Activities calendar

02 December 2018

21:20 - December 2, 2018

ఖమ్మం: ఖమ్మంజిల్లా ముదిగొండ మండలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరం ఈరోజు తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులకు దారితీసింది.  ముదిగొండ మండలంలోని సువర్ణాపురంలో డబ్బులు పంచటానికి టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంక్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారనే సమాచారంతో టీఆర్ఎస్ కు చెందిన ఒక వ్యక్తిని కాంగ్రెస్  కార్యకర్తలు ఆధారాలతో సహాపట్టుకుని పోలీసు స్టేషన్ లో అప్పగించారు. 

ఆదివారం సాయంత్రం సువర్ణాపురంలో జరిగిన ప్రజాకూటమి బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.  అదే సభలో ఉదయం పోలీసు స్టేషన్లో అప్పగించిన వ్యక్తి కనపడటంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో, పోలీసులు టీఆర్ఎస్ కొమ్ముకాస్తున్నరని పోలీసులపై ఆరోపణలు చేశారు. దీంతో విషయం తెలుసుకున్నభట్టి కాంగ్రెస్ కార్యకర్తలతో ముదిగొండ పోలీసు స్టేషన్ వద్దధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసుస్టేషన్ వద్దకు చేరుకుని పోటీగా ధర్నా నిర్వహిస్తున్నారు. పోలీసుస్టేషన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్ధితి ఉద్రిక్తంగా ఉంది. 

20:37 - December 2, 2018

సికింద్రాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజాకూటమిలో 13 సీట్లతో సాధించేది ఎమున్నదని, ఆంధ్రానువదిలి ఇక్కడకు వచ్చి వెకిలిమకిలి రాజకీయాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.  టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో తెలుగువారందరూ సంతోషంగా ఉన్నారని, చంద్రబాబునాయుడు ఇక్కడకొచ్చి తెలుగువారు,తెలుగువారని హైదరాబాద్ లోఉన్న తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ విశ్వనగరమని ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని  ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఉన్న వారందరూ హైదరాబాదీ గా గర్వపడండి కానీ , మేము వేరు ఆంధ్రా వాళ్ళం అని అనుకోవద్దని కోరారు. 
గత పాలకులు కమర్షియల్ ఆలోచనతో భాధ్యతా రహితంగా  వ్యవహరించటం వలన  హైదరాబాద్ నగరం విధ్వంసం అయ్యిందని ఆయన చెప్పారు.12 మున్సిపాలిటీలను జహెచ్ఎంసీలోకలిపేశారని,  గతంలో నగరంలో  కరెంట్ కోతలు ఉండేవని ,అపార్ట్మెంట్ వాసులు డీజిల్ కొనుగోలుకు విపరీతంగా డబ్బు ఖర్చు చేసేవారని ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదని, 24 గంటల పాటు  పరిశ్రమలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
ప్రశాంతనగరం హైదరాబాద్ 
గత నాలుగున్నరేళ్లలో హైదరాబాద్ లోకర్ఫ్యూలు  లేవు, 144 సెక్షన్లు లేవని మతకల్లోలాలు అసలే లేవని ఆయన చెప్పారు. గతంలో శివారు ఫ్రాంతాల్లో మంచినీటికి ఇబ్బందిఉండేదని హైదరాబాద్ లో మంచినీటి  సరఫరాకోసం 2 రిజర్వాయర్లు నిర్మాణంలోఉన్నాయని  కేసీఆర్ చెప్పారు. 
వెయ్యికోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటుచేసి మూసీ నది ప్రక్షాళన చేపట్టామని కేసీఆర్ చెపుతూ ...తనకు అందిన తాజా సర్వే ప్రకారం టీఆర్ఎస్  పార్టీ 100 పైచిలుకు సీట్లతో అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

19:42 - December 2, 2018

హైదరాబాద్: భవిష్యత్తులో ఇంక ఎన్నికల్లో పోటీచేయనని  ఇవే తన చివరి ఎన్నికలని ఎంఐఎం నేత,చాంద్రాయణగుట్ట అభ్యర్ధి అక్బరుద్దీన్ ఒవైసీ  చెప్పారు. తన ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా ఈనిర్ణయంతీసుకున్నాని ఆయన తెలిపారు. ఆదివారం యాకుత్ పురాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.... నా కిడ్నీలు 2 చెడిపోయాయని, కిడ్నీల దగ్గర కొన్నితూటా ముక్కలు ఉన్నాయని, డాకర్లు డయాలసిస్ చేయించుకోమనిచెప్పారని తెలిపారు.  నా ఆరోగ్యం చూసుకోటానికే సమయం సరిపోవటంలేదని ఆయన  చెప్పారు. ఇన్నాళ్లు తాను తనకోసం పోటీ చేయలేదని తనకమ్యూనిటీకి సేవ చేయడానికి పోటీ చేసానని అన్నారు. 

19:27 - December 2, 2018

సికింద్రాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ 24 అంశాలతో కూడిన మేనిఫెస్టోను  సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన  ప్రజాఆశీర్వాద సభలో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా 
>వృధ్దాప్య పించనువయస్సు 57ఏళ్లకు తగ్గింపు
>రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంచటం
>ఆసరా ఫించను రూ.2016 కు పెంపు
>వికలాంగుల ఫించను రూ.1500 నుంచి రూ.3,2016 కు పెంపు
>సొంత స్ధలం ఉన్నవారికి ఇల్లుకట్టుకోడానికి రూ. 5-6లక్షల రుణసాయం
>రైతులకు  లక్షన్నర వరకు రుణమాపీ
>నిరుద్యోగ భృతి రూ.3,016 కు పెంచంటం
>ప్రభుత్వ ఉద్యోగులకు  పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 ఏళ్లకు పెంపు
>రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు 
>ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో పాటు ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల నిర్వహణ భాధ్యత అప్పగింత
>ఫ్రతి వ్యక్తికి హెల్త్ ప్రోఫైల్ రికార్డ్ 
>ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణ
>ఉద్యోగ నియామకాల వయో పరిమితి మూడేళ్ల పెంపు
>పోడుభూముల వివాదాలకు త్వరితగతిన  పరిష్కారం
>బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ  స్ధాపనకు చర్యలు
>సింగరేణి భూముల్లో కట్టుకున్న ఇళ్లకు పట్టాలు
>ఆర్ధికంగా వెనుకబడిన  కులాల వారికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు
>కంటి వెలుగు తరహాలో ఇతర ఆరోగ్య సమస్యలకు  వైద్యశిబిరాలు
>చట్ట సభల్లో బీసీలకు,మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకోసం పోరాటం
>ఎస్టీలకు,మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రంతో పోరాటం 

17:55 - December 2, 2018

సంగారెడ్డి : తెలంగాణాలో  నివసించే  తెలంగాణేతరులకూ లోకల్ సర్ఠిఫికెట్లు ఇస్తామని ముఖయమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.  వచ్చే ప్రభుత్వ హయాంలో మెట్రో రైలును పఠాన్ చెరు వరకు పొడిగిస్తామని కూడా ఆయన పఠాన్ చెరు ఓటర్లకు హామీ ఇచ్చారు . సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ప్రభుత్వంలో ఇంటి స్ధలం ఉన్నవారికి కూడా ఇల్లు నిర్మించుకునేందుకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పధకంలో నిధులు మంజూరూ చేస్తామని, గవర్నమెంట్ వచ్చిన 10 రోజుల్లో పఠాన్ చెరు లో పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు జీవో ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.  ఈప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణేతరులు ఆంధ్రా వాళ్ళమనే భావన వదిలి పెట్టి తెలంగాణావారిగా బతకండి అని ఆఁధ్రా, రాయలసీమ ప్రజలకు చెప్పారు.  గత నాలుగున్నరేళ్లలో  ఆంధ్రా,తెలంగాణా అనే విభేదాలు లేకుండా పరిపాలించామని, పఠాన్ చెరు మినీ ఇండియా అని కేసీఆర్ చెప్పారు. మహీపాల్ రెడ్డి 70 శాతం ఓట్లతో గెలుస్తాడని నాదగ్గర ఉన్నసర్వేల్లోతేలిందని  కేసీఆర్ ధీమావ్యక్తం చేశారు. 

