Activities calendar

17 October 2018

22:00 - October 17, 2018

సికింద్రాబాద్: బోయిన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. దసరా పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ యువతి ప్రమాదవశాత్తు దుర్మరణం చెందింది. మృతురాలిని హర్షితగా గుర్తించారు. గోడ కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్షిత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసింది. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన హర్షిత ఇంటర్ సెకండియర్ చదువుతోంది. దసరా పండుగకు అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే అమ్మమ్మ ఇంటి పక్కనే ఉన్న పాత ఇల్లు కూలుస్తున్న సమయంలో మట్టి పెళ్లలు హర్షిత మీద పడ్డాయి. ఈ ఘటనలో గాయపడిన హర్షిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

21:25 - October 17, 2018

మహారాష్ట్ర : దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా అమ్మవారి నామస్మరణతో ఆలయాలు మారుమ్రోగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారష్ట్రలోని థానే నగరంలో అమ్మవారి మండపం పలువురిని ఆకట్టుకుంటోంది. అమ్మవారి మండపం మొత్తం వేరుశెనగ కాయలతో తయారు చేసారు. దాదాపు 80 అడుగుల ఎత్తులో తయారు చేసిన ఈ మండపం స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ భారీ మండపం తయారికీ దాదాపు 12 లక్షల వేరుశెనగ కాయలను వినియోగించినట్లుగా  నిర్వాహకులు తెలిపారు. మండపం లోపలిభాగంలో వేరుశెనగ కాయలతో తయారు చేసిన ఇండియా మ్యాప్, ఇతర చిత్రాలు అమర్చారు. వేరుశెనగ మండపంలో కొలువైన  అమ్మవారు విద్యుత్ కాంతులతో వెలుగొందుతు భక్తులకు దర్శనమిస్తోంది. 
 

21:18 - October 17, 2018

కేరళ: తీవ్ర ఉద్రిక్తతల నడుమ శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. సాయంత్రం 5 గంటకు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ప్రతి రోజూ రాత్రి 10.30 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత అయ్యప్ప ఆలయం ఇవాళే తెరుచుకుంది. కాగా ఓవైపు ఆందోళనకారులు మరోవైపు పోలీసులు.. అయ్యప్ప స్వామి ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. సుప్రీంకోర్టు తీర్పుతో దేశం నలుమూలల నుంచి అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మహిళలు తరలి వచ్చారు. అయితే ఆలయంలోకి మహిళలను వెళ్లనివ్వకుండా ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు అడ్డుకోవడంతో మహిళలు ఆలయం వరకు కూడా వెళ్లలేకపోయారు. మహిళలను కనీసం పంబ నది వరకు కూడా రానివ్వలేదు ఆందోళనకారులు. నీలక్కల్‌లో ఆందోళనకారుల మీద పోలీసులు లాఠీచార్జ్‌గా చేయగా, నిరసనకారులు పోలీసుల మీద రాళ్లు రువ్వారు.

ఆలయం తలుపులు తీసిన తర్వాత ప్రధాన పూజారి స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈనెల 22 వరకు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతామని, అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకోవచ్చని తెలిపారు. 

శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్న నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా పోలీసులు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న పంబ, నీలక్కల్‌, సన్నిధానం, ఎలవుంగళ్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు.

కాగా, ఆందోళనల వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు ఉన్నారంటూ కేరళ మంత్రి ఈసీ జయరాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల ఆలయం చుట్టుపక్కల అడవిలో దాక్కుని అయ్యప్ప భక్తులపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు. 10మంది మీడియా ప్రతినిధులు, ఐదుగురు భక్తులు, 15మంది పోలీసులపై దాడి చేశారని చెప్పారు. కేఎస్‌ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి శబరిమలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను కొట్టి వెనక్కి పంపించేశారని.. దీనంతటి వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ పాత్ర ఉందని మంత్రి జయరాజన్ అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు అందరికీ వర్తిస్తాయని, సుప్రీం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూ వాటిని అమలు పరుస్తోందని మంత్రి వివరించారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సన్నిధానం వెళ్లే భక్తులకు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

మరోవైపు ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ పలు హిందూ సంఘాలు 24 గంటల పాటు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. 

ఇక స్వామి వారి దర్శనానికి వస్తున్న మహిళల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి జాతీయ మహిళా హక్కుల కమిషన్ స్పందించింది. మహిళలకు భద్రత కల్పించాలని కేరళ డీజీపీని ఆదేశించింది.  పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకుని భక్తులపై దాడులకు దిగుతున్న ఆందోళనకారులను వెంటనే అరెస్టు చేసి.. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాల్సిందిగా కోరింది.

20:37 - October 17, 2018

హైదరాబాద్: ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో మంటలు రాజేస్తోంది. అధికార, ప్రతిపక్షాల నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను మక్కీకి మక్కీ కాపీ కొట్టారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై గులాబీ నేతలు భగ్గుమంటున్నారు. ఉత్తమ్ వ్యాఖ్యలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా బదులిచ్చారు.. మేనిఫెస్టో కాపీ కొట్టామని ఉత్తమ్ అనడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. అసలు ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడా?.. చప్రాసా? అని ప్రశ్నించారు.

గతంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పినా ప్రజలు నమ్మలేదని, ఇప్పుడు రూ.5వేలు పెన్షన్ ఇస్తామని ఆ పార్టీ చెబుతున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరని తలసాని అన్నారు. కాంగ్రెస్ ఓ దిక్కుమాలిన పార్టీ అని అన్నారు. ఉత్తమ్ క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకోకుండా ఇంటింటికి నీళ్లు రాలేదని మాట్లాడుతున్నాడని తలసాని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల్లా తాము ఉద్యోగాలు అమ్ముకోలేదని.. టీఎస్‌పీఎస్‌సి ద్వారా ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.

రాజీవ్ గృహ కల్ప పేరుతోనూ కాంగ్రెస్ నేతలు వసూళ్ల దందాకు పాల్పడ్డారని తలసాని ఆరోపించారు. పుట్టి పెరిగిన గ్రామాన్ని కూడా అభివృద్ది చేయలేని జైపాల్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

టీఆర్ఎస్‌పై ఉత్తమ్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా తాము అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు కళ్లు కనిపించడం లేదా? అని తలసాని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో కూర్చుని గాలిమాటలు మాట్లాడం కాదు.. ఒకసారి నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలను అడిగితే వాస్తవాలు తెలుస్తాయని తలసాని సూచించారు.

20:31 - October 17, 2018

కరీంనగర్ : సద్దుల బతుకమ్మ సందర్భంగా కరీంనగర్ మార్కెట్ పూల వనంగా మారింది. ప్రకృతి సిద్దంగా పూచిన పూలను వ్యాపారులు మార్కెట్‌కి తీసుకురావడంతో ఆడపడుచులు  పెద్ద ఎత్తున పూల కొనుగోలు చేస్తున్నారు. పూల కోసం వచ్చిన మహిళలతో మార్కెట్ అంతా కిక్కిరిసిపోయింది. నిన్నటి వరకు తక్కువ ధరకు లభించిన పూలకు ధరలు పెంచేశారు వ్యాపారులు. గునుగు, తంగెడు, కట్లపూలు , పుట్టు కుచ్చులు, గుమ్మడిపూలు, టేకు పూలు ఇలా చాలా రకాల పూలను అందుబాటులో ఉంచారు వ్యాపారులు.. అయితే గతేడాదితో పోల్చితే ఈ సారి వర్షాభావం కారణంగా పూల వ్యాపారం లాభసాటిగా లేదంటున్నారు వ్యాపారులు..
 

19:41 - October 17, 2018

శ్రీకాకుళం: తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. భారీగా ఆస్తి, పంట నష్టం మిగిల్చింది. తిత్లీ తుఫాను సృష్టించిన విధ్వంసంతో సిక్కోలు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని తుఫాను బాధిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం పర్యటించారు. బాధితుల కష్టాలు కళ్లారా చూసిన పవన్ చలించిపోయారు. తుఫానుతో నష్టపోయిన ప్రజల కష్టాలు చూసి తనకు కన్నీళ్లొచ్చాయని అన్నారు. అయితే తాను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదని.. ఆవేదనను తన గుండెల్లోనే పెట్టుకున్నానని చెప్పారు. 

జిల్లాలోని భావనపాడు, టెక్కలిలో పవన్ పర్యటించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీసిన పవన్... బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పవన్ పేర్కొన్నారు. ప్రజలను కొందరు అధికారులు బెదిరిస్తున్నారని, ఎవరైనా ప్రజల్ని బెదిరిస్తే తోలు తీస్తానని పవన్‌ హెచ్చరించారు. తుఫాను బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు మూడు రోజులు శ్రీకాకుళం జిల్లాలోనే పర్యటించనున్నట్టు పవన్ వెల్లడించారు. కాగా, తుఫాను బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని పవన్ పిలుపునిచ్చారు.

19:36 - October 17, 2018

తూర్పుగోదావరి :  గోదావరి తీరమంటే ప్రకృతి అందాలు మదిలో మెదులుతాయి. కోనసీమ అనగానే కొబ్బరి సాగు, పిల్ల కాలువలు గుర్తుకొస్తుంటాయి. ఐతే.. అన్నింటికీ మించిన ఇక్కడి ఓ సాహస క్రీడ గురించి చాలామందికి తెలియదు. ఏటా దసరా రాగానే దేశవిదేశాల్లో ఉన్న అమలాపురం వాసులు కూడా ఆసక్తి ప్రదర్శించే ఆ ఆసక్తికర చెడీ తాళింఖానా గురించి తెలిస్తే మీకూ అలాంటి ఆసక్తే కలుగుతుంది. 
సహజంగా పిల్లలకు సెలవులొస్తే ఊళ్లకు వెళ్లి సరదాగా గడుపుతారు. ఏవేవో ఆటలు ఆడుతారు. కబుర్లతో కాలం గడుపుతారు. ఈ జనరేషనైతే వీడియో గేములు, మొబైల్‌ సరదాలతో గడిపేస్తోంది.

Related imageఅమలాపురంలో అలా కాదు. కోనసీమ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇక్కడి వీధుల్లో దసరా సెలవులంటే కత్తులు పట్టిన కుర్రాళ్లు కనిపిస్తారు. అగ్గిబరాటాలతో ఆడుకునే యువకులు దర్శనమిస్తారు. ఇదే వీరికి ఇక్కడ దసరా సరదా. ఒళ్లు జలధరించే సాహసకృత్యాలను ప్రదర్శించడమే వీర ఆటాపాట. చూశారుగా.. నిండా పదేళ్లు కూడా లేని ఈ చిన్నారులు కత్తులు పట్టి ఎలా తిప్పేస్తున్నారో. కర్రసాముతో ఎలా గడగడలాడిస్తున్నారో. అగ్గిబరాటాలకు సైతం సై అంటారు వీరు. మొత్తం 30 రకాల సాహస కృత్యాలకు వీరంతా పెట్టింది పేరు. వీరే కాదు.. వీరి తాత-ముత్తాతల నుంచి తరతరాలుగా దసరా నాడు ఇలాంటి కార్యక్రమాలే నిర్వహిస్తున్నారు. దసరా వచ్చిందంటే ఇక్కడంతా ఇదే కోలాహలం. Related image

183 ఏళ్ల క్రితం బ్రిటీషు కాలంలో ప్రారంభమయ్యాయి.కొంకాపల్లి చెడీ తాళింఖానా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాని దీని చరిత్ర దాదాపు రెండు శతాబ్ధాల నాటిది. 183ఏళ్ల చరిత్ర. బ్రిటీషు వారి కాలంలో ఈ సాహస క్రీడలు ప్రారంభమయ్యాయని చెబుతారు. అమలాపురంలోని కొంకాపల్లి సహా పలు వీధుల్లో ఈ సాహస క్రీడల్ని నిర్వహిస్తారు. ఇక్కడి యువతకు శిక్షణనిచ్చి మరీ రాటుదేల్చుతారు. ఈ దసరా సందర్భంగా 183వ చెడీ తాలింఖానా నిర్వహిస్తున్నారు. 

