Activities calendar

12 October 2018

22:13 - October 12, 2018

హైదరాబాద్ : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. ఈమేరకు జలమండలిలో రాష్ట్ర ఎన్నికల అధికారులతో ఆయన భేటీ అయ్యారు. జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీలతో ప్రత్యేక సమావేశం అయ్యారు. వీవీప్యాటలు, సీవిజల్, సువిధ యాప్‌పై శిక్షణ ఇచ్చారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణానికి భంగకలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ తుపాకులను డిపాజిట్ చేయాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని చెప్పారు. రౌడీషీటర్లను బైండోవర్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాలో బైండింగ్ ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. నెల 17 వరకు పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. 

 

21:40 - October 12, 2018

విజయవాడ : వెంకటేశ్వరస్వామి సన్నిధిలో మనస్ఫూర్తిగా నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలకు అండగా ఉండటానికి బలమైన కుటుంబం కావాలన్నారు. పార్టీని ముందుకు నడిపించడానికి బలమైన వ్యక్తిత్వమున్న వ్యక్తులు కావాలని..ఆలాంటి వ్యక్తి నాదేండ్ల మనోహర్ అని పవన్ తెలిపారు. పార్టీలో నాదెండ్ల తనకు పెద్దన్నలాంటి వారని కొనియాడారు. 

 

21:27 - October 12, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాన్ ప్రబావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు పరిసర ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని.. పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. 

పలాసను మంచి టౌన్‌గా డెవలప్‌మెంట్ చేస్తామని చెప్పారు. పలాసను టౌన్‌గా మాడలైజ్ చేస్తామని, అధునికమైన టౌన్‌గా తయారు చేస్తామన్నారు. మంచిగా పని చేసిన వారికి అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. 

20:52 - October 12, 2018

హైదరాబాద్ : ఓ వ్యక్తి ఏసీ సీఎం చంద్రబాబు డూప్ లాగానే అన్నాడు. అచ్చం చంద్రబాబు పోలికలతో ఉన్నాడు. చంద్రబాబు లాంటి ముఖం, హెయిర్, గడ్డంతో ఉన్నాడు. బాబు పోలికలతో ఉన్న వ్యక్తి వీడియో ఒకటి యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఓ హోటల్‌లో సర్వ్ చేస్తున్నట్లు ఉన్న వీడియోలో కనిపిస్తున్నాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో ఇప్పుడు వైరల్ అయింది. ఆ వ్యక్తి అచ్చం చంద్రబాబు లాగా ఉండడంతో అతన్ని చూసేందుకు జనం హోటల్‌కు భారీగా వస్తున్నారు. అయితే ఈ వింత ఎక్కడ అనేది మాత్రం తెలియరాలేదు. 

 

20:29 - October 12, 2018

హైదరాబాద్ : వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ మరోసారి బాంబు పేల్చాచారు. దసరాకు ’లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రారంభిస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. తిరుపతిలో ప్రారంభిస్తానని చెప్పారు. జనవరి చివరివారంలో సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 19న సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. ’లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వర్మ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.  

 

19:44 - October 12, 2018

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలకు ముప్పు తప్పింది. ప్రచార వేదికపై విజయశాంతి అభివాదం చేస్తుండగా స్టేజ్ కూలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ ప్రచార సభ ఏర్పాటు చేశారు. అయితే సభకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులకు ప్రచార వేదిక నుంచి విజయశాంతి అభివాదం చేస్తుండగా స్టేజ్ కుప్పకూలింది. ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

 

18:36 - October 12, 2018

విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచుచేసుకుంది. విజయవాడ కోర్టులో కేసు సంబంధించిన రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని ప్రత్యేక దర్యాప్తు సంస్థ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే రికార్డులు ధ్వంసమయ్యాయని సిట్ తెలిపింది. రికార్డుల ధ్వంసంపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

2007, డిసెంబర్‌ 26న అర్ధరాత్రి ఆయేషా మీరా అత్యంత దారుణంగా హత్యకు గురైంది. నిమ్రా కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా, విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో హత్యకు గురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు నివ్వడం తెలిసిందే.

 

18:19 - October 12, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రపంచవ్యాప్తంగా, నిన్నటి నుండి ధియేటర్స్‌లో సందడి చేస్తోంది.. ఓవర్సీస్లో వన్ మిలియన్ మార్క్ దాటేసింది.. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాన్ బాహుబలి రికార్డ్స్‌ నెలకొల్పిన అరవింద సమేత మూవీ, శాటిలైట్ రైట్స్‌విషయంలోనూ అదే దూకుడు కనబరచింది..  రిలీజ్‌కి ముందు,  20కోట్ల వరకూ చెల్లించి, అరవింద సమేత శాటిలైట్ రైట్స్‌ దక్కించుకోవాలని.. స్టార్ మా అండ్ జీ తెలుగు ఛానెల్స్‌పోటీ పడగా, సినిమాపై నమ్మకంతో నిర్మాత ఎవరకీ శాటిలైట్  హక్కులు అమ్మలేదట. తీరా సినిమా విడుదలై, సూపర్ హిట్ టాక్ రావడంతో,  జీ తెలుగు 23.5కోట్లకు అరవింద సమేత వీర రాఘవ శాటిలైట్ రైట్స్  కొన్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం..

17:29 - October 12, 2018

విశాఖ : పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు, సివేరు పోమ హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్‌ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలానికి చెందిన మీనా.. గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

 

17:27 - October 12, 2018

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా‌హెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వనీదత్, దిల్ రాజు, పీ.వీ.పీ. కలిసి నిర్మిస్తున్న మూవీ, మహర్షి.. అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న మహర్షి షూటింగ్.. ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. 
మొన్నటి వరకు గెడ్డంతో, చేతిలో బుక్ పట్టుకుని కాలేజ్‌కి వెళ్ళిన మహేష్ ,ఈ షెడ్యూల్‌లో కంపెనీ సీఈవో‌గా మారిపోయాడు.. ఆన్‌లొకేషన్ నుండి ఈ స్టిల్ బయటకొచ్చింది. మహేష్ క్లీన్ షేవ్‌తో, బ్లూ జీన్స్‌ బ్లేజర్, గాగుల్స్‌తో, హాలీవుడ్ హీరోలా ఉన్నాడు.. మహేష్  అలా స్టైల్‌‌గా నడుచుకుంటూ వస్తుంటే, చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది..   ఈ స్టిల్ చూసి, మహేష్ మేల్ ఫ్యాన్స్‌హ్యాపీగా ఫీలవుతుంటే, ఫీమేల్ ఫ్యాన్స్ మాత్రం,  మహేష్ బాబు, అంత అందమేంటయ్యా బాబూ.. అంటూ అసూయ పడుతున్నారు... 2019 సమ్మర్‌లో మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

16:33 - October 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అపద్ధర్మ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ రద్దుపై ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ వేసిన పిటిషన్‌తోపాటు అసెంబ్లీ రద్దుపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో అసెంబ్లీ రద్దుపై అడ్డంకులు తొలగిపోయాయి. గత నెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దైన సంగతి తెలిసిందే.

