Activities calendar

14 October 2018

22:04 - October 14, 2018

చైనా : సాధారణంగా శునకాలు, పిల్లుల లాంటి పెంపుడు జంతువులతో చిన్నారులు స్నేహం చేస్తారు. కానీ ఓ బాలిక ఏకంగా చిరుత పులి పిల్లతో స్నేహం చేస్తోంది. ఈ వింత చైనాలో చోటుచేసుకుంది. 

చైనాలో జియావోజింగ్‌ (9) అనే బాలిక తండ్రి ఫుజియాన్‌ ప్రాంతంలోని జూలో పని చేస్తాడు. దీంతో ఆమె తరుచూ జూకి వెళ్లి ఆడుకునేది. అందులోని ఓ చిరుత పిల్ల మూడు నెలల క్రితం ఓ పులి పిల్లకి జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే దానితో ఆ బాలిక స్నేహాన్ని పెంచుకుంది. ఆమెను చూడగానే ఆ పులిపిల్ల గంతులేస్తూ వచ్చేస్తోంది. దాన్ని తీసుకుని ఆ బాలిక జూ పరిసరాల్లో వాకింగ్‌కు వెళుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘నా కూతురు ఆ పులిపిల్లకి పాలసీసాతో పాలు పడుతుంది.. స్నానం చేయిస్తుంది.. దానితో ఆడుకుంటుంది’ అని బాలిక తండ్రి మీడియాకు తెలిపారు.

 

21:52 - October 14, 2018

ముంబై: మద్యం హోం డెలివరీ చేసే విధానంపై మహారాష్ట్ర సర్కార్ వెనక్కి తగ్గింది. ప్రజలు, సామాజిక కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మద్యం హోం డెలివరీ చేసే విధానాన్ని విరమించుకుంది. మద్యం ప్రియుల ఇంటికే మధ్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 

కాగా, మద్యపానం కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.., ఇకపై మద్యం ప్రియులకు నేరుగా ఇంటికే మద్యాన్ని డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఈ విధానం ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే పేర్కొన్నారు. ప్రజలు తాగి వాహనాలు నడుపుతున్నారని, ఫలితంగా రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి వివరించారు. వీటిని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసినట్టు తెలిపారు. అచ్చం ఈ-కామర్స్ సంస్థల్లానే తాము మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. మద్యాన్ని డోర్ డెలివరీ చేయడం వల్ల కల్తీ మద్యం, అక్రమ రవాణాను అరికట్టే వీలుందని మంత్రి తెలియజేశారు. అయితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది.

21:43 - October 14, 2018

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో మొదటి సారిగా జనసేన కవాతు కార్యక్రమం నిర్వహించనున్నారు. పవన్ ఈనెల 15న విజ్జేశవరం మీదుగా పిచ్చుకలంకకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ కవాత్ నిర్వహించనున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కవాతు కోసం జనసైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

21:15 - October 14, 2018

కృష్ణా : జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. కొండపల్లి గ్రామంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదు అయింది. ప్రజలు భయంతో ఒక్కసారిగా ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించిదని..చిన్నలు, పెద్దలు భయభ్రాంతులకు గురయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చాయని చెప్పారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. 

 

21:09 - October 14, 2018

ముంబై: మీటూ(#Me Too) ఉద్యమం మంటలు చల్లారడం లేదు. బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తమను వేధించిన సహోద్యోగులు, బాస్‌ల పేర్లు నిర్భయంగా వెల్లడిస్తూ వారి బండారం బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పెద్దలు, ప్రముఖులు మీటూ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత సుభాష్‌ ఘాయ్‌ సైతం ఈ లిస్టులో మరోసారి చేరిపోయారు. సుభాష్ ఘాయ్‌పై నటి, మోడల్ కేట్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బలవంతంగా కౌగిలించుకోవడంతోపాటు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.
 
‘‘ఆగస్టు 6న సుభాష్ ఘయ్ నన్ను ఇంటికి రమ్మని పిలిచాడు. అప్పటికే అక్కడ ఐదారుగురు వ్యక్తులు ఉన్నారు. నన్ను పిలిచి మర్దన చేయాల్సిందిగా కోరాడు. నేను ఒక్కసారిగా షాకయ్యా. అయితే, ఆయన సీనియారిటీని గుర్తు చేసుకుని అందుకు అంగీకరించా. రెండుమూడు నిమిషాలపాటు మర్దన చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు వాష్ రూముకు వెళ్లా. నా వెనకాలే వచ్చి నాతో మాట్లాడాల్సి ఉందని చెప్పి అతడి రూముకు తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లాక నన్ను లాగి కౌగిలించుకోబోయాడు. ముద్దు పెట్టాలని ప్రయత్నించాడు. వదిలేయమని ప్రాధేయడితే బెదిరించాడు. నేను చెప్పినట్టు వింటే ఇండస్ట్రీకి పరిచయం చేస్తా. లేకపోతే నీకు మరో అవకాశం లేదు’’ అని బెదిరించాడని కేట్ పేర్కొన్నారు.
 
కేట్ శర్మ ఫిర్యాదుపై సుభాష్ ఘాయ్ స్పందించారు. తన పరువు ప్రతిష్ఠలను దిగజార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తన లాయర్లే అంతా చూసుకుంటారని ఆయన ట్వీట్ చేశారు. అయితే తనపై చేసిన ఆరోపణలను కనుక నిరూపించకుంటే పరువునష్టం కేసు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేట్ శర్మను హెచ్చరించారు. 

కాగా, సుభాష్ ఘాయ్‌పై గతంలోనూ లైంగిక ఆరోపణలు వచ్చాయి. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా ఇప్పుడు కేట్ కూడా అటువంటి ఆరోపణలే చేసింది. 

అయితే గతంలో తనపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకోని సుభాష్.. మీటూ ఉద్యమం ఫ్యాషనైపోయిందని పేర్కొన్న కొన్ని గంటలకే కేట్ శర్మ ఫిర్యాదు చేయడం గమనార్హం. 

సుభాష్ ఘాయ్‌తో పాటు అలోక్‌నాథ్, కైలాష్ కేర్, రజత్ కపూర్, సాజిద్ ఖాన్, వికాస్ బెహెల్ తదితర బాలీవుడ్ ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్నారు. మీటూ ఉద్యమంతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాలీవుడ్.. కేట్ ఫిర్యాదుతో మరింత వేడెక్కింది.

20:40 - October 14, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్‌ను గద్దే దించే లక్ష్యంతో ఏర్పాటైన మహాకూటమిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జన సమితికి తెలంగాణ కాంగ్రెస్ ఆంక్షలు విధించింది. కోదండరామ్‌కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. కోదండరామ్‌ను ఎన్నికల్లో పోటీచేయొద్దన్న కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ జన సమితి అభ్యర్థులు కూడా హస్తం గుర్తుపైనే పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా కూటమి తరపున ప్రచారం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. 

 

20:13 - October 14, 2018

లండన్: దేశ ప్రధాని మారినా పాకిస్థాన్ ఆర్మీ బుద్ధి మాత్రం మారలేదు. భారత్ ను తమ మాటలతో కవ్వించే ప్రయత్నం చేసింది. మరోసారి భారత్ ను రెచ్చగొట్టే విధంగా పాక్ ఆర్మీ వ్యవహరించింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తలతోపాటు మాటల యుద్ధం నడుస్తోంది. ఇది చాలదన్నట్టు తాజాగా పాక్ ఆర్మీ ఇండియాను హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. భారత్ ఒక్క సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. ప్రతిగా తాము అలాంటివి పది దాడులు చేస్తామని పాక్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పాక్ మిలిటరీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఏదైనా సాహసం చేసేముందు పాకిస్థాన్ సైనిక బలగాన్ని, తమ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని గఫూర్ హెచ్చరించారు. పాకిస్థాన్ సామర్థ్యంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందన్న ఉద్దేశంతోనే 5 వేల కోట్ల డాలర్ల చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌కు పాక్ సైన్యం రక్షణగా ఉందని గఫూర్ వివరించారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్నదని, జులైలో జరిగిన ఎన్నికలు పాక్ చరిత్రలో అత్యంత పారదర్శకంగా జరిగినవని ఛెప్పుకొచ్చారు. ఇక పాక్ లో మీడియాకు స్వాతంత్ర్యం లేదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, తమ దేశంలో ప్రసార మాధ్యమాలకు పూర్తి స్వాతంత్ర్యం ఉందని గఫూర్ స్పష్టం చేశారు. కాగా, పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చేసిన కటువు వ్యాఖ్యలు భారత్ ను రెచ్చగొట్టేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

19:51 - October 14, 2018

హైదరాబాద్ : ప్రతిపక్షాలపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కూటములు కట్టినా టీఆర్ఎస్‌ను ఓడించలేరని స్పష్టం చేశారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్‌ది అన్నారు. తెలంగాణ ప్రజల తరపున నిలబడేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని తేల్చి చెప్పారు. రాష్ట్రం బలంగా ఉండడం కోసం సత్తెన్న బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరడం నిజాంగా చాలా సంతోషంగా ఉందన్నారు. సత్తెన్న కార్మిక బంధు, కార్మిక నాయకుడని కొనియాడారు. ఈమేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడారు.

రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు, రాజీనామాలు చేశామన్నారు. కేంద్రమంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను గడ్డిపోసల్లాగా త్యాగం చేసి.. ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్‌ది అన్నారు. 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి.. ఢిల్లీని కదిలించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. త్యాగాల పునాదుల మీద టీఆర్ఎస్ నిలబదిందన్నారు. పోరాటాల మీద తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. ఇలాంటి తెలంగాణ టీఆర్ఎస్, కేసీఆర్ చేతుల్లో ఉండడమే న్యాయమవుతుందన్నారు.
 
రాష్ట్ర విభజన ఇంకా పూర్తి కాలేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఆస్తుల పంపకాలు, నదీ జలాల పంపకం, ప్రభుత్వరంగ సంస్థల విభజన, అసెంబ్లీ విభజన, సచివాలయ విభజన, హైకోర్టు విభజన పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఇవ్నన్ని జరిగే క్రమంలో తెలంగాణ ప్రజల తరపున నిలబడే నిఖార్సైన, ఖచ్చితమైన మనిషి కేసీఆర్ అని పేర్కొన్నారు. 

