Activities calendar

28 October 2018

22:15 - October 28, 2018

మేడ్చల్‌ : జిల్లా గోదుమకుంటలోని ఓ ఆశ్రమంలో యువతి అదృశ్యం అయింది. 24 ఏళ్ల చందన అనే యువతిని తల్లి మంగాదేవి ఒమోజయ బాబా ఆశ్రమంలో రెండు నెలల క్రితం వదిలివెళ్లింది. తనకూతిరిని చూపించాలంటూ మంగాదేవి ఆశ్రమ నిర్వాహకులను కోరగా వారు నిరాకరించారు. దీంతో మంగాదేవి పోలీసులను ఆశ్రయించింది. కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

 

22:03 - October 28, 2018

కర్నూలు : జిల్లాలో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. ఇవాళ ప్రభుత్వ వైద్యశాలలో ముగ్గురు స్వైన్ ఫ్లూకు బలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులుండగా.. వారిలో నాలుగు నెలల చిన్నారి మృతి చెందడం విషాదాన్ని నింపింది. చిన్నారి తల్లికీ స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో పదిమంది ఇంకా చికిత్స పొందుతుండగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో ఇంతవరకూ 31 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కాగా.. వారిలో 16 మంది మృతి చెందారు. రోజు రోజుకూ స్వైన్ ఫ్లూ మృతులు పెరుగుతుండడంతో జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్‌కు, వైద్యులకు మధ్య సమన్వయ లోపం వల్లే బాధితులకు సరైన చికిత్స అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

22:00 - October 28, 2018

విజయవాడ: వైజాగ్ ఎయిర్‌పోర్టులో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతోంది. జగన్‌ను చంపేందుకు టీడీపీ కుట్రపన్నింది అని వైసీపీ.. సానుభూతి కోసం జగన్ డ్రామా ఆడారని టీడీపీ.. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. జగన్‌పై దాడి ఘటనపై రాష్ట్రపతి, హోంమంత్రిలకు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ఇక నిందితుడు శ్రీనివాసరావు మీవాడు అంటే కాదు మీవాడే అంటూ ఇరు పార్టీల నాయకులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు.

జగన్‌పై దాడి కేసులో విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్డా కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడు శ్రీనివాసరావు కత్తిని జనవరిలోనే కొనుగోలు చేశాడని.. దానిని హోటల్ వంటగదిలో దాచాడని ఆయన స్పష్టం చేశారు. శ్రీనివాసరావుకు ఉన్న మూడు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని, నిందితుడి నుంచి 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు. తొలిరోజు విచారణలో పలు విషయాలు రాబట్టామన్నారు.

శ్రీనివాసరావు ట్యాబ్ కూడా వినియోగించేవాడని.. దానిని స్వాధీనం చేసుకున్నామని  లడ్డా పేర్కొన్నారు. జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాసరావు ఫ్లెక్సీలు వేయించాడని సీపీ తెలిపారు. శ్రీనివాస్ దస్తూరి బాగుంటుందని.. అయినా ఇతరులతో అతడు లేఖ ఎందుకు రాయించాడో తెలుసుకుంటామన్నారు. శ్రీనివాసరావుతోపాటు రెస్టారెంటులో పని చేస్తున్న వారిని కూడా విచారించినట్టు లడ్డా స్పష్టం చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావు పని చేస్తున్న ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంటు ఓనర్‌ హర్షవర్దన్‌ను కూడా పోలీసులు విచారించారు. జగన్‌పై దాడి కేసులో 3 రోజులుగా పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

21:50 - October 28, 2018

ఖతర్ : విదేశి గడ్డ ఖతర్ లో సిరిసిల్ల నేత కార్మికులకు అరుదైన గౌరవం దక్కింది. దొహా ఖతర్ లో సిరిసిల్ల బతుకమ్మ చీరలతో బతుకమ్మ వేడుకులు ఘనంగా నిర్వహించుకున్నామని ఖతర్ తెలంగాణ జాగృతి సభ్యులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేతకార్మికుల సంక్షేమానికి చేపట్టిన పథకాలను అభినందిస్తూ తాము కూడా నేతన్నలకు ఏదో ఒకటి చేయాలని సంకల్పించామని, అందులో భాగంగానే సిరిసిల్ల బతుకమ్మ చీరలు ధరించి వేడుకలు జరుపుకున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇస్తామని, నేత కార్మికులకు అండగా ఉంటామని ఖతర్ జాగృతి అధ్యక్షురాలు అబ్బగోని నందిని తెలిపారు. 

 

21:28 - October 28, 2018

విజయవాడ: ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ, జనసేన.. ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంటే.. ఎట్టిపరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇక తన సత్తా చూపేందుకు జనసేనాని కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పొత్తుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, జనసేనకు.. వైసీపీ, బీజేపీలతో పొత్తు కుదిరిందని.. సీట్ల సర్దుబాటు కూడా అయ్యిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారని.. జనసేనకు ఏ పార్టీ అండా దండా అక్కర్లేదని పవన్ పేర్కొన్నారు.

‘‘జనసేన.. ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుంది’.. అని కొందరు అంటున్నారు. సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మనకు ఏ పార్టీ అండ దండా అక్కర్లేదు. మన బలం జనం. చూపిద్దాం ప్రభంజనం’’ అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

జగన్‌ నాకు శ్రతువు కాదు అని ఆ మధ్యన పవన్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక టీడీపీతో పోలిస్తే.. బీజేపీపైనా పెద్దగా విమర్శలు చేయడం లేదు అనే అభిప్రాయం ఉంది. దీంతో వైసీపీ, బీజేపీతో జనసేన పొత్తు ఖాయం అనే టాక్ మొదలైంది. అప్పట్నుంచి జగన్-పవన్-బీజేపీ పొత్తులపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.

21:02 - October 28, 2018

విశాఖ : విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు చేశారు. కడుపులో బంగారం పెట్టుకుని ప్రయాణించిన నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లను కేజీహెచ్‌కు తరలించారు.. ఆపరేషన్‌ చేసి బంగారాన్ని బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. 

 

20:40 - October 28, 2018

గుంటూరు : బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇంటి పైన బీజేపీ జెండా ఇంట్లో వైసీపీ జెండా పెట్టుకుని కన్నా లక్ష్మినారాయణ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. ఈమేరకు అమరావతిలో బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోనే కన్నాకు మించిన ధనవంతులు లేరని, రోజుకో కబ్జా.. రోజుకో దందా చేసే కన్నా ఇంట్లో దొంగ సొత్తు కోట్లలో ఉందని ఆరోపించారు. 

చంద్రబాబు కోసం చావడానికి తాను సిద్ధమని, కన్నా చేసే ఆరోపణల్లో ఏ ఒక్కటి రుజువు చేసిన ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు. కన్నాకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

20:27 - October 28, 2018

హైదరాబాద్: నిజాంపేటలో ''హమారా హైదరాబాద్'' కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో చోటు చేసుకున్న ఘటనలను కేటీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ఆయన ఎండగట్టారు. అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు ఇవ్వాలని అనుకున్నారని, కానీ ప్రధాని మోడీ కారణంగా ఆగిపోవాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. వాస్తవానికి వేదికపై నుంచి అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 100 కోట్లు ప్రకటించాలని కేసీఆర్ అనుకున్నారట. కానీ సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చెంబు నీళ్లు, తట్టెడు మట్టి ఇవ్వడంతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారట. ప్రధాని మోడీ అహం దెబ్బతింటుందనే భావనతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని కేటీఆర్ వివరించారు.