 

16:25 - October 12, 2018

మీ టూ ఉద్యమం రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తోంది... హాలీవుడ్ టు బాలీవుడ్, తర్వాత టాలీవుడ్ వయా కోలీవుడ్.. భాష వేరైనా బాధ మాత్రం ఒక్కటే అంటూ, రకరాల పరిస్ధితుల్లో వేధింపులకు గురైనవారు, ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.. సింగర్ చిన్మయి, ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. రీసెంట్‌గా చిన్మయి విషయంలో, ఆమె తల్లి పద్మాసిని రియాక్ట్ అయింది..
2004లో, ఒక ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు, ఫంక్షన్ అయిపోయాక ఒక వ్యక్తి వచ్చి, చిన్మయితో, వైరముత్తు గారు మీకోసం రూమ్‌లో వెయిట్ చేస్తున్నారు, ఒక్కరే వెళ్ళి కలవండి, కోపరేట్ చెయ్యండి అన్నాడు.. నేను, ఆ పనికైతే ఇంకెవరినైనా చూసుకోండి అని, చిన్మయిని తీసుకుని అక్కడినుండి వచ్చేసాను అని చిన్మయి తల్లి పద్మాసిని తెలిపింది.. ఈ మీ టూ ఉద్యమంలో ఇంకెవరు ప్రముఖుల పేర్లు బయటకొస్తాయో చూడాలి మరి... 

15:52 - October 12, 2018

న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న ‘‘#మీ టూ’’ స్పందనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కేసుల విచారణకు నలుగురు సభ్యుల విశ్రాంత న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర మంత్రి  మేనకా గాంథీ శుక్రవారం ప్రకటించారు. 
ఈ న్యాయవాదుల బృందం ‘‘మీ టూ’’ కేసులను విచారణ చేసేందుకు పబ్లిక్ హియరింగ్స్ నిర్వహిస్తారని మంత్రి వెల్లడించారు. ఇందులో లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలను వేరువేరుగా విచారించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మేనకా గాంధీ పేర్కొన్నారు.
 

 

15:44 - October 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-2కు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-2 పరీక్షలో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని తొలగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-2 పరీక్షలో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసినవారిని తొలగించాలని గతంలో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-2 పరీక్షల్లో 3,147 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని తొలగిస్తూ హైకోర్టు ఆదేశించింది. 1/2 పద్ధతిలో సెలక్ట్ అయినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. 

 

15:22 - October 12, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా నిన్నటి నుండి ధియేటర్స్‌లో సందడి చేస్తోంది.. ఏపీ, తెలంగాణాల్లో అన్ని ధియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి.. ఓవర్సీస్‌లోనూ మొదటి రోజు తారక్ తన హవా కొనసాగించి, అక్కడ, తన గత చిత్రం జైలవకుశని, అరవింద సమేతతో బీట్ చేసేసాడు.. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ని టచ్ చేసి, ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయేలా చేసాడు.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వీర రాఘవుడు రచ్చ చేస్తున్నాడు... ఇప్పటివరకూ ఉన్న లెక్కల ప్రకారం, నైజాం-5.73కోట్లు, సీడెడ్-5.48కోట్లు, నెల్లూరు-1.06కోట్లు, గుంటూరు-4.14కోట్లు, కృష్ణ-1.97కోట్లు, తూర్పుగోదావరి-2.77కోట్లు, పశ్చిమగోదావరి-2.37కోట్లు, ఉత్తరాంధ్ర-3.12  కోట్ల చొప్పున 26.64  కోట్లు వసూలు చెయ్యగా, అమెరికాలో ప్రీమియర్ల ద్వారా 5.80  కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం.. మొత్తానికి 100  కోట్లకి దగ్గర్లో అరవింద సమేత ఉంది..   అలాగే, తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డ్ కూడా ఈ చిత్రానిదే కావడం విశేషం.. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్‌డే 136  కోట్ల వరకూ వసూలు చేసిందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కూడా అంటున్నారు..   

 

15:14 - October 12, 2018

ఢిల్లీ : తాను ఏ పార్టీలో చేరడం లేదని ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. తాను ఏ పార్టీ సభ్యుడిని కాదన్నారు. ఢిల్లీలో ప్రజా గాయకుడు గద్దర్ రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడారు. సోనియమ్మను చూడటానికే ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని... సెక్యులర్ శక్తులన్నీ ఏకం కావాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో అక్కడి ప్రజలు, రాజకీయ పార్టీలు కేసీఆర్‌పై పోటీ చేయాలని కోరితే తాను పోటీ చేస్తానని చెప్పారు. నయా ఫ్యూడలిజాన్ని తగ్గించేందుకు పోటీ చేస్తానని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఏ పార్టీలోనైనా ఉండవచ్చన్నారు. ఓటు.. రాజకీయ విప్లవమన్నారు. 

14:02 - October 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్న మోత్కుపల్లి ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది.  ఆలేరు నుండి పోటీలోకి దిగుతానని ఆయన గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధిష్టానం..పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనితో ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. సస్పెండ్ అనంతరం బాబుపై మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
ఆలేరులో ఆయన ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఏ పార్టీ నుండి ప్రచారం నిర్వహిస్తున్నారో తెలియలేదు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిసింది. కానీ బీఎల్ఎఫ్ శుక్రవారం నాడు విడుదల చేసిన జాబితాలో మోత్కుపల్లి పేరు ఉంది. బీఎల్ఎఫ్  అభ్యర్థిగా ఆలేరు నుండి నర్సింహులు బరిలో నిలుస్తున్నారు. నర్సింహులుతో పాటు మరో 28 మంది అభ్యర్థుల పేర్లను బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు.  

