Activities calendar

19 October 2018

21:47 - October 19, 2018

కేరళ: హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు కవితతో పాటు సామాజిక కార్యకర్త రెహనా ఫాతిమా, మేరీ స్వీటీ అనే ముగ్గురు మహిళలు ఇవాళ శబరిమల ఆలయానికి అత్యంత సమీపంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గుర్భగుడి వద్ద ఉన్న 18 మెట్లకు 500 మీటర్ల దూరం వరకు వారు చేరుకున్నారు. అయితే భక్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారి ముందుకు పోలేకపోయారు. పోలీసుల సూచనల మేరకు వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఈ నేపథ్యంలో శబరిమల దేవస్థానం అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటివ్ అధికారులకు పందళ ప్యాలెస్ ట్రస్ట్ లేఖ రాసింది. ఒకవేళ ఆలయ ఆచారాలకు ఎలాంటి భంగమైనా వాటిల్లి ఉంటే వెంటనే తలుపులు మూసేయాలని లేఖలో కోరింది. ప్రధాన అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాతే ఆలయాన్ని మళ్లీ తెరవాలని సూచించింది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో, రాజకుటుంబీకులు ఈనెల 12న శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.

కాగా, గర్భగుడిలోకి వెళ్లే 18 మెట్ల దారి సమీపం వరకు వెళ్లడం చాలా గర్వంగా ఉందని ఆ ముగ్గురు మహిళలు పేర్కొన్నారు.

21:20 - October 19, 2018

ముంబై: దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మోదీకి జ్ఞాపికను బహుకరించారు. శతాబ్ది ఉత్సవాల స్మారకంగా వెండి నాణేన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 

షిర్డి సాయిబాబా సందేశాలు మానవాళికి ప్రేరణగా నిలిచాయని ప్రధాని మోదీ అన్నారు. బాబా బోధించిన విశ్వాసం, సహన సూత్రాలు మానవాళిని ఆకట్టుకున్నాయన్నారు. విశ్వాసం, సహనంపై ఆయన చేసిన బోధనలు మానవాళికి ప్రేరణగా నిలిచాయన్నారు. సమానత్వానికి షిర్డి సాక్ష్యంగా నిలుస్తుందని, అన్ని మతాలకు చెందిన ప్రజలు బాబా ముందు వంగి నమస్కరిస్తారని ప్రధాని అన్నారు. సాయిబాబా బోధించిన సబ్ కా మాలిక్ ఏక్‌హై అన్న సూత్రం ప్రపంచ శాంతికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రధాని వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. అనంతరం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను మోదీ అందజేశారు.

20:27 - October 19, 2018

పంజాబ్: అమృత్‌సర్‌లో రావణ దహన వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొన్న ఘటనలో 50మందికి పైగా దుర్మరణం చెందారు. దసరా వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌ వద్ద రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని పట్టాలపై నుంచుని వీక్షిస్తున్నారు. అదే సమయంలో రైలు రావడంతో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై నిలుచున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రావణ దహనంలో భాగంగా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రైలు వారిపై దూసుకెళ్లింది.  సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ రైలు పఠాన్‌కోట్‌ నుంచి అమృత్‌సర్‌ వెళుతోంది.

గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఎంతో సంతోషంగా దసరా వేడుకలు చేసుకుంటున్న వారు మృత్యువాత పడటంతో బంధువుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం దద్ధరిల్లింది.

కాగా, ఈ ప్రమాదానికి నిర్వాహకులు నిర్లక్ష్యమే కారణం అని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకుల వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించలేదన్నారు. రైలు వస్తున్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వారు వాపోయారు. ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు రైలును నిలివేయడమో లేదా వేగం తగ్గించమని చెప్పడమో చేయాల్సిందని అంటున్నారు. ఘటన జరిగే సమయంలో రైల్వే ట్రాక్‌పై 500 నుంచి 700 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

20:16 - October 19, 2018

తిరుపతి: వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న మరో కాంట్రవర్సీ సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు పోటీగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను తెరపైకి తెచ్చారు. దీంతో విడుదలకు ముందే వర్మ సినిమా ఆసక్తికరంగా మారింది. తిరుపతిలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతితో కలిసి మీడియాతో మాట్లాడిన వర్మ.. తన సినిమా విశేషాలను వివరించారు. జనవరి 24న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల చేస్తున్నామని, దివంగత ఎన్టీఆర్‌ ఆశీస్సులు తన సినిమాకు ఉంటాయని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజాలు చూపించేలా సినిమా తీయగలిగే దమ్ము ఎవరికీ లేదన్న వర్మ.. తాను మాత్రం నిజాలు నిరూపించగలిగేలా సినిమా తీస్తానని స్పష్టం చేశారు. అయితే వైసీపీకి తాను తీసే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు ఎలాంటి సంబంధం లేదని వర్మ క్లారిటీ ఇచ్చారు. 

ఎన్టీఆర్‌ మంచి మనిషి అని పొలిటిక్‌ హీరో అని, నమ్మిన సిద్ధాంతాన్ని పాటించేందుకు ఎన్టీఆర్‌ భయపడరని వర్మ కొనియాడారు. లక్ష్మీపార్వతి గురించి చెప్పగలిగే ప్రత్యక్ష సాక్షి ఎన్టీఆర్‌ మాత్రమే అన్నారు. యూట్యూబ్‌లో లక్ష్మీపార్వతి గురించి... ఎన్టీఆర్‌ గొప్పగా మాట్లాడిన వీడియో తాను చూశానని చెప్పారు. అలనాటి నటీమణలు శ్రీదేవి, జయసుధ, జయప్రదలో లేని ఆకర్షణ... లక్ష్మీపార్వతిలో ఏముందని తాను ఆశ్చర్యపోయానని వర్మ వ్యాఖ్యానించారు. అంతటి ఆకర్షణను కాదని...ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకోవడంపై సందిగ్ధంలో పడిపోయానని చెప్పుకొచ్చారు. కాగా, దాదాపు కొత్తవాళ్లతోనే సినిమా తీస్తున్నట్టు.. పాత్రల ఎంపిక తుదిదశకు చేరినట్టు వర్మ వెల్లడించారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి దర్శించుకున్న వర్మ.. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉన్న అనేక సందేహాలకు సమాధానంగా తన వాయిస్‌లో 4 నిమిషాల నిడివితో ఉన్న వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను నాస్తికుడిగా చెప్పుకునే వర్మ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. తనకు దేవుడి మీద నమ్మకం ఉందన్న వర్మ.. భక్తుల మీదే నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవమే తనను తిరుమల రప్పించిందన్నారు. ఈ సినిమాలో నిజాలు చూపించేలా తనను ఆశీర్వదించాలని తాను శ్రీవారిని కోరుకున్నట్టు వర్మ చెప్పారు. నాస్తికుడైన వర్మ శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని లక్ష్మీపార్వతి అన్నారు. వర్మ తన సిద్దాంతాలను పక్కన పెట్టి దైవ దర్శనానికి రావడం వల్ల ఈ సినిమాకు, ఎన్టీఆర్‌కు న్యాయం జరుగుతుందని.. సినిమా విజయవంతం అవుతుందని లక్ష్మీపార్వతి ఆశాభావం వ్యక్తం చేశారు.

