Activities calendar

07 December 2018

21:32 - December 7, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కి  శుక్రవారం జరిగిన ఎన్నికల్లో  టీఆర్ఎస్పార్టీ 100 సీట్లు గెలుపొంది అధికారంలోకి వస్తుందని  టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్  ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన 3 నెలలుగా పార్టీ విజయం కోసం కృషి చేసిన  పార్టీ నేతలు, లక్షలాది మంది కార్యకర్తలకు మనస్ఫూర్తిగా  ధన్యవాదాలు చెపుతూ ఆయన ట్వీట్ చేశారు. 

21:03 - December 7, 2018

చత్తీస్ ఘడ్ లోని 90 శాసన సభ  నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ లో  కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని సర్వేలు చెపుతున్నాయి. చత్తీస్ ఘడ్ లో మ్యాజిక్ ఫిగర్ 46. బీజేపీ ఇక్కడ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయిందని సర్వేలల్లో తేలింది 
చత్తీస్ ఘడ్ ఎన్నికలపై  వివిధ టీవీ ఛానళ్ళు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలు
న్యూస్ఎక్స్ : బీజేపీ -43, కాంగ్రెస్ -40, ఇతరులు -7
ఇండియా టుడే - బీజేపీ : 21-31, కాంగ్రెస్ : 55-65, ఇతరులు : 4-8.
టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ :బీజేపీ -46, కాంగ్రెస్ -35, జేసీసీ+బీఎస్‌పీ -7, ఇతరులు -2.
రిపబ్లిక్ టీవీ - జన్ కీ బాత్ :బీజేపీ : 40-48, కాంగ్రెస్ : 37-43, జేసీసీ-బీఎస్‌పీ : 5-6, ఇతరులు : 0-1. 
రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ :బీజేపీ -39, కాంగ్రెస్ -46, ఇతరులు -5.

20:17 - December 7, 2018

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 స్దానాలకు ఎన్నికలు నిర్వహించారు.  ఓట్ల లెక్కింపు డిసెంబర్  11 న జరుగుతుంది. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ  హోరా హోరీ తలపడినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ  అధికారం చేజిక్కించుకుంటుందని  కొన్ని సర్వేలు 

చెపుతున్నాయి. 
మధ్యప్రదేశ్ ఫలితాలపై జాతీయ ఛానల్స్ నిర్వహించిన సర్వేలు  
ఇండియా టుడే  సర్వే ..బీజేపీ 102-120...కాంగ్రెస్ 104-122..ఇతరులు 3 
రిపబ్లిక్ టీవీ సర్వే  ప్రకారం కాంగ్రెస్ 112,  బీజేపీ 108, ఇతరులు 10 
టైమ్స్ నౌ  బీజేపీ 126, కాంగ్రెస్ 89 ,బీఎస్పీ 6 ఇతరులు 9 
న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం  బీజేపీ 106, కాంగ్రెస్ 112,  ఇతరులు 12 

19:23 - December 7, 2018

లగడపాటి రాజగోపాల్ సర్వే విడుదల చేశారు. ఇప్పటి వరకు చేసిన సర్వేల్లో అత్యంత క్లిష్టమైనది ఇదే అంటున్నారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయం అంటున్నారు. కేవలం 35 సీట్లకే పరిమితం అవుతుందన్నారు. కాంగ్రెస్ - టీడీపీ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి 65 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. తెలంగాణ హస్తం చేతికి చిక్కిందన్నారు. టీఆర్ఎస్, ప్రజాకూటమి సాధించే స్థానాల్లో 10 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందన్నారు. ఈ లెక్కన తీసుకున్నా టీఆర్ఎస్ అధికారంలోకి రాదని తన సర్వేలో తేలిందన్నారు. బీజేపీ 7, ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో విజయం సాధిస్తారని, ఎంఐఎం 6-7 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు. జిల్లాల్లో 80శాతం కూటమికే ఆధిక్యం వస్తుందన్నారు.
డబ్బు, ప్రలోభాలు పని చేశాయి :
గతంలో కంటే భిన్నంగా ఈసారి ఎన్నికల్లో డబ్బు, ప్రలోభాలు బాగా పని చేశాయి అన్నారు. డబ్బు బాగా ఖర్చు చేశారు అన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో ఏపీ, కర్నాటక, తమిళనాడులో మాత్రమే డబ్బు ప్రభావం ఉంటుందని.. ఈసారి ఆ సంస్కృతి తెలంగాణలోకి కూడా ప్రవేశించింది అన్నారు. ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలు వరసగా చేసిన సర్వేల్లో ఈ లెక్కలు తేలాయన్నారు. గ్రామాల్లో ఈసారి ఓటింగ్ పోటాపోటీగా సాగిందన్నారు.
సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి :
టీఆర్ఎస్ : 35 స్థానాలు (10 అటూ ఇటూ ఉండొచ్చు)
ప్రజాకూటమి : 65 సీట్లు (10 అటూ ఇటూ ఉండొచ్చు)
ఎంఐఎం : 6-7
బీజేపీ : 7 సీట్లు (2 అటూ ఇటూ ఉండొచ్చు)
ఇండిపెండెంట్లు : 7 సీట్లు (2 అటూ ఇటూ ఉండొచ్చు)

18:34 - December 7, 2018

భద్రాద్రి కొత్తగూడెం: శుక్రవారం జరిగిని  తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో  పోలీసులు, పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు  పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. పైపు బాంబులతో విధ్యంసం సృష్టించే యత్నంలో ఉన్న మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులను  చర్ల పోలీసులు అదుపలోకి తీసుకుని విచారిస్తున్నారు. 