ఆంధ్రాలో ఓట్లు పోతాయని బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణ వైపు నిలబడలేవన్నారు. ఇక టీడీపీ పక్కా ఆంధ్రా పార్టీ.. అది తెలంగాణ వైపు నిలబడుతుందని ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల తరపున నిలబడేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎందుకంటే మనకు పోరాటాలు, త్యాగాలు చేసిన చరిత్ర ఉందన్నారు. ’మనకు ఆంధ్రాలో ఓట్లు అవసరం లేదు, సీట్లు అవసరం లేదు. మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’ అని అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే టీఆర్ఎస్ పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల పార్టీగా, ఇంటి పార్టీగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ అన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమే రాష్ట్రానికి మేలు చేయగల్గుతాడని ధీమా వ్యక్తం చేశారు.

జాతీయ పార్టీలవి అవకాశవాద రాజకీయాలని విమర్శించారు. ఢిల్లీలో అధికారం కోసం, నాలుగు ఎంపీ సీట్ల కోసం ఎంతకైనా పోయేటటువంటి మనస్తత్వం జాతీయపార్టీలకు ఉంటుందని ఎద్దేవా చేశారు. 

19:21 - October 14, 2018

ఢిల్లీ: దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు తమలో తాము కుమిలిపోయిన బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా ప్రపంచం ముందు ఉంచుతున్నారు. బడా బాబుల ముసుగులో చెలామణీ అవుతున్న వ్యక్తుల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటికే ఎందరో ప్రముఖుల బండారం బయటపడింది. కాగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ ను సైతం మీటూ ఉద్యమం తాకింది. ఆయనపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొన్ని రోజులుగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ ఎట్టకేలకు లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని, నిరాధారమైనవని ఆయన అన్నారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఇలాంటి వాటిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. వీటిపై తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న ఎంజే అక్బర్‌ ఈ ఉదయం ఢిల్లీకి వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న అక్బర్‌ను మీడియా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే దీనిపై తాను తర్వాత మాట్లాడతానని అక్బర్‌ చెప్పారు. తాజాగా  ఆరోపణలపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం, కల్పితం. అసూయతోనే నాపై నిందలు వేస్తున్నారు. నేను విదేశీ పర్యటనలో ఉండటంతో ఈ ఆరోపణలపై స్పందించలేదు. కానీ ఇప్పుడు వీటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. భవిష్యత్‌ కార్యాచరణ ఏంటనేది నా లాయర్లు నిర్ణయిస్తారు’ అని అక్బర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక అజెండా ఏంటి? అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాని అక్బర్‌ అన్నారు. తన పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘నేను స్విమ్మింగ్‌ పూల్‌లో పార్టీ చేసుకుంటానని ఒకరు అన్నారు. కానీ నాకు ఈత కొట్టడమే రాదు’ అని అక్బర్‌ తెలిపారు. అయితే రాజీనామా వార్తలపై ఎంజే అక్బర్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో అక్బర్ తన పదవి నుంచి తప్పుకోవట్లేదని సమాచారం.

అక్బర్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 80వ దశకంలో టెలిగ్రాఫ్, ఏషియన్ ఏజ్ పత్రికల్లో ఎడిటర్ గా పనిచేసే సమయంలో ఆయన లైంగిక దాడులకు పాల్పడినట్లు  దాదాపు 10 మంది మహిళలు సోషల్ మీడియాలో అక్బర్ పై ఆరోపణలు చేశారు.  2017లో ప్రియారమణి అనే మహిళా జర్నలిస్టు మీటూ ఉద్యమానికి మద్దతుగా ఒక పత్రిక ఎడిటర్ తనపై ఏ రకంగా లైంగిక వేధింపులకు గురిచేశారో వివరిస్తూ ఒక ఆర్టికల్ రాశారు. ఇటీవలే ఆ ఎడిటర్ అక్బరే నని ఆమె తన ట్విట్టర్ లో పేర్కోన్నారు, ప్రియారమణి ట్విట్టర్ లో మెసేజ్ ను చూసి మరో 9 మంది మహిళా జర్నలిస్టులు అక్బర్ తమను ఏ రకంగా లైంగిక వేధింపులకు గురి చేసింది ధైర్యంగా బయట పెట్టారు. దాంతో అక్బర్ చిక్కుల్లో పడ్డారు.

18:31 - October 14, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీ పర్యటన ఖరారు అయింది. ఈనెల 20న రాష్ట్రంలో రాహుల్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగ సభలలో రాహుల్‌గాంధీ పాల్గొనన్నారు.

ఈనెల 20న ఉయదం 11 గంటలకు చార్మినార్‌లో, మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా బైంసాలో, సాయంత్రం 4.45 గంటలకు కామారెడ్డిలలో నిర్వహించే బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొని, ప్రసంగించనున్నారు. రేపు సభా ఏర్పాట్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా పరిశీలించనున్నారు. 

 

18:23 - October 14, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, విపక్షాల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసిందని, భారీగా నిధులు ఇచ్చిందని.. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఏమీ ఇవ్వలేదని అబద్దాలు చెబుతున్నారని అమిత్ షా ఆరోపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆరోపణలకు టీఆర్ఎస్ నేత కవిత ఘాటుగా బదులిచ్చారు.  

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కవిత మండిపడ్డారు. కేంద్రం ఈ నాలుగేళ్లలో తెలంగాణకు రెండున్నర లక్షల కోట్లు ఇచ్చారని అమిత్ చెప్పారని, కానీ ఇచ్చింది కేవలం రూ.900 కోట్లని కవిత స్పష్టం చేశారు. అమిత్ షా మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. ఇలానే అబద్ధాలు చెబితే.. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఐదు స్థానాలు ఉన్నాయని, త్వరలో జరిగే ఎన్నికల్లో ఆ ఐదు స్థానాలను కూడా కోల్పోవడం ఖాయమని కవిత హెచ్చరించారు. అమిత్ షా లెక్కలు చెబితే.. లెక్కల మాస్టర్లు సూసైడ్ చేసుకుంటారని కవిత ఎద్దేవా చేశారు. అమిత్ షాకు ఎన్నిసార్లు చెబుతాం, ఆయన్ని ఏమన్నా అంటే, ఇక్కడి బీజేపీ వాళ్లు గింజుకుంటారని కవిత వ్యాఖ్యానించారు.

17:46 - October 14, 2018

 

హైదరాబాద్: ఉప్పల్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై భారత జట్టు విజయభేరి మోగించింది. ఈ గెలుపుతో కోహ్లి సేన సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టెస్టు మ్యాచ్ విరాట్ సేన మూడు రోజుల్లోనే ముగించడం విశేషం. విండీస్ విధించిన 72పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు వికెట్ నష్టపోకుండా 16.1 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. 
తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులు చేసి 56 రన్స్ లీడ్ సాధించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను కేవలం 127 పరుగులకే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి విండీస్ వెన్నువిరిచాడు. టెస్ట్ కెరీర్‌లో పది వికెట్లు తీయడం ఉమేష్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. జడేజా 3, అశ్విన్ 2 వికెట్లతో రాణించారు. 

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు పృథ్వీ షా, కేఎల్ రాహుల్ ఈజీ విక్టరీ సాధించి పెట్టారు. పృథ్వీ 33, రాహుల్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 272 పరుగులతో భారత క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించిన కోహ్లి సేన.. రెండో టెస్ట్‌లో 10 వికెట్లతో గెలవడం విశేషం. ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఓపెన‌ర్ పృథ్వీ షా మొత్తం 237 ప‌రుగులు చేశాడు. తొలి టెస్ట్‌లోనే సెంచరీతో కదం తొక్కిన పృథ్వీ(134).. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 70, రెండో ఇన్నింగ్స్‌లో 33 ప‌రుగులు చేశాడు.

అంతకుమందు భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్స్‌ బెంబేలెత్తిపోయారు. వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో విండీస్‌కు ఉమేశ్‌యాదవ్‌ భయం పట్టుకుంది. అతడి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నాలుగు కీలక వికెట్లు తీశాడు. ఆదివారం భోజన విరామం అనంతరం విండీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను ప్రారంభంలోనే భారత బౌలర్లు దెబ్బకొట్టారు. 0.2 ఓవర్లో ఉమేశ్ యాదవ్‌ వేసిన బంతికి ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ కైరన్‌ పోవెల్‌ సైతం 3.3 ఓవర్లో అశ్విన్‌ వేసిన బంతికి డకౌట్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఇక అక్కడ నుంచి విండీస్ వికెట్ల పతనం మొదలయ్యింది. టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయిన విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత విండీస్ కోలుకోలేకపోయింది. చివరకు 46.1 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్‌ అయింది.

సొంతగడ్డపై కోహ్లి సేనకు ఇది వరుసగా పదో టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. 

17:20 - October 14, 2018

హైదరాబాద్ : దసరా పండుగకు నాలుగు రోజుల ముందు నుంచే టీఎస్ఆర్టీసీ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తోంది. సాధారణ బస్సు సర్వీసులకు కూడా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. కండక్టర్లు టికెట్ పై రూ.35 అదనంగా వసూలు చేస్తున్నారు. పండుగ రద్దీని ఆర్టీసీ క్యాష్ చేసుకుంటుంది.  

ప్రత్యేక బస్సు సర్వీసులకు మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సివుంది. కానీ సాధారణ బస్సు సర్వీసులకు కూడా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన ప్రయాణికులపై సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదం నెలకొంటుంది. టికెట్ పై రూ.35 అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. 

17:18 - October 14, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల లేటెస్ట్ సెన్షేషన్.. అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రపంచవ్యాప్తంగా, అన్నిధియేటర్స్‌‌లో సందడి చేస్తోంది.. ఇప్పటికే ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ మార్క్ దాటేసింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హౌస్‌‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతూ, కొన్నిఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, అరవింద సమేత సాధించిన త్రీ డేస్ కలెక్షన్స్   వివరాలు తెలిసాయి.. 
నైజాం : 11.16కోట్లు, సీడెడ్ : 9.13కోట్లు, నెల్లూరు : 1.55కోట్లు, గుంటూరు : 5.44కోట్లు, తూర్పుగోదావరి : 3.64కోట్లు, పశ్చిమగోదావరి : 2.99కోట్లు, ఉత్తరాంధ్ర : 4.77కోట్లు... టోటల్ 41.70 కోట్లు... ఇవి, ఆంధ్ర, తెలంగాణలో అరవింద సమేత మూడు రోజుల షేర్ వివరాలు... 
 

