Activities calendar

22 October 2018

22:47 - October 22, 2018

లక్నో : కట్నంగా తనకు నచ్చిన అపాచీ బైక్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఓ వరుడు పీటల వద్దనే మంకు పట్టు పట్టాడు. పెళ్లి కూతురు బంధువులు పెళ్లి కొడుక్కి అర గుండు కొట్టించారు. ఈఘటన లక్నోలోని కుర్రంపట్టణంలో చోటుచేసుకుంది.
 
అబ్దుల్ కలాం బహేచ్ అనే పెళ్లి కొడుకు తనకు ముందుగానే అపాచీ బైక్ ఇస్తానని అన్నారు కానీ.. ఆ మాట నిలబెట్టుకోలేదంటూ తమ బంధు వర్గంతో పెళ్లి కూతురు బంధువులుతో గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహించిన పెళ్లి కూతరు తరుపు వారు కూడా వారితో తలపడ్డారు. పెళ్లి కూతురు బంధువులు పెళ్లి కొడుక్కి అర గుండు కొట్టించారు. రెండు వర్గాల వారు గొడవకు దిగారు. దీంతో విషయం పోలీస్ స్టేషన్ దాకా చేరింది. ఇందిరా నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా... పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే పనిలో పడ్డారు. 

 

22:14 - October 22, 2018

విజయవాడ : బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. అక్రమార్జన ద్వారా జీవీఎల్ రూ.200 కోట్లు సంపాదించారని ఆరోపించారు. అక్రమ నగదు చెలామణికి పాల్పడ్డారని విమర్శించారు. ఢిల్లీ, హైదరాబాద్, ఏపీలో జీవీఎల్ భారీగా ఆస్తులు కూడబెట్టారని తెలిపారు. జీవీఎల్ నరసింహారావుపై ఈడీ అధికారులు కేసు పెట్టాలని అన్నారు. 

 

22:10 - October 22, 2018

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షణకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు 9 రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యారు. రాజకీయ పార్టీల అభ్యంతరాలు,సూచనలు స్వీకరించారు. కేంద్ర ఎన్నికలసంఘంతో సమావేశమై వచ్చిన కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి ఎన్నికల సంఘం పనితీరును తీవ్రంగా తప్పు పట్టారు. కోర్టును ఎన్నికల అధికారులు తప్పుదారి పట్టించారని,ఎన్నికల సంఘం చాలాదారుణంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఈనెల12కల్లా ఓటర్ల లిస్టు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఓటర్ల జాబితా అందలేదని,ఈఆర్వీనెట్ సక్రమంగా పనిచేయటంలేదని ఆరోపించారు.

21:41 - October 22, 2018

గుంటూరు: టీడీపీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలలో 40 శాతం మందిపై ప్రజల్లో చెడు అభిప్రాయం ఉందన్నారు. వాళ్లని మార్చగలిగితే మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని చెప్పారు. ఈమేరకు జేసీ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మోడీ ఫ్యాక్షన్ స్వభావం ఉన్న వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబు అందరూ బ్రతకాలి అనుకుంటారని అన్నారు.

జగన్ సీఎం అయితే మొదట అరెస్టు చేయమనేది తననే అని అన్నారు. గంజాయి కేసు అయినా తనపై పెట్టమంటాడని చెప్పారు. జగన్, పవన్ వ్యక్తిగతంగా గెలుస్తారని.. ఇద్దరూ భిన్న ధృవాలు కలిసి పని చేయడం కష్టమన్నారు.

21:19 - October 22, 2018

హైదరాబాద్ : నగరంలో బురిడీ బాబా హల్ చల్ చేశాడు. పూజల పేరుతో మహిళల మెడలో గొలుసులు కాజేస్తున్నాడు. కిరాణా దుకాణాల్లో పని చేస్తున్న మహిళలే టార్గెట్‌గా దొంగ బాబా చోరీలు చేస్తున్నాడు. నోటు మార్చేసి గొలుసులు కొట్టేస్తున్నాడు. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్ పల్లి, గండిపేట్‌లో చోరీలకు పాల్పడ్డాడు. 
 
గుడిలో ఇవ్వాలంటూ కొబ్బరి కాయలు, ముడుపులు మహిళలకు ఇస్తున్నాడు. మెడలో గొలుసును వంద రూపాయల నోటులో పెట్టమని చెబుతున్నాడు. నోటు మార్చేసి దొంగ బాబా గొలుసులు కొట్టేస్తున్నాడు.  

రాజేంద్రనగర్ భవానీకాలనీలో లావణ్య అనే మహిళ నుంచి 12 తులాల గొలుసు చోరీ చేశాడు. మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోషి అనే మహిళ నుంచి 6 తులాల బంగారాన్ని కొట్టేశారు. నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలో భాగ్యలక్ష్మీ అనే మహిళ నుంచి 6 తులాల బంగారాన్ని చోరీ చేశాడు. 

21:05 - October 22, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టడానికి ఏర్పాటైన మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ఇంతవరకు ఒకక్లారిటీకి రాలేదు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయమై నాన్చుడు ధోరణి అవలంబిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహాకూటమిలో చీలికలు వచ్చాయని వస్తున్న వార్తలపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్. కోదండరాం మాట్లాడుతూ-కూటమిని నడపాల్సిన బాధ్యత కాంగ్రెస్ దేనని, ఇతర భాగస్వామ్య పార్టీలతో ఎలావ్యవహరించాలో కాంగ్రెస్ పార్టీకి స్పృష్టత లేదని వ్యాఖ్యానించారు. ఈఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కూటమి పని చేస్తుందని, ప్రస్తుతానికి కూటమిలో ఎవరు,ఎవరు, ఏఏ బాధ్యతలు తీసుకోవాలి,ఎలా పనిచేయాలో తేల్చుకోలేక పోతున్నామని, కాంగ్రెస్ పార్టీ త్వరగా సీట్ల విషయం తేల్చాలని కోదండరాం అన్నారు. 

20:38 - October 22, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘ బృంద సభ్యులు రాష్ట్రంలోని రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో సీఈసీ ఓపీ రావత్ సమావేశమై త్వరలో జరగబోయే ఎన్నికలపై చర్చించారు. మొత్తం 9 పార్టీల  వారిని పిలవగా ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు సభ్యుల చొప్పున హాజరయ్యారు. ఆయా పార్టీల సభ్యులతో ఎన్నికల బృందం విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తోంది. ఒకో పార్టీకి  19 నిమిషాలు సమయం కేటాయించారు. రాజకీయపార్టీలతో సమావేశమై వారి అభిప్రాయాలు,  అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత రాత్రికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌‌, పోలీసు నోడల్ అధికారులతో సీఈసీ బృందం  సమావేశం అవుతుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఎస్పీలు,డీఐజీలు, ఐజీలతో సమావేశమై  శాంతి భద్రతల అంశంపై  చర్చించిన అనంతరం  మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు  డీఈవోలు ,ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమై  ఓటర్ల జాబితా, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది, ఎన్నికల నియమావళి తదితర అంశాలపై వారితో చర్చిస్తారు.  24 వ తేదీ బుధవారం ఉదయం 10  గంటలనుంచి 11 గంటల వరకు  ఐటీ,అబ్కారీ  శాఖల అధికారులతో భేటీ అయి  ఎన్నికల్లో మద్యం, డబ్బు నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశమై ఢిల్లీకి  బయలుదేరి వెళ్తారు. 

20:30 - October 22, 2018

హైదరాబాద్ : బీజేపీ దీక్షపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. దొంగే దొంగ అన్నట్లుగా బీజేపీ నేతలు దీక్ష చేశారని ఎద్దేవా చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. నోట్ల రద్దు నుండి రఫేల్ కుంభకోణం వరకు దేశాన్ని దోచేసి దొంగలను సరిహద్దులు దాటిస్తున్నారని ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులు అగ్రిగోల్డు పేరుతో దీక్షలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదా నుండి తిత్లీ తుపాను సహాయం వరకు దేశంలో ఏపీ భాగం కాదన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.
 
అగ్రిగోల్డ్‌పై బీజేపీ కొత్త కుట్రకు తెర తీస్తుందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ అంశంలో బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే..కోర్టులను కించపరిచే విధంగా బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం మాని ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. బీజేపీకి అగ్రిగోల్డ్ బాధితులపై చిత్తశుద్ధి ఉంటే బెయిలవుట్ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.  

 

19:50 - October 22, 2018

హైదరాబాద్ : సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు మూడు విధాలుగా అటాక్ చేస్తున్నారు. ’మనకు తెలియకుండానే మన ఖాతాలో డబ్బులు మాయం’ అవుతున్నాయి. వెయ్యి రూపాయలు డ్రా చేస్తే క్షణాల్లో అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉంటుంది. సైబర్ క్రైమ్ నేరగాళ్ల మెసాలపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. అనుమానం వస్తే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల మెసాలపై పోలీసులు ఒక వీడియోను విడుదల చేశారు. 

