవర్ బాయ్ రాఘవగా, సెకండ్‌హాఫ్‌లో సీమలో  ప్రత్యర్థులతో వీర విహారం చేసే వీర రాఘవ రెడ్డిగా తారక్ నటన..అద్భుతహ అనేలా ఉంది.. సీమయాసలో  అతని డైలాగ్ డెలివరీ, ఫైట్స్‌లో రౌద్రం, ముఖ్యంగా తండ్రి చనిపోయే సీన్‌లో తారక్ నట విశ్వరూపం చూస్తాం.. అనగనగనగా, రెడ్డీ ఇక్కడ సూడు పాటల్లో తారక్ వేసిన స్టెప్స్‌కి ధియేటర్స్‌లో విజిల్స్‌పడ్డాయి.. అరవింద సమేత వీర రాఘవలో తారక్ అద్భుతమైన నటన కనబరచడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.. 

 

13:38 - October 11, 2018

కేరళ : శబరిబలలో మహిళల దర్శనం విషయంలో వివాదాలు కొనసాగుతునేవున్నాయి. మహిళలు కూడా శబరిమల స్వామి దర్శనానికి వెళ్ళవచ్చుఅంటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేరళ సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆలయాలకు వెళ్లేది భక్తితో కాదని, అంగాంగ ప్రదర్శనతో పురుషులను ఆకట్టుకోవడానికే వారు ఆలయానికి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అలా చూసి ఆనందించడానికే పురుషులు కూడా ఆలయానికి వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆలయాల్లోని కోనేరులో స్నానం చేసే మహిళలు తడిసిన దుస్తులతో అంగాంగ ప్రదర్శనకే మొగ్గు చూపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Image result for sabarimala temple in supreme court

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తిరుగుబాటుకు ఆరెస్సెస్, కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని ఎంపీ  శ్రీమతి ఆరోపించారు. సుప్రీం తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న శ్రీమతి.. సమానత్వ హక్కును ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు. 

కేరళలోని అనేక సామాజిక దురాచారాలను కమ్యూనిస్టు పార్టీ రూపుమాపిందని శ్రీమతి అన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను ఇంత ఘోరంగా అవమానించడమేంటంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తక్షణం ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఎంపీ శ్రీమతి ఎలా స్పందిస్తారో చూడాలి.
 

13:25 - October 11, 2018

ఢిల్లీ: బ్యాంకులు కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. మోసాలను అరికట్టే పేరుతో ఆన్ లైన్ సేవలు విస్తరించే పేరుతో అనేక రూల్స్ అమలు చేస్తున్నాయి. తాజాగా ఏటీఎం నుంచి ఒక రోజు విత్‌డ్రా చేసే మొత్తంపై బ్యాంకులు పరిమితులు విధించాయి. రోజుకి ఏటీఎం ద్వారా అంత మొత్తం మాత్రమే తీసుకునే వీలు ఉంటుంది. ఈ విషయంలో ఒక్కో బ్యాంకు ఒక్కో పరిమితిని అనుమతిస్తున్నాయి. అలాగే కార్డు రకాన్ని బట్టి కూడా విత్‌డ్రా చేసుకునే డబ్బు మొత్తం మారుతోంది. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ఇటీవలే తన ఖాతాదారులు ఏటీఎంల నుంచి ఒక్క రోజులో డ్రా చేసుకోదగిన మొత్తాన్ని కుదించింది. కొన్ని కార్డులకు రోజుకి రూ.20 వేలు డ్రా చేసుకునేందుకు అనుమతిస్తుండగా, కొన్ని కార్డులకు అత్యధికంగా లక్ష వరకు అనుమతిస్తోంది.

ఎస్‌బీఐ నిబంధనల ప్రకారం క్లాసిక్‌, మాస్ట్రో డెబిట్‌ కార్డులకు వర్తించనున్నాయి. ఎస్‌బీఐ క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డు పరిమితిని రూ.40 వేల నుంచి రూ.20 వేలకు తగ్గించింది. గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ కార్డుకు రూ.50 వేలు, ప్లాటినం ఇంటర్నేషనల్‌ కార్డుకు రూ.లక్ష తీసుకోవచ్చని చెబుతోంది.

ఇక ప్రైవేటు రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.3 లక్షల వరకు అనుమతి ఇస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంకు కనీస విత్‌డ్రా పరిమితిని రూ.50 వేల వద్ద కొనసాగిస్తోంది. స్మార్ట్‌ షాపర్స్‌ గోల్డ్‌ కార్డు హోల్డర్లు రూ.75 వేలు, టైటానియం డెబిట్‌ కార్డు హోల్డర్లు లక్ష తీసుకోవచ్చని సూచిస్తోంది. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్లాటినం కార్డుకు రూ.50వేలు, క్లాసిక్‌ కార్డుకు రూ.25 వేలు అనుమతిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ బుర్గుండీ డెబిట్‌ కార్డు నుంచి రూ.3 లక్షలు అత్యధికంగా తీసుకునేందుకు అనుమతిస్తోంది.

ఇక హెచ్‌డీఎఫ్‌సీ టైటానియం చిప్‌ బేస్డ్ డెబిట్‌ కార్డు నుంచి రూ.లక్ష వరకు, రాయల్‌ డెబిట్‌ కార్డు నుంచి రూ.75 వేలు, ఈజీ షాప్‌ డెబిట్‌ కార్డు నుంచి 25 వేలు అనుమతిస్తోంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్లాసిక్‌ కార్డుపై రోజుకి రూ.25 వేలు, మాస్టర్‌ ప్లాటినం కార్డుపై రూ.50వేలు, వీసా ఎలక్ట్రాన్‌ కార్డుపై రూ.25 వేలు, మాస్టర్‌ క్లాసిక్‌ కార్డుపై రూ.25 వేలు, వీసా ప్లాటినం చిప్‌ కార్డుపై లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.

13:16 - October 11, 2018

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై విరుచుకు పడ్డాడు. రష్యాతో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎస్-400 డీల్ కుదుర్చుకొని ఆర్మీ పరికరాలు కొనుగోలు  చేయడంపై పెద్దన్న ట్రంప్ గరం గరంగా ఉన్నాడు. ఇది అమెరికా ప్రభుత్వం రూపొందించిన కాట్సా శాంక్షన్ల చట్టంకు వ్యతిరేకమని ట్రంప్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ ‘‘భారత్ త్వరలో తెలుసుకుంటుంది నా నిర్ణయాలు ఎంత తీవ్రంగా ఉంటాయో’’ అంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

13:09 - October 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇతర పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టికెట్ రాని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కానీ గురువారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న దామోదర రాజనర్సింహ సతీమణి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 

దామోదర రాజనర్సింహ...కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆందోల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. సతీమణి పద్మినీరెడ్డిని సంగారెడ్డి నుండి బరిలోకి దింపాలని దామోదర యోచించినట్లు తెలుస్తోంది. గతంలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు సంగారెడ్డి శాసనసభ టికెట్ కోసం దామోదర రాజనర్సింహ తీవ్రంగా ప్రయత్నించారు. కుటుంబానికి ఒకటే టికెట్ నిర్ణయం కారణంతో ఆమెకు టికెట్ ఇవ్వలేమని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పడంతో పోటీ యోచనను ఆయన విరమించుకున్నారు. 

గత కొంత కాలంగా సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నపద్మినీరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. మురళీధర్ రావు సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి నుండి పోటీ చేయాలని పద్మినీ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. పద్మినీరెడ్డి చేరికను స్వాగతిస్తున్నామని, ఆమె సేవలను వినియోగించుకుంటామని మురళీధర్ రావు తెలిపారు. భార్యభర్తలు వేరే పార్టీల్లో ఉండడం తప్పు కాదని బీజేపీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. మరి సతీమణి ిఇతర పార్టీలో చేరడంతో దామోదర కూడా బీజేపీలో చేరుతారా ? అనే చర్చ జరుగుతోంది....

