Activities calendar

21 October 2018

22:11 - October 21, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 107కు చేరింది. మరో రెండు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల పేర్లను కూడా కేసీఆర్ విడుదల చేశారు. జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు, మలక్‌పేట్ టీఆర్ఎస్ అభ్యర్థి చావా సతీష్‌కుమార్ పేర్లను కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 107 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. 

 

22:08 - October 21, 2018

హైదరాబాద్: తెలంగాణా పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. 2019 జననరిలో దావోస్ లో జరిగే 49వ ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించమని ఫోరం అధ్యక్షుడు బెర్గ్ బ్రెండీ కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ఈ సమావేశాలలో కేటీఆర్ పట్టణాభివృద్ధి, డిజిటలైజేషన్, సులభతర వాణిజ్య విధానం, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం తీసుకున్న చర్యలను వివరించనున్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక సంస్కరణలను, సమావేశాలకు హాజరు కావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు పంపిన ప్రత్యేక ఆహ్వానంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధి కోసం గత నాలుగు సంవత్సరాల్లో  అనేకమైన వినూత్న కార్యక్రమాలను చేపట్టిందని, ముఖ్యంగా టెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యుర్షిప్, ఇన్నోవేషన్ వంటి అంశాలను ఉపయోగించుకున్నారని  కేటీఆర్ కు పంపిన లేఖలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు ప్రశంసించారు. 

21:39 - October 21, 2018

హైదరాబాద్ : నగరంలో హవాలా వ్యాపారం గుట్టు రట్టు అయింది. కోఠిలో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా నగదు తరలిస్తున్న నలుగురిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.54 కోట్ల నగదును పట్టుకున్నారు. కౌంటింగ్ మిషన్, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని గుజరాత్‌కు చెందిన అక్రమ వ్యాపారస్తులుగా పోలీసులు గుర్తించారు. 0.6 శాతం వడ్డీతో నగదును సప్లై చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడించారు.


కోఠిలో ఏపీ09బీఎన్02505 హోండా ఆక్టీవా బైక్‌పై వెళ్తున్న జ్యూలరీస్ బిజినెస్ మేన్ పటేల్ జయేష్, విన్‌రాజ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పాట్‌లో వీరి నుంచి కోటి 80 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లను రుజువు చేయలేకపోయారు.

అయితే వీరిని విచారించగా కోఠిలోని మార్వెల్ మోడల్ ఆఫీస్‌లోని 202 ఫ్లాట్‌లో 74 లక్షల రూపాయలను దాచి పెట్టామని నిందితులు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడి వెళ్లి ఆ నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పటేల్ జయేష్, విన్‌రాజ్‌, పటేల్ అశ్విన్, నవీన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గుజరాత్‌కు చెందిన నగదును అక్రమంగా తరలిస్తున్నారు. పటేల్ జయేష్, విన్‌రాజు హైదరాబాద్ వాస్తవ్యులు. వీరికి పటేల్ అశ్విన్, నవీన్‌లు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం నగరంలో కలకలం సృష్టిస్తోంది. 

 

21:33 - October 21, 2018

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి 2రోజుల పాటు పెట్రోల్ బంకులు బంద్ నిర్వహిస్తున్నారు. కేంద్ర  ప్రభుత్వం అక్టోబరు 4న చమురుపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ, వినియోగదారుల కోసం  వ్యాట్ తగ్గించమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు దేశంలోని పలు రాష్ట్రప్రభుత్వాలు వ్యాట్ తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. కానీ ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించలేదు. ఢిల్లీతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి సరిహద్దు రాష్ట్రాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. వ్యాట్ తగ్గించటానికి ఢిల్లీ  ప్రభుత్వం ఒప్పుకోనందున సమ్మె చేపట్టాలని ఢిల్లీ పెట్రో డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. బంద్ వలన ఢిల్లీలోని సుమారు 400 పెట్రోల్ బంక్లలో సోమవారం ఉదయం 6 గంటలనుంచి మంగళవారం వరకు పెట్రోల్,డీజిల్,సీఎన్జీ అమ్మకాలు నిలిపివేయనున్నారు.

20:31 - October 21, 2018

కడప : జిల్లాలో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. పారిపోయిన 11 మందిలో ఏడుగురు స్మగ్లర్లు అరెస్టు చేశారు. 

కొద్దిరోజుల క్రితం అటవీ శాఖ అధికారుల నుండి 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తప్పించుకున్నారు. దీంతో రాజంపేట మండలం రోళ్లమడుగులో ఇవాళ అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. పారిపోయిన 11 మందిలో ఏడుగురు స్మగ్లర్లు అరెస్టు చేశారు. వీరి నుంచి 47 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయల విలువైన ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. 
 

20:29 - October 21, 2018

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో సీపీఐకి ఓటర్లు ఉన్నారని, ఈఎన్నికల్లో మహాకూటమితో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. కొన్ని పార్టీలు కావాలనే తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని, సీపీఐ అభ్యర్ధుల కోసం కూటమిలో 12 సీట్లు కావాలని అడుగుతున్నామని, కనీసం 9 సీట్లు అయినా తమకు ఇవ్వాలని ఆయన మహాకూటమి నేతలను కోరారు. 

20:12 - October 21, 2018

హైదరాబాద్ : తిత్లీ తుపాను బాధితులకు హిందూపురం ఎమ్మెల్యే, సినీ హరో బాలకృష్ణ అండగా నిలిచారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. తిత్లీ తుపాను బాధితులకు బాలకృష్ణ 25 లక్షల విరాళం ప్రకటించారు. ఆ మేరకు బాలకృష్ణ.. సీఎం చంద్రబాబుకు రూ.25 లక్షల చెక్‌ను అందజేశారు.

తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని, సహాయ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం పిలుపు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ఇస్తానని ఇటీవల బాలకృష్ణ ప్రకటించారు. ఆ మేరకు బాలకృష్ణ.. సీఎం చంద్రబాబుకు రూ.25 లక్షల చెక్‌ను అందించారు. ఇవాళ హైదరాబాద్‌కు వచ్చిన బాలకృష్ణ..సీఎం నివాసంలో చంద్రబాబుకు రూ.25 లక్షల చెక్‌ను అందించారు. ఇదివరకే బాలకృష్ణ అభిమానులు తిత్లీ తుపాను బాధితులకు సహాయార్థం ఆర్థిక సాయం అందజేశారు.

19:29 - October 21, 2018

హైదరాబాద్ : తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు సినీ సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తుపాను బాధితులకు మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది. తిత్లీ తుపాను బాధితులకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బాసటగా నిలిచారు. తుపాను బాధిత గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెర్రీ తెలిపారు. తుపాను బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని బాబాయి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

 

19:28 - October 21, 2018

హైదరాబాద్: ఈ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకుని టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధులతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదివారం తెలంగాణభవన్లో దాదాపు 3గంటలపాటు సమావేశం అయ్యి వచ్చే45 రోజుల్లో పార్టీ ప్రచార వ్యూహాలపై అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్ధులు ప్రచారంలో నిర్లక్ష్యం వహించవద్దని, పోలింగ్ రోజు వరకు సమయాన్నిఏరకంగా సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి ఓటరును ఎలా కలవాలి, ఓటింగ్ శాతం ఎలా పెంచుకోవాలి  వంటి అనేక విషయాలను ఆయన వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పధకాలను వినియోగించుకుంటున్న వారు ప్రతి నియోజక వర్గంలోనూ సుమారు 60వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించి, నియోజక వర్గాల వారీగా వారి వివరాలను అభ్యర్ధులకు అందచేశారు. పాక్షిక మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కూడా అభ్యర్థులకు ఆయన వివరించారు. సమావేశం వివరాలను కడియం శ్రీహరి  విలేకరులకు వివరిస్తూ..శాసనసభ రద్దుచేసిన నాటినుంచి నేటివరకు చేసిన సర్వేలలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని, అభ్యర్ధులు మరింత కష్టపడి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని కేసీఆర్ సూచించారని చెప్పారు. ఈనెలాఖరులోగా ఖమ్మం,వరంగల్,కరీంనగర్ లలో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహిస్తారని వాటికి సంబంధించిన తేదీలను 2రోజుల్లో ప్రకటిస్తామని కడియం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ ఎన్నికల్లో 100 నియోజక వర్గాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారని, దానిలో భాగంగా నవంబర్ 12వతేదీన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా 30 ప్రచార సభలు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు కడియం తెలిపారు. 

18:53 - October 21, 2018

హైదరాబాద్‌ : టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన అయన ప్రచార రథాన్ని ప్రజలు అడ్డుకుని, ఫ్లెక్సీని చింపి వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బాలాపూర్‌ మండలం శివాజీచౌక్‌ డీఆర్‌డీఎల్ రోషన్‌ దౌలాకు వెళ్లాడు. తమ కాలనీకి రావద్దంటూ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన అయన ప్రచార రథాన్ని ప్రజలు అడ్డుకుని, ఫ్లెక్సీని చింపి వేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని నేతలు చెప్పినా... ఆ హామీలు అమలుకు నోచుకోలేదని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు ఎలాంటి పథకాలు అందలేదని స్థానికులు తెలిపారు. 