 

19:16 - October 22, 2018

హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జూబ్లిహిల్స్ లో నిర్మించిన 10 టీవీ నూతన కార్యాలయాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజియర్ స్వామి   సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  "మనిషి ప్రశాంతతను కోరతాడు, ప్రశాంతత ఉన్నమనిషి ప్రగతిని సాధిస్తాడు. మనిషికి శరీరం  మనస్సు,బుద్ది జ్ఞానం ఇవన్నీ ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండగలిగితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు" అని అన్నారు. మనిషి తాను, తన చుట్టూ ఉండే సమాజం, తను మనుగడ సాగించే కుటుంబంతోపాటు తన చుట్టూ ఉన్న ప్రపంచ పోకడలను అర్ధం చేసుకుని ముందుకు సాగగలిగితే ఆమనిషి సమాజానికి ఉపయోగపడగలిగినవాడు కాగలగుతాడు అని శ్రీశ్రీశ్రీ చినజియర్ స్వామి చెప్పారు. "మనిషికి అన్ని రంగాలతో కావలసిన సంబంధాలను, అనుభవాన్ని, ఇవ్వగలిగిన  మాధ్యమం టీవీ" అని స్వామిజీ అన్నారు. సమాజానికి ఉన్నద్దున్నట్లు చూపించి, ఉద్రేకపరిచే వార్తలను కాకుండా, వాస్తవాలను అందిస్తూ, స్వార్ధం వీడి ,సమాజహితం కోరి ,నేను బాగుపడాలి,సమాజం బాగుపడాలనే ఆలోచనతో 10టీవీ  నేడు కొత్త అడుగు ముందుకు వేస్తున్నందుకు సంతోషిస్తున్నాము అని స్వామి వారు 10 టీవీ యాజమాన్యానికి మంగళాశాసనములు అందచేశారు.

19:13 - October 22, 2018

హైదరాబాద్ : వనస్థలీపురంలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయింది. డెలివరీ సమయంలో ఓ ఆపరేషన్ కు బదులు వైద్యులు మరో ఆపరేషన్ చేయడంతో   
మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు.

గర్భిణీ అయిన శ్వేత ఆగస్టు 15న డెలివరీ కోసం వనస్థలీపురంలోని లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే రెండు రోజుల క్రితం ఆమెకు తీవ్ర నొప్పి రావడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెలివరీ సమయంలో ఒక ఆపరేషన్ కు బదులు మరో ఆపరేషన్ చేయడం వల్లే ఆమెకు నొప్పి వస్తుందని..మరొక ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడి వైద్యులు సూచించారు. ఈ సమయంలో నొప్పి తీవ్రతరం కావడంతో శ్వేత మృతి చెందింది. దీంతో లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. 

మహిళ బంధువు..
’ఆగస్టు 15న ఉదయం 8.30 గంటకు శ్వేతను ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు కాన్పు కాలేదని డాక్టర్ చెప్పింది. నార్మల్ ఆపరేషన్ చేస్తానని చెప్పింది. అయితే మోషన్ పేగులు కట్ చేసింది. దాని వల్ల శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంతకముందుకు ఇద్దరికి నేను ఈవిధంగానే ఆపరేషన్ చేశానని..వారు నా దగ్గరకు గొడవకు రాలేదని.. మీరే నా దగ్గరకు గొడవకు వచ్చారని మాట్లాడింది. నష్టం పరిహారం కోసం మేము ఇక్కడికి రాలేదు’ అని మహిళ బంధువు పేర్కొన్నారు.  

16:53 - October 22, 2018

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రముఖ వ్యక్తుల జీవితాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న"మీటూ" ఉద్యమంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం  తిరస్కరించింది. "మీటూ" పిటీషన్ పై  అత్యవసర విచారణ చేపట్టాలంటూ ఎమ్ఎల్ శర్మ అనే న్యాయవాది వేసిన పిటిషన్ ను న్యాయస్ధానం తోసిపుచ్చింది.  "మీటూ" పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను అత్యవసర విచారణగా భావించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన​ గగోయ్‌, ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంటూ సాధారణ పిటీషన్లతో పాటు విచారణకు అనుమతించింది. లైంగిక ఆరోపణలు చేసిన కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్ధానం ఏర్పాటుచేసి, ఫిర్యాదుదారులకు జాతీయమహిళా కమీషన్ ద్వారా రక్షణ కల్పించాలని పిటిషనర్ సుప్రీం కోర్టును కోరారు. హాలీవుడ్ లో మొదలైన "మీటూ" ఉద్యమం మనదేశంలో సినీరంగంలో ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. "మీటూ" ఆరోపణలతో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్  ఇటీవల తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

16:52 - October 22, 2018

హైదరాబాద్ : తిత్లీ తుపాను నష్టంపై ఏపీ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. తుపాను నష్టంపై నివేదికను ఏపీ అధికారులు పీఎంఓలో సమర్పించనున్నారు. తిత్లీ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో రూ. 3435 కోట్ల నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. అక్టోబర్ 13న రాసిన లేఖకు కొనసాగింపుగా చంద్రబాబు రెండో లేఖను రాశారు. ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలను కూడా అధికారులు అందజేయనున్నారు. 

 

16:26 - October 22, 2018

హైదరాబాద్ : యాదాద్రి వ్యభిచార గృహాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మహిళలను వ్యభిచారంలోకి దింపి వ్యాపారం చేస్తున్న ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోర్టు పేర్కొంది. యాదాద్రి పోలీస్ ఉన్నతాధికారి నేరుగా హాజరై, వివరణ ఇవ్వాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. 

 

16:00 - October 22, 2018

విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. తిత్లీ తుఫాను విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పవన్ మండిపడ్డారు. తుఫాను వస్తుందని ముందే తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రజలను అప్రమత్తం చేయలేని పవన్ ఆరోపించారు. ప్రభుత్వం కమ్యూనికేషన్ వ్యవస్థను సరిగా వాడుకోలేదన్నారు.

తిత్లీ దెబ్బకు ఉద్దానం ఘోరంగా దెబ్బతిందని పవన్ వాపోయారు. బాధితులు నేటికీ అంగన్‌వాడీ కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటీకి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదని, తుఫాను షెల్టర్ల నిర్వహణ సరిగా లేదని పవన్ విమర్శించారు. సహాయక కార్యక్రమాల్లో వివక్ష చూపిస్తున్నారని పవన్ ఆరోపించారు. కేంద్రాన్ని సాయం అడగడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారని పవన్ వ్యాఖ్యానించారు. తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన సిక్కోలు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని, మత్స్యకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. ఇది ప్రచారం చేసుకునే సమయం కాదని, సహాయక కార్యక్రమాలు సరిగా అందేలా చూడాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

15:36 - October 22, 2018

విజయవాడ: కృష్ణా జిల్లా వైసీపీలో సీట్ల వ్యవహారం చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే. వైసీపీ కీలక నేత వంగవీటి రాధ విజయవాడ సెంట్రల్ సీటు కోసం పట్టుబట్టిన విషయం విదితమే. అయితే ఈ సీటును మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు జగన్ కేటాయించారు. దీంతో వంగవీటి రాధ అలక బూనడం, ఆయన అనుచరులు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న వంగవీటి రాధ తన సన్నిహితులు, అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. ఒకానొక దశలో వంగవీటి రాధ పార్టీని వీడేందుకు సైతం సిద్ధమయ్యారు. అయితే రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు రాధను బుజ్జగించారు.

తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రాధ సీటు ఎసిసోడ్‌పై జగన్ క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వంగవీటి రాధకు విజయవాడ తూర్పు సీటుని కేటాయించారని, బందర్ పార్లమెంటును బాలశౌరికి కేటాయించారని సమాచారం. మరి ఈ నిర్ణయంపై వంగవీటి రాధ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

15:23 - October 22, 2018

విశాఖ : జిల్లాలో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడి నలుగురు మృతి చెందారు. పాడేరు నుంచి వేగంగా వెళ్తున్న ఆటో జిల్లాలోని మాడుగుల మండలం వంట్లమామిడి వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఎక్కువగా చిన్నారులున్నట్లు తెలుస్తోంది.

 

14:21 - October 22, 2018

విజయవాడ: బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలో ప్రఃభుత్వం మారుతుందని జోస్యం చెప్పారు. అంతేకాదు రాబోయే ప్రభుత్వంలో బీజేపీ కీలక పాత్ర పోసిస్తుందన్నారు. ఆ ప్రభుతంలో అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చేసే విధంగా తొలి నిర్ణయం తీసుకుంటామని రాంమాధవ్ హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షను రాంమాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ... తెలుగు దోపిడి పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. చంద్రబాబుది హిట్లర్ తరహా పరిపాలన అని రాంమాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి జవాబుదాదీతనం ఉండాలని ఆయన హితవు పలికారు.

అగ్రిగోల్డ్ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తుందని రాంమాదవ్ హామీ ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అనేక మార్గాలు ఉన్నా.. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేందుకు ఆస్కారం ఉన్నా.. కావాలనే ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కొనేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చినా.. వారిని భయపెట్టి వెనక్కి పంపేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం తీరు చూస్తుంటే తప్పనిసరిగా ఇందులో పెద్ద కుంభకోణం ఉందనేది స్పష్టమవుతోందన్నారు. 

బీజేపీ.. మోదీ గారి పార్టీ అన్న రాంమాధవ్.. బీజేపీలో అవినీతికి తావు లేదన్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలో అవినీతి మచ్చలేకుండా పాలన సాగిస్తున్నామన్నారు. అగ్రిగోల్డ్ స్కామ్‌లో నష్టపోయిన బాధితులకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో పేద, పీడిత వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి మోదీ అని రాంమాధవ్ అన్నారు. అగ్రిగోల్డ్ స్కాంలో న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.6,500 కోట్లు చెల్లించడం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదన్నారు. కానీ అగ్రిగోల్డ్ భూములను కాజేసేందుకు కొందరు టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అందుకే బాధితుల సమస్యను పరిష్కరించడం లేదని రాంమాధవ్ ఆరోపించారు. అగ్రిగోల్డ్ కుంభకోణం వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియాలి అని రాంమాదవ్ అన్నారు. అవినీతిలో దేశంలోనే ఏపీ నాలుగో స్థానంలో ఉంటే.. తెలంగాణ 2వ స్థానంలో ఉందని రాంమాధవ్ అన్నారు.

