ఎక్కువ రేట్లకు కరెంట్ కొనలేదు : జగన్ కి తెలంగాణ మీదున్న ప్రేమ ఏపీ మీద లేదు

Submitted on 17 July 2019
chandrababu fires on jagan over ppa

పీపీఏలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎక్కువ ధరకు కరెంట్ కొన్నారని వైసీపీ చేసిన ఆరోపణలను చంద్రబాబు ఖండించారు. టీడీపీ హయాంలో ఎక్కువ రేట్లకు కరెంట్ కొనలేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ చెప్పిన రేట్లకు ఎక్కడా కరెంట్ రాదన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో అధికారులు మీడియా సమావేశం పెట్టడమే తప్పు అని చంద్రబాబు అన్నారు. విద్యుత్ అధికారులు వివరణ ఇవ్వాలి కానీ ప్రెస్ మీట్లు పెట్టకూడదన్నారు. అధికారులు గత ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. థర్మల్ విద్యుత్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సమస్యలు వస్తున్నాయని, అందువల్లే సోలార్, విండ్ పవర్ వైపు వెళుతున్నారని చంద్రబాబు వివరించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో వినూత్న కార్యక్రమాలతో పవర్ సెక్టార్ ని డెవలప్ చేశామని చంద్రబాబు చెప్పారు. ఐదేళ్ల క్రితం భారీగా పవర్ కట్ లు ఉండేవన్న చంద్రబాబు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక మిగులు విద్యుత్ సాధించే పరిస్థితి తెచ్చామన్నారు.

కరెంట్ ధరలపై జగన్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. నిజాలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. సీఎం జగన్ ఏర్పాటు చేస్తానన్న జ్యుడిషియల్ కమిషన్ అసాధ్యం అని చంద్రబాబు తేల్చి చెప్పారు. టెండర్ల గురించి ఏమీ తెలియకుండా వైసీపీ విమర్శలు చేస్తోందని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం వల్లే కరెంటు ధరలు పెరిగాయనడం సరికాదన్నారు. వైసీపీ చెప్పిన రేట్లకు ఎక్కడా విద్యుత్ ను కొనుగోలు చేయలేదన్నారు. సోలార్, విండ్ కరెంట్ ఎక్కువ రేటుకి కొన్నామని అసత్యాలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలార్ కరెంట్ రూ.2.72కే వచ్చిందన్నారు.

తెలంగాణ మీదున్న ప్రేమ ఏపీ మీద జగన్ కు లేదని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ కి 2 విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయని, కర్నాటకలో విద్యుత్ ప్లాంట్ల ద్వారా జగన్ డబ్బులు సంపాదిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ కి చెందిన కంపెనీలు కర్నాటకకు విద్యుత్ అమ్మలేదా అని ప్రశ్నించారు. ప్రజలకు పొల్యూషన్ లేని విద్యుత్ ఇవ్వాలనుకున్నామని, భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా చేయాలనుకున్నామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీని చీకటి రాజ్యంగా మార్చేసిందన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు యూనిట్ కి రూ.6.99 చొప్పున తాము విండ్ కరెంట్ కొనుగోలు చేయలేదన్నారు. పీపీఏల రద్దు కరెక్ట్ కాదని కేంద్రమంత్రి స్వయంగా చెప్పినా సీఎం జగన్ కి అర్థం కావడం లేదన్నారు. జగన్ ప్రభుత్వానికి అవగాహన లేకుండా సిట్టింగ్ జడ్జితో టెండర్లపై కమిటీ అంటున్నారని, టెండర్లపై ప్రభుత్వ కమిటీకి జడ్జి నియామకం కుదరదన్నారు.

Chandrababu
TDP
PPA
Power
current
Ys Jagan

మరిన్ని వార్తలు