Activities calendar

07 November 2018

21:35 - November 7, 2018

చెన్నై: సుప్రీంకోర్టు ఆదేశాలను తమిళనాడు పోలీసులు తు.చ తప్పకుండా పాటించినట్టున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలను కేసులతో భయపెట్టారు. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు అందిన సమాచారం ప్రకారం..దీపావళి బాణాసంచా కాల్చే సమయాన్ని పాటించని, సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 2100 కేసులు నమోదు చేసి... 650 మందిని అరెస్ట్ చేశారు. వీటిలో చెన్నైలో అత్యధికంగా 344, కోయంబత్తూరులో 184 కేసులు, విల్లిపురంలో 160 కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 291, 188, 268 కింద ఈ కేసులు నమోదు చేశారు.  సుప్రీం ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు బాణాసంచా కాల్చాలని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధలను పాటించని వారిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. 

21:08 - November 7, 2018

బెంగుళూరు: బళ్లారి మైనింగ్ బ్యారన్, కర్ణాటక మాజీ పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు గాలి జనార్ధనరెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. కాకపోతే ఈసారి ఆయన మైనింగ్ కేసులో కాదు, రూ.18కోట్ల ముడుపుల కేసులో సిటీ క్రైం బ్రాంచ్(సీసీబీ) పోలీసులు ఆయన్ని విచారించనున్నారు. ఆయనపై బెంగుళూరు పోలీసులు లుక్-ఔట్ నోటీసులు జారీచేశారు. 
బెంగుళూరు పోలీసు కమీషనర్ సునీల్ కుమార్ బుధవారం జరిగిన విలేకరుల సమావేశం లోచెప్పిన వివరాల ప్రకారం ...."సయ్యద్ అహ్మద్ ఫరీద్‌ అనే వ్యక్తి  2016-17లో ఆంబిడెంట్ గ్రూప్‌ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు. నెలకు 30 నుంచి 40 శాతం లాభాలు ఇస్తామని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చి. వారివద్ద నుంచి సుమారు రూ.600 కోట్ల మేరకు వసూలు చేశాడు. కొన్ని నెలల తర్వాత  పెట్టుబడి దారులకు లాభాలు ఇవ్వలేక పోవటంతో కొందరు పెట్టుబడిదారులు ఫరీద్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు డీజే హళ్లి పోలీసు స్టేషన్ లో ఫరీద్ పై కేసు నమోదు చేశారు.  కేసులో భాగంగా 2017 జనవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) కంపెనీలో సోదాలు చేసి విలువైన పత్రాలును స్వాధీనం చేసుకుంది. 
ఫరీదును విచారించగా.. ఈకేసు నుంచి బయటపడేయటానికి గాలి జనార్ధనరెడ్డితో రూ.18 కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పాడు. ఫరీద్ రూ.18 కోట్లను గాలి సూచనల మేరకు మధ్యవర్తులకు అందచేశాడు. మొదటగా రూ.18 కోట్లను రమేష్ కొఠారీ అనే బంగారం వర్తకుడికి ఇవ్వగా, రమేష్ ఆసొమ్ముతో 57 కేజీల బంగారాన్నికొని జనార్దన్ రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న అలీఖాన్‌ సూచనల  మేరకు బళ్లారికి  చెందిన రాజ్‌మహల్‌ జ్యూయలర్స్ యజమాని రమేష్ కి పంపించినట్లు తెలిపాడు.  
గత కొద్దిరోజులుగా వినియోగదారుల ఫిర్యాదులు పెరుగుతుండటంతో పోలీసులు విచారణ వేగం పెంచారు. విచారణలో భాగంగా రమేష్ కొఠారిని, రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  వీరి బ్యాంకు ఖాతాలను జప్తు చేసారు. కాగా ఈకేసులో గాలి జనార్ధన రెడ్డి ఈడీ అధికారులకు లంచం ఇవ్వజూపినట్లు ఆరోపణలు నమోదయ్యాయని ఒక వార్తా సంస్ధ తెలిపింది. కేసు విచారణ గమనించిన గాలి జనార్ధనరెడ్డి పరారయ్యారు. సెర్చ్ వారెంట్‌తో బెంగళూరు, బళ్లారిలోని జనార్దన్‌రెడ్డి నివాసాల్లో మూడు సీసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆయన్నుఅరెస్టు చేసేందుకు బెంగుళూరులోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసులు డూప్లికేట్ తాళంతో తెరిచి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండటంతో పోలీసులు లుక్-ఔట్ నోటీసులు జారీచేశారు. మరో వైపు ఏసీపీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని ఒక బృందం తెలంగాణాలో గాలిజనార్ధన రెడ్డి కోసం గాలిస్తోంది. 