16:48 - October 14, 2018

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.. చరణ్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. రీసెంట్‌గా ట్విట్టర్‌లో ఆమె ఒక పిక్ అప్‌లోడ్ చేసింది..  ఉపాసన అప్‌లోడ్ చేసిన ఆ పిక్ చూసి అందరూ.. షాక్‌తో కూడిన సర్ ప్రైజ్‌కి గురవుతున్నారు..
ఇంతకీ ఆ ఫోటో స్టోరీ ఏంటంటే, రంగస్ధలం‌లో రామ్ చరణ్, నటనతోపాటు అతని గెటప్‌కి కూడా మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.. ఉపాసన ఒక పక్క చిట్టిబాబు ఫోటో, దాని పక్కనే ఆమె కర్రకి మోచేతిని ఆనించి నిలబడిన ఫోటో పెట్టి, చరణ్ పిక్‌కి రీల్‌లైఫ్ అనీ, తన పిక్‌కి రియల్ వైఫ్ అని క్యాప్షన్స్ పెట్టింది.. పనిలో పనిగా ఈ రోజు సాయంత్రం టి.వి.లో రంగస్ధలం మూవీ వస్తుంది, చూసెయ్యండని చెప్పింది మిసెస్ చెర్రీ..

16:25 - October 14, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాన్ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది. తిత్లీ వల్ల పలువురు మృతి చెందారు. తుపాన్ తో అపార నష్టం వాటిల్లింది. తిత్లీ తుపాను దెబ్బ నుంచి ఉద్దానం వాసులు తేరుకోలేదు. కరెంట్ లేకపోవడంతో నాలుగు రోజులుగా పలు గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 180 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. తాగేందుకు నీరు లేదని బాధితులు వాపోతున్నారు. 

 

16:00 - October 14, 2018

గుంటూరు : జిల్లాలోని దొంగలు రెచ్చిపోయారు. చిలకలూరిపేటలో దోపిడీకి పాల్పడ్డారు. బగారం, నగదుతో ఉడాయించారు. చిలకలూరిపేటలో రాచుమల్లు నగర్ లోని సిద్దాబత్తుని వెంకట రమణ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వారి కళ్లలోకి కారం కొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 12 సవర్ల బగారం, 52 వేల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు.

 

15:56 - October 14, 2018

హైదరాబాద్: ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, సంస్థలపై ఐటీ దాడులు జరగడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఆ మధ్యన నెల్లూరులో టీడీపీకి చెందిన బీదా సోదరుల సంస్థలపై దాడులు చేసిన అధికారులు కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ రంగంలోకి దిగారు. ఈసారి సీఎం చంద్రబాబు నాయుడికి సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇళ్లు, సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అటు కడప జిల్లాలోని సొంతూరుతో పాటు ఇటు హైదరాబాద్‌లోని సీఎం రమేష్‌కు చెందిన ఇళ్లు, సంస్థలలో అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థలో అధికారులు చాలాసేపు సోదాలు జరిపి పలు ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఐటీ దాడులపై సీఎం రమేష్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. 'అధికార పార్టీతో పెట్టుకుంటే ఇలాంటి దాడులే జరుగుతాయని మీకు తెలియదా?' అని తనిఖీలకు వచ్చిన ఓ అధికారి తమ ఆఫీసు సిబ్బందిని హెచ్చరించినట్టు సీఎం రమేష్ మీడియాతో చెప్పారు. తన వద్ద, తన భార్య వద్ద మాట్లాడే ధైర్యం లేకనే ఆ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న తాను ఉన్నతాధికారికి ఫోన్ చేసి సదరు అధికారి చేసిన వ్యాఖ్యల గురించి చెప్పానని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన అధికారి పేరు ‘మదన్’ అని తెలిపారు.

‘మీ బాస్‌లకు చెప్పండి.. అధికార పార్టీకి అనుకూలంగా వెళ్లమనండి. వ్యతిరేకంగా చేస్తే ఇలానే జరుగుతుంది. మీకు ఆ మాత్రం అర్థం కాదా? హైదరాబాద్‌లో ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల పనులు చేస్తున్నారో మీకు తెలియదా? వాళ్లకు ఏమన్నా జరుగుతున్నాయా? మీకే ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇలాంటి దాడులు తప్పవు' అని అధికారి మదన్ తమ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారని సీఎం రమేష్ తెలిపారు.

కాగా, ఐటీ దాడులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదని సీఎం రమేష్ తేల్చి చెప్పారు. ఈ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని అన్నారు. పార్లమెంటులో ప్రశ్నించినందుకే తన నివాసాలపై ఐటీ దాడులు జరిగాయని, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.  అధికారం ఉందని చెప్పి ఒత్తిడి చేసి తమను లొంగదీసుకోవాలని చూస్తారా? అని కేంద్రంపై రమేష్ విరుచుకుపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేంద్రానికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని ఈ ఐటీ దాడుల వ్యవహారంపై జాతీయస్థాయిలో పోరాటం చేస్తానని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.

15:55 - October 14, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 అనంతరం నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది షూటింగ్‌లో ఉండగానే మరో చిత్రానికి చిరు కన్ఫామ్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ మరలా ఈ సినిమాను నిర్మించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా ప్రధానంగా రైతులు..వ్యవసాయ నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఈ చిత్రంలో చిరంజీవి సరసన అనుష్క లేదా తమన్నాలతో నటింప చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘రైతు’ అనే టైటిల్ పెట్టాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిగురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

15:46 - October 14, 2018

అరవింద సమేత వీర రాఘవ మూవీ, ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ని టచ్ చేసి, ఎన్టీఆర్ గత చిత్రం జైలవకుశని, బీట్ చేసిన సంగతి తెలిసిందే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హౌస్‌‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతూ, కొన్నిఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్‌నెలకొల్పింది.. ఇప్పుడు మరో అరుదైన రికార్డ్‌ని యంగ్ టైగర్ సొంతం చేసుకున్నాడు..
అరవింద సమేత వీర రాఘవ ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ మార్క్‌‌ని చేరుకుంది.. ఇప్పటివరకూ.. తారక్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాలు వరసగా 1.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసాయి.. అరవింద సమేత వీర రాఘవ‌తో నాలుగోసారి ఈ ఘనత సాధించింది ఒక్క యంగ్ టైగర్ మాత్రమే.. సౌత్‌‌లో తారక్‌కి తప్ప ఇంకెవరికీ ఇది సాధ్యం కాలేదు.. తారక్ కెరీర్‌లో ఇప్పటి వరకూ ఒక్క నాన్నకు ప్రేమతో మాత్రమే ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.. ఇదే జోష్ కొనసాగితే, అరవింద సమేత వీర రాఘవ, నాన్నకు ప్రేమతో రికార్డ్‌ని బీట్ చెయ్యడం ఖాయం... 

15:38 - October 14, 2018

కరీంనగర్ : గత కొంతకాలంగా స్తబ్ధంగా ఉన్న మావోయిస్టులు ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపాయి. జిల్లాలోని కోల్ బెల్ట్ ఏరియాలో మావోయిస్టుల లేఖలు సంచలనం కల్గిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు బహిష్కరించాలంటూ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల లేఖలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం చెన్నూరు, బెల్లంపల్లి అభ్యర్థులకు భద్రతను పెంచారు.

ఇటీవలే ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమలను మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన ఏపీలో సంచలనం సృష్టించింది. నిన్న ఏవోబీ సరిహద్దులో మావోయిస్టులు ల్యాండ్ మైనింగ్ పేల్చారు. ఛత్తీస్ గఢ్ లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. కాగా మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవానుకు గాయాలు అయ్యాయి. 

 

15:21 - October 14, 2018

ఢిల్లీ: అతడు సెక్యూరిటీ ఆఫీసర్. రక్షణగా ఉండటం అతడి బాధ్యత. ఉన్నతాధికారిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఆ సెక్యూరిటీ ఆఫీసరే కాలయముడయ్యాడు. నమ్ముకున్న వారి ప్రాణాలు తీయబోయాడు. వారిని తుపాకీతో కాల్చి చంపబోయాడు. దేశ రాజధాని ఢిల్లీలోని గురుగ్రామ్‌లో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్లుగా ఓ న్యాయమూర్తి వద్ద సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న మహిపాల్ సింగ్ అనే వ్యక్తి, నడిరోడ్డుపై న్యాయమూర్తి భార్య, కుమారుడిపై కాల్పులు జరిపాడు. ఆ వెంటనే జడ్జికి ఫోన్ చేసి "నీ భార్య, కుమారుడిని కాల్చాను" అని చెప్పాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రీతూ, ధ్రువ్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ ఆఫీసరే కాల్పులు జరిపిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

అదనపు సెషన్స్ న్యాయమూర్తి కిషన్ కాంత్ శర్మ వద్ద మహిపాల్ సెక్యూరిటీగా ఉన్నాడు. న్యాయమూర్తి భార్య రీతూ (38), కుమారుడు ధ్రువ్ (18) షాపింగ్‌కు వెళ్లిన వేళ, భద్రత కోసం మహిపాల్ కూడా వెళ్లాడు. ఇంతలో ఏమైందో కానీ మహిపాల్ ఉన్మాదిగా మారాడు. న్యాయమూర్తికి ఫోన్ చేసేందుకు క్షణాల ముందు వారిద్దరిపైనా మహిపాల్ కాల్పులు జరిపాడు. మహిపాల్ అతని సర్వీస్ రివాల్వర్‌తోనే కాల్పులు జరిపాడని, చాలా దగ్గరి నుంచి కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిపాల్‌ను అరెస్ట్ చేశారు. కాల్పులు ఎందుకు జరిపాడన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా లీవ్ ఇవ్వకపోవడం వల్లే మహిపాల్ ఆగ్రహానికి కారణం అని, ఆ కోపంతోనే అతడు ఇలా చేసి ఉంటాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.

15:11 - October 14, 2018

హైదరాబాద్ : నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌లో సుమారు 100 స్టాళ్లను  ఏర్పాటు చేశారు. సంప్రదాయ కొర్రలు, సామలు లాంటి చిరుధాన్యాలు, వాటితో తయారు చేసిన వంటకాలు నోరూరిస్తున్నాయి బతుకమ్మ వేడుకల సందర్భంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఏసీ వాతావరణంలో శుచి, శుభ్రం, హైజినింగ్  ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచామన్నారు. సకినాలు, గారెలు, వడలు, అరిసలు ఇలాంటి పిండి వంటలతో పాటు జొన్నరొట్టెలు, బిర్యానీ, పాయా ఇలా నాన్ వెజ్ ఐటెమ్స్‌ను కూడా సిద్ధం చేసి ఉంచారు.

