Activities calendar

13 October 2018

22:49 - October 13, 2018


అమెరికా : సెల్ఫీ దిగాలనే సరదా ఓ యువతి ప్రాణాలు తీసింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని పనామా నగరంలో జరిగింది. పర్యటన నిమిత్తం సాంద్రా మాన్యులా డా కోస్టా అనే యువతి పనామాలోని ఓ అపార్ట్‌మెంట్ 27వ అంతస్తు బాల్కనిలోకి వెళ్లింది. అక్కడ సెల్ఫీ స్టిక్‌తో ఫొటో దిగుతుండగా కాలుజారి బాల్కనీ నుంచి కింద పడిపోయింది. తీవ్రగాయాలైన యువతి మృతి చెందింది. ఆ యువతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

22:25 - October 13, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధిక మొత్తంలో డబ్బు తీసుకెళ్తే సరైన కారణాలు చెప్పాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్ఫష్టం చేశారు. లేకపోతే డబ్బు సీజ్ చేస్తామని చెప్పారు. స్పష్టమైన ఆధాారాలు చెప్పి డబ్బు తీసుకెళ్లాలన్నారు. లిక్విడ్ క్యాష్‌కు లెక్కలు చెప్పలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద అధిక మొత్తంలో డబ్బు ఉండకూడదన్నారు. ఒక వేల ఉన్నాసీజ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 6 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మద్యానికి సంబంధించి కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. 

 

22:04 - October 13, 2018

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోపం వచ్చింది. నెటిజన్లు అందునా మగాళ్లపై ఆమె ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ఉచిత సలహాలు ఇవ్వకండి అంటూ సీరియస్ అయింది. మ్యాటర్ ఏంటంటే.. ప్రస్తుతం గర్భంతో ఉన్న సానియాకు నెటిజన్లు, అందులోనూ పురుషులు ఎక్కువగా సలహాలు ఇవ్వడాన్ని సానియా జీర్ణించుకోలేకపోయింది. గర్భంతో ఉన్నప్పుడు మేం శవం మాదిరిగా ఓ చోట పడి ఉండాలా? అని తనకు ఉచిత సలహాలిచ్చే వారిని ఆమె ప్రశ్నించింది. 

సానియా తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మరికొన్ని రోజుల్లో బిడ్డకు జన్మనివ్వనున్న సానియా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. కడుపుతో ఉన్నావ్.. నువ్వు ఒక్కచోట కుదురుగా ఉండు అంటూ కామెంట్లు చేశారు. దీంతో తట్టుకోలేకపోయిన సానియా సీరియస్ అయింది. ‘నాకు సలహాలిచ్చే వారిలో అధికంగా మగవారే ఉన్నారు. గర్భంతో ఉన్న 9 నెలలపాటు సుప్తావస్థలో ఉండాలని చెబుతున్నారు. కడుపుతో ఉండటమంటే అది వ్యాధి సోకినట్లు కాదు. అంటరానివారుగా గర్భిణులను ట్రీట్ చేస్తున్నారు. అందరూ సాధారణ మనుషులమే. గర్భిణులు కూడా ఇతరుల్లాగ స్వేచ్ఛా జీవనాన్ని ఇష్టపడతారు. చులకనగా చూసే ఆలోచనల్ని మీ మెదడు నుంచి తీసేయాలి. మీరూ ఓ తల్లి గర్భం నుంచి వచ్చినవారే కదా’ అంటూ సానియా వరుస ట్వీట్లలో తన అభిప్రాయాల్ని షేర్ చేసుకుంది.

22:03 - October 13, 2018

నెల్లూరు : నగరంలో కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కల్లూరు కాలనీలో ఆషీమ్ అనే వ్యక్తి కరెంట్ పని చేస్తున్నాడు. 6, 8 సంవత్సరాలున్న ఇద్దరు చిన్నారులకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇంటికి తాళం వేసి..నోట్లో గుడ్డలు కుక్కి చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించాడు. వారిపై అత్యాచారాయత్నం చేశాడు. ఇంట్లో చెబితే చంపేస్తామంటూ చిన్నారులను బెదిరించాడు. వారిలో ఓ బాలిక పరిస్థితిని గమనించిన తండ్రి నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. స్థానికులు నిందితునికి దేహశుద్ది చేశారు. తాళ్లు, వైర్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఆషీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. 

 

21:43 - October 13, 2018

హైదరాబాద్ : ఐటీ అధికారుల దాడులపై ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. కుట్రలో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తన పర్సనల్ లాకర్ తెరిచేందుకే హైదరాబాద్ వచ్చానని తెలిపారు. సెర్చ్ వారెంట్ తనపై జారీ కాలేదన్నారు. సెర్చ్ వారెంట్ తనపై భార్యపై పేరు మీదే వచ్చిందని స్పష్టం చేశారు. ఐటీ అధికారులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని ఎద్దేవా చేశారు. 

21:37 - October 13, 2018

హైదరాబాద్: పాతబస్తీ అంటే మజ్లిస్.. మజ్లిస్ అంటే పాతబస్తీ.. అనే రేంజ్ కు ఎంఐఎం ఎదిగింది. పాతబస్తీలో ఎంఐఎంకు తిరుగులేదనే విషయం అన్ని పార్టీలకు తెలుసు. అంతగా మజ్లిస్ అక్కడ పాతుకుపోయింది. అయితే పాతబస్తీలో మంచి పట్టున్న మజ్లిస్‌ పార్టీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం సిద్ధం చేసింది. ఎంఐఎంను ఎదుర్కొనేందుకు ఎంబీటీ (మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌) పార్టీని కాంగ్రెస్‌ రంగంలోకి దింపనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చి.. ఓల్డ్‌ సిటీలో సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. పాతబస్తీలోని ఏడు సీట్ల విషయమై భక్తచరణ్‌ దాస్‌ కమిటీతో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ స్థానాల్లో ఎంఐఎంకు పోటీగా కాంగ్రెస్‌, ఎంబీటీ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.

పొత్తులో భాగంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై మహమ్మద్‌ పహిల్వాన్‌ లేదా ఆయన కుటుంబసభ్యులను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మద్‌ పహిల్వాన్‌ కొడుకు ఇప్పటికే భక్తచరణ్‌ దాస్‌ కమిటీని కలిసినట్టు తెలుస్తోంది. ఈ పొత్తులో భాగంగా ఓల్డ్‌సిటీ భారాన్ని ఎంబీటీ పార్టీకే వదిలేయాలనే భావనలో కాంగ్రెస్‌ ఉందట. చూడాలి మరి కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో.

21:12 - October 13, 2018

సిద్ధిపేట: టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలుగుదేశం పార్టీపైన, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైన ఫైర్ అయ్యారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయిందని వ్యాఖ్యానించిన హరీష్ రావు బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీకి పట్టిన గతే టీడీపీకి కూడా పడుతుందని జోస్యం చెప్పారు. జార్ఖండ్ ప్రజలు ఆర్జేడీని బీహార్ పార్టీగా ముద్ర వేసేశారని.. అదే విధంగా టీడీపీపై కూడా ఆంధ్ర పార్టీ అనే ముద్ర పడిందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతయిందని... తెలంగాణలో మళ్లీ ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ ముసుగులో టీడీపీ యత్నిస్తోందని హరీష్ రావు అన్నారు. నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టు చంద్రబాబు పరిస్థితి ఉందని హరీష్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వస్తే నాగార్జునసాగర్ పై 45 టీఎంసీల హక్కును తెలంగాణకు కల్పించబడుతుందని బచావత్ ట్రైబ్యునల్ తెలిపిందని... దీనికి కూడా చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అందుకే చంద్రబాబును ఆంధ్రా బాబు అంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబుతో కాంగ్రెస్ నాయకులు ఎలా పొత్తు పెట్టుకున్నారని హరీష్ రావు నిలదీశారు.

21:00 - October 13, 2018

ఛత్తీస్‌గడ్‌ : రాష్ట్రంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పలు జరిగాయి. జీజాపూర్ వీక్లీ మార్కెట్‌లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. దీందో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. పోలీసులు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాన్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. అతన్ని పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీకరించారు. 

అంతకముందు ఆంధ్రప్రదేశ్, ఒడిషా సరిహద్దులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. ఏవోబీలో ల్యాండ్‌మైన్ పేల్చారు. కోరాపుట్ జిల్లా పనసపుట్ట అటవీప్రాంలో కూంబింగ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు ల్యాండ్‌మైన్ పేల్చారు. అయితే భద్రతా బలగాలు తృటిలో తప్పించుకున్నాయి. పోలీసు బలగాలు సురక్షితంగా ఉన్నారని ఓఎస్డీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.  