13:39 - October 22, 2018

తిరువనంతపురం: కేరళ సన్యాసిని రేప్ కేసులో ప్రధాన నిందితుడు బిషప్ ఫ్రాంకో కేసులో కీలక సాక్షి అయిన క్రిష్టియన్ ఫాదర్ కురియకోస్ అనుమానస్పద స్థితిలో మరణించాడు. ఇది ముమ్మాటికీ హత్యే అని ఆయన కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. 
బిషప్ ఫ్రాంకో కేసులో బాధితురాలు 13 సార్లు రేప్ చేయబడింది అని వాదిస్తున్న క్రిస్టియన్ ఫాదర్ కురియకోస్ (60) జలంధర్ లోని దసుయా సైంట్ మేరీ చర్చిలో పూజారిగా పనిచేస్తున్నారు. ఆయన సోమవారం అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉండగి కనుగొన్నారు. బిషప్ ఫ్రాంకో ములక్కాయ్‌కు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చినందుకో కురియకోస్‌ను అంతమొందించారని అనుమానిస్తున్నారు. ఈ హత్య వెనక అతిపెద్ద లాబీ పనిచేస్తోందన్న ప్రచారానికి కురియకోస్ హత్య తోడయ్యింది. 
కొంతమంది సన్యాసినులు ఈ ఉదయం కురియకోస్ ఇంటివద్ద తలుపులు కొట్టినా లేవకపోవడంతో.. అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టగా ఆయన నేలపై పడిఉన్నారని.. ఆయనను ఆసుపత్రికి తరలించగా మరణించారని వైద్యులు దృవీకరించారు. కొద్ది రోజుల క్రితం కొందరు సిస్టర్స్ తన దగ్గరికి వచ్చి బిషప్ ఫ్రాంకోపై ఫిర్యాదు చేశారని. అయితే వారు బిషప్‌కు భయపడి పోలీసులను ఆశ్రయించలేదని.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లడితే ఏమవుతుందో..నాకు తెలుసు నాకు ఏదో హాని జరగవచ్చని అనుకుంటుంన్నాను.. అంటూ కురియకోస్ ప్రకటన జారీ చేశారు. 

 

 

13:39 - October 22, 2018

భువనేశ్వర్: పెట్రోలు ధరను డీజిల్ ధర దాటేసింది. అక్కడ పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువ. ఇలా జరగడం దేశంలోనే తొలిసారి. ఒడిషా రాష్ట్ర రాజధాని నగరమైన భువనేశ్వర్‌లో ఈ పరిస్థితి ఏర్పడింది. అక్కడ డీజిల్ లీటరు ధర రూ.80.78కా.. పెట్రోలు లీటరు ధర రూ.80.65 గా ఉంది. సాధారణంగా డీజిల్ కంటే పెట్రోలు ధర అధికంగా ఉంటుంది. కానీ ఒడిశాలో మాత్రం దీనికి భిన్నంగా డీజిల్ రేటు పెరిగింది. డీజిల్‌పై తక్కువ పన్నులు, తక్కువ డీలరు కమీషన్లతో పాటు బేస్ ధర కూడా తక్కువగా ఉంటుంది. దీంతో డీజిల్ ధర పెట్రోలు కంటే తక్కువగా ఉంటుంది. కానీ అంతర్జాతీయంగా డీజిల్ బేసిక్ ధర ఐదు రూపాయలు పెరగడం వల్ల పెట్రోలు కంటే డీజిల్ రేటు పెరిగిందని ఉత్కల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి తెలిపారు.

ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని స్థానిక వాహనదారలు వాపోతున్నారు. కాగా, పెట్రోల్, డీజిల్‌ ఇంధన ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలతో ఇటువంటి కనీవినీ ఎరుగని పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శశి భూషణ బెహరా అన్నారు. పెట్రోలియం కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం పట్టు కోల్పోయి అయినా ఉండాలి.. లేకుంటే వారితో లాలూచీకి పాల్పడి ఉండాలని ఆయన ఆరోపించారు. సాధారణంగా డీజిల్, పెట్రోల్‌ ధరల మధ్య దాదాపు 10 శాతం వ్యత్యాసం కొనసాగేది. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి భిన్నంగా తయారైంది. డీజిల్‌ మూల ధర పెట్రోల్‌ ధర కంటే అధికంగా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి ఇంధనం ధరలు తగ్గుముఖం పడుతుండగా రాష్ట్రంలో వీటి ధరలు తరచూ పెరగడం కేంద్ర ప్రభుత్వ వ్యవహారంపట్ల సందేహాన్ని ప్రేరేపిస్తోందని అధికార వర్గాలు ఆరోపించాయి. కాగా, డీజిల్‌ ధర పెరుగుదలతో అన్ని రకాల సామగ్రి ధరలపై ప్రభావం చూపింది. వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

13:37 - October 22, 2018

ముంబై : భార్యా భర్తల బంధానికి అర్థం మారిపోతోందా? భార్య ఒక డబ్బు సంపాదించే వస్తువుగా మారిపోతోందా? స్వంత ఆస్థిగా భార్యను భావిస్తు అమ్మకాలపు వస్తువుగా మారిపోతోందా? డబ్బు ముందు కట్టుకున్న భార్య సైతం పూచికపుల్లలా మారిపోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తాను ఇచ్చిన మాట కోసం సత్య హరిశ్చంద్రుడు అనే పేరు కోసం భార్యను నడివీధిలో పెట్టి వేలం వేసిన పురాణ సంస్కృతి డబ్బు కోసం భార్యలను అమ్మకపు వస్తువుగా..తాకట్టు వస్తువుగా మార్చుకోమచని సంకేతాలిస్తోందా? అనే అనుమానం కలగకమానదు ఈ దుర్ఘటనలు వింటుంటే..

Related imageనవ మాసాలు మోసీ..20ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను కన్యాదానం చేస్తు వివాహ సమయంలో  ‘నాతిచరామి’ అని ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి జీవితాంతం తోడూ, నీడ, రక్షణగా ఉంటానని మూడు ముళ్లు వేసిన భర్తే భార్యను వెలయాలుగా మార్చేస్తే ఆమె ఎవరి వద్దకు వెళ్లి తన గోడు వెలబోసుకోవాలి? అయినా అనాదికాలంలో స్త్రీ పడిన బాధలు ఆధునిక వనితలు పడతారా? పడేందుకు సిద్ధంగా వున్నారా? అంటే కొన్ని కొన్ని సందర్బాలలో లేదనే చెప్పాలి. ఇదిగో ఈ మహిళ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి. తమ వేదనల నుండి..వేధిస్తున్న భర్తలకు సరైన బుద్ధి చెప్పాలి. తననొక తాకట్టు వస్తువుగా..వెలయాలుగా మార్చే భర్త చెర నుండి విడిపించుకోవాటమే కాదు  సంప్రదాయ సంకెళ్లు తెంచుకుని ఆమె పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. తన హక్కును కాపాడుకుంది. ఆమె తీరుతో స్ఫూర్తి పొందిన సోదరి కూడా తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Image result for men in indian moneyముంబై నగరం విరార్‌ ప్రాంతంలోని ఎంబీ ఎస్టేట్‌కు చెందిన ఇద్దరు సోదరులు ఇద్దరు అక్కచెల్లెళ్లను పెళ్లాడారు. తొలి నుంచి భర్త, అత్తమామల ప్రవర్తన వారికి అనుమానాలను రేకెత్తిస్తునే వుంది. ఈ నేపథ్యంలో అక్కచెల్లెళ్లలోని ఒకామె భర్త లక్షన్నర అప్పు చేశాడు. రుణ దాత నుంచి ఒత్తిడి పెరిగిందో లేక భార్యపై వారి కన్నుపడిందోగాని డబ్బు కోసం వేరే మార్గంలో ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. వారి ఒత్తిడికి లొంగిన భర్త రుణదాత కోరిక తీర్చాలంటూ భార్యను పురమాయించాడు. భర్త నోటి నుంచి వచ్చిన ఈ మాటలు వినగానే ఆమె కాసేపు ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించింది. భర్త తీరుపై ఫిర్యాదు చేసింది.దీంతో ఆమె సోదరి భర్త, అత్తమామల ఎదుటే ఓ బంధువు తనను లైంగికంగా వేధిస్తున్నా వారు చూసీ చూడనట్లు ఉంటున్నారని, దీంతో తాను తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నానంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మేము చెప్పిన వారి వద్దకు వెళ్లి వారి కోరిక తీర్చండి...లేదా మీ పుట్టింటికి వెళ్లి రూ.5 లక్షలు తీసుకురండి’ అంటూ తమ భర్తలు తమను బెదిరిస్తున్నారని ఈ మహిళలు తమ ఫిర్యాదుల్లో  పేర్కొన్నారు. వీరి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

-మైలవరపు నాగమణి

 

 

