Activities calendar

04 December 2018

20:52 - December 4, 2018

మహబూబ్ నగర్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ నేతలపై తెలంగాణ ఆపద్ధర్మసీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు కేసులు వేశారని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని... కేసులు పెడుతున్నారని.. ఇది కట్టవద్దని 35 ఉత్తరాలు రాశాడని పేర్కొన్నారు. అటువంటి చంద్రబాబునాయుడిని కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుని తీసుకొస్తుందని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సిగ్గు, చీము, నెత్తురు లేకుండా చంద్రబాబును మళ్లీ తీసుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. కోస్గిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణను మళ్లీ ఆంధ్రావాళ్లకు అప్పగిస్తారంటా..? 
నాడు తెలంగాణను ఆంధ్రాలలో కలిపింది కాంగ్రెస్.. అని తెలిపారు. తెలంగాణ అడిగితే ఇందిరాగాంధీ 400 మందిని కాల్చి చంపిందన్నారు. 14 ఏళ్లు మడమ తిప్పకుండా తెలంగాణ కోసం కొట్లాడానని...సావు నోట్లు తలకాయ పెడితే.. కొట్లాడితే తెలంగాణ వచ్చింది అన్నారు. వచ్చిన తెలంగాణ మళ్లీ ఆంధ్రా వాళ్లకు అప్పగిస్తారంటా కాంగ్రెస్ వాళ్లు.. మళ్లీ చంద్రబాబు నాయుడిని తెచ్చి మన నెత్తని పెడతారంటా..? అని మండిపడ్డారు. ప్రాజెక్టులకు అడ్డుపడ్డ చంద్రబాబును కాంగ్రెస్ నేతలు భుజం మీద మోసుకొస్తున్నారని తెలిపారు. చంద్రబాబు గెలిస్తే పాలమూరు ప్రాజెక్టు బంద్ అంటడు. భగీరథకు నీళ్లు బంద్ అంటడు.. ఇదీ కావాలా? అని అన్నాడు. నాటి నుంచి నేటి వరకు వీళ్లు దుర్మార్గంగా పాలన చేశారని పేర్కొన్నారు. నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని....టీఆర్ ఎస్ హయాంలో ఆ ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతల చెంపను కోర్టు చెళ్లుమనిపించిందన్నారు. 
దరిద్రం వదలాలంటే.. దరిద్రులను ఓడించాలి.. 
ప్రాజెక్టులను చంద్రబాబు వద్దంటాడని..మన దరిద్రులు కూడా కేసులు వేసి ఆపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివాళ్లు ఈ జిల్లాలో పుట్టిండ్రు కాబట్టే.. కొండలు, బండలు, దరిద్రం ఉందన్నారు. పాలమూరు దరిద్రం వదలాలంటే.. దరిద్రులను ఓడించాలని పిలుపు ఇచ్చారు. పాలమూరు దరిద్రం వదలాలంటే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న దరిద్రులకు బుద్ధి చెప్పాలన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు. కొడంగల్ నియోజకవర్గ సభకు ఇంతమంది తరలివచ్చారంటే నరేందర్ రెడ్డి గెలిచినట్టే కనిపిస్తోందన్నారు. 
కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా... 
కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. నర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు అడిగారు...అధికారంలోకి వచ్చాక.. ఏర్పాటు చేస్తామని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలను చేశామన్నారు. చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో 41 తండాలను గ్రామ పంచాయతీలు చేశామని తెలిపారు. డిగ్రీ, ఐటిఐ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు బాగుపడాలి.. ప్రతి వ్యక్తి ముఖంపై చిరునవ్వు వస్తేనే, కోటి ఎకరాలకు నీళ్లు వస్తేనే బంగారు తెలంగాణ వచ్చినట్లన్నారు. ఇండియాలో నెంబర్ వన్ స్వంత వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు.
ప్రజలు గెలవాలి.. 
ఎన్నికల్లో ఆగమాగం..ఓట్లు వేయవద్దు...గాలి గాలి ఓట్లు వేయొద్దు...గాలి గాలి ఓట్లు వేస్తే గాలి గాలికి కలుస్తారని అన్నారు. తర్వాత ఉండే కాలమంతా గాలి..గాలి...గత్తరగా ఉంటుదని అన్నారు. పని జరగదు. ప్రజలు గెలవాలి.. ప్రజల ఎజెండా గెలవాలి.. ప్రజల అభీష్టం గెలవాలన్నారు. ప్రజలు ఎజెండా.. ప్రజల కార్యక్రమాలు అమలు జరుగుతాయన్నారు. ఆలోచన చేసి, ఓటేయాలన్నారు. 
కూటమి, టీఆర్ఎస్ మధ్య పోటీ.. 
కూటమి, టీఆర్ఎస్ మధ్య పోటీ అని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఒకవైపు..తెలంగాణను అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ మరో వైపు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు ఎలా ఉంది.. టీఆర్ఎస్ పాలనలో కరెంటు ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు కరెంటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వకలేపోయారని నిలదీశారు. తెలంగాణపై వారికి శ్రద్ధ, కమిట్ మెంట్ లేదని విమర్శించారు. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుందని.. ఇళ్లకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఎక్కడా కరెంటు మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలి పోవడం లేదన్నారు. గప్పాలు కొడితే కరెంట్ రాదు.. మాటలు చెబితే కరెంటు రాదు.. కష్టపడితే సాధ్యమవుతుందన్నారు. 
పాలమూరు జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం.. 
పాలమూరు జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14కు 14 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్ అని అన్నారు. ఆసరా, వికలాంగుల పింఛన్ లను పెంచుతామని చెప్పారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ.లక్షా 116 ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో పుట్టిన ఆడపిల్లలకు రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే..  ఆసరా పింఛన్లను వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు. వికలాంగుల పింఛన్ ను 3016లకు పెంచుతామని చెప్పారు. నిరుద్యోగ యువకులకు నెలకు నిరుద్యోగ భృతి 3016 ఇస్తామని చెప్పారు. ఐరాస ప్రసంశించిన, ప్రపంచంలో ఎక్కడా లేని పథకం రైతు బంధును తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తున్నామని తెలిపారు.
మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్..
మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మైనారిటీల కోసం నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే..తెలంగాణ ప్రభుత్వం  మైనారిటీల కోసం రెండు వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అందరినీ సమానంగా గౌరవిస్తామన్నారు. పెన్షన్స్ ను డబుల్ చేస్తామని చెప్పారు. పాలమూరు జిల్లాకు శత్రువుల ఎక్కడో లేరని.. పాలమూరు జిల్లాలోనే ఉన్నారని పేర్కొన్నారు. ఎంత మందితోని, ఎంతమంది రక్షాసులతో తాను కొట్లాడాలని కేసీఆర్ అన్నారు.
పాలమూరును సస్యశ్యామలం చేస్తాం...
పాలమూరు కరువు జిల్లా అని.. కొండలు, బండలు, రాళ్లు.. మధ్య మధ్యలో ఎక్కడోఒకచోట పొలం ఉందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ. 35 వేల కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ పథకం పూర్తి అయితే.. 20 లక్షల ఎకరాలతో పాలమూరు జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని...ఆకుపచ్చని పాలమూరుగా మారిపోతుందన్నారు.

20:51 - December 4, 2018

జనగాం : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే మిగిలివున్నాయి. రేపటితో ఎన్నికల ప్రచార గడువు కూడా ముగియనుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచేందుకు భారీగా డబ్బు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇవాళా పెంబర్తి వద్ద భారీగా నగదు పట్టుబడింది. రూ.5.85 కోట్లు పట్టుబడింది. పట్టుబడిన నగదు ప్రజా కూటమి అభ్యర్థులదిగా పోలీసులు నిర్ధారణ చేశారు. 

హైదరాబాద్ గోషామహల్ కు చెందిన హవాలా బ్రోకర్ కీర్తి కుమార్ జైన్ నుంచి హవాలా డబ్బు తరలిస్తున్నారు. రూ.1.50 కోట్లు టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుకు, రూ.2.30 కోట్లు కొండా సురేఖ భర్త కొండా మురళికి, రూ.2 కోట్లు వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్ది రాజు రవిచంద్రకు తరలిస్తున్నట్లు సీపీ రవీందర్ తెలిపారు. షెల్ వేరియేషన్ సంస్థ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సీపీ వెల్లడించారు. పట్టుబడ్డ నగదులో ఒక రూ.2 వేల దొంగనోటు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ నగదుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో నోట్ల కట్టల వ్యవహారం చర్చనీయాంశమైంది. 

 

18:13 - December 4, 2018
IPL ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ తన పేరు మార్చుకున్నది. డేర్ డెవిల్స్ ను.. ఢిల్లీ క్యాపిటల్ గా పిలవాలని సూచించింది. కొత్త లోగో కూడా విడుదల చేసింది. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ఫస్ట్ వేలంపాటలోనే GMR గ్రూప్ ఢిల్లీ జట్టును కొనుగోలు చేసింది. 2019 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం డిసెంబర్ 18వ తేదీన జైపూర్ లో ప్రారంభం అవుతుందని బీసీసీఐ ప్రకటించిన కొన్ని రోజులకే ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది. ఢిల్లీలో భేటీ అయిన యాజమాన్యం కొత్త పేరుతోపాటు కొత్త లోగోను విడుదల చేసింది.
జట్టులో కూడా మరిన్ని మార్పులు రాబోతున్నట్లు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఇన్నాళ్లు జట్టుకి కెప్టెన్సీగా వ్యవహరిస్తున్న గంభీర్ తప్పుకోవటంతో.. ఆ స్థానంలో సన్ రైజర్స్ నుంచి శిఖర్ థావన్ ను తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. మహ్మద్ కైఫ్ సైతం కోచ్ బాధ్యతలు స్వీకరించాడు. భారీ మార్పులతో టీం మరింత స్ట్రాంగ్ అయ్యిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ కిరణ్ గాంధీ అనౌన్స్ చేశారు. యూత్ ఎంట్రీతో జట్టు మరింత బలోపేతం అయ్యిందని ప్రకటించారాయన.
17:45 - December 4, 2018

