ఏపీలో సంక్రాంతి శోభ

13:15 - January 13, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. పల్లెలు, పట్టణాలు అన్ని చోట్ల పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబసభ్యులతో పండుగను జరుపుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉన్నవారు సొంత ఊళ్లకు పయనమవ్వడంతో బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు పట్టణాల్లో వస్త్ర, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. 
పచ్చని తోరణాలతో సంక్రాంతికి స్వాగతం
ఏపీలో సంక్రాంతి కళ ఉట్టిపడుతోంది. పండుగ ప్రత్యేకతను చాటి చెప్పేందుకు జనం సిద్ధమవుతున్నారు. ప్రతి లోగిలి పచ్చని తోరణాలతో సంక్రాంతికి స్వాగతం పలుకుతోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి పండుగ. ఈ పండుగకు ఎనలేని ప్రాధాన్యత ఉంది.  సంవత్సరమంతా ఉన్న పండుగలు ఒక ఎత్తైతే సంక్రాంతి పండుగ మరో ఎత్తు. సంక్రాంతిని తెలుగు రాష్ట్రంలోనే వారే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా సొంతూరికి తరలివెళ్తారు. కుటుంబసభ్యులంతా ఒక్క చోటికి చేరి పండుగ మూడురోజులు సంబరంగా జరుపుకుంటారు. రాష్ట్రంలోని లోగిళ్లు రంగవల్లులతో కళకళలాడుతున్నాయి. మహిళలు ముగ్గుల పోటీకి క్యూ కడుతూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుతున్నారు. ఇక స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ముగ్గుల పోటీలు నిర్వహిస్తుండటంతో యువతులంతా ముగ్గుల పోటీల్లో ఆనందంగా పాల్గొంటున్నారు. రంగురంగుల ముగ్గులతో పోటీ పడుతున్నారు. 
జిల్లాల్లో సంక్రాంతి సందడి 
కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పండుగవేళ మూడురోజులు ప్రత్యేకంగా కనిపించేందుకు జనం సిద్ధమవుతున్నారు. కొత్తబట్టలు, కొత్త ఆభరణాల కొనుగోళ్లతో  వస్త్ర, బంగారు నగల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. 
బస్టాండ్, రైల్వేస్టేషన్లు కిటకిట 
ఇదిలా ఉంటే సంక్రాంతిని కుటుంబసమేతంగా నిర్వహించుకునేందుకు విద్యార్ధులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇలా అందరూ తమ ఇళ్లకు పయనమయ్యారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద  క్యూ కడుతున్నారు. దీంతో బస్టాండ్, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకునేందుకు జనం సిద్ధమవుతున్నారు. 

 

Don't Miss