18:20 - October 21, 2018

మధ్యప్రదేశ్ : ఓటర్లను చైతన్యం చేసేందుకు, ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా అధికారులు వింత ఆలోచన చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఝాబువా జిల్లా యంత్రాంగం మద్యం సీసాలపై ఓటర్లను చైతన్యం చేసే నినాదాలతో స్టిక్కర్లను అతికించాలని నిర్ణయించింది. అయితే అది బెడిసికొట్టడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 

ఇందుకు సంబంధించి స్టిక్కర్లను కొన్ని రోజుల క్రితమే స్థానిక మద్యం దుకాణదారులకు పంపిణీ చేశారు. వాటిపై ఓటు హక్కును అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలంటూ రాశారు. ఎక్సైజ్‌ శాఖ స్టిక్కర్లను పంపిణీ చేసి మద్యం సీసాలపై అతికించాల్సిందిగా దుకాణదారులను కోరింది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో మద్యాన్ని ప్రోత్సహిస్తారా? అంటూ పలువురు మండిపడ్డారు. దీంతో ఈ నిర్ణయాన్ని అధికారులు వెనక్కితీసుకున్నారు. ‘ఓటర్లను చైతన్యపరిచే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అన్నిఅంశాలను పరిశీలించిన అనంతరం దీన్ని వెనక్కితీసుకుంటున్నాం’ అని అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ అభిషేక్‌ తివారి వెల్లడించారు. 

 

18:08 - October 21, 2018

ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగబోయే అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిధిగా నటసింహం నందమూరి బాలకృష్ణ రాబోతున్న సంగతి తెలిసిందే.. దాదాపు 8సంవత్సరాల తర్వాత బాబాయ్ బాలయ్య, అబ్బాయ్‌ తారక్ ఒకే వేదికపై అభిమానులకు దర్శనమివ్వనున్నారు.. వీరితో పాటు కళ్యాణ్ రామ్ కూడా స్టేజ్‌పై కనిపించనున్నాడు..
ఈ వేదికపై బాలయ్య నందమూరి అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడట.. అదేంటంటే, బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో తారక్, బాలయ్య పాత్ర పోషించబోతున్నట్టు, స్వయంగా బాలయ్యే ప్రకటిస్తాడు అనే మాట గురించి ఫిలిం వర్గాల్లో, నందమూరి అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది..   

18:01 - October 21, 2018

హైదరాబాద్: రాష్ట్రంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున బలం తక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చెయ్యాలని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ నిర్ణయించింది. ప్రచారకమిటీ చైర్మన్ భట్టివిక్రమార్క అధ్యక్షతన ఆదివారం గోల్కోండ హోటల్లో సమావేశమైన కమిటీ ప్రచారంలో స్పీడ్ పెంచాలని నిర్ణయించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుకు  దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో ప్రచారం చేయించాలని నిర్ణయించింది.  పార్టీలో ప్రజాకర్షణ ఉన్ననాయకులు ఇతర నియోజకవర్గాలలో ప్రచారానికి వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో రెండో విడత ప్రచారంపై ఒక నిర్ణయానికి రానప్పటికీ, రేపు మరోసారి సమావేశమై  ప్రచారం ఏవిధంగా ఉండాలి అనే  అంశంపై తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి మిత్రపక్షాల నియోజకవర్గాల్లో ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్న కమిటీ, సీట్ల విషయం తేలాక ఆనియోజక వర్గాలలో ప్రచారంపై ఒక నిర్ణయం తీసుకోనుంది. నిన్నటి రాహుల్ గాంధీ పర్యటనతో ఉత్సాహంలో ఉన్నకాంగ్రెస్ శ్రేణులు రెండో విడత రాహుల్ ని  ప్రచారానికి తీసుకువారావాలని నిర్ణయించాయి. టీఆర్ఎస్ కు బలం ఉన్న కరీంనగర్, వరంగల్ లలో ఈనెల 27 లేదా 28 తేదీల్లో రాహుల్ గాంధీ సభలు నిర్వహించాలని అనుకుంటున్నారు. రాహుల్ ఆఫీసు నుంచి అనుమతులు రాగానే వాటిని ప్రకటిస్తారు. 

 

17:40 - October 21, 2018

బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపికా పదుకోణ్, రణవీర్ సింగ్ ఎట్టకేలకు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు.. గత కొద్ది రోజులుగా వీళ్ళ ప్రేమ, పెళ్ళి గురించి రకరకాల వార్తలూ, ఊహాగానాలూ వినిపించాయి.. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ, తమ వెడ్డింగ్ కా‌ర్డ్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీపికా.. నవంబర్ 14,15 తేదీల్లో తామిద్దరం ఒకటవబోతున్నామని చెప్పుకొచ్చింది.. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉన్న  శుభలేఖలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది..  
దీపికా, రణవీర్ కలిసి రామ్‌లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాల్లో నటించి, ఆన్‌స్క్రీన్ రొమాంటిక్ కపుల్‌గా పేరుతెచ్చుకున్నారు.. ఇప్పటికే పెళ్ళి పనులు స్టార్ట్ అయ్యాయని, డ్రెస్‌ల డిజైన్ కూడా జరుగుతుందని తెలుస్తుంది.. రెండు రోజులపాటు జరగబోయే దీపికా, రణవీర్‌ల మ్యారేజ్ బాలీవుడ్‌లో  ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి...

17:27 - October 21, 2018

నెల్లూరు : జిల్లాలో ఫారెస్ట్ ఆఫీసర్ నిర్వాకం బట్ట బయలైంది. పెళ్లి చేసుకుంటానని ఓ మహిళను అధికారి మోసగించాడు. పెళ్లి చేసుకుంటానని మహిళ నుంచి రూ.5 లక్షలు తీసుకుని..జాతకాలు కలవడం లేదంటూ పెళ్లికి నిరాకరించాడు. యువతిపై అధికారి దాడికి పాల్పడ్డారు. తెనాలి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి శిరీషను పరామర్శించారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


నెల్లూరు జిల్లాకు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ మన్నేపల్లి హరికుమార్ గతేడాది రెండో పెళ్లికి వధవు కావాలని, తాను ప్రభుత్వ ఉద్యోగినని పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు. తెనాలికి చెందిన శిరీష..స్థానికంగా ట్యూషన్లు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. పేపర్ ప్రకటనలోని ఫోన్ నెంబర్‌కు శిరీష ఫోన్ చేసింది. ఫోన్ చేయడంతో హరికుమార్‌తో శిరీషకు పరిచయం ఏర్పడింది. అయితే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి శిరీషను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు రూ.5 లక్షలు కావాలని.. ఆ డబ్బు తన దగ్గర లేదని.. శిరీషను డబ్బు ఇవ్వాల్సిందిగా కోరాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాక...ఆ తర్వాత శిరీషను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అతనిని నమ్మిన.. శిరీష అప్పు చేసి రూ.5లక్షలను హరికుమార్‌కు ఇచ్చింది.

 
ఆ తర్వాత హరికుమార్ సక్రమంగా స్పందించడం లేదు. దీంతో ఆత్మకూర్ పోలీస్ ష్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. అయితే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఇది కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అంశం కావడంతో పోలీసులు హరికమార్‌ను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీసుల కౌన్సిలింగ్‌కు హరికుమార్ స్పందించలేదు. శిరీషను వివాహం చేసుకోవడానికి అతను ముందుకు రాలేదు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం శిరీషపై హరికుమార్ దాడి చేశాడు. హరికుమార్ తనపై దాడి చేసినట్లు శిరీష తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తీవ్రంగా గాయపడిన శిరీష ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి శిరీషను పరామర్శించారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితుడు హరికుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. 

 

17:02 - October 21, 2018

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మానుయోల్ జంటగా, వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ ఈ సాయంత్రం బుల్లితెరపై సందడి చెయ్యనుంది..
గత కొద్ది రోజులుగా  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అని, వాల్ పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి.. జీ తెలుగు ఛానెల్‌లో నా పేరు సూర్య ఈ సాయంత్రం అంటూ పెద్ద ఎత్తున పేపర్ యాడ్స్ కూడా ఇవ్వడంతో, అందరూ ఆశ్చర్యపోయారు.. ఈ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నారంటే, నా పేరు సూర్య శాటిలైట్ రైట్స్ కోసం జీ వాళ్ళు బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు..  ఈ సండే ఫ్యామిలీతో కలిసి జీ తెలుగులో  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి.. 

16:57 - October 21, 2018

హైదరాబాద్ : మగ్దూం భవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హాట్ హాట్‌గా కొనసాగింది. మహా కూటమి పొత్తుల నేపథ్యంలో ఈ చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరడం లేదని తెలుస్తోంది. ఇంతవరకు ఆ పార్టీలు అభ్యర్థులు కూడా ప్రకటించలేదు. దీనితో సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయ్యింది. మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం మధ్యలోనే కూనంనేని సాంబశివరావు వెళ్లిపోయారు. మూడు సీట్లు ఇస్తే కూటమి నుండి బయటకు రావాలని మెజార్టీ సభ్యులు ప్రస్తావించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోతే బెటర్ అని సీపీఐ భావిస్తోంది. 25 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. హుస్నాబాద్, ఆలేరు, మునుగోడు, కొత్తగూడెం, వైరా, పినపాక, బెల్లంపల్లి, మంచిర్యాల, దేవరకొండ, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, మహేశ్వరం, మేడ్చల్, సిద్దిపేట, భద్రాచలం, చెన్నూరు, తాండూరు, భూపాలపల్లి, నర్సంపేట, చెవేళ్ల, మహబూబాబాద్, మధిర, పాలేరు, నాగర్‌కర్నూలు, మానకొండూరు నియోజకవర్గాల్లో 

16:57 - October 21, 2018

హైదరాబాద్ : శాసనసభను రద్దుచేసిన రోజే 105మంది అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్ధులను ప్రకటించి ముందస్తు ఎన్నికల్లో అన్ని పార్టీలకంటే ప్రచారంలోను, పాక్షిక మేనిఫెస్టో విడుదల్లోనూ  ముందున్న గులాబీబాస్ కేసీఆర్ తెలంగాణభవన్ లో  అసెంబ్లీకి పోటీ చేస్తున్న 105మంది అభ్యర్ధులతో సమావేశం అయ్యారు. ఈసమావేశానికిపార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా హజరయ్యారు. ఇప్పటికే తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నఅభ్యర్ధుల ప్రచార సరళిపై నివేదిక తెప్పించుకున్న ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రచారంలోనూ,ప్రజలకు చేరువ కావటంలోను వెనుకబడిన అభ్యర్ధులకు దిశా, నిర్దేశం చేయనున్నారు. ఇంకా పోలింగ్ కు 45 రోజుల సమయమే ఉన్నందున ఈ 45రోజుల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలు అభ్యర్ధులకు వివరించనున్నారు. 
భారతీయ జనతాపార్టీ ఇప్పటికే 38మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. త్వరలో మహాకూటమి కూడా తన అభ్యర్ధులను ప్రకటించనుంది. ఈనేపధ్యంలో టీఆర్ఎస్ తన దూకుడును మరింత పెంచనుంది. పోలింగ్ తేదీ లోపు కేసీఆర్ మొత్తం 100 బహిరంగ సభల్లో ప్రసంగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు తుదిరూపు వచ్చే అవకాశం ఉంది.