13:45 - October 12, 2018

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర‌తో, ఆయన తనయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్నచిత్రం.. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు... రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం, హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగుతోంది.. మరోవైపు ప్రమోషన్స్‌‌లోనూ వేగం చూపిస్తుంది చిత్రబృందం.. ఈ మూవీలో స్వర్గీయ హరికృష్ణ క్యారెక్టర్‌ని ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ చేస్తుండగా, నిన్న అతని లుక్ వెనకనుండి చూపించారు.. వచ్చే దీపావళి నాడు,  ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల టీజర్లని ఒకేసారి రిలీజ్ చెయ్యబోతున్నారు.. తర్వాత ధియేట్రికల్ ట్రైలర్స్‌ని కూడా అదే పద్ధతిలో రిలీజ్‌ చేసే ప్లాన్‌లోఉన్నారు.. దసరాకి మరో లుక్ ఏదైనా బయటకొస్తుందేమోనని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

13:39 - October 12, 2018

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొంత ఊరట లభించింది. బాబు వేసిన నాన్ బెయిలబుల్ రీకాల్ వారెంట్‌కు ధర్మాబాద్ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 10వ తేదీన న్యాయవాదులతో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. బాబు తరపున సుప్రీంకోర్టు లాయర్ లూత్రా వాదిస్తున్నారు. 
వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడాన్ని ధర్మాబాద్ కోర్టు బాబుకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. మిగతా వారు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. శుక్రవారం దీనిపై కోర్టు విచారణ జరిపింది. గతంలో దీనిపై విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 15వ తేదీన బాబు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని గత నెల 21వ తేదీన స్పష్టం చేసింది. ఆ రోజు కూడా బాబు హాజరు కాకుండా రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుకు హజరయ్యే విషయమై మినహయింపు కోరుతూ బాబు తరపు న్యాయవాదులు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కావడం వల్ల బాబు కోర్టుకు వ్యక్తిగతంగా హజరుకావడం ఇబ్బందని కోర్టుకు న్యాయవాది తెలిపారు. లీగల్ సెల్ అథార్టీలో రూ. 15వేలు చెల్లించాలని, మిగతా వారు కోర్టుకు హాజరు కావాలని కోర్టు సూచించింది. కానీ నవంబర్ 15న బాబు హాజరవుతారా ? లేక దానికి కూడా మినహాయింపు ఇస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. 

13:24 - October 12, 2018

హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ శాంతి భద్రతల అంశంపై  శుక్రవారం  రాష్ట్రంలోని 31 జిల్లాల ఎస్పీలతో సమావేశం అయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై  సీఈవో రజత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీలకు వివరిస్తారు. ఎన్నికల నియమావళి ఎలా అమలుచేయాలి, ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తీసుకోవాల్సిన అంశాలపై ఆయన జిల్లా ఎస్పీలతో చర్చిస్తారు. జిల్లాల్లో ఉన్న పరిస్ధితులపై జిల్లా ఎస్పీలు రజత్ కుమార్ కు రిపోర్టు ఇవ్వనున్నారు. నిఘా విభాగాల సమాచారం మేరకు మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించమని పిలుపు నిచ్చిన నేపధ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాష్ట్రంలోని 32వేల 500 పోలింగ్ స్టేషన్ల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం కూడా ఈసమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు, 8మంది పోలీసు కమీషనర్లు కూడా ఈ సమావేశంలో పాల్గోన్నారు. సాయంత్రం దాకా ఈ సమావేశం కొనసాగుతుంది.

 

13:14 - October 12, 2018
వాషింగ్‌టన్: రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన ఇంటర్‌నెట్ సర్వర్ల సాధారణ మైంటెనెన్స్‌ సందర్భంగా ఇంటర్‌నెట్ వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. నెట్‌ను పొందడంలో తీవ్ర వైఫల్యాలు తలెత్తుతాయి. సర్వర్లు కొంతసేపు పూర్తిగా పనిచేయడం ఆగిపోవడంవల్ల ఈ సమస్య గ్లోబల్ వ్యాప్తంగా సమస్య సంభవిస్తుంది. ఇంటర్‌నెట్ కార్పోరేషన్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసీఏఎన్ఎన్) సంస్థ ఈ మైంటెనెన్స్‌ను ఈ సమయంలో చేపట్టబోతోంది. క్రిప్టోగ్రాఫిక్ కీ ను మార్చడం ద్వారా ఇంటర్‌నెట్‌లోని అడ్రస్‌బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్‌ఎస్) క్షేమంగానే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడుల నేపథ్యంలో ఈ తరహా మైంటెనెన్స్ తప్పదని ఐసీఏఎన్ఎన్ పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా గ్లోబల్ ఇంటర్‌నెట్‌ను షట్‌డౌన్ చేయడం ద్వారా భద్రతతో పాటు డీఎన్ఎస్‌ను అపత్కరసమయాల్లో తిరిగి డాటాను పొందే వీలుంటుందని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్ఏ) వెల్లడించింది. నెట్ వినియోగదారులతో పాటు నెట్‌వర్క్ ఆపరేటర్స్, ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్‌పీ) ఈ షట్‌డౌన్  కు సిద్ధంగా ఉండాలని కోరింది. సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్‌టెన్షన్‌లను ఎనేబుల్ చేయడం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని సీఆర్ఏ తెలిపింది. కాలం చెల్లిన ఐఎస్‌పీ లను వాడే వినియోగదారులకు ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
12:44 - October 12, 2018

అల్లు శిరీష్, కృష్ణార్జున యుద్ధం ఫేమ్, రుక్సార్ థిల్లాన్ జంటగా, సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్న మూవీ.. ఏబీసీడీ.. (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ).. ధనవంతుడైన ఒక కుర్రాడు, పేదవాడిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తే ఏం చేసాడు అనే పాయింట్‌తో మలయాళంలో తెరకెక్కిన  ఏబీసీడీ సినిమాని, అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు..  శ్రీనువైట్ల సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్‌తో, బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న భరత్, ఈ మూవీలో శిరీష్ ఫ్రెండ్‌గా కనిపించబోతున్నాడు.. ఏబీసీడీ పోస్టర్‌ని ట్వట్టర్‌లో పోస్ట్‌చేసి, సినిమా 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ అవబోతుంది, ఏబీసీడీ‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాను అని ట్వీటాడు అల్లు బాబు...

 

12:41 - October 12, 2018

ఢిల్లీ : త్వరలో రాబోయే దసరా..దీపావళి పండుగలను క్యాష్ చేసుకునే పనిలో సెల్ కంపెనీలు పడిపోయాయి. ఆకర్షణీయమైన ధరలు..ఆఫర్లు..డిస్కౌంట్లతో ముందుకొస్తున్నాయి. సెల్ కంపెనీల్లో ఒకటైన నోకియా మరొక కొత్త ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. నోకియా 8110 4జి బనానా స్లైడర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. 
పేరులో ఉన్నట్లుగానే అరటిపండు ఆకృతిలో వంపులో ఈ సెల్ కలిగి ఉండడం గమనార్హం. ఇందులో కీ ప్యాడ్‌ స్లైడర్‌ విధానాన్ని చేర్చారు. దీని ద్వారా కాల్‌ వచ్చినప్పుడు కీ ప్యాడ్‌ స్లైడ్‌ చేసి సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రాచుర్యం పొందిన స్నేక్ గేమ్‌ని ఇన్ బిల్డ్ గా ఇవ్వనున్నారు. అన్ని రకాల గూగుల్ యాప్స్ ను ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇక ఈ ఫోన్‌‌లో ఎలాంటి ఫీచర్లున్నాయంటే...
ఓస్‌: కై..డ్యుయల్‌ సిమ్‌ (మైక్రో+నానో)..2.45 అంగుళాల కర్వ్‌డ్‌ డిస్‌ప్లే..4 జీబీ నిల్వ సామర్థ్యం..2 మెగా పిక్సల్‌ వెనుక కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌..512 ఎంబీ ర్యామ్‌..4జీ వోల్ట్‌, హాట్‌స్పాట్‌, వైఫై సౌకర్యాలు (ఇంటర్నెట్)..1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ..
ధర: సుమారు రూ.6 వేలు....అక్టోబరు 24 నుంచి ఈ ఫోన్‌ అన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులోకి రానుంది.