 

15:05 - October 14, 2018

ఇండియన్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 12లో పార్టిసిపెట్ చేస్తున్నాడు.. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా కెరీర్ నాశనం చేసుకున్న శ్రీశాంత్  ఆ మధ్య హీరోగా కూడా ట్రై చేసాడు.. ఇప్పుడితగాడి టాపిక్ ఎందుకొచ్చింది, కొంపదీసి మీ టూ‌లో శ్రీశాంత్ మీద ఏమైనా ఆరోపణలొచ్చాయా అనుకుంటున్నారా? అక్కడే ఆగండి.. 
ఇప్పుడు శ్రీశాంత్ పేరు తీసింది ఎవరోకాదు.. అతని మాజీ ప్రేయసి, పవన్ కళ్యాణ్ సరసన పులి సినిమాలో నటించిన నికిషా పటేల్.. శ్రీశాంత్ తనతో ఏడేళ్ళపాటు ప్రేమాయణం కొనసాగించి, తర్వాత భువనేశ్వరిని పెళ్ళాడాడనీ, పెళ్ళికి ముందు వరకూ నాతో డేట్ లో ఉండి, ఇప్పుడు భువనేశ్వరితో  పెళ్ళికి ముందు ఏడేళ్ళపాటు ప్రేమలో ఉన్నానని చెప్తున్నాడు, అతని మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి.. పదే పదే భార్య పేరు తీస్తున్నాడంటే, సెంటిమెంట్‌తో షోలో గెలవాలని చూస్తున్నట్టున్నాడు అని చెప్పుకొచ్చింది నికిషా.. ఆమె మాటలకి కాస్త వెనక్కి వెళితే, 
శ్రీశాంత్ తన జాతకంలో రెండో పెళ్ళి యోగం ఉందనీ, అందుకు తన భార్య కూడా ఒప్పుకుందనీ, కాకపోతే తనకి 75 సంవత్సరాలు వచ్చాకే రెండో పెళ్ళి అవుతుందనీ జోక్ చేసి, పెళ్ళికి ముందు ఏడేళ్ళపాటు తన భార్యతో ప్రేమలో ఉన్నానని చెప్పాడు.. తనతో కలిసున్న టైమ్‌ని శ్రీశాంత్ అతని భార్య అకౌంట్‌లో వేయడంతో పులి భామకి కోపం వచ్చింది.. అదీ సంగతి... 

14:35 - October 14, 2018

తమిళనాడు : టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన శ్రీ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాస్టింగ్ కౌచ్‌పై ఈ నటి పెదవి విప్పడంతో టాలీవుడ్‌‌లో కలకలం రేగాయి. ప్రముఖల పేర్లను వెల్లడించడంతో తీవ్ర దుమారం రేగింది. అంతేగాకుండా ఈ విషయంలో అర్ధనగ్నంగా నిలబడి తన నిరసన తెలిపిన ఈ నటి శ్రీ రెడ్డి ప్రస్తుతం తమిళనాడుకు మకాం మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో మీ టూ సంచలనం సృష్టిస్తున్న వేళ తాజాగా శ్రీ రెడ్డి ఓ టీవీ ఛానెల్‌లో షాకింగ్ విషయాలు బయటపెట్టింది.  Image result for sri reddyఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జీవన్ రెడ్డి వేధింపులకు పాల్పడ్డాడని శ్రీ రెడ్డి ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా పలు ఆరోపణలు కూడా చేసినట్లు సమాచారం. నిర్మాత బెల్లంకొండపై కూడా శ్రీ రెడ్డి పలు ఆరోపణలు గుప్పించింది. 
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై తొలిసారిగా ఈమె నోరు విప్పింది. మీడియా ఎదుటకొచ్చి సంచలన ఆరోపణలు గుప్పించారు. దీనితో ఒక్కాసారిగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేయడంతో జాతీయస్థాయిలో ఆ అంశం మారుమోగింది. ఆమె చేసిన వ్యాఖ్యలు పలు వుడ్‌లలో చర్చకు దారి తీశాయి. చిత్ర విశ్లేషకులు కత్తి మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జీవిత రాజశేఖర్..తదితరులపై ఆమె సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘నా పోరాటం వ్యక్తుల మీద కాదు.. తెలుగు చిత్ర సీమలో మార్పుల కోసమే నా పోరాటం.. నిరసనను మళ్లీ మొదలుపెడతాను. నాకు ఎవరి మీదా పగ లేదు. ఒకరి తీరుతో హర్టయ్యాం. వారి మీద యుద్ధాన్ని ఆపేస్తున్నా’ అంటూ ఇటీవల ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. తాజాగా శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

14:16 - October 14, 2018

ఢిల్లీ : భారతదేశంలో ‘మీటూ’ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న విదేశాంగ మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేయాల్సి సైతం వచ్చింది. ఎక్కువ సినీ నటులు నోరెత్తుతున్నారు. తమకు గతంలో జరిగిన దారుణాలను వెల్లగక్కుతున్నారు. దీనితో సినీ రంగంలో ఈ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరొక సింగర్ నోరు విప్పారు. లైంగిక బాధితుల త‌ర‌పున మాట్లాడుతున్న‌సింగర్ చిన్మయి జీవితంలో జరిగిన ఘటనలు తనకు జరిగాయని సింగర్ సునీత సారథి వెల్లడించారు. 
సామాజిక మాధ్యమం ద్వారా తనకు జరిగిన ఘోరాలను పోస్టు చేశారు. తనకు చిన్నప్పటి నుండే లైంగిక దాడులు జరిగాయని తెలిపారు. తనకు నాలుగు..ఐదేళ్ల వయస్సులో అమ్మ తరపు సోదరుడు వచ్చి జుగుప్సాకరంగా ప్రవర్తించే వాడని, అమ్మ సహోద్యోగి కూడా వచ్చి ఇలాగే వ్యవహరించే వాడని పేర్కొన్నారు. ఈ ఘటనలతో తాను నిర్ఘాంతపోయానని తెలిపారు. ప్రస్తుతం మ‌హిళ‌లు క‌లిసి ముందడుగు వేయాల్సిన స‌మ‌యం ఆసన్న‌మైందని, మీటూ వ‌ల‌న తనలో ఉన్న బాధ‌ని అంద‌రితో పంచుకునే అవ‌కాశం ల‌భించిందన్నారు. మగవాళ్లు కూడా తమకు మద్దతు తెలిపితే నీచులకు శిక్ష పడేలా చేయవచ్చునని సింగర్ సునితా సారథి పోస్ట్‌లో తెలిపారు. 

13:52 - October 14, 2018

హైదరాబాద్: నన్ను రాజకీయంగా అణగదొక్కేందుకే  కక్ష సాధింపుతోనే, నాఇంటిపైనా, నాకుటుంబ సభ్యులకు సంబంధించిన సంస్ధలపై ఐటీ దాడులు చేశారని, తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఐటీ అధికారులు  బెంగుళూరు,చెన్నై,ఢిల్లీ,కడప,హైదరాబాద్ తో సహా దాదాపు 25 చోట్ల 3 రోజులు సోదాలు నిర్వహించారని, తన బంధువులే కాకుండా, తన వ్యాపారాలతో సంబంధం లేని  నాచిన్ననాటి స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు  చేసి భయానక వాతావరణం క్రియేట్ చేయటం చాలా దారుణం అని ఆయన అన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న నన్నుఅభాసుపాలు చేయటానికి ఈదాడులు నిర్వహించారని ఆయన అన్నారు. మాఇంట్లో 3లక్షల 53వేల రూపాయల నగదు దొరికిందని ఐటీ అధికారులు చెప్పారని, అందులో 2 లక్షలరూపాయలు  దేవుడి డబ్బని ఆయన తెలిపారు. ఇంతకు ముందు తన ఇంటిలో ఐటీ సోదాలు జరిగాయని, ఈసారి మాత్రం కేవలం రాజకీయ కక్షతోనే సోదాలు నిర్వహించారని ఆయన చెప్పారు. తన ఇంట్లో  కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారని, అవి కేవలం బ్యాంకుకు సంబంధించిన పత్రాలు అని రమేష్  వివరించారు.  అధికారులు  కంప్యూటర్  హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నామని   చెబుతున్నారని  అది తన కుమారుడికి చెందిన సినిమాల  హర్డ్ డిస్క్ తప్ప, వేరే ఏమీ కాదని సీఎం రమేష్ చెప్పారు.

13:38 - October 14, 2018

కేరళ : శబరిమలలో మహిళల ప్రవేశంపై ఇంకా దుమారం రేగుతూనే ఉంది. దీనిని పలువురు స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దీనిని పునరాలోంచించాల్సిందిగా కోరుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తృప్తి దేశాయ్ కీలక ప్రకటన చేశారు. తాను త్వరలోనే శబరిమల ఆలయానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అనుమతి లేని ఆలయాల్లో మహిళలకు అనుమతినివ్వాలంటూ ఆమె గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని శనిసింగపూర్‌లో మహిళల ఆలయ ప్రవేశం కోరుతూ పోరాటం చేసి సఫలం చెందారు. 
శబరిమలకు త్వరలోనే వెళ్లనున్నట్లు తృప్తి చేసిన ప్రకటనను పలువురు ఖండిస్తున్నారు. బీజేపీ నేత శ్రీధరన్ పిళ్లై ఆమె వ్యాఖ్యలను తప్పబట్టారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న లాంగ్ మార్్చ శనివారం కొల్లాం జిల్లాకు చేరుకుంది. అక్టోబర్ 15వ తేదీనాటికి రాజధానికి ర్యాలీ చేరుకుంటుందని తెలిపారు. అక్టోబర్ 18వ తేదీ నుండి ఆలయ తలుపులను తెరువనున్నారు. తృప్తి దేశాయ్ చేసిన వ్యాఖ్యలు..నిరసన ర్యాలీలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయో చూడాలి. 