గద్వాల : ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ అబద్ధాలు మాట్లాడుతున్నారని.. కరెంటు లేదని మోడీ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. టీడీపీ ప్రాజెక్టులకు అడ్డుపడుతుంటే కాంగ్రెస్ నేతలు నోరు తెరవలేదన్నారు. గద్వాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి 73 సం.లు అవుతున్నా.. అబద్ధాలు మాట్లాడే ప్రధానమంత్రలు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. నిజామాబాద్ పట్టణానికి వచ్చి.. కరెంటు లేదని మాట్లాడారని...ప్రధాని ఇంత నీచంగా అబద్ధాలు మాట్లాడుతుంటే ఏం చేస్తామని అసహనం వ్యక్తం చేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అడ్డగోలుగా ముంచుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు నోరుమూసుకుని పడిఉన్నారని మండిపడ్డారు. ఇది చరిత్ర అని.. అబద్ధం చెప్పే అవసరం తనకు లేదన్నారు. 1974లో ఏపీ ప్రభుత్వం అడగకపోతే..బచావత్..  వారంతటవారే జూరాల ప్రాజెక్టు మంజూరు చేశారని తెలిపారు. ఆ తర్వాత ఎందుకు కాంగ్రెస్ త్వరగా జూరాలను నీటితో నింపలేదని ప్రశ్నించారు.
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కావాలి..  
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా పోతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రైతు బంధు పథకం ఎక్కడా లేదన్నారు. రైతు బీమా దేశానికే ఆదర్శమన్నారు. అన్నదాతలను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ ఎస్ అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. రైతు బంధు పెట్టుబడి సాయం రూ.10 వేలు అందిస్తామని చెప్పారు. టీఆర్ ఎస్ పార్టీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. పాలమూరుకు నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ కాదా..అని అన్నారు. ఈ విషయం పాలమూరు జిల్లా ప్రజలకు తెలియదా..అన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుకు చంద్రబాబు అడ్డుపడ్డారని తెలిపారు. గట్టు ఎత్తి పోతల పూర్తైతే మండలం మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. గట్టు.. స్టేట్ బార్డర్ అని కృష్ణమోహన్ రెడ్డి కొట్లాడితే గట్టు ఎత్తిపోతల పథకం మంచూరు చేశామని తెలిపారు. వీలైనంత త్వరలో ఆగమేగాల మీద దాన్ని పూర్తి చేసి... 38 వేల ఎకరాలకు నీరు ఇచ్చే బాధ్యత తనదన్నారు. రిజర్వాయర్ సామర్థ్యం పెంచి..గట్టు లిఫ్టు ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికల్లో  ఓట్లు అడగమని చెప్పారు. 
గద్వాల జిల్లా చేసిన ఘనత టీఆర్ఎస్ దే..
తెలంగాణ రాష్ట్రమే లేకపోతే...కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ జిందగీల గద్వాల జిల్లా అయ్యేదా అని అన్నారు. ఎవరైనా చేసే వారా? తాను గద్వాలను జిల్లాగా చేశానని తెలిపారు. అందుకోసం లక్ష ఓట్ల మెజారిటీతో కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గద్వాల చైతన్యవంతమైన ప్రాంతమని కొనియాడారు. ఉద్యమ సమయంలో జోగులాంబ అమ్మవారి దీనెనతో పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. మంచినీళ్ల పథకం మిషన్ భగీరథ పూర్తి అయిందన్నారు. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకూ..కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకూ రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చే బాధ్యత తనది అన్నారు. రైతులకు గిట్టుబాట ధర రావాలన్నారు. ఐకేపీ మహిళా సంఘాలు జాగృతం కావాలన్నారు. ప్రభుత్వం వచ్చాక ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పారు. ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహిస్తామని చెప్పారు. కల్తీ లేని నిత్యావసరాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో సరఫరా చేస్తామని చెప్పారు. 
ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి...
’ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు. ఎన్నికలు వస్తుంటాయి...పోతుంటాయి... అందరి మాటలు వినండి...చర్చించండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి’ అని అన్నారు. కూటమి, టీఆర్ఎస్ కు మధ్యే పోటీ అని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంటు ఎలా ఉండేది... నాలుగేళ్లలో కరెంటు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుంది అన్నారు. ఏపీలో 24 గంటల కరెంటు లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు కరెంటు ఇస్తున్నామని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు.
ఆసరా, వికలాంగుల పింఛన్ లు పెంచుతాం..
పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ.లక్షా 116 ఇస్తున్నామని తెలిపారు. ఆసరా, వికలాంగుల పింఛన్ లను పెంచుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి రూ.3.016 ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో పుట్టిన ఆడపిల్లలకు రూ.13 వేలు.. అబ్బాయి పుడితే రూ.12 వేల ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతు బంధుతో ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. సహజ మరణానికి కూడా రూ.5 లక్షల బీమా ఇస్తున్నామని చెప్పారు. భూ సర్వేతో పాస్ బుక్ లు రైతులకు అందించామని తెలిపారు.
కంటి వెలుగు పథకాన్ని ఎప్పుడైనా ఊహించామా?
కంటి వెలుగు పథకాన్ని ఎప్పుడైనా ఊహించామా? ఉచితంగా అద్దాలు, మెడిసిన్స్ ఇస్తున్నామని తెలిపారు. ఈఎన్ టీ, డెంటల్ డాక్టర్ లతో పరీక్షలు చేయిస్తామని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ కావాలని ఆకాంక్షించారు. అందరి రక్త నమూనాలు సేకరించి..ప్రజల హెల్త్ స్టేటస్ కంప్యూటరైజ్ చేస్తామని చెప్పారు. 

 

17:01 - December 4, 2018

ఢిల్లీ : రాజకీయాల్లో క్రిమినల్ నేతలు వుండకూదు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వారే రాజ్యాంగానికి భంగం కలిగించేలా క్రిమినల్ చర్యలకు పాల్పడితే ఇక చట్టసభలకు అర్థం వుందదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో క్రిమినల్ కేసులు వున్న రాజకీయ నేతలపై దాఖలైన పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయంస్థానం సుప్రీంకోర్టు విచారణ చేట్టింది. 

క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలని, ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరుతూ భాజపా నేత అశ్వినీ ఉపాధ్యాయ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో తెలియాలని పేర్కొంది. దీనిపై డేటా ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ విచారణలో న్యాయస్థానానికి సాయం చేసేందుకు సీనియర్‌ న్యాయవాదులు విజయ్‌ హన్సరియా, స్నేహా కలితను అమికర్‌ క్యూరీలుగా నియమించింది. 

ఈ నేపథ్యంలో కేసుల విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించింది. ప్రస్తుతం మాజా రాజకీయ ప్రతినిథులపై 4,122 కేసులు పెండింగ్ లో వున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో ఎంపీలపై 2,324 కేసులు న్నాయి. 1991 కేసుల్లో ఇంకా చార్జ్ షీట్లు నమోదు కావాల్సి వుంది. 

ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత బీఎస్‌ యడ్యూరప్పపై 18 కేసులుండగా..వీటిల్లో 10 కేసులు గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష పడేవే కావటం విశేషం. అయితే ఇంతవరకూ ఏ ఒక్క కేసులోనూ ఆయనపై ఛార్జ్‌షీటు నమోదుకాలేదు. ఒక్క యడ్యూరప్పే కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఏకంగా 4,122 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యేలపై పెండింగ్‌ కేసుల అంశంపై అమికస్‌ క్యూరీగా ఉన్న సీనియర్‌ న్యాయవాదులు ఇద్దరు సుప్రీంకోర్టుకు మంగళవారం నివేదిక సమర్పించారు.

ఈ న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడి హైకోర్టుల నుంచి పెండింగ్‌ కేసుల వివరాలను తీసుకుని మంగళవారం కోర్టుకు నివేదిక సమర్పించారు. దీని ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,122 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో చాలా కేసుల్లో కనీసం ఛార్జ్‌షీటు కూడా నమోదు కాలేదని తేలింది. ఇక 264 కేసుల్లో హైకోర్టులే స్టే విధించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు పరిశీలించింది. 
 

16:40 - December 4, 2018

హైదరాబాద్ : దొంగల్లో హైటెక్ దొంగలు వేరయా అన్నట్లుగా వుంది ఈ దొంగగారి పొజిషన్. దొంగతనాల్లో చాలా రకాలున్నాయి. అలాగే దొంగతనాల్లో కూడా ప్రొఫెషనలిజం చూపిస్తుంటారు కొందరు దొంగలు. అలాగే ప్రొఫెసనల్ గా చేసే దొంగతనాలకు టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకుంటున్నారు నేటి హైటెక్ దొంగలు. గూగుల్. దీనిపైనే ఇప్పుడు ప్రపంచం అంతా నడుస్తోంది. మనకు కావాల్సిన ఎటువంటి సమాచారాన్నైనా ఎవ్వరిని అడగకుండానే మన చేతుల్లో పెట్టేస్తుంది. గూగుల్. అందుకే అందరు గూగుల్ ని గూగుల్ మాత అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. మరి మాత అంటే తల్లికి బిడ్డల పట్ల పక్షపాత వైఖరి వుండనట్లే గూగుల్ తల్లికి కూడా పక్షపాతం లేకుండా అడిగినవారందరికి సమచారాన్ని అందించేస్తుంది. అలా గూగుల్ మాత ఇచ్చిన సమాచారంతో ఓ హైటెక్ దొంగ దోపిడీలకు పాల్పడుతు ప్రొఫెషనలిజం ప్రదర్శిస్తున్నాడు.మరి ఆ హైటెక్ దొంగగారి ఫ్రొఫెషనలిజం ఏమిటో తెలుసుకుందాం..

దొంగా దొంగా వచ్చాడు అన్నీ దోచుకుపోయాడే అన్నట్లుగా వుంటుంది ఈ హైటెక్ దొంగగారి ప్రొఫెషనలిజం. గూగుల్ మ్యాప్స్ ద్వారా ధనవంతుల ఇళ్లు ఎక్కడ వున్నాయో వెతికేస్తాడు గూగులమ్మ  మ్యాప్ సహాయంతో. వాటిలో నచ్చిన ఇంటిని సెలక్ట్ చేసుకుంటాడు. అంతే విమానంలో రయ్ మంటు వచ్చేస్తాడు. ఎందుకంటే అతను హైటెక్ దొంగ కదా. ఇంటిని దోచుకుని తిరుగు ప్రయాణంలో విమానంలో కాకుండా  రైలెక్కేసి చక్కగా చెక్కేస్తాడు. 

