లోక్‌సభతోపాటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు ?

16:35 - April 15, 2018

ఢిల్లీ : లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై క్రేంద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ అభిప్రాయం తెలుసుకునే పనిలో ఎన్డీయే ప్రభుత్వం నిమగ్నమైంది. 2019, 2014లో రెండు విడతలుగా జమిలి ఎన్నికలు జరిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్న ఆలోచనలో మోదీ సర్కారు ఉంది. 
జమిలి ఎన్నికలు 
జమిలి ఎన్నికల విషయంలో ఎలక్షన్‌ కమిషన్‌ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కేంద్రం భావిస్తోంది. త్వరలో లా కమిషన్‌ నివేదిక ఇవ్వనుంది. 2019, 2014లో రెండు దఫాలుగా లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపాలని లా కమిషన్‌ సిఫారసు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నీతి ఆయోగ్‌ కూడా జమిలి ఎన్నికలకు మొగ్గు చూపింది. ఈ మేరకు కేంద్రానికి పంపిన నివేదికను.... మోదీ సర్కారు  ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. లా కమిషన్‌ కూడా జంట ఎన్నికలకు సిఫారసు చేస్తే... దీనిపై అభిప్రాయం సేకరణను వేగవంతం చేయాలిన ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. 
అసెంబ్లీల కాలపమితి పొడిగింపు లేదా తగ్గింపు ?
2021 వరకు కాలపరిమితి ఉన్న అసెంబ్లీలకు 2019లో లోక్‌సభతో పాటు ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ సిఫారసు చేసే అవకాశం ఉందని  అధికార వర్గాల్లో వినిపిస్తోంది. మొదటి విడత జమిలి ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అసోం, బీహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో  ఉండే అవకాశం ఉంది. 2024 జమిలి ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటక, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలు ఉంటాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆయా రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలంటే అసెంబ్లీ కాలపరిమితిని పొడిగించడం లేదా తగ్గించడం చేయాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగంతో పాటు ప్రజా ప్రానిధ్య చట్టానికి సవరణలు చేయాలి. 
బీజేపీకి ఎదురుగాలి ?
జమిలి ఎన్నికలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందన్న విమర్శలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మెజార్టీ సాధించింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో  కూడా బీజేపీకి ఎదురు గాలి వీస్తోందని గ్రహించిన మోదీ సర్కారు.. దీనిని ఎదుర్కొనేందుకు  జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెస్తోందన్న వాదనలు ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నిలకల్లో వచ్చిన సీట్లు 2019లో రాకపోతే ఏంచేయాలన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్న బీజేపీ... జమిలి ఎన్నికల ద్వారా జాతీయ అంశాలను ప్రజల ముందుంచి... లబ్ధి పొందాలన్న ఆలోచనలో ఉందని విశ్లేషిస్తున్నారు. కమలనాథుల ఆలోచనలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో వేచి చూడాలి. 

Don't Miss