12:37 - October 12, 2018

న్యూఢిల్లీ: తెలుగుదేశం నాయకులు తప్పు చేయకపోతే ఐటీ దాడులకు ఎందుకు భయపడుతున్నారని  బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం నాయకులను  ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన ఇళ్లపై ఈ ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సీఎం రమేశ్ తనపై కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని ఆరోపించారు. సీఎం రమేష్ వ్యాఖ్యలపై జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ .... ఒకరిపై కక్షతో సోదాలు జరగటంలేదని,దేశంలో అవినీతిని నిర్మూలించాలని, నల్లధనాన్నిఅరికట్టాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తెలుగుదేశం నాయకులు తప్పులు చేశారు కనుకే భయపడుతున్నారని జీవీఎల్ అన్నారు. దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు ఐటీ,ఈడీ వంటి ప్రభుత్వ సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం స్వేఛ్చనిచ్చిందని, ఆయా సంస్ధలు వాటికందిన సమాచారం మేరకు సోదాలు జరుపుతాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక, రాజకీయ ముసుగులో అక్రమార్జనను కాపాడుకోవచ్చని అనుకుంటున్నారని జీవీఎల్ అన్నారు. 2017లో 3 లక్షల డొల్ల కంపెనీలను కేంద్రం మూసి వేయించిందని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కూడా నల్లధనం విషయంలో నోటీసులు ఇచ్చామని, వారు కోర్టుకు వెళితే వారికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని నరసింహారావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను నామినేషన్ పద్దతి ద్వారా ప్రభుత్వం సీఎం రమేష్ కంపెనీలకు ఇచ్చిందనే సమాచారం మేరకే సోదాలు నిర్వహిస్తున్నారని,ఆదాయపన్నుశాఖ వారు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చి సీఎం రమేష్ తన నిజాయితీని నిరూపించుకోవచ్చని జీవీఎల్ అన్నారు. 

12:12 - October 12, 2018

హైదరాబాద్ : భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రాజ్‌కోట్ టెస్ట్‌లో ఆకట్టుకున్న పేస్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో శార్ధూల్ ఠాకూర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్‌లో భారత బౌలర్లు ప్రతిభ కనబరిచారు. కీరన్ పొవెల్, క్రైగ్ బ్రాత్‌వైట్‌లు బ్యాటింగ్ ఆరంభించారు. జట్టు స్కోరు 32 పరుగులుండగా పొవెల్ (22) వెనుదిరిగాడు. ఇతడిని అశ్విన్ అవుట్ చేశాడు. అనంతరం బ్రాత్‌వైట్‌కు హోప్ జత కలిశాడు. వీరిద్దరేూ కొద్దిసేపు భారత బౌలర్లను ఎదుర్కొన్నట్లు కనిపించింది. కానీ బ్రాత్ వైట్ (14) మరోసారి నిరాశ పరిచాడు. మరోవైపు హోప్‌ బౌండరీలతో వెస్టిండీస్ స్కోరు బోర్డుని పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. ఇతని ప్రయత్నాన్ని ఉమేశ్ యాదవ్ నిలువరించాడు. హోప్‌ని ఉమేశ్ యాదవ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆ జట్టు జోరుకి కళ్లెం వేశాడు. మూడో వికెట్ కోల్పోయే సరికి వెస్టిండీస్ జట్టు 86 పరుగులు చేసింది. లంచ్ సమయానికి క్రీజులో హెట్‌మెయర్ (10 బ్యాటింగ్: 23 బంతుల్లో 2x4) ఉన్నాడు. 
భారత జట్టు : విరాట్ కొహ్లి , అజింక్యా రహానే , కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్.

11:43 - October 12, 2018

ఢిల్లీ : ‘మీ టూ’ (నేనూ బాధితురాలినే) సంచలనం సృష్టిస్తోంది. ఒక ఉద్యమంలా మారతోంది. తమపై జరిగిన లైంగిక దాడులు..వేధింపులను మహిళలను ప్రస్తుతం బహిర్గతం చేస్తున్నారు. ప్రముఖులపై ఆరోపణలు చేస్తుండడంతో కలకలం రేపుతోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో పలువురు కూడా స్పందించారు. ఇతర హీరోలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 
తండ్రి పాత్రలను పోషించి ఆకట్టుకున్న నటుల్లో అలోక్ నాథ్ ఒకరు. ఆయన పోషించిన పాత్రలతో..టీవీ షోలలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రచయిత్రి బింటా నంద, సంధ్యా మృదుల్‌లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. ఈ జాబితాలో మరో నటి చేరింది. Image result for Actress Deepika Amin Accuses Alok Nath Of Sexual Harassment
అలోక్ నాథ్ మద్యానికి బానిస అని, మహిళలను వేధిస్తాడని సోను కే టిటు క స్వీటీ’ చిత్రంలో నటించిన నటి దీపిక ఆమీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం షూటింగ్‌లో పాల్గొన్న తాను ఓ గదిలో ఉండగా అలోక్ నాథ్ చొచ్చుకొని వచ్చాడని ఆ సమయంలో యూనిట్ సభ్యులు అండగా నిలిచారని పేర్కొన్నారు. చిన్న వయస్సులో జరిగిన ఈ ఘటన ఇప్పటికీ గుర్తుకొస్తుంటే భయంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేశారు. ఇవన్నీ అసత్య ఆరోపణలు అని అలోక్ నాథ్ న్యాయవాది తెలిపారు. కేవలం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. వస్తున్న ఆరోపణల్ని చట్టప్రకారం ఎదుర్కోవడానికి అలోక్‌నాథ్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