18:26 - December 7, 2018

ఒక్క తెలంగాణానే కాదు.. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు విడుదల. ఓటరు తీర్పు ఇచ్చేశాడు.. వెల్లడించటానికి టైం ఉండటంతో జాతీయ, రాష్ట్ర సర్వే సంస్థలు, మీడియా ఏజెన్సీలు సర్వే రిపోర్టులను వెల్లడించాయి. తెలంగాణ ఎన్నికలపై ఆయా సంస్థల సర్వేల్లో వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణపై జాతీయ ఛానల్స్ సర్వేలు :

టైమ్స్ నౌ : టీఆర్ఎస్ 66, ప్రజా కూటమి 37, బీజేపీ 7, ఇతరులు 9
న్యూస్ 18 : టీఆర్ఎస్ 50-65, ప్రజాకూటమి 38-52, బీజేపీ 4-7, ఇతరులు 8-14
ఇండియా టుడే - యాక్సిస్ : టీఆర్ఎస్ 79-91, ప్రజాకూటమి 21-33, బీజేపీ 1-3

ఎన్డీటీవీ  టీఆర్ఎస్ 69 ప్రజాకూటమి 37, ఇతరులు 4

రిపబ్లిక్ టీవీ   టీఆర్ఎస్ 50-65  ప్రజాకూటమి 38-52,  బీజేపీ 4-7 ఇతరులు 8-14

టైమ్స్ నౌ సర్వే అయితే వార్ వన్ సైడ్ అని తేల్చింది. మెజార్టీ అయిన 60 స్థానాల కంటే టీఆర్ఎస్ పార్టీ అదనంగా 6 సీట్లు కైవసం చేసుకుని మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. కూటమికి భారీ ఓటమి తప్పదని సంకేతాలు ఇచ్చింది.

17:32 - December 7, 2018

హైదరాబాద్: తెలంగాణా రాష్టంలోని  119 నియోజక వర్గాల్లో  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  రాష్ట్రంలోని 32,815  పోలింగ్ కేంద్రాలలో ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలోని 13  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన  106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 70  శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. 

17:09 - December 7, 2018

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి అని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.  పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్ లో ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.  సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను పోలింగ్ బూత్ లనుంచి స్ట్రాంగ్ రూంలకు తరలిస్తాం అని డీజీపీ మహేందర్రెడ్డి చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్ర సాయుధ బలగాలు ఈవీఎంల వద్ద కాపలాగా ఏర్పాటు చేశామని డీజీపీ చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ....... ఓట్ల లెక్కింపు జరిగేంత వరకు  స్ట్ర్రాంగ్ రూంల వద్ద సీసీటీవీ కెమెరాలతో 24 గంటలు  నిఘా పర్యవేక్షణ  కొనసాగుతుందని ఆయన తెలిపారు. గత 3 నెలలుగా పోలీసు సిబ్బంది  ఎన్నికల విషయంలో అహర్నిశలు కష్టపడి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చేశారని డీజీపీ చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగటం కేవలం టీమ్ వర్క్ వల్లే సాధ్యమయ్యిందని పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రజలతో మమేకమై ఎన్నికలు నిర్వహించాము కనుక సహకరించిన పౌరులకు కూడా ధన్యవాదాలు అని డీజీపీ చెప్పారు.  రాష్ట్ర పోలీసుశాఖకు ప్రతి విషయలోనూ సరైన సూచనలిచ్చిన ఎన్నికల సంఘానికి కూడా మహేందర్రెడ్డి  ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అని మహేందర్ రెడ్డి అన్నారు. 11 వ తేదీ ఓట్ల లెక్కింపు కూడా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. 

 

16:48 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరికొద్ది సేపట్లో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో పోలింగ్ ముగియనుంది. దీంతో ఎగ్జిట్ పోల్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
డిసెంబర్ 7 తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ సమయానికి పోలింగ్ బూత్ కు చేరుకున్న ఓటర్లకు మాత్రం ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. కానీ ఓటింగ్ శాతం పెంచేందుకు..ఓట్లు వేయకుండా క్యూలలో మిగిలివున్న ఓటర్లకు మాత్రం ఓటు వేసే అవకాశాన్ని కల్పించనున్నారు ఎన్నికల అధికారులు. 
ఇప్పటికే రాష్ట్రంలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు తప్ప, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై భౌతిక దాడి ఘటన మాత్రం అలజడి రేపింది. మరోవైపు, 5 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ లగడపాటి ప్రకటించిన కొద్ది మేర ఫలితాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేడిని పుట్టించాయి. ఈ నేపథ్యంలో కాసేపట్లో వెల్లడి కానున్న వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ కోసం తెలుగు ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
 

 

16:39 - December 7, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించటం అంటే మాటలు కాదు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో వుండే పాతబస్తీలో ప్రశాంతమైన వాతావరణంతో పోలింగ్ అనేది కత్తిమీద సామువంటిది. దీంతో సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించింది. ఏ సమయంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా తగిన ఏర్పాట్లను చేసింది. కానీ కొన్ని ప్రాంతాలలో రిగ్గింగ్ జరుగుతోందంటు..పాతబస్తీలోని యాకుత్ పురాలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంపై సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది ఘర్షణకు పాల్పడ్డ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్ పురా, యాకుత్ పురాలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. రాజకీయపార్టీలకు చెందిన వారు, బయట వ్యక్తుల నుంచి తమకు ఫిర్యాదులు అందిన వెంటనే వాటిపై దృష్టి సారించామని చెప్పారు. ఎక్కడా రిగ్గింగ్ జరగడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. 
 

