ఇండియా ఫస్ట్ 'ట్రైబల్ క్వీన్' పల్లవి దరువా..

16:14 - July 12, 2018

ఒడిశా : గిరిజనులు, ఆదివాసీలు అమాయకత్వంలోనే కాదు నిజాయితీలో కూడా వారికి వారే సాటిగా నిలుస్తారు. అలాగే వారు ఏ విషయంలోనైనా పట్టు పట్టారంటే దాన్ని సాధించేంత వరకూ విశ్రమించరు. వేషధారణలోను, సంప్రదాయాలను అనుసరించటంలోను, వాటిని నిలుపుకోవటంలోను అడవి బిడ్డలు ఏమాత్రం రాజీ పడరు. కానీ నేటి తరం వాటిని కొనసాగిస్తునే ఆధునికంగా కూడా విజయాలు సాధిస్తున్నారు. వారి సంస్కృతి సంప్రదాయాల విషయంలో వారికి వారే సాటిగా వుంటారు గిరిజనులు.

భారతదేశ తొలి ట్రైబల్‌ క్వీన్‌గా పల్లవి దరువా చరిత్ర ..
భారతదేశ తొలి ట్రైబల్‌ క్వీన్‌గా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌ జిల్లాకు చెందిన పల్లవి దరువా చరిత్ర సృష్టించారు. ఆది రాణి కళింగ ట్రైబల్‌ క్వీన్‌ పోటీలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందిని ఓడించి ఆమె కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గిరిజన వేషధారణ, ఆభరణాల ప్రదర్శన, అద్భుత ప్రతిభ, సంస్కృతిని ప్రదర్శించడంలో నైపుణ్యం, ఫొటోజెనిక్‌ ఫేస్‌, బెస్ట్‌ స్కిన్‌, బెస్ట్‌ పర్సనాలిటీ వంటి ఏడు విభిన్న విభాగాల్లో పల్లవి విజేతగా నిలిచారు.

మొదటి రన్నరప్‌ గా పంచమీ మజీ ..
ఈ పోటీలో టిట్లాఘడ్‌కు చెందిన పంచమీ మజీ మొదటి రన్నరప్‌గా నిలవగా.. మయూర్‌భంజ్‌కు చెందిన రష్మీరేఖా హన్స్‌దా రెండో రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఒడిశా ఎస్సీ, ఎస్టీ డిపార్ట్‌మెంట్‌, టూరిజం శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్థానిక ఉత్కళ్‌ మండపంలో జరిగిన ఈ పోటీలో ‘పద్మశ్రీ’ తులసి ముండా నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు విజేతలను నిర్ణయించారు.

గిరిజనులు మూఢనమ్మకాలు వీడాలి : పల్లవి దరువా
భారతదేశ తొలి ట్రైబల్‌ క్వీన్‌గా గెలుపొందటంపై పల్లవి దరువా ఆనందం వ్యక్తంచేసింది. ఈ అసందర్భంగా ఆమె మాట్లాడుతు..ఎంతోమంది గిరిజన బాలికలు, మహిళలకు బయటి ప్రపంచంలోకి రావడానికి, చదువుకోవడానికి అవకాశాలు దక్కడం లేదని వాపోయింది. 'ట్రైబల్‌ క్వీన్‌'గా కిరీటాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గిరిజనులు మూఢనమ్మకాలు వదిలి.. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఎంతో వుందని పల్లవి పిలుపునిచ్చింది.

గిరిజన మహిళలకంటూ సొంత గుర్తింపు కోసం ఈ కార్యక్రమం : ఖట్వా
విజేతలను ప్రకటించిన అనంతరం అవార్డు కమిటీ ప్రధాన కార్యదర్శి చిదాత్మిక ఖట్వా మాట్లాడుతూ...ఈ కార్యక్రమం ద్వారా గిరిజన సంస్కృతిని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చామన్నారు. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన పోటీ కానే కాదు. కళలు, నృత్యరీతుల ద్వారానే కాకుండా గిరిజన మహిళలకంటూ ఒక సొంత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పోటీ నిర్వహించామని చిదాత్మిక ఖట్వా తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడవడం, అందరి ముందు అభిప్రాయాలను వెల్లడించడం వంటివి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయంటూ’ వ్యాఖ్యానించారు.

Don't Miss