12:57 - October 22, 2018

హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం, పొత్తులు, సీట్ల సద్దుబాటపై తమ్ముళ్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయి రాజకీయాల్లో ప్రభావం చూపుతుందన్నారు. పొత్తు ముఖ్యం కాబట్టి సీట్ల విషయంలో సర్దుకుపోవాలని తమ్ముళ్లకు సూచించారు. కాంగ్రెస్ 12సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, అదనంగా మరో ఆరు సీట్లు ఇవ్వమని కోరుదామని చంద్రబాబు అన్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ స్థానాల కోసం పట్టుబడదామన్నారు. సీట్ల సర్దుబాటపై కాంగ్రెస్ నేతలతో తాను మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులను చంద్రబాబు బుజ్జగించినట్లు సమాచారం. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వచ్చినా అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని తమ్ముళ్లకు చంద్రబాబు సూచించారు. మనం విజయం సాధించే స్థానాలను కోరుకుందామని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రత్యామ్నాయ పదవులూ దక్కుతాయని పేర్కొన్నారు. నేతలు నిరాశచెందకుండా పని చేయాలని అధినేత పిలుపునిచ్చారు. కూటమి గెలుపు కోసం కేడర్ గట్టిగా పని చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని చంద్రబాబు ఇదివరకు అన్న విషయం విదితమే. అయితే సడెన్‌గా ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తాను అంటూ చంద్రబాబు అనడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా తెలంగాణలో ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో మహాకూటమిలో ప్రతిష్ఠంభన నెలకొంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. త్వరగా ఈ వ్యవహారం తేల్చాలని అటు టీడీపీ, ఇటు టీజేఎస్ పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. టీటీడీపీ నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

12:40 - October 22, 2018

లక్నో: తాగివచ్చి అరుస్తున్నాడని.. కన్నతల్లే స్వంత కొడుకును కడతేర్చింది. ఉత్తరప్రదేశ్ విధానసభ అధ్యక్షుడు రమేష్ యాదవ్ కుమారుడు అభిజిత్ యాదవ్ తన తల్లి కోపాగ్నికి బలయ్యాడు. కోడుకు తాగివచ్చి అరుస్తుంటే తట్టుకోలేక తానే గొంతునులిమి చంపేశానని అభిజిత్ యాదవ్(22) తల్లి పోలీసులకు తెలిపింది. ఈ సంఘటన లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో జరిగింది.  
లక్నో పోలీసు సూపరింటెండెంట్ సర్వేశ్ మిశ్రా కధనం ప్రకారం అభిజిత్ శనివారం రాత్రి తాగివచ్చి తల్లితొ వాదనకు దిగటంతో తట్టుకోలేక అతని తల్లి గొంతునులిమి చంపివేసింది. 
ముందుగా ఇది సాధారణ మరణంగా సృష్టించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. పోలీసు విచారణకు వ్యతిరేకించారు. అయితే శవపరీక్షలో ఇది గొంతునులిమి చేసిన హత్యగా తేలడంతో పోలీసులు విచారణ చేపట్టారు. 

 

 

12:40 - October 22, 2018

హైదరాబాద్‌ : దేశ భద్రతకు ముప్పు తెచ్చే హై ప్రొఫైల్ ఉగ్రవాదుల జాబితాను..మోస్ట్ వాటెండ్ మావోయిస్టుల జాబితాను నేషనల్ ఇన్వెస్టిగేషణ్ సంస్థ ఎన్ఐఏ విడుదల చేసింది. లష్కర్ తొయిబా చీఫ్ హాషీజ్ సయీద్ తో సహా నవంబర్ 26 పేలుళ్లలో ప్రధాన సూత్రధారి జాకీర్ వంటి 258 మందితో సహా ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఎటువంటి రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ తెలంగాణ మావోయిస్టులపై ఎన్ఐఏ రివార్డు ప్రకటించింది. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిపై రూ.15లక్షల రివార్డును, నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజుపై రూ.10లక్షల రివార్డులను ప్రకటించింది. 
 

 

12:27 - October 22, 2018

కోల్‌కతా: నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలలో మార్పు రావడం లేదు. కొందరు నీచులు కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

తాజాగా పశ్చిమబెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతాన్ని తలపించే అమానవీయ ఘటన ఇది. భూవివాదంలో గిరిజన మహిళపై ఆగ్రహించిన ఆమె బంధువు దారుణానికి ఒడిగట్టాడు. మిత్రుడి సాయంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మర్మాయవాల్లో ఇనుప రాడ్డు చొప్పించి చిత్రహింసలకు గురిచేశాడు. 

బాధితురాలికి, ఆమె బంధువుకు భూ తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన నిందితుడు, మరో వ్యక్తితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మహిళ భర్త కూలి పనుల కోసం బయటకు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళను.. సమస్య పరిష్కరించుకుందామని బయటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత చిత్రహింసలకు గురిచేశాడు. రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో పడి ఉన్న బాధితురాలిని ఓ రిక్షా కార్మికుడు జల్‌పాయ్‌గురి జిల్లా ఆసుపత్రిలో చేర్చాడు. బాధితురాలికి చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని, అతడికి సాయం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

11:58 - October 22, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహా కూటమిలో అంతర్మథనం ప్రారంభమైందా? కూటమిలో చీలికలు ఏర్పడుతున్నాయా? ఇంకా సీట్ల పంపకాల నేపథ్యంలో సీట్ల కోసం కుమ్ములాటలు మొదలయ్యాయా? కూటమి నేతల్లో అభిప్రాయాలు కొరవడుతున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ను ఓడించేందుకు రాజకీయంగా బద్ధ శతృత్వం వున్న కాంగ్రెస్, టీడీపీలు ఒకే గొడుగుకిందకు వచ్చాయి.దేనికి అంటే  తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు. వీరిద్దరి పొత్తుపై పలు పార్టీలతో పాటు రాజకీయ విమర్శకులు కూడా విస్తుపోయారు. రాను రాను దానికి కారణాలను అవగతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల విషయంలో కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. 

Image result for dailama in kodandaramకూటమిలో కొనసాగాలా వద్దా ?..
కూటమిలో భాగంగా వున్న   తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సీట్ల పంపకాల విషయంలో తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఈ కేటాయింపుల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ తో పలుమార్లు భేటీ అయిన సందర్భాలు వున్నాయి. అయినా ఇప్పటికీ పంపకాల విషయం తేలనేలేదు. దీంతో ఒకింత అసంతృప్తితో వున్న కోదండరాం టీఆర్ఎస్ ఓటమి ఎజెండాతో ఒకటయిన కారణంగా ఆరంభంలోనే కూటమి నుండి విడిపోతే టీఆర్ఎస్ పార్టీకి చులకన అవుతామనే కారణంతో వేచి చూస్తున్నారు. దీంతో మరోసారి కాంగ్రెస్ తో భేటీ అయినా దీనిపై ఎటువంటి క్లారిటీ రాక మల్లగుల్లాలు పడుతున్న కోదండరాం అంతర్మథనంలో పడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు అంటే 23న వరంగల్ లో పోరు గర్జన నిర్వహించాలను కున్న జనసమితి సభ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకపక్క టీఆర్ఎస్ ప్రచారంలోను..మేనిఫెస్టోప్రకటనలోను, అభ్యర్థుల ప్రకటనలోను దూసుకుపోతుంటే కోదండరాం కనీసం సభలు నిర్వహించుకున్న ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా వీలులేని సంకటపరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోరాటాల  ఖిల్లా వరంగల్ లో పోరుగర్జన సభపై నీలి నీడలు అలుమున్నాయి. మరి ఈ కూటమి ఎంతవరకూ కొనసాగనుందో లేదో అనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నేడు సీట్ల పంపకాల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి కూటమితో భేటీ కానున్నారు.
-మైలవరపు నాగమణి

 

11:47 - October 22, 2018

ఢిల్లీ: పరారీలో ఉన్న మోస్ట్‌వాంటెడ్ నిందితుల జాబితాను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విడుదల చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాదులు, నేరస్తులు, మావోయిస్టులు.. ఇలా 258మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఎన్ఐఏ విడుదల చేసిన ఈ జాబితాలో కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది.. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయీద్ సలావుద్దీన్, లష్కరే తోయిబా-జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, ఇస్లాం మతబోధకుడు జాకిర్ నాయక్, లష్కరే తొయిబా ఉగ్రవాది రెహ్మాన్ లఖ్వీ, నవంబర్ 26 పేలుళ్ల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ సహా పలువురి నిందితుల వివరాలు, ఫోటోలు ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలు, సాయుధ శిక్షణ ఇవ్వడం, పేలుడు పదార్దాలు అమర్చడం లాంటి చర్యలకు పాల్పడిన వారి వివరాలను ఎన్ఐఏ రూపొందించింది. ఈ జాబితాలో 57మందిపై రివార్డు సైతం ప్రకటించింది. కాగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఎలాంటి రివార్డు ప్రకటించని ఎన్ఐఏ.. తెలంగాణకు చెందిన మావోయిస్టు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతిపై రూ.15లక్షల రివార్డు, ముప్పాల అనుచురుడు నంబాల కేశవ్‌రావు అలియస్ బసవరాజుపై రూ.10లక్షల రివార్డు ఎన్ఐఏ ప్రకటించింది. 