Modi Stopped KCR's Package for Amaravathi?సాధారణంగా ప్రొటోకాల్ ప్రకారం అందరూ ప్రసంగించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తారని... పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్‌కు ముందు మాట్లాడే అవకాశం ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ గారికి ఎందుకో అనుమానం వచ్చిందని... ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచి... అమరావతి నిర్మాణానికి ప్రధాని ఏం ప్రకటించబోతున్నారని అడిగారని తెలిపారు. ఆయనకంటే ముందు తాను మాట్లాడాలని... ప్రధాని ఏం ప్రకటించబోతున్నారో చెబితే, తాను ప్రకటించాల్సింది ప్రకటిస్తానని అడిగారని చెప్పారు. దానికి సమాధానంగా... ఢిల్లీ నుంచి తట్టెడు మట్టి, చెంబుడు నీళ్లు తెచ్చామని... ఇంకేమీ లేదని ప్రిస్సిపల్ సెక్రటరీ సమాధానమిచ్చారట. దీంతో, కేసీఆర్ ఉలిక్కిపడ్డారని.. తాను రూ. 100 కోట్లు ప్రకటించి, ప్రధాని ఏమీ ప్రకటించకపోతే... ఆయన అహం దెబ్బతింటుందని కేసీఆర్ భావించారని... లేనిపోని పంచాయతీలు వచ్చే ప్రమాదం ఉందనే భావనతో కేసీఆర్ వెనకడుగు వేశారని కేటీఆర్ తెలిపారు. దీంతో, ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు మాత్రమే చెప్పాల్సి వచ్చిందట. ఆ తర్వాత ఎంతో ఆవేదనతో కేసీఆర్ హైదరాబాద్‌కు వచ్చారని కేటీఆర్ తెలిపారు. 

Andhra Pradesh CM N. Chandrababu Naidu speaks to PM Narendra Modi after the foundation was laid for Amaravati on Thursday. Telengana CM K. Chandrasekhar Rao and Japanese Minister Yosuke Takegi are also seen.— Photo: K.R. Deepakఅమరావతికి ప్రధాని ఏదో ప్రకటిస్తారని అనుకుంటే... ఆయన ఏమీ ప్రకటించకపోవడం ఆశ్చర్యాన్ని కలగజేసిందని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలది ఒకటే వైఖరని... ఈ పార్టీల బాస్‌లు ఢిల్లీలో ఉంటారని... ముఖ్యమంత్రులన్నా వారికి చిన్న చూపేనని.. ప్రజల ఆంకాంక్షలను పట్టించుకోరని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇరు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశాయని కేటీఆర్ ఆరోపించారు.

Vijayawada , Andhra Pradesh : 22/10/2015: Prime Minister Narendra Modi presenting soil from Parliament and water from River Yamuna to Chief Minister N.Chndrababu Naidu after laying the foundation for Amaravati the new capital of Andhra Pradesh on October 22, 2015. Photo: K.R. Deepak -రాజధాని శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన వేదికపైకి కేసీఆర్ వెళ్లగానే అక్కడున్న ఏపీ ప్రజలంతా హర్షధ్వానాలు చేశారని కేటీఆర్ చెప్పారు. ప్రజల్లో విభేదాలు లేవు, తెలుగువారంతా ఒకటే అనేదే ప్రజల భావన అనే విషయం తమకు అప్పుడే అర్థమయిందని తెలిపారు. ప్రజల్లో పొరపొచ్చాలు లేవని... రాజకీయ పార్టీల్లోనే విభేదాలు ఉంటాయని... టీఆర్ఎస్, టీడీపీ మధ్య.. కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజకీయపరమైన పంచాయతీలు ఉంటాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

 
20:13 - October 28, 2018

నెల్లూరు : జిల్లాలోని రంగనాయులపేటలో విషాదం నెలకొంది. భర్త మృతి చెందాడని మనస్థాపంతో భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాలిక మృతి చెందింది. వివాహిత, మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

రంగనాయులపేటలోని గొల్లల వీధిలో కొండల్ రావు, సుజాత దంపతులు. తమ ఇద్దరు పిల్లలు విష్ణువర్ధిని, దివ్యలతో కలిసి గత కొన్నేళ నుంచి గొల్లల వీధిలో నివాసముంటున్నారు. కొండల్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. రెండు రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం అతను హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో కొండల్ రావు హార్ట్ అటాక్ గురై మృతి చెందారు. 

అయితే హైదరాబాద్‌కు వెళ్లిన తన భర్త తిరిగి వస్తాడని భార్య, తన తండ్రి తిరిగి వస్తాడని పిల్లలు ఎదురు చూస్తున్నారు. అదే ప్రాంతంలో ఉన్న ఒక లాండ్రీ షాప్‌కు కొండల్ రావు చనిపోయాడని ఈరోజు సమాచారం వచ్చింది. కొండల్ రావు మృతి చెందాడన్న సమాచారాన్ని భార్య సుజాత, ఆయన పిల్లలకు అందజేశారు. దీంతో ఇక తండ్రి లేడని పిల్లలు, భర్త లేడని భార్య తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈక్రమంలోనే తమ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని భార్య, పిల్లలు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. విష్ణువర్దిని అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. 

వారి ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కాగా అప్పటికే విష్ణువర్దిని అనే పాప మృతి చెందింది. సుజాత, దివ్యలను రక్షించి వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈఘటనతో రంగనాయులపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు.
 

19:48 - October 28, 2018

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి ఘటన.. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య చిచ్చు రాజేసింది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దాడి చేయించింది టీడీపీనే అని వైసీపీ నాయకులు.. సానుభూతి కోసం జగనే చేయించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరావు జగన్‌కు వీరాభిమాని అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. 

కాగా, సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు కొత్త పోస్టర్ హల్‌చల్ చేస్తోంది. శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనంటూ.. మెంబర్ షిప్ కార్డ్ ఒకటి నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. దీనిపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇదంతా వైసీసీ ట్రేడ్ మార్క్ మార్పింగ్ ట్రిక్‌గా అభివర్ణించారు. అంకాలు నంబూరి అనే వ్యక్తి కార్డుకు సంబంధించిన నంబర్‌ను శ్రీనివాసరావుదిగా వైసీపీ నేతలు మార్చారని.. అవన్నీ ఫోటోషాప్ జిమ్మిక్కులని వెల్లడించారు. ‘మీరు మారరు.. మీ నాయకుడు మారరు’ అంటూ లోకేశ్ మండిపడ్డారు.

ట్విటర్‌లో వరుస ట్వీట్లతో వైసీపీపై లోకేశ్ ధ్వజమెత్తారు. ‘‘వైసీపీ ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్. దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ మోడీ రెడ్డి. తన అభిమానిని టీడీపీ కార్యకర్తగా చిత్రిస్తూ చీప్ ఫోటో షాప్ జిమ్మిక్కులు. కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గంలోనిది అంటూ ఫేక్ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేశారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ మోడీ రెడ్డి తప్ప మరొకరు ఉండరు’’ అని లోకేశ్ తన ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

19:46 - October 28, 2018

హైదరాబాద్ : గంజాయి దందాలో కొత్త కోణం వెలుగుచూసింది. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సెన్సేషన్‌ రైజ్‌ ఈవెంట్‌ను స్మగ్లర్లు టార్గెట్ చేసుకున్నారు. ఈవెంట్‌కు వచ్చే యూత్‌కు గంజాయి లిక్విడ్‌ను అమ్మేందుకు ప్రయత్నించారు. 10 ఎం.ఎల్‌ లిక్విడ్‌ను రూ. వెయ్యి నుంచి రూ.2వేలకు స్మగ్లర్లు బేరం పెట్టారు. అంబర్‌పేటలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్‌ వేదసాయి ఇచ్చిన సమాచారంతో దాడులు చేసిన ఎక్సైజ్‌ పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేసి.. భారీగా గంజాయి లిక్విడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

 

19:13 - October 28, 2018

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందనే విషయం మహాకూటమికి కూడా తెలుసన్నారాయన. టీఆర్ఎస్‌కు మెజార్టీ సీట్లు తగ్గించాలని విపక్షాలు చూస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజాంపేటలో 'హమారా హైదరాబాద్' కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నాలుగేళ్లలో ఉన్నంత భద్రంగా గత 67ఏళ్లలో హైదరాబాద్ ఎన్నడూ లేదని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ప్రజలు, మహిళల్లో విశ్వాసాన్ని నింపిన ఘనత మాదే అన్నారు. టీఆర్ఎస్ హయాంలో నగరంలో భద్రత కట్టుదిట్టం చేశామని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో మహిళలకు భద్రత పెరిగిందని తెలిపారు. సుమారు 5లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కర్ఫ్యూరహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామన్నారు. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిందని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 47శాతం ఓట్లు లభించాయని చెప్పారు. నగర శివార్లకు సైతం మంచినీరు అందించిన ఘనత, 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఘనత తమ ప్రభత్వానిదే అని కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పడటం వల్లే తెలంగాణ యాసకు గౌరవం దక్కిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల్లో టీఆర్‌ఎస్ బలమైన విశ్వాసాన్ని నింపిందని.. సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ వారికి ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు దక్కిందని చెప్పారు. ఈ నాలుగేళ్లలో చిన్న గొడవ జరగకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన సాగిందని కేటీఆర్ గుర్తు చేశారు. గత పాలకుల హయాంలో నీళ్ల కోసం జలమండలి ముందు ఆందోళనలు జరిగేవని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు. నగరంలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

18:24 - October 28, 2018

ఢిల్లీ: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వమే రక్షణ కల్పించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు కోరారు. జగన్‌పై దాడి ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం జరిపే విచారణపై తమకు నమ్మకం లేదని, కేంద్రం తక్షణమే థర్డ్ పార్టీ సంస్థతో విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు. సిట్ లేదా కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలన్నారు. జగన్‌పై దాడి ఘటనపై రాష్ట్రపతి, హోంమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన హత్యాప్రయత్నంపై స్వతంత్ర దర్యాఫ్తు జరిపించాలని రాష్ట్రపతి, హోంమంత్రిని తాము కోరతామన్నారు. ఓటమి భయంతో జగన్‌పై చంద్రబాబే దాడి చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే సీఎం కనీసం ఖండించలేదని మండిపడ్డారు. 