12:52 - October 11, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా ? టీ.టీడీపీకి పునరవైభవం తీసుకరావడానికి నడుం బిగిస్తారా ? పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారబరిలో దిగుతారా ? అనే చర్చ జరుగుతోంది. గురువారం సారథి స్టూడియోస్‌కు టీ.టీడీపీ నేతలు వెళ్లారు. ఎల్.రమణ, పెద్దిరెడ్డితో పాటు సీనియర్  నేతలున్నారు. ఆ సమయంలో అక్కడ ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా బాలకృష్ణతో నేతలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ప్రచారం చేయాలని కోరారు. వీలుకాకపోతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనైనా సరే..ప్రచారం చేయాలని కోరారు. దీనికి బాలయ్య సమ్మతించినట్లు తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని టీ.టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో బాలయ్య ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందని నేతలు భావిస్తున్నారు. మరి బాలయ్య ప్రచారం నిర్వహిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

12:24 - October 11, 2018

విశాఖపట్నం : కాఫీ ఆహా!! ఆ సువాసనకే కడుపు నిండిపోతుంది. కాఫీని ఆస్వాదించటం మంటే చాలామంది బహుమక్కువ. కాఫీతో రోజుకు శుభారంభం పలకటమంటే ఆ రోజంతా మనస్సు, శరీరం హాయిగా వున్నట్లే నంటారు కాఫీ ప్రేమికులు. రుచికి రుచి, సువాసనకు సువాసన..రంగుకు రంగు కాఫీ ప్రత్యేకత. ఒక్కో నేలలో పండే కాఫీ గింజలకు ఒక్కో ప్రత్యేక వుంటుంది. ఇంపైన రుచి, చక్కటి  రంగు మనసును మైమరపించే సువాసనలో సాటిలేని అరకు కాఫీకి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ లోని అరకులోయలో గిరిజన రైతులు పండించే ఈ కాఫీ 'ప్రిక్స్ ఎపిక్యురెస్ ఓఆర్-2018' పోటీలో బంగారు బహుమతిని గెలుచుకుంది. ఫ్రాన్స్ లోని పారిస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

గతేడాది ఈ కాఫీ పొడిని ఫ్రాన్స్ లో అమ్మడం ప్రారంభించారు. తాజా అవార్డుతో అరకు కాఫీ కొలంబో, సుమత్రా వంటి ప్రసిద్ధ కాఫీ గింజల సరసన చేరింది. అరకు కాఫీ బ్రాండ్ ను మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా డైరెక్టర్ గా ఉన్న ‘నాంది’ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తోంది. కేవలం గింజలే కాకుండా కాఫీ ఆకులతో సైతం అరకు రైతులు అదనపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు.

నేచురల్ ఫార్మసీ ఇండియా అనే సంస్థ ‘అరకు చాయ్’ పేరుతో కెఫిన్ తక్కువగా, కృత్రిమ రుచులకు దూరంగా ఉండేలా గ్రీన్ టీని తయారుచేస్తోంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. పాలు, పంచదార కలపాల్సిన అవసరం లేకుండా కప్పు వేడినీటిలో ఈ టీ పొడి పొట్లాన్ని ముంచి తాగేయవచ్చని నేచురల్ ఫార్మసీ ఇండియా ప్రతినిధి రామన్ మాదాల తెలిపారు.
 

12:18 - October 11, 2018

హైదరాబాద్: ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరనున్నారు. రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. 

న‌వ‌త‌రం రాజ‌కీయాలే ల‌క్ష్యంగా నాదెండ్ల‌ మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో చేర‌నున్నారని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 12న అందుకు ముహుర్తం ఖ‌రార‌య్యింది. జ‌న‌సేన చీఫ్ పవన్, మ‌నోహ‌ర్ మధ్య కొంతకాలంగా స్నేహం కొన‌సాగుతోంది. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నాటి నుంచి జ‌న‌సేన సైద్దాంతిక విధానాలపై ప‌వ‌న్‌‌తో మనోహర్  మాట్లాడుతూనే ఉన్నారు. గత నాలుగేళ్లుగా జ‌న‌సేన పార్టీ స‌భ‌లు, ప‌వ‌న్‌ ప్ర‌సంగాల‌ని కూలంకుషంగా ప‌రిశీలిస్తూ త‌న అభిప్రాయాల‌ని తెలియ‌జేస్తున్నారు. పవన్ భావ‌జాలం, నాదెండ్ల‌ మ‌నోహ‌ర్‌ రాజ‌కీయ ల‌క్ష్యాలు ఒకే విధంగా ఉండ‌డంతో, వీరిద్ద‌రి మైత్రి మ‌రింత బ‌ల‌ప‌డింది. రాజ‌కీయ విలువ‌లు, ఉన్న‌త ల‌క్ష్యాలు క‌లిగిన మ‌నోహ‌ర్ రాక‌తో జ‌న‌సేన పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

12:12 - October 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టి.కాంగ్రెస్ ప్రచారం చేపడుతోంది. ఇతర పార్టీలతో కలిసి పొత్తులు కుదుర్చుకొనే పనిలో ఉంది. కానీ ఇంకా పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. మరోవైపు పార్టీ సీనియర్ నేత వీహెచ్ ‘ఇందిరమ్మ విజయయాత్ర’ పేరిట యాత్ర చేపట్టారు. గురువారం నగరంలో జరిగిన యాత్రలో టి.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచకపడ్డారు. తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి ఎవరంటే కేసీఆర్ అని విమర్శలు చేశారు. కాంగ్రెస్..టిడిపి పొత్తు అంటే టీఆర్ఎస్ భయపడుతోందని..అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రానికి ద్రోహం చేశారని, ఇతర పార్టీలో ఉన్న వారిని మంత్రులుగా చేశారని..వీరు తెలంగాణ కోసం ఏం పోరాడాని ప్రశ్నించారు. నేరేళ్లలో దళితులను హింసించారని...రైతులకు బేడీలు వేశారని.. తెలంగాణ బిడ్డలను హింసించడం కాదా ? అని నిలదీశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతమొందించాలని, డిసెంబర్ 12న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. 

12:03 - October 11, 2018

తిరుమల :  నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఈ రోజు  చిన్న శేష వాహనంపై తిరు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల రెండో రోజైన నేడు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు మాడ వీధులకు పోటెత్తడంతో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు వెలవెలబోయాయి. కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే మూల విరాట్టును దర్శించుకునేందుకు భక్తులు వేచివున్నారు. వీరికి 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని టీటీడీ ప్రకటించింది. కాగా, నేటి సాయంత్రం హంస వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
కలియుగ దైవం శ్రీ శ్రీనివాసును బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని 'వాసుకి'కి ప్రతీకగా పరిగణించటం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. రెండో రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మిగా ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. పాలను, నీళ్లను వేరుచేసినట్టుగానే.. దేవుడి ఆదేశాలను గ్రహించి ఆధ్యాత్మిక చింతనవైపు జీవితాన్ని మరల్చుకోవాలన్నది హంసవాహన సారాంశం. 
 