వీరి ఆచూకీ కనిపెట్టేందుకు ఎన్ఐఏ ప్రజల సాయం కోరింది. ‘‘మీకు వీరి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే దయచేసి 011-24368800 నెంబర్‌కు కాల్ చేయండి లేదా assistance.nia@gov.in అడ్రస్‌కు ఈ మెయిల్ పంపండి. మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. దేశ భద్రత కోసం సహకరించండి ’’ అని ఎన్ఐఏ ట్వీట్ చేసింది. నిందితుల వివరాల తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ లింకును కూడా ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

11:21 - October 22, 2018

బెంగళూరు : మంచి చెడులు అనేవి రెండు విభిన్నమైనకోణాలు. అలాగే ప్రతీ అంశంలోను రెండు కోణాలు వుంటాయి. బాధ, వేధన అనేవి అందరికీ ఒకలాగనే వుంటాయి. ప్రతీ మనిషిలోను మంచి చెడులు వుంటాయి. అలాగే బాధ అనేది స్త్రీ పురుషులిద్దరికి వుంటుంది. కానీ ఎక్కువగా బాధింపబడే నేపథ్యంలో మహిళలు కొన్ని తరతరాలుగా బాధలను, వేదనలను, అణచివేతలను ఎదుర్కొంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో సాధికారతవైపుగా అడుగులు వేస్తున్న మహిళలు తమపై జరుగుతున్న వేధింపులపై గళమెత్తుతున్నారు. ‘మీటూ ’ అంటు ఇక బాదలను, వేధింపులను సహించం అంటు నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాకూ బాధలున్నాయి. మేము వేధింపులను ఎదుర్కొంటున్నామంటు పురుషులుకూడా ‘మెన్ టూ’ను ప్రారంభించారు. దీనిపై ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. 

‘మెన్ టూ ప్రారంభించిన దర్శకుడు వారాహి..
సినీ పరిశ్రమలోనే కాక దాదాపు అన్ని రంగాల్లోను ‘మీ టూ’ ఉద్యమం కాక పుట్టిస్తున్న సమయంలో మరో సరికొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది. తమిళ పరిశ్రమలోని ఓ దర్శకుడు ఈ ఉద్యమన్ని ప్రారంభించారు. ‘మీటూ’ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మహిళలు బెదిరింపులకు పాల్పడుతున్నారని..దీని బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘మీ టూ మెన్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తమిళ సినీ దర్శకుడు వారాహి తెలిపారు. 

 బెంగళూరులో మెటూను ప్రారంభించిన జాగిర్ధార్..Image result for men too
ఇప్పుడు ఇటువంటి తరహా ఉద్యమమే మరోటి పురుడు పోసుకుంది. అయితే, ఇది పురుషుల చేతిలో అన్యాయానికి గురైన మహిళలకు సంబంధించినది కాదు.. మహిళల చేతిలో కష్టాలు పడుతున్న పురుషులకు సంబంధించింది. దీనిపేరు ‘మెన్ టూ’. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘క్రిస్ప్’ అనే స్పచ్ఛంద సంస్థ దీనిని తెరపైకి తీసుకొచ్చింది. ఈ సంస్థ నిర్వాహకుడైన కుమార్ జాగిర్దార్.. మరో 15 మందితో కలిసి ఆదివారం దీనిని ప్రారంభించారు. ‘మీటూ’కు ‘మెన్ టూ’ ఏమాత్రం వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా జాగిర్దార్ పేర్కొన్నారు. తప్పుడు కేసులు, ఆరోపణలతో మానసిక క్షోభ అనుభవిస్తున్న పురుషుల ఆవేదనను వెలికి తీసుకొచ్చేందుకే దీనిని ప్రారంభించినట్టు వివరించారు. 
అకౌంటెంట్ అయిన జాగిర్దార్... స్టాక్ మార్కెట్ నిపుణుడు కూడా. భార్యా బాధితుల సంఘం, భారతీయ కుటుంబ సంక్షేమ సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాలలో సవరణలు చేయాలంటూ గత 15 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఆయనను వదిలి కుమార్తెతో కలిసి వెళ్లిపోయిన భార్య ఓ క్రికెటర్‌ను పెళ్లాడింది. తన కుమార్తె సంరక్షణ భారాన్ని తనకు అప్పగించాలంటూ పోరాడి విజయం సాధించారు. కాగా, ‘మెన్ టూ’ వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ మజురియర్ ఉండడం విశేషం. సొంత కుమార్తెనే లైంగికంగా వేధించాడంటూ పాస్కల్‌పై ఆయన భార్య కేసు పెట్టింది. 2017లో కేసును కొట్టేసిన కోర్టు పాస్కల్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.
 

11:16 - October 22, 2018

నందమూరి హీరోలు మళ్లీ ఒక్కటయ్యారు. అభిమానుల్లో ఆనందం నింపారు. చాలా రోజుల తర్వాత బాబాయ్, అబ్బాయ్‌లను ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అరవింద సమేత సక్సెస్ మీట్ వేదికగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ కలుసుకున్నారు. ఆదివారం శిల్ప కళావేదికలో జరిగిన ఈ వేడుకకు బాలకృష్ణ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన తారక్.. ఎమోషన్ అయ్యాడు. తన తండ్రి హరికృష్ణను గుర్తుచేసుకుని ఆవేదన చెందాడు. ''ఈ ఆనంద సమయంలో నాన్న ఉంటే బాగుండేదని... నాకు తెలిసి నాన్న ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తుంటారు. నాన్న లేకపోయినా నాన్న హోదాలో ఇక్కడికి వచ్చిన బాబాయ్‌కు పాదాభివందనం చేస్తున్నా. నా సినిమా విజయానికి ఆశీస్సులు అందించినందుకు బాబాయ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా' అంటూ ఎన్టీఆర్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. 

Image result for ntr balakrishnaఈ సినిమా ఘన విజయం సాధించిన ఆనందాన్ని అభిమానులతోనే కాకుండా, బాబాయ్‌తో కూడా పంచుకోవాలనుకుంటున్నానని తారక్ చెప్పాడు. ఈ ఫంక్షన్‌లో ఇంతకన్నా తాను ఎక్కువ మాట్లాడితే బాగోదని... మీరందరూ బాబాయ్ మాటల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాడు. జోహార్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ... జై హరికృష్ణ అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించాడు. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అరవింత సమతే.. హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాకు అభిమానుల నీరాజనం పడుతున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించింది. సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా వచ్చారు.

ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటులకు ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య మెమెంటోలను అందించారు. తారక్‌కు కూడా బాలయ్య మెమెంటో అందించారు. ఈ సందర్భంగా తారక్‌ను బాలయ్య ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ సన్నివేశాన్ని వీక్షించిన అభిమానుల కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లింది. మొత్తంగా నందమూరి అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సన్నివేశం ఆవిష్కృతమైంది.

Image result for ntr balakrishna

11:04 - October 22, 2018

రాజస్థాన్ : దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామాంధుల చేతుల్లో ఎంతో మహిళలు నలిగిపోతున్నారు. పలువురిని దారుణంగా హత్య చేసేస్తున్నారు. రాజస్థాన్‌లో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు రెచ్చిపోయారు. వీరి నుండి తప్పించుకోవాలని ఓ యువతి నగ్నంగా భవనంపై నుండి కిందకు దూకేసింది. తీవ్రగాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. 
నేపాల్‌కు చెందిన 23 ఏళ్ల యువతి జైపూర్‌లో ఓ సంస్థలో పని చేస్తోంది. ఈమెను ముహానా ప్రాంతంలో ఓ ఇంట్లో ఇద్దరు యువకులు అనంతరం ఒకరు తరువాత మరొకరు అత్యచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను హింసించారని తెలుస్తోంది. వీరి నుండి తప్పించుకొనేందుకు భవనం మూడో అంతస్థు నుండి కిందకు నగ్నంగా దూకేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచారానికి పాల్పడిన వారు లోకేశ్ శైని కమల్ శైని యువకులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

10:54 - October 22, 2018

ముంబయి: సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఎందర్నో చూసాం. ఈ ఫోటోలో సెల్ఫీ తీసుకుంటున్న మహిళ పేరు అమృత. ఈమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి. ఓడలో ప్రయాణిస్తూ సెల్ఫీ బాగారావాలని భద్రతకోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి ఓడ చివర భాగాన సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న భద్రతాధికారులకు కాసేపు చెమటలు పట్టాయి. సీఎం భార్య.. చెబితే ఏమన్నా అనుకుంటుందేమో అనే భయంతోనే ఇది చాలా ప్రమాదమని చెప్పేందుకు సాహసించారు. అమృత ఓడ రైలింగ్ మీద ప్రమాదం అంచున కూర్చొని సెల్ఫీదిగటం ఏఎన్ఐ వీడియోలో రికార్డింగ్ అయ్యింది. అలాగే.. అంటూ మరో సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించడం పోలీసులనే కాదు ఓడలో ఉన్న జనాలకూ కాసేపు దడ పుట్టించింది.

Image result for AMRUTA FADNAVIS DARINGయాంగ్రియా అనే మొదటి దేశీయ షిప్ ప్రారంభం సందర్భంగా ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ ఓడను అమృత భర్త ముఖ్యమంత్రి ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబయిలోని విక్టోరియా పోర్టులో ప్రారంభించారు. ప్రతీ వారం ముంబయి నుంచి గోవా ప్రయాణించేందుకు యాంగ్రియా షిప్‌ను ప్రారంభించారు. ఇందులో 400 మంది ప్రయాణించే అవకాశం ఉంది. 
 