13:34 - October 14, 2018

సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. వరస ఫ్లాప్‌లతో వర్రీ అవుతున్నాడు.. తేజ్ ఐ లవ్ యూ తర్వాత తేజ్ కొత్త సినిమా ఏదీ ఇంతవరకు మొదలుకాలేదు.. అక్టోబర్ 15న తేజ్ బర్త్‌డే.. ఈ సందర్భంగా మెగాభిమానులకు ఒక లెటర్ వ్రాసాడు.. అత్యంత ప్రియమైన  మెగాభిమానులకు ప్రేమతో అని స్టార్ట్ చేసి, గెలిచినప్పుడు వేలకుపైగా చేతులు చప్పట్లు కొడతాయి.. ఓడిపోయినా, మీ చేతుల చప్పట్ల చప్పుడు తగ్గకుండా, జయాపజయాలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తూ, వెన్నంటి ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు.. ఈ మధ్య కాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయానన్నది వాస్తవం, దానికిగల కారణాలను విశ్లేషించుకుంటాను.. మీ సలహాలు, సూచనలతో తప్పులను సరిదిద్దుకుంటాను.. మీకు నా నుండి చిన్న విన్నపం.. నా పుట్టినరోజు నాడు బ్యానర్లు కట్టడాలు, కేక్ కట్ చెయ్యడాలు చేస్తున్నామని చెప్పారు.. వాటికి ఖర్చు పెట్టే డబ్బుని ఎవరైనా చిన్నారి చదువులకు ఉపయోగించండి, అలా చేస్తే నేను ఇంకా ఆనందిస్తాను.. అని లెటర్‌లో పేర్కొన్నాడు.. ఏదేమైనా తేజ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అతణ్ణి ప్రశంసించాల్సిందే.. హ్యాపీ బర్త్‌డే టు.. సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్..  

12:48 - October 14, 2018

ఢిల్లీ: మీటూ ఉద్యమంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేంద్ర విదేశాంగశాఖ మంత్రిసుష్మాస్వరాజ్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. నైజీరియా పర్యటనలో ఉన్న అక్బర్  ఆదివారం భారత్ తిరిగి రాగానే తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల గురించి విమానాశ్రయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు  సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేస్తానని ఆయన చెప్పారు. అక్బర్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 80వ దశకంలో టెలిగ్రాఫ్, ఏషియన్ ఏజ్ పత్రికల్లో ఎడిటర్ గా  పనిచేసే సమయంలో ఆయన లైంగిక దాడులకు పాల్పడినట్లు  దాదాపు 10 మంది మహిళలు సోషల్ మీడియాలో అక్బర్ పై ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన సుష్మాస్వరాజ్ ను కలిసి వివరణ ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా ఈఅంశంపై  బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు. కానీ అక్బర్ రాజీనామా చేయాల్సిందేనని సంఘ్ పరివార్ కేంద్రం పై ఒత్తిడి తీసుకు వచ్చింది. త్వరలో మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి మంత్రి వర్గంలో ఉంటే పార్టీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో సంఘ్ పరివార్ ఆయనతో రాజీనామా చేయించాలని పట్టుబట్టింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై పదవులు నుంచి తప్పుకున్న మూడో వ్యక్తి ఎంజే అక్బర్. 2017 జనవరిలో మేఘాలయ గవర్నర్‌ వి.షన్ముగనాథన్‌, 2018 ఆగస్టులో కేంద్ర మంత్రి నిహాల్‌ చంద్‌ మేఘ్‌వాల్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతోనే తమ పదవులను కోల్పోవాల్సివచ్చింది. 
 2017 లో  ప్రియా రమణి అనే మహిళా జర్నలిస్టు మీటూ ఉద్యమానికి మద్దతుగా  ఒక  పత్రిక ఎడిటర్ తనపై  ఏరకంగా లైంగిక వేధింపులకు  గురిచేశారో వివరిస్తూ ఒక ఆర్టికల్ రాశారు. ఇటీవలే ఆమె ఆఎడిటర్ అక్బరే నని తన  ట్విట్టర్ లో పేర్కోన్నారు, ప్రియారమణి  ట్విట్టర్ లో మెసేజ్ ను చూసి మరో 9 మంది మహిళా  జర్నలిస్టులు అక్బర్ తమను ఏరకంగా  లైంగిక వేధింపులకు గురి చేసింది  ధైర్యంగా బయట పెట్టారు. దాంతో అక్బర్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.  

12:41 - October 14, 2018

మీ టూ లో, ఎప్పుడు, ఎవరి పేరు వినబడుతుందోనని సినిమా రంగంలో కలకలం మొదలైంది.. తనుశ్రీ దత్తా, నానాపటేకర్‌పై ఆరోపణలు చెయ్యడంతో, ఈ మీ టూ ఉద్యమం ఊపందుకుంది.. మరోవైపు సింగర్ చిన్మయి కూడా బాధిత మహిళలకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేస్తుంది..
ఇప్పుడు, బాలీవుడ్ భామ కంగనా రనౌత్, దర్శకుడు వికాస్ బాల్‌పై చేసిన ఆరోపణల గురించి, వికాస్ మాజీ భార్య, రీచా దూబే ఘాటుగా స్పందించింది.. వికాస్ నీతో మిస్ బిహేవ్ చేసినప్పుడు ముఖంమీదే చెప్పాల్సింది.. అలా కాకుండా, అతనితో వైన్ తాగడం, డిన్నర్లు చెయ్యడం ఎందుకు చెయ్యాలి, కంగనా తన సెలబ్రిటీ హోదాని అడ్డుపెట్టుకుని, అనవసరమైన ఆరోపణలు చేసి, మీ టూని తప్పుదారి పట్టిస్తుంది అని రీచా దూబే అంటే, కంగనా, ఒక మాజీ భార్య, ఒక మాజీ భర్తని కాపాడుకోవడానికి వచ్చిందా? నిజంగా నీ మొగుడు ఉత్తముడైతే, నువ్వతనికి దూరంగా ఎందుకుంటున్నావ్? ఒక పని చెయ్, మేం వర్క్ చేసే ప్లేసెస్‌లో రక్షణ కల్పించి, అతగాడు మిగతా మహిళల జీవితాల్ని నాశనం చెయ్యడని హీమీ ఇవ్వు అంటూ.. కంగనా రనౌత్, దర్శకుడు వికాస్ బాల్ మాజీ భార్య రీచా దూబేకి కౌంటర్ ఇచ్చింది.. మరోవైపు, మీ టూ బాధితులకి పలువురు  బాలీవుడ్ ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు...

12:36 - October 14, 2018

శ్రీకాకుళం : మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రమాదపు అంచుల్లో నుండి బయటపడ్డారు. హరిపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్నవాహన టైర్లు పేలిపోయి డివైడర్ మీదకు దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.  ఇటీవలే శ్రీకాకుళంలో తిత్లీ తుపాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనితో ఆదివారం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బయలుదేరారు. కానీ ఆయన వాహనం జాతీయ రహదారిపై అదుపు తప్పింది. వాహనం టైర్లు పేలిపోవడం..వెంటనే వాహనం స్కిడ్ అయిపోవడం..డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే, డ్రైవర్ నైపుణ్యంగా వ్యవహరించి వాహనాన్ని అదుపు చేయడంతో సోమిరెడ్డి ప్రమాదం నుండి బయటపడ్డారు. అనంతరం మరో వాహనంలో మందస గ్రామానికి వెళ్లిపోయారు. 

12:20 - October 14, 2018

హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్్సలో 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్్స లో 311 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో భారత్ 56 పరుగుల అధిక్యం లభించినట్లైంది. 
ఓవర్ నైట్ స్కోరు 308 పరుగుల వద్ద భారత బ్యాట్ మెన్్స ఆటను ఆరంభించారు. అప్పటికే రహానే 75 పరుగులు,న పంత్ 85 రన్లతో క్రీజులో ఉన్నారు. ఆదివారం వీరు సెంచరీ సాధిస్తారని అందరూ అనుకున్నారు. కానీ జట్టు స్కోరు 314 పరుగుల వద్ద రహానే (83) అవుట్ అయ్యాడు. వెంటనే జడేజా (0) కూడా వెనుదిరిగాడు. మరోైవపు పంత్ తన బ్యాట్‌ను ఝులిపించాడు. ఇతనికి అశ్వన్ జత కలిశాడు. వీరిద్దరూ వికెట్ పోకుండా కాపాడారు. కానీ అది కొద్దిసేపే మిగిలింది. సెంచరీ సాధిస్తాడని అనుకున్న పంత్ (92) నిష్ర్కమించాడు. చివరకు మిగతా బ్యాట్స్ మెన్్స తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. మొత్తం భారత్  367 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 
వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్్స : 311
భారత్ మొదటి ఇన్నింగ్్స : 367

12:02 - October 14, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తుకు తెరలేపి..ముందే అభ్యర్థులను ప్రకటించేసిన గులాబీ దళంలో అసమ్మతి రాగాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకున్నా పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారు వెనక్కి తగ్గడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుండి తాజా, మాజీ జైపాల్ యాదవ్‌కు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయన తరపున ప్రచారం నిర్వహించబోమని, ఆయనకు మద్దతు ఇవ్వమని కసిరెడ్డి, ఆయన తరపున అనుచరులు ప్రకటిస్తున్నారు. 
ఇదిలా ఉంటే ఆదివారం మంత్రి కేటీఆర్ కల్వకుర్తిలో సభకు ఏర్పాటు చేశారు. కానీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కేటీఆర్ బహిరంగ సభకు సహకరించేది లేదని ఖరాకండీగా చెప్పడంతో, టీఆర్ఎస్ నేతలు సభను వాయిదా వేశారు. జైపాల్ యాదవ్ గెలిచే పరిస్థితి లేదని, ఆయన్ను మార్చాలని వారు డిమాండ్ 

11:57 - October 14, 2018

గజపతినగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపుల పాయనుంచి ఇచ్చాపురం దాకా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం నాడు 285వ రోజు విజయనగరంజిల్లా గజపతి నియోజక వర్గం కొమటిపల్లి నుంచి ప్ర్రారంభమైంది. చంద్రబాబు నాయుడు అబ్దదపు హామీలతో మోస పోయామని దత్తరాజేరు మండలం లో పర్యటిస్తున్న సందర్బంలో పలువురు నిరుద్యోగులు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నామని జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరడాం గ్రామంలో కనీస సౌకర్యాలు లేవని, జూనియర్ కాలేజీ కూడా లేక పోవటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రామానికి చెందిన విద్యార్ధులు జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర అడుగడుగునా ప్రజలు జగన్కు తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. ముందు ముందు మంచిరోజులు ఉన్నాయని, అందరి సమస్యలు తీరుతాయని భరోసా ఇస్తూ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర ఈ రోజు గజపతినగరం నియోజకవర్గంలోని తాడెందొరవలస క్రాస్‌, కుంటినవలస క్రాస్‌, మరడాం, షికారుగంజి క్రాస్‌, కె. కొత్తవల క్రాస్‌ మీదుగా ఎస్‌ బూర్జవలస వరకు సాగుతుంది. 