 

 

20:19 - October 13, 2018

ఢిల్లీ: ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారా? మరి మీ మొబైల్ నెంబర్‌ రిజిస్టర్ చేసుకున్నారా? లేదా? లేకుంటే మాత్రం మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం బ్లాక్ అవడం ఖాయం. డిసెంబర్ 1, 2018 నాటికి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సర్వీసుకు మీ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు తేదీలోపు మొబైల్ నెంబర్‌కు అనుసంధానం చేయని పక్షంలో నెట్ బ్యాంకింగ్ సర్వీసులు నిలిచిపోతాయంటూ ఎస్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఎస్బీఐ తమ ఖాతాదారులకు నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌పై సూచనలు చేసింది. మీ ఖాతాకు మొబైల్ నెంబర్ నమోదు కాని పక్షంలో వెంటనే సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి నమోదు చేసుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులు సూచించారు.

ఖాతాదారుల బ్యాంకింగ్‌ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌ అలర్ట్‌ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా తెలియజేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) జులై 6, 2017లో అన్ని బ్యాంకులకు సర్క్యులర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌కు మొబైల్‌ నెంబరును రిజిస్టర్‌ చేసుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది.

మొబైల్ రిజిస్ట్రర్ చెక్ చేయడం ఎలా?
- ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి.
- లాగిన్ అయ్యాక ‘మై అకౌంట్ అండ్ ప్రొఫైల్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- పర్సనల్ డిటైల్స్/మొబైల్ ఆప్షన్‌ బటన్‌పై క్లిక్ చేయాలి.
- మీ ఖాతా ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- లాగిన్ పాస్‌వర్డ్ కాకుండా ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. 
- అక్కడే రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలు ఉంటాయి. 
- ఒకవేళ మొబైల్ నెంబర్ కనిపించకుంటే రిజిస్ట్రర్ కాలేదని అర్థం.
- వెంటనే సమీప ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లి మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేయించుకోవాలి.

19:46 - October 13, 2018

హైదరాబాద్: తనకు టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తనకు కేంద్ర భద్రతా సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులను కోరినట్లు రేవంత్‌ రెడ్డి వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను రేవంత్ రెడ్డి కలిశారు. రెండు అంశాలపై ఫిర్యాదు చేసినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల మంత్రి జగదీశ్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ తనను భౌతికంగా అంతమొందిస్తామని హెచ్చరించారని.. టీఆర్ఎస్ సర్కార్‌ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు అధికారులకు తాను ఫిర్యాదు చేశానని రేవంత్ తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో నాగార్జునసాగర్‌లో జరిగిన టీఆర్ఎస్ నేతల శిక్షణకు హాజరైనందున ఆయనపై తనకు నమ్మకం లేదని.. కేంద్ర సంస్థల సిబ్బందితో తనకు భద్రత కల్పించాలని కోరినట్లు రేవంత్‌ చెప్పారు. 

మరోవైపు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనకు రూ.10 కోట్లు లంచం ఇస్తానన్నారంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రేవంత్ తెలిపారు. నాయిని వ్యాఖ్యల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయాలని.. లేదంటే తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరినట్టు చెప్పారు. నాయిని స్టేట్‌మెంట్ రికార్డు చేసి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. 

తనకు ముషీరాబాద్ టికెట్ ఇవ్వకుండా ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని.. అక్కడి నుంచి పోటీ చేస్తే రూ.10కోట్ల లంచం కేసీఆర్ ఇవ్వజూపారని నాయిని నర్సింహారెడ్డి పత్రికాముఖంగా వ్యాఖ్యానించినట్టు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు నాకు పది కోట్లు లంచం ఇవ్వజూపారని స్వయంగా ఒక రాష్ట్ర మంత్రే చెప్పినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని రేవంత్ ప్రశ్నించారు. అవినీతి నిరోధక శాఖ చట్టం ప్రకారం ఒక ప్రజాప్రతినిధి మరొక ప్రజాప్రతినిధికి లంచం ఇస్తానని అనడం నేరం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

19:18 - October 13, 2018

విశాఖ : ఆంధ్రప్రదేశ్, ఒడిషా సరిహద్దులో మరోసారి మావోయిస్టులు కలకలం సృష్టించారు. ఏవోబీలో ల్యాండ్‌మైన్ పేల్చారు. కోరాపుట్ జిల్లా పనసపుట్ట అటవీప్రాంలో ఘటన చేసుకుంది. కూంబింగ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు ల్యాండ్‌మైన్ పేల్చారు. అయితే భద్రతా బలగాలు తృటిలో తప్పించుకున్నాయి. పోలీసు బలగాలు సురక్షితంగా ఉన్నారని ఓఎస్డీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.  

 

18:57 - October 13, 2018

హైదరాబాద్: ఉప్పల్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఇంకా మూడు పరుగుల వెనుకంజలో ఉంది. టీమిండియా యువ సంచలనం పృథ్వీషా(70) ధాటిగా ఆడగా.. వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే (75 బ్యాటింగ్‌) బాధ్యతాయుత ఇన్నింగ్‌ ఆడాడు. రిషభ్‌ పంత్‌ (85 బ్యాటింగ్‌) దూకుడుగా ఆడటంతో రెండో రోజు ఆటలో కోహ్లి సేన గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. విండీస్ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌ రెండు వికెట్లు తీయగా, గాబ్రియల్‌, వ్యారికెన్‌ చెరో వికెట్‌ సాధించారు.

అంతకుముందు  295/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌.. మరో 16 పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. విండీస్‌ ఓవర్‌నైట్‌ ఆటగాడు రోస్టన్‌ ఛేజ్‌(106; 189 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో రాణించాడు. భారత బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ విజృంభించి ఆరు వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు పృథ్వీషా మంచి ఆరంభం ఇచ్చాడు. కాగా, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ తన వైపల్యాన్ని కొనసాగించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించగా అందులో రాహుల్‌ చేసినవి నాలుగు పరుగులే ఉండటం అతడి ఆటకు నిదర్శనం. అనంతరం నాలుగు పరుగుల వ్యవధిలోనే పృథ్వీషా, పుజారా(10) వికెట్లను విండీస్‌ బౌలర్ల పడగొట్టి కోహ్లి సేనను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో జట్టు బాధ్యతను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రహానేలు తీసుకున్నారు. ఆచితూచి ఆడుతూ విండీస్‌ బౌలర్లను ఎదుర్కొన్నారు. కోహ్లి-రహానే జోడి నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించిన అనంతరం భారత జట్టుకు మరో షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లిని(45) హోల్డర్‌ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌(85) రెచ్చిపోయి ఆడాడు. ఈ జోడి ఐదో వికెట్‌కు 146 పరుగులు జోడించింది. రేపు కూడా వీళ్లిద్దరూ ఇదే జోరు కొనసాగితే విండీస్ కు కష్టాలు తప్పవనే చెప్పాలి.

విండీస్ తొలి ఇన్నింగ్స్-311
భారత్ తొలి ఇన్నింగ్స్-308/4 (పృథ్వీ షా-70, కోహ్లి-45, రహానె-75 నాటౌట్, రిషబ్ పంత్-85 నాటౌట్)

18:51 - October 13, 2018

ఆదిలాబాద్ : జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లి మృత్యులోకాలకు వెళ్లారు. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు, కాలువలో స్నానానికి వెళ్లి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలతో రెండు జిల్లాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో అన్నదమ్ములు తరుణ్, అరుణ్ పిక్నిక్‌కు వెళ్లారు. అన్నదమ్ములు ఇద్దరూ మత్తడిగూడ చెరువులో ఈతకు వెళ్లారు. ఈత పూర్తిస్థాయిలో రాకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వీరి మృతితో గ్రామం విషాదఛాయలు అలుముకున్నాయి. 

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఏకీన్పూర్ శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో ఇద్దరు బాలికలు స్నానాకి వెళ్లారు. వీరిలో అర్చన (13) మృతి చెందింది. మరో బాలిక గల్లంతు అయ్యింది. గల్లంతైన బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతురాలు కథలాపూర్‌కు చెందిన అర్చనగా గుర్తించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