Image result for rajamouli magadheeraమగధీర కోసం ఇక్కడి వారినే తీసుకెళ్లారు.అంతేనా.. బాహుబలి డైరక్టర్‌ రాజమౌలి దృష్టిలో కూడా పడ్డారు చెడీ తాళింఖానా క్రీడలు. రాంచరణ్‌తో తాను తీసిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ మగధీరలో ఫైట్ల కోసం ఇక్కడి వారినే తీసుకెళ్లారు. వీరిచేతే యుద్ధ సన్నివేశాల్లో కత్తిఫైట్లపై ఆర్టిస్టులకు ట్రైనింగ్‌ ఇచ్చారట. చెడీ తాళింఖానా రాజమౌలి దృష్టిలో పడిందంటే ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.అప్పట్లో 60 రకాల సాహస క్రీడలు నిర్వహించేవారు. అందులో సగం మాత్రమే నేటి తరం కొనసాగిస్తోంది. తరాలు మారినా, అంతరాలు పెరిగినా, అలనాటి ఈ సాహసాలను నేటితరం కొనసాగిస్తుండడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. భావితరాలు కూడా కొనసాగించేలా స్ఫూర్తి నింపుతున్నామంటున్నారు అమలాపురం వాసులు. ఏటా దసరా వచ్చిందంటే అమలాపురంలో సందడే సందడి. దేశవిదేశాల నుంచి వచ్చిన వారితో కోలాహలంగా కనిపిస్తుంది. అందరి చూపూ చెడీ తాళింఖానా క్రీడలవ వైపే. ఇందులో వివిధ రకాల సాహసాలుంటాయి. కర్రసాము, కత్తిసాము, తాడుతో ప్రత్యర్థులను నిలువరించడం, అగ్గిబరాటా వంటి వాటిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.

ఏటా దసరా సదర్భంగా ఈ చెడీని అమలాపురం వీధుల్లో ప్రదర్శిస్తారు. ఐదు రోజుల ముందు చెడీ తాలింఖానా నిర్వహణ కోసం ఓ నవ యువకుడిని సిద్ధం చేస్తారు. 12 ఏళ్ల వయసు నుంచి పదహారేళ్ల మధ్యలో ఉన్న కుర్రాడిని సిద్ధం చేసి అతడికి అన్ని విద్యలు నేర్పుతారు. కనీసం నెలరోజుల పాటు శిక్షణ ఉంటుంది. అతడితో పాటు అదే వయసు ఉన్న కుర్రాళ్లకు కూడా శిక్షణ ఇస్తారు. అందుకే ఈ ప్రాంతంలోని యువత ఈ విద్యలో ఆరితేరి ఉంటారు. ప్రస్తుతం యువకులకు తోడుగా రూప అనే అమ్మాయి కూడా చెడీ తాళింఖానా నేర్చుకుంటుండడం విశేషంగా మారింది. దసరా సందర్భంగా ఇలాంటి సాహస క్రీడలు యువతలో ధైర్యం నింపడం, శీతాకాలం ప్రారంభంలో కసరత్తుల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం సాధించడం సాధ్యమవుతుందని వీరి నమ్మకం. ఇలా నేర్చుకున్న ఈ సాహస క్రీడల్ని దసరా నాడు అమలాపురం వీధుల్లో ప్రదర్శిస్తారు. వీటిని చూసేందుకు వేలాదిగా జనం తరలివస్తారు. 

Related imageచెడీ తాళింఖానా కోసం దేశవిదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా అమలాపురం వస్తుంటారు. ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని దర్శిస్తుంటారు.చెడీ తాళింఖానా కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు ప్రస్తుతం ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు. దసరాకి ముందు రోజుల్లో మాత్రమే వాటిని తిరిగి నిర్వాహకులకు అందజేస్తున్నారు. ఐనా చారిత్రక సాహస క్రీడలను కొనసాగిస్తుండడం తమకు ఆనందంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.ఒకప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అనుభవం భారతీయులది. అప్పట్లో మనపై పెత్తనం చేస్తున్న తెల్లోడిని ఎదురించడానికి ఇలాంటి అనేక సహసక్రీడలను నాటి తరం అలవరుచుకుంది. అందులో చెడీ తాళింఖానా మాత్రం నేటికీ కొనసాగుతుండడం విశేషం. 

19:16 - October 17, 2018

విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాక్షసుడు మహిషాసురుడికి మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి పోలికలు ఉన్నాయంటూ జగన్ అన్నారు. రాక్షసుడు మహిషాసురుడు అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నారా సురుడు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బహిరంగసభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన మహిషాసురుడి పాలనలా ఉందన్న జగన్.. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరవుకాటకాలేనని విమర్శించారు. పొదుపు సంఘాలకు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదని, రుణమాఫీ పేరిట మహిళలను దగా చేశారని జగన్ ఆరోపించారు. ఈవిధంగా మోసం చేస్తున్న చంద్రబాబును ‘నారా సురుడు’ అనాలా? 420 అనాలా? అంటూ విరుచుకుపడ్డారు.

18:42 - October 17, 2018

కర్నూలు : ఆటవికం కాదది... ఆచారం. సమరం కాదు.. సంప్రదాయం. చూసేవారికి అది కర్రలయుద్ధం... ఆ పల్లెవాసులకు మాత్రం సంబరం. కర్రలేకుండా బన్ని జరపాలని పోలీసులు..  కర్ర మా సంప్రదాయం అది లేకుండా బన్ని జరగదని భక్తజనం. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు సిద్ధం  చేశారు.
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో వెలసిన మాలమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలు ప్రతి ఏటా సాంప్రదాయ బద్ధంగా జరుగుతాయి. ప్రధానంగా విజయదశమి రోజున అర్దరాత్రి జరిగే మొగలరాయి పోరాటం దేశంలోనే అరుదైన ఉత్సవంగా కొనసాగుతుంది. ఆచారంలో భాగంగా ఉత్సవం రోజున విగ్రహాలను తమ వశం చేసుకునేందుకు బహుపరాక్ పోరాటాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. మాలమల్లేశ్వరస్వామి విగ్రహాలను ఇతర గ్రామాల వారికి దక్కనియకుండా నేరణకి, నేరణకితాండ, కొత్తపేట గ్రామాల ప్రజలు విగ్రహాల చుట్టు గుంపులుగా ఏర్పడి ఇనుపరింగులతో చుట్టిన కర్రలతో కొట్టుకునే క్రీడ ఒళ్లు గగుర్పాటు కలిగిస్తుంది. 
విగ్రహాలను వశం చేసుకునేందుకు బహుపరాక్ పోరాటం
తమ ఇష్ట దైవమైన మాలమల్లేశ్వరస్వామి విగ్రహం దక్కించుకునే ప్రయత్నంలో భక్తులు ఇనుప రింగులతో, అగ్గి కాగాడాలతో పాల్గొనే బహుపరాక్ పోరాటంలో తలలు పగిలినా, గాయాలైన వెంటనే స్వామివారి బండారు రాసుకోవడం మరింత ఉద్వేగానికి దారి తీస్తుంది. ఆచారం మాటున కొనసాగే బన్ని క్రీడలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లను సిద్ధం చేసింది.
బహుపరాక్ పోరాటంలో తలలు పగిలినా  బన్ని ఉత్సవ పోరాటంలో ఎవరికి ఎలాంటి గాయాలైన... చివరికి చనిపోయినా కూడా ఎలాంటి కేసులు నమోదు కావు. మొత్తంగా ఓ వైపు ఉత్సవాలను అడ్డుకుంటామని పోలీసులు చెబుతుంటే...మరోవైపు ఎలాగైనా జరిపి తీరుతామని పల్లెవాసులు తేల్చిచెబుతున్నారు. దీంతో ఈ ఉత్సవాలు మరింత ఆసక్తికరంగా మారాయి. 
 

18:31 - October 17, 2018

ఢిల్లీ : సర్దార్ వల్లభాయ్ పటేల్..ఉక్కుమనిషిగా పేరొందిన ఈ గొప్ప వ్యక్తి చరిత్ర అక్టోబర్ 31 నుంచి  వినువీధుల్లో ఆకాశమంత ఎత్తున ప్రకాశించనుంది. పటేల్ 140వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం. స్ట్యాచూ ఆఫ్ యూనిటీ..ఆ రోజున ఆవిష్కరణ జరగనుంది. అక్టోబర్ 31...భారతీయుల చరిత్ర దిగంతాలను తాకనుంది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం  ఆ రోజున 
ఆవిష్కరణ జరగనుంది. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ మహాయజ్ఞం సాకారమవనుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంకెక్కడా లేనంత ఎత్తున తయారైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ..భారతీయుల్లోని భిన్నత్వంలోని ఏకత్వాన్ని చాటి చెప్పనుంది.
స్వాతంత్ర్యం సిధ్దించిన తర్వాత, అప్పటికి అనేక రాజ్యాలుగా విడిపోయి ఉన్నవాటిని ఒకటిగా చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి దక్కింది. ఆ రకంగా ఇది భారతీయ స్వాతంత్ర్యకాంక్షకి కూడా ఆకాశమెత్తు నిదర్శనంగా చూడొచ్చు. 2010లో అప్పటి గుజరాత్ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపాదనతో లోహ్ పురుష్ విగ్రహ తయారీకి నాందిపడింది.
182మీటర్ల ఎత్తులో సర్దార్ సరోవర్ డ్యామ్ కంటే 138 మీటర్లపైన ఈ విగ్రహం తయారైంది. వింధ్యా, సాత్పురా పర్వతాల మధ్యలో
నెలకొల్పిబడింది. ఇక ఈ తయారీ విషయమే చూస్తే..ఓ యజ్ఞం అనే పదమే వాడాలి.  దేశంలోని 7లక్షల గ్రామాలనుంచి ఇనుము విరాళంగా స్వీకరించారు.  అలా 135టన్నుల ఐరన్ సేకరించగలిగారు.  రాష్ట్రీయ ఏక్తా మంచ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణఁ జరగగా..దీనికి గుజరాత్ సిఎం ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2013, అక్టోబర్ 31న శంకుస్థాపన చేయగా...ఐదేళ్లలోనే పూర్తవడం విశేషం. ఇఁదుకోసం వేలాది కార్మికులు, వందలాది ఇంజనీర్లు పడిన శ్రమ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ప్రపంచంలో అతి పెద్ద విగ్రహంగా లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ చెప్తుండగా..దానికంటే మన లోహ్ పురుష్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రెండింతలు ఎత్తు ఎక్కువ. 
మొత్తం ప్రాజెక్టు విలువ రూ.2989కోట్లుగా అంచనా వేశారు. నోయిడాకి చెందిన రాంసుతార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నమూనా సూచించారు. ఈ భారీ విగ్రహానికి ముందే ట్రయల్ రన్‌లా 30 అడుగుల నమూనా తయారు చేశారు. అలానే చైనాలోని విగ్రహతయారీ ఫ్యాక్టరీలను ఇంజనీర్లు పరిశీలించి వచ్చారు. అలానే అక్కడే కొన్ని శరీరభాగాలను వెండితో తయారు చేసి తెచ్చి ఇక్కడ అమర్చారు కూడా..విగ్రహం పైదాకా వెళ్లి పరిశీలించేందుకు రెండు  లిఫ్టులు ఏర్పాటు చేశారు. వీటిలో 20మంది చొప్పున రెండు లిఫ్టులలో 40మంది పైకి వెళ్లవచ్చు..అలా విగ్రహం ఛాతీ ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన స్థలంలో  ఒకేసారి 200మంది గడపవచ్చు. నది మధ్యలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని చేరుకోవడానికి పడవలు ఏర్పాటు చేశారు.
వల్లభాయ్ పటేల్ విగ్రహం బేస్‌మెంట్ దగ్గరే  శ్రేష్ట భారత్ సెంటర్‌ని నిర్మించారు. ఈ సెంటర్‌లో 53 గదులతో ఉన్న త్రీ స్టార్ హోటల్ నెలకొల్పారు. లేజర్ షో..సర్దార్ జీవిత చరిత్ర తెలిపే లైబ్రరీ కూడా శ్రేష్ఠ్ భారత్ సెంటర్లో ఉన్నాయ్. భవిష్యత్తులో తాజ్ మహల్ ఎంత ప్రసిధ్ది చెందిన టూరిస్టు ప్రదేశమో..స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా అదే స్థాయిలో టూరిస్ట్ స్పాట్ అవుతుందని అంటున్నారు. 
 