16:36 - October 21, 2018

ముంబై: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీలు దిగాలని ప్రయత్నిస్తుంటారు. ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతుంటారు. ఈ సెల్ఫీలతో కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ సెల్ఫీ వివాదమై కూర్చొంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
తొలి లగ్జరీ క్రూయిజ్ షిప్ ఆంగ్రియా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్రూయిజ్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని భావించి...ప్రారంభోత్సవం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమృత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ దిగాలని ఆమె భావించారు. కానీ హద్దు మీరారు. నౌక రెయిలింగ్ దాటి వెళ్లి కూర్చొని తాపీగా సెల్ఫీలు తీసుకున్నారు. సముద్ర అందాలను తన సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది హెచ్చరించారు. పోలీస్ అధికారి అలా చేయొద్దని వారించారు. కానీ అమృత పెద్దగా పట్టించుకోకుండా సెల్ఫీలు దిగుతూ కనిపించారు. అమృత బాధ్యతారహితంగా వ్యవహరించారంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. 

15:34 - October 21, 2018

హైదరాబాద్: మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి.. నోట్ల ప్రవాహం మొదలయ్యింది. దేశవ్యాప్తంగా చూస్తే, ఎన్నికలకు అత్యధిక ఖర్చు పెట్టేది తెలుగు రాష్ట్రాల్లోనే అంటూ వెల్లడైన వివరాలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ఖర్చులో తొలి రెండు స్థానాలను తెలుగు రాష్ట్రాలే ఆక్రమించగా.. మూడో స్థానాన్ని కర్నాటక, నాలుగో స్థానాన్ని తమిళనాడు ఆక్రమించాయి. 

2014 ఎన్నికలపై జాతీయ మీడియా చేసిన విశ్లేషణ ఆధారంగా చూస్తే.. ఎన్నికలకు అత్యధికంగా ఖర్చు పెడుతున్న అభ్యర్థుల్లో 60 శాతం మంది ..ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లోనే ఉన్నారు. టికెట్ దగ్గర నుంచి ఓటు వరకూ ప్రతీ చోట నోట్ల ప్రవాహాన్ని పారించి.. ఎన్నికలను.. నోట్లు, సీట్లు, ఓట్లుగా మార్చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. ఓటర్లు ఎన్నుకుంటున్నారా... నేతలు ఓటర్లను కొనుక్కుంటున్నారా అన్న సందేహం కలగకమానదు.

ఎన్నికల ఖర్చు పై ఈసీ 28 లక్షలే పరిమితిని విధించినా.. దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో గత ఎన్నికల కంటే.. ఈ సారి 30 నుంచి 40 శాతం అధిక వ్యయం అవుతుందని అంచనా. ఒక్కో అభ్యర్థి సగటున 15 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండదని భావించే రిజర్వ్‌డ్‌ స్థానాల్లోనే ఈసారి ఖర్చు 10 కోట్లను దాటిపోనుంది.


హైదరాబాద్‌ శివారు నియోజకవర్గాల్లో అయితే.. ఏకంగా 25 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా. అభ్యర్థుల ఖర్చు విషయంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా చేతులెత్తేస్తుండగా.. జాతీయ పార్టీలు ఏదో కొద్దిగా ఇస్తున్నాయి. కనీసం 25 కోట్లైనా ఖర్చు పెట్టే స్థోమత ఉంటేనే బరిలోకి దిగాలంటూ పార్టీలు కండిషన్‌ కూడా పెట్టేస్తున్నాయి. ఈ ఖర్చును భరించడానికి ఆస్తుల్ని అమ్ముకుని, భారీగా అప్పులు చేసి అభ్యర్థులు ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు.

15:31 - October 21, 2018

నారా రోహిత్, శ్రియ, సుధీర్ బాబు, శ్రీవిష్ణు మెయిన్ లీడ్స్‌గా, ఆర్.ఇంద్రసేన దర్శకత్వంలో, అప్పారావు బెల్లన నిర్మిస్తున్న చిత్రం, వీర భోగ వసంత రాయలు.. కల్ట్ ఈజ్ రైజింగ్ అనేది ఉపశీర్షిక...
మొన్నీ మధ్య రిలీజ్ చేసిన ధియేట్రికల్ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది.. ఇప్పుడు ఈ సినిమాలోని శ్రీవిష్ణు లుక్ బయటకొచ్చింది.. అప్పట్లో ఒకడుండేవాడు, నీదీ నాది ఒకే కథ, మెంటల్ మదిలో వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీవిష్ణు, వీర భోగ వసంత రాయలు‌లో సూపర్బ్ గెటప్‌లో కనబడి, ఆడియన్స్‌కి షాక్‌తో కూడిన సరప్రైజ్ ఇచ్చాడు.. బాడి బిల్డ్ చేసి, ఒంటినిండా టాటూలతో, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో  శ్రీవిష్ణు అదరగొట్టేసాడు.. అక్టోబర్ 26న వీర భోగ వసంత రాయలు రిలీజ్ కాబోతోంది...

 

15:14 - October 21, 2018

కాకినాడ:ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప షటిల్ ఆడుతూ కాలుజారి కిందపడ్డారు. తూర్పుగోదావరిజిల్లా కాకినాడలోని కుళాయి చెరువు వద్దఉన్న వివేకానంద పార్కును హోంమంత్రి ఆదివారం ప్రారంభించారు. పార్క్ ప్రాంరంభించిన అనంతరం చినరాజప్ప, ఎమ్మెల్యే కొండబాబుతో పార్కులో ఉన్న షటిల్ కోర్టులో సరదాగా షటిల్ ఆడారు. కొండబాబు కొట్టిన కాక్ ను కొట్టే క్రమంలో మంత్రి కాలుజారి కిందపడ్డారు. అప్రమత్తమైన రక్షణసిబ్బంది ఆయన్ను వెంటవే పైకి లేపారు. ఆయనకు ఎటువంటి గాయాలు తగలకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 2016అక్టోబరు.25వ తేదీన పెద్దాపురం మండలం కట్టమూరు వద్ద రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థతకు గురైన బాధితులని పరామర్శించేందుకు కాకినాడలోని సంజీవని ఆసుపత్రికి వచ్చిన చినరాజప్ప, వారిని పరామర్శించి మూడో అంతస్థు నుంచి లిఫ్టులో కిందకు వస్తుండగా లిఫ్టు వైరు ఒక్కసారిగా తెగిపోవడంతో లిఫ్టులో పడిపోయారు. ఆసమయంలో చినరాజప్ప నడుము భాగంలో గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను అదే ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. రెండేళ్ల తర్వాత ఆఆస్ప్రతి ఎదుట ఈరోజు ఈసంఘటన జరగటం యాధృచ్చికమైనప్పటికి అందరికీ విస్మయాన్ని కలిగించింది. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో షెడ్యూల్ ప్రకారం ఆయన తన కార్యక్రమాలను పూర్తి చేసుకుని వైద్యపరీక్షలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

14:52 - October 21, 2018

హైదరాబాద్ : వ్యాపార సంస్థలు పలు ఆపర్స్..డిస్కైంట్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. వస్తువుల నుండి మొదలుకొని బంగారు ఆభరణాలపై పలు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. బంగారు ఆభరణాల రంగంలో పేరొందిన జోయాలుక్కాస్ కూడా దివాళీ ఆఫర్స్ ప్రకటించింది. గిఫ్ట్‌ ఫుల్‌ దివాలీ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 
ఆభరణాల కొనుగోలు చేస్తే గృహోపకరణాలను బహుమతిగా అందించనున్నట్లు తెలిపింది. అందులో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, టీవీలు, గ్యాస్‌టాప్‌ స్టవ్స్‌, మైక్రోవేవ్‌ ఓవెన్లున్నాయని తెలిపింది. ప్రతి ఆభరణం కొనుగోలుపై కచ్చితంగా ఒక బహుమతి ఇస్తున్నట్లు జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోయ్‌ అలుక్కాస్‌ వెల్లడించారు. అంతేగాకుండా ఏడాది పాటు ఉచిత బీమా, జీవిత కాల ఉచిత మెయింటెనెన్స్‌, బై బ్యాక్‌ గ్యారంటీను ఇవ్వనున్నారు. నవంబరు 11 వరకు గిఫ్ట్‌ ఫుల్‌ దివాలీ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. 

