Activities calendar

23 October 2018

22:25 - October 23, 2018

కరీంనగర్ : జిల్లా డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేయడానికి ఓ సామాన్యుడు వచ్చాడు. అతన్ని చూసి సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లి పోయింది. కరీంనగర్ జిల్లాలో వెంకటేష్ అనే వ్యక్తి ఎస్సారెస్పీ కాలువ విస్తరణ పనుల్లో తన  భూమిని కోల్పోయాడు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. 35 ఏళ్లుగా వెంకటేష్ న్యాయపోరాటం చేస్తున్నాడు. కోర్టు ఆదేశాలతో కార్యాలయాన్ని జప్తు చేయడానికి వెంకటేష్ వచ్చాడు. అయితే వెంకటేష్‌ను చూసి కార్యాలయ సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లి పోయింది.

 

22:08 - October 23, 2018

నెల్లూరు : జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఓ విద్యార్థి మరో విద్యార్థిపై బీర్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాడు. సూళ్లూరుపేట ప్రభుత్వ కళాశాలలో మనోజ్‌, సురేష్ మధ్య ఘర్షణ జరిగింది. తన చెప్పును తీసుకురానందుకు మనోజ్ అనే విద్యార్థిపై సురేష్ బాటిల్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో సురేష్ దాడి చేశాడని విద్యార్థులు అంటున్నారు. సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

 

21:47 - October 23, 2018

ఖమ్మం : పట్టణంలో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణలో ఒక విద్యార్థి మృతి చెందారు. ఓ విద్యార్థి.. మరో విద్యార్థిని హత్య చేశాడు. ఖమ్మం ప్రభుత్వ గిరిజన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి.. జోసఫ్ అనే 4 వ తరగతి విద్యార్థితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో 10వ తరగతి విద్యార్థి.. జోసఫ్‌ను తీవ్రంగా కొట్టాడు. ఆపై జోసఫ్‌ను పెట్టెలో పెట్టి... మూత వేసి పెట్టెపై పలుమార్లు బలంగా ఎగిరి దుకాడు. దీంతో విద్యార్థి జోసఫ్ మృతి చెందాడు. అనుమానితుడు పదో తరగతి విద్యార్థిగా తెలుస్తోంది. 10వ తరగతి విద్యార్థి సైకోలాగా ప్రవర్తించేవాడని తోటి విద్యార్థులు అంటున్నారు. కాగా వార్డెన్ పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే ఈఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. 

 

20:48 - October 23, 2018

వరంగల్ అర్బన్ : మహాకూటమికి ఓటమి తప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమని చెప్పారు. స్టేషన్ ఘనపూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ చాలా నష్ట పోయిందన్నారు. 

మిషన్ కాకతీయపై కాంగ్రెస్ నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథకు మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎన్నికలు ఆపాలంటూ కోర్టులకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు అవసరం లేదంటున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కుసంస్కారమైన, దౌర్భాగ్యపు ప్రతిపక్షం అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడానికి కాంగ్రెస్ 200 కేసులు వేసిందన్నారు. చనిపోయిన వారి పేరు మీద కేసులు వేశారని ఎద్దేవా చేశారు. దొంగ వేలి ముద్రలు వేసి ..ఆఖరికి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. 

కేసీఆర్ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అందరికీ సంక్షమే పథకాలు అందేలా చేశారని చెప్పారు. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ అని గల్ల ఎగరేసుకుని చెప్పే పరిస్థితి తీసుకొచ్చిన్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.  

 

20:23 - October 23, 2018

హైదరాబాద్ : యాదాద్రిలో మహిళలు, చిన్నారులతో వ్యభిచారం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. చిన్నారులపై ఆక్సిటోసిన్ ఇంజక్షన్ వాడటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంజక్షన్ వాడకం వల్ల కలిగే అనర్దాలపై ధర్మాసనం వివరణ కోరింది. యాదాద్రిలో రెస్క్యూ అయిన చిన్నారులకు మరోసారి ఉస్మానియా వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఆపరేషన్ ముస్కాన్‌లో ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. 

యాదాద్రి డీసీపీ రామచంద్రారెడ్డి, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు హైకోర్టుకు వివరణ ఇచ్చారు. వ్యభిచార ముఠాలకు చెందిన 30 మందిపై కేసులు నమోదు చేశామని యాదాద్రి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి, జైలుకు పంపామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

 

18:22 - October 23, 2018

ఢిల్లీ: లంచం తీసుకున్నారనే అభియోగంలో ఎఫ్ఐఆర్ నమోదైన సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్ధానాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దాన్ని కొట్టివేయాలని, తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా సీబీఐను ఆదేశించాలని ఆస్ధానా ఈరోజు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు చెప్పిన వివరాలు ఆధారంగా ఆస్ధానాపై  కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్ ను విచారించిన న్యాయస్ధానం కేసు తదుపరి విచారణ వచ్చేంత వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్టు చేయడం వంటివి చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు తిరస్కరించింది. ఈకేసు తదుపరి విచారణ అక్టోబరు 29కి వాయిదా వేసింది. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌ ఆస్థానా, డీఎస్పీ దేవందర్‌ కుమార్‌పై సొంత సంస్థే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దేవేందర్ ను నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

17:52 - October 23, 2018

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా కొనసాగుతుంది.. మహానటి సావిత్రి బయోపిక్ తీస్తే బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర రెడ్డి బయోపిక్‌లు షూటింగ్ జరుపుకుంటున్నాయి.. ఇప్పుడు తమిళ నాట స్వర్గీయ జయలలిత బయోపిక్ రూపొందనున్న సంగతి తెలిసిందే.. ఆ మూవీలో జయలలిత క్యారెక్టర్ ఏ హీరోయిన్ చేస్తుంది, ఎవరు ఆమె పాత్రకి సూట్ అవుతారు అంటూ గత కొద్ది రోజులుగా రకరకాల చర్చలు జరిగాయి.. చివరకు జయలలిత పాత్ర పోషించబోయే నటి ఎవరో ఫిక్స్‌అయిపోయింది.. ఒక పక్క హీరోయిన్‌గా, మరోపక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉంటూ, సౌత్‌లో చక్రం తిప్పుతున్న నయనతార... జయలలిత బయోపిక్‌లో జయలలిత క్యారెక్టర్ చెయ్యబోతోందని తెలుస్తుంది.. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న జయలలిత బయోపిక్ కోసం నిర్మాతలు నయనతారని సంప్రదించగా, ఆమె సుముఖంగా ఉన్నట్టు వెల్లడించారట.. ఇదిలా ఉంటే, తమిళ నాట మరో ఇద్దరు దర్శకులు జయలలిత బయోపిక్ తీసే ప్లాన్‌లో ఉన్నారు..

17:29 - October 23, 2018

గుంటూరు : ఏపీలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం 14 మంది ఐపీఎస్‌‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రూరల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ విశాఖ సిట్‌కు బదిలీ అయ్యారు. కడప ఎస్పీగా ఉన్న అట్టాడ బాబూజీని విశాఖ రూరల్‌ ఎస్పీగా బదిలీ చేశారు. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌ను గుంటూరు రూరల్‌ ఎస్పీగా బదిలీ చేశారు. చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్‌ తిరుపతి అర్బన్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు. 

విశాఖ రూరల్‌ అడిషనల్‌ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగిని నెల్లూరు ఎస్పీగా, విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీసీ ఫకీరప్పను కర్నూలు ఎస్పీగా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మహంతిని కడప ఎస్పీగా, పార్వతీపురం ఓఎస్డీ విక్రాంత్‌ పాటిల్‌కు చిత్తూరు ఎస్పీగా బదిలీ చేశారు. 

గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడును విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌కు బదిలీ చేశారు. నెల్లూరు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు, కడప అడిషనల్‌ ఎస్పీ అద్మాన్‌ నయీం అస్మీ విశాఖ లా అండ్‌ ఆర్డర్‌కు బదిలీ చేశారు.  నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్థ కౌశల్‌ గుంతకల్లు రైల్వే ఎస్పీగా బదిలీ అయ్యారు. కర్నూల్‌ ఎస్పీ గోపీనాథ్‌ జెట్టీకి తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్‌ బాధ్యతలు అప్పగించారు. 

 

16:47 - October 23, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోగస్ఓట్లు తొలగింపులో ఎన్నికల సంఘం చర్యలు కంటితుడుపుగానే ఉన్నాయని, హైకోర్టును ఎన్నికలసంఘం తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఈఅంశంపై న్యాయపోరాటం చేస్తానని ఆయన చెప్పారు. తమదగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సాఫ్ట్ వేర్ ఉందని చెప్పిన ఎన్నికల సంఘం కంటితుడుపు చర్యగా బోగస్ ఓట్లను తొలగించిందని అన్నారు. రాష్ట్రానికి ఆడిట్ బృందాన్ని ఈసీ ఎందుకు పంపలేదని మర్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే  ప్రకటించిన షెడ్యూల్ కు అనుగుణంగా తమ షెడ్యూల్ ఉండేలా అమలు చేయటానికి ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 

16:47 - October 23, 2018

ఢిల్లీ : నవంబర్‌‌లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ నెల చివరి నాటికి స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనుంది. నవంబర్‌ మొదటివారంలో అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా పేర్కొన్నారు. ఈనెల చివరికి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం అవుతుందన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

సామాజిక వర్గాల వారిగా సీట్ల కేటాయింపుపై చర్చించామని తెలిపారు. బీసీలకు కేసీఆర్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.

 

16:35 - October 23, 2018

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డేసందర్భంగా, యు.వి.క్రియేషన్న్ వారు షేడ్స్‌ఆఫ్ సాహో చాప్టర్1 పేరుతో విడుదల చేసిన వీడియో దెబ్బకి, డార్లింగ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారి పోస్ట్‌లకి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది..
సాహో వీడియో చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.. మరోవైపు సెలబ్రిటీలు కూడా సైరా సాహో, సాహోరే సాహో అంటూ ఒక రేంజ్‌లో ట్వీట్లు చేస్తున్నారు..
షేడ్స్‌ఆఫ్ సాహో చూసి, తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కింది అని అల్లు శిరీష్ అంటే, రానా 'సాహో'..రే', అని ట్వీటాడు.. శ్రద్ధ దాస్, అడవి శేష్, సుమంత్, మంచు మనోజ్, సురేందర్ రెడ్డి, రామజోగయ్య శాస్త్రి, ఈషా ‌రెబ్బా, మారుతి, సుధీర్ వర్మ, పరుచూరి గోపాలకృష్ణ, సుధీర్ బాబు, శోభు యార్లగడ్డ, అరుణ్ విజయ్ వంటి పలువురు సెలబ్స్ తమ ట్వీట్లతో డార్లింగ్‌ని ఆకాశానికెత్తేసారు

  

16:27 - October 23, 2018

ఢిల్లీ : అత్యున్నత విచారణ సంస్థ సీబీఐలో లంచాల వ్యవహారం కలకలం రేపుతోంది. లంచాల అంశం దుమారం చెలరేగుతోంది. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. 

సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాకు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అంశం కోర్టుకు చేరింది. తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రాకేశ్ ఆస్తానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఇదే కేసులో అరెస్టైన డిప్యూటీ ఎస్పీ దేవేందర్ కుమార్‌ను ఢిల్లీ కోర్టులో సీబీఐ  హాజరు పరిచింది. దేవేందర్ కుమార్‌ను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది.

 

16:19 - October 23, 2018

ఢిల్లీ: సరికొత్తగా ముస్తాబైన 'హ్యుందాయ్‌ శాంత్రో’ మళ్లీ భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. ప్రముఖ కొరియన్ కార్ల కంపెనీ హ్యుందాయ్ తన సరికొత్త శాంత్రో మోడల్ కార్‌ను దేశీయ విపణిలో నేడు ప్రవేశ పెట్టింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సరికొత్త ది ఆల్ న్యూ 'శాంత్రో' ఫ్యామిలీ కారును ఘనంగా ఆవిష్కరించారు. ఈ సరికొత్త శాంత్రో ధర రూ.3.89 లక్షలుగా ఉండనుంది. ప్రీ బుకింగ్స్ కింద అక్టోబర్‌ 10 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా తొలి 50వేల మంది కస్టమర్లకు రూ.11,100కే కారును బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. పాత 'శాంత్రో' మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్‌ను మరింత స్టైలిష్‌గా టాల్‌బాయ్‌ సిట్టింగ్‌ మోడల్‌లో తీర్చిదిద్దారు. 5 వేరియంట్లలో 7 కలర్‌ ఆప్షన్స్‌లో లభ్యమవుతోంది. డ్లైట్ , ఎరా, మ్యాగ్నా, స్పోర్జ్, ఆస్టా పేర్లతో లభ్యమవుతున్నాయి. మ్యాగ్నా, స్పోర్జ్‌లో సీఎన్‌జీ సదుపాయం కూడా ఉంది. 

సరికొత్త ఫీచర్లతో పోటీ సంస్థలైన మారుతీ, టాటా మోటార్ల మోడల్స్2కు ధీటుగా హ్యుందాయ్ తన కొత్త శాంత్రో కారును ప్రవేశ పెట్టింది. రియర్ ఏసీ సదుపాయం, అన్ని వైపులా ఎయిర్ బ్యాగ్స్,  ఆటోమేటిక్ గేర్లు, ఆన్‌టచ్‌ స్క్రీన్ (7 అంగుళాలు) వంటి ఫీచర్లతో వినియోగ దారులను అకట్టుకునే ప్రయత్నం చేసింది. దాదాపు మూడేళ్ళ పాటు 100 మిలియన్ డాలర్లు వెచ్చించి శాంత్రోకు సరికొత్త ఫీచర్లు జోడించడానికి కృషి చేశామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకూ ఎవరూ వాడని టెక్నాలజీని ఇందులో ప్రవేశ పెట్టామని వారంటున్నారు. న్యూ శాంత్రో వినియోగదారులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. అంతే కాకుండా పర్యావరణ హితంగా ఇండియన్ పొల్యూషన్ బోర్డు ప్రామాణికాలకు దీటుగా ఇంజిన్ తయారు చేసామని కంపెనీ తెలిపింది. 

దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత  స్మాల్‌ కార్‌ సెగ్మెంట్‌లో తొలిసారిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ కారుగా శాంత్రో ఎహెచ్‌-2 లాంచ్‌ చేశారు. శాంత్రో కారుకు ప్రీ బుకింగ్‌లు అక్టోబర్ 10, 2018న ప్రారంభం కాగా ఇప్పటికే  23,500 బుకింగ్‌లు వచ్చాయని హ్యుందాయ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

* శాంత్రో ప్రారంభ ధర రూ.3.89లక్షలు
* టాల్‌బాయ్ సిట్టింగ్ మోడల్
* 5 వేరియంట్లు 7 కలర్లు
* సీఎన్‌జీ సదుపాయం
* రియర్ ఏసీ సదుపాయం
* అన్ని వైపులా ఎయిర్ బ్యాగ్స్
* ఆటోమేటిక్ గేర్లు
* ఆన్‌టచ్ స్క్రీన్స్

15:44 - October 23, 2018

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులోఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం ఈఏడాది ఆగస్టు 1న జారీ చేసిన జీవో నెంబరు 90ని  హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది. వచ్చే 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనను వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచ్ లు  దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగులను నియమిస్తోందని, వారికి పాలనా అనుభవం లేకపోవటంవల్ల  గ్రామాల్లో  అభివృధ్ది కుంటుపడుతోందని, మాజీ సర్పంచ్ లు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్  ఆఫీసర్ల పాలనతో ఎంతకాలం పాలన సాగిస్తారని  వారు పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు  వచ్చే 90 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. 

15:41 - October 23, 2018

హైదరాబాద్: ప్రొ.కోదండరామ్ ఆధ్వర్యంలో వచ్చిన తెలంగాణ జనసమితి పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారైంది. టీజేఎస్‌ ఎన్నికల గుర్తుగా ''అగ్గిపెట్టె'' కేటాయించారు. ఇవాళ సాయంత్రం అధికారికంగా  సీఈసీ ప్రకటించనుంది. తెలంగాణ జనసమితి పార్టీ నూతనంగా ఆవిర్భవించడంతో ఆ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించాలని సీఈసీని గతంలో కోరారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఈసీ టీజేఎస్‌కు గుర్తును కేటాయించినట్లు తెలుస్తోంది.

15:34 - October 23, 2018

తనీష్, ప్రియా సింగ్ జంటగా, యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై, వి.కార్తికేయ డైరెక్షన్‌లో, ఎ.పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మిస్తున్న మూవీ, రంగు.. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది..
అప్పుడెప్పుడో నచ్చావులే, రైడ్ సినిమాల తర్వాత ఇప్పటి వరకూ తనీష్‌కి హిట్ పడలేదు.. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన నక్షత్రం కూడా నిరాశ పరచింది.. ఈ మధ్య బిగ్‌బాస్2లోనూ పార్టిసిపెట్ చేసాడు.. ఇప్పుడు రంగు ట్రైలర్ చూస్తుంటే, తనీష్ కొత్తగా ట్రై చేసాడు, వర్కవుట్ అవ్వొచ్చేమో అనిపిస్తుంది.. విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న రంగుకోసం తనీష్ కంప్లీట్ మాస్ యాంగిల్‌లోకి మారిపోయాడు.. పోసాని, షఫీ, జబర్దస్త్ రఘ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్నారు.. ఈ మూవీకి పరుచూరి బ్రదర్స్ డైలాడ్స్ వ్రాస్తుండగా, యోగీశ్వర శర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.. రంగు మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. 

15:33 - October 23, 2018

కర్నూలు : జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ కేసులు అధికమవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో నలుగురికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏడుగురు స్వైన్‌ఫ్లూ వ్యాధితో మృతి చెందారు. స్వైన్‌ఫ్లూతో తుంగభద్ర గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. ఆదివారం గోనవరానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా 19 కేసులు నమోదు అయ్యాయి. 8 మంది చికిత్స పొందుతున్నారు. ఎనిమిది మందికి చికిత్స వైద్యులు అందిస్తున్నారు.  

 

15:26 - October 23, 2018

హైదరాబాద్: కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇంకా అభ్యర్థులను ప్రకటించనేలేదు. ఆశావహులు మాత్రం జోరుగా ప్రచారంలో మునిగిపోయారు. తమకే టికెట్‌ వస్తుందనే ఆశాభావంతో తమ తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సర్వే రిపోర్టు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని అధిష్ఠానం తేల్చి చెప్పడంతో ఆశావహులు కాస్తా అయోమయంలో పడ్డారు. 

కాంగ్రెస్‌ పార్టీలో ఆశావహులకు కొదవే లేదు. అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించకపోయినా ఆశావహులు మాత్రం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే టికెట్ కేటాయింపులో సర్వేలు కీలకం కానున్నాయి. సీనియారిటీ కంటే నియోజకవర్గంలో పలుకుబడినే ప్రాధాన్యతగా తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్‌ అధిష్ఠానం. 

అధిష్ఠానం సర్వేతో తమకు నిరాశే మిగులుతుందని భావిస్తున్నారు ఆశావహులు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో 3 నెలలుగా సర్వే నిర్వహిస్తున్నారు ఏఐసీసీ నేతలు. అయితే వాటి ఆధారంగా టికెట్లు రావడం కష్టమేనన్న సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. బోధన్‌, కామారెడ్డి నియోజకవర్గాలు మినహాయిస్తే మిగితా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బాల్కొండ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్న సీనియర్‌ నేతతో పాటు మరో ముగ్గురిపై సర్వే చేసినట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక ఆర్మూరు నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించింది అధిష్ఠానం. 

నిజామాబాద్‌ అర్బన్‌ పరిధిలో మొత్తం నలుగురు పోటీ పడుతున్నా సర్వేలో మాత్రం ఇద్దరికే అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రూరల్‌ నియోజకవర్గంలో రెడ్డి వర్గానికి అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది. బాన్సువాడ నియోజకవర్గంలో ఇద్దరి మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. జుక్కల్‌ నియోజకవర్గం పరిధిలో సీనియారిటీ కన్నా సర్వేకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే మహాకూటమి పొత్తు అంశం ఇంకా తేలకపోవడంతో అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో కాంగ్రెస్‌ కాస్త ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.  

అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉన్నా అభ్యర్థులు మాత్రం ప్రచారంలో మునిగిపోయారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 1999లో తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన కుమారి అరుణతార 3 సార్లు బరిలో దిగి రెండు సార్లు ఓటమి పాలయ్యారు. 2014లో కాంగ్రెస్‌లో చేరి జుక్కల్ నియోజకవర్గం టికెట్‌ ఆశిస్తున్నారు. టికెట్‌ తనకే వస్తుందన్న ఆశతో జోరుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. బిచ్కుంద, జుక్కల్‌, మద్నూరు మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా గడపగడపకూ కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

15:07 - October 23, 2018

దేశ అత్యున్నత నేర విచారణ వ్యవస్థ క్రైం బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) పనితీరుపై దేశం యావత్తు నివ్వెరపోయాలా చేసిన సంఘటన ఇది. ఇద్దరు సీబీఐ అధికారుల మధ్య జరిగిన ఆదిపత్యపోరు సీబీఐ పరువును రోడ్డున పడేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.  