జగన్‌పై దాడి ముమ్మాటికీ హత్యాయత్నమే అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అయితే దీనిని ప్రభుత్వం చాలా చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తోందని, సానుభూతి కోసం వైసీపీ కార్యకర్తే దాడి చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రచారం కోసం జగనే చేయించుకున్నారని సీఎం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నిందితుడు శ్రీనివాసరావు, క్యాంటీన్ యజమాని ఇద్దరూ టీడీపీకి చెందిన వారే అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం, డీజీపీ ప్రోద్బలంతోనే హత్యాయత్నం జరిగిందన్నారు. ఆపరేషన్ గరుడ సృష్టికర్త చంద్రబాబే అన్న వైవీ సుబ్బారెడ్డి... ఆపరేషన్ గరుడపైనా విచారణ జరిపించాలని హోంమంత్రిని కోరతామన్నారు. తిత్లీ తుఫాను సహాయక చర్యల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు విమర్శించారు. ఢిల్లీ వచ్చి కూడా సీఎం అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను అంతమొందిస్తే వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలవొచ్చని టీడీపీ కుట్ర చేస్తోందని మరో వైసీపీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. శ్రీనివాసరావును ప్రేరేపించి జగన్ హత్యకు కుట్ర చేశారన్నారు. చంద్రబాబుకి దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. 

జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను ధర్డ్ పార్టీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ వైసీపీకి చెందిన సీనియర్ నేతలు రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో పలువురు మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్యనాయకులు ఆదివారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. హత్యాయత్నం ఘటనపై విచారణకు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని.. ఏపీకి చెందిన పోలీసు అధికారులతో కాకుండా థర్డ్‌ పార్టీతో నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరుతున్నారు.

జగన్‌ని అంతమొందించటానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు ఆరోపించారు. అధికార పార్టీ అండతోనే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందన్నారు. హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించాలని చంద్రబాబు చూస్తున్నారని, డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసమే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని వారు విమర్శించారు.

17:58 - October 28, 2018

హైదరాబాద్ : మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ఏపీ సీఎం చంద్రబాబుతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. ఉత్తమ్, రమణ, సీపీఐ నేతలు నిన్న చంద్రబాబుతో రెండు గంటలపాటు చర్చించారు. కాంగ్రెస్ 91 స్థానాల్లో, టీడీపీ 15 స్థానాల్లో, తెలంగాణ జనసమితి 8 స్థానాల్లో, సీపీఐ 5 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ శనివారం రాత్రి ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో భేటి అయి సీట్ల విషయమై చర్చించారు. ఇవాళ సాయంత్రం మరోసారి హైదరాబాద్ లో భేటీ కానున్న కూటమి నేతలు రెండు రోజుల్లో మహాకూటమి తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 

టీడీపీ సీట్ల విషయంలో తుది నివేదికను సిద్ధం చేయాలని టీటీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. సీట్లు సర్దుబాటు చేసుకుంటే ఆమోదిస్తానని చంద్రబాబు అన్నారు. ప్రాథమికంగా టీడీపీ 15 సీట్లలో పోటీ చేసేందుకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు కోరుతోంది. విజయం సాధిస్తామన్న స్థానాలనే ఎంచుకోవాలని చంద్రబాబు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్ బీ నగర్, ఉప్పల్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను కోరుతున్నారు. 
ఖమ్మం జిల్లాలో ఖమ్మం, అశ్వారావుపేట, పాలేరు నియోజకవర్గాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం, దేవరకద్ర, వనపర్తి, మక్తల్ నాలుగు స్థానాల్లో మూడు స్థానాలను ఖచ్చితంగా కోవాలని కోరుతున్నాయి. 

తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్‌లో మల్కాజ్ గిరి, నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ స్థానాన్ని కోరుతోంది. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు స్థానాలను తొలి జాబితాలో ప్రకటించే విధంగా ప్రయత్నిస్తున్నారు. 

సీపీఐ ఐదు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నా.. రెండు లేదా మూడు స్థానాల్లో తొలి జాబితాలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో 40 నుంచి 45 స్థానాలను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధం చేస్తున్నట్తు తెలుస్తోంది. మొత్తంగా మహాకూటమి తరపున తొలి జాబితాలో 60 స్థానాలు ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

17:47 - October 28, 2018

రాఘవ్, కరోణ్య కత్రీన్ జంటగా, నంది అవార్డు గ్రహీత, అనిత పాట(వీడియో ఫేమ్) కోటేంద్ర దర్శకత్వంలో, కేఎండీ రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం.. బంగారి బాలరాజు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్యల కథాంశంతో రూపొందిన బంగారి బాలరాజు ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ : 


బాలరాజు (రాఘవ్) సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంటాడు. అందరితో సరదాగా ఉంటాడు. హోళి నాడు స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడుతుంటే... ముఖంనిండా రంగులతో ఉన్న ఒక అమ్మాయి వచ్చి, బాలరాజుకి ముద్దు పెడుతుంది. ఆ టైమ్‌లో, ఆమె కళ్లను చూసి ప్రేమలో పడతాడు బాలరాజు. అప్పటినుండి ఆ అమ్మాయి ఎవరు అని వెతుకుతుండగా.. అదే ఊర్లో ఉండే ఫ్యాక్షనిస్టు జగ్గారెడ్డి కూతురు, బంగారి(కరోణ్య కత్రిన్), బాలరాజు కనిపించినప్పుడల్లా ఏడిపిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత, బంగారి ఎవరో కాదు, తను ప్రేమించిన అమ్మాయే అని తెలిసి ఆనంద పడేలోపే, విషయం బంగారి తండ్రి జగ్గారెడ్డికి తెలిసిపోతుంది. పరువు కోసం హత్యలు చేసే జగ్గారెడ్డి.. బంగారి, బాలరాజులను చంపడానికి బయల్దేరుతాడు. జగ్గారెడ్డి నుండి  బంగారి, బాలరాజు బ్రతికి బయటపడ్డారా, తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు? అనేది అసలు కథ.

నటీనటులు & సాంకేతిక నిపుణులు :


హీరో,హీరోయిన్ ఇద్దరూ ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. ఫస్ట్ సినిమా అయినా పర్లేదు అనుకునేలా పెర్ఫార్మ్ చేసారు. అయితే, నటన పరంగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. కరోణ్య హుషారుగా నటించింది.గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. రాఘవ్ డైలాగ్ మాడ్యులేషన్ ఓకే కానీ, హావభావాలు సరిగా పండించలేక పోయాడు. హీరో తల్లిగా మీనా కుమారి, ఫ్రెండ్స్‌గా జబర్దస్త్ ఆర్పీ, బాబి, పోలీస్ పాత్రలో శ్రవణ్ కనిపించారు.
ఆర్ఆర్, సాంగ్స్ ఓ మోస్తరుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇతర సాంకేతిక విభాగాల పని తీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
ఈ కథ కొత్తగా అనిపించిక పోయినా, పరువు హత్యలు అనే కరెంట్ పాయింట్‌తో, ఆ సంఘటనలను గుర్తు చేస్తూ, సందేశాత్మంగా ఉంది. స్క్రీన్ ప్లేలో కొంచెం కామెడీ యాడ్ చేస్తే బావుండేది. స్కిప్టుతో పాటు, మేకింగ్ విషయంలోనూ దర్శకుడు ఇంకొంత శ్రద్ధ పెడితే సినిమా ఇంకా బాగుండేదనిపిస్తుంది. అక్కడక్కడా లాజిక్ లేని కొన్నిసీన్లు తప్పిస్తే, ఈ సినిమా ద్వారా ఒక మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యడం అన్నది.. అభినందించాల్సిన విషయం.