11:49 - October 14, 2018

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. దీనితో సెక్యూర్టీ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య నాయక్‌కు గుర్తు తెలియని వ్యక్తలు ఈమెయిల్ పంపారు. అస్సాం రాష్ట్రం నుండి ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్‌లో మోదీని ఎప్పుడు హత్య చేస్తారో తేదీ కూడా తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
గతంలో కూడా ఈ తరహా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి మోడీ ఈసారి పలు ర్యాలీలు, బహిరంగసభల్లో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

11:31 - October 14, 2018

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్స్‌గా, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సమర్పణలో, శిరీష్, లక్షణ్ నిర్మించిన చిత్రం.. హలో గురు ప్రేమకోసమే... త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసాడు..
ఈ మూవీ టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.. నిన్న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ యూనిట్.. 
ఈ సందర్భంగా  దిల్‌ రాజు మాట్లాడుతూ..రామ్, అనుపమా, ప్రకాష్ రాజ్.. వీళ్ళు ముగ్గురూ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్, రొటీన్ కథనే ఒక నావెల్ పాయింట్‌తో ఆసక్తికరంగా చెప్పాం.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మా బ్యానర్‌లో చేసిన 9వ సినిమా ఇది.. మంచి మ్యూజిక్ ఇచ్చాడు.. గంటా పదినిమిషాల పాటు ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు.. త్రినాధరావు టేకింగ్ ఆకట్టుకుంటుంది అన్నాడు.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, రామ్, అనుపమా, దేవిశ్రీ ప్రసాద్‌లతో కలిసి దిల్ రాజు కూడా స్టెప్పులేసాడు.. ప్రణీత సెకండ్ హీరోయిన్‌గా కనిపించబోతుంది.. హలో గురు ప్రేమకోసమే.. దసరా కానుకగా, ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది... 

11:22 - October 14, 2018

హైదరాబాద్ : టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసంపై జరుగుతున్న ఐటీ దాడులు ముగిశాయి. కానీ ఆయనకు చెందిన రుత్విక్ ప్రాజెక్టు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలోనూ 48గంటల పాటు ఐటీ తనిఖీలు నిర్వహించింది. శుక్రవారం మొదలైన సోదాలు.. శనివారం రాత్రి వరకు కొనసాగాయి. సాగర్ సొసైటీలోని రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆఫీసులో ఐటీ సోదాలు చేస్తోంది. సీఎం రమేష్ బావ గోవర్ధన్ నాయుడుని అధికారులు విచారించారు. సీఎం రమేష్ కంపెనీల ఫైనాన్స్ వ్యవహారాలను గోవర్ధన్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు. 
హైదరాబాద్‌తో పాటు ఆయన సొంత ఊరైన కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 60 మంది అధికారులు బృందాలుగా విడిపోయి మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కడపలో మరో ఐదు బృందాలు ఈ  సోదాల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్ లోని నివాసంలో.. హైసెక్యూరిటీ లాకర్ తెరిచేందుకు సీఎం రమేష్ వేలి ముద్ర అవసరం కావడంతో.. హుటాహుటిన ఢిల్లీ నుంచి ఆయన్ను హైదరాబాద్ రప్పించారు. ఈ విషయాన్ని సీఎం రమేష్ ధృవీకరించారు. తన నివాసంలో జరిగిన దాడులను రాజకీయ కక్షగా  ఆయన ఆరోపించారు. ఐటీ అధికారులు అనుమతిస్తే.. మీడియా సమక్షంలో లాకర్‌ను తెరుస్తానని చెప్పారు. 
తమను మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని రమేశ్‌ ఆరోపించారు. ఐటీ అధికారులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్నారు. ఐటీ దాడులపై తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, తన భార్య పేరు మీద నోటీసులు వచ్చాయని తెలిపారు. ఏటా  ఆదాయపన్ను కడుతున్నట్లు చెప్పారు. 

11:09 - October 14, 2018


కర్నూలు : ఆ ఊరి జనానికి వింత అనుభవం ఎదురైంది. తరాల నుండి ప్రశాంతంగా జీవిస్తున్న వారిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆ ఊరి జనం భయపడుతున్నారు. ఎక్కడ కాలు పెడితే.. బుగ్గిపాలవుతామోనని ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ వారికి ఎదురైన అనుభవం ఏంటి..? ఎవరా గ్రామస్థులు? ఏంటా కహానీ?48గంటలుగా ఎగసిపడుతున్న మంటలు..అధికారులకు అంతుచిక్కని రహస్యం..ఇవే ప్రశ్నలు ఇప్పుడు కర్నూలు జిల్లా అవుకు మండలం మర్రికుంట తండా వాసుల మెదళ్లను తొలుస్తున్నాయి. గురువారం సాయంత్రం ఒక్కసారిగా భూమి రెండుగా చీలింది. ఆ తరువాత మంటలు చెలరేగాయి. అవి ఎంతకీ చల్లారక పోవడంతో.. గ్రామస్తులు ఉల్లికిపడ్డారు. ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలోలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 
కర్నూలు జిల్లాలో ఖనిజ సంపదకు నిలయమైన బనగానేపల్లి నియోజకవర్గం అవుకుమండలం మర్రికుంటతండా గ్రామ సమీపంలో భూమిలోనుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా 50 మీటర్ల పొడవు, ఒక అడుగు వెడల్పులో భూమి చీలిపోయింది. భూమి నుంచి వేలవడుతున్న మంటల ప్రభావంతో సమీపంలోని విద్యుత్ స్థంబం కరిగిపోయింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతంలో ఏదైనా వస్తువు వేస్తే కాలి బుడిదైపోతుంది. అసలు మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో స్థానికులకు అంతుచిక్కకడం లేదు. కొండ ప్రాంతంలోని పవన విద్యుత్ ప్లాంట్లో పనిచేసే సిబ్బంది ఈ మంటలను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.
అధికారుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి నుండి మంటలు వెలువడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మంటలు నివాస ప్రాంతాలకు వ్యాపిస్తే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుని ఆందోళన చెందుతున్నారు. 
అయితే అధికారులు మాత్రం గ్రామస్తుల ఆరోపణలను ఖండిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించామని, గురువారం కంటే ప్రస్తుతం తీవ్రత తగ్గిందని చెబుతున్నారు. మంటలు ఎందుకు చెలరేగాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలకు పర్యావరణ సమతుల్యత లోపించడమే ఇందుకు ప్రధానకారణమని అధికారులు పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. జిల్లాలో నలమల్ల, ఏరమల అటవీప్రాంతం 33శాతం ఉండేది. అభివృద్ధి పేరుతో అడవులను కొల్లగొట్టమే భూతాపానితి కారణమని చెబుతున్నారు. 

 

11:07 - October 14, 2018

సిద్దిపేట : రాజస్థాన్ సేవ సమితి వారు టీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ సిద్దిపేట రైస్ మిల్ అసోసియేషన్‌లో ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. సిద్దిపేట పట్టణంలో 150 రాజస్థాన్ కుటుంబాలు ఉన్నాయి. ఈ మార్వాడీ కుటుంబాలు సిద్దిపేటలో పలు వ్యాపారాలు చేస్తూ సాదాసీదాగా జీవిస్తున్నాయి. ఎప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లని మహిళలు ఇంటిల్లిపాది చేసే వ్యాపారాలకు, ఇంటికి తాళం వేసి తనను ఆశీర్వదించినందుకు సంతోషంగా ఉందన్నారు హరీష్‌ రావు. రాబోయే రోజుల్లో సిద్దిపేట పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, ప్రైవేట్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు.

10:40 - October 14, 2018

విజయవాడ : ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలానక్షత్రం అందున అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో భక్తులు రాత్రి 12 గంటల నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. రాత్రి ఒంటి గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారి జన్మనక్షత్రం, మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపాలతో సాక్షాత్కరింపచేయడమే సరస్వతీ దేవి యొక్క విశిష్టత. విద్యార్ధినీ, విద్యార్ధులకు సరస్వతీ అమ్మవారంటే అమితమైన ఇష్టం. అమ్మవారు అణుగ్రహం కోరుతున్న వారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను సర్వస్వతీదేవి ప్రసాదిస్తుందని అర్చకులు చెబుతున్నారు.
మూలానక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దుర్గా ఘాట్ లో స్నానమాచరించిన తర్వాత...భక్తులు దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారు. 

 

10:36 - October 14, 2018

విజయవాడ:ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంతవైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు  ఆదివారం నాడు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. చదువుల తల్లి సరస్వతి దేవిని దర్శించుకోటానికి ఈతెల్లవారు ఝాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిత్లీ తుపాను సహయక చర్యలు పర్యవేక్షిస్తూ శ్రీకాకుళంలో ఉన్న ముఖ్యమంత్రి ఈమధ్యాహ్నం 2గంటలకు విజయవాడ వచ్చి అమ్మ వారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
శరన్నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మూలా నక్షత్రం అనేటటువంటిది. ఈ మూలా నక్షత్రం నాడు ప్రత్యేకించి సరస్వతీదేవిని ఆరాధన చేయడం అనేది విధిగా చెప్తూంటారు. ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తే సర్వభీష్టాలు నెరవేరుతాయని ,ఙ్ఞాపకశక్తి ,మేధ ,బుద్ధి, వృద్ధి చెందుతాయని చెప్పబడింది. అందుకే ఈ రోజున ఙ్ఞానాభివృద్ధి కొరకు దేవతలు సైతం అమ్మవారిని పూజిస్తారు.విద్యాధిదేవత సరస్వతి. ముఖ్యంగా విద్యార్థులందరి చేత కూడా మూలా నక్షత్రం నాడు సరస్వతీ ఆరాధన చేయించడం వారి భవిష్యత్తుకు చాలా మంచిదని  పండితులు చెబుతారు.  ఈరోజు అమ్మవారిని పూజిస్తే  ఏ విద్య వల్ల రాణిస్తారో ఆ విద్య వారికి సంపూర్ణంగా లభిస్తుందని  ఆ విద్యలో వారు అన్నివిధాలైనటువంటి ప్రగతిని సాధిస్తారని భక్తుల నమ్మకం. 