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న నుంగంబాక్కంకు చెందిన డాక్టర్  ఇంటిని దోచుకున్న తర్వాత ఈ హైటెక్ దొంగగారు హైదరబాద్ పోలీసులకు చిక్కిపోయాడు. అందేంటి చెన్నైలో దొంగతనం చేస్తే హైదరాబాద్ లో ఎలా కనిపెట్టారనుకుంటున్నారా? అదే మరి ఆ దొంగగారి స్పెషల్. 

ఇటీవల హైదరాబాద్‌లో ఓ దొంగతనం కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాతియా రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు. నుంగబాక్కం, వల్లువూర్ కొట్టంలో జరిగిన దొంగతనాలు కూడా తాను చేసినవేనని అంగీకరించాడు. దీంతో మరింత క్షుణ్ణంగా విచారించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే విషయాలు చెప్పాడు సదరు దొంగ. 

దోచుకున్న తర్వాత చిన్న ఆధారం కూడా లేకుండా జాగ్రత్త పడే ఈ హైటెక్ దొంగను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారటంతో..మరింతగా దృష్టి పెట్టిన పోలీసులు చెన్నైలో ధనికులు నివసించే ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలన్నీ ఒకేలా ఉండడంతో ఒకే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు విచారణలో కనిపెట్టారు.

చెన్నైలోని ధనికులు నివాసముండే ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతుకుతానని..తరువాత  విమానంలో టార్గెట్ చేసిన ప్రాంతానికి చేరుకుంటానని చెప్పాడు. ధనవంతులు రోజులో ఎక్కువ సమయం బయటే గడుపుతారని, కాబట్టి తన పని ఈజీ అయిపోయేదన్నాడు. ఇంట్లో  ఎవరూ లేని సమయంలో వెళ్లి ఎక్కడా వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడతు..సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీ చేసినా తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడతు..దోచుకున్న సొమ్ముతో రైలులో వెళ్లిపోతానని సాతియా రెడ్డి చెప్పాడు. ఈ హైటెక్ దొంగగారి స్ర్కీప్లేకు పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. 
 

16:34 - December 4, 2018

మహబూబ్ నగర్ : తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు అనుకుంటున్నాడా.. చంద్రబాబు అని కేసీఆర్ అన్నారు. ’మన కళ్లను మన వేలితో పొడుస్తున్నారు.. మీ ఇంట్లోకి వచ్చి పొడిచిపోతా అంటున్నాడు చంద్రబాబు’. మాయా మచ్చీంధ్ర - టక్కు టమారాం విద్యలు ప్రదర్శిస్తున్నాడు చంద్రబాబు..అని చెప్పారు. పౌరుషం, నెత్తురు లేకుండా తెలంగాణ ప్రజలు ఉన్నారా? తెలంగాణ ప్రజలకు పౌరుషం, నెత్తురుందని కేసీఆర్ అన్నారు. మక్తల్ టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. డబ్బు సంచులు తెచ్చి.. పంచుతూ ఉన్నారు..వరంగల్ పోలీసులు తంతే 6 కోట్లు పట్టుకున్నారు అని పేర్కొన్నారు. వలస పెత్తనం - చంద్రబాబు పెత్తనం అవసరమా ? అని అన్నారు. 

 

15:55 - December 4, 2018

2.ఓ మూవీ కలెక్షన్స్ ఎంత.. పెట్టిన బడ్జెట్ అంతా వచ్చేసిందా.. ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు అయ్యింది అనేది దానికి క్లారిటీ దొరికేసింది. అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాకపోయినా.. మరీ డల్ గా లేవని మాత్రం ఈ లెక్కలు చెబుతున్నాయి. 2018, అక్టోబర్ 29వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. వీకెండ్ వరకు నాలుగు రోజులు బాగానే వసూళ్లు రాబట్టినా.. రన్నింగ్ మాత్రం కష్టమనే టాక్ వచ్చేసింది. ఫస్ట్ 4 డేస్.. 500 కోట్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నా.. ఫలితం లేదు. కేవలం 328 కోట్లు మాత్రం రాబట్టగలిగింది.
ఏయే ప్రాంతాల్లో ఎంత వసూళ్లు :
నైజాంలో 13.70 కోట్లు, వైజాగ్ 4.28 కోట్లు, ఈస్ట్ లో 2.46, వెస్ట్ లో 1.71, కృష్ణలో 2, గుంటూరులో 2.59, నెల్లూరులో 1.36 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 49.8 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది మూవీ. తమిళనాడులో 55.3, కేరళలో 11.5, కర్నాటకలో 21.2 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో 26.4, యూఏఈలో 22 కోట్లు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో 5.6 కోట్లు, యూకేలో 4.6, ఇతర అన్ని దేశాల్లో కలుపుకుంటే 30 కోట్లు వసూలు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో వసూలు అయిన మొత్తం 328 కోట్లు గ్రాస్ అయితే.. ఇందులో షేర్ మాత్రం 168.6 కోట్లుగా ఉంది. వీకెండ్ తర్వాత వచ్చిన మండే రోజు ఏపీ, తెలంగాణలో 3 కోట్ల వరకు వసూలు చేసింది.
కలెక్షన్స్ పెరగటం కష్టమే :
500 కోట్ల భారీ పెట్టుబడి మొత్తంగా తిరిగి రావాలి అంటే కష్టమే అంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్. మరో 50 కోట్ల షేర్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఓవరాల్ గా 200 కోట్ల రూపాయలు మాత్రమే షేర్ రూపంలో రానుంది. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్లు అన్నీ కలుపుకుంటే మరో 50 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. 

 

15:48 - December 4, 2018

రాజస్థాన్  : ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియకు ముహూర్తం ఫిక్సయ్యింది. వేదికను బెంగళూరు నుంచి జైపూర్‌కు మార్చారు.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) – 2019 కోసం ఆటగాళ్ల వేలం ఈ నెల 18న జరగనుంది. జైపూర్‌ వేదికగా జరిగే ఈ వేలం కేవలం ఒకే రోజుతో ముగియనుంది. ఈ వేలంలో ఆయా జట్లు 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో 50 మంది భారత క్రికెటర్లు కాగా.. 20 మంది విదేశీ క్రికెటర్లు. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు ఉన్నాయి. ఈ వేలంలో యువరాజ్‌ సింగ్, గంభీర్, ముస్తఫిజుర్, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ వంటి వారు పాల్గొననున్నారు. ఇందులో ముస్తఫిజుర్ ను దక్కించుకునేందుకు అందరూ పోటీ పడుతున్నారు. కాగా గతంలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరగ్గా.. ఈసారి పింక్ సిటీ జైపూర్‌లో వేలం నిర్వహించనున్నారు. పంజాబ్ 11 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ 23 మంది ఆటగాళ్లను తమతోనే ఉంచుకోవడానికి ఇష్టపడింది. దీంతో ఆ జట్టు కేవలం ఇదర్ని మాత్రమే కొనుగోలు చేయగలదు. 
ఏఏ జట్లు ఎవరెవర్ని వదులుకున్నాయంటే..
వేలం ప్రక్రియ ప్రారంభానికి ముందే.. జట్లు తమతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను గత నెలలో ప్రకటించాయి. గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదులుకోనున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యువరాజ్ సింగ్‌ను వదిలేయగా.. ఢిల్లీ జట్టు గౌతమ్ గంభీర్‌‌ను వదిలేసింది. రాజస్థాన్ రాయల్స్ జయదేవ్ ఉనద్కత్‌ను వదులుకుంది. గత సీజన్లో రూ.11.5 కోట్ల భారీ మొత్తానికి రాజస్థాన్ అతణ్ని కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ తమ వికెట్ కీపర్ సాహాను, విండీస్ టీ20 కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్‌ను వదులుకుంది. హైదరాబాద్ జట్టు ముగ్గురు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లను కొనుగోలు చేయగలదు. జేపీ డుమిని, ప్యాట్ కమిన్స్‌, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది. సాధారణ ఎన్నికలు నిర్వహించనుండటంతో.. వచ్చే సీజన్లో ఐపీఎల్ మ్యాచ్‌లను పాక్షికంగా లేదా పూర్తిగా విదేశాల్లో నిర్వహించే అవకాశాలున్నాయి.
 

15:27 - December 4, 2018

రైతే రాజు అంటారు. మన దేశం ఎక్కువగా ఆధారపడింది కూడా వ్యవసాయం మీదే. మరి నిజంగానే రైతులు రాజుల్లా బతుకుతున్నారా? వారి పంటలకు గిట్టుబాటు ధరలు దక్కుతున్నాయా? అన్నదాతలు లాభాలు గడిస్తున్నారా? అంటే.. లేదనే చెప్పాలి. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రైతు పరిస్థితి దయనీయంగానే ఉంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస ధర కూడా రావడం లేదు. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు పండించే పంట కిలో రూపాయి కూడా పలకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కిలో వంకాయ 20 పైసలు:
నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. కిలో వంకాయ 20 పైసలే. దీంతో ఆ పంట పండించిన రైతుకి కడుపు మండిపోయింది. కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రాని పరిస్థితి. దీంతో అతడు మొత్తం పంటను తన చేతులతోనే నాశనం చేశాడు.

కిలో ఉల్లి రూపాయి: వంకాయ పండించిన రైతుదే కాదు ఉల్లి పండించిన రైతుది కూడా అదే దుస్థితి. కోయకుండానే ఉల్లి పంట రైతుతో కన్నీరు పెట్టించింది. కిలో ఉల్లి రూపాయి మాత్రమే పలకడంతో మహారాష్ట్రకు చెందిన రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక రూపాయి విరాళంగా పంపాడు. ఇదీ మా దుస్థితి అని తెలిజయేశాడు. 'నేను 750 కిలోల ఉల్లిని పండించాను.. కిలో రూపాయి మాత్రమే పలికింది.. చివరకు రూపాయి 40పైసలకు ఓ వ్యాపారితో ఒప్పందం చేసుకున్నాను. 750 కిలోల ఉల్లి పంటను రూ.1064కు అమ్మాను' అని ఆ రైతు వివరించాడు.