11:58 - October 11, 2018

న్యూఢిల్లీ: నేటి యువత సహనాన్ని కోల్పోయి మృగంలా మారుతున్నారన్న దానికి ఉదాహరించే సంఘటన ఢిల్లీలో జరిగింది. ప్రతీ తల్లీ, తండ్రికి ఈ సంఘటన ఓ గుణపాఠం కావాలి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బిజీ అయిపోయి.. ఎదిగిన కొడుకును ఎలా డీల్ చేయాలో తెలియకపోతే ఇటువంటి అనర్థాలే జరుగుతాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది. 
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ముగ్గురు హత్యగావించబడ్డారు. ఈ ఘటనలో మృతిచెందినవారు రియల్ ఎస్టేట్ వ్యాపారి మిథిలేష్ వర్మ, అతని భార్య సియా, వీరి 15 ఏళ్ల కుమార్తె. ఆ కుటుంబంలోని నాలుగో వ్యక్తి ఏమయ్యాడు అనే ప్రశ్న పోలీసుల్లో ఉదయించింది. వారి టీనేజి కొడుకు మృత్యువాతనుంచి తప్పించుకున్నారని పోలీసులు మొదట భావించారు. అయితే అతనే హంతకుడని ఊహించలేకపోయారు. 19 ఏళ్ళ సూరజ్ వర్మను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 
అతను చెప్పిన విషయాలు విని పోలీసులే నివ్వెరపోయారు. కారణం ఆగస్ఠు 15న గాలిపటాలు ఎగరవేస్తూ కాలేజీ ఎగ్గొట్టి చదువుని అశ్రధ్ద చేస్తున్నాడని సూరజ్ తండ్రి మిథిలేష్ వర్మ కొడుకు సూరజ్ వర్మను కొట్టాడు. పదేపదే తిట్లతో విసిగిపోయిన సూరజ్ తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. ఇంట్లోవాళ్లకు గట్టిగా బుద్ధిచెప్పాలని అదే రోజు సూరజ్ నిశ్చయించుకున్నాడు. మంగళవారంనాడు సూరజ్ స్నేహితులతో బయటకు వెళ్లి.. తిరిగి వచ్చేటప్పుడు ఓ కత్తి, కత్తెరలను కొనుక్కొని తెచ్చుకున్నాడు.
ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులతో పాత ఫోటో ఆల్బమ్‌లను చూస్తూ సరదాగా గడిపాడు. తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో ముందుగా తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి తండ్రిని, తల్లి సియాను, 15 ఏళ్ల చెల్లెలును దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. తల్లి మేల్కొని కూతురును కాపేడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తల్లి అరచినా భయపడక పదే పదే కత్తితో పొడిచి తల్లిని, చెల్లినీ చంపేశాడు. 
అనంతరం ఇంట్లో దొంగలు పడ్డారన్నట్టుగా సృష్టించేందుకు ఇల్లంతా సామానులు చిందరవందర చేసి.. ఆ తర్వాత కత్తిపై వేలుముద్రలను చెరిపేసాడు. రెండు గంటల అనంతరం చుట్టుపక్కలవారిని లేపి ఎవరో దొంగలు వచ్చి తన కుటుంబ సభ్యులను చంపేశారని కథ అల్లేశాడు. ఇంట్లో నగదు కానీ, విలువైన సామగ్రి అంతా అలాగే ఉండటంతో పోలీసుల దృష్టి సూరజ్ మీద పడించి. విచారణలో భయంకర నిజాలను వెల్లడించాడు. సూరజ్ తన 12వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యాడనీ... గతంలో తనని ఎవరో కిడ్నాప్ చేసినట్టు చెప్పి నమ్మించే ప్రయత్నం చేసి తరువాత దొరికిపోయాడని పోలీసులు తెలిపారు. తరచూ తన గురించిన నిజాలను తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయటంతో చెల్లెలు పైనా సూరజ్ కక్ష పెంచుకున్నట్టు విచారణలో తెలిసింది. 
క్లూస్ టీం సభ్యులు వంటగదిలో కత్తిని శుభ్రం చేసినట్టుగా గుర్తించారు. సూరజ్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. 

11:56 - October 11, 2018

జైపూర్: ఇప్పటివరకు మనం ఎన్నో రకాల ఉద్యోగాలు చూసి ఉంటాం, విని ఉంటాము. నెలకు ఇంత వేతనం ఇచ్చి ఉద్యోగులను నియమించుకుని వారితో పని చేయించుకుంటారు. ఇది రోటీన్‌గా జరిగేదే. కానీ ఇప్పుడు చెప్పబోయే ఉద్యోగం గురించి మీరు జీవితంలో చూసి ఉండరు, కనీసం విని కూడా ఉండరు. ఆ జాబ్ ఏంతో తెలుసా? దోపిడీలు, దొంగతనాలు, నేరాలు చేయడమే. షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. 

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో పోలీసులకి చిక్కిన ఓ దొంగల గ్యాంగ్ గురించి వాస్తవాలు తెలుసుకుని పోలీసులే విస్తుపోతున్నారు. ఆ గ్యాంగ్‌లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారంతా ఉద్యోగులు. ఒక్కొక్కరికి నెలకు రూ.15వేలు వేతనం. చేయాల్సిన పని దొంగతనాలు, దోపిడీలు, నేరాలు మాత్రమే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆశిష్ మీనా అనే వ్యక్తి ఈ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. నిరుద్యోగ యువతకు గాలం వేసి వారికి ఉద్యోగాలు ఇచ్చాడు. బంగారు నగలు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు దొంగిలించేందుకు ఆ ఆరుగురిని నెలవారీ వేతనాలతో ఉద్యోగంలో చేర్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఉద్యోగంలో చేరిన వ్యక్తి రోజుకు కనీసం ఒక్క నేరమైనా చేయాలి. ఒకవేళ నేరం చేయడంలో విఫలమైతే ఆ రోజు సాలరీ కట్ చేస్తాడు.

జవహర్ సర్కిల్ ఏరియా, శివ్‌దాస్‌పుర, ఖో నగోరియాన్, సంగనీర్ సహా ఇతర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్ దొంగతనాలు, మోటార్ సైకిళ్ల మాయంపై తరచూ ఫిర్యాదులు వస్తుండడంతో నిఘా వేసిన పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ లీడర్‌ సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తమ స్టైల్‌లో తీగలాగితే డొంకంతా కదిలింది. ముఠా సభ్యులు దొంగిలించిన వస్తువులను నాయకుడు ఆశిష్ మీనా అమ్మి సొమ్ము చేసుకుంటాడని జైపూర్ ఈస్ట్ డీసీపీ తెలిపారు.

కాగా, ముఠా సభ్యులందరూ నిరక్ష్యరాసులు, ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్న వారే. వీరిందరినీ ఉద్యోగంలోకి తీసుకున్న ఆశిష్ ఓ ఇంట్లో వారిని పెట్టాడు. జూలైలో వీరిని రిక్రూట్ చేసుకున్నాడని, ఇప్పటి వరకు 36 నేరాలకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి మొత్తం 35 పోన్లు, ల్యాప్‌టాప్, రెండు చైన్లు, మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

11:46 - October 11, 2018

హైదరాబాద్ : దేవుడు వున్నాడా? అనే ప్రశ్న వారి వారి నమ్మకాలను బట్టి వుంటుంది. దీని గురించి ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు వుండవ్. కానీ దుష్టశక్తులనే విషయంలో మాత్రం దేవుడంటే నమ్మకం లేనివారు కూడా ఒక్కోసారి వీటి విషయంలో డైలమాలో పడిపోతుంటారు. అసలు దేవుడే లేనప్పుడు దెయ్యాలెలా వుంటాయి? అసలు దెయ్యాల వున్నాయా లేవా అనేది పక్కన పెడితే దెయ్యం కంటే భయ్యం మాచెడ్డదబ్బా..అందుకే చీకటిలోకి వెళ్లాలంటే చాలామంది భయపడుతుంటారు. దెయ్యాలు భయపెడుతున్నాయనీ..ఆత్మలు వేధిస్తున్నాయని కొందరు నమ్ముతుంటారు. కానీ ఆత్మలు వేధిస్తున్నాయని ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో ఈ ఘటన కలకలం రేపింది. ఆత్మలు, కొన్ని దుష్ట శక్తులు తనను  వేంటాడుతున్నాయంటూ ఓ మహిళ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ డిప్రెషన్ లో భాగంగా భవనంపై నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ఫరిధిలో చోటుచేసుకుంది. 
బంజారాహిల్స్ రోడ్ నం.10 లోని జహీరానగర్‌కు చెందిన అతియా షకీర్ అనే 42 మహిళ భర్త మహ్మద్ షకీర్‌తో కలిసి కెనెడాలో నివాసం ఉంటున్నది. వారికి ఐదుగురు పిల్లలు. కాగా... కొన్ని నెలలు గా తనను దుష్టశక్తులు, ఆత్మలు వెంటాడుతున్నాయంటూ అతియా షకీర్ తీవ్రమైన ఆందోళనకు గురవటంతో తనను హైదరాబాద్‌కు పంపించాలంటూ భర్తకు చెప్పడంతో మూడు రోజుల క్రితం కెనెడా నుంచి పంపించాడు. 
టోలీచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటున్న సోదరుడు జమీల్ ఉర్ రహ్మాన్ ఇంటికి వచ్చింది. రెండు రోజులుగా జహీరానగర్‌లోని సొంతింట్లో ఉంటున్న నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవనంలోని ఐదో అంతస్తు పైకి ఎక్కిన అతియా కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న అతియా షకీర్ సోదరుడు జమీల్ ఉర్ రహ్మాన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  షకీర్ మానసిక పరిస్థితి తెలుసుకున్న డిప్రెషన్‌తో బాధపడుతుండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

11:33 - October 11, 2018

హైదరాబాద్ : స్పెషల్ ఆఫీసర్ల పాలనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు  నియమించడం రాజ్యంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మూడు నెలల వరకు పంచాయతీల్లో స్సెషల్ ఆఫీసర్ల పాలన ఉంటుందని తెలిపింది. అనంతరం ఎన్నికల నిర్వాహణకు ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆగస్టు 1వ తేదీ నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త బీసీ జనాభాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కోర్టును ఆశ్రయించారు. బీసీల జనగణన కోసం మరింత సమయం కావాలని కోర్టును ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యసాధ్యాలపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి కోర్టులో కౌంటర్ వేసే అవకాశం ఉంది. 