10:45 - October 22, 2018

ఉత్తర్ ప్రదేశ్ : ఎవరైనా ప్రముఖులు చనిపోతే...అంత్యక్రియల్లో వ్యక్తులు ఎలా ఉంటారు..ఎలా ఉంటారేంటీ ? విషాద సమయం కాబట్టి...బాధాతప్త హృదయాలతో ఉంటారు..అని అంటారు కదా..కానీ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం అంత్యక్రియల్లో పాల్గొని నవ్వులతో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. 
యూపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయపై పలు వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. యూపీ అసెంబ్లీ ప్రాంగణంలో తివారీ భౌతికకాయాన్ని ఉంచారు. ఆయనకు పలువురు రాజకీయ నేతలు ఘనంగా నివాళులర్పించారు. తివారీ పార్థీవ దేహం వద్ద సీఎం యోగి ఆదిత్యనాత్ కూర్చొగా ఆయన పక్కన బీహార్ గవర్నర్ లాల్జీ టాండన్ కూర్చొన్నారు. వీరి వెనుకాలే మోసిన్ రాజీ, ఆవుతోష్ టాండన్‌లు ఆసీనులయ్యారు. కానీ ఏమీ మాట్లాడుకున్నరో ఏమో కానీ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వుతూ కనిపించారు. అంత్యక్రియల్లో..సహచర మంత్రులతో కలిసి యోగి నవ్వుతూ కనిపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన విపక్షాలకు మంచి అస్త్రంగా మారింది. విషాద సమయంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నవ్వడంపై వివక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

10:36 - October 22, 2018

అస్సాం : క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఓ సంచలనం. ఓ రికార్డుల పుస్తకం. సెంచరీల పుస్తకం. క్రికెటర్స్ అతనో ఇన్ఫిరేషన్. అతన్ని చూసే క్రికెట్ లోకి వచ్చినవారెందరో. సచిన్ అంటే పడి చచ్చిపోయే అభిమానులకు లెక్కలేదు. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కు క్రికెట్ వారసుడిగా సచిన్ రికార్డులకు లెక్కలేదు. ఈ నేపథ్యంలో సచిన్ రికార్డులకు చెక్ పెట్టేశాడు మన రోహిత్ శర్మ.

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గువాహటిలో విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రోహిత్ 152 పరుగులు చేశాడు. 117 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 15 ఫోర్లు 8 సిక్సర్లతో 150 పైచిలుకు పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో ఎక్కువసార్లు 150కిపైగా పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

 టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 5 సార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. రోహిత్ ఆరుసార్లు ఆ ఘనత సాధించి సచిన్ రికార్డును బద్దలుగొట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా ఐదుసార్లు 150కిపైగా పరుగులు సాధించాడు. కాగా, వన్డేల్లో రోహిత్ అత్యధిక స్కోరు 264 పరుగులు కావడం విశేషం. మరి సచిన్ ఇటువంటివారికి స్ఫూర్తిగా నిలిచాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

10:30 - October 22, 2018

హైదరాబాద్ : రాజకీయాల్లోకి మరో యంగ్ హీరో రానున్నారా ? త్వరలో దేశంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పలువురు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏపీలో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరిట ప్రజల్లో తిరుగుతున్నారు. పార్టీ స్థాపించి వివిధ జిల్లాల్లో పోరుయాత్ర పేరిట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ప్రభుత్వంపై ఆయా పార్టీల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వీటిని అధికార పార్టీ తిప్పికొడుతోంది. తాజాగా టాలీవుడ్ డైలాగ్ కింగ్‌గా పేరొందిన ‘మోహన్ బాబు’ తనయుడు ‘మంచు మనోజ్’ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఆయన ట్విట్టర్ వేదికగా ‘మీ కోసం నేను’ అంటూ ఓ లేఖను పోస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
మంచు మనోజ్...గత కొంతకాలంగా సినిమాలు ఏమీ చేయడం లేదు. సినిమా కథలు కూడా వినడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. సేవా కార్యక్రమాల కోసం తిరుపతికి మకాం మారుస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. తిరుపతిలో రైతుల పిల్లలకు విద్యను అందించడంతో పాటు యువతకు తన వంతు సాయం చేస్తానని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
ఏపీలోని ఇతర ప్రాంతాలతో పాటు తెలంగాణకూ విస్తరిస్తానని మనోజ్ పేర్కొన్నారు. గతంలో తాను సినిమాలు చేయబోనని సంచలన ప్రకటన చేసి తిరిగి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ తన సినిమా, రాజకీయ జీవితంపై ఎలాంటి తీర్మానాలు చేయవద్దని లేఖలో పేర్కొన్నారు. సినిమాలపై తన ఆసక్తి తగ్గదని..విలక్షణ పాత్రలు పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాలన్నదే తపన అని తెలిపారు. ఛివరగా రాయలసీమకు వస్తున్నా..రాగి సంగటి..మటన్ పులుసు సిద్ధం చేయండని తన అభిమానులకు సూచించారు. మరి రాజకీయాల్లోకి వస్తారా ?  రారా ? అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

10:11 - October 22, 2018
బెంగళూరు: కర్నాటక తొలి మహిళా ఐజీ-డీజీపీ అయిన నీలమణి ఎన్.రాజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రెస్ కోడ్‌కు సంబంధించి మహిళా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా కానిస్టేబుళ్ల డ్రెస్ కోడ్ విషయంలో పలు నిబంధనలు విధించారు. చీరలు వద్దు.. ప్యాంటులు, షర్టులే ధరించాలన్నారు. మహిళా పోలీసులు ఇకపై విధిగా ఖాకీ యూనిఫాం అయిన ప్యాంటు, షర్టు, బెల్టు, బూటు ధరించాల్సిందేనని ఆమె ఆదేశించారు. చీరలో కంటే ప్యాంటు, షర్టు సౌకర్యంగా ఉంటుందని, నేరం జరిగినప్పుడు వేగంగా స్పందించవచ్చని ఆమె వివరించారు. అంతేకాదు ఓపెన్ హెయిర్ కూడా ఉండకూడదని చెప్పారు. చేతులకు గాజులు కూడా ఉండకూడదన్నారు(మెటల్ గాజులు వేసుకోవచ్చు). పూలు కూడా పెట్టుకోవద్దన్నారు. చిన్న బొట్టు మాత్రమే ఉండాలని సూచించారు. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి వస్తాయని డీజీపీ తెలిపారు. మహిళా పోలీసు అధికారులు, సీనియర్ పోలీసు అధికారులతో జరిగిన సమావేశం అనంతరం డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇప్పటి వరకు పెద్ద ర్యాంకుల్లో ఉన్న మహిళా పోలీసులు షర్టులు, ప్యాంటులు ధరిస్తుండగా.. కానిస్టేబుళ్లు మాత్రం ఖాకీ చీరలు ధరిస్తున్నారు. అయితే, ఇకపై ప్రత్యేక సందర్భాల్లో తప్ప చీరలు ధరించడం కుదరదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రంలోని మహిళా పోలీసులందరూ విధిగా ప్యాంటు, షర్టు ధరించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.
 
ఈ ఏడాది జూలైలో కర్నాటక రిజర్వ్ పోలీసు అధికారులు కూడా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. చీరలకు బదులు ట్రౌజర్స్, షర్టులు ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 95 వేల మంది పోలీసుల్లో 5 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు. మహిళా కానిస్టేబుళ్ల డ్రెస్ కోడ్‌కు సంబంధించి పోలీసు శాఖలో అనేకసార్లు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో పలు నిబంధనలు తీసుకొస్తున్నారు.
10:07 - October 22, 2018

హైదరాబాద్ : నగర శివార్లు రక్తమోడుతున్నాయి. అసలు ప్రమాదాలకు కారకాలుగా మారుతున్న నగర శివార్లు ఇక శీతాకాలంలో మంచు ప్రభావానికి మరింత వాహనాలు నడపాల్సిన అవసరముంది. అతివేగం, నిద్రలేమి, నిర్లక్ష్యం, మద్యం మత్తు, మంచు ప్రభావం ఇలా కారణాలు ఏమైనాగానీ ప్రమాదాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భలకు అంతులేకుండా పోతోంది. ఈ నేపథ్ంయలో నగరశివారులోని రంగారెడ్డి జిల్లాలో ఓ కారు అతివేగం కారణంగా ఇద్దరు కానిస్టేబుల్స్ తోపాటు మరో ఇద్దరిని బలిగొంది. మైసిగండి దేవాలయానికి నలుగురు యువకులు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు వేగంగా వస్తూ, ముందు నెమ్మదిగా వెళుతున్న ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  కారు నడుపుతున్న మలక్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ వినోద్‌, నారాయణగూడ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శివకుమార్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా, వారు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఉత్సాహంగా ఆలయానికి వెళ్లిన తమ బిడ్డలను ఇలా చూడలేకున్నామని మృతుల బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
 

09:41 - October 22, 2018

హైదరాబాద్ : తొలి విడత ప్రచారం విజయవంతం కావడంతో...రెండో విడత ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. గోల్కోండ హోటల్‌లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు...ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. గతంలో 54 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని షెడ్యూల్‌ను రూపొందించారు. తాజాగా దీన్ని మార్చాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఇవాళ మరోసారి సమావేశమై మలివిడత ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. రాహుల్ గాంధీ పాల్గొన్న భైంసా, కామారెడ్డి, హైదరాబాద్ సభలు విజయవంతం కావడంతో....నేతలు, శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని....వరంగల్, కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఒకటి రెండ్రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
 

09:32 - October 22, 2018

శ్రీకాకుళం: దసరా సెలవులు ముగిశాయి...ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ ప్రభావంతో వందల పాఠశాలలు దెబ్బతిన్నాయి. కొన్ని భవనాలు పూర్తిగా పని రాకుండా పోతే...మరి కొన్ని బిల్డింగ్‌లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు తెరవాలా? వద్దా? అన్న అయోమయంలో పడ్డారు విద్యాశాఖ అధికారులు.

తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అన్ని రంగాలను, అన్ని వర్గాల ప్రజలను దెబ్బతీసింది. పిల్లల చదువులపైనా తుఫాను ప్రభావం చూపింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రెండు రోజుల తర్వాత తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. తిత్లీ ప్రభావానికి జిల్లాలో 697 పాఠశాలలు దెబ్బతినడంతో...నష్టాన్ని అంచనా వేయడానికి 15 బృందాలను నియమించారు అధికారులు. టెక్కలి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, నౌపాడ, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, పొలాకి, ఇచ్చాపురం, కంచిలి, సోంపేట, కవిటి మండలాల్లోని పాఠశాలలు బాగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పాఠశాలల్లో ఎక్కువ శాతం సిమెంట్ రేకులతో నిర్మించినవే ఉండటంతో....తుపాను దెబ్బకు అవన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. 38 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

కాగా, నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే చాలా చోట్ల పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. పాఠశాలలపై చెట్లు పడిపోవడంతో శిథిలమైన భవనాలే దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు, కంప్యూటర్లు, కిటికీలు అన్ని ధ్వంసమయ్యాయి. దీంతో పాఠశాలల పునః ప్రారంభంపై అనుమానాలు నెలకొన్నాయి. 

అయితే వారం రోజుల్లో ధ్వంసమైన పాఠశాలలపై ఓ స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు తాత్కాలిక వసతులు ఏర్పాటు చేసి తరగతులు కొనసాగిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే తుపాను బాధితులు ఎక్కువమంది ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం పొందుతుండటంతో....పాఠశాలల పునఃప్రారంభంపై అనుమానాలు నెలకొన్నాయి. అటు శిథిలమైన భవనాల్లో పాఠాలు చెప్పలేక...ఇటు పునరావసం పొందుతున్న బాధితులను ఇబ్బంది పెట్టలేక ఆయోమయ స్థితిలో పడ్డారు అధికారులు.

09:24 - October 22, 2018

ఢిల్లీ : ప్రొ కబడ్డీ ఆరో సీజన్‌లో బెంగాల్ వారియర్స్‌ జట్టు తొలిసారి పరాజయాన్ని చవిచూసింది. దబాంగ్‌ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 39-30 తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. రైడింగ్‌లో నవీన్‌ కుమార్‌ 11 పాయింట్లు, ట్యాక్లింగ్‌లో రవిందర్‌ పహాల్‌ 4 పాయింట్లు సత్తాచాటి ఢిల్లీకి విజయాన్ని అందించారు. వారియర్స్‌ తరపున జాంగ్‌ కున్‌ లీ 10 పాయింట్లు సాధించినప్పటికీ...జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. దాంతో స్కోర్లు 2-2, 4-4 ఇలా సమం అవుతూ వచ్చాయి. మనిందర్‌ సింగ్‌ రైడింగ్‌లో రెండు పాయింట్లు తేవడంతో మ్యాచ్‌లో తొలిసారి ఎనిమిదో నిమిషంలో వారియర్స్‌ 8-5తో ఆధిక్యం సంపాదించింది. అయితే వెంటనే పుంజుకున్న దిల్లీ 8-8తో స్కోరు సమం చేసింది. అదే జోరులో వారియర్స్‌ను ఆలౌట్‌ చేసి 12-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి దిల్లీ 16-13తో పైచేయి సాధించింది. విరామం తర్వాత మరింత దూకుడుగా ఆడిన దిల్లీ రెండో సారి ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి తిరుగులేని విజయాన్ని సాధించింది. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ 27-25 తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది.
 

09:03 - October 22, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో...ఎలా వ్యవహరించాలన్న దానిపై చంద్రబాబు నేతలకు సూచనలు చేయనున్నారు. ఇందుకోసం ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భేటీ కానున్నారు. 

టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలు...మహాకూటమిగా జట్టు కట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు డేట్ దగ్గర పడుతున్నా....పార్టీల మధ్య సీట్ల వ్యవహారం కొలిక్కి రాలేదు. సీట్లపై ఏ పార్టీకి ఆ పార్టీ బెట్టువీడటం లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు....టీటీడీపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

ఇప్పటి వరకు సీట్ల కేటాయింపులో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో...వీలైనంత త్వరగా స్థానాల సంఖ్య తేల్చుకోవాలని తమ్ముళ్లు భావిస్తున్నారు. పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగర శివారు నియోజకవర్గాలతో పాటు ఖమ్మం, నిజామాబాద్, మహబూ‌బ్‌నగర్ జిల్లాల్లో ఎక్కువ స్థానాలను ఆశిస్తోంది. సీట్ల ఖరారుతో పాటు పొత్తుల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలను చంద్రబాబు దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లనున్నారు.

మొత్తంగా చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. ఇక మహాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని తమ్ముళ్లు ఆశిస్తున్నారు.

09:02 - October 22, 2018

గౌహతి : టెస్ట్ సిరీస్‌లో కొనసాగించిన ఫాంనే...టీమిండియా కొనసాగించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు...సెంచరీలతో చెలరేగడంతో 8వికెట్ల తేడాతో గెలుపొందింది. 323 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా చేదించింది. దీంతో సిరీస్‌లో భారత్ ఆధిక్యం నిలిచింది.

టీమిండియా బ్యాట్స్‌మెన్లు విజృంభించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నువ్వా నేనా అన్నట్లు పరుగులు రాబట్టడంతో....వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. విండీస్ జట్టులో హెట్‌మెయర్ సెంచరీతో జట్టు భారీ స్కోరకు బాటలు వేస్తే... కీరన్ పోవెల్ 51, జాసన్ హోల్డర్ తమ వంతు పాత్ర పోషించారు. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీసుకోగా, షమీ, జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఖలీల్ అహ్మద్‌కు ఓ వికెట్ దక్కింది.

323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు...ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 4 పరుగులకే ఔటయ్యాడు. వికెట్ తీసిన ఆనందం విండీస్ జట్టుకు ఎంతోసేపు నిలవలేదు. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన కోహ్లీ...బౌలర్లకు చుక్కలు చూపించాడు. రోహిత్, విరాట్‌ కోహ్లీలు శివాలెత్తడంతో....విండీస్‌కు పట్టపగలే చుక్కలు కనిపించాయి. నువ్వా నేనా అన్నట్లు బౌండరీలు బాదుతూ...స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లీ 88 బంతుల్లో సెంచరీ చేస్తే....రోహిత్ శర్మ 84 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో సాయంతో సెంచరీ చేశాడు. 

కోహ్లీ, శర్మ వీర విహారం ధాటికి కరీబియన్‌ బౌలర్లు తలవంచక తప్పలేదు. కొడితే బౌండరీ... లేదంటే సిక్సర్‌. మరో అవకాశమే లేదన్నట్టుగా ఇద్దరు విజృంభించారు. ఈ జోడీ ధాటికి విండీస్‌ ఆటగాళ్లు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. కెరీర్‌లో కెహ్లీ 36వ సెంచరీ కొడితే....రోహిత్ శర్మ 20వ సెంచరీ నమోదు చేశాడు. 140 పరుగుల వద్ద కోహ్లీ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడితో కలిసి రోహిత్ పని పూర్తి చేశాడు. మొత్తం 117 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 152 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 26బంతుల్లో ఒక ఫోర్, సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.విండీస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే ఛేదించింది. తొలి వన్డేలో విజయంతో...సిరీస్‌లో భారత్ ఆధిక్యంలో నిలిచింది. 

08:49 - October 22, 2018

కేరళ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది. తనను మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీతో పాటు ఆ పార్టీ ఎంపీ కె.సి.వేణుగోపాల్‌ అత్యాచారం చేశారంటూ... సోలార్‌ కుంభకోణంలో నిందితురాలైన సరితా నాయర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరితా నాయర్ ఫిర్యాదు మేరకు.. ఉమెన్ చాందీ, కేసీ వేణుగోపాల్ పై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. 2012లో సీఎం అధికార నివాసంలో చాందీ తనపై అత్యాచారం చేశారని, అప్పటి రాష్ట్ర మంత్రి అనీల్‌ కుమార్‌ నివాసంలో ఎంపీ వేణుగోపాల్‌ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సరితా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ఊమెన్‌ చాందీ కొట్టిపారేశారు. శబరిమల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
 

08:26 - October 22, 2018

విజయనగరం : పట్టణం ఉత్సవాల సందడితో..  కళకళలాడుతోంది. 2 రోజుల పాటు జరిగే విజయనగర్ ఉత్సవ్‌తో పాటు.. సిరిమాను సంబరాలతో పట్టణమంతా పండగ శోభ సంతరించుకుంది. వివిధ ప్రదర్శనలు, సాంస్క్రతిక వేడుకలతో ఎటు చూసినా సందర్శకులతో కిటకిటలాడుతోంది పట్టణం.ఫ్లవర్ షో, ఫోటో ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టు వంటి ప్రదర్శనలు చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు.

విజయనగర్ ఉత్సవ్ వేడుకలతో... విజయనగరంలో ఉత్సాహం ఉరకలేస్తోంది.  శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలతో పాటు.. విజయ్‌నగర్‌ ఉత్సవ్‌ వేడుకలు ఒకేసారి ప్రారంభంకావడంతో.  పట్టణమంతా సందడి నెలకొంది. ఈ ఉత్సవాలను 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఉత్సవాలను రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ఎంపీ పి.అశోక్ గజపతిరాజు జెండా ఊపి  ప్రారంభించారు. 