10:32 - October 14, 2018

చిత్తూరు : విశ్వంలోని పరిపాలకులంతా తిరుమలకు తరలివచ్చారు. ఆ శ్రీమహావిష్ణువుని తమ భుజాలపై మోసి ధన్యులయ్యారు. ఆ ఘట్టాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సర్వభూపాల వాహనసేవ నయనానందకరంగా సాగింది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండమంతా మారుమోగిపోతున్నాయి. సర్వభూపాల వాహన సేవ నేత్ర పర్వంగా సాగింది.. విశ్వంలోని పరిపాలకులంతా శ్రీనివాసుని తమ భుజాలపై మోసి ధన్యులయ్యారు. శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీనివాసుడు తిరువీధుల్లో మెరిసిపోయాడు.
రాజులు ఎంతమంది ఉన్నా ఆ శ్రీమహావిష్ణువు అందరికీ రారాజు. లోకంలో భూపాలకులందరికీ అధిపతి ఆ శ్రీనివాసుడే.. అందుకే ఆయన్ను సర్వ భూపాలుడంటారు. ఈ గూఢార్థాన్ని తెలియజేస్తూ వాహన సేవ తిరువీధుల్లో సాగింది. స్వామివారు భూపాలురపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సర్వభూపాల వాహన సేవలో ఉభయ నాంచారులతో విహరించారు. ఈ సేవలో పాల్గొంటే సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
దేశ చోడ వంశానికి చెందిన మట్టకుమార అనంతరాయలు ఈ వాహనాన్ని సమర్పించారని చరిత్ర చెబుతోంది. బాలకృష్ణుని రూపంలో కాళీయ మర్థనం చేస్తూ కనిపించిన స్వామిని చూసి భక్తకోటి మది పులకరించిపోయింది. కోలాటాలతో భక్తులు, భజన బృందాలు శ్రీనివాసుని లీలలను గానం చేస్తూ ఆకట్టుకున్నారు.
ఇక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ముఖ్య ఘట్టం భక్తులకు కనువిందు చేయనుంది. మలయప్ప స్వామి మోహినీ అవతారంలో దర్శనమివ్వనున్నారు. బంగారు చీర, సూర్య, చంద్రహారాలు, రత్నకిరీటాలు, కర్ణపత్రాలు, వజ్రపు ముక్కుపుడకతో శ్రీమన్నారాయణుడు మోహినిగా తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు.
క్షీరసాగరాన్ని మదించిన సమయంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పోటీ పడే సమయంలో దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అతిలోక మోహన రూపాన్ని ధరించాడు శ్రీమహావిష్ణువు. సురులకు సుధా ప్రదానం చేసిన ఆ జగన్మోహన రూపమే మోహినీ అవతారం.మంచిపనులు చేయడం ద్వారా భగవంతుడి అనుగ్రహం ఎలా పొందవచ్చో మోహినీ అవతారంలో శ్రీమహావిష్ణువు భక్తకోటికి వివరిస్తారని పురాణాలు చెబుతోంది. అలంకార ప్రియుడైన మలయప్ప స్వామి మిగిలిన వాహన సేవలకు భిన్నంగా మోహినీ అవతారంలో ఊరేగుతారు.

10:28 - October 14, 2018

చిత్తూరు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేడు అత్యంత విశిష్టమైన రోజు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు ఒక ఎత్తయితే.. ఈ రోజు జరిగే సేవకు భక్తులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అదే గరుడ సేవ. గరుడ వాహనంపై ఆశీనులైన శ్రీవారిని దర్శించుకుని కైవల్య ప్రాప్తి పొందేందుకు భక్తకోటి లక్షలాదిగా తిరుమలకు తరలివస్తోంది. పదివేల శేషుల పడగల మయమైన శేషాచలంపై వెలసిన శ్రీనివాసుని దివ్య వైభవాన్ని ఎంత వర్ణించినా మరో మాట మిగిలే ఉంటుంది. ఆ రూపాన్ని దర్శించుకునేందుకు, ఆయన వైభవాన్ని కనులారా తిలకించేందుకు ముక్కోటి దేవతలే తిరుమలకు తరలివస్తారు. ఇక సామాన్య భక్తులు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసే భాగ్యం దొరికితే జన్మ ధన్యమైనట్టే భావిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై విహరించే శ్రీనివాసుని కనులారా దర్శించుకుని తరించే భక్తకోటి.. అత్యంత ముఖ్యమైన ఘట్టాన్ని వీక్షించి తరించేందుకు లక్షలాదిగా తరలివస్తోంది.. గరుడ వాహనంపై స్వామివారి వైభవం సాక్షాత్కరించనుంది. విలువ కట్టలేని ఆభరణాలను ధరించి స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు అభయప్రదానం చేయనున్నారు.
వైష్ణవ పురాణాల్లో గరుడుడంటే ప్రథమ భక్తుడని అర్థం. అంతేకాదు వేదాలకు ప్రతిరూపంగా గరుత్మంతుని భావిస్తారు. అందుకోసమే గరుడ సేవకు అంతటి ప్రాముఖ్యత. గరుడ వాహనంపై స్వామి వారిని దర్శించుకునే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. గరుడ వాహన సేవలో ఆలయంలోని మూల విరాట్‌ ఆకారంలో ఉత్సవ రూపం ఉంటుంది.
గరుత్మంతుడు వేద స్వరూపుడు. శ్రీమహా విష్ణువు గరుడ సమ్మేళనంగా పురాణాలు చెబుతున్నాయి. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో ఐదో రోజు అంటే పంచవేదాలు, గరుడ పంచాక్షరిలోని పంచవర్ణ రహస్యం తెలిపే విధంగా స్వామివారి గరుడోత్సవం జరుగుతుంది. దాసుడిగా, మిత్రుడిగా, ధ్వజంగా అనేక విధాల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవిస్తాడు. స్వామి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది కూడా గరుత్మంతుడే. అందుకే బ్రహోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తూ గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేస్తారు.
ఇక గరుడ సేవలో స్వామివారికి విలువ కట్టలేని ఆభరణాలను అలంకరిస్తారు. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి... మూల విరాట్టుకు భేదంలేదని చెప్పేందుకు మూలమూర్తి ఆభరణాలను ఈ సేవలో వినియోగిస్తారు. గర్భాలయం దాటి బయటకు రాని ఆభరణాలను కూడా గరుడ సేవలో ఉత్సవమూర్తికి అలంకరిస్తారు. మూల విరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకరకంఠి, బంగారు హారం, సహస్రనామ మాలిక వంటి విశేష ఆభరణాలను ఆలయం వెలుపలికి తీసుకువచ్చి మలయప్పస్వామికి విశేషంగా అలంకరిస్తారు. లక్ష్మీహారంతో ఉన్న మలయప్పస్వామిని దర్శిస్తే భక్తులకు సిరులు, సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. ఇక గరుడ సేవ సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించిన పూలమాలను స్వామి వారికి అలంకరిస్తారు.

10:09 - October 14, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా, మూడో రోజూ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది...  ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ని టచ్ చెయ్యడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో  రెండు రోజులకుగానూ 35కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 40కోట్లకి పైగా షేర్ వచ్చింది.. ఈ రోజు కూడా అన్ని ఏరియాలూ హౌస్‌ఫుల్ అయ్యాయి.. విజయవాడతో పాటు, మరికొన్ని చోట్ల అరవింద సమేత మూవీ ప్రదర్శించే ధియేటర్లు పెంచబోతున్నారు.. ఈ చిత్రానికి ఫ్యాన్స్‌తో పాటు, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కూడా కనెక్ట్‌ కావడంతో, క్రౌడ్ ఎక్కువై, టికెట్స్‌దొరక్క చాలామంది నిరాశగా వెనుదిరగడంతో, డిస్ట్రిబ్యూటర్స్ ధియేటర్లు పెంచబోతున్నారు.. ఈ పండగ సీజన్‌లో యంగ్ టైగర్ ఎంత వసూలు చేస్తాడో చూడాలి..

10:07 - October 14, 2018

ఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జోన్‌ బిలో భాగంగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి మరోసారి చెలరేగాడు. ఇక  జోన్ ఏ లో భాగంగా జరిగిన మరో మ్యాచ్ లో యుముంబా హర్యాణస్టీలర్స్ పై సత్తా చాటింది. ఐదు సీజన్ల నుంచి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌ అట్టహాసంగా సాగుతోంది. ప్రొ కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ మరో విజయం సాధించింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి మరోసారి మెరుపులు మెరిపించడంతో శనివారం టైటాన్స్ యూపీ యోదాను ఓడించింది.  తెలుగు టైటాన్స్‌ 34-29తో యూపీ యోధపై గెలిచింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 9 పాయింట్లు సాధించగా.. డిఫెన్స్‌లో అబోజర్‌ మిఘాని 6 టాక్లింగ్‌ పాయింట్లతో హైఫైవ్‌ సాధించాడు. యూపీ తరఫున ప్రశాంత్‌ రాయ్‌  11 పాయింట్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు. రైడింగ్‌లో ఇరు జట్లూ సమవుజ్జీలుగా నిలిచినా.. డిఫెన్స్‌లో టైటాన్స్‌ మెరుగ్గా రాణించి ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది.  
ఇక జోన్ ఏ సాగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 53-26తో హర్యానా  స్టీలర్స్‌ను చిత్తుగా ఓడించింది. రైడింగ్‌, డిఫెన్స్‌లోనూ ముంబా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అభిషేక్‌ సింగ్‌ 12 రైడ్‌ పాయింట్లు సాధించగా.. డిఫెన్స్‌లో ఫజల్‌ అత్రాచెలి 7 టాక్లింగ్‌ పాయింట్లతో అదరగొట్టాడు. నిన్న పుణేరీ పల్టన్ తో జరిగిన మ్యాచ్‌ విజయం సాధించిన  యుముంబా  ప్రతీ పాయింట్‌కు తీవ్రంగా పోరాడి హర్యాన స్టీలర్స్ పై సత్తా చాటింది..