11:30 - October 11, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో హారిక అండ్ హాసిని క్రియేషపన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం.. అరవింద సమేత వీర రాఘవ.. దసరా కానుకగా, భారీ అంచనాల నడుమ ఈ రోజు గ్రాండ్‌‌గా రిలీజ్ అయింది.. అరవింద సమేత ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం...

కథ :
రాయలసీమలోని నల్లగుడి గ్రామపెద్ద బసిరెడ్డి, కొమ్మద్ది గ్రామపెద్ద నారపరెడ్డికి ఒక చిన్న సంఘటనలో మాటామాటా పెరిగి, ఇద్దరు మనుషుల కోపం కాస్తా, రెండు ఊర్ల మధ్య వైరంగా మారుతుంది..  నారపరెడ్డి తన కొడుకు వీర రాఘవ రెడ్డిని ఫ్యాక్షన్ గొడవలకి దూరంగా పెంచుతాడు.. హైదరాబాద్‌లో అరవింద అనే అమ్మాయి ప్రేమలో పడ్డ  వీర రాఘవ అనుక్షణం ఆమె వెన్నంటే ఉంటాడు.. ఒకరోజు అరవింద‌పై అటాక్ జరిగితే సేవ్ చేస్తాడు.. అనుకోని పరిస్థితిలో ఆమె ఇంటికివెళ్తాడు.. అక్కడ నుండి వీర రాఘవ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.. తర్వాత వీర రాఘవ రెడ్డి  అక్కడి  ఫ్యాక్షన్ గొడవలు ఎలా ఆపాడు అనేది అరవింద సమేత వీర రాఘవ కథ..
నటీనటులు :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట సామర్ధ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు... మైండ్ బ్లోయింగ్ అండ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.. ఫస్ట్‌హాఫ్ అరవింద వెనక తిరిగే లవర్ బాయ్ రాఘవగా, సెకండ్‌హాఫ్‌లో సీమలో  ప్రత్యర్థులతో వీర విహారం చేసే వీర రాఘవ రెడ్డిగా తారక్ నటన..అద్భుతహ అనేలా ఉంది.. సీమయాసలో  అతని డైలాగ్ డెలివరీ ఆడియన్స్‌ని మెప్పిస్తుంది.. పూజా‌హెగ్డే నటన అండ్ గ్లామర్ పరంగా మంచి మార్కులుకొట్టేసింది.. కాకపోతే డబ్బింగ్ కాస్త తేడాగా అనిపించింది.. ఈషారెబ్బా కూడా ఉన్నంతలో బాగానే చేసింది..  ఎన్టీఆర్ నాయనమ్మగా సుప్రియా పాతక్ నటన ఆకట్టుకుంటుంది.. ఇక బసిరెడ్డిగా జగపతి బాబు తన నటవిశ్వ రూపం చూపించాడు.. గెటప్, డైలాగ్ డెలివరీతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు...
నాగబాబు చాలా రోజుల తర్వాత ఈ మూవీలో మంచి క్యారెక్టర్ చేసాడు.. సినిమా సక్సెస్‌లో భాగమయ్యాడు..
సునీల్ దగ్గరినుండి ఆడియన్స్ మిస్ అయిన కామెడీతోపాటు, ఎమోషన్‌ని కూడా ఈ సినిమాలో చూస్తారు.. హీరో.. నవీన్ చంద్ర, జగపతి బాబు కొడుకుగా బాగా చేసాడు..
థమన్ సాంగ్స్, బ్యాగ్రౌండ్‌స్కోర్ ఇరగదీసాడు.. పి.ఎస్.వినోద్ ఫొటోగ్రఫీ కూడా బాగుంది.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన పెన్ పవర్ చూపించాడు.. ఒక చిన్న పాయింట్‌ని తనదైన స్టైల్‌లో చెప్పి ప్రేక్షకులని మెప్పించాడు.. సీమ స్లాంగ్‌లో ఆయన వ్రాసిన డైలాగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి..
రాయలసీమ ఫ్యాక్షనిజంలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చెయ్యని ఒక కొత్త పాయింట్‌ని ఎంచుకోవడంలోనూ, దాన్ని అందరికీ అర్ధం అయ్యేలా చెప్పడంలోనూ త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడు..

అరవింద సమేత వీర రాఘవ.... ఆలోచింపజేస్తుంది, ఆకట్టుకుంటుంది....

తారాగణం : ఎన్టీఆర్, పూజా‌హెగ్డే, ఈషారెబ్బా, సుప్రియా పాతక్, జగపతి బాబు, నాగబాబు, సునీల్, నవీన్ చంద్ర తదితరులు...

కెమెరా     :  పి.ఎస్.వినోద్

సంగీతం   :   ఎస్.ఎస్.థమన్

ఎడిటింగ్   :  నవీన్ నూలి

నిర్మాత    :   ఎస్.రాధాకృష్ణ (చినబాబు) 

 

రేటింగ్  : 3/5

 

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

11:28 - October 11, 2018

ఖమ్మం : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ పలు నిబంధలను తెలుపుతు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు అయినప్పటినుండి ఎన్నికల కోడ్ అమలులో వుందని తెలిపిన ఈసీ రాష్ట్రంలో పలు నిబంధనలను విధించింది. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడుగురిపై అనర్హత వేటు వేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వీరిలో గత ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసిన అక్కిరాల వెంకటేశ్వర్లు, పాలేరు నుంచి పోటీ చేసిన మోతె మల్లయ్య, వైరా నుంచి బరిలోకి దిగిన బచ్చల లక్ష్మయ్య ఉన్నారు. వీరితో పాటు ఇల్లెందుకు చెందిన గుగులోతు విజయ, మినపాకకు చెందిన కొమరారం సత్యనారాయణ, కొత్తగూడెంకు చెందిన పునుగోటి సంపత్ లు కూడా ఉన్నారు. వీరంతా 2020 వరకూ ఎన్నికల్లో పోటీ పడేందుకు అనర్హులని, ఎన్నికల నిబంధనల్లోని సెక్షన్ 10ఏ, 1951 ప్రకారం వీరు అనర్హులని తెలిపింది. కాగా దీనికి సంబంధి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
 

11:14 - October 11, 2018

శ్రీకాకుళం : తిత్లీ బీభత్సం సృష్టిస్తోంది. సుడులు తిరుగుతూ ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది. దీనితో సిక్కోలు చిగురుటాకులా వణికిపోతోంది. ప్రచండగాలులు వీస్తుండడంతో భారీ చెట్లు సైతం నెలకొరుగుతున్నాయి. తీరం వైపు అలలు చొచ్చుకొస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లెసారథి వద్ద తుఫాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉద్దానం ప్రాంతంపై పెను ప్రభావం కనిపిస్తోంది. పెనుగాలుల ధాటికి ఇళ్లు..గుడిసెలు నేలకూలాయి. అరటి పంట..ఇతర పంటలకు అపారమైన నష్టం సంభవించిందని తెలుస్తోంది. 

మరివైపు తిత్లీ కారణంగా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాలతో రైలు పట్టాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున రైళ్లను రద్దు చేసింది. విశాఖ నుంచి హౌరా వైపు వెళ్లే దాదాపు 20 రైళ్లను పాక్షికంగా రద్దు...మరికొన్నింటిని దారి మళ్లించింది. ఈస్టు కోస్టును ముందస్తు జాగ్రత్తగా రద్దు చేశారు. 12830 భువనేశ్వర్‌-చెన్నై వీక్లీ, 12773 షాలీమర్‌-సికింద్రాబాద్‌, 11020 భువనేశ్వర్‌-ముంబయి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, 11019 ముంబయి- భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, 18463 భువనేశ్వర్‌-బెంగుళూర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, 17015 భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్, 17016 సికింద్రాబాద్‌-భువశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌, 17479 పూరీ-తిరుపతి, 17480 తిరుపతి-పూరీ రైళ్లను అధికారులు రద్దు చేశారు. 