16:35 - December 7, 2018

తెలంగాణా రాష్ట్రంలోని  13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4గంటల వరకు క్యూలైనులో ఉన్న అందరు ఓటర్లుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.  పోలింగ్ సమయం ముగిసే సమయానికి 13 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాలు ఈ విధంగా ఉన్నాయి
సిర్పూర్  నియోజక వర్గంలో 65 శాతం 
చెన్నూరు 67
బెల్లంపల్లి 72
కొత్తగూడెం  51
అశ్వారావుపేట 47
భద్రాచలం 50
మంచిర్యాల 61
ఆసిఫాబాద్  65
,మంధని  56
భూపాలపల్లి 68
ములుగు 68
పినపాక 45
ఇల్లెందు 48  శాతం పోలింగ్ నమోదైంది 

16:19 - December 7, 2018

జైపూర్‌ (రాజస్థాన్) :  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చివరి రెండు రాష్ట్రాలైన తెలంగాణ, రాజస్థాన్‌లో శుక్రవారం పోలింగ్‌ కొనసాగుతోంది. జోధ్‌పూర్‌ రాజవంశీకులు గజ సింగ్‌, ఆయన సతీమణి సర్దార్‌పురా నియోజకవర్గంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. యువత నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. 100 ఏళ్లు పైబడిన వృద్ధులు సైతం కుటుంబీకుల సాయంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రామ్‌గఢ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మృతితో 199 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 4.77 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 

16:02 - December 7, 2018

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల మధ్య టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సరదా సరదా ముచ్చట్లు జరిగాయి. హైద్రాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకొని సిరిసిల్లకు వెళ్తున్న కేటీఆర్ మార్గమధ్యలోని సిద్దిపేటలో  హరీష్ రావు‌ను కలిశారు. ఇద్దరూ కొద్దిసేపు ఆప్యాయంగా..ఆదరంగా పలకరించుకున్నారు. అంతేకాదు బావా!లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని హరీష్‌తో కేటీఆర్ అంటు సరదాగా..ధీమాగా..ఆప్యాయంగా పలకరించుకోవటంతో ఆహ్లాదకరణ వాతావరణం నెలకొంది. 
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో  పోలింగ్ ఎలా వుందో తెలుసుకుంటు హరీష్ రావు  నియోజవర్గంలోని  గ్రామాలు తిరుగుతున్న సమయంలో  గుర్రాలగొంది గ్రామం వద్ద మంత్రి కేటీఆర్, హరీశ్ రావుల కాన్వాయ్ లు  ఎదురెదురుగా వచ్చాయి. దీంతో ఇద్దరు కార్లు దిగి రానున్న మెజారిటీపై ముచ్చటించుకున్నారు. 
అంతేకాదు నీకు వచ్చే మెజారిటీలో కనీసం సగం మెజారిటీ అన్న తెచ్చుకొంటానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల పోతున్నానను.. మీ వాళ్లంతా అక్కడ నీ కోసం ఎదురుచూస్తున్నారని హరీష్ రావుతో కేటీఆర్ అన్నారు. 
ఈ మాటలు అనగానే  హరీష్ రావు నవ్వుతూ ఆప్యాయంగా  కేటీఆర్ ను హత్తుకొన్నారు. వీరిద్దరి మధ్య సంభాషణను విన్న కార్యకర్తలు  సరదాగా నవ్వుకున్నారు.
 

15:58 - December 7, 2018

నాగర్ కర్నూల్:  పోలింగ్ మరి కొద్ది గంటల్లో ముగుస్తుందనగా , జిల్లాలోని అచ్చంపేట మండలం రంగాపురం  గ్రామంలో  టీఆర్ఎస్ కాంగ్రెస్  కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  ఇరు వర్గాలు వీధుల్లోకి వచ్చి కర్రలతో దాడులు చేసుకున్నారు.  శుక్రవారం మధ్యాహ్నం పోలింగ్ ప్రశాంతగా జరుగుతుండగా టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్ది గువ్వల బాలరాజు, ఆయన భార్యతో కలిసి  పోలింగ్ బూత్ వైపు రావటంతో, బాలరాజు ఓటర్లను ప్రలోభ పెడుతున్నాడని ఆరోపిస్తూ  కాంగ్రెస్ కార్యకర్తలు  ఆయనతో గొడవకు దిగారు.వెంటనే టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ వారితో ఘర్షణకు దిగారు. పరిస్ధితి గమనించిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్ధితి చక్కదిద్దారు.  

15:35 - December 7, 2018

అడిలైడ్‌: అడిలైడ్‌ వేదికగా టీమిండియా- ఆసీస్‌ మధ్య జరుగుతున్న టెస్టులో ఆస్ట్రేలియా  బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. 
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ బౌలర్లు సత్తాచాటారు. ఆటలో రెండో రోజైన డిసెంబర్ 7న స్పిన్నర్ అశ్విన్, ఇషాంత్ శర్మ,జస్‌ప్రీత్ బుమ్రా,రాణించడంతో వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఆస్ట్రేలియా జట్టు 191/7తో మొదటిరోజు ఆటను ముగించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ భారత్ కంటే 59 పరుగులు ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది. కాగా టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే. 
ఆస్ట్రేలియాపై ఇషాంత్‌ శర్మ అరుదైన రికార్డ్..!
ఓవర్‌నైట్ స్కోరు 250/9తో ఈరోజు తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. తొలి బంతికే మహ్మద్ షమీ రూపంలో ఆఖరి వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టుకి తొలి ఓవర్‌లోనే భారత్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఊహించని షాకిచ్చాడు. ఇషాంత్ విసిరిన బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమైన ఓపెనర్ అరోన్ ఫించ్ క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం వచ్చిన ఉస్మాన్ ఖవాజా ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరుస విరామాల్లో ఓపెనర్ హారిస్ (26: 57 బంతుల్లో 3x4), షాన్ మార్ష్ (2: 19 బంతుల్లో)తో పాటు ఉస్మాన్ ఖావాజాని కూడా తన మాయాజాలంతో బోల్తా కొట్టించాడు. దీంతో.. ఆస్ట్రేలియా 87/4తో ఇబ్బందుల్లో పడింది. 
అశ్విన్ ఎఫెక్ట్ 130 ఏళ్ల చెత్త రికార్డులోకి షాన్ మార్ష్..!
మ్యాచ్‌పై భారత్‌కి పట్టు దొరకటంతో పీటర్ హ్యాండ్స్‌కబ్ (34: 93 బంతుల్లో 5x4)తో కలిసి ట్రావిస్ హెడ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కానీ.. జట్టు స్కోరు 120 వద్ద బుమ్రా విసిరిన బంతిని కట్ చేయబోయి వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి హ్యాండ్స్‌కబ్ చిక్కింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ టిమ్‌పైన్ ని ఇషాంత్ శర్మ బోల్తా కొట్టించాడు. మధ్యలో పాట్ కమిన్స్  కూడా బుమ్రా వికెట్లు దక్కించుకోవటంతో ఆస్ట్రేలియా ఆల్ అవుట్ ప్రమాదంలో పడింది. కానీ.. ఆఖర్లో స్టార్క్‌తో కలిసి ట్రావిస్ హెడ్.. భారత్‌కి ఆ అవకాశాన్ని ఆస్ట్రేలియ ఇవ్వకపోవటం విశేషం.
 