17:05 - December 2, 2018

హైదరాబాద్: కేసీఆర్ గతాన్ని మర్చిపోయి నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని ఏపీ సీఎం, టీడీపీ జాతీయఅధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. తాను తెలంగాణాలో పెత్తనం చేయటానికివచ్చానని కేసీఆర్  అంటున్నారని,తాను తెలంగాణా ప్రజలకుసేవ చేయటానికి వచ్చానని చంద్రబాబు చెప్పారు.హైదరాబాద్ మలక్ పేటలో జరిగిన టీడీపీ  ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ...తాగునీరు విషయంలో నేను అడ్డుపడుతున్నానని కేసీఆర్ అంటున్నారని దానిలోనిజంలేదని, హైదరాబాద్ కు కృష్ణా జలాలను తానేతీసుకువచ్చానని,మాధవరెడ్డి కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల, కల్వకుర్తి,భీమా వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు తానే ప్రారంభించానని చంద్రబాబుతెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని ఆలోచించుకుంటే సముద్రంలో కలిసే 2వేల 500 టీఎంసీలు గోదావరి జలాలను ఉపయోగించుకోవచ్చని తద్వారా రెండురాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. ప్రజాకూటమి అధికారంలోకివస్తే ప్రతి పేదవాడికి ఇల్లుకట్టించి ఇస్తామని, ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్లు, వివిధ బలహీన వర్గాల వారికిఫించన్లు ఇస్తామని ఆయన చెప్పారు.కేసీఆర్ ఆయన కుటుంబంకోసం పని చేస్తోందని ప్రజాకూటమి మీకోసం పని చేస్తుందని చంద్రబాబు తెలిపారు. 

16:40 - December 2, 2018

హైదరాబాద్ : తనను చంపినా అబద్దాలు చెప్పనని..ఎన్నికల సమయంలో అబద్దాలు చెప్పకుండా నిజమే చెబుతానని..కాంగ్రెస్‌కు అధికారంలోకి రావడమే యావ తప్ప ఎలాంటి కమిట్ మెంట్ లేదని తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేవెళ్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. 
కేసీఆర్‌కు నచ్చిన పథకం...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో తనకు అత్యంత నచ్చిన పథకం..రైతు బీమా అని తెలియచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది కాంగ్రెసోళ్లు...కాంగ్రెసోళ్లు..ఢిల్లీకి గులాం అయితే..టీడీపోళ్లు..అమరావతికి గులాంలు..అయితే ఇక్కడి ప్రజలు ఎవరికి గులాంలు కావాలా ? ఇది అవసరమా ? అని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు...తాను ఒక్క పైసా తినలేదని...తింటే బయట పెట్టాలంటే పెట్టడం లేదని...ఇక్కడ చేస్తున్న ప్రాజెక్టులపై బాబు కేసులు వేసినట్లు చెప్పిన కేసీఆర్...కూటమి గెలిస్తే శనేశ్వరం వస్తుందన్నారు. 
111 జీవో ఎత్తేస్తా...
గోదావరి..కృష్ణా నీరు బ్రహ్మండంగా తెచ్చుకుంటున్నటు హిమాయత్ సాగర్..ఉస్మాన్ సాగర్...కలుషితం కావొద్దని చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 111 జీవో ఎత్తివేస్తామన్న గులాబీ దళాధిపతి చేవెళ్ల ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆకాక్షించారు. వికారాబాద్...చేవెళ్లకు నీళ్లు వస్తాయని..కేసీఆర్ వెల్లడించారు. 
> కాంగ్రెస్ కూటమిలో ఉంటూ కాంగ్రెస్‌ని ఓడేయాలని బాబు అంటున్నాడు...ఏమైనా అయ్యిందా ?
కులం..మతం పిచ్చి లేకుండా ఓట్లేయాలి...
కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు...వారికి పనిచేతకాదు...
తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్...
బాబును భుజాన మోసుకొస్తున్నారు..బాబు మనకు అవసరమా ? 

 

16:30 - December 2, 2018

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో బిత్తిరిసత్తిగా పేరొందిన చేవెళ్ల రవి పాల్గొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కాంగ్రెస్ కూటమిలో ఉంటూ కాంగ్రెస్‌ని ఓడేయాలని బాబు అంటున్నాడని..ఏమైనా అయ్యిందా అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. కులం..మతం పిచ్చి లేకుండా ఓట్లేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు...వారికి పనిచేతకాదు..తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ నేతలే..బాబును భుజాన మోసుకొస్తున్నారు..బాబు మనకు అవసరమా ? అంటూ ప్రశ్నించారు. 

16:26 - December 2, 2018

పీటల మీద  పెళ్లి జరుగుతూ ఉంటుంది..... 
పురోహితుడు పెళ్లి మంత్రాలు  చదువుతూ ఉంటాడు... 
అందరూ అక్షింతలు చేత్తోపుచ్చుకుని నవదంపతుల మీద వెయ్యటానికిసిధ్దంగా ఉంటారు. 
ఇంతలో రఁయ్ మని పోలీసు జీప్ వస్తుంది. 
అందులోంచి ఎస్ఐ దిగి పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చి యూఆర్ అండర్ అరెస్ట్ అంటాడు......
పెళ్లి కూతురు కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
అందరూ నిర్ఘాంతపోతారు...
భారీ డైలాగులతో ప్రతి అక్షరాన్ని వత్తిపలుకుతూ  పెళ్లి కొడుకు డైలాగులు చెపుతాడు....
ఇదంతా 1980లనాటి తెలుగు సినిమాల్లో  క్లైమాక్స్ సీన్ ....దాదాపు ప్రతి సినిమా ఇలానే ఉండేది. 
ముంబైలో  గత  గత మంగళవారం దాదాపు ఇలానే జరిగింది.  పెళ్లికొడుకును 10వేల రూపాయల సెల్ ఫోన్ చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ముంబైలో పెళ్లి చేసుకుని ఊరేగింపుగా ఇంటికి వెళుతున్న  పెళ్లికొడుకు అజయ్ సునీల్  ధోతె అనే వ్యక్తిని ఊరేగింపులో ఉండగా అరెస్టు  చేసి తీసుకువెళ్ళారు. పెళ్లి కొడుకుతోపాటు అతని స్నేహితుడు అల్తాఫ్ మీర్జాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకివెళితే  అజయ్, అల్తాఫ్ ఇద్దరుస్నేహితులు .  వీరిద్దరూ ఒక స్నేహితుడి బైక్ తీసుకుని దాని నంబర్ ప్లేట్ పై స్టిక్కర్ అంటించి  చెంబూరు  సమీపంలో వాకింగ్ చేస్తున్న మహిళ  వద్దనుంచి 10వేల రూపాయల విలువైన సెల్ ఫోన్ చోరీ చేసి బైక్ పై  పారిపోయారు. వెంటనే ఆమహిళ తిలక్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కెసు బుక్ చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలించి నిందితులను గుర్తించి  శివాజీ నగర్ లో పెళ్లి ఊరేగింపులో ఉండగా అరెస్టు చేసి వారిపై 392/34  కింద కేసుబుక్ చేసి జైలుకు పంపారు. 

15:42 - December 2, 2018

నాగర్ కర్నూలు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ సభకు వెళ్లినా అక్కడ నవ్వులు పూయిస్తున్నారు. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ హాస్యాన్ని పండిస్తున్నారు. ఎవరైనా నినాదాలు చేస్తుంటే..వారిని సుతిమెత్తంగా వారిస్తూ...సభ అయిపోయిన తరువాత..నీతో పాటు నేను అరుస్తా...సభ అయిపోని...ఎవరైనా దుంకుడు ప్రదర్శిస్తే...గిప్పుడే దుంకుడు వద్దు..నేను గజం ఎత్తు దుంకుతా...సభను డిస్ట్రబ్ చేయవద్దంటూ వారిస్తూ నవ్వులు పవ్వులు పూయిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభలో కూడా ఇలాగే జరిగింది. 
బీజేపీ ఎందుకు చేయడం లేదు ? 
డిసెంబర్ 02వ తేదీ ఆదివారం జిల్లాకు వచ్చిన కేసీఆర్ బహిరంగసభలో మాట్లాడారు...ప్రతి మనిషి యొక్క రక్తనమూనాతో పాటు హెల్త్ రిపోర్టు...కంప్యూటరైజ్డ్ చేస్తామన్నారు. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ..తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఎందుకు అమలు కావడం లేదని సూటిగా ప్రశ్నించారు. సంవత్సరానికి రెండు..మూడు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణం చేసిస్తామని..ఖాళీ జాగాల్లో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల రూపాయల డబ్బు ఇస్తామని కాంగ్రెస్ చెబుతుంటే అప్పు లేకుండా అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం డబ్బు ఉచితంగా ఇస్తుందన్నారు. టిడిపి..కాంగ్రెస్ హాయాంలో 4, 316 కోట్ల పేదల అప్పు ఉంటే తాను మాఫీ చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులకు సంబంధించిన విషయంలో పైరవీలు లేకుండా లాటరీ విధానం కొనసాగిస్తామన్నారు.
నాగర్‌‌కర్నూలులో ప్రతింటికి నీళ్లు...
కల్వకుర్తి కాల్వలో నీళ్లు చూసి బిర్యానీ తిన్న సంతోషం కలుగుతోందన్నారు. 3 - 4 వేల కుటుంబాలు రైతుబందు పథకం లబ్ది పొందుతున్నారని తెలిపారు. ఆడపిల్ల బిందె పట్టుకుని వెళితే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలని హెచ్చరించడం జరిగిందని..మిషన్ భగీరథ పనులు వేగవంతంగా జరుగుతుందని చెప్పిన కేసీఆర్ త్వరలోనే నాగర్ కర్నూలులో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ వస్తుందన్నారు. ప్రజల రక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించినట్లు కేసీఆర్ వెల్లడించారు