 

 

తారాగణం :  రాఘవ్, కరోణ్య కత్రీన్, మీనాకుమారి, దూకుడు శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు, కిరాక్ ఆర్.పి.

కెమెరా     :   జి.ఎల్. బాబు 

సంగీతం   :  చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు 

నిర్మాతలు:  కేఎండీ రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి 

కథ, స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం :  కోటేంద్ర దుద్యాల

రేటింగ్  :  2/5

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

17:14 - October 28, 2018
హైదరాబాద్: తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో బీజేవైఎం మహా యువభేరి
బహిరంగ సభ జరిగింది. అమిత్ షా, తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన అమిత్ షా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మజ్లిస్‌కు భయపడి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని విస్మరించందన్నారు. అమరవీరులను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, నిజాం రజాకార్లను పరుగులు పెట్టించిన వీరభూమి హైదరాబాద్ అని.. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించిన నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ అని షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మహాకూటమిపైనా షా మండిపడ్డారు. కాంగ్రెస్ కూటమికి నాయకులు లేరని, ఇలాంటి కూటమిని ప్రజలు నమ్మరని చెప్పారు. బీజేపీ యువమోర్చ శక్తి వంచన చలేకుండా పని చేయాలని, బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీజేపీ విజయానికి కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
 
కాంగ్రెస్ పార్టీ నాలుగు తరాల్లో చేయలేదని.. నాలుగున్నరేళ్లలో మేము చేసి చూపించామని షా అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశానికి చేసిందేమీ లేదని షా విమర్శించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చి వెళ్లేవారని.. కానీ మోఢీ హయాంలో మన సైనికులు పాకిస్తాన్ వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను హతమార్చారని షా చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఓటు బ్యాంకు మీద శ్రద్ద.. మాకు దేశంపై శ్రద్ద అని అన్నారు. బీజేపీని ప్రశ్నించే అర్హత రాహుల్‌కు లేదన్నారాయన.. సైన్యానికి ఏదైనా జరిగితే ఇప్పటివరకు ఇజ్రాయల్, అమెరికానే ప్రతీకారం తీర్చుకునేవని.. మోడీ హయాంలో ఆ రెండు దేశాల సరసన మన భారత్ కూడా చేరిందని షా వెల్లడించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇవ్వలేదన్న షా.. బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే జవాన్ల కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేశామన్నారు. ఇక్కడికి వచ్చిన యువతను చూస్తుంటే మోడీ మళ్లీ ప్రధాని అవుతారని అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు అమిత్ షా.
 
2019లో కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం వస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కేసీఆర్ అని, యువతకు కేసీఆర్ అన్యాయం చేశారని లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామన్న ఆయన, బీజేపీ అధికారంలోకి వస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ  నిర్వహిస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. యువత కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.
17:10 - October 28, 2018

సిద్దిపేట : మళ్లీ అధికారంలోకి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని టీఆర్ఎస్ నేత మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ లో నిర్వహించిన పద్మశాలి ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుందని  అనుకుంటున్నారని..నూటికి నూరు శాతం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం గజ్వేల్ ప్రజలకు వచ్చిందని చెప్పారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేనేత కార్మికుల బతుకులు మారాయన్నారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ప్రేమతో మంచి ఆశీస్సులు అందించాలని కోరారు. తాము తప్పకుండా ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ కోరుకుంటున్నది చీకటి తెలంగాణ అని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఢిల్లీకి, టీడీపీకి ఓటేస్తే అమరావతికి తెలంగాణ పోతుందన్నారు. 

16:28 - October 28, 2018

మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు మరుపురాని ఎన్నో విజయాలను ఒంటి చేత్తో అందించిన ఘనత ఈ జార్ఖండ్ డైనమైట్‌ది. కెప్టెన్‌గా టీమిండియాను నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చిన క్రెడిట్ ధోనిదే. ఎంత ఒత్తిడి ఉన్నా, టార్గెట్ ఎంత పెద్దది అయినా.. ధోని బరిలో ఉంటే చాలు..మ్యాచ్ మనదే.. అలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో ధోని నుంచి మనం చూశాము. కానీ ఈ మధ్య కాలంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. సరిగ్గా బ్యాటింగ్ చేయలేక విమర్శల పాలవుతున్నాడు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ధోని బ్యాటింగ్ తడబాటు వరుసగా మూడో వన్డేలోనూ కొనసాగింది. పుణె వేదికగా శనివారం రాత్రి జరిగిన మూడో వన్డేలో 11 బంతులు ఎదుర్కొన్న ధోని చేసింది 7 పరుగులే. కనీసం ఒక్క బౌండరీ కూడా లేదు. ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. ఒక ఎండ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నా.. ధోని మాత్రం గేర్ మార్చలేకపోయాడు. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన ధోనీ.. తాజా సిరీస్‌‌లో పేలవ ప్రదర్శనతో వన్డే కెరీర్‌ని కూడా ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. 

ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ గురించి చర్చ మొదలైంది. ధోని ఇక తన కెరీర్‌కు వీడ్కోలు పలకాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  ఈ సమయంలోనే ధోని రిటైర్మెంట్‌ ప్రకటించడం గౌరవప్రదంగా ఉంటుందని సూచిస్తున్నారు. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కీపింగ్‌లో అదరగొట్టిన ధోని.. ఓ అద్బుత క్యాచ్‌తో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అయితే ఇదే విధంగా బ్యాటింగ్‌లోనూ రాణిస్తాడనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో వారు ఇక ధోని రిటైర్మెంట్‌ తీసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మ్యాచ్‌కు ముందే ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ధోనిని టీ20ల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎమ్మెస్కేపై భగ్గుమన్న అభిమానులు.. బ్యాటింగ్‌లో ధోని తాజా ప్రదర్శన చూసి డీలా పడ్డారు. 

ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఒంటరిపోరాటం చేసిన కోహ్లికి ఏ ఒక్కరు అండగా నిలవలేదు. ఇది అభిమానులు తీవ్ర ఆగ్రహానికి తెప్పించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేసారు. ‘ప్రపంచకప్‌ ముందే భారత మిడిలార్డర్‌ గందరగోళంగా ఉంది. ప్రతీసారి కోహ్లి ఒక్కడే ఆడలేడు. ధోని తప్పుకుని అతని స్థానంలో ఓ మంచి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వాలి’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. త్వరగా ధోని రిటైర్మెంట్‌ తీసుకోవాలి లేకుంటే అన్ని ఓడిపోవాల్సి వస్తుందని మరొకరు కామెంట్‌ చేశారు.

మొత్తంగా ధోని రిటైర్మెంట్ గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి జార్ఖండ్ డైనమైట్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెబుతాడా? లేక మరోసారి విఫలమై రిటైర్మెంట్ వైపు మొగ్గుచూపుతాడో చూడాలి.

16:27 - October 28, 2018

హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీలలో కూడా తమ సత్తా చాటాలని ఇతర వుడ్‌లకు చెందని హీరోలు అనుకుంటుంటారు. తాము నటించే చిత్రాలను ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్..ఇలా పలు వుడ్‌లకు చెందని హీరోల చిత్రాలు టాలీవుడ్‌లో విడుదలై మంచి విజయాలను కూడా నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్ హీరో ‘విజయ్’ చిత్రం కూడా తెలుగులో రిలీజ్ అవుతోంది. 
Image result for SARKAR murugadossవిజయ్’ హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ‘సర్కార్’. ఈ సినిమాలో ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే రాదా రవి , వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ దుమ్ము రేపుతోంది. చిత్ర కథ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగునున్న సంగతి తెలిసిందే. 
Image result for SARKAR murugadossఇదిలా ఉంచితే మణిరత్నం ‘నవాబ్’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన అశోక్ వల్లభనేనినే, ‘సర్కార్’ చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  ఈ సినిమాను ఏకంగా సుమారు 750 థియేటర్లలో విడుదల చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 6వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మరి తెలుగులో కూడా ‘సర్కార్’ సత్తా చాటుతాడా ? లేదా ? అనేది చూడాలి. 