11:39 - October 12, 2018
న్యూఢిల్లీ: ‘‘రాహుల్ గాంధీ మూత్రం తాగటానికి జనం రెడీగా ఉన్నారు.. నువ్వు ఈ మాత్రం చేయలేవా?’’ అంటూ హిందూ టెర్రర్ కేసులో నరేంద్ర మోడీ పేరును చేర్చేందుకు అప్పటి కేంద్ర మంత్రి కమలనాథ్ తనతో అన్నట్టు అప్పటి హోమ్ శాఖ మాజీ కార్యదర్శి ఆర్వీఎస్ మణి షాకింగ్ వార్తను వెల్లడించారు.  
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలోని యూపీఏ హయాంలో నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా అడ్డగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు పలు రకాలుగా ప్రయత్నించారని మణి చెప్పారు. ఈ సందర్భంగా.. కమలనాథ్ మరో ఇద్దరు అధికారులు తనపై వత్తిడి తెచ్చి మోడీపై ఇష్రాన్ జహాన్ కేసును ఫేక్ ఎన్‌కౌంటర్‌గా సృష్టించే విధంగా  వివరాలు మార్చాలని సూచించారని మణి పేర్కొన్నారు. కానీ తాను అలా చేసేందుకు తాను నిరాకరించినట్టు పేర్కొంటూ ఆర్వీఎస్ మణి ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇష్రాన్ జహాన్‌ను అమాయకుడిగా చిత్రించేందుకు ఈ ఎన్‌కౌంటర్‌లో మోడీని ఇరికించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని మణి వెల్లడించారు.  
‘‘మీకు ఆ మూత్రం రుచి తెలిస్తే.. మీరే తాగండి.. నేనైతే తాగలేను. నేను నిజానికే కట్టుబడి ఉంటా..’’ అంటూ తిరుగు సమాధానం కమలనాథ్‌కు చెప్పినట్టు మణి పేర్కొన్నారు. 
ఆర్వీఎస్ మణి ట్వీట్ వైరల్ కావడంతో కమలనాథులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమలనాథ్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ మోడీని ప్రధాని కాకుండా ఆపలేకపోయిందని విమర్శించారు. 
 
 
 
 
11:26 - October 12, 2018

మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది.. నిన్న బిగ్‌బి అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లుక్‌కి మంచి స్పందన వస్తోంది.. ఇంతలోనే సైరా నుండి మరో కొత్త లుక్ వచ్చింది..
కన్నడ నటుడు సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తన్నారు.. అమితాబ్, నరసింహా రెడ్డి గురువు గోసయి వెంకన్నగా  కనిపించబోతున్నాడు.. విజయ్, నరసింహా రెడ్డి కుడిభుజంగా తమిళుడైన ఓబయ్య పాత్రలో నటిస్తుండగా, సుదీప్, అవుకు రాజు అనే పాత్ర పోషిస్తున్నాడు... వీళ్ళిద్దరూ పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం, మెలితిరిగిన మీసకట్టుతో వీరుల్లా ఉన్నారు.. జార్జియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులకు, నరసింహా రెడ్డి బృందానికీ మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి  2019 సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది...

11:25 - October 12, 2018

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసినప్పటి నుంచి పోలీసులు మావోయిస్టుల ఏరివేతను మరింత ఉధృతం చేశారు. లేటెస్ట్ గా ఆంధ్ర,ఒరిస్సా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో రానా అనే  మహిళా మావోయిస్టు మరణించినట్లు విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. ఏఓబీ లోని ఆండ్రపల్లి వద్ద ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

 

11:06 - October 12, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. ఐటీ దాడులు జరుపుతుండడంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐటీ అధికారులతో ఆయన నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ అధికారులను తీసుకొస్తే అనుమతించేది లేదని, అక్కడి ప్రభుత్వం తమకు వ్యతిరేకమన్నారు. మధ్యవర్తులను పెట్టుకుని సోదాలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వ వత్తిడితో ఏవైనా తనింట్లో వస్తువులు పెట్టే అవకాశం ఉందని తెలిపారు. 
తాను తప్పు చేసి ఉంటే ఉరి శిక్షకైనా సిద్ధమేనని వెల్లడించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై ఐటీ దాడులు జరుగుతున్నాయని, అన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకెళుతామన్నారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించడం జరుగుతుందన్నారు. 
గతంలో పార్లమెంట్‌‌లో గట్టిగా ప్రధాన మంత్రిని నిలదీస్తే..వస్తా..మీ అంతు చూస్తా..అంతు తేలుస్తా..అని అన్నారని గుర్తు చేశారు. ఏపీ విభజన చట్టం గురించి పోరాడుతుంటే తనపై కక్ష కట్టి ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఐటీ దాడులు ఏ విధంగా చేస్తున్నారని..ఎందుకు చేస్తున్నారో తెలుపాలని తాను లేఖ రాయడం జరిగిందని, మూడు రోజుల తరువాత దాడులు జరుగుతున్నాయన్నారు. ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదని, చట్టానికి వ్యతిరేకంగా పోలేదని...కరడుగట్టిన తెలుగుదేశం వాదులమని..ఏపీకి నష్టం కలిగిస్తే ఊరుకోమన్నారు. 

10:16 - October 12, 2018
తిరుచ్చి: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ సమయంలో ఎయిర్‌పోర్టు గోడను డీ కొట్టిన ఘటన శుక్రవారం ఉదయం తమిళనాడులోని తిరుచినాపల్లిలో చోటుచేసుకుంది. తిరుచ్చి నుండి దుబాయ్ వెళుతున్న ఈ విమానంలో 136 మంది ప్రయాణిస్తున్నారు. విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.  అందులో ప్రయాణిస్తున్న 136 మంది ప్రయాణీకులు క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. విమానం వెనకవైపు  ఉన్న రెండు చక్రాలు ఎయిర్‌పోర్టు కాంపౌండ్‌వాల్‌ను ఢీ కొనడంతో ఆ మేరకు గోడ కూలిపోయింది. ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ డైరక్టర్ జనరల్ విచారణ చేయనున్నారు.     
09:56 - October 12, 2018

ఢిల్లీ : అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తుంటే కక్ష గట్టి ఐటీ దాడులు జరుపుతున్నారని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం రమేశ్ నివాసాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులతో తనకు వచ్చిన ఇబ్బందేమి లేదని తెలిపారు. 
ఇటీవలే ఏపీ రాష్ట్రంలో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. నెల్లూరుకు చెందిన టీడీపీ నేత బీరం మస్తాన్ రావు నివాసంలో సోదాలు జరిపారు. మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల్లోనూ ఐటీ అధికారులు దాడులు జరిపి సోదాలు చేశారు. కానీ ఈ దాడులు జరగలేదని ప్రచారం జరిగింది. కానీ ఐటీ దాడులు జరుపుతుండడం వెనుక కేంద్రం ఉందని..కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నారు. 
సీఎం రమేశ్ నివాసాలపై శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు దాడులు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కడప, హైదరాబాద్‌లోని సీఎం రమేశ్ నివాసాలపై దాడులు జరిపి ఐటీ అధికారులు సోదాలు జరుపుతోంది. ఆయనకు చెందిన రుత్విక్ కంపెనీ రుత్విక్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు. ఐటీ దాడుల విషయం సీఎం చంద్రబాబు నాయుడికి అధికారులు తెలియచేశారని సమాచారం. 