11:10 - October 11, 2018

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ అదికారులు మీడియా దిగ్గజం రాఘవ బెహల్ ఇంటిపై గురువారం దాడులు చేశారు. 
పన్నుఎగవేత ఆరోపణల నేపథ్యంలో నోయిడాలోని రాఘవ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఆస్తులకు సంబంధింన పత్రాలు, వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 
రాఘవ్ బెహల్ క్వింట్ అనే వార్తా పోర్టల్‌ను న్యూస్ 18 నెట్‌వర్క్‌కు అధిపతిగా ఉన్నారు. ఇతర వ్యాపార సంస్థలపైనా ఐటీ శాఖ అధికారులు ఢిల్లీలో పలుచోట్ల దాడులు చేపట్టారు. 

 

10:55 - October 11, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తేదీ ఖరారైంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోవైపు విపక్షాల పరిస్థితి మాత్రం అయోమయంగానే ఉంది. మహాకూటమి పేరుతో ఒక్కటైన విపక్షాలు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీల మధ్య సమన్వయం కుదరలేదు. సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాలేదు. 

ఈ క్రమంలో మహాకూటమి నేతలు నేడు మరోసారి భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటు, ఎన్నికల ఉమ్మడి ప్రణాళికలపై తుది కసరత్తు చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో పార్టీల మధ్య సీట్ల సర్దుబాబు త్వరితగతిన పూర్తి చేయాలని కూటమిలోని పార్టీలు బావిస్తున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల ప్రచారంపైనే చర్చించనున్నారు. టీడీపీ, సీపీఐ, జనసమితి కోరుతున్న సీట్ల సంఖ్యపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చినప్పటికీ ఈ రోజు దానిపై ఎలాంటి వివరాలు ప్రకటించరని సమాచారం. అలాగే మహాకూటమి పేరు మార్పుపైనా చర్చలు జరగొచ్చని తెలుస్తోంది. మహాకూటమి పేరుని తెలంగాణ పరరక్షణ వేదికగా మార్చాలని, దీనికి ఛైర్మన్‌గా కోదండరామ్ ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 

మరోవైపు 48 గంటల్లో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రాకపోతే అన్ని చోట్లా పోటీ చేస్తామని జనసమితి వ్యాఖ్యానిస్తోంది. అటు సీపీఐ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు చేసుకోకపోతే ఎన్నికల ప్రచారం చేయడానికి తగినంత సమయం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

10:45 - October 11, 2018
హైదరాబాద్ : వింధ్యపర్యతాలు పశ్చిమ మధ్య భారత ఉపఖండంలో గల పర్వతశ్రేణులు . ఈ పర్వత శ్రేణులు ఉత్తరభారతాన్ని, దక్షిణ భారతాన్ని విడదీస్తున్నాయి. వింధ్య పర్వతాలకు ఈవలి వైను వున్న దక్షిణాదిలో కూడా బీజేపీ ఎలాగైనా గెలుపు సాధించాలనే పట్టుదలతో వుంది. వింధ్యకు అవతలివైపున బీజేపీ విజయకేతనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వింధ్య పర్యతాలకు ఇవతల అంటే దక్షిణాదిన విజయం సాధించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. 
అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, బీహార్, గోవా, త్రిపుర, నాగాలాండ్‌ల్లో అధికారంలోకి వచ్చింది. మేఘాలయలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే అక్కడ అధికారం చేపట్టింది. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ కొన్ని అననుకూల పరిస్థితుల రీత్యా బీజేపీతో పొత్తు అనివార్యంగా మారిన క్రమంలో 2014 ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వం నాలుగేళ్ళపాటు కొనసాగించింది. అనంతరం విభజన హామీలు నెరవేర్చటంతో ఎన్డీయే ప్రభుత్వం వివక్ష చూపుతోందనే కారణం టీడీపీ బీజేపీ నుండి విడిపోయింది. దీంతో మిత్రులుగా వుండే రెండు పార్టీల అంత్య శతృవులుగా మారిపోయాయి. అలాగే కర్ణాటకలో కూడా బీజేపీ తిమ్మిని బమ్మి చేసైనా అధికారం చేపట్టాలని శతవిధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో గవర్నర్ తో మంతనాలు జరిపి తమ సీఎం సభ్యుడైన యాడ్యురప్పను సీఎంను చేసేసింది. అనంతరం 10రోజుల్లో బలం నిరూపించుకుని శాశ్వస ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే వీలును పొందింది. కానీ కనీసం వారం రోజులు కూడా గడవకుండానే కుమారస్వామి తన బలాన్ని కూడగట్టుకుని కాంగ్రెస్ తో కలిసి పలు కీలక పరిణామాల మద్య బీజేపీ ఏతర ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు.   దీంతో మింగలేక కక్కలేక బీజేపీ గమ్మున ఊరుకుంది. కానీ దక్షిణాదిపై పట్టు ప్రయత్నాలను మాత్రం మానలేదు. 
Image result for modiఈ నేపథ్యంలో అటు ఏపీపైనా..ఇటు తెలంగాణపైనా పట్టుకోసం బీజేపీ నానా పాట్లు పడుతోంది. విభజన హామీలకంటే ఎక్కువగానే ఏపీకి నిధులు మంజూరు చేసామని ఏపీపైనా..తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీనే కారణమంటు తెలంగాణపైనా పట్టు సాధించాలని యోచిస్తోంది. దీంతో 2019 ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో విజయం సాధించాలని సాక్షాత్తు జాతీయ అధ్యక్షుడి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. 2019లో ఎన్నికలకు వెళితే మోడీ ధాటికి  ఓడిపోతామనే  భయంతోనే  ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తెలంగాణ ప్రజలపై  అదనపు భారం మోపారని  అమిత్ షా విమర్శించారు. ఎస్సీ కుటుంబాలకు ఇస్తానన్న  3 ఎకరాలు  భూమి ఇవ్వలేదని..గత ఎన్నికల్లో  చేసిన 150వాగ్దానాల ఏమీ  పూర్తి చేయకుండానే  కేసీఆర్ మందుస్తుకు వెళ్లారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించి  ఒక్క ఛాన్స్ఇస్తే  దేశంలో జరుగుతున్న అభివృధ్ది తెలంగాణాలోనూ  జరిగేట్టు చేస్తామని అమిత్ షా  హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన రూ.లక్షా 15వేల సంగతి కేసీఆర్ మరిచారా? అని నిలదీశారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తే బీసీలు నష్టపోతారని అమిత్ షా ముస్లింల పట్ల తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.  కాగా అమిత్ షా రాకతో బీజేపీ శ్రేణుల్లో జోష్ వచ్చిందని బీజేపీ భావిస్తోంది. 
కాగా ఇటీవల నగర బహిష్కరణకు గురై మొన్ననే తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన స్వామి పరిపూర్ణానందకు కాషాయ కండువా కప్పడం ద్వారా తెలంగాణలో మజ్లిస్ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చని బీజేపీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లా హిందుత్వ కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే సమ్మోహనశక్తి పరిపూర్ణానందకు ఉందని ఆరెస్సెస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. పరిపూర్ణానంద స్వామిని పార్టీలోకి ఆహ్వానించడంపై ఇటీవల మోహన్ భగవత్ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనూ చర్చించినట్టు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద ప్రభావం తెలంగాణలో బీజేపీ వికాసానికి పనికొస్తుందని భావిస్తోంది. 
Image result for bjp symbol
కాగా 2014 ఎన్నికల్లో కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వున్నారు. కానీ ఆయన అన్ని వర్గాల వ్యక్తులను కలుపుకుపోలేదనీ..అందుకే బీజేపీ అనుకున్నంతగా తెలంగాణలోను..ఇటు హైదరబాద్ లోను పెద్దగా తన ఉనికిని చాటుకోలేకపోయిందనే విమర్శలు కూడా వున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ 45 స్థానాల్లో పోటీ చేసి 7.03 శాతం ఓట్లు సాధించుకుని 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యలో బీజేపీ బండారు లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించింది. కాగా తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు మరి లక్ష్మణ్ ఆధ్వర్యంలోను..కేంద్రంలో బలపడి అధికారంలోవున్న బీజేపీ ప్రభావం తెలంగాణలోవీస్తుందా? లేదా అనేది చూడాలి. అమిత్ షా హామీలను తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా? లక్ష్మణ్ నాయకత్వంలో బీజేపీ బలం పుంజుకుంటుందా. పాతబస్తీలో తమ హవాను కొనసాగిస్తున్న మజ్లిస్ పార్టీ సీట్లపై బీజేపీ ప్రభావం చూపిస్తుందా? మజ్లిస్ పార్టీకి సరైన సమాధానం ఒక బీజేపీ మాత్రమే అని అమిత్ షా ప్రకటన పాతబస్తీపై ప్రభావం చూపేనా? దసరా తరువాత ప్రకటించే బీజేపీ మేనిఫెస్టోకి అటు పాతబస్తీ ప్రజలు..ఇటు తెలంగాణ యావత్తు ప్రజల ఓటుబ్యాంకుని బీజేపీ సాధిస్తుందా? అనే అనేక ప్రశ్నలకు 2019 ఎన్నికలు..అనంతరం వచ్చే ఫలితాలు వేదికకానున్నాయి..
- ఎం.నాగమణి 
10:44 - October 11, 2018

