Activities calendar

30 September 2018

21:15 - September 30, 2018

అమరావతి : వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరి సంధించుకునే విమర్శనాస్త్రలు వాడి వేడిగా వుంటున్నాయి. బీజేపీ రాఫెల్ కుంభకోణం విషయంలో కూడా విపక్షాలు సంధిస్తున్న విమర్శలకు గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై గుర్రుగా వున్న ఏపీ ప్రభుత్వం కూడా రాఫెల్ విషయంలో ప్రశ్నించేందుకు జగన్, పవన్ లు భయపడుతున్నాని విమర్శించింది. ఈ నేపథ్యంలో రాఫెల్ కుంభకోణంపై మాట్లాడాలంటే జగన్ కు జంకు, పవన్ పరుగు అని టీడీపీ నేత లంకా దినకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ అంటే బాధ్యత లేని జగన్-పవన్ అని అభివర్ణించారు. బీజేపీ డైరెక్షన్ లో జగన్, పవన్ యాక్షన్ చేస్తున్నారని, జగన్ సావాసం తర్వాతే కేంద్రం రాఫెల్ స్కాంలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. ఏపీలో అత్యంత పారదర్శకత పాలన ఉందని కేంద్రమే ప్రకటించిందని, విపక్ష నేతలు అసత్యాలు మాట్లాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు.

20:56 - September 30, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠ బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు ఆదివారం అమరావతి సచివాలయంలోని ప్రధాన కార్యదర్శి చాంబర్ లో ప్రస్తుత సీఎస్ దినేష్ కుమార్ నుండి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎస్ పునేఠ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు.
సీఎస్’ అనేది చాలా సవాళ్ళతో కూడుకున్న పదవని, అందులోనూ నూతన రాష్ట్రం అయినందున అనేక ఇబ్బందులు ఉన్నాయని, వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని మెరుగైన రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని అన్నారు.రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆదాయం పెంపొందించే విధంగా వారి జీవన విధానం మరింత మెరుగుపడే రీతిలో అన్ని కుంటుంబాలు ఆనందదాయకంగా జీవించేలా ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తానని అనిల్ చంద్ర పునేత అన్నారు. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వచ్చే మంత్రి వర్గ సమావేశానికి రానున్న కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన ర్యాటిఫికేషన్ దస్త్రాలపై ఆయన తొలి సంతకం చేసినట్టు తెలిపారు.

20:32 - September 30, 2018

హైదరాబాద్ : కామారెడ్డిలో షబ్బీర్ అలీ తరపున ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి లపై టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, గోవర్ధన్ రెడ్డిలను వంద మీటర్ల గొయ్యి తీసి పాతరేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే, ఈ ఎమ్మెల్యే కామారెడ్డిపై పడి తింటున్నాడని, గంప తన తట్టాబుట్టా సర్దుకునే సమయం దగ్గరపడిందని అన్నారు.
చెరకు తోటల మీద అడవిపందులు పడితే.. తిన్నకాడికి తిని, ఉన్నదంతా తొక్కి సర్వనాశనం చేసిపోతాయి. చెరకుతోటల మీద అడవి పందులు పడ్డట్టు రాష్ట్రంపై టీఆర్ఎస్ నాయకులు పడ్డారు. తిన్నకాడికి తిని.. దోచిన కాడికి దోచి.. మిగిలినదంతా ఎవ్వరికీ అక్కరకు రాకుండా సర్వనాశనం చేసి పోవడానికి కంకణం కట్టుకుని ఉన్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా రైతులు పగటి పూటయితే కాపలాగా ఉంటారు, రాత్రి పూట అడవిపందులొచ్చి పాడు చేయకుండా ఉండడానికి  కరెంట్ తీగలు అడ్డం కడతారని రేవంత్  టీఆర్ఎస్ నాయకులను ఉదేశిస్తు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మన భవిష్యత్ తరాల కోసం తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? టీఆర్ఎస్ నాయకులకు కరెంట్ షాక్ కొట్టించాల్సిన అవసరం ఉందా? లేదా? మన కరెంట్ ‘ఓటు’. ఆ ఓటు ను ‘చెయ్యి’ గుర్తు మీద వేసి మీరు మమ్మల్ని గెలిపించాలని’ రేవంత్ కోరారు.  

 

20:04 - September 30, 2018

తమిళనాడు : కోడి పందాన్ని ఓ కుక్క అడ్డుకునే ప్రయత్నం చేసింది. అవును రెండు కోళ్లు పరస్పరం పోరాడుతుంటే వాటిని ఆపేందుకు ఓ కుక్క ప్రయత్నిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. ఆ రెండు కోళ్లను విడదీసేందుకు అది ఎంతగానో ప్రయత్నించింది. అయితే ఆ కోళ్లు ఈ కుక్కను ఏమాత్రం పట్టించుకోకుండా పోరాడుతూనే ఉన్నాయి. అయినా వెనక్కి తగ్గకుండా ఆ కుక్క ఆ కోళ్ల పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తూనేవుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన  తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిందని తెలుస్తోంది. 

19:30 - September 30, 2018

చైనా : జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్‌ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. అయితే చైనాలోని లిలీతాన్‌ అనే  మహిళా రైతు ఇంట్లో ఉన్న 40 సిమెంట్‌ బస్తాలను తీసుకుని గౌన్‌ కుట్టుకుంది. కేవలం 3 గంటల్లో వెడ్డింగ్‌ డ్రెస్‌నే కుట్టేసింది. సిమెంట్‌ బస్తాల గౌన్‌తో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో లక్షల మంది చూశారు. దీంతో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ ఫొటో తెగ హల్‌చల్‌ చేస్తోంది. పాపం ఈ గౌనును తన పెళ్లికి ధరించలేకపోయినందుకు తెగ బాధ పడుతోంది. ఎందుకంటే 2012లోనే ఆమె పెళ్లి జరిగింది. 