09:34 - October 12, 2018

హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ కాంగ్రెస్‌లో చేరుతారా ? కేవలం ఆ పార్టీకి మద్దతు తెలియచేస్తారా ? అనే సందిగ్ధత నెలకొంది. ఐదు నెలల క్రితం గద్దర్ కుమారుడు కాంగ్రెస్‌లో సూర్యకిరణ్ చేరిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్‌ను గద్దర్ కుమారుడు సూర్యం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఇప్పించడానికి గద్దర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. గద్దర్ కుటుంబాన్ని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్ ఢిల్లీకి తీసుకొచ్చారు. 
మహా కూటమితో కాంగ్రెస్ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పొత్తులు, సీట్ల ఖరారు కాలేదు. అధిష్టానం నియమించిన స్ర్కీనింగ్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో సికింద్రబాద్ కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని సూర్యం ఆశిస్తున్నారు. దీనితో గద్దర్‌ను వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది. గద్దర్ కాంగ్రెస్‌కు ప్లస్ అవుతారని భావిస్తున్న అధిష్టానం పార్టీ తరపున ప్రచారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బుల్లెట్ బ్యాలెట్‌ను నమ్ముతుందా ? ..గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా ? లేదా ? అనేది తెలియనుంది. 

09:26 - October 12, 2018

హైదరాబాద్ : ఐటీ దాడులు ఏపీ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ టీడీపీ తీవ్ర ఆక్షేపన వ్యక్తం చేసింది. తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసాలపై శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు దాడులు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కడప, హైదరాబాద్‌లోని సీఎం రమేశ్ నివాసాలపై దాడులు జరిపిన ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయనకు చెందిన రుత్విక్ కంపెనీ రుత్విక్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు. ఐటీ దాడుల విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడికి అధికారులు తెలియచేశారని సమాచారం. రమేశ్‌కు చెందిన పలు కంపెనీలు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాయని..వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేస్తున్న ఆ కంపెనీలు వేలాది కోట్ల టర్నోవర్ చేస్తున్నాయని తెలుస్తోంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేశ్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. 
రాజకీయ కక్షలో భాగంగా దాడులు చేస్తారని..అప్రమత్తంగా ఉండాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ రమేశ్ నాయకత్వంలో కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని ఎంపీలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసాలపై ఐటీ దాడులు జరుగుతుండడం గమనార్హం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఏపీ ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

09:25 - October 12, 2018

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ వివాదంలో పీకల్లోతు కష్టాల్లో ఉండి విపక్షాల దాడిని ఎదుర్కోంటున్న కమలదళం ఇప్పుడు ఎంజే అక్బర్ రూపంలో మరో గండంలో చిక్కుకుంది. మీటూ వివాదం ఆరోపణలు ఎదుర్కోంటున్న విదేశాంగశాఖ సహాయ మంత్రి అక్బర్ పై  ఇప్పటికే పలు విమర్శలు  చుట్టుముట్టాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఏరికోరి కేబినెట్ లోకి చేర్చుకున్నప్పటికీ విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వెంటనే అక్బర్ తో రాజీనామా చేయించాలని సంఘ్పరివార్ బీజేపీ నేతలపై ఒత్తిడి తీసుకు వస్తోంది. ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్నఎంజే అక్బర్ తన పర్యటన అర్ధంతరంగా ముగించుకుని వచ్చి రాజీనామా చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. ఎఁజే అక్బర్ 80వ దశకంలో ఏసియన్ ఏజ్, టెలిగ్రాఫ్ పత్రికల్లో పని చేసిన సమయంలో ఆయన వద్ద పని  చేసిన మహిళా జర్నలిస్టులను ఏరకంగా వేధింపులకు గురి చేశారో చెపుతూ, సుమారు 10 మంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆయన బండారాన్ని బయట పెట్టారు.

అక్బర్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నవంబర్ నెలలో ఆరాష్ట్ర శాసనసభకు  ఎన్నికలు జరుగుతున్నాయి.  మీటూ వివాదంతో ఆరాష్ట్రంలో బీజీపీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ఇప్పటికే బీజేపీ భయపడుతోంది. అక్బర్ విషయంలో స్పందించటానికి కేంద్ర మంత్రులుగానీ, పార్టీ నాయకులు కానీ ప్రస్తుతానికి సుముఖంగా లేరు. ఒకవేళ మీటూ వివాదంపై అక్బర్ వివరణ ఇవ్వాలని చూసినా ఎన్నికల సమయంలో అది సంతృప్తికరంగా ఉండదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రియారమణి అనే జర్నలిస్టు ఒక ప్రముఖ ఎడిటర్ తనను లైంగికంగా ఎలా  వేధించారో వివరిస్తూ 2017లో మీటూ ఉద్యమాన్ని సమర్ధిస్తూ ఒక వ్యాసం రాశారు. ఇప్పుడు ఆమె ఆ ఎడిటర్ అక్బరేనని ట్విట్టర్ ద్వారా చెప్పారు. విదేశాల నుంచి రాగానే  అక్బర్ రాజీనామా చేస్తే ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా  చేసిన వారి సంఖ్య 3 కి చేరుకుంటుంది. 2017 జనవరిలో మేఘాలయ గవర్నర్‌ వి.షన్ముగనాథన్‌, 2018 ఆగస్టులో కేంద్ర మంత్రి నిహాల్‌ చంద్‌ మేఘ్‌వాల్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతోనే తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో  ఏంజరుగుతుందో వేచి చూద్దాం. 

08:57 - October 12, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ టైగర్ సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ నటనతో వీరవిహారం చేశాడని టాక్ వినిపిస్తోంది. చిత్రంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ అభిమాన హీరో అలరించడాని..సినిమా బంపర్ హిట్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. 
దీనిపై జూ.ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేశారు. ‘ఇలాంటి సమయంలో తనకు అండగా నిలిచిన, కొండంత బలాన్ని ఇచ్చిన అభిమానులకు తన ధన్యవాదాలు. అదేవిధంగా, చిత్ర యూనిట్ కు, మీడియాకు కూడా తన థ్యాంక్స్. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణను మర్చిపోలేనని, దృఢ సంకల్పంతో పని చేసిన త్రివిక్రమ్ లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు’ అని ఎన్టీఆర్ తెలిపారు. 