15:12 - December 2, 2018

కాలం మారింది. పద్ధతులు మారుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కొన్ని విషయాల్లో మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారు. పెళ్లి సమయంలో జాతకాలను నమ్మడం అందుకు నిదర్శనం. జీవితాంతం కలిసి బతకాల్సిన వారు సుఖంగా, సంతోషంగా ఉండాలంటే జాతకాలు మ్యాచ్ కావాలని తల్లిదండ్రులు నమ్ముతారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట అంటోంది సైన్స్‌. కేవలం చూపులతో.. కాసిన్ని విచారణలతో వ్యక్తుల గుణగణాలపై ఒక నిర్ధారణకు రావడం సరికాదని హెచ్చరిస్తోంది. ఈ పాతకాలపు పద్ధతులైన జన్మపత్రాన్ని కాకుండా.. జినోమ్‌ పత్రాన్ని నమ్ముకోవడం మేలని అంటోంది. 
జన్యువుల్లో సమస్త సమాచారం:
మన ఒడ్డూ పొడవు మొదలుకొని.. మనకు రాగల జబ్బుల వరకూ అన్నింటి సమాచారం జన్యువుల్లో ఉంటుంది. ఈ జన్యువుల్లోని సమాచారాన్ని చదివేందుకు వీలు కల్పించేదే జినోమ్‌ పత్రి. డీఎన్‌ఏ పోగు అడినైన్, గ్వానైన్, థయామీన్, సైటోసైన్‌ అనే నాలుగు రసాయనాలతో ఏర్పడి ఉంటుంది. వీటిని నూక్లియోటైడ్‌ బేసెస్‌ అని పిలుస్తారు. ఈ బేసెస్‌ జంటలను బేస్‌ పెయిర్స్‌ అంటారు. ఇలాంటి 300 కోట్ల బేస్‌పెయిర్స్‌తో మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుంది డీఎన్‌ఏ. ఈ డీఎన్‌ఏ పోగులోని భాగాలే జన్యువులు. మనుషుల్లో వీటి సంఖ్య దాదాపు 25 వేలు. మన జీవక్రియలకు అవసరమైన అన్ని రకాల ప్రొటీన్లను ఇవే ఉత్పత్తి చేస్తుంటాయి. వారసత్వంతోపాటు, వాతావరణం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి అనేక కారణాలతో జన్యుక్రమంలో వచ్చే మార్పులు వ్యాధులకు దారితీస్తాయి అని సైన్స్‌ చెబుతోంది. ఆరోగ్య సమస్యలు లేని ఇద్దరు దంపతులైతే.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. కాలిఫోర్నియా, నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన ప్రకారం 5–హెచ్‌టీటీఎల్‌పీఆర్‌ అనే జన్యువుల్లో తేడాలుంటే విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువని తేలింది. ఆ జన్యువులు మానసిక ఉద్వేగాలను ప్రభావితం చేస్తాయట.
జాతకాలు వద్దు:
జాతకాలను బట్టి పెళ్లిళ్లు చేసుకోవడం భారత్‌ లాంటి దేశాల్లో ఇంకా కొనసాగుతున్నప్పటికీ విదేశాల్లో మాత్రం ట్రెండ్‌ మారుతోంది. మనిషి జన్యుక్రమం నమోదు చేసే ఖర్చు గణనీయంగా తగ్గడం దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు జన్యుక్రమ నమోదు ప్రక్రియకు కోట్ల రూపాయలు ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు లక్ష రూపాయల్లోపు మాత్రమే అవుతోంది. ఇదే సమయంలో జన్యువుల పనితీరు.. వ్యాధుల విషయంలో వీటి పాత్ర వంటి వాటిల్లో సైన్స్‌ కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో రెండు జన్యుక్రమాలను పోల్చి చూసి దంపతులైతే ఎలా ఉంటుందో చెప్పే ప్రత్యేక పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. విదేశాల్లో ఇలాంటి జెనిటిక్‌ మ్యాచింగ్‌ చేసిపెట్టే కంపెనీలు బోలెడున్నా.. మన దేశంలో మాత్రం చాలా తక్కువ.

14:35 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల పోలింగ్‌ ఈనెల 7న జరగనున్న నేపథ్యంలో ఆరోజు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని దిగువ కోర్టులకు సెలవు ప్రకటించారు. ఆ రోజుకు బదులుగా ఈనెల 15న కోర్టులు పని చేస్తాయని, హైకోర్టు యధావిధిగా పనిచేస్తుందని రిజిస్టార్‌ జనరల్‌ మానవేంద్రరాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓటింగ్‌ రోజున రాష్ట్రంలోని జుడీషియల్‌ అకాడమీ, తెలంగాణ, ఏపీ న్యాయ సేవాధికార సంస్థలు, హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీకి సెలవు ప్రకటించారు.

 

14:30 - December 2, 2018
మహబూబ్ నగర్ : నారాయణపేట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలా ? వద్దా ?..నారాయణ పేట అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో ముక్కోణ పోటీ జరుగుతోందన్న షా నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ ఎలాంటి అభివృ‌ద్ధి చేయలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లడారు. 
కేసీఆర్ సమాధానం చెప్పాలి...
మజ్లిస్ కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారని...పాక్ సేనాధ్యక్షుడిని ఆలింగనం చేయడానికని సిద్ధూని పంపించింది...కాంగ్రెస్ కూటమేనన్నారు. ముందస్తు ఎన్నికలకు తెరలేపి..తెలంగాణ రాష్ట్ర ప్రజలపై టీఆర్ఎస్ పెనుభారం మోపిందన్నారు. 2019 పార్లమెంట్‌తో పాటు మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండేదని..ఇలా జరిగితే కోట్లాది రూపాయల ఖర్చు తప్పేదన్నారు. మోడీ ప్రాబల్యం..ప్రజాదరణతో బీజేపీ గెలుస్తుందని కేసీఆర్ భావించారని..కూతురు..కొడుకులను అధికారంలోకి తీసుకరాలేమన్న భయంతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
హామీలు విస్మరించిన కేసీఆర్...
నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన వాగ్దనాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని..ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద..బడుగు బలహీనవర్గాలకు డబుల్ బెడ్ రూం నివాసాలు ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఏం పని చేయలేదన్నారు. అంతేగాకుండా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అమలు చేయడం లేదని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం రెండు కోట్లకు పైగా ఇళ్లు నిర్మిస్తే తెలంగాణ ప్రజలకు ఇళ్లు దక్కలేదన్నారు. పేదలకు అనారోగ్యం ఎదురయితే ఆయిష్మాన్ భారత్ అనే పథకం కింద బీజేపీ ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం అమలు చేయడం లేదన్నారు. రెండు నెలల్లో మూడు లక్షల మంది లబ్ది పొందారని తెలిపారు. 
విమోచన దినోత్సవం జరుపుతాం...
తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన 800 కుటుంబాల వారిని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వీరికి ఉద్యోగాలు..ఉపాధి కల్పిస్తామని చెప్పిన కేసీఆర్..అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్..మాట తప్పాడని గుర్తు చేశారు. మజ్లిస్..ఓవైసీకి భయపడి సెప్టెంబర్ 11న విమోచన దినోత్సవం జరపడం మానేశారని..తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలుపొందిస్తే విమోచన దినోత్సవం జరిపిస్తామన్నారు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా మజ్లీస్ కాళ్ల కింద ఉండాలని ఓవైసీ చెబుతున్నారని... మత ఆధారితంగా ఇచ్చే రిజర్వేషన్లు రాజ్యంగ విరుద్ధమని పేర్కొన్న షా మతం ఆధారంగా 12 శాతం రిజర్వేషన్ అమలు చేయమన్నారు. 
నారాయణపేట అభివృద్ధికి బీజేపీ కృషి...
మసీదు..చర్చీలకు ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని..దీనిని తాము వ్యతిరేకించడం లేదని..మరి హిందూ ఆలయాలకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఉర్దు టీచర్ల ఏర్పాటుకు ప్రాముఖ్యతకు ప్రాధాన్యతనిస్తామని కాంగ్రెస్ చెబుతోందని...మరి తెలుగు టీచర్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. 
నారాయణపేట గ్రామంలో తాగు, సాగునీరు లభిస్తుందా ? రిజర్వాయర్ మందగతితో నిర్మాణం జరుగుతోంది...నారాయణపేట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలా ? వద్దా ? ఆసుపత్రి కట్టిస్తానని చెప్పి భూమి పూజ చేశారా ? నారాయణపేట హ్యాండ్లూమ్ పార్కును బీజేపీ అభివృద్ధి చేసి తీరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్..టీఆర్ఎస్‌తో సాధ్యం కాదన్న అమిత్ షా బీజేపీతో సాధ్యమన్నారు. 
14:25 - December 2, 2018