 

14:33 - October 21, 2018

మీ టూలో నిన్నే శృతి హరిహరన్, యాక్షన్ కింగ్ అర్జున్‌పై ఆరోపణలు చేసింది.. ఇంకాదాని గురించి చర్చ జరుగుతుండగానే, పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక మహిళ.. బాలీవుడ్ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. తాను మొట్ట మొదటి సారిగా 1990వ సంవత్సరంలో మెహబూబా స్టూడియోలో మాలిక్‌ని కలిసినప్పుడు తనతో మిస్ బిహేవ్ చేస్తే తిట్టాననీ, వెంటనే సారీ చెప్పాడనీ, కొద్ది రోజుల తర్వాత పిలిస్తే అతని ఇంటికి వెళ్ళానని, అక్కడ ఎవరూ లేకపోవడంతో, తన దగ్గరకొచ్చి, అతని ప్యాంటు జిప్ తియ్యడమేకాక, నా‌ స్కర్ట్‌ని కూడా పైకెత్తబోయాడు.. నేను బిత్తరపోయాను.. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో బయటపడ్డాను.. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని చెప్పుకొచ్చింది బాధిత మహిళ...  

14:24 - October 21, 2018

 కేరళ: అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శబరిమలలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో కొందరు మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల రావడం, ఆందోళనకారులు వారిని అడుగడుగునా అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఓవైపు భారీగా పోలీసు బలగాలు.. మరోవైపు అయ్యప్ప భక్తులు, ఆందోళనకారులు.. దీంతో శబరిమలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమైంది. అయ్యప్ప గర్భగుడిలోకి వచ్చేందుకు కొందరు మహిళలు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆందోళనకారుల నిరసనలు, హెచ్చరికల కారణంగా వారు వెనుదిరగాల్సి వచ్చింది. స్వామిని దర్శించుకునేందుకు మహిళలు ప్రయత్నించడం..  ఆందోళనకారులు వారిని అడ్డుకోవడం.. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలావుంటే మాస పూజల కోసం తెరిచిన ఆలయం.. ఈరోజు ప్రత్యేక పూజల అనంతరం రేపు మూతపడనుంది.

నాలుగు రోజుల క్రితం మాస పూజల నిమిత్తం శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరచుకున్నాయి. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు 8మంది మాత్రమే దేవుడిని దర్శించే ప్రయత్నం చేశారని, వారిలో ఒక్కరు కూడా స్వామిని ప్రత్యక్షంగా చూడలేదని ఆయల వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వసంతి (41), ఆదిశేషి (42) పంబ బేస్ క్యాంప్ నుంచి శబరిమలకు బయలుదేరగా, ఆలయానికి 200 మీటర్ల దూరంలో వారిని అడ్డుకున్న భక్తులు తీవ్ర నిరసనలు తెలుపగా, వారిద్దరూ వెనుదిరిగారు. నిన్న కేరళకు చెందిన 38 ఏళ్ల మహిళకు కూడా ఇదే విధమైన అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. అంతకుముందు ఎర్నాకులానికి చెందిన రెహానా, హైదరాబాద్ జర్నలిస్టు కవితలు భారీ బందోబస్తు మధ్య ఆలయం పరిసరాల్లోకి వెళ్లినప్పటికీ, స్వామిని మాత్రం దర్శించుకోలేక పోయారు. గర్భగుడిలోకి రావాలని చూస్తే ఆలయం మూసివేస్తామని ప్రధాన పూజారి కూడా హెచ్చరికలు పంపారు. దీంతో మహిళలు వెనుదిరగాల్సి వచ్చింది. మొత్తంగా ఒక్క మహిళ కూడా స్వామివారిని ప్రత్యక్షంగా చూడలేకపోయారు.

కాగా, రేపు శబరిమల ఆలయం మూతపడనుంది. ఆపై మండల పూజ నిమిత్తం నవంబర్ 16న ఆలయం తెలుపురు తెరవనున్నారు. డిసెంబర్ చివరి వారం వరకూ ఆలయంలో పూజలు జరగనున్నాయి.

13:45 - October 21, 2018

హైదరాబాద్ : బుల్లితెరపై హాట్ యాంకర్‌గా పేరొందిన ‘రష్మిక’ ఓ వ్యాధితో బాధ పడుతోందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఈ విషయంతో ఆమె అభిమానులు షాక్ తిన్నారు. ఆమెపై ధైర్యం చెబుతున్నారు. ఫ్యాన్స్ చెబుతున్న ధైర్యానికి..సూచనలకు రష్మి థాంక్స్ చెబుతోంది.
ఇటీవలే రష్మి ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమె శరీరాకృతి విషయంలో ప్రశ్నించింది. ఓ ఈవెంట్‌లో చూడడం జరిగిందని, చీరలో చాలా లావుగా కనిపించావని..కొద్దిగా జాగ్రత్త వహించాలని పేర్కొంది. వయసులో ఉన్న సినీ తారలు కాజల్ అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఇషా గుప్తా, సమంత చాలా స్లిమ్‌గా బాడీని మెయింటెన్ చేస్తున్నారని, మీరు కూడా మీ బాడీపై శ్రద్ధపెట్టండి...లేకపోతే కెరీర్‌కు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని సూచించింది. దీనితో రష్మి స్పందించింది.

తనకు ఓ వ్యాధి ఉందని...తనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు వ్యాధి గురించి తెలిసిందని ట్వీట్ చేసింది. తనకున్న వ్యాధి కారణంగానే లావు విషయంలో హెచ్చుతగ్గులు వస్తుంటాయని, అయినా తాను చిన్నప్పటి నుంచీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణగానే ఉంటానని ఆ అభిమానికి తెలిపింది. ఈ వ్యాధి నుంచి బయటపడాలని అనుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల పలు పరిణామాలు సంభవించాయని తెలిపింది. 
ఒకవేళ శరీరాకృతిలో తేడా వస్తే మాత్రం గౌరవంగా త‌ప్పుకుంటానని, రష్మి వ్యాధి గురించి వెల్లడించడంతో అభిమానులు పలు జాగ్రత్తలు తెలియచేస్తున్నారు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ జోడి, ఢీ 10 లాంటి ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలకు రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు.

13:42 - October 21, 2018

హైదరాబాద్:  కొన్ని రోజులుగా ఎడతెగని చర్చలు.. విస్తృత మంతనాలు.. రహస్య భేటీలు.. అయినా వ్యవహారం కొలిక్కి రావడం లేదు. పొత్తు కుదరడం లేదు.. సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేదు. ఇదీ మహాకూటమి పరిస్థితి. కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన భాగస్వాములుగా ఏర్పడిన మహాకూటమిలో ఇప్పటివరకూ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ.. మ్యాటర్ మాత్రం తేల్చడం లేదు. దీంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ హైదరాబాద్‌కు చంద్రబాబు రానున్నారు. తన నివాసంలోనే టీడీపీ కీలక నేతలతో బాబు భేటీ కానున్నారు. మహాకూటమితో పొత్తు, సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎల్.రమణ, పెద్దిరెడ్డి, దేవేందర్‌గౌడ్, గరికపాటిలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి తదితరులతోనూ చంద్రబాబు మాట్లాడతారని, అవసరమైతే రాహుల్‌గాంధీకి ఫోన్ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. 

సాధ్యమైనంత త్వరలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేస్తే, ఆపై ప్రచారం ప్రారంభించాలని టీడీపీ భావిస్తోంది. కాగా, ఈ ఎన్నికల్లో తాను వెనకుండి మద్దతు పలుకుతానే తప్ప, నేరుగా ప్రచారం చేయబోనని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణతో పాటు, కొందరు పేరున్న ఏపీ మంత్రులు కూడా తెలంగాణలో పర్యటిస్తారని సమాచారం.

ఇప్పటికే 105మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచారాన్ని సైతం ముమ్మరం చేశారు. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఇటు మహాకూటమి పరిస్థితి మాత్రం ఇంకా గందరగోళంగానే ఉంది. సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. మాకు ఇన్ని సీట్లు కావాలని టీడీపీ, టీజేఎస్‌లు అడుగుంటే.. కాంగ్రెస్ మాత్రం ససేమిరా అంటోంది. చూడాలి మరి.. చంద్రబాబు రంగంలోకి దిగిన తర్వాత అయినా.. పరిస్థితిలో మార్పు వస్తుందేమో..?

13:14 - October 21, 2018

హైదరాబాద్ : పెరుగు లేకుండా భోజనం ఊహిచుకుంటారా ? ఎన్ని ఆహార పదార్థాలు పెట్టినా పెరుగు ఉండాల్సిందే. భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకి రావని వైద్యులు పేర్కొంటుంటారు. ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఈ పెరుగును అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. పెరుగుతో అందాన్ని మెరుగుపరచుకోవచ్చు. మొటిమలు..ఇతరత్రా సమస్యలు తీరుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖాన్ని తాజాగా మార్చుతుంది. పెరుగులో రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపటి అనంతరం చల్లటి నీటితో ముఖానికి కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. దాంతో ముఖం మృదువుగా, తాజాగా మారుతుంది.
పెరుగు చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. దీనికి చెంచా చొప్పున సెనగపిండి, పెసరపిండి, తేనె కలిపి ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. అప్పుడే దుమ్ము, ధూళితో పాటు మృతకణాలు తొలగిపోయి నునుపుదనం మీ సొంతమవుతుంది. పెరుగులో తమలపాకుని కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత కళ్లపై ఉంచుకుంటే వేడి హరించుకుపోయి తాజాగా కనిపిస్తాయి. పావుకప్పు పెరుగులో అంతే పరిమాణంలో కలబంద గుజ్జు, చెంచా సెనగపిండి, నిమ్మరసం, అరచెంచా బాదం నూనె కలిపి మెత్తగా చేసుకొని ముఖానికి పూతలా వేయాలి. ఇలా ఓ ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని అరాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతమవడం ఖాయం.