18:14 - October 13, 2018

విశాఖపట్నం:  ఇటీవల పట్టపగలే రోడ్లపై నరుక్కోవడం చూస్తున్నాం. కత్తులతో దారుణంగా తెగబడుతున్నా జనం పట్టించుకోవడం లేదని చింతిస్తాం. కాని.. విశాఖలో సరిగ్గా ఇలాగే జరిగిన ఓ దారుణ హత్యాకాండ నిందితుల్ని గ్రామస్థులు వెంటాడి చివరకు పట్టుకున్నారు. పైగా హత్యలో పాల్గొంది ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏడు మంది. అందర్నీ వెంబడించి మరీ బంధించి శభాష్ అనిపించుకున్నారు. 
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఏడుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్ల మధ్య వార్లో భాగంగా సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించారని ప్రాధమికంగా తేలింది. 
తమిళనాడుకు చెందిన నీలిమేఘ అమరన్ అనే వ్యక్తిని ఏడుగురు వ్యక్తులు టోల్ ప్లాజా వద్ద దారుణంగా హత్య చేశారు. తర్వాత ఇన్నోవా వాహనంలో పారిపోయారు. వీరిని స్థానికులు వెంటాడారు. వీరిని గమనించిన నిందితులు పోలవరం కాలువ రోడ్డు మీదుగా పారిపోయే యత్నం చేశారు. గ్రామస్తులు భారీ  సంఖ్యలో రావడంతో కారును వదిలేసి తుప్పల్లోకి వెళ్లి దాక్కున్నారు. జనం తుప్పల్ని కూడా చుట్టుముట్టి పోలీసులకు కబురు చేశారు. వారొచ్చాక అంతా కలసి ఏడుగుర్ని పట్టుకున్నారు. ఒకరు పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ప్రాణాలకు తెగించి హంతకులను పట్టుకున్న స్థానికుల తెగువకు పోలీసులు బెచ్చుకున్నారు.  
హతుడు, హంతకులంతా తమిళనాడు వాసులే. హతుడు మధురైకి చెందిన నీలమేఘ అమరన్ అని ఆధార్ కార్డును బట్టి తేలింది. ఇతడు కూడా గంజాయి స్మగ్లరే. తన ప్రత్యర్ధుల వాహనాల సమాచారం పోలీసులకిచ్చి వారి గంజాయిని పట్టించే వాడట. దీంతో ఇతణ్ణి హత్య చేయటానికి మరో గ్యాంగ్ సుపారీ ఇచ్చి పంపింది. ఆ సుపారీ బృందమే ఇతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది.

18:05 - October 13, 2018

కేరళ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలను ముక్కలు చేయాలని మలయాళ నటుడు కొల్లం తులసి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కొల్లం తులసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పోలీసు స్టేషన్ లో కొల్లం తులసిపై పోలీసు కేసు నమోదైంది. డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు(డీవైఎఫ్ఐ) చెందిన కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

సేవ్ శబరిమల పేరుతో త్రివేండ్రమ్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న నటుడు కొల్లం తులసి.. నోరు జారారు. శబరిమల ఆలయానికి వచ్చే మహిళలను ముక్కలు చేయాలని, ఓ ముక్కను కేంద్రానికి మరో ముక్కను ముఖ్యమంత్రి కార్యాలయానికి పార్సిల్ చేయాలని అన్నారు. ఇలా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అంతేకాదు 50 ఏళ్ల పైబడిన అమ్మలు కూడా వీధుల్లోకి వచ్చి శబరిమల తీర్పునకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెవులు పగిలేలా అయ్యప్ప అఖండనామ కీర్తన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కొల్లం తులసి. 

కాగా, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గత నెల 28న సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాససం 4-1 తేడాతో తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీం తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కొందరు మహిళలు సైతం ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా తమిళనాడులో మహిళలు రోడ్డెక్కారు. 50ఏళ్లు వచ్చే వరకు తాము శబరిమలకు వెళ్లబోమని ప్రకటించారు. అదే సమయంలో రాజ్యాంగం పేరుతో ఆలయ సంప్రదాయాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం ఏంటని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

17:40 - October 13, 2018

హైదరాబాద్: దివంగత ఎన్టీ రామారావు జీవితం నేపథ్యంగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా ''ఎన్టీఆర్''. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోషిస్తున్నారు. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు పార్టులుగా ఈ సినిమా వస్తుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఏ విధంగా చూపిస్తారు? ఆయనకు సంబంధించిన ఏయే అంశాలను చూపిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్టీఆర్ సినిమాకు పోటీగా ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమా తెరకెక్కిస్తానని సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. తన సినిమాలో వర్మ ఏం చూపిస్తారు? అనేది కూడా ఆసక్తిరేపుతోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలపై లక్ష్మీపార్వతి స్పందించారు. 

మొదట ఎన్టీఆర్ బయోపిక్ విడుదల చేయాలని, ఆ తర్వాతే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేస్తే బాగుంటుందని లక్ష్మీపార్వతి అన్నారు. నా పేరు పెట్టుకున్నారు కాబట్టి.. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఉన్నది ఉన్నట్టు చూపించాలన్నారు. నా జీవితం గురించి, ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి వర్మ తన సినిమాలో చూపించాలన్నారు. నాకు, ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని చూపించాలని లక్ష్మీపార్వతి కోరారు. దుర్మార్గమైన రాజకీయాలకు ఎన్టీఆర్ జీవితం బలైపోయిందని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తే తాను ఊరుకోనని ఆమె హెచ్చరించారు. ఉన్నది ఉన్నట్టు కాకుండా కల్పితాలు తీస్తే కోర్టుకెళతానని వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య ఎన్టీఆర్ లో తనకు పాత్ర లేదన్న లక్ష్మీపార్వతి ఆ సినిమలో తనను చూపించే సాహసం చేయరని చెప్పారు. ఆ రెండు సినిమాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఎన్టీఆర్ లాంటి మహానాడుకుడిపై కల్పితాలు ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారామె. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి వర్మ తనతో మాట్లాడలేదని, కథ గురించి చర్చించలేదని లక్ష్మీపార్వతి వివరించారు.

17:38 - October 13, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారి రజత్ కుమార్ పలు చర్యలకు ఉప్రకమించారు. డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం సీఈవో రజత్ కుమార్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల వేళ మద్యం సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్‌‌లు పాల్గొన్నారు. మద్యం దుకాణాల దగ్గర ఐదు కి.మీటర్ల పరిధిలో ఆంక్షలు విధిస్తామని, ఈసారి లిక్కర్ మాఫియాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ వెల్లడించారు. 
టోల్ ఫ్రీ నెంబర్ - సోమేష్ కుమార్...
ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడారు. రాజకీయ నేతలు మద్యంతో ఓటర్లను ప్రభావితం చేయకూడదని వెల్లడించారు. మద్యంపై సమాచారం అందించేందు టోల్ ఫ్రీ నెంబర్ (18004252523) కేటాయించడం జరిగిందని, ప్రతి బెల్టు షాపులో బ్రాండ్‌ల వారీగా అమ్మకాలను రిజిష్టర్‌లో పొందుపరచాలన్నారు. అలాగే ప్రతి మద్యం షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బెల్టు షాపులపై ప్రత్యేక నిఘా..ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం అమ్మకాలపై ఎప్పటికప్పుడు ఆరా తీసి కలెక్టర్, కేంద్రానికి రిపోర్టులను ఎన్నికల నోడల్ అధికారులు పంపుతారని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతొక్కరూ సహకరించాలని సూచించారు. 

17:31 - October 13, 2018

త్రిష చిరకాల కోరిక ఇప్పుడు తీరబోతుంది.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన పేట్టా చిత్రంలో త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా సిమ్రాన్ కనిపించనుంది.. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు.. రజనీకాంత్‌తో కలిసి దైవ దర్శనం చేసుకున్న త్రిష, ఆ ఫోటోలని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.. రజనీ నుదుటి నిండా బొట్టు, మెడలో దండలతో ఉంటే, త్రిష ఆయన పక్కనే బొట్టుతో, చేతిలో దండ పట్టుకుని నిలబడి ఉంది.. దర్శన్ డన్ రైట్ విత్ ది గాడ్ లైక్ మ్యాన్ హిమ్‌సెల్ఫ్ అని కొటేషన్ కూడా ఇచ్చింది.. పేట్టాలో, విజయ్ సేతుసతి, బాబీసింహా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.. త్రిష పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

 

16:28 - October 13, 2018

జగిత్యాల : ఆత్యాధునికయుగంలో ఉన్నాం.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నాం. రాకెట్‌లను అంతరిక్షంలోకి పంపుతున్నాం. కానీ సాటి మనిషిని మనిషిగా చూడడం లేదు. కొంతమంది కుల, మతాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే వుంది. ప్రతి రోజు దేశంలో ఏదో ఒక మూలన కుల దురహంకార హత్యలు, దాడులు, అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. మిర్యాలగూడ ప్రణయ్ హత్య, హైదరాబాద్‌లో ప్రేమ జంటపై దాడి ఘటనలు మరువక ముందే తాజాగా జగిత్యాల జిల్లాలో మరో కుల దురహంకార ఘటన చోటుచేసుకుంది. సారంగపూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం కుల బహిష్కరణకు గురైంది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని మైనర్ బాలిక కుటుంబాన్ని కుల పెద్దలు వెలి వేశారు.

సారంగపూర్‌లోని రేచపల్లి తాండాలో కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. వేరే కులం యువకుడిని ప్రేమించిందని మైనర్ బాలిక కుటుంబాన్ని కుల పెద్దలు కులం నుంచి వెలి వేశారు. మహిళను ప్రేమించిన యువకుడిని పోలీసులకు అప్పగించి, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయించారు. ఆ తర్వాత వెలి వేసిన కుటుంబాన్ని కులంలో కలుపుకోవడానికి 20 వేల రూపాయల జరిమానా విధించారు. అంతేకాకుండా అమ్మాయికి గుండు గీయించి, పంది రక్తంతో స్నానం చేయించి, చెప్పుల దండ వేయించే కార్యక్రమానికి కుల పెద్దలు పూనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ అమ్మాయిని రక్షించారు.