18:37 - September 30, 2018

హైదరాబాద్ : ప్రసంగంలోగానీ..పనిలో గానీ తనదైన శైలిలో వ్యవహరించే కేటీఆర్ ఎన్నికల క్యాంపెయినింగ్ లో కూడా తన స్టైల్ పంచ్ లతో అదరగొడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఢిల్లీ నుండి సీల్డ్ కవర్ లో వచ్చే  సీఎం కావోలో సింహంలాంటి సీఎం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నేతలు వాష్ రూమ్ కు వెళ్లాలన్నా ఢిల్లీలోని అధిష్టానం వద్ద అనుమతి తీసుకుంటేనే గానీ వెళ్లేందుకు వీలులేదనీ..ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే సింహంలాంటి సీఎం కేసీఆర్ చేతిలో వుండాలా? లేదా పదవి అంటే పడి సచ్చే కాంగ్రెస్ సన్యాసుల సీఎం కావాలో ప్రజలే తేల్చుకోవాలని కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ది చూడలేక టీఆర్ఎస్ నేతలనే కాదు చిన్న పిల్లలను కూడా కాంగ్రెస్ నేతలు ఉక్రోషం చూపిస్తు వారి నీచబుద్ధిని నిరూపించుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు.

 

18:04 - September 30, 2018

ఢిల్లీ : బస్ రావాలి..బైటకు పోవాలి అనేది పాతసంగతి. చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే హలో అంటే పొలో అని వచ్చేస్తున్నాయి క్యాబ్ లు. ఒక్క క్లిక్ తో ఇంటిముందు వాలిపోతున్నాయి. ప్రయాణీకులకు చక్కటి ప్రయాణ సాధనంగా క్యాబ్ లు మారిపోయాయి. ఈ సౌకర్యం బాగానే వున్నా..కొంతమంది డ్రైవర్లు ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఒక్కసారి బుక్ చేసుకున్నాక ఆ క్యాబ్ డ్రైవర్ రాలేనంటే ఇకపై కుదరదు. 
క్యాబ్‌ సర్వీసులు. దిల్లీ, బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో అయితే.. చాలా మంది వరకు వీటి మీదే ఆధారపడతారు. గత కొన్నేళ్లుగా ఓలా, ఉబెర్‌ వంటి సంస్థలు ప్రజలకు క్యాబ్‌ సేవలను అందిస్తున్నాయి. మనం ఏదైనా ప్రాంతానికి వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్న తర్వాత కొంతమంది డ్రైవర్లు ఆ ప్రదేశానికి రాలేమంటూ రైడ్‌ను రద్దు చేసుకుంటారు. ఇక మీదట అలా ఎవరైన డ్రైవర్‌ రైడ్‌ను రద్దు చేస్తే రూ.25వేల వరకు జరిమానా ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఓ ప్రతిపాదనను దిల్లీ ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది.
క్యాబ్‌ సేవల ధరలు పెరుగుదలను నియంత్రించడంతో పాటు, వాటిల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిందిగా కోరుతూ దిల్లీ రోడ్డు రవాణా శాఖ సరికొత్త డ్రాఫ్ట్‌ను రూపొందించింది. క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై పోలీస్‌ కేసు పెట్టాలని ఆ డ్రాఫ్ట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నట్లయితే సదరు డ్రైవర్ లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ముసాయిదాను దిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్‌ త్వరలోనే కేబినెట్‌ ముందు పెట్టనున్నారు. 

 

17:36 - September 30, 2018

మహారాష్ట్ర : ప్రముఖ ‘లంకేశ్’ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేశ్ హత్య దారుణ హత్యకు గురైన సంఘటన యావత్ దేశాన్ని కుదిపివేసింది. ఈ కేసులో నిందుతులను సిట్ విచారణకు అప్పంగించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో నిందితులు పరశురామ్ వాగ్మేర్, మనోహర్ లు ప్రత్యేక దర్యాప్తు బృందంపై  సంచలన ఆరోపణలు చేశారు.  ఈ హత్యలో నిందితుడు పరశురామ్ మాట్లాడుతూ, ఈ కేసు విచారణ నిమిత్తం సిట్ ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత అధికారులు నేరుగా తన వద్దకే వచ్చారని, ఈ నేరం ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తమకు బెదిరింపులు మొదలయ్యాయని, తనకు రూ.25 లక్షలు ఇచ్చి నేరం ఒప్పుకోమని సిట్ అధికారులు చెప్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 మరో నిందితుడు మనోహర్ మాట్లాడుతూ, గౌరీ లంకేశ్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ, తనను, తన కుటుంబాన్ని బెదిరించి తనతో ఈ నేరం ఒప్పించారని ఆరోపించారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 5న గౌరీ లంకేశ్ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం ను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 14 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