19:36 - October 19, 2018

ఆదిలాబాద్‌: ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. నోటుతో ఓటు కొనేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం కసరత్తులు మొదలుపెట్టింది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు నిఘా పెంచింది. ఈ నిఘాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. 

తాజాగా ఆదిలాబాద్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా రూ.10కోట్ల నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. జైనథ్ మండలం పిప్పర్వాడ చెక్‌పోస్టులో తనిఖీలు చేస్తుండగా.. ఓ కారులో తరలిస్తున్న నగదుని పోలీసులు గుర్తించారు. నగదుని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దానిపై ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కారులో నగదుని హైదరాబాద్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల్లో ఖర్చుచేసేందుకు డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

18:40 - October 19, 2018

కేరళ: శబరిమలలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆలయంలోకి మహిళలు రాకుండా ఆందోళనకారులు ఇవాళ కూడా అడ్డుకున్నారు. దీంతో శబరిమల కొండపైకి వెళ్లాలని అనుకున్న తెలుగు మహిళా జర్నలిస్టు కవిత, సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా మధ్యలోనే వెనుదిరిగారు. వారి ప్రయత్నం ఫలించలేదు. ఆలయానికి 500 మీటర్ల దూరంలో వారు ఆగిపోయారు. భక్తుల నిరసనల మధ్య హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు, సామాజిక కార్యకర్తకు రక్షణగా వెళ్లిన పోలీసులు ముందుకు వెళ్లేందుకు సాహసించలేదు. దీంతో కొండపైకి వెళ్లకుండానే వారిద్దరూ వెనుదిరిగారు. 

ఇవాళ ఉదయం వీరిద్దరూ సుమారు 300 మంది పోలీసుల భద్రత మధ్య కొండపైకి బయల్దేరారు. జర్నలిస్టుకు తాము ధరించిన ప్రత్యేక దుస్తులను, బులెట్ ఫ్రూఫ్ జాకెట్‌ను, హెల్మెట్‌ను ఇచ్చిన పోలీసులు, ఆమెకు జాగ్రత్తలు చెబుతూ ముందుకు తీసుకెళ్లారు. పంబ నుంచి 4.6 కిలోమీటర్ల దూరంలో పర్వత మార్గంలో ఆలయం ఉంది. సన్నిధానానికి అర కి.మీ. దూరంలో ఇద్దరు మహిళలను ఆపారు. కొండమీదకు చేరుకున్నాక గర్భాలయానికి వెళ్లి అయ్యప్పను దర్శించుకునే ముందు.. పదునెట్టాంబడి అని పిలిచే 18 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఈ 18 మెట్లు ఎక్కితేనే అయ్యప్పను దర్శించుకోవచ్చు. ఈ ఇద్దరు మహిళల విషయంలో అది జరగలేదు. ఓ వైపు వేలాది మంది ఆందోళనకారుల బెదిరింపులు, మరోవైపు ఆలయ ప్రధాన ద్వారాన్ని మూసివేస్తామని ప్రధాన తాంత్రీ ప్రకటించారు. తామందరినీ చంపేసి ముందుకు వెళ్లాలని భక్తులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు సైతం చేసేదేమి లేకపోయింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయ ద్వారం దగ్గరి దాకా వెళ్లిన కవిత సహా మరో మహిళ వెనక్కి తిరగక తప్పలేదు. 

శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలన్న ప్రయత్నాన్ని కవిత విరమించుకోవడంతో.. పూజారులు నిరసనను విరమించి యథావిధిగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆలయ తలుపులు మూసివేశారన్న ప్రచారంలో నిజం లేదని.. రోజువారీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆలయ కమిటీ తెలిపింది.

శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు గురువారం రాత్రి నుంచే కవిత సన్నద్దమయ్యారు. కేరళ ప్రభుత్వం కల్పించిన భద్రత నడుమ ఈ ఉదయం 6గంటలకు ఆమె కొండపైకి బయలుదేరారు. భక్తుల నిరసనలు, హిందూ సంఘాల ఆందోళనల నడుమ ఆలయ ద్వారం దగ్గరిదాకా వెళ్లారు. అయితే ప్రధాన పూజారి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం.. ఆలయ ద్వారాన్ని మూసిస్తానని హెచ్చరించడంతో పోలీసులు సైతం పునరాలోచనలో పడ్డారు. ఇంకా ముందుకు కదిలితే పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న భయాందోళనతో తమ ప్రయత్నాన్ని విరమించుకోక తప్పలేదు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. ఆలయంలోకి వెళ్లేందుకు కొందరు మహిళలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కోర్టు తీర్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అయ్యప్ప భక్తులు.. ఎట్టిపరిస్థితుల్లో ఆలయంలోకి మహిళలు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.

17:40 - October 19, 2018

ఢిల్లీ: కాకినాడ పీఠాధిపతి, ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద రాజకీయ రంగప్రవేశం చేశారు. స్వామి పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ నేత రామ్‌మాధవ్‌తో కలిసి అమిత్ షా నివాసానికి వెళ్లిన స్వామి పరిపూర్ణానంద.. అక్కడే బీజేపీలో చేరారు. 

పరిపూర్ణానంద చేరికను స్వాగతిస్తున్నట్టు అమిత్ షా చెప్పారు. పరిపూర్ణానంద చేరికతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో ఆయన సేవలు వినియోగించుకుంటామన్నారు. 

ఏదీ ఆశించకుండా ఒక ఆశయంతో తాను బీజేపీలో చేరానని స్వామి పరిపూర్ణానంద అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆధ్యాత్మికతతో పాటు దేశ సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని స్వామీజీ వెల్లడించారు. దేశం కోసం, పార్టీ కోసం 24గంటలు కర్మయోగిలా పనిచేస్తానన్నారు. దేశంలో ఏ మూలకు పంపినా పని చేసేందుకు తాను సిద్ధమేనని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. తనకు ముందు, వెనుక ఎవరూ లేరని, ఉన్నదంతా భారతీయమేనని స్వామీజీ అన్నారు. బీజేపీతో కలిసి దేశం కోసం, ధర్మం కోసం కష్టపడతానన్నారు.

Image may contain: one or more people and people standing

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న కాషాయ దళం.. రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు శ్రీ పీఠం పీఠాధిపతి, ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానందను ఉపయోగించాలని భావిస్తున్నారు. బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తే.. హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడవచ్చునని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది. 

గతంలో హిందువుల ఆరాధ్య దైవం రాముడి విషయంలో సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కత్తి వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద ఖండించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం శాంతి యాత్ర చేపడుతానని ప్రకటించారు. అటు కత్తి వివాదాస్పద వ్యాఖ్యలు, ఇటు స్వామీజీ యాత్ర.. ఈ నేపథ్యంలోఇరువురిపై పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు వేశారు. అయితే, ఈ బహిష్కరణపై హైకోర్టు స్టే విధించడంతో పరిపూర్ణానంద తిరిగి నగరంలో అడుగుపెట్టారు. 