17:47 - October 17, 2018

వరుణ్ తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్స్‌గా, ఘాజీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి డైరెక్షన్‌లో, దర్శకుడు క్రిష్ సమర్పణలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ అంతరిక్షం 9000KMPH.
తెలుగులో  మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న అంతరిక్షం టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిహర స్పేస్ ప్రాజెక్ట్ టీమ్‌లో ఉండే  వరుణ్, తన టీమ్ మేట్స్‌తో స్పేస్‌కి చేరుకోవడం, అక్కడ సమస్యలు ఎదురవడం, వాటని ఎలా సాల్వ్ చేస్తాడు అనే ఆసక్తికర అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది అంతరిక్షం టీజర్.. టీజర్‌లో వరుణ్‌తో పాటు, అదితి రావు, సత్యదేవ్, రాజా కనబడ్డారు కానీ, లావణ్య త్రిపాఠిని చూపించలేదు.. గ్రాఫిక్ వర్క్, విజువల్స్‌తో పాటు, ఆర్ఆర్ కూడా బాగుంది.. డిసెంబర్‌లో ప్రేక్షకులను స్పేస్‌లోకి తీసుకెళ్ళబోతోంది అంతరిక్షం టీమ్...

 

17:22 - October 17, 2018

ఆఫ్గనిస్తాన్ : దేశంలో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చిన్నా, పెద్దా, మంచీ, చెడ్డా అనే తారతమ్య మరిచిన నరరూప రాక్షసులైన తాలిబన్స్ వారు అనుకున్నది జరిగేవరకూ ఎంతటి ఘాతుకానికైనా పాల్పడతారు. ఈ నేపథ్యంలో  ఏకంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి సీటు కింద బాంబు పెట్టి ఘోరంగా హతమార్చారు. ఈ ఘటన హెల్మెండ్ ప్రావిన్సులో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో పార్లమెంటుకు పోటీ చేస్తున్న అబ్దుల్ జబర్ ఖహ్రామన్ అక్కడికక్కడే చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా రాబోయే ఎన్నికలను బహిష్కరించాలని తాలిబన్లు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దాడిలో అమాయకులు కూడా ప్రాణాలను పోగొట్టుకున్నారు. 

Image result for talibanఅమెరికా అండగా కొనసాగుతున్న ఆఫ్గన్ తోలుబొమ్మ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని తాలిబన్లు దాడి అనంతరం  స్పష్టం చేశారు. తమ హెచ్చరికను కాదన్నందుకు ఖహ్రోమన్ పై దాడి జరిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గత రెండు వారాల్లో ఆఫ్గనిస్తాన్ లో ఎన్నికల్లో పోటీచేస్తున్న 10 మంది అభ్యర్థులను తాలిబన్లు కిరాతకంగా హతమార్చారు. అంతేకాకుండా ఓ ర్యాలీ లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

17:13 - October 17, 2018

ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేశారు. విదేశాంగ వ్యవహారాల శాఖ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. మీ టూ(#MeeToo) ఉద్యమంలో భాగంగా తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అక్బర్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. సుమారు 15మంది మహిళలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ముందుగా జర్నలిస్టు ప్రియారమణి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బహిర్గతం చేశారు. దీంతో ఎంజే అక్బర్ ఇబ్బందుల్లో పడ్డారు. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎంజే అక్బర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను అక్బర్ ఖండించారు. అవన్నీ అవాస్తవాలే అని వివరణ ఇచ్చారు. తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన పరువుకు భంగం వాటిల్లే విధంగా ఆరోపణలు చేశారంటూ అక్టోబర్ 15న ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో ప్రియారమణిపై అక్బర్ పరువు నష్టం దావా కూడా వేశారు. ఇంతలోనే ఆయన పదవికి రాజీనామా చేయడం జరిగింది.

'ద ఏషియన్ ఏజ్’ మీడియా సంస్థకు ఎడిటర్‌గా ఉన్న సమయంలో ఎంజే అక్బర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ప్రియారమణి ఆరోపణలు చేసిన విషయం విదితమే. 

బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా తనకు ఎదురైన లైంగిక ఆరోపణలను బయటపెట్టిన తర్వాత మీ టూ ఉద్యమం ఊపందుకుంది. నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనూశ్రీ దత్తా ఆరోపణలు చేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు తమలో తాము కుమిలిపోయిన బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా ప్రపంచం ముందు ఉంచుతున్నారు. బడా బాబుల ముసుగులో చెలామణీ అవుతున్న వ్యక్తుల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటికే ఎందరో ప్రముఖుల బండారం బయటపడింది.

16:47 - October 17, 2018

కేరళ: అన్ని వయసుల మహిళలను అయ్యప్ప స్వామి ఆలయంలోకి అనుమతించాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత తొలిసారిగా ఇవాళ శబరిమల ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. దీంతో శబరిమలలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మరికొన్ని నిమిషాల్లో అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న మహిళలను ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కాగా ఆందోళనకారులను నియంత్రించడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. నిలక్కల్ దగ్గర ఆందోళనకారులు పోలీసుల చేతుల్లోంచి లాఠీలు సైతం లాక్కున్నారు. దీంతో అయ్యప్ప స్వామి ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా, మహిళల ఆలయ ప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించినా ఆలయం దగ్గర మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. 50 ఏళ్లు పైబడిన మహిళలను మాత్రమే ఆలయంలోనికి పంపిస్తామని ఆందోళనకారులు అంటున్నారు. మరోవైపు స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి మహిళలు శబరిమలకు తరలి వెళుతున్నారు. రాజమండ్రికి చెందిన మాధవి..  అడుగడుగునా అడ్డంకులు దాటుకుంటూ పంబ వరకు చేరుకున్నారు. అయితే  పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, ఆందోళనకారులు అడ్డుకోవడంతో మాధవి వెనుదిరగాల్సి వచ్చింది. ఆమెతో పాటు ఏపీకి చెందిన మరో మహిళా భక్తురాలు కూడా వెనక్కి వెళ్లిపోయింది. 

మహిళలు దేవాలయంలోకి ప్రవేశిస్తే దాడులు చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. అటు పంబ వద్ద దారిలోనే వాహనాలను ఆపేసి మహిళలను తనిఖీ చేస్తున్నారు. వారి ఆధార్ కార్డులను పరిశీలించి 50ఏళ్ల వయసు లోపు ఉన్న వారిని ఆందోళనకారులు వెనక్కి పంపేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటీషన్ పై చర్చించడానికి ట్రావెన్‌కోర్ బోర్డు ఇష్టపడటం లేదు.

16:45 - October 17, 2018

హైదరాబాద్ : తెలుగు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ కు ఆయన ఆర్మీకి ఇప్పటికింకా విన్నింగ్ కిక్ దిగలేదు. ఎందుకంటే ఎన్నో అవమానాలు, అవహేళనల మధ్య ఒంటిరిపోరాటంతో స్వతంత్రంగా పోరాడి సాధించుకున్న విజయం  ఎంతటి కిక్ ఇస్తుందో చెప్పలేం. ఇప్పుడు ఆ కిక్ లోనే వున్నాడు బిగ్ బాస్ విన్నర్ కౌశల్. నిన్న మొన్నటి వరకూ కౌశల్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. 'బిగ్ బాస్ 2' విన్నర్ ఎవరు అంటే చంటిపిల్లాడు కూడా చెప్పే పేరు కౌశల్. ఇప్పుడు కౌశల్ నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. ఈ రియాలిటీ షో ద్వారా ఆయన అంతగా పాప్యులర్ అయ్యాడు. ఈ క్రేజ్ తో ఆయన వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు. తాను విలన్ పాత్రలకి బాగా పనికొస్తానని ముందుగానే చెప్పిన కౌశల్, మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కాగా సినీ పరిశ్రమలో ఎవరు క్రేజ్ లో వుంటారో వారితో పలువురు టచ్ లో వుంటారు. ఈ నేపథ్యంలో కౌశల్ కు పలు సినిమాల్లో  పెద్ద పెద్ద దర్శక నిర్మాతల వద్ద నుండి ఆఫర్లు వచ్చాయి.

Image result for ధృవ అరవిందస్వామిషో తరువాత పలు ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్న కౌశల్ ఓ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..రామ్ ఛరణ్, విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన నవ మన్మధుడు అరవింద్ స్వామి కాంబినేషన్ లో వచ్చిన  'ధ్రువ' సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ సినిమాలో విలన్ గా అరవిందస్వామి చేసిన పాత్రను అంత తేలికగా మరిచిపోలేం.

Image result for aravinda sametha jagapathi babu photosఅలాగే రీసెంట్ గా వచ్చిన 'అరవింద సమేత' సినిమాలో విలన్ గా జగపతిబాబు పోషించిన పాత్ర కూడా అద్భుతం. అలాంటి విలన్ పాత్రలు చేయాలనుందని కౌశల్ తన మనసులోని మాటను తెలిపాడు.  ఆ తరహా పాత్రల్లో నన్ను నేను నిరూపించుకోవాలని వుంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను అని కౌశల్ తన మనసులోని మాటను బైటపెట్టాడు. మరి కౌశల్ ఆశ, ఆయన ఆర్మీ కోరిక తీరాలను కోరుకుందాం..
 

16:37 - October 17, 2018

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ వడచెన్నై దసరా కానుకగా, తమిళనాడులో  ఈ రోజు భారీగా రిలీజ్ అయింది.. ఆండ్రియా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌కాగా, వెట్రిమారన్ డైరెక్ట్ చేసాడు..  మొత్తం మూడు భాగాలుగా రూపొందిస్తుండగా, ఈ రోజు  మొదటి పార్ట్  వడచెన్నై విడుదలైంది.. సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ :
అన్బు (ధనుష్) తమ ఏరియాలోని గ్యాంగ్ లకి దూరంగా ఉంటూ, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి గౌరవంగా బతకాలనుకుంటాడు.. పద్మ (ఐశ్వర్య రాజేష్)‌తో ప్రేమలో పడతాడు.. అక్కడి నుండి అన్బు జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.. అటువంటి పరిస్ధితిలో అన్బు ఏం చేసాడు అనేది వడచెన్నై కథ..
నటీనటులు & సాంకేతిక నిపుణులు:
ధనుష్ తన నటనతో అన్బు పాత్రని అద్భుతంగా రక్తి కట్టించాడు.. అతని బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్ అండ్ డైలాగ్ డెలివరీతో సినిమాని నడిపించాడు.. ధైర్యంగల యువతిగా ఐశ్వర్య రాజేష్ ఆకట్టుకోగా, ఆండ్రియా కూడా చక్కగా నటించింది.. సముద్ర ఖని, అమీర్, డానియేల్ బాలాజీ, రాధా రవి వంటి వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేసారు.. సంతోష్ నారాయణన్ సంగీతం బాగుంది. వేల్ రాజ్ ఫోటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా ప్లస్ అయ్యాయి.. దర్శకుడు తమిళ నేటివిటీని బాగా ప్రెజెంట్ చేసాడు.. అతని రీసెర్చ్ తాలూకు ఎఫర్ట్ తెరపై కనిపిస్తుంది.. లైకా సుభాస్కరన్‌తో కలిసి ధనుష్ నిర్మించిన వడ చెన్నై పూర్తి తమిళ బ్యాక్ డ్రాప్‌లో సాగడంతో తెలుగులో డబ్ చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నారు..
మొత్తం మీద వడ చెన్నై ఆకట్టుకునే గ్యాంగ్ వార్ మూవీ అని చెప్పొచ్చు..
తారాగణం : ధనుష్,  ఆండ్రియా, ఐశ్వర్య రాజేష్, సముద్ర ఖని, అమీర్, డానియేల్ బాలాజీ, రాధా రవి
కెమెరా     : వేల్ రాజ్
సంగీతం   : సంతోష్ నారాయణన్ 
ఎడిటింగ్  : శ్రీకర్ ప్రసాద్ 
నిర్మాత    : లైకా ప్రొడక్షన్స్ , వండర్ బార్ ఫిలింస్..
రేటింగ్     :  3/5

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

16:26 - October 17, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన రాములు నాయక్ ఈరోజు మీడియాతో మాట్లాడారు.  తనకు ఏ టికెట్ అవసరం లేదని, తనకు కావాల్సింది గిరిజన రిజర్వేషన్లు మాత్రమేనని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో గిరిజన రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ నేతలను కలిశానంటున్నానంటు తనపై నిందలు వేసి పార్టీ నుండి బహిష్కరించారని రాయులు ఆరోపించారు. నేను ఎవరిని కలిశానో తెలిపాలని..దీనిపై తనపై నిందలు మోపినవారు.. తాను  నార్కో టెస్ట్ చేయించుకుందామా? అంటూ టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ రాములు నాయక్. 
నారాయణ్ ఖేడ్ లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, భూపాల్ రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని, ఒకవేళ తాను ఓడిపోతే ఉరేసుకుంటానని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎన్నికల అబద్ధాల పుట్ట అని, కొత్త వాగ్దానాలతో ప్రజలను మోసం చేసేందుకు టీఆర్ఎస్ బయలుదేరిందని విమర్శించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే మాట పార్టీలో కొంతమందికే నిధులు వచ్చాయని, నియామకాలు ఎటుపోయాయో తెలియదని విరుచుకుపడ్డారు.
 