16:49 - September 30, 2018

ఢిల్లీ : మనిషికి బలహీనతలు వుండటం సహజమే.కానీ ఆ బలహీనతలో భాగంగా చేసిన తప్పును ఒప్పుకోవటంలో వున్న ఔన్నత్యం మాత్రం అందరికీ సాధ్యం కాదు. కానీ నిజం నిప్పులాంటిదంటారు. అది తప్పు చేసినవారిని నిలువునా దహించివేస్తుంది. కానీ చేసిన తప్పుని ఒప్పుకోవటమేకాదు..పశ్చాత్తాపం చెందిన ఓ వ్యక్తి చేసిని తప్పు దాదాపు శతాబ్దాల తరువాత కూడా బైటపడింది. ఇది నమ్మటానికి సాధ్యంకాకపోయినా నమ్మి తీరవలసిన ఘటన. 
'మీటూ' ఉద్యమం ఎన్నో ప్రేమకథల్ని, లైంగిక వేధింపులను, అత్యాచారాలను వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు పలువురు జైలు పాలయ్యేందుకు ఈ ఉద్యమం కారణమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ హాస్య, టీవీ నటుడు బిల్‌ కాస్బీ కూడా జైలుపాయ్యాడు. ఈ ఉద్యమమే ఈ బ్రిటీష్‌ నావికుడి చర్యను బయటపెట్టింది. శతాబ్దాల క్రితం అతను చేసిన తప్పు ఏమిటీ? అనే విషయం తెలుసుకుందాం.. 
‘అతనో ఓడ సహాయకుడు. అనుకోని పరిస్థితుల్లో పనిమనిషిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అది జరిగిన కొంతకాలానికి ఓ  సందర్భంలో బాధితురాలు కలిసినప్పుడు ఆమె విలపించటం పట్ల అతను చేసిన ఘోరంపై పశ్చాత్తాపం చెంది పెళ్లి చేసుకున్నాడు. ఇది  పదిహేడో శతాబ్దంలో జరిగిన ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది..
బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్‌ బార్లో సముద్రయాన చరిత్ర అధ్యయనకారులకు సుపరిచితుడు. 17వ శతాబ్దానికి చెందిన బార్లో ఓడ సహాయకునిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రోజుల్లో పనిమనిషి మేరీ సైమన్స్‌పై లైంగిక దాడిచేశాడు. అనంతరం పశ్చాత్తాపంతో ‘తను చేసింది సరైంది కాదని..ఇటువంటి ఘోరాలు  సభ్యసమాజం అంగీకరించదని తన డైరీలో రాసుకున్నాడు.
అనంతరం ఇంటికి వచ్చిన బార్లోకు..మేరీ కన్నీరుమున్నీరుగా ఏడుస్తు కనిపించింది. తన జీవితం వ్యర్థమైపోయిందని బాధపడింది. దీంతో పశ్చాత్తాపానికి గురైన బార్లో ఆమెను వివాహమాడాడు. లైంగికదాడిని మాత్రం బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. 17వ శతాబ్దంలో జరిగిన ఈ లైంగిక దాడిని చరిత్రకారులు  తాజాగా వెలికి తీశారు. దీంతో నిజం నిప్పులాంటిదనీ..అది ఎప్పటికైనా బైటపడక తప్పదని మరోసారి నిరూపించబడింది. కానీ కాలంగమనంలో ఇటువంటి వెలుగు చూడని ఘోరాలెన్నో..ఇటువంటి ఘోరాలకు బలైపోయిన మహిళా సమిథలు ఎన్నో ఎన్నెనో..

 

16:10 - September 30, 2018

ఛత్తీస్ గఢ్ :  : తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై మావోయిస్టులు ఈ ఉదయం మెరుపుదాడి చేశారు. తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడిన మావోలను నిలువరించడానికి జవాన్లు కూడా ఫైరింగ్ ఓపెన్ చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా క్యాంప్ వేసిన భద్రతా దళాలు, అక్కడి నుంచే అడవుల్లోకి వెళ్లి కూంబింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మావోలు, సీఆర్పీఎఫ్ దళాల మధ్య సుమారు గంట పాటు ఎదురుకాల్పులు సాగినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. మావోయిస్టులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారని, అదనపు బలగాలను రంగంలోకి దించి, వారికోసం గాలింపును ముమ్మరం చేశామని తెలిపారు.
 

 

15:59 - September 30, 2018

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో వాణిజ్య రాజధాని ఇండోర్. ఇప్పుడు ఈ పేరు వణుకు పుట్టిస్తోంది. దాదాపు 40 నుంచి 50 లక్షల మంది ప్రాణాలను హరించగల అత్యంత విషపూరిత రసాయనాలను ఇండోర్ లో పోలీసులు, డీఆర్డీఓ సైంటిస్టులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడిలో పట్టుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు వారం రోజుల పాటు ఆపరేషన్ జరిపిన అధికారులు 9 కిలోల సింథటిక్ ఓపియాయిడ్, ఫెంటానిల్ ను సీజ్ చేశారు. ఇండియాలో ఫెంటానిల్ పట్టుబడటం ఇదే తొలిసారని తెలుస్తోంది.
ఇండోర్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వ్యాపారి, అమెరికాపై కక్షను పెంచుకుని, ఈ రసాయనాలను తయారు చేసినట్టు తెలుస్తోంది. రసాయన యుద్ధంలో దీన్ని వినియోగిస్తే, కోట్లాది మంది అనారోగ్యం బారినపడివుండేవారని, ఈ కేసులో ఓ మెక్సికన్ జాతీయుడిని కూడా అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.కాగా, హెరాయిన్ తో పోలిస్తే 50 రెట్ల అధిక విషపూరితమైన ఫెంటానిల్ ను వాసన చూసినా కూడా ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని డీఆర్ఐ డైరెక్టర్ జనరల్ డీపీ దాస్ వెల్లడించారు. ఎంతో నైపుణ్యవంతులైతేనే దీన్ని తయారు చేయగలుగుతారని, దీన్ని తయారు చేసిన వ్యాపారి కెమిస్ట్రీలో పీహెచ్డీ కూడా చేస్తున్నాడని తెలిపారు. 

15:38 - September 30, 2018

విశాఖపట్నం : మావోయిస్టుల మారణకాండకు బలైపోయిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తెలుగు రాష్ట్రాలల తీవ్ర అలజడి సృష్టించింది. అరుకులో జరిగిన ఈ మారణ కాండకు పక్క రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడ్డాయి. దీంతో ఆయా రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులు కూడా అలర్ట్ అయ్యారు. తెలంగాణలో కూడా మావోయిస్టులతో ప్రమాదం వుందనే అనుమానంతో పోలీసులు పలువురు నేతలను హెచ్చరించారు. కాగా మావోయిస్టులు కాల్చి చంపిన సివేరి సోమ ఆత్మఘోషిస్తోందంటూ ‘జవాబు చెప్పండి’ పేరిట ఓ కరపత్రం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
ఆ లేఖ సారాంశం ఏలా వుందంటే..‘నేనొక మాజీ ఎమ్మెల్యేని. నాకు ఆరుగురు పిల్లలు. ఎదిగొచ్చిన కొడుకులకు ఉద్యోగం కూడా లేదు. సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేనేం తప్పు చేశాను? ఏదైనా తప్పుచేసుంటే ఒక  హెచ్చరిక అయినా చేశారా? నేనేం తప్పు చేసానని నన్ను చంపారు? నేను ఏ వర్గానికి శత్రువుని? మావోయిస్టులారా చెప్పండి, కుహనా హక్కుల సంఘల్లారా..మీరైనా చెప్పండి- సివేరి సోమ’ అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. ఈ కరప్రతంలో సోమ భౌతికకాయం ఫొటోతో పాటు, ఆయన పాస్ పోర్ట్ చిత్రం కూడా కనబడుతుంది.