16:20 - October 19, 2018

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణాన ఎట్టకేలకు బీజేపీ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. బీజేపీ నుంచి తొలి జాబితా సిద్ధమైనట్టు తెలుస్తోంది. తొలి జాబితాలో పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. అధిష్ఠానంతో చర్చలు జరిపిన అనంతరం వారి సూచనల మేరకు ఎల్లుండి అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా
నెం. నియోజకవర్గం అభ్యర్థి
1 అంబర్‌పేట్ కిషన్‌రెడ్డి
2 ముషీరాబాద్ లక్ష్మణ్
3 ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి
4 ఉప్పల్ ఎన్వీఎస్ఎస్ ప్రబాకర్
5 సికింద్రాబాద్ సతీష్
6 ఎల్బీనగర్       పేరాల చంద్రశేఖర్‌రావు 
7 మేడ్చల్ మోహన్‌రెడ్డి
8 దుబ్బాక రఘునందన్‌రావు
9 మునుగోడు మనోహరరెడ్డి
10 కల్వకుర్తి ఆచారి
11 వనపర్తి అమరేందర్‌రెడ్డి
12 షాద్‌నగర్ శ్రీవర్ధన్‌రెడ్డి
13 సూర్యాపేట సంకినేని వెంకటేశ్వరరావు
14 ఆదిలాబాద్ పాయల్
15 కరీంనగర్ బండి సంజయ్
16 పెద్దపల్లి గుజ్జుల రామకృష్ణారెడ్డి
17 భూపాలపల్లి కీర్తిరెడ్డి
18 ముథోల్ రమాదేవి
19 నారాయణపేట్ రతన్

 

15:46 - October 19, 2018

తిరుమల: వెంకన్నను వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మలు దర్శించుకున్నారు. వీరితో పాటు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర యూనిట్ సభ్యులు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వర్మ మాట్లాడుతూ, పుట్టినప్పటి నుంచి తాను దేవుడిని దర్శించుకోలేదని చెప్పారు. కేవలం దివంగత ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతోనే తిరుమల వెంకన్నను దర్శించుకున్నానని చెప్పారు. 
గతంలో తాను తెరకెక్కించిన 'గోవిందా గోవిందా' చిత్రం యాక్షన్ మూవీ అని... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వాస్తవిక చిత్రమని వర్మ తెలిపారు. ఈ సినిమాలో నమ్మలేని ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. నిజాలను ప్రజలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని దేవుడిని ప్రార్థించానని తెలిపారు. నిజాలను చూపించే ధైర్యం, సాహసం, శక్తి ఇవ్వాలని కోరుకున్నానని చెప్పారు.
 

15:18 - October 19, 2018

తిరుమల : వివాదాల వర్మ ఎప్పుడు వివాదాలనే కాదు షాక్‌కు కూడా గురిచేస్తుంటారు. సినిమాల చిత్రీకరణలో వైవిధ్యమే కాదు ఆయన నిజ జీవితంలో కూడా వైవిధ్యభరితంగా ఉంటారు. పలు సంచలన సినిమాల రూపకర్తగా పేరున్న వర్మ ఇప్పుడు మరో సంచలనానికి దారి తీశారు. ఆయనకు వివాదాలు కొత్తేమీ కాదు... దేవుడు పేరు చెబితే ఇంతెత్తున లేస్తారు... విచిత్రమైన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతారు. పక్కా నాస్తికుడినని చెప్పుకుంటారు. అటువంటి ఆయన దేవుడి గుడిలో ప్రత్యక్షమైతే, స్వామి వారి ప్రసాదాన్ని చేతిలో పట్టుకుని దర్శనమిస్తే...

ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్‌ వర్మ ప్రత్యేకతే అది. ఏది చేసినా తనదైన స్టైల్‌లో చేస్తాడీ దర్శకుడు. నాస్తికుడినని చెప్పుకునే రామ్‌గోపాల్‌ వర్మ ఒకే రోజు రెండు ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్నారు. ఒకటి ప్రఖ్యాత కాణిపాకం వినాయకుని గుడికాగా, రెండోది తిరుమల శ్రీవారి ఆలయం. తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ట్వీట్‌ చేసిన వర్మ అన్నట్లుగానే స్వామిని దర్శించుకున్నారు. నుదుట సిందూరం, చేతిలో స్వామి వారి లడ్డూ, సంప్రదాయ వస్త్రధారణతో దిగిన ఫొటోలు పోస్టు చేసి తనదైన శైలిని చాటుకున్నారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కోసం దివంగత ఎన్‌.టి.రామారావే తనను ఇలా మార్చేశారని కింద క్యాప్షన్‌ పెట్టి ఆశ్చర్యపరిచారు.

శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిలోని శిల్పారామంలో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడిస్తానని వర్మ తెలిపారు. జీవీ ఫిల్మ్స్‌ పతాకంపై రాకేష్‌ రెడ్డి నిర్మిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఓ వీడియోను వర్మ యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. అందులో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ సేవలు, ఆయన చనిపోయాక అంతిమ యాత్ర వివరాలు ఉన్నాయి.
 

15:06 - October 19, 2018

తిరుమల: దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి ఆమె తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి 2019 ఎన్నికల్లో పోటీ విషయమై స్పష్టత ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని ఆమె తేల్చి చెప్పారు. కాగా, కృష్ణా జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మీపార్వతి పోటీ చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఊహాగానాలకు లక్ష్మీపార్వతి ఇవాళ తెరదించారు.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం మాత్రం చేస్తానని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా తెలిపారు. జగన్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఆమె అన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రాంగోపాల్ వర్మ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పోస్టర్ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ, లక్ష్మీపార్వతిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

 

13:57 - October 19, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. సినిమా చిత్రీకరణంలో అందరి స్టైల్ వేరు వర్మ స్టైల్ వేరు అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో వివాదాల దర్శకుడు వర్మ  'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కొనసాగుతున్నవిషయం కూడా తెలిసిందే. ఒకరి కథనే ఇద్దరు దర్శకులు వారి వారి కోణాలలో వారి వారికి అందించిన సమాచారాన్ని బట్టి తీస్తున్న ఈ సినిమాపై ఉత్కంఠ సమంజసమే. కానీ ఈ ఇద్దరు దర్శకులలో ఒకరు వర్మ కావటమే ఈ సంచలనానికి కారణం. ఈ ఉత్కంఠకు తెర దించుతు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎలా వుండబోతోందనే విషయంపై వర్మ తన వాయిస్ ఓవర్ ద్వారా వెల్లడించాడు. 
వర్మ వాయిస్ లో సినిమా గురించి ప్రకటన సారాంశం..
''ఎన్.టి.రామారావు గారి నిజమైన అభిమానులకి నా బహిరంగ ప్రకటన. సినిమా అనేదానికి సరైన నిర్వచనం జీవితానికి అద్దం పట్టడం. జీవితానికి అర్ధం నిజంగా జీవించడం. అసలు నిజానికి నిజంగా జీవించే వారికి మరణం అనేది ఉండదు.ఎందుకంటే అలాంటి వారు భౌతికంగా మరణించినా.. వారిని ప్రేమించే మనుషుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు.. ఎన్టీఆర్ గారి మీద సినిమా తీయడానికి ముఖ్య కారణం ఆయన జీవితంలో అత్యంత భావోద్వేగమైన ఘట్టాలు ఉండడం వలన.. ఆ ఘట్టాలు అన్నింటిలో ముఖ్యమైన ఘట్టం.. ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం తరువాత ఉద్భవించిన కొన్ని అత్యంత కీలకమైన విపత్కర పరిణామాలు.అందుకనే ఈ సినిమాకి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కేవలం ఒక సినిమా అనడం సినీ కళామతల్లిని, ఎన్టీఆర్ గారిని కూడా అవమానించినట్లే.. ఎందుకంటే ఇది ఒక జీవిత సత్యాన్ని చెరపడం కోసం చచ్చేంత ప్రయత్నం చేసినా.. చేరపలేకుండా చేయడానికి కెమెరాతో వేయబోతున్న అతి కచ్చితమైన రౌద్ర ముద్ర. లక్ష్మీ పార్వతి గారి గురించి నాకు వేరు వేరు మంది వేరు వేరు అభిప్రాయాలని , వేరు వేరు ఉదంతాలను చెప్పారు. వారు తెలిసి చెప్పారో.. తెలియక చెప్పారో.. రకరకాల కారణాలు ఉండొచ్చు.