 

19:30 - November 7, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం బెంగుళూరు వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించటానికి దేశంలోని   బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో చంద్రబాబు రేపు బెంగుళూరులో మాజీప్రధాని,జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడతో, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ బేటీ కానున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఇటీవల మద్దతు ఇచ్చారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు, యూపీ మాజీ సీఎం మాయావతి, లోక్ తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్‌తో భేటీ అయ్యి జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. తమిళనాడులో కీలక నేతగా ఉన్న డీఎంకే  పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కూడా రాహుల్-చంద్రబాబు భేటీని స్వాగతించారు. ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లి  డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ భేటీ కానున్నారు.

 

18:34 - November 7, 2018

హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీకి నామినేషన్లు వేసే తేదీ దగ్గర పడుతున్నాకాంగ్రెస్ పార్టీ సీట్ల విషయం తేల్చకుండా తాత్సారం చేయటం, సీట్ల విషయంపై  లీకులివ్వటం పట్ల మిగిలిన పార్టీలను అసహనానికి గురిచేస్తోంది. తెలంగాణా జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్.కోదండరాం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డితో బుధవారం హైదరాబాద్లో సమావేశం అయ్యారు. కూటమిలో కాంగ్రెస్ వ్యవహార శైలిపై నాయకులు చర్చించినట్లు తెలిసింది. మహాకూటమిలో భాగస్వాములమైన మాకు సీట్లు కేటాయింపు జరపకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్నిస్ధానాల్లో ప్రచారం చేసుకోవటం పట్ల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఐ, జనసమితి కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న స్ధానాలు, సీట్ల సంఖ్యపై కూడా అసంతృప్తితో ఉన్నాయి. ఈనేపధ్యంలో రెండు పార్టీల నేతలు భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఈ భేటీ పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పందిస్తూ కేవలం  స్నేహ పూర్వకంగా కలవడానికి వచ్చానని చెప్పారు. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి, నారాయణ కూడా పాల్గొన్నారు. 

17:38 - November 7, 2018

ఢిల్లీ: తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక  దాదాపు ఖరారు అయ్యింది. గత రెండు రోజులుగా ఢిల్లీ లోని కాంగ్రెస్ వార్ రూమ్ లో  రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్త చరణ్ దాస్ నేతృత్వంలో 2 రోజుల పాటు కమిటీ సభ్యులు అభ్యర్ధుల ఎంపికపై చర్చించారు.  గతంలో ఎంపీలు గా పోటీ చేసిన వారు కూడా ఈసారి  శాసన సభ బరిలో ఉండేందుకు సిధ్దమవటంతో వారి విజయవకాశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఆమె పోటీ చేసే స్ధానంతో పాటు మెదక్ జిల్లాలోని మిగతా స్దానాలపై  పైనా కమిటీ సభ్యులు చర్చించారు. దాదాపు 20 స్ధానాల్లో ఉన్న ఆశావహులను బుజ్జగించాలని కమిటీ నిర్ణయించింది. రేపు ఉదయం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి మళ్లీ తుది రూపు ఇస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు .యూపీఏ ఛైర్ పర్సన్  సోనియాగాంధీ నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయి అభ్యర్ధులను ఖరారు చేస్తుంది. ఎల్లుండి అభ్యర్ధులను ప్రకటిస్తారు.