కిలో కొత్తిమీర రూ.2.50:
మహారాష్ట్ర రైతులదే కాదు హర్యానా రైతులదీ అదే దుస్థితి. కొత్తిమీర, ముల్లంగి, పాలకూర పండించిన రైతులు లబోదిబో మంటున్నారు. కిలో కొత్తిమీర రూ. 2 నుంచి 7కు మించడం లేదు. హర్యానా ప్రభుత్వం ఆలూ, టమాటో పంటలకు మాత్రమే మద్దతు ధర ఇస్తోందని రైతు వాపోయాడు. చేసేదేమీ లేక తమ పంటలను అయినకాడికి అమ్ముతున్నామని వాపోయారు.

కిలో టొమాటో రూ.3:
పుణె రీటైల్ మార్కెట్‌లో కిలో టమాటో ధర 20రూపాయల వరకు ఉంది. హోల్‌సేల్ మార్కెట్‌లో మాత్రం 3 రూపాయలకు మించడం లేదని రైతులు వాపోతున్నారు. అధికంగా పంట పండిండం, ఎక్కువగా సరఫరా దీనికి కారణం.

ఎందుకు?
రైతు అమ్మితే పైసల్లో.. వినియోగదారులు కొంటే రూపాయల్లో. ఎందుకీ వ్యత్యాసం. ఎందుకు ఇంత తేడా? అనే ఆరాలు తీస్తే.. రైతులు పండించిన పంట వినియోగదారుడికి చేరేలోపే 40శాతం వరకు పాడైపోతోంది. దీనికి తోడు అధికంగా పంట పండించం, కోల్డ్ స్టోరేజీలు లేకపోవం కారణాలు. అమ్మకాలకు సరైన మార్గాలు లేకపోవడం కూడా కారణమే. ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు సరిపడ లేవు. దేశంలో కేవలం 2శాతం కూరగాయలు, పండ్లను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తున్నారు. అమెరికాలో 60శాతం వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది.

ఎక్కువగా నష్టపోతున్నది:
గిట్టుబాటు ధరలు లేకపోవడం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నది కూరగాయలు, పండ్ల వ్యాపారులే. రైతుల కష్టం ఏంటో తెలుసు అని ప్రధాని మోడీ పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు. అన్నదాతకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చేతల్లో చూపలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రధాని మోడీ రైతుల కష్టాలను తీర్చేందుకు, వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

15:25 - December 4, 2018

ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీటూ’ ఉద్యమంతో గళమెత్తిన మహిళల గొంతులను నొక్కివేసే యత్నాలు జరుగుతున్నాయా? మహిళల ఆర్థిక స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపేలా వున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. న్యూయార్స్ వాల్ స్ట్రీట్ లో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.

ఇలా ప్రవర్తిస్తున్నారు :
మహిళా ఉద్యోగులతో డిన్నర్ కు వెళ్లవద్దు..
విమానాలు ఎక్కితే మహిళల పక్కన కూర్చోవద్దు..
హోటల్స్ లో దిగాల్సి వస్తే ఒకే ఫ్లోర్ లో ఉండవద్దు..

వాల్ స్ట్రీట్ లోని పురుషులంతా.. 'మీటూ' ఉద్యమం తర్వాత ఇలా ప్రవర్తిస్తున్నారు. వ్యూహాత్మకంగా..కుటిలబుద్ధితో  తీసుకుంటున్న నిర్ణయాలు మహిళలను సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరో ఒకరు చేసిన తప్పుకి మహిళలు అందరూ కూడా బాధపడుతున్నారు.

ఆఫీసుల్లో మహిళలతో మాట్లాడేవారే తగ్గిపోయారు. ఎక్కడ తమపై ఆరోపణలు వస్తాయన్న భయం కన్నా, ఈ 'మీటూ'ను ఎలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశమే ఈ వ్యూహాల్లో ఉద్ధేశంగా కనిపిస్తోంది. దీనికి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్సీ మాట్లాడిన మాటలే నిదర్శనం. మహిళలతో డిన్నర్ కు వెళ్లడం మానేశానని ఆయన స్వయంగా చేసిన ప్రకటన సంచలనం అయ్యింది. 

'మీటూ' ఉద్యమంపై పురుషుల స్పందన ఎలావుందో తెలుసుకోవాలని 30 మంది వాల్ స్ట్రీట్ సీనియర్ ఉద్యోగులను ప్రశ్నించగా, ప్రతి ఒక్కరూ మహిళలను దూరం పెట్టాలన్న నిర్ణయంతోనే ఉన్నట్లుగా తెలిసిందని మైక్ పెన్సీ తెలిపారు. ఉద్యోగపరంగా చనువుగా ఉన్నా.. తమపై ఆరోపణలు చేస్తారోమో అన్న ఆందోళన పురుష ఉద్యోగుల్లో వ్యక్తం కావటం విశేషం. 

మోర్గాన్ స్టాన్లీ మాజీ ఎండీ డేవిడ్ భన్ మాట్లాడుతూ పురుషులంతా ఆఫీసుల్లో తమ వైఖరిని మార్చుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని ప్రకటించేశారు. తమను తాము కాపాడుకునేందుకే ఇలా చేస్తున్నారని తెలిపారు. 

మహిళల్లో మానసిక ఆందోళన :

కొలీగ్స్ తోపాటు ఇతరులు కూడా ఇలాంటి వైఖరి అవలంభించటం వల్ల మనశ్శాంతి కోల్పోతున్నామని ఉద్యోగినులు చెబుతున్నారు. స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నామని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నవ్వటానికి కూడా అవకాశం లేకుండాపోయిందని.. జోక్ కూడా చేయటం లేదని.. కనిపిస్తే దూరంగా వెళ్లిపోతున్నారని.. కలిసి కాఫీ తాగటం లేదు.. కలిసి భోజనం చేయటం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. మానసికంగా దెబ్బతీస్తున్నారని పురుష ఉద్యొోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

14:45 - December 4, 2018

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ఎన్నికలకు ఫండింగ్ చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కర్నాటక ఎన్నికల మాదిరిగా ఒక్కో నియోజకవర్గానికి రూ.10కోట్ల చొప్పున.. మొత్తం 1200 కోట్ల రూపాయలను చంద్రబాబు ఫండింగ్ చేస్తున్నారని, టీడీపీ ఎంపీలకు చెందిన బస్సుల్లో ఆ డబ్బు తరలించారని విజయసాయి రెడ్డి చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు కోసం తన జాతీయ వాటా కింద రాహుల్‌గాంధీకి చంద్రబాబు రూ.5వేల కోట్లు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఇక ముందస్తు ప్రణాళిక ప్రకారమే రేవంత్‌రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్‌లోకి పంపించారని ఆరోపణలు చేశారు.

14:41 - December 4, 2018

అలాంపూర్ (జోగులాంబ): దేశంలో ఎక్కడా లేనటువంటి రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అలంపూర్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్  పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి కష్టాల్లో కూరుకుపోకూడదంటే ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని..ఓటు వేసే ముందు మంచీ చెడు ఆలోచించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని అన్నారు.   రైతు బంధ్ పథకం ద్వారా ఇచ్చే రూ.వేలను రూ.10లకు పెంచుతామన్నారు.  రైతులను ఆదుకున్న ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు.పోరాడి సాధించుకున్న  రాష్ట్రం మరింతగా అభివృద్ధ సాధించాలంటే టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 
గత పాలకుల హయాంలో తెలంగాణలో విద్యుత్ సరఫరా ఎలా ఉందో, టీఆర్ఎస్ హయాంలో ఎలా ఉందో ఆలోచించాలని, అదే విధంగా, పింఛన్లు, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో కూడా పోల్చి చూసుకోవాలని అన్నారు. సమైక్యపాలనలో రైతాంగం దెబ్బతిందని, తమ హయాంలో రైతులకు మేలు చేశామని చెప్పారు. నాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిననాడు జోగులాంబ ఆలయంలో మొక్కి ఇక్కడ నుంచే బయలుదేరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మంచినీళ్లు, తాగునీళ్లు ఇవ్వకుండా సమైక్యపాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. టీఆర్ఎస్ ను మరోసారి గెలిపిస్తే..గతంలో వున్న పెన్షన్స్ ను మరింతగా పెంచి ఇస్తామని కేసీఆర్ హామీఇచ్చారు.
 

14:08 - December 4, 2018
ఢిల్లీ :  ఇండియన్ రైల్వే వివిధ జోన్ల‌లో 2018-19 సంవ‌త్స‌రానికిగానూ అప్రెంటిస్‌ పోస్టుల భ‌ర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆయా జోన్ల‌కు విడివిడిగా ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చు. ఒకప్పుడు ఉద్యోగం రావాలంటే కనీసం డిగ్రీ అర్హత కావాల్సివచ్చేది.కానీ ఇప్పుడు కేవలం 10వ తరగతి చదివితే చాలు కొన్ని నింబంధలను సరిపోలితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుంది.  అభ్యర్థులు రూ.100 ఫీజుగా చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి వుంటుంది. 
రైల్వే అప్రెంటిస్‌షిప్: 2835 పోస్టులు..
జోన్ల వారీగా ఖాళీలు ఇలా వున్నాయ్..
నార్త్ ఈస్ట‌ర్న్ రైల్వే (గోర‌ఖ్‌ఫూర్)- 745
నార్త్ వెస్ట‌ర్న్‌ రైల్వే (జైపూర్‌)     - 2090
మొత్తం ఖాళీలు                - 2,835
ట్రేడ్స్: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ (డీజిల్), ట్రిమ్మర్. 
ఉద్యోగ దరఖాస్తుకు తగిన అర్హ‌త‌: 
50 శాతంమార్కులతో ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉత్తీర్ణ‌త‌ సాధించాల్సి వుంటుంది.  
దరఖాస్తు అభ్యర్థికి వుండాల్సిన వయోపరిమితి..
15 - 24 సంవ‌త్స‌రాల‌ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాలు; ఓబీసీలకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. మెట్రిక్యులేష‌న్, ఐటీఐ మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా వుంటుంది. ఎంపిక విధానంలోని నిబంధలను కూడా అభ్యర్థి దృష్టిలో పెట్టుకోవాలి. 
చివ‌రితేది.. 
నార్త్-ఈస్ట‌ర్న్ రైల్వే - 29.12.2018 
నార్త్-వెస్ట‌ర్న్‌ రైల్వే - 30.12.2018
 