13:01 - October 21, 2018

హైదరాబాద్ : రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోయాయి. వెంటనే చలి కూడా వచ్చేసింది. తెలంగాణలో అప్పుడే చలి పంజా విసురుతోంది. పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి..ఉదయ వేళల్లో చలి ఎక్కువగా ఉంటుండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో మంచుకురుస్తోంది. దీనితో పది దాటినా మంచు దుప్పటి వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట 33 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని సమాచారం. 
శనివారం హైదరాబాద్‌లో గరిష్ఠంగా 33.2, కనిష్ఠంగా 19.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్టోబర్‌లొనే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో వ్యాదులు సైతం విజృంభించే అవకాశాలున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

12:59 - October 21, 2018

పంజాబ్: మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతోంది. జాలి, దయ లోపిస్తున్నాయి. సాటి మనిషి కష్టాల్లో ఉంటే.. ఆదుకోవాల్సింది పోయి సెల్ఫీలు దిగుతున్నారు, అంతకుమించి దోచుకుంటున్నారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి ఘోరాలు అమృత్‌సర్‌ రైలు దుర్ఘటన అనంతరం ఎన్నో చోటుచేసుకున్నాయి. రావణ దహణ వేడుకలు వీక్షించేందుకు ట్రాక్‌పై నిల్చున్న వారిపైకి రైలు దూసుకురావడంతో 61మంది దుర్మరణం చెందగా, 70మంది గాయాలపాలయ్యారు.

కాగా, నెత్తుటి మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారికి చేతనైన సాయం అందించాల్సింది పోయి కొందరు వారివద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకుపోయారు. బాధితుల మొబైల్‌ఫోన్లు, నగలు, నగదు, పర్సులు దొంగిలించారు. ఆఖరికి మృతదేహాలు అనే కనికరం కూడా లేకపోయింది. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను సైతం దోచుకెళ్లారు. ఇంత విషాదకర ఘటనలో కూడా రాక్షసానందం పొందడం ఆ మనసు లేని మనుషులకే చెల్లింది.

అమృత్‌సర్‌ రైలు ప్రమాద ఘటనలో దీపక్ అనే వ్యక్తి కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అతని కూతురు చనిపోయింది. కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రైలు ఢీకొని వెళ్లిపోయాక పట్టాలపై విసిరేసినట్టు పడిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా క్షణాల్లో అత్యంత హృదయవిదారకంగా మారిపోయింది. చనిపోయిన తన కుమార్తెను, ఒళ్లంతా గాయాలైన తన కుమారుడిని చూసి దీపక్ కుమిలిపోతున్నాడు. సాయం అడిగేందుకు సైతం గొంతు పెగలట్లేదు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి దీపక్‌ జేబులోని మొబైల్‌ను బలవంతంగా లాక్కొని పారిపోయాడు. కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో దీపక్ ఉండిపోయాడు.

జ్యోతి కుమారి అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకు వాసును రైలు ప్రమాదంలో పోగొట్టుకుంది. ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని అప్పగించాక అతని మెడలో బంగారు గొలుసు, మొబైల్, పర్స్‌ కనిపించలేదని ఆమె వాపోయింది. కమల్‌కుమార్‌ అనే వ్యక్తికి సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రైలు ప్రమాదంలో కమల్ తన కుమారుడిని కోల్పోయాడు. కొడుకు మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది కమల్‌కు అప్పగించారు. అయితే కొడుకు జేబులో ఉండాల్సిన రూ.20 వేల విలువైన మొబైల్‌ఫోన్ కనిపించడం లేదని ఆ తండ్రి వాపోయాడు.

కొందరు దొంగతనాలకు పాల్పడి మానవత్వానికి మచ్చ తెస్తే.. ఇంకొందరు సెల్ఫీలు దిగి సిగ్గుపడేలా చేశారు. ప్రమాదం అనంతరం బాధితులకు తక్షణ సాయం అందించాల్సిందిపోయి కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వారి ఆర్తనాదాలను రికార్డు చేస్తున్నారు. మరికొందరు ఘటన స్థలంలో సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఇంత విషాదంలోనూ కొందరు వ్యక్తులు చేసిన పనులు అందరిని బాధిస్తున్నాయి. వీళ్లసలు మనుషులేనా? అన్న అనుమానం కలుగుతోంది. మనిషి ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదనే విషయం వారికి తెలుసా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

12:30 - October 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలతో అన్ని పార్టీలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో గులాబీ దూసుకపోతోంది. కానీ ప్రధాన పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పొత్తుల విషయంలో చర్చల మీద చర్చలు కొనసాగిస్తోంది. దీనితో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల విషయంలో టి.పీసీసీకి పలు సూచనలు చేసింది. 
ఎమ్మెల్యే టికెట్ల ఖరారుకు కాంగ్రెస్ అధిష్టానం మార్గదర్శకాలు చేసింది. సామాజిక న్యాయం దిశగా టికెట్లు ఇవ్వాలని, అందులో బీసీలకు 34 టికెట్లు ఇవ్వాలని సూచించింది. మాదిగలు 12, మాలలు, 7, లంబాడీలు 6, ఆదివాసీలకు 6 టికెట్లు కేటాయించే విధంగా చూడాలని పేర్కొంది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని, రిజర్వేషన్ విషయంలో సమస్య కుదరకపోతే మరో పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు టికెట్లు కేటాయించాలని సూచించింది. ఈ మేుకు టీపీసీసీకి కాంగ్రెస్ అధిష్టానం సమాచారం అందించింది. మరి ఆ దిశగా టీపీసీసీ టికెట్లు కేటాయిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

11:46 - October 21, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల లేటెస్ట్ సెన్షేషన్  అరవింద సమేత వీర రాఘవ దసరా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.. తారక్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.. ఇప్పటికే ఓవర్సీస్‌లో టు మిలియన్ మార్క్ దాటేసింది.. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సక్సెస్ మీట్ నిర్వహించబోతోంది మూవీ యూనిట్.. ఈ ఫంక్షన్‌‌కి ముఖ్య అతిధిగా నటసింహం నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు.. గత కొద్ది రోజులుగా బాబాయ్, అబ్బాయ్‌లకి పెద్దగా మాటలు లేవు అనే వార్తలు వినబడ్డాయి.. చాలా రోజుల తర్వాత బాలయ్య, ఎన్టీఆర్ కలవబోతున్నారు, ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు, వీరితోపాటు కళ్యాణ్ రామ్ కూడా అటెండ్ అవనున్నాడని తెలియగానే నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.. నిన్న రాత్రి నుండే సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్ట్ లు పెడుతున్నారు.. నిజంగా ఈ రోజు అభిమానులకు పండగరోజనే చెప్పాలి..

11:43 - October 21, 2018

ఢిల్లీ: వాహనదారుల వెన్నులో వణుకుపుట్టించిన పెట్రో ధరలు దిగొస్తున్నాయి. కొన్ని రోజులుగా నింగిని తాకుతూ సెంచరీ దిశగా వెళ్లిన పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఆదివారం(అక్టోబర్-21) హైదరాబాద్‌లో పెట్రోల్ పై 27 పైసలు తగ్గగా, డీజిల్‌పై 18 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.86.75గా ఉండగా, డీజిల్ ధర రూ.81.89గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర 25పైసలు లీటర్ ధర రూ.86.25.. డీజిల్ ధర 18పైసలు తగ్గి లీటర్ ధర రూ.80.97కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 25 పైసలు తగ్గి రూ.81.74కు చేరింది. లీటర్‌ డీజిల్‌ ధర 17 పైసలు తగ్గి రూ.75.19గా ఉంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర 25పైసలు, డీజిల్‌ 18 పైసలు తగ్గింది. ఇక్కడ పెట్రోల్‌ ధర రూ.87.21, డీజిల్‌ ధర రూ.78.82గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడంతో దసరా రోజు నుంచి పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి.

11:24 - October 21, 2018

ఢిల్లీ : వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ను అలవోకగా కైవసం  చేసుకున్న భారత్‌.. నేటినుంచి వన్డే పోరుకు సిద్దమైంది.  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు తొలి వన్డే గౌహతిలో  మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.  మిడిలార్డర్‌పై భారత్‌ ప్రధానంగా దృష్టి  పెట్టింది. ఇప్పటికే  టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌  పంత్‌ వన్డే ఆరంగేట్రానికి సిద్దమయ్యాడు. తుది జట్టులో చోటు  సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు భారత్‌-వెస్టిండీస్‌లు  121 సార్లు తలపడగా.. 56 మ్యాచ్‌ల్లో భారత్‌, 61 మ్యాచ్‌లు  విండీస్‌ సొంతమయ్యాయి. ఒక వన్డే టై కాగా.. మూడు  మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 

 

 

11:21 - October 21, 2018

హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల లెక్కలు కొలిక్కి రావడం లేదు. కూటమి నాయకులు రహస్య భేటీలు.. చర్చోపచర్చలు సాగిస్తున్నా లెక్కలు ఫైనల్‌ కావడం లేదు. దీంతో కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడికి పెంచేందుకు తెలంగాణ జనసమితి సిద్దమైంది. కాంగ్రెస్‌తో మెతక వైఖరి అవసరం లేదని కోదండరామ్‌కు టీజేఎస్‌ నేతలు సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం వరకు కాంగ్రెస్‌ స్పందించకపోతే.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించేందుకు టీజేఎస్‌ సిద్దమవుతోంది . 