16:15 - November 7, 2018

హైదరాబాద్: ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పోలీసు నిఘా పెరిగింది. అక్రమంగా డబ్బు తరలించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.  హైదరాబాద్లో  బుధవారం 7న్నర కోట్లకు పైగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది.  ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు జరిపిని తనిఖీల్లో  రూ.7,71.25.510 నగదును స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో కారులో తరలిస్తున్న రూ.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈడబ్బుకు సరైన పత్రాలు చూపించకపోవటంతో నగదు తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నిందితులపై 171(బీ), 468, 471, 420, 120(బీ) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
మరో వైపు బంజారా హిల్స్లోని షాఇనాయత్ గంజ్ వద్ద రూ.2,71.25.510 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ము ముంబై .ఢిల్లీ ,నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు చెపుతున్నారు. హావాలా సొమ్మా, లేక ఎన్నికల కోసం ఎవరైనా తెప్పించారా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక హైదరాబాద్ లో ఇంత పెద్ద మొత్తంలో  నగదు పట్టుబడటం ఇదే మొదటిసారి. 

15:30 - November 7, 2018

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధనరెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారు.  ఆయన కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు. ఒక కేసులో "అంబిడెంట్" కంపెనీని ఈడీ నుంచి తప్పించేందుకు జనార్ధన్‌రెడ్డి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగాను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టురేట్ కు చెందిన అధికారులకు కోటి రూపాయలు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు గాను, గాలి అంబిండెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారం తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరు, బళ్లారి,ఢిల్లీ లోని ఆయన నివాసాల్లో  పోలీసులు దాడులు చేశారు. అయినా ఆయన అప్పటికే తప్పించుకున్నారు. ఈకేసులో అరెస్టు చేస్తారని తెలిసిన గాలి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈకేసులో ఆయనకు సహకరించిన ఆలీఖాన్ అనే వ్యక్తికి బెంగుళూరులో బెయిల్ దొరికింది. గాలి జనార్ధనరెడ్డి ఆయన అనుచరుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసు బృందం హైదారాబాద్లో గాలిస్తోంది. 2014 లో  రూ.500  కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని, అంబిండెంట్ సంస్ధపై, ఈడీ, సీసీబీ అధికారులు సంస్ధ చైర్మన్ ఫారిద్ ను విచారిస్తున్నారు. ఈ కేసు నుంచి ఫారిద్ ను తప్పించేందుకు, ఈడీ అధికారులకు లంచం ఇచ్చేందుకు, గాలి ఒప్పందం కుదుర్చుకుని, ఈడీ అధికారులకు లంచం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం గాలి కోసం బెంగుళూరు పోలీసుల తెలంగాణాలో గాలిస్తున్నారు. 

కాగా....గాలి జనార్ధన రెడ్డి  పరారీ పై  ఆయన ప్రధాన అనుచరుడు బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు స్పందించారు. తనకు ఈ విషయం తెలియదని, తాను ఈ వార్తను టీవీల్లో చూశానని చెప్పుకొచ్చారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని,చట్టానికి ఎవరూ అతీతులు కారని శ్రీరాములు వ్యాఖ్యానించారు.   

13:56 - November 7, 2018

ఢిల్లీ : ఢిల్లీ నుండి గల్లీ వరకు చూసుకుంటే సీమ టపాకాయల్లాంటి మాటలతో ప్రజలను ఆకట్టుకునే నేతలు మనదేశంలో కొదవేం లేదు. మరి ఈ దీపావళి సందర్భంగా క్రాకర్స్ కు పొలికల్ ను జత చేస్తే  టాపాకాయల్లాంటి తమ మాటలతో ఏఏ నేతలున్నారో కాసేసు సరదాగా చూసేద్దాం..