  1. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్  రాకేష్ ఆస్ధానా - 1984  బ్యాచ్ గుజరాత్ కు చెందిన ఐపీఎస్ క్యాడర్ అధికారి.  గత ఏడాది అక్టోబర్  22 న సీబీఐ లో ప్రత్యక డైరెక్టర్‌గా  నియమితులయ్యారు. ప్రధాని మోడీ స్వయంగా ఆయన్ను  ప్రత్యేక అధికారిగా నామినేట్ చేశారన్న వార్తలు ఉన్నాయి. గతంలో  గోద్రాలో సబర్మతీ ఎక్స్‌ప్రెస్ దహనకాండ కేసు దర్యాప్తు చేశారు. సీబీఐలో ఆయన్ను నియమించినప్పుడు లోకాయుక్త చట్టాలు ఉల్లంఘించి  ఆయన్ను నియమించారని పిల్  దాఖలైంది. ఈ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. అయితే ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ రూ 3.8 కోట్లు లంచం తీసుకున్నానని ఆరోపిస్తూ తనను ఈ కేసులో ఇరికించారని కేంద్ర విజిలెన్స్‌  కమిషన్‌ (సీవీసీ)కి ఆస్థానా లేఖ రాశారు.
  2. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ - ఈయనకు ఆస్థానాతో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆస్థానాకు సీబీఐ డైరక్టర్ గా పదోన్నతి రావడంతో విబేధాలు మరింత పెరిగాయి. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ అనే కంపెనీ డైరీలో ఒక చోట రూ.3.8 కోట్లను ఆస్థానాకు చెల్లించినట్లు ఉండడాన్ని కారణంగా చూపించి, ఆయన పదోన్నతిని అడ్డుకునేందుకు  అలోక్‌వర్మ ప్రయత్నించడంతో ఇద్దరు అత్యున్నతాధికారుల మధ్య వైరం మరింత పెరిగింది. అప్పటి నుంచి పలు కేసుల విచారణలో, అంతర్గత బదిలీల్లో వీరిద్దరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు  చేసుకుంటున్నాయి.
  3. సీబీఐ డీఎస్పీ  దేవేందర్ కుమార్ - మాంసం ఎగుమతుల వ్యాపారి  మొయిన్  ఖురేషికి సంబంధించిన కేసులో దర్యాప్తు అధికారిగా దేవేందర్ వ్యవహరించారు. ఆ కేసులో  హైదరాబాద్‌కు చెందిన సానా సతీష్ బాబు  వాంగ్మూలం నమోదు చేయటంలో  ఫోర్జరీకి పాల్పడ్డారు. ఆస్ధానా  నేతృత్వంలో  సెప్టెంబరు 26, 2018న  సతీశ్ బాబు వాంగ్మూలం రికార్డు చేసినట్లు చెపుతున్నా.. వాస్తవానికి సతీశ్ బాబు ఆరోజు హైదరాబాద్‌లోని ఒక  హోటల్‌ లో  ఉన్నట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. ఫోర్జరీ ఆరోపణలపై సీబీఐ దేవేందర్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం జైలు నుండి తన అరెస్టును సవాలు చేస్తూ కోర్టులో మంగళవారం పిటీషన్ ధాఖలు చేశారు.
  4. సానా సతీష్ బాబు, వ్యాపారి - ఈయన మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడైన ఖురేషీకి లావాదేవీల్లో భాగంగా రూ 50 లక్షల సొమ్ము 2011 లో ఇచ్చాడు. మాంసం ఎగుమతులు, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్టక్చర్ వ్యాపారి అయిన . మొయిన్ ఖురేషిపై  హవాలా కేసుకు సంబంధించి సీబీఐ దాడులు చేసింది.  ఖురేషికి సతీష్ బాబు డబ్బు ఎందుకిచ్చారనే అంశంపై సీబీఐ  వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంది ...  కానీ కేసు నుంచి తప్పించుకోటానికి సీబీఐ అధికారులకు, కొందరు మధ్యవర్తులకు రూ 5 కోట్లు ఇచ్చినా ఇంకా డబ్బుకోసం వేధిస్తున్నారని సీబీఐకి ఈ ఏడాది అక్టోబరు 15న సతీష్ బాబు ఫిర్యాదు చేశాడు. దాంతో సీబీఐ ఎంక్వైరీ  మొదలెట్టింది.   మొయిన్ ఖురేషిపై నమోదైన కేసులో అక్టోబర్ 12, 2017 న సీబీఐ ముందు హాజరుకావాలని సీబీఐ అధికారి దేవేందర్  నుంచి నోటీసు అందింది. అక్టోబర్ 23 తేదీన ఖురేషికి డబ్బులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఖురేషికి చెందిన ఇన్ ఫ్రా సంస్దలో పెట్టుబడిగా ఇచ్చినట్లు చెప్పాడు. ఇదే కేసులో ప్రశ్నించేందుకు తెలంగాణ  కాంగ్రెస్ నేత షబ్బీర్  ఆలీని  సీబీఐ పిలిపించింది.  సీబీఐ కేసునుంచి తప్పించుకోవడానికి రూ 5 కోట్లు ఇచ్చేందుకు సతీష్ సోమేష్ ప్రసాద్ అనే మధ్యవర్తితో డీల్ కుదుర్చుకున్నాడు. ఈ సొమ్ము ఆస్థానాకు ఇవ్వాలని చెప్పాడు. ఇందులో రూ 3.55 కోట్లు చెల్లించాడు. అయినప్పటికీ సీబీఐ అధికారులు వేధించడంతో సీబీఐ ఉన్నతాధికారులకు వాట్సప్ మెసేజ్  ఆధారాలతో  ఫిర్యాదు చేశాడు. దీంతో లంచం తీసుకున్న సీబీఐ అధికారల మీద విచారణ మొదలయ్యింది.
  5. మధ్యవర్తి సోమేష్ ఒక సందర్భంలో రాకేష్ ఆస్థానాతో కూడా డీల్ మాట్లాడుతున్నట్టు సతీష్‌కు చెప్పి ఆధారాలు చూపించాడు. ఆ నమ్మకంతో సతీష్ విడతల వారీగా లంచం సొమ్ము చెల్లించడం ప్రారంభించాడు.  
  6. ఈ కేసుని డీల్ చేసిన సీబీఐ అధికారులు ఆస్థానా అరెస్టుకు కూడా రంగం సిద్ధం అయ్యింది. అయితే మోదీ ఆశీస్తులతో కేసునుంచి బయటపడతారా అన్నది తేలాల్సి ఉంది. కాగా .... ఈకేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మంగళవారం ఆస్ధానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 
  7. సీబీఐ ఉన్నతాధికారులైన రాకేష్ ఆస్థానా, అలోక్ వర్మల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరడంతో దేశ ఉన్నతమైన విచారణ సంస్థ పరువు బజారున పడింది. వీరి మధ్యలో ఇరుక్కున్న దేవేందర్ అరెస్టుతో వీరిద్దరి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.
  8. ఈ కేసులో సీబీఐ అధికారులు రాకేష్ ఆస్థానాతొ పాటు ఆలోక్ వర్మపైనా విచారణ జరగాల్సి ఉంది.
  9. బీజేపీ సర్కారుకు ఈ కేసు ఓ సవాల్‌గా మారే అవకాశం లేకపోలేదు.
  10. సీబీఐ సంస్థ పంజరంలో చిలుక లాగా ఉందని యూపీఏ హయాంలో అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్డీఏ సర్కర్ కూడా అదే బాటలో పయనిస్తోందని దేశ ప్రజలు అర్థం చేసుకొనే పరిస్థితి ఈ కేసు తీసుకువచ్చిందనేది వాస్తవం.
13:59 - October 23, 2018

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహం, ఎన్నికల ప్రచారంపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా మహాకూటమి, ఏపీ సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మహాకూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందన్న కేటీఆర్.. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు మళ్లీ కన్నీళ్లు తప్పవని హెచ్చరించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని కేటీఆర్ ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. టీడీపీకి కేడర్ లేదు.. కాంగ్రెస్‌కు లీడర్ లేరు అన్న కేటీఆర్.. మహాకూటమిలో సీట్ల పంపకమయ్యే లోపే ఇబ్రహీంపట్నంలో స్వీట్లు పంచుకుంటారని.. గత ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని కేటీఆర్ జోస్యం చెప్పారు.

సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందన్న కేటీఆర్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలకు మించి ఉండవన్న కేటీఆర్.. అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యం అని స్పష్టం చేశారు. అందరికీ ఉపాధి అందుకే పరిశ్రమలు రావాలన్నారు. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పారు.

* మహాకూటమి అధికారంలోకి వస్తే మళ్లీ కన్నీళ్లే
* రైతులకు అన్యాయం జరుగుతుంది
* మహాకూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది
* సింహం సింగిల్‌గానే వస్తుంది
* పాలమూరు ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే
* ప్రభుత్వ ఉద్యోగాలు 4లక్షలకు మించి ఉండవు
* అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అసాధ్యం
* కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి
* ఫార్మాసిటీతో యువతకు ఉపాధి లభిస్తుంది
* మహాకూటమిలో సీట్ల పంపకమయ్యే లోపే ఇబ్రహీంపట్నంలో స్వీట్లు పంచుకుంటారు
* టీడీపీకి కేడర్.. కాంగ్రెస్‌కు లీడర్ లేరు
* గత ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయి

13:32 - October 23, 2018

నార్త్ కరోలినా : హొటల్ వెళితే మనకు సర్వ్ చేసిన సర్వర్స్ కు ఎంతో కొంత టిప్ ఇవ్వటం సర్వసాధారణంగా జరిగేదే. సర్వర్ మనకు సర్వ్ చేసిన విధానం మనకు బాగా నచ్చితే ప్రశంసలతో పాటు మరికొంత ఎక్కువ టిప్ ఇస్తాం. కానీ కేవలం తాగేందుకు మంచినీళ్లు ఇచ్చినందుకు ఓ మహిళా సర్వర్ కు 10వేల డాలర్ ఇచ్చిన సందర్భం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచినీళ్లు ఇచ్చిన సర్వర్ వినయానికి మెచ్చిన సదరు కష్టమర్ ఇచ్చిన ఈ టిప్ ఎంత భారీగా ఉందో వింటే ఆశ్చర్యం కలగకమానదు.