15:27 - December 7, 2018

ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్ధతకు గురయ్యారు. శుక్రవారం గడ్కరీ మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని మహాత్మా పూలే  వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.  ఆ కార్యక్రమంలో జాతీయగీతం ఆలపించే సమయంలో లేచి నిలబడినప్పుడు షుగర్ లెవల్స్ పడిపోవటంతో ఆయన స్టేజీమీద కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు ఆయన పడిపోకుండా చేయి అందించి పైకి లేపే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న సహాయక సిబ్బంది ఆయన్ను వెంటనే  ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
ప్రస్తుతం తాను డాక్టర్ల పర్యవేక్షణలో క్షేమంగానే ఉన్నానని గడ్కరీ ట్వీట్ చేసారు. తాను కోలుకోవాలవి కోరుకున్నవారందరికీ  నితిన్ గడ్కరీ  కృతజ్ఞతలు తెలిపారు. 

15:08 - December 7, 2018

నల్లగొండ : టీడీపీ బహిష్కరణకు గురైన మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్యం మరింతగా విషమించింది. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. గత కొంతకాలం నుండి తీవ్ర భావోద్వేగానికి గురవుతున్న క్రమంలో  మోత్కుపల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో డిసెంబర్ 7న తీవ్ర అస్వస్థతకు గురైన ఆలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి, మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. లో-బీపీతో పాటు ఛాతీలో విపరీతమైన నొప్పి, వాంతులతో మోత్కుపల్లి బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించటంతో ఆయన అభిమానులు ఆందోళనలకు గురవుతున్నారు.

15:04 - December 7, 2018

నల్గొండ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్న అతడు గుండెపోటుతో అక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడిని నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన నర్సింహగా గుర్తించారు. గుండ్రాంపల్లి గ్రామంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసేందుకు వచ్చాడు. క్యూలో నిల్చుని వేచి ఉండగా గుండెపోటు వచ్చి పడిపోయాడు.

14:54 - December 7, 2018

నల్గొండ : నాకు చూపు సరిగ్గా కనబడదు..టీఆర్ఎస్‌కి ఓటు వేయాలని ఆ దివ్యాంగుడు కోరితే...ఆ అధికారి ఏకంగా ‘చేయి’ గుర్తుకు ఓటు వేశాడు....తీవ్ర ఆగ్రహానికి గురైన అక్కడి వారు అతనిపై చేయి చేసుకుని చితకబాదారు. ఈ దృశ్యాలన్నీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే...
టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరితే...
వెల్గటూరు పోలింగ్ బూత్‌లో ఓ దివ్యాంగుడు ఓటు వేసేందుకు వచ్చాడు. కనిచూపు కనిపించదని..తనకు ఓటు వేసేందుకు సహకరించాలని అక్కడున్న పార్టీల ఏజెంట్లను కోరాడు. నిబంధనల దృష్ట్యా ఏజెంట్లు ముందుకు రాకపోవడంతో...అక్కడున్న ఎన్నికల సిబ్బందిలో ఒకరు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. ‘కారు’ గుర్తుకు ఓటేయాలని ఆ దివ్యాంగుడు చెప్పడంతో ఆ అధికారి ఓటు వేసి వచ్చాడు.
వీవీ ప్యాట్‌‌లో చేయి గుర్తు పేపర్...
అనుమానం వచ్చిన ఓ పోలింగ్ ఏజెంట్ వీవీ ప్యాట్‌ను గమనించాడు. అందులో కాంగ్రెస్ గుర్తుకు వేసినట్లు పేపర్ ఉండడం..విషయం బయటకు పొక్కింది. ఆగ్రహానికి గురైన వారు ఆ అధికారిని చితకబాదారు. అతడిని నిలదీయడంతో మూడు ఓట్లు మాత్రమే వేశానని అధికారి ఒప్పుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడిలో గాయపడిన అధికారిని ఆసుపత్రికి తరలించారు. పోలింగ్‌ని అధికారులు నిలిపివేశారు. ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

14:48 - December 7, 2018

ఢిల్లీ : తెలంగాణ  ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతు సుప్రీంకోర్టులో ఆనాడు పూర్తిస్థాయి అధికారంతో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి (అసెంబ్లీని రద్దు చేసిన ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వంగా వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం) దేశ అత్యున్నత ధర్మాసం అయిన సుప్రీంకోర్టు ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతు వేసిన పిటీషన్స్ 50శాతం మించరాదని స్పష్టం చేసింది. 
రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ... రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉందని, ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతం ఇవ్వాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం... రిజర్వేషన్లను పెంచడం కుదరదని, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పును వెలువరించింది. కాగా ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్స్ డిమాండ్ తో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారంలో వున్న సమయంలో ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. 
 