 

16:15 - October 17, 2018

మహారాష్ట్ర : రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రక్షించాల్సిన జవాన్లు ఓ బధిర మహిళపై ఆకృత్యానికి పాల్పడ్డారు. ఒకటి కాదు..రెండు..కాదు..నాలుగేళ్లుగా దారుణానికి ఒడిగట్టారు. తాము ఏమి చేస్తున్నామో తెలిసినా పశువుల్లా మారిపోయి ప్రవర్తించారు. ఆపై ఆ దారుణాన్ని ఫోన్‌లో తీసి పలుమార్లు ఆమెపై పలుమార్లు ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ఎన్జీవో సహాయంతో ఈ దురాఘతం వెలుగులోకి వచ్చింది. 
ఖడ్కీలోని మిలటరీ ఆసుపత్రిలో ఓ మహిళ పని చేస్తోంది. ఈమెకు మాట్లడడం..వినికిడిలో ఇబ్బందులున్నాయి. ఈమె జులై 2014 నుండి పనిచేస్తోంది. పలుమార్లు తనపై ఆత్యాచారానికి పాల్పడ్డారని ఎన్జీవో సంస్థకు చెందిన ప్రతినిధి పురోహిత్‌కు తెలిపింది. దీనితో మహిళతో ఆసుపత్రి ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి అధికారులు కేసును నమోదు చేశారు. దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు ఆమె తెలియచేసింది. ఈ నేపథ్యంలో నలుగురు ఆర్మీ జవాన్లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆత్యాచార ఘటనను పలువురు ఖండిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

15:42 - October 17, 2018

కేరళ: శబరిమలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు వస్తున్న మహిళా భక్తులను అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు. కాగా నిలక్కల్ వద్ద పోలీసుల చేతుల్లోంచి లాఠీలు లాక్కున్న ఆందోళనకారులు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఓ ఇంగ్లీష్ ఛానల్ రిపోర్టర్‌పై దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారుల దాడిలో ఓ మీడియ వాహనం ధ్వంసమైంది. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఏపీకి చెందిన ఇద్దరు మహిళా భక్తులను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పంబ వరకూ వెళ్లిన రాజమండ్రికి చెందిన మాధవి, మరో భక్తురాలు వెనుదిరిగారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శబరిమల ఆలయ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. 

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని ఇటీవలే సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీర్పుని మహిళా సంఘాలు సమర్థిస్తే.. హిందూ, ధార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో ఆలయంలోకి మహిళలను అనుమతించేది లేదని తేల్చి చెబుతున్నారు.

15:36 - October 17, 2018

ముంబై: ఒకే రాజ్యాంగం..ఒకే దేశం, ఒకే భరత ఖండం.. కానీ ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఎప్పుడు పాలనలోను, అభివృద్ధిలోను ఇలా అన్ని విషయాలలోను వివక్షాపూరిత ధోరణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ వంటకంలో అతి ప్రీతిపాత్రం ఆ వంటకం..వాసనకే నోరూరిపోతుంది. కడుపు నిండిపోతుంది. ఆ వంటకం ఘుమఘుమలకు చుట్టుపక్కలంతా లొట్టలేయాల్సిందే. అదే సాంబార్. ఘుమఘుమలాడే సాంబార్ వంటకంపై ఉత్తరాదివారి కన్ను పడింది. సాంబారును దక్షిణ భారత వంటకం అని అందరూ చెప్పుకుంటారు. సాధారణంగా సాంబార్ అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది ఉడిపి. ఉడిపిలో సాంబార్ చాలా చాలా ఫేమస్.

Related imageటెంపుల్ టౌన్ గా పిలువబడే ఉడిపిలో చాలా ఫేమస్ అయినటువంటి రిసిపి ఉడిపి సాంబార్. ఈ పాపులర్ అయినటువంటి రిసిపిని కర్ణాటకాలో చాలా పేమస్ అయినటువంటి టెంపుల్ టౌన్ ఉడిపిలో దీన్ని ఎక్కువగా సర్వ్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఉడిపి సాంబార్ ఇడ్లీ మరియు దోసలలోకి బెస్ట్ కాంబినేషన్. అలా సాంబార్ అంటే ఉడిపిని ప్రసిద్ధిగా చెప్పుకుంటాం. 
కానీ తాజాగా ఓ ప్రముఖ చెఫ్ మాత్రం ఈ సాంబారు పేటెంట్‌ను కూడా సౌత్ ఇండియాకు దూరం చేసే ప్రయత్నం చేశాడు. నిజానికి ఈ వంటకం దక్షిణ భారతదేశానిది కాదట. మహారాష్ట్రలో తొలిసారి సాంబారును చేశారని చెఫ్ కునాల్ కపూర్ ఈ కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు. మాస్టర్‌చెఫ్ ఇండియా ప్రోగ్రామ్‌తో ఫేమసైన ఈ కునాల్..దేశంలోని వివిధ ప్రాంతాలు అక్కడి కూరలను పరిచయం చేసే ఈ కునాల్  ఇప్పుడు కర్రీస్ ఆఫ్ ఇండియా పేరుతో మరో కొత్త షో చేస్తున్నాడు.ఇందులో భాగంగా సాంబారు గురించి కూడా కునాల్ పరిచయం చేశాడు.

Image result for chef kunal kapoor ఈ సందర్భంగా కునాల్ మాట్లాడుతు..ఇపుడు మనం సాంబారును కందిపప్పుతో చేస్తున్నాం. దీనిని సౌత్ ఇండియా డిష్ అని కూడా చెప్పుకుంటాం. సాంబారుపై ఎన్నో రకాల కథలు ఉన్నాయి. కానీ నిజానికి సాంబారును తొలిసారి వండింది మహారాష్ట్రలోనే. మరాఠాలు దక్కన్‌ను పాలిస్తున్న సందర్భంగా చేశారు. శంభాజీ పేరు మీదే దీనికి సాంబారు అని పేరు వచ్చింది అని కునాల్ కపూర్ చెప్పాడు. ఈ శంభాజీ ఎవరో కాదు.. ఛత్రపతి శివాజీ కుమారుడే. దీనికి రాతపూర్వక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని కపూర్ చెబుతున్నాడు. ఇప్పుడు సాంబారును కందిపప్పుతో చేస్తున్నా.. అప్పట్లో మినపప్పుతో చేసేవారని కూడా అతడు తెలిపాడు. ఇప్పటి నుంచి సౌతిండియాలో సాంబారు తింటుంటే.. అది ఓ మరాఠా డిష్ అన్న విషయం గుర్తుంచుకోవాలని కునాల్ నొక్కి వక్కాణించటం గమనించాల్సిన విషయం. 

15:03 - October 17, 2018

శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది. ఆయన వార్నింగ్ ఇచ్చారు. తిత్లీ తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేతనైతే సాయం చేయండి లేకుంటే మౌనంగా ఉండండి.. కానీ.. లేనిపోని వదంతులు వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చగొట్టొద్దని సీఎం హితవు పలికారు. తిత్లీ తీవ్రతకు నష్టపోయిన ప్రజలకు సాయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం అవిశ్రాంతంగా పనిచేస్తోందని సీఎం వెల్లడించారు. అధికారులు ఓవైపు కష్టపడుతుంటే, కొందరు... ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.

తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లా విలవిలలాడిపోయిన సంగతి తెలిసిందే. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చేతికి అందాల్సిన పంట నీటిపాలైంది. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడి, మామిడి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో చాలా గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యుత్, రోడ్లు సహా పలు మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం రంగంలోకి దిగారు. స్వయంగా తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

15:03 - October 17, 2018

ఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తన స్టైల్లో స్పదించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత ఈరోజు శబరిమల ఆలయం తెరుచుకుంటున్న నేపథ్యంలో పలువురు మహిళలు స్వామి దర్శనానికి వస్తారనే సమాచారంతో కేరళలోని కొన్ని సంఘాలవారు మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్న క్రమంలో కేరళలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Image result for triple talaq supreme courtఈ అంశంపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తు..శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఆలయంలోకి మహిళలు వెళ్లకూడదు, అది సంప్రదాయానికి విరుద్ధం అని మీరు అంటున్నారు. ఆ రకంగా ఆలోచిస్తే ట్రిపుల్ తలాక్ కూడా ఒక మత సంప్రదాయమే. ట్రిపుల్ తలాక్ ను నిషేధించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ఆ సందర్భంగా ఎవరైతే హిందువులు వారి సంతోషాన్ని వెలిబుచ్చారో... ఇప్పుడు వారే రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు?  అని ప్రశ్నించారు. 

Image result for supreme court sabarimala judgement
శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా అడ్డుకోవాలనుకోవడం సరైంది కాదని..ఇది హిందూ పునరుజ్జీవనానికి, తిరోగమనానికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఈ అంశాన్ని అభివర్ణించారు. పుట్టుక ద్వారానే కులం సంక్రమిస్తుందని ఎక్కడ రాశారని ప్రశ్నించారు. హిందూ శాస్త్రాలను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

14:40 - October 17, 2018

ఢిల్లీ : అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోటానికి తెలంగాణలో ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఒక వారంలో కొలిక్కి వస్తుందని   తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా చెప్పారు. మహాకూటమిలో చర్చల అంశాన్ని ఏఐసీసీ  కోర్ కమిటీ కి వివరించటానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో  కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆజాద్‌, ఏకే ఆంటోనీని కలిసి  మహాకూటమిలో చర్చల అంశాన్ని వివరించారు. అనంతరం కుంతియా విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 20న తెలంగాణలో  రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో పాల్గోంటారని, త్వరలో సోనియాగాంధీ కూడా పర్యటిస్తారని చెప్పారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో  జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని,కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, ముగ్గురు బలమైన అభ్యర్థులున్నారని సాధ్యమైనంతవరకు  అందరికీ న్యాయం చేస్తామని కుంతియా అన్నారు.