13:29 - December 4, 2018

జనగాం: పెంబర్తి వద్ద తనిఖీల్లో పట్టుబడ్డ రూ.5కోట్ల నగదు వివరాలను పోలీసులు వెల్లడించారు. తాము స్వాధీనం చేసుకున్న ఆ డబ్బు మొత్తం ప్రజాకూటమి అభ్యర్థులకు చేరవేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సీపీ రవీందర్ నిర్దారించారు. హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన హవాలా బ్రోకర్ కీర్తి కుమార్ జైన్ నుంచి హవాలా డబ్బుని తరలించారని చెప్పారు. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు రూ.1.50కోట్లు, కొండా సురేఖ భర్త కొండా మురళికి రూ.2.30కోట్లు, వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్ది రాజు రవిచంద్రకు రూ. 2కోట్లు చేరవేసేందుకు ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. సరైన పత్రాలు చూపని నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల అధికారులు చేపట్టిన తనిఖీల్లో కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు దగ్గర అధికారులు తనిఖీలు చేపట్టగా ఓ కారులో రూ.5.85కోట్ల నగదు లభించడం సంచలనంగా మారింది. నగదుతో పాటు ఏపీ 37 సీకే 4985 నెంబరు గల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

* జనగాం పెంబర్తి వద్ద రూ.5.85కోట్లు స్వాధీనం
* రూ.5.85కోట్లు ప్రజాకూటమి అభ్యర్థులదిగా నిర్దారణ
* హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన కీర్తీ కుమార్ జైన్ నుంచి హవాలా డబ్బు తరలింపు
* రూ.1.50 కోట్లు టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి
* రూ.2.30కోట్లు కొండా సురేఖ భర్త కొండా మురలికి
* రూ.2కోట్లు వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్ది రాజు రవిచంద్రకు
* పట్టుబడ్డ నగదులో ఒక రూ.2వేల దొంగ నోటు
* షెల్ వేరియేషన్ సంస్థ ద్వారా ఆర్థిక లావాదేవీలు

13:09 - December 4, 2018

ఢిల్లీ : కిల్లర్ గేమ్ బ్లూ వేల్ ఛాలెంజ్‌ గురించి తెలిసిన విషయమే. ఈ గేమ్ కు బలైపోయినవారు ఎంతమందో. ఈ గేమ్ లో ఇచ్చిన టాస్క్ లను రీచ్ అయ్యే క్రమంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారనే వార్తలు గతఏడాదిలో హల్ చల్ చేశాయి. ఆత్మహత్యకు ప్రేరేపించే ఈ ఆటకు యువత ఆకర్షితులై ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు లేకపోలేదు. గేమ్ అనేది వికాశం పెంచేదిగా వుండాలి తప్ప ప్రాణాలు తీసేంతగా వుండకూడదు. మైండ్ గేమ్ తో మైండ్ మరింతగా షార్ప్ అవ్వాలి తప్ప దానికి బానిసగా మారిపోకూడదు. ఇటువంటి ప్రాణాలు పోగొట్టుకునే ఘటనలకు బ్లూవేల్ చాలెంజ్ గేమ్ బలైపోయిన ఘటనలు జరిగాయి. 
ఈ క్రమంలో ఈ బ్లూవేల్ గేమ్ ను చాలా  దేశాల్లో నిషేధించారు. బ్లూ వేల్ గేమ్ ఆడటం వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంబైలో 2017 జులై 30న తొలి పోలీస్ కేసు నమోదైంది. ఆ తరవాత దేశ వ్యాప్తంగా చాలా మంది పిల్లలు ఈ గేమ్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది ఇంటర్నెట్‌లో ఓ మోసమని నిపుణులు అంటున్నారు. ఈ గేమ్‌లోని ‘రోజ్’ ఛాలెంజ్ కారణంగా ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది కేవలం కల్పితం కాదని నిరూపణ కూడా అయ్యింది. దీనికి సంబంధించి ఓ కీవర్డ్స్  సాక్ష్యంగా కనిపిస్తోంది. 
ఆత్మహత్యల వివరాలు తెలియజేసే కీవర్డ్స్..
యువత ఈ బ్లూ వేల్ ఛాలెంజ్‌ను స్వీకరించినట్లు పోలీసులు ఇప్పటికే ఖరారు చేశారు. అయితే ఈ సంఖ్య చాలా తక్కువ. బ్లూ వేల్ ఛాలెంజ్ ద్వారా ఆత్మహత్యలకు యత్నించిన వారి వివరాల గురించి గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ‘Police confirms Blue Whale Challenge’ అనే కీవర్డ్స్ ద్వారా చాలా వివరాలు పొందొచ్చు. కాగా ఇదిలా ఉంటే, బ్లూ వేల్ ఛాలెంజ్‌కు సంబంధించి కిందటేడాది వైరల్ అయిన మెసేజ్ ఒకటి ప్రస్తుతం తమిళనాడులో వాట్సాప్ గ్రూపుల్లో సర్య్కులేట్ అవుతోంది. విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఆ మెసే ఇదే..మీరు కూడా చూడండి..

Image result for Blue Whale Challenge Game: Viral Whatsapp Message ..

13:04 - December 4, 2018

ఖమ్మం: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అధికారం మళ్లీ టీఆర్ఎస్‌దే అని ఆయన చెప్పారు. ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కు మద్దతుగా కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఏపీ, కర్నాటక, ఢిల్లీల నుంచి డబ్బు మూటలు అందుతున్నాయని కేటీఆర్ ఆరోపిచారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజాకూటమికి అధికారం మాత్రం దక్కదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఉత్తుత్తి వాగ్దానాలు నమ్మొద్దని ప్రజలను కోరారు.
కేసీఆర్ లాంటి సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా?
ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని.. పేదల సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సీఎం అయితేనే రైతులకు 24గంటల కరెంటు అందుతుందన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి దేశంలో మరెవరూ లేరన్నారు. కాంగ్రెస్‌కు పవర్ కట్ అయితేనే తెలంగాణకు పవన్ వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ప్రజలు బాగుండాలి అని కోరుకునే ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, పెన్షన్లు ఇలా ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో మరెవరైనా ఉన్నారా? అని కేటీఆర్ అడిగారు. ప్రజల భవిష్యత్తు గురించి కేసీఆర్ తన ఆరోగ్యం కూడా లెక్కచేయలేదన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ గెలుపు ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఖమ్మం పట్టణానికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చామని, అవసరమైతే మరో వెయ్యి కోట్లు ఇచ్చేందుకు వెనుకాడము అని కేటీఆర్ స్పష్టం చేశారు.

12:36 - December 4, 2018

హైదరాబాద్ : ఎంఐఎం నేత, మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కేటీఆర్ అధినేత కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.   పాతబస్తీలో జరిగిన మజ్లిస్ బహిరంగ సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతు..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు ఏఐఎంఐఎం మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.  తాజాగా తమ మిత్రపక్షంపై మజ్లిస్ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒడిపోతే సీఎం కేసీఆర్ బీజేపీ గూటికి చేరుకుంటారని.. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరో 5-10 ఏళ్లు కొనసాగుతుందని అక్బరుద్ధీన్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.
అందుకే టీఆర్ఎస్ కు మద్దతు : అక్బరుద్దీన్
అందుకే తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆర్ కు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ తమ మాట వినకుంటే పరిస్థితులను బట్టి రాజకీయ వ్యూహాలను మార్చుకుంటామని స్పష్టంచేశారు. కాగా ఒకపక్క మద్దతు ఇస్తున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కేసీఆర్ పై సంలచన ఆరోపణలు చేయటం మరింత సంచలనంగా మారింది. ఇది ఎన్నికల్లోవ్యూహమా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 
 

12:29 - December 4, 2018

ఢిల్లీ: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 100 లాకర్లు... 10 కాదు.. 20 కాదు.. ఏకంగా 25కోట్ల రూపాయలు.. దేశ రాజధాని ఢిల్లీలో హవాలా రాకెట్ గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ప్రైవేట్‌ లాకర్ల నుంచి రూ. 25 కోట్లు బయటపడ్డాయి. అన్నీ 2వేల రూపాయల నోట్లు కావడం విశేషం. హవాలా వ్యాపారులు తమ సొమ్మును రహస్య ప్రాంతాల్లో ప్రైవేట్‌ లాకర్లలో దాచుకుంటున్న విషయం విచారణలో వెల్లడైంది. రంగంలోకి దిగిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఢిల్లీలో ఏకకాలంలో పది ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
చాందీనీ చౌక్ నయాబజార్‌లో కొన్ని దుకాణాల్లో రైడ్ చేసిన ఐటీ అధికారులకు అక్కడ కనిపించిన దృశ్యాలు షాక్‌కు గురి చేశాయి. దుకాణం కింద సీక్రెట్‌గా ఓ సెల్లార్ ఏర్పాటుచేసిన వ్యాపారులు... అందులో లాకర్స్ ఏర్పాటు చేశారు. చాందినీ చైక్ ప్రాంతంలో హవాలా వ్యాపారం నిర్వహించే చాలామంది ఈ లాకర్లలో డబ్బును దాచుకుంటున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు, ఒక్కో వ్యాపారి ప్రత్యేకంగా లాకర్ ఏర్పాటు చేసుకుని, సీక్రెట్ ‘కీ’ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. ఐటీ అధికారులకు లాకర్స్ తెరిచేందుకు అవకాశం లేకపోవడంతో వాటిని పగలకొట్టి, డబ్బు బయటికి తీశారు.
దాడుల్లో పట్టుబడిన నగదు... పొగాకు వ్యాపారులు, కెమికల్‌ ట్రేడర్లు, డ్రైఫ్రూట్‌ డీలర్లతో సహా ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో కొందరు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సొమ్ముగా భావిస్తున్నారు. వీరు పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు సాగించడంతో పాటు, వీరికి అంతర్జాతీయ సంబంధాలున్నాయని చెబుతున్నారు.
ఈ ఏడాది ఐటీ అధికారులు ఢిల్లీలో చేపట్టిన మూడో భారీ లాకర్‌ ఆపరేషన్ ఇది‌. జనవరిలో సౌత్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలోని ప్రైవేట్‌ లాకర్లలో ఐటీ అధికారులు దాడులు జరిపి రూ 40 కోట్ల నగదును సీజ్‌ చేశారు