 

16:15 - October 13, 2018

అమరావతి: తిత్లీ తుఫాను బాధితులను ఆదుకొనేందుకు... పునరావాస ఏర్పాట్లు చేసేందుకు తక్షణం రూ.1200 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రధానికి ఓ లేఖ రాశారు. తిత్లీ సృష్టించిన బీభత్సానికి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయని.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సామాన్య జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపారు.  
160 కిమీ స్పీడుతో తీవ్ర గాలులు వీచడంతోపాటు దాదాపు 10 నుంచి 43 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని.. దీంతో ప్రజల ఆస్తులు, పంటలు, తోటలు భారీగా దెబ్బతిన్నాయని చంద్రబాబు నాయిడు వివరించారు. తక్షణ సహాయం కింద రూ 1200 కోట్లు విడుదల చేసి సహాయ కార్యక్రమాలను చేపట్టేందుకు సహకరించాలని ప్రధానిని తన లేఖలో కోరారు. 
ఈ గురువారం తిత్లీ సృష్టించిన బీభత్సానికి 8 మంది మృత్యువాత పడగా భారీగా చెట్లుకూలి తీవ్ర నష్టం చేకూర్చింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో 3 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినగా, జిల్లాలో 12,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 100 మంది డిప్యూటీ కలెక్టర్లను సహాయక చర్యల కోసం మోహరించారు. 
తిత్లీ తీవ్రతకు నష్టపోయిన మత్సకార కుటుంబాలకు వెంటనే 50 కేజీలు, పేదలకు 20 కేజీల బియ్యంతో పాటు లీటర్ నూనె, కేజీ చక్కెర, కేజీ కందిపప్పు, కేజీ ఆలూ అందించాలని అధికారులను రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. 

16:09 - October 13, 2018

మీ టూ ఉద్యమం రోజుకో మలుపు తిరుగుతోంది.. వివిధ రంగాలలో, వివిధ పరిస్ధితుల్లో వేధింపులకు గురైన మహిళలు, ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా, ధైర్యంగా తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. భాధిత మహిళలు ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు..
 ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై, సింగర్ చిన్మయి చేసిన ఆరోపణల గురించి, చిన్మయి తల్లి పద్మాసిని నిన్న మాట్లాడిన సంగతి తెలిసిందే.. ఇప్పుడీ మీ టూ‌లో యువ గాయకుడు, కార్తీక్ పేరు కూడా బయటకి వచ్చింది.. టాలీవుడ్‌లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్, తనని లైంగికంగా వేధించాడని ఒక మహిళ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు..
ఆ మహిళ, కార్తీక్ వాట్సాప్‌లో తనకి, లైంగికంగా రెచ్చగొట్టే మెసేజ్ లు పంపాడని, అతగాడి టార్చర్ తట్టుకోలేకే అతనితో కలిసి వర్క్ చెయ్యడం మానేసానని  కూడా చెప్పింది.. ఇంతకీ, సదరు యువతి, ఎవరై ఉంటారబ్బా అని,  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది..

16:05 - October 13, 2018

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార,ప్రతిపక్షాల నాయకుల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్షాలపై అధికార పక్షం నాయకులు విరుచుకుపడుతున్నారు. మహా కూటమిపైన, కాంగ్రెస్ పైన టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు దమ్ము,ధైర్యం ఉంటే టీఆర్ఎస్ ను డైరెక్టుగా డీకొనాలని నాయిని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదన్నారాయన. అందుకే అంతా కలిసి మహాకూటమిగా ఏర్పాడ్డారని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో మెజార్టీ మందికి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని నాయిని జోస్యం చెప్పారు. ఓడిపోతామని కాంగ్రెస్ కు ముందే తెలుసని అందుకే ఒంటరిగా పోరాటం చేయలేక ఇలా మహాకూటమి ఏర్పాటు చేశారని నాయిని ఎద్దేవా చేశారు. 

పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపైనా నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఊడ్చుకుపోయిందన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేందుకు తాము ప్రయత్నం చేస్తుంటే.. తగాదాలు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు మా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు దోచుకున్నది చాలదా? అని నిలదీశారు. ఏపీలో ఐటీ దాడులు జరిగితే కేసీఆర్ చేయిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు.. కానీ అది అవాస్తవం అని నాయిని అన్నారు. ఐటీ దాడులు చేయించడానికి సెంట్రల్ గవర్నమెంటు ఏమైనా మా చేతుల్లో ఉందా? మేము చెబితే సెంట్రల్ గవర్నమెంటు మా మాట వింటుందా? అని నాయిని ప్రశ్నించారు.

15:39 - October 13, 2018

హైదరాబాద్ : ఏంటీ చంద్రబాబును పట్టిస్తే లక్ష రూపాయలు ఇస్తానని వర్మ అంటాడా ? ఎందుకు అంటూ ఏవోవో ఊహించుకోకండి..ఎందుకంటే పట్టియాల్సింది ఆ బాబును కాదు వేరే బాబుని...వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ..ఎప్పుడు వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాస్త తగ్గించాడనే చెప్పవచ్చు. ఆయన తీస్తున్న తాజా చిత్రం ‘లక్ష్మీ పార్వతి’. ఈ సినిమా గురించి తెలియచేస్తూ వర్మ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేశారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా డూప్ చంద్రబాబు నాయుడు వీడియో సంచలనం సృష్టిస్తోంది. హోటల్ పని చేస్తున్న ఆయన్ను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వదిలారు. దీనితో కొద్ది రోజుల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. 
ఈ వీడియో లింక్‌ను వర్మ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. బాబును మొద‌ట గుర్తించి అడ్రస్ చెప్పిన వాళ్ల‌కు ల‌క్ష రూపాయ‌లు ఇస్తాన‌ని వర్మ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. అడ్ర‌స్ laxmisntr@gmail.com కి పంపిస్తారో వాళ్ల‌కు డబ్బులిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన తీస్తున్న ’ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’‌లో చంద్ర‌బాబు పాత్ర‌కు అతడిని తీసుకుంటారా ? అనే దానిపై చర్చ జురుగుతోంది. ఈ సినిమాలో చంద్ర‌బాబు పాత్రే కీల‌కం కానుందని తెలుస్తోంది. మరి నిజంగానే పంపించిన అతనికి వర్మ రూ. లక్ష ఇస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

15:38 - October 13, 2018

ముంబయి : ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి (92) కున్నుమూశారు. అనారోగ్యంతో ముంబయిలోని బ్రీచ్‌ కెనడీ ఆస్పత్రిలో పొందుతూ ఇవాళ ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా ఆమె పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నపూర్ణా దేవి ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. అన్నపూర్ణాదేవి పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత. ఆమెను చాలా మంది ‘మా’ అని సంబోధిస్తారు. 
మధ్యప్రదేశ్‌లోని మైహర్‌ పట్టణంలో ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్‌ ‘బాబా’ అల్లావుద్దీన్‌ ఖాన్‌, మదీనా బేగం దంపతులకు 1927లో అన్నపూర్ణాదేవి జన్మించారు. ఆమె తండ్రి అప్పటి మహారాజు బ్రిజ్‌నాథ్‌ సింగ్‌ దగ్గర సంగీత విద్వాంసులుగా ఉండేవారు. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రోషనారా ఖాన్‌. మహారాజు బ్రిజ్‌నాథ్‌ ఆమెకు అన్నపూర్ణాదేవిగా నామకరణం చేశారు. దీంతో ఆమె ఈ పేరుతోనే ప్రసిద్ధి చెందారు. 5 సంవత్సరాల వయసు నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. సితార్‌, సుర్బాహర్‌ వాయిద్యాల్లో చాలా ప్రావీణ్యురాలు. ఆమె తన 14ఏళ్ల వయసులో ప్రముఖ సితార్‌ విద్వాంసులైన పండిట్‌ రవి శంకర్‌ను వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత వారు విడిపోయారు. 

 

15:20 - October 13, 2018

హైదరాబాద్: మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్‌ టు అమీర్‌పేట్‌కు ప్రయాణికులతో బయలుదేరిన మెట్రోరైలు ఆకస్మాత్తుగా కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ బాలానగర్‌ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ అంతరాయం వల్లనే రైలు ఆగిపోయిందని మెట్రో సిబ్బంది తెలిపారు. రైలు ఆగిపోవడంతో ఆందోళన చేపట్టిన ప్రయాణికులకు అధికారులు వారి టికెట్‌ ధర చెల్లించి పంపించేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు మియాపూర్‌ నుంచి ఎర్రగడ్డ వరకు మెట్రోసేవలు నిలిచిపోయాయి. 

మెట్రో పవర్‌ ప్లాంట్‌లో సమస్య తలెత్తడంతోనే రైలు నిలిచిపోయిందని సిబ్బంది వివరించారు. ఒక ట్రాక్‌ వైర్ తెగిపడిపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని, రెండో ట్రాక్‌పై సర్వీసులు నడుస్తున్నాయన్నారు.