14:41 - December 7, 2018

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.53శాతం పోలింగ్ నమోదైంది.
రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు గాను 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్వార్‌ జిల్లాలోని రామ్‌గఢ్‌ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మృతితో అక్కడ ఎన్నిక ఆగిపోయింది. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 51,687 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.
రాష్ట్రంలోని 130 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ జరగనుంది. బీజేపీ నుంచి వసుంధరా రాజే తిరిగి అధికార పగ్గాలు చేపడతామని ధీమాతో ఉండగా కాంగ్రెస్‌ నుంచి అశోక్‌ గెహ్లాట్, సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ.. అధికారంలోకి రావాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉన్నాయి. మరి గెలుపు ఎవరిది? అన్నది డిసెంబర్ 11న తేలనుంది.

14:37 - December 7, 2018

నల్గొండ : జిల్లాలో పోలింగ్ సిబ్బంది అత్యుత్సాహం చూపారు. భోజనం కోసం ఏకంగా పోలింగ్ కేంద్రానికే తాళం వేయడం వివాదాస్పదమైంది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. అక్కడకక్కడ సమస్యలు ఏర్పడినా వాటిని అధికారులు పరిష్కరించారు. మొదటి నుండి మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభంలో ఆలస్యం చోటు చేసుకుంది. 
భోజనం కోసం తాళం..ఓటింగ్ నిలిపివేత...
ఇదిలా ఉంటే తిరుమలగిరి మండలం వెలుగుపల్లి, బీసీ కాలనీలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు గ్రామస్థులు వస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో భోజనం కోసం అధికారులు కేంద్రాలకు తాళాలు వేయడంతో ఓటర్లు అక్కడే కూర్చొన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు సరిదిద్దే ప్రయత్నం చేశారు. వెంటనే పోలింగ్ కేంద్రానికి వేసిన తాళాన్ని తొలగించారు. నిబంధనల ప్రకారం అధికారులకు భోజన సౌకర్యం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో భోజనం చేసేందుకు పోలింగ్ కేంద్రానికి తాళం వేయకుండా ఓటింగ్‌ని కాసేపు నిలిపివేయాల్సి ఉంటుంది

14:28 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 7వ తేదీన జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ 50 శాతానికి చేరుకుంది. ఇదే కంటిన్యూ అయితే పోలింగ్ ముగిసే సరికి 70 శాతానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
నగర ప్రజల నిరాసక్తత...
మహిళలు..వృద్ధులు..వికలాంగులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. కానీ నగర ప్రజలు మాత్రం మరోసారి ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదని ఇప్పటి వరకు జరుగుతున్న ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తెలుస్తోంది. పల్లె వాసులు మాత్రం ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి..ఓటు వేసి వస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో ఓటింగ్ సరళి మాత్రం నత్తనడకన సాగుతోంది. వరుసగా సెలవలు రావడంతో వారి స్వగ్రామాలకు వెళ్లడానికి ఆసక్తి చూపారని తెలుస్తోంది. 
ఆ నియోజకవర్గంలో నాలుగు గంటలకే క్లోజ్...
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో (113 నియోజకవర్గాలు) పోలింగ్ సమయం నాలుగు గంటలకే క్లోజ్ చేయనున్నారు. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటలకు వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ సమయంలో క్యూ లైన్‌‌లో ఉండే వారికి ఓటు వేసేందుకు అనుమతినిస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎంత నమోదైందనేది కొద్ది గంటల్లో తేలనుంది. 

14:08 - December 7, 2018

హైదరాబాద్ : ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా దర్శక దిగ్గజం రాఘవేంద్రరావుకు పరాభవం ఎదురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా బూత్ లోకి వెళ్తున్న ఆయనను ఓటర్లు అడ్డుకున్నారని, నేరుగా బూత్ లోకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఫిలింనగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన రాఘవేంద్రరావు ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారనే వార్తలపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. పూర్తిగా తెలుసుకోకుండా మీడియా వార్తలను ఎలా ప్రసారం చేస్తుందంటు ప్రశ్నించారు. ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది. నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను తప్ప క్యూలో నిలబడలేక కాదని తెలిపారు. క్యూలో నిలుచున్న తనను ఎవరూ అభ్యంతరపెట్టలేదనీ..బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కరం నాకు లేదన్నారు దర్శకేంద్రుడు. ఛానల్స్ వార్త వేసేముందు.. దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి వేయమని సూచించారు రాఘవేంద్రరావు.
 

13:58 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లరు అనూహ్యంగా స్పందించారు. మధ్యాహ్నం 1గంటకే 48.3 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో అభివ‌ృద్ధి చేయలేదని...హామీలిచ్చి మరిచిపోయారంటూ..అందుకే ఓటుకు దూరంగా ఉంటున్నామన్నారు. ఓటు వేయాలని..ఒకవేళ అభ్యర్థులు నచ్చకపోతే ‘నో్టా’ అనే ఆఫ్షన్ ఉపయోగించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. 
వనపర్తి...ఎస్టీ కాలనీ...
ఎలాంటి అభివృద్ధి చేయలేదని..హామీలిచ్చి మోసం చేశారంటూ వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్టీ కాలనీ గ్రామ ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఏ పార్టీకి ఓటేసేది లేదని గిరిజనులు ఖరాఖండిగా చెబుతున్నారు. వీరికి పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. 
రంగాపురంలో ఘర్షణ...
సూర్యాపేట జిల్లా మోతె మండలం కోదాడ నియోజకవర్గంలో రంగాపురంలో ఘర్షణ నెలకొంది. పాలకులు ఎలాంటి అభివృద్ది చేయలేదని...నిరసన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు అవసరం లేదని బహిష్కరించారు. ఇతరులను కూడా అడ్డుకుంటున్నారనే ఆరోపణలతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓటును బహిష్కరించిన వారితో అధికారులు మాట్లాడి శాంతింప చేసే ప్రయత్నం చేశారు. 
లక్ష్మీపురం గ్రామస్థులు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గట్టు లక్షీపురం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఏజెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని..రాజకీయ నేతలు..అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వారు వాపోయారు. తాము ఇతర ఊరికి వెళ్లి చదవాలంటే సర్టిఫికేట్ కావాలంటున్నారని..తమకు ఇవ్వాలని కోరుతున్నా స్పందించడం లేదని...దీనికి నిరసనగా తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. 