16:07 - October 28, 2018

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రాష్ట్రంలో బీసీ కులాల ఆధ్వర్యంలో అలయ్-బలయ్ నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు దీనికి హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో బీసీల ఓట్లు కీలకంగా మారబోతున్నాయని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. రాష్ట్రంలోని బీసీలందరూ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్ బీసీల చేతుల్లోనే ఉందని చెప్పారు. టీఆర్ఎస్ బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వడం తప్పా చేసిందేమీ లేదని ఎల్.రమణ విమర్శించారు. టీఆర్ఎస్ మళ్లీ బీసీలను మోసం చేసేందుకు చూస్తుందని ఆయన ఆరోపించారు. బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వాపోయారు. అన్ని పార్టీలు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు మారిపోతాయని, బీసీలే సీఎం అవుతారని వీహెచ్ జోస్యం చెప్పారు.

15:47 - October 28, 2018

విశాఖ : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ ను విశాఖ ఎయిర్ పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. జగన్ పై దాడి కేసులో శ్రీనివాస్ ను పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ విచారణకు  సహకరిస్తున్నారని పోలీసులు తెలిపారు. నవంబర్ 2 వరకు  విశాఖ ఎయిర్ పోర్టు పీఎస్ లో విచారణ జరుపుతామన్నారు. 6 రోజులపాటు విచారణ చేస్తామని చెప్పారు. శ్రీనివాస్ కు సంబంధించిన మరికొంతమందిని కూడా విచారిస్తామని విశాఖ పోలీసుల చెప్పారు. కాగా తన గోడును రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసమే దాడి చేశానని శ్రీనివాస్ తెలిపినట్లు తెలుస్తోంది.

దాడిపై జగన్ స్టేట్ మెంట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. నవంబర్ 3 నుంచి జగన్ ప్రజాసంకల్ప యాత్ర పున:ప్రారంభం కానుండటంతో మరోసారి జగన్ స్టేట్ మెంట్ కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.  

15:30 - October 28, 2018

ఈ దసరాకి పందెంకోడి2తో, తెలుగుతో పాటు, తమిళ్‌లోనూ హిట్ కొట్టాడు విశాల్.. త్వరలో పందెంకోడి3, అభిమన్యుడు2, డిటెక్టివ్2 వంటి సీక్వెల్స్  చేసే ప్లాన్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వూలో విశాల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని పొగిడాడు. విశాల్ ప్రస్తుతం తమిళ్‌లో, ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. తమిళ్‌లో అయోగి అనే టైటిల్‌‌తో రూపొందుతుంది. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా అనడగితే, విశాల్ తన స్టైల్‌లో సమాధానమిచ్చాడు. అయోగిని తెలుగులో విడుదల చేస్తే, అందరూ, నన్ను తారక్‌తో పోల్చిచూస్తారు. నేను తారక్‌లా చెయ్యలేదంటారు. అందుకే భయం, ఇక్కడ రిలీజ్ చెయ్యను, పైగా, తారక్‌లా నేను నటించలేను. అతను మంచి నటుడు.. సూపర్బ్ డాన్సర్.. తను ఒక సినిమా చేసాడంటే, అతని నటన తాలూకు ఇంపాక్ట్ 12 ఏళ్ళ పాటు ఉంటుంది. అంత బాగా యాక్ట్ చేస్తాడు అంటూ ..ఎన్టీఆర్ పొగిడాడు విశాల్.. 

 

15:28 - October 28, 2018

హైదరాబాద్: ''ప్రత్యేక తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఉండవని భయపెట్టారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో శివసేన లాంటి వాతావరణం ఏర్పడుతుందని పుకార్లు సృష్టించారు. కానీ, హైదరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో నగరంలో ఒక్క గంట కూడా కర్ఫ్యూ లేదు'' అని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. 

ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పలువురు జైన్ సమాజ్ నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. వారిని కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించామని కేటీఆర్ చెప్పారు. అభివృద్ధిలో ఎక్కడా రాజీపడకుండా పని చేస్తన్నామన్నారు. మెట్రోను నగరంలో మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. రాజకీయ సుస్థిరతకు మారుపేరుగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీల గుర్తులకు అనుగుణంగా జనాలకు చెయ్యి ఇచ్చి వారి చెవిలో పూలు పెట్టాయని ఎద్దేవా చేశారు. తమ హైకమాండ్ హైదరాబాద్‌లో ఉంటే.. మహాకూటమి హైకమాండ్‌ ఢిల్లీ, విజయవాడలో ఉందని విమర్శించారు. మాకు బాసులు ఢిల్లీ, విజయవాడలలో లేరని, హైదరాబాద్ లోనే ఉన్నారని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్‌ వస్తే సీల్డ్ కవర్ సీఎం.. టీఆర్‌ఎస్‌ వస్తే కేసీఆరే సీఎం’ అని కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ఎంతమంది సీఎంలను మార్చిందో చూశామన్నారు. 2009 నుంచి 2013 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మారారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇంటి అద్దెలు కడతామని బీజేపీ హామీ ఇవ్వడం హాస్యాస్పదమని కేటీఆర్ అన్నారు. 

15:26 - October 28, 2018

కడప : కర్నూలు, కడప జిల్లాలను స్వైన్ ఫ్లూ వణికిస్తంది. కడపలో స్వైన్ ఫ్లూ జ్వరంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కర్నూలు జిల్లాలో 8 నెలల శిశువుకు స్వైన్ ఫ్లూ సోకింది. ఇప్పటివరకు మొత్తం స్వైన్ ఫ్లూ కేసులు 29కి చేరుకోగా 13 మంది మృత్యువాత పడ్డారు. క్రమంగా స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో ప్రజానీకం భయాందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన జిల్లా వైద్య అధికారులు స్వైన్ ఫ్లూపై గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

 

14:33 - October 28, 2018

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా.. చందూమొండేటి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం, సవ్యసాచి.. మొన్న రిలీజ్ చేసిన ధియేట్రికల్ ట్రైలర్‌‌కీ, సాంగ్స్‌కీ, వెరీగుడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సవ్యసాచి చిత్రం ఒక తమిళ సినిమా కాపీ అనే వార్తలు, తమిళ సినిమా అభిమానుల మధ్య వినబడుతున్నాయి. గతేడాది కోలీవుడ్‌లో రిలీజ్ అయిన పీచాంకై అనే సినిమాకీ, సవ్యసాచికి దగ్గర పోలికలున్నాయట. ఆర్ఎస్ కార్తీక్ హీరోగా నటించిన పీచాంకైలో, అంజలి రావు కథానాయిక. ఆ మూవీలో హీరో..అలైన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతుంటాడు. అతని ఎడమ చేయి అతని ఆధీనంలో ఉండదు.. సవ్యసాచిలో చైతన్యది కూడా ఎడమ చేయి సమస్యే కావడంతో, సవ్యసాచి కథ, పీచాంకై సిమిమాకి కాపీ అంటున్నారు. ఈ విషయంపై సవ్యసాచి టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.  

13:56 - October 28, 2018

శ్యామ్ జే చైతన్య దర్శకత్వంలో, చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై, రామకృష్ణా రెడ్డి సమర్పణలో, శేఖర్ రెడ్డి జీ.వీ.ఎన్. నిర్మిస్తున్న మూవీ.. ఏడు చేపల కథ.. మొన్న, ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. అడల్ట్ కంటెంట్ సినిమా కావడంతో, మౌత్‌టాక్‌తో, ఏడు చేపల కథ టీజర్‌కి రెస్పాన్స్ ఓ‌రేంజ్‌లో వస్తుంది. అభిషేక్, బిగ్‌బాస్ భానుశ్రీ, అయేషా సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్‌లో, అమ్మాయిలు లిప్‌‌లాక్‌లివ్వడం, గోడలు దూకడాలు, అబ్బాయి మీదకెక్కి రొమాన్స్ చెయ్యడం చూసి, నోరెళ్ళ బెట్టడం వీక్షకుల వంతైంది. అందుకే, అప్‌లోడ్ చేసిన ఒక రోజుకే.. పది లక్షలకు పైగా.. అంటే, వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి.. తొమ్మిది వేలకు పైగా లైకులు వచ్చాయి.. టీజర్ చూసి, ఇందులో రొమాన్స్.. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలను మించిపోయిందనీ, ఏడు చేపల కథ అంటే, ఇదేదో ఆరుగురు పతివ్రతలు టైప్ సినిమానేమోననీ  డిస్కషన్‌‌లు జరుగుతున్నాయి.. ప్రస్తుతం ఏడు చేపల కథ టీజర్ యూట్యూబ్‌లో వ్యూస్ వరద పారిస్తుంది..     