08:38 - October 12, 2018

లుథియాన : భారతదేశంలో...తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. తమ కులం కాని వాడిని ప్రేమించిందని సొంత కుటుంబసభ్యులే దారుణానికి ఒడిగడుతున్నారు. ప్రేమ పేరిట హత్యలు పరిపాటై పోయాయి. తాజాగా ఓ యువతి సొంత తమ్ముడినే చంపేసింది. కేవలం ప్రేమకు అడ్డొస్తున్నాడనే కారణంతో దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన లూథియానాలో ఆలస్యంగా వెలుగు చూసింది. 
రేణు కనౌజియా అనే యువతి ఓ యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం ఆమె సోదరుడు అన్ష్‌ కనౌజియాకు తెలిసింది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పాడు. దీనితో ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించారు. రేణుపై అన్ష్ ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచేవాడని..ప్రియుడితో కలిసే సమయంలో గమనించే వాడని..ఏ సమయంలో వెళుతోంది..ఎప్పుడు కలుస్తోంది..తదితర సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియచేసేవాడని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్వీర్ సింగ్ ఓ జాతీయ పత్రికకు తెలియచేశారు. 
దీనితో రేణు సోదరుడిపై కక్ష పెంచుకుందని, తమ ప్రేమకు అన్స్ అడ్డుగా ఉంటాడని భావించి అతడిని హత్య చేయాలని నిర్ణయానికి వచ్చిందన్నారు. అక్టోబర్ 6వ తేదీన తండ్రి గణేష్ ఉదయం 8గంటల సమయంలో బయటకు వెళ్లగా బంధువు ఆసుపత్రిలో చేరడంతో తల్లి కూడా ఇంటి నుండి బయటకు వెళ్లిందని తెలిపారు. 
ఇంట్లో ఉన్న అన్ష్ ను వేరే గదిలోకి పిలిపించుకుని అతడి గొంతు నులిమి హత్య చేసిందన్నారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ్ముడు కనిపించడం లేదని రేణు పేర్కొందన్నారు. కానీ రేణును విచారించగా హత్య విషయం బయపటడిందని, రేణుపై 365 (కిడ్నాప్), 302 (హత్య) 506 కేసులు నమోదు చేశారు. 

07:52 - October 12, 2018

హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి నాగం జనార్ధనరెడ్డి కుమారుడు నాగం దినకర్ రెడ్డి (46) గురువారం రాత్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన అక్టోబరు 4న జూబ్లీ హిల్స్ లోని  అపోలో ఆసుపత్రిలో చికిత్సకొసం చేరారు. ఊపిరితిత్తుల మార్పిడికి ప్రయత్నాలు జరుగుతుండగానే దినకర్ రెడ్డి మరణించటంతో నాగం కుటుంబం విషాదంలో మునిగిపోయింది.  

 

07:47 - October 12, 2018

విజయవాడ : తెలుగు దేశం పార్టీని ధర్మాబాద్ కోర్ట్ టెన్షన్ వెంటాడుతోంది. చంద్రబాబు సహా 16మంది హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై మరోసారి రీకాల్ పిటిషన్ వేయాలని చంద్రబాబు నిర్ణయించడంతో.. కోర్టు ఎలా స్పందింస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ధర్మాబాద్‌ కోర్టులో సీఎం చంద్రబాబు తరపున రీకాల్‌ పిటిషన్‌ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుసహా 16మంది హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్ర పిటిషన్‌ వేయనున్నారు. రీకాల్‌ పిటిషన్‌పై ధర్మాబాద్‌ కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో చంద్రబాబు సహా పలువురు నేతలు ధర్నా చేశారు. వారికి ధర్మాబాద్ కోర్టు గత నెలలో నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 21న చంద్రబాబుతో పాటు 15 మందిని కోర్టులో హాజరుపర్చాల్సిందిగా మహారాష్ట్ర పోలీసులకు ఆదేశించింది. తరువాత ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. బాబ్లీ కేసులో..ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని నిశ్చయించుకున్నారు. ఈ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు ఏవిధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 

07:34 - October 12, 2018

చిత్తూరు : తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారు సింహ వాహనంపై ఊరేగనున్నారు. శుక్రవారం రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. గోవింద నామస్మరణతో తిరువీధులు మార్మోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి వచ్చిన జనం.. దేవ దేవుని దివ్య దర్శనంతో పులకించి పోతోంది. రెండోరోజు ఉదయం స్వామివారు ఐదు పడగల చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీకృష్ణుడి రూపంలో చిన్న శేషవాహనంపై ఆసీనులైన వేంకటేశ్వరుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వామివారిని దర్శించుకున్న వేలాదిమంది భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. 
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో మాడవీధులు కోలాహలంగా మారాయి. భజనలు, కోలాటాలు, హరినామ సంకీర్తనలు, కేరళ వాయిద్యాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. రెండో రోజు రాత్రి  దేవదేవుడు హంస వాహనంపై తిరు మాడవీధుల్లో విహరించారు. స్వామివారి వాహన సేవను వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులతో వీధులన్నీ కిటకిటలాడాయి. హంస వాహన సేవకు ముందు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9గంటలకు సింహ వాహనంపై విహరించనున్నారు. రాత్రికి ముత్యపు పందిరిలో తిరు వీధుల్లో గోవిందుడు భక్తులను కటాక్షించనున్నాడు. 

07:24 - October 12, 2018

హైదరాబాద్ : ప్రొ - కబడ్డీ సీజన్‌ 6లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌కు తొలి విజయం లభించింది.  రాత్రి యూపీ యోధాతో తలపడిన పట్నా పైరేట్స్‌ 43-41 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.  పట్నా రైడర్‌ పర్‌దీప్‌ నర్వాల్‌ అద్భుత ఆటతీరును కనబర్చాడు. తనొక్కడే 16 పాయింట్లు స్కోర్‌ చేశాడు.
పట్నా డిఫెన్స్‌ విభాగం అద్భుతంగా రాణించింది. ఆట మొదలైన రెండు నిమిషాలకే యూపీ 4-1 ఆధిక్యం ప్రదర్శించింది. మూడో నిమిషంలో పర్‌దీప్‌ తన తొలి పాయింట్‌ సాధించగా.. పట్నా 3-5కు ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ దశలో రిషాంక్‌ దేవడిగ రెండు పాయింట్లు తేవడంతో యూపీ మరింత ముందంజ వేసింది.  రెండు రైడ్లతో నర్వాల్‌ మూడు పాయింట్లు రాబట్టడంతో ప్రత్యర్థి ఆధిక్యాన్ని పట్నా ఒక పాయింట్‌కు తగ్గించ గలిగింది.
14వ నిమిషంలో పట్నా పైరేట్స్‌ను యూపీ యోధ ఆలౌట్‌ చేసింది. అప్పుడు 20-15 స్కోరుతో యూపీ యోధ ముందంజలో ఉంది. అయితే ప్రథమార్థం చివరి ఐదు నిమిషాల్లో పట్నా ఆరు పాయింట్లు చేజిక్కించుకుని 21-20తో ముందంజ వేసింది. సెకండాఫ్‌లో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన పట్నా... 24-21తో ఆధిక్యాన్ని పెంచుకుంది. ఆట చివరి దశలో రెండు జట్లూ డిఫెన్స్‌, అటాకింగ్‌ గేమ్‌తో పాయింట్లు రాబట్టడంతో మ్యాచ్‌ నువ్వా - నేనా అన్నట్టు సాగింది. కానీ చివరకు పట్నానే విజయం వరించింది. 
మరో  మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌...బెంగాల్‌ వారియర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనైనా గెలుస్తుందనుకున్న తమిళ్‌ తలైవాస్‌.. బెంగాల్‌ వారియర్స్‌  చేతిలోనూ చిత్తైంది. 36-27 స్కోరుతో ఓటమి చవిచూసింది. దీంతో తమిళ్‌ తలైవాస్‌ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. 