ఏపీ,విశాఖపట్నం, మావోయిస్టులు, ఎన్ కౌంటర్,మాజీ ఎమ్మెల్యే, సివేరి సోమ, ఆత్మఘోష, లేఖ, సోషల్ మీడియా,AP, Visakhapatnam, Maoists, Encounter, Former MLA, Sivari Soma, Swagoshosh, Letter, Social Media,

15:10 - September 30, 2018

విజయనగరం : ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు వాగ్ధానాల పర్వం ఏపీలో కూడా ఊపందుకుంది. మహిళా ఓటు బ్యాంకులను ఆకర్షించేందుకు నేతలు వాగ్ధానాల పరంపర కొనసాగుతోంది. గన ఎన్నికల్లో విజయం చేతివరకూ వచ్చి చేజారిపోయిన జగన్ రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో మహిళలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, మరో కీలక హామీ ఇచ్చారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి అక్కకూ రూ. 75 వేలను నాలుగు దఫాలుగా అందిస్తానని హామీ ఇచ్చారు. కోరుకొండ వద్ద తనను కలిసిన విశ్వబ్రాహ్మణులతో మాట్లాడిన ఆయన, వైఎస్ఆర్ చేయూత ద్వారా ఈ పథకాన్ని అమలు చేయిస్తానని, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళ ఏ ఇంట ఉన్నా, వారికి డబ్బు అందించేలా చర్యలు చేపడతానని అన్నారు. విశ్వబ్రాహ్మణులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, బంగారం వ్యాపారంలో కార్పొరేట్లను తగ్గిస్తూ, తాళిబొట్లను కేవలం విశ్వబ్రాహ్మణులే తయారు చేసేలా చట్ట సవరణ తీసుకువస్తానని అన్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తానని, జీవో 272లోని అభ్యంతరకర క్లాజులను తొలగిస్తానని చెప్పారు.

 

13:37 - September 30, 2018

ఉత్తర్ ప్రదేశ్ : తన భర్త మరణానికి రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమాధానం చెప్పాలని తివారీ భార్య కల్పన డిమాండ్‌ చేశారు. తన భర్త ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. తనకు రూ.కోటి పరిహారం, పోలీసు శాఖలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఎంకు ఆమె లేఖ రాశారు. తివారీ, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తివారీ మృతికి బాధ్యులైన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. వారిని సర్వీసు నుంచి తొలగించనున్నట్లు రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు. ఆత్మ రక్షణ పరిమితులను దాటి వారు అతిగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైందని అన్నారు. ఎవరినీ కాల్చేందుకు పోలీసులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడిని పోలీస్ కానిస్టేబుల్ కాల్చిచంపిన ఘటన సంచలనం రేపుతోంది. తనిఖీల సమయంలో కారు ఆపలేదన్న కారణంతో నిండు ప్రాణాలు బలి తీసుకోవడం లక్నోలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో పెరిగిన ఎన్‌కౌంటర్ల సంస్కృతి పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లక్నోలోని విలాసవంతమైన గోమతీనగర్‌ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ప్రశాంత్‌ చౌధరి అనే కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వివేక్ తివారీ యాపిల్ కంపెనీ ఉద్యోగి. తివారీ విధులు ముగించుకొని వస్తున్న సమయంలో గస్తీ కాస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయన వాహనాన్ని ఆపమని కోరారు. కానీ ఆప కుండా ముందుకు పోవడంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈఘటనలో తివారీ అక్కడే మృతి చెందాడు. ఈసమయంలో కారులో మరో మహిళ కూడా ఉన్నారు.

13:22 - September 30, 2018

పశ్చిమ గోదావరి : కట్టుదిట్టమైన చర్యలు ఎన్ని తీసుకున్నా పైరసీ మాత్రం పేట్రేగిపోతోంది. భారీ బడ్జెట్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట నడుమ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలయితే కాసేపటికే ఆ సినిమా లీక్ అవుతోంది. దీనితో దర్శక, నిర్మాతలు, హీరోలు, చిత్ర యూనిట్ తీవ్రంగా నష్టపోతోంది. పైరసీలకు పాల్పడవద్దంటూ కోరుతున్నా అక్రమార్కులు మాత్రం ఇంకా చెలరేగిపోతున్నారు. ఇటీవలే జూ.ఎన్టీఆర్ నటించిన అరవింద సమతే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక ఫైట్ సీన్ బయటకు రావడంతో కలకలం రేగింది. తాజగా విజయదేవరకొండ నటించిన ‘ట్యాక్సీ వాలా’ చిత్రం విడుదలకు ముందే విద్యార్థుల సెల్‌ఫోన్లలో ప్రత్యక్షమైంది. ఇతను హీరోగా నటించిన గీతా గోవిందం సినిమా కూడా రిలీజ్‌కు ముందే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో సెల్‌ ఫోన్లలో ఎడిటింగ్ కాని ట్యాక్సీ వాలా చిత్రం దృశ్యాలను చూస్తున్న విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. విడుదలకు ముందే ఫుటేజ్‌ లీకవడంపై నిర్మాత ఎస్‌కెఎన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుటేజ్‌ చెన్నై నుంచి దేవరపల్లిలోని విద్యార్థులకు వచ్చినట్టు తెలుస్తోంది. 