13:35 - October 28, 2018

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పలు పార్టీలు ప్రయత్నాలు ఆరంభించాయి. డిసెంబర్ నెలలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ ముందుగానే 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో దూసుకపో్తోంది. అభ్యర్థుల ప్రచారం...ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలపై ఈసీ నజర్ పెట్టింది. అందులో భాగంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా నగదు బయటపడుతోంది. 
తాజాగా ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల లోడ్‌తో వెళుతున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం చేపట్టే చీరల పంపిణీకి ఈసీ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. దీనితో బతుకమ్మ చీరలను ప్రభుత్వం నిలిపివేసింది. కానీ ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టగా బతుకమ్మ చీరలతో వెళుతున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ లో చీరలను లోడ్ చేసినట్లు డ్రైవర్ పేర్కొనట్లు సమాచారం. వీటిని కొత్తగూడెం పట్టణానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. లారీలోని చీరలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. 

13:08 - October 28, 2018

కాకినాడ: మాంసం ఎగుమతుల వ్యాపారి మొయిన్ ఖురేషి కేసు విషయంలో సీబీఐ అధికారులకు లంచాలు ఇచ్చినా, ఇంకా వేధిస్తున్నారని కేసు పెట్టిన సానా సతీష్ బాబుకు చెందిన  గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం సతీష్ బాబు అతిధి గృహంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు. సీబీఐలో లంచాల భాగోతం బయటపడటానికి సతీష్ బాబు కంప్లైంటే కారణంగా భావిస్తున్నసమయంలో ఈసోదాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. 

13:08 - October 28, 2018

బుల్లితెరపై హుషారైన మాటలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే యాంకర్ రవిపై, హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సందీప్ అనే డిస్ట్రిబ్యూటర్, యాంకర్ రవికి డబ్బు బాకీ పడడంతో, రవి అతనికి ఫోన్ చేసి బెదిరించాడనీ, 20 మందితో తనపై దాడికి పాల్పడ్డాడనీ, ఇనుప రాడ్లతో తనను చంపుతానని బెదిరించాడనీ సందీప్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ కోసం రవిని స్టేషన్‌కి పిలిపించగా, సమస్యని పరిష్కరించుకుంటామనీ, సందీప్ ఆరోపిస్తున్నట్టు 20 మందితో తనపై దాడికి పాల్పడలేదనీ యాంకర్ రవి అన్నాడు.    

12:35 - October 28, 2018

కరీంనగర్ : హీరోయిన్ హాన్సిక కరీంనగర్‌లో సందడి చేసింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 250వ షోరూం ను ప్రారంభించిన హన్సిక సంతోషం వ్యక్తం చేసింది. 25ఏళ్ల ప్రస్థానంలో 250వ షోరూంను సంస్థ ఏర్పాటు చేయడం, ప్రారంభోత్సవానికి కరీంనగర్ రావడం ఆనందంగా ఉందన్నారు హన్సిక. తొలి కస్టమర్‌కు హన్సిక చేతుల మీదుగా ఆభరణాలు అందించారు షో రూం యాజమాన్యం..ఈ సందర్భంగా పెద్ద ఎత్తున స్థానికులు, అభిమానులు తరలివచ్చారు..

 

11:59 - October 28, 2018

విజయవాడ : కృష్ణా జిల్లాను స్వైన్‌ ఫ్లూ వణిస్తోంది. అనుమానిత లక్షణాలతో నలుగురు మృతి చెందగా.. ప్రభుత్వాసుపత్రిలో పలువురు చికిత్స పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో... అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలతోపాటు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. 
మరోవైపు శ్రీకాకుళం జిల్లాను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. ఇప్పటికే స్వైన్‌ఫ్లూతో విశాఖ ఆస్పత్రిలో నలుగురు చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరికి వ్యాధి లక్షణాలు బయటపడడం కలకలం రేపుతోంది. రద్దీగా ఉండే నగరాలకు వెళ్లి తిరిగి జిల్లాకు వస్తున్నవారికే ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోందని వైద్యులు చెబుతుండటం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. వ్యాధి లక్షణాలు వెలుగు చూసిన బాధితులిద్దరూ మహిళలే కావడంతో వ్యాధి కారకాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు శ్రీకాకుళం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన వారు.. కాగా మరొకరు పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన వారు. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. 

11:54 - October 28, 2018

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను ధర్డ్ పార్టీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రిని కలవనున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో పలువురు మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్యనాయకులు ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈమధ్యాహ్నం వారు కేంద్ర హోం మంత్రిరాజ్ నాధ్ సింగ్ ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. విశాఖ విమానాశ్రయంలో 3 రోజుల క్రితం జగన్ పై హత్యాయత్నం జరిగిన ఘటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేసి వివరాలుతెలుసుకోవటం పై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. హత్యాయత్నం ఘటనపై విచారణకు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ పై తనకు నమ్మకంలేదని జగన్ అభ్యంతరం తెలిపారు. దాంతో హత్యాయత్నం ఘటనను ఏపీకి చెందిన పోలీసు అధికారులతో కాకుండా థర్డ్‌ పార్టీతో నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరనున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ అపాయింట్ మెంట్ ఖరారు అయిన తర్వాత వారిని కూడా కలిసి రాష్ట్రం లో శాంతిభద్రతల పరిస్ధితిని వైసీపీ నేతలు వివరిస్తారు.

11:54 - October 28, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌. ఈ మూవీలో మన్మోసింగ్ పాత్రలో అనుపమ్‌ ఖేర్ నటిస్తుండగా...సోనియా గాంధీగా సజ్జన్‌ బెర్నర్ట్‌ కనిపించనున్నారు. విజయ్ రత్నాకర్ గట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు అనుపమ్ ఖేర్ ప్రకటించారు. అంతేకాకుండా సెట్‌లో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన్మోహన్‌ సింగ్‌ జీవిత ప్రయాణం నాకు ఎన్నో నేర్పిందన్న అనుపమ్...ఈ సినిమా చేయడానికి ముందు నాలో కొన్ని ఆలోచనలు ఉండేవని...మిమ్మల్ని అపార్థం చేసుకున్నానంటూ తెలిపారు. షూటింగ్‌ పూర్తయిన తర్వాత, దాదాపు ఏడాది పాటు ఈ పాత్రలో జీవించిన తర్వాత నిజాయతీగా చెబుతున్నా.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మా సినిమా చూసిన తర్వాత మీతో కలిసి ఓ కప్పు టీ తాగాలని ఉందంటూ అనుపమ్‌ పేర్కొన్నారు.