12:25 - December 4, 2018

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే ''డార్క్ మోడ్''. ఇప్పుడీ సెట్టింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని ద్వారా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. పైగా రాత్రి వేళల్లో వాట్సాప్ చూసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. కళ్లకు పెద్దగా శ్రమ ఉండదు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ వైట్‌ కలర్‌లో ఉంది. ఈ సెట్టింగ్ వచ్చాక బ్యాక్ గ్రౌండ్ కలర్ బ్లాక్‌లోకి మారిపోతుంది.
వాట్సాప్‌లో రాబోయే ఫీచర్ల గురించి ముందే చెప్పే డబ్లూఏ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని బయటపెట్టింది. వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ గురించి బీటా ఇన్ఫో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. డార్క్ మోడ్ గురించి చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ఈ ఫీచర్‌పై పని జరుగుతోందని, మరికొంత కాలం ఓపిగ్గా ఉండాలని బీటా ఇన్ఫో ట్వీట్ చేసింది. కాగా ఈ ఏడాది వాట్సాప్ అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టికర్స్, గ్రూడ్ వీడియో కాలింగ్ తదితర ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు డార్క్ మోడ్ పై దృష్టిపెట్టింది. డార్క్ మోడ్ అనేది వాట్సాప్ యూజర్ల డ్రీమ్‌గా చెబుతారు.

12:21 - December 4, 2018

ఉత్తరప్రదేశ్‌ : గోరక్షణ ముఠా మరోసారి రెచ్చిపోయారు. అల్లర్లు సృష్టించారు. ఈ అల్లర్లలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు పోలీస్ అధికారి కూడా వున్నారు. గోరక్షణ పేరుతో సృష్టించిన ఈ అల్లర్లు జిల్లా పరిధిలో చోటుచేసుకున్నాయి. జిల్లాలోని మెహౌ గ్రామం వద్ద కళేబరం కనిపించింది. ఇంకేముంది..ఓ మతానికి చెందినవారే ఆవును చంపేశారని ఆరోపిస్తూ గోరక్షక ముఠా,  హిందూ సంఘాలు రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు చేపట్టాయి. 
ఆవు కళేబరంలోని ఎముకల్ని నిరసనకారులు ట్రాక్టర్‌ లో వేసుకుని ఛింగర్వతి పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు తీసుకొచారు.అనంతరం  బులంద్‌ షెహర్‌ – గఢ్‌ రహదారిని దిగ్బంధించారు. జిల్లా కలెక్టర్‌ అనూజ్‌ కుమార్, సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ అవినాశ్‌ రంగంలోకి దిగి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. నిలిచిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన గోరక్షకులు నిరసనను ఉదృతం చేసిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. అంతేకాదు  స్థానిక పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ కు నిప్పంటించారు. పలు వాహనాలను దగ్ధం చేస్తు భీతావహ వాతావరణం సృష్టించారు. 
ఈ దాడిలో ఇన్‌ స్పెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ మరణించారు. అలాగే పోలీసులు నిరసనకారులపై జరిపిన పోలీసులు కాల్పుల్లో సుమిత్‌ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో పోలీసులు  పరిస్థితి మరింతగా విషమించకుండా పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బీజేపీ అధికారంలో వున్న ఉత్తరప్రదేశ్ లోనే గోరక్షణ పేరుతో ఇటువంటి ఘటనలు జరగటం గమనార్హం. కాగా గోరక్షణ పేరుతో సృష్టించే ఈ అల్లర్లకు అమాయకులు కూడా బలైపోతున్నారు. 
మరోవైపు రైల్వే ట్రాక్స్ పై వేగంగా వచ్చే టైన్స్ వల్ల గోవులు వందల సంఖ్యలో చనిపోతుంటే రైల్వే గేట్స్ ను ఏర్పాటు చేయటంలో శ్రద్ధ పెట్టని ప్రభుత్వం గోరక్షణ పేరుతో సృష్టించే అల్లర్లను నియంత్రణకు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవటం గమనించాల్సిన విషయం.  
 

 

11:26 - December 4, 2018

వంకాయలు, వంకాయలు అని ఇంటి ముందుకు బండి వచ్చినా.. కూరగాయలు అమ్మే మనిషి వచ్చినా మనం ఠక్కున ఏమంటాం.. ఎంతమ్మా వంకాయలు కిలో అని.. ఆమె 20 పైసలు అని చెబితే ఎలా ఉంటుంది.. మరీ వెటకారాలు వద్దు.. నిజం చెప్పు అంటాం. ఇది పచ్చినిజం. కిలో వంకాయలు 20పైసలు మాత్రమే. మీరు నమ్మినా, నమ్మకపోయినా పచ్చినిజం. కాకపోతే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు.. మహారాష్ట్రలో. కిలో వంకాయలు 20పైసలకు అమ్మిన రైతుకి లాభం వస్తుందా.. కచ్చితంగా రాదు. 20పైసలకు వంకాయలు అమ్మేకంటే.. ఊరికే ఇవ్వటం మేలు అనుకున్నాడు. పంటను అంతా పంచిపెట్టేశాడు ఈ రైతు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా రాహతా తెహ్సిల్లోని సకురి విలేజ్. ఆ రైతు పేరు రాజేంద్ర బవేకే..
కిలో 20పైసలే ఎందుకు?
రాజేంద్ర బవేకే.. వంకాయ పంట సాగు చేశారు. రూ.2 లక్షలు ఖర్చు అయ్యింది. పంట చేతికొచ్చింది. కోత మొదలుపెట్టాడు. వ్యాపారితో బేరం పెట్టాడు. మొత్తంగా 65వేలు ఇస్తాను అని చెప్పాడు. 2 లక్షలు ఖర్చు అయ్యింది.. 65వేలు ఏంటీ అని ప్రశ్నించాడు రాజేంద్ర. మార్కెట్ రేటు అంతే అని స్పష్టం చేశాడు. ఈ 65వేలలో రవాణా ఛార్జీలు కూడా నువ్వే భరించాలని చెప్పాడు వ్యాపారి. ఇవన్నీ పోతే మిగిలేది 50వేల రూపాయలు. చేతికొచ్చిన వంకాయలను కిలోల లెక్కన చూస్తే.. 20పైసలు మాత్రమే పడింది. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు రైతు రాజేంద్ర. 20పైసలకు అమ్ముకునే కంటే.. ఊరికే ఇస్తేపోలా అని నిర్ణయం తీసుకున్నాడు. పంట మొత్తాన్ని నాశనం చేశాడు. కోత ఖర్చు ఇక దండగే అనుకున్న రాజేంద్ర.. మొక్కలను పీకిపారేశాడు.
పురుగు మందుల బాకీ కూడా తీరలేదు :
పంటలోని చీడపురుగుల నిర్మూలన కోసం పురుగు మందులు వాడారు రైతు రాజేంద్ర. దాని కోసం 35వేలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు ఆ బాకీ తీర్చటానికి కూడా డబ్బులు లేవు. 2 లక్షల పెట్టుబడికి.. 65వేల వస్తే ఏం చేస్తాం.. ఎలా అప్పుడు తీర్చాలి.. ఇంట్లో తిండి ఎట్లా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు రాజేంద్ర. ప్రభుత్వం ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించాలని.. వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే అన్నారు అంటారు కానీ.. కిలో వంకాయలు 20పైసలు ఏంటండీ.. మరీ దారుణం కాకపోతే. రూపాయికే విలువ లేకుండా పోయిన ఈ రోజుల్లో.. 20పైసలకు కిలో వంకాయలు వస్తున్నాయి అంటే విచిత్రమే కదా.. 

 

11:19 - December 4, 2018

శ్రీహరికోట(నెల్లూరు): దేశ సమాచార, ఇంటర్నెట్‌ రంగం బలోపేతం కోసం ఇస్రో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. పలు సంచలనాత్మక ప్రయోగాలలో విజయకేతనాన్ని ఎగురవేస్తున్న ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమయ్యింది. ఈసారి ఫ్రెంచ్‌ గయానా నుంచి ఈ భారీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. అక్కడి కురు అంతరిక్ష కేంద్రం నుంచి ఆ దేశపు ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా 5,854 కిలోల జీశాట్‌-11 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. డిసెంబర్ 5 తెల్లవారుజామున 4.08 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహాన్ని ఏరియన్‌ రాకెట్‌ తాత్కలిక భూసమస్థితి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. అనంతరం మనశాస్త్రవేత్తలు బెంగుళూరులోని హసన్‌ కేంద్రం నుంచి ఉపగ్రహంలోని ద్రవ అపోజీ మోటార్లను మండించి భూమధ్య రేఖకు తూర్పుదిశలో 74 డిగ్రీలవాలులో భూస్థిరకక్ష్యకు చేరవేయనున్నారు. 
జీశాట్ -11 ప్రత్యేకతలు..
ఈ ఉపగ్రహంలో దేశ సమాచార వ్యవస్థ కోసం 32 కేయు బాండ్‌తోపాటు 8 కేఏబాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లను ఏర్పాటు చేశారు. ఈ ఉపగ్రహంలోని మల్టీ స్పాట్‌ బీమ్‌ యాంటీనా మనదేశ వ్యాప్తంగా సంకేతాలు అందించనుంది. నిమిషానికి 16 గెగాబైట్స్‌ వేగాన్ని ఇంటర్నేట్‌కు అందించనుంది. దేశంలో గ్రామ పంచాయతీలలో ఈ-గవర్నెస్ కు ఉపయోగపడనుంది. బ్రాడ్‌బాండ్‌ సర్వీసెస్ లలో జీశాట్ -11 కీలక పాత్ర పోషించనున్నది. 15 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది. 
అన్ని శాటిలైట్స్ కంటే హెవీ వెయిట్ ఈ జీశాట్ -11
భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-11 ప్రయోగం డిసెంబరు 5న జరుగనుంది. విపరీతంగా పెరుగుతున్న డేటా అవసరాలను తీర్చడమే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఉపగ్రహాన్ని సిద్ధం చేసింది. 5,848 కేజీల బరువున్న జీశాట్‌-11 భారత్‌ తయారుచేసిన ఉపగ్రహాలన్నింటికన్నా బరువైనది. దీన్ని అరియాన్‌-5 రాకెట్‌ సాయంతో ఫ్రెంచ్‌ గయానా నుంచి ప్రయోగిస్తారు. మొదటగా దీన్ని భూ అనువర్తిత బదిలీ కక్ష్యలో ప్రవేశపెడతారు. అనంతరం దీనిలోని ఇంజిన్‌ను మండించడం ద్వారా స్థిర కక్ష్యలోకి చేరుస్తారు. 32 కేయూ బ్యాండ్‌, 8 కేఏ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లను తీసుకెళ్తున్న జీశాట్‌-11 15ఏళ్లపాటు సేవలందిస్తుంది. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడంలో ఇది కీలకంగా మారనుంది.
  