12:22 - September 30, 2018

హైదరాబాద్ : బిగ్ బాస్ 2 ఫైనల్ షూటింగ్ కాసేపు నిలిచిపోయిందా ? షూటింగ్ నిలిచిపోవడానికి కౌశల్ ఆర్మీ కారణమేనా ? ఈ రియాల్టీ షోకు కాసేపట్లో ఎండ్ కార్డు పడనుంది. దీనికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మాధ్యమాల్లో వార్తలు అవుతున్నాయి. కౌశల్ విజేత...గీతా మాధురి రన్నరప్ అంటూ తెగ పుకార్లు షికారు చేస్తున్నాయి. 
అనేక గొడవలు...పాటలు..ఎంజాయ్..భావోద్వేగాల మధ్య 110 రోజుల పాటు ఈ షో సాగింది. షోకి నేచురల్ స్టార్ నాని యాంకర్‌గా వ్యవహరించారు. మొత్తం 18 మంది కంటెస్టులు పాల్గొన్నారు. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ ప్రస్తుతం తనీష్, కౌశల్, దీప్తి, గీతా మాధురి, సామ్రాట్‌లు ఫైనల్ పోరులో తలపడుతున్నారు. కానీ కౌశల్ విజేత అంటూ కౌశల్ ఆర్మీ తెగ హల్ చల్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన బిగ్‌బాస్‌ సెట్‌ వద్దకు శనివారం రాత్రి భారీగా కౌశల్ ఆర్మీ సభ్యులు చేరుకున్నట్లు..హల్ చల్ చేయడంతో ఫైనల్ షూట్‌ని నిర్వాహకులు నిలిపివేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. సెట్‌ చుట్టూ కౌశల్ పేరిట పోస్టర్లు అంటించారు. చివరకు బందోబస్తు మధ్య ఆదివారం ఉదయం షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

11:14 - September 30, 2018

హైదరాబాద్ : బిగ్ బాస్ 2 ఫైనల్..కొద్ది గంటలే ఉంది. విజేత ఎవరో ముఖ్య అతిథి ప్రకటించనున్నారు. విజేత ఎవరనే దానిపై సోషల్ మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కౌశల్ విన్నర్ అంటూ విపరీతమైన ప్రచారం జరగుతోంది. ఆయన పక్కాగా విన్ అవుతారని కౌశల్ ఆర్మీ పేర్కొంటోంది. ప్రేక్షకులు ఏకపక్షంగా కౌశల్‌కు ఓట్లు వేశారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా బుల్లితెరపై బిగ్ బాస్ 2 రియాల్టీ షో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆదివారంతో ఈ షో ముగియనుంది. నేచురల్ స్టార్ నాని షోకు యాంకర్‌గా వ్యవహరించారు. మొత్తం 18 మందితో ప్రారంభమైన కార్యక్రమం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ ప్రస్తుతం తనీష్, కౌశల్, దీప్తి, గీతా మాధురి, సామ్రాట్‌లు ఫైనల్ పోరులో తలపడుతున్నారు. విజయానికి ప్రేకక్ష్ులు కీలకం కానున్నారు. అవును..వీరు వీసే ఓట్లు వారి విజయానికి కారణం కానున్నాయి. కౌశల్‌కు భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయని సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా 27 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయని, అందులో సగం ఓట్లు కౌశల్‌కే వచ్చాయని తెగ ప్రచారం జరుగుతోంది. రన్నరప్‌గా మాత్రం గీతా మాధురి విజయం సాధిస్తుందని తెలుస్తోంది. విన్నరప్‌కు రూ. 50 లక్షల బహుమతిని ఇవ్వనున్నారనే సంగతి తెలిసిందే. మరి విజేత ఎవరు ? ఎన్ని ఓట్లు పడ్డాయని తెలియాలంటే కొద్ది గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. 

10:37 - September 30, 2018

జగిత్యాల : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి..నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఐతే ఆ ఆలయంలో గాజులు  మాయమయ్యాయి. గాజులంటే అవి మామూలు గాజులు కాదు. వజ్రాలతో పొదిగిన గాజులు. ఎన్‌ఆర్‌ఐ  దంపతులు దేవునికి కానుకగా సమర్పించిన గాజులను గాయబ్‌ చేసిందెవరు..? ఇంత జరుగుతున్నా అధికారులు  చూస్తూ ఊరుకున్నారెందుకు..? ఆలయ పాలకమండలి ఏం చేస్తోంది..?

యోగ, ఉగ్ర నృసింహ అవతారాల్లో కనిపించే స్వామితో పాటు.. హరిహర క్షేత్రంగా.. త్రిమూర్తులు కొలువైన పవిత్ర  ప్రదేశంగా.. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రసిద్ధిగాంచింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటి గోదావరి  పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విదేశాల్లో ఉంటున్న ధర్మపురి వాస్తవ్యులైన కుప్పం విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం... గుప్తదానం కింద సుమారు ఆరులక్షల పైచిలుకు విలువ చేసే డైమండ్ గాజులను.. ఈమధ్య లక్ష్మీనృసింహుడి హుండీలో వేయబోయారట. విషయం తెలుసుకున్న ఈవో సుప్రియ హుండీలో వేస్తే  ఎండోమెంటుకు వెళ్లిపోతుంది.. నాకివ్వండీ నేను ఈ ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానంటూ.. ఆమెవద్ద నుంచి  తీసుకున్నారట. ఇప్పుడా గాజులేమైనాయంటే.. అర్థంపర్థంలేని కారణాలు చూపిస్తున్నారని బాధితపక్షంతో పాటు..  ఊళ్లో జనం సీరియస్ అవుతున్నారు.