అయితే కొన్ని గంటల తర్వాత మెట్రో సిబ్బంది మరమ్మతులు చేపట్టి.. మెట్రో సర్వీసులను పునరుద్ధరించినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండు ట్రాక్‌ల్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయని చెప్పారు. విద్యుత్ తీగల మరమ్మతు వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్పష్టం చేశారు.

కాగా మెట్రో రైళ్లు అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలతో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో కూకట్ పల్లి, బేగంపేటలో సాంతికేక లోపాల కారణంగా మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నా.. తరుచుగా సాంకేతిక లోపాలు పునరావృతం అవుతుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15:19 - October 13, 2018

అరవింద సమేత వీర రాఘవుడు రెండో రోజూ బాక్సాఫీస్ బరిలో విజృంభించాడు..  ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ని టచ్ చేసి, తన గత చిత్రం జైలవకుశని, అరవింద సమేతతో బీట్ చేసేసాడు.. తొలిరోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో కలిపి 27కోట్లు కొల్లగొట్టాడు..
రెండో రోజు 8కోట్లు వసూలు చేసాడు.. రెండు రోజులకుగానూ 35కోట్లు షేర్ రాగా, ఓవర్సీస్‌ లెక్క7.5కోట్లు, అంటే, ప్రపంచవ్యాప్తంగా రెండురోజుల్లో 40కోట్లకి పైగా షేర్ వచ్చింది.. సెకండ్ డే షేర్ వివరాలు ఇలా ఉన్నాయి..
నైజాం 8.55కోట్లు, సీడెడ్ 7.44కోట్లు, నెల్లూరు 1.33కోట్లు, గుంటూరు 4.82కోట్లు, కృష్ణ 2.51కోట్లు, తూర్పుగోదావరి 3.24కోట్లు, పశ్చిమగోదావరి 2.69కోట్లు, ఉత్తరాంధ్ర4.01కోట్ల చొప్పున షేర్ సాధించింది.. మొత్తంగా 60కోట్ల మేర గ్రాస్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు..
ఈ రేంజ్‌లో దూసుకెళ్తే, తారక్‌ని ఎప్పటినుండో ఊరిస్తున్న 100కోట్ల క్లబ్‌లోకి అరవింద ఎంటర్ అవడం ఖాయం అనిపిస్తోంది.. 

 

15:12 - October 13, 2018

మహబూబ్ నగర్ :  తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా నేతలు విమర్శలు..ప్రతి విమర్శలకు దిగుతూ రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్ నేత డీకే అరుణపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్యజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని, భరత్ సింహా రెడ్డిపై కేసు ఎందుకు నమోదైందో అందరికీ తెలుసని..కమీషన్లు..మాఫియా గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను మభ్య పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, రక్త మాంసాలు తినే మనిషిని కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను పిల్లినో...జూపల్లినో త్వరలో తెలుస్తందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు పడవని..ఏట్లు పడుతాయని ఎద్దేవా చేశారు. 

15:09 - October 13, 2018

విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రిపై మరో వివాదం నెలకొంది. ఈవో కోటేశ్వరమ్మ, పాలకమండలి సభ్యులకు మధ్య విభేదాలు తలెత్తాయి. తమకు గౌరవ ఇవ్వడం లేదని ఈవోపై పాలకమండలి సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుడిలో ప్రతీచోట గేట్లకు తాళాలు వేస్తున్నారని ఈవోపై పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే పాలకమండలి సభ్యులపై మంత్రి కొల్లు రవీంద్రకు ఈవో ఫిర్యాదు చేశారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలని కొల్లు రవీంద్ర సూచించారు. 

 

14:31 - October 13, 2018

హైదరాబాద్ : భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని కొద్దిలో మిస్ అయ్యాుడు. ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ - భారత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. విండీస్ తొలి ఇన్నింగ్స్ 311 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. భారత ఓపెనర్ రాహుల్ (4) త్వరగా అవుటయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా చెలరేగాడు. కేవలం 53 బంతుల్లో 70 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా (10) ఎక్కువ సేపు నిలవలేదు. ఇతనితో జత కట్టిన కెప్టెన్ కోహ్లీ భారత్ స్కోరును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. 78 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 45 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీనితో భారత్ 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 

14:04 - October 13, 2018

ఢిల్లీ : దేశ రాజధానిలో శుక్రవారం మధ్యాహ్నం కలకలం రేగింది. ఓ బ్యాంకులో ప్రవేశించిన ఆరుగురు దుండగులు రూ. 3 లక్షలను దోచుకెళ్లారు. ఈ ఘటనలో క్యాషియర్‌ను దుండగులు కాల్చి చంపారు. బ్యాంకుల్లో ఉన్న ఇతరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దుండగులతో సెక్యూర్టీ గార్డు పోరాడడం, దోపిడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని చౌహాల పట్టణంలోని కార్పొరేషన్ బ్యాంకులో చోటు చేసుకుది. దుండగులు ముసుగులు ధరించి ఉన్నారు. దోపిడి జరిగిన సమయంలో బ్యాంకులో పది మంది కస్టమర్లు, 6గురు బ్యాంకు సిబ్బంది ఉన్నారు. నగదు ఇవ్వడానికి మొరాయించిన క్యాషియర్ సంతోష్‌ను కాల్చారని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తును చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
: #https://twitter.com/i/status/1050988416714887168

13:53 - October 13, 2018

విజయనగరం: ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుపాను కారణంగా విరామం ఇచ్చిన ప్రజా సంకల్పయాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శనివారం  ఉదయం తిరిగి గజపతి నగరం  నియోజక వర్గంలోని మదుపాడు నుంచి మొదలు పెట్టారు.  284 వ రోజు  ప్రారంభమైన  పాదయాత్రలో  ప్రతి చోట  ప్రజలు ఆయనకు బ్రహ్మరధం పడుతూ తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని అర్హతలున్నా, సక్రమంగా పింఛన్లు రావటంలేదని, రాజకీయ కారణాలు చూపి తమకు పింఛన్లు రాకుండా చేస్తున్నారని వృధ్దులు, వికలాంగులు, జగన్ మోహన్ రెడ్డి ఎదుట తమ బాధను చెప్పుకున్నారు. వైెస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్హులైన అందరికీ పింఛన్లు సక్రమంగా వచ్చేవని, ఆ మంచి రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు వారు  జగన్‌తో చెప్పారు. కోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని, ఉపాధి లేకపోవటంతో కుటుంబాలు  వీధిన పడుతున్నాయని తమకు న్యాయం చేయమని  ఉపాధి హామీ  ఫీల్డ్ అసిస్టెంట్లు జగన్ కు వినతి పత్రం అందచేశారు. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించిందని సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లు కూడా తమ సమస్యల్ని వైఎస్‌ జగన్‌ జగన్‌కు చెప్పారు. ఉద్యోగం కోసం ఎన్ని ఆందోళనలు  చేసినా ప్రభుత్వం హామీ ఇవ్వడం తప్ప ఫలితం లేకుండా పోయిందని,పెండింగ్‌ జీతాలు కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వారు వినతిపత్రం అందజేశారు. గజపతినగరం నియోజకవర్గంలోని మదుపాడు వద్ద ప్రారంభమైన  ప్రజా సంకల్పయాత్ర భూదేవీపేట క్రాస్‌, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్‌, గుడివాడ క్రాస్‌, మానాపురం, మానాపురం సంత మీదుగా కోమటిపల్లి వరకు కొనసాగుతుంది.  

13:48 - October 13, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల లేటెస్ట్ సెన్షేషన్ అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రపంచవ్యాప్తంగా, అన్నిధియేటర్స్‌‌లో సందడి చేస్తోంది.. ఇప్పటికే ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్ దాటేసింది.. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హౌస్‌‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతూ, కొన్నిఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్‌ నెలకొల్పింది.. అరవింద సమేత చూసి, సెలబ్రిటీస్ పెద్దఎత్తున్న ట్వీట్‌లు చేస్తున్నారు.. దర్శకధీరుడు రాజమౌళి, సినిమా చూసి, తారక్ నటన అండ్ త్రివిక్రమ్ డైరెక్షన్ గురించి పొగిడాడు.. అఖిల్ అక్కినేని..  తారక్, త్రివిక్రమ్‌లతో పాటు, పూజాహెగ్డే డబ్బింగ్ గురించి కూడా ట్వీట్ చేసాడు.. సాయి ధరమ్ తేజ్.. ఎన్టీఆర్ యాక్టింగ్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని అన్నాడు.. సినిమా చూసాను, తారక్ రోరింగ్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ రైటింగ్, థమన్ బ్యాగ్రౌండ్‌స్కోర్ అద్భుతం అన్నాడు అలీ.. పండగ వరకూ ఇతర సినిమాలేవీ లేవు కాబట్టి, యంగ్ టైగర్ మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి..