హైదరాబాద్ : దసరా..దీపావళి పండుగలు పలు కంపెనీలకు కీలకం. ఎందుకంటే ఈ పండుగలలో భారీగా లాభాలను ఆర్జించాలని పలు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. భారీగా ఆఫర్లు..డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో సెల్ కంపెనీలు ముందుంటాయి. సెల్ కంపెనీలలో ఒకటైన హ్యాప్పీ కూడా పండుగల సందర్భంగా బహుమతులను ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన సెల్ ఫోన్ తీసుకుంటే పలు బహుమతులను అందచేయనున్నట్లు కంపెనీ ప్రకటిస్తోంది. 

సుమారు రూ. 5 కోట్ల విలువైన బహుమతులను అందచేసేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. హ్యాప్పీ ఫెస్టివ్ పటాకా పేరిట ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని అందచేస్తామని పేర్కొంటోంది. మరి ఏ ఫోన్ కొనుక్కొంటే ఏ బహుమతి అందించనున్నారో చదవండి...

 • మోబిస్టార్ ఎక్స్1 డ్యూయల్ మొబైల్‌పై రూ.4,500 విలువైన కెంట్ వాక్యూమ్ క్లీనర్ అందించనున్నారు. 
 • రూ.14,999 విలువ కలిగిన స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,590 ధర కలిగిన మైక్రోమాక్స్ ఎల్‌ఈడీ టీవీ అందించనుంది. 
 • హానర్ 9లైట్ మొబైల్‌పై రూ.2,999 విలువ కలిగిన స్పోర్ట్స్ వైర్లెస్ హెడ్‌సెట్స్ ఇవ్వనుంది. 
 • డీటెల్ 1400డీ మొబైల్‌పై రూ.1,095ల ఫ్రెషర్ కుక్కర్‌ను ఉచితంగా అందించనున్నారు. 
 • లావా జెడ్91పై రూ.2,499 ధర కలిగిన 4.1 హోమ్ థియేటర్, కార్బన్ ఏ40 ఇండియన్ మొబైల్‌పై రూ.2,100 విలువ కలిగిన బుల్లెట్ జ్యూసర్ బహుమతిగా అందించనున్నారు. 
10:25 - October 11, 2018

హైదరాబాద్ : బెల్లం ముక్క రోజు తింటే ఏమవుతుంది ? తీపి ఎక్కువగా ఉంటుందని..ఇది తింటే షుగర్ వచ్చే అవకాశం ఉందని..బరువు పెరుగుతారని..ఇలా ఏవో ఏవో ఊహించుకుంటుంటారు. కానీ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో బెల్లం సహాయ పడుతుందని వైద్యులే చెబుతుంటారు. చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ని పెద్దలు చెబుతుంటారు. 

 • నెయ్యి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్న చోట వేస్తె భాధ నివారణ అవుతుంది .
 • ముక్కు కారడముతో బాధపడుతున్న వారికి ... పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .
 • బెల్లం, నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది.
 • బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. 
 • భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. 
 • లివర్‌ను శుభ్ర పరిచేందుకు బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. 
 • బెల్లంను తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
 • బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. 
 • ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
 • ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని 'మెడిసినల్‌ షుగర్‌'గా వ్యవహరిస్తారు.
10:24 - October 11, 2018

ముంబై: ‘మీటూ’ ఉద్యమం దుమారం రేపుతోంది. దేశాన్ని కుదిపేస్తోంది. పలు రంగాల్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇన్నాళ్లు తమలోనే దాచుకున్న బాధలను నిర్భయంగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సొసైటీలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి బాగోతాలను వెలుగులోకి తెస్తున్నారు. 

మీటూ ఉద్యమం సినీ, క్రీడా రంగాలనే కాదు రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి శ్రీలంక మాజీ క్రికెటర్‌, ప్రస్తుత శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ కూడా చేరిపోయారు. రణతుంగ తనను లైంగికంగా వేధించాడంటూ ముంబైకి చెందిన ఓ ఎయిర్‌ హోస్టెస్‌ ఆరోపించారు. ముంబైలోని ఓ హోటల్‌లో తనకు ఎదురైన ఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే...

‘కొన్నేళ్ల క్రితం క్రికెట్‌ మ్యాచ్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్లు ముంబైలోని జుహు సెంటార్‌ హోటల్‌లో దిగాయి. అక్కడకు వెళ్లి వాళ్ల వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకుందామని నా సహచర ఉద్యోగిని కోరింది. సరేనని అక్కడికి వెళ్లాం. శ్రీలంక క్రికెటర్ల వద్దకు వెళ్లగానే నాకు భయం వేసింది. వాళ్లు దాదాపు ఏడుమంది ఉన్నారు. మేం ఇద్దరమే. నాకు అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే వెళ్లిపోదామని నా స్నేహితురాలిని కోరాను. అంతలోనే వారు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. నేను తాగలేదు. అంతలోనే మరికొందరు మమ్మల్ని హోటల్ వెనకవైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ శ్రీలంక క్రికెటర్‌ అర్జున రణతుంగ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా నడుము మీద చేయివేయబోయాడు. నేను అతడిని తప్పించుకుందామని ప్రయత్నించాను. ఆయన నన్ను కొట్టాడు. నేను పోలీసులతో చెప్పి పాస్‌పోర్ట్‌ రద్దు చేయిస్తానని బెదిరించాను. ఆయన వద్ద నుంచి తప్పించుకుని వచ్చి రిసెప్షన్‌లో ఫిర్యాదు చేస్తే ‘ఇది మీ వ్యక్తిగత విషయం. మేం ఎలాంటి సహాయం చేయలేం’ అని చెప్పేశారు’ అంటూ ఆమె పోస్ట్‌ పెట్టింది.

10:10 - October 11, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే జార్జియాలో షూటింగ్ జరుపుకుంది. మెగాస్టార్‌కు 151వ సినిమా. 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో సైరా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత కథతో చిత్రం రూపొందుతోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై చిరంజీవి తనయుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాను నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నేషనల్ లెవల్లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, సుదీప్ , జ‌గ‌ప‌తి బాబు, న‌య‌న‌తార త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. బాలీవుడ్ నుండి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గురువారం ఆయన జన్మదిన సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. గ‌తంలోనే సెట్‌లో చిరు, న‌య‌న‌తార‌తో క‌లిసి ఉన్న ఫోటోని అమితాబ్ షేర్ చేయ‌గా రాజ‌గురువు గోస‌యి వెంక‌న్న‌ పాత్ర‌లో అమితాబ్ క‌నిపించనున్నట్టు సమాచారం. 

