వివాదాస్పదంగా సూర్యాపేట కలెక్టరేట్‌ భవన నిర్మాణం

18:33 - April 15, 2018

స్యూర్యాపేట : స్యూర్యాపేట జిల్లాలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలం వివాదస్పదంగా మారింది. మంత్రి జగదీష్‌రెడ్డి తన అనుయాయులకు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే  కలెక్టరేట్‌ భవన సముదాయం నిర్మిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. జనసమ్మర్దం లేని ప్రాంతంలో నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో నిర్మించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

సూర్యాపేట కలెక్టరేట్‌ భవన నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య కలెక్టరేట్‌ నిర్మాణంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి జగదీష్‌రెడ్డి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే ప్రదేశంలోకాకుండా..  తన వర్గపు వారికి మేలు చేసేలా కలెక్టరేట్‌ నిర్మాణం చేపడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.  సూర్యాపేటకు 5 కిలోమీటర్ల దూరంలోని కుడకుడ సమీపంలో కలెక్టరేట్‌ కోసం ప్రభుత్వం.. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించింది. అయితే ఆ ప్రాంతంలో కలెక్టరేట్‌ ప్రతిపాదనలేవీ చేయకముందే మంత్రి జగదీష్‌ రెడ్డి తన బినామీ వ్యాపారులతో రైతుల దగ్గర తక్కువ ధరకే 25 ఎకరాల స్థలం  కొనుగోలు చేశారని కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.  రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన తర్వాత కలెక్టరేట్‌కు అక్కడ ప్రతిపాదనలు చేయించారని మండిపడుతున్నారు. దీంతో ఆఘమేఘాల మీద ఆ ప్రాంతంలోనే కలెక్టరేట్‌కు ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారని కోమటిరెడ్డి ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలో కలెక్టరేట్‌ నిర్మాణం చేపడితే ప్రజలకు ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి భూముల ధరలు పెంచుకుని వందల కోట్లు లబ్ది పొందేందుకే అక్కడ కలెక్టర్‌ కార్యాలయం నిర్మిస్తున్నారని మండిపడుతున్నారు. కలెక్టరేట్‌ భవన సముదాయ ప్రతిపాదనల వెనుక పెద్ద కుంభకోణమే ఉందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. 

Don't Miss