 గతంలో ఎన్నో సందర్భాల్లో చూశాము. అటువంటిదే ఇది కూడా. హోటల్ కు వచ్చి కేవలం మంచినీరు తాగి వెళ్లిన ఓ వ్యక్తి, తనకు నీళ్లిచ్చిన యువతికి ఏకంగా 10 వేల డాలర్లు అంటే ఇండియా కరెన్సీలో సుమారు రూ. 7.38 లక్షలు టిప్ ఇచ్చిన ఘటన జరిగింది. 
ఓ హోటల్ లో అలియానా కస్టర్ అనే యువతి వెయిటర్ గా పనిచేస్తోంది. ఆ హోటల్ కు వచ్చిన ఓ కస్టమర్ మంచినీరు కావాలని అడిగాడు.. నీరిచ్చింది. తాగిన అతను మరో గ్లాస్ కావాలని అడిగాడు. అంతే వినయంగా మరో గ్లాస్ నీరు  ఇచ్చింది. హోటల్ నుంచి వెళ్లిపోయిన అతను, "రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు" అని ఓ కాగితంపై రాసి, టిప్ ను పెట్టి వెళ్లాడు. అంతవరకూ ఓకే. కానీ ఆ టిప్ చూసిన అలియానా సంభమాశ్చర్యాల్లో మునిగిపోయింది. దాంట్లో నుండి ఆమె తేరుకోకముందే అతను మరోసారి వచ్చిన ఓ హగ్ ఇచ్చి వెళ్లాడు. ఇక ఆ కస్టమర్ యూట్యూబ్ లో దాదాపు 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మిస్టర్ బీస్ట్ అని తెలుసుకున్న అలియానా ఆనందంలో ఎగిరి గంతేస్తోంది. ఈ రోజును తన జీవితంలో మరచిపోలేనని చెబుతోంది. 
 

13:25 - October 23, 2018

ఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది. అయితే వచ్చే నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు వీటిపై విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.

కేరళలోని శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను సైతం అనుమతించాలంటూ సెప్టెంబర్ 28న ఐదుగురు జడ్జీల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను అనుమతించకూడదు అనే నిబంధనకు చట్టబద్ధత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు నుంచి శబరిమల ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. మహిళల ప్రవేశంపై సంప్రదాయవాదులు భగ్గుమన్నారు. పలు హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లేందుకు యత్నించిన మహిళల్ని అడ్డుకున్నాయి. మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ శబరిమల, పంబ, పథనంతిట్ట, ఎర్నాకులం, తిరువనంతపురం, కొచ్చి తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిషేధిత వయసున్న మహిళలను ఆలయం వరకూ మాత్రమే చేర్చగలిగిన పోలీసులు, వారిని పదునెట్టాంబడి(18 మెట్లు) మాత్రం ఎక్కించలేకపోయారు. సుప్రీం తీర్పు అనంతరం మాస పూజల కోసం బుధవారం ఆలయం తెరిచిన తర్వాత ఆరు రోజుల పాటు కేరళలో యుద్ధ వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పుతో అయ్యప్ప సన్నిధానంలోకి అడుగుపెట్టాలని భావించిన మహిళలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 

ఈ సందర్భంగా మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ పలు హిందూ సంస్థలు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. రివ్యూ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం, విచారణ జరిపే తేదీని ఇవాళ వెల్లడించింది.

నెలవారీ పూజల కోసం గత బుధవారం తెరచుకున్న ఆలయం, ఆరు రోజుల అనంతరం సోమవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. తిరిగి నవంబర్ 5న ఆలయం తెరవనున్నారు. మండల పూజల కోసం నవంబర్ 16 నుంచి డిసెంబర్ చివరి వారం, తర్వాత రోజుల మినహా జనవరి 20 వరకు సన్నిధానం తెరిచే ఉంటుంది.

13:11 - October 23, 2018

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, సోషల్ మీడియా అంతా సందడి సందడిగా, హడావిడిగా ఉంది.. 
చాలామంది సినీ ప్రముఖులు డార్లింగ్ ప్రభాస్‌కి ట్విట్టర్‌లో  పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. 
రానా దగ్గుబాటి, బాహుబలి అప్పుడు సరదాగా తీసుకున్న ఫోటో పోస్ట్‌చేసి, హ్యాపీ బర్త్‌డే టూ యూ బ్రదర్ అంటూ విష్ చెయ్యగా, జగపతి బాబు, సుధీర్ బాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, సంపూర్ణేష్ బాబు, అడవి శేష్, మురళీ శర్మ, శ్రీ విష్ణు, అదా శర్మ, ఈషా ‌రెబ్బా, రకుల్ ప్రీత్, థమన్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, మారుతి, సంపత్ నంది, హరీష్ శంకర్ తదితరులు ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా, షేడ్స్‌ఆఫ్ సాహో చాప్టర్1 పేరుతో, ఈ ఉదయం ఒక వీడియో రిలీజ్ చేసింది చిత్ర బృందం..

13:03 - October 23, 2018

ఢిల్లీ: సీబీఐ స్పెషల్ డైరెక్టర్  రాకేష్ ఆస్ధానా అవినీతి కేసులో  సోమవారం రాత్రి అరెస్టైన  సీబీఐ డీఎస్పీ  దేవేందర్ కుమార్  తన అరెస్టును  సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై  ఈ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు మనీలాండరింగ్ వ్యాపారం చేసే మాంసం వ్యాపారి ఖురేషి కి  సంబంధించిన కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్నారు.   హైదరాబాద్ కు చెందిన  సానా సతీష్ బాబు వాంగ్మూలం రికార్డు చేయటంలో ఫోర్జరీకి పాల్పడ్డారనే  ఆరోపణలతో ఆదివారం నాడు దేవేందర్  ఆఫీసు,ఇంటిలోనూ సోదాలు చేసిన సీబీఐ అధికారులు ఆయన వద్ద నుంచి ఐపాడ్లు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఏడాది సెప్టెంబరు 26న సతీష్ వాంగ్మూలాన్ని ఆస్థానా నేతృత్వంలోని దర్యాప్తు బృందం నమోదు చేసినట్లు చెబుతున్నా... నిజానికి ఆ తేదీన సతీష్ హైదరాబాద్‌లో ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఆ మేరకు హోటల్‌ బిల్లులు, ఇతర ఆధారాలను సంస్థ సేకరించింది. కేసు నుంచి బయటపడటానికి సీబీఐ అధికారులకు లంచాలు ఇచ్చానని సతీష్ బాబు అక్టోబరు 15న  సీబీఐ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీబీఐ దేవేందర్ ను అరెస్టు చేసింది. 

12:58 - October 23, 2018

అనంతపురం : అసలు కరవు ప్రాంతం. నీటి ఎద్దడి. పంటలు వేసిన రైతన్నలు ఆరుగాలం ఆకాశంవైపు నీటి కోసం చూడాల్సిందే. దానికి తోడు పండించిన పంటకు తగిన మద్దతు ధర లేక రైతన్నలు దేశవ్యాప్తంగా అల్లాడిపోతున్నారు. దీనికి తోడు పలు  తెగుళ్లు పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అసలే కష్టాల కడలిలో ఎదురీదుతున్న అనంతపురం జిల్లా అన్నదాతలకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని మిర్చీ పంటకు తాజాగా ‘విల్ట్’ అనే ప్రమాదకరమైన తెగులు సోకింది. దీని కారణంగా పచ్చటి మిర్చీ మొక్కలు సైతం ఎండిపోతాయి.
కాగా ఈ తెగులు పంటలకు చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో కేవలం రోజుల్లోనే ఉరవకొండ నియోజకవర్గంలోని 9,000 ఎకరాల్లోని మిర్చీ పంటకు విల్ట్ తెగులు సోకడంతో అనంత అన్నదాతలు అల్లాడిపోతున్నారు. దీంతో మిగతా పంటలకు తెగులు వ్యాపించకుండా 2,000 ఎకరాల్లోని పంటను రైతులు తొలగించారు. ఈ నేపథ్యంలో నిపుణులు స్పందిస్తూ.. విత్తన శుద్ధి చేసుకోకుంటే తర్వాత వేసే పంటకు కూడా ఈ తెగులు వ్యాపిస్తుందని హెచ్చరించారు. కాగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.
 

12:58 - October 23, 2018

న్యూఢిల్లీ: ఆయనో పెద్ద కంపెనీకి బాస్.. వందల కోట్ల ప్రజల సొమ్ముకు కాపలాదారుడు. ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించాలన్నా ఈ కంపెనీ యాప్‌ను ఉపయోగించాల్సిందే!. అదే పేటీఎమ్. పేటీఎమ్ ఆఫీసులోకి ఒక్కసారిగా పోలీసులు ఎంటరయ్యారు. అక్కడ పనిచేస్తున్న సోనియా ధావన్ అనే మహిళను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. సోనియా తన బాస్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి ఆయన్నే రూ. 20 కోట్లకు బ్లాక్‌మెయిల్ చేసిందని పోలీసులు తెలిపారు. సోనియా పేటీఎమ్ కంపెనీ వ్యవస్థాపకుడు విజయశేఖర శర్మకు పీఏగా ఢిల్లీలోని నోయిడా ఆఫీసులో  గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తోంది.   
తన సహచర ఉద్యోగి దేవేంద్రకుమార్, తన భర్త రియల్టర్ రూపక్ జైన్‌తో కలిసి ఈ నేరానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. విజయశేఖర శర్మ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న పేటీఎమ్ సంస్థ ప్రారంభం నుండి తారాస్థాయికి ఎదిగే వరకూ సోనియా కంపెనీలోనే పనిచేసింది. అలాగే దేవేంద్ర కూడా 7 ఏళ్ల నుండి పేటీఎమ్లోనే పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. విజయశేఖర్ వ్యక్తిగత ల్యాప్‌టాప్, మోబైల్ ఫోన్, ఆఫీసు కంప్యూటర్‌తో సోనియాకు యాక్సిస్ ఉండటంతో సమాచారాన్ని దొంగిలించి.. వాటిని రోహిత్ కమల్ అనే నాలుగో వ్యక్తికి అందజేసింది. రోహిత్ విజయశేఖర్ తమ్ముడు, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మకు డబ్బులు డిమాండ్ చేస్తూ కాల్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ నష్టాల్లోకి పోతుందనీ.. కంపెనీ పరువు పోతుందని బెదిరించారు. ముందుగా కలకత్తాకు చెందిన రోహిత్ కోమల్ రూ 10 కోట్లు ఇవ్వాల్సిందిగా సెప్టెంబర్ 20న కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత నుంచి అతను కనిపించలేదు. ఈ సమాచారం బయటకు వెళ్లకుండా ఉండాలంటే తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని ఈ గ్యాంగ్ డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. 

 

12:51 - October 23, 2018

విశాఖ: ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ విశాఖ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని సీఎం చెప్పారు. విశాఖలో ఫిన్‌టెక్ ఫెస్టివల్ రెండో రోజుకి చేరింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. సాంకేతికతతో నూతన ఆవిష్కరణలు రావాలని అన్నారు. ఇన్ని కంపెనీలు ఏపీకి రావడం ఆనందంగా ఉందన్నారు. మీ ఆవిష్కరణలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయన్నారు. నాల్జెడ్ ఎకానమీలోమరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుపతి అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా అవతరించిందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఐదో అద్భుత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అమరావతిలో 9 నగరాలు నిర్మిస్తున్నామన్న సీఎం... అవన్నీ నాలెడ్జ్ సిటీలుగా అభివృద్ది చెందే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా చాలా నష్టపోయినా.. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని ప్రభుత్వం కార్యకలాపాలు ఆదార్‌తో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు.