07:14 - October 12, 2018

ఢిల్లీ : విండీస్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. రెండో టెస్టులో తలపడనున్నటీమ్‌లో చోటు దక్కుతుందని భావించిన హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్, హనుమ విహారీ, మయాంక్ అగర్వాల్‌కు చోటు దక్కలేదు. క్రికెట్‌లో అగర్వాల్ దుమ్మురేపినప్పటికీ సెలక్టర్లు అతడిని ఎంపిక చేయకపోవడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహమ్మద్ సిరాజ్, హనుమ విహారీ కూడా అద్భుతాలు సృష్టించారు. అయినప్పటికీ వారిని సైతం పక్కనపెట్టారు సెలక్టర్లు.
ప్రస్తుతం భారత్‌తో తలపడుతున్న విండీస్ టీమ్ వీక్ గానే ఉంది. బ్యాట్స్‌మెన్ కుదురుగా క్రీజులో నిలవలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో పూర్తిస్థాయి టీంఇండియాను బరిలోకి దింపాల్సిన అవసరం ఏముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోగాలకు అవకాశం ఉన్న సమయంలో కొత్త వారిని ఎందుకు పక్కన పెడుతున్నారో  తెలియడం లేదని, విండీస్ లాంటి టీమ్స్ పైనే కొత్త వారికి అవకాశం ఇవ్వనప్పుడు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పెద్ద టీమ్స్ పై అవకాశం ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తారు క్రికెట్ అభిమానులు. ట్విట్టర్ ద్వారా బీసీసీఐ టీం సెలక్షన్స్ పై అసహనం వ్యక్తం చేశారు నెటిజన్లు.

07:03 - October 12, 2018

హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రాజ్ కోట్ వేదికగా శనివారం ముగిసిన మ్యాచ్‌లో భారత్ ఇన్సింగ్స్ 272 పరుగుల తేడాతో గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో భారత్ ఉంది. రెండో టెస్ట్లోనూ విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.
ఈ మ్యాచ్ కోసం అటు పోలీసులు, ఇటు స్టేడియం యాజమాన్యం భారీ ఏర్పాట్లు చేశారు.. స్టేడియం మొత్తం సిసి కెమెరాల నిఘాలో ఉంచారు. పార్కింగ్ తదితర అంశాలతో పాటు స్టేడియం యాజమాన్యం కూడా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.. ఇక స్టేడియంకి చేరే అన్ని దారులతో పార్కింగ్ వద్ద ఏర్పాట్లు, కొన్ని సెక్యూరిటీ అంశాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ అధ్వర్యంలో  హైదరాబాద్ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.

07:03 - October 12, 2018

శ్రీకాకుళం:  తిత్లీ తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాను అన్ని రకాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. గురువారం శ్రీకాకుళం చేరుకున్నఆయన రాత్రి పొద్దుపోయే వరకు సహయక చర్యలపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేసారు. ఉత్తరాంధ్ర సాధారణ స్ధితికి వచ్చే వరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి పని చెయ్యాలని ఆదేశించారు. పంటలకు జరిగిన నష్టం అంచనా వేయటానికి వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు నష్ట  పరిహారం తక్షణం అందించాలని  ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తిత్లీ తుపాను ధాటికి జిల్లాలోని 18 మండలాలు పూర్తిగా దెబ్బితిన్నాయి. చంద్రబాబునాయుడు తుపాను పరిస్ధితిపై కలెక్టరేట్లో  సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే  ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీఎంకు ఫోన్ చేసి పరిస్ధితి అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 196 గ్రామాలలో ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయి. తిత్లీ తుపాను ధాటికి ఇచ్చాపురం నుంచి పైడి భీమవరం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వచ్చే 3 రోజుల్లో అన్ని గ్రామాలలోను విద్యుత్ సరఫరా పునరుద్దరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 1లక్షా 96 వేల ఎకరాల్లో పంట నష్టం  జరిగినట్లు కలెక్టర్ ధనుంజయ్ రెడ్డి ప్రాధమిక అంచనా వేశారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపాను దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. 

06:47 - October 12, 2018

హైదరాబాద్ : ఒకప్పుడు బుల్లెట్ తోనే రాజ్యాధికారమన్న ఉద్యమ కారుడు గద్దర్…. నేడు ప్రజాప్రతినిధిగా కొనసాగేందుకు బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఏ పార్టీలో చేరుతారనే సందిగ్ధతకు తెరపడింది. గద్దర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. సీపీఎం, ఇతర ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన బీఎల్ఎఫ్ తరపున పోటీ చేస్తారని భావించినా చివరకు ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి మొగ్గు చూపారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్కతో భేటీ అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గురువారం రాత్రే మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌తో కలిసి గద్దర్ ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నగరా మోగడంతో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ను ఓడించడానికి రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏకమౌతున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పెద్దన్నగా అవతరించి మహా కూటమి ఏర్పాటు దిశగా పావులు కదుపుతోంది. ఇందులో టిడిపి, కోదండరాం పార్టీ, ఇతర పార్టీలు చేరనున్నాయి. ఇంకా పొత్తులు, సీట్లపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గద్దర్ మహాకూటమికి మద్దతు తెలియచేసే అవకాశం ఉంది. మహాకూటమి అభ్యర్థిగా గద్దర్‌ను గజ్వేల్ బరి నుండి కేసీఆర్‌పై పోటీ చేయిస్తారనే ప్రచారం ఎప్పటి నుండో సాగుతోంది. గద్దర్ బాటలోనే మరికొంతమంది ప్రజా ఉద్యమకారులు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్ తరపున గద్దర్ ప్రచారం ఏ మాత్రం కలిసివస్తుందో వేచి చూడాలి. 

Don't Miss