11:44 - October 28, 2018

ఢిల్లీ : అది ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ షో....టాప్ మోడల్స్ ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తున్నారు. అంతలోనే ఓ పిల్లి ఉన్నట్టుండి...ర్యాంప్‌పైకి వచ్చింది. మోడల్స్ క్యాట్‌వాక్ చేస్తున్న అక్కడ్నుంచి కదల్లేదు. కాసేపు అక్కడే పడుకుంది. తర్వాత మోడల్స్ క్యాట్‌వాక్ చేసిన విధంగా పిల్లి క్యాట్‌వాక్ చేసింది. ఇది వారం రోజుల క్రితం ఇస్తాంబుల్‌లోని ఇస్మోద్‌ ఇంటర్నేషనల్‌‌ ఫ్యాషన్‌ షో సీన్ ఆవిష్కృతమైంది. మోడల్స్ ఒకరి తర్వాత ఒకరు క్యాట్‌వాక్ చేస్తున్నారు. ఇంతలోనే ర్యాంప్‌పైకి వచ్చింది.  మోడళ్లు ఓ పక్క వస్తూ, పోతూ ఉంటే...పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయింది. కొంతసేపటి తర్వాత ఓ మోడల్ వెంట పడింది. అంతలోనే తానేం తక్కువనుకుందేమో....ర్యాంప్‌పై నడుచుకుంటూ ముందుకు వెళ్లింది. ర్యాంప్‌పై పిల్లి వయ్యారాలు చూసిన...వీక్షకులు ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

11:38 - October 28, 2018

మహారాష్ట్ర : పుణె వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ బోల్తా పడింది. 283 పరుగులు చేధించలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా మూడో సెంచరీ సాధించినా...భారత్‌కు ఓటమి తప్పలేదు. 240 పరుగులకే ఆలౌటయి...40 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన విండీస్ జట్టు...సిరీస్‌ను సమం చేసింది. 
Image result for west indies beat india by 40 runs virat kohliభారత్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా...ఫలితం లేకుండాపోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది విండీస్ జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది.
Image result for west indies india shai hopeవెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లలో షై హోప్ మరోసారి అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. విశాఖలో సెంచరీతో మ్యాచ్‌ను టై చేసిన హోప్...పూణెలోనూ సెంచరీ చేసేలా కనిపించాడు. 113బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసిన షై హోప్...5 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు.చివర్లో టెయిలెండర్ నర్స్....సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 250 పరుగులు చేయడమే కష్టమనుకున్న సమయంలో...22బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి విండీస్‌ను పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ 2, ఖలీల్ అహ్మద్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
Image result for west indies india 4th one day mumbai brabourne stadium284 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్...మరో 14 బంతులు మిగిలి ఉండగానే 240 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి...వరుసగా మూడో వన్డేలోనూ సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.  119 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ... 10 ఫోర్లు, సిక్సర్‌తో 107 పరుగులు చేశాడు. అంతేకాకుండా కెరీర్‌లో 38 సెంచరీ కంప్లీట్ చేశాడు. ధవన్ 35, అంబటి రాయుడు 22, రిషబ్ పంత్ 24 పరుగులు చేసి...స్వల్ప స్కోర్ల ఔటయ్యారు. దీంతో భారత్ 43 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ వన్డేలో గెలుపుతో 1-1 సిరీస్‌ను సమం చేసింది విండీస్ జట్టు. ఈ నెల 29న ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది. 

11:12 - October 28, 2018

ఢిల్లీ : ప్రొ కబడ్డీలో బెంగాల్ వారియర్స్...జైత్రయాత్ర కొనసాగుతోంది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...బెంగాల్ వారియర్స్ 39-28 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బెంగాల్ వారియర్స్  గ్రూప్‌-బిలో టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. తర్వాత బెంగాల్ డిఫెండర్లు అదరగొట్టడంతో...ప్రత్యర్థి పాయింట్లు సాధించడం కష్టంగా మారింది. చివరికి 39-28 తేడాతో బెంగాల్...పింక్ పాంథర్స్‌ను మట్టికరిపించింది. మహేశ్ గౌడ్, మణిందర్ సింగ్‌లు చెరో ఏడు పాయింట్లు సాధించి...జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌పై యు ముంబా జట్టు 40-39 పాయింట్ల తేడాతో అతికష్టమ్మీద విజయం సాధించింది. ఇరు జట్లు చివరి నిమిషం వరకు కొదమ సింహాల్లా పోరాటం చేశాయి. చివరికి యు ముంబా జట్టు ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది.

 

10:59 - October 28, 2018

ఢిల్లీ : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన...పార్లమెంటును వచ్చే నెల 16 వరకు సస్పెండ్ చేశారు. ప్రధాన మంత్రి పదవిని కోల్పోయిన రణిల్ విక్రమసింఘే పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచాలని, తాను తన బలాన్ని నిరూపించుకుంటానని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. ప్రధానిగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మహీంద రాజపక్సే పార్లమెంటులో బలాన్ని కూడగట్టుకునేందుకు.... మరింత సమయం ఇచ్చేందుకు వీలుగా పార్లమెంటును సస్పెండ్ చేసినట్లు విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్‌లో...రాజపక్ష, సిరిసేన కూటమికి 95 మంది సభ్యుల మద్దతుంది. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీకి సొంతంగా 106 మంది సభ్యులు ఉన్నారు. సాధారణ మెజారిటీకి కేవలం ఏడుగురు మాత్రమే తక్కువున్నారు. 2019 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వచ్చే నెల 5న పార్లమెంటు సమావేశం జరగాల్సి ఉంది. ఇంతలోనే వచ్చే నెల 16 వరకు పార్లమెంటును దేశాధ్యక్షుడు సిరిసేన ప్రోరోగ్ చేశారు.

 

10:50 - October 28, 2018

ఢిల్లీ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలు  ఏకాభిప్రాయానికి వచ్చాయి.  మొత్తం 48 స్థానాల్లో 38 సీట్ల విషయంలో కాంగ్రెస్‌, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పుణె, ఔరంగాబాద్‌, యావత్‌మల్‌ నియోజకవర్గాల కోసం ఎన్సీపీ ఎంతో ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మరో పది స్థానాలు విషయంలో ఇరు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. వీటిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

10:43 - October 28, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ త‌న పంజా విసురుతోంది. కోడ్ ఉల్లంఘ‌న‌కు పాల్పడిందేవరైనా స‌రే ఉపేక్షించేది లేదంటుంది. అధికారమైనా... ప్రతిప‌క్ష నేతలైనా త‌ప్పులు చేస్తే శిక్షలు త‌ప్పవంటోంది. అధికార పార్టీ అక్రమాల‌కు పాల్పడుతుంద‌ంటూ మ‌హాకూట‌మి నేత‌లు చేసిన పిర్యాదుపై త‌క్షణ‌మే స్పందించిన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్...సంబంధిత అధికారులు, పార్టీ నేత‌లకు నోటిసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు ఇంకా నోటిఫికేష‌న్ వెలువడనే లేదు. ఒక్క అధికార టిఆర్ఎస్, బిఎల్ఎఫ్, సిపిఎం పార్టీలు మిన‌హా ఇత‌ర ప్ర‌ధాన పార్టీలేవి త‌మ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌నేలేదు. అయినా రాష్ట్రంలో విచ్చల విడిగా కోడ్ ఉల్లంఘ‌నలు జ‌రుగుతునే ఉన్నాయి. ఇప్ప‌టికే దాదాపు ప‌ది వేల కేసులు న‌మోదైనట్లు తెలుస్తుంది. ఇందులో బ్యాన‌ర్లు, గోడలపై రాతలు, పోస్ట‌ర్స్ అతికించడంతో పాటు పలువురి నేతలపై కూడా కేసులు న‌మోదు చేసింది.
Image result for mahakutami ecతాజాగా అధికార టిఆర్ఎస్ పోలీసుల‌ను అడ్డంగా పెట్టుకుని...త‌మ పోన్లు ట్యాపింగ్ చేయ‌డంతో పాటు..వ్య‌క్తిగ‌తంగా కోడ్ ఉల్లంఘ‌న పేరుతో కేసులు న‌మోదు చేస్తున్నార‌ని మహాకూటమి నేతలు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్‌ని క‌ల‌సి కూటమి నేత‌లు పిర్యాదు చేశారు. ఇందులో భాగంగా పోన్ ట్యాపింగ్ పై వివ‌ర‌ణ కోరుతూ సీఈఓ ర‌జ‌త్ కుమార్‌ డిజిపికి నోటిస్ ఇచ్చారు. మరోవైపు మంత్రుల నివాసంలో పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న టిఆర్ఎస్ తాజా మాజీ మంత్రుల నుంచి వివ‌ర‌ణ కోరుతూ ...ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌దర్శి కేశ‌వ‌రావుకి నోటిసులిచ్చింది ఎల‌క్ష‌న్ క‌మిష‌న్.
Image result for gangula kamalakarదీంతో పాటు ఆదిలాబాద్‌లో ఓ టీఆర్ఎస్ అభ్య‌ర్ధి భ‌ర్తపై అందిన ఫిర్యాదుతో పాటు...నారాయ‌ణ ఖేడ్‌లో నోరు జారిన అభ్య‌ర్ధి...అంత‌కుముందు ఏక‌గ్రీవ తీర్మానం చేస్తే ఐదు ల‌క్ష‌లు ఇస్తానంటూ ఆఫ‌ర్ చేసిన ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి...బిజేపి నేతలపై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని అందిన ఫిర్యాదుతో గంగుల క‌మాల‌క‌ర్‌పై యాక్ష‌న్ తీసుకుంది ఈసీ. మ‌రోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వాహనాల త‌నిఖీల్లో భారీగా న‌గ‌దు ల‌భ్యమవుతున్న నేప‌థ్యంలో మరింత నిఘా పెంచాల‌ని ఈసీ నిర్ణ‌యించింది.