గాజులు కనిపించకపోవడంతో స్థానికులతో పాటు ఆలయ సిబ్బంది ఈవోపై నిరసన గళం విప్పారు. ఐతే ఈవో సుప్రియ వరంగల్ కు బదిలీ  అవడంతో అందరి ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టైంది.  డైమండ్స్ తో కూడిన  బంగారు గాజులను ఈవో నొక్కేసిందని ఆమె పై స్థాయిలో అధికారులు రక్షిస్తున్నారంటూ పలువురు ఆరోపించారు.  ఈవో పై చర్యలు తీసుకోవాలంటు ఇటీవలే బిజెపి పార్టీ ధర్మపురి బంద్ పిలుపు  నివ్వగా...బ్యాంకులు.విద్యసంస్థలతోపాటు స్థానికులంతా బంద్ సంఘీభావం తెలిపి బంద్ లో పాల్గొన్నారు.  ఆలయంలో డైమండ్‌ గాజులు మాయం అవడంతో.. భక్తులిచ్చిన గుప్తనిధుల ఉన్నాయో లేవో విచారించాలని   బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

ఆలయ ఉద్యోగులను తన కనుసైగలతో నడిపిస్తూ.. అడ్డగోలు అవినీతికి ఇక్కడి ఈవో తెరతీస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సుప్రియకు నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండటంతో.. ఇక్కడి పాలకవర్గం కూడా చేతకాకుండా చేష్టలుడిగి చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  గతంలో ఈవో సుప్రియ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు నాల్గుతులాల బంగారు గొలుసును లక్షీనృసింహుడి సాక్షిగా  ఆలయంలోనే కానుకగా ఇవ్వడం వివాదాస్పదమైంది.  ఆలయంలో జరుగుతున్న అక్రమాల పై సమగ్ర విచారణ జరిపిస్తే అసలు విషయం బయటపడుతుందంటున్నారు  భక్తులు, లేదంటే ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందని భక్తులు చెబుతున్నారు.

10:23 - September 30, 2018

చిత్తూరు : జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏడు కేసులు నమోదయ్యాయి. ఆరు కేసులు పాజిటివ్ వచ్చినట్లు తెలియడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. స్విమ్్స వైద్యుడు, మరో వైద్య సిబ్బంది ఉండడం కలకలం రేపుతోంది.  ఓ వృ‌ద్ధురాలు స్వైన్ ఫ్లూ లక్షణాలతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. కానీ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఇతర అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందిందని వైద్యులు పేర్కొంటున్నారు. చికిత్స పొందుతున్న వారి వద్దకు ఎవరినీ రానీవ్వడం లేదు. చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని..మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. బస్టాండు, రైల్వేస్టేషన్‌లలో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు. 

10:15 - September 30, 2018

జమ్మూ కాశ్మీర్ : మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. గ్రనైడ్లు, తుపాకులతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం షోపియాన్ పీఎస్‌పై దాడికి పాల్పడ్డారు.  ఒక్కసారిగా గుంపులుగా వచ్చిన ఉగ్రవాదులు పీఎస్‌పై గ్రనైడ్లు విసురుతూ..తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. కొద్దిసేపటి అనంతరం పోలీసులు తేరుకుని ప్రతిగా కాల్పులు జరిపారు. కానీ ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. అనంతరం అడవుల్లోకి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు పీఎస్‌కు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. అడవుల్లో నక్కిన ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపడుతున్నారు. షోపియాన్ జిల్లాలో పట్టు సాధించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులే టార్గెట్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం నలుగురిని పోలీసులును ఉగ్రవాదులు మట్టబెట్టారు. దాడులు చేసిన అనంతరం పోలీసుల ఆయుధాలను ఎత్తుకెళుతున్నారు. 

09:34 - September 30, 2018

హైదరాబాద్ : దాదాపు నాలుగు నెలలు...బుల్లితెరపై బిగ్ బాస్ 2 రియాల్టీ షో...ఎంతో మందిని అలరించిన ఈ షో...ఆదివారంతో ముగియనుంది. నేడు ఫైనల్‌లో జరిగే విజేత ఎవరో ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. విన్నర్‌గా కౌశల్, రన్నరప్‌గా గీతా మాధురి నిలిచిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. బిగ్ బాస్ 1కు కొనసాగింపుగా బిగ్ బాస్ 2ని మా టీవీ ప్రసారం చేస్తోంది. మొదటి రియాల్టీ షోకు జూ.ఎన్టీఆర్ యాంకర్‌గా వ్యవహరించగా రెండో షోకు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. సుమారు 18మందితో ప్రారంభమైంది. ఇందులో వివిధ రంగాలకు చెందిన వారున్నారు. ప్రతి వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. చివరకు తనీష్, కౌశల్, దీప్తి, గీతా మాధురి, సామ్రాట్‌లు ఫైనల్ పోరులో తలపడుతున్నారు. మద్దతు పొందిన కౌశల్ టైటిల్ సొంతం చేసుకున్నాడని, ప్రచారం జరుగుతోంది. రన్నరప్ గా గీతామాధురి నిలిచిందని చెబుతున్నారు. ఇక, నేడు ప్రసారం అయ్యే గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 2 విజేతను ప్రకటించేందుకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.

08:40 - September 30, 2018

ఇండోనేషియా : ప్రకృతి విపత్తులకు నిలయమైన ఇండోనేసియాను రాకాసి అలలు ముంచెత్తాయి. తీవ్రమైన భూకంపం, దాని పర్యవసానంగా వెంటనే సంభవించిన సునామీ పెను విషాదాన్ని నింపింది. సులవేసి దీవిలోని పాలూ నగరంలో  స్థానికులు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణలో తలమునకలయిన సమయంలో సునామీ ముంచెత్తింది. పాలూ నగరంలో భవనాలకు భవనాలే కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల 20 అడుగుల ఎత్తులో అలలు విరుచుకుపడ్డాయి. సునామీలో చిక్కుకొని దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  మరో 540 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడికక్కడ మృతదేహాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ విషాదం నెలకొంది.