Image result for lakshmis ntr varmaకానీ వాదించే దానికి వీలు లేని పూర్తి నగ్న సత్యమేమిటంటే ఎన్టీఆర్ గారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి గారు గురించి ఎనలేని గౌరవంతో  మాట్లాడారు. అందుచేత ఆమెని అవమానిస్తే.. సాక్షాత్తు ఎన్టీఆర్ ని అవమానించినట్లే.. అలా అని నేను ఎవరో ఒకరి మాటలే వినడం లేదు.. లక్ష్మీ పార్వతి నుండి ఆమె ఇంట్లో అప్పట్లో పని చేసిన పనివాళ్లు, పార్టీ మెంబర్లు ఆమె శత్రువులు అందరితో గూడంగా ఇంటర్వ్యూలు జరిపి కళ్ళు బయర్లు గమ్మే నిజాన్ని లోతుగా తవ్వి బయటకి తీశాను.సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా లక్ష్మీపార్వతిని పిలిచాను కాబట్టి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా ఉంటుందని అనుకుంటే పొరపాటే ఎందుకంటే నేను సినిమా తీసేది ఆమె కోసం కాదు.. ఎన్టీఆర్ గారి గురించి. ఆయన మీదున్న గౌరవం మూలాన ఆవిడని గౌరవించి ఆయన మీదున్న  గౌరవాన్ని నిలబెట్టడం నిజమైన అభిమానుల కనీస బాధ్యత. ఆవిడని  పిలిచిన ఒక కారణం ఎన్టీఆర్ భార్యగా, ఆయన మీదున్న గౌరవంతో.. రెండో కారణం సినిమాలో ఆమెది చాలా చాలా ముఖ్య పాత్ర.

Image result for lakshmis ntr varmaఎవరి పాయింట్ ఆఫ్ లో వ్యూలో సినిమా ఉంటుందనే దానికి నా సమాధానం కేవలం నిరూపించగలిగే నిజాల పాయింట్ ఆఫ్ లో మాత్రమే ఉంటుందని చెప్పగలను. జనవరి 24న విడుదల కాబోతున్న ఈ సినిమా వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పినా మీరు నమ్మరు కాబట్టి చెప్పను. ఎన్టీఆర్ జీవితం మీద ఎన్ని సినిమాలు వచ్చిన ఆయన ఆశీస్సులు మాత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కి మాత్రమే ఉంటాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలను ఇది నా ఓపెన్ ఛాలెంజ్'' అంటూ తన వాయిస్ ద్వారా తెలిపారు వివాదాల వర్మ.
 

13:54 - October 19, 2018

హైదరాబాద్ : బుల్లితెర...వెండి తెర రోజురోజుకు వెలుగులు చిమ్ముతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంటే మరో పక్క తాను కూడా తక్కువమే కాదని బుల్లి తెర కూడా సామాన్య ప్రేక్షకులను అమితంగానే ఆకట్టుకొంటోంది. వెండి తర నటీ నటులు సైతం బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారంటే దీనికి ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళామణులకు ఆకర్షించడానికి ఆయా ఛానెళ్లు ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంటాయి. అందులో ప్రధానంగా ‘సీరియళ్లు’. మధ్యాహ్నం..సాయంత్రం వేళల్లో పలువురు మహిళలు బుల్లితెరకు అతుక్కపోతుంటారు. 
వివిధ సీరియల్స్ ఆసక్తి కలిగించే విధంగా ఉంటుండగా మరికొన్ని సీరియల్స్ ఎన్ని రోజులు అయినా ఎండింగ్ కార్డు పడడం లేదు. తెలుగులో ప్రసారమయ్యే ‘అభిషేకం’ సీరియల్ 24 ఆగస్టు 2018కి 3032 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొంటోంది. అలాగే ‘ఆడదే ఆధారం’ సీరియల్ కూడా (24 ఆగస్టు 2018 నాటికి) 2842 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోనుంది. ‘మనసు మమత’ 2369 (24 ఆగస్టు 2018 నాటికి) పూర్తి చేసుకొనబోతోంది. ఇక హిందీ సీరియల్స్‌లో ‘బాలికా వధు’ 2245 (24 ఆగస్టు 2018 నాటికి) పూర్తి చేసుకోబోతోంది. మరి వీటికి ఎండింగ్ కార్డు పడుతోందో చూడాలి. 

13:27 - October 19, 2018

ఢిల్లీ : సాక్షాత్తు సౌదీ దేశస్థుడైన ఓ జర్నలిస్టుని సౌదీ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా హత్య చేసింది. కాగా గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ దారుణహత్యకు గురయ్యారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తు ఆర్టికల్స్ రాసినందుకు జమాల్ ఖషోగ్గీ  అనే జర్నలిస్ట్ ని దారుణంగా చంపేసారు. రియాద్ నుంచి రెండు విమానాల్లో టర్కీ వచ్చిన 15 మంది స్క్వాడ్ ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. అనంతరం ఖసోగ్గీ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. 
ఖషోగ్గీని హత్య చేసిన అనంతరం అదే విమానాల్లో వారు తిరిగి రియాద్ వెళ్లినట్లు టర్కీ ప్రకటించింది. సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ అమెరికాలో ఉంటూ సౌదీ అరేబియా ప్రభుత్వంపై విమర్శనాత్మక వ్యాసాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ అరేబియా రాయబార కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు..ఈ నేపథ్యంలో ఖషోగ్గీ దారుణ హత్యకు గురయ్యారు. 
ఈ దారుణహత్యతో సౌదీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జమాల్ హత్యపై అమెరికా, బ్రిటన్‌లు సౌదీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో సౌదీలో జరగనున్న పెట్టుబడుల సదస్సు నుంచి యూఎస్ ట్రజరీ సెక్రటరీ స్టీవెన్ మ్నుచిన్, బ్రిటన్ అంతర్జాతీయ కార్యదర్శి లియామ్ ఫాక్స్ వైదొలిగారు. 