మేడిన్ గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ..
మేడిన్ గుజరాత్ నుండి తయారైన ఈ పొలిటికల్ క్రాకర్ అందరికంటే ఫస్ట్ వచ్చేశారు. ప్రధాని అయిన అనంతరం ఆకాశంలోకి వెళ్లాక ఆయన తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు ఆకాశంలోకి వెళ్లాకు పేలిన బాంబులాగా తయారయ్యాయి. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి పలు సంచలనాత్మక నిర్ణయాలు అంచనాలకు తల్లకిందులు చేస్తు అట్టర్ ప్లాప్ అయ్యాయి. మరి ఈ పొలిటికల్ రాకెట్ 2019లో వచ్చే ఎన్నికల్లో తన గమ్యాన్ని చేరుతుందో లేదో  వేచి చూడాలి..
వారసత్వ రాజకీయాల్లో చిచ్చుబుడ్డి రాహుల్  గాంధీ..
వారసత్వ రాజకీయాల్లో చిచ్చుబుడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత అంతకు ముందుకు వున్న రాహుల్ కు చాలా తేడా వుంది. పగ్గాలు చేతికొచ్చాక రాహుల్ చిచ్చుబుడ్డిలా రెచ్చిపోతున్నారు, అధికార పార్టీపై మాటలతో విరుచుకుపడుతున్నారు. కాగా కొన్నిసార్లు మాటలతో వెలిగిపోయే రాహుల్ కొన్ని సందర్భాల్లో మాత్రం తుస్సుమంటారు ఆ పార్టీ నేతలే అంటుంటారు. మరి మన దీపావళి చిచ్చుబుడ్డి మన రాహుల్ గాంధీ అన్నమాట. 
టెన్ థౌజెంట్ వాలా కేసీఆర్..
తెలంగాణలో టెన్ థౌజెంట్ వాలా వంటివారు. మాటలతో మంత్రం వేసేస్తారు. ఎంతటివారినైనా సన్నాసులు, దద్దమ్మలు, వాజమ్మలు అంటు బాంబుల్లాంటి మాటలతో చిత్తు చేసేస్తారు మన కేసీఆర్. తన మాటలతో వినేవారిని మంత్రముగ్ధుల్ని చేసేస్తారు.
uttam and ktr కోసం చిత్ర ఫలితంథౌజంట్ వాలాలా కేటీఆర్..
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటారు. కేటీఆర్ మాటల వెల్లువలో తండ్రికి చాలా పోలికలున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి..తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలతో కోటలు కట్టేస్తారు. ఇప్పటివరకూ సైలెంట్ గావున్న ఉత్తమ్ ఎన్నికల వేళ మాత్రం సైటెంట్ గా వుండి దీపావళి తాటాకు బాంబ్ లాగా ఒక్కసారిగా సౌండ్ రేంజ్ చేస్తు పేలిపోతారు. అందుకే ఆయన దీపావళి తాటాకు బాంబ్ అన్నమాట.
నారా చంద్రబాబు నాయుడు..
రాజకీయాలలో అపర చాణుక్యుడికి ఏమాత్రం తీసిపోరు. అనవసరమైన మాటలు..అనవసరమై వ్యాఖ్యలు చేయరు. పొలిటికల్ మంత్రాంగంలోను, యంత్రాంగంలోను ఆయనను మించినవారు లేరంటే అతిశయోక్తి లేదు. తన తెలివితేటలతో రాష్ట్రాన్ని అందనంత ఎత్తుకు తీసుకెళ్లాలంనుకుంటారు. అందుకే ఆయన అవ్వాయల్ సువ్వాయ్ రాకెట్ లాంటివారు. pawan and jagan కోసం చిత్ర ఫలితం
జనసేన పవన్ కళ్యాణ్..
టైమ్ బాంబ్ లాంటివారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సరిగ్గా ఎన్నికల టైమ్ చూసుకుని పేలేందుకు సిద్ధంగా వున్నారు పవన్. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలమీద బాంబుల్లాంటి మాటలతోవిరుచుకుపడ్తున్నారు పవన్. ఏపార్టీతోనైనా పొత్తులు పెట్టుకుంటారనే ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తు తాను ఒంటరిగానే పోటీచేస్తాననీ..తాను సీఎం అవుతానని ప్రత్యర్థుల గుండెల్లో బాంబు పేల్చేశారు. మరి ఈ పొలిటికల్ టైంబాంబ్ 2019 ఎన్నికల్లో పేలుతుందో లేదో చూడాలి.

vijayashanthi and roja కోసం చిత్ర ఫలితంఇక పాదయాత్ర అటు భూచక్రంలా తిరుగుతు మెరుపులు మెరిపంచే జగన్ 2019 ఎన్నికల్లో వెలుగులు పంచుతారో లేదో చూడాలి. అలాగే జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు చిటపటలాడుతు కనిపిస్తుంటారు. చిటపటల మాటలతో మెరిసిపోతుంటారు జేసీ.