12:32 - October 23, 2018

రాజస్థాన్ : కొన్నేళ్ళ క్రితం వరకూ ప్రపంచాన్ని వణికించింది స్వైన్ ఫ్లూ హెచ్1ఎన్1 అనే వైరస్.  స్వైన్ ఫ్లూ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోయాయి. స్వైన్ ఫ్లూ దాడికి గురై అనేక మరణాలు సంభవించిన దేశాల్లో భారత దేశం కూడా ఒకటి. ఇప్పటికీ స్వైన్ ఫ్లూ వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.ఈ స్వైన్ ఫ్లూ బారినుంచి కొద్దిగా బయట పడి ఊపిరి తీసుకుందో లేదో వెంటనే ఎబోలా వైరస్ విజృంబించింది ఆఫ్రికా దేశాల్లో కొన్ని వందల మందిని బలి తీసుకుందీ ఈ వైరస్. అదే క్రమం లో ఇప్పుడు జికా వైరస్ అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్ లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ వైరస్ పూర్తి ప్రపంచాన్ని ఆక్రమించేందుకు పెద్దగా సమయం పట్టక పోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో  రాజస్థాన్ లో  120 మందిలో జికా వైరస్‌ను గుర్తించామని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి కలిచరణ్ సరఫ్ వెల్లడించారు. కాగా బ్రెజిల్ లో దాదాపు 10 లక్షలమందిని చుట్టుముట్టింది. 

Mosquitosవీరిలో 105 మంది చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి జికా వైరస్‌కు సంబంధించిన అవగాహన కలిస్తున్నామని, వైరస్ సోకిన వారు తగిన చర్యలు తీసుకుంటే కేవలం వారం రోజుల్లోనే ఉపశమనం పొందచ్చని అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. తగిన విశ్రాంతి, బాగా నీళ్లు తాగడంతో పాటు పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు తీసుకుంటే కేవలం వారం రోజుల్లోనే ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారని సరఫ్ వెల్లడించారు.

Image result for జికా వైరస్జికా లక్షణాలు..
‘ఆడెస్’ అనే దోమలు కుట్టడం వల్ల జికా వైరస్ వ్యాప్తితో పాటు వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఈ దోమలు పగటి పూట కుడతాయి. ఈ వైరస్ వ్యాపిస్తే జ్వరం, దద్దుర్లు, కళ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భంతో ఉన్న మహిళలకు జికా వైరస్ వ్యాపిస్తే పిల్లలు కొన్ని లోపాలతో జన్మించే అవకాశాలు ఉంటాయి. అలాగే గర్భిణీల్లో పలు సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ముందే ప్రసవం కూడా జరిగే అవకాశాలుంటాయి. తలనొప్పి,కీళ్ల నొప్పులు,జ్వరం,వాంతులు,కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.జికా వైరస్ ఒంట్లో చేరిన అందరిలోను లక్షణాలు కనిపించకపోవచ్చు. జ్వరం వంటి లక్షణాలు వారం రోజుల లోపు తగ్గిపోతాయి. ఇటువంటి బహు ప్రమాదకర లక్షణాలు ఈ జికా స్పెషల్. సో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వుండటం ఎంతైనా మంచిదని ఆరోగ్య శాఖ హెచ్చిరిస్తోంది.
 

12:11 - October 23, 2018

పంజాబ్: అమృత్‌సర్‌లో గత శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 61మంది చనిపోయారు. 70మంది గాయపడ్డారు. రావణ దహణ వేడుకల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే, ఆ ప్రమాదానికి కారణమైన రైలును నడిపిన డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఓ వంతెన మీద వేలాడుతున్న మృతదేహానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ... ‘అమృత్‌సర్ రైలు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియా అతడి వ్యక్తిత్వాన్ని పదేపదే కించపరచడమే దానికి కారణం. రాజకీయ నాయకులు కూడా ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి’ అని పేర్కొంటూ వేలాదిమంది దాన్ని షేర్ చేస్తున్నారు.

ఆ ఫొటోతో పాటు ఆ డ్రైవర్ పేరును అరవింద్ కుమార్‌గా పేర్కొంటూ, అతడు రాసిన ఆత్మహత్య లేఖ అంటూ ఒక లేఖను కూడా చూపిస్తూ ఆ పోస్టును సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. #AmritsarTrainTragedy అనే హ్యాష్‌ట్యాగ్‌తో దాన్ని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో పంజాబ్ పోలీసు అధికారి కూడా ఒకరు ఉండటంతో ఆ పోస్టుకు మరింత బలం చేకూరింది. ఆ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని అంతా నమ్మేశారు. పలు మీడియా సంస్థల్లో కూడా ఈ కథనాలు వచ్చాయి. అయితే అసలు వాస్తవం ఇప్పుడు బయటపడింది. డ్రైవర్ ఆత్మహత్య న్యూస్ ఫేక్ అని తేలింది.

అసలు.. అమృత్‌సర్ రైలు ప్రమాదానికి కారణమైన రైలు డ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదు. ప్రస్తుతం అతడు పంజాబ్ రైల్వేస్ కస్టడీలో ఉన్నాడు. డ్రైవర్ సూసైడ్ వార్త ఫేక్ అని అమృత్‌సర్ రైల్వే స్టేషన్ డైరెక్టర్ అమృత్ సింగ్ తెలిపారు. ఆ ఫొటోల్లో ఆత్మహత్య లేఖ అంటూ చూపుతున్న లేఖ అసలు ఆత్మహత్య లేఖే కాదని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేసి విషయాన్ని సంచలనంగా మార్చే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఇక సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఫొటో అక్టోబర్ 20 అమృత్‌సర్ గ్రామీణ ప్రాంతంలో ఉరి వేసుకుని చనిపోయిన ఓ వ్యక్తిదని పోలీసులు తెలిపారు.

చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. పండుగ వేళ భారీ సంఖ్యలో జనం మృత్యువాత పడటానికి కారణమైన ఆ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త పూర్తిగా అవాస్తవం.

సోషల్ మీడియా పుణ్యమా అని అనేక రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి. ఏది నిజం..? ఏది అవాస్తవం..? అనేది తెలుసుకోలేకపోతున్నాం. నిజానిజాలు తెలుసుకోకుండానే లైక్‌లు కొడుతున్నాం, కామెంట్లు చేస్తున్నాం.. గుడ్డిగా షేర్ కూడా చేస్తున్నాం. ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, కీబోర్డ్ బ్రౌజింగ్‌ ద్వారా ప్రయత్నం చేయొచ్చు. సో.. ఇకముందు.. సోషల్ మీడియాలో వచ్చే వార్తల పట్ల కొంచెం అలర్ట్‌గా ఉంటే సరిపోతుంది.

11:59 - October 23, 2018

చైనా : జనాభాలో చైనాదే ప్రధమస్థానం. అలాగే అభివృద్దిలో కూడా చైనా దూసుకుపోతోంది. పలు కీలక, భారీ నిర్మాణాలను నిర్మిస్తు ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తోంది చైనా. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర బ్రిడ్జ్ ను చైనా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ బ్రిడ్జ్ ను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈరోజు ప్రారంభించారు. 
వంతెనలోని విశేషాలు..
55 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్ హాంకాంగ్, మకావూ‌తోపాటు చైనా ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది. జుహాయ్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిన్‌ పింగ్ ఈ ఉదయం ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు 55 కిలోమీటర్లు. రోడ్డు బ్రిడ్జ్ తో పాటు నీటిలో సొరంగం ద్వారా నిర్మితమైన ఈ బ్రిడ్జ్ ఇస్తూరీ నదిని దాటుతూ హాంకాంగ్ లాంతావ్ ద్వీపం, జుహాయ్, మకావూలను కలపనుంది. గత నెలలో చైనా, హాంకాంగ్ లకు కలిపే హైస్పీడ్ రైల్వే మార్గాన్ని కూడా చైనా ప్రారంభించింది. 
రావాణా మార్గాలపై భిన్న అభిప్రాయాలు..
అయితే హాంకాంగ్ తో చైనా తన రావాణా మార్గాలను మెరుగుపరచుకోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాంకాంగ్ లో తన బలగాలను మోహరించేందుకు చైనా ఈ బ్రిడ్జ్ ను నిర్మించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రిడ్జ్ పై ప్రయాణించడానికి పలు ఆంక్షలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలావుండగా బ్రిడ్జ్ నిర్మాణంతో రవాణా, వాణిజ్య కార్యాకలాపాలు అనుకూలంగా ఉంటాయని పలువురు సమర్థిస్తున్నారు.
 

11:54 - October 23, 2018

ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్‌తో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా ఉంది.. బర్త్‌డే స్పెషల్‌గా, రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్షన్‌లో చేస్తోన్న సాహో సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇస్తారు.. జిల్ ‌ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా విషయాలేం చెబుతారు.. పోనీ  ప్రభాస్ పర్సనల్‌గా తన పెళ్ళి వార్త ఏమైనా చెప్తాడా.. ఇలా, ఎవరికి తోచినట్టు వాళ్ళు రకరకాలుగా ఊహించేసుకుంటుండగా.. ప్రభాస్ న్యూ మూవీ సాహో గురించి కొత్త అప్‌డేట్ వచ్చింది.. షేడ్స్‌ఆఫ్ సాహో చాప్టర్1 పేరుతో ఒక వీడియో రిలీజ్ చేసారు మేకర్స్.. దాదాపు 82సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, విదేశాల్లో చిత్రీకరించిన మేకింగ్ పార్ట్ చూపించారు.. హాలీవుడ్ టెక్నీషియన్స్‌‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసారు.. ఇక, వీడియో చివర్లో డార్లింగ్ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తూ, గాగుల్స్ పెట్టుకుంటున్న విజువల్ అయితే అదిరిపోయింది.. బైక్‌పై హాలీవుడ్ హీరోలా రయ్‌మని దూసుకెళ్తుంటే ఫ్యాన్స్‌కి పూనకాలే..  మొత్తానికి ఆకలి మీద ఉన్న తన ఫ్యాన్స్‌కి బర్త్‌డే నాడు సాహో రూపంలో మంచి ట్రీట్ ఇచ్చాడు డార్లింగ్..  