12:48 - October 19, 2018

హైదరాబాద్  : రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ పై జనసేన కవాతు పోలీసులు అనుమతి నిరాకరించిన విజయవంతంగా పవన్ జరిపారు. అనంతరం  పవన్ మాట్లాడుతు..టీడీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విమర్శలపై పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ టీడీపీ మహిళా నేత..అమెచ్యూర్ రేడియో జాకీ  సాదినేని  యామిని సోషల్ మీడియాలో పెట్టిన వ్యాఖ్యలపై పవన్ వీరాభిమానిగా చెప్పుకునే నటి మాధవీలత తీవ్రంగా మండిపడింది. యామినిపై మాధవీలత తీవ్రంగా ఫైర్ అయ్యారు.వారసత్వం గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదా? ఆయన వారసత్వంతో రాలేదు కదా?  అని కవాతు దేనికోసం పవన్ చేశారు అనే విమర్శకు ఏం చేశాడు అని అడుగుతున్నారా? ఏం చేయలేదు?" అంటు యామిని చేసిన పలు ఘాటు విమర్శలకు మాధవీలత  ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 

Image result for pawan kalyan sadhineni yaminiఆయన వ్యక్తిగత జీవితం మీద పడి ఏడవటమే తప్ప, మీకు విమర్శించటానికి వేరే లేవు కదా అని మాధవీలత  ఎద్దేవా చేసింది. మొన్నటి దాకా బీజేపీ డబ్బులు తీసుకున్నాడని.. ఇప్పుడేమో  ఎవరివో డబ్బులు ఖర్చుపెట్టాడని చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, "పవన్ కు డబ్బులు మీ అయ్యలు ఇచ్చారా? లేక మీ తాతలు ఇచ్చారా? మరి ఆయన ఎవరి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మీకు నొప్పెందుకు? అనీ..డబ్బులు ఇవ్వకుంటే ఇంతమంది జనం ఎందుకు వచ్చారనే ప్రశ్నకు సమాధానంగా ఆమాత్ర కడుపు మంట ఎందుకుండదు? అని అని తన ఫేస్‌ బుక్‌ లో యామినీకి మాధవీ లత యామినీకి  స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చింది. ఇక మాధవీ లత పోస్టుపై పవన్ అభిమానులు స్పందిస్తూ, బాగా మాట్లాడారంటూ ప్రశంసిస్తున్నారు. ఇక మాధవీ వ్యాఖ్యలపై యామినీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

12:23 - October 19, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151 సినిమా ‘సైరా’ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో వివిధ వుడ్‌లకు సంబంధించిన నటులు విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్‌లు నటిస్తున్నారు. మెగాస్టార్ సరసన నయనతార నటిస్తోంది. వార్ సీన్స్..మరిన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఇటీవలే చిత్ర యూనిట్ జార్జియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్ర షూటింగ్ కూడా జార్జియాలో జరిగింది. 
హాలీవుడ్ స్టంట్ కొరియోగ్ర‌ఫ‌ర్ లీ విక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలోనే వార్ సీన్స్ చిత్రీక‌రించారు. కేవలం 8 నిమిషాల సీన్ కోసం ఏకంగా 54 కోట్లు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది. అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.  
తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అనంతరం హైదరాబాద్‌కు చిత్ర యూనిట్ పయనమైనట్లు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షూటింగ్ జరుపుకొనుంది. సుమారు నెల రోజు పాటు షూటింగ్‌ను చిత్ర యూనిట్ జరుపనుంది. డిసెంబర్ నాటికి షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

12:09 - October 19, 2018

జనగామ  : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది.  సీనియర్ నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి కొత్త యువ రక్తంతో కాంగ్రెస్ కు తిరిగి జవసత్వాలు తీసుకువచ్చి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రాహుల్ గాంధీ ఒక నిబంధన పెట్టారు. ఇప్పుడు అదే నేతల ఇంటిలో కుంపట్లు రాజేస్తోంది. 

Image result for rahul gandhiఒక్క కుటుంబంలో ఒక్కరికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు, 70 ఏళ్లు దాటితే టిక్కెట్టు  ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ  నిర్ణయం తీసుకొందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ దఫా జనగామ నుండి మాజీ  పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కేనా అనే చర్చ సాగుతోంది. ఒక్కపొన్నాలకే కాదు మిగిలిన సీరయర్ నేతలకు కూడా అదే డైలమాలో వున్నారు. 
దీంతో నేతలంతా తమ తమ వారసుల్ని పార్టీలో పెట్టేందుకు యత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య  ఇంట్లో  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం పోరు సాగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం తీవ్రమైంది. ఈ  పరిస్థితుల నేపథ్యంలో  పొన్నాల కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఎవరికీ దక్కుతోందనే  చర్చ ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉత్కంఠకు తావిస్తోంది.Image result for Ponnala's daughter is Vaishali
పొన్నాల కోడలు వైశాలి క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. దీంతో మహిళా కాంగ్రెస్  వరంగల్ జిల్లా  అధ్యక్షురాలుగా వైశాలి కొనసాగుతున్నారు. పొన్నాలకు  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వకపోతే  ఆయన కోడలు వైశాలికి ఈ స్థానం నుండి టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. జనగామ నుండి పోటీ చేసేందుకు వైశాలి కూడ సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే  తనను కాదని  వైశాలికి టిక్కెట్టు కేటాయించడాన్ని పొన్నాల వ్యతిరేకిస్తున్నారని కూడా  సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

-మైలవరపు నాగమణి 

 

11:22 - October 19, 2018

కృష్ణా : జిల్లాలో జనసేన కార్యకర్త చలమల శ్రీనివాస్‌పై వైసీపీ నేతలు దాడికి దిగడం సంచలనం సృష్టించింది. వైసీపీ నేతలు గంటుపల్లి రామకృష్ణ, శేషగిరి, షేక్ సయిదాలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చలమల శ్రీనివాస్ వెళుతుండగా దారి కాచిన ఆ ముగ్గురు రాళ్లు..మారణాయుధాలతో హత్యాయత్నానికి ఒడిగట్టారు. కిందపడేసి విచక్షణారహితంగా కట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ సమీప సీసీ టీవీ ఫుటేజ్‌‌లో రికార్డయ్యాయి. 
నందిగామలో జనసేన కార్యక్రమాలు విసృత్తమయిన సంగతి తెలిసిందే. వైసీపీకి ధీటుగా ప్రజల్లోకి ఆ పార్టీ వెళుతోంది. పార్టీ ఎదుగదలను ఓర్వలేక శ్రీనివాస్‌పై దాడికి పాల్పడినట్లు జనసేన నేతలు పేర్కొంటున్నారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని..చనిపోయానని అనుకుని వెళ్లిపోయారని శ్రీనివాస్ తెలిపారు. దాడికి పాల్పడిన అనంతరం తన వద్దనున్న బంగారం, సెల్ ఫోన్ తీసుకున్నారని వెల్లడించారు. తనపై హత్యాయత్నం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు

11:18 - October 19, 2018

వరంగల్:  ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అంటు వేమన పద్యంలో చదువుకున్నాం. సమాజంలో వుండే సందర్భాలు..స్వానుభవాలను రంగరించి నీతి పద్యాలుగా, సామెతలుగా వెలుగులోకి వచ్చాయి. వీటిని మనకు ఎదురైన అనుభవాలను బట్టి సందర్భానుసారంగా అనువయించుకుంటుంటాం. ఇటువంటి సందర్భం మన తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కడియం శ్రీహరికి ఎదురయ్యింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కడియం కుమార్తె తనకు కూడా టిక్కెట్ కోసం తండ్రిపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పనిలో బిజీగా వున్న కడియంకు కేటీఆర్ షాక్ ఇచ్చారు. 