ఇక మహిళా లీడర్స్ లో రోజా,విజయశాంతి లక్ష్మీ బాంబ్ లాంటివారు. లక్ష్మీబాంబ్ ల్లాంటి డైలాగ్స్ తో విరుచుకుపడుతుంటారు ఈ మహిళా మణులు. ఇలా పొలిటికల్ బాంబ్ లు రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఎలా చాటుతారో వేచి చూద్దాం.

 
13:05 - November 7, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా మహాకూటమితో చేతులు కలిపిన వాపపక్ష పార్టీ తనకు పట్టు స్థానాలలో సీట్లు కేటాయించకపోవటంతో అలిగింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెైస్ కు డెడ్ లైన్ ఇచ్చిన సీపీఐ పార్టీ కార్యదర్శి అలకబూనారు. దీంతో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కూటమిలో భాగస్వామి అని కోదండరాం చాడను బుజ్జగిస్తున్నారు. సీపీఐ కార్యాలయం అయిన మగ్ధీంభవన్ కు చేరుకున్న కోదండరాం సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటు అలిగిన చాట వెంటకరెడ్డిని బుజ్జగించేందుకు యత్నిస్తున్నారు. కాగా నాలుగు అసెంబ్లీ స్థానాలు, రెండు ఎమ్మెల్సీ స్థానాలు కోరగా..కాంగ్రెస్ మాత్రం  మూడు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే ఇస్తానని తేల్చి చెప్పటంతో చాడ కూటమి నుండి వైదొలగే యోచనలో వున్న నేపథ్యంలో కోదండరాం చర్చలు కొనసాగిస్తున్నారు. కాగా చాడ వినని పక్షంలో సీపీఐ జాతీయ అధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డితో కోదండరాం భేటీ అయ్యే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క స్ర్కీనింగ్ కమిటిలో  భాగంగా ఈరోజు ఢిల్లీలో భేటీ కానున్న నేపథ్యంలో జాతీయ సీపీఐ కార్యదర్శి సురవరంతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఏది  ఏమైనా ఈరోజు సాయంత్రానికి చర్చల్లో స్పష్టత వచ్చి సీట్ల కేటాయింపులు ఖరారుకానున్నట్లుగా తెలుస్తోంది. 
 

 

11:42 - November 7, 2018

కర్ణాటక : మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. విలాసవంతమైన జీవితానికి గాలి కేరాఫ్ అడ్రస్. అలాగే వివాదాలకు కూడా ఆయన కేంద్ర బిందువు. సీబీఐ కేసుల్లో భాగంగా భారీ అక్రమాస్తుల కేసు, మైనింగ్ మాఫియా వంటి బడా బడా కేసుల్లో వున్న గాలి మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు.

బెంగళూరులోని అంబిడెంట్ కంపెనీ విదేశీ పెట్టుబడుల విషయంలో విచారణను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గాలి వర్గీయులు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సమస్యను పరిష్కరించేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా కంపెనీ 57 కేజీల బంగారు కడ్డీలను రహస్యంగా అందించింది. దీంతో రంగంలోకి దిగిన గాలి జనార్దన రెడ్డి ఓ ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

బెంగళూరు, బళ్లారి, హైదరాబాద్, ఢిల్లీ సహా పలుచోట్ల గాలి జనార్దన రెడ్డి నివాసాలు, ఆఫీసులపై దాడులు నిర్వహించారు. కాగా, ఈ దాడుల గురించి ముందే తెలుసుకున్న గాలి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, లంచం విషయంలో గాలిని త్వరలోనే ప్రశ్నిస్తామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చిన వ్యవహారంలో గాలి జనార్దనరెడ్డికి నోటీసులు జారీచేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జనార్దనరెడ్డిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.