14:30 - October 17, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. అంతేకాదు అభినందనలు కూడా తెలిపారు. 16వ తేదీన పవన్ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన నిర్వహించిన కవాతు విజయవంతం కావడంతో పవన్ ను కేటీఆర్ అభినందించారు. కేటీఆర్ కు ఈ సందర్భంగా పవన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ తన పార్టీ తరఫున ప్రచార పర్వంలో దూసుకెళ్ళిపోతున్నరు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కోట మీద ఏర్పడిన రాజకీయ పార్టీలపై ఆ పార్టీ అధినేత లపై మరియు నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు కేటీఆర్. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు కేటీఆర్...కార్యకర్తలతో మాట్లాడుతూ 'గడ్డం పెంచిన ప్రతివోడూ గబ్బర్ సింగ్ అయితడా?' పవన్ కళ్యాణ్ అయితడా?'' అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించే ఈ సెటైర్ వేసిన పేరు ప్రస్తావించకుండా కేటీఆర్ బీభత్సమైన పంచ్ పడేలాగా అద్భుత రీతిలో రాజకీయంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. పవన్ కూడా గతంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ కు కేటీఆర్ కు మధ్య పోలికల గురించి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనుభవంతో కేటీఆర్ తన తన మంత్రిత్వశాఖను సమర్ధవంతంగా కొనసాగిస్తున్నారనీ..మరి లోకేశ్ కు ఏ అనుభవం వుందని మంత్రిని చేశారని విమర్శించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే పవన్ కు కేటీఆర్ కు మధ్య వున్న స్నేహ బంధం అర్థం అవుతోంది.

14:27 - October 17, 2018

ముంబై : మీ టూ...ప్రకంపనల పర్వం కొనసాగుతోంది. బాలీవుడ్ నుండి మొదలైన ఈ ప్రకంపనలు రాజకీయాలకు కూడా పాకుతున్నాయి. నానా పాటేకర్‌పై బాలీవుడ్ నటి తను శ్రీ దత్త తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తాము వేధింపులకు గురయ్యామంటూ పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పెయింటర్ జతిన్ దాస్‌పై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. నిషా బోరా అనే మహిళ జతిన్‌పై ఆరోపణలు గుప్పించారు. తాను 14 ఏళ్ల వయస్సులో ఉండగా ఆయన వేధించారని ఆరోపించారు. 
Image result for #meToo Nandita Das Response On Sexual Harassment Allegation On Fatherదీనిని జతిన్ ఖండించారు. తాను షాక్‌కు గురయ్యాయనని, ఆమె అసభ్యంగా మాట్లాడుతోందన్నారు. ఆమె ఎవరో తనకు తెలియదని, ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ ఆమెను ఏ సందర్భంలోనైనా కలిసి ఉన్నప్పటికీ అలా ప్రవర్తించి ఉండననని వెల్లడించారు. 
ఇక ఆమె కుమార్తె నందితా దాస్ ఎలా స్పందిస్తారో అని ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆమె మౌనం వీడారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. మీటూ’ ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, కానీ తన తండ్రిపై ఇబ్బందికరమైన తప్పుడు ఆరోపణలు వచ్చాయన్నారు. మహిళలు/పురుషులు మాట్లాడటానికి ఇదే సరైన సమయమని, వారు చెప్పే విషయాల్ని వినాలన్నారు. కానీ ఆరోపణలు ‘మీటూ’ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

14:02 - October 17, 2018

ఢిల్లీ : దసరా..దీపావళి..పండుగల నేపథ్యంలో పలు కంపెనీలు పోటా పోటీ పడుతున్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్‌‌లో కొనుగోళ్లు దుమ్ము రేపుతున్నాయి. అమెజాన్..ఫ్లిప్ కార్డులు పోటా పోటీ పడుతున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకొనేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. 
నోకియా కూడా వినియోగదారులను ఆకట్టుకొనే పనిలో పడింది. ఏకంగా కేవలం రూ. 99 డౌన్ పేమెంట్ చెల్లించి సులభ వాయిదా పద్దతుల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ తీసుకెళ్లవచ్చని పేర్కొంటోంది. ఈ ఆఫర్ కావాలంటే మాత్రం దగ్గరలోని జియో డిజిటల్ లైఫ్, క్రోమా స్టోర్స్‌లో సంప్రదించాలని కంపెనీ పేర్కొంటోంది. నవంబర్ 10వ తేదీ వరకు ఈ ఆపర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉన్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ పేర్కొంది. నోకాస్ట్‌ ఈఎంఐలో నోకియా 1, నోకియా 2.1, నోకియా 5.1, నోకియా 6.1, నోకియా 3.1 ప్లస్, నోకియా 8 సిరాకో. నోకియా 3.1ప్లస్‌ను ఇటీవలే లాంచ్‌ చేసింది.

14:00 - October 17, 2018

చిత్తూరు : తిరుపతిలో హీరా గోల్డ్ అక్రమాలు బయటపడ్డాయి. హీరా గోల్డ్‌పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. హీరా గోల్డ్ డిపాజిట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డిపాజిట్లు మొత్తం హవాలా ద్వారా వచ్చాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. 

 

13:56 - October 17, 2018

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం, ఎన్టీఆర్..కథానాయకుడు, ఎన్టీఆర్..మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.. ఎన్.బి.కె.ఫిలింస్, ఎల్.ఎల్.పి.సమర్పణలో, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తుండగా, 
క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఏ ఎన్ ఆర్గా సుమంత్, చంద్రబాబుగా రానా దగ్గుబాటి, హరికృష్ణగా నందమూరి కళ్యాణ్ రామ్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కనిపించనున్నారు..
రీసెంట్గా షూటింగ్ లొకేషన్లో తీసిన ఫోటోని విద్యా బాలన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.. చక్కటి చీరకట్టు, నుదుట బొట్టు, తలనిండా పూలతో తెలుగుదనం ఉట్టిపడేలా తయారైన విద్యా బాలన్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.. అద్దంలో తననితాను చూసుకుంటున్న విద్యా, ఫోటోపై వాట్ డూ ఐ సీ అని వ్రాసింది.. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందిస్తున్నఎన్టీఆర్..కథానాయకుడు..2019 జనవరి 9న, ఎన్టీఆర్ మహానాయకుడు.. జనవరి 24న విడుదల కాబోతున్నాయి...

13:47 - October 17, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ మినీ మ్యానిఫెస్టోపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిన్న కేసీఆర్ టీఆర్ఎస్ మినీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీ మ్యానిఫెస్టో అంశాలను టీఆర్ఎస్ కాపీ కొట్టందని కాంగ్రెస్. టీజేఎస్ నేతలు విమర్శించారు. త్వరలో వెలువడే కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఎన్నో సంక్షేమ పథకాలు ఉంటాయన్నాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. 

 

13:45 - October 17, 2018

చిత్తూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామి వారి  బ్రహ్మోత్సవాలు  తిలకించటానికి భక్తులు  భారీగా తరలి వస్తున్నారు.  ఉత్సవాల్లో  భాగంగా ఏడవ రోజు బుధవారం మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో స్వర్ణరధంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.   వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. స్వామి వారు స్వర్ణరధంలో ఊరేగుతుంటే , పలు రాష్ట్రాలనుంచి వచ్చిన  భజన బృందాలు  కోలాట బృందాలు స్వామి వారి  ముందుఆడిపాడుతున్నారు. ఈ సాయంత్రం స్వామి వారికి అశ్వవాహనసేవ జరుగుతుంది. 

 

13:39 - October 17, 2018

ఢిల్లీ : వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీనితో నగదు కోసం ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గురువారం నుండి ఆదివారం వరకు సెలవులు రావడంతో బ్యాంకులు తెరుచుకోవు. గురువారం నవమి, శుక్రవారం విజయదశమి పండుగలు. ఈ నేపథ్యంలో నగదును ఏటీఎంలో నిల్వ చేయడం జరిగిందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. 
పండుగలు..వరుస సెలవులు రావడంతో పలువురు వారి వారి గ్రామాలకు తరలివెళుతున్నారు. గురువారం రోజునే సరిపడా డబ్బును డ్రా చేసుకోవాలని పలువురు ఆలోచిస్తున్నారు. నగదు తీసుకోవడానికి వెళ్లిన వారికి ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేస్తాయని సమాచారం. 
ఇక నవంబర్ నెలలో కూడా పలు సెలవులు వచ్చాయి. నవంబర్ 7 నుండి నవంబర్ 9 వరకు బ్యాంకులు పనిచేయవని తెలుస్తోంది. నవంబర్ 10వ తేదీన రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. 

13:32 - October 17, 2018

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఓ పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఫతేహ్‌హడల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో బుధవారం ఉదయం ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. ముష్కరులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరికొందరు పోలీసులు గాయపడినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

 

13:22 - October 17, 2018

లండన్ : అత్యంత విలువైన ఆస్తులను స్వంతం చేసుకోవడంలో భారతీయులు వేరెవ్వరితోనూ తీసిపోరు. ఇలా ఏదైనా విలువైన, చారిత్రాత్మకమైన అస్తులు కొనాలనుకొనే వారికి ఓ అవకాశం రెడీగా ఉంది.  ఇంగ్లండ్‌ నైరుతీ ప్రాంతంలో ఉన్న దేవన్‌లోని పోర్ట్ సిటీ ప్లైమౌత్ దగ్గరలోని డ్రేక్ ఐలండ్ అమ్మకానికి పెట్టారు. దీని ధర అక్షరాలా..6 మిలియన్ పౌండ్లు అంటే రూ 581 కోట్ల రూపాయల పైమాటే.. జేఎల్‌ఎల్ అనే సంస్థ ఈ దీవి అమ్మకాన్ని పర్యవేక్షిస్తోంది. ఇక్కడ అత్యంత విలాసవంతమైన స్పాతో పాటు ఒక అత్యాధునికమైన హోటల్ నిర్మాణానికి అనుమతులను ఈ సంస్థ పొందింది. 
ఈ దీవిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవి మీకోసం. .

 • ఈ దీవి సముద్ర వారసత్వ సంపదగా భావిస్తారు.
 • ఇది చరిత్రాత్మకమైన బాబ్రికన్ ప్రాంతంలో ఉంది
 • సట్టన్ హార్బర్‌లో నేషనల్ మెరైన్ అక్వేరియం కలిగి ఉంది.
 • ఇందులో 16వ శతాబ్దం నాటి రాతి గుహలు, సొరంగాలు ఉన్నాయి
 • ఈ దీవి విస్తీర్ణం 6.5 ఎకరాలు
 • ఈ ఐలండ్ సర్ ఫ్రాన్సీస్ డ్రేక్ అనే నావికుడు పేరుతో పిలువబడుతోంది
 • డ్రేక్ 1577 ప్రాంతంలో ఈ దీవి నుంచి సముద్రంలో ప్రయాణించి 1580 లో అంటే 3 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడకే చేరుకున్నాడు. 
 • 1583లో ఈ ఐలండ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యాడు.
 • స్పానిష్, ఫ్రెంచ్ ఆక్రమణదారుల నుంచి రక్షించడంలో ఈ కోట కీలక పాత్ర పోషించింది. 
 • వచ్చిన బెస్ట్ ఆఫర్లను ప్రకటించేందుకు త్వరలో ఓ మంచి ముహూర్తాన్ని  విక్రేతలు నిర్ణయించనున్నారు. 
 • ఈ దీవిని 1995లో డ్యాన్ మెక్ కాలీ అనే వ్యక్తి 384,000 పౌండ్లు ( రూ. 37.19 కోట్లు)కు కొనుగోలు చేశాడు. 
 • ప్రస్తుతం డ్రేక్ దీవి ఓనర్ ఇక్కడ ఒక హోటల్‌తో పాటు స్పాను నిర్మించాలని ప్లాన్ చేశారు. 

FollowFollow @JLLUK
More

Our team is marketing Drake’s Island, a historical fortress island just off Plymouth, with planning permission for luxury hotel and spa complex

13:09 - October 17, 2018

అమెరికా : కోడి కూర తినాలంటే కోడిని కోయాలి. మేక మాంసం తినాలంటే మేకను కోయాల్సిందే. ఇవి ఇప్పటివరకు మనం అనుసరిస్తున్న విధానాలు. కానీ భవిష్యత్తులో ఇందుకు భిన్నంగా ఉండబోతోంది. కోళ్లు, మేకలను చంపకుండానే వాటి మాంసాన్ని తినే రోజులు త్వరలోనే రానున్నాయి. ఇందుకు పరిష్కారమార్గంగా అమెరికా శాస్త్రవేత్తలు కణ ఆధారిత మాంస ఉత్పత్తిపై దృష్టి సారించారు. కోడి రెక్కల కణాల నుంచి వారు మాంసం ముక్కలను అభివృద్ధి చేశారు. వండిన అనంతరం వాటి రుచి అచ్చం కోడి మాంసాన్నే పోలి ఉండటం గమనార్హం. ఇదే తరహాలో చేపల వంటి ఇతర జంతువుల సజీవ కణాల నుంచి వాటి మాంసాన్ని కూడా ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. 