దక్షిణ సులవేసి రాజధానిగా ఉన్న పాలూ నగరవాసుల జీవనం అస్తవ్యస్థమయింది. సముద్రం నీరు ప్రవేశిస్తుండడం, భవనాలు కూలిపోతుండడంతో దిక్కుతోచని ప్రజానీకం రోడ్లపై పరుగులు తీశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి 20 అడుగుల పొడవు ఉన్న చెట్లను కూడా ఎక్కారు. వందలాది మంది ఆచూకీ తెలియక సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. కొంతమందికి ఆరుబయటే చికిత్స చేయాల్సి వస్తోంది. ఇళ్లలోకి వెళ్లడానికి భయపడుతూ చాలా మంది బయటే తలదాచుకుంటున్నారు. అధికారులు దాదాపు 17 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఓ వ్యక్తి బురదలో కూరుకుపోయిన ఓ పసిబిడ్డ శవాన్ని వెలికితీసిన సంఘటన అక్కడి వారిని కలచివేసింది. ఓ షాపింగ్‌ మాల్‌లోని ఒక అంతస్తు భూమిలో కుంగిపోయింది. పలు చోట్ల భూమి చీలడంతో ప్రయాణించడం కష్టంగా మారింది. నగరానికి తలమానికంలా ఉండే వంతెన కూలిపోయింది. విద్యుత్తు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు నిలిచిపోవడంతో సమస్యలు అధికమయ్యాయి. మలేషియా మీదుగా వెళ్లే ఇతర దేశాల ఉపగ్రహాల సహాయంతో చిత్రాలు తీయించి వాటి ఆధారంగా సహాయ చర్యలు చేపట్టనున్నట్టు విపత్తు విభాగం ప్రకటించింది.

సునామీకి ముందు సులవేసి దీవిలో సంభవించిన భూకంపం అక్కడ తీవ్రమైన నష్టాన్ని నింపింది. భూమికి 10 కిలోమీటర్ల లోపల 7.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అనంతరం పాలూ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో దాదాపు వందసార్లు భూమి కంపించింది. ఇలాంటి చిన్న ప్రకంపనల వల్ల కూడా నష్టం అధికంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపం, సునామీ కారణంగా నష్టపోయిన మలేషియాకు భారత్‌ తరఫున సహాయం అందిస్తామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ఐరాస సమావేశాల్లో ప్రసంగిస్తూ ఆమె ఈ మేరకు ఓ  ప్రకటన చేశారు.

08:29 - September 30, 2018

విజయవాడ : దసరా పండుగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దసరా  వస్తోందంటే చాలు.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు అంతా రెడీ అవుతుంటారు. నగరంలో బిజీబిజీ జీవితం గడుపుతన్న వారితోపాటు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు కూడా పండుగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని  ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో పాటు స్పెషల్ బాదుడుకు సిద్ధమైంది...  పండుగ వేళ ప్రయాణికుల నుంచి అదనంగా  50శాతం చార్జీల భారం మోపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధమవుతోంది. అయినవారు దసరా పండుగకు స్వగ్రామానికి వెళ్తుంటారు.  పండుగకు తమ తమ స్వగ్రామాల్లో బంధువులతో ఆనందంగా గడపాలని చూస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అటు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను దసరా పండుగ సందర్భంగా ప్రతిఏటా నడుపుతోంది.

అక్టోబర్‌ మూడో వారంలో దసరా పండుగ వస్తోంది. దీంతో అక్టోబర్‌ 12 నుంచి 20వ తేదీ వరకు 9 రోజులపాటు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేకబస్సులను తిప్పేందుకు రెడీ అయ్యింది. పండుగ సెలవుల ప్రారంభం నుంచి చివరి రోజు వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణీకులకు అందుబాటులో ఉండనున్నాయి. సుమారు 1270 బస్సులను ప్రత్యేకంగా నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్లేవారిపై ఆర్టీసీ ధరల బాదుడుకు రెడీ అయ్యింది. టిక్కెట్‌ ధర మీద అదనంగా 50శాతం వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది.  ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణీకుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అటు ప్రైవేట్‌ సర్వీస్‌ ఆపరేటర్లు కూడా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణీకుల నుంచి అందినకాడికి దోచుకునేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చార్జీలపై వంద నుంచి రెండువందల శాతం వసూలు చేయడానికి రెడీ అవుతున్నాయి.  ప్రతి ఏటా పండుగపూట ప్రయాణీకుల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వసూలు చేస్తోన్న ప్రత్యేక ధరలను అదుపు చేయాలని ప్రయాణీకులు అంటున్నారు.  అవసరమైన మార్గాల్లో మరిన్ని సర్వీసులు నడపాలని వారు కోరుతున్నారు.

08:14 - September 30, 2018

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ టిడిపిపై విమర్శల జోరును పెంచారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు, ఆయన కుమారుడు లొకేష్‌లపై విమర్శలు గుప్పించిన పవన్‌ కళ్యాణ్...ఇపుడు వ్యూహం మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్-స్థానిక ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతూ...ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏకంగా రౌడీ ఎమ్మెల్యేగా పవన్‌ పేర్కొన్నారు. ఆయనపై అనేక కేసులున్నాయని వ్యక్తిగత విమర్శలతో దాడి చేశారు. పవన్‌ కళ్యాణ్‌ సరికొత్త వ్యూహంపై టిడిపి హైకమాండ్‌ అప్రమత్తమైంది. పవన్‌ వ్యాఖ్యలు ప్రాంతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, దీనిపై సంయమనం పాటించాలని...వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకూడదని పార్టీనేతలకు స్పష్టం చేసింది. పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసినా రాజకీయంగానే తిప్పికొట్టాలని టిడిపి శ్రేణులకు సూచించింది..పవన్‌ కళ్యాణ్‌ తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు టిడిపి ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన చింతమనేని వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. దమ్ముంటే దెందులూరులో పోటీ చేసి గెలవాలంటూ రాజకీయంగా తిప్పికొట్టారే తప్ప వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లలేదు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ విషయంలో టిడిపి ఆచి తూచి వ్యవహరిస్తోంది.

07:42 - September 30, 2018

విజయనగరం : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం  ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు యంత్రాంగం సమాయాత్తమవుతోంది. సిరిమాను జాతర మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. నెల రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు పందిరి రాట ఉత్సవంతో ప్రారంభమయ్యాయి. విజయనగరం పట్టణంలో మూడు లాంతర్ల జంక్షన్‌లో ఉన్న అమ్మవారి చదురుగుడి, రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న వనం గుడి దగ్గర పందిరి రాటలను వేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి దీక్షాదారులు, భక్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. 