 

11:14 - November 7, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్, భారతదేశాల మధ్య వుండే నిబంధలను ఉల్లంఘింటం పాకిస్థాన్ కు పరిపాటిగా మారిపోయింది. పలుమార్లు కాల్పుల ఒప్పందాలను ఉల్లంఘించిన పాకిస్థాన్ ఇప్పుడు మరో ఉల్లంగనకు పాల్పడింది. భారత్ అభ్యంతరాలను తోసిపుచ్చి పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా, పాకిస్థాన్ మధ్య సోమవారం రాత్రి బస్సు సర్వీసు ప్రారంభమైంది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న గుల్బర్గ్ ప్రాంతం నుంచి పీవోకే మీదుగా చైనా జిన్‌జియాంగ్ రాష్ట్రం కష్ఘర్ నగరానికి తొలి బస్సు సర్వీసు నడిచింది. చైనా- పాకిస్థాన్ ఎనకమిక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా పాక్, చైనా ఈ బస్సు సర్వీసును నడుపుతున్నాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం నాడే బస్సు సర్వీసు ప్రారంభించాల్సి ఉంది. కానీ దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న మహిళ అసియా బీబీని పాక్ సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో సదరు బస్సు సర్వీసును సోమవారం రాత్రి ప్రారంభించారు. పాక్ ఎకనమిక్ ఫొరం చైర్మన్ ఇక్బాల్ షమీ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు దేశాల సంబంధాల్లో ఇది చాలా మంచి రోజని పేర్కొన్నారు. పీవోకే మీదుగా పాక్- చైనా మధ్య బస్సు సర్వీసు నిర్వహించడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది.
 

10:54 - November 7, 2018

ఉత్తరాఖండ్: ప్రధాని నరేంద్రమోదీ కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. కేదార్‌నాథ్ ఆలయ పరిసర ప్రాంతాలను ప్రధాని పరిశీలించారు. అక్కడి భక్తులతో కాసేపు ముచ్చటించారు. దీపావళిని పురస్కరంచుకుని మోదీ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపిన మోడీ... 
ప్ర‌ధాని మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఈ దీపావ‌ళి వెలుగులు నింపాల‌ని, ప్ర‌జ‌ల జీవితాల్లో సంతోషాలు నెల‌కొనాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

 

 
 
 
 
10:11 - November 7, 2018

తమిళనాడు : దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసినందుకు వారంతా అరెస్ట్ అయ్యారు. కాగా దీపావళికి బాణాసంచా కాల్చుకోవటాన్నిరాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు 2గంటలకు పరిమితంచేస్తూ తీర్పు చెప్పింది.  వాస్తవానికి గత ఏడాది బాణాసంచా విక్రయాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ వేళ తమిళనాఢు అంతటా టెన్షన్, టెన్షన్ వాతావరణం నెలకొంది. పండుగ సందర్భంగా నిన్న ఉదయం 6 గంటల నుంచి 7 వరకూ.. తిరిగి రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో బాణసంచా కాల్చుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను చాలాచోట్ల ప్రజలు పట్టించుకోలేదు. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు కొరడా ఝులిపించారు. తమిళనాడు వ్యాప్తంగా 1,000 మందిపై కేసులు నమోదుచేశారు. వీరిలో 600 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, 400 మంది ప్రజలు బెయిల్ పై బయటకు వచ్చారు. మిగతావారిని కోర్టులో హాజరుపర్చి డిమాండ్ కు తరలించారు. 
 

09:52 - November 7, 2018

హైదరాబాద్ : తెలంగాణలో సరిగ్గా నెల రోజుల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, పలువురు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ, టికెట్లను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన పలువురు, టీఆర్ఎస్ ను ఓడించాలన్న లక్ష్యంతో తమకు పట్టున్న స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. 

వీరిలో కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కార్, మెదక్ నుంచి విజయశాంతి, ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరితో పాటు, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జడ్చర్ల నుంచి మల్లు రవి, కంటోన్మెంట్ నుంచి సర్వే సత్యనారాయణ కూడా తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో వీరి పేర్లు ఖరారైనట్టు సమాచారం.
తెలంగాణ, ఎన్నికలు, కాంగ్రెస్, టిక్కెట్స్, ఖరారు, మాజీ ఎంపీ, విజయశాంతి, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, రమేశ్ రాథోడ్, 

09:29 - November 7, 2018

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల రైతుల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీజేపీ అహంకారానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు గుణపాఠమన్న ఆయన మోదీ పాలన రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతోందన్నారు. కేంద్ర విధానలకు ఎండగడుతు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలను త్వరిత గతిన పూర్తి చేసి రాజధాని ప్రాంతంలో నిర్వహించే  ముగింపు సభకు  జాతీయ నేతలను ఆహ్వానించాలని  చంద్రబాబు నిర్ణయించారు.  