09:56 - October 14, 2018

హైదరాబాద్ : భారీ ఆధిక్యంపై టీం ఇండియా దృష్టి పెట్టింది. ఆట మొదట్లోనే వికెట్లు తీయడం.. ఆ తర్వాత స్కోర్ పెంచడంతో రెండో టెస్టులో కూడా వెస్టిండిస్‌ను శాసించే పరిస్థితి సృష్టించుకుంది టీం ఇండియా. క్రీజులో రహానే, రిషభ్‌ పంత్‌ నిలదొక్కుకొని సెంచరీల దిశగా సాగుతుండటం... వీరి తర్వాత వచ్చే జడేజా సహా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లో కూడా మరిన్ని పరుగులు జోడించే సత్తా ఉండటంతో భారత్‌కు భారీ ఆధిక్యం దక్కే అవకాశముంది. మూడో రోజు ఆట విండీస్‌, భారత్‌లకు కీలకం కానుంది.
వెస్టిండీస్‌ తొలిరోజు ఆకట్టుకుంది కానీ... రెండో రోజు తేలిగ్గానే ఆలౌటైంది. టీం ఇండియా రెండో సెషన్‌ మినహా రెండో రోజంతా ప్రతాపం చూపింది. శనివారం ఉదయం ఉమేశ్‌ యాదవ్‌ మిగతా మూడు వికెట్లను పడేయడంతో వెస్టిండీస్‌ ఆట ముగిసింది. ఇండియా పృథీ షా 53 బాల్ లలో 70 రన్ లు చేయగా 11 ఫోర్లు, 1 సిక్స్‌ షో తో మొదలైంది. 
ఓవర్‌నైట్‌ 295 పరుగులు7వికేట్లతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ మిగిలిన 3 వికెట్లను  త్వరగానే కోల్పోయింది. జట్టు స్కోరు 300 దాటిన కాసేపటికే ఆలౌటైంది. 296 పరుగుల వద్ద బిషూ పెవిలియన్‌ చేరగా, శతక వేటలో నిలిచిన ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఛేజ్, గాబ్రియెల్‌ (0) వరుస బంతుల్లో ఔట్‌ కావడంతో 101.4 ఓవర్లలో 311 పరుగుల వద్ద విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఈ మూడు వికెట్లను ఉమేశ్‌ యాదవే పడగొట్టాడు.  స్పిన్నర్లు శాసించే భారత గడ్డపై 1999 తర్వాత 6 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా ఉమేష్ నిలిచాడు.   
టీనేజ్‌ ఓపెనింగ్‌ సంచలనం పృథ్వీ షా 39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌ సహాయంతో తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఉరిమే ఉత్సాహంతో మొదలైన తొలి సెషన్‌కు రెండో సెషన్‌లో బ్రేక్‌లు పడ్డాయి. జోరుమీదున్న పృథ్వీ షా, టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా, కెప్టెన్‌ కోహ్లిల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మొదట 98 పరుగుల వద్ద పృథ్వీ షోకు వారికెన్‌ తెరదించాడు. తర్వాత కోహ్లి క్రీజులోకి రాగా... 4 పరుగుల వ్యవధిలో పుజారా వికెట్‌ను గాబ్రి యెల్‌ పడగొట్టాడు. ఈ దశలో రహనేతో కలిసి కోహ్లి నింపాదిగా ఆడాడు. ఈ సెషన్‌లో 31 ఓవర్లు ఆడిన భారత్‌ కీలకమైన 3 వికెట్లను కోల్పోయి 93 పరుగులు చేసింది. .
సొంతగడ్డపై తడబడిన రహానే... అసలైన సమయంలో తన సత్తా చాటాడు. యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌తో కలిసి జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ పరుగులు జోడించారు. 55వ ఓవర్లో జట్టు 200 పరుగులు చేసింది. వీరిద్దరు అజేయంగా సాగడంతో జట్టు స్కోరు 77వ ఓవర్లో 300 పరుగులు దాటింది. ఈ సెషన్‌లో 34 ఓవర్లు వేసిన వెస్టిండీస్‌ బౌలర్లు ఈ జోడీని విడగొట్టలేకపోయారు. కనీసం ఒక్క వికెట్‌నైనా చేజిక్కించుకోలేకపోయారు. ఇక చివరి సెషన్‌లో  రహానే నిదానంగా ఆడుతున్నప్పటికీ... హైదరాబాదీల జోష్‌కు ఊతమిచ్చేలా రిషభ్‌ పంత్‌ ఫోర్లతో రెచ్చిపోయాడు. మొత్తానికి నగరవాసులు శనివారం క్రికెట్‌తో వీకెండ్‌ పండగ చేసుకున్నారు. 

09:43 - October 14, 2018

మంచిర్యాల:మాజీ మంత్రి టీఆర్ఎస్ నాయకుడు జి.వినోద్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మాజీ మంత్రి ఐనప్పటికీ తనకు టీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యం లభించటం లేదనే అసంతృప్తితో ఉన్న వినోద్ 1,2 రోజుల్లో  ఏఐసీసీ అధ్యక్షుడు  రాహుల్  గాంధి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. తన తండ్రి జి.వెంకటస్వామి హయాం నుంచి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వినోద్ గత ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్న వినోద్ చెన్నూరు లేదా బెల్లంపల్లి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఆయన ఢిల్లీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. 

 

08:43 - October 14, 2018

హైదరాబాద్:రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో సాంకేతిక కారణాల వలన సుమారు 25 వేల  మంది ఓటర్ల పేర్లు రిపీట్ అయినట్లు గుర్తించామని, ఈ విషయాన్ని సుమోటోగా గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని వారం రోజుల్లోగా కొత్త జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఈఆర్వో నెట్‌    వెబ్‌సైట్‌లో ఓటర్ల వివరాలను నమోదు చేసి ‘సబ్మిట్‌’ బటన్‌ నొక్కినా ఆ కమాండ్‌ పూర్తి కాలేదు. దీంతో డీటీపీ ఆపరేటర్లు రెండు, మూడు సార్లు మళ్లీ సబ్మిట్‌ బటన్‌ను నొక్కటంతో ఓటర్ల పేర్లు లిస్టులో రిపీట్ అయ్యాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో తుది ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తయిందని, ఉర్దూలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరాఠీలో 3 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ప్రచురించాల్సి ఉందని, మరో నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని రజత్ కుమార్ తెలిపారు. 

రాష్ట్ర ఎన్నికల సంయుక్త అధికారి ఆమ్రపాలితో కలసి ఆయన శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 17,68,873 మంది కొత్త ఓటర్లు తమ పేరు నమోదు చేసుకోగా వారిలో 5,87,046 మంది పేర్లు వివిధ కారణాలతో తొలగించామని చెప్పారు. ఓటర్ల జాబితాలో మొత్తంగా మహిళా ఓటర్ల సంఖ్య తక్కువైనప్పటికీ, కొత్తగా తమ పేరు నమోదు చేసుకున్న వారిలో అధిక సంఖ్యాకులు మహిళలే ఉన్నారని అని రజత్ కుమార్ పేర్కొన్నారు.  9,36,969 మంది మహిళలు, 8,31,472 మంది పురుషులు, 432 మంది ఇతరులు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. అదే విధంగా 18–19 ఏళ్ల వయసున్న వారిలో 3,22,141 మంది యువకులు, 2,53,247 మంది యువతులు, 112 మంది ఇతరులున్నారు. మార్పులు, చేర్పులు పూర్తయిన తర్వాత తుది జాబితాలో కొత్తగా 11,81,827 మంది ఓటర్లు పెరిగారు అని  రాష్ట్రంలో వందేళ్లకు పైబడిన ఓటర్లు 2,472 మంది ఉన్నట్లు రజత్ కుమార్ తెలిపారు. 

07:46 - October 14, 2018

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ  రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో, అతనికి చెందిన వ్యాపార  కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి చేపట్టిన సోదాలు శనివారం అర్దరాత్రి ముగిసాయి. 2015-16, 2016-17 కి చెందిన ఆర్ధిక సంవత్సరాల్లో రిత్విక్ సంస్ధలో జరిగిన పలు లావాదేవీలపై ఐటీ శాఖ ప్రధానంగా దృష్టి సారించి ఈసోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. రిత్విక్ సంస్ధకు చెందిన వేల కోట్ల రూపాయలను ఢిల్లీలోని ఒక వ్యక్తికి తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులలో అధిక భాగం కాంట్రాక్టులు రమేష్ కు చెందిన రిత్విక్ సంస్ధ దక్కించుకుంది. సాగునీటి ప్రాజెక్టుల పనులను దక్కించుకున్నరిత్విక్‌ సంస్థ ఆ పనులు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో చూపించి వేల కోట్ల రూపాయల బిల్లులను డ్రా చేసుకున్నవిషయం  ప్రస్తుత ఐటీ సోదాలతో బైటపడినట్లు సమాచారం. సోదాలు సందర్భంగా రూ.3.53 లక్షల నగదు, సీఎం రమేష్‌, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న14 బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు గుర్తించారు.   
రిత్విక్‌ సంస్థలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల బిల్లులన్నీ నగదు రూపంలోనే జరగడంపై కూడా ఐటీ శాఖ దృష్టి సారించింది. ఓ ప్రాజెక్టులో రూ.1,800 కోట్లు, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్ల  రూపాయల విలువైన బిల్లులను రిత్విక్ సంస్ధ నగదు రూపంలో చేసిందని అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన పన్నులను కంపెనీ ఎగ్గొట్టిందన్న ఆరోపణలపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. రిత్విక్,దాని అనుబంధ సంస్ధలు గత 3 ఏళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్న్లలో భారీస్దాయిలోలాభాలు పెరిగిపోవటం,  పెట్టుబడులు పెరగటంపై కూడా విచారణ చేయాలని ఐటీ శాఖ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రమేష్ ఇంట్లో ఉన్న డిజిటల్ లాకర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నీటి పారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టుల కేటాయింపుల వివరాలతో కూడిన ఫైళ్లు, ప్రాజెక్టుల పాత అంచనాలను పెంచుతూ రూపొందించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో లాకర్‌లో రమేశ్‌కు చెందిన 3 బ్యాంకు ఖాతాల వివరాలు, చెక్‌బుక్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఐటీ రిటర్నులకు సంబంధించిన కాపీలు అధికారులు గుర్తించారు. కాగా తన ఇంటిలోని డిజిటల్ లాకర్లు తెరవటానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం రమేష్ ఇంట్లోకి వెళుతూ ఆ లాకర్లలో బట్టలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 
 ఐటీ సోదాలు పూర్తయ్యాక అధికారులు ఇచ్చిన పంచనామా పత్రాలను విలేకరులకు  చూపుతూ సీఎం రమేష్ ....నన్ను  బీజేపీ లోకి రమ్మని అడుగుతున్నారని, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయమై గట్టిగా పట్టుపట్టినందునే తనపై ఐటీ దాడులు జరిగినట్లు చెప్పారు. గత నెలలో  జీఎస్టీ అధికారులు దాడులు చేసినా తాను ఎవరికీ చెప్పలేదని, తాను కరడు గట్టిన టీడీపీ వాదినని, తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ  జీవీఎల్ తో ఎక్కడైనా చర్చకు సిధ్దమని రమేష్ చెప్పారు.

 

Don't Miss