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ అప్పుడే నటనలో జీవించేస్తోంది. తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. కూతురు సుహానా పెర్ఫార్మెన్స్‌కి తండ్రి షారుక్ ఫిదా అయ్యారు. వివరాల్లోకి వెళితే.. జూలియట్ పాత్రలో సుహానా అదుర్స్ అనిపించింది. బాగా నటించావు అని కూతురుని మెచ్చుకున్నారు షారుక్.
ప్రశంసల వర్షం:
సుహానా ప్రస్తుతం లండన్‌లోని ఆర్డింగ్లీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. లండన్‌లో ఓ ప్లేలో నటించింది. అందులో జూలియట్‌ పాత్ర పోషించింది. కూతురి నటనను ప్రత్యక్షంగా చూసేందుకు తన బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి మరీ లండన్‌కు వెళ్లాడు షారుక్. కళ్లారా కూతురి నటన చూసి ఆనందానికి లోనయ్యాడు. జూలియెట్ పాత్రలో కూతురు అభినయం చూసి ఆశ్చర్యపోయాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన షారుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తండ్రికి తగ్గ కూతురు, బెస్ట్ ఫాదర్, సూపర్బ్, అమేజింగ్.. అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
చదువు పూర్తికాగానే:
సుహానాకు కూడా సినిమాలంటే ఆసక్తే. చదువు పూర్తయిన తర్వాతే సినిమాల్లోకి ప్రవేశించనుంది. గత ఆగస్టులో వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీతో మ్యాగజైన్ ఎంట్రీ ఇచ్చింది.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న షారుక్.. జీరో సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. షారుక్ సరసన కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటించారు.

14:24 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితికి రచనారెడ్డి షాక్ ఇచ్చారు. టీజేఎస్ కి రచనారెడ్డి గుడ్ బై చెప్పారు. ఉపాధ్యక్షురాలి పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ కు ప్రజాకూటమి ప్రత్యామ్నాయం కాదని, ఈ కూటమిలో పొలిటికల్ బ్రోకర్స్ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని, టీజేఎస్ అధినేత కోదండరామ్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో కోదండరామ్ అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. చర్చల పేరుతో హోటల్స్ లో సమావేశాలు ఏర్పాటు చేసి టైంపాస్ చేశారని మండిపడ్డారు. పైసలు వసూలు చేసి ప్రజాకూటమి ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రజాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని... ప్యారాచూట్ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. కూటమిలో అమాయకులను బలిపశువులను చేశారని వాపోయారు. 
చంద్రబాబును ప్రజలు తిరస్కరిస్తారు... 
తెలంగాణ ప్రజలకు జ్ఞానం ఉందని.. టీడీపీని చంద్రబాబును ప్రజలు తిరస్కరిస్తారని తెలిపింది. మైనార్టీలకు టీజేఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు. కూరగాయలు అమ్ముకున్నట్టే సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తో కలిసిన కోదండరామ్ ఓటమిపాలు కానున్నారని జోస్యం చెప్పారు.

13:58 - December 2, 2018

హైదరాబాద్ : పోస్టల్ బ్యాలెట్ లెక్కల తేలింది. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల గుడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,60, 509 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. దాదాపు 80 వేల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, రెవెన్యూ పంచాయతీరాజ్, ఎన్జీవోలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన బీఎస్ఎన్ఎల్ పోస్టల్ సిబ్బంది, సింగరేణి కార్మికులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం...
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. దీంతో దాదాపు 80 వేల మందికి పైగా ఉద్యోగులు తమకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు నవంబర్ 30 వ తేదీతో ముగిసింది. నియోజకవర్గాల వారిగా బ్యాలెట్ పేపర్లను ఈసీ సిద్ధం చేసింది.

 

13:40 - December 2, 2018

ఒడిషా : పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2018 టోర్నమెంట్.. భువనేశ్వర్ లోని కలింగ స్టేడియంలో జరుగుతున్నాయి. టోర్నమెంట్ లో భాగంగా నేడు పూల్ సీలోని నాలుగు జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ 9లో పూల్ సీలోని కెనడా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ 10లో పూల్ సీలోని ఇండియాను బెల్జియం ఢికొట్టనుంది. 
ప్రారంభ మ్యాచ్ లో భారత్ విజయం..  
అయితే ప్రారంభ మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 5-0 గోల్స్ తేడాతో భారత్ గెలుపొందింది. భువనేశ్వర్ లోని కలింగ స్టేడియంలో దక్షిణాఫ్రికా, భారత్ మధ్య హాకీ తొలి మ్యాచ్ జరిగింది. టీమిండియాకు సఫారీలు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. బంతి దాదాపుగా భారత్‌ నియంత్రణలోనే ఉంది. సిమ్రన్‌ జీత్‌ 3 నిమిషాల వ్యవధిలో (43 నిమిషాలు, 46 నిమిషాలు) రెండు గోల్స్‌ కొట్టి అదరగొట్టాడు. ఆట ప్రారంభమైన పదో నిమిషంలోనే మన్‌దీప్‌ సింగ్‌ గోల్‌ చేశాడు. మరో రెండు నిమిషాల్లోనే ఆకాశ్‌దీప్‌ గోల్‌ కొట్టి స్కోర్ ను 2-0కు తీసుకెళ్లాడు. సిమ్రన్‌ జీత్‌, లలిత్‌ వెంటవెంటనే 3 గోల్స్‌ చేయడంతో భారత్‌ 5-0తో నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో భారత్ రెండో మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

 

13:08 - December 2, 2018

హైదరాబాద్ : నగరంలో నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డివైడర్ ను దాటి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మూసాపేట ఫ్లైవర్ పై వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బస్సు అదుపు తప్పి, డివైడర్ ను దాటి.. పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఫ్లైవోవర్ పై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన వెంటనే స్థానికులు బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. 

 

12:41 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న మంత్రి కేటీఆర్...సామాజిక మాధ్యమాలను కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. వస్తున్న విమర్శలపై ట్వీట్స్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా డిసెంబర్ 2వ తేదీ ఆదివారం #AskKTR పేరిట నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. లగడపాటి సర్వే ఓ నెటిజన్ ప్రశ్నకు...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న లగడపాటి సర్వేలు ఫేక్ అని అభివర్ణించారు. ఆరోగ్య శ్రీ పథకం ఆపేశారన్న ఓ నెటిజన్ ప్రశ్నకు...డిసెంబర్ 2వ తేదీ ఆదివారం సమస్య పరిష్కారమౌతుందని సమాధానం ఇచ్చారు. బోగస్ మీడియాపై చర్యలు ఎందుకు తీసుకోరన్న ప్రశ్నకు ఓటు ద్వారా ప్రజలే సమాధానం చెబుతారని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. నగరంలో నివాసం ఉంటున్న ఆంధ్రా ప్రజలకు ఎలాంటి రక్షణ ఇస్తున్నారన్న ప్రశ్నకు...నాలుగేళ్ల ట్రాక్ రికార్డు చూడాలని..శాంతిభద్రతల కోసం చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదన్న కేటీఆర్...పలువురి నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు...

