ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం..

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పురుషుల బాక్సింగ్‌ 49 కేజీల లైట్ ఫ్లై విభాగం ఫైనల్‌లో భారత్‌కు చెందిన అమిత్‌ పంఘాల్‌ విజేతగా నిలిచి స్వర్ణం పతకం సాధించాడు. ఫైనల్లో అమిత్‌ 3-2 తేడాతో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన హసన్‌బోయ్‌ దుస్మతోమ్‌పై విజయం సాధించాడు. ఈ ఏషియాడ్‌లో ఫైనల్‌ చేరిన ఏకైక భారత బాక్సర్‌ అమితే. 2016 రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత దుస్మతోమ్‌పై విజయం సాధించడంతో అమిత్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హరియాణాకు చెందిన అమిత్‌ ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించాడు. ఆ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 14వ స్వర్ణం. ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో 66 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో 14 స్వర్ణాలు, 23 రజతాలు, 29 కాంస్యాలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 2010లో 65 పతకాలు 14 స్వర్ణాలు, 17 రజతాలు, 34 కాంస్యాలు దక్కించుకుంది. తాజా ఆసియా క్రీడల్లో భారత్‌ గత రికార్డును బద్దులుకొట్టి 66 పతకాలతో ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది.

Don't Miss