అహంభావం ఉంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలకు కళ్లు తెరిపిస్తారనీ తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిర్వహిస్తున్న ధర్మ పోరాట సభలను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈనెల 10న నెల్లూరులో 8 ధర్మ పోరాట సభ, 27న విజయనగరంలో,డిసెంబర్లో అనంతపురం, శ్రీకాకుళంలలో ఈ సభలను నిర్వహించనున్నారు. అనంతరం జనవరిలో రాజధాని ప్రాంతంలో చివరి ధర్మపోరాట సభను కృష్ణా, గుంటూరులకు సంబంధించి చివరి సభను భారీగా నిర్వహించాలని ఈ సభకు జాతీయ నేతలను ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా సమావేశంలోతెలిపారు.  

08:54 - November 7, 2018

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచార ప్రణాళిక ఖరారైంది. ఈ నెల 12 నుంచి ఆయన తదుపరి ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లా సభలతో పాటు నియోజకవర్గాల పర్యటనలూ ఇందులో ఉన్నాయి.  పార్టీ ముఖ్యనేతలతో సీఎం మంగళవారం సమావేశమై ప్రచార ప్రణాళిక గురించి చర్చించారు. దీని ప్రకారం  చివరి మూడు రోజుల పర్యటనలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అంతకుముందు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 

దాదాపు 23 రోజుల పాటు నిరంతరం ఆయన సభల్లో పాల్గొననున్నారు. ప్రతి రోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనే వీలుంది. మొత్తంగా 100 నియోజకవర్గాల పర్యటనలు జరపాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.  పార్టీ బలంగా ఉందని భావిస్తున్న సిద్దిపేట, సిరిసిల్ల, హుజురాబాద్‌, బాన్సువాడ తదితర కొన్ని నియోజకవర్గాల్లో అవసరమైతేనే ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు. హైదరాబాద్‌లో పర్యటనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కీలక సెగ్మెంట్లలో 3 రోజుల పాటు సభల్లో పాల్గొంటారు.   మరోవైపు తెరాస ఎన్నికల తుది ప్రణాళిక సిద్ధమైంది. ఎన్నికల కమిటీ మంగళవారం సీఎంకు సమర్పించింది. రెండు రోజుల పాటు పరిశీలించిన తర్వాత కేసీఆర్‌ కమిటీతో సమావేశమై ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేయించే అవకాశం ఉంది. అనంతరం తుది ప్రణాళికను విడుదల చేయనున్నారు.
12 స్థానాలపై చర్చలు.. 
సీఎం కేసీఆర్‌  12 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక జాబితాను పరిశీలించారు. ఇప్పటికే ప్రచారంలో, ప్రతిపాదనల్లో ఉన్న వారు గాక అనూహ్యంగా కొన్ని కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం మంగళవారం తెరాస అభ్యర్థులు పలువురికి ఫోన్లు చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచార సరళిని తెలుసుకొని, ఉత్సాహంగా ముందుకు సాగాలని సూచించారు.
 

08:27 - November 7, 2018

ఢిల్లీ : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఆశావహుల బలాబలాలు, సామాజిక సమీకరణాలు భేరీజు వేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి దిల్లీ వార్‌ రూమ్‌లో మంగళవారం స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 11.30 గంటలు దాటినా కొనసాగింది. కాంగ్రెస్‌ తెలంగాణ స్క్రీనింగ్‌ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్‌, సభ్యులు శర్మిష్ఠ ముఖర్జీ, జోతిమణి సెన్నిమలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ, మండలి పక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలపై చర్చించారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి పాత జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలపై కసరత్తు సాగింది. కొద్దిసేపు విరామం తర్వాత హైదరాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌ పాత జిల్లాలపై చర్చించారు. ఏడుగురు మాజీ ఎంపీలను శాసనసభ బరిలో నిలపాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డి, మంచిర్యాలలో అరవిందరెడ్డి, ప్రేమసాగర్‌రావుల అభ్యర్థిత్వంపై ఎక్కువగా చర్చ సాగినట్లు తెలిసింది. స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అనంతరం పరిశీలించిన పేర్లను కమిటీ కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీకి అందజేయనుంది. 8వ తేదీన ఎన్నికల కమిటీ భేటీ అయి అభ్యర్థుల తుది జాబితాకు ఆమోదముద్ర వేయనుంది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ ఈరోజు మరోసారి భేటీ కానుంది.