 

13:23 - October 13, 2018

హైదరాబాద్ : భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు విండీస్ బౌలర్లు షాక్ ఇచ్చారు. స్వల్ప వ్యవధిలోనే భారత్ రెండు వికెట్లను కోల్పోయింది. రాహుల్, షాలు ఆటను ఆరంభించారు. షా విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బంతిని బౌండరీలకు తరలించాడు. కానీ రాహుల్ (4) విఫలం చెందాడు. ఈ తరుణంలో షా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారతున్న షా (70)వారికన్ అవుట్ చేశాడు. అప్పటికీ భారత్ జట్టు స్కోరు 98. పుజారా, కోహ్లీలు స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. కానీ స్కోరు 102 పరుగులు ఉండగా పుజరా (10) వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్‌ కోహ్లీ (21), రహానే(13)లు ఉన్నారు. 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
అంతకుముందు ఉప్పల్‌లో విండీస్ బ్యాట్ మెన్స్ మంచి ప్రదర్శన కనబరచారనే చెప్పవచ్చు. 7 వికెట్ల నష్టానికి 295 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించింది. రోస్టన్ ఛేజ్ సెంచరీతో చెలరేగాడు. మరొకరు కెప్టెన్ జెసన్ హోల్డర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ 311 పరుగుల వద్ద ముగిసింది.

13:01 - October 13, 2018

విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రి దసర శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజున అమ్మవారు లలితాత్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అదిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ, మహా మంత్రాదిదేవతగా అమ్మను కొలిచిన భక్తులను అనుగ్రహిస్తుందని, దంపతులకు సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.మరోవైపు బెజవాడ దుర్గగుడి మహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. దుర్గగుడితో పాటు కొండప్రాంతాల్లో ఉన్న పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్ , బాంబు స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 

12:45 - October 13, 2018

ఢిల్లీ : ఏపీ ఎంపీలు...బీజేపీ ఎంపీల మధ్య వార్ ఎక్కువైంది. కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన తరువాత టీడీపీపై బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ఆ పార్టీకి చెందని ఎంపీ జీవీఎల్ ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను కలిశారు. అనంతరం పలువురు టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ బీరేంద్ర సింగ్‌పై పలు విమర్శలు గుప్పించారు. 
కడప ఉక్కు ఇస్తావా ఛస్తవా అడగడమేనని ఎంపీ జేసీ పేర్కొన్నారు. ఎక్కడో ఉత్తర్ ప్రదేశ్ నుండి బతకడానికి వచ్చిన జీవీఎల్ పాఠాలు చెబుతారా ? అని నిలదీశారు. అవగాహన లేని వారు భయపడుతారని...అవగాహన ఉన్న వారు భయపడరన్నారు. ఏపీలో కనీసం ఆధార్ కార్డు లేదని..ఎలాంటి అవాహన లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుండి ఎంపీగా తీసుకొచ్చారని..అక్కడ మాట్లాడాలని.. ఏపీలో ఆయన తలకాయ పెట్టకపోతే మంచిదన్నారు. జీఎస్ఈ రిపోర్టు..జీవీఎల్ రిపోర్టా ? అని ఎంపీ సీఎం రమేశ్ నిలదీశారు. జీవీఎల్ అబద్దాలు చెబుతున్నారరని..యూపీకి చెందిన వ్యక్తి ఏపీ విషయం గురించి మాట్లాడుతారా ? అంబోతును వదిలేసినట్లు వదిలేశారని విమర్శించారు. 

12:41 - October 13, 2018

ముంబయి: ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సేవలు నిరంతరంగా పొందాలంటే ఎస్బీఐ వినియోగదారులు తప్పనిసరిగా మొబైల్ నెంబరును మీ అకౌంట్‌కు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో డిసెంబర్ 1 నుంచి వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయని ఎస్బీఐ అధికారులు ప్రకటించారు.   
ఇప్పటికే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఈ మార్పు గురించి బ్యాంకు కస్టమర్లకు తెలియజేశారు. కస్టమర్లు తమ బ్యాంకు బ్రాంచికి వెళ్లి ఫోన్ నెంబరుని రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. మీ నెంబరును బ్యాంకు అకౌంట్కు రిజిస్టర్ చేసుకోని ఖాతాదారులు తక్షణం రిజిస్టరు చేసుకోవాలని ఎస్బీఐ స్పష్టం చేసింది.

 

12:32 - October 13, 2018

పూరీ జగన్నాధ్, వి.వి.వినాయక్.. ఇద్దరూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్సే.. ఒకప్పుడు వరస విజయాలు సాధించిన వారే, తమతో పని చేసిన హీరోలకి కెరీర్ బెస్ట్ ఫిలింస్ ఇచ్చినవారే.. కానీ, టైమెప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఫ్లాప్‌‌ల ప్రభావంతో స్పీడ్ తగ్గింది.. వినయ్, మెగాస్టార్‌తో ఖైదీ నంబర్ 150 హిట్ తర్వాత, సాయి ధరమ్ తేజ్‌తో చేసిన ఇంటిలిజెంట్ మూవీ చూసి, వినాయక్ ఇలాంటి చెత్త సినిమా ఎలా తీసాడబ్బా అని ఆడియన్స్ ఆశ్యర్యపోయారు..
నిర్మాత సి.కళ్యాణ్, వినాయక్ డైరెక్షన్‌లో బాలయ్యతో సినిమా ప్లాన్ చేసాడు కానీ, తన కథతో బాలయ్యని చెప్పించలేకపోయాడు వినాయక్.. ప్రస్తుతం పెద్ద హీరోల దగ్గరి నుండి మీడియం హీరోల వరకూ ఎవరికివారే బిజీగా ఉన్నారు.. వినాయక్ ఏమో వెయిటింగ్‌లో ఉన్నాడు..
పూరీది కూడా ఇదే పరిస్థితి.. అతను  మేకింగ్‌లో చూపించే స్పీడ్, సినిమాల్లో చూపించడం లేదు.. డైలాగ్స్‌తో అలరిస్తున్నా, కథలతో ఆకట్టుకోలేక పోతున్నాడు.. కొడుకుతో చేసిన మెహబూబా ఫ్లాప్ అవడంతో, పూరీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది.. శ్రీను వైట్లది కూడా దాదాపూ ఇదే పరిస్థితి .. రవితేజతో చేస్తున్న అమర్, అక్బర్, ఆంటోని రిజల్ట్‌పై శ్రీను తర్వాతి సినిమా సంగతి ఆధారపడి ఉంది.. కృష్ణవంశీ కూడా ఖాళీగానే ఉన్నాడు.. మెహర్ రమేష్ సంగతి చెప్పక్కర్లేదు.. వీళ్ళంతా తిరిగి ట్రాక్‌లోకి రావాలని కోరుకుందాం..

12:29 - October 13, 2018

ఢిల్లీ : ఏపీ ఎంపీలు కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం మరింత ఉధృతం చేశారు. గతంలో ఎంపీ సీఎం రమేశ్ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. సుమారు వంద రోజులైనా కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో శనివారం టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను కలిశారు. విభజన హామీలు అమలు చేయాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఈ విషయంపై క్లారీటీ ఇస్తామని బీరేంద్ర సింగ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి ఎదుట ఎంపీలు పలు ప్రతిపాదనలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి పరిశ్రమ ఏర్పాటు చేయడం..ప్రభుత్వాలు ప్రైవేటు ఏజెన్సీతో నిర్మాణం చేయడం...పూర్తి స్థాయిలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం..లాంటి ప్రతిపాదనలు చేశారు. మరి ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఒకే అంటుందా ? లేదా ? అనేది చూడాలి. 

12:22 - October 13, 2018

హైదరాబాద్:మియాపూర్ నుంచి అమీర్ పేట వెళుతున్న ఓ మెట్రోరైలు  బాలానగర్ స్టేషన్ లో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. అప్రమత్తమైన అధికారులు మరమ్మత్తు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది. బాలానగర్ స్టేషన్ లో ఒకమార్గంలో రైలు నిలిచిపోవటంతో  ఆమార్గంలో నడిచే ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరమ్మత్తులు పూర్తయ్యే వరకు అమీర్ పేట నుంచి బాలానగర్ వరకే రైళ్లు నడపనున్నట్లు అధికారులు  తెలిపారు. 