12:46 - October 17, 2018

శ్రీకాకుళం : జిల్లాలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పర్యటిస్తున్నారు. ఇటీవలే తిత్లీ తుపాన్‌తో జిల్లాలో అపార నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉద్దాన్నం ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. వేలాది కొబ్బరిచెట్లు నేలకూలడం..పంటలు నీట మునిగిపోవడం..నివాసాలు నేలమట్టమయ్యాయి. దీనితో ఉద్దాన్నం వాసులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో దత్తత తీసుకున్న సహలాలపుట్టుగ గ్రామంలో లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. 
తుపాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతోందని, కొబ్బరి పంటకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. మిగిలిన చెట్లను రక్షించాలని రైతులు కోరుతున్నారని, పడిపోయిన చెట్ల ప్రాంతాన్ని క్లియర్ చేయాలంటున్నారని తెలిపారు. మరలా కొబ్బరి పంట రావాలంటే చాలా కాలం పడుతుందని, అరటి చెట్లు పంట పెట్టడం..కోకో పంటలు వేసుకొనే విధంగా ప్రభుత్వ స్థాయిలో ఆలోచించాలని సూచించారు. ఇక్కడ చాలా మంది చిన్న రైతులున్నారని, ఒక సంవత్సరపు పాటు ఒక్కో పంచాయితీకి హార్టికల్చర్ అధికారిని కేటాయించాలని సూచించారు. రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 

12:42 - October 17, 2018

శ్రీకాకుళం : జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. తిత్లీ తుపాను బాధితులను పవన్ పరామర్శించనున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి, సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ హత్యలపై పవన్ చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే పవన్ ఉత్తరాంధ్ర పర్యటనకు ముందే ప్రకంపనలు రేగాయి. 

 

12:36 - October 17, 2018

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం జెర్సీ, ఈ ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. మళ్ళీరావా‌తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ కథానాయికలుగా నటిస్తున్నారు..
త్రివిక్రమ్ ముహూర్తపు సన్నివేసానికి క్లాప్ కొట్టగా, నిర్మాత చినబాబు, త్రివిక్రమ్ కలిసి దర్శకుడికి కథ అందచేసారు..
జెర్సీలో నాని తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడని తెలుస్తోంది.. క్రికెట్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో సత్యరాజ్, బ్రహ్మీజీ కీలక పాత్రలు పోషించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు..

12:23 - October 17, 2018

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను నిర్ధాక్షిణ్యం గా సస్పెండ్ చేశారని,నాపైవచ్చిన ఆరోపణలకు వివరణ అడగకుండానే, అహంకారపూరితంగా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని  ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన మేనిఫెస్టో  కమిటీ మీటింగ్లో గిరిజనుల సంక్షేమానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు  రిజర్వేషన్ పెంచుతామని,ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, అవి అమలు చేయకుండానే ప్రభుత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్లిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెండు సామాజిక వర్గాలకు కార్పోరేషన్ ఏర్పాటు చేశారని, గిరిజనుల సంక్షేమానికి ఒక డెవలప్మెంట్ బోర్డు వెయ్యమని అనేక సార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశానని,ఆవిషయాన్ని ఆయన విస్మరించారని రాములు నాయక్ అన్నారు. సమాజంలోని ప్రతి2 కులాల మధ్య ముఖ్యమంత్రి చిచ్చుపెట్టారని రాములు నాయక్ ఆరోపించారు.

12:16 - October 17, 2018

హైదరాబాద్ : ఎన్నికల కోడ్‌ అమలుతో రైతుబందు పంటసాయం రెండో విడత ఆలస్యమైంది. చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం నో చెప్పడంతో.. ముద్రించిన చెక్కులను వెనక్కి తెప్పిస్తున్నారు. లబ్ధిదారుల అకౌంట్‌లో డబ్బులు జమ చేసేందుకు వారి ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 10 లక్షల మంది వివరాలు సేకరించగా.. మిగతావారి వివరాలు కూడా త్వరలోనే పూర్తి చేసి నగదు జమ చేస్తామంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ కూయడంతో రైతుబంధు పంటసాయం రెండో విడత పంపిణీ కార్యక్రమం మళ్లీ మొదటికొచ్చింది. రైతులకు ఇచ్చేందుకు చెక్కులన్నీ సిద్దం కావడం.. కొన్ని గ్రామాల్లో చెక్కుల పంపిణీ కూడా జరిగిపోయింది. అయితే ఈసీ ఆదేశాలతో ఇప్పుడు ఆ చెక్కులన్నీ వెనక్కి తీసుకుంటున్నారు అధికారులు.
ఇక లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలోనే డబ్బులు జమ చేయాలని సూచించడంతో.. వ్యవసాయ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు 51 లక్షల మంది రైతులకు 5,200 కోట్ల రూపాయల వరకు అందించనున్నారు. ఇందుకోసం 2,400 మంది ఏఈవోలు రోజుకు కనీసం వంద నుంచి 200 మంది రైతుల బ్యాంక్‌ ఖాతా నంబర్లు సేకరిస్తున్నారు. ఆ ఖాతాల నంబర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి రిజర్వ్‌బ్యాంక్‌కు పంపించాల్సి ఉంటుంది. అనంతరం రిజర్వ్‌బ్యాంక్‌ వద్ద ఉన్న ఈ-కేబేర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రైతులకు పెట్టుబడి సొమ్ము చేరనుంది. రైతుకు ఖాతా ఉన్న బ్యాంక్‌తో సంబంధం లేకుండానే ఒకేసారి వారి ఖాతాల్లో సొమ్ము చేరిపోతుందని అధికారులంటున్నారు. తొలి విడత పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహించింది. చెక్కుల రూపంలో రైతులకు గ్రామసభలో అందించారు. కానీ.. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పంట పెట్టుబడి సాయం సైలెన్స్‌గా కొనసాగుతోంది. 
 

12:09 - October 17, 2018

కేరళ : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉద్రిక్తత నెలకొంది. అయప్ప దర్శనానికొచ్చిన ఓ మహిళపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయప్ప మాల ధరించి వచ్చిన మహిళపై పతనంతిట్ట బస్‌స్టాండ్‌లో కార్యకర్తలు దాడి చేశారు. ఇవాళ సాయంత్రం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఆలయ దర్శనానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాకు చెందిన మాధవి అనే మహిళ భర్త, కూతురితో కలిసి శబరిమలకు వెళ్లింది. అయప్ప మాల ధరించి వచ్చిన మాధవిపై పతనంతిట్ట బస్‌స్టాండ్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. స్వామియే శరణం అయప్ప అంటూ భక్తుల నినాదాలు చేశారు. పోలీసులు మహిళకు రక్షణ కల్పించారు. 

 

12:03 - October 17, 2018

హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పక్షాలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అవకాశం ఉన్న అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులు తెలుసుకునేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దింపారు. ఈ విషయం బయటపడడంతో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ కూడా అప్రమత్తమైంది. 
తెలంగాణ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌ పెద్దలు దృష్టి సారించారు. ఇక్కడి పరిస్థితులు, పరిణామాలపై ఎప్పటికప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు అక్కడి ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. నగరంలోని పలు హోటళ్లలో మకాం వేసి ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఏపీ అధికారుల కదిలికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా పెట్టారు. 
అయితే.. ఏపీ నిఘా వర్గాలు నెల క్రితమే తెలంగాణలో దిగినట్లు సమాచారం ఉంది. తెలంగాణ జిల్లాల్లోని రాజకీయ పరిస్థితి ఏంటి ? టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఇంకా అవకాశం ఉన్న ప్రాంతాలేంటి ? మహాకూటమిలో టీడీపీ చేరితే ఎన్ని సీట్లు కోరవచ్చు ? అనే అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తన ఇంటెలిజెన్స్‌ అధికారులతో ఆరా తీసినట్లు బయటకు పొక్కడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఇక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఈ కార్యక్రమం మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అధికారులు మరో అడుగు ముందుకేసి ప్రముఖ హోటళ్లలో బస చేస్తూ.. తెలంగాణ పోలీసు అధికారులపైనే రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఇంటిలిజెన్స్‌ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. 
సాధారణంగా ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు సమాచార గోప్యత, పని వెసులుబాటు కోసం ప్రైవేట్‌ చోట నుంచి పని చేసేందుకు తమ పరిధిలోని హోటళ్లను ఎంచుకుంటారు. అయితే ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలంగాణలో అనధికారికంగా దిగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ అధికారులు వ్యూహాత్మకంగానే కొన్ని హోటళ్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. రాజకీయ అంశాలపై ఆరా తీసే అధికారం ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులకు ఉండదని.. న్యాయవాదులంటున్నారు. మొత్తానికి దాదాపు 60 మంది నిఘా అధికారులను హైదరాబాద్‌కు పంపించినట్లు సమాచారం. అలాగే వందమంది ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు... నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో మోహరించినట్లు తెలుస్తోంది. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఇంటెలిజెన్స్‌ అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎవరికి దొరికిన సమాచారం వారు చేరవేస్తున్నారు. 
 

11:49 - October 17, 2018

విజయవాడ : తిత్లీ తుపాను సాయంపై కేంద్రంపై టీడీపీ ఒత్తిడి పెంచుతోంది. తిత్లీ తుపాను ప్రభావంతో అతలాకుతలమైన  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు .. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖను రాశారు. రెండు జిల్లాలను ఆదుకోవడానికి తక్షణ సాయంగా 1200 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు.  టీడీపీ ఎంపీలు  కేశినేని నాని, కొనకళ్ల  నారాయణ, మాగంటి బాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డి గన్నవరం విమానాశ్రయంలో రాజ్‌నాథ్‌ను కలిశారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖను ఆయనకు అందజేశారు. తుఫానుతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 3,435.29 కోట్ల నష్టం వాటిల్లినట్టు రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలోనే మకాం వేసిన ఏపీమంత్రి నారా లోకేష్‌.... సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకున్నా... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా సహాయం అందిస్తున్నామన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని,  పునరావాసం కల్పించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాకు కేంద్ర బృందాలను వెంటనే పంపాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. రాజ్‌నాథ్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లింది. మరి దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

11:32 - October 17, 2018

ఢిల్లీ : రాఫెల్‌ యుద్ధవిమానాల కుంభకోణం రోజుకో ఆసక్తికర మలుపు తిరుగుతోంది. రాఫెల్స్‌ను తయారుచేసే సంస్థ- దసో ఏవియేషన్‌ తన ఉద్యోగ సంఘాలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలను వెల్లడించే మరో రెండు పత్రాలు లీకయ్యాయి. పోర్టెయిల్‌ ఏవియేషన్‌ అనే ఫ్రెంచి వెబ్‌సైట్‌ వీటిని బయటపెట్టింది. అనిల్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ను ఎందుకు తాము  భాగస్వామిగా ఎంచుకోవాల్సి వచ్చిందో దసో డిప్యూటీ సీఈవో లోయిక్‌ సెగాలెన్‌ ఇచ్చిన వివరణ ఈ పత్రాల్లో ఉంది.  మేకిన్‌ ఇండియా పథకంలో భాగంగానే... అనిల్‌ అంబానీ కంపెనీని దసోకు అంటగట్టారని ఈ డాక్యుమెంట్లలో తేటతెల్లమవుతోంది. రిలయన్స్‌ను తమ ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా దసోయే ఎంపిక చేసుకుందని, దీనితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని అటు దసో ఏవియేషన్‌తో పాటు భారత ప్రభుత్వం కూడా వాదిస్తూ వచ్చాయి. కానీ అది నిజం కాదని ఉద్యోగ సంఘాలకు సెగాలెన్‌ ఇచ్చిన వివరణ రుజువు చేస్తోంది.