13:51 - December 7, 2018

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ లోని ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య సమ్రతతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి మహేష్ ను చూడగానే అభిమానులంతో చుట్టుముట్టారు. సెల్ఫీ అడిగిన అభిమానులను అలరించారు. కాగా కొంతసేపే క్యూ లో నిలబడ్డారు. అభిమానుల సందడి పెరిగిపోవటంతో మీడియా ఆయన చుట్టూ చేరడంతో ఎన్నికల అధికారులు మహేశ్ బాబును నమ్రతను లోపలకు తీసుకువెళ్లి ఓటు వేయించారు. దీంతో మీడియాను అదుపు చేయటం భద్రతా సిబ్బంది ఇబ్బంది పడాల్సివచ్చింది.
 

 

13:20 - December 7, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వింత జరిగింది. ప్రజా గాయకుడు గద్దర్ జీవితంలో తొలిసారి ఓటు వేశారు. తన భార్యతో కలిసి మల్కాజ్‌గిరి నియోజకవర్గం అల్వాల్‌లోని వెంకటాపురంలో గద్దర్ ఓటు వేశారు. ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ చేతిలో అంబేద్కర్ ఫొటో ఉంది. 70 ఏళ్ల గద్దర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేసే సమయంలో మావోయిస్టు పార్టీలో చేరిన గద్దర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన ఓటు హక్కును ఎన్నడూ వినియోగించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రజాకూటమి తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
చాలా ఏళ్ల పాటు ఓటు కూడా నమోదు చేయించుకోని గద్దర్ ఇటీవలే తన ఓటును నమోదు చేయించుకున్నారు. ఓటరు జాబితా ప్రకారం మల్కాజిగిరి నియోజకవర్గంలో జి.విటల పేరుతో ఆయన ఓటు నమోదైంది. ఓటు హక్కు కూడా ఒక పోరాట రూపమేనని, ఓట్ల యుద్ధంలో పోరాడదామని గద్దర్ పిలుపునిచ్చారు.

12:59 - December 7, 2018

హైద‌రాబాద్: టెన్నిస్ స్టార్..తెలంగాణ ఆడబిడ్డ, పాకిస్థాన్ కోడలు అయిన సానియా మీర్జా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇటీవ‌ల పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన సానియా మీర్జా హై ద‌రాబాద్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. కాగా రాష్ట్ర‌వ్యాప్తంగా టాప్ సెల‌బ్రిటీలు సాధారణ వ్యక్తుల్లా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవటం విశేషం. కాగా ప్రజలు కూడా గత కంటే ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 23.4 శాతం ఓటింగ్ న‌మోదు అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 
 

12:57 - December 7, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంట‌నే టోల్‌ప్లాజాలు ఎత్తివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం వరకు టోల్‌ప్లాజాలు ఎత్తివేయాలని సీఎస్‌ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి టోల్‌ప్లాజాలు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి నిమిత్తం వేరే ఊళ్లలో ఉంటున్న ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత గ్రామాలకు బయల్దేరడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. దీంతో ముందుకు కదల్లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల సంఘం టోల్‌ప్లాజా రుసుం ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది.

 

12:49 - December 7, 2018

కొడంగల్ (మహబూబ్ నగర్) : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం డేగకళ్లతో పర్యవేక్షిస్తోంది. అయినాసరే కొడంగల్ నియోజకవర్గంలో డిసెంబర్ 6 తేదీ రాత్రి సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఘటన జరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బు పంచుతున్నారంటూ టీఆర్ఎస్,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుని చిలికి చిలికి గాలివానగా మారి స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో కొన్ని చోట్ల వాహనాల అద్దాలను సైతం ధ్వంసం చేశారు ఆందోళనకారులు.
టీఆర్ఎస్ నేతలు లాఠీలు, మద్యం సీసాలను వాహనాల్లో తరలిస్తుండగా ప్రజాకూటమి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోస్గి సమీపంలోని బాహర్‌ పేట కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి నాలుగు వాహనాల్లో లాఠీలు, మద్యం ఉన్నాయంటూ కాంగ్రెస్ నాయకులు వాటిని అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో, పోలీసులు ఆ వాహనాలను తనిఖీ చేయగా లాఠీలు బయటడ్డాయి. అన్ని వాహనాలను తనిఖీ చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు, ఇతర నాయకులు పట్టుబట్టారు. రెండు గంటల పాటు ఈ ఉద్రిక్తత కొనసాగగా ఎస్పీ ఇరు వర్గాలను శాంతింప జేశారు. కర్రలు లభ్యమైన వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. 
 