10:43 - October 28, 2018
ఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా మరణించారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్న ఖురానా శనివారం రాత్రి 11 గంటల సమయంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంకో కుమారుడు గతనెలలో మరణించాడు. 1993-96 మధ్య కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా, వాజ్ పేయీ మంత్రివర్గంలో టూరిజం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2004లో రాజస్ధాన్ గవర్నర్ గా నియమితుల్యయారు. ఖురానా మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయఅధ్యక్షులు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు.
10:31 - October 28, 2018

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పన పై కసరత్తు వేగవంతం చేసింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ నేతృత్వంలో సమావేశమైన నేతలు...మ్యానిఫెస్టోపై చర్చించారు. సీట్ల విషయంలోనూ త్వరలోనే స్పష్టత వస్తుందన్న ధీమాలో టీడీపీ నేతలు ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ నేతలు...ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై దృష్టి సారించారు. కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితితో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ...ఎన్ని స్థానాలు దక్కుతాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సీట్లపై క్లారిటీ రాకపోయినప్పటికీ....మేనిఫెస్టో సిద్ధం చేసే పనిలో తెలుగుదేశం నేతలు బిజీ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భేటీ అయిన పార్టీ ముఖ్యనేతలు... పార్టీ రూపొందించే మ్యానిఫెస్టోను కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో ఉంచుతామని తెలుగుదేశం నేతలు అంటున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే...అన్ని వర్గాలను ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. క్రిష్టియన్, రెడ్డి సామాజిక వర్గాలతో పాటు ఇతర బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించిన 26 బిసి కులాలను బిసిల్లో చేరుస్తామని పార్టీ నేతలు వెల్లడించారు. కూటమిగా నాలుగు పార్టీలతో కలిసి బహిరంగంగానే ఏర్పడ్డామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే TRS పార్టీ మాత్రం అంతర్గత ఒప్పందాలతో BJP, MIM, YCPలతో కలిసి మరో కూటమిగా ఏర్పడ్డాయని రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. వెనుక బడిన వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని టీడీపీ నేతలు తెలిపారు. 

10:24 - October 28, 2018

విజయవాడ : విశాఖలో ప్రతిపక్ష నేత జగన్‌పై అభిమాని దాడితో...ఏపీ పోలీసులు అప్రమత్తయ్యారు. జగన్‌కు రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఇక నుంచి జగన్‌ చుట్టూ మూడంచెల భద్రత ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీతో పాటు సొంత అనుచరులు ఆయనకు రక్షణ ఉంటారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో దాడి నేపథ్యంలో...అభిమానులు ఇక నుంచి జగన్‌ను దూరం నుంచి చూడాల్సిందే. సెల్ఫీలకు, షేక్‌ హ్యాండ్‌లకు అనుమతించకుండా పోలీసులు రక్షణ కల్పించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటిదాకా సెక్యూరిటీ సిబ్బందితో ఆయన పాదయాత్రలకు రక్షణ కల్పిస్తుండగా, వారికి రోప్‌ పార్టీ, సివిల్‌ పోలీసులను జతచేసి..మూడు అంచెల్లో భద్రతా వలయం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది ఏపీ సర్కార్. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణలకు సెక్యూరిటీ పెంచనుంది. 

 

10:16 - October 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం త్వరలో జరిగే ఎన్నికలు..దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అప్రమత్తమైంది. రాష్ట్రంలో పాగా వేయాలని కాషాయ దళపతి అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలకు..నేతలకు దిశా..నిర్దేశం చేశారు. తాజాగా మరోసారి అమిత్ షా నగరానికి రానున్నారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బీజేవైఎం యువ సమ్మేళనం ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

10:05 - October 28, 2018
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహం ఏర్పాటును నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ పై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది.ప్రణయ్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేయొద్దని ప్రణయ్ తండ్రికి కూడా చెప్పినట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో వివరించారు. ఈ మేరకు ప్రణయ్ విగ్రహం ఏర్పాటును నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ ను జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ మూసివేశారు. నల్గోండ జిల్లా మిర్యాలగూడ లో సెప్టెంబరు 14న పెరుమాళ్ల ప్రణయ్ అనే వ్యక్తి పరువు హత్యకు గురయ్యాడు. తమ మాట వినకుండా ప్రేమ పెళ్లిచేసుకుందని ప్రణయ్ భార్య అమృత తండ్రి తిరునగరి మారుతిరావు ఈ హత్యచేయించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రణయ్‌ కుటుంబ సభ్యులు అతడి విగ్రహాన్ని మిర్యాలగూడలోని సాగర్‌ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటును నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం పోలీసుల వాంగ్మూలంతో కేసును మూసివేసింది.
08:29 - October 28, 2018
హైదరాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్ధుల తుది జాబితా నవంబర్ 2 న విడుదల చేసేందుకు పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 1 కాంగ్రెస్ పార్టీ జాబితా వచ్చాక టీఆర్ఎస్ తుది జాబితా విడుదల చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే 107మంది అభ్యర్ధులు ఖరారు కావటంతో మిగిలిన 12 స్ధానాలకు పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ లో సీట్లు రాని కొందరు అసమ్మతి నేతలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. మహాకూటమి కూడా సీట్లు ప్రకటిస్తే , అక్కడ సీట్లు రాని నాయకులు టీఆర్ఎస్ లోచేరే అవకాశం ఉందని, వారికీ కొన్ని సీట్లను కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నారు. వీరేకాక నవంబర్ మొదటి వారంలో టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 2 న తుది జాబితా విడుదల చేసి జిల్లాల వారీగా ప్రచారాన్ని ముమ్మరంచేసే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ముందుగా వరంగల్, ఖమ్మం,కరీంనగర్ లలో పర్యటించి న అనంతరం నియోజక వర్గాల పర్యటన ప్రారంభిస్తారని తెలుస్తోంది.
07:28 - October 28, 2018
ఢిల్లీ: ఎట్టకేలకు మహా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ 91 స్ధానాల్లో,తెలుగుదేశం పార్టీ 15 స్దానాల్లో, తెలంగాణ జనసమితి 8 స్దానాల్లో, సీపీఐ 5 స్దానాల్లో పోటీ చేసేందుకు ప్రాధమికంగా ఒక అవగాహనకు వచ్చాయి.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ శనివారం రాత్రి ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో భేటి అయి సీట్ల విషయమై చర్చించారు. శుక్రవారం ఉత్తమ్, కోదండరాం, రమణల మధ్య జరిగిన చర్చల కొనసాగింపుగా శనివారం రాత్రి చంద్రబాబునాయుడుతో భేటీ జరిగింది. ఎవరెవరు, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయంపై ఇంకా స్పృష్టత రాలేదు. తెలంగాణ జనసమితి, సీపీఐ అడుగుతున్న కొన్ని సీట్లనే కాంగ్రెస్, టీడీపీలు అడగటంతో ఆ స్ధానాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మహకూటమిలోకి కొత్తగా రాష్ట్రీయలోక్ దళ్ కూడ త్వరలో చేరుతున్నట్లు తెలిసింది, ఆపార్టీ కూడా 2 స్దానాలు కోరుతోంది. ఏది ఏమైనా మహా కూటమి అధికారంలోకి రావటానికి ఎవరో ఒకరు కొన్ని త్యాగాలు చేయక తప్పదని, గెలవని సీట్ల కోసం పంతాలకు పోయి అవకాశాన్ని జారవిడుచుకోవద్దని చంద్రబాబునాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రమణలకు సూచించారు. అంతకుముందు సీపీఐ జాతీయ ప్రదానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, రాజా, నారాయణ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో భేటి అయి సీట్ల సర్దుబాటు విషయం చర్చించారు. ఢిల్లీలోనే ఉన్న టీఆర్ఎస్ రాజ్యసభసభ్యుడు డి.శ్రీనివాస్, కాంగ్రెస్ కు చెందిన వంటేరు ప్రతాపరెడ్డి, బండ్ల గణేష్ కూడా చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.

Don't Miss