11:28 - October 17, 2018

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారి  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఎనిమిదవ రోజైన ఆశ్వయుజ శుధ్ద అష్టమి, బుధవారంనాడు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి అవతారాల్లో  దుర్గ అవతారానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ముగ్గురమ్మలకు మూలమైన ఆ జగన్మాత దుష్టశిక్షణకు,శిష్టరక్షణకు దుర్గాదేవిగా అవతరించింది. దుర్గతులను నాశనం చేసే  భక్తులను కాపాడుతుంది. ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవి అమ్మవారిని ‘దుర్గా' అని పిలుస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి పై రద్దీ పెరిగింది. భవానీమాల వేసుకున్న భక్తులు  దీక్ష విరమణ కోసం పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుని  కృష్ణానదిలో స్నానమాచరించి  కొండపైకి చేరుకుంటున్నారు. భక్తులను తెల్లవారుఝూము 3 గంటలనుంచే దర్శనానికి అనుమతించారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. 

11:23 - October 17, 2018

ఢిల్లీ : మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ ఎలెన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా లింపోమా కేన్సర్‌తో బాధపడుతున్న ఎలెన్‌ స్థానిక సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సోదరి జోడి వెల్లడించారు. ఆయన మృతిపట్ల బిల్‌గేట్స్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల సంతాపం ప్రకటించారు. చిరకాల మిత్రుడు ఎలెన్‌ మృతి తనను కుదిపేసిందని, ఎలెన్‌ లేకుంటే పర్సనల్‌ కంప్యూటింగ్‌ ఉండేదే కాదని బిల్‌గేట్స్‌ అన్నారు. టెక్‌ రంగానికి ఎలెన్‌ అందించిన సేవలు ఎనలేనివని సత్యనాదెళ్ల కొనియాడారు. బిల్‌గేట్స్‌తో కలిసి 1975లో ఎలెన్‌ మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్‌ నుంచి వైదొలిగిన అనంతరం 1986లో ఉల్కెన్‌ ఇంక్‌ అనే సంస్థను ప్రారంభించారు.

11:20 - October 17, 2018

అనంతపురం : తెలుగు రాష్ట్రాల్లో వరుసుగా కుల దురహంకార హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాల కన్నా కులానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారని కన్నబిడ్డలనే కడతేర్చుతున్నారు. తెలంగాణలో మిర్యాలగూడలో ప్రణయ్ హత్య, హైదరాబాద్‌లో ప్రేమజంటపై దాడి ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలోనూ కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరో కుల దురహంకార హత్య జరిగింది. తమకు ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు బాలికను దారుణంగా హత్య చేశారు. హెచ్ఎల్‌సీ కాలువలో ఆదివారం ఓ బాలిక మృతదేహం కనిపించింది.

అనంతపురం జిల్లా చెన్నంపల్లికి చెందిన హేమశ్రీ(16), మోహన్‌రాజు(20) పది రోజుల కిందట తిరుమలకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఆమె యువకుడితో కలిసి గ్రామానికి వచ్చింది. వివాహం చేసుకుని గ్రామానికి వచ్చారని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు యువకుడి ఇంటికి వచ్చారు. ఇంటికి రావాలని తల్లిదండ్రులు బాలికను కోరారు. ఆమె ససేమిరా అనటంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై కొందరు యువకులు 100కు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారని, పోలీసులు స్పందించలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

అయితే ఆగ్రహం పట్టలేని తల్లిదండ్రులు నాలుగురోజుల కిందట బాలికను వీధుల్లో కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి నుంచి బాలిక, తల్లిదండ్రులు గ్రామంలో కనిపించలేదు. ఈ క్రమంలో గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాలిక తండ్రి, బాబాయ పథకం ప్రకారం హేమశ్రీని బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని హెచ్ఎల్‌సీ కాలువలో పడేశారు. 

ఆదివారం హెచ్ఎల్‌సీ కాలువలో బాలిక మృతదేహం కనిపించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ మృతదేహం చెన్నంపల్లికి చెందిన బాలిక హేమశ్రీ(16)దిగా నిర్ధారించారు. దీనిపై మంగళవారం బాలిక తల్లిదండ్రులు ఎర్రమ్మ, నారాయణస్వామితోపాటు బాలిక బాబాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందనే ఆగ్రహంతో కుటుంబసభ్యులే హత్య చేసి హెచ్ఎల్‌సీ కాలువలో పడేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

 

11:16 - October 17, 2018

ఢిల్లీ : ఆకలి లేదా పోషకాహార లోపం వల్ల ప్రతి ఐదు నుంచి పది క్షణాలకు ఒకరు చొప్పున బాలలు మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఆహార విభాగం హెచ్చరించింది.  ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఉత్పత్తి క్రమంలో, వంట గదుల్లో ఎంతో ఆహారం వృథా అవుతున్నదని వివరించింది.  ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా రోమ్‌ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి ఆహార కార్యక్రమం  అధిపతి డేవిడ్‌  బీలే పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఓ పీడ కల రాబోతున్నదని, ఓ తుపాను మన ముందున్నదని ఆకలిని గూర్చి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని 15.5 కోట్ల మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పారు. సూక్ష్మపోషకాల లోపంతో 200 కోట్ల మంది బాధపడుతుండగా, 60 కోట్ల మంది స్థూలకాయులుగా ఉన్నారని తెలిపారు. 

11:03 - October 17, 2018

ఢిల్లీ : ప్రొ-కబడ్డీలో తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో టైటాన్స్‌ ఓటమిపాలైంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ జట్టు 25-30 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌పై జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ విజయం సాధించింది. తెలుగు టైటాన్స్‌ - బెంగాల్‌ వారియర్స్‌ మధ్య పోటీ చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది.  ఆరంభంలో ఇరు జట్లూ డిఫెన్స్‌కే పరిమితం అయ్యాయి. దీంతో ఫస్టాఫ్‌ చప్పగా సాగింది. 10 నిమిషాల  ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ 8-6తో ముందంజలో నిలిచింది. ఆతర్వాత  టైటాన్స్‌ ఆటగాడు నీలేష్‌ సక్సెస్‌ఫుల్‌ రైడ్‌తో స్కోరు  9-9తో సమమైంది.  ఆ తర్వాత రైడింగ్‌కు వచ్చిన మహేష్‌ను పట్టేసిన టైటాన్స్‌.. 11-9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ వెంటనే జోరును కొనసాగిస్తూ 13.10తో బ్రేక్‌కు వెళ్లింది.
సెకండాఫ్‌లో బెంగాల్‌ వ్యూహం మార్చింది. నిలకడగా ఆడుతూ పాయింట్లు రాబట్టింది. గెలిచేందుకు టైటాన్స్‌కు మంచి అవకాశాలు వచ్చినా ఆ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. 32వ నిమిషంలో బెంగాల్‌ పుంజుకుంది. అక్కడి నుంచి బెంగాల్‌ తన జోరును కొనసాగించింది. అప్పటి వరకు 17-17గా ఉన్న స్కోరును... మనీందర్‌ డబుల్‌ రైడింగ్‌ పాయింట్లతో ఆధిక్యాన్ని అందించాడు.  అక్కడి నుంచి మరింత ఉత్కంఠ పెరిగింది. 39వ నిముషంలో టైటాన్స్‌ 25-27తో వెనుకబడి ఉండగా...రాహుల్‌ చౌదరి చేసిన తప్పిదంతో ప్రత్యర్థికి రెండు పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. రాహుల్‌ ఈ మ్యాచ్‌లో ఒక్క రైడింగ్‌ పాయింట్‌ కూడా సాధించలేదు. రెండు ట్యాకిల్‌ పాయింట్లు మాత్రమే తెచ్చాడు. బెంగాల్‌ రైడర్‌ మణీందర్‌సింగ్‌ 11 పాయింట్లతో జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ ఫాంథర్స్‌, హరియాణా స్టీలర్స్‌ తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌  36-33 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.  నితిన్‌ నర్వాల్‌ 8 రైడ్‌ పాయింట్లతో జైపూర్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐతే ఈ మ్యాచ్‌లో హరియాణా ఆటగాడు నవీన్‌ ఏకంగా 15 రైడ్‌ పాయింట్లు సాధించాడు. కానీ జట్టును విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. అతడికి సహచరుల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. దీంతో హరియాణా స్టీలర్స్‌ అపజయాల్లో మరో ఓటమి చేరింది.

10:56 - October 17, 2018

హైదరాబాద్ : తెలంగాణాలో పూలతో జరుపుకునే  అతి పెద్ద పండగ బతుకమ్మ. ఈ ఉత్సవాల్లో చివరిరోజైన  సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు  రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  విద్యుత్‌ వెలుగుల్లో.. రంగురంగుపూల బతుకమ్మలతో ట్యాంక్‌బండ్‌పై అందంగా  తీర్చిదిద్దారు. ఇదివరకూ నీటిలోనే జరుపుకున్న బతుకమ్మను.. బుధవారం గాలిలో ఊరేగించేందుకు  ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ప్రకృతి స్వరూపిణి గా అమ్మతల్లిని భావించి, రకరకాల రంగురంగు పూలతో  పేర్చి 'బతుకమ్మ'గా ఆరాధిండం సంప్రదాయం.  మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవాల్లో  రాష్ర్ట సాంస్కృతిక సౌరభాలు వెల్లివిరుస్తాయి.  బతుకునివ్వడంతో పాటు.. సకల ప్రాణులకూ జీవశక్తిని అందజేసే ప్రకృతి, ఆకృతే  బతుకమ్మ.  ఈ ఉత్సవాల్లో చివరిరోజున సద్దుల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ సద్దుల బతుకమ్మ ఉత్సవాలకోసం రాష్ర్ట ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
రాష్ర్టవ్యాప్తంగా  సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. ఈ వేడుకల కోసం టూరిజం, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బైసన్‌పోలో గ్రౌండ్‌లోనూ  ఉత్సవాలు జరపనున్నారు. ఇప్పటి వరకూ నీటిలోనే జరిపిన  బతుకమ్మ ఉత్సవాలు.. ఇవాళ నింగిలోనూ సాగనున్నాయి. ప్యారాచ్యూట్‌లో బతుకమ్మను ఊరేగించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. టూరిజం శాఖ, బ్రహ్మకుమారీలు సంయుక్తంగా ట్యాంక్‌ బండ్‌పై విదేశీయులతో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు.
తొమ్మిదిని పూర్ణత్వానికి సంకేతంగా భావించి.. తొమ్మిది రకాల పుష్పాలతో తొమ్మిది వరసల్లో అమర్చి పూజలు చేస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా ఆరాధించడం సంప్రదాయం. తొమ్మిది రోజులూ గౌరీదేవి పూలమ్మగా పుట్టింటికి  వచ్చినట్లు భావిస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మను సాగనంపే వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. గౌరమ్మను అత్తవారింటికి  పంపుతూ, సకల సౌభాగ్యాలూ అనుగ్రహించేందుకు  మళ్లీ రావాలని వేడుకుంటారు. ప్రకృతి నుంచి ఆవిష్కృతమైన పూల పుంత బతుకమ్మ. జలాల్లో సమ్మిళితమై, చివరికి ఆ ప్రకృతిలోనే మమేకమవుతుంది. 
బతుకమ్మ అంటేనే పూలపండగ.. కానీ.. పూల ధరలు మండిపోతున్నాయంటున్నారు ప్రజలు. కానీ తామేమీ ధరలు పెంచలేదంటున్నారు దుకాణదారులు. గతంతో పోలిస్తే ఈ సారి ధరలు  సాధారమణంగానే ఉన్నాయంటున్నారు.