Related image

కుమార్తె కావ్య టిక్కెట్ కోసం కడియం యత్నాలు..
స్టేషన్ ఘన్‌పూర్‌లో తన కూతురు కావ్యను పోటీకి దించేందుకు రెండేళ్లుగా కడియం కసరత్తుగా సాగించారు. స్థానిక శాసనసభ్యుడు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన తాటికొండ  రాజయ్యపై వ్యతిరేకత,ఆరోపణలు కూడా ఉన్నందున ఆ టిక్కెట్ ను కుమార్తె కావ్యకు ఇప్పించుకునేందుకు రెండేళ్లుగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తిరిగి రాజయ్యకు టికెట్ ఖరారు చేయటంతో కడియం ఆశలు నీరుగారాయి. దీంతో  మంత్రిగా పనిచేసినా నాకు టికెట్ ఇప్పించలేకపోవావనే కోపంతో కుమార్తె కావ్య తండ్రిపై తిరుగుబాటుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కుమార్తె కోపం, తిరుగుబాటు తగ్గించేందుకు..కుమార్తె వల్ల తనకు పార్టీలో ఎక్కడ స్థాయి తగ్గిపోతుందోననీ..కేసీఆర్ వద్ద మందలింపులు పడాల్సివస్తుందనే భయంతో కడియం కుమార్తెకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు తన పట్టు వీడలేదు. రెండో విడత అభ్యర్థుల ఖరారులోనైనా కావ్యకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు రాజయ్య వ్యతిరేకులను ఆసరాగా చేసుకుని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఆందోళనలకు కడియం కారకులుగా తయారయినట్లుగా ఆరోపణలు కూడా వచ్చాయి.

Image result for kadiyam srihari VERY SADEరాజయ్య తమకు వద్దంటూ ఆపద్ధర్మ మంత్రి కేటి రామారావుకు విన్నవించుకునేలా శ్రీహరి చేయించినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో  రాజయ్య స్వయానా కడియం శ్రీహరి కాళ్లకు మొక్కారు.

రంగంలోకి దిగిన కేటీఆర్..
Related imageదీంతో కేటీఆర్ రంగంలోకి దిగి కడియంను పిలిచి కేటీఆర్ మందలించినట్లు కూడా తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ లోనే కాకుండా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కూడా అసమ్మతి లేకుండా చూడాలని కడియం శ్రీహరికి కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో తన శిష్యురాలు సత్యవతి రాథోడ్ తో కలిసి కడియం శ్రీహరి పార్టీ మారుతారంటూ ప్రచారం కూడా సాగింది. స్టేషన్ ఘనపూర్ కాకపోతే తన కూతురికి వర్ధన్నపేట టికెట్ అయినా ఇవ్వాలని కడియం శ్రీహరి అడిగినట్లుగా తెలుస్తోంది. కాగా ఆ ప్రచారాన్ని కడియం శ్రీహరి కొట్టిపారేశారు. తాను పార్టీ మారేది లేదంటూ స్పష్టం చేశారు. అయితే..తన భవిష్యత్తును పక్కన పెట్టి ఎలా నిర్ణయం తీసుకుంటారని కూతురు కావ్య కడియం శ్రీహరిని నిలదీసినట్లు..దీంతో ఆమె కాంగ్రెసులో చేరే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం ముందుకు వచ్చింది. కాంగ్రెసు కాకపోతే ఇండిపెండెంట్ గా స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీకి దిగడానికి ఆమె సిద్ధపడినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కడియం శ్రీహరికి ఇంటిపోరు కూమార్తె కావ్యరూపంలో తప్పకపోవటం గమన్హాం.

-మైలవరపు నాగమణి
 

 

 
10:47 - October 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్, టీఆర్ఎస్‌ను ఓడించాలని టిడిపి, కాంగ్రెస్ ఇతర పార్టీలు జత కడుతుండగా, బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలో పాగా వేయాలని కాషాయ దళం భావిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు శ్రీ పీఠం పీఠాధిపతి, ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను ఉపయోగించాలని భావిస్తోంది. 
శుక్రవారం పరిపూర్ణానంద ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. బీజేపీలో చేరాలని..పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయాలని మోడీ..షాలు సూచించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే అమిత్ షాతో స్వామి భేటీ అయిన సంగతి తెలిసిందే. దసరా అనంతరం తన కార్యచరణను ప్రకటిస్తానని పరిపూర్ణానంద తెలియచేసినట్లు సమాచారం. విజయదశమి పండుగ పూర్తి కావడంతో ఆయన హస్తినకు బయలుదేరారు. మరి ఆయన ఎలాంటి కార్యచరణను ప్రకటిస్తారో వేచి చూడాలి.
గతంలో రాముడి విషయంలో సినీ విశ్లేషకులు కత్తి మహేశ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కత్తి వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద ఖండించారు. తాను శాంతి యాత్ర చేపడుతానని ప్రకటించడం..కత్తి విమర్శలు చేయడంతో ఇరువురిపై పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. అయితే, ఈ బహిష్కరణపై హైకోర్టు స్టే విధించడంతో పరిపూర్ణానంద తిరిగి నగరంలో అడుగుపెట్టారు. బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తే.. హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడవచ్చునని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది. 

10:27 - October 19, 2018

కేరళ : శబరిమలలో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఆలయాన్ని తెరిచి రోజులు గడుస్తున్నా ఏ ఒక్క మహిళ కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోలేకపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భక్తులు ఆందోళనకు దిగడంతో.. సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇదిలా ఉంటే తెలుగు మహిళా జర్నలిస్టు జుక్కాల కవిత స్వామిని దర్శించుకొనేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసుల సహాయంతో ఆమె ఆలయ సన్నిధానం వరకు చేరుకున్నట్లు, ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కానీ ఆమె మాత్రం ఆలయంవైపుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. దీనితో టెన్షన్ వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ ఉన్నా ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. 
10-50 ఏళ్ల వయస్సు గల మహిళలను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. పంబ బేస్ క్యాంపు నుండి ఆలయం వరకు భక్తుల రూపంలో ఆందోళనకారులు మోహరించారు. ఇదిలా ఉంటే ట్రావెల్ బోర్టు సమావేశం కానుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కేరళ బ్రాహ్మణ సభ డిమాండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నిజమైన అయ్యప్ప భక్తులను ఆందోళనలకు గురిచేసే ఈ తీర్పుతో న్యాయానికి పాతర వేసిందంటూ పిటిషన్‌లో ఆరోపించింది. న్యాయవాది సనంద్ రామకృష్ణన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