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది. ఇటు బీజేపీ సైతం జోరు పెంచింది. 38మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. కానీ మహాకూటమి పరిస్థితే అగమ్యగోచరంగా తయారైంది. మహాకూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. తమ పార్టీకి కనీసం 15-17 స్థానాలు కచ్చితంగా సర్దుబాటు చేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు తేల్చిచెప్పారు. మరోవైపు కూటమిలో చర్చోప చర్చలు సాగిస్తున్నా.. సీట్ల సర్దుబాటు తర్వాతే మేనిఫెస్టోపై దృష్టి సారించాలని కోదండరామ్‌ ప్రతిపాదనలు పెట్టారు. 

ఇదిలావుంటే.. తమకు కేటాయించే స్థానాలపై కాంగ్రెస్‌ ఎంతకీ తేల్చకపోవడంతో టీజేఎస్‌ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీజేఎస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో నేతలంతా కోదండరామ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. కూటమిలో తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని.. ఇందుకోసం కాంగ్రెస్‌పై ఒత్తిడిని మరింత పెంచాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల మెతకవైఖరి అవసరం లేదని కోదండరామ్‌కు పలువురు సూచించినట్లు తెలుస్తోంది. మహాకూటమిలో తాము కలవకపోతే.. కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం జరుగుతుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. 

సమావేశంలో నేతల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశం నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్లిపోయారు. అయితే.. మహాకూటమికి సంబంధించిన అంశాలపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు బుధవారం టీజేఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిపాలని నిర్ణయించారు. ఈ సమావేశం తరువాత కోదండరామ్‌ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి సీట్ల సర్దుబాటుపై టీజేఎస్ కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి పెంచుతోంది. మరి దీనిపై కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

11:17 - October 21, 2018

నల్గొండ : జిల్లా మిర్యాలగూడలో గత నెల 14న పట్టపగలే దారుణ హత్యకు గురైన ప్రణయ్‌ సంస్మరణ సభ ఆదివారం జరగనుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌.. తన  కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకోవడంతో  సహించలేని ఆమె తండ్రి మారుతీ రావు హత్య చేయించాడు.  ఈ హత్యోదంతంపై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ ఎస్సీ,  ఎస్టీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎంతోమంది అమృతకు మద్దతుగా నిలిచారు. ప్రణయ్ సంస్మరణ సభకు అనేక  ప్రజాసంఘాలు, సామాజిక సంఘాల నేతలు, విద్యావేత్తలు,  నేతలు తరలి రానున్నారు. ప్రణయ్‌ ఘటన భవిష్యత్‌ తరాలకు తెలిపే విధంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అనేకమంది కోరుతున్నారు. ఇందుకోసం అమృత దరఖాస్తు  కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే  కార్యక్రమంలో ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుతో పాటు.. కులాంతర  వివాహం చేసుకున్న జంటలకు రక్షణ చట్టం కల్పించే అంశాలపై చర్చించనున్నారు. 

11:05 - October 21, 2018

హైదరాబాద్ :  తెలుగు రాష్ర్టాల్లో క్రికెట్ బుకింగ్‌ హైటెక్‌  స్థాయిలో సాగుతోంది. టెక్నాలజీతో  కోట్లాది రూపాయలు  అక్రమంగా సంపాదిస్తున్నారు బుకీలు. ఇంటర్నెట్, వాట్సాప్,  ఫేస్ బుక్‌ ద్వారా  చాపకిందనీరులా సాగుతుంటే.,,   పోలీసులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారన్న  ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ హైటెక్‌ స్థాయిలో సాగుతోంది. టెక్నాలజీ వినియోగంతో... రెచ్చిపోతున్న క్రికెట్‌ బుకీలు  కోట్లకు కోట్లు కూడబెడుతున్నారు. ఈ విషయంలో  పోలీసుల  తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పోలీసులు  ప్రధాన  బుకీలను పక్కనపెట్టి అనామకుల అరెస్టులతో చేతులు  దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  శివారు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు అద్దెకు తీసుకుని  బెట్టింగ్‌  దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఇంటర్నెట్‌లో ప్రత్యేక  గ్రూపులు ఏర్పాటు చేసుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. పూర్తి స్థాయి వివరాలు తెలుసుకున్నాకే.. తమ గ్రూపులో యాడ్‌ చేసుకుంటున్నారు.
అంతటితో ఆగకుండా.. క్రికెట్‌పై మక్కువ ఉండే కాలేజీ  విధ్యార్ధులను ఈ ఉచ్చులోకి దించుతున్నారు. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చంటూ విద్యార్థులకు  ఆశలురేపుతారు. అలాగే.. అట జరిగే సమయంలో బుకీలను తెస్తే కమీషన్ కూడా ఇస్తామంటూ  వలవేస్తారు. ఇలా విద్యార్ధులే టార్గెట్ గా బుకీలు  కోట్లాది రూపాయలు  అక్రమంగా సంపాదిస్తున్నారు. అరెస్ట్‌ చేయడానికి వెళ్తున్న పోలీసులు.. బేరం కుదుర్చుకుని వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

11:01 - October 21, 2018

హైదరాబాద్: ఉదయం, రాత్రి తేడా ఉండదు. పనిగంటలు అస్సలు తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే. డ్యూటీ చేయడం. తాము కుటుంబానికి దూరమైనా.. ప్రజలంతా హాయిగా ఉండేలా కాపలా కాయడం. అల్లరిమూకల రాళ్ల  దెబ్బలు, విద్రోహుల తుపాకీ తూటాలకు తమ ప్రాణాలను సైతం ఎదురొడ్డుతారు. వీరోచితంగా పోరాడి ప్రజల ప్రాణాలు కాపాడతారు. వారే పోలీసులు. విధి నిర్వహణలో రక్తాన్ని చిందించి.. ప్రాణాలు అర్పించిన పోలీసుల  త్యాగం మరువలేనిది. శాంతిభద్రతలే ధ్యేయంగా విధులు నిర్వహిస్తారు. నిరంతరం సేవలందిస్తూ.. ప్రజారక్షణలో నిమగ్నమవుతారు పోలీసులు. ఇవాళ(అక్టోబర్ 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 10టీవీ ప్రత్యేక కథనం..

భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్‌చిన్ ప్రాంతం.. 16వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఇక్కడి నుంచే ఆరంభమైంది.

మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకం. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను CRPF బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న పంజాబ్‌కు చెందిన 21మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పదిమంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పోలీసుల పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 

పోలీసులకు తెలిసిందల్లా ఒక్కటే.. శాంతిభద్రతలను కాపాడటం. బంధుత్వాలు అనే వాటికి వారివద్ద తావుండదు. తప్పు చేసిన వాడు తన వాడైనా శిక్ష ఒక్కటే అనేది వారి పాలసీ. పగలు రాత్రి తేడా లేకుండా అలుపెరగని విధులు నిర్వహిస్తారు. బందులైనా, బందోబస్తులైనా వారు లేనిదే ఏమీ జరగదు. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడేందుకు అవసరమైతే తమ ప్రాణాలను పణంగా పెడతారు. అందుకే తల్లిదండ్రుల్లా దండించే స్థానంలో వారికి మనం స్థానం కల్పించాం. భార్యబిడ్డలకు, తల్లిదండ్రులకు సైతం దూరంగా ఉండి నిరంతరం సొసైటీని రక్షించడంలో పోలీసులది కీలక పాత్ర. నేరస్తుల గుండెల్లో నిద్రపోతూ, సంఘ విద్రోహశక్తులను అణిచివేడయంలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బంది అనేక మంది ఉన్నారు. వారి త్యాగం మరువలేనిది. అలా డ్యూటీలో ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం మన పోలీసులు ప్రతి ఏడాది అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తారు. 

పోలీసులు దేశం కోసం, ప్రజల కోసం వారి ప్రాణాలు అర్పించినప్పటికీ ఆ త్యాగాలు గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఈ త్యాగాలను గుర్తించి, ఆ త్యాగమూర్తులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. దేశ సరిహద్దుల్లో సైనికులు, అంతర్గత శత్రువులతో పోరులో పోలీసు అసువులు బాస్తున్నారు. ఎంతో కష్టతరమైన.. పోలీసు బాధ్యతలను నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే.. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం.

10:59 - October 21, 2018

తెలుగుసినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైజాగ్ ప్రసాద్ ఈ ఉదయం హఠాత్తుగా కన్నుమూసారు.. తెల్లవారుజామున వాష్‌రూమ్‌కి వెళ్ళిన ప్రసాద్, గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు.. కుటుంబ సభ్యులు గుర్తించి హాస్పిటల్‌కి తీసుకెళ్ళగా ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.. వైజాగ్ ప్రసాద్ అసలు పేరు ప్రసాద్ బాబు.. ఆయన వయసు 68సంవత్సరాలు.. ప్రసాద్ భార్య విద్యావతి. వీరికి రత్నప్రభ, రత్నకుమార్.. ఇద్దరు పిల్లలు.. రత్నప్రభ అమెరికాలో, రత్నకుమార్ లండన్‌లో కంప్యూటర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.. జంధ్యాల దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా చేసిన బాబాయ్-అబ్బాయ్ సినిమాతో ప్రసాద్ నట జీవితం ఆరంభమైంది.  నువ్వునేను, భద్ర, జైచిరంజీవ, లయన్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వైజాగ్ ప్రసాద్.. 