 

 

07:21 - November 7, 2018

హైదరాబాద్ : దీపం ప్రాణానికి ప్రతీక. పరమాత్మకి ప్రతిరూపం. అందుకే ఏపూజకైనా ముందు దీపారాధనతోనే ప్రారంభిస్తారు. దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. ఏ ఉపచారాలూ చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలంటారు పెద్దలు. ముక్కోటి దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీకటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపాన్ని ఎలా ఆరాధించాలీ, దీపారాధన సమయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించాలీ మొదలైన అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పెద్దలు.

Image result for deepavaliపంచ భూతాత్మక సృష్టికి ప్రతీక దీపం. దీప కాంతి జ్ఞానానికీ, శుభానికీ, శాంతికీ సంకేతమనే ఆర్య భావనా సంస్కృతి మనది. పర్యావరణహితంగా పూలు, రంగవల్లులు వాటి నడుమ వెలిగే అందమైన దీపాలు మనలో ఆనందాలు నింపే అసలైన వెలుగులు. ఒక చిన్న దీపం గదిలోని చీకటినంతటినీ తరిమేస్తుంది. అలాంటిది మంచి మనసుతో బంధాల అమరికతో ఒదిగిన కుటుంబమంతా కలిసి దీపాల వరుసను పేర్చి దీప జ్యోతిని ఆరాధిస్తే ఇల్లంతా నిజ కాంతితో వెలిగిపోతుంది. దీపారాధన భారతీయులకు నిత్య సమారాధన. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దేవుడి ముందు దీపాలను వెలిగించి అంతా మంచే జరుగాలని కోరుకుంటాం. ఏదైనా మంచి పనిని మొదలు పెట్టేముందు జ్యోతి ప్రజ్వలనం చేసి నిరాటంకంగా అనుకున్న పని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తాం. అలాగే దీపావళి రోజు ప్రపంచంలోని చెడంతా నశించి మంచితో నిండిపోవాలని వెలిగించే దీపాలు జీవిత వెలుగులకు సంకేతాలుగా భావించాలి. ఆ దీపాల వెలుగులను ప్రతీ ఒక్కరూ తమ జీవితాలను ఆపాదించుకునే వెలుగులను నింపుకోవాలి. అప్పుడే దీపావళి పండుగకు అసలైన నిర్వచనం.

‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటుంది వేదం... చీకటి నుంచి వెలుగులోకి నన్ను నడిపించు అని దీని అర్థం... చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు. చిన్న దివ్వెను వెలిగించిచూడు అనే అమృత ప్రబోధమే దీపావళి ఆంతర్యం. చీకటిని దుఃఖానికి, వెలుగును సంతోషానికి ప్రతీకలుగా భావిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇవి రెండూ తప్పవు. దుఃఖాన్ని జయించి, ఆనందాన్ని సాధించాలన్న మనిషి యత్నానికి దీపావళి ఓ సంకేతం. సత్యం నుంచి సత్యంలోకి, చీకటి నుంచి వెలుగులోకి, మృత్యువులోంచి అమర్వతంలోకి నడిపించమనే వేదవాక్కు దీపావళి పండుగలో ఒప్పారే దివ్య సందేశంగా విరాజిల్లుతూ మన జీవితాలను వెలుగులమయం చేయాలని ఆకాంక్షిద్దాం. దీపావళి పర్వదినం సందర్భంగా 10టీవీ సోషల్ మీడియా వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు..

 

 

 

 

 

Don't Miss