12:35 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడిన బాబు..బద్దవిరోధి అయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారంటూ గులాబీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా కేసీఆర్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్న బాబు...పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో పలు ట్వీట్స్ చేశారు. 
‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే నేను అడ్డుపడ్డానా? కేసీఆర్ దళితుడిని సీఎంను చేస్తానంటే నేను అడ్డుపడ్డానా? తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే నేను అడ్డుపడ్డానా? నేను ఎక్కడ అడ్డుపడ్డానో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. తన పాలనలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్‌ ఒక్క పనైనా చేశారా? ఇచ్చిన మాట తప్పి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంటే కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీశారా? అవేమీ చేయకుండా హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ది చేసిన నాపై విమర్శలు చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ధాని @narendramodi ఎప్పుడూ చెప్పే అచ్చేదిన్‌ నాలుగున్నరేళ్లలో ఎక్కడా కనిపించలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపిని చిత్తుచిత్తుగా ఓడిస్తే మాత్రం తప్పకుండా అచ్చేదిన్‌ వస్తుంది’. అంటూ బాబు ట్వీట్స్ చేశారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. 

12:32 - December 2, 2018

భారత మహిళలు దూసుకుపోతున్నారు. ఆ రంగం ఈ రంగం అని లేకుండా అన్నింటా సత్తా చాటుతున్నారు. మేధస్సులోనే కాదు సాహసాలు చేయడంలోనూ వెనుకాడటం లేదు. కష్టతరమైన విధుల్లోనూ సులభంగా రాణిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సాహసంతో సావాసాలు చేస్తూ ఆకాశంలో దూసుకుపోతున్నారు. పురుషులతో పోటీపడుతూ పైలెట్లుగా రాణిస్తున్నారు. సాధారణంగా పైలెట్ జాబ్ అంటే రిస్క్‌తో కూడుకున్నది. అందుకే ఎక్కువగా పురుషులే ఈ జాబ్‌కు వస్తారు. కానీ అతివలు సైతం సై అంటున్నారు. ఎంతో ఇష్టంతో ఈ రంగాన్ని కెరీర్‌గా మలుచుకుంటుననారు ఈ క్రమంలో ప్రపంచంలోనే ఎక్కువమంది మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్‌ రికార్డు క్రియేట్ చేసింది. దేశంలో మొత్తం 8,797 మంది పైలట్లు ఉంటే.. వారిలో మహిళల సంఖ్య 1,092గా ఉంది. అంటే 12.4శాతం. వీరిలో 355మంది కెప్టెన్లు ఉన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఉమెన్ పైలెట్ల సగటు 5.4శాతంగానే ఉంది. అదే మనదేశంలో ఆ శాతం రెండింతలు ఎక్కువ కావడం విశేషం. ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ విమెన్‌ ఎయిర్‌లైన్‌ పైలట్స్‌ (ఇస్వాప్‌) ఈ లెక్కలు వెల్లడించింది.

ఇస్వాప్ నివేదిక ప్రకారం:
విమానయాన సంస్థ మొత్తం పైలెట్లు మహిళా పైలెట్లు శాతం
ఇండిగో 2,689 351 13.9
జెట్‌ఎయిర్‌వేస్ 1,867 231 12.4
స్పైస్‌‌జెట్ 853 113 13.2
ఎయిరిండియా 1710 217 12.7

ప్రపంచంలో మహిళా పైలట్ల సగటు 5.4%

భారత దేశంలో 12.4%

ఢిల్లీకి చెందిన ‘జూమ్‌ ఎయిర్‌’ అత్యధికంగా మహిళా పైలట్లకు ఉద్యోగాలిచ్చింది. మొత్తం 30మంది పైలట్లలో 9మంది మహిళలే. కాగా, అమెరికాలో మహిళా పైలట్ల సంఖ్య ప్రపంచ సగటు కంటే తక్కువే (4.4%). అమెరికాలోని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లో అత్యధికంగా 7.5% మంది, డెల్టాలో 4.7% మంది మహిళా పైలట్లు పని చేస్తున్నారు. యూకేలో 4.77% మహిళా పైలట్లు ఉన్నారు.

20ఏళ్లలో 7లక్షల 90వేల మంది: భవిష్యత్తులో భారత దేశంలో విమాన ప్రయాణాలూ బాగా పెరుగుతాయని.. రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 7,90,000 మంది పైలట్లు అవసరమని ఓ కంపెనీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పైలట్ల కొరత ఏర్పడే పరిస్థితి ఉన్నందున భారతీయ కంపెనీలు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయని తెలిపింది. స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసాలు లేని రంగాలు చాలా తక్కువ. అలాంటి వాటిలో విమానయాన రంగమొకటి.

12:22 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే ఈసీ పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అయితే పలు సంస్థలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు బేగంపేటలోని కలినరి అకాడమీ ఆధ్వర్యంలో వినూత్న ప్రయోగం చేపట్టారు. కేక్ తయారీ పోటీలు నిర్వహించారు. వివిధ కాలేజీల నుంచి యువత.. కేక్ తయారీ పోటీల్లో పాల్గొంది. ముగ్గురు విజేతలకు డిప్యూటీ కమిషనర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ విధంగా పలు సంస్థలు, పలువురు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. 

11:59 - December 2, 2018

కరీంనగర్ : విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకివ్వలేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌లో డిసెంబర్ 2వ తేదీ ఆదివారం ప్రెస్ మీట్‌లో మాట్లాడారు...గత కొన్ని రోజుల నుండి సీపీఐ..కాంగ్రెస్..టీజేఎస్ పార్టీలను ఒక దగ్గరకు చేసి మహాకూటమి పేరిట బాబు ప్రయత్నం చేశారని తెలిపారు. కానీ...40 సీట్లు కూడా సరిగ్గా పంచుకోలేని ఈ కూటమి రాష్ట్రంలో పాలన చేస్తామని ఆశిస్తున్నారని ఎద్దేవా చేశారు. బలంగా...రాజకీయ శక్తిగా ఉన్న గులాబీ సర్కార్ ఉండడం బాబుకు ఇష్టం లేదని..కరెంటు ఇవ్వనని చెప్పిన బాబు..విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వలేదన్నారు. కానీ కేసీఆర్ మాత్రం...ఛత్తస్ గడ్ నుండి కరెంటు తెప్పించుకుని రాష్ట్రంలో 24గంటల పాటు విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ స్థాపిస్తే ఈ ఎన్నికల కోసం బాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం హాస్యాస్పదమని ఎంపీ వినోద్ తెలిపారు...

11:51 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం వస్తుందని అనుకుంటే రాబందుల రాజ్యం వచ్చిందని హిందూపురం ఎమ్యెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర అప్పుల్లోకి నెట్టిందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బాలయ్య..డిసెంబర్ 2వ తేదీ ఆదివారం వివేకానందనగర్‌లో టీ.టీడీపీ అభ్యర్థి ఆనంద ప్రసాద్‌కు మద్దతుగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి సామాజిక న్యాయం కోసం పోరాడిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఎలాంటి ఉద్యోగాలు లేక..ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పోరాటం ఎంతో కీలకమని వ్యాఖ్యానించిన బాలయ్య..రాజకీయాలను శాసించే స్థితికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. 17 శాతం అక్షర శాతాన్ని పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాల జరిగితే వారిని పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని..వారి జ్ఞాపకార్థం స్థూపం నిర్మించాల్సిందేనని బాలకృష్ణ డిమాండ్ చేశారు. 

11:50 - December 2, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ బహిరంగ సభకు పరేడ్‌గ్రౌండ్ ముస్తాబైంది. సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అభ్యర్థుల తరఫున నిర్వహించే బహిరంగ సభలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర ముఖ్యనేతలు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు, పార్టీ ముఖ్యనేతలకు పలు సూచనలు చేశారు. ఒకే వేదికపై 26 నియోజకవర్గాల అభ్యర్థులను సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. సభకు దాదాపు నాలుగు లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. 
మూడు జిల్లాల్లో కేసీఆర్ ప్రచారం..
నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఇవాళా నిర్వహించే ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్‌కర్నూల్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకొని ఉయ్యాలవాడ శివారులో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 70 వేల మంది సభకు హాజరుకానున్నారని మర్రి జనార్దన్‌రెడ్డి చెప్పారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చేరుకుంటారు. ఫరా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించే బహిరంగసభలో మట్లాడుతారు. ఏర్పాట్లను టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య పరిశీలించారు. సుమారు 50 వేల మంది తరలివస్తారని చెప్పారు. మధ్యాహ్నం 3గంటలకు పటాన్‌చెరు మార్కెట్‌యార్డులో నిర్వహించే ప్రజా ఆశీర్వాదసభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. సభ ఏర్పాట్లను టీఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో కలిసి పర్యవేక్షించారు. సభకు లక్ష మంది హాజరవుతారని మహిపాల్‌రెడ్డి తెలిపారు. 