10:56 - October 21, 2018

హైదరాబాద్ : వాతావరణంలో మార్పులు ప్రజలను  బెంబేలిత్తిస్తున్నాయి... రోగాలు పెంచే వైరస్ స్పీడ్ పెంచి  ప్రజలకు చుక్కలు చూపిస్తోంది.. దసరాకు ముందే.. 200కు  పైగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ  రేంజ్‌లో చెప్పొచ్చు. వెదర్ ఛేంజ్‌కు తగ్గ ట్రిక్స్‌ పాటించి..  జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది లేదంటున్నారు డాక్టర్లు.  తెలంగాణ వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.  గ్రామీణ ప్రాంతాల్లో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ  వ్యాధులతో ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. పట్టణాల్లో  సైతం చిన్నారులు, మహిళలు విష జ్వరాలతో మంచాన పడి  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి తీవ్రంగా వర్షాలు  పడటంతో వాతావరణంలో మార్పులు వచ్చి వైరస్‌  విపరీతంగా వ్యాపించింది. అయితే... ఏరేంజ్‌లో వైరస్‌ స్పీడప్‌  అయితే దసరాకు ముందు వరకే 200కు పైగా పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయంటే పరిస్థితులు అర్ధం చేసుకోవచ్చు. 
మరోవైపు... సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో జిల్లాల్లోని  ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. కొన్ని  ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా బెడ్స్‌ లేక రోగులను తిప్పి  పంపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఆర్థిక  స్థోమత లేని పేదలు మాత్రం అక్కడే ఉండి వైద్యం  చేయించుకుంటున్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో  వైద్యం అందక రోగులు అవస్థలు పడుతుంటే.. మరోవైపు..  ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చిన్నపాటి జ్వరాలకే ఇష్టానుసారంగా  టెస్ట్‌లు నిర్వహిస్తూ రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. 
అయితే రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు  వ్యక్తిగత శుభ్రత పాటించాలంటున్నారు డాక్టర్లు. చిన్నపిల్లలు,  గర్భిణీలకు వైరస్‌ సోకితే హెవీ రియాక్షన్ ఉండే అవకాశం  ఉన్నందున  కేర్‌ ఫుల్‌గా ఉండాలంటున్నారు డాక్టర్లు.

10:42 - October 21, 2018

ఢిల్లీ : భారత సీనియర్‌ పేసర్‌ ప్రవీణ్‌కుమార్‌ క్రికెట్‌ సిరీస్‌కు ముగింపు పలికారు. అన్ని రకాల క్రికట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో ప్రవీణ్‌కుమార్‌ నేర్పరి. 2007లో ఆరంగ్రేటం చేసిన ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్‌ప్రదేశ్‌వాసి. 84 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్రవీణ్‌కుమార్‌.. కొన్నేళ్లపాటు భారతజట్టు వన్డే ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. అతను 68 వన్డేల్లో 36.02 సగటుతో 77 వికెట్లు తీశాడు. 2012లో ప్రవీణ్‌కుమార్‌ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఫిట్‌నెస్‌ సమస్యలు అతడి కెరీర్‌ను దెబ్బతీశాయి. కొన్నేళ్ల నుంచి అతను ఐపీఎల్‌లోనూ కనిపించడం లేదు. అయితే.. బౌలింగ్‌ కోచ్‌ కావాలనేది తన లక్ష్యమని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 

10:33 - October 21, 2018

ఢిల్లీ : ప్రొ-కబడ్డీలో బెంగాల్‌ వారియర్‌-యూపీ యోధ మ్యాచ్‌ టై అయ్యింది. చివరివరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. ఓ దశలో బెంగాల్‌ గెలిచేలా కనిపించినా చివరకు యూపీ సత్తా చాటడంతో స్కోర్లు సమమయ్యాయి. మరో మ్యాచ్‌లో యు ముంబాపై పుణేరీ పల్టన్‌ విజయం సాధించింది. ప్రొ-కబడ్డీ ఆరో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ అజేయంగా సాగుతోంది. శనివారం యూపీ యోధతో జరిగిన మ్యాచ్‌ను 40-40తో ఆ జట్టు టైగా ముగించింది.  
బెంగాల్‌ తరపున మనిందర్‌ సింగ్‌ 16 రైడ్‌ పాయింట్లతో సత్తా చాటాడు. సుర్జీత్‌ ఆరు ట్యాకిల్‌ పాయింట్లు సాధించాడు. యూపీ యోధ జట్టులో ప్రశాంత్‌కుమార్‌, రిషాండ్‌ దేవడిగ అద్బుతంగా ఆడారు. తొలి అర్ధభాగంలో యోధ 18-15తో ముగించింది. విరామం తర్వాత కూఆ అదే జోరు కనబరిచిన యోధ జట్టు.. 22వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 23-17తో ఆధిక్యాన్ని సాధించింది. 10 నిమిషాలు ఆట మిగిలివుండగా.. 28-21తో నిలిచింది. ఆ సమయంలో సుర్జీత్‌ ట్యాకింగ్‌లో మెరవడం, రైడర్లు వరుసగా పాయింట్లు తేవడంతో 38వ నిమిషంలో బెంగాల్‌ జట్టు 36-37తో ఆధిక్యం సాధించింది. తర్వాత నిమిషంలోనే ప్రశాంత్‌ రైడింగ్‌లో డబుల్‌ పాయింట్లతో యోధను పోటీలో నిలిపాడు. మనిందర్‌ తెచ్చిన రెండు రైడ్‌ పాయింట్లతో బెంగాల్‌ 40-39తో గెలిచేలా కనిపించినా చివరి రైడ్‌లో ప్రశాంత్‌ బోనస్‌ పాయింట్‌ సాధించడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్‌.. 33-32తో యు ముంబాపై గెలిచింది. 

10:25 - October 21, 2018

విజయవాడ : రాష్ట్రంలో రౌడీయిజాన్ని కఠినంగా అణచివేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. మతసామరస్యానికి విఘాతం కలిగించే శక్తులను ఉపేక్షించవద్దని కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సదర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసుల సంక్షేమ నిధికి 15 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉద్యోగంలో చేరిన ప్రతి పోలీసు ఒక ప్రమోషన్‌ పొందేలా విధానం తీసుకొస్తున్నామని చెప్పారు.  

10:15 - October 21, 2018

ఢిల్లీ : రాముడు, కృష్ణుడు...సీత, లక్ష్మి, సరస్వతి...తదితర దేవతల పేర్లు పెట్టుకోవడం సహజం. కానీ రాజస్థాన్‌ ఓటర్ల జాబితా పేర్లను చూస్తే మాత్రం విస్తు పోవాల్సిందే. రామాయణ కాలం నాటి దేవతలే కాదు...రాక్షసుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో దర్శనమిచ్చాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. రాజస్థాన్‌లో ఈసీ విడుదల చేసిన  ఓటర్ల జాబితా ఇపుడు చర్చనీయాంశమైంది.
రామాయణ కాలం నాటి పాత్రల పేర్లు ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, భరత, శతృఘ్న, హనుమంతుడి లాంటి పేర్లు ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ....రాక్షసుల పేర్లు కూడా ఓటర్ల లిస్టులో ఉన్నాయి. రావణ్‌, మండోదరి, విభీషణ్‌, మేఘనాథ్‌, కుంభకర్ణ్‌ లాంటి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండడం విస్తు గొలుపుతోంది.  
పూజించే దేవతల పేర్లు పెట్టుకోవడం సహజమే...భారత్‌లో రావణుడిని విలన్‌గా చూడడమే కాదు...దసరా పండగ రోజు ఆయన దిష్టిబొమ్మను కూడా తగులబెడుతుంటారు. అలాంటిది రాజస్థాన్‌ ఓటర్ల జాబితాలో రావణుడి పేరిట 110 మంది ఓటర్లు ఉన్నారు. జాతీయ ఓటర్ల సేవా పోర్టల్‌ ప్రకారం రావణుడి భార్య మండోదరి పేరిట 47 మంది మహిళా ఓటర్లున్నారు. నలుగురు కుంభకర్ణులు, 68 మంది విభీషణులు, 223 మంది మేఘనాథ్‌లు ఉన్నారు. హనుమాన్‌ పేరుతో 64 వేల 637 ఓటర్లున్నారు. సీత పేరుతో లక్షా 90 వేల 77 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా రాముడి పేరుతో 12 లక్షల 81 వేల 679 ఓటర్లున్నారు. లక్ష్మణుడి పేరుతో 44 వేల 194 మంది ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి.
దేశవ్యాప్తంగా రావణుడి పేరుతో 24,873 ఓటర్లు, మండోదరి పేరుతో 6,831 ఓటర్లు... రావణుడి సోదరి శుర్పనఖ పేరుతో ఇద్దరు, మంథర పేరుతో 1233, కైకేయి పేరుతో 644 మంది ఓటర్లు ఉండడం గమనార్హం. పురాణ పాత్రల పేరుతో వ్యక్తుల పేర్లు కలిగి ఉండడం విచిత్రమే మరి. 

09:55 - October 21, 2018

హైదరాబాద్: టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ క్యారెక్టర్ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన మరణించారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ కాసేపటికే ఆయన కన్నుమూశారు. ప్రసాద్ వయసు 75 సంవత్సరాలు. ఆయనకు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలు రత్నప్రభ, రత్నకుమార్ ఉన్నారు. గత రెండేళ్లుగా ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్‌ నుంచి వచ్చారు కాబట్టి వైజాగ్‌ ప్రసాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది. ప్రసాద్‌ తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానంగా జన్మించారు. ఊహ తెలియక ముందే తల్లి కన్నుమూసింది. మేనమామ దగ్గరుండి ఎస్‌ఎస్‌ఎల్‌సీ దాకా చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో నటించేవారు. నాటకాల పిచ్చితో అగ్రికల్చర్‌ బీఎస్‌సీ సీటు, ఎంబీబీఎస్‌ సీటు పోగొట్టుకున్నారని సన్నిహితులు చెబుతారు. 

