నోటు పాట్లు : మూతపడుతున్న ATMలు

Submitted on 9 June 2019
Cash Crunch Crisis in Telangana | Banks Shutting Down ATM Centres

ATM కష్టాలు జనాన్ని వదలడం లేదు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఏటీఎంలు క్రమంగా మూతపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. డబ్బులున్న ఏటీఎంలను వెతికిపట్టుకోవడం కష్టమైపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏటీఎంలు పెద్ద సంఖ్యలో తగ్గాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నగదు విత్‌డ్రా లావాదేవీలు పెరుగుతున్నా వీటి సంఖ్య మాత్రం తగ్గుముఖం పడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏటీఎంలు లేక జనం ఇక్కట్లపాలవుతున్నారు.  

దేశంలో క్యాష్ విత్ డ్రా లావాదేవీలు పెరుగుతన్నా ఏటీఎంల సంఖ్య మాత్రం తగ్గుతోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గడిచిన రెండేళ్లలో ఏటీఎంల సంఖ్య 6వేలకు పైగా తగ్గింది. ఏడాది కాలంలోనే 5వేల ఏటీఎంలను తొలగించాయి బ్యాంకులు. తెలంగాణాలో కూడా సంఖ్య తగ్గుతోంది. 2019 మార్చి నాటికి తెలంగాణలో 383 ఏటీఎంలు మూతపడ్డాయి. మార్చినెలలో తెలంగాణాలో ప్రస్తుతం 2 వేల 340కి తగ్గాయి. ఎస్.బీ.ఐ పెద్ద మొత్తంలో ఏటీఎంలు తగ్గించి మొదటి స్థానంలో నిలిచింది.  తెలంగాణాలో మొత్తం ఏటీఎంలు 2018 లో 10 వేల 385 కాగా 2019 మార్చిలో వాటి సంఖ్య 9 వేల 982 మాత్రమే. ప్రభుత్వ, ప్రవేటు బ్యాంకుల ఏటీఎంలు 2018లో 9 వేల 120 కాగా 2019లో వాటి సంఖ్య 8 వేల 657కు చేరింది. 2018లో ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలు 1,325  కాగా 2019 మార్చిలో వాటి సంఖ్య 1,245 కు చేరింది. 

ఏటీఎంల నిర్వహణ భారం పెరగడంతో చిన్న బ్యాంకులు వీలైనంత వరకు తగ్గించుకుంటున్నాయి. నిర్వహణకు ప్రధాన కూడళ్లలో, రహదారుల్లోనో స్థలం ఉండాలి. వాటికి వాణిజ్య ప్రమాణాలతో అద్దెలు చెల్లించాలి. భద్రతకోసం సెక్యూరిటీ గార్డును నియమించాలి. అద్దెలు పెరగడం, సెక్యూరిటీ సిబ్బంది వేతనాలు అనివార్యంగా పెంచాల్సి రావడంతో పాటు విద్యుత్ బిల్లులు భారీగా రావడంతో బ్యాంకులు ఏటీఎంల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ప్రధాన బ్యాంకులన్నీ ఏటీఎంలను బ్రాంచీల వద్దే ఏర్పాటు చేస్తున్నాయి. బ్యాంకుల విలీనం వల్ల కూడా ఏటీఎంల సంఖ్య తగ్గింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా , విజయా దేనా బ్యాంకుల విలీనంతో ఏటిఎంల సంఖ్య తగ్గనున్నాయి. 

ఏటీఎం కేంద్రాల నిర్వహణకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు నిబంధనలు కట్టుదిట్టం చేసింది. పటిష్షమైన సాఫ్ట్ వేర్  రూపొందించాలని నిర్దేశించింది. దీంతో నిర్వహణ వ్యయం మరింత పెరిగింది. దీంతో బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ విషయంలో వెనకడుగు వేస్తున్నాయి. ఖాతాదారులపై వేసే సేవ రుసుము ద్వారానే ఏటీఎంలను నిర్వహించడం కష్టసాధ్యంగా మారింది. అదనపు వ్యయాలు బ్యాంకులకు భారంగా మారాయి. ఏటీఎంల నిర్వహణతోపాటు తమ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసినందుకుగానూ చెల్లించాల్సిన ఇంటర్ ఛేంజ్ పీజు చెల్లించడం వల్ల వ్యయం తగ్గుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి.

ఏటీఎంల నిర్వహణ భారం పెరిగిన మాట వాస్తవమే అయినా ఈ మధ్య కాలంలో బ్యాంకు ఖాతాలు తీసుకుంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏమిటన్నదే ప్రధానమైన ప్రశ్న. దీన్ని పరిష్కరించేందుకు బ్యాంకులు రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచిచూడాల్సిందే. 

Cash
Crunch
crisis
Telangana
Banks Shutting Down ATM
Centres

మరిన్ని వార్తలు