12:41 - December 7, 2018

గజ్వేల్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఓటింగ్ జరుగుతోందని..టీఆర్ఎస్‌కు అనుకూల పవనాలున్నాయని తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు కేసీఆర్ సతీసమేతంగా చింతమడక గ్రామానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
పోలింగ్ శాతం పెరుగుతుంది...
‘టీఆర్ఎస్‌కు పూర్తి చాలా అనుకూల పవనాలున్నాయి..పవనాలు రోజు మారవు..మంచి ఫలితాలుంటాయి...రాష్ట్రంలో పోలింగ్ శాతం భారీగా ఉండబోతోంది..హైదరాబాద్‌‌లో ఇదే పరిస్థితి నెలకొంది...వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఆస్తకి కనబరుస్తున్నారు...అంతా సానుకూలంగా ఓటింగ్ జరుగుతోంది...సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో విషయం బయటపడుతుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు ఉన్నారు. 

12:37 - December 7, 2018

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ, వ్యాపార ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వర్‌రావు, కుటుంబసభ్యులు ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో క్యూలైన్‌లో వెళ్లి వారు ఓటు వేశారు.

12:29 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. పోలింగ్ లో భాగంగా మెగాస్టార్ కుటుంబ సభ్యలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మోగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కుమార్తె శ్రీజలతో కలిసి ఇప్పటికే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ సతీ సమేతంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
 

 

12:29 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి ప్రారంభం కావాల్సిన పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు...
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వచ్చిన 30 ఫిర్యాదుల్లో 25 వాటికి సమాధానం చెప్పినట్లు...5 ఫిర్యాదులకు సమాధానం చెప్పాల్సినవసరం ఉందన్నారు. కొడంగల్ విషయంలో జరిగిన ఘటనపై డీఈవో దగ్గరి నుండి రిపోర్టు తీసుకోవడం జరిగిందన్నారు. అక్కడి నుండి రెండు ఫిర్యాదులు వస్తే వెంటనే యాక్షన్ తీసుకున్నట్లు...ఫిర్యాదులపై డీఈవోలకు సమాచారం చేరవేస్తున్నట్లు వెల్లడించారు. ఇక టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జాం ఉందని..ఉచితంగానే టోల్‌ప్లాజా వద్ద అనుమతించాలని కోరడం జరిగిందన్నారు. వీవీ ప్యాడ్‌ ఫెయిల్ అవుతుందనే ఉద్దేశ్యంతో కేంద్రాల్లో కొంత లైట్ తక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సాయంత్రం 7గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి  వివరాలు తెలిచేయనున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. 

12:01 - December 7, 2018

హైదరాబాద్ : తొలిసారిగా చేసిన ఏ పని అయినా అదొక తీపిగుర్తుగా వుండిపోతుంది. అందులోనే తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఆనందంగా వుందటున్నాడు నిర్మలా కాన్వెంట్ సినిమాతో తొలిసారి హీరోగా తెరగ్రేటం చేసిన ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఊహన ముద్దుల తనయుడు రోషన్.  'నిర్మలా కాన్వెంట్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రోషన్ వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. దీంతో ఓటర్ల లిస్ట్ లో ఓటు నమోదు చేయించుకున్న రోషన్ జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి తల్లిదండ్రులతో కలసి వచ్చి ఓటు వేశాడు. ఆపై కెమెరాలకు తన వేలిపై ఉన్న ఇంక్ ను చూపుతూ ఫోజులిచ్చాడు ఈ టీనేజ్ హీరో. మొట్టమొదటిసారి ఓటు వేయడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని  రోషన్ తెలిపాడు. 
 

11:50 - December 7, 2018

హైదరాబాద్: డిసెంబర్ 7 రాష్ట్రం అంతా ఓట్ల కోలాహలంగా వుంది. పలువురు రాజకీయా నేతలుతమ ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ ప్రచారంతో ఓట్లు అడిగిన నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోవటమే కాక అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆపద్ధర్మ మంత్రులు తమ సతీ సమేతంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. 
పోలింగ్ ప్రారంభంలోనే మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ఈ క్రమంలో హన్మకొండ టీచర్స్‌కాలనీలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎల్లపల్లి గ్రామంలో.. మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జ్లిలా కొల్లాపూర్‌లో.. మంత్రి లకా్ష్మరెడ్డి మహబూబ్‌నగర్‌లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక పాఠశాలలో కుటుంబ సమేతంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఓటేశారు.
 

11:42 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో రికార్డు శాతం ఓటింగ్ నమోదు కానుందని తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీన ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ నాలుగు గంటలు వరకు 23 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇదిలా ఉంటే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓటర్లను భయపెట్టే విధంగా మాట్లాడుతున్నాడని..వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని మహాకూటమి నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
శేరిలింగం అభ్యర్థిని బయటకు గెంటేశారు...
సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి ఓటు వేసి బయటకు వచ్చి...ప్రజాకూటమికి ఓటు వేస్తే..బాబుకు..అమరావతికి ఓటు వేసినట్లు అవుతుందని ఓటర్లతో మాట్లాడడం తగదని..దీనిపై ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు తెలిపారు. మాల్ ప్రాక్టీస్..ఫ్రాడ్ జరుగుతోందని పేర్కొన్న శేరిలింగం నియోజకవర్గం అభ్యర్థి ఆనంద ప్రసాద్‌ను మెడలు పట్టుకుని బయటకు గెంటేశారని..ఇది అప్రజాస్వామికమని...వెంటనే చర్యలు తీసుకోవాలని తాము అభ్యర్థించడం జరిగిందని...చర్యలు తీసుకుంటానమి ఎన్నికల అధికారులు హామీనిచ్చినట్లు తెలిపారు. 