అక్టోబర్‌ 22, 23 తేదీల్లో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు  సిద్ధమవుతున్నారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సుజయ కృష్ణ రంగారావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మంచినీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ద్యంతోపాటు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పైడితల్లి అమ్మవారి జాతరతోపాటు విజయనగరం ఉత్సవ్‌ను కూడా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అమ్మవారి సిరిమాను సంబరానికి రెండు రోజుల ముందు నుంచీ ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. విజయనగరం చరిత్రకు అద్దంపట్టేలా సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

07:33 - September 30, 2018

కర్ణాటక : మండ్య జిల్లా మళవళ్లి తాలూకా చిక్కబాగిలు గ్రామంలో దారుణ హ‌త్య జ‌రిగింది. పశుపతి, గిరీశ్ అనే ఇద్ద‌రు మంచి మిత్రులుగా పేరు తెచ్చుకున్నారు. ఐతే రెండు రోజుల కిందట ఓ సంఘటనకు సంబంధించి గిరీశ్‌‌- పశుపతి తల్లి మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ సమయంలో ప‌శుప‌తి త‌ల్లిని గిరీశ్ దూషించినట్టు స‌మాచారం. ఈ సంఘటన స్నేహితులిద్దరి మధ్య గొడ‌వ‌కు దారితీసింది. ఆ గొడ‌వ‌ను సీరియ‌స్‌గా తీసుకున్నప‌శుప‌తి, గిరీశ్‌ను హ‌త‌మార్చాల‌ని స్కెచ్ వేశాడు. స‌ర‌దాగా వెళ‌దామంటూ గిరీశ్‌ను స‌మీపంలోని కొళతూరు గ్రామం వరకు తీసుకెళ్లాడు. అక్కడ వాహనాన్ని నిలిపి.. కత్తితో గిరీష్‌ తల నరికాడు. హత్యానంతరం తలను తీసుకుని నిందితుడు 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మళవళ్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన తల్లిని నానా దుర్భాషలాడినందుకే హతమార్చినట్లు నిందితుడు పశుపతి పోలీసులకు చెప్పాడు.

07:21 - September 30, 2018

ఢిల్లీ : ఫేస్‌బుక్‌ యూజర్లు వెంటనే తమ ఖాతాలను లాగ్‌ అవుట్‌ చేసి మళ్లీ రీ-లాగిన్‌ అవడం మంచిదని సైబర్‌, ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 5కోట్ల ఖాతాలను యాక్సెస్‌ టోకెన్స్‌ను హ్యాకర్లు చోరీ చేసిన నేపథ్యంలో నిపుణులు ఈ సూచన చేస్తున్నారు. వీరి సూచనల ప్రకారం 'మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ ఇలా ఎందులో అయితే ఫేస్‌బుక్‌ లాగిన్‌ అయిన దాదాపు 2.3బిలియన్ల యూజర్లు ఇప్పుడు వాటిని లాగ్‌ అవుట్‌ చేసుకొని మళ్లీ రీలాగిన్‌ అవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మన ఖాతా భద్రత, గోప్యత సెట్టింగ్స్‌ను సమీక్షించుకున్నట్లు అవుతుందని ని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు. 

07:11 - September 30, 2018

ఢిల్లీ : ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఐదో సీజన్లో కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం చేసింది. కోల్‌కతాతో ఏటీకే జట్టుతో కేరళ జట్టు తలపడింది. తొలి మ్యాచ్‌లో 2-0 గోల్స్‌ తేడాతో కేరళ బ్లాస్టర్స్ విజయం సాధించింది. ప్రథమార్థలో ఇరుజట్లు ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేదు. ఐతే ఆఖరి పదిహేను నిమిషాల్లోనే కేరళ బ్లాస్టర్స్‌ రెండు గోల్స్‌ చేసింది. 77వ నిమిషంలో పోప్లాట్నిక్‌ తొలి గోల్‌ నమోదు చేయగా..86వ నిమిషంలో స్టోజనోవిచ్‌ మరో గోల్‌ చేసి కేరళను ఆధిక్యంలో నిలిపాడు.
ఐఎస్‌ఎల్‌ ఐదో సీజన్ ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా జరిగింది. కోల్‌ కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌, అట్లెటికో సహ యజమాని సౌరవ్‌ గంగూలీ, ఐఎస్‌ఎల్‌ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ, అథ్లెట్‌ హిమదాస్, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌, కేరళ బ్లాస్టర్స్‌ సహ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్‌ పాల్గొన్నారు.

 

 

06:56 - September 30, 2018

ఢిల్లీ : క్రికెట్‌లో నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఐసీసీ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. డకవర్త్ లూయిస్ స్టెర్న్ సిస్టంను ఐసీసీ అప్‌డేట్ చేసింది. అలాగే, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌, ఐసీసీ ప్లేయింగ్ కండీషన్లను తాజా చేర్చింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య ఆదివారం కింబర్లీలో ప్రారంభం కానున్న తొలి వన్డే నుంచే తాజా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2014లో డీఎల్ఎస్ సిస్టంను అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశపెట్టాక ఇది రెండో అప్‌డేట్. 700 వన్డేలు, 428 టెస్టుల తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్‌లో పలు నిబంధనలను మార్చింది.

06:46 - September 30, 2018

చైనా : జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్‌ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. అయితే చైనాలోని లిలీతాన్‌ అనే  మహిళా రైతు ఇంట్లో ఉన్న 40 సిమెంట్‌ బస్తాలను తీసుకుని గౌన్‌ కుట్టుకుంది. కేవలం 3 గంటల్లో వెడ్డింగ్‌ డ్రెస్‌నే కుట్టేసింది. సిమెంట్‌ బస్తాల గౌన్‌తో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో లక్షల మంది చూశారు. దీంతో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ ఫొటో తెగ హల్‌చల్‌ చేస్తోంది. పాపం ఈ గౌనును తన పెళ్లికి ధరించలేకపోయినందుకు తెగ బాధ పడుతోంది. ఎందుకంటే 2012లోనే ఆమె పెళ్లి జరిగింది. 

Don't Miss