 

11:30 - October 23, 2018

రాయబరేలీ (ఉత్తరప్రదేశ్): "ప్రియాంక గాంధీ మిస్సింగ్" అంటూ సోనియా గాంధీ పార్లమెంటు నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో వెలసిన వాల్ పోస్టర్లపై కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాయబరేలీలో ఈ పోస్టర్లు సంచలనం సృష్టించాయి. ఈ పోస్టర్లలో ప్రియాంకా గాంధీ కనుబడుట లేదు.. నియోజకవర్గానికి రావడానికి కూడా ఆమెకు తీరిక దొరకటం లేదు. తన తల్లి తరుపున ప్రచారం చేయడానికి వచ్చారు.. మళ్లీ కనబలేదు. హర్‌చందాపూర్‌లో రైలు ప్రమాదం జరిగినా..ఎన్టీపీసీ పేలుళ్లు జరిగినా ఆమె కనీసం బాధితులను పలకరించడానికి కూడా రాలేదు..అంటూ పోస్టర్లలో ఓటర్లు ప్రశ్నించారు. 
ఈ పోస్టర్ల వ్యవహారం బీజేపీ పనే అంటూ కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తుంటే..బీజేపీ నేతలు ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఇది మళ్లీ ప్రియాంకాను రాయబరేలీలో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. రాయబరేలీని కూడా "కాంగ్రెస్ ముక్త్ నియోజకవర్గం"గా చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. 

 

 

11:10 - October 23, 2018

ఢిల్లీ: దేశంలో బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించాలా వద్దా అనే విషయమై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. టపాసుల విక్రయాలకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే పలు షరతులు విధించింది. బాణాసంచా తయారీ, విక్రయానికి లైసెన్స్ తప్పనిసరి అని నిబంధన విధించింది. అంతేకాదు బాణాసంచాను ఆన్‌లైన్‌లో విక్రయించకూడదని స్పష్టం చేసింది. దీపావళి రోజున పలానా సమయంలో మాత్రమే టపాసులు కాల్చాలని ప్రజలకు సూచించింది. 

ఇక దీపావళి, న్యూఇయర్, క్రిస్మస్ రోజున బాణాసంచా కాల్చాల్సిన సమయాన్ని సైతం న్యాయస్థానం డిసైడ్ చేసింది. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10గంటల మధ్య.. న్యూఇయర్, క్రిస్మస్ రోజున రాత్రి 11.45 నుంచి ఉ.12.45 గంటల మధ్య మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Image result for fire crackersవాయు కాలుష్యం, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని దేశంలో బాణాసంచా విక్రయాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. గత ఆగస్టులో ఈ అంశంపై విచారణ జరిపిన సమయంలో బాణాసంచా తయారీదారుల జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులు, 130 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు... బాణాసంచా వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలో వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
* బాణాసంచా విక్రయాలకు సుప్రీంకోర్టు అనుమతి
* తయారీ, విక్రయాలకు లైసెన్స్ తప్పనిసరి
* ఆన్‌లైన్‌లో విక్రయాలపై బ్యాన్
* దీపావళి రోజున రా.8 నుంచి 10గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలి
* న్యూఇయర్, క్రిస్మస్ రోజున రా.11.45 నుంచి ఉ.12.45గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలి

అయితే బాణాసంచాపై పూర్తిగా నిషేధం విధించకుండా... వీటిని నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని బాణాసంచా తయారీదారులు కోర్టును కోరారు. వాయు కాలుష్యానికి పూర్తిగా బాణాసంచా మాత్రమే కారణం కాదని... ఇందుకు అనేక ఇతర కారణాలు ఉన్నాయని వారు కోర్టుకు వివరించారు. ఈ అంశంలో వాస్తవాలు తెలియకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి ఉంటుందని వాదించారు. 

గతేడాది అక్టోబర్‌లో దీపావళికి ముందు బాణాసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. పండగకు రెండు రోజులు ముందు అమ్మకాలకు అవకాశం కల్పించాలని వ్యాపారుల వినతిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాయు కాలుష్యం ప్రభావం ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందనే విషయం తెలుసుకోవడానికే ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. 

10:58 - October 23, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరీశిలించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపి రావత్...ఇవాళ శాంతి భద్రతల అంశంపై ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. 31జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో  సమావేశం అవనున్నారు. ఈ సందర్భంగా సమస్యత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు..సరిహద్దులో చెక్ పోస్టుల నిర్మాణం, నగదు, మద్యం పంపిణీని ఎలా అరికట్టాలనే దానిపై పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.  ఇక పోలింగ్ స్టేషన్లలో సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లతో పాటు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  కల్పించాల్సిన మౌలిక సదుపాయాల పై కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఐటీ శాఖ అధికారులతో భేటీ అవనున్నారు.
 

10:47 - October 23, 2018

హైదరాబాద్ : మెట్రో రైల్‌ ప్రయాణీకుల భద్రతకు పెద్దపీట వేయనుంది.  రైల్లో భద్రతా సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు అధికారులు. ప్రయాణీకుల ఫిర్యాదులకు వాట్సాప్ నెంబర్‌తోపాటు.. ఫుట్ పాత్‌లు, స్టేషన్ పరిసరాల ఆక్రమణలను అరికట్టేందుకు విజిలెన్స్‌టీమ్‌ను పటిష్టం చేయనున్నారు. రైళ్ళలో ప్రయాణీకుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే మహిళలకోసం ప్రత్యేకంగా కోచ్‌లు  కేటాయించిన అధికారులు..  ఇప్పుడు మహిళా సీట్లలో పురుషులు కూర్చుకుంటే కఠినంగా వ్యవహరించనున్నారు. అలాంటివారికి 500 రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగుల సీట్లలో ఇతరులు కూర్చున్నా.. ఇదే జరిమానా విధించనున్నారు.
ఇక ప్రతి మెట్రో బోగీలో  ఎల్ అండ్ టికి చెందిన  సెక్యూరిటీ సిబ్బందితోపాటు.. పోలీసు నిఘాను కూడా పెంచనున్నారు. ప్రయాణీకులు ఫిర్యాదు  చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నెంబర్ కూడా అందుబాటులోకి రానుంది.  మెట్రో స్టేషన్లు, పరిసరాల్లో  పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు మెట్రో అధికారులు. పచ్చదనం కోసం మొక్కలను విస్తృతంగా నాటాలని నిర్ణయించారు.   స్టేషన్ పరిసరాల ఆక్రమణదారులపై  కఠిన చర్యలు తీసుకోనున్నారు. దీనికోసం టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పోలీసు అధికారులతో ఒక ప్రత్యేక ఎన్‌ఫోర్స్ మెంట్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందుబాటులోకొచ్చిన ఎల్బీ నగర్- మియాపూర్ మార్గంతోపాటు..  నాగోల్ - అమీర్ పేట మార్గంలోని మెట్రో స్టేషన్ల పరిసరాల్లో  మిగిలిన  సివిల్ పనులన్నీ వేగవంతం చయనున్నారు.
 

10:32 - October 23, 2018

హైదరాబాద్: అభ్యర్థుల ఎంపిక‌లో ఆచి తూచి వ్యవ‌హ‌రిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. మ‌హాకూట‌మిలో పొత్తుల‌పై చ‌ర్చలు కొన‌సాగిస్తూనే.. మ‌రోవైపు సొంత పార్టీలో సామాజిక స‌మ‌తుల్యత‌పై దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల అభ్యర్థుల తుది జాబితా కోసం  ఫైన‌ల్ క‌స‌ర‌త్తు చేస్తోంది హైక‌మాండ్‌.

తెలంగాణ‌ ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా.. ప‌క్కా ప్రణాళిక‌ల‌తో సిద్ధమ‌వుతోంది. ఇప్పటికే మ‌హాకూట‌మికి తెర‌లేపిన కాంగ్రెస్‌ పార్టీ.. మిత్రప‌క్షాల‌తో చ‌ర్చల‌ను కొన‌సాగిస్తోంది. సీట్ల స‌ర్దుబాటు కోసం ఆ పార్టీల‌తో వ్యూహాత్మకంగా చ‌ర్చల‌ను జరుపుతోంది. సాధ్యమైనంత తొంద‌ర‌గా  సీట్ల స‌ర్దుబాటును పూర్తి చేసుకుంటామ‌ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

ఇక సొంత పార్టీలో అభ్యర్థుల ఎంపిక‌లో పార్టీ గ‌తంలో ఎన్నడూ లేనంతగా క‌స‌ర‌త్తు చేస్తోంది. పోలింగ్‌ నాటికి ప్యారాచూట్‌ లీడ‌ర్‌లు దిగుతార‌న్న విమ‌ర్శల‌కు తావులేకుండా ఈ సారి జాగ్రత్తలు తీసుకుంటోంది పార్టీ హైక‌మాండ్‌. ఆశావహుల దరఖాస్తుల స్వీక‌ర‌ణ నాటి నుండి.. ఎంపిక వ‌ర‌కు భారీ క‌స‌ర‌త్తునే చేస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ స్క్రీనింగ్‌ క‌మిటీ రాష్ట్రంలో ప‌ర్యటించి మొద‌ట ద‌ఫా క‌స‌ర‌త్తును కూడా పూర్తి చేసింది.

ఇప్పుడు తుది ద‌శ అభ్యర్థుల ఎంపిక‌లో ఉన్న కాంగ్రెస్ హైక‌మాండ్.. అభ్యర్థుల ఎంపిక‌లో సామాజిక స‌మ‌తుల్యత‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన ముఖ్య నేత‌ల‌తో ఢిల్లీలోని వార్‌‌రూమ్‌లో వ‌ర‌స స‌మావేశాలు నిర్వహించారు ఢిల్లీ పెద్దలు. హైక‌మాండ్ పిలుపులో భాగంగా స్క్రీనింగ్ క‌మిటీతో .. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భ‌ట్టి విక్రమార్క, దామోద‌ర రాజ‌నర్సింహ భేటీ అయి చ‌ర్చించ‌నున్నారు. బీసీల‌కు 34, ఎస్సీల్లో మాదిగ‌ల‌కు 12, మాల‌ల‌కు 7, ఎస్టీల్లో లంబాడిల‌కు, ఆదివాసుల‌కు చెరో 6 సీట్లు, ఇక ముస్లింల‌కు 5 సీట్లు ఇవ్వాల‌ని  రాహుల్ ఆదేశించిన‌ట్లు తెలుస్తుంది. ఈ సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు సీట్లు కేటాయించ‌టం వ‌ల‌న‌.. ఎన్నిక‌ల్లో ఆయా వ‌ర్గాలు కాంగ్రెస్‌కు మ‌రింత ద‌గ్గర‌వుతాయ‌ని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ పాల‌న‌లో.. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు అణిచివేత‌కు గురవుతున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌.. తమ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యతలను పాటించి ఆయా వ‌ర్గాల‌ను త‌మవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అయితే ఈ క‌స‌ర‌త్తు  ఫైనల్ లిస్ట్‌లో ప్రతిబింబిస్తుందా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు ఇప్పుడు చెబుతున్న విధంగా సీట్ల ద‌క్కుతాయా అన్నది చూడాల్సి ఉంది.