11:42 - December 7, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాజకీయ నాయకులు క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీఆర్ఎస్ నేత కేటీఆర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో బూత్ నెంబర్ 124లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్.. పోలింగ్ కేంద్రం వద్ద కేటీఆర్‌కు గులాబీ మొక్క ఇచ్చి స్వాగతం పలికారు.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్‌లో బయటకు రాకుండా, ఓటు వేయకుండా, మనకు కావాల్సిన నాయకత్వాన్ని ఎంచుకోకుండా తర్వాత నిందిస్తే ఎలాంటి లాభం ఉండదని కేటీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మీకు నచ్చిన నాయకుడిని, నచ్చిన పార్టీని, మీ భవిష్యత్తుని మీరే నిర్దేశించుకోండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

11:30 - December 7, 2018

ఖమ్మం : ‘ఉదయం 7గంటలకు వచ్చినం..ఇంకా క్యూ లైన్‌లోనే ఉన్నం..ఇంకా ఓటేయ్యలే’..అంటూ ఖమ్మం ఓటర్లు పేర్కొంటున్నారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు వినూత్న ఆలోచనలు అమలు చేశారు. ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చే వికలాంగులకు గ్రీన్ కార్పెట్ ద్వారా స్వాగతం పలుకుతున్నారు. పలు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే..భారీగా ఓటర్లు తరలిరావడంతో చాంతాడంత క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. తాము ఉదయమే వచ్చినా ఇంకా ఓటు వేయలేదన్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఈవీఎంలు మొరాయించడం...మాక్ పోలింగ్ లేటుగా నిర్వహించడంతో...పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో భారీగానే ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

11:29 - December 7, 2018

అమెరికా : ప్రపంచ వ్యాప్తంగా వార్తా సేకరణ సేవలందిస్తున్న సీఎన్ఎన్ న్యూయార్క్ కార్యాలయం చాలా ఫేమస్ అనే విషయం తెలిసిందే. 2018 అక్టోబర్ నెలలో కూడా  ఇదే తరహా బాంబు  వున్నట్లుగా ఓ ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యాంబ్ స్వాడ్ ను రప్పించి బాంబ్ ను కనిపెట్టి  నిర్వీర్యం చేసారు. దీంతో మరోసారి సీఎన్ఎస్ కార్యాలయానికి ఇదే తరహా ఫోన్ రావటంతో ఎఫ్బీఐ రంగంలోకి దిగింది. వార్తాసంస్థ లోని ఉద్యోగులందరినీ బయటకు పంపిన అధికారులు, ప్రస్తుతం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయంలోని అణువణువూ గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

11:12 - December 7, 2018

మహబూబ్ నగర్ : ప్రశాంతంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకటైన కల్వకుర్తిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అమన్ గల్ మండలం జంగారెడ్డి పల్లెలో ఓ బూత్‌ను పరిశీలించేందుకు వంశీచంద్ అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వంశీచంద్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని పేర్కొంటున్న కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడి నుండి బీజేపీ తరపున టి.ఆచారి పోటీ పడుతున్నారు. 

11:08 - December 7, 2018

హైదరాబాద్: డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీంట్లో భాగంగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు ప్రభుత్వ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి నగరంలోని ప్రశాసన్‌నగర్‌లో గల సెరికల్చర్ కార్యాలయంలో ఓటుహక్కు వినియోగించుకోగా.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ కుందన్‌బాగ్‌లోని చిన్మయ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నాంపల్లిలోని హనుమాన్ వ్యాయమశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలసి సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్.. నిర్మల్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో గల పోలింగ్ బూత్‌లో జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి.. సిద్దిపేట పట్టణం నాసర్‌పురా ఉర్థూ మీడియం స్కూల్లో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోగా..అడిషనల్ కమిషన్ ఆఫ్ పోలీస్ స్వాతీ లక్రా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
తెలంగాణ, హైదరాబాద్, ఎన్నికలు, ప్రభుత్వ అధికారులు, ఓటుహక్కు, వినియోగం,జీహెచ్‌ఎంసీ, కమిషనర్, దానకిశోర్,కమిషనర్ ఆఫ్ 

10:49 - December 7, 2018

వరంగల్ : జిల్లా అసెంబ్లీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరుతున్నారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గెలుపొందేందుకు నేతలు అడ్డదారులు తొక్కారు. ఈసీ అధికారులు..పోలీసులు జరిపిన దాడులు..తనిఖీల్లో భారీగా నగదు..మద్యం..బంగారం స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పోలింగ్ జరుగుతున్న సమయంలో సుమారు రూ. 7 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నర్సంపేట నియోజకవర్గంలోని దాసరిపల్లిలో ఓ ఇంట్లో ఈ డబ్బును ఈసీ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం అందుతోంది. దీనిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది అంతేగాకుండా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
తొలుత మందకొడిగా ప్రారంభమై...ఊపందుకుంది...
మరోవైపు భూపాలపల్లి, ములుగు పోలింగ్ కేంద్రాల్లో 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మావోయిస్టు ప్రభావం కావడంతో పెద్ద ఎత్తున్న పోలీసులు మోహరించారు. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓటింగ్ శాతం పెంచేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించాయి. మొత్తంగా 12 నియోజకవర్గాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ జరుగుతోతంది. ఉదయం 7గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 8.30 గంటల తరువాత ఊపందుకుంది. ఈవీఎంలు మొరాయించడంతో పలువురు అభ్యర్థులు..నేతలు సైతం క్యూ లైన్‌‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

10:43 - December 7, 2018

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లు వేయటనికి సాధారణ ప్రజానీకంతో పాటు ప్రముఖులు కూడా క్యూలలో నిలబడి ఓటు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జోరుగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేయడానికి ఉత్సాహంగా తరలి వచ్చారు. టీఆరెస్ ఎంపీ కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్‌లోని 177వ పోలింగ్ బూత్‌లో ఎంపీ కవిత ఓటు హక్కుని వినియోగించుకున్నారు.  సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆమె ఓటు వేయడం విశేషం.