పలు జానపద కళారూపాలతో కోట నుంచి ప్రారంభమైన ఉత్సవ్ ర్యాలీ ఆనందగజపతి ఆడిటోరియం వరకు సాగింది. అక్కడ కళారూపాల ప్రదర్శన, ఉత్సవ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ వేడుకల ప్రదర్శన కోసం పట్టణంలో ఏడు వేదికలను సిద్ధం చేశారు. ముఖ్యంగా క్షత్రియ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ రకాల జాతుల ఫ్లవర్స్, ఫలాలు, కూరగాయలతో పాటు బోన్సాయ్ మొక్కలను ప్రదర్శించడం సందర్శకులను ఆకట్టుకుంటోంది.  వీటితో వినోదంతోపాటు విజ్ఞానం కూడా పొందుతున్నామని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కోటలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆహుతులను అలరిస్తోంది. ముఖ్యంగా పూసపాటి వంశీయులకు చెందిన అరుదైన ఫోటోలను ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. అయోధ్యా మైదానంలో ఏర్పాటు చేసిన  సాంస్క్రతిక వేదికపై పలు జానపద కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలతో పాటు విజయనగర్ ఉత్సవ్ కూడా ఒకేసారి ప్రారంభంకావడంతో... ప్రజల్లో ఆనందోత్సాహం వ్యకమవుతోంది.
 

08:09 - October 22, 2018

విశాఖపట్నం : విశాఖ నగరం మరో అంతర్జాతీయ ఉత్సవానికి  ముస్తాబైంది.. ఇవాళ్లీ నుంచి 26వ తేదీ వరకూ.. 5 రోజులపాటు వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌-2018ను నిర్వహించనున్నారు. 15 దేశాల  ప్రతినిధులు పాల్గొనే  ఈ ఉత్సవానికి.. 2వేలమంది  ఫిన్‌టెక్‌ నిపుణులను ఆహ్వానించారు. ప్రముఖ ఐటి సంస్థల సీఈవోలు, సీవోవోలతోపాటు.. ఇతర అత్యున్నత పదవుల్లో ఉన్న వారంతా తరలివస్తున్నారు. 23న సీఎం చంద్రబాబుతో రోబో సోఫియా సమావేశం కానున్న ఈ వేడుకపై 10టీవీ కథనం..

రాష్ర్ట ప్రభుత్వం మరో అంతర్జాతీయ ఉత్సవాన్ని తలపెట్టింది.  విశాఖ నగరం వేదికగా.... ఇవాళ నుంచి 26వ తేదీ వరకూ.. 5 రోజులపాటు వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌-2018 నిర్వహించనుంది. 15 దేశాల  ప్రతినిధులు పాల్గొనే  ఈ ఉత్సవానికి.. 2వేలమంది  ఫిన్‌టెక్‌ రంగ నిపుణులు హాజరుకానున్నారు. ప్రముఖ ఐటి సంస్థల్లో  అత్యున్నత పదవుల్లో ఉన్న వారంతా  విశాఖకు తరలివస్తున్నారు. 
ప్రపంచ తొలి హ్యూమనాయిడ్‌ రోబోగా గుర్తింపు పొందిన సోఫియా ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 23న రోబో సోఫియా సీఎంతో సమావేశం కానుంది.

ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో భాగంగా ప్రభుత్వం గోల్ఫ్‌ క్రీడను  నిర్వహించనుంది. ముడసర్లోవలోని  గోల్ఫ్‌క్రీడా ప్రాంగణంలో ఆ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఇవాళ  సుమారు 40 మంది సీఎక్స్‌వోలు గోల్ఫ్‌ ఆడనున్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు.. ఫిన్‌థాన్‌  పోటీలు నిర్వహించారు. మొత్తం 400 విద్యార్థి బృందాలు పోటీపడగా.. 50 బృందాలను ఎంపిక చేశారు. ఈపోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి  2 లక్షలు, రెండో బహుమతి  లక్ష , మూడో బహుమతిగా 50 వేల రూపాయల నగదును ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిష్ణాతులు   ఫిన్‌టెక్‌ భవిష్యత్తుగురించి కీలకాంశాలపై... విశ్లేషణాత్మకంగా ప్రసంగించనున్నారు. కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. 
 

07:52 - October 22, 2018

హైదరాబాద్ : అనుమతులు లేకుండా ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించి....తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలతో హీరా గ్రూప్ ఛైర్మన్‌ నౌహీరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నౌహీరాషేక్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయన్న ఆలోచనతో పోలీసులు...ఆమెను కస్టడీకి అనుమతించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నౌహీరా షేక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి. నాంపల్లి కోర్టు నౌహీరా షేక్‌ను కస్టడీకి అనుమతిస్తుందా లేదంటే....బెయిల్ మంజూరు చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. 
 

 

07:36 - October 22, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్....పార్టీ అభ్యర్థులకు గెలుపు సూత్రాలను బోధించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించిన గులాబీ దళపతి....ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిల ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేకాదు ఎన్నికల వరకు అభ్యర్థులందరూ నియోజకవర్గంలోనే ఉంటూ...ఓటర్లను కలుసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరు నుంచి బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించాలని గులాబీ పార్టీ అధిపతి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థుల  ఖరారు దశలోనే ఉండటంతో....ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ అభ్యర్థులకు సూచించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతి ఓటరును కలుసుకునే ప్రయత్నం చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలని సూచించారు. పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి గురించి ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్‌ను ముంచిందన్న కేసీఆర్... చంద్రబాబు తెలివిగా పక్కా వ్యూహంతో విజయం సాధించారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులు అతివిశ్వాసం పక్కన పెట్టి ఆత్మ విశ్వాసంతో పని చేయాలని...100 సీట్లు మనవేనన్నారు. అందరూ కలిసికట్టగా పని చేస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నేతలకు హితబోధ చేశారు.

పార్టీ నిర్వహించిన సర్వే వివరాలను కేసీఆర్....అభ్యర్థులకు వివరించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను తెలియజేసే నివేదికను ఎమ్మెల్యే అభ్యర్థులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు నెలన్నర సమయం ఉంటంతో అన్ని సర్దుబాట్లు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తన రాజకీయ అనుభవాన్ని...ప్రత్యక్షంగా ఎదురైన అనుభవాలను కేసీఆర్ పంచుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నేతలకు ఓటమే ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారిగా ప్రభుత్వం తరపున లబ్ది పొందిన వారి జాబితాను కేసిఆర్ అభ్యర్థులకు పంపిణీ చేశారు. ఒక్కో నియోజకవర్గంలో  50 నుంచి 60 వేల మంది వరకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందారని...ఆ కుటుంబాలు ఓట్లు సాధించినా విజయం సాధిస్తామని మంత్రి కడియం అన్నారు.
పార్టీ ప్రచార సభలను కూడా ఈ నెలాఖరు నాటికి మొదలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాల వారిగా నిర్వహించిన సభలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పూర్తి కాకపోవడంతో... ఆ జిల్లాల్లో ముందు సభలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి 40 సభలను పూర్తి చేయాలని...సభల బాధ్యతలను మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లకు  అప్పగించారు సీఎం కేసీఆర్.
 

07:21 - October 22, 2018

హైదరాబాద్ : రైతుబంధు రెండో విడత నగదు బదిలీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్‌తో చెక్కుల పంపిణీకి అడ్డంకులు ఎదురుకావడంతో....ఇవాళ్టీ నుంచి రైతుల ఖాతాల్లోకే నగదు చేరనుంది. దీనికి సంబంధించిన 162 కోట్ల రూపాయల నగదుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో విడత రైతుబంధు పథకం నగదు బదిలీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల నగారా మోగడంతో...రైతులకు చెక్కు రూపంలో నగదు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంతకాలం రెండో విడత నగదు బదిలీకి అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే చెక్కుల రూపంలో వద్దన్ని ఈసీ...నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం రైతుబంధు నగదు...నేరుగా రైతుల ఖాతాల్లో వేసేలా ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో లబ్దిపొందిన రైతులందరి ఖాతాల్లోకి ఈ నగదు డిపాజిట్ కానుంది. 

తెలంగాణలోని రైతుబంధు లబ్దిదారులకు 162 కోట్ల అవసరమయితే...ఇందుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వ్యవసాయ, ఆర్థిక శాఖలు చేయాల్సిన పనులన్ని ఇప్పటికే పూర్తి చేశాయి. అయితే బ్యాంకులకు రెండు రోజుల పాటు సెలవులు ఉండటంతో...ఇంత భారీ మొత్తంలో నగదు బదిలీ అవుతుందా లేదా అన్న దానిపై సందిగ్దం నెలకొంది. అయితే రైతుబంధు పథకానికి  ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్బీఐని తెలంగాణ అధికారులు కోరారు. రైతుబంధు లబ్దిదారులకు ఈ-కుబేర్ పోర్టల్ నుంచి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ కానుంది. నగదు అకౌంట్లలోకి చేరిన వెంటనే రైతులకు సమాచారం వెళ్తుంది. 
6లక్షల ఖాతాలను ఆన్‌లైన్‌లో పరిశీలించిన మండల వ్యవసాయాధికారులు....నగదు బదిలీకి అనుమతించారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్సీ కోడ్, ఆధార్ నంబర్లను సేకరించి...ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందులో లక్షా 51వేల 466 మంది రైతుల ఖాతాలకు నగదు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కనీసం 5లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 5వందల కోట్ల రూపాయలు జమా చేయాలని నిర్ణయించారు. 
 

Don't Miss