TOLET ఉంటే చూడండి : కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ

Submitted on 26 June 2019
chandrababu in search of new house

టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కొత్త ఇంటి కోసం అన్వేషణలో పడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న ఇల్లు వివాదంలో చిక్కుకుంది. అది అక్రమకట్టడం అని, దాన్ని కూల్చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రజావేదికను కూల్చేసిన అధికారులు.. నెక్ట్స్ చంద్రబాబు ఇంటిపై దృష్టి పెడతారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... చంద్రబాబు ఇంటికి వెళ్లే రోడ్డుని తవ్వేయాలనే ఆలోచనలో ఉన్నారు. రోడ్డుని 10 అడుగుల మేర తవ్వేందుకు రంగం సిద్ధం చేశారు.

ఈ ప్రజావేదిక రోడ్డు ద్వారానే చంద్రబాబు తన ఇంటికి వెళ్తున్నారు. ఈ రోడ్డుని తవ్వేయనున్నారనే వార్తలతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారట. కాగా, రోడ్డు కోసం గతంలో రైతుల భూమిని అధికారులు సేకరించారు. అధికారులు తమ భూమిని బలవంతంగా తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ భూమి తమకు కేటాయించాలని రైతులు సాంబశివరావు, నాగయ్య కోరుతున్నారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.


ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఇంట్లో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసం అంశంపై చర్చిస్తున్నారు. అదే నివాసంలో ఉండాలా, ఇల్లు మారాలా.. అనే అంశంపై నేతల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకుంటున్నారు. మారాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఉద్దండరాయునిపాలెంలో ఇల్లు ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని నేతలు చంద్రబాబుతో చెప్పారు. ఇదే ఇంట్లో ఉంటే జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చంద్రబాబుకి స్పష్టం చేశారు.

ఉండవల్లిలో కరకట్టను ఆనుకుని ఉంటున్న ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను ఉంటున్న నివాసాన్ని కూడా ప్రభుత్వం కూల్చివేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు ఆ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు అమరావతిలో మరో ఇంటి కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అనువైన నివాసం దొరికిన వెంటనే ప్రస్తుతం తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన భావిస్తున్నారట. ప్రస్తుతం చంద్రబాబు నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజా వేదికను ఇప్పటికే చాలా వరకు కూల్చి వేశారు. దాన్ని కూల్చివేసిన తర్వాత చంద్రబాబు ఉంటున్న భవనాన్ని కూల్చే వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 

చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. దాన్ని కూడా కూల్చివేయక తప్పదని చెబుతున్నారు. అ రకంగా చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాలనే సంకేతాలు ఇస్తున్నారు. గుంటూరు, విజయవాడకు త్వరగా చేరుకునే విధంగా తన నివాసం ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారట. రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయుని పాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కొందరు ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబుకి స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ స్థితిలో జగన్ ప్రభుత్వం దాన్ని కూల్చివేయడానికి వెంటనే పూనుకుంటుందా, కోర్టు తీర్పు కోసం వేచి చూస్తుందా అనేది చూడాలి. కూల్చివేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా జగన్ ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి లేదని అంటున్నారు.

AP CM YS Jagan
Chandrababu
news house
search
prajavedika
TDP

మరిన్ని వార్తలు