ఇబ్రహీంపట్నంలో ఎన్‌ఎస్‌జీ నూతన సముదాయం...

06:40 - April 11, 2018

రంగారెడ్డి : ఉగ్రవాదుల ఏరివేతలో కీలకపాత్ర పోషిస్తున్న జాతీయ భద్రతా దళ కమాండో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఎన్నో ఉగ్రవాద దాడులను తిప్పికొట్టిన ఎన్‌ఎస్‌జీ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రతిపాదించింది. ఉగ్రవాదులకు సింహస్వప్నంగా మారిన ఎన్‌ఎస్‌జీ కమాండోల సేవలు ఎవరెస్టు పర్వతం కంటే మహోన్నతమైనవని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్‌ఎస్‌జీ నూతన సముదాయం ప్రారంభోత్సవంలో ..దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో ఎన్‌ఎస్‌జీ ప్రాధాన్యత పెరిగిందని రాజ్‌నాథ్‌ చెప్పారు.

2008 నవంబర్‌ 26న ముంబైలో ఉగ్రవాద దాడుల తర్వాత ఎన్‌ఎస్‌జీ సేవల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2009లో ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఎన్‌ఎస్‌జీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సికింద్రాబాద్‌లోని మిలటరీ ఏరియాలో కొనసాగిన ఎన్‌ఎస్‌జీకి ఇప్పుడు కొత్త సముదాయం అందుబాటులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో ఎన్‌ఎస్‌జీ కేంద్రం ఏర్పాటైంది. ఉగ్రవాద దాడులను అరికట్టడంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ కమాండోలు చేసిన సాహసోపేతమైన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సందేశమిస్తూ... దేశ అంతర్గ భద్రత పరిరక్షణలో ఎన్‌ఎస్‌జీ కమాండోల పాత్ర కీలకంగా మారిందన్నారు. ఇబ్రహీంపట్నం ఎన్‌ఎస్‌జీ కేంద్రాన్ని అన్ని విధాల అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులను రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు. 

Don't Miss