10:15 - October 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీలో తెలంగాణ అభ్యర్థుల ఎంపిక బాధ్యత మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నేత ఆంటోనికి అధిష్టానం అప్పగించింది. సామాజిక వర్గాల సమీకరణాలపై వార్‌రూమ్‌లో సమావేశం జరగనుంది. మంగళవారం జనరల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరగనుంది. వార్‌రూమ్‌లో భేటీకి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెలాఖరుకు అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 27లోపు పొత్తులపై తేల్చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. రేపు రాష్ట్రానికి స్క్రీనింగ్ కమిటీ వచ్చి...లిస్టును ప్రకటించే అవకాశం ఉంది.
 

10:08 - October 23, 2018

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీఈసీ ఓపీ రావత్ బృందం...తెలంగాణలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్లపై ఆయా పార్టీల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలపై చర్చించారు. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందంటూ ప్రతిపక్షాలు ఈసీ ముందే ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. 11మంది సభ్యులున్న కేంద్రం ఎన్నికల సంఘం బృందం....మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఎంఐఎం, వైసీపీ, సీపీఎం ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కోపార్టీకి 19 నిమిషాల టైమివ్వడంతో....పార్టీల నేతలు పలు అంశాలను ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే...ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో మంత్రుల పర్యటనలపై వస్తున్న వార్తలను పెయిడ్ ఆర్టికల్‌గా పరిగణించాలని విపక్షాలు కోరడాన్ని ఆయన తప్పు పట్టారు.

ప్రస్తుత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ వస్తుందని ఈసీకి తెలియజేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని... మొదట్నుంచీ తాము చెబుతూనే ఉన్నామన్నారు. ఓటర్ల జాబితా సరిచేయలేదని, అవసరమైన ఆధారాలను సీఈసీకి ఇచ్చామని చెప్పారు. 

ఆపద్ధర్మ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఈసీకి తెలిపారు. టీడీపీ సీనియర్ నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. సంబంధంలేని అంశంలో ఎల్‌. రమణను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాలని ఈసీని కోరామన్నారు. 

హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో బోగస్ ఓట్లు ఉన్నాయని....వాటిని తొలగించాలని గతంలోనే కోరినా ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోలేదన్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి. డబ్బుల పంపకాన్ని అడ్డుకొనేందుకు అన్ని వాహనాలను తనిఖీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు. బోగస్‌ ఓటర్లకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విజిలెన్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు.

09:53 - October 23, 2018

యాదాద్రి :  బాలికలను బలవంతంగా వ్యభిచారంలో దింపిన వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. మాంసం పెరగడానికి బాయిలర్ కోళ్లకు ఇంజక్షన్లు ఇస్తున్నట్లు...చిన్నారుల శరీరాలు పెరిగేలా హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నా...ఏం చర్యలు తీసుకున్నారంటూ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఆడపిల్లలకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తున్న వారిపై ఐపీసీ సెక్షన్ 120 బీ కింద కేసులు నమోదు చేశారా అంటూ నిలదీసింది. బాలికలను వ్యభిచార రొంపిలోకి దించకుండా తీసుకున్న చర్యలెంటో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. అధికారులకు తెలియకుండా ఇదంతా జరిగి ఉంటుందని తాము భావించడం లేదని అనుమానం వ్యక్తం చేసింది.ఈ కేసుల విచారణకు సిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయాలని కోర్టు ప్రశ్నించింది.

Related imageఈ వ్యవహారంపై ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని...బాధిత చిన్నారులకు పరిహారం ఇచ్చామని అదనపు ఏజే కోర్టుకు వివరించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్రమైన కేసుల్లో పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని...చిన్నారుల రక్షణ కోసం చర్యలు తీసుకోవడంతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో 22మందిపై కేసులు నమోదు చేశామని...మనుషుల అక్రమ రవాణా, పోస్కో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అదనపు ఏజే తెలిపారు. కేసుల్లో పురోగతిపై వివరణ ఇచ్చేందుకు డీసీపీ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. 

 

 

09:34 - October 23, 2018

శ్రీకాకుళం : జిల్లాలో తిత్లీ తుపాను బాధితుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు.  సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. వారిని నగదు కష్టాలు వెంటాడే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 29న చెక్కులు పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినా... అందుకు సరిపడా నగదు నిల్వ బ్యాంకుల్లో ఉందా అన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. దాదాపు 500 కోట్ల నగదు లేకుంటే చెక్కుల పంపిణీకి చిక్కులు తప్పవు. 

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ బాధితులను నగదు కష్టాలు వెంటాడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల ప్రారంభానికి పూర్తి స్థాయి పరిహారం అందించాలని భావిస్తోంది ప్రభుత్వం.బాధితులను గుర్తించి పరిహారం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ నెల 29 నుంచి పరిహారం చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటించారు సీఎం.  కానీ ఇది జరగాలంటే..  బ్యాంకులు ముందుగా నగదు నిల్వ ఉంచుకోవాల్సి ఉంది.

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసింది ప్రభుత్వం. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ నెల చివరి వారం నుంచి నవంబరు మొదటి వారంలోగా  550 కోట్ల  మేర నగదు అవసరమని అంచనా వేస్తున్నారు. అలాగే పరిహారానికి 400 కోట్ల వరకు అవసరమని  భావిస్తున్నారు అధికారులు.  సర్వే పూర్తయితే .. ఈ మొత్తం రెట్టింపయ్యే అవకాశం ఉందంటున్నాయి అధికార వర్గాలు. 

బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవంటున్న బ్యాంక్‌ వర్గాలు. మరోవైపు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు, ఉద్యోగుల జీత భత్యాలు, ఇతరత్రా చెల్లింపులకు  వందలాది కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది.  ఈనేపథ్యంలో తీవ్రంగా నగదు కొరత ఏర్పడే  అవకాశం ఉందన్నది బ్యాంకర్ల అంచనా. దీనికితోడు.. ఈ స్థాయిలో బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవని బ్యాంక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో  రుణాల రీషెడ్యూల్‌తో పాటు.. కొత్త రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరుతోంది ప్రభుత్వం. ఈలెక్కను 400 కోట్ల వరకు రుణాలు రీషెడ్యూల్‌ అయ్యే అవకాశం ఉందన్నది బ్యాంకర్ల అంచనా. శ్రీకాకుళం జిల్లాలో నగదు లభ్యతపై బ్యాంకర్లతో కలెక్టర్‌  సమావేశమయ్యారు.  నగదు కొరత లేకుండా చూడాలని బ్యాంకర్లను కోరారు కలెక్టర్. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పరిహారం జమ చేయనుండటంతో ఆరోపణలు, అవకతవకలకు తావులేకుండా చేయాలని భావిస్తోంది. 
 

09:21 - October 23, 2018

ఢిల్లీ: అయ్యప్ప భక్తుల పోరాటం ఫలించింది. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ తాము గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఆలయం ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం, ఎప్పటి నుంచి విచారణ జరపుతామన్న విషయాన్ని నేడు ప్రకటించనుంది. ''19 రివ్యూ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయం మాకు తెలుసు. విచారం తేదీని మంగళవారం నిర్ణయిస్తాం’'అని ధర్మాసనం స్పష్టం చేసింది.

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు వెలువడిన నాటి నుంచి కేరళ అట్టుడికిపోతోంది. హిందూ సంస్థలు, అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అయ్యప్ప ఆలయం తెరువగా.. ఆలయంలోకి వెళ్లేందుకు కొందరు మహిళలు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలను అయ్యప్ప భక్తులు, ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ శబరిమల, పంబ, పథనంతిట్ట, ఎర్నాకులం, తిరువనంతపురం, కొచ్చి తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పలువురు యువతులను ఆలయం వరకూ మాత్రమే చేర్చగలిగిన పోలీసులు, వారిని పద్దెనిమిది మెట్లను మాత్రం ఎక్కించలేకపోయారు. యువతులు ఆలయంలోకి రాకుండా అడ్డుకునే విషయంలో భక్తులు విజయం సాధించారు. ఆలయం తెరిచిన 5 రోజులు అక్కడ ఉద్రిక్త వాతావరణమే కనిపించింది. ఇప్పుడు రివ్యూ పిటిషన్ విషయంలోనూ సానుకూల ఫలితం వెలువడింది. మొత్తంగా సుప్రీంకోర్టు తన తీర్పుపై సమీక్షించేందుకు ఓకే చెప్పడం భక్తుల విజయమని శివసేన ప్రతినిధి తెలిపారు.

రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అత్యవసరంగా సమీక్షించాలంటూ న్యాయవాది జే నెడుంపర కోర్టును అభ్యర్థించారు. నేషనల్ అయ్యప్ప భక్తుల అసోసియేషన్ పక్షాన నెడుంపర రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని న్యాయవాది ఇంతకు ముందే కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టలేమని ఈ నెల 9న బెంచ్ తేల్చి చెప్పింది.

కాగా, ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మహిళలు శబరిమల ఆలయ ప్రవేశంపై 4:1 నిష్పత్తిన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. 

09:19 - October 23, 2018

ఉత్తరప్రదేశ్: కేబినెట్ మంత్రి సతీష్ మహానా వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌తో వెళ్తుండగా....పోలీసులు ఆయనకు భద్రత నిర్వహిస్తున్నారు. సీఎం కాన్వాయ్ వెనుకే రాష్ట్ర మంత్రి సతీష్ మహానా కారు వెళ్లింది. ఇంతలోనే కాన్పూర్ సమీపంలో మంత్రి కారును...పోలీసుల వాహనం ఢీ కొంది. దీంతో ఊగిపోయిన మంత్రి సహానా...వాహనాన్ని నడుపుతున్న పోలీసుపై చిందులు తొక్కారు. నడిరోడ్డుపైన మంత్రి ఆగ్రహించడంతో....పోలీసు మంత్రి సతీష్ సహానా కాళ్లు మొక్కారు. ఉద్యోగం నుంచి తొలగిస్తారన్న భయంతోనే మంత్రి కాళ్లు మొక్కినట్లు కానిస్టేబుల్ తెలిపారు. కానిస్టేబుల్ కాళ్లు మొక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...ఈ వ్యవహారం కాస్తా వివాదస్పదమవుతోంది.
 