 

11:13 - December 4, 2018

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిమంది శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. సొంతవాహనాల్లో కొండపైకి వెళ్లే వారు చాలామంది ఉన్నారు. అలా సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్, ఇతరత్రా పత్రాలూ తప్పనిసరిగా మీతో ఉండాలి. లేదంటే అలిపిరి దగ్గరే ఆపేస్తారు. ఘాట్‌రోడ్డులో ప్రయాణించాలంటే ఇకపై తప్పనిసరిగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాల్సిందే అని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం వాహనానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌.. ఇవన్నీ కచ్చితంగా ఉండాల్సిందే. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా వాహనాలను అనుమతించేది లేదని ట్రాఫిక్‌ పోలీసులు తేల్చి చెప్పారు.
ఇటీవల తిరుమల ఘాట్‌లో చోటుచేసుకున్న ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో టీటీడీ అధికారులు, విజిలెన్స్‌ విభాగం అధికారులు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నిబంధనలు తీసుకొచ్చారు. అలిపిరి టోల్‌గేట్‌లో లైసెన్స్ లేకుండా వచ్చిన వాహనదారులను అడ్డుకుంటున్నారు. అలాగే అలిపిరి టోల్‌‌గేట్‌ నుంచి తిరుమలకు బైక్‌పై ముగ్గురు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని రావాలని అధికారులు సూచించారు.
నాలుగు రోజుల నుంచి అలిపిరిలో విజిలెన్స్‌, ట్రాఫిక్‌ పోలీసులు పటిష్ఠమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంబంధిత పత్రాలు, లైసెన్స్‌, హెల్మెట్‌ లేకపోతే అలిపిరి వద్దే వాహనాలను ఆపి.. వెనక్కి పంపేస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి అన్నిరకాల పత్రాలు ఉండాలనే నిబంధన అమలు చేయడంతో భక్తులు మండిపడుతున్నారు. కొంతైనా గడువు ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొండపై కొత్త నిబంధనలు
* నిబంధనలను కఠినతరం చేసిన అధికారులు
* వాహనదారులకు కొత్త రూల్స్
* అన్ని పత్రాలతో వస్తేనే కొండపైకి
* ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ తప్పనిసరి

10:32 - December 4, 2018

ఆస్ట్రేలియా : క్రికెట్ లో ఎన్నో రికార్టులు. కొన్ని మాత్రం చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. టీనేజ్ లో సాధించే రికార్డులు.. జీవితంలో సాధించబోయే విజయాలకు సంకేతాలు. అలాంటి అరుదైన రికార్డును సాధించాడు ఓ టీనేజర్. 18 ఏళ్ల ఒలివర్‌. కళ్లు మిరుమిట్లు గొలిపేలా అతను సిక్స్ లు కొడుతుంటే ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు

క్రికెట్‌లో అత్యంత అరుదుగా నమోదయ్యే ఈ ఫీట్‌ను ఇప్పటికే యువరాజ్‌ సింగ్‌, గిబ్స్‌లాంటి స్టార్‌ ఆటగాళ్లు సాధించారు. గతంలో రవిశాస్త్రి కూడా సాధించాడు. ఇప్పుడీ జాబితాలోకి ఆస్ర్టేలియా టీనేజర్‌ ఒలివర్‌ డేవిస్‌ చేరాడు. అండర్‌-19 జాతీయ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన టోర్నీలో ఒలివర్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు. నార్తర్న్‌ టెరిటరీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూ సౌత్‌వేల్స్‌ మెట్రో టీమ్‌ తరఫున ఆడాడు ఈ కుర్రోడు. ఆరు బంతుల్లో 6 సిక్సులే కాదు.. 115 బంతుల్లో 207 పరుగులతో డబుల్ సెంచరీ కొట్టటం విశేషం. మ్యాచ్ లో మొత్తం 17 సిక్సులు కొట్టాడు. 74 బంతుల్లో సెంచరీ చేసిన ఒలివర్‌, ఆ తర్వాత 100 పరుగులను 39 బంతుల్లోనే కొట్టేశాడు. ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌లో స్పిన్నర్‌ జాక్‌ జేమ్స్‌ వేసిన ఆరు బంతులనూ ఒలివర్‌ స్టాండ్స్‌లోకి పంపాడు. ఒలివర్‌ అద్భుత ప్రదర్శనతో న్యూ సౌత్‌వేల్స్‌ జట్టు 163 పరుగుల తేడాతో విజయం సాధించింది.
 

 

10:25 - December 4, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారు. డిసెంబర్ 3వ తేదీ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఈ తెల్లవారుజామున బలవంతంగా అరెస్ట్ చేయడం కొడంగల్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఏసీబీ దాడులు సమయంలోను..గతంలో నోటుకు నోటు కేసులోను  రేవంత్ అరెస్ట్ కాగా ఇప్పుడు తాజాగా కేసీఆర్ సభను అడ్డుకుంటామనీ..నేడు కోస్గిలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని, సభను జరగనివ్వబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కోస్గిలో కేసీఆర్ సభను  పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ తో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డిని, ఇతర ప్రధాన అనుచరులను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు. 
 

10:24 - December 4, 2018

మరొక్క రోజే మిగిలింది. ఆ తర్వాత మైకులన్నీ మూగబోతాయి. ప్రచారం బంద్ అవుతుంది. దీంతో అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం డిసెంబర్ 5తో ముగియనుంది. ప్రచారం ముగింపునకు కౌంట్‌డౌన్‌ మొదలవడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఫుల్ స్పీడ్‌తో జనాల మధ్య తిరిగేస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఐదు ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడనున్నారు. అలంపూర్‌, గద్వాల, మక్తల్‌, కొడంగల్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో కేసీఆర్‌ పర్యటించనున్నారు.
* ఎన్నికల ప్రచారం ముగింపునకు కౌంట్‌డౌన్
* ఐదు నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచార సభలు
* అలంపూర్, గద్వాల, మక్తల్, కొడంగల్, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నియోజకవర్గంలో రోడ్‌ షోలు, సభల ద్వారా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం మూడున్నరకు మైలార్‌గడ్డలో జరిగే సభలో ప్రసంగిస్తారు. వెస్ట్ మారేడ్‌పల్లి, అన్నా నగర్ చౌరస్తా మీదుగా బాపూజీ నగర్‌ చౌరస్తాకు చేరుకుంటారు. తర్వాత మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి దిలీప్‌ కుమార్ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.

* ఆర్మూర్‌లో ఎంపీ కవిత పర్యటన.. జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం
* ఖమ్మంలో కేటీఆర్ రోడ్ షో.. తుమ్మల, పువ్వాడ అజయ్‌కు మద్దతుగా ప్రచారం
* డిచ్‌పల్లిలో బీజేపీ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి తరఫున స్మృతి ఇరానీ ప్రచారం
* సూర్యాపేటలో విజయశాంతి రోడ్ షో, దామోదర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం

09:53 - December 4, 2018

విశాఖపట్నం: సెల్ ఫోన్, ఇయర్ ఫోన్ ఈ రెండు చేతిలో వుంటే ఎవరితోను పనిలేనట్లుగా అసలు అ లోకంతో సంబంధమే లేనట్లుగా మైమరచిపోతు మరో ప్రపంచంలో విహరిస్తుంటారు కొందరు. ముఖ్యంగా నేటి యువత ఇయర్ ఫోన్ పెట్టుకుని పరిసరాలను మరచిపోతున్నారు. దీంతో పలు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఇదిగో సరిగ్గా ఇటువంటి సంఘటనే ఉక్కునగరంలో చోటుచేసుకుంది. అవసరానికి వినియోగించుకోవాల్సిన టెక్నాలజీని టైమ్ పాస్ కు వినియోగించుకుంటు తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. 
ఇయర్‌ ఫోన్స్‌ లో పాటలు వింటూ..పరిసరాలను మరిచిపోయి..రైలు పట్టాలు దాటుతున్న ఓ యువకుడు రైలు కింద పడి దుర్మరణం పాలైన ఘటన విశాఖపట్నంలో జరిగింది. వేగంగా వస్తున్న రైలును గమనించకుండా అతను రైల్వే ట్రాక్‌ దాటేందుకు యత్నించటంతో ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.
నగర పరిధిలోని బుచ్చిరాజుపాలెం, రెడ్డివీధికి చెందిన ఉప్పాడ అనిల్‌ అనే 22ఏళ్ల యువకుడు డాన్సర్ గా పనిచేస్తున్నాడు. నిన్న ఉదయం తన స్నేహితులను కలిసేందుకు వెళుతూరైల్వేట్రాక్‌ దాటే ప్రయత్నం చేశాడు. రైలు తగలడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి ఘటనలతో యువకులే కాదు సెల్ ఫోన్, ఇయర్ ఫోన్ వినియోగిస్తున్న సమయంలో తగు జాగత్తలు పాటించాలని అందరు గుర్తించాల్సిన అవసరముంది. టైమ్ పాస్ ఎలా వున్నా..ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోలేం కదా? అలాగే కుటుంబంలో ఓ ప్రాణం పోతే ఎంతటి విషాదం నెలకొంటుందో అనే విషయాన్ని గుర్తించాలి. 
 