10:13 - October 19, 2018

ఒడిషా : మనసు చలించే ఘటన చోటు చేసుకుంది. పోస్టుమార్టం కోసం ఏడేళ్ల కూతురి మృతదేహాన్ని 8 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. గజపతి జిల్లా లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని అతంక్‌పూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
ముకుంద్‌ దొర ఏడేళ్ల కూతురు బబిత ఈనెల 11 నుంచి కనిపించకుండాపోయింది. అయితే కొండచరియలు విరిగిపడి బబిత మరణించిందని అధికారులు తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి ఫొటోలు తీసుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయారు. అసలే తిత్లీ తుపాన్‌ ధాటికి సర్వస్వం కోల్పోయిన ముకుంద్‌ కుటుంబం.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఇక చేసేది ఏమీ లేక ముకుంద్‌... బబిత మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని హాస్పిటల్‌కు బయలుదేరాడు. అలా 8 కిలోమీటర్లు నడిచిన తర్వాత కొందరు విషయం ఆరా తీశారు. 
డెడ్‌బాడీని వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు తన వద్ద డబ్బు లేకపోవడంతో నడుచుకుంటూ తీసుకెళ్తున్నానని ముకుంద్‌ తెలిపాడు. ఈ విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు వాహనం ఏర్పాటు చేసి డెడ్‌బాడీని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. 
ఇలాంటి ఘటనే 2016లో కాలింది జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్లు దూరం నడిచిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. గ్రామాల్లో కనీస వసతులు లేక.. జనం పడుతున్న ఇబ్బందులకు ఇవన్నీ నిదర్శనమని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. 

09:44 - October 19, 2018

ఢిల్లీ : అభ్యర్ధుల ఎంపికపై కసరత్తును ప్రారంభించింది బీజేపీ. ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఇక తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను ఎంపిక చేసిన రాష్ట్ర నేతలు అధిష్టానానికి జాబితా అందించనున్నారు. శనివారం అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈరోజు పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం కానుంది. తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ముఖ్యంగా ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. అందులో ఆరు స్థానాల్లోని అభ్యర్థుల పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. మిగతా స్థానాలపై ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాను సిద్దం చేసి.. అధిష్టానానికి అందించనుంది. ఈ జాబితా ప్రకారం బీజేపీ శనివారం అభ్యర్థులను ప్రకటించనుంది. 
మరోవైపు రాష్ట్రంలో 15 మంది సభ్యులతో ప్రకటించిన తెలంగాణ ఎన్నికల కమిటీలో ఖైరతాబాద్‌ తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, గోషామహల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చోటు లభించలేదు. దీంతో ఈ అంశం పార్టీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. వీరిద్దరికి త్వరలో కీలక బాధ్యతలు అప్పజెబుతారా ? లేదా మిన్నకుండిపోతారా ? అనేది సందిగ్ధంగా మారింది. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పీడ్‌ పెంచింది. త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. 

09:36 - October 19, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుఫాను బీభత్సం శ్రీకాకుళం జిల్లా ప్రజానీకాన్ని వెంటాడుతూనే ఉంది. తీరప్రాంత ప్రజానీకం కారు చీకట్లో కాలం వెళ్ళదీస్తున్నారు. సీఎం పర్యటనలో హడావుడితప్ప తమకు ఒరిగిందేమీ లేదంటున్నారు. తినడానికి తిండి, చేయడానికి కూలీ లేదు.. చుట్టూ నీళ్ళు.. విషపురుగుల మధ్య జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చావడమో.. ఊరొదలడమో తప్ప తమకు వేరే మార్గం లేదంటున్నారు. తిత్లీ తుఫాను ఆగిపోయి సుమారు వారం రోజులు దాటుతున్నా.. అది సృష్టించిన బీభత్సం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇంకా కోలుకోలేదు. 
విద్యుత్‌ సరఫరా లేక తీరప్రాంత గ్రామాల్లో అంధకారం నెలకొంది. తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటనలో హడావుడి తప్ప ఏమీలేదని విమర్శిస్తున్నారు. దోమలు పెరిగిపోయాయని.. అంటువ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు. సహాయ కార్యక్రమాలపై అధికారులు కోతలు కోయడమే తప్ప వాస్తవానికి  చేసిందేమీ లేదని మండిపడుతున్నారు.
తీరప్రాంతాల్లో ఇంతవరకూ విద్యుత్‌ పునరుద్ధరణ చేయలేదు.  తొమ్మిది రోజులుగా బెండి గ్రామానికి విద్యుత్‌ సరఫరాలేదు. పలాసాతోపాటు.. జాతీయరహదారికి అత్యంత సమీపంలోని ఈ గ్రామంలో కొవ్వొత్తులు కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. కట్టుకునేందుకు బట్టల్లేవు, చిన్నపిల్లలకు పాలులేవు.. వెలిగించుకోడానికి కొవ్వొత్తులు లేవు  ఎటైనా వెళ్దామంటే సరైన దారి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజానీకం..
తీరప్రాంతాల్లో మహిళలు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు  చూస్తున్నారు.  సుమారు ఇరవై ఏళ్ళుగా పెంచుకున్న చెట్లన్నీ నేలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలిపని కూడా దొరకని పరిస్థితినెలకొంది..  ఆదాయ మార్గమే లేనప్పుడు.. తాము తీసుకున్న డ్వాక్రా రుణాలు ఎలాచెల్లించాలంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు ఇక్కడ బతుకుదెరువు కూడాలేదని.. ఊరొదిలిపోవడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు. 
సీఎం పర్యటించే ప్రాంతాల్లో తప్ప మరెక్కడా రోడ్లను క్లియర్‌ చేయడం లేదంటున్నారు. విరిగిపడ్డ చెట్లు, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏమాత్రం తొలగించలేదని మండిపడుతున్నారు. హడావుడిగా అరగంటసేపు జనరేటర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేశారనీ.. దీనివల్ల కొందరికి విద్యుత్‌షాక్‌ తగలడంతో ఆపేశామంటున్నారు ప్రజలు. 

09:24 - October 19, 2018

విజయవాడ : కృష్ణా నదిలో తెప్పోత్సవం ఘనంగా సాగింది. విద్యుద్దీపాల అలంకరణలో హంస వాహనంపై దుర్గా మల్లేశ్వర స్వామి వారు విహరించారు. ఈ వేడుకను చూసేందుకు  భక్తులు పోటెత్తారు.  విజయవాడ కృష్ణానదిలో ఈవేడుక కన్నుల పండగగా జరిగింది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు పలు ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి పైనుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దుర్గామల్లేశ్వరస్వామి వారు విహరించారు..
ఇంద్రకీలాద్రిపై ఇరుముడి సమర్పించేందుకు భవానీలు  భారీగా  తరలివచ్చారు. రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు  బారులు తీరారు.. జైదుర్గా .. జైజై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మార్మోగాయి. భవానీల దీక్ష విరమణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవం సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.   భవానీలతో సహా భక్తులు పెద్దఎత్తున రావడంతో.. ప్రకాశం బ్యారేజీ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 

09:17 - October 19, 2018

ఖమ్మం : మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. పోలీసులే టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యేను దారుణ హత్య చేసిన అనంతరం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కానీ పోలీసులపై పైచేయి సాధించేందుకు మావోయిస్టులు కూడా పలు చర్యలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లో మావోస్టులు రెచ్చిపోయారు. దంతెవాడలో ల్యాండ్ మైన్ను పేల్చివేశారు. ఐటీబీటీ 44 బెటాలియన్‌కు చెందిన 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

 

07:52 - October 19, 2018

హైదరాబాద్‌ : నగరంలో భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడింది. తెలుగు యువత వైస్‌ ప్రెసిడెంట్‌ వల్లభనేని అనిల్‌ కారు డ్రైవర్‌ మహేశ్‌ వద్దనుంచి సెంట్రల్‌ జోన్‌  పోలీసులు 60లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలకు డబ్బు తరలిస్తుండగా.. మహేష్‌తోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనిల్‌ ఆదేశం మేరకు డబ్బు తరలిస్తున్నట్లు మహేష్‌ చెప్పినట్లు తెలిపాడు. ఎన్నికల నేపథ్యంలో భారీగా సొమ్ముపట్టుబడడంతో పోలీసులు పలుకోణాల్లో విచారిస్తున్నారు. 