10:37 - October 17, 2018

న్యూఢిల్లీ: వీడియో వీక్షించే వినియోగదారులకు దాదాపు 45 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. కారణం గూగుల్‌కు చెందిన యూట్యూబ్ షేరింగ్ సేవలు బుధవారం కొద్దిసేపు నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన సాంకేతిక కారణాల వల్ల యూట్యూబ్ సేవలు ఆగిపోయాయి. గూగుల్ సంస్థ నుంచి వచ్చిన యూట్యూబ్ 2005 సంవత్సరంలో ప్రారంభించిన నాటినుండి ఇంటర్‌నెట్‌ అత్యధిక వినియోగదారులు సందర్శించే వేదికగా పేరు గడించింది.
‘‘ మేము రిస్టోర్ చేశాం. మీ సహనానికి ధన్యవాదాలు. ఒకవేళ మీరు  ఈ సమస్య ఇంకా ఫేస్ చేస్తున్నట్టయితే మాకు సమాచారం ఇవ్వండి’’ అంటూ యూట్యూబ్ టీమ్ వినియోగదారులను కోరింది. 
ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ వినియోగదారులు సేవలు అందక ఈ ఉదయం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందరూ ‘‘ 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్’’ అంటూ స్క్రీన్‌పై అక్షరాలు ప్రత్యక్షం కావడంతో పదేపదే బ్రౌజ్ చేయటం ప్రారంభించారు. ఈ సమస్య 45 నిమిషాలపాటు భారత్ సహా అన్ని దేశాల్లోనూ కనిపించింది. 
నిన్న ట్విట్టర్‌లో ఎదుర్కొన్న సమస్యనే ఇవాళ యూట్యూబ్ వినియోగదారులూ అనుభవించారు. ట్విట్టర్ దాదాపు 1 గంటపాటు ఆగిపోయింది. అలాగే మరో సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ సేవలు కూడా కొద్దికాలం క్రితం ఇలాగే నిలిచిపోయాయి. 
 

 

10:19 - October 17, 2018

తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి  ఆలయాన్ని నెలవారి పూజలు చేసే క్రమంలో భాగంగా  బుధవారం సాయంత్రం  తెరవనున్నారు. ప్రతినెల  దేవాలయం  తెరిచినప్పుడు 5 రోజులు  భక్తుల  దర్శనానికి అనుమతిస్తారు.  శబరిమల అయ్యప్ప స్వామి  ఆలయంలోకి అన్నివయసుల  మహిళలకు   ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత  ఆలయాన్ని భక్తుల కోసం  తెరవడం ఇదే మొదటిసారి.

నిషేధిత వయస్సుకల మహిళలు  స్వామి వారి ఆలయంలోకి ప్రవేశిస్తే  ఆలయాన్ని ప్రతిరోజు శుధ్ది చేయాల్సి ఉంటుందని  ఆలయ పురోహితులు చెపుతున్నారు. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత కేరళలోని అన్ని జిల్లాలలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈరోజు గుడి తెరవనుండటంతో ఆలయ ప్రధాన ద్వారమైన నిలక్కళ్‌ వద్దకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు చేరుకుని నిషేధిత వయస్సుగల స్త్రీలు కొండ ఎక్కకుండా అడ్డుకుంటున్నారు. కొండపైకి వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేసి నిషేధిత వయసుకల మహిళలు ఉంటే వారిని వాహనాల్లోంచి దింపేస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. గుడిలోకి వెళ్లే మహిళలను అడ్డుకోబోమని, ఆలయానికి వెళ్లే మహిళలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరతామని ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు.

10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఇంతకాలం శబరిమల ఆలయంలోకి అనుమతిలేదు. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుప్రీం  కోర్టుకు వ్యతిరేకంగా ఇంత పెద్దఎత్తున  ఉద్యమం రావటం ఇదే మొదటిసారి. సుప్రీం తీర్పుపై  రివ్యూ పిటీషన్ వేసే అంశంలో  రాజకుటుంబీకులకు ,దేవస్ధానం బోర్డుకు మధ్య చర్చలు విఫలం అయ్యాయి. ఆలయంలోకి మహిళల ప్రవేశం పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసే ఉద్దేశ్యం లేదని  కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కానీ  దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి  భక్తులు  సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేసారు. దసరా శలవుల తర్వాత  సుప్రీం ఈ పిటీషన్ల పై విచారణ చేపడుతుంది. ఎన్నోఉద్రిక్తల మధ్య ఈ సాయంత్రం శబరిమల ఆలయం తెరుస్తున్నారు. ఆలయంలోకి మహిళలను అనుమతిస్తారా,లేదా,  మహిళా సంఘాలు, భక్తులు మధ్య  ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే ఈ సాయంత్రం దాకా వేచి చూడాలి. 

10:05 - October 17, 2018

ముంబై : రాజ‌కీయాల్లోకి ఎవ‌రైనా రావ‌చ్చు...సినిమా..క్రీడా..వివిధ రంగాల‌కు చెందిన వారు..వారి త‌న‌యులు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.  త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలువురు వివిధ పార్టీల్లోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టీమిండియా బౌలర్ మహ్మద్ షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన సతీమణి హసీన్ జహాన్...రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. ముంబై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. వృత్తి రీత్యా జహాన్ మోడల్. కానీ ఆమె సినీ రంగంలో ప్రవేశిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఏకంగా రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారంట. పనిలో పనిగా బాలీవుడ్‌లో అవకాశాలు వస్తే నటించడానికి జహాన్ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. 
గతంలో షమీతో జహాన్‌ కుటుంబంపై ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. షమీ అతని కుటుంబసభ్యులు తనను శారీరకంగా హింసించారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పోలీసు కేసు పెట్టారు. దీనితో షమీ బీసీసీఐ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. కొద్దిరోజుల తరువాత షమీని బీసీసీఐ మళ్లీ తీసుకుంది. మరి జహాన్ రాజకీయాల్లో రాణిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

09:39 - October 17, 2018

హైదరాబాద్ : దసరా పండుగ సందర్బంగా పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ ప్రసిద్ధి. దసరా పండుగకు ముందు రోజున సద్దుల బతుకుమ్మ పండుగ చేస్తారు. సద్దుల బతుకుమ్మను వివిధ రకాల పూలతో పేల్చుతారు. చాలా మంది భారీగా పూలను కొనుగోలు చేస్తారు. దీంతో మార్కెట్‌లో అన్ని రకాల పూల ధరలు భారీగా పెరిగాయి. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో పూల ధరలు పెరిగాయి. పూల ధరలు ఆకాశాన్నంటాయి.  సామాన్యునికి అందని రీతిలో పెరిగాయి. వివిధ జిల్లాల నుంచి పూలను హైదరాబాద్‌కు తీసుకొస్తారు. ఇవాళ సద్దుల బతుకుమ్మ పండుగ నేపథ్యంలో పూల ధరలు మండిపోతున్నాయి. నిన్న కిలో చామంతి రూ.100 ఉండగా నేడు 200 రూపాయలు అయింది. కిలో బంతి పూల ధర 80 రూపాయలు అయింది. పూల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు కొనలేకపోతున్నారు. ధరలను తగ్గించాలని కోరుతున్నారు. 

 

09:14 - October 17, 2018

హైదరాబాద్‌ : నగరంలో భారీ వర్షం కురిసింది. నగరం తడిసిముద్దైంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది.నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చందానగర్, మియాపూర్, ఖైరతాబాద్‌, విద్యానగర్, అశోక్‌నగర్, బాగ్‌లింగంపల్లి, చిక్కడిపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ, సికింద్రాబాద్, అల్వాల్‌తోపాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వచ్చే 3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షంతోపాటు 32 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 

 

08:36 - October 17, 2018

ఢిల్లీ : భారత విదేశాంగ సహాయమంత్రి ఎంజే అక్బర్‌ మీ టూ ఉద్యమం సుడిలో చిక్కుకున్నారు. ఎంజే అక్బర్‌ వేధింపుల గురించి మొదట ప్రముఖు పాత్రికేయురాలు ప్రియా రమణి బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మహిళ మంత్రి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మీ టూ స్టోరీతో ముందుకు వచ్చారు. 

తుషితా పటేల్ అనే మహిళ ఎంజే అక్బర్‌ తనను లైంగికంగా వేధించాడని తెలిపారు. ఓ హోటల్‌లో ఆయన అర్ధ నగ్నంగా తనను కలవడమే కాకుండా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపించించారు. ఆయనతో రెండు సందర్భాల్లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని వెల్లడించించారు.

కాగా తన మీద మహిళా జర్నలిస్టులు చేస్తోన్న ఆరోపణలన్నీ అబద్ధాలని అక్బర్‌ అంటున్నారు. అంతేకాకుండా ప్రియా రమణి మీద పరువు నష్టం దావా కేసు కూడా వేశారు. కానీ బాధితులంతా రమణికి పూర్తి మద్దతు ప్రకటించారు. రమణికి మాత్రం మద్దతు విపరీతంగా పెరిగిపోతోంది. అలాగే క్రౌడ్ ఫండింగ్ సాయంతో ఆమెకు న్యాయపరమైన ఖర్చులు అందించి.. సహకరిస్తామని హామీ ఇచ్చారు. 

08:24 - October 17, 2018

ఢిల్లీ : సినీరంగం నుంచి మొదలై వివిధరంగాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న మీటూ ఉద్యమం సెగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తాకింది. మొన్నటికి మొన్న ఎన్డీయేలోని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్  జర్నలిస్టుగా పనిచేసేటప్పుడు మహిళా ఉద్యోగినులను వేధించిన ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. లేటెస్ట్ గా  కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం (ఎన్.ఎస్.యూ.ఐ) జాతీయ అధ్యక్షుడు  ఫైరోజ్ ఖాన్  లైంగిక వేధింపుల కేసులో మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. చత్తీస్ ఘడ్ కు చెందిన ఒక మహిళా కాంగ్రెస్ కార్యకర్త  ఫైరోజ్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని  పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఫైరోజ్ ఖాన్ వల్ల తన ప్రాణాలకు ముప్పు  పొంచి ఉందని  కూడా ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.  ఫైరోజ్ ఖాన్ రాజీనామాను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఫైరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లకూడదనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే మహిళ చేసిన ఆరోపణలపై  నిజానిజాలు విచారించేందుకు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. 

07:56 - October 17, 2018

కర్నూలు : జిల్లాలో విషాదం నెలకొంది. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు దర్గాకు వెళ్తూ మృత్యులోకాలకు వెళ్లారు. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 

కర్నూలు వన్‌టౌన్‌కు చెందిన ఓ కుటుంబం చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు ట్రాలీ ఆటోలో వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఆలూరు మండల పెద్దహోతూరు సమీపంలో బుధవారం తెల్లవారుజామున ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాదం సమయంలో ఆటోలో 21 మంది ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

06:39 - October 17, 2018
ఢిల్లీ:ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి నేషనల్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ 50 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇళ్ళమధ్యలో ఉక్కు శుధ్ది పరిశ్రమల ఏర్పాటును ఆప్ ప్రభుత్వం నిరోధించలేకపోయిందని ఆరోపిస్తూ ‘ఆలిండియా లోకాధికార్‌ సంఘం’ అనే స్వఛ్చంద సంస్ధ ఎన్జీటిలో పిటీషన్ వేసింది. పిటిషన్‌ను విచారించిన ట్రైబ్యునల్‌ మంగళవారం ఈతీర్పునిచ్చింది. ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ప్రకారం నిషేధిత ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని నేషనల్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గతంలోనే హెచ్చరించింది. నిషేధిత ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు వలన ప్రజలకు అనారోగ్య సమస్యలతో పాటు, యమునా నది కూడా కాలుష్యానికి గురవుతోందని ఎన్జీటి వ్యాఖ్యానించింది. ఎన్జీటి  ముందుగా హెచ్చరించినప్పటికీ ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించిన కారణంగా పిటీషన్ విచారించిన జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయెల్‌ నేతృత్వంలోని బెంచ్‌ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వానికి రూ.50 కోట్లు పెనాల్టీ విధిస్తూ తీర్పు చెప్పింది. 

Don't Miss