కేసీఆర్ సుడిగాలి పర్యటన

21:18 - January 17, 2018

హైదరాబాద్/సిద్దిపేట : పీపుల్స్‌ ప్లాజాలో 102, 108 వాహనాలను సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణులకు వైద్యసేవలు అందించేందుకు అమ్మఒడి పేరిట 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులను ప్రసవానికి ముందు దవాఖానకు చేర్చడం, తర్వాత పుట్టిన బిడ్డతోపాటు కుటుంబ సభ్యులను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి వాహనాలను ప్రవేశపెట్టారు. తొలి దశలో 41 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వాహనాలను 200 వరకు పెంచేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ సహకారంతో అమ్మఒడి వాహన సేవలను అందించనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గిరిజన ఆవాస ప్రాంతాల్లో 102 సేవలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు.

అంబులెన్స్‌పేరిట 108 టూ వీలర్ అంబులెన్సులు
అదేవిధంగా హైదరాబాద్‌లోని మురికివాడల్లో అత్యవసర వైద్య సేవలందించేందుకు ప్రయోగాత్మకంగా ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్స్‌పేరిట 108 టూ వీలర్ అంబులెన్సులను ప్రవేశపెట్టారు. తొలిదశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 50 టువీలర్ 108 వాహనాలను సిద్ధం చేశారు.మరోవైపు మాతాశిశు ఆరోగ్య సంరక్షణలో నిరంతరం బస్తీల్లో ఇంటింటి తిరిగి సేవలందించే ఏఎన్‌ఎంలకు రాయితీపై బైకులను ప్రభుత్వం అందజేసింది. ఈ టూ వీలర్‌లో వ్యాక్సిన్, మందులు, సిరంజీల వంటి సామాను తీసుకువెళ్లేందుకు వీలుగా ఉందని ఏఎన్‌ఎంలు అంటున్నారు.

తూప్రాన్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి
అనంతరం సీఎం కేసీఆర్‌ మెదక్ జిల్లా తూప్రాన్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించారు. ఆస్పత్రిలోని వార్డులను సీఎం పరిశీలించారు. తూప్రాన్‌తో సహా ఆరు మండల కేంద్రాల్లో ఒక్కో మండలానికి కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే తూప్రాన్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం 5 కోట్లు మంజూరు చేస్తామన్నారు. 20 లక్షలతో షాదీఖానా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తూప్రాన్‌లో పెద్ద చెరువును సుందరీకరిస్తామన్నారు. త్వరలో 500 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తామని సీఎం చెప్పారు. తూప్రాన్‌కు డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని ప్రకటించారు.అనంతరం గజ్వేల్‌లో 100 పడకల ఆస్పత్రిని సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత గజ్వేల్‌లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. 

Don't Miss