నట్టింట్లో రోబోలు...

20:55 - January 1, 2018

కేలండర్ మారింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కాలం శరవేగంగా మారుతోంది. కాలంతోపాటే టెక్నాలజీ కూడా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ప్రపంచాన్ని ముంచేస్తోంది. రోబోలు నట్టింట్లో తిష్టవేస్తాయి. వర్చువల్ క్లాస్ రూమ్ లు అడుగడుగునా కనిపిస్తాయి. పొలాలు ఇళ్లపైకెక్కుతాయి. డ్రైవర్ లేకుండానే కార్లు షికార్లు కొడతాయి. తలెత్తిచూస్తే డ్రోన్లు విచ్చలవిడిగా విహారం చేస్తుంటాయి. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు రూపు రేఖలను మార్చేసుకుంటాయి. అవును.. ప్రపంచం మరింత స్మార్ట్ గా మారుతోంది. ముందున్నదంతా స్మార్ట్ పండుగే.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. కాలంతో పాటు మార్పులు రావటం సహజమే. మనిషిలో, సమాజంలో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు రావటం సాధారణం. అయితే ఈ మార్పులు ఇప్పుడున్న స్థితిని సమూలంగా మార్చేదైతే, అది తెలుసుకోవలసిన విషయమే. లైఫ్ స్టైల్ తో పాటు, ప్రపంచ స్వరూపాన్ని మార్చే అలాంటి అంశాలు అనేకం 2018లోనే ప్రపంచాన్ని పలుకరించబోతున్నాయి. సాంకేతిక విప్లవం కొత్త పరవళ్లు తొక్కే కొద్దీ మానవ జీవితంలో అనేక మార్పులొస్తున్నాయి. యాంత్రీకరణతో ప్రపంచ స్వరూపం మారిపోయి.. కొత్త విలువలు, కొత్త సంస్కృతి, సరికొత్త జీవన విధానాలు ఈ ప్రపంచాన్ని నింపేశాయి. ఇదే క్రమంలో వచ్చిన కంప్యూటర్లు, సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనల ఫలితంగా వచ్చిన రోబోలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. రోబోల తర్వాత మరింత ఎక్కువగా భవిష్యత్తుని ఆక్రమించే వాటిలో డ్రోన్లు కూడా ఒకటి. అయితే, వీటి వాడకం చుట్టూ అనుమానాలు, భయాలు ఎలా ఉన్నా సినిమా షూటింగ్ లను మాత్రం డ్రోన్ లు చాలా సింపుల్ గా మార్చేశాయి. కొరియర్ సర్వీసులకు, వ్యవసాయ రంగంలోను డ్రోన్ల వాడకం మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

బండెడు పుస్తకాలు మోసుకుంటూ స్కూలుకెళ్లే శ్రమ ఉండదు...ఆ మాటకొస్తే అసలు స్కూల్ కే వెళ్లనక్కర్లేదు..ఇంట్లోంచే క్లాస్ రూమ్ లో ఉన్న అనుభవాన్ని పొందొచ్చు. ఇక కారెక్కితే డ్రైవింగ్ చేయనక్కర్లేదు. మనిషికంటే జాగ్రత్తగా గమ్యాన్ని చేర్చే కార్లొస్తున్నాయి. పొలంతో పనిలేని వ్యవసాయం ఇప్పటికే వచ్చింది. కంప్యూటర్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.మట్టి వాసన, పొలాలు, బురద నీళ్లు, కలుపు మొక్కలు, ఇవన్నీ పల్లెలలతో కాస్త సంబంధం ఉన్న అందరికీ తెలిసిన విషయాలే. ఐదు వేళ్లు లోపలికి పోవాలంటే రైతన్న మట్టిలో నానా కష్టాలు పడాల్సిందే. కానీ, భవిష్యత్తు వ్యవసాయంలో పొలం లేని పంట ఉండబోతోంది. అవును.. ఇళ్ల పైకప్పులపై పంటలను పెద్ద ఎత్తున పండించబోతున్నారు. అలాగే రక్తం కొరత అనేది లేకుండా కృత్రిమ రక్తం, బరువు తగ్గించే మాత్రలు.. అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. అనంతకాల గమనంలో, మానవ జాతి అనేక పరిణామాలకు లోనయింది. ఎంతో ముందడుగు వేసింది. ఆ ముందడుగు ఇప్పుడు మరింత వేగంగా సాగుతోంది. ప్రపంచ స్వరూపాన్ని సమూలంగా మార్చి... మనుషుల జీవితాలను అమితంగా ప్రభావితం చేసే దిశగా సాగుతోంది. అయితే సైన్స్ ఎప్పుడూ రెండంచుల కత్తిలాంటిది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. 

Don't Miss