11:51 - October 13, 2018

విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాలు దక్కించుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమతప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ పలు విషయాలపై మాట్లాడారు. తాను విమర్శించే సమయంలో బీజేపీని వెనకేసుకొస్తున్నారంటున్నారని..ఇక్కడ తనకు బీజేపీ ఏమీ బంధువు కాదని..మోడీ తన అన్న కాడని...అమిత్ షా తన బంధువు కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని..అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని..తాను సమావేశానికి హాజరవుతానని..ఢిల్లీకి తీసుకెళితే ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడుదామన్నారు. కానీ హోదాపై భిన్నమైన వ్యాఖ్యలు చేయవద్దన్నారు. హోదాపై ముఖ్యమంత్రి ఎన్ని భిన్నమైన మాటలు మాట్లాడారో అందరికీ తెలిసిందేనన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్ బాధితులను తాను పరామర్శించకపోవడం బాధిస్తోందని కానీ అక్కడకు వెళితే సహాయక చర్యలకు ఆంటకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే వైజాగ్ వెళ్లి 17న శ్రీకాకుళంలో పర్యటన చేస్తామని, ఈ పర్యటనలో నాదెండ్ల మనోహర్ కూడా ఉంటారని వెల్లడించారు. నాదెండ్లవి..తనవి అభిప్రాయాలు ఒక్కటేనన్నారు. పార్టీ కోసం ఆయన సలహాలు..సూచనలు తీసుకొనేవాడినని, తప్పులు జరుగకూడదని..సరికొత్త రాజకీయం చేయాలని..బాధ్యతతో కూడుకున్న పనులు చేయడం..సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యం తమలో ఉందన్నారు. 
రాజకీయాల్లో కొత్తతరమైన నాయకత్వం తీసుకరావాలని ఉద్దేశ్యం..ఒక ధృడ సంకల్పం ఆయనలో ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇచ్చిన మాటకు నిలబడి ఉంటామని, రాష్ట్రం ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తాము పాటుపడుతామని వెల్లడించారు. 15వ తేదీ నిర్వహించే కవాతులో యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. 

11:20 - October 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి స్వైన్ ఫ్లూ విసురుతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ వ్యాధి బారిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. శనివారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు మృతి చెందడం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. 
ఫ్లూ లక్షణాలతో చాలామంది వివిధ ఆసుపత్రులలో చేరుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధిపేటకు చెందిన ఓ వృద్ధురాలు గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు గాంధీలో స్వైన్ ఫ్లూ లక్షణాలతో పలువురు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. చికిత్స పొందుతున్న వారితో ఆసుపత్రిలోని నోడల్ సెంటర్ నిండిపోయింది. దీనితో రోగులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

10:30 - October 13, 2018

మెగాస్టార్ చిరంజీవి, తన 151వ సినిమాగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా,  సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. ఈస్ట్‌ఇండియా కంపెనీ సైనికులకు, నరసింహా రెడ్డి బృందానికీ మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌కీ,  బిగ్‌బి అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లుక్‌కీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది.. ఇంతలోనే సైరా నుండి మరో కొత్త అప్‌డేట్ వచ్చింది.. దసరా సందర్భంగా సైరా నరసింహా రెడ్డి నుండి మరో టీజర్ రీలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది.. ఈ వార్త కనక నిజం అయితే,  పండగనాడు మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.. జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్న సైరాలో, కన్నడ నటుడు సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు..  

10:30 - October 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. గులాబీ పార్టీ నుంచి చాలా మంది పెద్దోళ్లు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే కొంత మంది ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరతారని చెప్పారు. మహాకూటమిలోని మిత్రపక్షాలతో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని, పొత్తులపై ఒకటి రెండురోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంతో కూడా చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 
ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదా సిద్ధమైందన్నారు. మహాకూటమి పేరు మారుతుందని, కూటమిలోని పార్టీలు ఉమ్మడిగానే ప్రచారం చేస్తాయని చెప్పారు. గెలిచే అవకాశం, సామాజిక న్యాయం ప్రాతిపదికనే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ప్రస్తుత సర్వే ప్రకారం మహాకూటమి 80కి పైగా స్థానాల్లో గెలవబోతోందని, టీఆర్ఎస్ 20 స్థానాలకే పరిమితమవుతుందని అన్నారు. 12 చోట్ల బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించామన్న ఉత్తమ్.. రెండు సభల్లో సోనియాగాంధీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. 

10:18 - October 13, 2018

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తూ, ప్రభుత్వంలోని అవకతవకలు ఎత్తి చూపుతూ నిత్యం జనంతో మమేకమై రోడ్ షోలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  విజయవాడ పార్టీ కార్యాలయాన్నిశనివారం ప్రారంభించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో  కలిసి  బెంజిసర్కిల్ లో  ఏర్పాటు  చేసిన కార్యాలయాన్నిఈఉదయం ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వనున్న జనసేన పార్టీలోకి ఇప్పటికే  ఇతర పార్టీల నుంచి నాయకుల వలసలు మొదలయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సరికి ఇంకెంత మంది జనసేన పార్టీలో చేరతారో వేచి చూడాలి.  

10:15 - October 13, 2018

హైదరాబాద్ : నగర మేయర్ బొంతు రామ్మోహన్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన సోదరి సునీత కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతోంది. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న సునీత వరంగల్‌‌లోని రాయపర్తి మండలం మెరిపారాలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సోదరి మరణవార్త తెలుసుకున్న మేయర్ రామ్మోహన్ వెంటనే వరంగల్‌కు చేరుకున్నారు. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి, స్థానిక పలువురు టీఆర్ఎస్ నేతలు సునీత భౌతికకాయానికి నివాళులర్పించారు. శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగున్నాయి. 

 

10:09 - October 13, 2018

విజయనగరం : తిత్లీ తుపాను కారణంగా ఆగిన వైస్ జగన్ పాదయాత్ర శనివారం తిరిగి ప్రారంభం కానుంది. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రజాసంకల్పయాత్ర 284వ రోజు కొనసాగనుంది. విజయనగరం జిల్లాలో తుపాను కారణంగా నిలిచిపోయిన పాదయాత్ర ఉదయం నైట్‌క్యాంపు నుంచి ప్రారంభం కానుంది. గజపతినగరం నియోజకవర్గంలోని మదుపాడు, భూదేవీపేట క్రాస్‌, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్‌, గుడివాడ క్రాస్‌, మనపురం, మనపురం సంత, కోమటిపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుందని  వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు.

 

09:55 - October 13, 2018

విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రి దసర శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజున అమ్మవారు లలితాత్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అదిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ, మహా మంత్రాదిదేవతగా అమ్మను కొలిచిన భక్తులను అనుగ్రహిస్తుందని, దంపతులకు సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.మరోవైపు బెజవాడ దుర్గగుడి మహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. దుర్గగుడితో పాటు కొండప్రాంతాల్లో ఉన్న పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్ , బాంబు స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 

 

09:39 - October 13, 2018

హైదరాబాద్ : వెస్టిండీస్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ మొదటి రోజు నువ్వా నే్నా అన్నట్లుగా సాగింది. మొదటి రెండు సెషన్లు టీమిండియా బౌలర్లు  ఆధిపత్యం సాధిస్తే..చివరి సెషన్ మాత్రం విండీస్ బ్యాట్స్ మెన్ పట్టుదల ప్రదర్శించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి  కరీబియన్లు 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేయగలిగింది. మొదటి టెస్టులో ఓటమి అనంతరం రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్ మెన్ పోరాట పటిమ కనబరిచారు. రెండు సెషన్లలోనే  రెండు వికెట్లు కోల్పోయినా..ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న  కరీబియన్స్ రెండు సెషన్లు పూర్తయ్యేసరికి  6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
ఆ తర్వాత మాత్రం వికెట్ మాత్రమే కోల్పోయి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. రోస్టన్ ఛేజ్ సిసలైన టెస్ట్ ఆటతీరు  ప్రదర్శించడంతో భారీ స్కోరు సాధించగలిగింది. 174 బంతులు ఆడిన  రోస్టన్ 7 ఫోర్లు ఒక సిక్స్‌తో సెంచరీకి రెండు పరుగుల దూరంలో  నాటౌట్‌గా మిగిలాడు. రెండో వైపు దేవేంద్ర బిషూ సింగిల్ డిజిట్ స్కోరుతో రెండో రోజుకు సిధ్దమయ్యాడు. చివరి సెషన్లో వికెట్లు పడగొట్టలేకపోవడంతో విండీస్ సేఫ్ సైడ్ స్కోరుతో మొదటి రోజు ముగించగలిగింది. ఇక ఫస్ట్ టెస్ట్ ఆడుతోన్న శార్దూల్ ఠాకూరే పది  బంతులు మాత్రమే వేసి గాయంతో పెవిలియన్‌కి పరిమితమయ్యాడు. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో మూడు వికెట్లు..రవిచంద్రన్ అశ్విన్‌కి ఒక వికెట్ దక్కింది.