 

09:34 - December 4, 2018

హైదరాబాద్ : వాతావరణ కాలుష్యం..సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్..గాలి కాలుష్యం, నీటి కాలుష్యం వెరసి పలు పక్షి జాతులు..జంతు జాతులు  ఇప్పటికే అంతరించిపోతున్న ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వీటిలో కొన్ని జాతుల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు ఓ పక్షిజాతిపై పగపట్టినట్లుగా వుంది. అదే గుడ్లగూబ. రాత్రివేళ్లలో మాత్రమే సంచరించే ఈ గుడ్లగూడతో తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల కళ్లు పడ్డాయి. దీంతో వాటిని పట్టి తెచ్చి చంపి పడేస్తున్నారు. ఎందుకు? అంటే గెలుపు కోసమట!! అభ్యర్థుల గెలుపుకు, గుడ్లగూబలకు సంబంధం ఏమిటా? అనుకుంటున్నారా? 

అంతరించిపోతున్న పక్షిజాతుల్లో గుడ్లగూబ కూడా ఒకటి అని పర్యవరణ ప్రేమికులు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. గుడ్లగూబలను చంపి వాటిని ప్రత్యర్థుల నివాస స్థలాల్లో పడేస్తే ఇక తమ గెలుపును ఖాయమనే మూఢనమ్మకంతో గుడ్లగూడలను ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు తెలంగాణ ఎన్నికల పోటీ అభ్యర్థులు.దీంతో ఒక్కసారిగా గుడ్లగూడలకు  మస్తు గిరాకీ పెరిగింది.  ఒక్కో గుడ్లగూబకు మూడు నుంచి నాలుగు లక్షలు ఇచ్చేందుకు సైతం అభ్యర్థులు ముందుకు వస్తున్నారంటే వాటి డిమాండ్ ఎలా వుందో ఊహించుకోవచ్చు. 

ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు దళారులు కూడా ఏర్పడ్డారు. కొందరు గుడ్లగూబల వేటకు బయలుదేరారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో గుడ్లగూబల కోసం వేట జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం సేడంలో ఆరుగురు వ్యక్తులు గుడ్లగూబలను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అంటే ఇది ఎంతటి తీవ్రస్థాయికి చేరుకుందో ఊహించుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వీటిని విక్రయిస్తున్నట్టు విచారణలో వారు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.  ఒక్కో గుడ్లగూమకు  డిమాండ్‌ను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు విక్రయిస్తున్నట్టు వారు తెలిపారు. అంతేకాదట వీటిలో  మేలు జాతి గుడ్లగూబలకే ఇంకా మంచి గిరాకీ వుందని వారు చెప్పటం విశేషం. ఈ  విషయం తెలిసిన పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లగూబలను వేటాడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
 

09:20 - December 4, 2018

జనగామ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. సరైన పత్రాలు చూపని నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.6కోట్లకు పైగా నగదు పట్టుబడింది. జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు దగ్గర అధికారులు తనిఖీలు చేపట్టగా ఓ కారులో తరలిస్తున్న రూ.6కోట్ల నగదును సీజ్ చేశారు. ఏపీ 37 సీకే 4985 నెంబరు గల కారును స్వాధీనం చేసుకున్నారు. అటు మంచిర్యాలలో ట్రాలీలో పైపు మాటున తరలిస్తున్న రూ.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య డబ్బుగా గుర్తించారు. మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలో తనిఖీలు చేపట్టగా రూ. 1.17లక్షలు పట్టుబడ్డాయి.
* పెంబర్తి చెక్‌ పోస్టు దగ్గర రూ.5 కోట్లు స్వాధీనం
* హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న ఏపీ37సీకే4985 కారులో తరలింపు
* వెనుక సీటు కింద నగదు కట్టలు

మంచిర్యాల: అటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో 50లక్షల రూపాయలను పట్టుకున్నారు పోలీసులు. బెల్లంపల్లికి చెందిన బాలరెడ్డి అనే వ్యక్తి ఆటో ట్రాలీ ద్వారా బోర్‌వెల్‌ పైపులో డబ్బులు తీసుకెళ్తుండగా టౌన్‌ సీఐ పట్టుకున్నారు.. ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ నేపథ్యంలో తీసుకెళ్తున్నారన్న సమాచారంతో పట్టుకున్నామన్నారు పోలీసులు. బాలరెడ్డితోపాటు పట్టుబడిన డబ్బు, ఆటో ట్రాలీని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌కు అప్పగించారు పోలీసులు...పైపులో డబ్బు తీసుకెళ్లడం పై ఆరా తీస్తున్నారు.
* మంచిర్యాల జిల్లా కేంద్రంలో పట్టుబడిన రూ.50 లక్షలు
* బెల్లంపల్లికి చెందిన బాలరెడ్డి నుంచి స్వాధీనం
* బోర్‌వెల్ పైపులో డబ్బు తరలింపు

08:52 - December 4, 2018

శ్రీకాకుళం: కొంతకాలంగా తనను టార్గెట్ చేస్తూ తనపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎదురుదాడికి దిగారు. పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు. మరోసారి పవన్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ విరుచుకుపడ్డారు. మ‌గ‌త‌నం ఉందా? అంటూ తనను ఉద్దేశించి గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. నిత్య పెళ్లికొడుకు మాదిరి నాలుగేళ్ల‌కోసారి కార్లను మార్చినట్లుగా భార్య‌లను మార్చ‌ట‌మే మ‌గ‌త‌నమా? అని జగన్ ప్ర‌శ్నించారు. ప‌వ‌న్‌కు న‌లుగురు భార్య‌లున్నార‌ని ఎత్తి చూపితే..ఎత్తి చూపిన వారి కుటుంబాల్లోని మ‌హిళ‌లపై సోష‌ల్ మీడియ‌లో తిట్టిస్తారని జ‌గ‌న్ మండిపడ్డారు. భారతీయ సంప్రదాయంలో ప‌విత్ర‌మైన పెళ్లి అనే వ్య‌వ‌స్థ‌ను ప‌వ‌న్ అపహాస్యం చేశారని జగన్ ధ్వజమెత్తారు. ప‌వ‌న్ రెండో భార్య రేణూ దేశాయ్ ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ గురించి మాట్లాడితే.. తన అభిమానుల‌తో పవన్ సోష‌ల్ మీడియాలో ఆమెను వేధించారని.. మ‌గ‌త‌న‌ం అంటే ఇదేనా? అని జ‌గ‌న్ నిలదీశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాజాంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యాక్టర్ పవన్.. డైరెక్టర్ చంద్రబాబు.. నిర్మాత లింగమనేని:
పవన్ కళ్యాణ్.. చంద్రబాబు పెయిడ్ అర్టిస్ట్ అని, చంద్రబాబు డైరెక్షన్‌లో ప‌వ‌న్ ప‌ని చేస్తున్నార‌ని జగన్ ఆరోపించారు. పవన్ యాక్టర్, చంద్రబాబు డైరెక్టర్, లింగమనేని ప్రొడ్యూసర్ అని జగన్ అన్నారు. ల్యాండ్ పూలింగ్ బాధితుల త‌ర‌పున నిల‌బ‌డ‌తాన‌ని చెప్పిన ప‌వ‌న్.. చంద్ర‌బాబు బినామీ లింగ‌మ‌నేని ర‌మేష్ వ‌ద్ద నాలుగు కోట్ల రేటు ఉన్న ప్రాంతంలో ఎక‌రాను కేవ‌లం 20 ల‌క్ష‌ల‌కే తీసుకోవ‌టం అవినీతి కాదా? అని జగన్ ప్ర‌శ్నించారు.

అజ్ఞాతవాసి ద్వారా కోట్లు సంపాదించారు:
అజ్ఞాత‌వాసి సినిమాకి చంద్ర‌బాబు నుంచి పవన్ అధిక మొత్తంలో రాయితీలు పొంది కోట్లు గ‌డించార‌ని జగన్ ఆరోపించారు. తాను అవినీతిపరుడిని అని, లాలూ ప్రసాద్ యాదవ్ తరహాలో జైలుకి వెళ్తానని పవన్ చేసిన వ్యాఖ్యలకు జగన్ ఘాటుగా బదులిచ్చారు. నేను అవినీతికి పాల్ప‌డిన‌ట్లు మీరు చూశారా? అని పవన్‌పై ఫైర్ అయ్యారు. అసలు పవన్‌కు రాజకీయ అవగాహన లేదని అన్నారు. చంద్రబాబు అవినీతి పవన్‌కు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్యాకేజీలకు అమ్ముడుపోయి తనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

08:12 - December 4, 2018

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ మరోసారి చెలరేగిపోయారు. ప్రజాకూటమి అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలయ్య టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఈసారి సవాల్ విసరడమే కాకుండా ఏకంగా తొడ కూడా కొట్టారు. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు జోక్యం చేసుకుంటున్నారని మండిపడిన కేటీఆర్.. అవసరమైతే ఆంధ్రాలో కూడా వేలు పెడతామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. ‘కేటీఆర్.. ఆంధ్రా వస్తావా? రా చూసుకుందాం" అని సవాల్ విసిరారు. అంతేకాదు తొడ కూడా కొట్టారు. గడ్డి అన్నారంలో నిర్వహించిన రోడ్‌షోలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు పేరు లేకుండా చేయాలంటే హైటెక్ సిటీ, ఫ్లైఓవర్లు తీసేయాలని.. అవి తీసే దమ్ముందా? అని బాలయ్య ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర చెరిపితే చెరిగేది కాదన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమితే ఎక్కడికో ఓ చోటకి పోవాల్సిందేనన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో రైతు ప్రభుత్వం వస్తుందనుకుంటే.. రాబందుల ప్రభుత్వం వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్‌ది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ల పర్వం కొనసాగుతోంది.

07:19 - December 4, 2018

వికారాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోస్గిలో జరగనున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను అడ్డుకుని నిరసన తెలపాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈసీ ఆదేశాలతో పోలీసులు రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్‌లో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. రేవంత్‌తో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్, ఆయన సోదరుడు, అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
బొమ్రాస్‌పేటలో 144 సెక్షన్:
బొమ్రాస్‌పేట‌లో సాయంత్రం వరకు 144 సెక్షన్‌ను విధించిన పోలీసులు ఈసీ ఆదేశాలతో రేవంత్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేసీఆర్ సభను అడ్డుకుంటానని రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారని రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం రేవంత్‌పై చర్యలకు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

Don't Miss