07:44 - October 19, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. రెయిన్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జావీద్‌ అనే వ్యక్తిని అతి కిరాతంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. హత్య అనంతరం రెయిన్‌బజార్‌ పీస్‌లో సుహైల్‌, సులేమాన్‌, ఎస్సా అనే వ్యక్తులు తామే హత్యకు పాల్పడినట్లు పోలీసులకు లొంగిపోయారు. అయితే.. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

07:39 - October 19, 2018

కేరళ : శబరిమలలో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భక్తులు ఆందోళనకు దిగడంతో.. సమస్య తీవ్రరూపం దాల్చింది. చినికిచినికి గాలి వానలా మారిన చందంగా ఈవివాదం కాస్తా. రాజకీయ రంగుపులుముకుంది. ఆరెస్సెస్‌, సంఘ్‌పరివార్‌ వల్లే సమస్య జఠిలంగా మారిందని ఆరోపించారు కేరళ సీఎం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శబరిమలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..కాగా.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి నిరసనగా  భక్తులు ఆందోళనకు దిగడంతో.. సమస్య తీవ్రరూపం దాల్చింది.  ఆరెస్సెస్‌, సంఘ్‌పరివార్‌ వల్లే సమస్య జఠిలంగా మారిందని ఆరోపించారు కేరళ సీఎం పినరయి విజయన్‌. కులం, ఫ్యూడల్‌ భావజాలానికి ప్రేరేపితులు కావడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయన్నారు కేరళ సీఎం. 
ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. సంప్రదాయాలు కాపాడడం కోసం ఆందోళన చేసి తీరుతామని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ప్రకటించాయి. ఆందోళకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ బెహరా తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కేరళ బ్రాహ్మణ సభ డిమాండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నిజమైన అయ్యప్ప భక్తులను ఆందోళనలకు గురిచేసే ఈ తీర్పుతో న్యాయానికి పాతర వేసిందంటూ పిటిషన్‌లో ఆరోపించింది. న్యాయవాది సనంద్ రామకృష్ణన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
శబరిమల ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు రక్షణ కల్పించాలని సూచిస్తూ జాతీయ మహిళాకమిషన్‌.. కేరళ డీజీపీకి లేఖ రాసింది. మహిళలను అడ్డుకుంటున్న వ్యవహారంపై నివేదిక సమర్పించాలని కోరింది. 

07:30 - October 19, 2018

ఢిల్లీ : ప్రొ-కబడ్డీ సీజన్‌6లో గుజరాత్‌ మొదటి విజయాన్ని దక్కించుకుంది. పుణెరి పల్టాన్‌పై 34-28 పాయింట్ల తేడాతో విక్టరీ కొట్టింది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌... దబాంగ్‌ ఢిల్లీపై విజయం సాధించింది.  34-28 పాయింట్ల తేడాతో గుజరాత్.. పుణెరి పల్టాన్‌ను చిత్తు చేసింది.
గుజరాత్ మ్యాచ్‌ మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. 4-0తో మొదట ఆధిక్యంలోకి వెళ్లింది. ఆర్వాత పుంచుకున్న పుణెరి జట్టు  5-4 స్కోరుతో సమీపానికి వచ్చింది. ఓ దశలో స్కోరు 20-20తో సమం అయ్యాయి. ఆ తర్వాత గుజరాత్‌ విజృంభించింది. వరుసగా పాయింట్లు రాబట్టడంతో విజయం సాధించింది. గుజరాత్‌ రైడర్‌ సచిన్‌  12 పాయింట్లు సాధించి గుజరాత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. పర్వేష్‌ సైతం జట్టు విజయంలో కీరోల్‌ ప్లే చేశాడు.
మరో మ్యాచ్‌లో హర్యాణా స్టీలర్స్‌, దబాంగ్‌ ఢిల్లీ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హర్యాణా స్టీలర్స్‌ విక్టరీ కొట్టింది. దబాంగ్‌ ఢిల్లీని 34-31 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది. హర్యాణా, ఢిల్లీ మధ్య పోరు మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. అయితే సెకండాఫ్‌లో హర్యాణా వ్యూహం మార్చింది.  ప్రత్యర్థిని చిత్తు చేస్తూ పాయింట్లు సాధించింది. ఢిల్లీ కూడా వరుసగా పాయింట్లు రాబట్టడంతో మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది.  చివరికి హర్యాణా స్టీలర్స్‌ విజయం సాధించింది. 

07:21 - October 19, 2018

కర్నూలు : ఆటవికం కాదది... ఆచారం. సమరం కాదు.. సంప్రదాయం. చూసేవారికి అది కర్రలయుద్ధం... ఆ పల్లెవాసులకు మాత్రం సంబరం. కర్రలేకుండా బన్ని జరపాలని పోలీసులు..  కర్ర మా సంప్రదాయం అది లేకుండా బన్ని జరగదని భక్తజనం. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు సిద్ధం  చేశారు.
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో వెలసిన మాలమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలు ప్రతి ఏటా సాంప్రదాయ బద్ధంగా జరుగుతాయి. ప్రధానంగా విజయదశమి రోజున అర్దరాత్రి జరిగే మొగలరాయి పోరాటం దేశంలోనే అరుదైన ఉత్సవంగా కొనసాగుతుంది. ఆచారంలో భాగంగా ఉత్సవం రోజున విగ్రహాలను తమ వశం చేసుకునేందుకు బహుపరాక్ పోరాటాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. మాలమల్లేశ్వరస్వామి విగ్రహాలను ఇతర గ్రామాల వారికి దక్కనియకుండా నేరణకి, నేరణకితాండ, కొత్తపేట గ్రామాల ప్రజలు విగ్రహాల చుట్టు గుంపులుగా ఏర్పడి ఇనుపరింగులతో చుట్టిన కర్రలతో కొట్టుకునే క్రీడ ఒళ్లు గగుర్పాటు కలిగిస్తుంది. 
తమ ఇష్ట దైవమైన మాలమల్లేశ్వరస్వామి విగ్రహం దక్కించుకునే ప్రయత్నంలో భక్తులు ఇనుప రింగులతో, అగ్గి కాగాడాలతో పాల్గొనే బహుపరాక్ పోరాటంలో తలలు పగిలినా, గాయాలైన వెంటనే స్వామివారి బండారు రాసుకోవడం మరింత ఉద్వేగానికి దారి తీస్తుంది. ఆచారం మాటున కొనసాగే బన్ని క్రీడలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లను సిద్ధం చేసింది.

Don't Miss