10:05 - October 11, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీ భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..  అరవింద సమేత చిత్రాన్ని అదనంగా మరో రెండు ఆటలు‌ ప్రదర్శించుకోవడానికి ఏపీ‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపధ్యంలో, చాలాచోట్ల ఉదయం 5 గంటలనుండే  బెనిఫిట్ షోలు వేసారు..
తెలంగాణాలోనూ ఎక్కువ ధియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా చాలాచోట్ల టికెట్స్ అయిపోవడం విశేషం...
ఫస్ట్‌హాఫ్ చూసినవారు సినిమా సూపర్ అని, సెకండ్‌‌హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు.. తారక్ నటన, త్రివిక్రమ్‌ మార్క్ డైలాగ్స్ అద్భుతం అని అంటున్నారు.. మరికొద్దిసేపట్లో పూర్తి రివ్యూ రానుంది..

09:50 - October 11, 2018

సూర్యాపేట : హుజూర్ నగర్ టికెట్ టీఆర్ఎస్ పార్టీలో ఎవరికి దక్కుతుంది ? తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ...ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ శంకరమ్మ కంటతడి పెట్టడం కలకలం రేగింది. ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే మాత్రం ఏకంగా ఆత్మాహుతి చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తనకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని..సైదిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారంటూ తన పలు ఆరోపణలు గుప్పించారు. తనకు కేసీఆర్, కేటీఆర్ మద్దతు ఉందని...పార్టీ కోసం తాను చాలానే పనిచేశానని చెప్పుకొస్తున్నారు. 

శాసనసభ రద్దు చేసిన అనంతరం గులాబీ బాస్ 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ కీలకంగా ఉన్న హుజూర్‌నగర్‌కు మాత్రం అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచారు. దీనితో పలువురు తమకు టికెట్ కేటాయించాలంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు.  2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన శంకరమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించలేకపోయారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో వర్గాలుగా విడిపోయారు. స్థానికంగా ఉన్న సైదిరెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయనకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలున్నాయని ప్రచారం జరుగుతోంది. టి.టీపీసీసీ అధ్యక్ష్డుడు ఉత్తమ్‌తో శంకరమ్మ పోటీ పడుతారా ? గెలుపొందుతారా ? అనే దానిపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ శంకరమ్మ డిమాండ్‌కు అధిష్టానం తలొగ్గుతుందా ? గులాబీ దళపతి ఈ సమస్యకు ఎలా చెక్ పెడుతారో వేచి చూడాలి. 

09:18 - October 11, 2018

శ్రీకాకుళం: నేలరాలిన భారీ వృక్షాలు, ఎగిరిపోయిన ఇళ్లపై కప్పులు, ప్రచండ వేగంతో వీస్తున్న గాలులు.. తిత్లీ తుపాను బీభత్సం సష్టిస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడుతోంది. ఈరోజు ఉదయం వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను తీరం దాటిన సమయంలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. దీంతో తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరిచెట్లు పెనుగాలులకు ఊగిపోతున్నాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పెనుగాలుల ధాటికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉద్దానంతో పాటు పలాస, టెక్కలి, ప్రాంతాల్లో తుపాను బీభత్స దృశ్యాలు వణుకుపుట్టిస్తున్నాయి. భారీ శబ్ధాలతో పెనుగాలులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు.

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులకు వరద తాకిడి పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు.. భావనపాడు, ఉమిలాడ, సున్నాపల్లి తదితర తీర గ్రామాల్లో ఈదురు గాలులతో జోరుగా వర్షం కురుస్తోంది. సంతబొమ్మాళి మండలం మరువాడలో సముద్ర తీరంలో అలల ఉద్ధృతికి పది అడుగుల మేర కోతకు గురైంది. తుపాను బీభత్సానికి శ్రీకాకుళం.. ఇచ్ఛాపురం, కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, లావేరు, రణస్థలం, పాతపట్నం, నరసన్నపేట, పోలాకి, గార, ఎచ్చెర్ల ప్రాంతాల్లోని తీర వాసులు గజగజలాడిపోతున్నారు.

మొత్తంగా తీరం దాటే వేళ పెనుగాలులు, భారీ వర్షంతో తిత్లీ విరుచుకుపడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్థంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాగుల్లోకి భారీగా వరదనీరు రావడంతో, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేసిన అధికారులు, పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. సాయంత్రం వరకూ తిత్లీ విధ్వంసం కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఆ తరువాత మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే చత్తీస్ గడ్, తూర్పు తెలంగాణ వైపు తిత్లీ కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

తిత్లీ ప్రభావం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలపైనా కనిపించింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో అలలు రోడ్డుపైకి ఎగసిపడుతుండగా, రహదారి ధ్వంసమైంది. రోడ్డు తెగిపోయి, సమీపంలోని ఇళ్లలోకి సముద్రపు నీరు చేరింది. దీంతో కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.

09:08 - October 11, 2018

హైదరాబాద్ : ఇక కేంద్రంలో నడిచేవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్న తరుణంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించింది. లోక్‌సభలో బీజేపీ బలం 275 సీట్లు. దేశంలో 29 రాష్ట్రాలకు గాను బీజేపీ, దాని మిత్ర పక్షాలు కలసి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇది బీజేపీకి స్వర్ణ యుగమా? అనే ప్రశ్నను తలపించింది.  2014లో కేంద్రంలో కమలం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత సొంతంగా లేదా మిత్ర పక్షాలతో కలసి.. ఉత్తరాదిలో ఆయా రాష్ట్రాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాుట చేసిన బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే అక్కడ అధికారం చేపట్టింది. కాగా జమ్మూ కశ్మీర్ లో ముఫ్తీ పార్టీతో చెడిన సంబంధాల కారణంగా అక్కడ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుండి తప్పుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందనే కారణంతో ఏపీలో కూడా అధికారపార్టీ టీడీపీతో సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో కొన్ని రాష్ట్రాలలో సంకీర్ణంగా కొనసాగుతున్న బీజేపీ ఆయా పార్టీ లనుండి అభిప్రాయబేధాలతో విడిపోయవటంతో బీజేపీ ఉనికి కష్టంగానే వుంది. కర్ణాటకలోనూ బీజేపీ నాయకుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం లభించింది. అలా బీజేపీ నుండి తప్పుకోవటంతో కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రశ్నార్థకంగా మారింది. 
చత్తీశ్‌గఢ్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2013 నుంచే అధికారంలో కొనసాగుతోంది. అంటే.. ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాంలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోను ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా  కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 6న ప్రకటించింది. 

రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌లు మాత్రం.. భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకంటే..ఐదేళ్ల నుంచి అప్రహతీతంగా సాగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రభంజనం మొదలైనది ఈ రాష్ట్రాల నుంచినే. ఐదేళ్ల కిందట ఈ మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణలో కూడా కాషాయ దళం పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో అపర చాణుక్యుడుగా రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. అటు ఏపీ సీఎంపైనా..ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా..తెలంగాణలో ఏర్పడిన మహాకూటమిపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. స్వతహాగా హిందూభావజాలం అధికంగా వున్న బీజేపీ ముస్లింలపై వివక్ష చూపుతోందనే విమర్శలు కూడా వున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా కరీంనగర్ సభలో మాట్లాడుతు..తెలంగాణలో  ముస్లిం పార్టీ అయిన ఎంఐఎంను ఎదుర్కోవటం కేసీఆర్ వల్ల చంద్రబాబు వల్ల కాదని ఒక్క బీజేపీకి మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పటం బీజేపీ ముస్లింల పట్ల వున్న తీరును తెలుపుతోంది. 

కాగా ఇటు తెలంగాణలో కేసీఆర్ హవాకు బ్రేకులు పడ్డాయి. ప్రజల నుండి కొంచెం వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది. దీనొక అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు టీఆర్ఎస్  ఓటుబ్యాంకును తమవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నాయి. మరోపక్క కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు నిధులు మంజూరు విషయంలో ఉదారత చూపుతోందని..అందుకే తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర కీలకమని ప్రజలకు తెలిపి ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణలో ఒక్క అవకాశం ఇవ్వమని బీజేపీ ఓటర్లను కోరుకుంటోంది. 