 

11:45 - December 2, 2018

రాజస్థాన్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనస్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రేమజంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. క్రైస్తవ సంప్రదాంయలో పెళ్లి చేసుకున్నారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌ ప్యాలెస్‌లో జరిగిన వీరి వివాహానికి స్నేహితులు, బంధువులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. క్రైస్తవ సంప్రదాయంలో జరిగిన ఈ వివాహాన్ని జోనస్ తండ్రి పాల్ కెవిన్ నిర్వహించారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు, రిలయన్స్‌ దిగ్గజం అంబానీ కుటుంబసభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ప్యాలెస్‌లో డిసెంబర్‌ 3 వరకు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు.
హిందూ సంప్రదాయంలో మరోసారి:
ప్రియాంక, నిక్ హిందూ సంప్రదాయంలో ఆదివారం(డిసెంబర్ 2) మరోసారి వివాహం చేసుకోనున్నారు. దీనికి సంబంధించి శనివారం(డిసెంబర్ 1) సంగీత్, హల్దీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రియానిక్ జంట సందడి చేసింది. ప్రియాంక వయసు 36 ఏళ్లు కాగా, సింగర్ నిక్ జోనస్ వయసు 26 ఏళ్లు.

11:11 - December 2, 2018

అనంతపురం : జిల్లాలో జనసేనానీ కవాతుకు సర్వం సిద్ధమౌతోంది. మధ్యాహ్నం 3గంటలకు గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డు నుండి క్లాక్ టవర్ వరకు కవాతు నిర్వహించనున్నట్లు జనసేనానీ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నేతలు విడుదల చేశారు. 
గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో పోరాట యాత్ర పేరిట విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న జనసేనానీ ఏపీ ప్రభుత్వం..నేతలను తూర్పారబడుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్...బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. జనసేన లక్ష్యాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కవాతు నిర్వహిస్తూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ..విశాఖపట్టణం..రాజమండ్రిలలో కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా అనంతలో నిర్వహిస్తున్న కవాతుకు వామపక్షాలు మద్దు ప్రకటించాయి. 

10:42 - December 2, 2018

నందమూరి బాలకృష్ణ హీరోగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'ఎన్టీఆర్'. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను రెండు పార్టులుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ''కథానాయకుడు'' పేరుతో తొలి భాగాన్ని, ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంపై ''మహానాయకుడు'' పేరుతో రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నటీనటుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సినిమా నుంచి ముఖ్యమైన కొన్ని పాత్రలకి సంబంధించిన ఫస్ట్‌లుక్స్ వచ్చి అంచనాలు పెంచాయి. తాజాగా కథానాయకుడు మూవీకి సంబంధించి తొలి పాటను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ కెరీర్ గురించి.. ఆయ‌న వేసిన పాత్ర‌ల గురించి.. ప్రేక్ష‌కుల్లో ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ వ‌ర్ణిస్తూ కీర‌వాణి తండ్రి, రచయిత శివ‌శ‌క్తిద‌త్తా, మరో రచయిత రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో రాసిన ఈ పాట అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఎన్టీఆర్ గొప్ప‌తనాన్ని వ‌ర్ణిస్తూ ఆయన గౌర‌వాన్ని పెంచేలా ఈ పాట ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా:
కీర‌వాణి సంగీతానికి కైలాష్ ఖేర్ స్వ‌రం స‌రిగ్గా స‌రిపోయింది. ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర జ‌న‌తాసుధీంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా అంటూ మొద‌లైన ఈ పాట మ‌ధ్య‌లో మ‌రిన్ని అద్భుతమైన ప‌దాల‌ను కూర్చారు శివ‌శ‌క్తిద‌త్తా. ముఖ్యంగా త్రిశ‌కాధికా చిత్ర‌మాలికా ఓ క‌థానాయ‌కా.. ఆహార్యాధ్భుత వాచికా జైత్ర‌యాత్రికా అంటూ ఎన్టీఆర్ చేసిన ప్ర‌తీపాత్ర‌ను త‌న పాట‌లో చూపించారు.
సంక్రాంతి కానుకగా:
క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విఎస్‌ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని అదే నెలలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది
ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, నారా చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి, హరికృష్ణగా కల్యాణ్ రామ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

10:39 - December 2, 2018
10:26 - December 2, 2018

మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న అభ్యర్థుల తరపున సినీ తారలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీలకు వారు మద్దతు తెలియచేస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున శంకర్ నాయక్ పోటీలో నిలిచారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఈయనకు మేమున్నామంటూ ‘గబ్బర్ సింగ్’ అంత్యాక్షరి బృందం వచ్చింది.  గబ్బర్ సింగ్ సినిమాలో పవన్..తో పాటు వీరు చేసిన అంత్యాక్షరి  ఎంతో ఆకట్టుకుంది. శనివారం మహబూబాబాద్ పదో వార్డులో వారు ప్రచారం నిర్వహించారు.
టీఆర్ఎస్ సర్కార్ ఎన్నో సంక్షమే కార్యక్రమాలు చేపట్టిందని గబ్బర్ సింగ్ అంత్యాక్షరి బృందం పేర్కొంది. శంకర్ నాయక్ మంచి వ్యక్తి అని..టీఆర్ఎస్‌ని గెలిపించాలని కోరారు. గబ్బర్‌సింగ్ అంత్యాక్షరి బృందాన్ని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇక ఈ ప్రచారంలో ఎంపీ సీతారాం నాయక్‌, శంకర్‌నాయక్‌, వార్డు కౌన్సిలర్లతో పాటు గులాబీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

10:21 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ప్రముఖులను ఎన్నికల ప్రచారంలోకి దింపుతున్నాయి. వారితో ప్రచారం చేయించి, ఓట్లు పొందాలని భావిస్తున్నారు. ప్రచారానికి ఇంకా 4 రోజులే మిగిలివుండటంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళా తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. చంద్రబాబుతోపాటు హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం చేయనున్నారు. హైరాదాబాద్ లో చంద్రబాబు, బాలకృష్ణ రోడ్ షోలు నిర్వహించనున్నారు. మహాకూటమి తరపున ప్రచారం చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. మహాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. బాబుతోపాటు హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నిన్న రాజేంద్రనగర్, కూకట్ పల్లిలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. సనత్ నగర్ లో బాలకృష్ణ పర్యటించారు.
ఉప్పల్, మలక్ పేట, శేరిలింగంపల్లిలో ప్రచారం    
ఇవాళా ఉప్పల్, మలక్ పేటలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆజాద్, కర్ణాటక మంత్రి శివకుమార్ పాల్గొనున్నారు. శేరిలింగంపల్లిలో నేడు బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే చంద్రబాబు, రాహల్ గాంధీ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేడ్చల్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్న సంగతి తెలిసిందే. 

 

10:14 - December 2, 2018

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'ఎన్టీఆర్' బయోపిక్. ''కథానాయకుడు'' పేరుతో తొలి భాగాన్ని, ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంపై ''మహానాయకుడు'' పేరుతో రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నటీనటుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సినిమా నుంచి ముఖ్యమైన కొన్ని పాత్రలకి సంబంధించిన ఫస్ట్‌లుక్స్ వచ్చి అంచనాలు పెంచాయి. తాజాగా మరో పోస్టర్ వచ్చేసింది. పంచె కట్టులో బాలయ్య ఆవేశంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే అచ్చం అన్న‌గారిని తలపించారని ఫ్యాన్స్ అంటున్నారు. తండ్రి పోలిక‌లే కాదు.. తండ్రి హావ‌భావాలు కూడా దించేశారని బాల‌య్యను ప్రశంసిస్తున్నారు‌.
అచ్చం ఆయనలానే:
ముఖ్యంగా పంచెక‌ట్టులో బాల‌య్య అదుర్స్ అనిపించారని, అన్న‌గారిని గుర్తు చేశారని కితాబిస్తున్నారు. ఒక‌ప్పుడు ఎన్టీఆర్‌ను చూడ‌ని వాళ్ల‌కు ఇప్పుడు బాల‌య్య‌ను చూస్తుంటే అలాగే ఉంటాడేమో అనిపిస్తుందని పొగుడుతున్నారు.
సంక్రాంతి కానుకగా:
క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విఎస్‌ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని అదే నెలలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది
ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, నారా చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి, హరికృష్ణగా కల్యాణ్ రామ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు

10:13 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చిన్న పార్టీలు కూడా తామేమీ తక్కువేం కాదంటున్నాయి. ప్రధాన పార్టీలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..అంటూ ఓటర్లను కోరడమే కాకుండా ఆకర్షణీయంగా..అందరినీ సంతృప్తి పరిచే విధంగా మేనిఫెస్టోలు తయారు చేస్తున్నాయి. జాతీయ పార్టీలైనా రాష్ట్రాల్లో చిన్న పార్టీలుగా గుర్తింపు పొందిన బీఎస్పీ..ఎన్సీపీ, సమాజ్‌వాద్ పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలిచాయి. ప్రధాన పార్టీల నుండి టికెట్ ఆశించి భంగపడిన కొంతమంది ఈ పార్టీల్లో చేరి ఎన్నికల కదనరంగంలో దూకారు.
ఇదిలా ఉంటే ఎల్బీనగర్ స్థానం నుండి ‘న్యూ ఇండియా పార్టీ’ అభ్యర్థిగా దోర్నాల జయకుమార్ బరిలో నిలిచారు. నియోజకవర్గ ఓట్లు రాబట్టేందుకు వినూత్నంగా ప్రచారంలోకి దూకారు. వంద రూపాయల బాండ్ పేపర్ రాసిస్తున్నాడు. తాను అధికారంలోకి వచ్చాక..ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే...ఎన్నికల్లో పోటీ చేయనని బాండ్ పేపర్‌పై రాసి..ఓటర్లకు పంచుతున్నారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని చెబుతున్న జయకుమార్...ప్రతి నెలా ఓటర్ అకౌంట్‌లో రూ. 5వేలు వేస్తానని హామీనిస్తున్నారు. చిన్న పార్టీ..కొత్త ఆలోచన అంటూ ముందుకెళుతున్న జయకుమార్‌ని ఎల్బీనగర్ ఓటర్లు ఆశీర్వదిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

  • బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ...
  • 40 స్థానాల్లో ఎన్సీపీ పోటీ...
  • సమాజ్ వాదీ పార్టీ 80 స్థానాలకు పైగా పోటీ...
09:59 - December 2, 2018

హైదరాబాద్ : సైబరాబాద్, హైటెక్ సిటీలను నిర్మించిన ఘనత చంద్రబాబుదేనని హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. సనత్ నగర్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చెరిపేయాలంటే హైటెక్ సిటీ తీసేయాలన్నారు. హైటెక్ సిటీని తీసివేసే దమ్ము టీఆర్ఎస్ కు ఉందా ? అని ప్రశ్నించారు. చంద్రబాబును దూషించే వారివి గల్లీ బుద్ధులని విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ నెలకొల్పిన ఘనత చంద్రబాబుది మాత్రమేనన్నారు. చంద్రబాబును హైదరాబాద్‌ చరిత్ర పుటల నుంచి తొలగించాలంటే హైటెక్‌ సిటీని, ఔటర్‌ రింగ్‌ రోడ్డును మాయం చేయాలని అలా చేసే దమ్ము ఎవరికుందని ప్రశ్నించారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించేది భల్లాలదేవుడే అయినా ప్రజలు గుర్తు పెట్టుకునేది మాత్రం బాహుబలినేనని అన్నారు. 
ప్రజల కోసం టీడీపీ స్థాపన.. 
సినిమాలు వీడి ప్రజల కోసం టీడీపీని స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. టీడీపీ.. నాయకుల కోసం, ధనవంతుల కోసం పుట్టిన పార్టీ కాదని; భూస్వాములు, పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ అని తెలిపారు. మహిళలతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి ఆనాడు టీడీపీ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఆ పథకాలనే ఇప్పటి పార్టీలు కాపీ కొట్టక తప్పని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రాజకీయ జీవితాన్ని, గుర్తింపును ఇస్తే టీడీపీకి వెన్నుపోటు పొడిచి పదవుల కోసం వేరొక పార్టీని ఆశ్రయించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 
మోడీ సంస్కరణలతో సామాన్యులకు కష్టాలు
ప్రధాని మోడీ చేపట్టిన సంస్కరణలు సామాన్యులను ఎన్నో కష్టాలకు గురిచేస్తున్నాయన్నారు. బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయిందని తెలిపారు. ఎన్నో త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయనుకున్న యువతకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

09:52 - December 2, 2018

ఢిల్లీ : భారత క్రికేటర్ యువరాజ్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో క్రికేటర్ ఖైఫ్‌తో పాటు యూవీ కూడా ఉన్నాడు. ఖైఫ్‌ 38వ బర్త్ డే సందర్భంగా యూవీ ఈ ఆసక్తికర ఫొటోను పోస్టు చేశారు. డ్రెస్సింగ్ రూంలో ఉండగా ఈ ఫొటో తీశారు. 2002లో వీరిద్దరూ కలిసిన ఓ ఇన్నింగ్స్ మరుపురానిది. మ్యాచ్ అనంతరం డ్రస్సింగ్ రూములో దిగిన ఫోటోను షేర్ చేసుకున్న యూవీ...ఖైఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఈ విధంగా రాసుకొచ్చాడు. ‘భాయ్‌ సాబ్.. పుట్టినరోజు శుభాకాంక్షలు..నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ తర్వాత దిగిన ఈ ఫోటో గుర్తుందా ? ట్వీట్ చేశాడు. 
2002లో ఏం జరిగింది ? 
2002లో నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ - ఇంగ్లండ్ ఢీకొన్నాయి. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 325 భారీ స్కోరు చేసింది. సెహ్వాగ్ (45)..గంగూలీ (60) ధాటిగా ఆటను ఆరంభించారు. కానీ 106 పరుగుల వద్ద గంగూలీ వెనుదిరగగా 114 స్కోరు వద్ద సెహ్వాగ్ పెవిలీయన్ చేరాడు. అనంతరం వచ్చిన మోంగియా, సచిన్, ద్రావిడ్‌లు విఫలం చెందారు. ఈ సమయంలో వచ్చిన యూవీ, కైఫ్‌లు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 267 పరుగుల వద్ద (63 బంతుల్లో 69, 9 ఫోర్లు..1 సిక్స్) యువరాజ్ అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన హర్బజన్..కైఫ్‌కు సహకరించాడు. కేవలం 75 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 47.5 ఓవర్లలలో 8 వికెట్లు కోల్పోయిన భారత్ 326 పరుగులు చేసి గెలుపొందింది. 

09:50 - December 2, 2018

అందాల తార రాశీఖన్నా రూటే సెపరేటు. ఆమె ఏం చేసినా అందులో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంది. పుట్టినరోజు విషయంలోనూ అంతే. ప్రతి బర్త్‌డేని ఒక థీమ్‌తో జరుపుకోవడం రాశీఖన్నా ప్రత్యేకత. ఈ ఏడాది కూడా అదే ఫాలో అయ్యింది. ఈసారి ఆమె పార్టీ థీమ్‌ రెట్రో. అంటే పాత కాలంలో ఎలా ఉండేదో అలా అన్నమాట. పాత క్యాసెట్లు, టెలిఫోన్, టీవీలు డెకరేట్‌ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. డిసెంబర్ 29న స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇండస్డ్రీకి చెందిన స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది రాశీఖన్నా. బర్త్‌డే పార్టీలో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పార్టీలో హీరోలు రామ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రకుల్, మంచు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

09:24 - December 2, 2018

తెలంగాణలో ఎన్నికల పోరు కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. అన్ని పార్టీల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మాటల తూటాలు పేల్చుతూ పైచేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అసలు గ్రౌండ్‌లో పరిస్థితి ఎలా ఉంది.. గెలుపు గుర్రాలు ఎవరు? ఉమ్మడి 10 జిల్లాల సమగ్ర విశ్లేషణలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలుపు గుర్రాలపై గ్రౌండ్‌ రిపోర్ట్‌ చూద్దాం..