09:30 - October 13, 2018

ఢిల్లీ : ప్రొ కబడ్డీ సీజన్‌ 6లో దబంగ్ ఢిల్లీ బోణి కొట్టింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో 41-37తో పుణెరి పల్టాను ఓడిచింది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్, గుజరాత్ ఫార్చూన్‌పై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 32-25 తేడాతో పై చేయి సాధించింది. హర్యానా స్టీలర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో...రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. పాయింట్లు సాధించేందుకు ఇరు జట్లు చెమటోడ్చాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో స్టీలర్స్ ఆధికత్య ప్రదర్శించినప్పటికీ...తర్వాత గుజరాత్ పుంజుకుంది. మొదటి హాఫ్ తర్వాత పుంజుకున్న హర్యానా స్టీలర్స్ జట్టు...32-25 తేడాతో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ పై విజయం సాధించింది.
స్టీలర్స్‌ స్టార్‌ రైడర్‌ మోను గోయత్‌ ఏడు పాయింట్లతో ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతడికి చక్కని సహకారాన్నిచ్చిన కుల్‌దీప్‌ సింగ్‌ కూడా ఏడు పాయింట్లు సాధించాడు. గుజరాత్‌ జట్టు సచిన్‌, ప్రపంజన్‌ కలిసి 17 పాయింట్లు రాబట్టారు.  స్టీలర్స్‌ రెండో అర్ధభాగంలోనూ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఐతే గుజరాత్‌ ప్లేయర్ ప్రపంజన్‌ వరుస రైడ్‌ పాయింట్లతో పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్టీలర్స్‌ ఆఖరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.
మరోవైపు ఈ సీజన్‌లో దబంగ్‌ దిల్లీ తొలి విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో 41-37తో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. 7 పాయింట్లు సాధించి.. ఢల్లీ విజయంలో నవీన్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. అతడికి.. చంద్రన్‌ రంజిత్‌,  విశాల్‌ మానె సహకరించారు. నితిన్‌ తోమర్‌ 20 పాయింట్లు స్కోర్‌ చేసినా పుణెరిని గెలుపు ముంగింట నిలబెట్టలేక పోయాడు. 

09:21 - October 13, 2018

హైదరాబాద్ : భారత్, వెస్టిండీస్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో అభిమానం హద్దులు దాటింది. ఆడియన్స్ గ్యాలరీ నుంచి స్టేడియంలోకి దూసుకొచ్చిన ఓ అభిమాని కొహ్లీతో సెల్ఫీ దిగేందుకు సాహసం చేశాడు. ఆతరువాత కొహ్లీని హత్తుకున్నాడు. ఈలోగా అక్కడకు చేరుకున్న స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది అభిమానిని బయటకు తీసుకెళ్లారు. అతడ్ని కడపకు చెందిన మహ్మద్ ఖాన్‌గా గుర్తించారు. నిబంధనలను అతిక్రమించినందుకు గాను అతనిపై.. 351, 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే.. విధుల్లో నిర్లక్ష్యంగా వహించారంటూ.. ఇద్దరు కానిస్టేబుల్స్, ఓ ఎస్ఐని సైతం సస్పెండ్ చేశారు అధికారులు.

 

09:05 - October 13, 2018

హైదరాబాద్‌ : టీడీపీ ఎంపి సీఎం రమేశ్‌ నివాసం, కార్యాలయంలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రిత్విక్‌ ప్రాజెక్ట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లోను సోదాలు చేస్తున్నట్లు, ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను,నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు హైదరాబాద్‌లోని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ నివాసం, కార్యాలయం, కడపలోని నివాసంలో ఏకకాలంలో దాడులు చేశారు. ఐటీ దాడులు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరుస బెట్టి ఈడీ, ఐడీ సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఐటీ దాడులు జరుగుతుండడం టీడీపీ వర్గాలు ఖండిస్తున్నాయి. 
సీఎం రమేశ్ సొంత గ్రామమైన కడప జిల్ల యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోనూ ఏకకాలంలో సోదాలు జరిపారు. ఒక్క హైదరాబాద్‌లో 60 మంది అధికారులు దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రమేష్ ఇల్లు, రుత్విక్ ప్రాజెక్టు. పై.లి., రిత్విక్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రిత్విక్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రిత్విక్‌ గ్రీన్‌పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కదిరి గ్రీన్‌పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గ్లోబల్‌ ఎర్త్‌ మినరల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రిత్విక్‌ అగ్రికల్చర్‌ ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల కార్యాలయాలతోపాటు ఆయా సంస్థల డైరెక్టర్లు, ఇళ్లూ, కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టారు. 
సాగర్ సొసైటీలోని అలాహాబాద్ బ్యాంకులో రమేష్ కంపెనీల పేర్ల మీద ఉన్న ఖాతాల్లో లావాదావీలను పరిశీలించినట్లు సమాచారం. రాజకీయ కక్షలో భాగంగా దాడులు చేస్తున్నారని సీఎం రమేష్ పేర్కొంటున్నారు. 

08:51 - October 13, 2018

హైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల ఆగడాలు శృతి మించుతున్నాయి. పీకలదాకా మద్యం సేవించి...ట్రాఫిక్ పోలీసులతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం-45లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు....ఇద్దరు యువకులు, ఓ యువతికి చుక్కలు చూపించారు. బ్రీతింగ్ ఎనలైజర్ టెస్టులు చేసేందుకు యత్నించిన కానిస్టేబుళ్లతో వాగ్వాదానికి దిగారు. వీడియోను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి పాల్పడ్డారు. 

 

08:46 - October 13, 2018

చిత్తూరు:తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్నరాత్రి ముత్యాల పందిరిలో ఇరువురు  దేవేరులతో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు 4వ రోజు శనివారం  కల్పవృక్షవాహనం పై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఇప్పటికే అన్ని ప్రత్యేక సేవలను నిలిపివేసింది. తిరువీధులు భక్తకోటి గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఈ రోజు రాత్రికి స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించునున్నారు. తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు కల్పవృక్షం పై స్వామివారు భక్తులకు దర్శనం  ఇవ్వనున్నారు. 

 

08:12 - October 13, 2018

చెన్నై:తమిళనాడులో రోడ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో అవకతకలు జరిగాయనే ఆరోపణలతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై సీబీఐ విచారణ జరపాలని చెన్నై హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రోడ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో రూ.4,800 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలతో డీఎంకే వ్యవస్ధాపక కార్యదర్శి ఆర్.ఎస్.భారతి గతంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌కి ఫిర్యాదు చేశారు. ఈకేసులో ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేకపోవటంతో ఆయన చెన్నై హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ స్వీకరించిన హైకోర్టు ఈకేసులో ముఖ్యమంత్రి పాత్రపై నిజానిజాలు తేల్చాలని సీబీఐని ఆదేశించింది. రాష్టంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యమంత్రే చూస్తున్నారు.  ఆశాఖ పిలిచిన టెండర్లలో ముఖ్యమంత్రి ఆశ్రిత పక్షపాతం వహించి కాంట్రాక్టులు అన్నీ తమ బంధువులకు, తన బినామీలకు ఇప్పించుకున్నారని డీఎంకే పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తూ వస్తోంది. ఈ కేసులో మూడు నెలల్లోగా ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసి నివేదిక అందించాలని హైకోర్టు  సీబీఐని ఆదేశించింది.

07:11 - October 13, 2018

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల తుది జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. జాబితాలో అన్ని రకాల సవరణలు తర్వాత 2,73,28,054 మంది ఓటర్ల తో ఉన్న లిస్టును శుక్రవారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపగా కేంద్ర ఎన్నికల సంఘం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమోదం తెలిపింది, వీరిలో 1,37,87,920 మంది పురుషులు కాగా 1,35,28.020 మంది స్త్రీలు ఉన్నారు. వీరు కాకుండా  2,663 మంది ట్రాన్స్ జెండర్స్, 9,451 మంది  సర్వీసు ఓటర్లు ఉన్నారు
కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన తుది జాబితాను ఆన్ లైన్ లో అన్ని జిల్లా కలెక్టర్లకు పంపారు. ఈనెల 8 న ఓటర్ల లిస్టు తుది జాబితా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కోర్టు కేసుల కారణంగా ఆలశ్యం అయ్యింది. తుది జాబితాను రూపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈఆర్వో నెట్ పేరుతో కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. ప్రస్తుతం ఎన్నికలు  నిర్వహిస్తున్న 5 రాష్ట్రాల్లో ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి నకిలీ  ఓటర్లను ఏరివేసారు. ఒకే పేరుతో ఉన్న వారిని, ఒకే ఫోటోతో వేర్వేరు పేర్లతో ఉన్న వారిని 100 ఏళ్లు దాటిన వారిని ఈ సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ను  జనన మరణ రిజిష్టర్ కు అను సంధానం చేయటంతో ఇప్పటికే మరణించిన 2,68,365 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. 
ఓటర్లలిస్టు లో పేర్లు తొలగించారని ఇప్పటికే విపక్షాలు కోర్టుకు వెళ్లిన నేపధ్యంలో  రాష్ట్ర ఎన్నికల  సంఘం అధికారులు అనేక వడపోతల మధ్య అత్యంత  జాగ్రత్తగా తుది జాబితాను  రూపోందించారు. ఈ తుది జాబితాలో ఇంకేమైనా తప్పొప్పులు ఉన్నయా అనేది ఓటర్ల జాబితా ముద్రించాకే తెలుస్తుంది.ఏది ఏమైనా తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాత్రి ఆమోదించడంతో రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చింది.

Don't Miss