09:00 - October 23, 2018

ఢిల్లీ : గడిచిన మూడేళ్ళలో దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరిగిపోయింది. 81వేల మంది కోటి రూపాయలకు పైగా వార్షిక ఆదాయం ప్రకటించారని  కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు పదిహేను శాతానికి పైగా  పెరిగాయని, ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటిదాకా  నాలుగు  లక్షల కోట్లకు పైగా  చేరాయని సీబీడీటీ వెల్లడించింది. మరోవైపు  భారతీయులు విదేశాల్లో దాచిన అక్రమ సొమ్ముపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు మూడో వారానికి దేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.7శాతం పెరిగాయన్న సీబీడీటీ... ఇయర్‌-ఆన్‌-ఇయర్‌ ప్రాతిపదికన పన్నుల రూపంలో రూ.4.89లక్షల కోట్లు ఖజానాకు జమ అయినట్లు తెలిపింది. మార్చి 31, 2019 నాటికి రూ.11.5లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో ఖజానాకు జమ అవుతాయని సీబీడీటీ లక్ష్యంగా పెట్టుకుంది. 
 

08:46 - October 23, 2018

హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... ఇవాళ ఉదయం 10గంటలకు ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. బషీర్‌బాగ్‌లోని ఐటీ శాఖ కార్యాలయంలో జరిగే విచారణకు రేవంత్ రెడ్డి అటెండవనున్నారు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాల తర్వాత ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల మూడున విచారణకు హాజరైన రేవంత్ రెడ్డిని  దాదాపు నాలుగున్నర గంటలపాటు అధికారులు విచారించారు. ఈనెల 23వ తేదీన మరోసారి తమ ముందుకు రావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ మరోసారి అధికారుల ముందు హాజరవనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు ఉదయ్ సింహా, మామ పద్మనాభరెడ్డి, శ్రీ సాయి మౌర్యా కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేశ్ రెడ్డి, శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సైతం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇళ్లలో రెండు రోజులకు పైగా సోదాలు నిర్వహించిన అధికారులు పలు డాక్యుమెంటు స్వాధీనం చేసుకున్నారు. ఓటు నోటు కేసు, రేవంత్ బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రయివేటు లిమిటెడ్‌లో రూ.20 కోట్ల లెక్క తేలని ఆదాయాన్ని గుర్తించిన అధికారులు.. రేవంత్ రెడ్డి భాగస్వామ్యం పై ఆరా తీసే అవకాశాలున్నాయి.  సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన భూపాల్ ఇన్‌ఫ్రా కంపెనీతో రేవంత్‌కు ఉన్న సంబంధాలపైనా వివరాలు సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రేవంత్ ఇంటి అడ్రస్ పైన పలు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని ఐటీ అధికారులు గుర్తించారు. అయితే, తమ ఇంట్లో అద్దెకు ఉన్న వారి కంపెనీల పేర్లు అని రేవంత్ చెప్పారు. ఆయా కంపెనీలతో రేవంత్‌కు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ ఆరా తీయనున్నారు. మొత్తంగా ఓటుకు నోటు డబ్బులు, రూ.20 కోట్ల లెక్క, సోదరుడి కంపెనీలో వాటా, తన ఇంటి అడ్రస్‌లోని కంపెనీలపై ఆరా తీయనున్నారని తెలుస్తోంది.

08:44 - October 23, 2018

ఢిల్లీ : మూడేళ్లలో దాదాపు 50వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అది కూడా రైలు ప్రమాదాల్లోనే మృతి చెందారంటే ఎవరికైనా ఆశ్చర్య కలగకమానదు. అమృత్‌సర్ ప్రమాదంతో రైల్వే శాఖ...అధికారికంగా వివరాలు వెల్లడించింది. 2015 నుంచి 2017 మధ్య 49వేల 790 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఉత్తర రైల్వే జోన్‌ నుంచి అత్యధికంగా 7వేల 908 మంది మృతి చెందితే...దక్షిణ రైల్వే  నుంచి 6వేల 149 మంది చనిపోయారు. అటు తూర్పు రైల్వే జోన్‌లో 5వేల 670 మంది మృత్యువాత పడ్డారు. భారత్‌లో మొత్తం 16 రైల్వే జోన్లుంటే...68 డివిజన్లు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిర్లక్ష్యంగా రైల్వే ట్రాకులను దాటడం, పై వంతెనలను ఉపయోగించకుండా రైలు పట్టాలపై నుంచే వెళ్లడం, రైల్వే ట్రాకులు దాటే సమయంలో మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను వినియోగించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రైల్వే శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి రైల్వే ట్రాకులు దాటినా, నిషేధం ఉన్న రైల్వే ప్రాంతాల్లోకి పాదచారులు, ప్రయాణికులు వచ్చినా రైల్వే చట్టం-1989లోని సెక్షన్‌ 147 ప్రకారం నేరమని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు వరకు దేశ వ్యాప్తంగా లక్షా 20వేల 923 మందిని ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అరెస్టు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 

 

08:24 - October 23, 2018

తమిళనాడు : రాష్ట్రంలో లో మరోసారి రిసార్ట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. శశికళ వర్గానికి కొంత మంది  ఎమ్మెల్యేలను టీటీవీ దినకరన్ రిసార్ట్‌కు తరలించడం చెన్నైలో హాట్ టాపిక్ గా మారింది. 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు  తిరునల్వేలి జిల్లా కుట్రాళం ఇసాక్కి రిసార్ట్‌కు తరలించారు. టీటీవీ దినకరన్‌కు అనుకూలంగా తీర్పు వస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశాలున్నాయి. 

08:05 - October 23, 2018

ఢిల్లీ: గంభీర్‌లు...రాజకీయాల్లోకి రానున్నారా ? అది కూడా జాతీయ పార్టీల్లో చేరి ప్రజలకు సేవ చేయనున్నారా ? ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు క్రికెటర్లు సంసిద్దత వ్యక్తం చేశారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇద్దరు క్రికెటర్లతో కమల దళపతి చర్చలు జరిపినట్లు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. 

వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, గౌతం గంభీర్‌లు బీజేపీ తరపున పోటీ చేయనున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వారిద్దరూ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నట్టు ఓ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. వీరిద్దరితో కాషాయం నేతలు ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇద్దరు క్రికెటర్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 

సామాజిక కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొంటున్నాడు. సైన్యం, కాల్పులు, దేశభక్తి అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తాడు. కొంతకాలం ముందు మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్ల పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి పనితీరుపై పార్టీ వర్గాలు, అనుచరులు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో 2019లో గౌతం గంభీర్‌ను... ఆమె స్థానంలో పోటీ చేయించాలని బీజేపీ నేతలు కసరత్తు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

అలాగే జార్ఖండ్ డైనమెట్ ధోనీని కూడా పోటీలో నిలపాలని బీజేపీ భావిస్తోంది. ధోనికి ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అతన్ని ఝార్ఖండ్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయించాలని బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఇద్దరు ససేమిరా అంటే.. కనీసం వారితో ప్రచారమైనా చేయించుకోవాలని పథకం రచిస్తున్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.  లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ప్రపంచకప్ కూడా ఉండడంతో...రాజకీయాల్లోకి రావడం కష్టమేనని పరిశీలకులు చెబుతున్నారు.

07:52 - October 23, 2018

ఢిల్లీ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ అధికారి రాకేశ్ ఆస్థానా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. కేసులో డబ్బు చేతులు మారిన వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు సంస్థలో రెండో స్థానంలో అధికారిపై ఆరోపణల నేపథ్యంలో....ఈడీ రంగ ప్రవేశం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విచారణ పూర్తయ్యే వరకు సదరు అధికారి సెలవుపై వెళ్లమని చెప్పడమో లేదంటే సస్పెండ్ చేయడమో జరగవచ్చని తెలిపాయి.
 

 

07:33 - October 23, 2018

ఢిల్లీ : సీబీఐలో అధికారుల లంచాల బాగోతం వ్యవహారం... ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రధాని మోడీతోపాటు బీజేపీని ఆత్మరక్షణలో పడేసేలా చేసింది. అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థలో కీలక నేతలు పరస్పరం ఆరోపణలతో కీచులాడుకొని కేసులు పెట్టుకోవడంతో...ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. ఇద్దరు డైరెక్టర్లు- అలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానాలను పిలిపించి మాట్లాడారు. ఈ వ్యవహారంలో రా ఉన్నతాధికారికి కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో రా అధిపతి అనిల్‌ దస్మానాతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. 
 

07:10 - October 23, 2018

ఢిల్లీ : సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాపై సొంత సంస్థే కేసు నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాకేశ్‌ ఆస్థానాపై వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు... తమ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ దేవేందర్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకున్నారు. సీబీఐలో ఉన్న ఇద్దరు ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అస్థానాను సస్పెండ్‌ చేయాల్సిందిగా అలోక్‌వర్మ వారం రోజుల కిందటే ప్రభుత్వానికి సిఫారసు పంపినప్పటికీ....పీఎంఓ నుంచి దీనికి వెంటనే క్లియరెన్స్‌ రాలేదని తెలుస్తోంది. మరోవైపురాకేశ్‌ అస్థానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. 2016 నవంబరులో వడోదరలో జరిగిన ఆయన కుమార్తె పెళ్లి ఖర్చులపైనా దృష్టి సారించినట్లు సమాచారం. 

వార్...తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ ఆస్థానాపై కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.  అదే సమయంలో దేశచరిత్రలోనే తొలిసారి సీబీఐ ప్రధాన కార్యాలయంలో...ఆ శాఖ ఉన్నతాధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా కేసులో సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. సతీష్‌ సానా తన వాంగ్మూలంలో చెప్పినట్లుగా దేవేందర్‌కుమార్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని సీబీఐ పేర్కొంది. మొయిన్‌ ఖురేషీ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్... తప్పుడు స్టేట్‌మెంట్‌ను సృష్టించారని అధికారులు తెలిపారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేరును సతీష్ సానా చెప్పకపోయినా డీఎస్పీ దేవేందర్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేశారని సీబీఐ గుర్తించింది. అంతేకాకుండా సతీష్ సానా ఢిల్లీలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని తేల్చారు.

మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషీతో ముడిపడి ఉన్న ఒక కేసులో ఓ వ్యాపారి పేరును తప్పించడానికి లంచం తీసుకున్నారన్న అభియోగంపై సీబీఐ చర్యలు చేపట్టింది. ఆస్థానాపై ఈ నెల 16వ తేదీనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. సీబీఐ ఆఫీసులో తొలిసారి సోదాలు నిర్వహించిన అధికారులు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ చేసిన దేవేంద్ర కుమార్‌ నుంచి ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకున్నారు. సీబీఐలో ఉన్నత పదవుల్లో ఉన్న డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాకు ప్రధాన మంత్రి కార్యాలయం సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆస్థానా కేసు వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రధాని మోడీని టార్గెట్ చేసింది. మోడీ నాయకత్వంలో రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు సీబీఐను ఆయుధంలా వాడుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు.

 

 

 

 

 

Don't Miss