కాగా డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించినా..అధికార పార్టీతో సహా ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించలేదు. దసరా తరువాతనే ప్రకటిస్తామని దాదాపుఅన్ని పార్టీలు చెబుతున్నాయి. కట్టుదిట్టంగా ఎవరికి వారు తమ మేనిఫెస్టోని సిద్ధం చేసుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఎవరు ముందుగా ప్రకటిస్తే వారి స్ర్కిప్ట్ ను మరోపార్టీ కాపీ కొట్టేస్తాయనే భయం కూడా కావచ్చు. 

కాగా జిల్లాలలో కంటే నగరంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన బీజేపీ ఇప్పటికే బీజేపీ మేనిఫెస్టోలో నగర వాసులకు పెద్ద పెద్ద తాయిలాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.  కిరాయి ఇంటివారికి రూ.5వేలు, వాటర్ ట్యాక్స్ 1రూపాయి, నిరుద్యోగులకు భారీగా భృతివంటివి తమ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. మరి తెలంగాణ ప్రజలు మేనిఫెస్టో వాగ్ధానాలకు పడిపోతారో లేదో వేచి చూడాలి..కాగా సీట్లు పెద్దగా రాని దక్షిణాది రాష్ట్రాలలో ఎలాగైనా సరే పట్టు సాధించుకోవాలనే బీజేపీ పట్టుదల 2019 ఎన్నికల్లో ఏమాత్రం రాణిస్తుందో వేచి చూడాలి..

-ఎం.నాగమణి

08:48 - October 11, 2018

ఢిల్లీ: నోరు జారడం ఆ తర్వాత నాలిక కరుచుకోవడం.. మన రాజకీయ నాయకులకు కామనే కదా. ఆవేశంలో ముందూ వెనకా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఆ తర్వాత వివాదాస్పదం కావడంతో మళ్లీ మాట మారుస్తారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విషయంలోనూ ఇదే జరిగింది. సొంత పార్టీ నేతల నుంచి వచ్చిన విమర్శల ఫలితమో.. తన తప్పు తెలుసుకున్నారో... కానీ.. ఇప్పుడు ఆయన మాట మార్చారు. అసలు నేను అలా అనలేదు అని చెబుతున్నారు.

వివరాల్లో వెళితే.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నో అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చామని, ప్రజలు ఇప్పుడు వాటిని గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేక పారిపోతున్నామని వ్యాఖ్యానించి ఎన్డీయే సర్కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇరుకునపడేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ బీజేపీని ఇబ్బందులకు గురి చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, కాంగ్రెస్ విరుచుకుపడేలా ఆయన అస్త్రాన్ని అందించారని బీజేపీ నేతలు వాపోయారు. దీంతో నితిన్ గడ్కరీ మాటమార్చారు. 

తాను మరాఠీలో ఇచ్చిన ఇంటర్వ్యూను అర్థం చేసుకుని విమర్శలు చేయడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరాఠీ భాషను ఎప్పుడు నేర్చుకున్నారని నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. ఆ ఇంటర్వ్యూలో తాను మోదీ పేరెత్తలేదని, ప్రజల ఖాతాల్లో ఎన్నడూ రూ. 15 లక్షలు వేస్తామని చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. నేను చెప్పింది ఒకటైతే, మీడియాలో ప్రసారమైంది మరొకటని నితిన్ పేర్కొన్నారు.

తన మరాఠీ ఇంటర్వ్యూపై మరింత వివరణ ఇచ్చిన గడ్కరీ, ఏడెనిమిది రోజుల క్రితం తాను ఇంటర్వ్యూ కోసం వెళ్లానని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవిస్, గోపీనాథ్ ముండే ఇచ్చిన ఎన్నికల హామీల గురించిన ప్రస్తావన వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో అమలుకు సాధ్యం కాని ఎన్నికల హామీలు ఇవ్వొద్దని తాను అభ్యంతరం చెప్పానని, అటువంటి హామీల జోలికి వెళ్లవద్దని తాను వారిద్దరికీ సూచించిన విషయాన్ని గుర్తు చేశానని గడ్కరీ అన్నారు. నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారని నితిన్ గడ్కరీ ఆరోపించారు.

07:30 - October 11, 2018

తమిళనాడు : దేవుడు పేరుతో అరాచకపు పనులకు పాల్పడుతున్న ఓ ఫాదర్ గుట్టు బైటపడింది. ఫాదర్ నంటు ఊరూరా సైకిల్ పై తిరుగుతు ఎందరో మహిళల జీవితాలను ఛిద్రం చేశాడు. మోసాలు చేసి బ్రతకమని ఓ మతం చెప్పదు. కానీ మత ప్రచారం ముసుగులో ఓ పాస్టర్ చేసిన దారుణాలు  సంచలనం సృష్టిస్తున్నాయి. ఏకంగా 30 పెళ్లిళ్లు చేసుకున్న ఆ ప్రబుద్ధుడు ఎంతోమంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఓ మహిళను హత్య  కూడా చేశాడు. పాపం పండిన ఓ తరుణాన ఓ మేకల దొంగతనం కేసులో పోలీసులు సదరు పాస్టర్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పాపాల చిట్టా బయటపడింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ఉక్కిరన్‌ కోటలో జరిగిందీ ఘటన. 
మిలన్ సింగ్ అనే పాస్టర్ సైకిలుపై ఊరూరా తిరుగుతూ మత ప్రచారం నిర్వహిస్తున్నాడు. అత్త కుమార్తె డైసీని పెళ్లాడిన మిలన్ మనస్పర్థల కారణంగా  కొన్నాళ్లకు విడిపోయారు. ఆ తర్వాత సలోమీ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగక ఆమె చెల్లెలు జెన్నిఫర్ రాణిని మూడో పెళ్లి చేసుకున్నాడు. అటు తర్వాత తన వద్దకు బైబిలు పాఠాలు నేర్చుకునేందుకు వచ్చిన జీవిత అనే అమ్మాయిని మోసగించి పెళ్లాడాడు. ఆమెతో కలిసి గ్రామాల్లో మత ప్రచారం నిర్వహిస్తూ పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. వారిలోనే కొందరిని పెళ్లాడాడు. ఇలా ఇప్పటి వరకు 30 మందిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇటీవల జరిగిన ఓ మేకల దొంగతనం కేసులో మిలన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.  కాగా ఈ నిత్యపెళ్లి కొడుకు ఓ అమ్మాయిని హత్య చేసినట్లుగా విచారణలో తెలిసింది. విచారణలో భాగంగా  అతడు చెబుతున్న విషయాలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం కటకటాలు లెక్కించుకుంటున్నాడు. దేవుడు పేరుతో, మతం పేరుతో చేసే కొంతమంది మోసగాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన అవసరముంది. 

06:54 - October 11, 2018

శ్రీకాకుళం : తుపాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. తిత్లీ అతి తీవ్ర తుపానుగా మారి తీరాన్ని తాకింది. ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో తిల్లీ తుఫానుతో అధికారులు అప్పమత్తంగా వుండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ అంశంపై అధికారులతో చంద్రబాబు ఉదయం నాలుగు గంటల నుండి టెలీకాన్ఫనెన్స్ నిర్వహిస్తున్నారు. అధికారులంతా అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పుపై ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అనుకున్నట్టుగానే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు-పల్లిసారథి వద్ద గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తుపాను తీరాన్ని తాకింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుపాను ప్రయాణిస్తుండగా, గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెను గాలులు ప్రజలను భయపెడుతున్నాయి.

గాలుల తాకిడికి జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరా కుప్పకూలింది. తూర్పు కోస్తా రైల్వే రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. సోంపేటలో గత రాత్రి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి జిల్లా వ్యాప్తంగా హైఅలెర్జ్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 
తుపాను కారణంగా ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. 53 కిలోమీటర్ల మేర తుపాను కేంద్రం విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సెమ్మెస్‌ల ద్వారా వరద హెచ్చరిక సందేశాలు పంపిస్తోంది. సహాయం కోసం 1100 నంబరుకు కాల్ చేయాలని అధికారులు కోరారు. విజయనగరంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. 08922 236947, టోల్ ఫ్రీ నంబరు 1077కు ఫోన్ చేసి సాయం కోరవచ్చు. విశాఖ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటరు నంబరు 1800 4250 0002.

Don't Miss