1983లో వచ్చిన బాబాయ్‌ అబ్బాయ్‌‌ నటుడిగా ఆయన మొదటి సినిమా. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన, టీవీ సీరియల్స్‌లోనూ పలు కీలకమైన పాత్రలు పోషించి తెలుగు అభిమానులకు వినోదాన్ని అందించారు. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చిన వైజాగ్ ప్రసాద్ తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను'లో హీరో ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రను పోషించి, మెప్పించారు. తర్వాత వరుసగా అవకాశాలను పొందారు. భద్ర, జై చిరంజీవ, గౌరి, జానకీ వెడ్స్ శ్రీరామ్ తదితర చిత్రాల్లో నటనతో గుర్తింపు పొందారు.

కాగా, ప్రసాద్ పిల్లలు రత్నప్రభ అమెరికాలో, రత్నకుమార్ లండన్ లో నివాసం ఉంటుఃన్నారు. వారికి కబురు చేశామని, వారు వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయని ప్రసాద్ కుటుంబీకులు తెలిపారు. వైజాగ్ ప్రసాద్ మృతికి టాలీవుడ్ సంతాపం వెలిబుచ్చింది.

09:41 - October 21, 2018

హైదరాబాద్: ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ.. టీఆర్‌ఎస్‌ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించిన గులాబీ పార్టీ.. అభ్యర్థులు.. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై గులాబీ బాస్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే 105మంది అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా.. ఓవైపు ప్రచారాన్ని ఉధృతం చేసిన టీఆర్‌ఎస్‌.. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై దిశా నిర్దేశం చేయనుంది. ఇందులో భాగంగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం భేటీ కానున్నారు. పార్టీ ఎంపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. 

బతుకమ్మ, దసరా పండుగలు అయిపోయిన నేపథ్యంలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలనుకుంటోంది గులాబీ దళం. అలాగే పార్టీ పాక్షిక మేనిఫెస్టోను కూడా ప్రకటించడంతో ఆయా అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై అభ్యర్థులకు కేసీఆర్‌ సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. కేసీఆర్‌ 50 రోజుల్లో 100 సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్‌పై నేతలు కసరత్తు చేస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్‌ సభలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇక పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రచారానికి సన్నద్ధం చేయడం.. ఓటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే పథకాలు, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన, ఓట్లు టీఆర్‌ఎస్‌కు వేసే విధంగా చూడటం ఇలా పోల్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించడంపై కూడా కేసీఆర్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారంలో మరింత దూసుకుపోవాలని టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది. మరి ఈ సమావేశంలో అభ్యర్థులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి.

08:47 - October 21, 2018

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశమిచ్చారు. జాబితాలో ముగ్గురు మహిళలకు అవకాశమిచ్చారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చినట్లు,.. గెలుపు అవకాశాలు ఉన్న వారికే సీట్లు కేటాయించినట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. 

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుండగా.. తాజాగా బీజేపీ 38మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. శనివారం రాత్రి 11గంటల తర్వాత ఈ జాబితాను అధికారికంగా విడుదల చేశారు.

అమిత్‌షా, మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తొలి జాబితాను కేంద్రమంత్రి, తెలంగాణ ఇన్‌చార్జ్‌ జేపీ నడ్డా విడుదల చేశారు. ఈ జాబితాలో ఐదుగురు సిట్టింగులకు సీట్లు ఖాయం చేశారు. అలాగే తొలి జాబితాలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. ముషీరాబాద్‌ నుంచి లక్ష్మణ్‌, అంబర్‌పేట నుండి కిషన్‌రెడ్డి, ఉప్పల్‌ నుండి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ఖైరతాబాద్‌ నుండి చింతల రామచంద్రారెడ్డి, గోషామహల్‌ నుండి రాజాసింగ్‌కు అవకాశమిచ్చారు. ఈ ఐదుగురు ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యేలు. 

Image result for bjp lakshmanఇక మిగతా స్థానాలైన మునుగోడు నుండి మనోహరరెడ్డి, కల్వకుర్తి నుండి ఆచారి, బోధ్‌ నుండి మాదవి రాజు, బెల్లంపల్లి నుండి కొయ్యల ఇమ్మాజి, సూర్యాపేట నుండి సంకినేని వెంకటేశ్వరరావు, మేడ్చల్‌ నుండి మోహన్‌రెడ్డిలకు అవకాశమిచ్చారు. అలాగే ఆదిలాబాద్‌ నుండి పాయల్‌ శంకర్‌కు, షాద్‌నగర్‌ నుండి శ్రీవర్ధన్‌రెడ్డికి, దుబ్బాక నుండి రఘునందనరావుకు, కరీంనగర్‌ నుండి బండి సంజయ్‌కు, పెద్దపల్లి నుండి గుజ్జుల రామకృష్ణారెడ్డి, భూపాలపల్లి నుండి కీర్తిరెడ్డి, ముదోల్‌ నుండి రమాదేవి, నారాయణపేట నుండి రతన్‌పాండురంగారెడ్డి, కామారెడ్డి నుండి వెంకటరమణారెడ్డి, ఎల్బీనగర్‌ నుండి పేరాల చంద్రశేఖర్‌రావు, పినపాక నుండి సంతోష్‌కుమార్‌, మక్తల్‌ నుండి కొండయ్య, ఆర్మూర్‌ నుండి వినయ్‌కుమార్‌రెడ్డి, ధర్మపురి నుండి అంజయ్య, మానకొండూరు నుండి గడ్డం నాగరాజు, పరకాల నుండి విజయ్‌చంద్రారెడ్డి, మల్కాజ్‌గిరి నుండి రామచంద్రారావుకు, పాలేరు నుండి శ్రీధర్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ నుండి ఆనంద్‌రెడ్డి, తాండూర్‌ నుండి పటేల్‌ రవిశంకర్‌, అచ్చంపేట నుండి మల్లేశ్వర్‌, సత్తుపల్లి నుండి నంబూరి రామలింగేశ్వరరావు, భద్రాచలం నుండి కుంజా సత్యవతి, కోరుట్ల నుండి జె.వెంకట్‌, ఆందోల్‌ నుండి బాబుమోహన్‌, కార్వాన్‌ నుండి అమర్‌సింగ్‌, గద్వాల నుండి గద్వాల వెంకటాద్రిరెడ్డిలను ప్రకటించారు. 

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా

నెం. నియోజకవర్గం అభ్యర్థి పేరు
1 ముషీరాబాద్‌  లక్ష్మణ్
2 అంబర్‌పేట  కిషన్‌రెడ్డి
3 ఉప్పల్‌ ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్
4 ఖైరతాబాద్‌  చింతల రామచంద్రారెడ్డి
5 గోషామహల్‌  రాజాసింగ్‌
6 మునుగోడు మనోహరరెడ్డి
7 కల్వకుర్తి ఆచారి
8 బోధ్‌ మాదవి రాజు
9 బెల్లంపల్లి కొయ్యల ఇమ్మాజి
10 సూర్యాపేట సంకినేని వెంకటేశ్వరరావు
11 మేడ్చల్‌ మోహన్‌రెడ్డి
12 ఆదిలాబాద్‌ పాయల్‌ శంకర్‌
13 షాద్‌నగర్‌  శ్రీవర్ధన్‌రెడ్డి
14 దుబ్బాక రఘునందనరావు
15 కరీంనగర్‌  బండి సంజయ్
16 పెద్దపల్లి గుజ్జుల రామకృష్ణారెడ్డి
17 భూపాలపల్లి కీర్తిరెడ్డి
18 ముదోల్‌ రమాదేవి
19 నారాయణపేట రతన్‌ పాండు రంగారెడ్డి
20 కామారెడ్డి వెంకటరమణారెడ్డి
21 ఎల్బీనగర్‌ పేరాల చంద్రశేఖర్‌రావు
22 పినపాక సంతోష్‌కుమార్
23 మక్తల్‌ కొండయ్య
24 ఆర్మూర్‌ వినయ్‌కుమార్‌ రెడ్డి
25 ధర్మపురి అంజయ్య
26 మానకొండూరు గడ్డం నాగరాజు
27 పరకాల విజయ్‌చంద్రారెడ్డి
28 మల్కాజ్‌గిరి రామచందర్ రావు
29 పాలేరు శ్రీధర్‌రెడ్డి
30 నిజామాబాద్‌ రూరల్‌ ఆనంద్‌రెడ్డి
31 తాండూర్‌ పటేల్‌ రవిశంకర్
32 అచ్చంపేట మల్లేశ్వర్
33 సత్తుపల్లి నంబూరి రామలింగేశ్వరరావు
34 భద్రాచలం కుంజా సత్యవతి
35 కోరుట్ల జె.వెంకట్
36 ఆందోల్‌ బాబుమోహన్‌
37 కార్వాన్‌ అమర్‌సింగ్
38 గద్వాల గద్వాల వెంకటాద్రిరెడ్డి

 

సీట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు పెద్ద పీట వేసినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. గెలుపు గుర్రాలకు అవకాశం కల్పించామన్నారు. 

మొత్తానికి 119 నియోజకవర్గాలకు గాను 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మిగతా అభ్యర్థుల ఎంపిక.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్దం చేస్తారో చూడాలి.

శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ ఎన్నికల కమిటీ.. 38మందితో కూడిన తొలి జాబితాకు ఆమోదం తెలిపింది. అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సమావేశమైంది. ఈ సందర్భంగా పోటీ లేని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను షాకు అందజేసి చర్చించారు. అనంతరం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.

ఇందులో అమిత్‌ షాతోపాటు కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, జేపీ నడ్డా, థావర్‌చంద్‌ గెహ్లాట్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, రాంలాల్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ ఎన్నికల బాధ్యులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 38 మందితో కూడిన తొలి జాబితాతోపాటు మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. శనివారం అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరిన డాక్టర్‌ జె.వెంకట్‌ కోరుట్ల నుంచి బరిలోకి దిగనున్నారు. ఆయన సతీమణి జెడ్పీటీసీ సునీత కూడా బీజేపీలో చేరారు.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Don't Miss