09:21 - December 2, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార గుడువు ముగియనుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ, బీఎల్ఎఫ్, సీపీఎం పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి. పలువురు ప్రముఖులు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ప్రముఖులను ఎన్నికల ప్రచారంలోకి దింపుతున్నాయి. వారితో ప్రచారం చేయించి, ఓట్లు పొందాలని భావిస్తున్నాయి. ఓట్లు రాబట్టుకోవడానికి రాజకీయ పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారానికి ఇంకా 4 రోజులో మిగిలివుండటంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. నేడు తెలంగాణలో అపద్ధర్మ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, హీరో బాలకృష్ణ బాలకృష్ణ, బీజేపీ నేతలు, అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్, నితిన్ గడ్కరీ ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని, ప్రచారం చేయనున్నారు. 
కేసీఆర్ ప్రచారం 
అపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేస్తున్నారు. బహిరంగ సభలు, ప్రజా ఆశీర్వాద సభలు, సమావేశాలతో కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. టీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. 
నాగర్ కర్నూల్, చేవెళ్ల, పటాన్ చెరులో.. 
నాగర్ కర్నూల్, చేవెళ్ల, పటాన్ చెరులో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయా నియోజవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభలలో కేసీఆర్ పాల్గొని, ప్రసంగించనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ లో బహింరంగ సభకు కేసీఆర్ హాజరై, ప్రసంగించనున్నారు. కేసీఆర్ సభలకు భారీగా జనాన్ని సమీకరిచేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. సభల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 
చంద్రబాబు, బాలకృష్ణ ప్రచారం..   
తెలంగాణలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేస్తోన్నారు. హైరాదాబాద్ లో చంద్రబాబు, బాలకృష్ణ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మహాకూటమి తరపున ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నిన్న రాజేంద్రనగర్, మణికొండలో ప్రచారం చేశారు. సనత్ నగర్ లో బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు. ఇవాళా ఉప్పల్, మలక్ పేటలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆజాద్, కర్ణాటక మంత్రి శివకుమార్ పాల్గొనున్నారు. ఇవాళా శేరిలింగంపల్లిలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే చంద్రబాబు, రాహల్ గాంధీ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేడ్చల్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్న సంగతి తెలిసిందే. 
ఉత్తమ్ రోడ్ షోలు 
నల్గొండ జిల్లాలో నేడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించనున్నారు. కందిబండవ్, హేమ్లా తండా, రామాపురం, గుడిమల్కాపురం, చింతలపాలెం, వేళ్లచెర్వు, పేవల సింగారంలో రోడ్లు షోలు నిర్వహించనున్నారు. 
బీజేపీ జాతీయ నేతల ప్రచారం  
తెలంగాణలో ఇవాళా బీజేపీ జాతీయ నేతలు పర్యటించనున్నారు. సభలు, రోడ్ షో ల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొని, ప్రసంగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళా రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 
అమిత్ షా, యోగి ఆదిత్యానాధ్, నితిన్ గడ్కరీ పర్యటన  
అమిత్ షా.. నారాయణపేట, కల్వకుర్తి, కామారెడ్డిల్లో ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగసభల్లో ఆయన పాల్గొని, ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని మల్కాజ్ గిరి లో జరిగే రోడ్ షో లో పాల్గొని, మాట్లాడనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తాండూరు, సంగారెడ్డి, మేడ్చల్ లలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని గోషామహల్ నియోజకవర్గంలోజరిగే బహిరంగ సభలో యోగి  పాల్గొంటారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ.. కొల్లాపూర్, ఉప్పల్, సూర్యాపేటలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరై, ప్రసంగించనున్నారు. 

 

08:40 - December 2, 2018

వరంగల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నాయి. హామీల వర్షం కురిపిస్తున్నాయి. మరి నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..? లేక మహాకూటమి వైపు మొగ్గుచూపుతున్నారా..? అసలు ఓటర్ల నాడి ఏంటి..? ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10టీవీ పబ్లిక్ పల్స్..

 

08:36 - December 2, 2018

చిత్తూరు : జిల్లాలో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రేణిగుంట సమీపంలోని మామండూరులో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు మృతి చెందారు. మృతులు కడప జిల్లా సీకే దిన్నె వాసులు గంగాధరం (35), విజయమ్మ (30) ప్రసన్న(32), మరియమ్మ(25), ప్రసన్న(2)లుగా గుర్తించారు. 

08:14 - December 2, 2018

హైదరాబాద్: అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు జూ.ఎన్టీఆర్. కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన అక్క సుహాసిని తరుఫున ప్రచారానికి ఎన్టీఆర్ వస్తారని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే ప్రకటన ద్వారా మద్దతు ప్రకటించిన ఎన్టీఆర్, తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ రాజకీయాలకు దూరం:
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. హేమాహేమీలు అంతా ప్రచారంలో పాల్గొంటూ తమ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. ప్రధానంగా మహాకూటమి నుంచి కూకట్‌పల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె నందమూరి తారకరామారావు మనవరాలు, దివంగత నందమూరి హరికృష్ణ కూతురు కావడంతో ఆ కుటుంబంపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన టీడీపీ నేతలు సైతం ఆమె కోసం ప్రచారం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే సుహాసిని సోదరులైన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ప్రచారం చేస్తారా? లేదా అనే దానిపై సందిగ్దం ఏర్పడింది. తన సోదరులిద్దరూ ప్రచారం చేస్తారని సుహాసిని భావించారు. అయితే ఆమె పోటీకి మద్దతిచ్చిన ఎన్టీఆర్ ప్రచారానికి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సుహాసినికి మద్దతుగా ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఇప్పటివరకు పేరు ఇవ్వలేదు:
సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వచ్చే వ్యక్తుల వివరాలను అభ్యర్థులు లేదా పార్టీలు.. ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు టీడీపీ కానీ మహాకూటమి నేతలు కానీ ఎన్టీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో జూ.ఎన్టీఆర్.. అక్క ప్రచారానికి రావడం కష్టమే అని తెలుస్తోంది.

07:52 - December 2, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముగింపు గడువు దగ్గర పడుతుంటంతో రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచారాన్నిముమ్మరం  చేసాయి. నేడు తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు పర్యటించనున్నారు. సభలు, రోడ్ షో ల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొని, ప్రసంగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళా రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 
అమిత్ షా, యోగి ఆదిత్యానాధ్, నితిన్ గడ్కరీ పర్యటన...  
అమిత్ షా.. నారాయణపేట, కల్వకుర్తి, కామారెడ్డిల్లో ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగసభల్లో ఆయన పాల్గొని, ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని మల్కాజ్ గిరి లో జరిగే రోడ్ షో లో పాల్గొని, మాట్లాడనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తాండూరు, సంగారెడ్డి, మేడ్చల్ లలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని గోషామహల్ నియోజకవర్గంలోజరిగే బహిరంగ సభలో యోగి  పాల్గొంటారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ.. కొల్లాపూర్, ఉప్పల్, సూర్యాపేటలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరై, ప్రసంగించనున్నారు.  పాల్గోంటారు. 

 

07:42 - December 2, 2018

హైదరాబాద్ : అపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేస్తున్నారు. బహిరంగ సభలు, ప్రజా ఆశీర్వాద సభలు, సమావేశాలతో కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. టీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం 
నిర్వహించనున్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. 
మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం 
నాగర్ కర్నూల్, చేవెళ్ల, పటాన్ చెరులో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయా నియోజవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభలలో కేసీఆర్ పాల్గొని, ప్రసంగించనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ లో బహింరంగ సభకు కేసీఆర్ హాజరై, ప్రసంగించనున్నారు. కేసీఆర్ సభలకు భారీగా జనాన్ని సమీకరిచేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. సభల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

 

07:23 - December 2, 2018

వికారాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్ అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారని అభిమానులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొడంగల్‌లో శనివారం (డిసెంబర్ 1) అర్థరాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాగా, డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించామని పోలీసులు చెబుతున్నారు.

కొడంగల్‌ బంద్‌కు పిలుపు:
పోలీసుల సోదాలపై రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తన అనుచరులపై కుట్రపూరితంగా కేసీఆర్ ఐటీ దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 4న కొడంగల్ నియోజకవర్గ బంద్‌కు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. అలాగే 4న కేసీఆర్ కోస్గి పర్యటనను అడ్డుకుంటామని చెప్పారు. ఐటీ దాడులను నిరసిస్తూ కొడంగల్‌లో శనివారం అర్థరాత్రి చేపట్టిన ఆందోళనను రేవంత్ విరమించారు.

ఓటుకు నోటు..?
కొడంగల్‌లో శనివారం రాత్రి పోలీసుల సోదాలు కలకలం రేపాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రేవంత్ అనుచరుడు యూసఫ్‌తో పాటు పలువురు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. యూసఫ్, రామచంద్రారెడ్డి, మదుసూదన్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న రేవంత్ అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం రేవంత్‌తో పాటు పలువురు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
రేవంత్ అనుచరుడు యూసఫ్ డబ్బులు పంచుతున్నారనే సమాచారంతోనే సోదాలు నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. అనుమానం ఉన్న ప్రతి చోట తనిఖీలు జరుపుతామని ఏడీజీ జితేందర్ తెలిపారు. అయితే సోదాల్లో ఏం దొరికాయన్న విషయం మాత్రం బయటకు రాలేదు. రేవంత్ ఇంట్లో సోదాలు చేయలేదని పోలీసులు తెలియజేశారు.

Don't Miss